29, నవంబర్ 2015, ఆదివారం

నాయనా అసహనం పులి వచ్చె!

‘‘రాహుల్ గాంధీ చిన్నప్పటి నుంచి పిల్లల కథలు బాగానే చదివినట్టున్నాడు’’
‘‘ ఆ ??? ’’
‘‘ చిన్నప్పటి అమాయక  పంతులు మేక కథ గుర్తుందా? ఒక పంతులు మేకను పట్టుకుని వెళుతుంటే దానిపై కనే్నసిన దొంగలు పంతులు గారు గాడిదను పట్టుకెళుతున్నారు అని ఒకడంటాడు. పట్టించుకోకుండా వెళుతుంటే, కొంత దూరం వెళ్లాక మరొకడు ఆ తరువాత మరొకడు అంతా ఇలానే ప్రశ్నించే సరికి అది నిజంగానే గాడిదేమో అనిపించి వదిలేస్తాడు. ’’
‘‘ కథ తెలుసు కానీ రాహుల్‌గాంధీకేం సంబంధం ? ’’
‘‘మేధావుల అసహనం కథలు వింటుంటే ఎందుకో అమాయక పంతులు- మేక కథ గుర్తుకొచ్చింది. మేధావులు ఒకరి తరువాత ఒకరు అసహనం కథలు చెబుతుంటే, నిజంగా అసహనం ఉందేమో అనే అనుమానం రాకుండా ఉంటుందా? కథలోని పంతులు గారిలా’’
‘‘ అది సరే రాహుల్‌గాంధీకి సంబంధం ఏమిటని ?’’


‘‘ రాహుల్‌గాంధీ మొన్న బెంగళూరు కాలేజీలో విద్యార్థుల బుర్రలో ఇలాంటి కథే ఎక్కించడానికి ప్రయత్నిస్తే, వాళ్లే ఈయనకు ఈ కాలం ఐటి కథలు వినిపించారు. సోనియాగాంధీ పప్పన్నం ఎప్పుడు పెడుతుందో, వాళ్ల కుటుంబానికి మంచి రోజులు ఎప్పుడొస్తాయో’’
‘‘ నువ్వు మరీ చిత్రంగా మాట్లాడతావు. సోనియాగాంధీ మీ మేనత్తనా ఏంటీ నీకు పప్పన్నం పెట్టడానికి, ఆమె పప్పన్నం పెట్టడానికి దేశానికి మంచి రోజులు రావడానికి సంబంధం ఏమిటి? పిల్లల కథ చెప్పి ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకు వెళుతున్నావు’’
‘‘ భావాన్ని అర్ధం చేసుకోవాలి కానీ ప్రతి పదాన్ని పీకి పాకాన పెట్టడం కాదు. రాహుల్‌గాంధీ పెళ్లి గురించి నేనన్నది. పెళ్లి కాకుండా ఒంటరి జీవితం గడిపితే మానసిక శారీరక సమస్యలు ఎక్కువగా ఉంటాయని చికాగో యూనివర్సిటీ వాళ్లు జరిపిన సర్వేలో తేలింది ’’


‘‘ఇలాంటి సర్వేల మీద నాకు పెద్దగా నమ్మకం లేదు.’’
‘‘నాకూ లేదు కానీ బెంగళూరు కాలేజీ విద్యార్థులతో రాహుల్‌గాంధీ మాట్లాడిన రోజే ఈ సర్వే ఫలితాలు వచ్చాయి. అందుకే కొంత నమ్మకం ఏర్పడింది. అదేమన్నా బిహారా? అసలే బెంగళూరు ఇండియన్ సిలికాన్ వ్యాలీ లాంటిది. అక్కడి విద్యార్థులతో మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అవుతుందా? స్వచ్ఛ భారత్ సక్సెస్ అవుతుందా? అని ప్రశ్నిస్తే కాదు కాదూ అని రాహుల్‌ను చూడగానే గట్టిగా అరుస్తారని అనుకున్నాడు. తీరా వాళ్లేమో ఆయన ఊహించిన దాని కన్నా గట్టిగా సక్సెస్ అవుతుంది అని అరిచారు. ’’
‘‘ నీ అభిప్రాయం ఏంటి సక్సెస్ అవుతుందా? ’’
‘‘ ఎవరైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించేది విజయవంతం కావాలనే కదా? శుభం పలకరా అంటూ పెళ్లి కూతురు ... అని ఏదో అన్నట్టు. అయినా నవభారత నిర్మాత జవహర్ లాల్ నెహ్రూ మనవడు అనాల్సిన మాటలేనా ఇవి? నెహ్రూ కాలంలోనే 1953లో వినోభా భావే తొలిసారి స్వచ్ఛ భారత్‌కు పిలుపునిచ్చారు. ఇది మా తాతగారి కాలం నాటి నినాదమే అని గర్వంగా చెప్పుకోవాలి కానీ... కంప్యూఆఆ టర్‌ను ఆపరేట్ చేయడం రాకపోయినా ఐటిని కనిపెట్టింది, ఐన్‌స్టిన్‌ను కనిపెట్టింది, ప్రపంచ పటాలను కనిపెట్టింది మేమే అని ఓవైపు నాయకులు చెప్పుకుంటుంటే సాంకేతిక విజయాలతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకు వెళ్లాడానికి పునాదులు వేసిన రాజీవ్ గాంధీ కుమారుడు బెంగళూరులో ఇలాగేనా మాట్లాడేది? దేన్నయినా సాధించగలం అనే ఆత్మవిశ్వాసం ఉన్న యువతతో అవేం మాటలు. అందుకే చికాగో సర్వేపై గట్టి నమ్మకం ఏర్పడింది’’


