27, జులై 2011, బుధవారం

డబ్బుతో ఏం చేయవచ్చు?

ప్రముఖ పారిశ్రామిక వేత్త తిప్పయ్య మాట్లాడేందుకు సిద్ధం కాగానే అంతా నోరు మూసుకుని చప్పట్లు కొట్టడానికి చేతులను సిద్ధం చేసుకున్నారు. సరైన సమయంలో సరైన వ్యూహం అవసరం అని భావించిన ఒకరు నిజంగా ఆ పేరులో ఎంత మాధుర్యం ఉంది కదూ అని తిప్పయ్యకు వినిపించేంత మెల్లగా పలికాడు.


 నాకు కొడుకు పుడితే తిప్పయ్య అని, కూతురు పుడితే తిప్పమ్మ అని పిలుచుకుంటాను అని కొత్తగా పెళ్లయిన తిప్పయ్య కంపెనీ ఉద్యోగి వ్యూహాత్మకంగా ప్రకటించాడు. తిప్పయ్య నోరు తెరిచాడు. డబ్బులు లెక్కించేందుకు చేతులను తెరవడం తప్ప అతను నోరు పెద్దగా తెరవడు-తాగడానికి, తినడానికి తప్ప!!


 నోరు తెరిస్తే ముత్యాలు రాలుతాయి కాబట్టే నోరు తెరవరు అని ఆయన ముందు, పాండిత్యం బయటపడుతుందనే నోరు తెరవరు అని ఆయన లేనప్పుడు చాలా మంది అనుకుంటుంటారు. ఆయన మాత్రం వ్యూహాత్మక వౌనం పాటిస్తారు. తిప్పయ్య మాట్లాడేందుకు లేవగానే అంతా ఆసక్తిగా ముందుకు వచ్చారు. నవ్వుతున్నట్టుగా తిప్పయ్య పెదవులు రెండింటిని వేరు చేయగానే అంతా నవ్వారు. ఇదిగో నాకు ఇదే నచ్చదు నేను జోకు చెప్పిన తరువాత నవ్వాలి అని తిప్పయ్య ఆదేశించాడు....


. మూడు చీమలు ఒక దాని వెనుక ఒకటి నడుస్తున్నాయి. ముందు ఉన్న చీమ నా వెనక రెండు చీమలున్నాయంది, చివరి చీమ కూడా నా ముందు రెండు చీమలు ఉన్నాయంది, మధ్యలో ఉన్న చీమ నా వెనక కూడా రెండు చీమలు ఉన్నాయని చెప్పింది. అదేలా ? చెప్పండి అని తిప్పయ్య ప్రశ్నించాడు. ఎవరూ చెప్పలేక పోయారు, తెలియని వాడొకడు చెప్పడానికి లేస్తే విషయం తెలిసిన వారు వాన్ని బలవంతంగా కూర్చోబెట్టి మీరు జీనియస్ సార్ మీరే చెప్పండి అని ముక్తకంఠంతో అన్నారు. మధ్యలో ఉన్న చీమ అబద్ధం చెప్పింది అని తిప్పయ్య నవ్వగానే అంతా పడిపడి నవ్వారు.


 ఐదు నిమిషాలైనా అక్కడ నవ్వుల వాన వెలియలేదు. అరే ఇది మన చిన్నప్పటి నుండి ఎన్నోసార్లు విన్నాం కదరా? ఇందులో జోకేముందిరా, ఇలాంటివి నేను వంద చెబుతాను అని సత్యం పక్కనున్నవాడితో తన సందేహాన్ని పంచుకున్నాడు. నీకందులో జోకు కనిపించలేదా? తిప్పయ్య దగ్గర వంద కోట్లున్నాయి అని సీనియర్ సందేహం తీర్చాడు. 


పిచ్చోడా! మస్తు డబ్బుంటే చీమ దోమ జోకులే కాదు నల్లుల జోకులు కూడా నవ్విస్తాయి అని సత్యానికి జీవిత జీవిత సత్యాన్ని బోధించాడు.
అసలు డబ్బుకు ఎంత పవరుంటుందో నీకు తెలుసా? ఇప్పటికప్పుడు నువ్వు అపరిచితుడివి కావచ్చు. అనుమానం ఉంటే సురేశ్ కల్మాడిని కలిసి రా! కామనె్వల్త్ కుంభకోణంలో నిండా మునిగిన కల్మాడీకి భయంకరమైన మతిమరుపు జబ్బు వచ్చిందట! డాక్టర్లు సర్ట్ఫికెట్ ఇచ్చేశారు. అన్నీ మరిచిపోయిన ఆయన డాక్టర్ సర్ట్ఫికెట్ మాత్రం మరిచిపోకుండా తన వద్ద పెట్టుకున్నాడు. ఇది నిజమా! అని విచారణ జరిపేందుకు వచ్చే నిపుణులకు సైతం కావాలంటే మతిమరుపు జబ్బువచ్చి తీరుతుంది.

డబ్బుతో ఏం చేయవచ్చు అనే సందేహం వందేళ్ల క్రితమే బారిష్టర్ పార్వతీశానికి వచ్చింది. ధనమూలమిదం జగత్ అని తన తాత చిన్నప్పుడు చెప్పడంతో డబ్బుతో పోలీస్ స్టేషన్ నుండి కోర్టుల వరకు ఏ పనైనా చేయించుకోవచ్చునని అతనికి చిన్నప్పుడే గట్టి నమ్మకం ఏర్పడింది. లండన్‌కు వెళ్లడానికి స్టీమరు ఎక్కడమే కాదు బడా కంపెనీల్లో లోనికి వెళ్లాలన్నా డబ్బుతో అన్ని చేసేయవచ్చని గ్రహించేస్తాడు. దాదాపు వందేళ్ల క్రితం వచ్చిన తొలి తెలుగు హాస్య నవలలోనే డబ్బుతో ఏమేం చేయవచ్చునో చర్చించారు. వందేళ్ల క్రితం డబ్బుతో ఏమేం చేయవచ్చు అనే సందేహం పార్వతీశానికి వస్తే ఇంకెలా డబ్బు సంపాదించవచ్చు అని రాజకీయాల్లోకి వచ్చాక చిరంజీవికి సందేహం వచ్చిందట! ఆయనకూ ఈయనకు సంబంధం ఏమిటి? అంటే మెగాస్టార్ చిరంజీవి పుట్టింది మొగల్తూరులోనే ఆయన కన్నా చాలా ముందే తొలి తెలుగు హాస్య నవల‘ బారిష్టర్ పార్వతీశం’లో హీరో పార్వతీశం పుట్టంది అక్కడే.


 లక్ష రూపాయలు ఇస్తే ముఖ్యమంత్రి అవుతారని, కోటి రూపాయలు ఖర్చు పెడితే ప్రధానమంత్రి కావచ్చునని డబ్బుకు విలువ పడిపోని 1956లో నీలం సంజీవరెడ్డి పలికారట. డబ్బుతో ఏం చేయవచ్చునో నీలం వారు బహిరంగంగానే చాటి చెప్పారు. ఇప్పటి మన నేతలు రాజకీయాల్లో విలువలు పడిపోయాయని అంటుంటే దాన్ని చాలా మంది తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. విలువలు పడిపోవడం అంటే వారి దృష్టిలో విలువ పెరగడం . అంటే అప్పుడు లక్ష పెడితే ఏకంగా ముఖ్యమంత్రి పదవి లభిస్తుండేది. ఇప్పుడేతే పది కోట్లు ఖర్చు పెడితే కానీ ఎమ్మెల్యే కారు అంతేనా డబ్బుతో పార్లమెంటులో ప్రశ్నలు అడిగించవచ్చునని, ప్రశ్నలు అడగకుండా చేయవచ్చునని మొన్న మన వాళ్లు నిరూపించారు కదా!


 ఏ యంత్రం నడవాలన్నా ఇందనం అవసరం అలానే ప్రజాస్వామ్య యంత్రం నడవాలంటే ధనమనే ఇందనం లేకపోతే ఎలా సాధ్యమవుతుంది? ఈ మాత్రం విషయం అందరికీ తెలుసు కానీ ఎవరికీ తెలియనట్టు ఒకరిని మించి ఒకరు నటిస్తూ గౌరవనీయమైన సభ్యులు అమ్ముడు పోవడమా? వోటుకు నోటా? అంటూ నోరెళ్లబెట్టి ఆశ్చర్యం నటిస్తూ విచారణకు డిమాండ్లు చేస్తుంటారు. డబ్బు దేముందండి మనసు ముఖ్యం అంటూ ఓ సినిమా రైట్స్ కోసం తమిళ కమల్‌హసన్‌ను తెలుగు సినీ వ్యాపారి కలిస్తే అతను మాత్రం నిర్మోహమాటంగా నాకు డబ్బే ముఖ్యం, , నేను డబ్బు కోసమే ఆ సినిమా అమ్ముతున్నాను అని చెప్పాడట మరి తమిళవాడి ముందు తెలుగు తెలివి తేటలు పని చేస్తాయా?

అమృత మథనంలో దేవదానవులు పాలకడలిని మథించేప్పుడు వచ్చిన లక్ష్మీదేవినేమో విష్ణువుకు కట్టబెట్టారు. హాలాహలం వచ్చినప్పుడు శివుడితో తాగించారు. అలా ఎందుకు జరిగిందంటారు.?ఇంకెందుకు విష్ణుమూర్తి పట్టువస్త్రాలు, నగలతో దగదగలాడుతుంటే లక్ష్మీదేవి ఉండాల్సింది ఆయన వద్దే అనుకున్నారు. శివుడేమో పాపం శరీరం అంతా బూడిద, మెడలో పాముతో కనిపించే సరికి ఎవరికైనా హాలాహలానే్న ఇవ్వబుద్ధేస్తుంది కదా!

26, జులై 2011, మంగళవారం

జగన్ ఒడిలో నుండి జారిపోతున్న చానల్స్ ........ ఈ వారం తెలుగు ఛానల్స్ ఆపద్బాంధువు మందకృష్ణ

విధేయతను బదిలీ చేస్తున్న చానల్స్


రాజుల కాలంలో శత్రురాజ్యంపై విజయం సాధించాలంటే వారి కాల్బలం, ఏనుగులు, గుర్రాల బలం ఎంతో ముందు తెలుసుకునే వారు. అంతకు మించిన బలాన్ని సమకూర్చుకున్నాకే యుద్ధం చేసేవారు. రోజులు మారాయి. రాజరికం నుండి ప్రజాస్వామ్యంలోకి వచ్చాం. ఆయుధాలు కూడా మారాయి. అప్పుడు ఏనుగులు, గుర్రాలు ఆయుధాలు అయితే ఇప్పుడు మీడియానే ప్రధాన ఆయుధం. మీడియా బలం సమకూర్చుకోకుండా యుద్ధ రంగంలోకి అడుగుపెడితే ఎంత గొప్ప హీరో అయినా మట్టికరిచిపోతారని జనమే కాదు ఆ యోధుడు సైతం గ్రహించాడు. అందరి వాడిని.. అన్ని ఛానల్స్ నావే అనుకున్న చిరంజీవి చివరకు ప్రత్యర్థుల చానల్స్ ధాటికి తట్టుకోలేకపోయారు. అనుభవం అయిన తరువాత ఆయనకు తత్వం బోధపడింది. ఇప్పుడు సొంత చానల్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఏదో ఒక రోజు అవకాశం రాకుండా పోదు. అప్పటి వరకు బలమైన ఆయుధాన్ని సమకూర్చుకోవాలనేది ఆయన లక్ష్యం. ఆయనో న్యూస్ ఛానల్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.
చిరంజీవి అనుభవమే కాకుండా తన తండ్రి అనుభవాన్ని సైతం దగ్గరి నుండి చూసిన జగన్ ముందు నుండి మీడియా బలాన్ని బాగానే అంచనా వేశారు. మీడియా విషయంలో తన ప్రత్యర్థి చంద్రబాబు కన్నా ఒక అడుగు ముందుకేశారు. సొంత మీడియానే కాకుండా అనుబంధ మీడియాను ఏర్పాటు చేసుకున్నారు. తాతకు దగ్గులు నేర్పుతావా? అనుకున్న ప్రత్యర్థి సైతం ఈ ఎత్తుకు పైఎత్తు వేశారు. దీంతో జగన్ ఒడిలో నుండి ఒక్కో మీడియా జారిపోతోంది. జగన్‌కు సొంత ఛానల్ ఎలాగూ చేతిలో ఉంది . ఒప్పందాలు ఏమిటో బయటకు తెలియదు కానీ సొంత ఛానల్‌తో పాటు కొన్ని చానల్స్ జగన్‌కు మద్దతుగా ఉండేవి. వీటిలో ఒక్కొక్కటి జారుకుంటోంది.
మొన్నటి వరకు ఒక నాయకుడిని తీవ్రంగా విమర్శించే ఛానల్ హఠాత్తుగా ప్లేటు మార్చి ఆ నాయకుడిని తీవ్రంగా విమర్శిస్తుంటే తెరపై చూసినప్పుడు నిష్పక్షితత్వానికి మారు పేరు అనిపిస్తుంది. లోతుగా విషయ పరిశీలన చేస్తే అసలు విషయం నిష్పక్షపాతం కాదు విధేయతగా మారింది అని తెలుస్తుంది.
2009 ఎన్నికల సమయంలో ఒక ఛానల్ మొదటి విడత పోలింగ్ మొత్తం టిడిపిని విమర్శిస్తూ, వైఎస్‌కు అండగా నిలిచింది. బాబు, ఆ ఛానల్ యజమాని ఒకే పోలింగ్ బూత్‌లో ఓటు వేయాలి. అక్కడ ఇద్దరూ తారసపడ్డారు. ఏంటయ్యా మనవాడివై ఉండి మనకు వ్యతిరేకంగా మీ ఛానల్ ఉందేమిటి? అని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏం చేస్తాం ఎటు నుండి సహాయం వస్తే అటుండాలి, మీ నుండి ఆశించిన సహాయం రాలేదు అన్నారు. ఏం సహాయం అందిందో కానీ మొదటి విడత పోలింగ్‌లో కాంగ్రెస్‌కు అండగా నిలిచిన ఆ ఛానల్ రెండవ విడత పోలింగ్‌లో బాబును భుజానికెత్తుకుంది. ఫలితాలు వచ్చాక మళ్లీ జగన్ పక్షం వహించింది. ఇప్పుడు ఛానల్ తన విశ్వసనీయతకు పచ్చదనం పులుముకుంది.
మరో ఛానల్ నిర్మొహమాటంగా జగన్‌కు రాంరాం చెప్పి కిరణ్‌లోని పాలనా పటిమను ప్రపంచానికి చాటడంలో మునిగిపోయింది.
గతంలో టీవి9 పట్ల చంద్రబాబు బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తం చేశారు. మీ ఛానల్ వైఎస్‌ఆర్ కొమ్ము కాస్తోంది మీ సంగతి చూస్తాం, మిమ్ములను మేం బహిష్కరిస్తాం అని బాబు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ ఛానల్‌ను జగన్ కొనేశాడు అని టిడిపి నాయకులు బహిరంగంగానే విమర్శలు చేసేవారు. అందులో నిజం ఎంతో, తరువాత ఏం జరిగిందో కానీ ఇప్పుడా ఛానల్ పేరు వింటేనే జగన్ వర్గం మండిపడుతోంది. జగన్‌పై విషం కక్కడంలో ఆ ఛానల్ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఐతే ఇదే శాశ్వతం అని భావించాల్సిన అవసరం లేదు అవసరాన్ని, పరిస్తితులను బట్టి విధేయత మళ్లీ మరో వైపు మారవచ్చు.  ఇక తెలంగాణ వారు టివి ౯ ఛానల్‌కు తెలంగాణ వ్యతిరేకి అని ముద్ర వేశారు.

