31, జనవరి 2012, మంగళవారం

హిందీ చానల్స్ రియాల్టీ షో లో హీరోలు .. తెలుగు టీవిలో రాణిస్తున్న కమేడియన్లు




హిందీ చానల్స్‌లో పలువురు హీరోలు పలు రియాల్టిషోలను విజయవంతంగా నిర్వహిస్తుంటే, తెలుగులో మాత్రం కమెడీయన్లు ఈ పాత్రను పోషిస్తూ, పలు తెలుగు చానల్స్‌లో సందడి చేస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు లేని వారు టీవి వైపు చూడడం కాదు. సినిమా రంగంలో నంబర్ వన్‌గా నిలిచిన వారు సైతం హిందీలో టీవిల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమితాబ్ మొదలుకొని షారుఖ్ ఖాన్ వరకు చాలా మంది ప్రముఖ హీరోలు హిందీలో చిన్నతెరపై కనిపిస్తున్నారు. కనీసం టీవి రియాల్టీ షో లోనైనా భేషజాలు లేకుండా హీరోలు ఒకరి కార్యక్రమాల్లో ఒకరు పాల్గొంటున్నారు. కలిసి నృత్యం చేస్తున్నారు, హిందీ హీరోలు కామెడీ పండిస్తున్నారు.
తెలుగు చానల్స్‌కు విషయానికి వస్తే, ధర్మవరపు సుబ్రమణ్యం బాటలో మరి కొందరు కమెడియన్లు టీవిల్లో కార్యక్రమాల్లో బాగానే రాణిస్తున్నారు. ఎవిఎస్, అలీ, శివారెడ్డి టీవిల్లో హడావుడి చేస్తున్నారు. ధర్మవరపు సుబ్రమణ్యం కన్నా చాలా ముందే హాస్యనటి శ్రీలక్ష్మి టీవిలో కొద్ది రోజులు ఇలాంటి కార్యక్రమానే్న నిర్వహించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిన తరువాత ఆమె కొంత కాలం కనుమరుగై టీవిలో దర్శన మిచ్చారు. కార్యక్రమంలో కామెడీని బాగానే పండించారు. మళ్లీ ఎందుకో కనిపించకుండా పోయారు. ఆ తరువాత సాక్షిలో ధర్మవరపు సుబ్రమణ్యం డింగ్ డాంగ్ బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రాజకీయ ఉద్దేశాలు, లక్ష్యాలు చానల్‌కు ఉన్నా, తనకున్న పరిధిలో కార్యక్రమాన్ని బాగానే రూపొందిస్తున్నారు. ఐ న్యూస్‌లో హాస్యనటులు ఎవిఎస్ న్యూసెన్స్ అంటూ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఎవిఎస్ హాస్యనటునిగా సినిమా రంగం ప్రవేశానికి ముందు జర్నలిస్టు. సహజంగా ఒకసారి జర్నలిస్టు అయిన వారికి ఆ వాసనలు పొమ్మన్నా పోవు. ఆయన టీవిలో నిర్వహిస్తున్న న్యూసెన్స్‌లో సైతం ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూ తరహాలో కాకుండా ఒక హాస్యనటుడు నిర్వహించే కార్యక్రమంలో ప్రేక్షకులు మరింత వినోదాన్ని కోరుకుంటున్నారు. దాని కోసం ఎవిఎస్ ప్రయత్నిస్తే బాగుంటుంది. 

శివారెడ్డి జీ తెలుగులో చిత్తం ప్రాయశ్చిత్తం అంటూ కొంత హడావుడి చేస్తున్నారు. ఒక సినిమాలో అలీ చెప్పిన కాట్రవెల్లి అనే చిత్రమైన మాట బాగా పాపులర్ అయింది. అదే పేరుతో అలీ కార్యక్రమం సాగుతోంది. తెలుగువారిలో హస్య ప్రియత్వం తక్కువ అనే అపవాదు ఉంది. కానీ తెలుగులో వచ్చినన్ని హాస్య ప్రధానమైన సినిమాలు మరే భాషలోనూ రాలేదు. నరేష్, రాజేంద్ర ప్రసాద్ దాదాపు రెండు దశాబ్దాల పాటు హాస్యనటులుగా ఒక వెలుగువెలిగారు. తరువాత ఆ వారసత్వాన్ని అల్లరి నరేష్ అందిపుచ్చుకున్నారు. చివరకు ఇప్పుడు మహేష్ లాంటి హీరో సైతం కామెడీ నటనతో హీరోయిజాన్ని పండించక తప్పని పరిస్థితి. సినిమాల్లో హాస్యం విషయంలో చాలా ముందున్న మనం టీవిలకు వచ్చే సరికి చాలా వెనకబడి ఉన్నాం. హిందీలో కెబిసి, బిగ్‌బాస్ తరహాలో హాస్య కార్యక్రమాలకు పాపులారిటీ ఉంది. హిందీలో కామెడీ ప్రొగ్రామ్‌ను చూసి ఒకటి రెండు తెలుగు చానల్స్ జోక్స్ చెప్పే కార్యక్రమాన్ని రూపొందించినా, జోక్స్ చదవడం వేరు కామెడీ ప్రొగ్రాం వేరు అని గ్రహించకుండా కార్యక్రమాలు రూపొందించడం వల్ల పెద్దగా ఆకట్టుకోలేదు.
ఇప్పుడిప్పుడే తెలుగు కమేడియన్లు టీవి కార్యక్రమాల్లో రాణిస్తున్నారు. హీరోల పరిస్థితి మాత్రం వేరుగా ఉంది.
మన తెలుగు హీరోలది మాత్రం ఎవరి సామ్రాజ్యం వారిదే, వారి సామ్రాజ్యంలో వారే రారాజులు, ఇంకో హీరో పొడ వారికి గిట్టదు. ఇటీవల ఇద్దరు మాజీ ప్రముఖ హీరోలు తిట్టుకుంటున్న మాటలను వింటుంటే మన హీరోల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. చివరకు తెలుగు సినిమా పండగ నిర్వహించినా అక్కడ కీచులాట తప్పలేదు. కులాల వారీగా, కుటుంబాల వారీగా, పార్టీల వారీగా మన హీరోలు విడిపోయారు. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. కనీసం గతంలో ఫలానా హీరో అంటే నాకెంతో అభిమానం మా సినిమా వాళ్లం అంతా ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటాం అనే చిలకపలుకల ఇంటర్వ్యూలు పత్రికల్లో కనిపించేవి. ఇప్పుడు టీవిల పుణ్యమా అని వీరి అనుబంధం ఎంత మధురమైనదో, ఉమ్మడి కుటుంబం మాదిరిగా ఎలా కలిసిమెలిసి ఉంటారో చూసే భాగ్యం లభించింది. ఈ వారం బాలకృష్ణ చిరంజీవిల స్టార్ వార్‌కు టీవిలు ప్రాధాన్యత ఇచ్చాయి. బాలకృష్ణ తొడ గొడుతూ, వాడెవడో నన్ను చిన్నపిల్లాడు అన్నాడు... మా నాన్న కాలి గోటికి సరిపోడు అంటూ సినిమా డైలాగులు వినిపించారు. అబ్బే మా సినిమా వాళ్ల మధ్య ఎలాంటి గొడవలు లేవు, అదంతా మీడియా సృష్టి, బాలకృష్ణ, చిరంజీవి మంచి మిత్రులు అని సినిమా పెద్ద మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. బాలకృష్ణ తిట్టినప్పుడు అన్ని చానల్స్ ఆ వార్తలకు ప్రాధాన్యత ఇచ్చాయ. ప్రాయోజిత కార్యక్రమమో, పెయిడ్ న్యూసో విషయం తెలియదు కానీ బాలకృష్ణ వీరాభిమాని రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం తరహాలో ఉంది ఎన్ టీవిలో బాలకృష్ణపై శనివారం ప్రసారం చేసిన ప్రత్యేక వార్తా కథనం. ఆయన దూకుడుగా వెళుతున్నారు, ఆచితూచి వెళుతున్నారు, తెలంగాణలో సైతం తిరిగేందుకు సిద్ధం అని చెప్పడం ద్వారా తాను ఎంత దూకుడుగా ఉన్నది స్పష్టమవుతోంది అని పొగడ్తలతో ముంచెత్తారు. మా తండ్రి కాలి గోటికి సరిపోడు, వాడు వీడు అనడం ఆచితూచి మాట్లాడడమా? దూకుడంటే ఇదేనా? ఎన్‌టివి వారికే తెలియాలి. ఎవరేమన్నా అదే స్థాయిలో స్పందించే బాలకృష్ణ లక్ష్మీపార్వతి విషయంలో మాత్రం దూకుడుగా వ్యవహరించలేదు అభినందించారు. దూకుడుగా మాట్లాడినా వీరికి ముచ్చటేస్తుంది, మాట్లాడకపోయినా ముచ్చటేసిందన్నమాట! టిడిపి వర్గాలు సమాచారం ప్రకారమే బాలకృష్ట గురించి చిరంజీవి మామూలుగానే మాట్లాడుతూ చిన్నపిల్లల మనస్తత్వం అన్న దానికి బాలకృష్ణ అదే విధంగా సెటైర్‌గా మాట్లాడితే సరిపోయేది, వ్యక్తిగతంగా దూషణకు దిగాడనే అభిప్రాయం ఏర్పడింది అని టిడిపి నాయకులే చెబుతున్నారు. బహుశా ఇలాంటి అభిప్రాయం ఏర్పడడంతో పాజిటివ్ ప్రచారం కోసం ప్రయత్నాలు సాగించినట్టుగా ఉంది, దానిలో భాగంగానే ఈ ప్రత్యేక కథనం వచ్చిందేమో! అయితే సినిమా వాళ్లకు సంబంధించి ఏది స్పాన్సర్డ్ ప్రోగ్రామో, ఏది టీవి వాళ్లు రూపొందించిన కార్యక్రమమో తెలియదు. వారే చెబితే బాగుంటుంది. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ సిగరెట్‌పై కనిపించీ కనిపించకుండా ముద్రించినట్టుగా కనీసం చిన్న అక్షరాలతో స్పాన్సర్డ్ ప్రోగ్రాం అని వేసే ప్రయత్నం చేయాలి
.

27, జనవరి 2012, శుక్రవారం

అధికారం లో ఉన్నప్పుడు బుర్ర పని చేయదు. కళ్ళు కనిపించవు . అందుకే ఉద్యమాల గోడు వినిపించదు ... వస్త్ర వ్యాపారుల9 రోజుల బంద్ .



వారం రోజుల బంద్ అంటూ సాధారణంగా ఈశాన్య రాష్ట్రాల గురించి వింటుంటాం. ఢిల్లీలో చీమ చిటుక్కుమన్నా, ముంబాయిలో హీరోయిన్ గర్భవతి అయినా గంటల తరబడి జాతీయ చానల్స్ మొత్తం స్పందిస్తాయి. ఎక్కడో మూలపడేసినట్టు ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటి రెండు వారాలు కాదు ఏకంగా నెలల పాటు బంద్ జరిగినా మనకు పెద్దగా పట్టదు. కానీ ఇప్పుడు చివరకు మన రాష్ట్రంలో సైతం సరిగ్గా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది రోజుల బంద్‌కు వస్త్ర వ్యాపారులు పిలుపు ఇచ్చారు. నాలుగు రోజుల నుండి బంద్ పాటిస్తున్నారు. వారి డిమాండ్లలో న్యాయం ఉందా? లేదా? డిమాండ్ ఆమోదిస్తే లాభమెంత? నష్టమెంత అనే చర్చ తరువాత విషయం. ముందు వారి బంద్‌పై స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?

 బట్టలపై ఐదు శాతం వ్యాట్ విధించడాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని నెలల నుండి వస్త్ర వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం నుండి కనీస స్పందన లేకపోవడంతో ఏకంగా తొమ్మిది రోజుల పాటు బంద్‌కు పిలుపు ఇచ్చారు. సోమవారం నుండి రాష్ట్రంలో వస్త్ర వ్యాపారుల బంద్ సాగుతోంది. ఏ ఒక్క మంత్రి స్పందించలేదు, ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదు. రాజధాని నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో వస్త్ర వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు. ఏకంగా రాజధానిలో భారీ ప్రదర్శన నిర్వహించారు. సోమవారం నుండి ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు జరుపుతున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ వస్త్రాలపై వ్యాట్ విధించడం లేదు. ఒక్క మన రాష్ట్రంలో మాత్రం ఐదు శాతం వ్యాట్ విధిస్తున్నారు. ఏ వస్తువుపై పన్ను ఉన్నా దాన్ని భరించాల్సింది చివరకు వినియోగదారుడే. మన కన్నా ముందు ఒరిస్సా, జార్ఖండ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో వస్త్రాలపై వ్యాట్ విధించారు. అయితే వస్త్ర వ్యాపారులు వ్యతిరేకించడంతో వారి వాదనను మన్నించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను రద్దు చేశాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఎంత తీవ్ర స్థాయిలో వస్త్ర వ్యాపారులు ఉద్యమిస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు.

