2, నవంబర్ 2014, ఆదివారం

ఆ.. విషాద గీతం లానే ముగిసింది ఆ సంగీత దర్శకుని జీవితం

ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము
ఎంత వరకీ బంధము
ఈ పాట ఆనాటి తరాన్ని తీవ్రంగా కదిలించింది. పాట వింటేనే మనసు భారంగా మారుతుంది. ఇక సినిమాలోని ఆ దృశ్యాలను చూస్తూ పాట వింటే మనుషులపై ప్రభావాన్ని ఊహించలేం. ఇంతగా కదిలించిన ఆ పాటలో సంగీతం గొప్పదా? సాహిత్యమా? గాయకుడి గాత్రమా? ఏది అంటే చెప్పలేం. మూడు కలిశాయి కాబట్టే ఆ పాట మనసున్న వారిని కదిలించింది.
సరిగ్గా నాలుగు దశాబ్దాల తరువాత తన జీవితం కూడా ఆ పాట చరణాల్లో చెప్పినట్టు విషాదంగా ముగుస్తుందని, ఆ పాటకు సంగీతం అందించిన జెవి రాఘవులు ఊహించి ఉండరు.  
ఎవరీ జెవి రాఘవులు అంటే?

***
‘‘బాగున్నారా? ’’
‘‘ఓ మీరా బాగున్నాం సార్...’’
‘‘నా పరిస్థితి బాగాలేదు. వైద్యం ఖర్చులు భరించలేకపోతున్నాను. ఏమైనా సహాయం చేస్తారా? ’’
‘‘సారీ సార్ మేమిప్పుడు సినిమాలకు ఫైనాన్స్ మాత్రమే చేస్తున్నాం, సహాయం చేయలేం’’
జెవి రాఘవులు ఫోన్ చేసినప్పుడు పలువురు దర్శక నిర్మాతలు చెప్పిన మాటలు ఇవి.
***
1973లో పుట్టిన ఆ పాట 2013లో జెవి రాఘవులు విషాద జీవితాన్ని తలపించేట్టుగా ఉంది.
పాటకు ఆయన సంగీతం ప్రాణం పోస్తుందని, తమ సినిమా హిట్టు కావడానికి దోహదం చేస్తుందనే నమ్మకంతో ప్రముఖ నిర్మాత, దర్శకులు రాఘవులు ఇంటి వద్ద వేచి చూసేవారు.
‘‘ఒకప్పుడు ఎంతో మంది ప్రముఖ నిర్మాతలు జెవి రాఘవులు కోసం నిరీక్షించారు, ఇప్పుడు ఆయన తనను ఆదుకోవడానికి దాతలు ఎవరైనా ముందుకు వస్తారేమోనని నిరీక్షిస్తున్నారు. ఆయన్ని ఆదుకోండి. వైద్య చికిత్స చేయించుకోలేని స్థితి, ఇల్లు గడవని పరిస్థితి దాతలు ఆదుకోండి ’’ రాజమండ్రిలో జెవి రాఘవులు అభిమానులు విలేఖరుల సమావేశంలో చెప్పిన మాటలివి. చివరి రోజుల్లో ఆయన పరిస్థితికి అద్దం పడుతున్నాయి ఈ మాటలు. అభిమానులు ఎందుకు చెప్పారు అంటే ఒకప్పుడు శ్రావ్యమైన సంగీతం వినిపించిన ఆయన అప్పుడు తన దుస్థితి కూడా తాను చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. పక్షవాతం వల్ల మాట్లాడలేని పరిస్థితి ఉండడంతో అభిమానులే ఆయన పక్కన ఉండగా, ఆయన దీన గాథను వివరించారు. ఎంత మంది ఆదుకున్నారు, ఎంత మంది స్పందించారో కానీ ఆయన మాత్రం ఏమీ లేకుండానే ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము అనే పాటలోని మాటలు అక్షర సత్యాలు అని నిరూపించి తన జీవితాన్ని ముగించారు.

82లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా బొబ్బిలిపులి టిడిపి సూపర్ హిట్‌కు తన వంతు పాత్ర పోషించింది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి పాట సినిమాకు కనక వర్షం, టిడిపికి ఓట్ల వర్షం కురిపించింది. ఆ పాటకు సంగీతం అందించిన జెవి రాఘవులు జీవితంలో చివరి రోజుల్లో మాత్రం కాసు లేకుండానే కన్ను మూశారు.
మనసు గతి ఇంతే, వీణనాది తీగనీది తీగ చాటు రాగముంది వంటి ఎన్నో సూపర్ హిట్ పాటలకు సంగీతం అందించారు. భగవద్గీతకు ఘంటసాలతో కలిసి పని చేశారు.

ఆకాశవాణి రికార్డింగ్ థియేటర్‌లో జెవి రాఘవులు పాడిన పాట విన్న ఘంటసాల అద్భుతంగా పాడావు, ఆసక్తి ఉంటే మద్రాసు వచ్చి కలవమని చిరునామా ఇచ్చారు. అప్పటి నుంచి ఘంటసాలతో రాఘవులు అనుబంధం కొనసాగింది. అనేక సినిమాలకు కలిసి పని చేశారు. నెలకు వంద రూపాయల జీతంతో ఘంటసాల వద్ద జీవితాన్ని ప్రారంభించిన రాఘవులు సినిమా రంగంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లారు.
సంగీత దర్శకుడిగా తొలి చిత్రానికి 15వేల రూపాయల పారితోషికం తీసుకున్నారు. బొబ్బిలి పులికి రెండు లక్షల పారితోషికం. అప్పట్లో అది చాలా ఎక్కువ మొత్తం.

