31, ఆగస్టు 2014, ఆదివారం

కన్నీళ్లు పెట్టించే రాజనాల జీవితం

అవి తెలుగునాట మద్యనిషేధం అమలులో ఉన్న రోజులు. మందు దొరుకుతుంది కానీ ఆ మందును గొంతులోకి పంపేందుకు ఓ నీడ కావాలి. కొంత మంది జర్నలిస్టు మిత్రులకు ఆ సమయంలో యూసుఫ్‌గూడలోని సారధి స్టూడియో వద్ద ఓ రేకుల షెడ్డు నీడ లభించింది. ఆ షెడ్డులో నివాసం ఉండే వ్యక్తి వీరికి మంచినీళ్లు, మందు తాగేందుకు గ్లాసుల వంటి మౌళిక సదుపాయాలు కల్పించేవారు. 

అక్కడ మద్యం తాగి ఆ ఇంటిలో ఉన్న వ్యక్తికి ఒక క్వార్టర్ తాగించి వెంట తీసుకెళ్లిన బిర్యానీ ప్యాకెట్, జేబులో ఉంటే ఓ 50 రూపాయలు ఇచ్చేవాళ్లు.
ఇందులో పెద్ద విశేషం ఏముంది? ఆ కాలంలో చాలా మంది ఇలా చేసిన వారున్నారు అనుకోవచ్చు. నిజమే ఏ కాస్త చీకటి కనిపించినా అక్కడ మందు తాగిన వాళ్లు, ఇప్పటికీ తాగుతున్న వాళ్లు చాలా మందే ఉండొచ్చు. కానీ ఆ రేకుల షెడ్డులో నివసించేది ఒకప్పుడు తెలుగు చలన చిత్ర సీమలో మకుటాయమానంగా వెలిగిపోయిన విలన్... తెలుగు విలన్‌లకు విలనిజం నేర్పిన నటుడాయన... హీరోలను మించి పాపులారిటీతో పాటు హీరోలను మించి పారితోషికం తీసుకున్న నటుడాయన. దాదాపు పాతికేళ్లపాటు చిత్ర సీమలో ఎదురు లేకుండా నిలిచిన నటుడు. హీరోలకు పోటీ ఉందేమో కానీ విలన్‌గా ఆయనకు పోటీ లేకుండే. అతని కోసం హాలీవుడ్ సినిమా వాళ్లు సైతం దేశానికి వచ్చి సినిమా తీశారు. అతనే రాజనాల. మహోన్నత స్థితి నుంచి అధఃపాతాళంలోకి పడిపోయిన ఆయన జీవితం సినిమా వారికే కాదు జీవితాన్ని ప్రేమించే అందరికీ ఒక గుణపాఠం.

***
రాజనాల తన చివరి రోజుల్లో హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌కు రోజూ వచ్చేవారు. ఆయన పరిస్థితి చూసి పాత్రికేయులు జాలి పడేవారు. రాజనాల ఒక రేకుల షెడ్డులో దుర్భర జీవితం గడిపే రోజుల్లో ఒక పాత్రికేయుడు ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తూ అంత సంపాదించిన వారు ఇలా ఎలా అయ్యారు? అని అడిగారు. నువ్వు రాయను అంటే చెబుతాను, ‘ప్రపంచంలో నేను రుచి చూడని మద్యం బ్రాండ్ లేదు.. నేను తాగని బ్రాండ్ సిగరెట్ లేదు ’ అంటూ ఒక్క ముక్కలో చెప్పేశాడు. మీ తరం ఇలా ఎందుకు అయింది అనేది చెబితే తరువాత తరం వారికి ఉపయోగపడుతుంది కదా? రాయడం వల్ల నలుగురికి ఉపయోగమే తప్ప నష్టం లేదని చెబితే, అయితే నీ ఇష్టం అని చెప్పాడు.
***
రాజనాల ఇంటి పేరు కల్లయ్య అసలు పేరు. 1928 జనవరి మూడున నెల్లూరు జిల్లా కావలి వెంకట సుబ్బయ్య, నారాయణమ్మ దంపతులకు జన్మించిన రాజనాల మొదట్లో నెల్లూరులో కుస్తీలు పట్టేవారు. మంచి పహెల్వాన్. ఆ ఆసక్తే ఆయన్ని సినిమాల వైపు తీసుకు వెళ్లింది. రాజనాల కన్నా ముందు విలన్లు ఉన్నా పాపం వాళ్లు సాత్వికులు. రాజనాల వచ్చాక విలనిజానికి కొత్త నిర్వచనం చెప్పాల్సిన పరిస్థితి. ఎన్టీఆర్, కాంతారావు హీరో ఎవరైనా కావచ్చు. హీరోకు ధీటుగా నిలిచే విలన్ రాజనాల. కుస్తీల పట్టిన కండల తిరిగిన శరీరం. డైలాగులతో ఎదుటివారిని వణికించే స్వరం.
జానపద సినిమాలు, పౌరాణికాలు, సాంఘిక చిత్రాలు ఏవైనా కావచ్చు. రాజనాల విలన్‌గా చెలరేగిపోయారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేశారు. ఉద్యోగం చేస్తూనే నేషనల్ ఆర్ట్ థియేటర్‌ను స్థాపించి నాటకాలు వేసేవారు. ఎవరు దొంగ పేరుతో అవినీతి అక్రమాలపై నాటకం ప్రదర్శించారు. అది జిల్లా కలెక్టర్‌కు ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ప్రభుత్వంలోని అవినీతిని బయటపెడతారా? అని మండిపోయారు. రాజనాల నాటకాల్లో ప్రజలను రెచ్చగొట్టే సంభాషణలు ఉంటున్నాయని, ప్రభుత్వానికి పోలీసులు నివేదిక ఇచ్చారు. జిల్లా కలెక్టర్ రాజనాలను మూడునెలల పాటు సస్పెండ్ చేస్తే. రాజనాల ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని శాశ్వతంగా సస్పెండ్ చేసి రంగ స్థలాన్ని నమ్ముకున్నారు. అటు నుంచి సినిమాలకు వెళ్లారు. 1951లో కాంతారావు హీరోగా, రాజనాల విలన్‌గా హెచ్‌ఎం రెడ్డి వారి ప్రతిజ్ఞ సినిమాలో నటించారు. కాంతారావు, రాజనాల ఇద్దరికీ ఇది మొదటి సినిమా. సినిమా భారీ హిట్టు . తరువాత వీరిద్దరు హీరో విలన్‌గా అనేక సినిమాల్లో నటించారు. విఠలాచార్య సినిమాల్లో కాంతారావు హీరో, రాజనాల విలన్. కారణాలు వేరు వేరు కావచ్చు కానీ ఒక వెలుగు వెలిగిన ఈ ఇద్దరు తారల జీవితాలు ముగింపు మాత్రం ఒకే రకంగా ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 25 ఏళ్లపాటు సినిమాల్లో బిజీబిజీగా గడిపి కొన్ని వందల సినిమాల్లో నటించిన రాజనాల లాంటి వారు సినిమాల్లో చాలా అరుదు.

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. ఆ కాలంలో తెలుగులో వచ్చిన పలు జానపద సినిమాలు తమిళంలో అనువాదం అయ్యేవి. దాంతో తమిళనాడు రాజనాలకు ఆనాటి హీరోలతో సమానంగా పాపులారిటీ ఉండేది.
ఎన్టీఆర్, కాంతారావు సినిమాల్లో తప్పనిసరిగా కనిపించే విలన్ రాజనాల. రెండు చేతులా సంపాదించిన రాజనాల మద్రాసులో రెండు ఇళ్లను కట్టుకున్నారు. రాజనాల సంపాదనకు హద్దులేదు, ఖర్చుకు హద్దు లేదు. దాన ధర్మాలు చేశారు. బంధువులను ఆదుకున్నారు. వారికి ఇళ్లు కట్టించారు. మద్రాసులో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి అందరికీ మంచి సాహిత్యం అందుబాటులో ఉండేట్టు చేశారు.

ఆ సినిమాతో ఆ నటుడు ఇక వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం ఏర్పడలేదు అంటుంటారు సినిమా వాళ్లు. కానీ ఏ దశలోనైనా వెనుతిరిగి చూసుకోవాలి అలా చూసుకోక పోతే కొంత కాలం గడిచిన తరువాత వెనుతిరిగి చూసుకున్నా ఏమీ మిగలదు. రాజనాల విషయంలో అదే జరిగింది. భార్య మరణంతో ఆరోగ్యం క్షీణించింది. అదే సమయంలో క్రమంగా సినిమాలు తగ్గిపోయాయి. అప్పటి వరకు సంపాదించిన సంపదను జాగ్రత్త చేసుకున్నా, ఏదో ఒక రంగంలో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన చేసి ఉంటే రాజనాలను ఆ ఆలోచనే చివరి దశలో ఆదుకునేది. కానీ రాజనాల మాత్రం అంతా అయిపోయే వరకు వెనుదిరిగి చూసుకోలేదు.

ఎన్టీఆర్ రాజనాలపై మొదటి నుంచి ఆప్యాయత చూపించే వారు మామాజీ అని పిలుచుకునే వారు. అనేక సినిమాల్లో ఇద్దరూ కత్తులు దూసుకున్నారు. హీరో ఎన్టీఆర్ తన గ్లామర్‌ను, ప్రజల్లో ఉన్న ఆదరణను పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కాగా, అదే సమయంలో రాజనాల పరిస్థితులు క్రమంగా క్షీణిస్తూ వచ్చాయి. మద్రాసులో ఇక జీవనోపాది లేదని గ్రహించిన తరువాత 1993 ప్రాంతంలో రాజనాల హైదరాబాద్‌కు వచ్చారు.
తెలుగువీర లేవరా సినిమా షూటింగ్‌లో అరకులో జరుగుతుండగా రాజనాల కాలుకు గాయమైంది. అప్పటికే మధుమేహం వ్యాధి ఉండడంతో చివరకు తొడవరకు తీసేయాల్సి వచ్చింది. నిజానికి ఆ సమయంలో రాజనాలకు వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును కూడా భరించే స్థితి లేదు. ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించింది. రాజనాల వైద్య చికిత్స కోసం ఒక హెల్త్ కార్డును ప్రభుత్వం ఇచ్చింది. సినిమా రంగానికి చెందిన దాతలు నెలకు వెయ్యి రూపాయల సహాయం చేస్తే వాటితోనే చివరి రోజుల్లో రాజనాల బతికారు. అంతకు ముందు ఎన్టీఆర్ కొంత ఆర్థిక సహాయం చేసినా, ఇకపై రాజనాల వస్తే పంపించేయండి అంటూ ఆదేశించారని, రాజకీయాల్లో ఎన్టీఆర్‌కు వ్యక్తిగత సహాయకులుగా పని చేసిన సిబ్బంది చెప్పారు. ఎవరైనా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసినా ఆ డబ్బు తిరిగి మద్యం కొనేందుకే ఖర్చు చేసేవారనీ, రాజనాలను చివరి రోజుల్లో దగ్గరి నుంచి చూసిన వారు చెబుతారు. రాజనాల తొలి భార్య మరణించినప్పటి నుంచే ఆయన పరిస్థితి తలక్రిందులు కావడం మొదలైంది. 84లో ఒక కుమారుడు మూర్ఛవ్యాధితో మరణించాడు. ఒక కుమారుడు ముంబై వెళతానని చెప్పి వెళ్లాడని ఏమయ్యాడో ఎక్కడున్నాడో తెలియదని రాజనాల చివరి రోజుల్లో చెప్పారు. రాజనాలకు జ్యోతిష్య శాస్త్రంలో మంచి ప్రవేశం ఉంది. చివరి రోజుల్లో ఆస్పత్రిలో చికిత్స జరిగేప్పుడు కూడా డాక్టర్లకు, నర్సులకు జ్యోతిష్యం చెప్పేవారు.

అచ్చం సినిమాలో హీరోను బెదిరిస్తూ మాట్లాడినట్టుగా కళ్ల్లెర్ర చేసి, ముఖ కవళికలు మార్చి ఆస్పత్రిలో నర్సులను బెదిరించినట్టుగా మాట్లాడేవారు. ఆ నటన సినిమాలో హీరోలను భయపెట్టి ఉండొచ్చు కానీ ఆ చేష్టలను చూసి ఆస్పత్రిలో నర్సులు నవ్వుకునే వారు. ఒకరి జీవితం పతనమైనా, ఉన్నతంగా ఉన్నా ఎవరి జీవితానికి వారే కారణం. 

ఇతరులకు జ్యోతీష్యం చెప్పిన రాజనాల తన జీవిత భవిష్యత్తును ఊహించలేకపోయారు. *

24, ఆగస్టు 2014, ఆదివారం

తోచీ తోచనమ్మ వైరస్ ఐస్‌బకెట్!

తోచీ తోచనమ్మకు భర్త మీద కోపం వచ్చింది. కోపమెందుకో ఆమెకు గుర్తు లేదు. కానీ కోపం మాత్రం ఉంది. తాను అలిగానని తోటి కోడలు పుట్టింటికి వెళతానని అల్టిమేటం ఇచ్చింది. పుట్టింటికి వెళదామంటే అంతకు ముందు రోజే పుట్టింటి మీద అలిగి మెట్టినింటికి వచ్చిందాయె ఇప్పుడేం చేస్తుందే ఏదో ఒక చోట అలగాలి తప్పదు. అందుకే అలిగి తోటి కోడలు పుట్టింటికి వెళతానంది. తోచీ తోచనమ్మ తోటికోడలి పుట్టింటికి వెళితే అక్కడేమైంది అంటే ?


భర్త మీద కోపం వస్తే పుట్టింటికి వెళ్లాలి, పుట్టింటి వాళ్లపై కోపం వస్తే మెట్టినింటిలోనే ఉండి భర్తను సాధించాలి. అంతే తప్ప తోచీ తోచకుండా తోటి కోడలి పుట్టింటికి వెళితే అక్కడ ఆమెను పట్టించుకునేదెవరు? తోచీ తోచకుండా చేసే పనులకు పెద్దగా అర్ధాలు ఉండవు. తోయకపోవడం ఒక్కటే కారణం. ఈ తోచీతోచనమ్మలు వెనకటికి తెలుగునాట మాత్రమే కాదు ఈనాటికీ పాశ్చాత్యుల్లో సైతం ఉన్నారు. అమెరికాలో ఇలా తోచీ తోచని వాళ్లు సముద్రం ఒడ్డున గాడిదలపై ఎక్కి పరుగు పందేల్లో పాల్గొనే వారని ఓషో రజనీష్ వాళ్ల గురించి చెప్పుకొచ్చారు. కొంత కాలానికి అదే విసుగేసి మళ్లీ ఏమీ తోచక పోవడంతో ఈసారి ఆ గాడిదలను తాము మోస్తూ పరుగు పందాలు నిర్వహించారు. అది చూసిన వారికి వారిలో ఎవరు గాడిదో? ఎవరు మనిషో? అర్థం కాక అయోమయంలో పడే ఉంటారు.
కృష్ణశాస్ర్తీ బాధ ప్రపంచ బాధ అన్నట్టు కొందరికీ ఏదీ తోచక పోతే అది వారొక్కరి బాధే కాదు ప్రపంచ బాధ అవుతుంది. అందులోనే వాళ్లేమీ అల్లాటప్పా తోచీ తోచనమ్మలు కాదు. సెలబ్రిటీలు వాళ్ల సమస్య మొత్తం ప్రపంచ సమస్య అయిపోయింది. ఈ సెలబ్రిటీల తోచి తోచని అంటు రోగం ప్రపంచ వ్యాప్తం అయింది. ఇది సెలబ్రిటీల వైరస్‌గా మారిపోయింది. తలపై ఐస్ వాటర్ గుమ్మరించుకొని వీడియో తీసి దాన్ని నెట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఐస్ బకెట్‌ను తల మీద గుమ్మరించుకోవడమేనట బిల్‌గేట్స్ మొదలుకొని బాలివుడ్ తారల వరకు ఇప్పుడు ఐస్ బకెట్ చాలెంజ్ వైరస్ అందరినీ ముంచెత్తేస్తోంది. ఎబోలా వైరస్ ప్రపంచాన్ని గజగజవణికిస్తే, ఐస్ బకెట్ చాలెంజ్‌ను స్వీకరించిన తారలు తలపై చల్లని ఐస్ నీటిని కుమ్మరించుకుని చలితో వణికిపోతున్నారు. అమెరికాలో ఒకావిడ పాపులర్ టీవి షోలో పుట్టిన ఈ వైరస్ అతి వేగంగా భారత్‌కు వ్యాపించింది. గతంలో రష్యాలో వర్షం పడితే మన దేశంలో కొందరికి తుమ్ములోచ్చేవి. ఇప్పుడు అక్కడెక్కడో అమెరికా టీవి షోలో వైరస్ పుడితే బాలీవుడ్‌ను ముంచెత్తుతుంది. 


బకెట్‌లోని ఐస్‌ను తలపై గుమ్మరించుకోవాలి ఇదో చాలెంజ్. ఈ చాలెంజ్‌ను స్వీకరించినా? స్వీకరించకపోయినా? గెలిచినా ఓడినా ఎంతో కొంత సేవా కార్యక్రమాలకు చెల్లించాలి. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు పోటీగా గల్లీ క్రికెట్ పుట్టినట్టు ఐస్ బకెట్‌కు పోటీగా రైస్ బకెట్ చాలెంజ్ పుట్టింది. అమెరికాలోని తోచీ తోచని వాళ్ల వ్యవహారాలు చూసి విసుగెత్తిన ఒక సామాజిక కార్యకర్త రైస్ బకెట్ చాలెంజ్‌కు రూపకల్పన చేసింది. బకెట్ బియ్యం ఇస్తే ఒక కుటుంబానికి నెల రోజుల భోజనం దొరుకుందని ఈ చాలెంజ్ ప్రారంభించింది. బకెట్ బియ్యం ఇవ్వలేకపోతే వంద రూపాయలు ఇవ్వాలి. అయితే సెలబ్రిటీల ఐస్ బకెట్‌లో ఉన్నంత వెర్రి ఒక కుటుంబానికి బకెట్ బియ్యంలో ఉండదు కాబట్టి ఈ చాలెంజ్ ప్రచారం సామాజిక మాధ్యమాలకే పరిమితం అయింది. ఐస్ బకెట్ చాలెంజ్‌లా కార్పొరేట్ మిడియా దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. సంపన్నులు, సెలబ్రిటీలు ఎంత బిజీగా ఉన్నా, వాళ్లూ తోచీ తోచని తనంతో ఇబ్బంది పడుతుంటారని, ఇలాంటి వైరస్‌లను చూస్తే తెలుస్తుంది. వంటింటి పార్వతి వంటి పని ముగిశాక తీరిక దొరికితే పక్కింటి లక్ష్మితో వరండాలో నిలుచోని తోచనప్పుడు కబుర్లు చెప్పుకుంటారు. సెలబ్రిటీలు చీమలు దూరని భవంతుల్లో నివసిస్తారు, మొగుడి గారికో గది భార్యగారికో గది విడివిడిగా ఉంటుంది. మగడనే వాడు ఇంటికి వచ్చాడా? లేదా అనేదే తెలియదు. అలాంటప్పుడు తోచనప్పుడు పక్కింటి వారితో కబుర్లు చెప్పుకునేంతటి అదృష్టం వారికెక్కడిది. ఏమీ తోయకపోవడం అనేది అందరిలోనూ కనిపిస్తుంది. అయితే ఎవరికి వారు తమ తమ స్థాయిలో ఆ పనులు చేస్తుంటారు. 

అధికారం అనుభవించి, ప్రతిపక్షంలోకి వచ్చిన వారికి ఏమీ తోచక పోవడం నరక ప్రాయం లాంటిది. ఒకవైపు అధికారం పోయిందనే బాధ, మరోవైపు ప్రత్యర్థి చేతిలో అధికారం ఉందనే బాధ. ఈ ఆలోచనలతో వారి కసలు నిద్రనే పట్టదు. తమకు నిద్ర లేనప్పుడు తమను ఓడించిన ప్రజలకు నిద్ర ఎందుకుండాలని సమస్యలు లేకపోతే సృష్టించి మరీ ఉద్యమిస్తారు. మేం అధికారం లోకి వస్తే భూలోక స్వర్గం చూపిస్తాం అంటారు. ఒకవేళ అధికారంలోకి వస్తే తోచీ తోచనప్పుడు ఇచ్చిన హామీలే అసలు సమస్యలుగా మారుతాయి. రైతులారా! మీరు రుణాలు చెల్లించకండి.. నేను రాగానే రద్దు చేస్తానో అంటూ ఏదో తోచీ తోచనప్పుడు ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చాక తలకు చుట్టుకుంది. రాత్ గయి బాత్ గయి అన్నట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలను అధికారంలోకి వచ్చాక అడగడం అన్యాయం అనిపిస్తుంది కానీ పాపం ఆ మాట పైకి చెప్పలేరు. చెన్నారెడ్డిని బయట ఉంచితే ప్రమాదం అని ఇందిరాగాంధీకి చాలా మంది తెలుగు నాయకులు చెప్పేవారట! పదవి ఊడబెరికి ఏమీ తోచని పరిస్థితి కల్పిస్తే ఆయన అధినాయకురాలిపైనే తిరుగుబాటు చేస్తారని, అందుకే ఆయన్నినిరంతరం బిజీగా ఉంచాలని సలహా ఇచ్చేవాళ్లట! సెలబ్రిటీలకు ఏమీ తోచక పోతే ఐస్ బకెట్ చాలెంజ్ లాంటి సిల్లీ గేమ్స్ పుడతాయేమో కానీ రాజకీయ నాయకులకు ఏమీ తోచక పోతే ప్రజలకు ప్రమాదం. రాజకీయ నాయకులకు అధికారం ఉండి పని లేకపోయినా, అధికారం లేక పని లేకపోయినా రెండూ ప్రజల పాలిట ప్రమాదమే. సాధారణ వ్యక్తులు ఏ పనీ లేకపోతే ఏదో ఒక వ్యసనానికి బానిసగా మారి తమను తాము నష్టపరుచుకుంటే నాయకులు మాత్రం ఏమీ తోచక పోతే అల్లకల్లోలం సృష్టిస్తారు.
నాయకులకు ఏమీ తోచక పోతే మరో నాయకుడి పై బురద జల్లుతారు . సెలబ్రిటీ లకు తోచక పోతే ఐస్ బకెట్ ను తమ పైనే కుమ్మరించుకుంటారు 

హిందీ సినిమా ప్రపంచాన్ని ఏలిన తెలుగు వాడు ..అతని జీవితం వారసులకు ఆస్తి పంపకం పై ఓ పాఠం