 తొలుత జివో ఎంఎస్ నంబర్ 932 ద్వారా వస్త్రాలపై రాష్ట్రంలో 8.7.2011న నాలుగు శాతం వ్యాట్ పన్ను విధించారు. దీన్ని వస్త్ర వ్యాపారులు వ్యతిరేకించారు. అనంతరం ప్రభుత్వం 14.9.2011 నుంచి ఐదు శాతానికి పెంచింది. ఐదు శాతం వ్యాట్ వల్ల ఏటా కనీసం ప్రజలపై 14వందల కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని వస్త్ర వ్యాపారులు చెబుతున్నారు. దేశంలో ఎక్కడా వస్త్రాలపై వ్యాట్ లేనప్పుడు ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే విధించడం వల్ల రాష్ట్రంలోని వస్త్ర వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతుందనేది వీరి ఆందోళన. వ్యాట్‌ను వ్యతిరేకిస్తూ వస్త్ర వ్యాపారులు చేస్తున్న వాదన కూడా సహేతుకంగానే ఉంది. దేశంలో ఎక్కడా లేనప్పుడు ఒక్క మన రాష్ట్రంలోనే వ్యాట్ విధిస్తే, మన వస్త్ర వ్యాపారం పొరుగు రాష్ట్రాలకు తరలి వెళుతుంది. మన రాష్ట్రానికి సరిహద్దుల్లో తమిళనాడు, ఒరిస్సా, చత్తీస్‌ఘడ్, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో వ్యాట్‌పై పన్ను లేదు. సమీపాన ఉన్న వారు మన రాష్ట్రంలో కన్నా ఈ రాష్ట్రాల్లో వస్త్రాలు కొనుగోలు చేయడం మంచిదనుకుంటారు. ఇప్పటికే ప్రధాన నగరాలైన మద్రాసు, బెంగళూరు, భువనేశ్వర్‌లలో మన వారు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. వ్యాట్ వల్ల ఇది మరింతగా పెరగవచ్చు. అంతే కాకుండా వస్త్రాల వ్యాపారం అనేది ప్రధానంగా అరువుపై సాగుతుంది. వస్త్రాలు ఉత్పత్తి చేసే వారి నుండి వినియోగదారునికి చేరే వరకు అనేక దశలు ఉన్నాయి. అరువుపై కొనుగోలు జరిగినప్పుడు అక్కడ నగదు అనేది లేకపోయినా మేం ముందు వ్యాట్ చెల్లించాలి ఇదెక్కడి చోద్యం? అనేది వస్త్ర వ్యాపారుల వాదన. ఉత్పత్తి అయిన వస్త్రాల్లో 70 శాతం వరకు రెడిమేడ్ వస్త్రాల తయారీకి ఉపయోగిస్తున్నారు. రెడీమేడ్ వస్త్రాలపై వ్యాట్ ఎలాగూ ఉంది. ఇక 30 శాతం మాత్రమే బట్టలు కుట్టించుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వ్యాట్ విధించేది వీటిపైనే. పెద్దగా చదువు లేని సంప్రదాయ వ్యాపార కుటుంబాల వారే వస్త్ర వ్యాపారంలో ఉంటున్నారు, వీరికి ఈ మాత్రం ఉపాధి కూడా లేకుండా చేస్తారా? అని వస్త్ర వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ఒక్క మన రాష్ట్రంలోనే రెండు లక్షల మంది వస్త్ర వ్యాపారులు ఉన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వస్త్ర వ్యాపారం ద్వారా 20లక్షల కుటుంబాలకు ఉపాధి లభిస్తోందని వీరు చెబుతున్నారు. వ్యాట్ ద్వారా ఇలాంటి వస్త్ర వ్యాపారుల జీవితాలను ప్రమాదంలో పడేశారని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్స్ ఆసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సోమ దయానంద్ చెబుతున్నారు.
అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతి రాజకీయ పార్టీ నాయకుడిని కలిశారు. వీరి ఉద్యమానికి టిడిపి, టిఆర్‌ఎస్, బిజెపి, సిపిఎం, సిపిఐ పార్టీల నాయకులంతా మద్దతు ప్రకటించారు. వస్త్ర వ్యాపారులకు మద్దతుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ గుంటూరు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం ధర్నా చేయనున్నారు. ప్రభుత్వం చివరకు శవం మీద కప్పే బట్టల నుండి కూడా పన్నులు వసూలు చేయాలనుకుంటోంది అని సిపిఐ కార్యదర్శి నారాయణ ఘాటుగానే స్పందించారు. అసెంబ్లీ సమావేశాల నాటికి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే అసెంబ్లీలో నిలదీస్తామని టిఆర్‌ఎస్ ప్రకటించింది. వీరి బంద్‌కు టిడిపి మద్దతు ప్రకటించింది. వ్యాట్ ద్వారా ప్రజలపై 14 వందల కోట్ల రూపాయల భారం పడుతుందని సిపిఎం కార్యదర్శి బివి రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. అనేక రూపాల్లో ఆందోళన సాగించిన తరువాత కూడా ప్రభుత్వంలో స్పందన లేకపోవడంతో చివరకు వస్త్ర వ్యాపారులు తొమ్మిది రోజుల బంద్‌కు పిలుపు ఇచ్చారు.
వరుసగా నాలుగు రోజుల నుండి బంద్ పాటిస్తూ, మరో ఐదు రోజుల పాటు బంద్ నిర్వహించాలని ప్రకటించినా ప్రభుత్వంలో స్పందన లేకపోవడం గమనార్హం.
ఒకవైపు అడగకపోయినా ప్రభుత్వం ఉచిత పథకాలు ప్రకటిస్తోంది. ఉచిత పథకాలు నిజంగా అవసరమా? అనే ఆలోచన కన్నా వాటి ద్వారా ఏ మేరకు రాజకీయ ప్రయోజనం ఉంటుంది అనేదే పాలకుల ఆలోచన. అడక్కపోయినా ఉచిత పథకాలు ఒకవైపు.. నడ్డివిరిచే పన్నులు మరోవైపు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత తన మార్కు పథకం కోసం కిలో రూపాయి బియ్యం ప్రకటించారు. మరోవైపు ఏడాది కాలంలోనే అదనంగా దాదాపు పదివేల కోట్ల రూపాయల వరకు పన్నులు విధించారు.
తొమ్మిది రోజులు కాదు రెండు నెలల పాటు బంద్ జరిపినా వస్త్ర వ్యాపారులు ప్రభుత్వాన్ని ఏమీ చేయలేకపోవచ్చు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వీళ్లకేం అసెంబ్లీలో ఓటు ఉండదు. అధిష్ఠాన వర్గం వద్ద పలుకుబడి ఉండదు. వస్త్ర వ్యాపారులే కాదు, సమాజంలో ఎవరిలోనైనా ఏర్పడే తీవ్రమైన నిస్పృహ,ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావం ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది అధికారంలో ఉన్నప్పుడు తెలియదు, ఎవరికైనా అధికారం పోయాక తెలుస్తుంది. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసి కార్మికులు ఆరువారాల పాటు సమ్మె జరిపారు. జీతంపై బతికే కార్మికులు ప్రభుత్వంతో ఎంత కాలం పోరాడుతారు? మేమూ చూస్తాం, వాళ్లే తోక ముడిచి తిరిగి ఉద్యోగంలో చేరుతారు అని అప్పటి పాలకులు ధీమాగా ఉన్నారు. వారి ఉద్యమాన్ని అస్సలు పట్టించుకోలేదు. ప్రభుత్వం ఊహించినట్టుగానే చివరకు ఎలాంటి డిమాండ్లను ఆమోదించకపోయినా వారు ఉద్యోగంలో చేరారు. కానీ ఎన్నికలు వచ్చే సరికి దాదాపు లక్షమందికి పైగా ఆర్టీసి కార్మికులు కాంగ్రెస్ పార్టీకి ఆయాచిత వరంగా లభించారు. అప్పటి ప్రభుత్వం ఓటమి కోసం చిత్తశుద్ధితో కృషి చేశారు. అసెంబ్లీలో ఓటింగ్‌తో ఫలితం అప్పటికప్పుడు తేలిపోతుంది, కానీ ప్రజల్లో వచ్చే తీవ్ర వ్యతిరేకత ఫలితం చూడాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.
డిమాండ్లతో ఉద్యమించే వారు ఏం చేస్తారు అనే అహంకారం ప్రభుత్వానికి పనికి రాదు. ప్రభుత్వం మరీ మొద్దుబారిపోతోంది. ఎవరు ఆందోళన చేసినా, ఎవరు ఉద్యమించినా పట్టించుకునే స్థితిలో లేదు. వ్యాపారం చేసుకుని బతికే వారు, ఉద్యోగం చేసుకుని బతికే కార్మికులు, ప్రజలు ఎంత కాలం ఉద్యమిస్తారు? అనే ధీమా ప్రభుత్వానిది. ప్రభుత్వాన్ని ఢీ కొనేంత బలం ఒక కార్మిక సంఘానికో, వ్యాపారులకో, విడివిడిగా ఉండే ప్రజలకో ఉండకపోవచ్చు. కానీ అసంతృప్తి చిన్నచిన్నగా మొదలై చివరకు అది పాలకులను గద్దె దించి అడ్రస్ లేకుండా చేసేంతగా బలపడుతుందనే విషయం పాలకులు గ్రహించాలి. అలా గ్రహిం
ని వారు ఏమయ్యారో గుర్తుకు తెచ్చుకోనైనా మారాలి. ఎట్టి పరిస్థితిలోను వ్యాట్‌ను రద్దు చేసేది లేదంటూ ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ప్రకటించడం సరికాదు. కనీసం వారిని చర్చలకైనా పిలిస్తే వారికున్న ఇబ్బందులు ఏమిటి, ప్రభుత్వానికి ఉన్న సమస్యలు ఏమిటి అన్నది పరస్పరం తెలుసుకునే అవకాశమైనా లభిస్తుంది .

25, జనవరి 2012, బుధవారం

ఔను బాలకృష్ణ, చిరంజీవి రియల్ హీరోస్


‘‘నేను మాట్లాడేప్పుడు భారత దేశం మాట్లాడుతుందని అనుకుంటాను, నేడు నడిస్తే భారత దేశం నడుస్తుందనుకుంటాను, నన్ను నేను భారత దేశంగా భావిస్తాను ’’ అని ఏదో సందర్భంలో స్వామి రామానంద తీర్థ తన గురించి తాను చెప్పుకున్నారు. ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో కాంగ్రెస్‌లో ఎదురులేని నాయకుడు, సన్యాసం స్వీకరించి తన శేష జీవితం అంతా సన్యాసిగానే గడిపారు. ఒక తీవ్రవాది సన్యాసిగా మారితే ఎలా ఉంటుందో,అరవింద్ ఘోష్‌ను చూస్తే తెలుస్తుంది. స్వాతంత్య్ర పోరాట కాలంలో నిప్పులు చెరిగిన తీవ్రవాది, అనంతరం ఒక యోగిగా మారిపోయారు. స్వాతంత్య్రం కోసం ఆయుధం చేపట్టినప్పుడు ఇతనిలో ఒక యోగి ఉన్నాడని ఎవరైనా ఊహించారా? ఎవరో ఎందుకు స్వయంగా ఆయనే ఊహించి ఉండరు. చలం రాతలు చదివిన వారు ఈయన ఏదో ఒక రోజు అరుణాచలం వెళతారని అనుకున్నారా? ఇదంతా దైవలీలనేమో! ఇలాంటి మహనీయుల సంగతి వదిలేస్తే, కొంత మంది గురించి మనం అసలు ఊహించలేం.
బాలకృష్ణను ఒకవైపే చూశారు, రెండో బాలకృష్ణను చూస్తే జడుసుకుంటారు అంటూ సినీనటుడు బాలకృష్ణ పంచ్ డైలాగులు వినిపిస్తున్నారు. రెండో బాలకృష్ణ మాకెందుకు తెలియదు ఆయన ఒక హంతకుడు కదా? అని చిరంజీవి వర్గీయులు చమత్కరిస్తున్నారు. రెండో కోణంలో కూడా బాలకృష్ణలో నిజమైన హీరో కనిపిస్తాడు. సినిమాల్లో హీరోలు గన్ను చేతిలో పట్టుకుని కనిపించిన వారిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తుంటాడు. అలా కాల్చినందుకు ఏ సినిమాలోనూ హీరోపై పోలీసులు కేసు పెట్టరు, విచారణ జరిపించరు. సినిమాల్లోని ఈ దృశ్యాన్ని ఆయన నిజ జీవితంలో సైతం చేసి చూపించారు.

 హీరో బాలయ్య షూటింగ్ ముగించుకుని ఇంటికొచ్చి పుల్లుగా మందు కొట్టారు. కాల్పులు జరిగాయి. ఇద్దరు నెలకొరిగారు. చావు బతుకుల మధ్య ఇద్దరు ఆస్పత్రిలో చేరారు. మరి బాలయ్య పోలీస్ స్టేషన్‌కెళ్లారా? వెళితే ఆయన హీరో ఎలా అవుతారు. కనీసం పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లకుండా కాంగ్రెస్ బావ, టిడిపి బావ నైతిక మద్దతుతో బావమరిది బాలయ్య హీరోలా బయటపడ్డారు. సినిమాల్లోని సీన్ నిజ జీవితంలో చూపించిన వ్యక్తి హీరో కాకుంటే మరేమవుతారు. విమానాలు, ఓడలను మాయం చేసే బర్ముడా ట్రయాంగిల్ మాయాజాలం కొంత వరకైనా అంతు చిక్కిందేమో కానీ బాలకృష్ణ ఇంట్లో ఆ రాత్రి తూటలు ఆకాశం నుండి ఎలా వచ్చి పడ్డాయో ఇప్పటికీ అర్ధం కాలేదు. ఎంత హిచ్ కాక్ సినిమా అయినా ముగింపులో సస్పెన్స్ తేలిపోతుంది. ఆ తూటాల సస్పెన్స్ ఇంకా అలానే ఉందంటే బాలయ్య నిజ జీవితంలోనూ హీరోనే కదా? 

అలాంటి హీరోను పట్టుకుని పసి పిల్లాడు అంటే కోపం రాదా? అందుకే నా అంతటి వాడిని నేను నన్ను పసి పిల్లాడివంటారా? రెండో బాలయ్యను చూపిస్తానని సవాల్ విసిరారు. చండ శాసనుడని అంతా భయపడే తండ్రి ముందే వెన్ను పోటు సమయంలో మాతో పెట్టుకోకు అని పోస్టర్లు ప్రదర్శించిన ధైర్యం ఆయనది. సోదరి ఇంటి ముందు తొడగొట్టిన ధైర్య శాలి.
మహాభారత యుద్ధాన్ని నడిపించిన శ్రీకృష్ణుడు, గోపికలతో సరసాలాడిన శ్రీకృష్ణుడు, అలకమానవే అంటూ సత్యభామ కాళ్లు పట్టుకున్న శ్రీకృష్ణుడు ఒక్కరే. ఆయన దేవుడు కాబట్టి శ్రీకృష్ణ లీలలు అన్నాం. దేవుళ్లే కాదు దేవుడు సృష్టించిన మనుషులు సైతం ఒక్కో సందర్భంలో ఒక్కోలా కనిపిస్తారు. మా ఆయన బుద్ధిమంతుడు అని ముచ్చటపడే ఇల్లాలు ఆయన ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అని తెలిసి ఛీ నీ అసలు రూపం ఇదా? అని తిడుతుంది.
మనమేంటో మనకే అర్ధం కానప్పుడు ఎదుటి వాళ్లను అర్ధం చేసుకోడం సాధ్యమా? తత్వవేత్తలంతా నిన్ను నువ్వు తెలుసుకో అనే కదా చెప్పింది. రారా తేల్చుకుందా అనే డైలాగు ఇప్పటి వరకు వీధిరౌడీలకు మాత్రమే హక్కుగా ఉండేది. మన సూపర్ హీరోలు వారి నుండి ఆ హక్కును లాక్కోని తేల్చుకుందా రా అని వీధిన పడ్డారు. సినిమాల్లో హీరోల రెండో రూపం ఇదా అని సినీ అభిమానులు విస్తుపోతున్నారు. స్టాలిన్ అనుకున్న తమ హీరో కాంగ్రెస్ గూటి పక్షి కాగానే మా హీరో రెండో రూపం ఇదా? అని అభిమానులు లోలోనే కుమిలిపోతున్నారు.
***
పౌరాణికం, జానపదం, సాంఘికం అదీ ఇదీ అని కాదు. బహుశా ప్రపంచ సినిమా చరిత్రలో అత్యధిక పాత్రలు నటించిన రికార్డు ఎన్టీరామారావుది. ఆయన దేవుడి పాత్రలతో పాటు రాక్షస పాత్రల్లో సమానంగా మెప్పించారు. అందగాడిగా నటించాడు. కుంటివాడిగా మెప్పించారు. రాముడిగా పూజలందుకున్నాడు, రావణుడిగా వీరవిహారం చేశారు. కర్ణుడిలో లీనమయ్యారు, దుర్యోధనుడిగా చెలరేగిపోయారు. చివరకు రాజకీయాల్లోకి వచ్చాక సైతం వివేకానందుడిగా, సన్యాసిగా బహు వేషధారణలో కనిపించారు. ఎన్ని వేషాలనైనా సహిస్తాం కానీ కొత్త పెళ్లి కొడుకు వేశాన్ని ఒప్పుకునేది లేదని కుటుంబ సభ్యులు వెన్ను విరిచారు. ఎన్టీఆర్ తన కుడిభుజం అనుకున్న అల్లుడిలోని రెండో రూపాన్ని ఊహించలేకపోయారు. ఆ విషయాన్ని చివరి రోజుల్లో ఆయనే ప్రకటించారు. విధేయునిగా కనిపించే వాడు అత్యంత వ్యతిరేకిగా కూడా మారగలడు. దీనికి ప్రతి రాజకీయ నాయకుడి జీవితం ఉదాహరణే.

24, జనవరి 2012, మంగళవారం

మనపొగడ్తలంటే హీరోలకూ విసుగేస్తోంది -


ఈ హీరో అలాంటిలాంటి వాడు కాదు. బాక్సాఫీసు బద్దలు కొడతాడు, కొత్త చరిత్ర సృష్టిస్తాడు. ఎనిమిది దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించాడు అంటూ ఎవరినీ వదలకుండా హీరోలందరినీ పొగడడం మన టీవిల ఆనవాయితీ. చివరకు ఈ పొగడ్తలు సినిమా వాళ్లకు సైతం విసుగు తెప్పిస్తోంది. ఒక హీరోను మాత్రమే ఇలా పొగడ్తలతో ముంచెత్తితే నన్ను ఒక్కరినే ఇలా అంటున్నారను కోవచ్చు కానీ కొద్ది పాటి డైలాగులను మార్చి అందరినీ అలానే పొగడ్తలతో ముంచెత్తుతున్నారాయె. అందుకే ఈ మధ్య అక్కినేని నాగార్జున సినిమా ప్రమోషన్ పేరుతో సాగుతున్న పొగడ్తల పట్ల విసుగు ప్రదర్శించారు. ఏముంటుంది అక్కడ ఒకరినొకరు పొగుడు కోవడం తప్ప అంటూ పెదవి విరిచారు. అందుకే సాధ్యమైనంత వరకు అలాంటి వాటికి దూరంగానే ఉంటున్నానన్నాడు.