ఛానల్స్ ఆపద్బాంధవుడు
గతంలో ఒకే ఛానల్ ఉన్నప్పుడు వారు ఆడిందే ఆట వారు చెప్పిందే వార్త. ఇప్పుడు పార్టీల వారీగా, ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా ఛానల్స్ ఉండడం వల్ల అందరి వాదనలు తెలుసుకునే అవకాశం ప్రజలకు లభిస్తోంది. ఈ వారం టీవీ ఛానల్స్ పాలిట ఆపద్బాంధవుడిగా మందకృష్ణ మాదిగ మారారు. యాదిరెడ్డి ఆత్మహత్య అంశంపై ఢిల్లీలో దళిత అధికారిపై టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు చేయి చేసుకున్నారు. తరువాత క్షమాపణ చెప్పారు. అప్పటి వరకు జగన్ సభ ముగిసిన తరువాత మైదానంలో కనిపించే కొద్దిమందిని చూపించి జనం లేరు అని చెప్పడం, మద్యం షాపుల వద్ద కార్యకర్తలను చూపించడం. ప్రతి మీటింగ్‌కూ రెడీమేడ్‌గా ఇవే దృశ్యాలు చూపుతూ అదే అద్భుతంగా భావిస్తూ మురిసిపోయిన యువ బాబు ఛానల్ స్టూడియో ఎన్ ఢిల్లీ సంఘటనపై ఒక్కసారిగా మేల్కొంది. దళితునిపై దొరల దౌర్జన్యం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. బాబు ఆదేశాలపై టిడిపి దళిత నేతలతో పాటు దళిత సంఘాలతో మాట్లాడించారు. పయ్యావుల కేశవ్, దేవినేని ఉమా మహేశ్వర్‌రావువంటి కొందరు నేతలు ఈ సంఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కారం చేడులో దళితులను ముక్కలుగా నరికి గోనె సంచుల్లో మూటకట్టి ఊరవతల పారేసిన ‘మహానుభావుల వర్గం’ ఒక్కసారిగా దళిత ప్రేమను కుమ్మరించింది. వారిలో ఇంతటి మార్పు వస్తే ఆహ్వానించదగిందే. ఈ సంఘటనతో పలు  పాలిట మందకృష్ణ మాదిగనిగా కనిపించారు. అప్పటి వరకు తెలంగాణ అంశంపై దాడి చేయడానికి అవకాశం లేదని ఆవేదన చెందిన ఛానల్స్ అన్నీ మందకృష్ణ మాదిగతో చర్చ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇక టిఆర్‌ఎస్‌కు చెందిన టీ ఛానల్ దీనిపై ఎదురుదాడి జరిపింది. టిఆర్‌ఎస్ దళిత నాయకులతో మాట్లాడించింది. పలు ఛానల్స్‌లో మందకృష్ణ మాట్లాడారు. ఈ అంశంపై ఐ న్యూస్‌లో కు ఆయన గురువు దళిత నాయకుడు ఉ సాంబశివరావుకు వాగ్వివాదం జరిగింది. టీ న్యూస్‌లో ఉ సాంబశివరావు మాట్లాడుతూ దాడిని ఖండించాల్సిందే,దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎంత వరకైనా పోరాడాలి. కానీ కొందరు వ్యక్తులు ఈ అంశాన్ని సాకుగా చూపించి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాటికి మనం మద్దతుగా నిలిస్తే మన అసలు లక్ష్యం దెబ్బతింటుందని చెప్పారు.
గతంలో ఎబిఎన్ ఛానల్‌పై దాడికి దిగిన మందకృష్ణ తెలంగాణకు చెందిన నాయకుడు ఆయన చానల్స్‌కు ఆత్మబంధువుగా కనిపిస్తే, సీమాంధ్రకు చెందిన దళిత నాయకుడు ఉ సాంబశివరావు తెలంగాణ చానల్ టీ ఛానల్‌కు ఆత్మబంధువుగా కనిపించారు. రాజకీయాల్లోనే కాదు ఛానల్స్‌కు సైతం ఎవరూ శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కాదు. నాయకత్వం స్థాయిలో ఉన్నవారు ఎలాంటి సందర్భంలోనైనా సంయమనం కోల్పోతే తన శత్రువు అవకాశం కల్పించిన వారవుతారని హరీష్ ఉదంతం నాయకులకు ఒక పాఠంగా నిలవాలి.

24, జులై 2011, ఆదివారం

తెలుగు వారికి భారత రత్న అవార్డు పొందే అర్హత ఉందా ? పివి నరసింహారావు, ఎన్టీఆర్ లకు దక్కేనా?
ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు కోసం ఆయన అభిమానులు కొందరు ఉద్యమానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈసందర్భంగా భారతరత్నల అవార్డు చరిత్ర చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరికీ ఆ గౌరవం దక్కకపోవడం విడ్డూరమనిపించింది.

 కానీ, ఇప్పటి వరకు అవార్డు పొందిన వారిని పరిశీలిస్తే అంతటి సామర్థ్యం తెలుగువారికి లేదా? అనే ప్రశ్న ఉదయిస్తుంది.

1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ విశాల రాష్ట్రం నుండి ఒక్కరికీ భారతరత్న లభించలేదు. ఔను నిజం. భారతరత్న అవార్డులను ఏర్పాటు చేసిన ఏడాదే తమిళనాడుకు (మద్రాస్ రాష్ట్రంగా ఉన్నప్పుడు) ముగ్గురికి లభించాయి.
ఇంతకాలం తరువాత కూడా తెలుగు మూలాలు ఉన్న ముగ్గురికి భారతరత్నలు లభించాయని అనుకోవలసిందే తప్ప, ఆంధ్రప్రదేశ్ నుండి ఒక్కరికీ భారతరత్న లభించలేదు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య    పూర్వీకులు తెలుగువారు. మూడు వందల సంవత్సరాల క్రితం వారి పూర్వీకులు మైసూరు రాష్ట్రానికి వలస వెళ్లారు. ఆయన ఇంటిపేరును బట్టి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని మోక్షగుండం వారి ఊరని, వారి పూర్వీకులు తెలుగువారని తేలింది. మోక్షగుండంకు 55లో భారతరత్న అవార్డు లభించింది. ఇక సర్వేపల్లి రాధాకృష్ణ తమిళనాడుకు చెందిన తెలుగు కుటుంబంలో పుట్టారు. ఆయనకు 54లో లభించింది. రాధాకృష్ణ పుట్టింది మద్రాసు ప్రెసిడెన్సిలోని తిరుత్తనిలో తెలుగు కుటుంబంలో. ప్రస్తుతం ఈ ప్రాంతం తమిళనాడులోని తిరువత్తూరు జిల్లాలో ఉంది.
వివి గిరికి భారతరత్న లభించింది. అప్పటి మద్రాసు ప్రెసిడెన్సిలోని బర్హం పురంలో ఆయన జన్మించారు. ప్రస్తుతం బరంపురం ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. సర్వేపల్లి రాధాకృష్ణది తెలుగు కుటుంబమే అయినా భారతరత్న మాత్రం తమిళనాడు లెక్కల్లో చూసుకోవలసిందే. ఏతావాతా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరికీ భారతరత్న లభించలేదు. 1954లో భారతరత్న అవార్డును ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 41 మందికి అవార్డు ఇచ్చారు. ఇందులో సింహ భాగం పొరుగున ఉన్న తమిళనాడుదే. తొలిసంవత్సరం అవార్డు పొందిన చక్రవర్తుల రాజగోపాలాచారి మొదలుకుని మొన్న మొన్నటి అవార్డు గ్రహిత ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎపిజె అబ్దుల్ కలాం వరకు అంతా తమిళనాడు వారే. 