సంగీతం రోగాలను నయం చేస్తుందని, శిశువులు, పశువులను సైతం గాన రసం మైమరిపిస్తుందని అంటారు. కోట్లాది మంది ప్రజలను తన సంగీతంతో మైమరిపించేట్టు చేసిన ఆయన మాత్రం ఆనారోగ్యంతో యుద్ధం చేయలేక ఓడిపోయారు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు ఆర్థిక సమస్యలు మద్రాసులోని భవనం అమ్మేశారు. ఆస్తులు కరిగిపోయాయి. చివరి దశలో రాజమండ్రిలో ఉన్న కుమారుడి వద్దకు వచ్చారు. తన కాళ్ల మీద తాను నిలబడలేని ఆయన నిస్సహాయ స్థితి చూసి అభిమానులు చలించి పోయారు.

1970లో వచ్చిన ద్రోహి సినిమా జెవి రాఘవులు సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా. 2000లో వచ్చిన ఛలో అసెంబ్లీ చివరి సినిమా. ఆ తరువాత అనారోగ్యం ఆయన పాలిట శాపంగా మారింది. తెలుగు, తమిళం, మరాఠా, కన్నడ భాషల్లో 172 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. వంద వరకు సినిమా పాటలు పాడారు. లవకుశ సినిమాకు ఘంటసాల వద్ద సహాయకునిగా పని చేశారు.
జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్‌లో సినిమా వారి బంధువులకు కూడా ప్లాట్లు ఉంటాయి కానీ జెవి రాఘవులు, వేటూరి లాంటి వారికి ఎందుకు ఉండవు. ఇలాంటి వారు అద్దె ఇళ్లల్లో కాలం వెళ్లదీస్తారు ఎందుకు? అంటే సమాధానం అందరికీ తెలుసు కానీ ఎవరూ చెప్పరు.
ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా, ఏఆర్ రహమాన్, మణిశర్మ  లాంటి వారు ప్రారంభ రోజుల్లో రాఘవులు వద్ద పని చేశారు.

జెవి రాఘవులుగా పేరు పొందిన జెట్టి వీర రాఘవులు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించారు. 1931 అక్టోబర్ 22న జన్మించారు. తల్లిదండ్రులు వీరా స్వామినాయుడు, ఆదిలక్ష్మి. తల్లిపాడే భక్తి పాటలు విని సంగీతంపై ఆసక్తి పెంచుకున్నాడు. చదువుకోవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో కాకినాడలోని పిఆర్ కాలేజీలో పియుసిలో చేరి నెల రోజులకే మానేశారు. తన జీవిత కాలమంతా సంగీత ప్రపంచంలోనే మునిగిపోయిన ఆయన తన జీవితం ముగింపు ఇలా ఉంటుందని ఊహించి ఉండరు. ఘంటసాలతో పరిచయం అయ్యాక సంగీతమే ప్రపంచంగా బతికారు. బాల్యంలో చదువుకోవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితి వల్ల చదువుకోలేక పోయిన విషయం రాఘవులు మనసుపై బలంగా ప్రభావం చూపి ఉండాల్సింది. అలా ప్రభావం చూపి ఉంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి జీవిత చరమాంకం ప్రశాంతంగా గడిచిపోవడానికి అవసరం అయిన మెట్లు ముందు నుంచే నిర్మించుకుని ఉండేవారు. ఆలోచన రాలేదు. కాలం కలిసి రాలేదు. దాంతో సంపాదించిన కొద్దిపాటి ఆస్తిని కూడా ఆనారోగ్యం మింగేసింది.

బొబ్బిలి పులి సినిమా సమయంలో ఎన్టీఆర్ రాఘవులుతో ఎందుకైనా మంచిది హైదరాబాద్‌లో స్థలం తీసుకోండి అని సలహా ఇచ్చారు, సరిగమల గురించే నిరంతరం ఆలోచిస్తూ గడిపిన ఆయన స్థలం గురించి పట్టించుకోలేదు. ఆ సలహా వినక తాను తప్పు చేశానని, విని ఉంటే పరిస్థితి ఇప్పుడిలా ఉండేది కాదని ఓ సందర్భంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మద్రాసులో మంచి కార్లలో తిరుగుతూ భారీ భవంతుల్లో నివసించిన ఆయన చివరి రోజులు రాజమండ్రిలో పేదరికంలో గడిచాయి.
తనలా కష్టపడవద్దని పిల్లలకు సంగీతం నేర్పించలేదు, సినిమాల్లో బిజీగా ఉండడంతో పిల్లల ఆలనా పాలన పట్టించుకోలేదు. దాంతో వారికి చదువు అబ్బలేదు. చిన్న కంపెనీలో చిరుద్యోగం చేస్తున్న మూడవ కుమారుడి ఇంట్లో చివరి రోజులు గడిచిపోయాయి.

సంగీత ప్రపంచంలో లీనమై పోయిన జెవి రాఘవులు తర తరాలు నిలిచిపోయే సంగీతాన్ని అందించారు. అద్బుతమైన పాటల సంపద తెలుగువారికి ఇచ్చారు. ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని పట్టించుకోకుండా ఏమీ లేకుండా నిరాశతో జూన్ 7, 2013న చనిపోయారు.
* ధనం మూలం 17

3 కామెంట్‌లు:

 1. ముందు చూపు లేకపోతే
  యెంత సంపాదించినా
  యెంత గొప్పగా బ్రతికినా
  చివరికి ఇంతే ...
  చిత్తూరు నాగయ్య, కాంతారావు,
  రాం మోహన్, సలీం, జె వీ రాఘవులు
  సావిత్రి, రమాప్రభ వగైరా గార్ల జీవిత చరమాంకాలు
  నేర్పే జీవిత పాఠాలివే ...

  రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం