అత్యవసరంగా డబ్బు అవసరం వచ్చింది. బ్యాంకులో రుణం తీసుకోవాలంటే అంత ఈజీ కాదు. బోలెడు తతంగం. ప్రైవేటు అప్పు అంటే నెలకు మూడు శాతం భరించలేం. ఇలాంటి సందర్భంలో ఆదుకునేది చీటి. మధ్యతరగతి, పేదలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరినీ ఆదుకునే అక్షయపాత్ర చీటి.
నేటి ఐటి తరం వారికి చీటీల గురించి పెద్దగా తెలియక పోవచ్చు. జీవితంలో అనుకోని అవసరం ఏర్పడినప్పుడు, ఇంటి నిర్మాణం, పిల్లల పెళ్లి, చదువు వంటి అవసరాలకు ఆదుకునే చీటీలు మన జీవితంలో భాగం. ఆర్థిక రంగం నిపుణులు, పెద్దవారు చీటీల గురించి ప్రస్తావించక పోవచ్చు కానీ చీటీలతో మధ్యతరగతి జీవితాలకు విడదీయరాని అనుబంధం ఉంటుంది.
ఎంసెట్‌లో మంచి ర్యాంకు చక్కని ఇంజనీరింగ్ కాలేజీ, ఐఐటిల్లో సీటు, తరువాత చక్కని ప్యాకేజీతో ఐటి కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన చాలా మంది నేటి తరం యువతకు చీటీల గురించి అంతగా తెలియకపోవచ్చు.
పొదుపునకు, అత్యవసరాలకు చీటీని మించిన సౌకర్యం లేదు.
రోజు కూలీలు, లక్షల్లో జీతాలు పొందే ఉద్యోగులు, వ్యాపారులు అందరికీ అనువైన పొదుపు + పెట్టుబడి మార్గం చీటీలు.
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలంటే కంపెనీల గురించి అవగాహన ఉండాలి. మార్కెట్ కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలి. స్టాక్‌మార్కెట్‌కు సంబంధించి అవగాహన ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలన్నా ఎంతో కొంత స్టాక్‌మార్కెట్ గురించి అవగాహన ఉండాలి. స్టాక్‌మార్కెట్‌లో లాభాలకు ఎంత అవకాశం ఉందో నష్టాల భయం అంతే ఉంది.
నష్టాలేమీ లేకుండా బ్యాంకులో దాచుకుందాం అంటే ఆరు శాతానికి మించి వడ్డీ రాదు. ద్రవ్యోల్బణం కన్నా ఈ వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. స్టాక్‌మార్కెట్ నాలెడ్జ్ లేదు, ఆరు శాతం వడ్డీ సరిపోదు మరేం చేయాలి అంటే చీటీలు చక్కని మార్గం. చీటీలు ఏమిటో ఎలా పని చేస్తాయో సామాన్యులకు కూడా తెలుసు కానీ ఈ తరానికి పెద్దగా తెలియదు.
చీటీలు ఒక రకంగా బ్యాంకులు చేసే పని చేస్తాయి.
చీటీ ఏంటి? ఎలా పని చేస్తుంది? మనకేం లాభం అంటే...
ఉదాహరణకు లక్ష రూపాయల చీటీ అనుకుందాం. దీనిలో 20 మంది సభ్యులు ఉంటారు. ఈ చీటీని ఒకరు నిర్వహిస్తారు.
20 మంది సభ్యులు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున చెల్లించాలి. 20మంది ఐదువేలు చెల్లిస్తే లక్ష రూపాయలు అవుతాయి. మనం దాచుకున్న డబ్బును బ్యాంకులు వడ్డీకి ఇచ్చినట్టుగా ఈ చీటీ డబ్బును ప్రతి నెల కూడా 20 మందిలో ఒక సభ్యునికి ఇస్తారు.
అంటే లక్ష రూపాయల చీటీలో సభ్యునిగా ఉన్న వ్యక్తి మొదటి నెలనే చీటీని పాడుకుంటాడు. అంటే లక్ష వసూలు చేస్తారు కదా? 20 మంది సభ్యులు ఒక చోట చేరి పాట పాడతారు. ఎవరు ఎక్కువకు పాడితే వారికి ఆ 20మంది నుంచి వసూలు చేసిన డబ్బు ఇస్తారు. దాదాపుగా మొదటి నెల 70వేల రూపాయల వరకు పాడుకుంటారు. అంటే మొదటి నెల చీటీ ఎత్తిన వ్యక్తికి 70వేల రూపాయలు వస్తాయి. మిగిలిన 30 వేల సంగతి ఏమిటి? అంటే దానిని 20 మంది సభ్యులకు పంచుతారు. అంటే చీటీ ఎత్తిన వ్యక్తికి సైతం అందరితో సమానంగా కమిషన్ వస్తుంది. ఐదువేల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, దాదాపు 15వందల రూపాయల కమిషన్ పోగా మూడున్నర వేల రూపాయలు చెల్లించాలి. ఆ తరువాత నెల కమిషన్ కొంత తగ్గుతుంది. ఇలా క్రమంగా తగ్గుతూ పోతుంది. 20 మంది సభ్యుల్లో ప్రతి నెల ఒక సభ్యుడు పాట పాడి చీటీ తీసుకుంటాడు. సభ్యులు తమ తమ అవసరాల మేరకు తీసుకుంటారు. చివరి నెల వరకు చీటీ ఎత్తకుండా అలానే పొదుపు చేసే వారికి తమ పొదుపుపై నెల నెలా కనీసం 16శాతం వడ్డీ వస్తుంది. స్టాక్ మార్కెట్ ఎంత బ్రహ్మాండంగా ఉన్నా సుదీర్ఘ కాలం 16శాతం ఆదాయం వచ్చే సందర్భాలు తక్కువే.
