కహానీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కహానీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, ఫిబ్రవరి 2013, మంగళవారం

అసలు.. వృద్ధుడెవడు?... నిజ వ్యక్తి కథ



కహానీ.4
======
‘ఈ భాషలెవడు కనిపెట్టాడ్రా బాబూ!’ అంటూ శత్రువు సినిమాలో కోట శ్రీనివాస్‌లాగే -వినోద్ డైలాగ్ కొట్టగానే రూమ్‌లోని ఫ్రెండ్సంతా గొల్లున నవ్వుకున్నారు. వాళ్ల కంబైండ్ స్టడీలో ఇలాంటి జోకులే ఎక్కువగా పేల్తుంటాయ్. ‘ఇవే కనుక లేకపోయి ఉంటే జీవితం ఎంతహాయిగా ఉండేదో? మాతృభాష, ఫస్ట్ లాంగ్వెజ్, సెకండ్ లాంగ్వేజ్ ఇవి చాలవన్నట్టు ఏదోక విదేశీ భాష నేర్చుకోమని ఇంట్లో పోరు. వీటికితోడు అమ్మాయిల్ని ఆకట్టుకునే ‘భాష’ మనం సొంతంగా నేర్చుకోవాలి’ అని అశోక్ అనేసరికి అంతా చప్పట్లు కొట్టారు. భాషలు నేర్చుకోవడంతోనే జీవితం సరిపోతుంది -అని అంతా బాధపడ్డారు. కొద్దిసేపటికి వారి చర్చ పక్కింటి పైకి మళ్లీంది. ఏరా వినోద్ ఈమధ్య ప్రతి రోజూ ఒకే సమయానికి మీ పక్కింటికో ఆంటీ వస్తోంది. ఏంటీ కథా? అంటూ చిలిపిగా నవ్వాడు ప్రకాశ్. ‘నాకూ అదే అర్ధం కాలేదురా! పక్కింట్లోకి కొత్తగా వృద్ధ జంట దిగింది. అయినా, వాళ్లిద్దరూ వృద్ధుల్లా ఉండరు. మనకంటే ఎక్కువ ఉత్సాహంగానే ఉంటున్నారు. ఈసారి పలకరించి, విషయమేంటో తెలుసుకోవాలి’ అని వినోద్ బదులిచ్చాడు.
***
‘నమస్కారం అంకుల్’ -దారిలో ఎదురుపడిన పక్కింటి వ్యక్తిని పలకరించాడు వినోద్. రేబాన్ అనుకుంటా అని మనసులోనే నవ్వుకున్నాడు కంటి అద్దాలను చూసి. వినోద్ పరిచయంతో ఆ వ్యక్తి ఇంట్లోకి ఆహ్వానించాడు. కొద్ది సేపటికే ఒకమ్మాయి వచ్చింది. ‘్ఫరవాలేదు కూర్చో’ అని వినోద్‌కు చెప్పి, ఆ వృద్ధుడు మాత్రం ఆమె ముందు విద్యార్థిగా మారిపోయాడు. అర్థంగాకుండా అయోమయంగా ఆమె చేతిలోని బుక్‌వైపు చూస్తున్న వినోద్‌తో అంది.. ‘ఇది బ్రెయిలీ లిపి పుస్తకం’ అని.
***
వృద్ధునికి ఆమె బ్రెయిలీ లిపి నేర్పించడానికి రోజూ వస్తొంది. విషయం అర్థమయ్యాక అయోమయం మరింత పెరిగింది వినోద్‌లో. ఈ వయసులో? అంటూ మనసులోని ప్రశ్నార్థకాన్ని అప్పుడే అక్కడకు వచ్చిన వృద్ధుడి భార్యముందు అనేశాడు. దానికి ఆమె -అంకుల్‌కి ఏడుపదులు దాటి చాలా కాలమైంది. ఆయనకు చాలా భాషలు వచ్చు. ఇప్పుడు క్రేజీగా చెప్పుకుంటున్న ఐఐటి చదువులు ఆయన ఎప్పుడో చదివాడు. పెద్ద కంపెనీలో పెద్ద హోదాలోనే పని చేసి రిటైరయ్యారు. ఈ వయసులో హఠాత్తుగా కళ్లుపోయాయి. వినికిడి శక్తి మాత్రం ఉంది’ అని చెప్పుకొచ్చింది. అతని గురించి తెలిశాక వినోద్ ఆశ్చర్యంగా ‘ఈ వయసులో బ్రెయిలీ నేర్చుకుని ఏం చేస్తారు’ అడిగాడు. చిన్నప్పటి నుంచి చదవడం ఆయనకు ఇష్టమైన పని. హఠాత్తుగా కళ్లుపోయాయి. బ్రెయిలీ లిపిలో మంచి ఆత్మకథలు ఉన్నాయట. వాటిని చదువేందుకు ఇప్పుడు బ్రెయిలీ నేర్చుకుంటున్నారు’ అంటూ ఆమె చెప్పుకునిపోతుంటే -వినోద్‌కు మనసులోనే అనిపించింది. 20ఏళ్ల వయసులో ఏదైనా కొత్త భాష నేర్చుకోవడం కష్టమైన పని అనుకునే నేను వృద్ధుడినా? ఏడు పదుల వయసులో కళ్లుపోయినా ఆత్మకథలు చదివేందుకు బ్రెయిలీ నేర్చుకోవడానికి ఉద్యుక్తుడైన అంకుల్ వృద్ధుడా? అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. తాను చదవాల్సినవి చాలా ఉన్నాయి. ‘భగవంతుడా.. నాకు కళ్లిచ్చావు చాలు. వీటిని సార్థకం చేసుకుంటాను’ అని మనసులోనే అనుకుని ఇంటిముఖం పట్టాడు.
*
(ఇది నిజంగానే ఉన్న వ్యక్తి కథ .. 72 ఏళ్ళ వయసులో  చదువు పై ఆసక్తితో బ్రెయిలీ లిపి నేర్చుకుంటున్నారు .). 