‘‘ అంటే నువ్వు నరేంద్ర మోదీ దారిలో నడుస్తున్నావన్నమాట. గమనిస్తున్నాను నువ్వు పరోక్షంగా మోడీ భజన మొదలు పెట్టావు ’’
‘‘ఆర్టీసి చార్జీలే భరించలేను. ఎప్పుడూ విమానాల్లో విదేశాల్లోనే గడిపే ఆయన మార్గంలో నడవడమా? ఆయన ఎక్కువగా గాలిలోనే ఉంటున్నారు. భూమిపై ఉంటే ఏమో ఆయన నడిచిన మార్గంలో నడిచే వాడినేమో’’
‘‘ అప్పుడే ఆకాశానికి ఎత్తుతావు .. వెంటనే నేలపై పడేస్తావు ..  నీ ఉద్దేశం దేశంలో అసహనం లేదంటావు’’
‘‘ఏదో ముచ్చటపడి ఈ దేశంపై దాడి చేసేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మానవ బాంబులుగా వచ్చే ఉగ్రవాదులపై సానుభూతి చూపకుండా మట్టుపెడుతున్న సైనికులది అసహనమే కదా? ’’
‘‘నువ్వు మాటలతో గారడీ చేస్తున్నావు. దేశంలో అసహనం ఉందా?లేదా? అది చెప్పు ముందు’’


‘ అలా అంటావా? దేశంలోనే కాదు ప్రతి ఒక్కరిలో అసహనం ఉంది. నీలో ఉంది. నాలో ఉంది. పిచ్చాసుపత్రుల్లో, కోమాలో, ఐసియులో ఉన్న వారిని మినహాయిస్తే ప్రతి ఒక్కరిలో అసహనం ఉంది. భార్యాభర్తలకు ఒకరి మాట ఒకరు వినాలంటే అహసనం. నిన్ను నువ్వు ప్రశ్నించి చూసుకో దేనిపై నీకు అసహనం ఉందో నీకే తెలుస్తుంది. నాకైతే ఎవడైనా అప్పు అడిగితే అసహనం, నేను అప్పు అడిగినప్పుడు ఇవ్వకుంటే అసహనం. సినిమాల్లో మా వంశం అంటూ చెట్టుపేరు చెప్పుకుని కాయలమ్ముకునే వాళ్ల డైలాగులు వినాలంటే, తల తిక్క సినిమాలు చూడాలంటే అసహనం. విలువలు లేని మేధావులు విలువల గురించి మాట్లాడుతుంటే అసహనం. జీవితమంతా అవినీతిమయమే అయినా జాతికి నీతులు బోధించే వాళ్ల ఉపన్యాసాలు వినడం అసహనం..


‘‘ ఆ విషయాలు వదిలేయ్ ఏంటీ లోకల్ విషయాలు’’
‘‘ ఉమ్మడి రాష్ట్ర కమ్యూనిస్టు పెద్దన్న తమ్మినేని వీరభద్రం అసహనంతో ఊగిపోతున్నారట? ’’
‘‘ ఎందుకు? ’’
‘‘ కెసిఆర్‌ను అధికారం నుంచి దించేయాలని 10 అంతర్జాతీయ పార్టీలు, 74 ప్రజా సంఘాల ఉమ్మడి అభ్యర్థిని వరంగల్‌లో పోటీకి నిలిపారు కదా? 10 పార్టీలు, 74 ప్రజా సంఘాల్లో కార్యవర్గం సంఖ్య కన్నా వరంగల్‌లో వచ్చిన ఓట్లు తక్కువగా ఉన్నాయని, పార్టీ అభ్యర్థికి ఓటు వేయని నాయకులెవరో తేలాలని రెండు అంతర్జాతీయ పార్టీల మధ్య ఒకటే గొడవ. దాంతో ఆయన అసహనంతో రగిలిపోతున్నారు. ’’
‘‘ ఇంతకూ ఏమంటావు?’’


‘‘అసహనం ఉందని ప్రజలను నమ్మించేందుకు వీళ్లు అచ్చం అమాయక పంతులు కథలోని  వ్యుహన్నే  నమ్ముకున్నారు. కానీ కాలం మారింది వీరు నమ్ముకున్న కథ రివర్స్ అయి నాయనా పులి వచ్చే కథ అవుతుందేమో’’
- బుద్దా మురళి (జనాంతికం .. 11.. 2015)

25, నవంబర్ 2015, బుధవారం

వరంగల్ తీర్పు ఏం చెబుతోంది?

