పత్రికలో ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి ఆకర్శిణీయమైన ప్రకటన చూడగానే పిల్లలు తండ్రి వద్దకు పరిగెత్తుకొచ్చి. నాన్నా ఇప్పుడు కొంటే పది శాతం రాయితీ నట అని ఉత్సాహంగా చెప్పారు. ఆ తండ్రి నవ్వి నిజమే కొంటే పది శాతం ఆదా అవుతుంది. కొనక పోతే వంద శాతం ఆదా అవుతుంది. ఏది బెటర్ అని తిరిగి ప్రశ్నించారు. ఒక వస్తువు మనకు అవసరమా? కాదా? అనేది ముఖ్యం కానీ రాయితీ ఇస్తున్నాడు కదా? అని అవసరం లేనివి కొంటే నష్టమే. డబ్బుకు సంబంధించిన ఈ అవగాహన పిల్లలకు కలిగించాలా? వద్దా? కచ్చితంగా బాల్యం నుంచే పిల్లలకు డబ్బుకు సంబంధించిన అవగాహన ఉండాలి. అది తల్లిదండ్రుల బాధ్యత.
తల్లిదండ్రులు ఉద్యోగులు, సంపాదన పరులు అయినప్పుడు ఆ సంపాదన ఎలా వస్తుంది? ఎలా ఖర్చు చేయాలి. ఎలా పొదుపు చేయాలి. రేపటి కోసం పొదుపు ఎందుకు అవసరం అని డబ్బుకు సంబంధించి పిల్లలకు మొదటి నుంచి అవగాహన కలిగించడం తల్లిదండ్రుల బాధ్యత.
మనకు కొన్ని చిత్రమైన అలవాట్లు, నమ్మకాలు ఉంటాయి. పిల్లలు ప్రతిభ కనబరిచినా తల్లిదండ్రులు మెచ్చుకోవద్దు అనేది కొందరి భావన. దీనికి సంబంధించి మనకు పురాణ కథలు కూడా ఉన్నాయి. అలానే పిల్లలకు డబ్బు గురించి చెప్పవద్దు, డబ్బుల వ్యవహారాలు పెద్దలకు సంబంధించినవి అని కొందరు అంటారు.
పిల్లలకు డబ్బులకు సంబంధించి పెద్దలు చెప్పకపోతే ఇక వారికి ఎవరు చెబుతారు. జీవితంలో ఎదురు దెబ్బలు తిన్న తరువాత, నిండా అప్పుల్లో మునిగిపోయాక, నమ్మి మోసపోయిన తరువాత డబ్బు గురించి వారే తెలుసుకుంటారా?
నిప్పు ముట్టుకుంటే కాలుతుంది అని చెప్పడం నిప్పు గురించి తెలిసిన వారి బాధ్యత. అంతే తప్ప నిప్పు ముట్టుకుంటే కాలిన తరువాత వారికే అనుభవంతో తెలుస్తుంది అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది.
ఇంజనీరింగ్ చదివే యువత సైతం డబ్బులు ఇవ్వడం లేదు కదా? కార్డే ఇస్తున్నాం కదా? అనడం చాలా మందికి అనుభవమే. కార్డు ఉపయోగించినా, కరెన్సీ లెక్కపెట్టి ఇచ్చినా డబ్బు ఖర్చు చేస్తున్నాం అని డబ్బుకు సంబంధించి వారికి అవగాహన ఉండాలి. ఒక్కసారి డబ్బు చేయిదాటి పోయాక ఏడ్చి మొత్తుకున్నా తిరిగి రాదనే సంగతి తెలిసే సరికి వారి జీవితం అయిపోతుంది.
దాదాపు దశాబ్ద కాలం క్రితం సికిందరాబాద్ ఏర్పడి రెండువందల సంవత్సరాలు అయిన సందర్భంగా ధర్మవరపు సీతారాం సికిందరాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు వ్యాపార ప్రముఖుల జీవితాల గురించి పత్రికల్లో వ్యాసాలు రాశారు. బ్రిటీష్ వారి పాలనా కాలంలోనే పెద్ద వ్యాపార కుటుంబాలుగా వెలుగొందిన వారి ఇంటి పేర్లతో సహా ప్రస్తావిస్తూ రాశారు. ఆ కుటుంబాలు ఇప్పటికీ సికిందరాబాద్‌లో ఉన్నాయి. ఐతే చాలా కుటుంబాలకు ఆనాటి వైభవం గత చరిత్రనే. ఎంతో గొప్పగా వెలిగిన ఆ కుటుంబాలు తరువాత తరం వారికి డబ్బుకు సంబంధించి సరైన అవగాహన లేకపోవడం, విలాసవంతమైన జీవితం, నమ్మి మోసపోవడం వంటి అనేక కారణాలతో ఆర్థికంగా దెబ్బతిన్నారు. కొన్ని కుటుంబాలు మాత్రం డబ్బుకు సంబంధించిన అవగాహనతో ఎదిగారు. డబ్బుకు విలువ ఇచ్చిన కుటుంబాలు, డబ్బుకు సంబంధించి అవగాహన ఉన్న కుటుంబాలు సరైన దారిలో వెళ్లి ఎదిగితే, అవగాహన లేని కుటుంబాలు చితికి పోయాయి. ఆ కుటుంబాలు తమ పిల్లలకు డబ్బుకు సంబంధించిన సరైన అవగాహన కలిగిస్తే వారి పరిస్థితి తలక్రిందులు అయ్యేది కాదు.
