29, ఆగస్టు 2012, బుధవారం

వై యస్ ఆర్ తో మంత్రులకు .. చూపులు కలసిన శుభవేళ!

మాయాబజార్‌లో శ్రీకృష్ణుడు శశిరేఖకు ఆ కాలం నాటి ల్యాప్‌టాప్ ఇస్తే అమె తెరిచి చూడగానే అభిమన్యుడిగా అక్కినేని కనిపిస్తాడు. ఇద్దరి చూపులు కలుసుకుంటాయి. సావిత్రి శశిరేఖగా కలవరపడుతుంది. చూపులు కలిసిన శుభవేళా ఎందుకు నీకీ కలవరము అంటూ అక్కినేని పాజిటివ్ సంకేతాలిస్తాడు. అలానే ల్యాప్‌టాప్ ఓపెన్ చేయగానే మన మంత్రులకు వైఎస్‌ఆర్ కనిపించారనుకోండి. అప్పుడు వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది. వణికిపోతున్నట్టు, క్షమించమని వేడుకుంటున్నట్టు అనిపిస్తుందా? లేక నీవు పోయావు మమ్ములను చంపేస్తున్నావు.. వా! అని ఏడుస్తున్నట్టుగా కనిపిస్తుందా? ఏమో కానీ ఈ సందేహం స్వయంగా వైఎస్‌ఆర్ సతీమణి విజయమ్మకు వచ్చింది.


ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతున్న మంత్రులు ఒకవేళ వైఎస్‌ఆర్ బతికి మళ్లీ వస్తే ఆయన కళ్లలో చూస్తూ ఈ మాటలు మాట్లాడగలరా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు. యాధృచ్చికమే కావచ్చు కానీ కళ్లు సినిమా విడుదలై పాతికేళ్లయిన సందర్భంగా ఉత్సవాన్ని నిర్వహించిన రోజునే విజయమ్మ కళ్ల గురించి చెప్పుకొచ్చారు. కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమీ? అని హీరోయిన్ అడిగితే హీరో అక్కినేని నాగేశ్వరావు కలలే అని చాలా సింపుల్‌గా సమాధానం చెప్పేస్తారు. ఆ కాలంలో ఆయనకంటే అది సాధ్యమైంది కానీ ఇప్పుడు మంత్రులకు మాత్రం అంత ఈజీకాదు. కనులు కనులతో కలబడితే ఏమవుతుంది అని అడిగితే మంత్రులు నీళ్లు నములుతున్నారు. కళ్లకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉన్నట్టుగా ఉంది. 

బాఫూజీ మొదలుకొని బాబు నుండి మొద్దు శీను వరకు రాజకీయ నాయకులు వీలున్నప్పుడల్లా కళ్ల డైలాగులు చెబుతుంటారు. కళ్లు చిదంబరం కన్నా మన నాయకులే రాజకీయాలకు కళ్లను ఎక్కువగా ఉపయోగించుకున్నారు. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి బతికి వస్తే ఆయన కళ్లల్లోకి చూస్తూ మంత్రులు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు మాట్లాడగలరా? అని వైఎస్‌ఆర్ శ్రీమతి విజయలక్ష్మి ప్రశ్నిస్తున్నారు. దీనిపై మంత్రులు కాని వాళ్లు స్పందిస్తున్నారు తప్ప మంత్రులు స్పందించడం లేదు. బావ కళ్లలో ఆనందం చూడడానికే పరిటాల రవిని హత్య చేశానని మొద్దుశీను చేసిన ప్రకటన రాజకీయాల్లో పంచ్ డైలాగుగా మిగిలిపోయింది. మొద్దుశీనుకు ఈ డైలాగు ఎవరైనా రాసిచ్చారో? సొంతంగా చెప్పాడో కానీ ఈ డైలాగును రాజకీయాల్లో, సినిమాల్లో తెగ వాడేసుకున్నారు. బావ కళ్లల్లో ఆనందాన్ని చూసేందుకు మొద్దు శీనును ఎవరో ఉపయోగించుకుంటే మొద్దు శీనును చంపడం ద్వారా అన్నో, బావమరిదో కళ్లల్లో ఆనందం చూసేందుకు ఎవరినో ఎవరో నియమించుకోకుండా ఉంటారా? దాంతో మొద్దు శీను కళ్లు మూశాడు. ఆ డైలాగు పాతపడిపోయింది. మత ప్రాతిపదికన దేశ విభజన డిమాండ్ వచ్చినప్పుడు మహాత్మాగాంధీ హిందువులు, ముస్లింలు తనకు రెండు కళ్లు అని చెప్పినప్పటి నుంచి రాజకీయాల్లో కళ్లు పాపులర్ డైలాగు అయింది. కొన్ని సార్లు ఈ డైలాగులే ఇబ్బంది కరంగా మారుతాయి.

 ఆంధ్రా, తెలంగాణ నాకు రెండు కళ్లు అంటూ బాబు చెబితే, రెండు కళ్లు రెండు ఒకేవైపు చూస్తున్నాయి అది ఆంధ్రావైపే అని తెలంగాణ వాళ్లు విమర్శిస్తుంటే రెండు కళ్లు సరే మా మూడో కన్ను సంగతేమిటిని రాయలసీమ ప్రశ్నిస్తోంది. మేం కోరిన పాట అంటూ రాయలసీమ గీతాన్ని కర్నూలు నుంచి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, డాక్టర్ రమణారెడ్డి వారి కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. ఇప్పుడు బాబు నాకు మూడు కళ్లు అనాలి లేకపోతే రాయలసీమలో కష్టం తప్పదు.


చిన్నింటి సంగతి బయటపడగానే భర్తకు విడాకులివ్వలేక, చిన్నంటిని జీర్ణం చేసుకోలేక మధ్య వయసులోని మధ్య తరగతి భార్య కుమిలిపోతుంటే నన్ను నమ్ము ... మీరిద్దరూ నాకు రెండు కళ్ల లాంటి వాళ్లు అంటాడా! దొంగ మొగుడు. గుడ్డికన్ను కన్నా మెల్లకన్ను, మెల్లకన్ను కన్నా ఒంటికన్ను మేలు అనుకుని అసలు లేని మొగుడి కన్నా ఇద్దరిని రెండు కళ్లు అంటున్న మొగుడే కొంత బెటర్ అనుకుని సర్దుకుపోతారు. ధర్మేంద్ర నుంచి బోనీకపూర్ వరకు, సూపర్ స్టార్ నుంచి, క్యారెక్టర్ స్టార్ వరకు ఈ డైలాగులు వినిపించిన వాళ్లే. హేమామాలిని నుంచి, శ్రీదేవి వరకు ఈ డైలాగును జీర్ణం చేసుకున్న వారే. కళ్లు రెండు అయినా చూపు ఒకవైపే ఉంటుంది. ఒక సమయంలో రెండు కళ్లు రెండు వైపుల చూడలేవు ఒకేవైపు చూస్తాయి. నాకు రెండు కళ్లు అని తారలు, నేతలు పైకి చెప్పినా వారి చూపు ఒకవైపే ఉంటుంది. ఈ విషయం తెలిసే బాలకృష్ణ ఒకవేపే చూడు అని ఓ సినిమాలో సీరియస్‌గానే చెప్పారు.


సర్వేంద్రియా ల్లో నయనం ప్రధానం అన్నారు. ప్రధానం సంగతేమిటో కానీ నిజానికి శరీరంలో అత్యంత శక్తివంతమైనవి కళ్లే. నోటితో అబద్ధం చెప్పవచ్చు కానీ కళ్లు అబద్ధం చెప్పవు. కళ్లు మన మనసు మాట వింటాయి తప్ప మన మాట వినవు. అందుకే మనసులో ఏముందో కళ్లు బయటపెట్టేస్తాయి. కళ్లు ఇంత శక్తివంతమైనవని తెలిసే ఇంద్రుడి పాపానికి శాపంగా శరీరమంతా కళ్లు ఉండేట్టు శపించారు. రెండు కళ్ళ డైలాగును నమ్మించ లేకనే నేతలు హైరానా పడిపోతుంటే శరీరమంతా కళ్లున్న ఇంద్రుడు ఎన్ని బాధలు పడ్డాడో.

రాజకీయాల్లో కళ్లడైలాగులు చప్ప పడిన కాలంలో విజయమ్మ హఠాత్తుగా కళ్లను గుర్తు చేశారు. వైఎస్‌ఆర్ బతికి వస్తే ఆయన కళ్లల్లోకి చూస్తూ మంత్రులు ఇప్పుడు మాట్లాడుతున్నట్టు మాట్లాడగలరా? అనేది ఆమె ప్రశ్న. కచ్చితంగా మాట్లాడలేరు, ఎందుకంటే అవినీతిలో వారికే తగు వాటా ఉంది, వాటా పొందిన వాళ్లు కళ్లలోకి చూస్తూ అబద్ధం చెప్పలేరు. దేశాన్ని మోసం చేసే రాజకీయ నాయకులు సైతం తమ కళ్లను మోసం చేయలేరు. కళ్లకున్న శక్తి అదీ! అసలే కంటిచూపుతో చంపేసే రోజులొచ్చాయి మనకెందుకులెండి!

26, ఆగస్టు 2012, ఆదివారం

దేశం లో నైతిక విలువలు దిగుమతి చేసుకుందాం


నైతిక కరువు!


విద్యుత్ కొరత రాష్ట్రాన్ని ఊపిరాడకుండా చేస్తోందని మనం వాపోతుంటే , సర్లేండి ఈ కొరత తీర్చడం పెద్ద కష్టమేమీ కాదు కానీ దేశాన్ని పీడిస్తున్న అసలైన కొరత గురించి ఆలోచించండి అని మాజీ కేంద్ర మంత్రి దినేశ్ త్రివేది సెలవిచ్చారు. పక్క రాష్ట్రాల నుంచో పక్క ఖండం నుంచో కావాలసినవి తెచ్చుకోవచ్చు కానీ అసలు కొరత గురించి ఆలోచించండి అంటున్నారాయన. చైనా నుంచి దిగుమతికి సైతం అవకాశం లేదు. చైనా ఎగుమతి చేయలేంది ఉంటుందా? మేం నమ్మమంటే నమ్మం అని అనుకోవచ్చు. కానీ ఆయన చెప్పింది విన్నాక నిజమే అని ఒప్పుకోవలసిందే! 

ఇంతకూ ఆయన చెప్పిన కరువు ఏమిటంటే? దేశంలో నైతిక కరవు ఏర్పడిందట. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అని ఆయన వాపోయారు. డొక్కల కరువు ఈ మాట వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. 1832 ప్రాంతంలో ఐదులక్షల జనాభా ఉన్న గుంటూరు జిల్లాలో కరవు వల్ల రెండు లక్షల మంది చనిపోయారు. శరీరంలో కండ అనేదే లేకుండా డొక్కలు కనిపించేవట! అలాంటి డొక్కల కరువు నుంచి కూడా బయటపడ్డాం కానీ ఇప్పుడున్న నైతిక కరువు నుంచి అంత సులభంగా బయటపడే అవకాశం కనిపించడం లేదు.
ఇంతకూ నైతిక కరవు అంటే ఏమిటి? అంటే చెప్పడం కష్టమే. ఈ మధ్య చాలా మంది రాజకీయ నాయకులు రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోతున్నాయని, వాటిని నిలబెట్టడానికి కంకణం కట్టుకున్నామని చెబుతున్నారు. అంటే రాజకీయ నాయకుల గోదాముల్లో నైతిక విలువల నిల్వలు పుష్కలంగానే ఉన్నాయనిపిస్తోంది. పాత సినిమాల్లో రేషన్ సరుకులను విలన్లు గోదాముల్లో నిల్వ చేసి నో స్టాక్ అనే బోర్డు పెట్టే వాళ్లు. ఆ స్టాకుకు మాత్రం ఆర్జా జనార్దనో మరొకరో లుంగీ కట్టుకుని చేతిలో కర్ర పట్టుకుని కాపలా కాసేవాడు. ఒక వృద్ధురాలు వచ్చి బాబు రెండు రోజుల నుంచి తిండి లేదు, రేషన్ బియ్యం ఇవ్వు బాబు అని కన్నీళ్లు కారిస్తే, షాపు విలన్ పోవే ముసిలి దానా అని తోసేసేవాడు. పడిపోతున్న ఆ వృద్ధురాలిని ఎన్టీఆర్ పట్టుకుని నిలబెట్టి ఆర్జా జనార్దన్‌తో ఫైట్ చేసి గోదాముల్లోని బియ్యం అందరికీ పంచి పెట్టేవాడు. హీరోకు జై అంటూ అంతా ఆయన్ని తమ భుజాలపైకి ఎత్తుకునే వారు. బహుశా ఎన్టీఆర్ ఆ స్ఫూర్తితోనేనేమో రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ప్రకటించి అధికారం కొట్టేశారు. పాత సినిమాల్లో ఎన్టీఆర్ గోదాముపై దాడి చేస్తే బియ్యం దొరికాయి కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు గోదాములపై సిబిఐ దాడి చేస్తే ఫైళ్లు దొరుకుతున్నాయి కానీ ఆ నైతిక విలువలు మాత్రం దొరకడం లేదు.
షాపులపై దాడులు చేసి ఎరువులను, విత్తనాలను పట్టుకుంటున్నట్టు నాయకుల ఇళ్లపై దాడి చేసి నైతిక విలువలను పట్టుకోవచ్చు కదా? నైతిక విలువ కరవు ఉందని కేంద్ర మాజీ మంత్రి గంభీరంగానే ప్రకటించారు కానీ వాటిని ఎక్కడ బంధించారు, ఎలా బయటకు తీయాలో మాత్రం చెప్పడం లేదు. ప్రజల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు తీవ్రంగా కృషి చేస్తానని ప్రకటనలు చేస్తున్న నాయకుల జీవితాలను చూస్తుంటే బహుశా వాళ్లే నైతిక విలువలను ఎక్కడో బంధించారనిపిస్తోంది. లేకపోతే అంత ధైర్యంగా ఎలా చెబుతారు. ఆ మధ్య తారా చౌదరి అలియాస్ రాజేశ్వరి కూడా ఇదే మాట చెప్పింది. జీవితంలో విలువలు ముఖ్యం, దాని కోసం కట్టుబడి ఉన్నాను, కొంత మంది నాపై కక్ష కట్టారు. అయినా నేను భయపడను విలువల కోసం పోరాడతాను అని సెలవిచ్చారు. రాజకీయ నాయకులు, సినీ తారలు, తారలు కావాలనుకునే వారు, గనుల ఓనర్లు, పవర్ బ్రోకర్లు ఇలా ఎవరికి వారు నైతిక విలువలను బంధిస్తే, మార్కెట్‌లో కొరత ఏర్పడక ఏం చేస్తుంది. 

అదేదో రాష్ట్రంలో మద్యానికి రేషన్ విధించారట! అలానే నైతిక విలువలకు సైతం రేషన్ విధించి అందరికీ అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి.
ఆ మధ్య ఒక తెలుగు నాయకుడు ప్రజల్లో, మీడియాలో నైతిక విలువలు పడిపోతున్నాయి ఇలా అయితే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా అతనికి చిర్రెత్తుకొచ్చి నిజమే నండి గతంలో విలువలకు కట్టుబడిన నాయకులు ఉండేవారు దానికి తగ్గట్టు సమాజంలోనూ విలువలు ఉండేవి. ఇప్పుడు విలువల గురించి ఉపన్యాసాలు ఇచ్చే నాయకులే తప్ప పాటించే నాయకులు లేరు అందుకే సమాజంలో విలువలు పడిపోతున్నాయనగానే ఆ నేతకు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. దేశాన్ని ఏలుతున్న పార్టీ అధ్యక్షుడు లక్ష రూపాయలు తీసుకుని కెమెరాలకు చిక్కిపోతే ఆ పార్టీ నేత ఒకరు విలువలు మరీ పడిపోతున్నాయండి అంత పెద్ద నాయకుడు మరీ చీప్‌గా లక్ష రూపాయలు తీసుకోవడం ఏమిటి? పట్టుపడిపోవడం ఏమిటి? జాతీయ నాయకులే ఇంత అసమర్ధులైతే, మాకు వాళ్లేం మార్గం చూపిస్తారని ఆవేదన చెందాడు. అసలు విషయం అది కాదు లేండి మా వాళ్లే ఆయన్ని పట్టించారు ఎక్కడ పోటీకి వస్తారో అని మరొకాయన సెలవిచ్చాడు.
ఒకప్పుడు ప్రపంచానికి నైతిక విలువలు బోధించిన వేద భూమిపైనే నైతిక కొరత ఏర్పడింది. ప్రపంచంలో పది ప్రముఖ మతాల పేర్లు ప్రస్తావిస్తే, అందులో నాలుగు ప్రధాన మతాలు హిందూమతం, బౌద్ధం, జైనమతం, సిక్కుమతం పుట్టింది ఇక్కడే. మతాలు ప్రధానంగా బోధించేది నైతిక విలువల గురించే! మనం చైనా, జపాన్‌లకు ఎప్పుడో బౌద్ధాన్ని ఎగుమతి చేస్తే ఆ దేశాలు ఇప్పుడు ప్రపంచాన్ని తమ వస్తువుల ఎగుమతులతో సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రపంచానికి విలువలను ఎగుమతి చేసిన మన దేశం ఇప్పుడు విలువల కొరతతో ఉక్కిరిబిక్కిరవుతోంది.
ఉవ్వెతున్న ఎగిసిన గ్రీకు సంస్కృతి పతనమైంది విలువల పతనం తరువాతనే. ఇప్పుడు మనం కూడా ఆ దారిలోనే ఉన్నామనిపిస్తోంది. ఆర్థికంగా, సాంకేతికంగా ఆకాశానికంటిన మన ఆభివృద్ధి విలువల్లో మాత్రం పాతాళంలో తవ్వకాలు జరిపితే కానీ మనం ఎక్కడున్నామో తెలియదేమో! విలువలకు స్టాక్‌మార్కెట్ ఇండెక్స్ ఉండదు, అభివృద్ధి సూచికలు ఉండవు అందుకేనేమో అటువైపు ఆలోచించడం లేదు. సరే కనీసం దిగుమతి చేసుకోవడానికైనా ప్రయత్నించండి పాలకులారా....
!