ప్రజలు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తమ అభిప్రాయాలు వెల్లడించరు. టీవి చర్చల్లో గట్టిగట్టిగా అరవరు. మేధావుల చర్చల్లోనూ కనిపించరు. కానీ సమ యం వచ్చినప్పుడు దిమ్మతిరిగిపోయేలా తీర్పు చెబుతారు. ఇప్పుడు వరంగల్‌లో ప్రజలు చేసింది అదే. వాళ్ల అంతరంగం మేధావులకు అర్ధం కాదు. కానీ ఈ సామాన్యులను నమ్ముకొని రాజకీయం చేసే వారికి బాగా అర్ధమవుతుంది. 

వరంగల్ పార్లమెంటు నియోజక వర్గం ఉప ఎన్నికల సందర్భంగా దాదాపు నెల రోజుల క్రితం తెలంగాణ భవన్‌లో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో వరంగల్, నారాయణఖేడ్ రెండు నియోజక వర్గాల్లో మనం గెలుస్తున్నాం, వరంగల్‌లో 65శాతం ఓటర్లు, నారాయణఖేడ్‌లో 57 శాతం మంది ఓటర్లు మనవైపు ఉన్నారు అని కెసిఆర్ ప్రకటించారు. మంగళవారం నాటి తీర్పుతో వరంగల్ సర్వే నిజమైంది. ఇక నారాయణఖేడ్ తీర్పు తేలాలి.
తెలంగాణ ఆవిర్భవించిన తరువాత టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు రెండు పార్లమెంటు నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఎంపిగా ఎమ్మెల్యేగా రెండు చోట్ల గెలవడంతో మెదక్ పార్లమెంట్ నియోజక వర్గానికి రాజీనామా చేశారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఈ ఉప ఎన్నిక జరిగింది. అప్పటికి ప్రభుత్వం ఇంకా సర్దుకోలేదు. అధికారుల కేటాయింపు జరగలేదు. 2014 తో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గింది, ఆ మేరకు మెజారిటీ కూడా తగ్గింది. కానీ పదిహేడు నెలల టిఆర్‌ఎస్ పాలన తరువాత జరిగిన వరంగల్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా టిఆర్‌ఎస్ పాలనపై ప్రజలు తీర్పుగానే భావించాల్సి ఉంటుంది. ఈ పదిహేడు నెలల్లో ఏం చేశామో చెప్పి టిఆర్‌ఎస్ ఓట్లు అడిగింది. వరంగల్‌లో జరిగిన ఎన్నికల సమావేశంలో కెసిఆర్ ఇదే మాట చెప్పారు. 17నెలల్లో ఇదిగో మేం చేసింది ఇది. ప్రభుత్వం చేసింది మంచి పనే అని మీరు భావిస్తే, దీవించండి, మేం తప్పు చేశామని భావిస్తే శిక్షించండి అని కోరారు. నేను చెప్పింది తప్పయితే నన్ను శిక్షించండి, ప్రతిపక్షాలు మాటలు తప్పయితే ఓటు ద్వారా వారిని శిక్షించండి అని ముఖ్యమంత్రి బహిరంగ సభలోనే పిలుపు ఇచ్చారు.


నాలుగు లక్షల 59వేల ఓట్ల మెజారిటీ ద్వారా ప్రజలు తమ తీర్పును చాలా స్పష్టం గా వెల్లడించారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి టిడిపి కూటమి అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కనంత సూటిగా ప్రజలు తీర్పు చెప్పారు. వెంటనే ఎన్నికలు జరిగిన మెదక్ ఓటర్ల తీర్పు కన్నా 17నెలల పాలన చూసి ఓటు వేసిన వరంగల్ ఎన్నికల ఫలితాలు విలక్షణమైనవి. సాధారణంగా ఎక్కడైనా అధికార పక్షంపై ప్రజల్లో క్రమంగా కొంత వ్యతిరేకత ఏర్పడుతుంటుంది. కానీ వరంగల్‌లో మాత్రం విపక్షాలన్నీంటిపైన ప్రజలు మూకుమ్మడిగా తమ వ్యతిరేకతను చాటే విధంగా తీర్పు చెప్పారు. ఏ ఒక్క పార్టీకి కూడా డిపాజిట్ దక్కని స్థాయలో టిఆర్ ఎస్ విజయం సాధించింది.


తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ తెలంగాణ ఏర్పాటును కోరుకునే శక్తులన్నింటిని ఏకం చేశారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణ బాగును కోరుకునే ప్రజలందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు.  ఈ అంశంలో విపక్షాలు చిత్రంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణా ఏర్పాటును వ్యతిరేకించిన శక్తులు ఎకమవుతూ కెసిఆర్ పనిని సులభం చేస్తున్నాయి . తెలంగాణలో కెసిఆర్‌కు తాము ప్రత్యామ్నాయంగా నిలవాలని విపక్షాలు కోరుకుంటే కెసిఆర్ కన్నా మిన్నగా తెలంగాణను అభిమానించాలి. కెసిఆర్ కన్నా తమ వల్లనే తెలంగాణకు మేలు జరుగుతుంది అనే నమ్మకం కలిగించే విధంగా వ్యవహరించాలి. కానీ విపక్షాలు ఈవిషయంలో ఘోరంగా విఫలం అవడమే కాకుండా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన శక్తులతో చేతులు కలపడమే కాకుండా వారిలానే రాజకీయాలు నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు.

 కాంగ్రెస్ వ్యతిరేకతే మా సిద్ధాంతం అని ప్రకటించి.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను ఏకం చేసిన పార్టీ మాదే అని ఇప్పటికీ టిడిపి గర్వంగా చెప్పుకుంటుంది. అలాంటి టిడిపితో చేతులు కలిపి టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఉద్యమాలు చేసింది. చివరకు ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోగానే కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో టిడిపితో కలిసి పోటీ చేసి టిఆర్‌ఎస్‌ను ఓడిస్తామని ప్రకటించారు. అనుకూలంగా లేఖ ఇచ్చినా తెలంగాణ ఏర్పాటును టిడిపి చిత్తశుద్ధితో వ్యతిరేకించింది. చివరి నిమిషం వరకు అడ్డుకోవడానికి ప్రయత్నించింది. అలాంటి పార్టీతో తెలంగాణ ఇచ్చిన కాంగ్రె స్ చేతులు కలపడంలో ఉద్దేశం ఆ పార్టీ మేధావులకే తెలియాలి. ప్రతి అంశంలోనూ కెసిఆర్ తెలంగాణను ఓన్ చేసుకునే విధం గా తెలంగాణ కోణంలో స్పందిస్తుంటే తె లంగాణ వ్యతిరేక శక్తులు ఏకమై తెలంగాణ పార్టీని ఓడించాలనే ప్రయత్నాన్ని వరంగల్ ఓటర్లు బలమైన తీర్పు ద్వారా వ్యతిరేకించారు.
నన్నపనేని రాజకుమారి టిడిపి అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు ఆమెను ఎదుర్కోవడానికి వైఎస్‌ఆర్ ఉన్నప్పుడు  కాంగ్రెస్ వారు గంగాభవానిని రంగంలో దించారు. వీరి ప్రత్యేకత ఏమంటే ప్రత్యర్థులను ఏ మాత్రం మర్యాద పాటించకుండా తిట్టేయగలరు. చివరకు కొత్తగా పెట్టిన ప్రజారాజ్యం సైతం ఈ కోటా కింద ఒక నాయకురాలిని ఎంపిక చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ పార్టీ లో నైనా ప్రత్యర్థులను బూతులు తిట్టేందుకు ఒక నేతను ఎంపిక చేసుకునే వారు. విభజన తరువాత కూడా టిడిపి తెలంగాణా లో కూడా  ఈ సంస్కృతి నుంచి బయటపడలేదు. తిట్టడమే హీరోయిజంగా భావించిన టిడిపికి వరంగల్ ఓటర్లు చక్కని తీర్పుతో గుణపాఠం నేర్పించారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ప్రజలు నిన్ను చెట్టుకు కట్టేసి కొడతారు అని ఎన్నికల ప్రచారంలో టిడిపి శాసన సభాపక్షం నాయకుడు దయాకర్‌రావు విమర్శించారు. చివరకు ఆయన ప్రాతినిధ్యం వహించిన పాలకుర్తిలో సైతం టిఆర్‌ఎస్‌కే మెజారిటీ వచ్చింది.


 మీడియా ముందు దయాకర్‌రావు మాట్లాడితే బ్యాలె ట్ బాక్స్‌లో పాలకుర్తి ఓటర్లు సమాధానం చెప్పారు. తెలంగాణలో నిర్మించే ఇరిగేషన్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం బాబు ప్రయత్నించడం ఆయన ధర్మం కానీ చివరకు తెలంగాణ టిడిపి నాయకులు ఈ లేఖలను సైతం సమర్థిస్తే తెలంగాణ ప్రజలు ఆ పార్టీని తమ పార్టీ అని ఎలా భావిస్తారు? చివరకు తెలంగాణ టిడిపి నాయకులు ఏ చిన్న అంశం కోసమైనా విజయవాడ వెళ్లి చంద్రబాబుతో చర్చిస్తున్నారు. ప్రాణాలను సైతం త్యాగం చేసి ఉద్యమాలతో పోరాడి తెలంగాణ సాధించుకున్నారు. కనీసం ఏడాది కూడా గడవకముందే తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన శక్తులతో టిడిపి తెలంగాణ నేతల సమావేశం మీడియాలో ప్రచారానికి ఉపయోగపడవచ్చు కానీ తెలంగాణ ప్రజలు ఇది మన పార్టీ కాదు పొరుగు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పార్టీ అని బలంగా తమ మనసులో ముద్ర వేసుకోవడానికి ఉపయోగపడుతుంది.


ఉద్యమానికి కెసిఆర్ నాయకత్వం వహించినా సోనియాగాంధీ పట్టుపట్టి ఉండక పోతే తెలంగాణ సాకారం అయి ఉండేది కాదు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామని బిజెపి ఎన్నికల ముందు చెప్పినా ఏడాదిన్నరలో కనీ సం ఉద్యోగుల కేటాయింపు కూడా పూర్తి చేయని ఆ పార్టీ స్పీడ్, అడ్డదిడ్డంగా విభజన చేశారని తరుచుగా మోదీ చేస్తున్న వాఖ్యలు చూస్తుంటే ఒకవేళ సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే బిజెపి వందేళ్లయినా ఇచ్చి ఉండేది కాదేమో అన్న అనుమానాన్ని కలుగజేస్తున్నాయ! తెలంగాణ ఇచ్చిన కాం గ్రెస్‌పై నిజానికి తెలంగాణ ప్రజలకు ఇంత వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు. కానీ గత ఎన్నికల్లో కన్నా వరంగల్‌లో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా పడిపోయింది. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన ఐదు రోజులకే దిష్టిబొమ్మలు దగ్దం చేయడం, ఆందోళన కార్యక్రమాలతో తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉన్న అభిమానాన్ని సైతం కాంగ్రెస్ తుడిచేసుకుంది. అలా తుడిచేసుకుని ఉండకపోయి ఉంటే విభజన చట్టం పార్లమెంటులో పెట్టిన సమయంలో కీలక పాత్ర పోషించిన మీరాకుమారి, షిండే వంటి హేమాహేమీలు వరంగల్‌లో ప్రచారం చేసినా కనీసం డిపాజిట్ దక్కకుండా ప్రజలు తిరస్కరించే వారు కాదు.
టిడిపి  కోసం పరితపించే ఆ వర్గం మీడియాను, టిడిపి ఆలోచనా ధోరణిని పక్కన పెట్టి కాంగ్రెస్ తెలంగాణ కోసం ఆలోచిస్తే ఆ పార్టీ పరిస్థితి మెరుగు పడుతుంది. ప్రత్యర్థులు సైతం జాలిపడేట్టుగా తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి మారుతోంది. వరంగల్ ఫలితాలపై కుంటి సాకులు వెతుక్కోవడానికి బదులు తెలంగాణ ప్రయోజనాల కోసం పార్టీ పరంగా ఏం చేయాలి ఆనే కోణంలో ఆలోచించడం కాంగ్రెస్‌కు మేలు. రెండు రాష్ట్రా ల్లో ఉన్న ప్రాంతీయ పార్టీ దేశంలో ఎక్కడా లేదు. నిజానికి టిడిపితో కాంగ్రెస్ భుజం కలపడం టిఆర్‌ఎస్‌కు సంతోషకరమే. సోనియాగాంధీ నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ను విమర్శించడం టిఆర్‌ఎస్ నాయకత్వానికి కొంత ఇబ్బంది.. కానీ అదే టిడిపి కాంగ్రెస్ భుజం భుజం కలిపి పని చేస్తే కెసిఆర్ పని సులభం అవుతుంది. బిజెపి ముసుగులో వచ్చిన టిడిపి అంటూ వరంగల్‌లో టిఆర్‌ఎస్ చేసిన విమర్శల్లో మర్మం అదే. తెలంగాణా ఏర్పాటులో సహకరించిన బిజెపి ని టార్గెట్ చేయడం కన్నా టిడిపి నే విమర్శించడం మేలనుకున్నారు 
టిడిపి, సిపిఐ, సిపిఎం, టిఆర్‌ఎస్ వంటి పార్టీలన్నీ కలిపి 2009లో మహాకూటమి అని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేసినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకత్వంలో కాంగ్రెస్ గెలిచింది. 

ఇప్పుడు వరంగల్‌లో టిడిపి  మీడియా, టిడిపి, బిజెపి కలిసి పోటీ చేసినా విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణ ప్రజలు టిఆర్‌ఎస్‌నే గెలిపించారు. మేధావుల విశే్లషణలు ఎలా ఉన్నా సామాన్య ప్రజలకు కృతజ్ఞత ఉంటుంది. ఆ కృతజ్ఞతా భావంతోనే ప్రభుత్వం అమలు చేసిన పథకాల నుంచి ప్రయోజనం పొందిన ప్రజలు  2009లో వైఎస్‌ఆర్‌ను గెలిపించారు. ఇప్పుడు టిఆర్‌ఎస్‌ను గెలిపించారు.