 ఆడియో విడుదల, అభినందన సభ అంటూ పేర్లు ఏవైతేనేం అక్కడ హీరోలను ఆకాశానికి ఎత్తడం, దర్శకుని ప్రతిభను పొగడ్డం తప్ప ఏమీ ఉండడం లేదు. కానీ తెలుగు చానల్స్ మాత్రం సినిమా ప్రమోషన్ వ్యవహారాల్లో ఏ మాత్రం మార్పు లేకుండా ఇలానే సాగిస్తున్నారు. అట్టర్ ఫ్లాప్ సినిమా అయినా హిట్టయిన సినిమా అయినా ప్రమోషన్ కార్యక్రమాల్లో మాత్రం తేడా ఉండదు. ఒక సినిమా విడుదల కాగానే ఆ సినిమా హీరోతో కొద్ది మంది ముచ్చట్లు ఇంత అద్భుతమైన సినిమాలో నటించేప్పుడు మీ ఫీలింగ్, హీరోయిన్ గురించి ఏమనుకుంటున్నారు? దర్శకుని ప్రతిభ గురించి నాలుగు పొగడ్తలు పొగడండి అంటూ ప్రశ్నిస్తున్నట్టుగా ఉంటున్నాయి. నాతో సినిమా తీసిన దర్శకుడు మహామేధావి అనుకుంటే ఏ హీరో అయినా ఇంకేమంటాడు.

 అదే హిందీ సినిమాల ప్రమోషన్ మాత్రం చాలా భిన్నంగా సాగుతోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు అటు సీరియల్ ప్రమోషన్, ఇటు సినిమా ప్రమోషన్ ఒకేసారి సాగిస్తున్నారు. సోనీ చానల్‌లో ‘బడే అచ్చే లగితే హే’ అంటూ పాపులర్ సీరియల్ వస్తోంది. ‘డర్టీ పిక్చర్’ సినిమా విడుదల సమయంలో ఈ సీరియల్‌ను సినిమా కోసం వాడుకున్నారు. అదే విధంగా సీరియల్ ప్రచారానికి ‘డర్డీ పిక్చర్’ హీరోయిన్ విద్యా బాలన్‌ను ఉపయోగించుకున్నారు. సీరియల్‌ని కథలో భాగంగా దంపతులు హనీమూన్ కోసం ఫ్రాన్స్ వెళతారు. వీరు బస చేసిన హోటల్‌లోనే ‘డర్టీ పిక్చర్’ యూనిట్ బస చేస్తుంది. హీరోయిన్ విద్యా బాలన్, సీరియల్ కథానాయికను పరిచయం చేసుకుంటుంది. హోటల్‌లో ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు. సినిమాలోని హీరో సీరియల్‌లోని హీరోతో మాట్లాడతాడు. ఇదంతా కథలో భాగంగానే సాగుతుంది. దీని వల్ల ఆ సీరియల్‌ను రెగ్యులర్‌గా చూసే వారికి కొత్తదనంగా ఉంటుంది. అదే సమయంలో సినిమాకు, సీరియల్‌కు ప్రచారం లభిస్తుంది. సోనీలోనే వచ్చే ‘సిఐడి ’ సీరియల్ విషయంలో సైతం ఇదే విధంగా ప్రచారానికి ఉపయోగించుకున్నారు. ఇలాంటి ప్రయత్నం తెలుగు సీరియల్స్, తెలుగు సినిమా విషయంలో కనిపించ లేదు. తెలుగు చానల్స్‌లో వచ్చే సీరియల్స్ అన్నీ తమిళం నుండి అనువాదం అవుతున్నవే కాబట్టి అది సాధ్యం కావడం లేదేమో! అనువాదం కాకుండా ఒకటి రెండు సీరియల్స్ డైరెక్ట్‌గా వస్తున్నాయి వాటి విషయంలోనైనా హిందీలో మాదిరిగా కొత్తదనంతో ప్రయత్నించవచ్చు.
ప్రయత్నం బాగుంది...
శ్యామల మంచి అందగత్తె. ఎంత అందగత్తె అంటే ఈ మధ్య ఆమె ఒక తెలుగు సినిమాలో నటించింది. చివరకు సినిమా రంగంలో ఎంతో మంది అందగత్తెలను చూసిన పోసాని కృష్ణ మురళి సైతం శ్యామల అందాన్ని ప్రస్తావించకుండా ఉండలేకపోయారు. జోగిని వంటి ఒక విష సంస్కృతికి బలైన జీవితం ఆమెది. తెలుగు చానల్స్ వాళ్లే ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. జోగిని జీవితం నుంచి బయటకు వచ్చి ఒక సంస్థను స్థాపించి తనలాంటి వారి కోసం ఆమె ప్రయత్నిస్తున్న సమయంలో చానల్స్ దృష్టిలో పడ్డారు. ఆమె జీవితాన్ని వీక్షకులకు పరిచయం చేయడంతో పాటు ఆమెతో కొన్ని కార్యక్రమాలు రూపొందించారు. అనంతరం ఎన్‌టీవి శ్యామలా డైరీ పేరుతో కార్యక్రమం రూపొందించారు. ఇందులో శ్యామల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో మాట్లాడుతోంది. మీరు ముక్కు సూటిగా మాట్లాడతారు అని శ్యామల అన్నప్పుడు పోసాని సమాధానం బాగుంది.

 ప్రపంచంలో ఎవరూ ముక్కు సూటిగా మాట్లాడరు. నా మనసులో అనేక ఆలోచనలు ఉంటాయి, నాకు ప్రమాదం లేనివి, నాకు నష్టం కలిగించనివి మాత్రమే చెబుతాను కానీ ప్రతిదీ చెబుతానా? అని ప్రశ్నించారు. శ్యామల అందం నచ్చింది, శ్యామలపై నాకున్న అభిప్రాయం పైకి చెబుతానా? అని పోసాని అనగానే ఆమె ఏ మాత్రం తడుముకోకుండా శ్యామలపై మీ మనసులో ఏముంది అని అడిగింది. అందగత్తె అంతే మనసులో ఉన్నది అంతా చెప్పకపోవడం సభా మర్యాద అంటూ తప్పించుకున్నారు. ఇంటర్వ్యూలు చేయడం ఆమె వృత్తి కాదు. జోగిని వ్యవస్థ వంటి ఒక దురాగతానికి బలైన జీవితం ఆమెది. అలాంటిది ప్రొఫెషనల్స్ మాదిరిగా తడబడకుండా ప్రముఖుల ఇంటర్వ్యూలు నిర్వహించడం అభినందనీయం. కొన్ని జాతీయ పత్రికలు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం లాంటి వారికి ఒక రోజు పూర్తిగా పత్రిక బాధ్యతలు అప్పగిస్తుంటారు. ఆ రోజు వారే సంపాదకీయం రాస్తారు. అదే విధంగా శ్యామల లాంటి ప్రయోగాలు చేయడానికి చానల్స్‌కు అవకాశం ఉంది. అయితే ఒక చానల్ శ్యామలను పరిచయం చేస్తే మిగిలిన చానల్స్ ఆమె కోసం కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. ఎవరికి వారు ఇలాంటి ప్రయోగాలు చేస్తే బాగానే ఉంటుంది. తెలుగు చానల్స్‌కు కొత్త ముఖాలు లభించవచ్చు.

22, జనవరి 2012, ఆదివారం

ఒక జర్నలిస్టు ఆక్రోశం...నేను జర్నలిస్టునేనా? సమీక్ష


ఒక జర్నలిస్టు ఆక్రోశం


ఒక హిందువు నేను హిందువును ఎట్లయితా? అని ప్రశ్నిస్తూ పుస్తకం రాసినప్పుడు సహజంగా ఆ పుస్తకం ఆసక్తి రేపుతుంది. అదే మార్గంలో ఇప్పుడో జర్నలిస్టు నేను జర్నలిస్టునేనా? అంటూ పుస్తకం ప్రచురించారు. ఒక పాఠకుడిగా పుస్తకం చదివినప్పుడు జర్నలిస్టుల్లో నైతిక విలువల కోసం రచయిత తపిస్తున్న తీరు ఆకట్టుకుంటుంది. మీడియా సంస్థలు, జర్నలిస్టులు వ్యక్తిగతంగా తమతమ ఖాతాల్లో విశ్వసనీయత బ్యాలెన్స్ ఏ మేరకు ఉందో బేరీజు వేసుకోవాలని రచయిత సూచించారు. మంచిదే మరి జర్నలిస్టుల నైతిక విలువల గురించి ప్రశ్నలు లేవనెత్తిన రచయిత విశ్వసనీయత బ్యాలెన్స్ గురించి ఆలోచించారా? ఈ రచనలో సందర్భాను సారం నేను అక్కడక్కడా చేసిన కొన్ని వ్యాఖ్యలు, విమర్శలు మీడియాతో ప్రత్యక్ష పరోక్ష, సంబంధాలున్న వ్యక్తులు, సంస్థలు, సంఘాలు వ్యవస్థలు, అధికారులను బాధిస్తాయని తెలిసినా, రోగి క్షేమం దృష్ట్యా ధైర్యం చేసినట్టు రచయిత ముందుమాటలోనే చెప్పారు.
జర్నలిజంలోనే కాదు ఏ రంగంలోనైనా విలువలు ముఖ్యం. అన్ని రంగాల్లోనూ విలువలు పడిపోతున్నాయి. స్వాతంత్య్ర పోరాటం కాలం నాటి పత్రికల్లోని విలువలను ఇప్పుడు ఆశించడం అత్యాశే అవుతుంది. అప్పుడు పత్రికలు స్థాపించే వారు, అందులో పని చేసే వారు ఒక ఉన్నత లక్ష్యంతో ఆ పని చేశారు. మీడియా ఇప్పుడు లాభసాటి వ్యాపారం. మారిన పరిస్థితులను అర్థం చేసుకున్న వారు మార్కెట్‌లో నిలబడతారు లేదంటే కాలగర్భంలో కలిసిపోతారు. కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టిన వారు దేశం కోసం మీడియాను నడుపుతారని, నడుపుతున్నారని అనుకుంటే అమాయకత్వం అవుతుంది. 

జర్నలిస్టులకు నైతిక విలువ గురించి ఒక పుస్తకాన్ని ప్రచురించిన జర్నలిస్టు రచయిత వ్యాపార కోణంతో ఆలోచించినప్పుడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే యజమాని ఆలోచన ఏ రీతిలో ఉంటుంది. నైతిక విలువల ఆవశ్యకత వివరించిన 130 పేజీల పుస్తకంలో 10 నిండు పేజీల వ్యాపార ప్రకటనలు ఉన్నాయి. వీటిలో ఎనిమిది ప్రకటనలు ప్రభుత్వ సంస్థలవి, రెండు ప్రైవేటు వారివి. బ్యాక్ కవర్ కలర్ ప్రకటన ప్రభుత్వానిదే. ఒక దిన పత్రిక ఇంత పెద్ద సంఖ్యలో ప్రకటనలు సాధిస్తుందేమో కానీ ఒక పుస్తకానికి ఇన్ని ప్రకటనలు సంపాదించడం సామాన్యం కాదు. అందుకే ఈ రచయత సామాన్య జర్నలిస్టు కాదు. 12వ పేజీలో ప్రకటనల గురించి రచయిత ఒక చక్కని మాట రాశారు..ప్రజల నుండి పన్నులు, ఇతరత్రా వివిధ రూపాల్లో వసూలు చేసే డబ్బుతో ప్రభుత్వ బొక్కసం నిండుతుంది. మీడియాకు, జర్నలిస్టులకూ సబ్సిడీలు, రాయితీలు, ప్రోత్సాహకాల పేరిట, ప్రకటనల రూపంలో అవసరానికి మించి కూడా రాజకీయ ఒత్తిడులు, వ్యూహాల కారణంగా కోట్లాది రూపాయలను ప్రభుత్వం బొక్కసం నుండి తీసి ఖర్చు పెడుతున్నది’ అని రచయిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పుస్తకంలోని ప్రకటనలకు సైతం ప్రభుత్వం ఆ బొక్కసం నుండే ఖర్చు చేసింది. ఒక పేజీ బ్లాక్ అండ్ వైట్ ప్రకటనతో పుస్తక ప్రచురణ ఖర్చు సరిపోతుంది. సీనియర్ జర్నలిస్టులను కాదని, వారి అనుభవాన్ని తోసిపుచ్చి పూచిక పుల్ల కింద జమకట్టి కొత్తవాళ్ల మీద ఆధారపడుతున్నారని చానల్స్‌పై ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్‌ను అని మడికట్టుకుని కూర్చుంటే బొట్టుపెట్టి పిలిచేదెవరు? దూసుకెళ్లిన వారికే అవకాశాలు. జర్నలిస్టుల జీవితాలు అద్భుతంగా ఉన్నాయంటే రచయిత పలు సందర్భాల్లో ఈర్ష్య ప్రకటించారు. కానీ ఒకరిద్దరి జీవితాలను చూసి అంతా అలానే ఉన్నారని జర్నలిజంతో సంబంధం లేని వారు అనుకోవచ్చు కానీ జర్నలిజంతో సంబంధం ఉన్నవారు అనుకోలేరు.
నేను జర్నలిస్టునేనా?
రచయిత - ములుగు రాజేశ్వరరావు
వెల రూ.100

18, జనవరి 2012, బుధవారం

లాజిక్ లేని లాజిక్... బిజినెస్ మేన్ సినిమాలోని లాజిక్ .. రామారావును దించడానికి బాబు చెప్పినలాజిక్‌ ఇదే .... రాజకీయ వ్యంగ్యం




మా దూరపు బంధువు ఉన్నాడు కదా! పాపం వాడికి ఇంకా పెళ్లి సంబంధం కుదరలేదోయ్ అని హాస్యరచయిత మునిమాణిక్యం వాళ్లవిడ కాంతంతో అంటే సిలోన్ వెళ్లొచ్చిన వాడికి పెళ్లి కాదని నేను ముందే అనుకున్నాను అంటూ కాంతం చెబుతుంది. మునిమాణిక్యానికి ఆశ్చర్యం వేస్తుంది. పెళ్లి కాకపోవడానికి, సిలోన్ వెళ్లి రావడానికి సంబంధం ఏమిటో అస్సలు అర్ధం కాదు. అదే విషయం అడిగితే ఆమె అంతే లేండి నేను చెప్పిన మాట మీకు ఎప్పుడు నచ్చిందని, నా మాట మీరు ఎప్పుడు విన్నారని సాగదీస్తుంది. ఆ గొడవ అలా సాగుతూనే ఉంటుంది. అంతే తప్ప సిలోన్ వెళ్లి రావడానికి పెళ్లి కాకపోవడానికి సంబంధం ఏమిటో మాత్రం ఆమె చెప్పదు. కొన్ని వాదనలు అంతే తెలుగు సినిమాల్లో మాదిరిగానే అస్సలు లాజిక్‌కు చిక్కవు. వాళ్ల తండ్రిని చంపిన వానిపై పగ తీర్చుకోవడానికి హీరో మహేష్ బాబు బిజినెన్ మ్యాన్ అంటూ ముంబై వెళ్లి ఉచ్చపోయిస్తానంటూ మాఫియా అవతారం ఎత్తుతాడు. పగ తీర్చుకోవడానికి బిజినెస్‌కు మాఫియాకు, హత్యలకు సంబంధం ఏమిటయ్యా అంటే లాజిక్‌లతో తెలుగు సినిమాలు చూస్తే మడికట్టుకుని ఇరానీ హోటల్‌కు వెళ్లినట్టే అంటాడు మహేష్ అభిమాని. రెండువేల థియేటర్లలో సినిమా విడుదల చేశారు. రెండు రోజులు నడిస్తే చాలదా.. నిర్మాతకు రెట్టింపు లాభాలు సంపాదించిపెట్టడానికి. సినిమా వ్యాపారానికి ఇంతకు మించిన లాజిక్ ఏముంటుంది. అసలే సినిమా పేరు బిజినెస్ మేన్. చూసే ప్రేక్షకుడికి, రివ్యూ రాసే సమీక్షకుడికి లాజిక్కుతో పని. సినిమా తీసే నిర్మాతకు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం రావడమే లాజిక్ కదా? నిర్మాత కోణంలో ఆలోచిస్తే బిజినెస్ మేన్‌లో బోలెడు లాజిక్ ఉంది. అనుమానం ఉంటే నిర్మాత ఇంటికి ఆదాయం పన్ను శాఖవారిని పంపి అడిగించండి. ఇదొక్కటే కాదు ఈ మధ్య వచ్చే సినిమాలు ఎక్కువ థియేటర్లలో విడుదలయ్యే లాజిక్‌కు కారణం ఇదే.