22, ఆగస్టు 2012, బుధవారం

కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ గీతా జ్ఞాన బోధన

‘గోతులు తీసే వాడు గోతిలో పడడు. నీతులు చెప్పేవాడు నీతిగా ఉండడు. నా జీవితమే నా సందేశం. నా అధికారమే నాకు ముఖ్యం ఎలా ఉంది నా నినాదం ’’అంటూ సిఎం అడిగాడు. ‘‘మీరు ఆటలాడతారని తెలుసు కానీ కవిత్వం కూడా చెబుతారా? ’’అని శ్రీమతి మురిపెంగా అడిగింది. ‘‘కక్కొచ్చినా, కవిత్వం వచ్చినా బయటకు పంపేస్తే మనకు సంతోషం ఎదుటి వాడికి సమస్య. కలిసొచ్చే కాలానికి సిఎం పదవి నడిచొస్తుంది. ఎమ్మెల్యే కాలేనీ వాళ్లు సిఎం అయినప్పుడు మంత్రి కాలేని వాళ్లు ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదనుకున్నాను అయ్యాను’’ అంటూ సిఎం నవ్వాడు.   

‘‘ఏంటో ఈరోజు మీరు వింతగా మాట్లాడుతున్నారు’’అంటూ శ్రీమతి అనుమానంగా చూసింది.‘‘ నిజం చెప్పినా అబద్ధం చెప్పినా జనం నమ్మరు. కాబట్టి జనానికి కావలసిందే నువ్వు చెప్పు వాళ్లకు కావలసిందే వాళ్లు వింటారు? ’’ అని సిఎం నవ్వాడు.‘‘ అదేంటండి మీరేం మాట్లాడుతున్నారో మీకైనా తెలుస్తుందా?’’ అని శ్రీమతి అనుమానంగా అడిగింది.
 ‘‘మనం ఏం చేస్తున్నామో మనకూ అర్ధం కావద్దు అప్పుడే మనం ఏదో చేస్తున్నాం అని అంతా మనగురించి అనుకుంటారు. రాజకీయాల్లో రాణించాలంటే, హై కమాండ్‌ను ఒప్పించాలంటే ఇదే తారక మంత్రం’’

‘‘హాస్టల్‌లో తిండి,నిద్ర   వద్దండీ అంటే విన్నారు కాదు. ఇప్పుడు ఏమోమే మాట్లాడుతున్నారు’’ అని శ్రీమతి ఆందోళనగా ఆటూ ఇటూ చూసింది. ‘‘అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్ష మీడియా కోసం, అసలైన విశ్వాస పరీక్ష హై కమాండ్ వద్ద ఉంటుంది. 150 మంది విశ్వాసం ప్రకటించిన జగన్‌ను పార్టీ నుంచి బయటకు పంపించాం, నా ఓటు నాకు తప్ప మరో ఓటు లేని నేను విశ్వాస పరీక్షలో నెగ్గాను. పరీక్ష ఇక్కడ విశ్వాసం ఢిల్లీలో ఇదే రాజకీయం ’’ అని సిఎం రాజకీయ గీతను బోధిస్తున్నట్టుగా ఫోజు పెట్టారు. అప్పటి వరకు అటు చూడలేదు కానీ టీవిలో వస్తున్న బ్రేకింగ్ న్యూస్‌పై శ్రీమతి దృష్టి సారించింది.

ముఖ్యమంత్రిపై మంత్రుల తిరుగుబాటు. వట్టి నాయకత్వంలో ముప్పావు డజను మంది మంత్రుల సమావేశం. వాటిని చూడగానే శ్రీమతి ముఖ కవళికలు మారిపోయాయి. తలా తోకా లేకుండా మాట్లాడే ఆయన ఈరోజు ఎప్పుడూ లేని విధంగా తాత్వికంగా మాట్లాడడానికి కారణం ఇదా? అనుకున్నారు.


మారిన శ్రీమతి ముఖ కవళికలు చూస్తూ ముఖ్యమంత్రి పడి పడి నవ్వసాగాడు. రెండేళ్ల కాలంలో శ్రీవారు సిఎం పదవికి అలవాటు పడ్డారేమో.. పోతుందనే భయంతో ఏం చేయాలో అర్ధం కాక ఇలా మాట్లాడుతున్నారేమో అనుకుంది.‘‘ నువ్వునుకుంటున్నట్టు ఏమీ కాలేదు డియర్ నేను బాగానే ఉన్నాను.’’ 
‘‘ఈ వార్తలు నిజమైతే కలవరపెట్టాలి, కాకపోతే చిరాకు కలిగించాలి కానీ మీరేంటండి ఆ రెండూ కాకుండా, ఏవేవో మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారని’’  ఆయోమయంగా చూస్తూ అడిగింది.
‘‘గుర్తు తెచ్చుకో డియర్ ... ఏడాదిన్నర క్రితం అదే వట్టి ఇంట్లో జరిగిన సమావేశం టివిల్లో ఏమని వచ్చిందో గుర్తు తెచ్చుకో’’ అని మళ్లీ నవ్వాడు.

ఇద్దరి ముందు తెలుగు సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ చూపేప్పుడు కనిపించే రింగులు కనిపించాయి. ఆ రింగులు తెరమరుగై దృశ్యం కనిపించింది.‘‘  ఈయనేమైనా సినియర్ అనుకుంటున్నాడా? ఒక్కసారి కూడా మంత్రి పదవి నిర్వహించలేదు, నా కన్నా జూనియర్ నాకీ పదవి ఇస్తాడా? ఏమనుకుంటున్నాడో నా తఢాఖా చూపిస్తాను, ఆయన ముఖ్యమంత్రిగా ఎన్ని రోజులుంటాడో చూస్తాను అని వట్టి ఆవేశంగా పలికాడు.’’ బొత్స, ఆనం బృందం ఆయనకు మద్దతుగా నిలిచింది. తమ కన్నా సీనియర్ సిఎం అయితే ఆయన కింద ఈ పనికి రాని శాఖలు తీసుకుని పని చేసే ప్రసక్తే లేదు. అంటూ అంతా భీష్మించుకున్నారు. రౌండ్ రౌండ్‌కు అక్కడ ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.