 వరంగల్ ఫలితం 17నెలల టిఆర్‌ఎస్ పాలనపై తీర్పు. సంక్షేమ పథకాలపై వ్యక్తం అయిన ప్రజాభిప్రాయమే భారీ మెజారిటీ. ఈ విజయంతో 2019లో గెలు పు మాదే అనే అతి విశ్వాసం అవసరం లే దు. చెప్పినవి చేసి చూపిస్తేనే 2019లో ప్రజలు ఆదరిస్తారు. దాని కోసం ప్రభుత్వానికి ఇంకా మూడున్నర ఏళ్ల సమయం ఉంది. ప్రభుత్వంపై తెలంగాణ సమాజం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ ఆశలను వమ్ము చేయకుండా మరింత నిబద్ధతతో వ్యవహరించాల్సిన బాధ్యత పాలకులది.

-బుద్దా మురళి25/11/2015

22, నవంబర్ 2015, ఆదివారం

నెహ్రూనే కారణం!

‘‘డాడీ నీకు పాకిస్తాన్ ఫోన్ నంబర్ తెలుసా?’’
‘‘ మా తల్లే మా బంగారమే! ఏమో య్! భార్యామణి చూశావా? ఇదీ నా పెంపకం ఇప్పుడేమంటావు. విదేశాల గురించి కూడా అడుగుతున్నది. ఈ వయసు పిల్లలు మహేశ్ బాబు కొత్త సినిమా విడుదల తేదీ గురించి, అతనిది విగ్గా ఒరిజినల్ జుట్టా అని తెగ మాట్లాడుకుంటారు. పెద్దయ్యాక విదేశీ రాయబారి అవుతుంది.’’


‘‘ ఇంతకూ మీ బిడ్డ ఏమడిగింది? అంతగా మురిసిపోతున్నారు. ’’
‘‘ ఏరా బంగారు తల్లి ఇంతకూ నీకు పాకిస్తాన్ ఫోన్ నంబర్ ఎందుకురా? ’’
‘‘పాకిస్తాన్ వారితో కాస్త పర్సనల్‌గా మాట్లాడాల్సిన మ్యాటర్ ఉంది డాడీ’’
‘‘చిట్టినా తల్లి బుర్రలో ఎన్ని ఆలోచనలో... ఈ రోజు ప్రపంచానికి తీవ్రవాద సమస్య ముప్పుగా మారింది. పాకిస్తాన్ తీవ్రవాదులకు మద్దతు ఇస్తోంది. ఇంకా’’
‘‘ అబ్బా ఆగు డాడీ ఈ విషయం నేను నిన్ను అడిగానా? ఇవి రోజూ టీవిలో వినేవే.. దీని గురించి కాదు నేను మాట్లాడాల్సిన విషయం వేరుగా ఉంది’’
‘‘నీ తండ్రిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. వారం రోజుల నుంచి నీతో హోం వర్క్ చేయించేది నేనే అని మీ అమ్మా గ్రహించాలి. ఏ విషయం అయినా నేరుగా మాట్లాడి తెలుసుకోవాలనే నీ జిజ్ఞాస అద్భుతం.’’
‘‘ సరే ఇంతకూ ఫోన్ నంబర్ ఇస్తావా? నెట్‌లో చూసి వెతుక్కోమంటావా? ’’
‘‘ ఇంతకూ ఎందుకో చెప్పనే లేదు. ’’


‘‘ మా క్లాస్ టీచర్ బెదిరింపులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. హోంవర్క్‌లో తప్పులుంటే తిడుతోంది. ఆకాశరామన్న పేర్లతో ప్రిన్సిపల్‌కు కంప్లయింట్ లేఖ రాస్తే. రైటింగ్ గుర్తు పట్టి అందరినీ చితగ్గొట్టింది. పాకిస్తాన్‌కు చెబితే కానీ క్లాస్ టీచర్‌ను మార్చరు. ’’
‘‘ ఇంత అద్భుతమైన ఆలోచన నీకెలా వచ్చింది తల్లి’’
‘‘ నువ్వు టీవిలో వార్తలు వింటూనే హోంవర్క్ చేయిస్తావు కదా? కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ ఏమన్నారు. మా ప్రధానమంత్రి మోదీని దించేయాలి మీరు మద్దతివ్వండి అని పాకిస్తాన్ వెళ్లి మద్దతు కోరాడా? లేడా? ఒక్కదాన్ని పాకిస్తాన్ వెళ్లి వాళ్ల మద్దతు కోరాలంటే కష్టం అని పించి ఫోన్ చేయాలని నిర్ణయించుకున్నాను’’
‘‘చూశారా? చూశారా? అమ్మా యి ఇప్పుడే ఇలా అయిందంటే ఇక పెద్దయితే ఎలా ఉంటుందో? వామ్మో దీని కంతటికీ మీ అమ్మగారే కారణం.’’
‘‘దీంట్లో మా అమ్మేం చేసిందే. ఎప్పుడో ఏడాదికోసారి మనింటికి వస్తుంది. రెండు రోజులకే వెళ్లిపోతుంది. చిట్టితల్లిని క్లాస్ టీచర్ ఎంత వేదిస్తుందో అందుకే పాకిస్తాన్‌కు ఫిర్యాదు చేయాలనిపించింది. మనం ఎప్పుడూ సమస్య మూలాల్లోకి వెళ్లి చూడాలి. ’’


‘‘ అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని విభజిస్తే పిల్లలు ఇలానే మాట్లాడతారు. ’’
‘‘ మరీ రాజకీయ నాయకుల్లా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావ్!
‘‘ దీనికీ దానికీ సంబంధం ఏంటోయ్ ’’
‘‘ నా మాటలు నీకు అడ్డదిడ్డంగా ఉన్నాయా? మొన్న నరేంద్ర మోదీ అమరావతి ప్రారంభోత్సవ సభలో ఇదే మాటంటే కోట్ల మంది ఉత్సాహంగా విన్నారు. ఇదే మాటన్న బాబుకు ఆంధ్ర ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. మోదీకీ జేజేలు పలికారు. అదే మాట నేనంటే పనికి మాలిన మాటలనిపించాయి. పెళ్లికి ముందు నేనేం మాట్లాడినా అచ్చం కోయిల కూసినట్టు , జానకి పాడినట్టుందనే వాళ్లు. పెళ్లయిన కొత్తలో నేను చిరాకు పడినా పాల్గుణి పాఠక్ దాండియా పాట పాడినట్టుందన్నారు గుర్తుందా? మీరు టీ తాగిన విధానం చూసి మా అమ్మ పెళ్లి చూపుల్లోనే అంది మీరిలా మారిలా మారుతారని ’’
‘‘ నేను టీ తాగడానికి, మీ అమ్మ మాటలకు ఏం సంబంధం ? ’’
‘‘ టీ తాగేవాడు ఇలానే ఉంటాడు. వద్దే దూరపు బందువు దుర్గేష్ ను చేసుకో వాడు చక్కగా కాఫీ తాగుతాడు అని అమ్మ చెప్పినట్టు వింటే ఇప్పుడు టీవి యాడ్‌లో అచ్చం సమంత ఆ హీరో ఎవడో ఉన్నాడు కదా అలా ఇద్దరం కాఫీ తాగుతూ ఒకరి కళ్లల్లో ఒకరం చూసుకుంటూ ఉండేవాళ్లం. నిన్ను చేసుకున్నాను నా జీవితం విశాఖా ఆస్బెస్టాస్ సిమెంట్ రేకుల ప్రకటనలోని ఇళ్లులా తయారైంది. ’’


‘‘ దుర్గేష్ అంటే వాడే కదా? దుర్గయ్య.... వాడో పనికి మాలిన వాడు. మున్సిపాలిటీలో చెత్త కాంట్రాక్టర్... రోడ్లు ఊడ్చేవాళ్ల దగ్గర కూడా డబ్బులు కొట్టేసే వాడితో నన్ను పోలుస్తావా? ’’
‘‘అంతే లేండి మా అమ్మ పేరెత్తినా మోదీ పేరెత్తినా మీకు ఇలానే కోపంగా ఉంటుంది. ఎంతైనా అడ్డదిడ్డంగా విభజించిన సోనియాగాంధీ అభిమానులు కదా? ’’
‘‘ సోనియాగాంధీ అడ్డదిడ్డంగా విభజిస్తే, మీ మోదీ దేవుడు సరి చేయవచ్చు కదా? కనీసం విభజన చట్టంలో ఉన్న హామీలను కూడా అమలు చేయడం లేదు. నాలుగు మాటలు మాట్లాడి వెళ్లడం తప్ప మీ మోదీ ఏం చేశాడని.. దేశాన్ని పాలించే ప్రధానమంత్రి కూడా అడ్డదిడ్డంగా అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడడం ఏమిటి? ప్రధానమంత్రి పార్లమెంటులో ప్రకటించిన ప్రత్యేక హోదానే ఇవ్వడం లేదు ’’
‘‘ అసలు తప్పు నెహ్రూది.. మధ్యలో మోదీనంటారేమిటి? ’’
‘‘ విజయవాడ దేవినేని నెహ్రూకు దీనికి సంబంధం ఏమిటి?’’
‘‘ నేన్ననది విజయవాడ నెహ్రూ గురించి కాదు. జవహర్ లాల్ నెహ్రూ గురించి’’
‘‘ ఆయనకేం సంబంధం’’


‘‘ ఇందిరాగాంధీ మతాంతర వివాహం చేసుకోవడం వల్లనే కదా? రాజీవ్ గాంధీ ఖండాంతర వివాహం చేసుకున్నారు. ఖండాంతర వివాహం చేసుకోవడం వల్లనే కదా సోనియాగాంధీ కాంగ్రెస్‌లో అధికారం చెలాయించారు. ఆమె వల్లనే కదా విభజన జరిగింది.’’
‘‘ అంటే తప్పంతా నెహ్రూదే కానీ మోదీ కేం బాధ్యత లేదంటావా? ’’
‘‘ నెహ్రూ చేసిన ఒక్కో తప్పును సరిదిద్దడానికి మోదీ ప్రపంచ యాత్ర చేస్తున్నారు. ముందు విదేశాల్లో తప్పులు దిద్ది, తరువాత స్వదేశంలో దిద్దుతారు.’’
‘‘ వామ్మో తల్లి మోదీ గ్రూపు, కూతరు మణిశంకర్ గ్రూప్, మధ్యలో నా పరిస్థితి సొంతింటిలో కాందీశీకుడిలా అయింది. కాశ్మీర్‌లో పండిట్స్‌లా’’

-బుద్దా మురళి (జనాంతికం 22.. 11. 2015)

15, నవంబర్ 2015, ఆదివారం

ఎవరి సినిమా వాళ్లది!