భారతీయ సినిమా చరిత్ర, అతని జీవిత చరిత్ర సమాంతరంగా సాగాయి.
సినిమా పుట్టినప్పుటి నుంచి నటించడం ప్రారంభించారు. 1909లో జన్మించి, 1995 వరకు నటిస్తూనే ఉన్నారు. అతని జీవితం సినిమా వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఒక చక్కని పాఠం.
హిందీ సినిమా తొలి లెజండర్... 50 మంది హేమా హేమీలైన హీరోయిన్లతో హీరోగా నటించారు. మూకీల కాలంలో మొదలైన అతని నటన 1995 వరకు సాగింది. రాజ్‌కపూర్ లాంటి వారికి దర్శకత్వం వహించారు. అతని జీవితం వారసులకు ఆస్తిని ఎలా ఇవ్వాలో సినిమా లోకానికి ఒక మంచి పాఠం చెప్పింది. ఎవరా నటుడు? ఏమా కథ తెలుసుకునే ముందు....
డబ్బు సంపాదన ఒక్కటే ముఖ్యం కాదు. సంపాదించిన డబ్బును జాగ్రత్త చేయాలని, సద్వినియోగం చేయాలి. చివరకు తన వారసులకు అప్పగించడం కూడా ఒక కళే. 13వ శతాబ్దానికి చెందిన కాశ్మీరుకు చెందిన సంస్కృత పండితుడు క్షేమేంద్రుడు చారుచర్య లో ఆ కాలంలోనే పిల్లలకు ఆస్తి ఎలా అప్పగించాలో చెప్పారు. పెద్ద వారు ఒకేసారి తమ వారసులకు తన సంపదనంతా అప్పగిస్తే ఇక ఆ తరువాత వాళ్లు పెద్దలను చూస్తారనే నమ్మకం లేదు. పోనీ ఆస్తి అస్సలు ఇవ్వను అంటే అడ్డు తొలగించుకోవడానికి దేనికైనా తెగిస్తారు. అందుకే కొంత ఆస్తి ఇచ్చి చివరి దశలో బాగా చూసుకుంటే మిగిలింది ఇస్తారు అనే అభిప్రాయం కలిగించాలంటాడు. దృతరాష్ట్రుడు పుత్ర ప్రేమతో రాజ్యం మొత్తం దుర్యోధనుడికి అప్పగిస్తే ఏమయింది. యుద్ధం వద్దురా అని మొత్తుకున్నా వినకుండా మొత్తం కౌరవుల నాశనానికి కారణమయ్యాడు. కొద్ది పాటి అధికారం మాత్రమే అప్పగించి ఉంటే మిగిలిన అధికారం కోసం దుర్యోధునుడు తండ్రి మాట వినివాడంటాడు.
మనం మన హిందీ లెజెండ్ దగ్గరకు వద్దాం. ఎందుకంటే అతను కూడా తన ఆస్తిని వారసులకు ఎలా అప్పగించాలో తెలియక పోవడం వల్ల అంతిమ దశలో కలలో కూడా ఊహించని నిరాదరణకు గురయ్యారు. .
***
దాదాసాహెబ్ పాల్కె అవార్డు పొందిన తొలి తెలుగు వారు ఎవరు? అంటే అక్కినేని నాగేశ్వరరావు అని చెబుతారు. అక్కినేనికి 1991లో దాదాసాహెబ్ పాల్కె అవార్డు లభిస్తే, దశాబ్దం ముందు 1980లోనే ఓ తెలుగు నటునికి దాదా సాహెబ్ పాల్కే అవార్డు వచ్చింది. తెలుగు వాడే అయినా ఒక్క తెలుగు సినిమాలోనూ నటించలేదు. 11 మూకీ సినిమాలు, 170 వరకు హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ సినిమాల్లో నటించిన జైరాజ్ ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమాలోనూ కనిపించక పోవడం విచిత్రం. పి జయరాజ్ పేరు వినగానే హిందీ సినిమాల గురించి కనీస పరిచయం ఉన్న పాత తరం వారు ప్రతి ఒక్కరూ అద్భుతమైన నటుడు అంటారు. పి జయరాజ్ అసలు పేరు జైరుల నాయుడు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో పుట్టిన పైడిపాతి జైరుల నాయుడు హిందీతో పాటు గుజరాతి, మరాఠీ భాషల సినిమాల్లోనూ నటించిన జయరాజ్‌ను తెలుగు సినిమా ప్రపంచం పట్టించుకోలేదు. ఆయనా తెలుగు సినిమాను పట్టించుకోలేదు. జైరాజ్ తన ఆత్మకథలో, తనపై నిర్మించిన డ్యాకుమెంటరీలో తాను కరీంనగర్‌లో జన్మించానని చెప్పేంత వరకు జైరాజ్ మూలాల గురించి సినిమా వారికి పెద్దగా తెలియదు.
సరోజినీనాయుడుకు దగ్గరి బంధువు అయిన జైరాజ్ పుట్టింది కరీంనగర్‌లో హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో చదువుకున్నారు. వయసులో ఉన్నప్పుడు జైరాజ్‌కు ఇంగ్లాండ్ వెళ్లి చదువుకోవాలని ఆసక్తిగా ఉండేది. తల్లి తన అన్నకే ప్రాధాన్యత ఇస్తుందనే కోపంతో 1929లో ఇంట్లో నుంచి బొంబాయికి పారిపోయాడు. ఓడరేవులో పనికి కుదిరాడు. ఆయన సినిమా పోస్టర్లు వేసేవారు. ఆ సమయంలోనే అనేక మూకీ సినిమాల్లో నటించారు. రైఫిల్‌గర్ల్, బాబీ, హమారా బాత్ వంటి మూకీ సినిమాల్లో నటించారు. తరువాత స్వామి, తమన్న, హతిమ్‌తాయి సినిమాల ద్వారా మంచి పేరు సంపాదించారు. తొలి తరం సౌందర్య రాశులు మీనా కుమారి, మధుబాల, సురయలతో నటించారు. దిలీప్‌కుమార్ సినిమాకు దర్శకత్వం వహించారు. జైరాజ్ నటించిన చివరి సినిమాల్లో ఒకటి ఖూన్‌బరీ మాంగ్. రేఖ, రిషికపూర్, కమల్ హసన్‌ల, డింపుల్ కపాడియాలతో కలిసి నటించారు. చిత్రంగా ఇదే పేరుతో జైరాజ్ ప్రారంభంలో ఒక సినిమా రూపొందించారు. అందులో భరత్‌భూషణ్, నర్గీస్‌తో పాటు జైరాజ్ నటించారు. చారిత్రక, పౌరాణిక సినిమాల్లో మంచి గుర్తింపు పొందారు. టిప్పుసుల్తాన్, హైదర్ అలీ బేగ్, రాణాప్రతాప్‌గా నటించి మంచి గుర్తింపు పొందారు. హిందీ సినిమా రంగంలో అత్యంత గౌరవం పొందిన నటుడాయన. ఆయన జన్మదినం రోజున ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకులు, సినీ ప్రముఖులంతా జైరాజ్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పేవారు. ఈ సంప్రదాయం చాలా కాలం వరకు సాగింది. క్రమంగా జైరాజ్ సినిమా ప్రపంచాన్ని వదిలి ఇంటికి పరిమితం అవుతూ వచ్చిన కాలం వరకు ఇది సాగింది.
కొత్త తరం వచ్చింది... కొత్త పోకడలు, జైరాజ్ ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వచ్చింది. .
***
నా జీవితం చివరి దశలోఇంట్లో నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. అంటూ జైరాజ్ కోర్టులో వాపోవడం కంటతడిపెట్టించింది. హిందీ సినిమా ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన జైరాజ్ 91 ఏళ్ల వయసులో ప్రశాంతమైన జీవితం కోసం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా ఎంతో సంపాదించాడు. ముంబైలో ఎన్నో ఆస్తులు ఉన్నాయి. తన కుమారుడు దిలీప్‌రాజ్ వ్యాపారం ప్రారంభిస్తున్నానని చెప్పగానే ఆస్తులను అమ్మి ఇచ్చాడు. కుమారునిపై అజమాయిషీ చేసే వయసు కాదు అతనిది.
ఏదో కొత్త వెంచర్ ప్రారంభిస్తున్నాను , డబ్బు కావాలి అని కుమారుడు అడిగితే తండ్రి ఇవ్వలేదు. హాకీస్ట్రిక్ తీసుకొని కుమారుడు తండ్రిని కొట్టాడు. ఇంట్లోకి సందర్శకులు రావద్దని, ఫోన్ చేయవద్దని ఆంక్షలు విధించారు. దీంతో స్నేహితులు, పెద్దలు వచ్చి పంచాయితీ చేశారు. దిలీప్‌రాజ్‌ను ఇంటి నుంచి పంపించి వేశారు. కుమారుడి ఖర్చుల కోసం తండ్రి ప్రతి నెల డబ్బు ఇవ్వాలనే ఒప్పందం కుదిరింది. కొంత కాలం గడిచాక జైరాజ్ భార్య మరణించిన తరువాత దిలీప్‌రాజ్, ఆయన భార్య వచ్చి నార్త్‌వెస్ట్ ముంబైలోని ఫాలీ హిల్స్‌లోని జైరాజ్‌కు చెందిన ఫ్లాట్‌ను ఆక్రమించేసుకున్నారు. చివరకు జైరాజ్‌ను ఆయన ఇంట్లోనే బందీగా మార్చేశారు.
ఓ రోజు దిలీప్‌రాజ్ సోదరి గీతకు ఫోన్ చేసి తమ తండ్రి జైరాజ్ పదే పదే గుర్తు చేస్తున్నాడని చెప్పాడు. జైరాజ్ ఫోన్ తీసుకుని కన్నీరు పెడుతూ తనను హింసిస్తున్నారని ఎలాగైనా వచ్చి రక్షించమని కోరాడు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న తన తండ్రి దయనీయంగా ఏడవడాన్ని కూతురు తట్టుకోలేక పోయింది. కలకత్తాలో ఉన్న కూతురు వెంటనే ముంబై వచ్చింది. ఈ వయసులో నీ సహాయం కావాలి, వెంటనే రమ్మని తండ్రి కోరడంతో మరుసటి రోజే విమానంలో కుమార్తె ముంబై వచ్చింది. కనీసం సరైన దుస్తులు కూడా లేవు, గదిలో వాసన వస్తోంది, స్నానం చేసి ఎన్ని రోజులు అయిందో అనిపిస్తోంది. వెంటనే డాక్టర్‌ను పిలవడంతో ఆయన చికిత్స ప్రారంభించారు. నాన్న కోసం కొన్ని బట్టలు కొనుక్కొచ్చాను. రెండు నెలల పాటు నేను ఇంట్లోనే ఉండి తండ్రిని చూసుకున్నాను కానీ కుమారుడి నుంచి సరైన సహాయం లేదు. కనీసం మాకు తిండికూడా పెట్టలేదు. నేను వండుకోవడం లేదా, హోటల్ నుంచి తెప్పించుకోవడం చేశాను. అమెరికాలో ఉన్న మరో సోదరుడు వచ్చి చూశాడు కానీ తిరిగి వెళ్లక తప్పని పరిస్థితి కాబట్టి వెళ్లిపోయాడు. చూసి పోదామని వచ్చాను కానీ పరిస్థితి చూశాక ఇలా వదలివెళ్లలేక పోయాను అంటూ జైరాజ్ కుమార్తె గీత జరిగిన విషయం కోర్టుకు చెప్పింది. నా చివరి రోజులు ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను. అంటూ జైరాజ్ న్యాయమూర్తికి చెప్పారు. ఆ ఫ్లాట్‌పై తండ్రికే అధికారం ఉందని, కుమారుడు రోజుకు ఒకసారి చూసి వెళ్లడం తప్ప అక్కడ ఉండేందుకు వీలు లేదని కోర్టు ఆదేశించింది. ఆ తరువాత జైరాజ్ ఎక్కువ రోజులు బతకలేదు. 2000 సంవత్సరం ఆగస్టు 11న జైరాజ్ కన్ను మూశారు.
ఆస్తులు పెంచుకోవడమే కాదు పిల్లలకు తల్లిదండ్రులపై అభిమానం అనే డిపాజిట్ కూడా పెంచుకోవాలి.

*

17, ఆగస్టు 2014, ఆదివారం

ఔను వాళ్లు ప్రధాన సేవకులు

‘‘ఏం వినయం... ఏం విధేయత... రెండు మూడు దశాబ్దాల క్రితం వచ్చి ఉంటే మన దేశం స్వర్ణ్భారత్ అయిపోయేదండి ’’ అంటూ శ్రీమతి కళ్లు తుడుచుకుంది. శ్రీవారిని చూస్తూ ‘‘ఆనంద భాష్పాలు.. మన పిల్లలు బుడి బుడి అడుగులు వేసేప్పుడు సంతోషంతో డ్యాన్స్ చేయాలనిపించింది. చిన్నోడు మాటలు నేర్చుకునేప్పుడు ముద్దు ముద్దు గా పలికే పలుకులు ఆనంద సాగరంలో ముంచెత్తాయి. మళ్లీ ఇంత కాలానికి నాకు అంత సంతోషం కలుగుతోంది ’’ అంటూ శ్రీమతి భావోద్వేగంతో చెప్పుకుపోతోంది.


‘‘పిచ్చి శ్రీమతి ఇంతోటి దానికి అంతగా సంతోష పడాలా? నువ్వు సహకరిస్తే, ఇలాంటి అద్భుతాలు మరెన్నో చేస్తాను. కాలనీ వాళ్లు మనను చూసి కుళ్లుకుని చావాలి. నిజం చెప్పొద్దు డార్లింగ్ ప్రెష్‌కు వెళ్లి కిలో టొమాటో ఇవ్వమని అనగానే అంతా నావైపు ఆశ్చర్యంగా, సంభ్రమాశ్చర్యాలతో చూస్తుంటే గర్వంతో చాతి పొంగి పోయింది. పాన్ కార్డు చూపించేంత వర కు వాడు కిలో టమాట ఇవ్వలేదనుకో. కానీ మన అదృష్టాన్ని చూసి అక్కడున్న వాళ్లంతా కుళ్లుకున్నారంటే నమ్ము. ఎంతైనా మన స్టేటస్‌కు కిలో టమాట పెద్ద కష్టమేమీ కాదు కదా? కొడుకు, కోడలు, కూతురు అల్లుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు నాది సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ నీది స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కిలో టమాట కొనడం మాకో లెక్క కాదని కాలరెగరేసి గర్వంగా చెప్పాననుకో’’ అంటూ శ్రీవారు చెప్పుకుపోతున్నారు.
శ్రీమతి అడ్డుతగిలి ‘‘మీకు తెలుసు కదా చిన్నప్పుడు నేను కమ్యూనిజాన్ని బాగా ఇష్టపడ్డాను. ఏనాటికైనా సమాజంలో అందరూ టొమాటో కొనే స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటాను. నా సంతోషానికి కారణం అది కాదు. అని శ్రీమతి బయట ఉన్న కారువైపు చూడడంతో ‘‘ ‘‘లీటరు పెట్రోల్ ధర రూపాయిన్నర తగ్గించినందుకే అంత సంతోషమా? మరో వారంలో రెండు రూపాయలు పెంచి చూపిస్తారు.’’ అని శ్రీవారు చెప్పారు. టీవి రిపోర్టర్‌లా నీకు తోచింది మాట్లాడేయడమేనా? నేను చెప్పేది వింటావా? ’’అని శ్రీమతి లైవ్ ప్రోగ్రామ్‌లో యాంకర్‌లా అడ్డుతగిలింది.


‘‘ఇంతకూ నీకు అంత సంతోషం కలిగించిన విషయం ఏమిటో చెబితే నేనూ సంతోషపడతాను’’ అని శ్రీవారు అడిగారు.
‘‘చూడండి మన దేశ ప్రధాని ఎంత వినయంగా మాట్లాడుతున్నాడు. ప్రధాన సేవకున్ని అంటున్నాడు. మాటలు ఎంత ముచ్చటగా ఉన్నాయో, ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని ఇలాంటి వారిని చూసే అన్నారనిపిస్తోంది. సంకలోని పిల్లాడు గద్దెనెక్కినా మన గురించే ఆలోచిస్తున్నాడని ఆనంద భాష్పాలు రాల్చాలనిపిస్తుంది.
నేను ప్రధాన మంత్రిని కాదు ప్రధాన సేవకుణ్ణి వాహ్ క్యా డైలాగ్..హై ... క్యా బాత్ హై అని భాష నేర్చుకుని మరీ హిందీలో అభినందించాలనిపిస్తోంది. .... ’’ అని శ్రీమతి సంతోషంగా అంది.