19, ఫిబ్రవరి 2013, మంగళవారం

చూపుడు వేలు..


కహానీ 3

‘ఛ.. ఛీ... ఈ దేశంలో ఎవరికీ సివిక్‌సెన్స్ లేదు. కామన్‌సెన్స్ అస్సలు లేదు’ అంటూ తిట్టుకుంటూనే మిత్రుడు సురేష్ ఇంట్లోకి వచ్చాడు రమేష్. మిత్రులు ఇద్దరూ సామాజిక చర్చల్లో మునిగిపోయారు. ఇద్దరి అభిప్రాయాలు ఒకటిగానే ఉన్నాయి.
‘ఈ దేశానికి ప్రజాస్వామ్యం పనికి రాదు. మిలటరీ పాలన వస్తేగానీ జనం దారికి రారు. పిట్టల్ని కాల్చినట్టు కాల్చేయాలి. రాజకీయ నేతలంతా దొంగలు. జనం పరమ బద్ధకస్తులు. ఇలాంటి దేశం ఎప్పుడు బాగుపడుతుందో. ఈ దేశాన్ని పూర్తిగా
మార్చేయాలి’ ఇవీ వారి చర్చల్లో దొర్లిన కొన్ని అంశాలు. ‘ఏంట్రా రమేష్ ఎప్పుడూ లేనంత ఆవేశంగా ఉన్నావ్. ఏమైందేమిటి?’ అంటూ అప్పటి వరకూ వారి మాటలు వింటూ పత్రిక చదువుతున్న సురేష్ అన్న సందీప్ ముందుకొచ్చాడు. ‘ఏ పనీ సమయానికి చేయరు. ఒక్కరూ మాట మీద నిలబడరు. చట్టాన్ని గౌరవించరు. నిబంధనలు పాటించరు’ అంటూ రమేష్ తన అసహనం వ్యక్తం చేశాడు.