 టీవిలు బ్రేకింగ్ న్యూస్‌లతో హడలెత్తించాయి. రాత్రంతా జనం నిద్ర పోకుండా టీవిలకు అతుక్కు పోయారు. 20:20 క్రికెట్ మ్యాచ్ తరువాత ఈ వార్తనే వారికి ఎక్కువగా ఉత్కంఠత కలిగించింది. నిమిష నిమిషానికి అసమ్మతి మంత్రుల సంఖ్య పెరుగుతూ పోయింది. తెల్లవారే సరికి సిఎం మంత్రి పదవి తేల్లారి పోతుందని అనుకున్నారు. ఒక్క రోజు కాదు ఐదు వందల రోజులు గడిచిపోయినా ఏమీ కాలేదు.
***
‘‘ఇప్పుడు మళ్లీ అదే వట్టి ఇంట్లో సమావేశమయ్యారు దేని కోసం. తోటి మంత్రిని రక్షించేందుకు మంత్రులంతా ఏకమయ్యారు. హమ్ ఏక్ హై అని నినాదం చేస్తున్నారు. చూశావా తొలుత సిఎం పదవి కోసం సమావేశాలు పెట్టుకున్నారు. తరువాత సిఎంను దించేయాలని సమావేశం పెట్టారు, ఇప్పుడు తోటి మంత్రిని రక్షించుకోవాలని సమావేశం పెట్టారు. నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే ముందు నీ ప్రత్యర్థికి నీ గురించి ఆలోచించేంత తీరిక లేకుండా సమస్యల్లోకి నెట్టేయ్! నువ్వే వెళ్లి సానుభూతి చూపించు. ఇదే రాజనీతి. ఫ్లాష్ బ్యాక్ చూశావు కదా ఇప్పుడు ఫ్యూచర్ చూపిస్తాను. ’’  అని తెలివిగా నవ్వాడు సియం  
***
‘‘ 2014 బ్రేకింగ్ న్యూస్
అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. తమకు టికెట్ వస్తుందా? రాదా అని పలువురు మంత్రులు వట్టి ఇంట్లో సమావేశం అయ్యారు.
’’ అంటూ అచ్చం న్యూస్ రీడర్ మాదిరిగానే వార్తను చదివి, తన స్టైల్ లో నవ్వుతూనే ఉన్నాడు సియం  .

‘‘అది సరే కానీ వచ్చే ఎన్నికల్లో మీరు గెలిచే నియోజక వర్గం ఏదైనా ఉందా?’’ అని శ్రీమతి అమాయకంగా అడిగారు.
‘‘తెలియని విషయాలను తెలివిగా చెప్పొచ్చు. తెలిసిన విషయాలను దాచి పెట్టొచ్చు. తెలిసీ తెలియని విషయాలను అర్ధం అయ్యి కాకుండా చెప్పొచ్చు. కానీ ..........’’ అంటూ ముగించాడు.

15, ఆగస్టు 2012, బుధవారం

మీకు ఆ వయసొచ్చిందా?... వృద్ధ నారీ పతివ్రత - వృద్ధ హీరో నేటి నేత

బ్యాక్‌గ్రౌండ్‌లో మంత్రోచ్ఛారణలు వినిపిస్తుండగా, డాన్‌గ్రీ తన కుమారుడితో పాటు మెట్లు దిగుతూ అందరికీ స్వాగతం పలికాడు. డాన్‌గ్రీ అంటే అతనెవరో చైనావాడో, జపాన్ వాడో అనుకునేరు. అతని వ్యాపారం అంతర్జాతీయం కానీ అతను మాత్రం పదహారణాల తెలుగు వాడు. అంతా డాన్ గిరి అనిపిలుస్తారు.

 ఒక వ్యక్తికి చదువు, డబ్బు పెరిగినప్పుడు పేరు పొట్టి దవుతుంది. నేర సామ్రాజ్యం విస్తరించుకున్న తర్వాత డాన్ గిరి కాస్తా స్టయల్‌గా డాన్‌గ్రీ అయ్యాడు. కోస్తాంధ్ర, సీమాంధ్ర, రాయలతెలంగాణ, సీమ తెలంగాణ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల నుంచి డాన్‌గ్రీ అనుచర గణం అక్కడికొచ్చింది. దొడ్డు శ్రీశైలం, బక్క శ్రీశైలం, పాత దాసు, సరికొత్త దాసు అంతా వరుసలో నిల్చున్నారు. తన షష్టిపూర్తి సందర్భంగా డాన్‌గ్రీ ఒక సంచలన ప్రకటన చేస్తాడనే సమాచారం ఉండడంతో అంతా వచ్చారు. డాన్ గ్రీ తన కొడుకు భుజంపై చేయి వేసి, ప్రపంచం కుగ్రామంగా మారిపోతోంది. ప్రపంచీకరణ తరువాత అన్ని రంగాల్లో మాదిరిగానే మన రంగంలోనూ మార్పు అనివార్యం అని నేను ముందే గ్రహించాను ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను అవగాహన చేసుకోవడానికి మా అబ్బాయిని ప్రపంచ పర్యటనకు పంపాను. హాంకాంగ్ మాఫియా, ఆఫ్రికా నల్లమందు మాఫియా వరకు అంతర్జాతీయ వ్యవహారాలన్నింటిలో మా వాడు తగిన శిక్షణ పొందాడు.

 ఎక్కడి నుంచి వచ్చానో కానీ హైదరాబాద్ అభివృద్ధిలో నావంతు పాత్ర ఉంది. నాకు ప్రాంతీయ విభేదాలు లేవు. నేరం ఎక్కడుంటే అది నా ప్రాంతం అనుకుంటాను అంతే తప్ప సంకుచితంగా ఇది నా ప్రాంతం అది నీ ప్రాంతం అనే ప్రాంతీయ విభేదాలు, కులమతాల పట్టింపులు నాకు లేవు. ఇప్పుడు నా వయసు 60 ఏళ్లు. వీధి రౌడీగా ఉన్నప్పుడు తగిలిన కత్తిపోట్లతో శరీరం బాగా అలిసిపోయింది. నా సామ్రాజ్యాన్ని యువరాజుకు అప్పగించి, ఇంత కాలం నన్ను ఆదరించిన ప్రజలకు ఏదో చేయాలనే నిర్ణయించుకున్నాను. నా షష్టిపూర్తి రోజే ఆ నిర్ణయం తీసుకోవాలని మీ అందరినీ పిలిపించాను అని చెప్పసాగాడు. రాష్ట్ర వ్యాప్తంగా డాన్‌గ్రీ ఉప న్యాసాన్ని లైవ్‌గా చూపిస్తున్నారు. అతనికి ప్రాంతాలకు అతీతంగా అభిమానులు ఉన్నారు, జనంలో, మీడియాలో మంచి క్రేజి ఉంది.


అంతర్జాతీయంగా నేర ప్రపంచంపై మంచి అవగాహన ఉన్న మా అబ్బాయి జూనియర్ డాంగ్రీనే మీ నాయకుడు. అని డాన్‌గ్రీ ప్రకటించగానే అంతా యువనేత జూనియర్ డాంగ్రీ నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. సార్ మీ జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు, ఇప్పుడు మీ అబ్బాయి జీవితాన్ని కూడా ప్రజలకే అంకితం చేసిన మీ త్యాగ జీవితం జాతి జనులకు ఆదర్శనీయం అని సన్నశ్రీశైలం చెమ్మగిల్లిన కనులను తుడుచుకున్నాడు. గుంటూరు బోసు, నెల్లూరు దాసు డాంగ్రీ కాళ్ల మీద పడిపోయారు. డాన్‌గ్రీ గద్గద స్వరంతో మళ్లీ మాట్లాడడం మొదలు పెట్టాడు. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. ఇంత కాలం నన్ను ఆదరించిన ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నేను ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచే రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటిస్తున్నాను. 60 ఏళ్లు దాటిన హీరోలు తమ వృత్తిని వదిలి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఏదో చేయాలని నిర్ణయించుకున్నట్టుగానే, 60 ఏళ్లు దాటిన రాజకీయ నాయకులంతా రాజకీయాలను వదిలి, మరో రంగానికి వెళ్లి రాజకీయాల్లో మా లాంటి కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి. 60 ఏళ్లు దాటిన ఖైదీలందరినీ విడుదల చేసి, ఇంత కాలం తమను ఆదరించిన ప్రజలకు ఏదో రకంగా సేవ చేసుకునే అవకాశం వారికి కల్పించాలి. ఏ రంగంలో ఉన్నవారైనా 60 ఏళ్లు దాటిన వారు తమ తమ వృత్తులను వదిలిపెట్టి ప్రజలకు ఏదో మేలు చేయాలని నేను సమాజానికి పిలుపును ఇస్తున్నాను. అని డాన్‌గ్రీ ఆవేశంగా ముగించాడు.