‘‘నీ సంతోషానికి ఇదా కారణం? ’’ ఐతే నువ్వు మన తెలుగు ముఖ్యమంత్రుల ఉపన్యాసం వినలేదన్నమాట’’ అని శ్రీవారు అడిగారు.
ఆ మధ్య డాక్టర్ ఆరోగ్యం కుదుట పడేంత వరకు తెలుగు టీవిలకు దూరంగా ఉండమన్నారు అందుకే చూళ్లేదు ఏంటీ విషయం అని శ్రీమతి అడిగింది.
‘‘అదీ సంగతి నువ్వు తెలుగు టీవిలు చూడలేదు కాబట్టి అలా అంటున్నావు. ఒకవేళ చూసి ఉంటే మన తెలుగు ముఖ్యమంత్రులు ఎప్పటి నుంచో చెబుతున్న మాటలను ఇప్పుడు మోదీ కాపీ కొట్టారని గ్రహించే దానివి’’ అని శ్రీవారు అన్నారు.
‘‘ఎలా?’’
‘‘ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయగానే ఏమన్నారు? రాజకీయాలను పక్కన పెడదాం ఇప్పుడు మనందరి లక్ష్యం తెలంగాణ సాధన కావాలి అని అన్నారా? లేదా? అందరూ రాజకీయాలు పక్కన పెట్టినా పెట్టక పోయినా కేసిఆర్ పిలుపు మేరకు తెలంగాణ ప్రజలు అన్ని పార్టీలను పక్కన పెట్టి టిఆర్‌ఎస్‌కు అధికారం అప్పగించారు. మరి కేసిఆర్ ఇప్పుడేమంటున్నారు. రాజకీయాలు పక్కన పెడదాం బంగారు తెలంగాణ కోసం అందరం కలిసి పని చేద్దాం అంటున్నారా? లేదా? ’’
‘‘ ఔను అంటున్నారు .. ఇందులో తప్పేముంది’’ అని శ్రీమతి అడిగింది.
‘‘ఆగాగు మన బాబు గారు 95లో అన్నను దించి అధికారం చేపట్టినప్పుడు ఏమన్నారు. రాష్ట్రం క్లిష్టపరిస్థితిలో ఉంది మీరంతా స్వర్ణాంధ్ర సాధనకు రాజకీయాలు పక్కన పెట్టాలని అన్నారా? లేదా?’’ అని శ్రీవారు అడిగారు.
‘‘అదేం తప్పు మాట కాదు కదా? 1999లో అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఇదే మాట అన్నారు. ఇప్పుడు మళ్లీ 2014లో కూడా ఇదే మాట అంటున్నారు. ఆయన మాట మీద నిలబడతారు’’ అని శ్రీమతి అంది.
‘‘అది సరే మరి ఆ మధ్యలో ఉన్న పదేళ్ల సంగతి చెప్పవేం... ఆ పదేళ్లలో ఆయన రాజకీయాలు చేయకుండా కనీసం ఒక్క రోజైనా ఉన్నారా’’ అని శ్రీవారు అడిగారు. ఊపిరి తీసుకోకుండా ఉండాలని మనిషిని కోరుకోవడం ఎంత అన్యాయమో, రాజకీయం చేయకుండా ఉండాలని నాయకులను కోరడం అంతే ’’ అని శ్రీవారు చెప్పారు.
‘‘ఐతే’’ అని శ్రీమతి అడిగింది.


‘‘తెలుగు నేతలిద్దరూ ఎప్పుడో చెప్పిన మాటలే మోదీ ఇప్పుడు చెబుతున్నవి. మనకు భాష తెలియదు కానీ తమిళంలో అమ్మ, బీహారీలో నితీష్ అస్సామిలో మహంత, గగోయ్‌లు, కన్నడంలో రామయ్యలు ఇవే మాటలు చెబుతారు. కుర్రాడైనా యూపిలో అఖిల్ బాబు హిందీలో చెప్పింది ఇదే మాట.. నేను సిఇఓను అని ఓడిపోవడానికి ముందు బాబు చెప్పిన మాటను మోదీ ప్రధాన సేవకుణ్ణి అంటున్నారు. ’’ అని శ్రీవారు చెప్పారు.
‘‘అది కాదండీ ఎందుకో మోదీ అందరి లాంటి వారు కాదనిపిస్తోంది. ‘దేశ హితం కోసం నేడొక శుభకార్యం చేసి త్రివర్ణ పతాక గౌరవం పెంచుదామని ’స్వయంగా నరేంద్ర మోదీ నా సెల్‌ఫోన్‌కు ఒక సందేశం పంపించారు. అని శ్రీమతి సందేశం చూపించింది. ‘‘మోదీ నీ సెల్‌ఫోన్‌కు సమాచారం పంపగలరు. టొమాటో ధర తగ్గించమని కోరుతూ ఆయనకో ఎస్‌ఎంఎస్ పంపించు చూద్దాం ’’ అని శ్రీవారు కొంటెగా నవ్వారు.
నీతి: అధికారంలోకి వచ్చిన వారి తొలి బాధ్యత నీతులు చెప్పడం.

రాజ మహల్ నుంచి అద్దె గది లోకి సినిమా రాణి జీవిత పయనం.. ఆమెపెరుతో మద్రాస్ లో ఓ వీధి ఉంది ... కానీ ఆమెకే ఓ ఇల్లు లేదు

సినిమా శుభంతో ముగుస్తుంది. కానీ ఆ సినిమా వారి జీవితం శుభంతోనే ముగియాలనేమీ లేదు. ప్రయోగంలో చిన్న పొరపాటు జరిగినా జీవితం తలక్రిందులు అవుతుంది. ఇది సినిమా రంగానికి సైతం వర్తిస్తుంది. మద్రాసు మహానగరంలో డజన్లు భవనాలతో రాజవైభోగాన్ని అనుభవిస్తున్న ఆ హీరోయిన్ జీవితంమే ఓ ప్రయోగం.
ఆమె అందానికి ముగ్దులై ఆమెకు సినిమా రాణి అనే అవార్డును బహూకరించారు. ఆమె అందాన్ని చూసేందుకు ఆమె నటించిన సినిమాలకు వెళ్లేవారు. అలాంటి సమయంలో నటిగా తన ప్రతిభను చాటే విధంగా ఇదియా గీతం అనే ఓ తమిళ సినిమాలో ఆమె వృద్ధురాలిగా నటించారు. ఆమె సాహసాన్ని హర్షించలేదు. అందాల రాణికి వయసు అయిపోయింది అనుకున్నారు అభిమానులు. ఆ సినిమా ఆమెకున్నదంతా ఊడ్చుకు పోయేట్టు చేసింది. ఆ సినిమా దెబ్బతో ఆమె కోలుకోలేకపోయారు.
***
కలైమామణి తమిళనాడులో కళారంగంలో కృషి చేసిన వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే అత్యున్నతమైన అవార్డు. కలైమామణి అవార్డు బహూకరణ కోసం సమయం ఆసన్నమవుతోంది. తమిళప్రజలకు ప్రత్యక్ష దైవం లాంటి ఎంజి రామచంద్రన్ లాంటి వారు సైతం వేచి చూస్తున్నారు. అవార్డు గ్రహీతలే ఇంకా రాలేదు. అందరిలో ఉత్కంఠత... సభలకు ఎంత ఆలస్యంగా వస్తే అంత గుర్తింపు అనేది కొందరి భావన. కానీ ఆ అవార్డు గ్ర హీత ఆలస్యానికి కారణం అది కాదు. సినిమా రంగంలో ఎంతో కీర్తిగడించిన, ఒకప్పుడు రాజభోగాన్ని అనుభవించిన ఆమెకు ఆ సమయంలో సభాస్థలికి వెళ్లడానికి ఓ వాహనం కూడా లేదు. ఏం చేయాలో తెలియక తమలో తామే మదనపడిపోతూ ఇంటి వద్దనే ఉండిపోయారు. విషయం తెలిసిన ఎంజి రామచంద్రన్ స్వయంగా తన వాహనాన్ని ఇచ్చి తన పిఎను పంపించి కలైమామణిని రప్పించారు.
***
ఆమె మరెవరో కాదు దక్షిణ భారత దేశంలో తొలి మహిళా దర్శకురాలు, నిర్మాత ఒకప్పటి అందాల తార. టిపి రాజలక్ష్మి. ఆమె హీరోయిన్, దర్శకురాలు, సినిమాకు కథ , మాటలు రాశారు. మంచి గాయని. ఆమె జీవితం సినిమా కథను తలపిస్తుంది. టిపి రాజలక్ష్మికి తెలుగు సినిమా రంగంతో కూడా అనుబంధం ఉంది. తెలుగునాట తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద. అయితే అంతకు ముందే తెలుగు తమిళంలో వచ్చిన కాళిదాసు సినిమాలో టిపి రాజలక్ష్మి హీరోయిన్. ఇది తొలి తెలుగు, తమిళ టాకీ సినిమా అనేది ఓ వాదన. ఈ సినిమాలో హీరో టి వెంకటేశ్ తెలుగువారే. అతను తెలుగులో మాట్లాడితే రాజలక్ష్మి తమిళంలో సమాధానం చెబుతుంది. ఎల్‌వి ప్రసాద్ కూడా ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు. గులేబకావళి కథను తమిళం, తెలుగు, హిందీలో తీశారు. తమిళ సినిమాలో హీరోయిన్ రాజలక్ష్మి.
భానుమతి దర్శకత్వంలో 1953లో తెలుగు, తమిళ భాషలో చండీరాణి సినిమా వచ్చింది. భానుమతి కన్నా 17 ఏళ్ల ముందు 1936లోనే దక్షిణాదిలోనే తొలి మహిళా దర్శకురాలిగా రాజ్యలక్ష్మి రికార్డు సృష్టించారు. తాను స్వయంగా రాసిన నవలతో మిస్ కమల అనే సినిమా 1936లో తీశారు.
***
బాల్యం నుంచి ఆమె జీవితం సినిమాలానే ఊహించని మలుపులతో సాగింది. నవంబర్ 11, 1911లో రాజ్యలక్ష్మి మద్రాసు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో జన్మించారు. తండ్రి మరణించడంతో వారి కుటుంబం జీవనోపాధి కోసం తిరుచ్చికి తరలి వెళ్లింది. వివాహం అంటే ఏమిటో తెలియని చిన్న వయసులోనే బాల్యవివాహం జరిగింది. మంచి గాత్రం ఉండడంతో నాటకాల్లో పాడేందుకు అంగీకరిస్తే, భర్త, అతని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దాంతో ఆమె వివాహ జీవితానే్న వదులుకుంది. డ్రామాల్లో నటించడానికి ఆసక్తి చూపించిన ఆమెను స్వాతంత్య్ర పోరాటం బాగా ఆకర్షించింది. వివాహ జీవితం పట్ల ఆసక్తి చూపించలేదు. 12ఏళ్ల వయసులో విడాకులు తీసుకుంది. చిన్న వయసులోనే నాటకాలకు దర్శకత్వం వహించడం ప్రారంభించింది. నాటకాల నుంచి సినిమాలవైపు వెళ్లింది. 1930 నాటికి ఆమె స్టార్‌గా మారింది. 20 ఏళ్ల వయసులో ఆమె అందానికి సినిమా రాణి అనే అవార్డు లభించింది. తన సహ నటుడు టివి సుందరాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ కాలంలోనే ఆమె బాల్య వివాహాలను, ఆడవారి పట్ల, పిల్లల పట్ల చూపుతున్న వివక్షతను వ్యతిరేకించారు.
శ్రీ రాజ్యం టాకీస్ పేరుతో ఆమె సొంతంగా సినిమా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. రాజలక్ష్మి పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని మద్రాసులో ఆమె నివసించే వీధికి రాజరత్నం స్ట్రీట్ అని పేరు పెట్టారు. ఆ వీధిలో ఆమెకు 12 పెద్ద భవనాలు ఉండేవి. రాజరత్నం స్ట్రీట్ నంబర్ వన్‌లో భారీ భవనం రాజమహల్‌లో ఆమె నివసించే వారు.
దేశభక్తిని ప్రబోధించే కథతో ఇదియ తాయి సినిమా నిర్మించారు. ఆ సినిమాలో ఆమె వృద్ధురాలిగా నటించారు. రాజలక్ష్మి వయసు మీరిందని, , ఆమెకు పూర్వం నాటి అందం లేదనే నిర్ణయానికి అభిమానులు వచ్చారు. ఆ సినిమా తరువాత రాజలక్ష్మికి చాలా తక్కువగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఆదాయం తగ్గడంతో క్రమంగా ఆస్తుల అమ్మకం ప్రారంభం అయింది.
నటనలో, సినిమాలకు దర్శకత్వం వహించడంలో బోలెడు ప్రతిభ ఉన్నా జీవించే కళలో ఆమెకు ప్రవేశం తక్కువే. అందుకే తన ఆస్తి ఎంతుంది, ఏమవుతోంది. ఆస్తిని ఎందుకు అమ్ముతున్నారు. ఇలా అమ్ముతూ పోతుంటే ఏమవుతుంది అనే ఆలోచన ఆమెకు రాలేదు. నిజానికి ఆమె ప్రమేయం లేకుండానే ఆస్తుల అమ్మకాలు సాగిపోతున్నాయి. సినిమాల్లో అవకాశాలు తగ్గిన తరువాత భవిష్యత్తు జీవితం గురించి ఆమె వాస్తవిక దృక్పథంతో ఆలోచించి ఉంటే బాగుండేది. ఎంత గొప్ప నటులకైనా సినిమా అవకాశాలు తగ్గే దశ ఒకటి వస్తుంది. అలాంటి దశను ఎదుర్కోవడానికి ముందుగానే సిద్ధం కావాలి. ఆమెకు అలాంటి ముందు జాగ్రత్త ఉండి ఉంటే సినిమా అవకాశాలు తగ్గినా, అప్పటి వరకు సంపాదించిన ఆస్తిని సరైన విధంగా చూసుకుంటే భవిష్యత్తు జీవితం ప్రశాంతంగా గడిచేది. జీవిత కథ ముగింపు సుఖాంతం అయ్యేది. కానీ ఆమెకు సినిమా కథ అర్థమయినంతగా జీవిత కథ అర్థం కాలేదు. ఆస్తంతా కరిగిపోయి, ఆమె పేద రాజ్యలక్ష్మిగా మిగిలిపోయారు. ఆ సమయంలోనే కలైమామణి అవార్డు బహూకరించారు. రాజవైభోగాన్ని అనుభవించి వాహనం లేకుండా కార్యక్రమానికి వెళ్లడానికి మొహమాటపడ్డారు. ఆ సమయంలో మా అమ్మ కళ్లల్లో కన్నీరు చూసి తట్టుకోలేక పోయానని ఓ ఇంటర్వ్యూలో రాజలక్ష్మి కుమార్తె శ్రీమతి కమల చెప్పుకొచ్చారు.
పేదరికం ఆమెను కృంగదీసింది. పేదరికంపైన, సమస్యలపైన పోరాటం చేసే వయసు కాదామెది. వాటికి ఆమె లొంగిపోయింది. బిపి పెరిగిపోయింది. గుండెపోటు ఆమెను మంచానికే పరిమితం చేసింది. తన కుమార్తె కమలకు బహూకరించిన ఇల్లు తప్ప ఆస్తంతా అమ్మేశారు. ఏమైనా ఈ ఇంటిని మాత్రం అమ్మవద్దని కమలతో రాజలక్ష్మి ఒట్టు వేయించుకుంది. కుమార్తె సరే నంది. కానీ తల్లి చికిత్స కోసం ఆ ఇంటిని కూడా అమ్మక తప్పలేదు.
***
రాజలక్ష్మికి డాక్టర్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను రాజమహల్ నుంచి ఒక అద్దె ఇంటికి తీసుకు వెళ్లారు. ఆమెకు మెలుకువ వచ్చిన తరువాత బెడ్ రూమ్ అంతా మారినట్టుగా ఉందేమిటని అడిగితే మార్పు కోసం ఒక బెడ్ రూం నుంచి మరో బెడ్‌రూమ్‌లోకి తీసుకు వచ్చినట్టు చెప్పారు. ఆమె చివరి క్షణం వరకు తాను ఇంకా రాజమహల్‌లోనే ఉన్నానని అనుకున్నారు. రాజలక్ష్మి చివరి రోజుల్లో మనవడు, కమల కుమారుడు రాఘవన్‌కు అందినెరవు అనే ఉత్సవాన్ని నిర్వహించాలని కోరింది. తనకు అవార్డుగా లభించిన కడియాన్ని కరిగించి మనవడికి బంగారు ఉంగరం చేయించింది. రాజలక్ష్మి 1964లో తనువు చాలించారు.
***
ఏ పాత్ర ఎలా ఉండాలి, ఏ పాత్ర ఎలా ప్రవేశించాలి, ఏ పాత్ర ముగింపు ఎలా ఉండాలో నాటకంలోనైనా సినిమాలోనే కచ్చితంగా ఒక ప్రణాళికా బద్ధంగా ఉండే రాజలక్ష్మి తన జీవిత కథ ఎలా ఉండాలో నిర్ణయించుకోలేక పోయారు. సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం కొద్దిమందికే లభించవచ్చు. కానీ ఎవరి జీవితానికి వారే దర్శకులు. తన జీవిత కథ ఎలా ఉండాలో రాసుకునే అవకాశం ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. *