తెలుగువారికి భారతరత్న అవార్డు పొందేంత సత్తా లేదా? అంటే? ఇప్పటి వరకు భారతరత్న అవార్డులు పొందిన వారి కన్న ఏమాత్రం తీసిపోని వారిని తెలుగుతల్లి కనలేదా? ఏమో !
ఇక ప్రస్తుతానికి వద్దాం. ఎన్టీఆర్‌కు భారత రత్న కోసం భారీ ఉద్యమాన్ని నిర్వహించాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో ఎప్పుడు ఏది మహా ఆయుధం అవుతుందో చెప్పలేం. ఒక్కోసారి ఆత్మవిశ్వాసం అనే మాటే ఎన్నికల ఆయుధం కావచ్చు. మరోసారి మద్య నిషేధం అన్న పిలుపే ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపించవచ్చు. అన్ని ఆయుధాల తరువాత కొందరు ఇప్పుడు హఠాత్తుగా ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం ఎన్నికల నాటికి ఒక ఉద్యమంగా సాగించాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుత కాలానికి తెలుగువారిలో గుర్తున్న ప్రముఖుల్లో భారతరత్న అవార్డు ఇవ్వాలి అని ఎవరైనా కోరేస్థాయిలో కనిపించే ప్రముఖుల్లో ఎన్టీ రామారావు, పివి నరసింహారావు కనిపిస్తున్నారు.
1988లో భారతరత్న అవార్డు పొందిన ఎంజి రామచంద్రన్ ప్రాంతీయ పార్టీని నడిపించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా సేవ చేశారు. ప్రముఖ సినీనటుడు. అచ్చంగా ఎన్టీఆర్‌కు సైతం ఈ అర్హతలన్నీ ఉన్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో మిత్రత్వం మినహాయిస్తే అన్నింటిలో ఎంజిఆర్‌కు ఎన్టీఆర్‌కు తేడా లేదు. కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పినప్పుడు భారతరత్న కోసం ప్రశ్నించని నాయకులు, ఇప్పుడు భారతరత్న కోసం మురళీమోహన్ ఆధ్వర్యంలో ఉద్యమించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 ఎన్టీఆర్, పివి నరసింహారావుల్లో ఎవరికైనా భారతరత్న వస్తుందా? అంటే వస్తుంది అని కచ్చితంగా చెప్పేవారైతే లేరు. చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పిన కాలంలో ఎన్టీఆర్‌కు లభించే అవకాశం ఉండేది మిస్సయింది. దీంతో ఇప్పట్లో తెలుగువారికి అవార్డు ఎండమావే అని చెప్పక తప్పదు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా, సినిమా నటునిగా తెలుగువారిపై చూపిన ప్రభావం సామన్యమైనదేమీ కాదు. తెలుగులో ఆయన గొప్ప నటుడు. ఈ విషయం కాదనేవారుండరు.
 ఎన్టీఆర్‌ను దించేసిన సమయంలో ఇటు వైస్రాయ్ హోటల్, అటు ఎన్టీఆర్ నివాసం మధ్య రాయబారాలు నడిపిన మురళీమోహన్ అవార్డు కోసం ఉద్యమించే ముందు, ఎన్టీఆర్ ఏం తప్పు చేశారని ఆరోజు అధికారం నుండి దించేశారో చెప్పాలి. ఎన్టీఆర్ మహనీయుడు, సామాజిక ఉద్యమకారుడు, కులాలకు అతీతంగా సమాజం ఉండాలని కోరుకున్న వ్యక్తి అంటూ ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాల్లోని దృశ్యాలతో ఎన్టీఆర్‌పై ఫిల్మ్ రూపొందించిన పెద్దలు అవార్డు గురించి డిమాండ్ చేసే ముందు అంతటి గొప్ప వ్యక్తిత్వం గల నాయకుడిని ఎందుకు దించేశారో చెప్పాల్సిన బాధ్యత ఉంది.
ఇంటి పంటి డాక్టర్‌కు, కంటి డాక్టరుకు  పద్మశ్రీలు ఇప్పించుకుంటున్న కాలమిది. ఇప్పించుకుంటున్న తీరులోనే అవార్డులకు గౌరవం ఉంటుంది. కానీ పొరుగున ఉన్న తమిళ సోదరుడికి డజన్లకొద్దీ భారతరత్నలు వచ్చినప్పుడు, మనవారికి ఒక్కటీ రాలేదేమిటా? అనిపించకుండా ఉంటుందా?. బాబు చక్రం తిప్పినప్పుడే రాని భారతరత్న ఎన్టీఆర్‌కు ఇప్పుడొస్తుందా? ఏ కారణాలు చూపి ఎన్టీఆర్‌ను అధికారం నుంచి దించేశారో, అలాంటి కారణాలు అవార్డుకు అడ్డం కావా? ఉద్యమించే వారే సమాధానం చెప్పాలి.
ఇక మిగిలింది పివి నరసింహారావు. నిజానికి భారత రత్న అవార్డుల్లో ఎన్టీఆరే కాదు, అవార్డు పొందిన ఎంతో మంది కన్నా పివి నరసింహారావుకు ఎక్కువ అర్హత ఉంది. పివి నరసింహారావు ఒక రాష్ట్రంపైనే కాదు, మొత్తం దేశంపైనే గణనీయమైన ప్రభావం చూపారు. స్వాతంత్య్రం తరువాత ఆర్థిక రంగంపై పివి చూపినంత ప్రభావాన్ని మరే నాయకుడు చూపలేదు. ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఈ దేశం ఏమవుతుందనే భయం ఉండేది. బంగారాన్ని వి దేశాల్లో తాకట్టుపెట్టిన కాలమది  అలాంటిది ఇప్పుడు మరో పది పదిహేనేళ్లలో ప్రపంచంలోని నాలుగు అగ్ర రాజ్యాల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని సగర్వంగా ప్రకటించుకుంటున్నారు. ఈ పరిస్థితికి పివి తీసుకు వచ్చిన ఆర్థిక సంస్కరణలు కారణం. ఆర్థిక సంస్కరణల్లో మంచి చెడుల ప్రభావం గురించి చర్చ కాదు. కానీ ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని సమూలంగా మార్చేశాయి. తీవ్రమైన ప్రభావం చూపించాయి.
ఇప్పటి వరకు భారత రత్న అవార్డులు పొందిన వారు వారివారి రంగాల్లో ప్రముఖులే, ప్రభావం చూపిన వారే. కానీ పివి మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేశారు. అలాంటి పివి నరసింహారావుకు భారతరత్న కోసం డిమాండ్ చేసే గొంతే లేదు. కనీసం ఎన్టీఆర్ కోసం డిమాండ్ చేసే బలమైన వర్గం ఉంది. పివికి అదీలేదు. భారతరత్న అవార్డు మాట అలా ఉంచండి, ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశాన్ని గట్టెక్కించిన తరువాత కనీసం ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ దక్కలేదు. ఇక భారత రత్న ఏం దక్కుతుంది.

 ఇటు పివికి భారతరత్న అడిగేవారు లేరు, అటు ఎన్టీఆర్‌కు అవకాశం లేదు.
ఏతావాతా భారత రత్న తెలుగువారికి ఇప్పట్లో అందని పండే. అవార్డు తేగల ప్రభావశీలి ఇంకా పుట్టాలేమో..!

20, జులై 2011, బుధవారం

ఇసుక నుండి నూనె తీయబడును

ప్లీజ్ నన్ను ప్రేమించు రాజా! - అని చాలా సేపటి నుండి హీరోయిన్ బతిమిలాడుకొంటోంది. దీనంగా హీరోయిన్ అడుగుతోంది. ఆ మాటలు విన్న వారికి జాలి కలగడం సహజమే కానీ ఆమెది పవిత్ర ప్రేమ. రాజా ప్రేమ పొందని జీవితం వృధా అని నిర్ణయించేసుకున్న పవిత్ర హీరోయిన్ ఆమె. ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు రాజా! నీతో ఐ లవ్ యు చెప్పించుకోని జీవితం వృధా అంటూ కన్నీరు కార్చింది.
 ఐనా ఎన్టీఆర్ కరిగిపోలేదు. బెల్ బాటం ఫ్యాంటు, ఎత్తుగా ఉన్న షూ ఉబికి వస్తున్న పొట్టతో భారీకాయుడైన ఎన్టీఆర్ హీరోయిన్ మాటలను పట్టించుకోకుండా చేతిలోని ఒక పుస్తకాన్ని మోస్తూ కాలేజీకి వెళుతున్నారు. అది టాకీ సినిమా కాబట్టి విషయం సులభంగానే ఆర్ధమవుతోంది. మూకీ సినిమా ఐతే బొజ్జమీద కూర్చోబెట్టుకుని ఆడించమని పిల్ల మారాం చేస్తుందేమో అనిపించేది!
హీరో అన్నాక ఒక పెద్ద లక్ష్యం ఉండి తీరుతుంది. దాని కోసం ప్రేమ దోమా జాన్తానై అంటారు. ఎవడి సమస్య వాడికి గొప్పది. చెట్టుమీద ఏం కనిపిస్తుంది అని అడిగితే వంద మంది కౌరవులకు వందలాది దృశ్యాలు కనిపించాయి. అర్జునుడికి మాత్రం పిట్టకన్ను మాత్రమే కనిపించింది. అలానే సాధకుడికి లక్ష్యం తప్ప మరేమీ కనిపించదు. అలా ఎన్టీఆర్ తన తండ్రిని మోసం చేసిన వాడిపై పగ తీర్చుకోవాలనే గొప్పలక్ష్యంతో ఉన్నాడు కాబట్టి అలాంటి వాడితో ఐ లవ్‌యు చెప్పించడం మహానటి అంజలీదేవితో మొదలు పెడితే వాణిశ్రీ నుండి జయప్రద, శ్రీదేవి,రాధ వరకు ఎవరికీ సాధ్యం కాదు. వాణిశ్రీ, శ్రీదేవి అంటే మనకు గొప్ప కానీ ఎన్టీఆర్‌కు కాదు కదా! హీరో పక్కనుండే కమెడియన్ ద్వారా హీరోయిన్ తన హీరో లక్ష్యం తెలుసుకున్నాక ఎన్టీఆర్ తో ఐ లవ్‌యు చెప్పించుకోవడం కన్నా , ఆయన లక్ష్యం సాధించడం ముఖ్యం అనుకుని రాజా ఇక నీ లక్ష్యమే నా లక్ష్యం అంటుంది. విషయం ఏమంటే ఏదో ఒక లక్ష్యంతో ఉన్నవాడితో ఎంత కష్టపడ్డా మరో మాట చెప్పించలేం.


కొన్ని కొన్ని విషయాలు కొందరితో చేయించడం, చెప్పించడం అంత ఈజీకాదు. ప్రహ్లదుడు నిరంతరం హరి ధ్యానంలోనే మునిగాడు కదా! ఆ మాట అతని నోటి నుండి రాకుండా చేయడం హిరణ్యకశిపుడుతోనే కాదు మహామహా ప్రైవేటు మాస్టారు చండమార్కుల వారి వల్లనే కాలేదు. భర్తృహరి కొందరితో చేయించగల పనులు, చేయించలేని పనుల జాబితాను తన నీతిశతకంలో చెప్పాడు. ‘‘తివిరి యిసుమున తైలంబు తీయవచ్చు....’’ కానీ ‘‘చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు..’’అని చెప్పాడు ఏదో విధంగా ఇసుక నుండి నూనెను తీయవచ్చునట! ఎండమావుల్లో కూడా నీటిని సంపాదించవచ్చు, కుందేటి కొమ్మును కూడా సంపాదించవచ్చు కానీ మూర్ఖుని మనస్సు రంజింపజేయలేమని తేల్చి చెప్పారు.


 అంతేనా మరో చోట మొసలి నోటిలోని రత్నన్నైనా బయటకు తీయవచ్చు, పెద్ద అలలు గల సముద్రాన్ని దాటవచ్చు, పామును పూదండగా ధరించవచ్చు, మూర్ఖుని మనస్సును సమాధాన పెట్టడం కష్టమన్నారు. చిన్నతనాన మనకు 13వ ఎక్కం కష్టమైన పని ఐనట్టే ఇవి భర్తృహరి కాలానికి సంబంధించి కష్టమైన పనులే కావచ్చు. 


నిజానికి భర్తృహరి చెప్పిన వాటిలో చాలా తరువాత కాలంలో సులభసాధ్యమై పోయాయి. కానీ ఆయన కాలంలో రాజకీయ నాయకులు లేరు కాబట్టి వారి గురించి ప్రస్తావించలేదు కానీ ఇవన్నింటి కన్నా నాయకులతో నిజం చెప్పించడం అనేది చాలా కష్టం. కర్ణుడితో లేదని చెప్పించడం, హరిశ్చంద్రుడితో అబద్ధం చెప్పించడం ఆ దేవుళ్లకే సాధ్యం కాలేదు. నాయకులతో నిజం చెప్పించడం అంత కన్నా కష్టం.


 ఓసారి శాసన సభలో ఏదో అంశంపై సీరియస్‌గా చర్చ జరుగుతుంటే బాబు ఆవేశంగా మాట్లాడాక రాజశేఖర్‌రెడ్డి లేచి ఏంటయ్యా బాబు నిజం చెబితే తల ముక్కలైపోతుందని నీకేమన్నా శాపం ఉందా? ఏంటి ఒక్క నిజం కూడ చెప్పవేమిటయ్యా అని నెమ్మదిగా అడిగాడు. ఒక్క బాబే కాదు రాజకీయ బాబులతో నిజం చెప్పించడం ఇసుక నుండి నూనె తీయడం కన్నా కష్టం. కనీసం సినిమా చివర్లో అయినా వాణిశ్రీ ఎన్టీఆర్‌తో ఐ లవ్‌యు అని చెప్పిస్తుంది. తరువాత ఇద్దరి తలలు పెద్ద పూవు వెనక్కి వెళతాయి. పూవు పరవశంతో ఊగిపోతుంది. పలుకుతల్లీ పలుకు అని ఎస్వీ రంగారావు తన చేతిని తెగ్గోసుకుంటే పాతాళభైరవి పలుకుతుంది. రావణుడు ఒక్కో తల తెగ్గోసుకుంటే శివుడు పరవశంతో పలుకుతాడు. చేతులు, కాళ్లు, ఒకటి రెండు తలలు తెగగానే నోరు విప్పడానికి ఆమేమన్నా అల్లాటప్ప మాతనా? అధిష్ఠాన మాత !! అందుకే ఆరువందల తలలు తెగినా మాట్లాడడం లేదు. ఆమెతో తెలంగాణపై ఔనని కానీ కాదని కానీ ఎవరూ చెప్పించలేకపోతున్నారు.


తన బలాన్ని పదింతలు చేసి ప్రచారం చేసుకోవడం, ప్రత్యర్ధి బలం పదిరేట్లు తగ్గించి ప్రచారం చేయడం నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. అంగదుడి నాయకత్వంలో వానర సైన్యం రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు రావణుడి తమ్ముడు కుంభకర్ణుడు వానర సైన్యంపై పడి బఠానీలు నమిలినట్టుగా నమిలేస్తుంటే అంతా పరుగులు పెడతారు. అప్పుడు అంగదుడు వాడు నిజమైన రాక్షసుడు కాదు పంట పొలాలకు కాపలాపెడతారు కదా! అలాంటి బొమ్మ రాక్షసుడు, భయపడకుండా యుద్ధం చేయండి అంటూ ధైర్యవచనాలు చెబుతాడు. కుంభకర్ణుడి గురించి నిజంగా అంగదుడికి తెలియదా? అంటే విషయం అది కాదు ప్రత్యర్థి బలహీనుడు కాగితపు పులి అంటేనే కదా తన సైన్యం ధైర్యంగా యుద్ధం చేసేది. ఈ టెక్నిక్‌ను మన వాళ్లు రామరావణ యుద్ధం నుండే నేర్చుకున్నట్టున్నారు. ఫలానా నేత జైలుకు వెళతాడు, కుర్చీ మనకోసమే ఎదురుచూస్తుంది- అని ఎంత కాలమైనా నమ్మించగలరు. ఎందుకంటే వారితో నిజం చెప్పించడం ఎవరి వల్ల కాదు!

