అమృతమథనం
3, అక్టోబర్ 2024, గురువారం
మహనీయుల జీవితాలను దుర్భరంగా మార్చిన నిర్లక్ష్యం : మనకు జీవిత పాఠాలు
లక్ష్మీ కటాక్షం
జీవితంలో డబ్బుకు ప్రాముఖ్యత ఉంది అని మీరు భావిస్తే చదవాల్సిన పుస్తకం .
తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పటి నుంచి భూగర్భంలో శాశ్వత నిద్రలోకి జారుకునేంత వరకు మనిషి జీవితంలో ప్రతి దశలో డబ్బుకు ప్రాముఖ్యత ఉంటుంది .. అది గ్రహించక పోతే మహా మహుల జీవితాలు కూడా అంతిమ దశలో దయనీయంగా గడిచాయి . సువిశాల భారత దేశాన్ని పాలించిన మొఘల్ వంశీయులు కలకత్తాలో చిన్న టీ కొట్టు పెట్టుకొని బతుకు తున్నారు . ఎన్టీఆర్ , ఏ ఎన్ ఆర్ లు నెల జీతంతో నటించిన రోజుల్లో సినిమాకు లక్ష రూపాయల పారితోషకం తీసుకున్న తొలి సూపర్ స్టార్ చిత్తూరు నాగయ్య చివరి దశలో కడుపు నింపుకోవడానికి చిన్న చిన్న పాత్రలు వేశారు ... హీరోలను మించి సంపాదించిన రాజనాల చివరి దశలో తిండికే ఇబ్బంది పడ్డారు . రజనీ కాంత్ ను సూపర్ స్టార్ ను చేసిన నిర్మాత వృద్ధాప్యంలో తనకో ఇల్లు దానం చేయండి అని వేడుకున్నాడు .. ఒక వెలుగు వెలుగుతున్న రోజుల్లో జీవితం శాశ్వతంగా అలానే ఉంటుంది అని భావించి చివరి దశలో దుర్భర జీవితం గడిపిన ఎందరో మహానుభావుల జీవితాలను కళ్లముందుంచిన లక్ష్మీ కటాక్షం - డబ్బుకు విలువ ఇస్తేనే నిలుస్తుంది -పుస్తకం జీవితం మారకుండా ఉండాలి అంటే ఏం చేయాలో చెబుతుంది . మన భవిష్యత్తు , పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే డబ్బును ఎలా గౌరవించాలో చెబుతుంది . తొలి తరం సినిమా నటుల దుర్భర జీవితం ఆ తరువాత తరం వారికి డబ్బు గురించి ఎన్నో పాఠాలు నేర్పింది .. ఆ పాఠాలు మనమూ నేర్చుకోవడానికి లక్ష్మీ కటాక్షం మానసికంగా మనల్ని సిద్ధం చేస్తుంది .
రెండు వందల రూపాయల పుస్తకం 25 శాతం డిస్కౌంట్ తో 150 రూపాయలకు లభిస్తుంది .
9849998087 కు G pay చేసి అడ్రెస్ పంపితే బుక్ ను పోస్ట్ లో పొందవచ్చు .
- బుద్దా మురళి
19, సెప్టెంబర్ 2024, గురువారం
ఓ గోల్డ్ మెడలిస్ట్ అనాధ మరణం జర్నలిస్ట్ జ్ఞాపకాలు -115
ఆమె యూనివర్సిటీ లో గోల్డ్ మెడల్ సాధించారు . ప్రభుత్వాలను శాసించే నంబర్ వన్ సంస్థ లో జీవితాన్ని ప్రారంభించి ..దాదాపు నాలుగు దశాబ్దాలు అదే జీవితం . ఆమెది ఒంటరి జీవితం . హైదరాబాద్ మహానగరం లో ఒంటరిగా గదిలో ప్రాణాలు విడిచింది .తలుపు బద్దలు కొట్టి చూస్తే తప్ప ఆమె మరణం బయటి వారికి తెలియలేదు . అనాధ శవానికి పోలీసులు , మున్సిపాలిటీ అంత్యక్రియలు నిర్వహించారు . .... ఈ వార్త టీవీ వారి దృష్టిలో పడితే పండగే ... మానవత్వం మంటగలిసింది ... ఎక్కడికి వెళుతున్నాం ... మనుషుల మేనా అంటూ వీలైతే సినిమా పాటలతో అద్భుతంగా మానవత్వాన్ని తట్టిలేపే విధంగా చక్కిని స్టోరీ ప్రసారం చేసే వారు . పత్రికల్లో ఐతే చేయి తిరిగిన సబ్ ఎడిటర్ చేతిలో పడితే కన్నీళ్లు పెట్టించే కవిత్వంతో వార్త వెలుగు చూసేది .. మరణం నిజమే ... కానీ టివిలో , కానీ మీడియాలో కానీ హృదయ విదారక కథనాలేమి రాలేదు .. ఎందుకంటే అలా మరణించింది ఓ మహిళా జర్నలిస్ట్ ... ఎవరైనా ఇలా మరణిస్తే జర్నలిస్ట్ లు హృదయ విదారకంగా కథనం రాస్తారు కానీ జర్నలిస్ట్ మరణిస్తే అలా రాయరు. ఎందుకలా అంటే అదంతే ... .... జంధ్యాల భారతి పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం లో జర్నలిజం లో గోల్డ్ మెడల్ సాధించారు ... ఈనాడు లో జర్నలిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించి తరువాత ఫ్రీ లాన్సర్ గా ఉన్నారు .. మిత్రుడు నామాల విశ్వేశ్వర్ రావు ఫోన్ చేసి జంధ్యాల భారతి సంస్మరణ సభ నిర్వహించాలి అని నాకు ఉంది .. ఆమె ఇలాంటివి తనకు నచ్చవు వద్దు అని గతంలో చెప్పారు అని కొందరు అంటున్నారు .. మీ అభిప్రాయం ఏమిటీ అని అడిగారు .. మీరు సంస్మరణ సభ నిర్వహించినా , నిర్వహించక పోయినా పోయిన వారికి తెలియదు .. మనం ఎలా బతుకుతున్నాం అని మనకు మనం చెప్పుకోవడానికి .. మన జీవితాన్ని మనం సమీక్షించుకోవడానికి సభ నిర్వహించాలి అనేది నా అభిప్రాయం అని చెప్పాను ... ఆమె కోసం కాదు మన కోసం అవసరం అని చెప్పాను ... .... నిన్నటి రోజంతా ఈ విషయం మీదే చర్చ ... ఆలోచన ... ఆమెతో పెద్దగా పరిచయం లేదు ..ఆంధ్రభూమిలో ఉండగా చాలా సార్లు చూశాను .. ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ గా అన్ని పత్రికలకు రాసే వారు ... ముందు ప్రభ తరువాత కరోనా లో భూమి లో పారితోషకం ఇవ్వడం మానేశాక రాయడం మానేశారు .. మిత్రుడు విష్వఈశ్వర రావు చెప్పిన వివరాల ప్రకారం ఆమె ఈనాడు లోనే జర్నలిజం జీవితాన్ని ప్రారంభించారు .. ఎం వి ఆర్ శాస్త్రి , కె యల్ రెడ్డి వంటి వారితో కలిసి ఈనాడులో పని చేశారు . అక్కడి ఉద్యోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ... అక్కడ ఇలాంటి ప్రేమ పెళ్లిళ్లు కొత్తేమి కాదు ... ఐతే ఇద్దరిలో ఒకరు రాజీనామా చేయాలి ఇది నిబంధన .. ఆమె రాజీనామా చేసింది .. కాపురం మూన్నాళ్ళ ముచ్చట కాదు ఒక రోజు ముచ్చట గానే మిగిలి పోయింది ... మళ్ళీ ఒంటరి జీవితమే ... ప్రైవేటు ఉద్యోగం అంటేనే బతుకు భయం భయం ఇక జర్నలిస్ట్ ఉద్యోగం అంటే మరింత భయం ...ఆమె అలానే జీవితమంతా భయం తో కలిసి బతికింది చనిపోయింది ... .... అందరి జీవితాలు ఇలానే ఉంటాయి అని కాదు సినిమా రంగం , జర్నలిజం , రచయిత ఏ రంగం ఐనా కావచ్చు ... ఎవరి బతుక్కు వారే కారణం ... సమాజం , తోటి వారు , యూనియన్ లు అని మాట్లాడితే పలాయన వాదమే అవుతుంది .. జర్నలిజం నుంచి సివిల్స్ కు ఎంపిక అయిన వారు ఉన్నారు ... ముందుకు బానిసలైన వారు ఉన్నారు ... ఆయేషా అని దక్కన్ క్రానికల్ లో క్రైం రిపోర్టర్ ఉండేవారు .. అమ్మాయి అయినా ఎప్పుడూ మార్చురీల చుట్టూ తిరిగేది ... ఇప్పటిలా వాట్స్ ఆప్ జర్నలిజం కాదు కాబట్టి రోజూ మార్చురీకి వెళ్ళేది ... ఐనా ఆఫీస్ లో వేధింపులు ...ఉద్యోగం వదిలేసింది . కొంతకాలం తరువాత ఆమె ఏకంగా జిల్లా కలెక్టర్ అయ్యారు .. చిన్న వయసు వారు కనిపిస్తే బోలెడు ప్రభుత్వ ఉద్యోగాలు , బ్యాంకు రైల్ వే ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తుంటాయి వెళ్లొచ్చు కదా ? అనేవాడిని ... అలా వెళ్లిన ఎంతో మందిని చూశా ... శ్రీ శ్రీ , వేటూరి సుందర రామ మూర్తి వంటి గొప్ప వారు మొదట్లో జర్నలిస్ట్ లే ... ఇవి ఆ రోజులు కాదు .. ఇతర రంగాల్లో రాణించిన వారిని చూశా అనాధల్లా మరణించిన వారిని చూశా ... ... భూమిలో చిక్కడ పల్లి చారీ అని ఒక పార్ట్ టైం విలేఖరి ఉండేవారు ... ఓ రోజు సార్ నేను ఎడిటర్ ఇంటికి వెళ్తా , ఎడిటర్చెప్పిన పని చేస్తా కానీ ఆఫీస్ కు వచ్చాక న్యూస్ ఎడిటర్ , బ్యూరో డెస్క్ అందరి మీద అధికారం చెలాయిస్తా ... నేను ఒక్కరికి తలవంచి అందరినీ భయపెడతా అని చెప్పుకుంటూ పోయా డు .. భ్రమల్లో బతుకుతున్నాడు పాపం అనిపించింది . అతని గురించి కొన్ని రోజుల తరువాత తెలిసింది .. చనిపోయాడు నాలుగు రోజులు మార్చురీలోనే శవం ... ఎవరూ రాలేదు ... ఎన్టీఆర్ ను దించేసి సమయం ... అప్పుడు సెల్ ఫోన్లు లేవు .. సచివాలయం ప్రెస్ రూమ్ లో ల్యాండ్ లైన్ ... ఓ జర్నలిస్ట్ తన వంతు వచ్చే వరకు నిలబడి మెల్లగా ఫోన్ లో సచివాలయంలో బాబు ఛాంబర్ లో ఎంత మంది శాసన సభ్యులు చేరారో రామోజీ రావుకు చెబుతున్నాడు ... ఆ సాయంత్రమే శిబిరం వైస్ రాయ్ కి మారింది .. ప్రభుత్వాన్ని కూల్చడం లో తమ వంతు పాత్ర పోషిస్తున్న వారు కూడా అంత మెల్లగా తన పని తాను చేసుకు పోతుంటే ... మందు మత్తులో అమెరికా అధ్యక్షున్ని కూడా ప్రెస్ రూమ్ నుంచే మార్చేస్తున్నట్టు మాట్లాడే వారిని కూడా చూశా ... ప్రపంచం లో ప్రతి పరిణామం పై సమీక్షించే మనం మన జీవితాన్ని కూడా సమీక్షించు కోవాలి లేదంటే ? ఆరోగ్యం , మానవ సంబంధాలు , డబ్బు అన్నీ జీవితానికి ముఖ్యమే ... బెంగళూరులో ఓ సీఏ ఆఫీస్ లో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకున్నారట ... అంత్యక్రియలకు ఎవరూ రాలేదట ... వాస్తవం ఇలానే ఉంటుంది ... భ్రమలు వదిలి వాస్తవం లోకి రావాలి ... ఓ వీడియో వింటుంటే నూతన్ ప్రసాద్ గురించి యండమూరి వీరేంద్ర నాథ్ ఓ మాట చెప్పారు ... సినిమా షూటింగ్ ప్రమాదంలో నడుము వరకు చచ్చుపడడం తో నూతన్ ప్రసాద్ వీల్ చైర్ కే పరిమితం అయ్యారు .. జీవితంలో అనుకోకుండా వచ్చే ప్రమాదాలకు ముందే సిద్ధం అయి ఉంటే ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుంది అని చెప్పారట ... ఏ ఉద్యోగంలో ఉన్న వచ్చే ప్రమాదాలను ముందే ఊహించుకుంటే జీవితం అగమ్య గోచరంగా ఉండదు ... సీఎం తెలుసు పీఎం తెలుసు అంటూ భ్రమల్లో బతికితే .... - బుద్ధా మురళి
17, సెప్టెంబర్ 2024, మంగళవారం
ఆ ఇద్దరికి సీఎం పీఠం దక్కింది కానీ ఇంటి స్థలం దక్కలేదు.. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -114
ఆ ఇద్దరికి సీఎం పీఠం దక్కింది కానీ ఇంటి స్థలం దక్కలేదు..
ఇందిరా గాంధీ పేరు వద్దంటే సభ్యత్వం తీసుకోకండి : రేవంత్ బృందంతో వై యస్
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -114
రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటైన శాసన సభ్యుల హౌసింగ్ సొసైటీలో ఇద్దరు సభ్యులకు ముఖ్యమంత్రి పదవి దక్కింది కానీ ఇప్పటి వరకు ఇంటి స్థలం మాత్రం దక్కలేదు . అటు పార్టీ వాళ్ళు ఇటు మారారు . సీఎంలు అయ్యారు , మంత్రులు అయ్యారు కానీ ఓ ఇంటివారు కాలేదు . ఎన్నో రాజకీయ మార్పులు చూసిన శాసన సభ్యుల హౌసింగ్ సొసైటీ కథ ఇది .
*****
టీడీపీ శాసన సభ్యుల బృందం అప్పటి ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి వద్దకు వెళ్లి మెల్లగా తమ కోరిక బయటపెట్టారు . ఇందిరాగాంధీ పేరు వద్దు ఇంకేదైనా పేరు పెట్టండి అని కోరారు . వైయస్ నింపాదిగా మీకు ఇందిరాగాంధీ పేరు నచ్చలేదా ? నో ప్రాబ్లమ్ బలవంతం ఏమీ లేదు . మీకు నచ్చక పోతే ఇందిరా గాంధీ పేరుతో ఉన్న ఆ సొసైటీలో చేరకండి అని చెప్పి పంపించేశారు . ఆ రోజు ఇందిరాగాంధీ పేరు మార్చాలి అని వైయస్ ను కలిసిన శాసన సభ్యుల బృందంలో ఇప్పటి ముఖ్యమంత్రి , అప్పటి శాసన మండలి సభ్యులు అనుముల రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు .
ఇందిరాగాంధీ కుటుంబం త్యాగాలు , గాంధీ కుటుంబం సేవల గురించి సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ సభలో ఆవేశంగా మాట్లాడారు . ఇందిరాగాంధీ పేరుతో సొసైటీ వద్దు పేరు మార్చాలి అని కోరిన రేవంత్ రెడ్డి అంతే ఆవేశంగా గాంధీ కుటుంబ త్యాగాలు గుర్తు చేసినప్పుడు పాత విషయాలు గుర్తుకు వచ్చాయి .
శాసన సభ్యులకు , జర్నలిస్ట్ లకు , సివిల్ సర్వీస్ అధికారులు , న్యాయమూర్తులకు నివాస స్థలాలు ఇవ్వడానికి హౌసింగ్ సొసైటీలు ఏర్పాటు చేస్తున్న సమయం అది .
ఉమ్మడి రాష్ట్రంలో 2006లో టీడీపీ శాసన సభా పక్షం కార్యాలయంలో టీడీపీ శాసన సభ్యులు , మండలి సభ్యుల సమావేశం . గుర్తున్నంత వరకు అనుముల రేవంత్ రెడ్డి , పయ్యావుల కేశవ్ , దూళిపాళ నరేంద్ర , ఎర్రబెల్లి దయాకర్ రావు మరికొంత మంది టీడీపీ శాసన సభా పక్షం కార్యాలయంలో సమావేశం . బాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ బృందం ఇలానే ఓ సారి సమావేశం అయింది . ఇంటి స్థలాల కోసం అని చెబితే .. శాసన సభ్యులకు ఇంటి స్థలాలు అంటే బాబు ఒప్పుకోరు . బాబు ఒప్పుకునే ఐడియా చెబుతాను అని . ఎమ్మెల్ల్యేల హౌసింగ్ సొసైటీ అని పేరు పెట్టవద్దు .ఎమ్మెల్యేస్ ఇన్ఫో టెక్ సొసైటీ అని పేరు పెట్టుకోండి అని దయాకర్ రావు బృందానికి సలహా ఇచ్చాను .. ఐటీ పేరుంటే కోరినంత భూములు ఇస్తున్న రోజులు అవి . వీరి వినతిని బాబు పట్టించుకోలేదు . పేరులో ఏముంది అంటారు కానీ అంతా పేరులోనే ఉంది . టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వైయస్ సీఎం అయ్యారు . హౌసింగ్ సొసైటీలు ప్రభుత్వ అనుసన్నల్లో ఏర్పాటు అయ్యాయి . అన్నింటికీ వై యస్ ఆర్ నే పేరు పెట్టారు . శాసన సభ్యుల సొసైటీకి ఇందిరాగాంధీ పేరు పెట్టడం టీడీపీ సభ్యులకు ఇబ్బంది కరంగా మారింది . పయ్యావుల కేశవ్ ( ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక మంత్రి ) నాయకత్వంలో అనుముల రేవంత్ రెడ్డి , దూళిపాళ నరేంద్ర , దయాకర్ రావు , వేం నరేందర్ రెడ్డి తదితరులు సమావేశం అయి పేరు మార్చాలి అని వైయస్ ఆర్ ను కోరారు . బలవంతం ఏమీ లేదు మీకు పేరు నచ్చక పోతే సొసైటీలో చేరకండి అని వై యస్ సలహా ఇచ్చి పంపించారు . శాసన సభ్యుల సొసైటీ ఇందిరాగాంధీ పేరుతో ఉంటే , జర్నలిస్ట్ లకు సంబంధించిన సొసైటీ కి జవహర్ లాల్ నెహ్రూ పేరు పెట్టారు . మాకా ఇబ్బంది లేదు నెహ్రూ జర్నలిస్ట్ కూడా అని అసలే దిగులుగా ఉన్న టీడీపీ శాసన సభ్యులకు చెప్పాను .
****
శాసన సభ్యుల సొసైటీకి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం వహించారు . ఆ తరువాత ఆయన ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ అయ్యారు . ఢిల్లీలో ప్రయత్నాలు ఫలించి రోశయ్యను తప్పించి సీఎం కూడా అయ్యారు . అనుముల రేవంత్ రెడ్డి ప్రయత్నాలు కూడా ఫలించి సీఎం అయ్యారు . వీరిద్దరూ సీఎంలు అయినా హౌసింగ్ సొసైటీలో సొంత ఇంటి కల ఫలించలేదు.
శాసన సభ్యుల హౌసింగ్ సొసైటీ ఎన్నో పరిణామాలు చూసింది . తెలంగాణ ఉద్యమ కాలం లో తెరాస శాసన సభా పక్షం నాయకునిగా ఈటెల రాజేందర్ ఉండేవారు . ఒక దశలో తెరాస శాసన సభ్యులను మేం మీకు సొసైటీలో సభ్యత్వం ఇవ్వం అని ఈటెల బృందంపై కిరణ్ కుమార్ రెడ్డి ఒత్తిడి తీసుకువచ్చారు . వారు ఆ ఒత్తిడికి తలొగ్గలేదు . అటు శాసన సభ్యులు , ఇటు జర్నలిస్టులు హౌసింగ్ సొసైటీ ద్వారా ఎప్పుడు ఓ ఇంటివారు అవుతారో ఎవరికి తెలియదు . రేవంత్ రెడ్డి ఇంట్లో వాళ్లకు కూడా ఇదే సందేహం వచ్చింది . జర్నలిస్ట్ లకు పట్టాలు ఇచ్చారు . మరి మన కెప్పుడు పట్టా వస్తుంది అని అడిగారట . ఓ సభలో రేవంత్ రెడ్డినే ఈ విషయం చెప్పారు .
శాసన సభ్యులు పది లక్షలు కట్టి ఎదురు చూస్తుంటే జర్నలిస్టులు రెండు లక్షలు కట్టి రెండు దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నారు . రెండు లక్షలు కట్టిన సమయంలోనే కొందరు జర్నలిస్టులు మన్నెవారి తుర్కపల్లి అనే గ్రామంలో రోడ్డు పై ఉన్న పొలం ధర అడిగి వచ్చారు . 80 వేలకు ఎకరం ధర , ఇప్పుడు అక్కడ ఎకరం రెండు నుంచి మూడు కోట్ల . సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోని ఉంటే ?
ఇటిచ్చిన రెండు లక్షలతో అటు రెండున్నర ఎకరాలు కొని ఉంటే ఇప్పుడు చకోర పక్షిలా ఎదురు చూసే అవసరం ఉండదు . మార్కెట్ రేటుకు కొన్నా, అదేదో డ్వాక్రా సంఘాల సభలా మూడు రంగుల జెండా పట్టి పాటకు నృత్యం చేసి భావోద్వేగాలకు గురైనా , కొనుక్కున్న స్థలం ఎప్పుడు చేతికి వస్తుంది అనే ప్రశ్నకు సగటు జర్నలిస్ట్ వద్ద సమాధానం లేదు . ఈ ప్రశ్న ఇంట్లో వాళ్ళు అడిగితే సీఎం నే చెప్పలేనప్పుడు సగటు జర్నలిస్ట్ ఏం చెప్పగలడు . ఎంత అంతులేని కథ అయినా ప్రతి కథకు ఎప్పుడో ఒకప్పుడు ముగింపు తప్పదు .
- బుద్దా మురళి
10, జూన్ 2024, సోమవారం
అతనికి స్మశానమే దేవాలయం : వారాంతం లో అక్కడే నివాసం : ముందే స్మృతి వనం నిర్మాణం . అలా గుర్తుండి పోయిన జర్నలిజం తొలి నాళ్ళ వార్త జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 113
^^ నాకు స్మశానమే దేవాలయం , మనిషి ఆలయానికి వెళ్ళవచ్చు , వెళ్లక
పోవచ్చు కానీ అంతిమంగా స్మశానానికి రావలసిందే అందుకే నాకు స్మశానం అంటే ఇష్టం ^^ 41 సంవత్సరాల క్రితం బి ఆర్ లక్ష్మయ్య చెప్పిన మాటలు ఇవి . అప్పుడు నేను పదవతరగతి పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థిని .అప్పుడు జర్నలిస్ట్ ను కాను కానీ బి ఆర్ లక్ష్మయ్య మాటలు , అయన చర్యలు అలా గుర్తుండి పోయాయి . సంఘటనలు తప్ప వ్యక్తుల పేర్లు పెద్దగా గుర్తు పెట్టుకోవడానికి ఆసక్తి ఉండదు . కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు బి ఆర్ లక్ష్మయ్య పేరు అలా గుర్తుండి పోయింది .
అంత్యక్రియలు జరిగే స్మృతి వనాన్ని ఈనాడు అధినేత రామోజీరావు ముందుగానే నిర్మించుకున్నారు . జర్నలిస్ట్ గ్రూప్ లో ప్రపంచంలో తొలిసారి ఇలా ముందుగానే స్మృతి వనాన్ని నిర్మించుకున్న ఏకైక వ్యక్తి రామోజీరావు అని పేర్కొనన్నారు . చాలా మంది జర్నలిస్ట్ లు కవులు , రచయితలు ప్రపంచంలో ఇదే మొదటి సారి అని రాశారు .