***
లైవ్‌లో డాన్‌గ్రీ ఉపన్యాసం విన్నవాళ్లలో ఊహించని విధంగా స్పందన వచ్చింది ‘‘ లచ్చీ మనకు 60 ఏళ్లు దాటాయంటావా?’’తన బొచ్చేవైపు ఆప్యాయంగా చూస్తూ కోటిగాడు అడిగాడు. ‘‘ఏమో నండి ఈ లక్ష్మీనారాయణ ఆలయం ముందు 40 ఏళ్ల నుండి అడుక్కుంటున్నాం 60 దాటే ఉంటాయి’’ అని లచ్చి తెలిపింది. ‘‘ఈ ఆలయాన్ని చిన్నోడికి, శివాలయాన్ని పెద్దోడికి అప్పగించి మనం కూడా ఇంత కాలం మనను ఆదరించిన ప్రజల కోసం ఏమైనా చేద్దాం’’ అని కోటిగాడు ప్రకటించాడు. రూపాయికి కిలో బెండకాయలు ఇస్తేనే ప్రజలు అధికారం అప్పగించారు. ఒక పూటకు సరిపోయే బెండకాయలిచ్చినందుకు గెలిపించిన వారు జీవిత కాలానికి ఉపయోగపడే పుణ్యాన్ని ఒక్క రూపాయికే ఇచ్చిన మనను కాకుంటే ఇంకెవరిని ఆదరిస్తారు?’’ అని కోటిగాడు ధీమాగా పలికాడు.
***
పెద్దాపురం బేబీ కళ్లు తుడుచుకుంటూ సమాజ ఉద్దరణలో నా వంతు పాత్ర పోషిస్తాను. జూనియర్ బేబీకి బాధ్యతలు అప్పగించి ఇంత కాలం నన్ను ఆదరించిన ప్రజలకు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను అని కస్టమర్ల సాక్షిగా ప్రమాణం చేసింది.
***
వా... వా.... అని కామన్‌మెన్ కన్నీళ్లను ఆపుకోలేక గుక్కపట్టి ఏడవ సాగాడు. ఎందుకేడుస్తున్నావు ఏమైంది అంటూ దారిన పోయే దానయ్యలంతా ఆగి అతన్ని ఓదార్చారు. ఈ కామన్ మ్యాన్‌కు ఏదైనా చేయాలని హీరోలు, బేబీలు, డాన్‌గ్రీలు తమ తమ రంగం వదిలిపెట్టి వస్తుంటే ఇవి ఆనందంతో రాల్చిన ఆనంద బాష్పాలు బాబూ ఆనంద భాష్పాలు... అని కామన్‌మెన్ కళ్లు తుడుచుకున్నాడు. ఆ మాటలు దారినపోయే దానయ్యలకు సైతం కళ్లు చెమ్మగిల్లేట్టు చేశాయి.
ముక్తాయింపు. వృద్ధ నారీ పతివ్రత నాటి సామెత - వృద్ధ హీరో రాజకీయ నేత నేటి సామెత.

8, ఆగస్టు 2012, బుధవారం

ఇచ్చట మనోభావాలు దెబ్బతీయ బడును

స్కూల్ బస్సు దిగి ఇంట్లో అడుగు పెట్టగానే బుజ్జిగాడు ఏదో సీరియస్‌గా ఉన్నట్టు అనిపించింది. ఎవరినీ పలకరించకుండా బ్యాగ్‌ను పక్కన పడేసి అమ్మ చేతిలో నుంచి రిమోట్ లాక్కోని కార్టూన్ ఛానల్ పెట్టుకున్నాడు. కోపంగా ఉన్న వాడి ముఖాన్ని చూసి ఎవరూ పలకరించడానికి సాహసం చేయలేదు. చివరకు తల్లే ఆ సాహసానికి ఒడిగట్టక తప్పలేదు. ఏరా బుజ్జి పరీక్ష ఎలా రాశావు? అని మెల్లగా పలకరించింది. ‘‘రాయలేదు... బహిష్కరించాను’’ అని వాడు ముక్తసరిగా సమాధానం చెప్పాడు. ఏం అని తల్లి అడగ్గానే ‘‘మా మనోభావాలు దెబ్బతిన్నాయి... స్కూల్ టీచర్ పిల్లల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా బడుద్దాయి వెదవల్లారా సరిగ్గా రాసి చావండి.. అంటూ అమానుషంగా మాట్లాడి మా పిల్లల మనోభావాలను దెబ్బతీసింది. 

మేమంతా మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాలనుకున్నాం, మా నిరసన తెలియజేయడానికి పరీక్షలను బాయ్‌కాట్ చేశాం ... పిల్లలమైతే మేం మనుషులం కాదా? మాకు మానవ హక్కులు ఉండవా? మా మనోభావాలు దెబ్బతినవా’’ అని మూడో తరగతి బుజ్జిగాడు ఆవేశంగా మాట్లాడుతుంటే తల్లి బిత్తరపోయింది. ఇంకేమన్నా అంటే తనపై కూడా మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాడేమో అని భయపడి వౌనంగా ఉండిపోయింది. 

నిజమే సర్వసంగ పరిత్యాగులైన సన్యాసుల మనోభావాలే దెబ్బతిన్నాయని కోర్టులకెక్కినప్పుడు ఇంకా బుజ్జగింపులతోనే జీవితాన్ని గడిపితే బుజ్జిగాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడడంలో తప్పేముందని అనుకుంది.
***


సార్థక నాయధేయులు నిత్యానంద స్వామి తన మనోభావాలు, తన భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, తీవ్రమైన మనోవేదన చెందుతున్నారు. ఆయన వాదనలో సత్యం ఉంది. ఆయన చర్యల్లో శివం ఉంది, ఆయన భక్తురాళ్లు సుందరంగా ఉన్నారు. సత్యం శివం సుందరం అంటూ ఆయన పనిలో ఆయనుంటే ఆయన మనోభావాలను దెబ్బతీసే అధికారం ఎవరికుంది? ఒక పోలీసాయన లాఠీచార్జ్ చేస్తుంటే అడ్డుకొని చూడండి.. ఏమవుతుంది? ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణను అడ్డుకున్నందుకు బొక్కలో పడేస్తారు. కామిగాని వాడు మోక్షగామి కాడంటారు. మోక్షం కోసం నిత్యానంద సినీతారతో ఏకాంతంగా ఉన్నప్పుడు రహస్యంగా కెమెరాల్లో బంధించడం ఆయన విధి నిర్వహణను అడ్డుకోవడమే కదా? 

సరే సన్యాసి కాబట్టి వెంటనే కోపం రాలేదు. పోనీలే అని క్షమించేసి ఎవరికీ కనిపించకుండా తపస్సు చేసుకోవడానికి హిమాలయాల్లోకి పారిపోయాడు. ఆయన ఊరుకున్నాడు కదా? అని ఆయన ‘విధి నిర్వహణ’ను సినిమాగా తీసి జనాలకు చూపిస్తే ఆయన మనోభావాలు ఏం కావాలి, ఆయన భక్తుల మనోభావాలు ఏం కావాలి. ఏ విషయాన్నైనా క్షమిస్తారు కానీ మనోభావాలు దెబ్బతినే విషయాన్ని మాత్రం ఎవరూ క్షమించరు. ఆయన మనోభావాలకు విలువ ఇస్తూ తెలుగులో ఆయనపై వచ్చిన సినిమా పేరు మార్చి కథ మార్చి, నటీనటులను మార్చి చివరకు ఆ సినిమా తీసిన దర్శకునికి సైతం సినిమా అర్ధం కానంత పిచ్చిగా తయారు చేసి తరువాత పెట్టుబడి పెట్టిన వారికి పిచ్చేక్కించేట్టు చేయడం ద్వారా నిత్యానంద తన మనోభావాలు దెబ్బతినకుండా రక్షించుకున్నారు.
 ఈ విషయం తెలిసో తెలియకనో  ఒకాయన కన్నడం లోకి డబ్ చేస్తున్నాడు  సినిమా సగం పూర్తయ్యాక నిత్యానంద హైకోర్టుకు వెళ్లారు ఈ సినిమా ద్వారా తన మనోభావాలు దెబ్బతిన్నాయని. మహిళా భక్తుల మనసు దోచడమే కాదు, కీలెరిగి వాత పెట్టడం కూడా నిత్యానందకు బాగా తెలుసు అందుకే సినిమా ప్రకటన వెలువడిన రోజు కాకుండా సగం పూర్తయ్యాక రంగంలోకి దిగారు.
***
మనోభావాలు దెబ్బతింటే మాత్రం ప్రతీకారం తీవ్రంగా ఉంటుంది. మయసభలో దుర్యోధనుడి మనోభావాలు దెబ్బతినడం వల్లనే కదా మహాభారత యుద్ధం జరిగింది!
సినిమా అభిమానుల మనోభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తమ అభిమాన హీరో పోస్టర్‌పై పేడ నీళ్లు పడ్డా ప్రతీకారం తీర్చుకునేంత వరకు నిద్ర పోరు. ప్రత్యర్థి హీరో పోస్టర్‌ను చించి ముక్కలు చేసేంత వరకు నిద్ర పోరు. ఆ మధ్య ఒక హీరో పోస్టర్ తమ హీరో పోస్టర్ కన్నా పెద్దగా ఉండడం వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కొందరు అభిమానులు, పలానా హీరో పోస్టర్‌లోని డైలాగులు తమ హీరో అభిమానుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని మరో అభిమానుల బృందం నిరసన ప్రదర్శనలు చేసింది. చివరకు పోలీసులు ఇరు హీరోల అభిమానులను సమానంగా లాఠీలతో సత్కరించి వారి మనోభావాలను గౌరవించారు. సినిమా అభిమానుల మనోభావాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పడమే ఉద్దేశం తప్ప వారి మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశం కాదని అభిమానులు గ్రహించాలి.