19, జులై 2011, మంగళవారం

ఆ ‘పాట’ మధురం


బయట సన్నని వాన ముసురు. మీ గదిలో మీరొక్కరే. మీ పక్కన ఒకవైపు వేడి పకోడీ. అంత కన్నా వేడివేడి టీ.. మరోవైపు ఈజీచైర్‌లో మీరు.. మీ ఒళ్లో పత్రిక- చేతిలో టీ. టీవీలో సూపర్‌స్టార్ కృష్ణ చిటాపటా చినుకులతో కురిసింది వాన! మెరిసింది జాణ అంటూ హుషారుగా స్టెప్పులు వేస్తున్నారు. కృష్ణకు డ్యాన్స్ రాదని అన్నవాడెవడు? అనే ప్రశ్న మీ మనసులో ఆ సందర్భంలో అస్సలు గుర్తుకు రాదు. ఎందుకంటే విజయనిర్మలను అంత అందంగా మీరెప్పుడూ చూడలేదు. విజయనిర్మల అందాన్ని చూసి మెరిసింది జాణ అని కృష్ణ పలికిన మాటలో ఈసమంత అబద్ధం కూడా లేదనిపించింది. కృష్ణ అంత ఉత్సాహంగా హీరోయిన్‌తో ఎప్పుడూ డ్యాన్స్ చేయలేదు.
 విజయనిర్మల అందాన్ని అలా చూస్తూ భలే జంట అనిపిస్తుంది తప్ప మరో ఆలోచన రాదు. చిటపట చినుకుల పాట వినగానే అక్కినేని నాగేశ్వరరావు, బి సరోజల జంటనే గుర్తుకు వస్తుంది కానీ ఆ పాటకు ఏ మాత్రం తీసిపోకుండా దానికి పోటీ అన్నట్టుగా కృష్ణ విజయనిర్మలపై చిటాపటాచినుకులతో పాటుంది. విజయనిర్మల చెక్కిలిపై పడ్డ వర్షపు చినుకులను చూసి కృష్ణకే కాదు ఆనాటి యువతకు కూడా చినుకునైనా కాకపోతే అనిపించే ఉంటుంది. టీవీ చూస్తూ ఆ పాటలో లీనమైపోయిన మీకు ఒక్కసారి మీ అదృష్టంపట్ల మీకే ఆసూయ కలిగి తీరుతుంది... ఆగండాగండి ఇదేమీ ఊహ కాదు.. కథ కాదు... కళ్ల ముందు వనిత టీవిలో కనిపించిన దృశ్యం.
సినీ అభిమానుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక థియేటర్లలో పన్నుల విధానంలో వచ్చిన మార్పుల పుణ్యమా అని పాత సినిమాలను థియేటర్లలో చూడాలనుకునే వారికి శాపంగా మారింది. గతంలో సినిమా హాళ్లలో ఉదయం పూట పాత సినిమాలు ప్రదర్శించే వారు. వాటిని చూసే వారి సంఖ్య తక్కువేమీ కాదు.
 కొత్త సినిమాలు మొదటి వారం మాత్రమే నాలుగు షోలు ప్రదర్శించే వారు తరువాత ఉదయం పూట పాత సినిమాలే. కత్తి వీరుడు కాంతారావు, ఎన్టీఆర్ గండికోట రహస్యం ఒకటేమిటి అద్భుతమైన సినిమాలను చూసే అవకాశం ఉండేది. నటుడు ముఖ్యమంత్రి అయ్యాక మనకా అదృష్టం లేకుండా పోయింది.
 ఆ తరువాత టీవీలు వచ్చాక పాత సినిమాలు సినిమా హాల్‌లో చూడడం అనేది కలగానే మిగిలిపోయింది.
ఇప్పుడు పలు చానల్స్ ఏదో ఒక సమయంలో పాత సినిమాలను, పాత సినిమాల్లోని పాటలను, దృశ్యాలను చూపిస్తున్నాయి. కలర్స్ చానల్‌లో సీరియల్ కోసం రిమోట్ లాగేసుకునే ఇల్లాలు, కార్టూన్ చానల్ కోసం ప్రపంచ యుద్ధం కోసమన్నట్టు సైరన్ మ్రోగించే పిల్లలు అంత ఈజీగా పాత సినిమాలను చానల్స్‌లో చూడనివ్వరు కానీ. అలా చూసే చాన్స్ ఉంటే మీరొక్కరు మాత్రమే మీ గదిలో ప్రశాంతంగా చూడగలిగే అవకాశం ఉంటే మీరు అదృష్టవంతులే. ఏదో ఒక తెలుగు చానల్స్‌లో ఏదో ఒక సమయంలో పాత ఆణిముత్యాలను దర్శించవచ్చు.

 ఒక సినిమా సీడీ కొనుక్కొని చూడడం వేరు. టీవీలో సినిమా చూడడం వేరు. సినిమా హాలులో చూడగలిగితే ఇంకా అదృష్టమే కానీ పన్ను విధానం, మారిన పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా వనిత చానల్‌లో పాత సినిమాలకు కొదవ లేదు. ఎంత మంది చూస్తారు, వీవర్ షిప్ ఎలా ఉంది, టిఆర్‌పి రేటింగ్ ఏమిటి? అనే ప్రశ్నలను పక్కన పెడితే వనితా టీవీలో పాత సినిమాలకు కొదవ లేదు.
ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటలకు వనిత చానల్‌లో ఆమని పేరుతో అరగంట పాటు మధురమైన పాత పాటలను వ్యాఖ్యానంతో చూపిస్తున్నారు. వ్యాఖ్యానం చక్కగా ఉండి పాటలూ బాగుంటున్నాయి. అదే విధంగా సోమవారం నుండి గురువారం వరకు రాత్రి తొమ్మిది గంటలకు గోల్డెన్ క్లాసిక్ పేరుతో పాత పాటలను వినిపించడమే కాకుండా ఆ పాట గురించి పాత విషయాలు చెబుతున్నారు. అంతేనా ప్రతిరోజు మధ్యాహ్నం ఒక పాత సినిమాలోని కొంత భాగాన్ని సీరియల్‌గా చూపుతున్నారు. వనిత, సప్తగిరి( దూరదర్శన్) పాత సినిమాలను డైలీ సీరియల్ మాదిరిగా ప్రదర్శిస్తున్నాయి.
శనివారం ఉదయం 8.30కి సప్తగిరిలో ఆణిముత్యాలు పేరుతో పాత సినిమా చరణదాసి సీరియల్‌గా ప్రసారమయింది. ఆ తరువాత న్యూస్ చానల్ టీవి 5 చూస్తే పాటల పల్లకిపై పేరుతో మధురమైన పాత పాటలను చూపించారు. కల్లాకపటం తెలియని వాడా!... ఏరువాకా సాగారోరన్నో చిన్నన్న అంటూ వహీదా రెహమాన్ నృత్యం చేస్తుంటే గిలిగింతలు పెట్టకుండా ఉంటుందా? కొసరాజు, శ్రీశ్రీ వంటి లబ్దప్రతిష్టులైన సినీగేయ రచయితల గురించి చెబుతూ వారు రాసిన పాటలు ప్రసారం చేశారు. న్యూస్ చానల్స్‌లో సైతం అపురూపమైన సినిమాలు కనిపించడంతో టైమ్ మిషన్‌లో ఒక్కసారిగా ఆనాటి స్వర్ణయుగానికి వెళ్లినట్టు అనుభూతి కలిగింది. రమణారెడ్డి అయ్యయ్యో చేతిలో డబ్బులో పోయెనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే అని పాడుతుండగానే పక్కన రేలంగి పేకాడుతూనే కనిపించారు. ఆనాటి ఈ పాట నేటికీ ముచ్చటగానే అనిపించింది కానీ కొద్ది మందినైనా మార్చే ఉంటుంది. ఆ తరువాత శ్రీశ్రీ తెలుగువీర లేవరా పాట వినిపించారు. ఈపాట ఒక తరానే్న తట్టిలేపింది. ఇద్దరు తెలుగువారిని కూర్చోబెట్టి చర్చల పేరుతో తన్నుకునేట్టు చేయడంలో మాత్రమే సామర్ధ్యం ఉన్న
న్యూస్ చానల్స్ అపురూపమైన పాత పాటలపై దృష్టిసారించడం చూస్తే ఇది నిజమా? కలా అని అనిపించకుండా ఉంటుందా?
మహాటీవి సైతం పాత సినిమాల పాటలకు చోటు కల్పిస్తోంది. ఇక ఈటీవిలో సైతం రాత్రి పొద్దు పోయిన తరువాత పాత సినిమా చూపుతున్నారు. ఆ సమయంలో పాత సినిమాల అభిమానులకు ఆ సినిమా చూడడం కష్టమే.

 చానల్ వారికి ప్రైమ్ టైమ్‌లో పాత సినిమాలు చూపడం చానల్ వారికి కష్టం. పాత సినిమానో, పాత సినిమాలోని పాటలో విందామనుకునే వారికి తెలుగు చానల్స్‌లో ఏ సమయంలోనైనా ఏదో ఒక చానల్‌లో అదృష్టం వరిస్తుంది. అయితే వీటిని వీక్షించాలంటే ఇంట్లో అందరితో పాటు చూసే చాన్స్ తక్కువే. కాలం మారింది అభ్యంతరకరమైన దృశ్యాలున్న సినిమాలను, వర్షంలో హీరోయిన్ పూర్తిగా తడిచిపోయి అందాలను ఆరవేసే దృశ్యాలను, డబుల్ మీనింగ్ డైలాగులను కుటుంబంతో కలిసి చూడలేకపోవడం నిన్నటి మాట, ఇప్పుడు పాత సినిమాలను ఇంట్లో అందరితో కలిసి చూడలేకపోవడం నేటి సమస్య. మీరు పాత సినిమా చూస్తానంటే ఇంట్లో వారికి చాదస్తంగా వయసు మీరిన వారిగా కనిపించవచ్చు, లేదా మీ అధికారం చెల్లుబాటు కాకపోవచ్చు. అందుకే ఒక్కరే చూడగలిగే చాన్స్ అవకాశం ఉంటే మాత్రం అదృష్టవంతులే. అలాంటి అదృష్టం మీకుంటే మీ అదృష్టం మీద మీకే జెలసీ కలిగేంత అద్భుతమైన పాటలు వినొచ్చు.
ఏడుపుగొట్టు సీరియల్స్, మనుషుల మధ్య వైరాన్ని పెంచే వార్తా చానల్స్‌లను చూశాక టీవి అంటేనే వెగటు పుట్టేవారికి సైతం కొన్ని చానల్స్‌లో వేసవిలో పన్నీటి జల్లు కురిసినట్టుగా ఉంటోంది. అయితే వీటికి అద్భుతమైన వీవర్ షిప్ ఉంటుందనే అత్యాశ పెట్టుకోవద్దు.

13, జులై 2011, బుధవారం

ఇట్లు మీ విధేయుడు.....తారకరాముడు లక్ష్మీపార్వతి విధేయుడిగా మారిన విధంబెట్టిదనిన ....తెలుగుభాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం అంటూ ఒక్కో హీరో ఒక్కో పదం చెబుతున్నాడు. ఇంకా నయం ఆ హీరోల వీర విధేయులైన అభిమానులు ఆ పదాలను పలకడం మానేస్తే? ఇంకేమన్నా ఉందా? తెలుగు భాషలో పదాలు మిగులుతాయా? అసలే తెలుగు అంకెలు మాయమయ్యాయి.
 కొందరు నా నిఘంటువు- డిక్షనరీ- లో పలానా పదం లేదంటే, కొనేప్పుడు చూసుకోవద్దాఅని కొందరు పరాచికాలాడుతారు.కొందరి నిఘంటువులో కొన్ని పదాలు ఉండకపోవచ్చు, కొందరికి కొన్ని పదాలు నచ్చకపోవచ్చు. కానీ అందరికీ నచ్చే పదాలు - ‘‘ఇట్లు మీ విధేయుడు....’’ ఇ- మెయిల్స్ సెల్‌ఫోన్లు వచ్చాక ఉత్తరాలు కనిపించకుండా పోయినందుకన్నా అందులో తప్పని సరిగా కనిపించే ఇట్లు మీ విధేయుడు పదం కనిపించకుండా పోయినందుకు చాలా మంది బాధపడుతున్నారు.