 ‘నీకో జోక్ చెప్పనా’ అంటూ సందీప్ అక్కడి వాతావరణాన్ని తేలిక పరచడానికన్నట్టు సరదాగా అడిగాడు. సమాధానం కోసం ఎదురు చూడకుండానే జోక్ చెప్పాడు. ఒక యువకుడు డాక్టర్ వద్దకెళ్లి తనకు విచిత్రమైన జబ్బు ఉందని చెప్పాడు. ‘శరీరమంతా ఎక్కడ ముట్టుకున్నా నొప్పి వేస్తుంది. కానీ శరీరంలో ఎక్కడా ఏమీ కనిపించడం లేదు. నొప్పి
భరించలేకపోతున్నా’ అని డాక్టర్‌ను కలిశాడు. నొప్పి ఎక్కడని డాక్టర్ అడిగితే, ఎక్కడ ముట్టుకున్నా నొప్పి అంటూ ముఖాన్ని చూపుడు వేలితో ముట్టుకున్నాడు. అబ్బో నొప్పి అని మెలికలు తిరిగిపోయాడు. కాళ్ల మీద, చెంపల మీద, వీపుమీద అన్నిచోట్లా ముట్టుకుంటూ.. నొప్పి నొప్పి అని అరుస్తున్నాడు. డాక్టర్ అతనే్న పరీక్షగా చూసి నవ్వాడు. నొప్పితో బాధపడుతున్న తనను డాక్టర్ చూసి నవ్వడంతో అతనికి మండుకొచ్చింది. ‘బాబూ నీ శరీరానికి వచ్చిన సమస్యేమీ లేదు. శరీరంలో నొప్పి లేదు. రోగం లేదు. నీ ఆలోచనలోనే తేడా ఉంది’ అని చెబుతూ అతని చూపుడు వేలిని పట్టుకుని చూశాడు.

ఇదిగో సమస్య ఇక్కడుంది. నీ చూపుడు వేలికి గాయమైంది. గాయంతో ఉన్న వేలితో శరీరంలో ఎక్కడ ముట్టుకున్నా నొప్పి లేస్తోంది. అది శరీరం సమస్య కాదు, నీ చూపుడు వేలి నొప్పి’ అని డాక్టర్ చెబితే అతనికి అప్పుడు గుర్తుకొచ్చింది. పెన్సిల్ చెక్కుతుంటే చూపుడు వేలికి గాయమైందని. అరే వేలికి గాయమైతే మొత్తం శరీరాన్ని అనుమానించాను అనుకున్నాడు’ అని సందీప్ ముగించాడు. రమేష్‌కు విషయం అర్ధమై ఆలోచనలో పడ్డాడు. తరువాత సిగ్గుపడ్డాడు. దేశాన్ని మార్చడం కాదు మారాల్సింది ముందు తానే అని మనసులోనే అనుకుని వౌనంగా ఉండిపోయాడు.
 అందరినీ  మార్చేద్దాం అని బయలు దేరిన వాళ్ళంతా ముందు తాము మారితే లోకం  దానంతట అదే  మారేది .

12, ఫిబ్రవరి 2013, మంగళవారం

ద్వాపర యుగం అర్జునుడు .. కలియుగం అర్జున్ .. ఒక పిట్ట కన్ను


అర్జున్ -- కహానీ2

 



 అర్జు నా.. నీకేం కనిపిస్తుంది! అని ద్రోణుడు అడిగినప్పుడు, పిట్ట కన్ను తప్ప తనకేమీ కనిపించడం లేదని సమాధానమిచ్చాడు ద్వాపరయుగం నాటి అర్జునుడు. ప్రస్తుత కాలపు అర్జున్‌ను అతని మాస్టర్ ఇదే ప్రశ్న అడిగితే, సమాధానమేమీ చెప్పకపోయే వాడు. కారణం -ప్రశ్నలు కూడా వినిపించుకోలేనంతగా పనిలో లీనమవుతాడు. మన కథలో -అర్జున్ తీరు మొదటి నుంచీ అంతే. చదువు పూర్తికాగానే క్యాంపస్ సెలక్షన్స్‌లో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. లక్ష్యం తప్ప అతనికేమీ పట్టదు. పట్టించుకోడు... పట్టించుకోవాలనే ఆసక్తీ ఉండదు. తన బృందంలో అర్జున్ ఉండటం అదృష్టమని బృంద నాయకుడు చాలాసార్లు స్వయంగా అర్జున్‌తోనే చెప్పాడు. ఆ మాట అర్జున్‌కు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఉత్సాహం అతనికి అప్పగించిన పనిలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఆఫీసులో వాతావరణం ఉత్సాహంగా ఉంది.