ఒకవేళ అవసరం కోసం చీటీ ఎత్తుకున్నా కొంచం అటూ ఇటుగా అదే 16 శాతం వడ్డీ భారం పడుతుంది. బ్యాంకుల్లో పర్సనల్ లోన్ సైతం దాదాపు ఇదే శాతం వడ్డీ విధిస్తున్నాయి. అయితే అంత ఈజీగా ష్యూరిటీ లేకుండా బ్యాంకులు రుణాలు ఇవ్వవు. అలాంటప్పుడు చిట్టీలకు మించిన ఉపాయం లేదు. పొదుపు కోసమైనా, అత్యవసర ఖర్చు కోసమైనా చీటీని మించిన అవకాశం లేదు.
చీటీలు నిర్వహిస్తూ రెండు కోట్లతో పారిపోయిన వ్యక్తి, ఐదుకోట్లతో పారిపోయిన వ్యక్తి అంటూ పత్రికల్లో తరుచుగా వార్తలు వస్తుంటాయి. నిజానికి చీటీల్లో అలా కోట్ల రూపాయల డబ్బుతో పారిపోవడానికి ఏ మాత్రం అవకాశం ఉండదు. ఒక్కో చీటీలో 20 మంది వరకు సభ్యులు ఉంటారు. 20 మంది చెల్లించిన డబ్బు ప్రతి నెల ఒకరికి ఇస్తారు. ఒకవేళ పారిపోవడం అంటూ జరిగితే ఒక నెల డబ్బుతో పారిపోవచ్చు అంతే తప్ప కోట్ల రూపాయలతో సాధ్యం కాదు.
మరి ఆ వార్తల సంగతి ఏంటి? అంటే చీటీలతో పాటు అనుబంధంగా ఫైనాన్స్ వ్యాపారం చేసేవారు చేసే పని అది. చీటీ ఎత్తిన తరువాత కూడా డబ్బులు ఇవ్వకుండా వడ్డీ ఇస్తాం అంటూ చీటీ డబ్బులు తమ వద్దనే ఉంచుకునే వారితో ఇలాంటి మోసాలకు అవకాశం ఉంటుంది కానీ కేవలం చీటీలు నిర్వహించే సందర్భంలో ఇలాంటి మోసానికి అవకాశం లేదు.
పెద్ద పెద్ద చిట్‌ఫండ్ కంపెనీలే కాకుండా ఆఫీసులో పని చేసే తోటి ఉద్యోగులు, కాలనీల్లో ఉండే షాపుల వాళ్లు. ఇంట్లో ఉండే మహిళలు చాలా మంది చీటీలు నిర్వహిస్తున్నారు. చీటీ పాడుకోగానే డబ్బులు చెల్లించే వారి వద్ద చీటీలు వేయడం మంచిది. పెద్ద పెద్ద చిట్‌ఫండ్ కంపెనీల్లో ష్యూరిటీ సమస్య, కమిషన్ తక్కువగా రావడం వంటి సమస్యలు ఉంటాయి. పరిచయస్తులు, బాధ్యతాయుతంగా చీటీలు నిర్వహించే వారి గురించి విచారించి చీటీలు వేయడం ద్వారా చీటీల నుంచి ప్రయోజనం పొందవచ్చు.
ఖర్చులు పోగా మిగిలింది పొదుపు చేయడం చాలా మంది అలవాటు. చీటీ అయితే ప్రతి నెలా తప్పని సరిగా చెల్లించాలి కాబట్టి ముందు పొదుపు తరువాత ఖర్చు అనే పద్దతి అలవాటు అవుతుంది. మంచివారేనా? అని ఒకటికి రెండుసార్లు విచారించి, ట్రాక్ రికార్డ్ పరిశీలించి చీటీల ద్వారా పొదుపు ప్రారంభిస్తే దీనికి మించిన పొదుపు పథకం లేదు.
-బి.మురళి