 లాజిక్ లేదు అని వాదించే దానిలో సైతం లాజిక్కు ఉంటుంది. ముంతాజ్ పెద్ద అందగెత్త కాదంటారు. ముంతాజ్‌ను షాజహాన్ కళ్లతో చూస్తే ఆమె ఎంత అందగత్తెనో తెలుస్తుంది. సినిమా ప్రేమలో మాత్రం లాజిక్ అస్సలు అర్ధం కాదు. ప్రేమించిన అమ్మాయి కోసం రాజ్యాలను వదలుకోవడం ఏమిటో? రాజకుమారి తోటరాముడ్ని ప్రేమించడం ఏమిటో ? ప్రేమ, లెక్కలకు అస్సలు చిక్కదు.


కొందరు మనుషులను ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ అని రెండుగా విభజించేస్తారు. నువ్వు ప్రాంతీయ పార్టీని విమర్శించావు కాబట్టి జాతీయ పార్టీ తొత్తువు అనేస్తారు. జాతీయ పార్టీని విమర్శిస్తే, ప్రాంతీయ చెంచా అంటారు. ఇదే లాజిక్‌తో ప్రపంచంలో మనుషులను రెండుగా విభజించే కాంట్రాక్టు మీకెవడిచ్చాడురా! బాబు అని ప్రశ్నిస్తే, వారి సమాధానంలో లాజిక్కు ఉండదు. భారీ వర్షానికి చెరువు నుండి వచ్చి బావిలో పడిన కప్ప, అప్పటి వరకు బావిలో తిష్టవేసుకున్న కప్పతో సంభాషణ జరుపుతూ ఎక్కడి నుండి వచ్చావు అంటే చెరువు నుండి అని చెప్పిందట! మీ చెరువు ఎంత పెద్దగా ఉంటుంది అని రెండు చేతులు చాపి చూపితే అంత కన్నా పెద్దగా ఉంటుందని చెప్పిందట! చివరకు బావిలో ఒకవైపు నుండి ఇంకో వైపుకు దూకి ఇంత పెద్దగా ఉంటుందా?అని విజయగర్వంతో అడిగిందట బావిలోని కప్ప. బాబోయ్ దీనికి చెప్పడం నా వల్ల కాదు దీని జీవితంలో చూసిన అత్యంత పెద్దది బావి మాత్రమే..! చెరువు అంత కన్నా పెద్దగా ఉంటుందని దీనికి నేను ఎలా చెప్పను? అని చెరువు నుండి వచ్చిన కప్ప తల పట్టుకొంది. వీళ్ల ప్రపంచం రెండు పార్టీల లోపే కుదించుకుపోతుంది. ప్రపంచం అంత కన్నా విశాలమైంది అంటే బావి కన్నా పెద్దది ఉండడానికి వీలే లేదని వాదనకు వస్తారు. వీరి లాజిక్కు అంతే.


ఆ మధ్య ఒక యువకుడు కేంద్ర మంత్రి శరద్‌పవార్‌ను చెంప దెబ్బ కొట్టాడు. కొన్ని వందల మంది అతనికి భారత రత్న ఇవ్వాలని సామాజిక సైట్స్‌లో యువత డిమాండ్ చేశారు. చివరకు ఆ యువకుడు తనకు మతి భ్రమించిందని, ఏం చేస్తున్నానో తనకు తెలియకుండా చేశానని పోలీసు విచారణలో చెప్పాడు. చెంపదెబ్బ కొడితే భారత రత్న కోసం డిమాండ్ చేయడం ఏమిటో? అస్సలు అంతు చిక్కని లాజిక్ .
బిఎస్‌పి గుర్తు ఏనుగు కాబట్టి అది కనిపించకుండా ఎలక్షన్ కమిషన్ వాళ్లు గుడ్డ కప్పమన్నారు. మరి చేయి గుర్తు కనిపించకుండా ఏం చేస్తారు. కొన్ని ఆదేశాలకు లాజిక్ ఉండదు..అంతే! రాందేవ్ బాబాపై సిద్దిఖీ అనే ఒకాయన కోపం వచ్చి ఇంకు చల్లాడు. ఎందుకయ్యా ఇంకు చల్లావు అంటే ఎన్‌కౌంటర్‌పై ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పలేదు. అందుకనే ఇంకు చల్లానని చెప్పుకొచ్చాడు. అంటే నువ్వు జర్నలిస్టువా? అని ప్రశ్నిస్తే రాజకీయ నాయకులను ప్రశ్నించే అధికారం 
జర్నలిస్టులకేనా? మా లాంటి వాళ్లు ప్రశ్నించవద్దా? అంటూ వాదనకు దిగాడు.


ఎండా కాలం గాలిలో తేమ శాతం మాదిరిగా బాబు మాటల్లో లాజిక్కు శాతం తక్కువగానే ఉంటుంది. కానీ ఎన్టీఆర్‌ను దించేయడానికి ఆయన చెప్పిన మాటల్లోని లాజిక్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎన్టీఆర్‌ను ఎందుకు దించేశారు? అంటే విధానాలు అమలు చేయడంలో, ఎన్టీఆర్ విఫలమయ్యారు. ఎన్టీఆర్ విధానాలు అమలు చేయడానికే, ఎన్టీఆర్‌ను అధికారం నుంచి దించేశామని బాబు చక్కని లాజిక్ తో మాట్లాడారు.

17, జనవరి 2012, మంగళవారం

వార్తలు లేనప్పుడు ఏం చేస్తున్నారు ? కోడిగుడ్డు ఈకలు పీకుతున్న హిందీ ,ఇంగ్లిష్ చానల్స్ ... సినిమాలను నమ్ముకుంటున్న తెలుగు న్యూస్ చానల్స్

దాదాపు దశాబ్దం క్రితం తెలుగు వార్తా పత్రికల్లో ప్రత్యేకంగా ప్రతి రోజు సినిమా వార్తల కోసం ఒక పేజీని కేటాయించినప్పుడు వింతగా అనిపించింది. ప్రతిరోజు ప్రచురించడానికి సినిమా వార్తలు ఏముంటాయనిపించింది. ప్రైవేటు చానల్స్ ప్రారంభం అయిన కొత్తలో ఆ రోజు జరిగిన సంఘటనలు ఒకటి రెండు రోజుల తరువాత రోజుకు గంట పాటు ప్రసారం చేసేవారు. 24 గంటల న్యూస్ చానల్స్ ప్రారంభం అయినప్పుడు కూడా అదే తరహాలో 24 గంటల పాటు చూపించడానికి వార్తలు ఏముంటాయనే సందేహం వచ్చింది. ఒకటికాదు రెండు కాదు దాదాపు 24 గంటల వార్తలు చూపడానికి తెలుగులోనే 24 చానల్స్ వచ్చేశాయి. వీటిలో కొన్ని చానల్స్ ఉనికి ప్రజలకు తెలియదు, కొన్ని ఎలాగోలా నెట్టుకొస్తున్నాయి. చానల్స్ నెట్టుకురావడానికి ఆర్థిక వ్యవహారాలు ఒక సమస్య అయితే వార్తలు మరో సమస్యగా మారుతున్నాయి. చూపిన వార్తలే, జరిగిన గొడవలే ఎంత సేపని చూపిస్తారు. మరి వార్తలు లేనప్పుడు ఏం చేస్తారు.


  మీడియాకు సెలవు రోజు, ప్రజలు పండుగ వాతావరణంలో ఉంటారు. రాజకీయాలను పట్టించుకునేంత తీరిక ఉండదు. సొంత ఊళ్లకు వెళుతుంటారు. మరి ఇలాంటి సమయంలో చానల్స్‌కు వార్తలు ఎలా? వార్తలు లేకపోతే ఏం చేస్తారు. సంక్రాంతి సమయంలో తెలుగు చానల్స్‌తో పాటు జాతీయ చానల్స్ సైతం ఇదే విధంగా వార్తల కొరతను ఎదుర్కొన్నాయి. తరుచుగా ఇలాంటి సందర్భాలు ఎదురవుతూనే ఉంటాయి. వార్తల కొరత ఏర్పడినప్పుడు తెలుగు చానల్స్, జాతీయ చానల్స్ స్పందిస్తున్న తీరు వేరువేరుగా ఉంటోంది. హిందీ, ఇంగ్లీష్ జాతీయ చానల్స్ కోడిగుడ్డుమీద ఈకలు పీకినట్టు ఒక చిన్న అంశాన్ని పట్టుకుని సాగదీస్తూ వార్తలను సృష్టించుకుంటున్నాయి. తెలుగు చానల్స్ ఎక్కువగా సినిమా కథనాలపై ఆధారపడుతున్నాయి. సంక్రాంతి రోజున తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చానల్స్‌లో కనిపించిన తేడా ఇది.
సంక్రాంతి రోజున పెద్దగా ముఖ్యమైన వార్తలేమీ లేకపోవడంతో తెలుగు చానల్స్ పూర్తిగా సినిమా అంశాలపైనే ఆధారపడ్డాయి. 1965 నుండి ఇప్పటి వరకు సినిమాల్లో ఐటెంసాంగ్స్‌పై టీవి5 ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. విజయలలిత, జ్యోతిలక్ష్మి, జయమాలిని, హలం, సిల్క్‌స్మిత, అనురాధల తరం నుండి నేటి తరం ఐటెం గర్ల్స్ వరకు కొన్ని పాటలతో చూపించారు. టైం మిషన్ అంటూ ఒక్కసారిగా ఆనాటి రోజుల్లోకి తీసుకు వెళ్లారు. ఎంపిక చేసుకున్న అంశానికి నిజానికి సమయం సరిపోదు. కానీ సాధ్యమైనంత వరకు ఎక్కువ మందిని గుర్తు చేయడానికి ప్రయత్నించారు. ఇంత మందిలో ఇంద్రుడు చంద్రుడులో తన అందాలతో సంచలనం సృష్టించి వాంపు పాత్రల్లో విజృంభించిన జయలలితను ఎందుకో మరిచిపోయారు. తన పాత్రల పట్ల తనకే విసుగేసి విరామం ప్రకటించి అమ్మమ్మ డాట్‌కాం సీరియల్‌లో ఒక మంచి పాత్రలో నటించి ఆమె ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
hm  టీవిలో శోభన్‌బాబు జయంతి సందర్భంగా ఆయనపై ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేశారు.అదే రోజు భాను
ప్రియ జన్మదినం సందర్భంగా కొన్ని తెలుగు చానల్స్ ఆమెపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేశాయి. ప్రముఖ నటుని కొత్త సినిమా విడుదలైతే తెలుగు చానల్స్ చాలా ఎక్కువగానే స్పందిస్తున్నాయి. బిజినెస్ మేన్ సినిమా విడుదల రోజున అన్ని చానల్స్‌లో వివిధ జిల్లాల్లో థియేటర్ల వద్ద రద్దీ ఎలా ఉంది? ప్రేక్షకుల సందడి ఎలా ఉంది అంటూ తెగ హడావుడి చేశారు. గతంలో ఇలాంటి హడావుడి అభిమాన సంఘాల వారు చేసేవారు, ఇప్పుడా పాత్రను తెలుగు చానల్స్ పోషిస్తున్నాయి. ఎక్స్‌ట్రా చానల్ పేరుతో గుట్టు చప్పుడు కాకుండా ఒక చానల్ ప్రసారాలు ప్రారంభమ య్యాయి. ఇది పూర్తిగా 24 గంటల సినిమా న్యూస్ చానల్.




ఇక వార్తలు లేని రోజున హిందీ, ఇంగ్లీష్ చానల్స్ విషయానికి వస్తే...
రాందేవ్‌బాబాపై ఒక ఎన్‌జివో సంస్థకు చెందిన వ్యక్తి ఇంకు చల్లాడు. ఈ మధ్య ఇదో ఫ్యాషన్ అయిపోయింది. ఆ మధ్య శరద్‌పవార్‌ను ఒక సిక్కు యువకుడు చెంపదెబ్బకొడితే దేశ వ్యాప్తంగా ఇంటర్‌నెట్ సోషల్‌సైట్స్‌లో అతనికి మద్దతు లభించింది. ఈ వార్తను యాహూలో పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే వందలాది మంది స్పందించారు. చెంపదెబ్బకొట్టిన వ్యక్తికి భారత రత్న ఇవ్వాలని సూచించారు. తీరా పోలీసు విచారణలో ఆ వ్యక్తి తనకు మతి స్థిమితం సరిగా లేదని, అందుకే అలా వ్యవహరిస్తున్నానని చెప్పుకున్నాడు. ఇలాంటి వాటికి జాతీయ మీడియాలో విస్తృతంగా ప్రచారం లభిస్తుండడంతో కొంత మంది ఇలాంటి దుందుడుకు చర్యలకు పూనుకుంటున్నారు. అయితే వీరు చేసే చిల్లర పనుల కన్నా ఈ సంఘటనలపై జాతీయ నాయకులు స్పందిస్తున్న తీరు మరింత సిల్లీగా ఉంది. ఎవరో రాందేవ్ బాబాపై ఇంకు చల్లగానే ఇది ఆర్‌ఎస్‌ఎస్ పనే అంటూ దిగ్విజయ్ సింగ్ తేల్చి చెప్పారు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్ అధికార ప్రతినిధి అన్నట్టుగా మాట్లాడేస్తుంటారు. ఎక్కడేం జరిగినా అందులో ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర కనిపిస్తుంటుంది. పార్లమెంటుపై దాడి జరిగినా, తాజ్‌మహల్ హోటల్‌పై దాడి సంఘటన అన్నింటిలో ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర కనిపిస్తుంది. దీనికి ఆయనో ఆధారం కూడా చూపారో ఎన్‌డిఏ అధికారంలో ఉన్నప్పుడు బిజెపి కేంద్ర మంత్రి ఒకరికి బాబారాందేవ్‌పై ఇంకు పోసిన వ్యక్తి నమస్కారం చేస్తున్నప్పటి ఫోటో విడుదల చేసి ఇంత కన్నా ఇంకేం ఆధారం కావాలని ప్రకటించారు. దానికి కాంగ్రెస్ ప్రత్యర్థులు అంత కన్నా గొప్ప ఫోటో విడుదల చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలాదీక్షిత్ పాల్గొన్న ఒక సభలో బాబాపై ఇంకు చల్లిన వ్యక్తి దగ్గరగా ఉన్నప్పటి ఫోటో వాళ్లు విడుదల చేశారు. ఈ రెండు ఫోటోలను పదే పదే చూపుతూ హిందీ, ఇంగ్లీష్ చానల్స్ గంటల తరబడి కోడిగుడ్డుపై ఈకలను పీకడానికి ప్రయత్నించాయి. ఒక రాజకీయ నాయకుడి వద్దకు ఎవరైనా వచ్చి నమస్కారం చేస్తే, అతన్ని పూర్తిగా స్కాన్ చేసి, అతని పుట్టుపూర్వోత్తరాలు, నేర చరిత్ర, మనస్తతత్వం అన్నీ తెలుసుకుని ప్రతి నమస్కారం చేస్తారా? నమస్కారం చేస్తే అతని నేరాలతో వారికి సంబంధం ఉన్నట్టా? రోడ్డుమీద వనమూలికలు అమ్మేవాళ్లు గతంలో అమితాబ్, ధర్మేంద్ర వంటి ఎందరో హీరోలతో ఫోటోలు దిగి రోడ్డు మీద ప్రదర్శనకు పెట్టేవారు. అంత మాత్రాన ఆ హీరోలకు రోడ్డుమీద వైద్యం చేసే వారు ఫ్యామిలీ డాక్టర్ అనుకుంటే ఎలా ఉంటుందో ? నాయకుడికి నమస్కారం చేసిన వారి ఫోటో చూసి వారి మనిషి అనుకుంటే అలానే ఉంటుంది.