కంపెనీకి నాలుగు ప్రాజెక్టులు వస్తేనే కళకళలాడుతుంది. ఉద్యోగుల పరిస్థితి బాగుంటుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టును విజయవంతం చేసినందుకు యాజమాన్యం కొందరికి ప్రమోషన్లు ఇచ్చింది. ఆ ప్రాజెక్టులో కీలక పాత్ర తనదే. జాబితాలో తొలి పేరు తనదే ఉండి తీరుతుంది అనుకున్న అర్జున్‌కు -మేనేజిమెంట్ నిర్ణయం ప్రకటించిన తరువాత అసలేం జరిగిందో అర్థం కాలేదు. బృంద నాయకుడిని యాజమాన్యం ఆకాశానికెత్తేసింది. తన పేరును ప్రస్తావించే వారే లేరు. ఎక్కడో పొరపాటు జరిగిందని అనుకున్నాడు అర్జున్. కాదు మోసం జరిగిందని గ్రహించాడు. మనసు అసంతృప్తితో రగిలిపోతోంది. కానీ ఎవరికీ చెప్పలేదు. విషయం తెలిసిన సీనియర్ ఒకరు భుజంపై చేయి వేసి పద.. క్యాంటిన్ వరకూ వెళ్లొద్దామని ఆప్యాయంగా పిలిచాడు. ఏమీ మాట్లడకుండా సీనియర్ వెంటే క్యాంటిన్‌కు వెళ్లాడు. అర్జునుడు పిట్ట కన్ను మాత్రమే కనిపిస్తుందని చెప్పే  కథ చిన్నప్పుడు  విన్నావా ? అని సీనియర్ ప్రశ్నిస్తే, వినడమే కాదు ఆ కథ నాపై తీవ్రమైన ప్రభావం చూపింది. లక్ష్యాన్ని తప్ప దేన్నీ పట్టించుకోవద్దనే జీవిత పాఠం నేర్పిన కథ అది అని అర్జున్ సమాధానమిచ్చాడు. అయినా అసందర్భంగా ఇప్పుడా విషయం ఎందుకు? అని మనసులోనే ప్రశ్నించుకున్నాడు. 

అర్జున్ మనసు భావాన్ని అర్థం చేసుకున్న సీనియర్ ఈ విధంగా హితోపదేశం చేశాడు.  అర్జునుడు  పిట్ట కన్నుపై మాత్రమే గురిపెట్టి చుట్టుపక్కల ఉన్న దుర్యోధన బృందాన్ని పట్టించుకోలేదు. ద్వాపరకాలం కాబట్టి   దాని వల్ల అతనికి ఇబ్బందేమీ కలగలేదు .  కానీ ఇది కలికాలం. పిట్ట కన్నుపై మాత్రమే గురిపెడితే సరిపోదు. నువ్వు బాణం వేసేప్పుడు నీకాళ్ల కింద గొయ్యి తవ్వే వాళ్లు ఉంటారు.  పని చేస్తున్నది తానే అని నీ  విషయం   నువ్వే  చెప్పుకోవాలి. లేదంటే ఏ దుర్యోధనుడో దాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు. ఎవరికి వారే మార్కెటింగ్ చేసుకునే కలికాలమిది అన్నాడు సీనియర్
.

5, ఫిబ్రవరి 2013, మంగళవారం

రతన్ టాటా-సంతోషం

సంతోషం..కహానీ1


వచ్చే జన్మంటూ ఉంటే నన్ను అర్థం చేసుకునే వాళ్లింట్లో పుట్టించు దేవుడా! -ఇంట్లోవాళ్లకు గట్టిగా వినిపించేట్టుగానే అన్నాడు రవి. రిబాక్ షూ మీద రవికి ఆశ. కొనుక్కుందామంటే ఇంట్లో వాళ్లు పట్టించుకోవడం లేదు.. కోపానికి అదీ కారణం! ఇలాంటి ఇంట్లో పుట్టడం వల్ల తనలాంటి ప్రతిభావంతుడికి సంతోషమనేది లేకుండా పోయిందని మరికొంత కోపం. -‘అరే ఇంజనీరింగ్ చదివే కొడుకు ఎలా ఉండాలి. కాలేజీలో ఒక్కొక్కడు ఎంత స్టయిల్‌గా ఉంటున్నాడు. నేనేమన్నా డబ్బున్నోడి కొడుకులా కారు కొనివ్వమన్నానా? మనకంత సీన్ లేదని తెలుసు. మంచి డ్రెస్సు, షూ అడిగానంతే కదా?’. ఈ మాటలన్నీ స్వగతంగా అంటున్నట్టుగా రవి గట్టిగానే అంటున్నాడు. రవి ఎంత మొత్తుకున్నా తండ్రి మాత్రం అవేమీ పట్టించుకోకుండా టీవీ చానెల్‌ను ఆసక్తిగా చూస్తున్నాడు. తండ్రి కూర్చున్న సోఫా వద్దకు వచ్చి పక్కనే కూడలబడ్డాడు రవి. 