ఇలా ముందుగానే నిర్మించుకున్న స్మృతి వనాన్ని నేను 1983లోనే చూశాను . అంతకు ముందే ఆ నిర్మాణం జరిగింది . ఇది కూడా పెద్ద విశేషం కాకపోవచ్చు . చాలా గ్రామాల్లో వృద్దులు తమ వ్యవసాయ పొలంలో ఇలా నిర్మించుకుంటారు . రూపాయలు బహుశా నేనెరిగిన ప్రపంచంలో బి ఆర్ లక్ష్మయ్య లాంటి ప్రత్యేక వ్యక్తిని మరొకరిని చూడలేదు .
స్మశానమే నాకు దేవాలయం అని చెప్పడమే కాదు ఆదివారం , ఇతర సెలవు దినాల్లో తాను స్మశానంలో నిర్మించిన భవనంలోనే విశ్రాంతి తీసుకునేవారు . జంటనగరాల్లోని పెద్ద స్మశాన వాటిక అయిన బన్సీలాల్ పేట స్మశాన వాటిక లో ఎక్కడ చూసినా బి ఆర్ లక్ష్మయ్య నిర్మించిన నిర్మాణాలు కనిపిస్తాయి . సికింద్రాబాద్ మార్కెట్ ప్రాంతంలో ఆయనది బండల వ్యాపారం . ఇప్పటిలా ఆ రోజుల్లో టైల్స్ లేవు . బండలవ్యాపారం జోరుగా సాగేది . తన సంపాదన ఎక్కువగా ఈ స్మశాన వాటిక కోసం ఖర్చు చేసేవారు . 1970 ప్రాంతంలోనే ఒకే సారి స్మశాన వాటిక అభివృద్ధి పనులకు 80 వేల రూపాయలుఇచ్చారు . 1980 ప్రాంతంలో మా బంధువులు ఎకరానికి వెయ్యి రూపాయల్లా భువనగిరి గజ్వేల్ రోడ్ లో 60 ఎకరాలు కొన్నారు . 70లో ఐతే 80 వేలకు 200 ఎకరాలకు పైగా వచ్చేది .
***
1983లో నేను పదవ తరగతి పరీక్షలకు సిద్ధం అవుతున్నప్పుడు మా నాన్న మరణించారు . ఓ పది రోజుల పాటు రోజూ స్మశాన వాటికకు రోజూ వెళ్ళాను . బి ఆర్ లక్ష్మయ్య అనే వ్యాపారి తన కోసం ముందుగానే అంత్యక్రియలు నిర్వహించే స్మృతి వనం నిర్మించుకున్నారు అని తెలిసి ఆసక్తి కలిగింది . ఎవరు ఎంత డబ్బు చెల్లిస్తామని ముందుకు వచ్చినా అయన అంగీకరించలేదు అని వినిపించింది . రెండేళ్లు గడిచాక 85-86లో ఒక వైపు చదువుకుంటూనే మరోవైపు ఉదయం పార్ట్ టైం విలేకరిగా చేరాను . అప్పుడు బి ఆర్ లక్ష్మయ్యను కలిసి చాలా సేపు మాట్లాడి ఉదయం సిటీ పేజీలో వార్త రాశాను . జర్నలిజం లోకి వచ్చిన తొలి నాళ్లలో నాకు బాగా నచ్చిన , అలా గుర్తుండి పోయిన వార్త బి ఆర్ లక్ష్మయ్య ముందే నిర్మించుకున్న స్మృతి వనం , స్మశాన వాటిక కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం , ఆదివారం అక్కడే పడుకోవడం బాగా గుర్తుండి పోయింది .
ఉదయం కోసం రాయడానికి ఆయనను కలిసినప్పుడు చాలా సేపు మాట్లాడాను . ఫోటో తీయబోతుంటే ఆగమని చెప్పి పాతతరం వాళ్ళు ధరించే కోటు వేసుకొని ఫోటో దిగారు .
స్మశాన వాటిక కార్యాలయం పైన ఉన్న విశాలమైన గదిలో పడుకునేవారు . భయం వేయదా? అని అడిగితే ఎందుకు ? అని ఎదురు ప్రశ్నించారు . తన భార్యా పిల్లలను కూడా ఆదివారం ఇక్కడికి రమ్మని మొదట్లో అడిగితే వారు రావడానికి నిరాకరించారని తాను మాత్రం తప్పనిసరిగా వస్తాను అని చెప్పారు .
అంత్యక్రియలకు వచ్చే వారి ప్రవర్తన , కులాల వారిగా వారు వ్యవహరించే తీరు చెప్పినట్టు గుర్తు . చివరకు అయన తన కులం గురించి కూడా తాను విమర్శించినట్టు బాగా గుర్తుండి పోయింది .
రాజులు మొదలుకొని నేటి సంపన్నుల వరకు ఆలయాల అభివృద్ధికి భారీగా విరాళాలు ఇచ్చిన వారు ఎంతో మంది ఉంటారు. కానీ తన సంపాదనలో చాలా మొత్తం స్మశాన వాటిక అభివృద్ధికి ఖర్చు చేయడమే కాకుండా దానిని దేవాలయంగా భావించి అక్కడే సెలవు రోజుల్లో సేదతీరేవారు కనిపించరు . స్మశాన వాటిక స్థలాలను ఆక్రమించుకొని భారీ భవనాలు నిర్మించుకున్నవారు ఉంటారు కానీ ఇలా సేవ చేసేవారు కనిపించరు .
1983లో బి ఆర్ లక్ష్మయ్య స్మృతి వనాన్ని చూశాను . అంటే అంతకు ముందే ఆ నిర్మాణం జరిగింది . బి ఆర్ లక్ష్మయ్య 2003లో మరణించారు . ఆ స్మృతి వనం లోనే అంత్య క్రియలు నిర్వహించారు . ఇప్పటికీ ఆ స్మృతి వనం బి ఆర్ లక్ష్మయ్యకే పరిమితం . మరెవరి అంత్యక్రియలు అక్కడ నిర్వహించరు .
ముందే తన కోసం స్మృతి వనం నిర్మించుకున్న బి ఆర్ లక్ష్మయ్య గురించి , బన్సీలాల్ పేట స్మశాన వాటిక లో అయన సేవల గురించి 1985లో ఉదయం లో రాశాను . చాలా రోజుల క్రితం సీనియర్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు జి కృష్ణ గురించి రాస్తూ బన్సీలాల్ పేట స్మశాన వాటిక నిర్వాహకులతో కృష్ణ పరిచయాలు , ఛలోక్తుల గురించి రాశారు . అది చదివాక 85లో నేను బి ఆర్ లక్ష్మయ్య గురించి ఉదయం లో రాసిన వార్త చూసి జి కృష్ణ వారితో పరిచయం చేసుకున్నారేమో అనిపించింది .
***
ప్రపంచంలో తొలిసారి రామోజీరావు ఇలా ముందుగానే స్మృతి వనాన్ని నిర్మించుకున్నారు అని జర్నలిస్ట్ లు , కవులు , రచయితలు సామాజిక మాధ్యమాల్లో రాయడంతో తన మరణానికి రెండున్నర దశాబ్దాల ముందే - నాలుగు దశాబ్దాల క్రితం ఇలా ముందే స్మృతి వనం నిర్మించుకున్న బి ఆర్ లక్ష్మయ్య గురించి , 85లో ఉదయంలో తొలినాళ్లలో నేను రాసిన నాకు నచ్చిన వార్త ఇలా గుర్తుకు వచ్చింది .
భారతీయ సినిమా పితామహుడు అని దాదాసాహెబ్ పాల్కేను సంభోదిస్తారు . తొలి భారతీయ సినిమాను నిర్మించింది వారే కాబట్టి . రామోజీ రావును తెలుగు జర్నలిజం పితామహుడు అని కొందరు రాశారు . తెలుగు లో తొలి పత్రిక 1832లో వచ్చింది . 1883లో సత్యదూత వచ్చింది .
7, జూన్ 2024, శుక్రవారం
అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం బాబు సోదరుడు వైయస్ వైపు - జగన్ సోదరి బాబు వైపు జర్నలిస్ట్ జ్ఞాపకాలు -112
అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
బాబు సోదరుడు వైయస్ వైపు - జగన్ సోదరి బాబు వైపు
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -112
-------
తాతా మనవడు సినిమాలోని అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం అనే పాట చిన్నప్పుడు రోజూ రేడియోలో వినిపించేది . ఆ వయసులో పాటలోని భావం పెద్దగా తెలియక పోయినా ఆ విషాద గీతం బాగా వెంటాడేది . జీవితాన్ని బాగా మదించిన వారే అలా రాయగలరు . పాట రచయిత ఎవరా ? అని చూస్తే డాక్టర్ సి నారాయణ రెడ్డి అని తెలిసింది .
***
గత కొన్ని రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో కుటుంబ వ్యవస్థకు కాలం చెల్లింది. భవిష్యత్తులో కుటుంబ వ్యవస్థ ఉండదు అని చాలా మంది ఒక వ్యాసాన్ని షేర్ చేస్తున్నారు . ఆంధ్రప్రదేశ్ ఎన్నికల టీడీపీ , జనసేన కూటమి విజయం సాధించింది . విజేతలు చంద్రబాబు తన కుటుంబం తో ఉన్న ఫోటోలు , పవన్ కళ్యాణ్ తన కుటుంబం తో పాటు చిరంజీవి కుటుంబం తో ఉన్న ఫోటోలు చూపుతూ జగన్ తన సోదరిని దూరం పెట్టిన విషయాన్నీ ప్రస్తావిస్తూ కుటుంబం కలిసి ఉంటే విజయం సాధిస్తారు . విడిపోతే జగన్ లా ఓడిపోతారు అంటూ కుటుంబ విలువల వ్యాసాలు బోలెడు వస్తున్నాయి . విజేతలకు ఎందరో తండ్రులు , పరాజితుడు అనాధ అని ఇంగ్లీషులో ఓ మాట బాగా పాపులర్ .
ఇంతకూ రాజకీయాల్లో కుటుంబం ఉండాలా ? దూరం పెట్టాలా ? మీడియా ఏం చేయమని చెబుతుంది అంటే ?
తండ్రి కొడుకు గాడిద కథ గుర్తుందా ? కథతో పాటు రాజకీయాల్లో కుటుంబ సభ్యుల ఉదంతాలు గుర్తుకు వచ్చాయి .
****
1994 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ వద్ద చంద్రబాబు స్థానాన్ని లక్ష్మీపార్వతి ఆక్రమించారు . బాబు వందశాతం రాజకీయ నాయకుడు ఐతే లక్ష్మీపార్వతి రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవు . చంద్రగిరి నుంచి బాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు టికెట్ కోసం ప్రయత్నం . బాబు వద్దు అంటుంటే లక్ష్మీపార్వతి బాబుకు వ్యతిరేకంగా రామ్మూర్తి తమ్ముడికి టికెట్ ఇప్పించడానికి ఎన్టీఆర్ వద్ద పలుకుబడి ఉపయోగించారు . ఐతే బాబే వ్యూహాత్మకంగా తమ్ముడిని లక్ష్మీపార్వతి పంపారు అని ఓ ప్రచారం . అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో ఎన్టీఆర్ కు వెన్నుపోటు . శరీరం అంతా ఎన్టీఆర్ పచ్చబొట్టు పొడిపించుకున్న శ్రీపతి రాజేశ్వర రావు , ఎన్టీఆర్ వచ్చే అంత వరకు మంగళసూత్రం కట్టని రమేష్ రెడ్డిలు ఎన్టీఆర్ ను వీడి బాబు వద్ద ముందు వరుసలో ఉన్నప్పుడు స్వయంగా బాబు తమ్ముడు బాబు వైపు ఎందుకు ఉండరు . లక్ష్మీపార్వతి రాజకీయాలు తెలియవు . బాబుకు తెలుసు .
బాబు సీఎం అయిన కొత్తలో నారా రామ్మూర్తి నాయుడు కూడా ఓ వెలుగు వెలిగారు . పనుల కోసం మీడియా వాళ్ళు కూడా రామ్మూర్తిని ప్రసన్నం చేసుకొనేవారు . కొంతకాలం ఆ హవా కొనసాగింది . తరువాత బాబు రామ్మూర్తిని దూరం పెట్టడంతో 2004 ఎన్నికలకు ముందు రామ్మూర్తి నాయుడు వై యస్ రాజశేఖర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లో చేరారు . ప్రతి రోజు తన అన్న చంద్రబాబు వ్యవహారాల గురించి రామ్మూర్తి నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడేవారు . చంద్రగిరి కాంగ్రెస్ టికెట్ రామ్మూర్తి కి ఖాయం అనుకున్నారు అంతా . తీరా ఎన్నికల సమయంలో రామ్మూర్తి కాంగ్రెస్ టికెట్ దక్కలేదు . ఎందుకంటే .. వై యస్ రాజశేఖర్ రెడ్డి కూడా బాబు లానే వంద శాతం రాజకీయ నాయకుడు . రేపు ఏదైనా జరిగితే తమ్ముడు మూర్తి ఎటు పోతాడో రాజకీయ అవగాహన ఉన్నవారు . ఏం జరిగిందో తెలియదు కానీ పదేళ్లు దాటిపోయింది రామ్మూర్తి బయటకు రాక .. అనారోగ్య కారణాలు అని ప్రచారం .
***
చంద్రబాబు , జగన్ ఫొటోలతో విస్తృతంగా ప్రచారం . బాబు కుటుంబంతో కలిసి ఉండడం కుటుంబ విజయంగా ఈ ఎన్నికల విజయాన్ని అభివర్ణిస్తున్నారు . జగన్ సోదరి షర్మిలను దూరం పెట్టడం వల్ల ఓడిపోయారు అని ప్రచారం . ప్రజలకు వేరే పని లేదు , సమస్యలు లేవు . తెలుగు సినిమాల్లో చూపించినట్టు మీ కుటుంబం అంతా ఇలా కలిసి ఉండాలి బాబు మాకు ఇంకేం సమస్యలు లేవు అని చెబుతున్నారన్న మాట . తమ ఇంట్లో తిండికి ఉందో లేదో తెలియదు కానీ కుటుంబం ను చూసి పులకించారు . జగన్ కుటుంబ ఫోటో కాకుండా ఒంటరి ఫోటో చూసి ఓడించారన్న మాట .
ఇదే ప్రచారం చేసిన వారు కెసిఆర్ కుటుంబం వల్లనే ఓడిపోయారు అని ప్రచారం చేశారు . కులం , మతం తో పాటు అనేక అంశాలు ఎన్నికల పై ప్రభావం చూపుతాయి . ఒక్కో పార్టీకి కొన్ని కులాల అండ ఉంటుంది . కొంచం ఎక్కువ, తక్కువ కానీ దేశమంతా ఇదే . ఉత్తర్ ప్రదేశ్ లో కులాల కాంబినేషన్ వల్ల బీజేపీ ఓడిపోయింది . ఆంధ్రాలో కూటమి గెలిచింది . కులం మతం తో పాటు అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయి . ఇంతకూ రాజకీయాల్లో కుటుంబం ఉండాలా ? వద్దా ? అంటే గాడిద పై తండ్రి కొడుకు కూర్చొని ప్రయాణిస్తే బాటసారులు ఏం చెప్పారో మీడియా అదే చెబుతుంది . .కుటుంబం ఉంటే వద్దు అంటుంది . లేక పోతే ఉండాలి అంటుంది .
రాజకీయం ఓ వ్యాపారం . బ్యాంకు దీర్ఘకాలం కోసం డిపాజిట్ చేస్తే ఎలాంటి రిస్క్ లేకుండా వడ్డీ రూపంలో సాధారణ ఆదాయం వస్తుంది . స్టాక్ మార్కెట్ లో రిస్క్ ఎక్కువ ఆదాయం అంతకన్నా ఎక్కువ . రాజకీయ వ్యాపారం చాలా రిస్క్ ఆదాయం కూడా అంతే . స్టాక్ మార్కెట్ లో కరోనా లాంటి ఉపద్రవం వస్తే మార్కెట్ క్రాష్ అవుతుంది . ఐనా ఆరు నెలల్లో కోలుకుంటుంది . రాజకీయ వ్యాపారంలో క్రాష్ వస్తే కోలుకోవడానికి ఐదేళ్లు పడుతుంది . రిస్క్ తో పాటు ఆదాయం అదే స్థాయిలో ఉంటుంది . రిస్క్ హై తో ఇష్క్ హై అని సినిమాలో హర్షద్ మెహతా డైలాగు బాగా పాపులర్ .
**
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల తరువాత షర్మిల కామెంట్ కోసం ఆసక్తిగా చూస్తే కనిపించలేదు . ఒకవేళ కామెంట్ చేసి ఉంటే గూగుల్ లో దొరుకుతుంది కదా ? అని సెర్చ్ చేస్తే యూట్యూబ్ ఛానల్ లో కనిపించింది . తను పాద యాత్ర చేసి వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా రక్షించింది సుదీర్ఘంగా చెబుతూ పోతున్నారు . ఫలితాల మీద చెప్పడం లేదు . ఇక వినలేక వదిలేశాను . షర్మిల టీడీపీ మీడియాలో రోజూ మొదటి పేజీ ఆక్రమించేవారు . ఫలితాలు వచ్చాయి . టీడీపీ గెలిచింది ఆమె కామెంట్ గూగుల్ లో సెర్చ్ చేస్తే తప్ప దొరకడం లేదు .
షర్మిల తొలుత తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడుఆంధ్రాలో ఉన్న ఓ మిత్రుడితో చర్చ ఆమెకు 15 సీట్లు వస్తాయి . కింగ్పా మేకర్లే అవుతారు అని అంటే . ఆమె పోటీ చేయరు , చేసినా ఒక్క చోట గట్టి పోటీ ఇస్తారు అన్నాను . ఇదే ఫేస్ బుక్ లో రాస్తే వైయస్ ఆర్ పార్టీ అభిమానులు మాటల దాడి , ఒకరు మెసెంజర్ లో ఫోన్ చేసి దాడి . పాలేరు బిడ్డను అంటూచివిరి నిమిషంలో చేతులు ఎత్తేసి ఆంధ్రాలో తేలి.. కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెస్తాను అన్నారు . ఒక్క చోట కూడా డిపాజిట్ రాలేదు . తెలం గాణలో బి ఆర్ యస్ కు వ్యతిరేకంగా , ఆంధ్రాలో వై యస్ ఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా న్యూ సెన్స్ క్రియేట్ చేయడంలో షర్మిల విజయం సాధించారు . కేఏ పాల్ మా ఇంట్లో 20 ఓట్లు ఉన్నాయి నాకు నాలుగు ఓట్లు మాత్రమే వచ్చాయి అని చెప్పిన మీడియా సమావేశంలో సైతం కనీసం పాతిక మీడియా లోగోలు ఉన్నాయి . నాలుగు ఓట్లు రాకపోయినా పాల్ మాట్లాడితే పాతిక ఛానల్స్ వస్తాయి . రాజకీయాల్లో కొన్ని పాత్రలకు న్యూ సెన్స్ వాల్యూ మాత్రమే ఉంటుంది . రాజకీయం వ్యాపారం . ఎవరికి లాభసాటి అనుకున్న రీతిలో వాళ్ళు రాజకీయ వ్యాపారం చేస్తారు . రాజకీయం వ్యాపారం అయితే మీడియా ?
పెద్ద పరిశ్రమకు అనుబంధంగా కొన్ని చిన్న పరిశ్రమలు ఉంటాయి .
2004 లో చంద్రబాబు ఓడిపోయాక సత్యం పెద్ద క్యాంపస్ ఒకటి ప్రారంభోత్సవం . టీడీపీలో రాధాకృష్ణ అని కార్యాలయ కార్యదర్శి ఉండేవారు . సత్యం క్యాంపస్ ప్రారంభోత్సవం అప్పుడు రాధాకృష్ణ బాధపడుతూ - ఆ క్యాంపస్ కు స్థలం ఇచ్చింది , సౌకర్యాలు కల్పించింది చంద్రబాబు - చూడు మనుషులు ఎలా ఉంటారు .. బాబును కనీసం పిలువ లేదు వై యస్ ఆర్ ను పిలిచారు అని బాధ పడ్డారు . సత్యం కు స్థలం ఇచ్చింది సీఎం , ప్రారంభోత్సవానికి పిలిచింది సీఎం ను ... దీనికి బాబు వైయస్ ఆర్ కు సంబంధం లేదు . సీఎం పోస్ట్ తోనే సంబంధం అని చెప్పాను . సత్యం, బాబు , జగన్ రామ్మూర్తి నాయుడు , షర్మిల అనుబంధాలు ఉత్త ట్రాష్ . రాజకీయమే వాస్తవం .
-బుద్దా మురళి
5, జూన్ 2024, బుధవారం
సత్యం పాతాళం నుంచి ఆకాశాన్ని తాకింది . డిపాజిట్ దక్కని పార్టీ అధికారంలోకి వస్తుంది . జీవితం , రాజకీయం , స్టాక్ మార్కెట్ అన్నీ బిజినెస్ లే జర్నలిస్ట్ జ్ఞాపకాలు 111
సత్యం పాతాళం నుంచి ఆకాశాన్ని తాకింది .
డిపాజిట్ దక్కని పార్టీ అధికారంలోకి వస్తుంది .
జీవితం , రాజకీయం , స్టాక్ మార్కెట్ అన్నీ బిజినెస్ లే
జర్నలిస్ట్ జ్ఞాపకాలు 111
జనవరి 2009 టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లోకి వెళుతుంటే ఓ యువకుడు ఫోన్ లో సత్యం షేర్లు లక్ష కొన్నాను -అని గట్టిగా చెబుతున్నాడు . అప్పటివరకు దాదాపు ఐదు వందల రూపాయలు ఉన్న సత్యం 2009 లో స్కామ్ భయటపడగానే తగ్గుతూ పది రూపాయలకు వచ్చింది . ఆ సమయంలో ముందు చూపు ఉండి ధైర్యం చేసిన వారి పంట పండింది . పది లక్షలతో లక్ష షేర్లు కొన్న ఆ యువకుడికి ఇప్పటి ధర ప్రకారం పన్నెండు కోట్ల రూపాయల ఆస్తి . సత్యం ను టెక్ మహేంద్ర విలీనం చేసుకున్న తరువాత ఆ స్టాక్ దశ తిరిగింది . పార్ల మెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మంగళవారం స్టాక్ మార్కెట్ ఘోరంగా పడిపోవడం, ఆంధ్రాలో టీడీపీ జనసేన విజయంతో పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి.
అసెంబ్లీ సమావేశాల అజెండాలో సభా కార్యక్రమాలను బిజినెస్ అని రాస్తారు . ఆ మాట నాకు బాగా నచ్చుతుంది . జీవితం , రాజకీయం , స్టాక్ మార్కెట్ అన్నీ బిజినెస్ లే . పగలు , రాత్రి ఉన్నట్టే బిజినెస్ అన్నాక బాగా నడిచే రోజులు ఉంటాయి . దెబ్బ తినే రోజులు ఉంటాయి . మన జీవితం లో ఎగుడు దిగుడులు ఉన్నట్టే స్టాక్ మార్కెట్ , రాజకీయాల్లో ఎగుడు దిగుడు ఉంటాయి .
తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక ఉప ఎన్నికల్లో ఆంధ్ర , తెలంగాణల్లో టీడీపీ డిపాజిట్లు కోల్పోయింది . అలాంటి టీడీపీ 2014లో ఆంధ్రాలో అధికారంలోకి వచ్చింది . ఉద్యమ కాలంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అసలు పోటీ కూడా చేయని తెరాస హైదరాబాద్ చరిత్రలోనే తొలిసారి 99 సీట్లు గెలిచింది . ఐదేళ్ల పాలన తరువాత ఆంధ్రాలో 23 సీట్లకు పరిమితం అయిన టీడీపీ , ఇప్పుడు వైయస్ ఆర్ కాంగ్రెస్ ను 11 సీట్లకు మరిమితం చేసింది . రెండు చోట్ల ఓడిపోయిన పవన్ ఇప్పుడు 21 స్థానాల్లో జనసేన పోటీ చేసి 21 చోట్ల గెలిచింది . వంద శాతం విజయం ఇదో రికార్డ్ .
చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టి ఓడిపోయినప్పుడు ఏం చేద్దాం అని అభిప్రాయాలు సేకరిస్తూ టీడీపీలో ఉన్నప్పుడు బాగా పరిచయం ఉన్న ఎ యం . రాధాకృష్ణ ఫోన్ చేసి చిరంజీవి అడుగుతున్నారు ఏం చేస్తే బాగుంటుంది అని అడిగారు . రాజకీయం వేరు , సినిమాల్లో హీరోలు వేరు . అన్నీ సమకూర్చాక హీరో వచ్చి నటిస్తాడు . రాజకీయం అలా కాదు చాలా ఓపిక ఉండాలి . వచ్చే ఐదేళ్ల వరకు పార్టీని నిలబెట్టి ఉద్యమాలు చేయగలరు అనుకొంటే ఒకే . అంత ఓపిక లేదు అనుకొంటే కాంగ్రెస్ లో విలీనం అయితే రాజ్యసభ , మంత్రి పదవి తో కాలక్షేపం చేయవచ్చు అని న అభిప్రాయం చెప్పాను . ప్రజారాజ్యం నుంచి గెలిచిన శాసన సభ్యులు చిరంజీవిని కలిసి కాంగ్రెస్ లో కలిసి పోతున్నాం మీరు వస్తే మీ నాయకత్వంలో కలుస్తాం , లేదంటే మేమే కలిసి పోతాం అని చెప్పడంతో చిరంజీవి కాంగ్రెస్ లో కలిసిపోయారు . ఎన్టీఆర్ ను దించేసే సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు వర్గం శాసన సభ్యులు సైతం సరిగ్గా ఇదే డైలాగు వినిపించారు . సినిమా నటులు రాజకీయ పార్టీలను నడపడం అంత ఈజీ కాదు . పవన్ కళ్యాణ్ పార్టీకి 21 సీట్లు వచ్చినా నా అభిప్రాయం అదే . చంద్రబాబు వంద శాతం రాజకీయ నాయకుడు . పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కాదు . యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో మాత్రమే . ఈ విషయం కాలమే చెబుతుంది . చంద్రబాబు రాజకీయం ముందు విశ్వ విఖ్యాత నట సార్వభౌముడే నిలువ లేక పోయారు .
పడిపోయిన స్టాక్ మళ్ళీ లేస్తుంది . పాతాళంలోకి వెళ్లిన సత్యం ఆకాశంలోకి దూసుకువెళ్లింది . ఆకాశంలోకి వెళ్లిన స్టాక్ పడిపోనూ పోవచ్చు . ఈ పోస్ట్ రాసేప్పుడు స్టాక్ మార్కెట్ ఇండెక్స్ చూస్తే నా ఫోర్ట్ పోలియో ఈ రోజు మూడు శాతం మైనస్ లో ఉంది . కొంత పోస్ట్ రాసి ఇప్పుడు మళ్ళీ చూస్తే మూడు శాతం మైనస్ కవర్ కావడంతో పాటు అరశాతం ప్లస్ లోకి వచ్చింది . 1990 ప్రాంతంలో స్టాక్ మార్కెట్ గురించి తెగ చదివే అలవాటు ఉండేది . ఆంధ్ర ప్రభ దినపత్రికలో ఆదివారం స్టాక్స్ రికమండేషన్స్ వచ్చేవి . యునిటెక్ అనే ఓ స్టాక్ 40 రూపాయలు ఉండేది . ఎందుకో అది బాగా గుర్తుండి పోయింది . ఈ మధ్య మిత్రులతో చర్చిస్తూ ఆ స్టాక్ ప్రస్తావన వచ్చింది . మూడున్నర దశాబ్దాల తరువాత ఆ స్టాక్ ఎక్కడుందో చూద్దాం అని గూగుల్ లో సెర్చ్ చేస్తే తొమ్మిది రూపాయల వద్ద కనిపించింది . 500 కూడా ఆ స్టాక్ కాలం కాటేయడంతో మూడున్నర దశాబ్దాల తరువాత 9 రూపాయల వద్ద తచ్చాడుతోంది .. ఆంధ్రాలో కాంగ్రెస్ లా ..
ఆంధ్ర పప్పు అని గెలిచేసిన లోకేష్ ఘన విజయం సాధించారు . జాతీయ స్థాయిలో బీజేపీ సోషల్ మీడియా దశాబ్దన్నర కాలం నుంచి జాతీయ స్థాయిలో పప్పు అని రాహుల్ గాంధీని గేలి చేసింది . అదే పప్పు తనను తాను దేవుడిని అని ప్రచారం చేసుకున్న మోడీకి చుక్కలు చూపించారు . వచ్చే ఎన్నికలకు దేవుడికి విశ్రాంతి ఇచ్చి రాహుల్ గాంధీ ప్రధాని కావచ్చు కూడా . తాను చీదరించుకున్న చంద్రబాబు , నితీష్ కుమార్ ల మధ్దతుతో ఇప్పుడు దేవుడు ప్రజలను పాలించబోతున్నారు . తెరాస లో ఒక సాధారణ చోటా నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి . ఒకప్పుడు మూడు రూపాయలు ఉన్న బజాజ్ ఫైనాన్స్ స్టాక్ ఇప్పుడు తొమ్మిది వేల రూపాయలను దాటి పది వేల రూపాయల వైపు పరుగులు తీస్తోంది . నిన్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు అన్ని స్టాక్స్ దాదాపు 20 శాతం వరకు పడిపోతే , చంద్రబాబు కు చెందిన హెరిటేజ్ 5 శాతం పెరిగింది . కాలం కలిసి వస్తే అంతే .
రాజకీయాల్లో అయినా , స్టాక్ మార్కెట్లో అయినా ఓపిక ఉన్నవారికే ఫలాలు అందుతాయి . కరోనా సమయంలో నాగార్జున కంస్ట్రక్షన్ స్టాక్ 17 రూపాయలు , ఇప్పుడు 280 . 17 రూపాయలప్పుడు ఓపిక వహిస్తే 280 అవుతుంది . 23 సీట్లు వచ్చినప్పుడు ఓపిక వహించిన నాయుడుకి 135 వచ్చాయి . జూదగాళ్ళకు నిమిషంలో ఫలితం తేలవచ్చు . లాంగ్ టైం ఇన్వెస్టర్లు లాభాల పంట చూడాలి అంటే దీర్ఘకాలిక ఓపిక , సహనం అవసరం . జీవితం , రాజకీయం , స్టాక్ మార్కెట్ అన్నీ వ్యాపారాలే . ఏ వ్యాపారం కైనా ఓపిక అవసరం . సబర్ కా ఫల్ మీటా హోతా హై అంటారు . గీతలో కృష్ణుడు చెప్పినట్టు నీ పని నువ్వు చెయ్ ఫలితం ఆశించకు . ఫలితం అదే వస్తుంది . స్టాక్ మార్కెట్ లో నైనా రాజకీయ మార్కెట్ లో నైనా .. - - - బుద్దా మురళి
21, మే 2024, మంగళవారం
అతని జోస్యం 33 ఏళ్లకు ఫలించింది - నా జోస్యం కూడా--జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 110
జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 110అతని జోస్యం 33 ఏళ్లకు ఫలించింది - నా జోస్యం కూడా -----------------మీడియాకు సంబంధించి కొన్ని ప్రపంచ రికార్డులు ఉన్నా ఎవరూ, ఎక్కడా నమోదు చేయడం లేదు . జర్నలిస్ట్ యూనియన్ కు నాయకత్వం వహించేవారు . మీడియా లో కార్మిక సంఘాలకు నాయకత్వం వహించేవారు , చివరకు సిఇఓలు ఐదారు దశాబ్దాల పాటు కొనసాగి రికార్డ్ సృష్టిస్తున్నారు కానీ అవి నమోద కావడం లేదు . నైజాం కాలం నుంచి అప్రతిహతంగా లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ఇంగ్లీష్ దినపత్రిక గా డక్కన్ క్రానికల్ ది ఎవరూ అధిగమించలేని రికార్డ్ . ఈ పత్రిక కార్మిక సంఘానికి 57 ఏళ్ళ నుంచి సంజీవరెడ్డి అధ్యక్షునిగా కొనసాగడం ఇంకో రికార్డ్ అయితే సిఇఓ 50 ఏళ్ళ పాటు కొనసాగడం మరో రికార్డ్ . జలగం వెంగళ రావు సీఎం కావడం కన్నా ముందు నుంచి మిమ్ములను చూస్తున్నాను . ఎంతో మంది సీఎంలు మారారు . మీరు మాత్రం ఇంకా యూనియన్ నాయకులుగా అలానే ఉన్నారు ? ఇది ఎలా సాధ్యం అని వై యస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు యూనియన్ నాయకులను ఓ సారి బహిరంగంగానే సరదాగా ప్రశ్నించారు . వైయస్ ఆర్ జమానా పోయి జగన్ జమానా వచ్చినా వారే నాయకులు . డక్కన్ క్రానికల్ లో ఇంతకన్నా సీనియర్లు ఉన్నారు . 94 ఏళ్ళ సంజీవరెడ్డి గత 56 ఏళ్ళ నుంచి డక్కన్ క్రానికల్ కార్మిక సంఘం అధ్యక్షులు . థామస్ అని క్రానికల్ గ్రూప్ కు సిఇఓ ఉండేవారు . 20 ఏళ్ళ వయసులో ఉద్యోగంలో చేరి 50 ఏళ్ళు గడిచాక 70 ఏళ్ళ వయసులో తనంతట తానే రాజీనామా చేసి వెళ్లిపోయారు . ఒక ఉద్యోగి 50 ఏళ్ళు కొనసాగి ఇక చాలు అని వెళ్లడం ఆడో రికార్డ్ .
****అవి టైమ్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభిస్తున్న సమయం . జాతీయ పత్రిక . సహజంగా పోటీ అని టెన్షన్ ఉంటుంది . అప్పుడు ఆంధ్రభూమికి పతంజలి సంపాదకులు . అందరూ ఏమవుతుందా ? అని కంగారు పడుతుంటే పతంజలి నింపాదిగా డక్కన్ క్రానికల్ ను వెంకట్రామ్ రెడ్డి ( యజమాని ) నే ఏమీ చేయలేక పోయారు . టైమ్స్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది . ఏమైనా చేస్తే వెంకట్రామ్ రెడ్డి చేసేవారు ఆయనే ఏం చేయలేక పోయారు అంటే డిసి ని ఎవరూ ఏమీ చేయలేరు . ఏమీ కాదు అని భరోసా ఇచ్చారు . అంతకు ముందు రామోజీరావు ఎంతో ఇష్టంగా ప్రారంభించిన న్యూస్ టైం సైతం డిసి ముందు నిలువ లేక పోయింది . పతంజలి జోస్యం నిజమైంది . టైమ్స్ ఆఫ్ ఇండియనే కాదు ఆ తరువాత వచ్చిన బ్యాంకు లోన్ సంక్షోభం సైతం డిసి ని ఏమీ చేయలేదు . లార్జెస్ట్ సర్క్యులేటెడ్ అనే కిరీటం అలానే ఉంది .
*****
జొన్నలగడ్డ రాధాకృష్ణ సహకారంతో 1987లో నేను ఆంధ్రభూమిలో స్టాఫ్ రిపోర్టర్ గా చేరి సిఇఓ థామస్ వద్దకు వెళితే అయన ఎందుకు చేరారు ? ఆంధ్రభూమి మూసేస్తారు అని పలికారు . మన నోటి నుంచి ఎప్పుడూ వ్యతిరేక మాటలు రావద్దు అని పైన తధాస్తు దేవతలు ఉంటారు అంటారు పెద్దలు . ఏ ముహూర్తంలో అయన ఆ మాట అన్నారో కానీ ఆ జోస్యం 33 ఏళ్ళ తరువాత నిజం అయింది . కరోనా కాలంలో మూసేశారు . ఆంధ్రభూమి మూసేస్తారు అనేది థామస్ కు ఒక ఊత పదం . ఎప్పుడు మాట్లాడినా అదే మాట అనేవారు . అదేదో సామెత చెప్పినట్టు యజమానికే తన సొంత పేపర్ పై ప్రేమ లేనప్పుడు సిఇఓ కు ఎందుకు ఉంటుంది . థామస్ జోస్యం చెప్పినట్టూ వారి గురించి నేనూ ఓ జోస్యం చెప్పాను . 87లో రిపోర్టర్ లకు ఇప్పటిలా పెద్దగా సౌకర్యాలు ఉండేవి కావు . వార్తలు పేపర్ పై రాసి జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ కు పంపించాలి .
వార్తలు రాయడానికి అవసరం ఐన వైట్ పేపర్ కోసం నేను బిల్లు పెడితే థామస్ అది చూసి ఇదేంటి అని అడిగి తనతో పాటు నన్ను గోదాం లోకి తీసుకువెళ్లి కొద్ది సేపు కనిపించకుండా మాయం అయి ఒక పెద్ద పేపర్ బండిల్ తెచ్చి ఇచ్చారు . ఏదో ఒక రోజు ఇతను ఈ పత్రికకు ఓనర్ అవుతాడు అనుకున్నాను . కొత్త ఉద్యోగిని కాబట్టి పైకి అనలేదు తోటి జర్నలిస్టులతో అన్నాను . ఓనర్ కాలేదు కానీ విన్న దాని ప్రకారం ఓనర్ కన్నా మంచి స్థితిలో ఉన్నారు అని విన్నాను . బ్యాంకులకు వేల కోట్ల రూపాయల అప్పు చెల్లించలేక చేతులు ఎత్తేసిన తరువాత యజమాని జైలుకు వెళ్లగా 2018లో థామస్ 50 ఏళ్ళ సుదీర్ఘ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు . థామస్ కేరళలో మరణించారు అనే వార్త చూశాక కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి . ****నేను ఎడిటర్ మనిషిని అని మిగిలిన వారిని బెదిరిస్తున్నాను అని ఓ మిత్రుడు తప్పుడు ఫిర్యాదు చేయడంతో థామస్ ఓ సారి పిలిచి ఎడిటర్ శాస్త్రి , నేను , నువ్వు ఇక్కడ అందరం కూలీలమే . ఒకరు పెద్ద కూలీ ఇంకొకరు చిన్న కూలి అంతే తప్ప అందరం కూలీలమే అని చెప్పారు . ఈ విషయం నాకూ తెలుసు , నేను ఇక్కడ మనుషుల కన్నా నా ఉద్యోగానికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను , ఎందుకంటే నాకు ఇంకో ఆదాయం ఏదీ లేదు అని చెప్పాను . నిజానికి థామస్ చెప్పింది చాలా ప్రాక్టికల్ మాట. చాలా మంది తాము సంస్థలో విడదీయరాని భాగం అనుకుంటారు . ఉద్యోగం ఊడబీకి రోడ్డున పడేసిన తర్వాత కానీ తాము కూలీలం అని అర్థం కాదు . యజమాని , సిఇఓ , ఎడిటర్ ఎవరి వ్యవహారం వారిదే ఒకరి జోలికి ఇంకొకరు వెళ్లకుండా ఎవరికి కావలసింది వారు చక్కబెట్టుకున్నారేమో అనిపిస్తోంది . ఏ ముహూర్త బలంలో డిసి బయటకు వచ్చిందో కానీ ... ముహూర్త బలం లేకపోతే ఇంతకాలం ఉండేది కాదు అనిపిస్తుంది . అద్భుతమైన సంస్థ ఎలా దెబ్బ తింటుందో స్టడీ చేస్తే ఎంబీఏ డిగ్రీని మించిన ప్రాక్టికల్ జ్ఞానం లభిస్తుంది .
- బుద్దా మురళి (21-5-2024)
18, ఏప్రిల్ 2024, గురువారం
ఎన్నికల్లో పండని అలిపిరి సానుభూతి పంట జర్నలిస్ట్ జ్ఞాపకాలు -109
ఎన్నికల్లో పండని అలిపిరి సానుభూతి పంట
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -109
-------------------------------------------------------
అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం నక్సలైట్లకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు మంత్రి గా ఉన్న మణికుమారి భర్తను నక్సలైట్లు హత్య చేశారు . భర్త ను నక్సల్స్ హత్య చేసినప్పుడు ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆమె సానుభూతి పవనాల ప్రభావం తో ఘన విజయం సాధించి ఉండాలి . గెలుపు మాట దేవుడెరుగు రెండవ స్థానం కూడా రాలేదు . నాలుగవ స్థానంలో నిలిచారు .
ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై రాయితో దాడి జరగగానే అది సానుభూతి కోసం ఆడిన డ్రామా అని టీడీపీ వర్గం , ఇది బాబు జరిపిన కుట్ర అంటూ వై యస్ ఆర్ వర్గం పరస్పరం మాటల దాడులు జరుపుకుంటున్నారు .
రాజకీయ సానుభూతి ఆరోపణల తో ఉమ్మడి రాష్ట్రంలో అతి పెద్ద సానుభూతి రాజకీయ ఎత్తుగడలు గుర్తుకు వచ్చాయి .
1999 ఎన్నికల్లో వాజ్ పాయి ఒక్క ఓటు తో ఓడిపోవడం ఆ సానుభూతి , గురిచూసి కొట్టినట్టు బాబు అదే సమయంలో బీజేపీతో జతకట్టి స్వల్ప తేడాతో తిరిగి అధికారంలోకి వచ్చారు . వరుసగా నాలుగేళ్ళ కరువు , తెలంగాణ ఉద్యమం , విద్యుత్ ఉద్యమం తో ఈ సారి బాబు ఓటమి ఖాయం అనే అభిప్రాయం బలంగా ఏర్పడింది . ఆ సమయంలో తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు వెళుతుండగా నక్సల్స్ బాబు కారు ను బాంబులతో పేల్చేశారు . బాబుతో పాటు , గోపాల కృష్ణారెడ్డికి తీవ్ర గాయాలు , బట్టలు రక్తసిక్తం అయ్యాయి .
బాబు ఇంటికి వచ్చాక రాజకీయం మొదలైంది . సానుభూతి పవనాలతో విజయం సాధించడం ఖాయం అనే ఆలోచనతో ముందస్తు ఎన్నికలకు సిద్ధం అయ్యారు . మొదట జ్యోతిలో ముందస్తు ఎన్నికలకు అని రాయించారు . అలిపిరి సంఘటన తరువాత బాబు మీడియాతో మాట్లాడలేదు . ఈ వార్త వచ్చిన రెండు రోజులకు ముఖ్యమంత్రి చీఫ్ పిఆర్ ఓ విజయ కుమార్ నుంచి ఫోన్ ... బాబు మీడియాతో మాట్లాడుతారు , ఐతే మీరెవ్వరు ఏమీ అడగవద్దు .. బాబు చెప్పింది విని వెళ్ళాలి ఆ షరతుకు ఒప్పుకుంటే రావాలి అని పిలుపు .. సరే అని మీడియా వెళితే చేతికి కట్టుకట్టుకొని ఉన్న బాబు గంటకు పైగా ఉపన్యాసం . ఐదేళ్ల కాలం లో తాను ఎలా అభివృద్ధి చేసింది , తిరిగి తానే ఎందుకు సీఎం కావాలో చెప్పుకుపోయారు . అచ్చం ఎన్నికల ప్రచారంలో ఉపన్యాసం లానే సాగింది .
ఏమీ అడగవద్దు అనే షరతు వల్ల ఎవరూ ఏమీ అడగకుండానే బయటకు వచ్చారు . బాబు మనోగతం అంటూ ఏమన్నా రాయించదలుచుకుంటే జ్యోతి లేదా ఈనాడు , ఒక్కోసారి రెండింటికి చెబుతారు . ముందస్తు అని జ్యోతిలో రావడంతో ఈనాడు మిత్రుడికి అది నమ్మబుద్ది కాలేదు . బాబు ఉపన్యాసం వింటే ఎన్నికల ఉపన్యాసంలానే ఉంది . సానుభూతిపై ఆశలు పెట్టుకొని ముందస్తుకు వెళతారు అనే అనిపిస్తోంది అని బయటకు వచ్చాక జరిగిన చర్చలో నా అభిప్రాయం చెప్పాను . అప్పటి నుంచి బాబు ఇంటి వద్ద సానుభూతి రాజకీయాలు ఉదృతం అయ్యాయి .
తొలుత మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తమ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులను బాబు నివాసానికి తీసుకువచ్చి బాబు అంకుల్ మీరు త్వరగా కోలుకోవాలి అని గులాబీ పూలు ఇవ్వడం .. మీడియాలో దీనికి మంచి కవరేజ్ వచ్చింది . స్కూల్ పిల్లల తరువాత అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా పరామర్శ యాత్రలు నిర్వహించారు . అంటే ఏ అసెంబ్లీ నియోజక వర్గం క్యాడర్ , నాయకులు ఏ రోజు రావాలో ముందుగానే సమాచారం ఇస్తే ఆ రోజు వచ్చే వాళ్ళు . చెప్పకుండానే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు .
సానుభూతి పై టీడీపీ చాలా ఆశలు పెట్టుకొంది .
ఐతే బయట ప్రజల్లో మాత్రం ఈ ప్రభావం ఏమీ లేదు . కృత్రిమ వర్షాలు కురిపించినట్టు , కృత్రిమ సానుభూతి పవనాలు కురిపించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శలు చేసింది . ముందు బాబు కుడి చేతికి కట్టు ఉండేది , తరువాత దాన్ని ఎడమ చేతికి మార్చుకున్నారు అని కే . రోశయ్య చేసిన విమర్శ దుమారం లేపింది .
బాబు కారు కింద నక్సల్స్ బాంబులు పేల్చింది , గాయాలు తగిలింది అంతా నిజమే . కానీ అప్పుడు బాబు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వల్ల బాంబు దాడి అంతా డ్రామా నెమో అని భావించిన వారు , ప్రచారం చేసిన వారు కూడా ఉన్నారు .
ఎన్నికల ఫలితాల వరకు అవసరం లేదు .. దడి జరిగినప్పుడే సానుభూతి పని చేయడం లేదు అని తెలిపే సంఘటన ఒకటి ...
శంకర్ రెడ్డి అని తిరుపతిలో టీడీపీ నాయకులు ( అప్పటి మున్సిపల్ ఛైర్మెన్ ), చదువుకునే రోజుల నుంచి బాబు మిత్రుడు . అతనే ఓ సారి టీడీపీ కార్యాలయంలో చెప్పిన విషయం. బాంబు దాడిలో బాబు దుస్తులు రక్తంతో తడిచిపోయాయి . దాడి తరువాత తిరుపతిలో షాప్స్ మొత్తం బంద్ చేస్తారని షట్టర్ తెరిచి బట్టలు తేగలడు అని శంకర్ రెడ్డిని పంపితే , షాప్స్ అన్నీ తెరిచే ఉన్నాయట . ఒక్క షాప్ కూడా మూయలేదు .
సానుభూతి పై బోలెడు ఆశలు పెట్టుకున్నా ఆ ఎన్నికల్లో సానుభూతి పని చేయలేదు . టీడీపీ చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా కేవలం 47 సీట్లు మాత్రమే వచ్చాయి . మంత్రి మణికుమారి భర్తను నక్సల్స్ హత్య చేస్తే ఆ ఎన్నికల్లో ఆమెకు డిపాజిట్ కూడా రాలేదు .
****
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సభలో శాంతిభద్రతల గురించి సీరియస్ చర్చ . తెరాస నుంచి గెలిచి, కాంగ్రెస్ లో చేరిన మందాడి సత్యనారాయణ తో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడించారు . శాంతి భద్రతల వైఫల్యం అంటూ బాబు ఆవేశంగా మాట్లాడితే .. ముడ్డి కింద బాంబు పిలిస్తే దిక్కులేదు .. శాంతిభద్రతల గురించి మీరా మాట్లాడేది అంటూ మందాడి దాడి చేశారు .
***
అలిపిరి బాంబు దాడి , కోడి కత్తి , తాజాగా జగన్ పై రాయితో దాడి అన్నీ నిజమే .ఏ పార్టీ నాయకులైన రాజకీయాల్లో ఉండేవాళ్ళు మహా ముదుర్లు . యూ ట్యూబర్ల అంత చిల్లర ఆలోచనల్లో ఉండరు . తమ మీద తామే దాడి జరుపుకొని , సానుభూతి వస్తుంది అనుకునేంత అమాయకులు కాదు . . ఓటర్లు అనేక కోణాల్లో అలోచించి ఏ పార్టీకి ఓటు వేయాలో నిర్ణయించుకుంటారు . సహజంగా రెండు పక్షాలు ఈ అంశంపై తమ తమ రాజకీయ కోణం నుంచి మాట్లాడుతుంటారు . ఐతే అలిపిరి దాడి సమయంలో వై యస్ రాజశేఖర్ రెడ్డి తెలివిగా వ్యవహరించారు . బాంబు దాడి జరిగిన సమయంలో ఆంధ్రాలోనే ఉన్న రాజశేఖర్ రెడ్డి వెంటనే రోడ్డు మీద బైటయింది ధర్నా చేశారు . దాడిని ఖండిస్తున్నట్టు , దోషులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు . టీడీపీ వాళ్ళు తేరుకోక ముందే కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్నా చేయడం ప్రత్యేకంగా నిలిచింది.
- బుద్దా మురళి .
21, ఫిబ్రవరి 2024, బుధవారం
అయోధ్య , కాశ్మీర్ , తెలంగాణ కన్నాకష్టం జర్నలిస్ట్ ల" ఇంటి "సమస్య ... ఓ జర్నలిస్ట్ ఇంటి స్థలం కథ @ 1987 జర్నలిస్ట్ జ్ఞాపకాలు 108
అయోధ్య , కాశ్మీర్ , తెలంగాణ కన్నాకష్టం జర్నలిస్ట్ ల" ఇంటి "సమస్య ఓ జర్నలిస్ట్ ఇంటి స్థలం కథ @ 1987 జర్నలిస్ట్ జ్ఞాపకాలు 108
---------------------------------------కొన్ని దశాబ్దాల క్రితం జర్నలిస్ట్ ల మధ్య చర్చలో అయోధ్య - బాబ్రీ మసీదు , కాశ్మీర్ , తెలంగాణ ఈ మూడు ఎప్పటికీ పరిష్కారం లేని సమస్యలు అనే అభిప్రాయం వినిపించేది . అసలు పరిష్కారమే లేదు అనుకొన్న ఈ మూడు సమస్యలకు కూడా మన కళ్ళ ముందే పరిష్కారం లభించింది . కానీ మహానగరంలో జర్నలిస్ట్ ల ఇంటి స్థలం సమస్య మాత్రం ఈ మూడు సమస్యలకన్నా జటిలంగా మారింది . ప్రతి మనిషికి సొంత ఇల్లు ఉండాలి అనే ఓ కల బలంగా ఉంటుంది . హౌసింగ్ సొసైటీ లో తనకూ ఓ ప్లాట్ దక్కాలి అని జర్నలిస్ట్ గా అక్షరాబ్యాసం చేసినప్పుడే జర్నలిస్ట్ మనసులో బలంగా ఉంటుంది .
*********1987 సెప్టెంబర్ నెలలో ఆంధ్రభూమి కార్యాలయంలో అపాయింట్ మెంట్ లెటర్ తీసుకోని నిలబడ్డాను . హైదరాబాద్ వీడి వెళుతున్నానని బాధ . ఉద్యోగం వచ్చింది అని సంతోషం . అప్పుడు ఆంధ్రభూమి న్యూస్ ఎడిటర్ గా ఉన్న రాధాకృష్ణ ఒకే జిల్లా కాదు , కులం కాదు ... నా రాతలంటే బోలెడు అభిమానం . ఎలాగైనా జీవితంలో బాగుపడేట్టు చేయాలి అనుకోని లెటర్ ఇస్తూ" మెదక్ జిల్లా రిపోర్టర్ గా వెళ్ళు .. అక్కడ జర్నలిస్ట్ ల హౌసింగ్ సొసైటీ ఉంటుంది . వెళ్ళగానే ముందు ఆ సొసైటీ లో సభ్యత్వం తీసుకో ..... నేను విశాఖలో ఉండగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఏర్పాట్లు అన్నీ పూర్తి అయి రెండు రోజుల్లో ఇస్తారు అనగా నేను కలెక్టర్ మీద ఓ వార్త రాశాను . దానితో కలెక్టర్ కు మండింది . అన్నీ రద్దు చేశాడు . అందరూ దెబ్బ తిన్నారు" అంటూ తన విషాద భరిత ఇంటి స్థలం కథ చెప్పుకొచ్చారు . తనదే కాదు ఇది చాలా మంది అంతులేని కథ అని ఆ రోజు రాధాకృష్ణ ఉహించి ఉండరు . మెదక్ జిల్లా రిపోర్టర్ గా సంగారెడ్డిలో ఉన్నప్పుడు ఆంధ్రప్రభ నుంచి వారానికి ఓ రిపోర్టర్ హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వచ్చేవారు .1988-89 లో ఓ వారం అంజయ్య వచ్చినప్పుడు హైదరాబాద్ లో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యత్వం తీసుకో అని సలహా ఇస్తే ... నేను పని చేసేది మెదక్ జిల్లాలో హైదరాబాద్ లో ఎలా తీసుకుంటా అని ప్రశ్నించా ... నీకెందుకు నేను చెబుతున్నాను కదా ? అని చెప్పినా వినలేదు . ఓ దశాబ్ద కాలం గడిచాక 95లో ప్రెస్ క్లబ్ లో మద్య నిషేధం తక్షణం ఎత్తివేయాలి అంటూ అప్పటి సీఎం బాబు సమక్షంలో జర్నలిస్ట్ యూనియన్ సమావేశం . బాబు తలుచుకుంటే మల్లాది సుబ్బమ్మ తో సీకులు అమ్మించగలరు . అయన కోసం మనం డిమాండ్ చేయడం ఏమిటీ అని ఆవేశంగా మాట్లాడి కిందకు వచ్చాక ... ప్రెస్ క్లబ్ తో పాటు , హౌసింగ్ సొసైటీ వ్యవహారాలు చూసే ఉద్యోగి ఒకరు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి తనను తాను పరిచయం చేసుకొని , మీకు హౌసింగ్ సొసైటీలో సభ్యత్వం ఉందా ? అని అడిగితే ఎప్పుడంటే అప్పుడు ఇవ్వరు కదా ? అని బదులిచ్చాను . ఇదిగో ఫారం నింపి ఇవ్వండి అని అక్కడి కక్కడే సొరుగు నుంచి ఫారం తీసి ఇచ్చాడు . అలా 95లో సభ్యత్వం . గోపన్ పల్లిలో సందడిగా సభ్యుల సమావేశం ప్లాట్ ల కేటాయింపు కుటుంబ సమేతంగా సభ్యులు వచ్చారు . ఇప్పటి వరకు మన సొసైటీలో రాష్ట్రంలో ఎక్కడ పని చేసేవారైనా సభ్యత్వం తీసుకోవచ్చు అనే నిబంధన ఉంది , దీనిని సవరించి హైదరాబాద్ లో పని చేసేవారికే సభ్యత్వం అనే నిబంధన పెడదాం జనరల్ బాడీ ఆమోదిస్తే , అని చదివి చప్పట్లతో ఆమెదించిన తరువాత కానీ ... ఇలాంటి నిబంధన ఒకటి ఉందని తెలియలేదు . ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడెక్కడో పని చేసిన వారు హైదరాబాద్ లో సభ్యత్వం పొందింది ఈ నిబంధన వల్లే . దీనిని ఎత్తివేసిన తరువాత కానీ నాలాంటి వారికి తెలియలేదు . 95 నుంచి వెయిటింగ్ లిస్ట్ కే పరిమితం .అంటే ఆశగా మా అన్నది ఇంతకన్నా విషాదం . కరీం నగర్ లో ఈనాడు ఎడిషన్ పెట్టినప్పుడు హైదరాబాద్ నుంచి కొందరిని అక్కడకు బదిలీ చేశారు . అప్పుడు సొసైటీ అధ్యక్షుడు ఈనాడులోనే ఉన్న రాహుల్ . మీకు బదిలీ అయింది కదా ? మీ సభ్యత్వం వెనక్కి తీసుకోండి అని రాహుల్ సలహా . ఎక్కడెక్కడి వారికో విశాల హృదయంతో హైదరాబాద్ లో సభ్యత్వం ఇచ్చిన పెద్దలు హైదరాబాద్ లో పుట్టి , హైదరాబాద్ లోనే జర్నలిస్ట్ గా పని చేస్తున్న వారికి బదిలీ అయింది అని సభ్యత్వం వెనక్కి ఇచ్చారు . నా ఒక్కడికే ఈ నిబంధన ఏమిటీ , మీ వారిసభ్యత్వం ఎందుకు రద్దు చేయరు , ప్లాట్స్ మీ సొంత జాగీరు కాదు కదా ? అని ప్రశ్నించక పోవడం తప్పు . గోపన్ పల్లిలో 9 ఎకరాలు ఉంది , ప్రభుత్వం అది ఇస్తే వెయిటింగ్ లో ఉన్న అందరికీ ప్లాట్ వస్తుంది అంటే ఆశగా ఎదురు చూపులు . ********2004 ఎన్నికలకు సన్నాహాలు . ఓ రోజు టీడీపీ బీట్ రిపోర్టర్ లు అందరూ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో మాట్లాడుతుంటే ... బాబుగారిని కలిసి మీ సొసైటీకి ల్యాండ్ కేటాయించమని అడగండి అని సలహా ... ఎప్పుడో అడిగాం , జర్నలిస్ట్ లకు ల్యాండ్ ఇవ్వడం మా పాలసీ కాదు , ఇవ్వం అని నిర్మొహమాటంగా చెప్పారు అని సమాధానం . అప్పటి మాట వదిలేయండి ఇది ఎన్నికల సమయం , ఎవరు ఏది అడిగినా ఇస్తున్నారు అని ఉమ్మారెడ్డి సలహా . గుర్తున్నంత వరకు నేను , అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్న రాముశర్మ , జ్యోతి వాసిరెడ్డి శ్రీనివాస్ , ఈనాడు సీఎస్ ఆర్ , సారధి బాబును కలిసి సొసైటీకి స్థలం అడిగితే ఒకే అని బదులిచ్చారు . టీడీపీ బీట్ రిపోర్టర్ లు బోలెడు ఆనందపడిపోయారు .తరువాత సచివాలయ రిపోర్టర్ లు సంబంధిత అధికారిని కలిస్తే .. రిపోర్టర్ లు అందరూ వెళ్లి అడిగితే ఏదో బాబు అలా హామీ ఇచ్చారు కానీ , మాకు ఏమీ చెప్పలేదు . మీరు ఆశలు పెట్టుకోకండి అని ఆశల మీద నీళ్లు చల్లారు . ఐతే బాబు ఉట్టుట్టి హామీ ఇచ్చినా ... తరువాత సొసైటీకి ల్యాండ్ కేటాయింపులో ఈ ఉట్టుట్టి హామీ ఎంతో మేలు చేసింది . టీడీపీ బీట్ రిపోర్టర్ లు ఎన్నికల ముందు బాబును కలిస్తే , కాంగ్రెస్ బీట్ రిపోర్టర్ లు గుర్తున్నంత వరకు నేమాని భాస్కర్ , వంశీ ఇతర రిపోర్టర్ లు వై యస్ ఆర్ ను కలిసి ఈ ఎన్నికల్లో బాబు గెలిస్తే సొసైటీకి ల్యాండ్ ఇస్తాను అని హామీ ఇచ్చారు . మీరు గెలిస్తే మీరు ఇవ్వాలి అని ఓ వినతి పత్రం ఇస్తే వైయస్ ఆర్ సరే అని హామీ ఇచ్చారు . జర్నలిస్టులు 9 ఎకరాల గురించి వినతి పత్రం ఇస్తే , అది వదిలేయండి అని వైయస్ ఆర్ అందరు జర్నలిస్టులకు సరిపోయే విధంగా 72 ఎకరాలు కేటాయించారు . *****ఐదేళ్ల సీనియారిటీ వల్ల సభ్యత్వం దక్కని వారు వైయస్ ఆర్ ను కలిస్తే న మాట విని వెళ్ళండి , 2009 లో కూడా నేనే సీఎం అవుతాను , మీ అందరికి కూడా నేనే ఇస్తాను అని చెప్పి పంపారు . ఐనా కొందరు కోర్టుకు వెళ్లడం , హై కోర్ట్ , సుప్రీం కోర్ట్ ల లో రెండు దశాబ్దాల పయనం . సామాన్యుల సమస్యలు పరిష్కరించడం అంత కష్టం కాదు . చివరకు అయోధ్య , కాశ్మీర్ సమస్య పరిష్కరించడం కూడా అంత కష్టం కాదు . కానీ మేధావుల సమస్య లు పరిష్కరించడం అంత ఈజీ కాదు .మొట్టమొదట కోర్ట్ర కు వెళ్ళింది జర్నలిస్ట్ లే .. ఒక్క సారి వ్యవహారం కోర్ట్ కు వెళితే .. తాతలు దిగివస్తారు . పెళ్లయిన కొత్తలో హౌసింగ్ సొసైటీ లో సభ్యత్వం తీసుకొంటే .. కోర్ట్ తీర్పు వచ్చేనాటికి తాత లు అయిన వారు కూడా ఉన్నారు . బాబు మాట తప్పారు , వైయస్ ఆర్ ఇచ్చారు , తరువాత వచ్చిన రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదు . తరువాత ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వ జోక్యం వల్ల, ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ రమణ గారి వల్ల సుప్రీంలో కేసు కదిలింది . తీర్పు వచ్చింది . సుప్రీం తీర్పు తరువాత నిజాం పేట స్థలం సొసైటీకి అప్పగించిన ప్రభుత్వం . పేట్ బషీర్ బాద్ స్థలం విషయం ఎటూ తేల్చలేదు . మేం అధికారంలోకి రాగానే హైదరాబాద్ ల్యాండ్ సమస్య పరిష్కరిస్తాం అని ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ హామీ . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వందరోజుల్లో హామీ నెరవేరుస్తారు అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు . ఇంకో నెల రోజుల్లో వంద రోజులు అవుతాయి . అంతులేని కథ రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు మొదలయింది . సీఎంగా కథ కు శుభం పడుతుందా ? అంతులేని కథ ఇంకా సాగుతుందా ? న్యూస్ పేపర్ లో చూడాలి . ******ఉచితంగానా ? కాదు కానే కాదు , 2005-6 లోనే ఒక్కో జర్నలిస్ట్ రెండేసి లక్షలు చెల్లించి ప్రభుత్వ ధరకు ల్యాండ్ కొన్నారు . అప్పుడు రెండు లక్షలు అంటే యాదగిరిగుట్ట , భువనగిరి ప్రాంతాల్లో ఒకటి రెండు ఎకరాల భూమి కొనవచ్చు . కొసమెరుపు : అదే సమయంలో వైయస్ ఆర్ ఐఏఎస్ , ఐ పి యస్ , శాసన సభ్యులకు ల్యాండ్ కేటాయించారు . జర్నలిస్ట్ లకు సంబంధించి కనీసం తీర్పు వచ్చింది . వారిది ఇంకా తీర్పు కూడా రాలేదు . ఇది నా ఒక్కడి కథ . ఒక్కొక్కరిది ఒక్కో పుస్తకం రాసేంత గాధ ఉంటుంది . రాస్తూ పోతుంటే అంతులేని కథకు అంతు ఉండదు . - బుద్దా మురళి
29, నవంబర్ 2023, బుధవారం
తిక్కవరపు ఇంటికి వెళ్లిన కొత్త పెళ్లి కొడుకు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి .. టీడీపీ అపవిత్రం అయిందన్న బాబు వర్గం .. అలా పుట్టింది ముసలం . జర్నలిస్ట్ జ్ఞాపకాలు -106
తిక్కవరపు ఇంటికి భోజనానికి వెళ్లిన కొత్త పెళ్లి కొడుకు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి
టీడీపీ అపవిత్రం అయిందన్న బాబు వర్గం .. అలా పుట్టింది ముసలం
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -106
----------------------
1993-94 ప్రాంతం . ఎన్టీఆర్ రెండవ వివాహం చేసుకున్న కొత్తలో . అప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది . ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి కొత్తగా వివాహం చేసుకున్న ఎన్టీఆర్ దంపతులను తన ఇంటికి భోజనానికి పిలిచారు . ఇప్పుడైతే ఐతే ఏంది ? అనిపిస్తుంది . ఆ రోజులు అలా కాదు . ఎన్టీఆర్ ను గద్దె దించడానికి పార్టీలో పుట్టిన ముసలంలో ఈ భోజనం ఎపిసోడ్ కూడా ఒక ప్రధాన పాత్ర వహించింది . ఎన్టీఆర్ దంపతులు సుబ్బిరామిరెడ్డి ఇంటికి వెళ్ళగానే బాబు వర్గం రంగంలోకి దిగింది . లక్ష్మీ పార్వతి పార్టీని అపవిత్రం చేస్తోంది అనేది ఆ వర్గం ప్రచార సారాంశం .
భోజనానికి వెళితే అపవిత్రమా ? అంటే వారి దృష్టిలో అంతే .. వారు అలా భావించడానికి ఓ కారణం ఉంది .
హిమాయత్ నగర్ లో పార్టీ కార్యాలయం ఉన్నప్పుడు , తరువాత భవన్ లో టీడీపీ నాయకులతో సరదా సంభాషణల్లో మీ పార్టీ సిద్ధాంతం ఏమిటీ అంటే పలువురు రెండు రూపాయలకు కిలో బియ్యం అని గర్వం గా చెప్పేవారు . రెండు రూపాయలకు కిలో బియ్యం సిద్ధాంతం కాదు ఆదో స్కీమ్ అని గుర్తు చేస్తే ... చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దాదాపు అందరు నాయకులు కాంగ్రెస్ వ్యతిరేకతే మా సిద్ధాంతం అనే వారు . ఒక పార్టీని వ్యతిరేకించడం మరో పార్టీ సిద్ధాంతం ఏమిటో ? ఒక వేళ కాంగ్రెస్ రంగంలో లేకుండా పోతుంది అనుకోండి అప్పుడు మీ పార్టీకి సిద్ధాంతం లేకుండా పోతుంది కదా ? అని చమత్కరించేవాడిని . నిజానికి ఆ కాలం లో కాంగ్రెస్ రంగంలో లేకుండా పోతుంది అనే మాట ఊహకు అందనిది . ఈ మూడు దశాబ్దాల కాలం లో ఆంధ్ర లో కాంగ్రెస్ లేకుండా పోతే , తెలంగాణలో టీడీపీ లేకుండా పోయింది .
*****
తిక్కవరపు ఇంటికి ఎన్టీఆర్ దంపతులు భోజనానికి వెళ్ళాక పార్టీలో బాబు వర్గం లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ను కాంగ్రెస్ కు దగ్గర చేస్తోంది అనే గుస గుస ప్రచారం మొదలు పెట్టారు .తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి కాంగ్రెస్ నాయకుడు , రాజ్యసభ సభ్యులు , కేంద్ర మంత్రి అయినా ఆయన పలుకుబడి కాంగ్రెస్ కె పరిమితం కాలేదు . ఉమ్మడి రాష్ట్రంలో ఆ కాలంలో కూడా ఆయన్ని ప్రచార పిచ్చి ఉన్న నాయకుడు అనే చూశారు కానీ ఢిల్లీలో అయన పలుకుబడి ఎలాంటిదో టీడీపీ రాజ్య సభ సభ్యులుగా ఉన్నప్పుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఓ సారి చెప్పారు . ఆయన ఢిల్లీలో పార్టీ ఇస్తే కేంద్రమంత్రులు ,ఆ న్నీ పార్టీల నాయకులు .... బడా బడా అధికారులు , సినిమా హీరోలు, హీరోయిన్ లు వచ్చేవారట . కనులతోనే ఎవరి అవసరం ఏమిటో గ్రహించేసే వారట .. అక్కడి పెద్దలు ..
అంతటి సుబ్బిరామిరెడ్డి కంస్ట్రక్షన్ సంస్థ వేల కోట్ల అప్పులతో చేతులు ఎత్తేసింది . దివాళా ప్రక్రియ సాగుతోంది .
లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ ను కాంగ్రెస్ కు చేరువ చేస్తోంది అని ప్రచారం ప్రారంభించిన బాబు వర్గం బాస్ బాబే స్వయంగా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారు .
ఆ తరువాత లక్ష్మి పార్వతిపై టీడీపీ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం . ఎన్నికలు వచ్చాయి . కాంగ్రెస్కు ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా ఘోరంగా ఓడిపోగా ఎన్టీఆర్ సీఎం అయ్యారు . 95 వెన్నుపోటులో ఎన్టీఆర్ ను దించేసిన తరువాత ఎన్టీఆర్ కాంగ్రెస్ మద్దతు కోసం ప్రయతినించారు అని మళ్ళీ వార్తలు . అప్పుడు ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు జోక్యం చేసుకోక పోవడం ద్వారా పరోక్షంగా బాబుకు సహకరించారు .
ఎన్టీఆర్ ను దించేసిన కొద్ది రోజులకే లోక్ సభ ఎన్నికలు వచ్చాయి . లోక్ సభ సీట్లు మీకు , అసెంబ్లీ మాకు .. బాబును దించేయాలి అని ఎన్టీఆర్ కాంగ్రెస్ తో మంతనాలు సాగిస్తున్నారని బాబు మీడియాలో ప్రచారం . బాబు సీఎంగా కుదురుకోవడంతో ఎన్టీఆర్ తెలుగుదేశం అని కొత్త పార్టీ ఏర్పాటు చేసి పోటీకి సిద్ధమయ్యారు కానీ ఎన్నికలు రాకముందే మరణించారు . ఎన్టీఆర్ నిజంగా కాంగ్రెస్ తో చేతులు కలిపారా ? బేరం కోసం ప్రయత్నించారా ? అంటే ఆ మాట చెప్పల్సింది ఎన్టీఆర్ , వార్తలు రాయించిన బాబు ... చెప్పడానికి ఎన్టీఆర్ లేరు . బాబు చెప్పరు .
****
సుబ్బిరామిరెడ్డి ఇంటికి ఎన్టీఆర్ దంపతులు భోజనానికి వెళ్లడం ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది అంటే ?
ఖమ్మంలో కాంగ్రెస్ నేత ప్రియాంక సభ లో టీడీపీ జెండాలు రెపరెపలడాయి . కాంగ్రెస్ సభల్లో టీడీపీ జెండాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి . ఇదేం కొత్తకాదు 2018 లోనే చెట్టాపట్టాలేసుకొని పోటీ చేశారు కదా ? అంటే నిజమే 2018 లో కాంగ్రెస్ , టీడీపీ రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఉంది . ఈ సారి పొత్తుకాదు ఒక్క సీటు కూడా ఇవ్వకపోయినా కాంగ్రెస్ విజయానికి టీడీపీ పని చేస్తోంది . కాంగ్రెస్ వ్యతిరేకతే మా సిద్ధాంతం అని సగర్వంగా ప్రకటించుకున్న పార్టీ కాంగ్రెస్ కోసం తమ పార్టీని మూసేసుకుంది . ఒక్క సీటు కూడా లేకుండా షర్మిల పార్టీ కాంగ్రెస్ తో జత కట్టింది . ఒక్క సీటు లేకుండా కోదండరాం పార్టీ కాంగ్రెస్ కోసం పని చేస్తోంది . ఆ రెండు పార్టీల దారిలోనే టీడీపీ సైతం కాంగ్రెస్ కోసం పని చేస్తోంది . 2014 కాలం లో బాబు ఏ ఉద్దేశంతో అన్నారో కానీ ఖాళీ చేయడానికి టీడీపీ బీరు సీసా కాదు అన్నారు . ఖాళీ బీరు సీసాకు కూడా కొంత విలువ ఉంటుంది . కానీ బాబు మాత్రం ఉచితంగానే తెలంగాణలో కాంగ్రెస్ కోసం టీడీపీని ఇచ్చేశారు .
బాబు గ్రేట్
----------
సుబ్బిరామిరెడ్డి ఇంటికి భోజనానికి వెళితే పార్టీని అపవిత్రం చేస్తున్నారని ప్రచారం చేసి దాన్ని నమ్మించిన బాబు ఏకంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా , ఉచితంగా కాంగ్రెస్ కోసం పని చేస్తున్నా టీడీపీ శ్రేణులు , నేతలు ఏమంటున్నారు ? అంటే ? ఏమీ అన్నారు బాబు ఏం చేసినా అదే కరెక్ట్ అనుకునేట్టు ట్యూన్ చేయడంలో బాబు విజయం సాధించారు . ప్రజలను ట్యూన్ చేయడంలో బాబు విఫలం అయి ఉండవచ్చు కానీ పార్టీని ట్యూన్ చేయడంలో ఘన విజయం సాధించారు .
- బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)