సంపన్నులు, మధ్యతరగతి, పేద, వ్యాపారలు, ఉద్యోగులు అనే తేడా లేదు. ప్రతి వారు పిల్లలకు డబ్బుకు సంబంధించి అవగాహన కలిగించాలి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే దాన్ని పిల్లల వద్ద దాచిపెట్టాల్సిన అవసరం లేదు. కుటుంబ ఆదాయం ఎంత ఖర్చు ఎంతో పిల్లలకు చెప్పాలి. వారూ అవగాహన చేసుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే పిల్లలకు అదే విషయం చెప్పాలి. దానికి తగ్గట్టు ఖర్చులు తగ్గించుకుంటారు. అదే విధంగా ఆర్థికంగా బాగుంటే అదే విషయం చెప్పాలి. సంపాదించిన దాని కన్నా తక్కువ ఖర్చు చేయడం వల్లనే సంపద మిగిలిందని, మిగిలిన ఈ సంపదను ఇనె్వస్ట్ చేసుకుంటేనే మరింతగా ఎదుగుతాం, రేపటి అవసరాలు తీరుతాయి, అలా కాకుండా సంపాదన బాగుందని, ఎప్పటికప్పుడు ఖర్చు చేస్తే అప్పుల్లో కూరుకుపోతామనే అవగాహన కలిగించాలి.
పిల్లలకు డబ్బు గురించి చెప్పడం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అంటే, దానికో వయసు లేదు. స్కూల్‌కు వెళ్లే చిన్న పిల్లలు కావచ్చు, కాలేజికి వెళ్లే వాళ్లు కావచ్చు, ఇప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు కావచ్చు. ఎంత త్వరగా డబ్బు గురించి వారికి అవగాహన కలిగిస్తే అంత మంచింది.
డబ్బు ఎలా వస్తుంది, ఎలా వ్యయం చేయాలి, డబ్బు ఏ విధంగా డబ్బును సంపాదిస్తుంది, మనీ మేనేజ్‌మెంట్ ఎలా ఉండాలో నేర్పించాలి.
అంతా ఆన్‌లైన్ జీవితాలు ఐపోయాయి. అయినా పరవా లేదు. చిన్నప్పటి నుంచే పిల్లలకు కరెంట్ బిల్లు, నీటి బిల్లు, ఫోన్ బిల్లు వంటివి చెల్లించే పని అప్పగిస్తే వారికి కొంత అవగాన కలుగుతుంది.
చిన్న వయసులోనే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయించాలి. స్నేహితులతో పార్టీ చేసుకుంటే రెండు మూడు గంటల ఆనందం. అదే డబ్బు మ్యాచువల్ ఫండ్స్‌లో ఇనె్వస్ట్ చేస్తే జీవిత కాలమంతా ఏ విధంగా ఆనందం కలిగిస్తుందో చూపించాలి. పిల్లల పేరుతో మ్యూచువల్ ఫండ్స్‌లో చిన్నప్పటి నుంచే ఎంతో కొంత ఇనె్వస్ట్ చేయడం వల్ల ఆ డబ్బు ఏ విధంగా పెరుగుతుందో వారికి అసక్తి కలుగుతుంది. దీని వల్ల స్టాక్ మార్కెట్ పెట్టుబడుల గురించి తెలుస్తుంది. డబ్బు విలువ తెలుస్తుంది. మార్కెట్ గురించి చిన్న వయసులోనే అవగాహన కలగడం భవిష్యత్తు జీవితానికి ఉపయోగపడుతుంది.
కుటుంబ సంపాదన ఏ విధంగా ఉంది. భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు. దాని కోసం నిర్ణయించుకున్న లక్ష్యాలు, వాటిని సాధించే మార్గాల గురించి పిల్లలతో ఎప్పటికప్పుడు చర్చించాలి. పిల్లలకేం తెలుసులే అనుకుంటే వారికి నిజంగానే ఏమీ తెలియకుండా పోతుంది. అలా అనుకోవడం వల్లనే ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు పొంది. ఐటి కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన వారిని కూడా ఇంటర్ ఫేయిల్ ఐన వారు మోసగించగలుతున్నారు. వెయ్యి రూపాయలతో లక్ష అవుతుంది అని చెబితే ఇనె్వస్ట్ చేసి నష్టపోతున్న వారిలో ఎక్కువ మంది విద్యావంతులే ఉంటున్నారు. ఏ వయసైనే కావచ్చు పిల్లలకు డబ్బు గురించి అన్నీ చెప్పాలి. అలా చెప్పాలి అంటే ముందు పెద్దలకు తెలియాలి.
-బి.మురళి
(6-1-2019)