మనకొచ్చిన ఉత్తరంలో నైనా మనం రాసిన ఉత్తరంలో నైనా, ముగింపులో ఉండే ఇట్లు మీ విధేయుడు అనే పదాలు చదవగానే మనసు ఉత్సాహంతో తేలిపోతుంది ! మనకు ఉత్తరం రాసిన వారు ఇట్లు మీ విధేయుడు అని ముగిస్తే మనకూ ఒక విధేయుడున్నాడని మన అహం గాలిలో తేలిపోతుంది. మనం రాసిన ఉత్తరాన్ని ఇట్లు మీ విధేయుడు అని ముగిస్తే పాపం పిచ్చోడు నమ్మేసినట్టున్నాడు, అని మనసు ఆనందంతో గెంతుతుంది.
వికటకవిని ఎటు నుండి చదివినా ఒకలానే ఉన్నట్టు ఇట్లు మీ విధేయుడును మనం రాసినా, మనం చదివినా ఒకే విధమైన సంతృప్తిని ఇస్తుంది. రావణ వధ తరువాత శ్రీరాముడి పట్ట్భాషేకం వేడుకగా సాగింది. విజయం సాధించిన సంతోషంతో శ్రీరాముడు అందరికీ తలా ఒక బహుమతి ఇచ్చాడు. తనకు అత్యంత విధేయుడైన హనుమంతుడికి ఒక ముత్యాల హారం ఇచ్చాడు. హనుమంతుడు ఆ హారంలోని ఒక్కో ముత్యాన్ని నోటితో కొరికి పారేయడాన్ని సీతారాములు చూశారు. తన అత్మీయ విధేయుడు తమను ఆవమానించినట్టుగా భావించి, ఎందుకలా? అని ప్రశ్నిస్తారు. నా రాముని పేరు లేని ముత్యం నాకెందుకు అందుకే ఇలా అంటాడు హనుమంతుడు. విధేయత అంటే ఇది అని సీతారాములు మురిసిపోతారు. అది త్రేతాయుగం కాబట్టి అంతటి విధేయతకు మురిసిపోయారు కానీ ఈ కలియుగంలో అంత విధేయత చూపిస్తే, హనుమంతున్నైనా! అనుమానించాల్సిందే.


 నేను చాలా సిన్సియర్‌నండి అంటూ ఎవరైనా వచ్చి విధేయత చూపిస్తే, కమల్‌హాసన్ అనుమానంగా చూస్తాడట! మరో మాయగాడు వచ్చాడని అనుమానిస్తాడట ఈ విషయం ఈ మధ్య స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు....చిన్నపిల్లలలను గమనించి చూడండి వారు పసిపిల్లలంటే ముచ్చటపడుతారు. దీనికి కారణం తెలుసా? ఇటీవలే మానసిక శాస్తవ్రేత్తలు వెల్లడించారు. వయసుతో సంబంధం లేదు, ఏ వయసులో ఉన్నవారైనా తమకు విధేయంగా ఉండేవారుంటే బాగుండు అనుకుంటారు. అందుకే పిల్లలు తమకు విధేయంగా ఉండే పసిపిల్లలను ఇష్టపడతారని తేల్చి చెప్పారు.


 దేవుళ్లే తమకు విధేయులుండాలని కోరుకున్నప్పుడు మనుషులు కోరుకోవడంలో వింతేముంది. అమెరివాడు ప్రపంచ మంతా తమకు విధేయులై ఉండాలని కోరుకుంటాడు. తమ కోరికలో న్యాయం ఉందని ఆ మధ్య ఆమెరికా మంత్రిణి ఒకరు బహిరంగాగానే తమ వాదన వినిపించారు. అమెరికా వాడు కనుగొన్న ఆవిష్కరణలన్నీ ప్రపంచంలోని మనుషులందరికీ చెందినప్పుడు అమెరికా బాధ ప్రపంచ బాధ కావలసిందే అమెరికా అధికారం ప్రపంచ వ్యాప్తం కావలసిందే! అని చెప్పుకొచ్చారు. గతంలో రష్యాకు విధేయులా? అమెరికాకు విధేయులమో తేల్చుకోలేక కొన్ని దేశాలు సతమతమయ్యేవి. ఇప్పుడా సమస్య లేదు మేం అమెరికా విధేయులం అని చెప్పుకోవడానికి దేశాలు పోటీ పడుతున్నాయి.


 వజ్రాయుధాన్ని తట్టుకుని నిలబడ్డవాళ్లు కూడా విధేయతకు పడిపోవలసిందే. సినిమా రంగంలో ఎంతో మంది సుందరాంగులను చూసిన ఎన్టీఆర్ అంత పెద్ద వయసులో అలా ఎలా అయ్యారు? మనసు ఎలా పారేసుకున్నారు అని చాలా మందికి ఇప్పటికీ అంతు చిక్కని విషయం.


 విధేయతే అని బాగా తెలిసిన వారంటారు. ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష నాయకుడిగా తీరిగ్గా ఉన్న సమయంలో అన్నగారికి జీవిత చరిత్ర రాయించుకోవాలనిపించింది. దాని కోసం అప్పటి లబ్దిప్రతిష్టులైన రచయిత్రులు కొందరిని పిలిపించారు. అన్నగారు బయటకు వచ్చే సమయానికి అంతా తమకు కేటాయించిన ఉచితాసనాలపై కూర్చోగా, లక్ష్మీపార్వతి మాత్రం హఠాత్తుగా కింద కూర్చున్నారు. అప్పుడే వేంచేసిన తారకరాముడు అదేమిటమ్మా మీరు అలా కింద కూర్చున్నారు అని రాగానే ఆమెనే పలకరించారు.
 మీరు కనిపించే దైవం, కలియుగ శ్రీరాములు, జ్ఞాన సంపన్నులు మీ ముందు నేను కూర్చోవడమా? అన్నారట! ఆ విధేయతకు తారకరాముడు మురిసిపోయాడు. ఆ మాటలు ఎక్కడో తాకాయి , ఆ దెబ్బతో తారకరాముడే ఆమెకు విధేయుడయ్యారు. అన్నిచోట్ల అందం పని చేయదు కొన్నిచోట్ల విధేయత మాత్రమే పని చేస్తుంది.


మాయలపకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు గొప్పవారి ప్రాణాలు విధేయుల చేతిలో ఉంటాయి. ఎన్నో పక్షులు ఉండగా మాయలపకీరు తన ప్రాణాన్ని చిలుకలోనే ఎందుకు పెట్టాడు? కుక్క అరుస్తుంది, కరుస్తుంది, కానీ చిలుక మాత్రం అరవదు, కరవదు, మనం చెప్పినట్టు పలుకుతుంది. అత్యంత విధేయతగల జీవి చిలుక అని ఫకీరు గ్రహించే ఆ పని చేశాడు. జీవితంలో నాలుగు రాళ్లు సంపాదించుకోవడం పెద్ద కష్టం కాదు కానీ నలుగురు విధేయులను సంపాదించుకోవడం చాలా కష్టం. కన్నవారిపై ఉండే విధేయత కట్టుకున్నవారికి బదిలీకావడం వల్లే మహానగరాల్లో ఓల్డ్‌ఏజ్ హోమ్‌లు పెరుగుతున్నాయట! సరే ఇక ఉంటాను.
 

                                                  -    ఇట్లు మీ విధేయుడు

12, జులై 2011, మంగళవారం

జూనియర్ ఎన్టీఆర్‌ , మహేష్ బాబులను గుర్తిస్తే రోజుకు లక్ష ఇస్తారు


మీరు జూనియర్ ఎన్టీఆర్‌ని గుర్తు పడతారా? పోనీ మహేశ్‌బాబును గుర్తు పడతారా? అంటే హెయిర్ స్టైల్‌నో, చేతి వేళ్లలో చూసి గుర్తు పట్టడం కాదండీ మొత్తం ముఖాన్ని మీరు కోరినంత సేపు చూసి మిత్రులు, కుటుంబ సభ్యుల సహకారం తీసుకుని చెప్పినా ఫరవాలేదు. గుర్తు పట్టగలరా?
 ఓ.. చాలా ఈజీగా అంటున్నారా? మరింకెందుకాలస్యం ఐతే మీరు రోజుకో లక్ష సంపాదించవచ్చు. కష్టమేమీ లేదు జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, త్రిష వంటి చాలా పాపులర్ నటీనటుల ఫోటోలను టీవీ తెరపై చూపిస్తారు.

 వెంటనే మీరు వారు చూపించిన ఫోన్ నంబర్‌కు ఫోన్ చేస్తే మీరు ఇల్లు కదలకుండా లక్ష రూపాయలు మీ ఒళ్లో వచ్చి పడిపోతాయి. బాగుంది కదూ! ఇంతటి మహత్తరమైన పుణ్య కార్యానికి పూనుకున్నది మా మూవీ చానల్ వాళ్లు. వాళ్ల చానల్‌లో రోజంతా కష్టపడ్డవారికి నెలకు పాతిక వేలు ఇస్తారో లేదో కానీ పాపం వాళ్లు మనమీదున్న ప్రేమ కొద్దీ ఫోన్ చేసి పేరు చెబితే చాలు లక్ష ఇచ్చేస్తారు. గుడ్డివాళ్లు తప్ప ఎవరైనా చెప్పగలంత ఈజీ ప్రశ్నలతో లక్ష రూపాయలిచ్చేస్తారు దానకర్ణులు.
మా మూవీ చానల్‌లో రాత్రి పదకొండు గంటల సమయంలో కవ్వించే మాటలతో రా రా అని పిలుస్తున్నట్టుగా మాట్లాడే ఒక అమ్మాయి ఆలసించిన ఆశాభంగం మీ కోసమే ఎదురు చూస్తున్నాం.. వచ్చేయండి ఫోన్ చేయండి.. అంటూ రెచ్చగొడుతుంది.

 తెరపై హీరో బొమ్మ వారు చూపించే లక్ష రూపాయల అంకె చూడగానే ఆశ మొదలవుతుంది. అసలు వ్యవహారం అక్కడే ఉంది. ఇదో పెద్ద బోగస్ వ్యవహారం. ఒక్కసారి పొరపాటును ఎవరైనా ఫోన్ చేశారంటే దాదాపు వెయ్యి రూపాయల వరకు నెత్తిన బిల్లు పడ్డట్టే. 

లేదా ఒకవేళ మీ సెల్‌ఫోన్ ప్రీ పెయిడ్ అయితే మీరు కాస్తంత అదృష్టవంతులు. ఎందుకంటే సెల్‌ఫోన్‌లో ఉన్న వందో రెండు వందల రూపాయల బ్యాలెన్స్‌తోనే మీకు జ్ఞానోదయం అవుతుంది. పోస్ట్‌పెయిడ్ అయితే ఆరిపోతారు. అంత పాపులర్ హీరోలను ఎవరైనా గుర్తు పడతారు. నిమిషానికి అర్ధ రూపాయే కదా, అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఫోన్ చేస్తే వారికి దొరికి పోతారు. నిజానికి నిమిషానికి 12  నుండి 15 రూపాయల వరకు వసూలు చేస్తారు. వెంటనే ప్రశ్నకు సమాధానం చెప్పనివ్వకుండా గంట గంటన్నర పాటు వెయిటింగ్‌లో ఉంచుతారు. టీవీలో- రండి ఫోన్ చేయండి అని అమ్మాయి పిలుస్తుంటుంది ఆ సమయంలో మాత్రం చాలా మంది వెయింటింగ్‌లో ఉంటారు. అలా ఉంటేనే ఆ కార్యక్రమ నిర్వాహకులకు గిట్టుబాటు అయ్యేది. రెచ్చగొట్టే విధంగా మాట్లాడడానికి ప్రత్యేకంగా శిక్షణ, ప్రత్యేక దుస్తులు ఉంటాయి.
మోసపోకుండా ప్రజలను చైతన్యపరచాల్సిన చానల్స్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను మోసపుచ్చడం ఎంత వరకు సబబు. కనీసం ఈ కార్యక్రమానికి ఫోన్ చేస్తే చార్జీలు ప్రత్యేకంగా ఉంటాయి. నిమిషానికి ఎంతో చెప్పాల్సిన బాధ్యత లేదా?
ఈ కార్యక్రమంపై టీవీ 1 యెటకారం డాట్‌కాంలో హాస్యగుళిక చూపారు. ఒక వడను తెరపై చూపించి కొద్దిగా కనిపించకుండా చేసి అదేంటో చెప్పాలని అడిగారు. మనం టిఫిన్‌గా తింటాం, మధ్యలో చిల్లు ఉంటుంది. చెట్నీతో తింటాం అంటూ చెప్పుకు పోయారు. దానికి సమాధానంగా పూరి అని కొందరు, దోశ అని కొందరు చెప్పారు. మహేశ్‌బాబును గుర్తుపట్టని వారు, వడను గుర్తుపట్టని వారుంటారా?
ఇంకా చిత్రమైన విషయం ఏమంటే అదే సంస్థకు చెందిన మా చానల్‌లో ఈ కార్యక్రమంపై వ్యంగ్యోక్తులు విసిరారు. ఉదయం సినిమాల్లో హాస్య దృశ్యాలను చూపించే కార్యక్రమంలో ఇద్దరు వ్యాఖ్యాతల మధ్య హీరోలను గుర్తించే కార్యక్రమంలోని మోసాన్ని ఎండగట్టారు. కానీ చానల్ వారే ఆ మోసం ఇంకా గుర్తించనట్టుగా ఉంది. ఇదే విధంగా శనియంత్రం, హనుమాన్ యంత్రం ధరించడం వల్ల దరిద్రం అంతా పోతుందని, సమస్యలన్నీ తీరిపోతాయని ఊదరగొడుతున్నారు. ఇలాంటి ప్రచారం నియమనిబంధనలకు విరుద్ధం. అయితే వీటిపై ఫిర్యాదులు రావడం లేదో ఏమో కానీ అన్ని చానల్స్‌లోనూ ఇలాంటి కార్యక్రమాలు రోజంతా వస్తున్నాయి. ప్రజల్లో మూఢనమ్మకాలను పెంచే విధంగా ఉన్న ఇలాంటి ప్రకటనలపై కనీసం వినియోగ హక్కుల ఉద్యమకారులైనా దృష్టిసారించాలి. అన్ని చానల్స్ ఈ యంత్రాలు ధరిస్తే వారే నంబర్ వన్ అయిపోతారు కదా!
అది ఎవరి సొమ్ము?
ప్రపంచంలోకెల్లా సంపన్న ఆలయంగా పద్మనాభస్వామి ఆలయం గురించి అన్ని చానల్స్‌లోనే ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేశారు. ఆ సంపదను పేదల సంక్షేమానికి ఉపయోగించాలని టీవీ9 ఉచిత సలహా పారేసింది. మంచిదే మనది కాదు కాబట్టి అలాంటి సలహాలిచ్చి పేద జనుల ఉద్ధరించిన తృప్తి పొందొచ్చు. లక్ష కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు లభించాయి నిజమే. అంటే టీవీ 9 ఉద్దేశం అంత పురాతనమైన ఆ ఆభరణాలను కరిగించి బంగారం అమ్మాలా? లేక ఆ విగ్రహాలను, ఆభరణాలను అమ్మి వచ్చిన డబ్బును పేదల సంక్షేమానికి ఉపయోగించాలా? అది కాస్తా వివరంగా చెబితే మరింత బాగుండేది. ఏదో నోటికొచ్చిన ఒక మాట చెప్పేద్దాం అనుకుంటే ఎలా?
శుక్రవారం అన్ని చానల్స్‌లోనూ వైఎస్‌ఆర్ జయంతి దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేశాయి. ఇడుపుల పాయలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్లీనరీ జరుగుతున్న ప్రాంతం నుండే సాక్షి చానల్ హెడ్‌లైన్ షో పేరుతో వార్త పత్రికల సమీక్ష ప్రసారం చేశారు. రోజూ స్టూడియోలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఒక పార్టీ వేదికపై నుండి నిర్వహించారు. రాష్ట్రంలో ఒక్కో చానల్ ఒక్కో పార్టీ ముద్దుబిడ్డలు అనే విషయం రహస్యమేమీ కాదు. కానీ ఒక పార్టీ వేదిక నుండి ఇలాంటివి నిర్వహించడం మాత్రం ఇదే తొలిసారి. పార్టీ వారినే కాకుండా సమీక్షలో పాల్గ్గొనే బయటి వారిని వేదికపైకి రప్పించడం ఏ విధంగా సమర్ధనీయం. అదే అంశంపై స్టూడియో నుండే కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుండేది.

8, జులై 2011, శుక్రవారం

బ్లాగుల గొంతు నులిమి చంపకండి ... ప్రోత్సహించండి ..

 చిన్న సలహా కావాలి  ?అతను అడిగిన విధానం పూర్తిగా సంతృప్తి పరిచింది నీ పతి ప్రాణం తప్ప ఏదైనా అడుగు అని యముడు చెప్పిన తరహాలో ఆతను అడుక్కో అని అభయమిచ్చాడు. ఓ కవిత రాశాను చదివి ఎలా ఉందో చెబుతారని అని మెల్లగా చెప్పాడు. ఆ మాట వినగానే ఆయన గట్టిగా నవ్వకుండా ఉండలేక పోయాడు. ఏంటి నువ్వుకుడా కవిత్వం రాయడమే అని అందరికీ వినబడేట్టుగా గట్టిగా చెప్పి మళ్లీ నవ్వాడు. అంతా వారివైపు చూశారు. అతను అదేవిధంగా మళ్లీ అడిగాడు. తన జేబులోని కవితను తీసి చూపించాడు. అతను గట్టిగా నవ్వుతూనే కవిత చదివాడు. ఇదిగో మనోడు కవిత రాశాడు.. కవిత  అంటూ వ్యంగ్యంగా నవ్వాడు. అయినా అతను అలానే ఉన్నాడు సరే నీ పట్టుదల నచ్చిన్దోయ్ ... కానీ కవిత్వం అంటే ఇది కాదోయ్ అంటూ  ఆ కవితలోని ఒక్కో అక్షరాన్ని పీకి పాకం పెట్టాడు . థాంక్స్ సార్ అని ఆ కవితను తీసుకోని మరో వ్యక్తి వద్దకు వెళ్ళాడు మీడియా   ఆఫీసు కాబట్టి పెద్దవారికి కొదవేమి లేదు . 
***
.మా మిత్రుడుమీడియాలో   పని చేస్తాడు ఓ సారి ఆతను ఒక కవిత తీసుకు వెళ్లి ఆఫీసులో ఉన్న అందరికీ చూపించాడు . అంతా నవ్వారు. ఆతను ఏ మాత్రం పట్టించుకోకుండా అందరి వద్దకు తిరిగాడు. ఒకరు ఓహో మీరు కూడా కవిత్వం రాయడమే అన్నారు. చదివి ఏమేం తప్పులు ఉన్నాయో చెప్పారు. దాదాపు గంట సేపు అంతా నవ్వుతూనే ఉన్నారు . కవిత్వం అంటే ఏమిటో ఒకరు చెబితే , ఆతను చూపిన దానిలో ఎన్ని తప్పులు ఉన్నాయో ఒకరు ఇలా గంట సేపు అంతా అతనితో ఆడుకున్నారు. గంట తరువాత ఆతను కవిత చదివి వేళా కోలం చేసిన అందరిని పిలిచి . కవితను మరోసారి చదివాడు అంతా నవ్వారు. ఆతను అప్పుడు చెప్పాడు కవిత చదివి మీ విలువైన అభిప్రాయాలు చెప్పిన వారందరికీ థాంక్స్ .  కానీ ఇంత సేపు మీరు చీల్చి చెండాడి, అదసలు కవితనే కాదు అని చెప్పిన కవిత నాది కాదు . సి నారాయణ రెడ్డి గారిది. కవిత్వంలో నారాయణ రెడ్డి గారికి  జ్ఞాన piita అవార్డు వచ్చింది. కవిత్వమే రాయలేని అతనికి అంత పెద్ద అవార్డు రావడం అన్యాయం కదూ అంటూ మిత్రుడు ముసిముసి నవ్వులతో చెప్పగానే అందరికీ నోటిమాట రాలేదు .  సి నారాయణ రెడ్డి  కవితల బుక్ చూపించాడు. మీ అమూల్యమైన అభిప్రాయాలూ ఆయనకు చెబుతాను అనగానే అంతా అవాక్కయ్యారు .ఒక వేళ ఆకవితలో తప్పు ఉంది అనుకుంటే అది నారాయణరెడ్డి కవిత అయినా తప్పని చెప్పాలి, శ్రీశ్రీ కవిత అయినా చెప్పాలి. అప్పటి వరకు అది కవితనే కాదు అని వ్యంగ్యంగా మాట్లాడిన వారు నారాయణ రెడ్డి కవిత అని చెప్పగానే మాట్లాడలేక పోయారు  
******
ఇది నేను కొంత బాధతో ,  హడావుడిగా రాశాను. విషయం ఏమంటే .. గూగుల్ తెలుగు గ్రూప్ లో ఒక మెయిల్ వచ్చింది . ఒకరు రామేశ్వరం వెళ్లి తన అనుభవాలను బ్లాగ్లో రాశారు . అతను రాసిన దానిలో తప్పులు ఎత్తిచూపుతూ ఒకరు  రాసిన లేఖ అందరికీ బాధ కలిగించేట్టుగా ఉంది.  ఆ సందర్భంలోనే నేను గూగుల్ గ్రూపుకు మిత్రునుని కవిత వ్యవహారాన్ని పంపాను . 
 జి మెయిల్ వంటి వాటిలో కంపోస్ చేయడం చాలా కష్టం . నేను ఈ మధ్యనే బ్లాగ్స్, బుజజ్ వంటివి చూస్తున్న. తప్పులు ఉంటే మంచి ఉద్దేశ్యంతో సవరించడానికి ప్రయత్నిస్తే మంచిదే కానీ ఇక జీవితం లో బ్లాగ్ వైపు చూడ వద్దు అనేట్టుగా ప్రవర్తించడం మంచిది కాదు. ఇంగ్లీష్ విషయంలో ఇలానే నవ్వడం వల్ల చదువుకే దూరం ఐనా వారు చాలా మండి ఉన్నారు. ఇంగ్లిష్ నేర్చుకునేప్పుడు చాలామంది చెప్పే మొదటి మాట నవ్వుతున్నారని పట్టించుకోకండి. నేర్చుకోండి అనే. బ్లాగ్ ప్రారంభించి నా వారిని ప్రోత్సహించండి. మాటలతో నిరాశపరచ వద్దు. మీరు బ్లాగ్ లో రాయడం నిలిపి వేస్తె ఇంకా చాలా మందిని నిరాశలో పడేసిన వారు అవుతారు. మీరో అలానే రాయండి. ఐతే తప్పులను చూపడం తప్పు అని నేను వాదించడం లేదు. సున్నితంగా ప్రోత్సహించే విధంగా ఉండాలి.
నేను మూడేళ్ళ క్రితమే బ్లాగ్ ప్రారంభించినా కంపోస్ చేయడం చాలా ఇబ్బంది అనిపించి అటువైపు చూడడం మానేశాను. ఆఫీసులో జెట్ స్పీడ్ లో కంపోస్ చేసే చేతులో జి మెయిల్ లో ఎడ్లబండి లాంటి స్పీడ్తో కంపోస్ చేయడం కష్టం అనిపించి బ్లాగ్ వైపు చూడడం మానేశాను. ఇప్పుడు కాస్తా పరవాలేదుజి మెయిల్ బాగానే ఉందనిపించి మళ్లీ నాలుగు నెలలనుంచి బ్లాగ్ ను వీడడం లేదు. కొంత నిర్లక్షం కావచ్చు, కొంత తెలియని తనం కావచ్చు, మరి కొంత వేగం వల్ల కావచ్చు తప్పులు తప్పడం లేదు. బ్లాగ్ మిత్రులు తప్పులను సరి చేసుకోమని చెప్పినప్పుడు ఒక టిచర్ మాదిరిగా సున్నితంగా చెప్పారు కానీ బ్లాగ్ అంటేనే విముఖత కలిగేట్టు చెప్పలేదు. భయపెట్టి బ్లాగుల వైపు రాకుండా చేయడం కాదు . ప్రతి ఒక్కరు మరో మిత్రుడిని బ్లాగ్ లోకానికి పరిచయం చేయాలనీ, ప్రోత్సహించాలని కోరుకుంటూ ........

******
ఇక తెలుగు గ్రూప్ లో చర్చ కొంత బాగాన్ని చూడండి . ఆసక్తి కరంగా ఉంది 
***
రాజాచంద్రగారు, పాపం రామేశ్వరం వెళ్లి, తమ ఆనందానుభూతుల్ని
తెలుగు గ్రూప్ సభ్యులతో పంచుకొందామనుకొని,
వ్రాసిన ఉత్తరం మీద చెలరేగిన వాదోపవాదాల్ని చదివాక, బండి
సుబ్రహ్మణ్య శ్రీనివాస శర్మ గారికి ( సుబ్రమణ్య కాదు, సుబ్రహ్మణ్య
అని వ్రాసుకోవాలి.) కొన్ని విషయాలు వ్రాయాలనిపించింది.
అయ్యా!  నమస్కారం.
తప్పులు ఎంచడం వరకు మంచిదే.
కానీ సున్నితంగా ఎంచడం మంచి పద్ధతి అని నా అభిప్రాయం.
మీకు తెలియనిది కాదు.
మీరు వ్రాసిన ఉత్తరాల్లో అనేక భాషాదోషాలు ఉన్నాయి.
తప్పులు                           ఒప్పులు
భాధ                               బాధ
రాస్తున్న                          వ్రాస్తున్న 
లెస్సా                             లెస్స
శతదా                             శతధా  
తప్పులెరుగలేరయా             తప్పులెఱుగరు
గ్రాంధీకము                       గ్రాంథికము
మాండలీకాలు                   మాండలికాలు
వాదేరో                            వాడేరో
ఇలా ఎన్నో తప్పులున్నాయి.
మీ పేరే మీరు తప్పు వ్రాసుకొన్నారు.
భావదోషాలు కూడా ఉన్నాయి.
"ఇక ఆంగ్ల పద సంపర్కం ఎందుకంటారా? సామాన్యంగా తెలుగును  1 ప్ర్రాకృతము, 2 వ్యావహారికము, 3 గ్రాంధీకము అని చెప్పుకో వచ్చు."
ఎవరు చెప్పారు మీకు...?
ఆంగ్ల పద సంపర్కం వేరు. మీరు చెప్పింది వేరు.
ప్రాకృతం అనేది ఒక భాష.
ఇక వ్యావహారికం , గ్రాంథికం అనేవి భాషకున్న రెండు రూపాలు.
గ్రంథస్థ భాష గ్రాంథికం. ఇది పండితుల చేత వ్యవహరింపబడుతుంది.
సామాన్య ప్రజలు (పండితేతరులు) వ్యవహరించే భాష వ్యావహారికం.
ఈ విషయంగా మళ్లీ భాషలు రెండు రకాలు 1. ఆదానభాషలు .2. ప్రదానభాషలు.
ఆదానభాషలు ఇతర భాషలనుండి పదాలను స్వీకరించి, తమలో
కలుపుకొంటాయి.
ప్రదానభాషలు ఇతర భాషలకు పదాలను దానం చేస్తాయి.
తెలుగు ప్రధానంగా ఆదానభాష. పదాలను తీసుకొని తనపదాలు
అన్నంతగా తనలో కలిపివేసుకోగలదు.
సంస్కృతం ప్రదానభాష.  పదాలను ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియని భాష ఇది. 
మీరు తెలుగు తెలుగు అని వ్రాసిన భాష అంతా సంస్కృతమే.
ఈ దురవస్థ నన్నయ వల్ల వచ్చింది.(నన్నయ భక్తులు క్షమింతురు గాక!)
ఆయన సంస్కృతపదాలకు  డు-ము-వు-లు చేర్చి, ఒక రకమైన
తెలుగు భాషను తయారుచేశారు. 
నన్నయను అభిమానించే చిన్నయసూరి దానికి తత్సమభాష అని,
పేరు కూడా పెట్టారు.
అచ్చతెనుగు భాషకు "దేశ్యభాష"  అని పేరు పెట్టారు.
ఈ మన అచ్చ/జాను తెనుగును బ్రతికిద్దామని, నన్నయ తరువాత
శివకవులు ( నన్నెచోడుడు, పాల్కురికి సోమనాథుడు మొదలైనవారు ) ప్రయతించారు. తెలుగుసాహిత్యచరిత్రలో " శివకవి
యుగం" అని ప్రత్యేకించి విభాగంకూడా చేశారు.
మళ్లీ తిక్కన ఆ ప్రయత్నం చేశాడు.
అన్నమయ్య కూడా అచ్చతెనుగు పదాలను మనకు తన
సంకీర్తనలద్వారా అందించాడు. నిజానికి మనం స్వచ్ఛమైన తెనుగును మర్చిపోయి చాల కాలమైంది. మాట్లాడినా అర్థం కాదు కూడా.
99 శాతం సంస్కృత , ప్రాకృత, ఆంగ్ల , హిందుస్థానీ మొదలైన పదాలతో కలిసిపోయి, ఒక్క శాతంగా మిగిలిపోయి,
తనకంటూ ఒక ప్రత్యేక రూపులేని తెలుగును మనం
మాట్లాడుతున్నాం అంటే కళ్లు చెమరించకమానవు.
ఇదీ నేటి తెలుగు దౌర్భాగ్యస్థితి.
మరి ఇంగ్లీషుమీడియం మీది అభిమానంతో అన్ని విషయాలు ఇంగ్లీషులో చదివినవారికి తెలుగు ఏం వస్తుంది..?
వారినీ తప్పుపట్టలేం.
ఇంతకీ సారాంశం ఏమిటంటే తప్పులు తెలియజేయడం అన్నది
చాల మంచిది. తెలియజేయాలి కూడా. కానీ అది సున్నితంగా
జరిగితే ఉత్తమమని నా అభిప్రాయం అని తెలియజేసుకొంటూ,
ఈ ఉత్తరం ద్వారా ఏమైనా మీ మనసును నొప్పిస్తే క్షమించండి.
అని కోరుతూ,
నాగస్వరం.
సూచన: కొలది ఆవేశంతో వ్రాయడం వల్ల నా ఉత్తరంలో కూడా
           తప్పులుండవచ్చు.
 పెద్దలకు నమస్కారం
నేను వాడిన ఇసుకంత అనే పదానికి ఇంత చర్చకు దారితీస్తుందని నేను
ఉహించలేదు. నావల్ల మీ అమూల్యమైన సమయాన్ని వృదా చేయించినందుకు నన్ను
క్షమించండి. నేను చేసిన ఆ తప్పును  నాకే తెలియపరుస్తూ  మెయిల్ చేసిఉంటే
బాగుందేమో .. నేను మీకు చెప్పతగిన వాడిని కాకపోయవచ్చు .. తప్పు నాది
కాబట్టి మీరు నాకే  మెయిల్ చేయవల్సింది. ఈ చర్చ చూస్తుంటే నేను 10th
క్లాస్స్ చదువు తున్నప్పుడు మా తెలుగు మాస్టర్ గారు అందరిలోనూ నేను రాసిన
తెలుగు పేపర్ చూపించిన సంఘంటన గుర్తుకు వస్తుంది --.raja chandra 
-

6, జులై 2011, బుధవారం

‘ధర్మకిరణ్’... ముఖ్యమంత్రి అంటే అతనేరా! రాష్ట్రం అంటే మనదేరా!

ఏడుపొచ్చినప్పుడు ఎవడైనా ఏడుస్తాడు, ఏడుపొచ్చినప్పుడు నవ్వేవాడే హీరో అంటాడో హీరో. పెళ్లయినప్పుడు ఎవరైనా కంటారు పెళ్లికాకున్నా కనడమే హీరోయినిజం అంది ఆ మధ్య మాజీ హీరోయిన్ నీనాగుప్తా. ప్రజాభిమానం ఉన్నోడు ఎలాగైనా గెలుస్తాడు ప్రజాభిమానం లేకున్నా గెలవడమే గొప్ప అని కొందరు ప్రజాప్రతినిధులు అంటే. ప్రజాభిమానం లేకున్నా నియోజక వర్గంలో గెలిచిన మీరే అంత గొప్పవాళ్లయితే ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా లేని నేను 294 మంది ఎమ్మెల్యేలున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యానంటే నా సంగతేమిటి? అని కిరణ్ ప్రశ్నిస్తున్నారు.


 ఆయన ఎప్పుడూ తనకు జనామోదం ఉందని చెప్పలేదు మన అదృష్టం బాగుంటే పదవి వరిస్తుందని చెప్పారు. 150 మంది ఎమ్మెల్యేలు జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని అమ్మగారికి మహజరు సమర్పించారు. కానీ దానిపై సంతకం చేసే అర్హత లేని రోశయ్యను అమ్మగారు ఏరి కోరి ఆ పదవికి ఎంపిక చేశారు.
వజ్రాన్ని వజ్రంతోనే కోసినట్టు రెడ్డిగారిని రెడ్డిగారితోనే కొట్టాలనుకున్న అమ్మగారు యువరెడ్డి కిరణాన్ని రంగంలో దించారు. ఈసారి జగన్‌కు సిఎమ్ పదవి ఇవ్వాలని సంతకం చేయని ఏకైక నేతను పిలిచి సిఎమ్ పదవి ఇచ్చారు. అప్పుడాయన స్పీకర్. వారు బహిరంగంగా సంతకాలు చేయరు కదా! ఏడేళ్ల క్రితం ఓడిపోయిన బాబును, ఏడాదిన్నర క్రితం చనిపోయిన వైఎస్‌ఆర్‌లనే జనం ముఖ్యమంత్రిగా గుర్తుంచుకుంటున్నారు కానీ విజయవంతంగా ద్విశతదినోత్సవం పూర్తి చేసుకున్న కిరణ్‌ను అంతగా పట్టించుకోవడం లేదు.


 మెగాస్టార్లు, ప్రిన్స్‌ల సినిమాలు కూడా ఒకటి రెండు వారాలు నడవడం లేదండి అలాంటప్పుడు కిరణ్ సినిమా రెండువందల రోజులు పూర్తి చేసుకోవడం మామూలు విషయమా! ఎవరి ద్వారా వచ్చామని కాదు ముఖ్యమంత్రిని అయ్యానా? లేదా?- అని ఏజిల్లాలోనూ వినిపించని సొంత యాసలో కిరణ్ ప్రశ్నిస్తున్నారు.
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడని అంటారు. రాజకీయాల్లో కలిసొస్తే కిరణ్‌లా సిఎమ్ అవుతారు. టిడిపి అధికారంలోకి వస్తే ఎవరు సిఎమ్ అవుతారు అని పిచ్చివాన్ని అడిగినా బాబుగోరు అంటారు . కానీ బాబుకు మరీ అంత పెద్ద గోర్లేమీ లేవు. ఆయనేమీ శ్రీరాముడు కాదు , పాదుక పట్టాభిషేకం  మాదిరిగా గోరుకు అధికారం కట్టబెట్టడానికి. ఆయన తన నీడనే కాదు సొంత ‘గోరు’ను కూడా నమ్మరు. అధికారం వస్తే ఆయనే సిఎమ్ అవుతారు, ‘గోరు’ను కానివ్వరన్నమాట !

 కిరణ్‌కుమార్ రెడ్డిప్రతిభను పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ తరిచి చూస్తే ఆయనలో ఒక ధర్మరాజు కనిపిస్తాడు. యుద్ధం చేసింది అర్జునుడు, చేయించింది శ్రీకృష్ణుడు, మరణించింది కౌరవులు , కానీ అధికారం వరిచింది ధర్మరాజును. ఇక్కడ సరిగ్గా అలానే ఎన్నికల్లో వీరోచితంగా పోరాడింది వైఎస్‌ఆర్, ఓడిపోయింది బాబు కానీ అధికారం అనుభవిస్తున్నది కిరణ్.

 ద్రౌపదీ స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని ఛేదించింది అర్జునుడు. ఆమె ఐదుగురు భర్తల్లో మొదటి స్థానం ధర్మరాజుదే. కిరణ్ సొంత నియోజక వర్గంలో పలుకుబడి అంతంత మాత్రమే, అభ్యర్థి ఎంపిక ద్వారా బాబు, ప్రచారం ద్వారా వైఎస్‌ఆర్ ఆయన విజయానికి తమవంతు కృషి చేశారు. మహాభారత యుద్ధంలో ధర్మరాజు ఎప్పుడూ ఆయుధాలు పట్టుకుని పెద్దగా పోరాడింది లేదు.

 మనం మహాభారత యుద్ధం చూడలేదు కదా! చూసింది సినిమాలోని యుద్ధమేనాయె. అందులో కర్ణుడి చేతిలో చిత్తయిన సందర్భంలో మాత్రమే ధర్మరాజు యుద్ధరంగంలో కనిపిస్తారు. కానీ శత్రువులపై ఆయుధాలతో కలియబడినట్టు ఏ సినిమాలోనూ కనిపించలేదు.

 నాలుగు దశాబ్దాల సినిమా ఇమేజ్‌ను నిచ్చెనగా మార్చుకుని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆయన్ని సొంత ఇంటివారు, మిత్రులు ఎవరూ కుదురుగా కుర్చీలో కూర్చోనివ్వలేదు. ప్రత్యర్థులు సైతం అబ్బురపడేట్టుగా పథకాలు అమలు చేసినా వైఎస్‌ఆర్‌కూ పెద్దగా మెజారిటీ రాక ప్రభుత్వం పరిస్థితి ఏమిటో? అనే దిగులు ఆ పార్టీ వారిలో కనిపించేది.

 కానీ అధికార పక్షం మద్దతు అస్సలు లేకున్నా ప్రతిపక్షం‘ నైతిక’మద్దతుతో అధికారాన్ని చెలాయిస్తున్న కిరణ్ అజాత శత్రువు అంటే కాదనేవారెవరుంటారు? నాటి ప్రకాశం పంతులు మొదలుకుని, ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ వరకు ముఖ్యమంత్రులు జనం అభిమానం సంపాదించారు కానీ ప్రతిపక్షం చేతిలో ముప్పు తిప్పలు పడ్డారు. కానీ కంటికి రెప్పలా కాపాడుకునే ప్రతిపక్షాన్ని కలిగి ఉన్న కిరణ్‌ను మించిన ఆజాత శత్రువు రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయ చరిత్రలో సైతం ఎక్కడా కనిపించరు.

 అవసరం అయితే దొంగతనం చేసైనా, బిక్షమెత్తయినా ప్రాజెక్టులు నిర్మిస్తాం అని అధికారంలో ఉన్నప్పుడు వైఎస్‌ఆర్ ఇంగ్లీష్ జాతీయాన్ని చెబితే, అదిగో ముఖ్యమంత్రిగా ఉండి చట్టవిరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నాడు, దొంగతనం చేస్తానన్నాడు చర్య తీసుకోండి, దిగిపోండి అని గోల చేసిన ప్రతిపక్షం ఇప్పుడు కిరణ్‌ను ఇంటెన్సివ్ కేర్‌లోని నవజాత శిశువులా చూసుకుంటోంది. డజను మెజారిటీతో ఉన్న ప్రభుత్వంలో 37మంది ఎమ్మెల్యేలు రోజూ జగన్‌తోనే ఉంటున్నారు. 40కి పైగా తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. పిజెఆర్, మర్రి ఇద్దరు మాత్రమే అసంతృప్తితో ఉన్నప్పుడు అసంతృప్తితో వైఎస్ ప్రభుత్వం కూలిపోతుంది అని బాబు, ఆయన మీడియా చేసిన గగ్గోలు సామాన్యమైనదా?

 అలాంటి బృందం నుండి అసలు లేనే లేని ప్రభుత్వానికి మద్దతు కూడగట్టడం అంటే కిరణాల ప్రభావం సామాన్యమైనదా? ఔను మేం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అంటూ ఏకంగా కోర్టుకిచ్చిన అఫిడవిట్‌లో పేర్కొన్న ‘రాజగురువు’ మద్దతు సాధించి సూర్యుని వెనక కిరణాల్లా తన వెనక వెలిగిపోయేట్టు ఏర్పాటు చేసుకున్నారంటే కిరణ్‌కు సాటిరాగల 
నాయకులెవరున్నారు? ధర్మకిరణాలకు ఎదురు లేదు !

5, జులై 2011, మంగళవారం

త్యాగం లో నా అంతటి వాణ్ణి నేను. .. కోట్ల రూపాయలు త్యాగం చేశాను

నా గురించి నేను చెప్పుకోవద్దు కానీ త్యాగం లో నా అంతటి వాణ్ణి నేను. ఏం త్యాగం చేశారేమిటి అనే కదా అడుగుతున్నారు.  ఈ రోజుల్లో  మనుషులు డబ్బుకోసం దేనికైనా తెగిస్తున్నారు కదా?  వంద రూపాయల కోసం హత్యా అని పతికల్లో బాక్స్ వార్తలు చూస్తున్నారు కదా ? ( వంద కాకుండా ఎక్కువ మోత్హానికి హత్యా చేస్తే వారికి అభ్యంతరం ఉండదేమో )  అలాంటి పరిస్తితిలో నేను వెయ్యి కాదు లక్ష కాదు కొన్ని కోట్ల రూపాయలను త్యాగం చేశాను. నమ్మడం లేదా ? అది ఒకసారి రెండు సార్లు కాదు కొన్ని డజన్ల సార్లు. నా త్యాగం ఒక్కోసారి నాకే ముచ్చటేస్తుంది. . నిజంగా నువ్వు నీ అంతటి వాడివి లేక పొతే ఎవరైనా ఇంత త్యాగం చేస్తారా అని నన్ను నేనే మెచ్చుకుంటాను. సాద్యమైనంత వరకు మన పనులు మనమే చేసుకోవాలి ఇతరులపై ఆధార పడరాదు. అందుకే అప్పుడప్పుడు నన్ను నేనే మెచ్చుకుంటాను. ఒకటి కాదు రెండు కాదు వంద కోట్లు ఏం చేయాలి బాగా  ఆలోచించాను. సరే అని నేను ఒక్క మాట అంటే వంద కోట్లు వచ్చి పడతాయి.  మనం నమ్ముకున్న విలువలా ? వంద కోట్లా ? సినిమాలో ఐతే ఇలాంటి సందర్భం లో  అద్దం లో మనలోని మన వాడు వచ్చి సలహా ఇస్తాడు. అద్దం ముందు నిలబడ్డా నేనే కనిపించాను. తప్పదు నా సమస్య నేనే పరిష్కరించుకోవాలి. బాగా ఆలోచించి తాము నమ్ముకున్న విలువల కోసం ఎన్నో పాత సినమాల్లో యన్టిఆర్ ,  అక్కినేని,కృష్ణ  ఎన్ని త్యాగాలు చేశారు . వారి త్యాగాలను చూస్తూ పెరిగిన నేను ఈ మాత్రం త్యాగం చేయలేనా అనుకున్నాను.వంద కోట్లు వద్దు పో అని ఎడమ చేతితో తోసేశాను. నా త్యాగం గురించి ఏ పత్రికలో రాలేదు కాబట్టి మీకు తెలిసి ఉండదు. కొందరు  గుప్త దానాలు చేస్తారు  అలానే నేను గుప్త త్యాగాలు చేశానన్నమాట. 
****
త్యాగాలు నాకు కొత్త కాదు నా జీవితంలో భాగమే. మేం వారాసిగుడా లో  ఉండగా ఎప్పటి మాదిరిగానే ఆ రోజు కుడా కిచులాడుకున్నాక నేను బయటకు వచ్చాను. సాయంత్రం ఫోన్ వచ్చింది. మనను  ఉత్తమ దంపతులుగా ఎంపిక చేశారట  డిన్నర్ కు  పలానా హోటల్కు  వస్తే ఉత్తమ దంపతులకు భారీ గిఫ్టు ఇస్తారట అది సారాంశం . ఫోన్ నెంబర్ తప్పేమో అని అనుమానం వ్యక్తం చేశాను. కాదు అడిగాను మన నంబరే చెప్పారని సమాధానం . ఏమో ఉత్తమ దంపతుల ను ఎంపిక చేసే విధానాలు మార్చారేమో. గొప్పగా చెప్పుకునే  రాజ్యాంగాన్ని ఆరువారాల నగలను  మార్చుతున్నంత  ఈజీగా  నాలుగు వారాలకోసారి మారుస్తుంటే ఉత్తమ దంపతుల  నిబంధనలు మారిస్తే తప్పేముంది  అనుకున్నాను.( ఆదివారం ఆడవారికి సెలవు కావున ఇప్పుడు ఏడు వారల నగలు కాదు ఆరువారాల నగలే )  అయినా నాలోని త్యాగ జివి మేల్కొని ఉచిత బహుమతులు అనుచితం అన్నాను. సరే విషయం తెలుసు కదా అసలు బహుమతి ప్రదానం ఎలా ఉంటుందో ఓ సారి చూసి వస్తే పోయేదేముంది అని శ్రేయోభిలాషులు చెబితే సరే అని వెళ్ళాను. స్టార్ హోటల్ మేము  వెళ్ళే సరికి అక్కడ ఉత్తమ దంపతులు చాల మంది కనిపించారు. కొందరు సొంత బంగారం, కొందరు అద్దె బంగారాన్ని  మెడ నిండా  దిగేసుకొని వచ్చారు .  వారందరినీ  కిడ్నాప్ చేస్తే ఒకటో రెండో క్వింటల్ల బంగారం దొరుకు తుందని అనిపించింది .
ఒక్కో టేబుల్  ఒక్కో జంట . అంత తెలుకుట్టినట్టిన దొంగల్ల ఉండి  పోయారు నేను మాత్రం విజయ గర్వం తో నేను ముందే చెప్పానా? లేదా ?  అన్నట్టుగా  శ్రీమతి ముఖం లోకి చూశాను .మన ప్రతిభను ప్రపంచం అంతా గుర్తించవచ్చు భార్య  గుర్తించడం అంత ఈజీ కాదు 
నేను స్కూల్కు  వెళ్ళను  అని ఏడ్చే పిల్లాడిని బలవంతంగా పంపిస్తే బుజ్జి.. కన్నా అని టిచర్ వాడికి రంగు రంగుల పుస్తకం చూపుతుంది.  మా వద్దకు  అలాంటి బుక్ తోనే ఒకడు వచ్చాడు . ప్రపంచం లో మీరు కానీవినీ  ఎరుగని దేశాలన్నిటిలో వీరికి హోటల్స్ ఉన్నాయి. కొన్ని లక్షల రూపాయల విలువైన ఆతిధ్యం  మీకు అని చెప్పబోతుండగా నేను ఆసక్తిగా వింటూ  నోరు తెరవడానికి ప్రయత్నించా ను. సందేహం వద్దు అడగండి సార్ అని అతను ఉత్సాహంగా అన్నాడు. నీకు ఇక్కడ జీతం ఇస్తారా ? ఇస్తే ఎంతా అని అడిగాను. జీతం పై కాదు చదువుకుంటున్నాను . రోజుకు ఇంతా అని ఇస్తారు వారు చెప్పమన్నది చెబుతాము అన్నాడు. ట్రాక్ తప్పుతుందని అతను  మళ్లీ  మొదలు పెట్టాడు. నేను కొంత  సేపటి తరువాత నువ్వు చాల బాగా చెబుతున్నావు, నీకు మంచి భవిష్యత్తు ఉంది నా మాట విని వీడిని వదిలేయి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి బూం రానుంది అటు వెళ్ళు బాగు పడతావు అని చెప్పను. ..ఇంతలో టపటప మని చప్పట్లు వినిపించాయి .  అందరు చప్పట్లు కొట్టి ఆ జంటను అభినదించమని మాటలు  వినిపించాయి.  ఒక  ఉత్తమ జంట ౩౦ వేల రుపాయాలి చెల్లించి సభ్యత్వం తీసుకున్నారు. దాంతో వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా వారి హోటల్స్ లో , రి సర్టులలో చాల చవకగా ఉండ వచ్చునన్నమాట. నాకు అలాంటి ఉచితాలు తీసుకోవడం అస్సలు నచ్చదు.  నా లాంటి  త్యాగ రాజును   నీమాటలు కరిగించలేవు  అని చెప్పాక అతను బేలగా  ముఖం పెట్టాడు. ఇలాంటి త్యాగాలు నాకు లెక్కలేనన్ని ఉన్నాయి ...


***
దూరపు బంధువు మరణించడం వల్ల కలిసొచ్చిన ఆస్తి అంటూ చిన్నప్పుడు పత్రికల్లో చదివినప్పుడు అలాంటి దూరపు బంధువు మనకు ఒకడు ఉండక పోడా  వారికి వారసులు ఎవరు లేకుండా ఏదో ఒక రోజు పోకపోడా అనుకునే వాణ్ణి.  దూరపుబంధువు కాదు కాని అదేదో  ఆఫ్రికా దేశం నుంచి కబురొచ్చింది . ఆ దేశంలో రాజకుటుంబం వద్ద బోలెడు డబ్బు ఉంది . వారికి ఎందుకో నా మీద  ప్రేమ పుట్టింది. సహజమే తెలుగు వాడిని సాటి తెలుగు వాడు ప్రేమించక పోవచ్చు కాని  ఆఫ్రికా వాడు ప్రేమించావద్దని లేదు కదా? ఆసక్తి ఉందని చెబితే కొన్ని కోట్ల డాలర్లు పంపుతానని అన్నాడు.
 మోహన్ దాస్ కరం చాంద్ గాంధీ , పోరుబందర్ అంటూ వివరాలు పంపాను . ఆ వెంటనే అక్కడి నుంచి సమాదానం రావడంతో నా కళ్ళు చెమర్చాయి. గాంధీని మనం మర్చిపోతున్నాం కానీ ఆఫ్రికా వాడికి మాత్రం గాంధీ మీ ద యెంత అభిమానం లేక పొతే వెంటనే స్పందిస్తాడని కళ్ళు చెమర్చాయి. ఐతే వందలకోట్లను ముట్టుకోవద్దని త్యాగం చేయాలని ముందుగానే అనుకోవడం వల్ల వాడు అడిగిన విధంగా నేను బ్యాంకు అకౌంట్ నెంబర్, ఇతర వివరాలు పంపలేదు.
 తన శరీరాన్ని కోసి ఇచ్చాడని శిబి చక్రవర్తి త్యాగం గురించి చెప్పుకుంటారు. గద్ద కు  మాంసం వేయాలంటే మార్కెట్లో దొరుకుతుంది కదా ? వంద రూపాయలకు కేజీ దొరికే మటన్ ను  త్యాగం చేస్తేనే యుగ యుగాలుగా తలుచుకుంటున్నారు  కానీ వందల  కోట్లు త్యాగం చేసినా ? .....అయినా మనది గుప్త త్యాగం కదా ? 
ఇంతకూ నేనుచెప్పొచ్చేదేమిటంటే ? త్యాగం మా సికిందరాబాద్ కే పరిమితం కావద్దు . అన్ని ప్రాంతాలకు విస్తరించాలి. వందల కోట్లు ఇస్తామని మీకు ఆఫర్లు రావచ్చు తొందరపడకండి త్యాగం చేయండి . మీ మిత్రులతో కుడా త్యాగం చేయించండి . చిరజీవి అదేదో సినిమాలో ఒక మంచిపని చేసి ప్రతి ఒక్కరు ముగ్గురితో మంచిపని చేయించాలని అంటాడు చుడండి  అలా మనం మరో ముగ్గురితో త్యాగం చేయిద్దాం . ( నా త్యాగాల మీద అనుమానం ఉందా ? ఐతే ఓకే అంటే కోట్ల రూపాయలు పంపిస్తామని నాకు వచ్చిన మెయిల్స్ పంపమంటే పంపిస్తాను ) అలా వచ్చిన మెయిల్స్ లో అమౌంట్ లెక్కిస్తే ??????). సికిందరాబాద్ కథలు ౬