టీవీలో రతన్ టాటాపై ప్రత్యేక కార్యక్రమం వస్తోంది. రతన్ టాటా ఇంట్లో పుట్టే అదృష్టం ఉంటేనా?....’ అంటూ తండ్రికి వినిపించేట్టుగా మళ్లీ అన్నాడు రవి.

దేశంలో సంపన్నతకు టాటా మారుపేరు. సంపన్నత కన్నా టాటా పేరుకే ఎక్కువ ప్రాచుర్యం... యాంకర్ చదువుకుంటూ పోతోంది తెలుగునే ఇంగ్లీష్‌లా. అదృష్టం అంటే టాటాదే కదా? అనుకున్నాడు రవి. ఎంత ఏడ్చినా తండ్రిని ఒప్పించడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చి తానూ వినసాగాడు.

 రతన్ టాటా దాదాపు 50 ఏళ్లపాటు టాటాల సామ్రాజ్యానికి నాయకత్వం వహించారు. ఆ సామ్రాజ్యం విలువ ఐదులక్షల కోట్లు. 75 ఏళ్ల వయసులో రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. సాధారణంగా రిటైర్ అయ్యే వారిలో రేపటి నుంచి ఎలా అనే దిగులు కనిపిస్తుంది. కానీ ఆయన మాత్రం పాతికేళ్ల యువకుడిగా ఉత్సాహంగా ఉన్నారు. ‘అయినా మనలాంటి కుటుంబరావులకు దిగులు కానీ లక్ష్మీపుత్రుడు ఆయనకేం’ అనుకున్నాడు రవి స్క్రీన్‌మీద చూపు తిప్పకుండానే. -రిటైర్మెంట్ తరువాత ఏం చేయాలనుకుంటున్నారు’ టాటాకు యాంకర్ సంధించిన ప్రశ్న. ‘లైఫ్ బిజీతో చాలా కోరికలు నెరవేర్చుకోలేకపోయాను. ఇప్పుడు వాటి పనిబడతా’ అంటూ చిర్నవ్వుతో చెప్పుకుపోతున్నారు టాటా. 

‘నీకేం బాసూ.. లక్షల కోట్లు. ఏ కోర్కెనైనా క్షణాల్లో నెరవేర్చుకుంటావ్’ రవి మనసు రన్నింగ్ కామెంట్రీ చేస్తోంది. ‘చిన్నప్పుడు పియానో నేర్చుకునే వాడిని. ఏడేళ్ల వయసులోనే బిజీగా ఉండి ఆపేశాను. ఇప్పుడది నేర్చుకోవాలని అనిపిస్తోంది. నా పెట్స్‌కు నేనంటే ఎంతో ప్రేమ. ఇప్పుడిక వాటితో ఆడుకుంటా. లైఫ్ బిజీతో దూరమైపోయిన చిన్న చిన్న సంతోషాలన్నీ ఇప్పుడు తీర్చేసుకుంటా.  నాకిప్పుడు చాలాటైం దొరుకుతుంది’ అంటూ రతన్ టాటా చెప్పుకుపోతుంటే రవికి బుర్ర తిరిగింది. అంతా గమనిస్తున్న తండ్రి గట్టిగా నవ్వేశాడు. ‘సంతోషమంటే రెబాక్ షూ, బ్రాండెడ్ జీన్స్ మాత్రమే కాదురా కుర్రకుంకా. చాలా ఉంటాయ్..’ అంటూ రవి భుజం తట్టాడు.