12, జనవరి 2012, గురువారం

మీరు వర్క్ హాలికులా - పనిమంతులా ?..... సప్త సూత్ర పరీక్షతో తేల్చు కోండి





ఆఫీసులో ఇద్దరు వ్యక్తులు కనిపించారు. ఒకరు -ఫైళ్లలోకి తలదూర్చేసి పనిలో బిజీగా ఉన్నారు. పక్కనే కూర్చున్న మరో వ్యక్తి టేబుల్ మీద -ఫైళ్లు గుట్టలుగా పేరుకుని ఉన్నాయి. వాటి సంగతి వదిలేసి -తన్మయత్వంతో ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. వీరిద్దరిలో ఒకరికి పని చెప్పదలిస్తే మీరు ఎవరికి చెబుతారు! నిజమే -మీరే కాదు, ఎవ్వరైనా అదే పని చేస్తారు. పనిలో బిజీగా ఉన్న వ్యక్తికే పని చెప్పాలని అనుకుంటారు.
ఇంతవరకూ ఓకె. కానీ -ఆ రెండు కుర్చీల్లో మిమ్మల్ని ఊహించుకోవాల్సి వస్తే మీరు ఏ కుర్చీలో కూర్చున్నట్టు ఊహించుకుంటారు? మీరు ఏ కేటగిరీకి ఓటేసుకుంటారో నిజాయితీగా అంచనా వేసుకోండి. మీది నిరంతరం పని చేసే మనస్తత్వమా? క్షణకాలం బద్ధకించినా మనిషి ఎందుకూ పనికిరాకుండా పోతాడని వాదించే రకమా? బద్ధకం సకల దరిద్య్రాలకు నిజరూపం అన్న వాదన కరక్టే కావచ్చు. కానీ నిరంతరం పనిలో నిమగ్నమై సొంత జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మరింత ప్రమాదం. పనికి బద్ధకించినా, అతిగా పనికి ఉపక్రమించినా -రెండూ కొంపముంచే వ్యవహారాలే అన్నది నిపుణులు చెప్తోన్న మాట.
జీవనం కోసం మనం చేసే పని -జీవితంలో భాగం మాత్రమే. దాన్ని నిర్లక్ష్యం చేస్తే బతుకు పల్టీ కొట్టడం ఖాయం. అలాగని -జీవనం కోసం మనం చేసే పనే జీవితం అనుకున్నా బతుకు పల్టీ కొట్టడం మరింత ఖాయం. ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించడం, ఏది ఎంత వరకూ అన్న విషయంపై అవగాహన పెంచుకోవడం తెలివైన వాళ్లు చేసే పని.
బద్ధకిస్తే బతుకు ఎలా పల్టీ కొడుతుందో అందరికీ తెలిసిన విషయమే కనుక దాన్ని పక్కనపెడదాం. కానీ, మనం చేసే పనే మన జీవితం అన్న భ్రమల్లో బతికేసే వర్క్‌హాలిక్‌ల లక్షణాలపై ఇటీవల శాస్ర్తియమైన సర్వే నిర్వహించారు. అలాంటి వారి జీవితంలో ప్రధానంగా ఏడు లక్షణాలను గుర్తించారు. అలాంటి లక్షణాల మీ జీవితంలోనూ కనిపిస్తున్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు వర్క్‌హాలిక్‌లో కాదో మీకే అర్థమైపోతుంది.
జీవితానికి ఎన్నో లక్ష్యాలు. వాటి సాధనకు ఎన్నో పనులు. అయితే పనిలో మునిగిపోయి మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారా? అదే ప్రమాదం. లక్ష్యంత ఎంత పెద్దదైనా, పనికి సంబంధించి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులను దాటి మీరు పని చేస్తున్నారంటే, మీరు పని రాక్షసులే. ఆ విషయాన్ని నిర్థారించుకోవడానికి ఏడు లక్షణాలు.
కుటుంబం పట్ల నిర్లక్ష్యం: మీ వృత్తిలో మీరు ఏస్థాయిలోనైనా ఉండొచ్చు. హోదా ఎలాంటిదైనా కావచ్చు. అయితే మంచి భర్తగా, మంచి తండ్రిగా కుటుంబంలో మార్కులు తెచ్చుకోవాలి. పనిలో మునిగిపోయి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం పని రాక్షసుడి మొదటి లక్షణం.
1. సినిమాలు, షాపింగ్‌ల్లాంటి ఆనందాలకు దూరమై ఎంతకాలమైంది. 2. పిల్లల హోంవర్క్ పట్టించుకుని ఎన్ని రోజులైంది. 3. శృంగార జీవితాన్ని మర్చిపోతున్నారా? 4. బాధ్యతలను స్వీకరించలేకపోతున్నారు కదూ! ఈ లక్షణాలకు మీరు దగ్గరవుతున్నారంటే, కుటుంబ జీవితానికి దూరమైపోతున్నట్టు. సీరియస్‌గా ఆలోచించాల్సిందే.
మత్తుకు బానిస: తరచూ మద్యం తీసుకుంటున్నారా? అతిగా సిగరెట్లు తాగుతున్నారు కదూ! అంటే, తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారన్న మాట. ఒత్తిడికి దూరంగా జరగాల్సిన తరుణం ఆసన్నమైంది. లేదంటే -ఆరోగ్యం ఫట్. కెరీర్‌లో పరుగులో విజయం సాధించి కొరుకున్న స్థానాన్ని సంపాదించే సమయానికి హెల్త్ గ్రాఫ్ పూర్తిగా కిందకు దిగిపోతుంది. అప్పుడు కొసరు మాట అటుంచి, అసలు జీవితానికి ఎసరొస్తుంది. ఆలోచించండి. ఉన్నతమైన కెరీర్ జీవితంలో భాగమే కానీ, అదే జీవితం కాదు. కెరీర్ కోసం జీవితాన్ని ఫణం పెట్టడం సరైన నిర్ణయం కాదని తెలుసుకోండి.
నిద్రకు పాతర: ఎక్కువ పని చేసేవారిలో సాధారణంగా కనిపించే లక్షణం నిద్ర లేమి. నిద్ర లేకపోవడం, ఒత్తిడి కారణంగా ఇస్నోమియాకు దగ్గరవుతారు. క్రమంగా నరాలు బలహీనపడతాయి. సాధారణంగా ఇలాంటి లక్షణాలు ఉద్యోగంలో చేరిన కొత్తవారిలో ఉంటాయి. ఇలాంటి పరిస్థితే వస్తే మీకు మీరు గ్రహించి పరిస్థితిని మెరుగు పర్చుకోవాలి. మనసుకు, శరీరానికి విశ్రాంతినివ్వడం నేర్చుకోవాలి.
నిస్సత్తువ: నిరంతరం తుమ్ములు. పడితే వదలని పడిసం. ఇలాంటివి మిమ్మల్ని బాధిస్తుంటే అధిక పనితో ఒత్తిడికి లోనవుతున్నారని అర్థం. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీలుచూసుకుని కొన్ని రోజులు సెలవు పెట్టండి. నచ్చిన ప్రదేశాలకు వెళ్లి విశ్రాంతి తీసుకోండి. దీనివల్ల శరీరం, ఆ తరువాత మనసు పునరుత్తేజం పొందుతాయి. మునుపటి చురుకుదనం మీలో కనిపిస్తుంది.
సిల్లీ మిస్టేక్స్: వాట్స్ యువర్ నేమ్? అన్న చిన్న ప్రశ్నకు నాలుగైదు క్షణాలు ఆలోచించే పరిస్థితిలో ఉన్నారా? లేదంటే -మీతో కలిసి పని చేసే స్నేహితుడి పేరు సైతం గుర్తుకు రావడం లేదా? అప్పుడప్పుడూ ఎదురయ్యే ఇలాంటి పరిస్థితికి -మేధావితనం వచ్చి చేరుతుందన్న భ్రమల్లో ఉండకండి. మీకు మతిమరుపు లక్షణం పెరుగుతుందన్న మాట. లేదంటే -పనిమీద ఏకాగ్రత పెరగటం వల్ల మిగిలిన అంశాలు, సొంత విషయాలను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారన్న మాట. నిరంతరం పని ధ్యాసలో ఉండేవారికి ఇతర విషయాలు గుర్తుండవు. పరిస్థితి తీవ్రతకు ఇది అద్దం పడుతున్నట్టే. చిన్న చిన్న తప్పులే కదాని సిల్లీగా తీసుకోకుండా, సీరియస్‌గా ఆలోచించండి. లేదంటే, తరువాత ఆలోచించడానికి టైం ఉండదు.
కోపం, నిరాశ: బలమైన కారణం లేకుండానే కోపం వచ్చేస్తుంది కదూ! చిన్న చిన్న విషయాలకే నిరాశ పెరిగిపోతోంది కదూ! ఇంట్లో వారిపై ఆగ్రహం, పిల్లల్ని కసురుకోవడం ఎక్కువయ్యాయి కదూ! ఇవన్నీ వర్క్‌హాలిక్‌ల లక్షణాలు. పని పెరగటం వల్ల ఎదురయ్యే తిక్క ఇబ్బందులు. ఇవి మీలోనూ ఉన్నాయని గ్రహిస్తే మాత్రం జాగ్రత్త పడండి. పనిని దూరం పెట్టిండి. సమతుల్యమైన పని ప్రణాళికలు వేసకోండి. లేదంటే -ప్రేమాను బంధాలను తెంచేస్తుంది. మీలోనే కాదు, మొత్తం కుటుంబానే్న అశాంతికి గురి చేస్తుంది.
కాఫీల మీద కాఫీలు: మీకు టీ, కాఫీ తాగే అలవాటుందా? ఎన్నిసార్లు తాగుతారు? ఒకటీ రెండుసార్లంటే ఓకే. అదే పనిగా సేవించేవాళ్లంతా వర్క్‌హాలికులే. అదీ చివరి స్టేజికి చేరిపోయిన వాళ్లన్నమాట. డజనుసార్లు కాఫీ, టీ తాగడమంటే విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు. ఒత్తిడి భయం నుంచి తప్పించుకోవడానికే వీటిని ఆశ్రయిస్తున్నారని అర్థం. కొన్నాళ్లకు మీ శరీరం డజను టీ, కాఫీలను భరించే స్థితిని కోల్పోతుంది. నిద్ర దూరమైపోతుంది. ఇస్నోమియా కౌగిలించుకుంటుంది. ఆరోగ్యం హరించుకుపోతుంది. ఈ లక్షణాలు కాసిన్ని కనిపించినా జాగ్రత్త పడండి. పనితీరు మార్చుకోండి.
పనిలో బద్ధకించకూడదు.. కరక్టే. కానీ, పనే జీవితం కాకూడదు. కుటుంబానికి ఎంత సమయం కేటాయించాలి. మీకోసం మీరెంత సమయం పెట్టుకోవాలి. పనికి ఎంత సమయం కేటాయించాలో మీకు మీరే నిర్ణయించుకోండి. ప్రణాళిక వేసుకోండి. అనారోగ్యంతో చేసే పనిలో నాణ్యత ఉండదు. ఇదీ, ముక్తాయింపు.

11, జనవరి 2012, బుధవారం

మతిమరుపులో మన నేతలు మహా మేధావులోయ్


ఒక శాస్తవ్రేత్త తన ఇంటి తలుపులకు ఒకటి పెద్దది, మరోటి చిన్నది రెండు రంధ్రాలు చేశాడట! ఎందుకలా అంటే పిల్లులు లోనికి రావడానికి, బయటకు వెళ్లడానికి అని సమాధానం చెప్పాడు. మరి రెండెందుకు అంటే ఒకటి చిన్నపిల్లికి మరోటి పెద్ద పిల్లికి అంటూ చెప్పుకొచ్చాడు. మాకు తెలుసులే ఆ ప్రపంచ ప్రఖ్యాత శాస్తవ్రేత్త అంటున్నారా? సరే ఈ మధ్య టైమ్స్ వాళ్లు మ్యాన్ ఆఫ్‌ది సెంచరీ అంటూ ఐన్‌స్టిన్ గురించి ఆసక్తికర విషయాలు పేర్కొన్నారు.
ఐన్‌స్టిన్ ప్రినె్ట్సన్ యూనివర్సిటీలో పని చేశారు. యూనివర్సిటీ నుండి ఒకసారి ట్యాక్సీలో ఇంటికి వెళుతున్నారు. ఇంటి అడ్రస్ మరిచిపోయారు. అయితే ట్యాక్సీ డ్రైవర్ ఐన్‌స్టిన్‌ను గుర్తించలేదు. ఇప్పుడు ఇంటికెలా వెళ్లడం అనే ఆలోచనలో పడ్డాడు. కొద్దిసేపటి తరువాత డ్రైవర్‌తో ఐన్‌స్టిన్ ఇల్లు తెలుసా? అని అడిగాడు. ఈ నగరంలో ఐన్‌స్టిన్ ఇళ్లు తెలియని వారెవరుంటారు? ప్రతి ఒక్కరికి తెలుసు అన్నా డు. ఐతే ఆయన ఇంటికి పదా! అన్నాడు ఐన్‌స్టిన్! ఆయన్ని మీరు చూడాలనుకుంటున్నారా? అని డ్రైవర్ ఆసక్తిగా అడిగాడు. ఐన్‌స్టిన్ చిరునవ్వుతో అది కాదు నేనే ఐన్‌స్టిన్‌ను ఇంటి అడ్రస్ మరిచిపోయాను అని చెప్పాడు నింపాదిగా! మరోసారి ఎక్కడో లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా, టికెట్ ఎక్కడో పడిపోయిందని కంగారుగా వెతకసాగాడు. అది గమనించి కండక్టర్ సార్ మిమ్ములను నేను గుర్తుపడతాను, మీరు టికెట్ కొన్నారు, ఆ విషయం నాకు తెలుసు. వెతకాల్సిన అవసరం లేదు పోతే పోనివ్వండి అన్నాడు. అయినా కంగారుగా ఐన్‌స్టిన్ అలానే వెతకసాగాడు. కండక్టర్ దక్కరకు వచ్చి వదిలేయండి సార్ మీరు నాకు తెలుసు అన్నాడు. దానికి ఐన్‌స్టిన్ నేనెవరో మీకు తెలియవచ్చు కానీ నేను ఎక్కడ దిగాలో నాకు గుర్తు లేదయ్యా! బాబు ఇప్పుడా టికెట్ చూస్తే కానీ ఎక్కడ దిగాలో తెలియదు అని దిగులు పడ్డాడట!
 మేధావుల్లో ఇలాంటి లక్షణాలు సహజమే. ఐతే ఏంటీ ? అనే కదా మీ ప్రశ్న. చెప్పదలుచుకున్నదాన్ని మరిచిపోయి ఏదేదో చెబుతున్నాననే కదా మీ అనుమానం.
ఇప్పుడు బాగా ఆలోచించండి మన నాయకులకు అన్యాయం జరిగిందా? లేదా? తన పేరును, తన ఇంటిని మరిచిపోయిన వాడే మేధావి అయినప్పుడు ఓటేసిన లక్షల మంది ఓటర్లను ఐదేళ్ళ వరకు మరిచిపోయేవాడు ఎంత మహామేధావి అయి ఉంటాడు. మీ, మా నియోజక వర్గం అనే తేడా లేదు మన నాయకులంతా ఐదేళ్ల వరకు మనను మరిచిపోతున్నారంటే మన నేతలు మహా మేధావులు అని అంగీకరించి తీరాల్సిందే. మరిచిపోవడం మీకూ మంచిదే! ఒకవేళ గుర్తుంటే ఒక్కో పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పిందో గుర్తుకు తెచ్చుకోండి. ఎన్నికలయ్యాక వాటిని వారు మరిచిపోతున్నారు కాబట్టే కొత్త మాటలు చెప్పగలుతున్నారు. తెలివిని ఐ క్యూ అని కొలిచినట్టు మతిమరుపును కొలిచే విధానం ఉంటే మన నేతలు ప్రపంచానికి మతిమరుపులో పాఠాలు నేర్పించగలరు.
రామాలయం కట్టకపోతే దేశం సర్వనాశనం అవుతుందని గగ్గోలు పెట్టి ఊరువాడ తిరిగి ఇటుకలు సేకరించి, ఇటుకపై ఇటుక పేర్చి అధికార భవనాన్ని నిర్మించుకునే నాయకులు ఆ వెంటనే విషయం మరిచిపోతారు.
వ్యవసాయానికి విద్యుత్ చార్జీలు అంత భారీగా పెంచితే ఎలా భరిస్తాం అంటూ ఆందోళనకు దిగిన వారిని పిట్టలను కాల్చినట్టు కాల్చడం కూడా వీరోచిత చర్యగా సమర్ధించుకున్న మహానుభావుడు, అధికారం పోగానే ఆ విషయం మరిచిపోయి విద్యుత్ చార్జీలను తగ్గించేంత వరకు చివరి రక్తం బొట్టు వరకు ఉద్యమిస్తాను అని రోడ్డుమీద బైటాయించడం అంటే అతని మతిమరుపు స్థాయి సామాన్యమైనదా? ఆయన మహామేధావి కాకుంటే మరేమిటి? అమ్మానాన్న లేని అనాధను శిక్ష వేయకుండా వదిలేయండి న్యాయమూర్తిగారూ అని వెనకటికొకడు కోర్టులో దీనంగా వేడుకున్నాడు. వాడి ఏడుపు అందరికీ కన్నీళ్లు తెప్పించింది ఇంతకూ కేసు ఏమిటంటే వాడు అమ్మానాన్నలను హత్య చేశాడు. ఆ విషయం మరిచిపోయాడు కాబట్టి వాడు కచ్చితంగా మహామేధావి. మామను పోటు పొడిచిన వారు ఆ విషయం మరిచిపోయి మామ ఫోటోతో ఓట్లు అడుక్కోవడం అంటే మతిమరుపు గొప్పతనమే.
మీ ఇ-మెయిల్ అకౌంట్ పాస్‌వర్డ్ మీరు మరిచిపోవద్దు. కానీ అది మీ మాజీ ప్రేయసి పేరనే విషయం మీ శ్రీమతి మరిచిపోకపోతే మీ జీవితం రాంగోపాల్ వర్మ సినిమా అంత అయోమయంగా తయారవుతుంది.

10, జనవరి 2012, మంగళవారం

నేతలతో వేషాలేయిస్తున్న వార్తా చానళ్లు


టీవిలో కనిపించడానికి గాంధీ భవన్‌లో మహిళా కార్యకర్త నృత్యం చేస్తే, టిడిపి కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఒక కార్యకర్త చిత్రవిచిత్ర వేషాలు వేస్తుంటారు. న్యూస్ చానల్స్ పుణ్యమా అని కార్యకర్తలతో మొదలైన ఈ జబ్బు ఇప్పుడు పెద్ద నాయకుల వరకు వెళ్లింది. కార్యకర్త వేషాలేస్తే వారితో పోటీ పడి పెద్ద నాయకుడు డప్పు వాయిస్తున్నాడు, బోనం ఎత్తుకుంటున్నాడు, బతుకమ్మ ఆడుతున్నాడు.
రాజకీయాల పట్ల నీకు ఆసక్తి లేకపోవచ్చు, కానీ రాజకీయాలకు నీ పట్ల ఆసక్తి ఉంటుంది ఇదో రాజనీతిజ్ఞుడు చెప్పిన మాట. నిజమే మనకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నా లేకున్నా రాజకీయాలు మన జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. మన జీవితాలను శాసిస్తాయి. మనను అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లేవి, మన జీవితాలను సమస్యాత్మకంగా మార్చేవి, సమస్యలను పరిష్కరించేవి అన్నీ రాజకీయాలే. చివరకు అడవుల్లో జీవించే వారిపై సైతం ప్రభుత్వం తన ప్రభావం చూపుతుంది. అలాంటిది మనపై ఇంకెంత ప్రభావం చూపుతుంది. రాజకీయాల్లో ఒకప్పుడు ఆలోచనా పరులు క్రియాశీలక పాత్ర వహించేశారు. రాజకీయాల్లో ఆలోచనలకు ప్రాధాన్యత ఉండేది. కానీ తెలుగునాట తెలుగు చానల్స్ విజృంభణ తరువాత తమాషాలు చేసేవారే రాజకీయాల్లో చురుగ్గా కనిపిస్తున్నారు.
మీరు వేషాలు వేయగలరా? తమాషాలు చేయగలరా, సిగ్గుపడకుండా గుంపులో డ్యాన్స్ చేయగలరా? ఇంకెందుకాలస్యం రాజకీయాల్లో చేరిపోండి బాగా రాణిస్తారు. నిజానికి ఈ లక్షణాలన్నీ ఉంటే సినిమా వేషాల కోసం ప్రయత్నించాలి, కానీ ఇప్పుడీ లక్షణాలు సినిమాల్లో కన్నా రాజకీయాల్లో రాణించడానికి ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా గడిచిన సంవత్సరంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశాలతో దాదాపు అన్ని చానల్స్ ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేశాయి. అన్ని చానల్స్‌లోనూ ఎక్కువ ప్రాధాన్యత లభించింది మంత్రి శంకర్‌రావుకే. ఒక చానల్ వాళ్లు ఏకంగా ఆయనకు కామెడీ కింగ్ అనే అవార్డు ప్రకటించారు.
ఏడాది కాలంలో ఆయన చేసిన చిత్రవిచిత్రమైన వేషాలను చానల్స్ చూపించాయి. జీ న్యూస్‌లో, సాక్షి చానల్‌లో శంకర్‌రావు ఆటపాటలు, వింత మాటలను ప్రత్యేకంగా చూపించాయి. సాధారణంగా ఒక కార్యక్రమానికి మంత్రిని అతిధిగా పిలిస్తే రిబ్బన్ కట్ చేయడం, ఉపన్యసించడానికే పరిమితం అవుతారు. కానీ రికార్డింగ్ డ్యాన్స్ వాళ్లు శంకర్‌రావును పిలిస్తే ఆయన ఏకంగా అక్కినేని నాగేశ్వరరావు పాట నేను పుట్టాను ఈ లోకం నవ్వింది అంటూ మొత్తం పాటమీద డ్యాన్స్ చేశారు. ఒక మంత్రి రికార్డింగ్ డ్యాన్స్ చేస్తే కచ్చితంగా అది ఏ చానల్‌కైనా పసందైన వార్త అవుతుంది.
చానల్స్‌కు ప్రధానంగా దృశ్య ప్రధానమైన అంశాలు కావాలి. టికెట్ రాలేదా? గాంధీభవన్‌లో కర్టెన్లు తగలబెట్టండి బ్రహ్మాండమైన కవరేజీ వస్తుంది అంటూ సలహాలిచ్చి మరీ ప్రోత్సహించారు. 2004 ప్రాంతంలో చానల్స్ వాళ్లు ట్రైనింగ్ ఇస్తే ఇప్పుడు నాయకులు రాటుదేలి పోయారు. ఈ పోటీలో సీనియర్ నాయకులు వెనకబడి పోతే వేషాలు వేయగలిగిన వారు ముందు వరుసలో ఉంటున్నారు. బంగిఅనంతయ్య అని కర్నూలులో ఉంటారు. పెట్రోల్ ధరలు పెంచినా, దేశంలో ఏం జరిగినా ఆయన టీవిలో కనిపించాల్సిందే. మరి ఆయన అంత గొప్ప నాయకుడేం కాదు. ఆయన్ని టిడిపి నుండి బయటకు పంపించారు. కానీ ఆయన ఒకసారి పాడె కట్టుకుని శవంలా పడుకుంటారు, మరోసారి కొజ్జాలతో కలిసి ఉద్యమిస్తారు, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్‌లా వేషం వేసుకొని నిరసన వ్యక్తం చేస్తారు. దాంతో ఆయన్ని టీవిల వాళ్లు ఇష్టం ఉన్నా లేకున్నా ప్రముఖంగా చూపించేయక తప్పదు.
ఉత్తరాది వారిలో నృత్యాలు చేసే సంప్రదాయం ఎక్కువగానే ఉంది. దేశంలో ఏ మూల ఎక్కడ కాంగ్రెస్ గెలిచినా గాంధీ భవన్‌లో ఒకావిడ నలుగురితో కలిసి డ్యాన్స్ చేస్తుంది. ఆమె చూడడానికి బాగానే ఉంటుంది, అందరి ముందు డ్యాన్స్ చేస్తుంది. టీవిలకు ఇంత కన్నా ఏం కావాలి. దాంతో ఆమెను టీవిలో చూపించేస్తారు. పార్టీలో కీలక బాధ్యతలు వహించే వారి కన్నా టీవిల్లో వీరి హడావుడే ఎక్కువగా ఉంటుంది.

 టిడిపిలో గౌడ్ అనే ఒక కార్యకర్త ఉన్నారు. రైతు ఉద్యమం జరిగితే అతను రైతు వేషంలో ప్రత్యక్షమవుతారు. అవినీతి, ధరల పెరుగుదల సందర్భం ఏదైనా కావచ్చు వ్యక్తి ఒక్కరే కాని వేషాలు వేరువేరుగా ఉంటాయి. మద్యం ధరలు ఎంఆర్‌పి కన్నా ఎక్కువ ధరకు అమ్ముతున్నారని టిడిపి అధ్యక్షుడు ఉద్యమించాలని పిలుపు ఇచ్చారు. తెలుగు తమ్ముళ్లు నిజంగానే మందు కొడుతూ రోడ్డుపై పడిపోతూ టీవిల ముందు జీవించేశారు. ఇదేంటని విమర్శలు వస్తే మేం మా పాత్రలో సహజంగా నటించాం అంతే తప్ప మరో ఉద్దేశం లేదన్నారు. ఆ తరువాత ఏకంగా తెలుగు మహిళలు మందు బాటిల్స్ పట్టుకుని తాగుతున్నట్టు నటిస్తూ ఎక్సైజ్ కమీషనర్ కార్యాలయం ముందు బైఠాయించారు. టీవిలో కనిపించాలంటే ఈ వేషాలు అవసరమా? మద్యంపై ఉద్యమిస్తున్నారా? నలుగురు నవ్వుకునేట్టు నటిస్తున్నారా?
చిన్న నాయకులకే కాదు మన చానల్స్ పుణ్యమా అని ఈ వేషాలు పెద్ద నాయకులకు సైతం తప్పడం లేదు. వెరైటీగా ఉండాలని ఒక సినిమాలో హాస్య నటుడు దీపావళి నాడు రంగులు పూస్తాడు, దసరా రోజు బాణా సంచా కాలుస్తాడు, గొబ్బెమ్మలు సంక్రాంతి నాడే ఎందుకు పెట్టాలి అని వాదిస్తూ హోళీ నాడు పెడతాడు. ఏ పండుగ రోజున ఏం చేయాలో ఒక పద్ధతి ఉంటుంది. చానల్స్‌లో ఎక్కువ సమయం కనిపించాలంటే రాజకీయ నాయకుల కార్యకలాపాలు దృశ్య ప్రధానంగా ఉండి తీరాలి కాబట్టి ఎప్పుడు ఏం చేయాలనేది పట్టించుకోకుండా నాయకులు వేషాలేస్తున్నారు. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగ అనేవి తెలంగాణకు సంబంధించి ప్రత్యేకత గలవి. రైతు పోరుబాట పేరుతో చంద్రబాబు వరంగల్ జిల్లాలో పర్యటించి బోనం ఎత్తుకున్నారు. చానల్స్ వారు కోరినంత సేపు డప్పు వాయించారు. నిజానికి ఆ డప్పు వ్యవహారం ఏమిటో? ఎందుకు వాయిస్తారో ఆయనకు తెలియదు. కానీ చెప్పిందే చెప్పే తన ఉపన్యాసం కన్నా డప్పు వాయించడాన్ని చానల్స్‌లో ఎక్కువ సమయం చూపిస్తారని ఆయనకు తెలుసు. ఆయన ఊహించినట్టే ఉద్రిక్తతలు, గొడవల మధ్య కూడా ఆయన డప్పు వాయిస్తున్న దృశ్యాలకు చానల్స్‌లో ఎక్కువ ప్రాధాన్యత లభించింది. చానల్స్ లేని కాలంలోనే ఎన్టీఆర్ మహానాడులో లొట్టిపిట్టల ఊరేగింపు, ముగ్గుల పోటీ, వంటల పోటీ వంటి చిత్రవిచిత్రమైన వాటిని పరిచయం చేశారు. ఆయన సన్యాసి వేషంలో కొన్నాళ్లు కనిపించారు. ఆయన స్వయంగా నటుడు కాబట్టి ఆయనకివి చెల్లుబాటు అయ్యాయి కానీ ఇప్పుడు కార్యకర్తలు మొదలుకొని, పెద్ద నాయకుల వరకు టీవి వార్తలో సముచితమైన వాటా కోసం వేషాలు వేయక తప్పడం లేదు.
చానల్స్ పుణ్యమా అని దృశ్య ప్రధానమైన రాజకీయాలు పెరిగిపోయాయి. ఒక మంత్రి నేలపై కూర్చోని సమీక్షలు నిర్వహించినా, నాయకులు డప్పు వాయించినా, నృత్యాలు చేయడం అంతా చానల్స్ రాజకీయం పుణ్యమే. రాజకీయాలు సీరియస్ విషయాలు. దాన్ని చివరకు ఇలా తమాషాగా మార్చడం నాయకులకు మంచిది. సమాజానికీ మంచిది కాదు.

8, జనవరి 2012, ఆదివారం

విమర్శలను ఎదుర్కోవడం లో జవహర్ లాల్ నెహ్రు ... ఇందిరాగాంధీ కాలం నుంచి సోనియా వరకు........... సామజిక మాధ్యమాలపై సెన్సార్షిప్ సాద్యమా ?


దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూను ఈ దేశ ప్రజలు కనిపించే దైవంగా భావించే వారు. అప్పటివరకు బ్రిటీష్ పాలన అనుభవించిన మనకు ప్రజాస్వామిక పాలన ఎలా ఉంటుందో చూపిన వారు. ప్రజల్లో ఆయన పట్ల విపరీతమైన అభిమానం ఉండేది. ఇప్పుడంటే ఇమేజ్ కోసం మీడియాను మేనేజ్ చేసుకోవడం మన నాయకులకు తెలుసు. అలాంటి మేనేజ్‌మెంట్ టెక్నిక్‌లు ఏమీ లేని కాలంలోనే ఆయన పట్ల జనంలో విపరీతమైన అభిమానం ఏర్పడింది. అలాంటి నెహ్రూపై ఒక పత్రికలో విపరీతంగా విమర్శిస్తూ తరుచుగా వ్యాసాలు వచ్చేవి. తీరా చివరకు తెలిసిందేమిటంటే ఆ వ్యాసాలు రాసింది స్వయంగా నెహ్రూనే తనను తాను సమీక్షించుకోవడానికి స్వయంగా ఆయనే తనపై ఇలాంటి వ్యాసాలు రాసుకునే వారట!
అది నెహ్రూ కాలం
ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఆమె ఇద్దరు కుమారులు రాజీవ్‌గాంధీ, సంజయ్‌గాంధీ ముగ్గురూ భోజనం చేస్తున్నారు. ఏదో ఒక విషయంపై వాడిగావేడిగా చర్చ సాగుతోంది. ఇంతలో సంజయ్‌గాంధీ పరుషంగా ఒక మాట అన్నాడు. రాజీవ్‌గాంధీకి కోపం వచ్చింది. తల్లితో మాట్లాడే పద్ధతి అదేనా? అంటూ సంజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ్ముడి మాటలపై ఏమీ అనడం లేదేమిటని తల్లిని కూడా అడిగాడు. ఇందిరాగాంధీ నవ్వుతూ సంజయ్‌గాంధీ తన తల్లితో పరుషంగా మాట్లాడితే నేను దానికి తగినట్టుగానే స్పందించేవాడిని, కానీ అతను ఈ దేశ ప్రధానమంత్రితో పాలనపై తన అసంతృప్తిని పరుషంగా వ్యక్తం చేశాడు. అతనికా హక్కు ఉంది అని సమాధానం చెప్పారు.
దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన ఇందిరాగాంధీ సైతం దేశ ప్రధానిని విమర్శించే హక్కు పౌరుడికి ఉందని అంగీకరించారు.
అది ఇందిరాగాంధీ కాలం
* * *
ప్రస్తుతం మనమున్నది కోడలి గారి కాలంలో...
కోడలిగారిని సామాజిక మాధ్యమాల్లో ఎవరో ఏదో విమర్శ చేశారట! దాంతో కేంద్ర మంత్రి కపిల్‌సిబల్ వాటిపై సెన్సార్‌షిప్ విధించే ఆలోచన చేశారు. కపిల్‌సిబాల్ ఇటీవల విలేఖరుల సమావేశంలో సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్స్‌లో రాజకీయ నాయకులపై వస్తున్న అభ్యంతరకరమైన కామెంట్స్‌పై తీవ్రంగా స్పందించారు. శ్రీమతి సోనియాగాంధీ పట్ల అభ్యంతరకరమైన రాతలు సామాజిక మాధ్యమాల్లో( సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్స్) రాస్తున్నారని, ఈ వీటి ఆంక్షలు విధించే విషయం పరిశీలిస్తున్నట్టు ప్రకటించారు. దేశంలో ఇది పెను సంచలనానికి దారి తీసింది. సామాజిక మాధ్యమాలపై ఆంక్షలా అంటూ నెట్ జనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో కపిల్‌సిబల్ తీరుపై మండిపడ్డారు. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి.
మేడమ్ గోప్యత కోసం పదికోట్ల మంది నెట్‌జనుల స్వేచ్ఛను హరిస్తారా? అంటూ ప్రశ్నించారు. న్యాయవాదిని ఐటి మంత్రిగా నియమిస్తే ఇలానే ఉంటుంది అంటూ ప్రముఖ స్టాక్ బ్రోకర్ రాకేష్ ఝున్‌ఝున్ వాలా మండిపడ్డారు. ఇది ఐటం సాంగ్ కోసం మాయావతిని ఎంపిక చేసుకోవడం లాంటిదే అని దురుసుగా వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ఈ దశాబ్దపు అద్భుతమేకాదు శతాబ్దపు అద్భుతంగా భావించే వాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆన్‌లైన్‌లో కొంత మంది
స్నేహితులతో నిరంతరం సామాజిక మాధ్యమం వల్ల టచ్‌లో ఉండవచ్చు. ఆన్‌లైన్‌లో పాత స్నేహితులను కలువ వచ్చు, కొత్త స్నేహాలు చేసుకోవచ్చు. రెండు మూడు దశాబ్దాల క్రితం చదువుకుని ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్న వారు సామాజిక మాధ్యమం పుణ్యమా అని మళ్లీ ఆన్‌లైన్‌లో టచ్‌లో ఉంటున్నారు. ప్రపంచంలో ఎక్కడెక్కడి వారు ఒక చోట చేరుతున్నారు. సాహిత్యం కావచ్చు, రాజకీయాలు కావచ్చు ఒకే రకమైన అభిరుచి గల వారు కొన్ని వేల మంది స్నేహితులుగా మారవచ్చు. అదీ ఇదీ అని లేదు. ఏ రంగంలో అభిరుచి ఉన్న వారైనా ఏకం కావచ్చు. గ్రూపులు, ఫోరంల ద్వారా ఎక్కడెక్కడి వారు ఏకమవుతున్నారు. ఏ అంశంపైనైనా వారు నిర్మోహమాటంగా తమ అభిప్రాయాలను వెల్లడించుకుంటున్నారు. కొన్ని అభిప్రాయాలు కొందరికి నచ్చకపోవచ్చు, కొన్ని వివాదస్పదం కావచ్చు కానీ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం మాత్రం అభినందనీయం.
బ్రిటీష్ పాలనా కాలంలో సంఘ సంస్కర పరులు తమ భావాల వ్యాప్తికి పత్రికలు ప్రారంభించారు. తరువాత స్వాతంత్య్ర పోరాటం కోసం పత్రికలను ప్రారంభించారు. తరువాత సంపన్నులు వ్యాపారంగా పత్రికలు ప్రారంభించారు. ఇటీవల కాలంలో రాజకీయ పక్షాలు, కార్పొరేట్ కంపెనీలు పత్రికలు, చానల్స్ ప్రారంభిస్తున్నారు. మీడియా పార్టీల వారిగా విడిపోయింది. కార్పొరేట్ కంపెనీ తమ అభిప్రాయాలను వెల్లడించడానికి మీడియా ఉంది, రాజకీయ పార్టీ తమ పార్టీ ప్రచారం కోసం మీడియాను ఏర్పాటు చేసుకొంది. మరి సామాన్యుడు తన అభిప్రాయం చెప్పాలంటే సాధమేది. ఇలాంటి ప్రశ్నకు సమాధానంగా ఉద్బవించిందే సామాజిక మాధ్యమం. ఏ అంశంపైనైనా కావచ్చు సోనియాగాంధీ తీరు మీకు నచ్చలేదా? ప్రధానమంత్రి పప్పెట్‌గా వ్యవహరించడాన్ని మీరు జీర్ణం చేసుకోలేక పోతున్నారా? విడుదలైన సినిమా పరమ చెత్తగా ఉందని మీ కనిపిస్తుందా? క్షణం కూడా ఆలస్యం అవసరం లేదు. సామాజిక మాధ్యమంలో మీ అభిప్రాయాన్ని మీరు నిర్మోహమాటంగా వెల్లడించవచ్చు. మీ అభిప్రాయం బాగుందని మిమ్ములను మెచ్చుకునే వారు, చెత్తగా ఉందని విమర్శించే వారు నిమిషాల్లోనే తమ స్పందన తెలియజేస్తారు. అంటే ఒక రకంగా పైసా ఖర్చు లేకుండా ఎవరికి వారు సొంత మీడియాను ఏర్పాటు చేసుకోవడం అన్న మాట. కోట్ల రూపాయల పెట్టుబడితో, వ్యయ ప్రయాసల కోర్చి ఏర్పాటు చేసుకునే మీడియా తరహాలో క్షణాల్లో పైసా ఖర్చు లేకుండా మన అభిప్రాయాలు ప్రపంచానికి చాటి చెప్పే సౌకర్యం కచ్చితంగా అద్భుతమే.
సామాజిక మాధ్యమాలకు ఇది ఒక కోణం
అదే సమయంలో వీటి వల్ల తీవ్రమైన నష్టాలు సైతం ఉన్నాయి.
సోనియాగాంధీని కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన రాతలను చదివిన వారు ఎంత మంది ఉంటారో తెలియదు కానీ కచ్చితంగా కపిల్ సిబల్ ప్రకటనతో ఈ విషయం కొన్ని కోట్ల మందికి తెలిసి వచ్చింది. సోనియాగాంధీ
ఏ విషయం బయటకు మాట్లాడరు కాబట్టి సామాజిక మాధ్యమాలపై సెన్సార్ విధించాలనే ఆలోచన ఆమెకే వచ్చిందా? లేక ప్రభువును మించిన ప్రభు భక్తి ప్రకటిస్తున్న కపిల్ సిబల్‌కు వచ్చిందా? సోనియాగాంధీకి సంబంధించిన వ్యవహారంపై కపిల్ స్వతంత్రంగా ఈ నిర్ణయం తీసుకున్నారని భావించలేం. సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్స్‌పై ఆంక్షలు విధించాలనే ఆలోచనకు సంబంధించిన అంశం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం కాదు. కపిల్ నుండి వచ్చిన ఈ ప్రకటనకు అమెరికా సైతం విస్తుపోయింది. ప్రజాస్వామిక దేశమైన ఇండియా నుండి ఇలాంటి ప్రకటనను ఊహించలేమని అమెరికా ప్రకటించింది. అభ్యంతరకరమైన రాతలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసమే. అయితే దీన్ని సాకుగా చూపించి సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించాలనే ఆలోచన ప్రమాదకరం. ప్రజాస్వామిక వాదులు ఎవరూ దీన్ని హర్షించరు. ఈరోజు మీడియా కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉంది. గతంలో మాదిరిగా మీడియాకు విశ్వసనీయత లేదు. కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉన్న మీడియా ప్రజల సమస్యల కన్నా తమ సంస్థ ప్రయోజనంపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంది. వ్యాపారం అన్నప్పుడు తన వ్యాపార ప్రయోజనాలకు పెద్ద పీట వేయడం సహజమైన చర్యనే. ఇలాంటి పరిస్థితిలో ఆవిర్భవించిన సామాజిక మాధ్యమాలు ప్రజల మాధ్యమాలుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతానికి ఇంగ్లీష్ చదువులు చదివిన మధ్యతరగతి కంప్యూటర్ ఆధార ఉద్యోగుల హడావుడి మాత్రమే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. సువిశాల భారత దేశంలో స్వల్ప సంఖ్యలో ఉన్న వీరికి పరిమితం అయిన సమయంలోనే అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం సాగించినప్పుడు సామాజిక మాధ్యమాలు చూపిన ప్రభావం ప్రభుత్వాన్ని సైతం విస్మయపరిచింది. వీటిపై ఆంక్షలు విధించాలనే ఆలోచన వెనుక అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని అణిచివేసే చర్య దాగి ఉందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా సామాజిక మాధ్యమాల ద్వారా అవినీతికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం కచ్చితంగా ప్రభుత్వానికి ఇబ్బందికరంగానే తయారైంది. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలని సామెత. సామాజిక మాధ్యమాల్లో సభ్యులుగా ఉన్న యువత సంఖ్య స్వల్పమే కావచ్చు కానీ విద్యావంతులైన వీరి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సహజంగా వీరు మార్పును కోరుకుంటారు. 125 ఏళ్ల నుండి ఒకే పార్టీ రాజ్యం చేయడం వీరికి నచ్చదు. వారసత్వ రాజకీయాలు నచ్చవు. విదేశీయురాలైన సోనియాగాంధీ నాయకత్వం నచ్చదు. అలాంటప్పుడు సామాజిక మాధ్యమాలు కాంగ్రెస్ నాయకత్వానికి నచ్చకపోవడం సహజమే.
సామాజిక విప్లవకారుడు
టైమ్ మేగజైన్ ప్రతి సంవత్సరం ఈ ఏటి మేటి వ్యక్తిగా ఒకరిని గుర్తిస్తుంది. ఈ సంవత్సరం వ్యక్తిని కాదు మొత్తం సామాజిక మాధ్యమాన్ని గుర్తించింది. ప్రజల సమస్యలపై నిరసన గళం వినిపించిన ఉద్యమ కారుడిని ఈ ఏటి మేటి వ్యక్తిగా నిరసన కారుడిని ఎంపిక చేసింది. నిరసన కారుడు అంటే ఒక వ్యక్తిని గుర్తించడం కాదు. ఇటీవల కాలంలో జరిగిన మొత్తం ఉద్యమాలను దృష్టిలో పెట్టుకుని నిరసన ది ప్రొటెస్టర్ అనే పేరుతో నిరసన కారుడిని ఎంపిక చేశారు. నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఇటీవల తలెత్తిన పలు ఉద్యమాలకు గుర్తింపుగా ఈ ఎంపిక జరిగింది. అయితే ఈ ఉద్యమాలన్నింటిలో సామాజిక మాధ్యమాలే కీలక పాత్ర వహించాయి. అందుకే టైమ్ మేగజైన్ ఈ సంవత్సరం సామాజిక ఉద్యమ మాధ్యమాన్ని ఈఏటి మేటి వ్యక్తిగా గుర్తించినట్టు అయింది.
సామాజిక మాధ్యమాల ద్వారా అన్నీ అద్భుతాలే, ఎలాంటి నష్టాలు లేవు, సమస్యలు లేవు అని ఎవరూ చెప్పడం లేదు. మంచి ఎంతుందో అంతకు మించి చెడు కూడా జరుగుతోంది. అమెరికాలో కాపురాలు కూలడంలో ఫేస్‌బుక్ ప్రధాన పాత్ర వహిస్తున్నట్టు ఇటీవల కొన్ని సర్వేలు వెల్లడించాయి. అశ్లీల బొమ్మలు, మాటలకు అంతు లేదు. మార్పును కోరుతూ అమెరికా ఓటర్లు విలక్షణమైన తీర్పును ఇచ్చి ఒబామా రాష్టప్రతి కావడానికి దోహదం చేశారు. దీనికి సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర వహించాయి. అలాంటిది స్వయంగా ఒబామా తమ పిల్లలకు ఫేస్‌బుక్ అకౌంట్ అవసరం లేదని ప్రకటించారు. ఈ వార్తను అమెరికా పత్రికలు ప్రధానంగా ప్రచురించాయి. మా పిల్లలు వ్యక్తిగత విషయాలను ఈ వయసులో ఫేస్‌బుక్ ద్వారా అందరికీ చెప్పుకోవలసిన అవసరం లేదు అందుకే వారికి ఫేస్‌బుక్ ఖాతా అవసరం లేదనుకుంటున్నట్టు ఆయన తెలిపారు.
సోనియాగాంధీని, సినిమా తారలనే కాదు బాబారాందేవ్ వంటి సన్యాసిని సైతం సామాజిక మాధ్యమాలు వదిలిపెట్టడం లేదు, వెకిలి మాటలు, బూతు బొమ్మలతో వెంటాడుతున్నాయి.
పెద్దవారే కాకుండా 18 ఏళ్ల లోపు వయసు వారు సామాజిక మాధ్యమాలకు బానిసలు అవుతున్నారని అమెరికాకు చెందిన అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సంస్థ ఆరోగ్య అధ్యయనాల్లో ఈ విషయం తేలింది.
సామాజిక మాధ్యమాల గ్రూపుల్లో చర్చలు చివరకు ఆందోళనకు వేధింపులకు కారణమవుతున్నాయి. వేధింపులకు పాల్పడినా పట్టుబడమూ అనే ధీమాతో కొంతమందిలో నేర ప్రవృత్తి పెరిగిపోతున్నట్టు తేలింది. అయితే ఇన్ని నష్టాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాలకు పిల్లలను దూరంగా ఉంచడం ద్వారా వారిని వెనక్కు నెట్టవద్దు అనేది నిపుణుల సూచన. వీటిలోని మంచి చెడులను వివరించి చెడు వైపు ఆకర్శితులు కాకుండా చూసుకోవాలి. లాటరీ వచ్చిందనో, వంటరిగా ఉన్నాను ప్రేమించుకుందామనే సందేశాల ద్వారానో సామాజిక మాధ్యమాలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి దేశంలో దాదాపు పదివేల కేసుల వరకు ఉన్నాయి.
సామాజిక మాధ్యమాల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, అంతకు మించి నష్టాలూ ఉన్నాయి. ఆ రెండింటిలో ఏది కోరుకోవాలో చాయిస్ మన చేతిలోనే ఉంది.
నష్టాలు ఉన్నాయని ఆంక్షలు విధించలేం. ప్రపంచంలో కొన్ని వందల భాషలు ఉన్నాయి. ప్రపంచ వరకు ఎందుకు మన దేశంలోనే ఎన్నో భాషలు ఉన్నాయి. ఒక్కో భాషలో సామాజిక మాధ్యమాల్లో ఏం రాస్తున్నారో పరిశీలించి, సెన్సార్ విధించడం సాధ్యమా? ఒక్క మన దేశంలోనే రోజుకు 25 మిలియన్ల భారతీయులు ఫేస్‌బుక్ ఉపయోగిస్తున్నారు. వంద మిలియన్ల మంది గూగుల్‌ను ఉపయోగిస్తున్నారట! వీరి రాతలను సెన్సార్ చేయడం సాధ్యమా?
ఐఎస్‌ఐ అండతో భౌతికంగా దాడులు జరుగుతుంటేనే నివారించలేకపోతున్నాం ఇక కంటికి కనిపించకుండా జరిగే అక్షర దాడులను అరికట్టడం సాధ్యమా?
మరేం చేయాలి అంటే ఒక నిపుణుడు మంచి సలహా ఇచ్చారు. ఉపేక్షించాలి. ఔను నిజం ఊపేక్షించడానికి మించిన శిక్ష లేదు.
పూర్వం రోమ్ లో సెనెట్‌కు ఎవరైనా నచ్చకపోతే వారిని తిరస్కరిస్తూ ‘డామ్‌నాటియో మెమోరి’ అనే ప్రకటన చేసేదట! అంటే వారి జ్ఞాపకాలను చెరిపివేస్తున్నట్టు చేసిన ప్రకటన. అలాంటి ప్రకటన చేసిన తరువాత ఆ వ్యక్తి పేరును అన్ని రికార్డుల నుండి తొలిగిస్తారు. బర్త్ రికార్డ్స్ , రోమన్ ఆర్మీ రికార్డ్స్ వంటి వాటి నుండి తొలగిస్తారు. అంటే చరిత్రలో వారి పేరును చెరిపేస్తారన్నమాట!
అంటే ఆ వ్యక్తిని పూర్తిగా ఉపేక్షించడం.
కొన్ని కోట్ల మంది అకౌంట్లను పరిశీలించి ఎవరు అభ్యంతర కరంగా రాశారో పరిశీలించి సెన్సార్ చేయడం కన్నా అలాంటి వారిని ఉపేక్షిస్తే అంత కన్నా పెద్ద శిక్ష అవుతుంది కదా! బూతు బొమ్మలు, రాతలు కనిపించినప్పుడు సహజంగా ఆ గ్రూపులో ఉన్న ఇతరులే ఫిర్యాదు చేస్తారు.
ఇక ఇంత సువిశాల మైన దేశానికి నాయకత్వం వహించేవారు ఎవడో పనికిమాలిన వాడు ఫేస్‌బుక్‌లో ఏదో రాశాడని కలవరపడితే అది వాడికి సంతోషం కలిగిస్తుంది తాను విజయం సాధించాననే భావన కలిగిస్తుంది. అంటే కపిల్ సిబల్ ఒక రకంగా అలాంటి అభ్యంతర కరమైన రాతలు రాసిన వారిని ప్రోత్సహించినట్టు అయింది.
అభ్యంతరకరమై అంశాలు కనిపించినప్పుడు ఫిర్యాదు చేస్తే కొన్ని సామాజిక మాధ్యమాలు వాటిని తొలగిస్తున్నాయి. కొన్ని పట్టించుకోవడం లేదు. ఇలాంటి వికృత చర్యలను ఖండించాల్సిందే, అరికట్టడానికి ప్రయత్నించాల్సిందే అంతే తప్ప వీటిని సాకుగా చూపించి మొత్తం సామాజిక మాధ్యమాలను కంట్రోల్ చేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం సహించరానిది.
వీళ్లు నిషేధించారు
పలు దేశాలు సామాజిక మాధ్యమాలను నిషేధించాయి. చైనాతో పాటు కొన్ని ఇస్లామిక్ దేశాలు సామాజిక మాధ్యమాలను నిషేధించాయి. ఇండియా లాంటి ప్రజాస్వామిక దేశంలో అది సాధ్యమా?
ఫేస్‌బుక్, యూ ట్యూబ్, ట్విట్టర్, బ్లాగర్, వికీమీడియా వంటి సామాజిక మాధ్యమాలను చైనా, పాకిస్తాన్, ఇరాన్, సిరియా, ఇథియోపియా, టర్కీ, థాయ్‌లాండ్, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ దేశాలు నిషేధించిన దేశాల జాబితాలో ఉన్నాయి.
నిజంగా మన దేశంలో సామాజిక మాధ్యమాలపై సెన్సార్ విధించాలనే ఆలోచన బూతు రాతల నివారణకా లేక పాలకులపై ప్రజల్లో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అసంతృప్తి జ్వాలలను అణిచివేయడానికా? అన్నా హాజారే ఉద్యమానికి సామాజిక మాధ్యమాల ద్వారా మద్దతు లభించినప్పటి నుండి వీటిపై ఆంక్షలకు ప్రభుత్వం ఆలోచిస్తుందనే వాదన వినిపిస్తోంది.
నాటి నినాదం: అరచేతిని అడ్డుపెట్టి సూర్యోయాన్ని ఆపలేరు
నేటి నినాదం: సెన్సార్‌షిప్‌తో సామాజిక మాధ్యమాల ఉద్యమాన్ని ఆపలేరు. 

ఆదివారం ఆంధ్రభూమి లో పూర్తి పాఠం 

4, జనవరి 2012, బుధవారం

నిజం చెప్పవద్దు.. అబద్దమాడవద్దు .. నాకు నచ్చిన news


.
ఇది చాల కష్టమైన పని నిజం చెప్పవద్దు అలా అని అబద్దమాడవద్దు . ఇలంట వార్త రాయాలంటే కత్తిమీద సాములాంటిదే.  భాషలో, విషయం లో పట్టు ఉంటేనే అది సాధ్యం. ఈనాడులో ఈరోజు వచ్చిన వార్త నాకు తెగ నచ్చేసింది . ఆస్తులు అమ్ముకున్నవాడు అమ్ముకున్నాము అని చెబుతాడు ఇది అందరు చేసే పని కానీ మహానుబావులు అలా చెప్పరు. ఈటివి వారు తెలుగు చానల్స్ మినహా మిగిలిన చానల్స్ అన్ని అమ్ముకున్నారు. మార్గదర్శి ఆధ్వర్యం లో చట్టవ్యతిరేకంగా డిపాసిట్లు వసూలు చేస్తున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ బయట పెట్టిన తరువాత చాల రోజుల నుండి చానల్స్ అమ్మేస్తున్నరనే వార్తలు పలు జాతీయ పత్రికల్లో వచ్చాయి. ఇప్పుడది అధికారికంగా వెల్లడయింది . అన్ని పత్రికలూ రామోజీ చానల్స్ అమ్మేశారని వార్త రాస్తే ఈనాడులో మాత్రం ౧౦౦ శతం వాటాల మార్పిడి అని చాల తెలివిగా అబద్దం చెప్పకుండా నిజం అర్ధం కాకుండా భలే రాశారు . రాజుగారికి అశుభ వార్త చెబితే కోపం వస్తుంది అందుకే  మీ గుర్రం చచ్చింది అని చెప్పడానికి మీ గుర్రం మొండెం తల నుండి వేరయింది మహారాజ అంటూ ఏదో చెప్పాడని కథ . చానల్స్ అమ్మేసిన వార్త ఈనాడులో ఎలా ఉందో, ఇతర పత్రికల్లో ఎలా ఉందో చూడండి .   జుట్టు ఉన్న ఆవిడ ఏ కొప్పు అయిన వేయగాలదన్నట్టు బాషలో పట్టున్న వారు ఏ విషయమైన ఎలా గైనా రాయగలరు . http://www.eenadu.net/Business/Businessinner.aspx?qry=bussi2

మందుదేవో భవ! ......మద్యం ప్రియుల కోసం గాంధీభవన్లో బొత్స టోల్ ఫ్రీ నెంబర్ ..మందు ధరల తగ్గింపునకు బాబు ఉద్యమం

గాంధీభవన్‌లో ట్రింగ్ ట్రింగ్ మని సౌండ్ వినగానే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఉత్సాహంగా ఫోన్ ఎత్తారు. ఎదురుగానే చాలా మంది విలేఖరులు కూడా ఎప్పటి మాదిరిగానే ముచ్చట్లాడుతున్నారు. పైసా ఖర్చు లేకుండా మందు అభిమానులు టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి పిసిసి అధ్యక్షునితో ముచ్చట్లాడుకోవచ్చు. మంచి చెడు చెప్పుకోవచ్చు.
‘‘ఆ చెప్పమ్మా’’ అంటూ బొత్స తొలి కాల్ అందుకున్నారు. ‘‘షారూ! బొచ్చషారుగారేనా నేను గుంపులో గుర్నాధాన్ని మాడుతున్న’’ అన్నాడు. ‘‘తమ్ముడు అన్‌డ్యూటీలోనే ఉన్నట్టున్నాడు’’ అంటూ బొత్స నవ్వాడు. ‘‘ మీకేమీ ఇబ్బంది లేదు కదా! మద్యం దొరక్క ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందా? చేతి నిండా తిండి, నోటి నిండా మందు, ఇంటి వద్దకే మద్యం అనేది మా ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో ఎంత పెద్దవారు అడ్డువచ్చినా పక్కకు తప్పిస్తాం ’’ అంటూ బొత్స భరోసా ఇచ్చాడు.



‘‘ ఎంత పెద్దవారైనా తప్పిస్తాను అంటున్నాడంటే ముఖ్యమంత్రిని తప్పిస్తానని వార్నింగ్ ఇవ్వడమే కదా? కిరణ్‌ను తప్పించడానికి సిద్ధమవుతున్న బొత్స అని బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేద్దామా?’’అని చానల్ కొత్త రిపోర్టర్ ఒకరు పక్కనున్న సీనియర్ చెవిలో ఊదాడు. చెవి ఓనర్‌కు తప్ప అక్కడున్న అందరికీ ఆ మాటలు స్పష్టంగా వినిపించాయి. ‘‘నా ఉద్దేశం అది కాదయ్యా? కాంగ్రెస్‌లో అందరం ఒక్కటే.. మాకు అడ్డు వచ్చేది అంటే బాబు అని అర్ధం చేసుకోవాలి’’ అని బొత్స వివరణ ఇచ్చారు.


 బ్రేకింగ్ న్యూస్ ముందు బ్రేక్ చేయాలి కానీ అభిప్రాయం ఎవరికీ చెప్పొద్దని కొత్త రిపోర్టర్ తొలి పాఠం నేర్చుకున్నాడు.
‘‘షారూ ఇక్కడ నేన్ లైన్‌లో ఉంటే మీరూ మీరూ మాట్లాడుకుంటే ఇంక మేమెందుకు? ఆదాయం ఇచ్చేవాళ్ల మాటకు ఇలువేలేదా? ఇదేనా షారు’’ అని గుర్నాధం ఆవేదన వ్యక్తం చేశాడు.‘‘ అయ్యో కస్టమర్ ఇస్ గాడ్ అని మహాత్మాగాంధీ అన్నారు. నేను కస్టమర్‌ను చిన్నచూపు చూస్తానా? నెవర్ చెప్పండి’’ అన్నాడు.


‘‘షారూ బార్లో మా మానాన మేం తాగి రోడ్డుమీద పడి ఆనందంతో దొర్లుతుంటే కొందరు వెహికిల్స్‌తో మాకు అడ్డంగా వస్తున్నారు. రాత్రి ఎనిమిది నుండి అర్ధరాత్రి ఒంటిగంట వరకు రోడ్లు మీదికి వెహికిల్స్‌ను అనుమతించొద్దు . దాన్ని మా సమయంగా ప్రకటించాలి. ఈ సంగతి మీకు చెబుదామని ఫోన్ చేశాను’’అన్నాడు గుర్నాధం. ‘‘నేనెలాగూ రవాణా శాఖ మంత్రినే కాబట్టి తప్పకుండా ఆలోచిస్తాను. మంచి సలహా ’’అని బొత్స నోట్ చేసుకున్నాడు. ‘‘మీరే మా ప్రగతి రథ సారధులు మీ అభిప్రాయాలు మాకెంతో విలువైనవి చెప్పండి’’ అంటూ బొత్స మరో కాల్ అందుకున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరితో ఫోన్‌లో మాట్లాడి అందరి అభిప్రాయాలు తెలుసుకుంటా? అని బొత్స పలికాడు.


‘‘సార్ మీ కార్యక్రమాన్ని నేను చాలా సేపటి నుండి చూస్తున్నాను. మనకు మంచి చేసిన మహనీయులందరినీ ఒకసారి స్మరించుకోవడం మన ధర్మం. నేను ఎన్టీఆర్ వీరాభిమానిని కాని ఆయన మాకు ద్రోహం చేశారు. నిషేధం విధిస్తే పొరుగున ఉన్న కర్నాటక, తమిళనాడు, ఒరిస్సా, యానాం వెళ్లి మందు కొట్టాల్సి వచ్చేది. మా కష్టాలను కడతేర్చడానికి ఆ దేవుడే బాబుగారిని పంపించారు. ఆయన నిషేధాన్ని ఒక్క తన్ను తన్ని ఆరువేల మద్యం షాపులు పెట్టారు. బెల్ట్ షాపులను ప్రపంచానికి పరిచయం చేశారు. అలాంటి వ్యక్తిని గుర్తు చేసుకోవలసిన అవసరం లేదా?’’ అని ఆ వ్యక్తి బొత్సను నిలదీశాడు. ‘‘చూడమ్మా ఇది మా పార్టీ ఆఫీసు మేం మా వాళ్లు చేసిన మంచి పనులనే స్మరించుకుంటాం’’ అని బొత్స సమాధానం చెప్పారు.


 ‘‘సార్ చేసిన మంచిని ప్రజలు ఎప్పుడూ మరిచిపోరు. మీ ఇమేజ్ జనంలో రోజు రోజుకు పెరిగిపోతోంది’’ అని ఇదంతా ఎన్టీఆర్ భవన్ నుండి లైవ్‌లో చూస్తున్న తెలుగునేతలు బాబును అభినందించారు.
కొన్ని కాల్స్ విన్నతరువాత బాబు ముఖంలో రంగులు మారాయి. బొత్స ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు, భవిష్యత్తులో అతనితోనే పోటీ అని అన్నారు. ‘‘మనం సచివాలయాన్ని మించిన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఇన్ని వందల మంది సిబ్బంది ఉన్నారు ఏం లాభం మీ ఎవ్వరికీ మందు ప్రియుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలనే ఈ ఆలోచన తట్టలేదు ’’ అని బాధపడ్డారు.



 బాబు 2004లో ఐటి వారిని నమ్ముకుంటే రోడ్డున పడేశారు. ఇది కాదని వారిని జెపికి వదిలేసి 2009లో పొలం బాట పట్టారు. అదీ వర్కవుట్ కాలేదు. రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ఓటర్లుంటే, ఓటర్లలో 80 శాతం వరకు మందు ఖాతాదారులే అనే విషయం గ్రహించిన తరువాత వారి అభిమానాన్ని చూరగొనాలని ఉద్యమ బాట పట్టారు. మద్యం ధర తగ్గించాలని ఉద్యమ బాట పట్టారు. రెట్టింపు ధరకు అమ్మడం వల్ల ఫుల్‌బాటిల్ తాగాల్సిన వారు సగం, ఆఫ్ బాటిల్ తాగాల్సిన వారు క్వార్టర్‌తో సరిపుచ్చుకుంటున్నారు ఇంత కన్నా అన్యాయం ఏమన్నా ఉందా? ధర తగ్గించాల్సిందే క్వార్టర్ బాటిల్ ధరతో ఫుల్‌బాటిల్ తాగండి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మందు ప్రియుడ్ని నేరుగా కలుసుకొని వారికి దగ్గరవుదాం. తాగిన వాళ్లు అబద్ధంచెప్పరు, ఈసారి మనదే అధికారం ’’అంటూ బాబు ఉత్సాహంగా పలికారు.