రాజకీయాల్లో మనోభావాలు మరింత చిత్రంగా ఉంటాయి. పలానా కులం వారి మనోభావాలను మీరు దెబ్బతీశారు అంటూ ఒక పార్టీపై మరో పార్టీ దాడికి దిగుతుంది. బాబోయ్ అసలా కులం వాళ్లు ఉన్నారనే నాకు తెలియదు ఇక వారి మనోభావాలు దెబ్బతీయడం ఏమిటని ఆ నాయకుడు లబోదిబో మంటే ... దేశానికి స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్ళయంది. అయినా ఫలానా కులం ఉందని ఈ ఆ పార్టీ నాయకుడికి తెలియదు. అంటే ఆ కులం వాళ్ల మనోభావాలు దెబ్బతీయడం కాకుంటే మరేమిటధ్యక్షా అంటూ మరింత ఉధృతంగా ప్రచారం సాగిస్తారు. ఆ కులం వాళ్ల ఓటర్ల సంఖ్యను బట్టి వారి మనోభావాలకు గౌరవం ఉంటుంది. వేళ్లమీద లెక్కించదగిన ఓట్లున్న కులాల మనోభావాలకు రాజకీయాల్లో పెద్దగా విలువ ఉండదు.

2, ఆగస్టు 2012, గురువారం

ఇంటర్వ్యూ కు వెలుతున్నారా ? అక్కడ ఆ ఒక్కటి మాత్రం అడగొద్దు

‘ప్రతాప్.. చాన్స్ కొట్టావయ్యా. మొత్తంమీద బోర్డుని మెప్పించావ్. ఉద్యోగానికి నువ్వు ఎంపికైనట్టే..’ ఇంటర్వ్యూ బోర్డు చీఫ్ డైలాగులు ప్రతాప్‌ని ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. ఫైనల్ ఇంటర్వ్యూలో ఎంపికయ్యాడు కనుక, ఇక ఉద్యోగం వచ్చేసినట్టే. కళ్లు మెరుస్తుంటే ఆనందంతో వొళ్లంతా తుళ్లిపడింది. దిగ్గున కుర్చీలోంచి లేచాడు. ‘్థ్యంక్యూ సర్ థ్యాంక్యూ. నా జీవితాశయం నెరవేరింది. ఇలాంటి పెద్ద కంపెనీలో ఉద్యోగం చేయాలని ఎన్నాళ్లనుంచో కంటున్న కల నేటికి నెరవేరింది’ -ఆనందంలో అప్రయత్నంగా పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్పేశాడు. పని చేస్తే ఈ కంపెనీలోనే పని చేయాలని కంకణం కట్టుకున్నానని కూడా అనేశాడు. అన్నీ బాగానే ఉన్నాయి.. ఆ తరువాతే, టంగ్ స్లిప్పయ్యాడు. కొంప కొల్లేరు చేసుకున్నారు. 


అదెలాఅంటే..? ‘సార్.. కంపెనీలో ఉద్యోగం దొరికేసింది. సో.. మిగిలిన విషయాల వివరాలు కూడా చెప్తే..’ ‘మిగిలిన వివరాలా? ఏంటయ్యా అవి’ కూల్‌గా అడిగాడు ఇంటర్వ్యూ చేసిన పెద్దాయన. ‘అదేసార్.. పెర్క్స్, లీవులు గట్రా. మొదటి నెలలోనే లీవులిస్తారా? లీవుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరమేమీ ఉండదుగా మన దగ్గర? నాకు బంధువులు స్నేహితుల సంఖ్య ఎక్కువ. ఎలాంటి కార్యక్రమానికైనా నేనే అటెండవ్వాలి. అందుకని..’ ప్రతాప్ ప్రశ్నల పరంపర ఇంకా పూర్తికాలేదు. ఈసారి ఇంటర్వ్యూ చేసిన పెద్దాయన దిగ్గున లేచ్చాడు. ఆయన కోపం నషాళానికి అంటిందన్న విషయం ఆయన ముఖంమీదే కనిపిస్తుంది. ‘అసలు నీకు బుద్దివుందా? ఇంకా పూర్తిగా ఉద్యోగంలో చేరనేలేదు. అప్పుడే లీవుల గురించి వివరాలు అడుగుతున్నావ్. నీలాంటోడిని ఉద్యోగంలో పెట్టుకుంటే అంతేసంగతులు. సెలవులు పెట్టడమన్నది అంటువ్యాధి లాంటిది. నీనుంచి పక్కవాళ్లకు అంటుకుంటే, అప్పుడు మేం పెట్టాలి కంపెనీకి సెలవులు. ఉద్యోగం లేదు.. గాడిద గుడ్డూలేదు. ఫో’ కసురుకున్నాడు ఇంటర్వ్యూ చేసిన పెద్దాయన. ‘సార్.. సార్’ అంటూ వేడుకుంటున్నాడు ప్రతాప్.


 *** 
తీవ్రమైన కరెంట్ కట్‌తో ఫ్యాన్ ఆగిపోయి మెళకువ వచ్చింది ప్రతాప్‌కు. చమటలు పట్టేసిన ముఖం ఆందోళనగా ఉంది. అప్పుడు అర్థమైంది, తాను ఎమ్మెన్సీ కంపెనీలో లేనని, ఇంట్లో బెడ్‌రూంలోనే ఉన్నానని. ‘ఇది కలా?’ అనుకున్నాడు మనసులో. గడియారం వంక చూశాడు. ఫైనల్ ఇంటర్వ్యూకు వెళ్లే టైమైందన్న విషయాన్ని గడియారం వికృతంగా చూపెట్టింది. రాత్రంతా ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్లాలన్న ఆలోచనలే ముసరటంతో, తెల్లవారుజామున పిచ్చి కల వచ్చింది. ‘కల కలవరపెడితే పెట్టిందిగానీ, ఇంటర్వ్యూలో పిచ్చి వేషాలేసి, తలతిక్క విషయాలేవీ మాట్లాడకూడదని చెప్పి పుణ్యం కట్టుకుంది’ అనుకున్నాడు ప్రతాప్. మంచం దిగి నీట్‌గా తయారై ఇంటర్వ్యూని ఫేస్ చేయడానికి కొత్త ఉత్సాహంతో బయలుదేరాడు. *** ఇది పోటీ యుగం. కనుక చదువుల్లో -నేటి యువత బాగానే రాణిస్తోంది. ప్రతిభ నీ ఒక్కడి సొత్తేకాదన్న విషయాన్ని పదేపదే చెబుతున్నట్టు -ఎక్కడికెళ్లినా పోటీ పోటీ. ఒకరిని మించి ఒకరు పోటీలో తలపడుతున్నారు. కానె్వంట్ స్కూల్లో చదివేటప్పుడు, క్లాసే ప్రపంచమైనప్పుడు, క్లాస్‌లో నెంబర్‌వన్‌గా నిలిచినప్పుడు మనల్ని మించినవాడు లేడన్న భావన కలుగుతుంది. తరువాత -టెన్త్ పరీక్షలు రాసే సమయానికి మనకంటే పుడింగులు చాలామందే ఉన్నారని లోకజ్ఞానం కొద్దికొద్దిగా అబ్బుతుంది. టెన్త్ గండాన్ని గట్టెక్కి ఇంటర్ చదువులో చేరగానే, కార్పొరేట్ కాలేజ్‌లో వారం వారం నిర్వహించే ఇంటర్నల్ పరీక్షల్లో మన మార్కుల్ని చూసుకున్నాక -మనకంటే పుడింగులు కొన్ని వేలమంది రాష్టవ్య్రాప్తంగా ఉన్నారన్న జీవిత సత్యం అవగాహనకు వస్తుంది. నానా తంటాలు పడి ఎలాగోలా ఇంటర్‌లో ర్యాంకు పట్టి సాంకేతిక విద్యకో, వృత్తివిద్యకో పరుగుతీశాక -అసలు తత్వం అప్పుడు బోధపడుతుంది. ఇంతకాలం మనం ఊహించిన దానికంటే ప్రపంచం చాలా విస్తృతమైందని, ప్రపంచంలో మనతో పోటీపడే పుడింగులు లెక్కపెట్టలేనంత మంది ఉన్నారన్న విషయం. అదిచూసి దిగులుపడి పరుగుకు బ్రేకులు వేసేవాళ్లు చాలామందే కనిపిస్తారు. దిగులును పక్కకునెట్టి, దాన్ని వంటబట్టించుకోకుండా ‘మన కోసం ఏదోకటి ఉండకపోదులే’ అని పరుగులు తీసేవాళ్లూ కనిపిస్తారు. ఎవరి శక్తి సామర్థ్యాల మేరకు వారికి అవకాశాలు లభిస్తుంటాయి. అవకాశాల కోసం ఆశావాహ దృక్పధంతో ఎదురు చూడాలి తప్ప, పోటీ ప్రపంచంలో పోటీని చూసి పోటీ పడలేమేమోనన్న భయంతో నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు నైపుణ్యం పెంచుకుంటే పోటీలో కొందరికంటే ముందే ఉండొచ్చు. హిట్టు కొట్టిన మార్కులతో పైతరగతిలో సీటు సంపాదించగలమేమోగానీ, ఉద్యోగం సంపాదించటానికి మార్కులు ఒక్కటే ప్రాతిపదిక కాదన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఇది అర్థంగాకే అకడమిక్ కెరియర్‌లో అత్యున్నత మార్కులు సాధిస్తున్న చాలామంది, అవగాహనతో ఎదుర్కోవాల్సిన ఇంటర్వ్యూల్లో మాత్రం చతికిలపడుతున్నారు.


 ఇటీవల కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వెలుగుచూసిన వాస్తవాలివి. అలాంటి జాబితాల్లో పైన చెప్పుకున్న ప్రతాప్‌లాంటి కుర్రాళ్లు ఉండొచ్చు. ఉద్యోగం సంపాదించడానికి మార్కులొక్కటే సరిపోదు. వాటితోపాటు అనేక విషయాలు అక్కడ పరిశీలనకు వస్తాయి. కంపెనీ కల్పించిన ఉద్యోగావకాశాన్ని సమర్థంగా నిర్వర్తించగల సామర్థ్యం ఉందా? అన్న పరీక్ష నుంచి అవి ప్రారంభమవుతాయి. ఇంటర్వ్యూ అంటే -తెలుగు సినిమాల్లో చూపినట్టుగా ఉండదన్న విషయాన్ని మొట్టమొదట గుర్తెరగాలి. నైలు నది పొడవెంత? భూమి బరువెంత?లాంటి తలతిక్క ప్రశ్నలు సంధించేసి, తరువాత తాపీగా ఉద్యోగాన్ని ముందే రికమండేషన్‌తో ఎవరికో ఇచ్చేశారని తెలుసుకునే తెలుగు సినిమాల్లోని సన్నివేశాలూ అక్కడ ఉండవు. ప్రశ్నించటం, పరిప్రశ్నలు సంధించటం, సమాధానాలు చెప్పడంలో భాగంగా మనతో చర్చలో పాల్గొని అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని అంచనా వేయటంలాంటి విచిత్రమైన పరీక్షలు అక్కడ ఎదురవుతాయి. మన వ్యక్తిత్వాన్ని, పనితీరును అంచనా వేసుకునే లెక్కలుంటాయి. సాధారణంగా 25ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తికి ఉద్యోగం ఇస్తే -ఆ అభ్యర్థిని ఆ కంపెనీ 30 ఏళ్లపాటు భరించాల్సి ఉంటుంది. మరి 30ఏళ్లపాటు మీతో పని చేయించుకోవాల్సిన కంపెనీ -ఒక్క ఇంటర్వ్యూతోనే మిమ్ములను పూర్తిస్థాయిలో అంచనా వేయాలంటే ఎంత వర్కవుట్ చేయాలి. లేదూ కంపెనీకి (మారకుండా పని చేసే పరిస్థితిలో. కానీ, కొత్త జనరేషన్‌లో కెరీర్ ఉన్నతికోసం కప్పగంతులే ఎక్కువగా ఉంటున్నాయి) 30ఏళ్లపాటు మీరేం ఇవ్వగలరో వాళ్లు అంచనా వేసుకునే సమాచారం, నమ్మకం ఇవ్వగలగాలి. అకడమిక్ చదువుల్లో ఉన్నతి సాధించిన వాళ్లు చాలామంది సైతం ఈ ‘ఎడ్యుకేషన్’లోనే ఫెయిల్ అవుతున్నారని దీనిపై సర్వేలు నిర్వహించిన సంస్థలు చెప్తోన్న మాట. *** ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు వ్యవహరించాల్సిన తీరుపై కొన్ని సంస్థలు స్వల్పకాలిక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాయి. అలాంటి సంస్థల్లో శిక్షణ తీసుకోవడం మంచిది. కొన్ని కార్పొరేట్ కాలేజీలు అయితే, విద్యార్థుల చివరి ఏడాదిలో ఈ తరహా శిక్షణను కూడా నిర్వహిస్తున్నాయి. ఇంటర్వ్యూ ఫేస్ చేసేటపుడు కచ్చితంగా చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. ఇంటర్వ్యూ ఫేస్ చేసేటపుడు మన తలంపులోకి రాకూడదని ఒకేఒక్క విషయం -సెలవు’ అంటాడొక మానసిక నిపుణుడు. పన్నీ విషయంలా కనిపించినా ఇదే వాస్తవం. లీవుల గురించి ఆసక్తి చూపకండి. కొత్త సంస్థలోకి మారేటప్పుడు -ఆ సంస్థ వ్యక్తుల్ని మెప్పించేందుకు పాత సంస్థపై విమర్శలు చేయకండి. అదే కొంప ముంచుతుంది. మీ సంస్థలో పని చేయాలనే ఆసక్తితో వచ్చానన్న అంశాన్ని మాత్రమే ప్రస్తావించాలి.


 అలాగే, ఈ సంస్థలో పైకి ఎదగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని మాత్రమే పాజిటివ్ కోణంలో చెప్పాలి. జీతభత్యాల విషయం ఇంటర్వ్యూ నిర్వహించేవారు ప్రస్తావించే వరకూ మీరు మాట మొదలుపెట్టొద్దు. సాధ్యమైనంత వరకు జీతం ఎంతిస్తారు? మిగిలిన వారికి ఎంతిస్తున్నారు? లాంటి పిచ్చిప్రశ్నలు మనల్ని గేటుబయట నిలబడేలా చేస్తాయి. మీ దృక్పథం దుస్తుల్లో ప్రస్ఫుటమయ్యేలా డ్రెస్ వేసుకోవటం మంచిది. ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడే చిన్న చిర్నవ్వు మనలోకి చాలా లోపాల్ని కవర్ చేస్తుంది. అందుకే మందహాసులై ఉండండి. ............

1, ఆగస్టు 2012, బుధవారం

హనుమంత రావు మౌన దీక్ష -గబ్బర్ సింగ్ కెవ్వు..... కేక ..పాట

ఇసుకవేస్తే రాలనన్ని మైకులున్నాయక్కడ. సంచలనాత్మక ప్రకటన చేస్తారని తెలియడం వల్ల డజన్ల కొద్ది మీడియా లైవ్ వ్యాన్‌లు అక్కడికి చేరుకున్నాయి. నేను వౌన దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాను అని నాయకుడు ప్రకటించగానే అంతా ఒక్కసారిగా నిర్ఘాంత పోయారు. తాము విన్నది నిజమేనా? అని ఆ నాయకుడిని మళ్లీ అడిగారు. ఔను నిజమే నేను వౌన దీక్ష చేయాలనుకుంటున్నారు. పార్టీని బాగు చేసేందుకు మా వాళ్లేవరూ మెదడును ఉపయోగించడం లేదు. ఎవరికి వారు ఖర్చవుతుందని మెదడు ఉపయోగించక పోతే పార్టీ పరిస్థితి ఏం కావాలి. పార్టీని బతికించుకోవాలంటే మెదడును ఉపయోగించాలని, క్యాడర్‌ను అర్సుకోవాలి అనే డిమాండ్‌తో వౌనదీక్ష చేస్తాను అని ప్రకటించారు.
కాంగ్రెస్ నేత హనుమంతరావు వౌనదీక్ష ఆరంభిస్తున్నట్టుగా మూతికి వేలును అడ్డుం పెట్టుకున్నాడు.



 ఒకటి రెండు మూడు నిమిషాలు గడిచిపోయాయి. ఇంకెన్ని సెకండ్లు వౌనంగా ఉంటారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విషయం తెలిసిన హై కమాండ్ ఆగ్రహంతో పిసిసి అధ్యక్షుడికి ఫోన్ చేసింది. మీ రాష్ట్రంలోని ఈ ఉద్యమం కొంప దీసి దేశ మంతా వ్యాపించిందంటే ఇంకేమన్నా ఉందా? మొత్తం ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడిపోతుంది ఎలాగైనా చేసి వౌన దీక్షను విరమింపజేయండి అని హై కమాండ్ ఆదేశించింది. దీక్ష విరమించు అని బొత్స తన మనిషితో రాయబారం పంపించాడు. ఏంరా బాయ్ బొత్స నాకు రాయబారిని పంపేంత పెద్దొడయ్యాడా! 
చంద్రబాబు తాలుకా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ను, నేను పిసిసి ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు బొత్స యూత్ కాంగ్రెస్ నాయకుడు కాలం కలిసి రాక ఇలా ఉన్నా అని రాయబారికి హనుమంతరావు సమాధానం రాసిచ్చాడు. ఎవరైనా తపస్సు చేస్తే భగ్నం చేయడానికి ఇంద్రుడు రంభ ఊర్వశి, మేనకలను పంపినట్టు నాయకులు అనేక ప్రయత్నాలు చేశారు.


 దీక్షా శిబిరం వద్దకు ఒక వ్యాన్ వచ్చి ఆగింది. ప్యారడైజ్ బిర్యాని ఐదు రూపాయలకు ప్లేట్ అని మైకులో అరుస్తున్నారు. రాహుల్‌గాంధీ సైతం ఇష్టంగా తినే ప్యారడైజ్ బిర్యాని పేరు వినగానే అంతా అటు పరుగులు తీశారు. హనుమంతరావుకు నోరూరింది. అన్నా వౌన దీక్ష మాటకే కాని నోటికి కాదు కదా? తిందామన్నా అని పక్కనున్న అనుచరుడు ఊరించాడు. పుల్లారెడ్డి స్వీట్స్ కారు చౌకగా అంటూ వ్యానొచ్చి ఆగింది. 


దీక్షా శిబిరం ఎదురుగా ఎవరో ప్రొజెక్టర్‌ను ఏర్పాటు చేశారు. కొప్పున పూలెట్టుకుని.... కెవ్వు కేక అంటూ గబ్బర్‌సింగ్ సినిమాలో ఐటెం సాంగ్ ప్రదర్శించారు. అది చూడగానే విజిల్ వేయాలన్నంత ఉత్సాహం వచ్చింది హనుమంతుకు విజిల్ ఘాటైన మాటే అని ఊరుకున్నాడు. అన్నా ఇందులో బొత్సా కుట్ర ఉందనిపిస్తోంది అని అంబర్‌పేట శివశంకర్ హనుమంతరావు చెవిలో ఊదాడు. రంభ, ఊర్వశి, మేనకల్లానే బిర్యానీ, స్వీట్స్, గబ్బర్‌సింగ్ కేక ఏదీ పని చేయలేదు.


ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ వచ్చి హనుమంతరావు చెవిలో ఏదో చెప్పాడు. నా మాట నమ్ము నిజం అని దామోదర్ పక్కనున్న డాక్టర్‌ను ముందుకు తోశాడు. అతను చెప్పింది హనుమంతరావు నమ్మనట్టుగానే ముఖం పెట్టాడు. అతను తన ఐడెంటీ కార్డు తీసి చూపించాడు. ఆ తరువాత తన వద్ద ఉన్న వైద్య గ్రంధంలోని ఒక పేజీ చూపించాడు. ఆ పేజీ చూడగానే హనుమంత రావుకు చమటలు పట్టాయిదీక్ష విరమించాడు. తన 60 నిమిషాల వౌన దీక్ష గురించి హనుమంతరావు మూడు గంటల పాటు మీడియాకు ఏకధాటిగా వివరించారు. దీక్ష విరమించగానే ఆయన పలికిన తొలి పలుకు ‘‘మాట్లాడకుండా ఉండడం చాలా కష్టం.’’


హై కమాండ్ దూతలు చెప్పినా వినని హనుమంతరావును దామోదర్ ఎలా దీక్ష విరమింపజేశారు. తెర వెనుక మతలబు ఏమిటి? అంటూ చానల్స్ గంట దీక్షపై ఇరవై మూడున్నర గంటల పాటు ప్రత్యేక వార్తా కథనాలు ప్రసారం చేశాయి.


మన శరీరంలోని ఏవైనా అవయవాలను ఎక్కువ రోజుల పాటు ఉపయోగించక పోతే ఆ అవయవం మొద్దు బారిపోతుంది. నాయకులు  అధినేత చెప్పు చేతుల్లో ఉంటూ సొంతంగా  మెదడును ఉపయోగించరు దాంతో మెదడు పని చేయకుండా పోతుంది. రాజకీయ నాయకుల శరీరం లో అతి తక్కువగా పని చేసేది మెదడు, అతి ఎక్కువగా పని చేసేది నోరు . అందుకే మెదడు మొద్దు బారినా నోరు చురుగ్గా ఉంటుంది . ఇప్పుడు మీరు నోటికి కూడా పని చెప్పక పొతే అదికూడా శాశ్వతంగా పని చేయకుడా పోయే ప్రమాదం ఉంది.ఇక మీరు శాశ్వతంగా వౌనంగా ఉండాల్సి వస్తుంది అని హనుమంతరావుకు చెప్పగానే ఆయన వణికి పోయి దీక్ష విరమించాడు. ఈ విషయాన్ని దామోదర్ వౌనంగా తనలోనే దాచుకున్నాడు. రాజకీయ నాయకుడు పదవి లేకపోయినా, తరువాత వస్తుందిలే అనే ఆశతో ఉండగలడు కానీ మాట్లాడుకండా ఉండలేడు.


 నది లేని చోట ప్రాజెక్టులు నిర్మించడం, కనిపించని రోడ్డు వేయడంలో మన నేతలకు సామర్ధ్యం ఉన్నప్పటికీ మాట్లాడకుండా ఉండడం అసాధ్యం.


 బాబు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలకు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ శిక్షణ ఇప్పించారు. 15 నిమిషాలకు మించి ఉపన్యసించవద్దు, అలా చేస్తే వినేవాళ్లు అసహనంగా ఉంటారని చక్కగా చెప్పారు. ఈ శిక్షణ అద్భుతంగా ఉందని, చాలా చక్కగా బోధించారని చంద్రబాబు 90 నిమిషాల పాటు ఉపన్యసించారు. ఆ 90 నిమిషాల లక్ష్యాన్ని ఆయన చాలా కాలం కొనసాగించారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి విలేఖరుల సమావేశం అంటే ఐదు నిమిషాల్లో ముగించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పివి నరసింహారావువినడమే తప్ప ఎక్కువగా మాట్లాడే వాళ్లు కాదు. వౌన మునులు రాజకీయాల్లో రాణించలేరు.
 ఈ జబ్బు కొత్తగా పుట్టిందేమీ కాదు. తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఓసారి జర్నలిస్టులతో మీరూ, మేమూ ఒకటే నాయకులు తెలియకపోయినా ఏదో ఒకటి మాట్లాడేస్తుంటారు, తెలియకపోయినా మీరు రాసేస్తుంటారు అని చమత్కరించారు.