14, ఆగస్టు 2014, గురువారం

అపూర్వ సహోదరులు

‘‘ఏంటీ పేపర్ చదువుతూ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? మాకూ చెబితే మేమూ నవ్వుతాం కదా? ఐనా నవ్వుకోవడానికి ఏముంది ప్రమాదాలు, మరణాలు, కరువు వార్తలే కదా? పత్రికల నిండా!’’
‘‘సంతోషంలోనే కాదు అప్పుడప్పుడు బాధతో కూడిన నవ్వులు కూడా ఉంటాయి’’
‘‘మరి నీ నవ్వు ఏమిటో? ’’
ఆ సంగతి ఎందుకు కానీ ... రెండు రాష్ట్రాల పాలన చూస్తే ఏమనిపిస్తోంది? నాకైతే ఈ రాజకీయాలను చూశాక వీళ్లు అపూర్వ సహోదరులు అనిపిస్తోంది’’
‘‘ఎందుకలా’’
‘‘చిన్నప్పుడు చదివిన కథ ఒకటి గుర్తుకొస్తున్నది చెప్పమంటావా? ’’
‘‘ఇరు రాష్ట్రాల పాలన గురించి చెబుతానని చెప్పి కథ చెబుతానంటావేమిటి?’’
‘‘అర్ధం చేసుకుంటే రెండూ ఒకటే’’
‘‘సర్లే చెప్పాలని నిర్ణయించుకున్నప్పుడు వద్దన్నా ఊరుకుంటావా? చెప్పు వింటాను’’


‘‘ఒక అడవిలో కొంగ నక్క స్నేహితులు’’
‘‘అడవిలో నక్కలుంటాయి కానీ కొంగలుంటాయా? ఉన్నా వాటి మధ్య స్నేహం ఉంటుందా? ’’
‘‘అలా అంటే ఈ రోజుల్లో నక్కలు అడవిలో ఉన్నాయో లేవో కానీ జనారణ్యంలో మాత్రం నక్కలకు కొదవ లేదు. చిన్నప్పటి కథ అన్నాను కథ వినాలంటే లాజిక్కులుండవద్దు. చెప్పింది విను ’’
‘‘చిన్నప్పుడు విన్న కథే అందుకే ప్రశ్నలడిగాను. సరే వింటాను చెప్పు ’’
పైకి ఆ రెండూ స్నేహితులుగానే ఉన్నా ఒకటంటే ఒకదానికి పడదు. మా ఇంట్లో పాయసం చేశాను రా అని నక్క కొంగను పిలుస్తుంది. వెడల్పైన పళ్లెంలో పాయసం పోస్తే పొడవైన ముక్కుతో పాయసం తాగలేక కొంగ ఇబ్బంది పడితే నక్క మాత్రం మొత్తం తాగేస్తుంది. కడుపు మాడ్చుకుని కొంగ తిరిగి వెళుతుంది. భలే అవమానించాను అని నక్క మురిసిపోతుంది. కొంత కాలానికి ఈ విషయం నక్క మరిచిపోతుంది. చేపల పులుసు చేశాను రా మావా అంటూ కొంగ నక్కను విందుకు ఆహ్వానిస్తుంది. ఇరుకు మూతిగల రెండు కూజాల్లో చేపల పులుసు పోస్తుంది. కొంగ పొడవైన ముక్కుతో కూజాలోని చేపల పులుసు లాగించేస్తుంది. నక్క మాత్రం ఏమీ చేయలేక కడుపు మాడ్చుకుంటుంది. ఇదీ కథ’’


‘‘ చిన్నప్పుడే చదివానులే.. ఇంతకూ ఎందుకు చెబుతున్నావు’’
‘‘ ఏందుకో సడెన్‌గా గుర్తుకొచ్చింది. సృష్టిలో ప్రతి ప్రాణికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, కొన్ని లోపాలు ఉంటాయి. ప్రాణులకే కాదు ప్రాంతాలకూ ఉంటాయి. కొంగ పొడవైన ముక్కుతో పాయసం తాగలేనప్పుడు నక్క నవ్వుకుంది. ఆ సమయంలో పొడవైన ముక్కు కొంగకు ప్రతికూల అంశం. అదే పొడవైన ముక్కు చేప పులుసు దగ్గరకు వచ్చే సరికి అనుకూల అంశంగా మారిం ది. ఎంత జిత్తుల మారి నక్కయినా ఇరుకు మూతిలో నుంచి చేప పులుసు తినలేదు కదా?.. సింహంతో స్నేహానికి సైతం ఆ జిత్తుల మారితనం ఉపయోగపడవచ్చు . అక్కడ జిత్తుల మారి తనమే నక్కకు అనుకూల అంశం ’’
‘‘ ఔను నిజం చీమలాంటి చిన్న ప్రాణికి సైతం సృష్టిలో ఏవో కొన్ని ప్రత్యేకతలుంటాయి.’’
‘‘ అది సరే ఇప్పుడా కథ ఎందుకూ ?’’
‘‘తెలివి మా సొంతం అనుకుంటే పప్పులే కాలేస్తారు..... రోజులన్నీ ఒకేలా ఉండవు అని చెప్పడానికి’’
‘‘ చెప్పేదేదో నేరుగా చెప్ప వచ్చు కదా? డొంక తిరుగుడు ముచ్చట్లెందుకు? ’’
‘‘ రెండు రాష్ట్రాల పాలనను చెప్పేందుకు ఈ కథ చెప్పాను అని నేను అంటే నీ నుంచి వచ్చే మొదటి ప్రశ్న.. ఇందులో నక్క ఎవరు, కొంగ ఎవరు? అనే ప్రశ్న వస్తుంది కదా? ’’
‘‘ వచ్చి తీరుతుంది. ఇంతకూ నక్క ఎవరు? కొంగ ఎవరు? ’’
‘‘ అందుకే నేరుగా చెప్పకుండా డొంక తిరుగుడుగా చెప్పాల్సి వస్తున్నది’’
‘‘ నాకు పలానా నాయకుడు కొంగలా, మరో నాయకుడు నక్కలా కనిపిస్తే, నీకూ అలానే కనిపించాలనేమీ లేదు. నాకు కనిపించిన దానికి రివర్స్‌లో నీకు కనిపించ వచ్చు కదా? ’’
‘‘అయితే’’
‘‘ అప్పుడు మనిద్దరి మధ్య కూడా రెండు రాష్ట్రాల పాలకుల్లా ఘర్షణ తప్పదు’’
‘‘ ఆ నేత చక్కగా చర్చలకు ఆహ్వానించాడు కదా’’
‘‘ చర్చకు కాదు కత్తియుద్ధానికి ఆహ్వానించినట్టుగా ఉంది’’
‘‘నీకెందుకలా అనిపించింది’’
‘‘చెప్పాను కదా ఇప్పుడు మనం రెండు రాష్ట్రాలుగా విడిపోయాం. కొన్ని విషయాలు నేరుగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఇబ్బంది. ‘అఖల్‌మంద్‌కో ఇషారా’ చాలన్నట్టు చెబితే అర్ధం చేసుకోవాలి ’’
‘‘ సరే అలాగైనా చెప్పు’’
ఎప్పుడైనా బంధువుల పంచాయితీ విన్నావా?
ఊ చెప్పు
చర్చలకు ఇద్దరి ఆహ్వానాలు విన్నాక
బంధువుల మధ్య సాగే గొడవ గుర్తుకొచ్చింది.
***


‘‘ఇదిగో వదినా మీరెంత దౌర్జన్యం చేసినా, మీరెంత రౌడీయజం చేసినా నాది మీలాంటి చిన్న మనసు కాదు. మీరెంత దుర్మార్గులైనా మంచి మనసుతో మాట్లాడుకుందామని పిలుస్తున్నాను. ఇప్పుడే చెబుతున్నాను ఐదేళ్లలో మీ ఇల్లు నాది కాకపోతే అప్పుడడగండి. ఇది నా చాలెంజ్. నా ఇల్లు నాదే, ఐదేళ్ల తరువాత మీ ఇల్లు నాదే. బస్తీమే సవాల్.. అయినా సరే గౌరవించి మాట్లాడుకుందామని పిలుస్తున్నాను. ఇదే నా ఆహ్వానం రా! మాట్లాడుకుందాం.’’
‘‘ నీ ముదనష్టపు తెలివి తేటలు తెలియందెవరికీ? ముందా నల్లికుట్ల పనులు మానుకుంటానంటే మీ ఆహ్వానాన్ని మన్నించి చర్చలకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానొదినా. కరెంటాఫీసుకు వెళ్లి మా ఇంటికి కరెంటు పీకేయమని ఫిర్యాదు చేశావు. నీ మాట వినకుండా వాళ్లు చీవాట్లు పెట్టి పంపారు. ఎక్కడికి పోయినా నీ నల్లికుట్ల వ్యవహారాలు పని చేయలేదు. ఇరుగు పొరుగు వారితో బుద్ధిగా మసులుకో అని బుద్ధి చెప్పి పంపించారు. అయినా నీ వంకర బుద్ధి మారలేదు. కానీ నేను నీలాంటి దాన్ని కాదు అందుకు నీ బుద్ధి మార్చుకుంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్నాను. అయితే నీ బుద్ధి మారిందని ముందుగా లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలి ’’
***


‘‘చర్చలకు ఎంత చక్కగా ఆహ్వానించుకున్నారు కదూ. అచ్చం మన పాలకుల మాదిరిగానే.’’
‘‘ వ్యవహారం చూస్తే భయమేస్తోంది.. ఎటు పోతుందో అని’’
‘‘భయమెందుకు? ఇద్దరిదీ రాజకీయమే... వారి రాజకీయ భవిష్యత్తు కోసమే ఇదంతా! రాజకీయం అన్నాక ఒక్క వ్యాపారమే కాదు నాటకం కూడా తప్పదీ నాటకాలు....
 (06/07/2014)

13, ఆగస్టు 2014, బుధవారం

కవి..మానవ హక్కులు!

అచ్చం సినిమాలో కోర్టు హాలును చూపించినట్టుగానే ఉంది అక్కడ వాతావరణం. తనతో మాట్లాడుతున్న వ్యక్తిని పరిచయం చేసుకుంటూ ‘‘నేను కవిని మరి మీరు’’ అని కవి అడిగాడు. అప్పటి వరకు సరదాగా కబుర్లు చెప్పిన ఆ వ్యక్తి భయపడుతూ ‘‘నేను చెవిటివాడిని’’ అని చెప్పి ముఖం పక్కకు తిప్పాడు. న్యాయమూర్తి వస్తుండడంతో బిళ్ల బంట్రోతు తన వంతు డైలాగు చెప్పడంతో అంతా నిశ్శబ్దంగా ఉన్నారు. మానవ హక్కుల కమిషన్‌లో కీలక కేసుల విచారణ ఉండడంతో చాలా మందే వచ్చారు.
‘‘నువ్వు కవివా?’’ అంటూ అంత దూరం నుంచే కవిని చూసి న్యాయమూర్తి ప్రశ్నించాడు. ‘‘నా కవితా కిరణాలు మీ వరకూ ప్రసరించాయా?’’ అంటూ కవి మురిసిపోయాడు.


‘‘అదేం కాదు. లాల్చీ , పైజామా? భుజంపై వేలాడుతున్న కాటన్ బ్యాగు, నెరిసిన గడ్డం, నిరాశ నిండిన చూపులు ఇవన్నీ చూడగానే నువ్వు కవివని తెలిసిపోతుందిలే ’’అని న్యాయమూర్తి చెప్పాడు. ప్రమాదకరమైన వాటిని ఎక్కువ సేపు అలా ఉంచడం మంచిది కాదనుకుని కవి కేసునే విచారణకు మొదటి కేసుగా తీసుకున్నాడు.
‘‘ఈ సమాజం నాపట్ల మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది ’’ అని కవి దీనంగా పలికాడు


‘‘మాకు వచ్చేవే మానవ హక్కుల ఉల్లంఘన కేసులు... అది కాదు కానీ నీ కేసేమిటో చెప్పు’’ అని న్యాయమూర్తి అడిగాడు.
‘‘ నేనొక కవిని. సమాజాన్ని మనో నేత్రంతో చూస్తా, కవిత్వంతో అగ్నివర్షం కురిపిస్తా.. కంటి చూపుతో సమాజాన్ని మార్చేస్తా ... కవిత్వంతో సమాజాన్ని కడిగి పారేయాలనకుంటున్నాను. కానీ ఈ సమాజం నా కవిత్వాన్ని పట్టించుకోకుండా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నది. ఎక్కడికి వెళ్లినా మానవ బాంబును చూసి పారిపోయినట్టు పారిపోతున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే కదా? అందుకే మీ వద్దకు వచ్చాను’’ అంటూ కవి బ్యాగులో చేయి పెట్టగానే న్యాయమూర్తిలో ముఖంలో రంగులు మారాయి.


‘‘స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగిని. ఈసారి బోనస్ బాగానే వచ్చింది.. బోనస్ డబ్బులతో వేయించిన తాజా కవితా సంకలనం ‘ప్రభుత్వాన్ని పడగొడతాను’లో ఒక అద్భుతమైన కవిత చదువుతాను వినండి యువర్ ఆనర్.. ’’అంటూ కవి చేతిలోకి కవిత సంకలం తీసుకోగానే న్యాయమూర్తి అలర్ట్ అయి ‘‘కేసును వచ్చే జడ్జికి వాయిదా వేస్తున్నాను’’ అని ప్రకటించారు.
జడ్జిగారి మాటలను రికార్డు చేసే ఉద్యోగి ఆయోమయంగా చూస్తూ, ఎవరికీ వినిపించుకుండా మెల్లగా ‘‘సార్ కేసు వచ్చే నెలకు వాయిదా వేశారా?’’ ఆని అడిగాడు. ‘‘కాదులేవోయ్ సరిగ్గానే చెప్పాను. కేసును వచ్చే జడ్జికి వాయిదా వేశాను, కవిత్వం కవికి ప్రాణం కావచ్చు, నా ప్రాణం నాకు అంత కన్నా తీపి’’ అని బదులిచ్చాడు.
న్యాయమూర్తి ‘‘హమ్మయ్య’’ అని ఊపిరి పీల్చుకుని తరువాత కేసు విచారణ చేపట్టారు.


సార్ ఈ ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తూ మమ్ములను ఏడిపిస్తోంది అంటూ ఇద్దరు కోరస్‌గా పలికారు.
తమిళ డబ్బింగ్ సినిమాల్లో డైలాగులు, సీన్‌కు సంబంధం లేకుండా మాట్లాడకండి ముందు విషయం ఏమిటో చెప్పండి అని న్యాయమూర్తి ప్రశ్నించారు.
‘‘న్యాయమూర్తి గారు మా బాధ ఆ పగవాడికి కూడా వద్దు. ఇందిరమ్మ ఇళ్లకైనా కనీసం నాలుగు పిల్లర్‌లైనా ఉండాలి కదా’’ అంటూ మొదలు పెట్టారు.


కేసు వినేందుకు వచ్చిన వారిలో ఒకరు ఒక్కపిల్లర్ కూడా అవసరం లేకుండా వేలాది ఇందిరమ్మ ఇళ్లు కట్టి కోట్లాది రూపాయలు స్వాహా చేశారు సార్ అంటూ మెల్లగా చెప్పాడు. సైలెన్స్ సైలెన్స్ అని బిళ్ల బంట్రోతు అరవడంతో అంతా నిశ్శబ్దంగా వినసాగారు. పిల్లర్లు లేని ఇండ్లు కట్టోచ్చునేమో కానీ ప్రజాస్వామ్యానికి మాత్రం నాలుగు పిల్లర్లు కచ్చితంగా కావాల్సిందే... మేం నాలుగో పిల్లర్లం ’’ అంటూ చెబుతుంటే..
‘‘బాబూ డైయిలీ సీరియల్‌లా సాగతీత వద్దు విషయంలోకి రండి’’ అంటూ న్యాయమూర్తి కోరారు.
‘‘ఈ ప్రభుత్వం మమ్ములను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. విశ్వామిత్రుడి తపస్సు భంగం చేసేందుకు మేనక వేసినన్ని వేషాలు వేశాం అయినా చలనం లేదు,’’ అంటూ చెబుతుంటే..
‘‘అవును ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభం అవసరమే. మీ బాధ్యత మీరు ప్రభుత్వం తన బాధ్యత తాను నిర్వహించాలి. భవనంలోని రెండు పిల్లర్లు తమలో తాము కీచులాడుకుంటే భవనమే కూలిపోతుంది,’’ అని న్యాయమూర్తి చెప్పి , ఇంతకూ నీ విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన ఏ విధంగా జరిగిందో చెప్పనే లేదు’’ అని గుర్తు చేశారు.
‘‘ ఇది మొండి ప్రభుత్వం బండ ప్రభుత్వం.. మేం ఏం ప్రచారం చేసినా లేదు... మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి తెలుగు మీడియాను పట్టించుకోనందుకు అమెరికా అధ్యక్షుడికి కోపం వచ్చిందని, ఐక్యరాజ్యసమితిలో దీనిపై తీవ్రంగా చర్చించాలని నిర్ణయించుకున్నారని రాస్తే ఏమీ అనలేదు’’ అని కన్నీళ్లు తుడుచుకున్నాడు.
‘‘ఐతే’’అని న్యాయమూర్తి ప్రశ్నించాడు.


‘‘అస్సలు పట్టించుకోక పోవడాన్ని మించిన మానవ హక్కుల ఉల్లంఘన ఏముంటుంది సార్... అంతేనా ముఖ్యమంత్రి తరుచుగా తుమ్ముతున్నాడు కాబట్టి రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించనున్నారని ప్రచారం చేశాం అయినా స్పందన లేదు ’’ అని వాపోయారు.
‘‘కేసు విచిత్రంగా ఉంది... అయినా మానవతా దృక్ఫథంతో ఈ ప్రచారంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోండి.. మీరేమంటారు అని న్యాయమూర్తి ప్రభుత్వ న్యాయవాదిని అడిగితే,
నాదో సలహా అని మీడియేటర్ లేచి నిలబడ్డాడు. వీళ్లు ఏదో ఒక ప్రచారం ప్రారంభిస్తారు. ఆ మరుసటి రోజే ప్రభుత్వం దీనిపై స్పందించి ఖండించిందని వారంతట వారే రాసుకోవచ్చు. ఇదీ నా పరిష్కార మార్గం అని చెప్పాడు. సలహా ఉభయ తారకంగా ఉండడంతో అంతా అంగీకరించారు.
****
మెట్రో రైలు ప్రాజెక్టు నిలిచిపోయింది అనే ప్రచారం చదువుతూ మెట్రో ట్రయల్ రన్‌ను టీవిలో చూస్తూ పరాంకుశం నిద్రలోకి జారుకున్నాడు.

10, ఆగస్టు 2014, ఆదివారం

ప్రతిభ ఆ నటుని జీవితాన్ని కాటేసింది

దిల్‌సుఖ్‌నగర్ వైన్ షాపు ముందు ఒక వ్యక్తి నిలుచోని కాస్త మందు పోయిస్తారా? అంటూ వేడుకుంటున్నాడు. అతనలా అడగడం అక్కడున్నవారికి వింతగా అనిపించింది. అతన్ని చూసిన సినిమా వ్యక్తికి గుండె తరుక్కుపోయినట్టు అయింది.
***

ప్రతిభ అతని జీవితాన్ని కాటేసింది. అతని కుటుంబాన్ని వీధిపాలు చేసింది. అతని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసింది. ఒక్క చాన్స్ ఇస్తే తమ ప్రతిభ నిరూపించుకుంటామని సినిమా రంగంలో చాన్స్ కోసం ఎదురు చూస్తుంటారు. చాన్స్ దొరికితే ప్రతిభ నిరూపించుకునే వారు కొందరు తెరమరుగు అయ్యేవారు ఎందరో? కానీ అతని మాత్రం అతని ప్రతిభనే యమపాశంగా మారిపోయింది. గునుపూడి విశ్వనాథశాస్ర్తీ. కుటుంబమే ఆయన చిన్న ప్రపంచం. పౌరోహిత్యంతో జీవితం హాయిగా గడిచిపోతోంది. పుట్టింది తాడేపల్లి గూడెంలో సినిమా ప్రపంచం కొలువైన చిత్రపురికి పౌరోహిత్యం కోసమే వచ్చాడు. సినిమాల ప్రారంభోత్సవాల్లో తప్పని సరిగా కనిపించే పురోహితుడు అతను.
విశ్వనాథశాస్ర్తీ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఐరెన్‌లెగ్ శాస్ర్తీ అంటే తెలియని వారుండరు. అతని పేరు వింటేనే ముఖంపై చిరునవ్వు ప్రత్యక్షం అవుతుంది. కానీ పాపం అతని జీవితంలో మాత్రం మిగిలింది చీకటే.
ఏ హీరో సినిమా అయినా కావచ్చు, బ్యానర్ ఏదైనా కావచ్చు. పురోహితులు మాత్రం సినిమా ప్రారంభోత్సవాల్లో బిజీబిజీగా ఉండేవారు. కులవృత్తిలో బిజీగా ఉన్న ఆయన్ని సినిమా పురుగు కుట్టింది.

తొలుత సరదాగా కొన్ని సినిమాల్లో చిన్నా చితక పాత్రలు వేసేవారు. ఆ పాత్రలతో ఆయనో నటుడు అని పెద్దగా గుర్తింపు అంటూ ఏమీ రాలేదు. ఆ దశలో రమాప్రభ 1992లో రాజేంద్ర ప్రసాద్, శోభన జంటతో అప్పుల అప్పారావు సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో ఐరెన్‌లెగ్ శాస్ర్తీగా నటించిన విశ్వనాథశాస్ర్తీకి ఆ పాత్ర పేరే స్థిరపడిపోయింది. అదే ఆయన కొంప ముంచింది. నటుడు ఒక పాత్రలో జీవించాడంటే ఆ పాత్ర పేరుతోనే అతన్ని పిలుస్తున్నారంటే కచ్చితంగా అది అతని ప్రతిభే అవుతుంది. నటుడు కనిపించకుండా పాత్ర మాత్రమే కనిపించాలంటే ఆ నటునికి అంత సత్తా ఉండాలి. ఐరెన్‌లెగ్ శాస్ర్తీ రూపం, కాళ్లు అప్పుల అప్పారావు సినిమాలో ఆయన్ని చూపించిన తీరు ఎంత కాలమైనా గుర్తుండిపోతుంది. ఒక రకంగా ఈ సినిమాలో ఐరెన్‌లెగ్ శాస్ర్తీ కన్నా ఆయన లెగ్ నటించింది అనడం సముచితం. సినిమాలో ఐరెన్‌లెగ్ శాస్ర్తీ ప్రవేశించాడంటే పెళ్లి పెటాకులు అవుతుంది, అస్పత్రిలో ఉన్నవారి పై ప్రాణాలు పైనే పోతాయి. ఆ సినిమా తరువాత కూడా ఐరెన్‌లెగ్ శాస్ర్తీకి వరుసగా అలాంటి పాత్రలే వచ్చాయి. చివరకు ఆయన అసలు పేరును, వృత్తిని మరిచిపోయి అంత అతన్ని ఐరెన్‌లెగ్ శాస్ర్తీ అనే పాత్రగానే చూశారు. ఆ తరువాత అతన్ని నిజంగానే ఐరెన్‌లెగ్‌గా భావించసాగారు. సినిమా షూటింగ్ ప్రారంభం సినిమా వారికి ఒక శుభకార్యం. చూస్తూ చూస్తూ శుభకార్యానికి ఐరెన్‌లెగ్‌ను ఎలా పిలుస్తామని క్రమంగా అతన్ని పౌరోహిత్యానికి ఎవరూ పిలిచేవారు కాదు. ఎక్కడికి వెళ్లినా అతను ఉంటే ఆ కార్యానికి మంచిది కాదని భావించేవారు. అతి తక్కువ కాలంలోనే 150 సినిమాల్లో నటించారు. కానీ అవే మూసపాత్రలు ఎంత కాలం ఉంటాయి.

ఒకవైపు పౌరోహిత్యానికి పిలవడం లేదు. సినిమాల ప్రారంభోత్సవాలు ఉంటే దరిదాపుల్లో కనిపించవద్దని వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. మరో వైపు కుటుంబం గడిచేందుకు మార్గం లేదు. ఐరెన్‌లెగ్‌గా బ్రహ్మాండంగా నటించావు అంటే మురిసిపోయిన ఆయన అదే తన జీవితాన్ని సుడిగుండంలోకి నెట్టేస్తుందని ఊహించలేకపోయారు.
దేవదాసు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు నటించారు అనడం కంటే జీవించారు అనడం సబబు. ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయారు. ఆ తరువాత అక్కినేనికి అన్నీ తాగుబోతు పాత్రలే రావడం మొదలయ్యాయట! దీని వల్ల కలిగే ప్రమాదం ఏమిటో గ్రహించిన అక్కినేని స్వయంగా మిస్సమ్మ సినిమా దర్శక నిర్మాతలను సంప్రదించి ఆ సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో నటించాలని ఉందని కోరారు. చిన్నప్పుడు తప్పిపోయిన సావిత్రిని వెతికేందుకు ప్రయత్నించే డిటెక్టివ్ హాస్య పాత్ర అది. ఎన్టీఆర్‌ను హీరోగా నిలబెట్టి అక్కినేనిని దెబ్బతీయడానికి ప్రాధాన్యత లేని ఆ పాత్రను ఇచ్చారని అంతా అనుకున్నారట! కానీ ఆ పాత్రను నేనే అడిగి తీసుకున్నాను ఎందుకంటే నాపై దేవదాసు ముద్ర పోవాలంటే ఇలాంటి ప్రాధాన్యత లేని హాస్యపాత్రతోనే సాధ్యం అని స్వయంగా అక్కినేని చెప్పారు. ఆయన అంచనా నిజమైంది కూడా. అక్కినేని జీవితాన్ని కాచివడపోశారు కాబట్టి ముందు జాగ్రత్తతో ఉన్నారు. పాపం పౌరోహిత్యం చేసుకునే విశ్వనాథశాస్ర్తీకి ఒక పాత్ర తన జీవితంతో ఇలా అడుకుంటుందని గ్రహించేంత జీవిత అనుభవం లేదు.

ఐరెన్‌లెగ్ చివరి రోజులు దయనీయంగా గడిచాయి. కుటుంబం గడవడానికి డబ్బులు లేక సినిమాల్లో అవకాశాలు లేక మత్తులో మునిగిపోయారు. ఎవరు కనిపిస్తే వారి ముందు చేయి చాచారు. 2006లో గుండెపోటుతో మరణించారు. వీధిన పడిన తమ కుటుంబాన్ని ఆదుకోమని ఐరెన్‌లెగ్ శాస్ర్తీ కుటుంబం వేడుకుంది. షూటింగుల్లో బిజీగా ఉన్న సినిమా రంగానికి ఐరెన్‌లెగ్ కుటుంబం ఆకలి కేకలు వినిపించలేదు. మరో నటుడు కాదంబరి కిరణ్‌కుమార్ చొరవతో కొంత మంది 2010లో 55వేల రూపాయల వరకు విరాళాలు సేకరించి విశ్వనాథశాస్ర్తీ కుటుంబానికి అందజేశారు.‘‘ సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆర్థిక సహాయం చేస్తుంది కానీ ‘మా’ వద్ద నిధులు లేకపోవడం వల్ల ఇవ్వలేకపోతున్నాం’’ అని మా అధ్యక్షుడు మురళీమోహన్ ప్రకటించారు.

వర్ధమాన గాయని ఒకరు 14 సినిమాల్లో పాటలు పాడుతున్నారు. పత్రికల్లో ఇంటర్వ్యూలు, టీవిల్లో పరిచయాలు అంతా బాగానే ఉంది. అమెరికా నుంచి మిత్రుడు ఫోన్ చేసి ఒక లెక్క చెప్పాడు. సుశీల, జానకి లాంటి వారు మూడు నాలుగు దశాబ్దాల పాటు పాడారు. ఇప్పుడు గాయకుల సినిమా జీవిత కాలం ఎంత ఉండొచ్చో లెక్క చెప్పాడు. రెండు మూడేళ్ల తరువాత అవకాశాలు లేకపోతే ఏం చేస్తావని ప్రశ్నించాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆ గాయని మారు మాట్లాడకుండా ఉద్యోగంలో చేరింది. అవకాశాలు వచ్చినంత వరకు పాడుతాను. అవకాశాలు రాకపోతే నా ఉద్యోగం నాకు ఎలాగూ ఉంది కదా అంది ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం అది.
సినిమా రంగంలో తరుచుగా వినిపించే పేరు ఐరెన్‌లెగ్ ఆ ముద్ర పడిందంటే నటులు విలవిలలాడిపోతారు. అలాంటిది ఏకంగా ఆ నటుని పేరే ఐరెన్‌లెగ్. ఆ ముద్ర తన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో విశ్వనాథశాస్ర్తీ కొద్దిగా ఆలోచించాల్సింది. అటు పౌరోహిత్యానికి, ఇటు సినిమాలకు కాకుండా పోయే ప్రమాదాన్ని పసికట్టేంత ముందు చూపు ఉంటే తన జీవితం అర్ధాంతరంగా ముగిసేది కాదు.. కుటుంబం వీధిన పడేది కాదు. అవకాశాలు ఉన్నప్పుడే రేపటి గురించి ఆలోచించాలి కానీ ఏ సినిమా సంఘం కూడా పోయిన వారి గురించి ఆలోచించదు అనే పాఠం ఐరెన్‌లెగ్ శాస్ర్తీ జీవితం సినిమా వారికి నేర్పించింది. ఒక పాత్రలో ఇమిడిపోవడమే అతని జీవితం పాలిట శాపంగా మారడం బహుశా సినిమా ప్రపంచంలో మరెవరి విషయంలోనూ జరిగి ఉండదు. *

5, ఆగస్టు 2014, మంగళవారం

సినీ పితామహుని దయనీయ జీవితం

అది భారతీయ సినిమా రజతోత్సవ వేడుకల వేదిక ... అట్టహాసంగా సాగుతోంది. ఆడిటోరియంలో ఒక మూల ఆనామకుడిగా ఒక వ్యక్తి కూర్చున్నారు. అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. అతనూ అవేమీ పట్టించుకోకుండా రజతోత్సవ వేడుకలను తిలకించడంలో మునిగిపోయారు. వి.శాంతారాం అతన్ని చూశారు. తనను తాను నమ్మలేకపోయారు. కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. అతను అనామకుడు కాదని భారతీయ సినిమా పితామహుడని, ఇప్పుడు తాము అనుభవిస్తున్న సినిమా స్టాటస్‌కు మూల పురుషుడు అతనే అని గుర్తుకు వచ్చి ఆ మహనీయున్ని వేదికపైకి తోడ్కొని వచ్చారు. అనామకునిలా ఆడిటోరియంలో కూర్చున్న ఆ మహనీయుడే దాదా సాహెబ్ ఫాల్కే.
***
‘‘బతికే పరిస్థితి లేదు.. చనిపోయేందుకు విషం కొందామన్నా డబ్బులు లేవు’’
తన తండ్రి రాసిన ఉత్తరాన్ని అతని కుమారుడు ఇంక చదవలేకపోయాడు. కన్నీళ్లు కార్చాడు... అంతకు మించి ఏమీ చేయలేడు కూడా ఎందుకంటే అతని వద్ద కూడా డబ్బేమీ లేదు
ఈ సీన్ సినిమాలో అయితే అద్భుతంగా పండుతుంది. ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించవచ్చు. ఆ కన్నీళ్ల నుంచి కాసులను కూడా కురిపించవచ్చ.
ఇది సినిమానే జీవితంగా భావించిన భారతీయ సినిమా పితామహుని నిజ జీవిత విషాద దృశ్యం. తన దీన పరిస్థితిని వివరిస్తూ ఫాల్కే తన కుమారుడు బాలచంద్రకు అంతిమ దశలో రాసిన ఉత్తరం సారాంశం.
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దేశంలో సినిమా రంగానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం. కానీ దుండిరాజ్ గోవింద్ ఫాల్కే ఉరఫ్ దాదా సాహెబ్ ఫాల్కే జీవితం మాత్రం అత్యంత విషాదకరంగా ముగిసింది.
ఈ ఉత్తరంలోని రెండు ముక్కల సమాచారం అతని జీవిత కథను, వ్యథను మొత్తం తెలుపుతోంది.
రాజా హరిశ్చంద్ర తొలి భారతీయ సినిమా. ఆ సినిమాకు సర్వస్వం ఫాల్కేనే. ఆయన మరణించినప్పుడు చాలా పత్రికల్లో ఆ వార్త కూడా రాలేదు. ఆయన అంత్యక్రియలకు 10- 12 మంది మాత్రమే వచ్చాయి. సంతాప సూచకంగా ఒక్క సినిమా హాలు కూడా మూయలేదు. హాలులో సినిమాలో అలానే నడుస్తున్నాయి, కానీ దేశానికి సినిమాను పరిచయం చేసిన ఆయన మాత్రం నిశ్శబ్దంగా ప్రకృతిలో కలిసిపోయారు.
***
60 ఏళ్ల వరకు సినిమాలో హీరో వేషాలు. ఆ తరువాత రాజకీయ ప్రవేశం .... ఎన్టీఆర్ నుంచి చిరంజీవి.. బాలకృష్ణ వరకు హీరోలు అనుసరించే ఫార్ములా ఇదే. హీరోలు తమ పాపులారిటీని చివరి వరకు ఉపయోగించుకుంటారు. 60 నుంచి హీరోల రిటైర్‌మెంట్ వయసు 55కి తగ్గి ఉండవచ్చు కానీ ఫార్ములా మాత్రం మారలేదు. ఈ తరం మరింత ముందు జాగ్రత్తగా ఉంటోంది. ఉండాలి కూడా... ఒక్కరు హీరో అయితే మొత్తం బంధు వర్గంలోని యువకులందరినీ హీరోలను చేస్తున్నారు. ఈ తరం మరింత ముందు జాగ్రత్తగా ఉంటోంది. నాలుగైదు సినిమాల్లో నటించిన చిరంజీవి కుమారుడు రాంచరణ్ విమానయాన రంగంలో ప్రవేశించారు. జీవితం పట్ల అవగాహన పెరిగింది .. పెరగాలి కూడా.. కాలం మారింది వయసులో ఉన్నప్పుడే భవిష్యత్తు జీవితం గురించి జాగ్రత్త పడుతున్నారు. జాగ్రత్త పడాలి కూడా..
భారతీయ చలన చిత్ర పితామహుని కాలంలో సినిమాను ప్రేమించడం తప్ప ఇలాంటి ముందు జాగ్రత్తలేమీ లేవు. సినిమానే జీవితంగా బతకడమే ఆయన చేసిన పెద్ద తప్పయింది. సినిమా వేరు జీవితం వేరు.. సినిమాకు సర్వస్వం అర్పించడం కాదు, సినిమా నుంచి ఎంత పిండుకుందామనే ఆలోచన లేకపోవడమే ఆయన చేసిన తప్పయింది.
***
దాదాసాహెబ్ ఫాల్కే సంస్కృత పండితుని కుమారుడు. 1870లో నాసిక్‌లోని త్రయంబకేశ్వర్‌లో జన్మించారు. బొంబాయిలోని జెజె కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో, బరోడాలోని కళాభవన్ విద్యార్థి. మంచి చిత్రకారుడు, నాటకాల్లో మేకప్ వేశారు. మంచి మెజీషియన్ కూడా... ప్రింటింగ్ ప్రెస్‌ను ఏర్పాటు చేశారు. ఆ కాలంలోనే ప్రింటింగ్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం జర్మనీ వెళ్లాలనుకున్నారు. సినిమాకు సంబంధించిన వార్త ఒకటి పత్రికలో వచ్చింది. తనను ఆ వార్త బాగా ఆలోచింపజేసింది. మన దేశంలో కూడా సినిమాను ఎందుకు తీయకూడదు అనే ఆలోచన అతన్ని కుదురుగా ఉండనివ్వలేదు. తన వద్ద ఉన్న డబ్బు, మిత్రుల నుంచి తీసుకున్న అప్పు , జీవిత బీమా డబ్బు మొత్తం తీసుకొని సినిమా నిర్మాణానికి సంబంధించిన పరికరాలు కొనడానికి 1912లో ఇంగ్లాండ్ వెళ్లారు.
అయితే ఫాల్కేకు తాను చరిత్ర సృష్టించబోతున్నానని తెలియదు, అదే తన జీవితాన్ని పేదరికంలోకి నెట్టివేస్తుందనీ ఊహించలేదు.
***
ఫాల్కే 1913లో రాజా హరిశ్చంద్ర, ఆదే సంవత్సరం మోహినీ భస్మాసుర, సత్యవాన్ సావిత్రి (1914) శ్రీకృష్ణ జననం (1918) కాళీయ మర్దన్ (1919) నిర్మించారు. ఆ తరువాత సినిమా రంగంలో క్రమంగా వ్యాపార ధోరణి మొదలైంది. దాంతో పాల్కే పక్కకు తప్పుకున్నారు. సినిమా ప్రేమ ఆయన్ని నిలువనివ్వలేదు. తన పలుకుబడి, పరిచయాలు ఉపయోగించి నిధులు సమీకరించి 1937లో గంగావతరణ సినిమా తీశారు. నిండా మునిగిపోయారు.
సినిమాను వ్యాపారంగా చూసి ఉంటే ఆయన పరిస్థితి బాగానే ఉండేది. సినిమాను విపరీతంగా ప్రేమించి దెబ్బతిన్నారు. తన వారసులను పేదరికంలోకి నెట్టేశారు. ఆయన దేశానికి తీసుకు వచ్చిన సినిమాతో సినీ వ్యాపారులు కోట్లు సంపాదించారు. పాపులారిటీని, రాజకీయాల్లో పదవులు సంపాదించారు కానీ ఫాల్కే మాత్రం కఠిక దరిద్రంలో మరణించారు. ఆయన కుమారుడు ముంభై వీధుల్లో చిల్లర వ్యాపారిగా జీవితం గడిపారు.
బాగున్న రోజుల్లో ఫాల్కే ఫోర్డ్ కారును ఉపయోగించేవారు. 1920 ప్రాంతంలో ఆ కారులోనే షూటింగ్‌కు వెళ్లేవారు. తిరిగి సినిమా తీయాలని నిర్ణయించుకున్న కాలంలో దాన్ని అమ్మేశారు. ఆ కారు పెళ్లిళ్ల ఊరేగింపునకు ఉపయోగించారు. ఐదేళ్ల క్రితం ఈ కారు నాసిక్ డంప్ యార్డ్‌లో లభించింది. తొలి భారతీయ సినిమా కెమెరాను ఫాల్కే జర్మనీ నుంచి తెప్పించారు. అదేమైందో ఇప్పుడు ఎవరికీ తెలియదు. సినిమా నిర్మాణానికి ఎలాంటి ఏర్పాట్లు లేని కాలంలో ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఫాల్కే తొలి సినిమా తీశారు. ఫాల్కే భార్య సరస్వతి భారతీయ తొలి సినిమా రాజా హరిశ్చంద్ర నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. ఆమెనే తొలి భారతీయ సినిమా టెక్నీషియన్. సరస్వతి షూటింగ్ సమయంలో వెలుతురు కెమెరాపై పడకుండా బెడ్ షీట్‌ను అడ్డుగా పట్టుకుని ఉండేవారట. షూటింగ్‌కు కావలసినవన్నీ సమకూర్చేవారు. రాత్రి పూట క్యాండిల్ వెలుగులోనే ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక పనులు నిర్వహించేవారు. సినిమా బృందం 60-70 మందికి ఆమెనే వంట చేసి పెట్టేవారు. రాజా హరిశ్చంద్రలో హరిశ్చంద్రుని కుమారునిగా ఫాల్కే కుమారుడు బాలచంద్ర నటించారు. తొలి భారతీయ బాలనటుడు అతనే. శ్రీకృష్ణ జననం, కాళీయ మర్దన్‌లో బాల శ్రీకృష్ణునిగా మందాకిని నటించారు. ఆమె ఫాల్కే పెద్ద కూతురు. ఆమెనే తొలి భారతీయ బాలనటి.
***
భారతీయ సినిమా రజతోత్సవ వేడుకల్లో దాదాసాహెబ్ ఫాల్కే ఒక అనామకుడిగా కూర్చోవడం చూసిన శాంతారాం ఆయన్ని గుర్తించి వేదికపైకి తీసుకు పోయి 1938లో అప్పటికప్పుడు వేదికపై ఐదువేల రూపాయల పర్స్ అందజేశారు. ఆ డబ్బుతో ఫాల్కే తిరిగి సినిమా తీస్తాడేమోనని చాలా మంది భయపడ్డారు. ఎందుకంటే సినిమా అంటే ఆ మహనీయునికి అంత పిచ్చి. అందరూ ఒత్తిడి తెచ్చి ఆ డబ్బుతో నాసిక్‌లో ఒక ఇంటిని కొనిపించారు. అప్పటి వరకు ఫాల్కేకు సొంత ఇల్లు కూడా లేదు. ఆ ఇంటిలోనే తుది శ్వాస విడిచారు.

3, ఆగస్టు 2014, ఆదివారం

సామాన్యుడి ఆత్మకథ!

‘‘ఏమండోయ్ శ్రీవారు గదిలో రహస్యంగా ఏదో రాసుకుంటున్నారు. నన్ను చూడగానే డైరీ మూసేశారంటే ఏదో ప్రేమ లేఖ రాస్తున్నారన్నమాటే’’ అంటూ శ్రీమతి నవ్వింది. ‘‘ఈ వయసులో ప్రేమ లేఖ రాసేందుకు నేను సిద్ధమే కానీ తీసుకునే వారెవరూ’’ అని కొంటెగా నవ్వాడు సామాన్యరావు ‘‘అంటే తీసుకునే వారుంటే రాస్తారనే కదా? నాకు తెలుసుండి మీ కాలేజీ స్నేహితురాలు సుజాతను మీరు మరువలేకపోతున్నారు.ఈ మధ్య ఫేస్‌బుక్ పుణ్యమా అని పాత ప్రేమలు కొత్తగా చిగురిస్తున్నాయని విన్నాను ’’ అని శ్రీమతి సీరియస్‌గానే అంది. నవ్వులాటకు అంటే వ్యవహారం ఎక్కడికో పోతుందనుకున్న సామాన్య రావు టాపిక్ డైవర్ట్ చేయాలనుకున్నాడు. చూడోయ్ కాలేజీ ముచ్చట్లు చెబుతూ సుజాత అందంగా నవ్వేది అని చెప్పానే అనుకో ఇంతగా అనుమానించాలా? నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే లేదు కానీ సుజాత అందంగా నవ్వుతుందని ఆమెకు కూడా చెప్పలేదు కానీ నీకు చెప్పాను. అప్పుడు మాట్లాడే ధైర్యం ఉండేది కాదు, ఇప్పుడు ధైర్యం ఉంది కానీ సుజాత అడ్రస్ లేదు. అయినా నేను ప్రేమ లేఖ రాస్తున్నానని ఎందుకనుకుంటావు ఆత్మకథ రాసుకుంటున్నానని అనుకోవచ్చు కదా? ’’ అని సామాన్యరావు అడిగాడు. ‘‘మీరేమన్నా దేశాన్ని దోచారా? కనీసం తారా చౌదరి అంతటి పాపులర్ ఫిగర్ కూడా కాదు ఏ అర్హత ఉందని ఆత్మకథ రాస్తారు’’ అని శ్రీమతి కవ్వించింది. మరీ భారీ కుంభకోణాలే చేయనక్కర లేదు. ఒకాయన చిన్నప్పుడు కిరోసిన్ స్మగ్లింగ్ చేశానని ఆత్మకథ రాసుకున్నాడు’’ అంటూ సామాన్యరావు నవ్వాడు. ‘‘మీ ఆత్మకథ రాస్తానని ఎవరైనా వస్తే సరే అనేరు... కొంప కొల్లేరవుతుంది’’ అని శ్రీమతి ఉడికించింది. ‘‘ ఆత్మకథ ప్రహసనం వల్లనే కదా మన అభిమాన అల్లుడు అధికారంలోకి వచ్చింది’’ అని సామాన్యరావు తానేమీ తక్కువ తినలేదని కౌంటర్ ఇచ్చాడు.
‘‘సోనియాగాంధీ కూడా ఆత్మకథ రాస్తానని చెబుతున్నారు కదా? ఏం రాస్తుందంటారు? చదువుకునే రోజుల్లో రాజీవ్‌గాంధీతో తన ప్రేమ గురించి రాస్తుందంటారా? ’’ అని శ్రీమతి సందేహం వ్యక్తం చేసింది.
‘‘ఆ రాస్తుంది ఆప్పుడు ఏ రంగు డ్రెస్ వేసుకుందో కూడా రాస్తుంది. నాయకుల ఆత్మకథలు రాజకీయ కోణంలోనే ఉంటాయి. ఆయనెవరో నట్వర్ సింగ్ అని ఆయన్ని కాంగ్రెస్ పక్కన పెట్టింది. ఎన్నికలయ్యాక కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయాక, ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని రూఢీ ఆయ్యాక ఆ మహానుభావుడు వీరోచితంగా కాంగ్రెస్ అధినేత్రిని విమర్శిస్తూ ఆత్మకథ రాశాడు. ఈ ధైర్యమేదో ఆమె ఒక వెలుగువెలుగుతున్న కాలంలో రాసుంటే బాగుండేది కదా? సోనియాగాంధీ ఏం తప్పులు చేస్తున్నారో ఆమె అధికారంలో ఉన్నప్పుడు రాస్తే ప్రయోజనం ఉండేది కానీ ఇప్పుడు విమర్శించడానికి ప్రత్యర్థులకు ఆయుధాలు అందించడం తప్ప ఆత్మకథతో ఇలాంటి వారు సాధించేదేముంటుంది’’ అని సామాన్యరావు ప్రశ్నించారు.
‘‘ఏమో మీ రాజకీయాలు నాకేం తెలుసు’’ అంది శ్రీమతి
‘‘నా అంచనా ప్రకారం సోనియాగాంధీ ఇప్పట్లో ఆత్మకథ రాయదు. అని నాకైతే గట్టిగా అనిపిస్తోంది. రాస్తే గీస్తే వచ్చే ఎన్నికల తరువాత రాస్తుంది ’’అని సామాన్యరావు చెప్పాడు.
‘‘ఈ మధ్య జ్యోతీష్యం కూడా నేర్చుకుంటున్నారా? ఏమిటి? ’’శ్రీమతి అడిగింది.
‘‘జ్యోతీష్యం కాదు దీనికి కావాల్సింది రాజకీయ అవగాహన. కావాలంటే రాసిపెట్టుకో సోనియా వచ్చే ఎన్నికల నాటికి ఆత్మకథ రాయరు, బాబు జీవితంలో ఎప్పుడూ ఆత్మకథ రాయరు. ’’ అని సామాన్యరావు ధీమాగా చెప్పాడు.
‘‘ఏంటో ఆ రాజకీయ అవగాహన చెబితే వింటాం కదా?’’ అని శ్రీమతి అడిగింది.
‘‘శ్రీశ్రీ, చలం లాంటి వాళ్లు ఆత్మకథల్లో అన్ని విషయాలు రాసి తాము బాగానే ఉన్నారు కానీ వీరి ఆత్మకథల్లోని ఆడవారే చిక్కుల్లో పడ్డారు. నాయకులెప్పుడూ ఇలాంటి సాహసాలు చేయరు. తమ రాజకీయ జీవితం ముగిసిపోయిందని భావించినప్పుడే ఆత్మకథలు రాస్తారు. ఇంకా రాజకీయాల్లో చురుగ్గానే ఉన్న సోనియాగాంధీ ఇప్పుడే ఎందుకు రాస్తుంది? ఇక బాబు విషయానికి వస్తే రాజకీయ జీవితం ముగింపు దశలోకూడా ఆత్మకథ రాయనే రాయరు. రాస్తే తన జీవితంలో అత్యంత కీలకమైన ఎన్టీఆర్‌ను దించేసిన విషయాన్ని ఏమని రాయాలి. రాయకపోతే చరిత్ర ప్రజలకు తెలుసు,రాస్తే తనకు ఇబ్బంది అందుకే ఆత్మకథల జోలికి బాబు వెళ్లనే వెళ్లరు ’’ అని సామాన్యరావు చెప్పారు.
‘‘సర్లే ఈ చర్చ ఎంత సేపైనా చేయవచ్చు కానీ సరదాగా ఈరోజు మీరు టీ చేసిస్తే నేను తాగిపెడతాను’’ అని శ్రీమతి మురిపెంగా కోరడంతో సామాన్యరావు వంట గదిలోకి వెళ్లాడు.
***
ఇంత సేపు చర్చ జరుపుతున్నా శ్రీమతి దృష్టంతా శ్రీవారి డైరీపైనే ఉంది. ఆయన వంటగదిలోకి వెళ్లడంతో గబగబా ఆ డైరీని తీసుకుంది. అంత సీరియస్‌గా ఆలోచిస్తూ ఆయన ఏం రాశారో చదివేంత వరకు తనకు నిద్ర రాదనుకుంది. కాలేజీ రోజుల నాటి ప్రేయసికోసం కవిత్వం రాస్తున్నాడని ఆమెకు గట్టి నమ్మకం. పేజీలు తిప్పి చూసింది.
హౌసింగ్ లోన్ ఇఎంఐ 8000
పర్సనల్ లోన్ 3000
ఇంటి సామాను 2500
పాలు 2000
కూరగాయలు 1000
కరెంట్ బిల్లు 800
పిల్లల ఫీజు 2500
జీతం మైనస్ మొత్తం ఖర్చు = లోటు
15 % లోటు అక్షరాల మధ్యన ఆ అంకెలను శ్రీమతి ఇక చదవలేకపోయింది. డైరీలో అన్నీ పేజీల్లో అంకెలు ఇలానే ఉన్నాయి ... 
***
‘‘అంకెల్లో కొద్దిగా తేడాలుండొచ్చు కానీ ప్రతి మధ్యతరగతి ఆత్మకథలోని విషయాలు ఇవే కదా డియర్ ’’అంటూ సామాన్యరావు గట్టిగా నవ్వే ప్రయత్నం చేశాడు.
‘‘కుంభకోణాలు భయటపడగానే రాజకీయ నాయకుడు నా జీవితం తెరిచిన పుస్తకం అంటాడు కానీ నిజానికి వారి పుస్తకాల్లో అన్నీ ఎవరికీ అర్ధం కానీ రహస్య అక్షరాలే. సామాన్యరావుల జీవితాలే తెరిచిన పుస్తకం. డైరీ చదివినా? అసలు డైరీనే లేకపోయినా మ్యాటర్ మాత్రం ఒకటే . మధ్యతరగతి ఆత్మకథ త్రిశంకు స్వర్గం కథ ఒకటే’’ అన్నాడు సామాన్యరావు చిద్విలాసంగా నవ్వుతూ ....