‘‘పంచెకట్టుతో పవన్ తుఫాను సృష్టించనున్నారు. సమస్యల సుడిగుండంలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల  ప్రజలను రక్షించే హీరో నాకు పవన్‌లో కనిపిస్తున్నాడు.’’
‘‘ నాకైతే తెగిపోయిన గాలిపటం గుర్తుకు వచ్చింది. తెగిన గాలి పటానికి గమ్యం ఉండదు . ’’
‘‘ నువ్వెప్పుడూ అంతే ఈ రాజకీయాలు ఎప్పుడూ ముసలి వారితోనే కంపు కొట్టాలా? యువ రక్తానికి అవకాశం ఇవ్వరా? ’’
‘‘ అలా అంటే సినిమాలు కూడా ముసలి కంపు కొడుతున్నాయి కదా’’
‘‘అవును అందుకే కదా అక్కినేని వంశం నుంచి 11వ వారసుడు హీరోగా వచ్చాడు ’’


‘‘ఆ సినిమా డమాల్ అంది లే.. అందమైన హీరోయిన్ల చుట్టూ తిరుగుతూ ప్రేమ కబుర్లు, మధ్యలో అలీ, బ్రహ్మానందం కామెడీ సీన్లతో లాగించేస్తే మినిమం గ్యారంటీ ఉండేది. అన్నప్రాసనాడే అవకాయ అన్నట్టు, అప్పుడే అఖిల ప్రపంచాన్ని రక్షించే బాధ్యత అతని భుజస్కంధాలపై వేస్తే సినిమా ఫట్ మనకుంటే ఇంకేమంటుంది. ఆ కాలంలో మహా మహా ఎన్టీఆర్, కాంతారావు, నాగేశ్వర్‌రావు,కృష్ణ, శోభన్‌బాబులే కుటుంబాన్ని, గ్రామాన్ని, రాజకుమారిని, మహా అయితే రెండు మూడు గ్రామాల సైజులో ఉండే రాజ్యాన్ని రక్షించే బాధ్యత తీసుకునే వారు. మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీర్, పవన్ కళ్యాణ్‌లు సైతం ఆ బాధ్యత తీసుకోలేదు. ఇంకా బొడ్డూడని హీరోలు ప్రమాదంలో పడిన ప్రపంచాన్ని రక్షించేందుకు బయలు దేరితే చూసేందుకు ప్రేక్షకులు మరీ అంత అమాయకులా? ’’


‘‘ నిజమే ప్రేక్షకులు తెలివి మీరి పోయారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల రోజుల కావు. గుడిసెలో ఉన్న ముసలవ్వకు జర్వం వస్తే డాక్టర్ బ్యాగ్ పట్టుకొని మరీ పరిగెత్తుకొచ్చేవాడు. ఈ రోజుల్లో డాక్టర్ అపాయింట్‌మెంట్ కావాలంటే నెల రోజులు వేచి చూడాలి. పైగా మనకు పెద్ద భవనం ఉన్నా ఇంటికి రాడు మనమే వెళ్లి నంబర్ పిలిచినప్పుడు వెళ్లాలి.’’
‘‘నువ్వు చెబుతున్నది సినిమా రోజుల గురించా? బ్లాక్ అండ్ వైట్ నుంచి అప్పుడప్పుడే కలర్‌లోకి అడుగు పెట్టినప్పటి రోజులు ఇంకా ముచ్చటేసేవి నీకు గుర్తుందా? జమీందారు కూతురు అదే హీరోయిన్ హాచ్ అని తుమ్మగానే పాతిక మంది డాక్టర్లు వరుసగా వచ్చి నిలబడేవారు.జగన్నాధం గారూ మీ అమ్మాయికి ఏమీ కాలేదు. చల్లగాలి తాకడం వల్ల జలుబు చేసింది అంతే ఈ మందులు వాడండి అంటూ డాక్టర్ చీటి ఇచ్చి వెళ్లేవాడు. ఇంటి నిర్మాణానికి డజన్ల కొద్ది కూలీలు వచ్చినట్టు ఆ రోజుల్లో తుమ్మితే డాక్టర్లు వచ్చేవాళ్లు. ఆ కథలు ఎంత సహజంగా ఉండేవి.’’


‘‘కాలం మారింది కానీ కథలు మారలేదు. హీరో కంటి చూపుతూ చంపేస్తున్నాడు. తొడగొట్టగానే విలన్ల గుంపు గాలిలో ఎగురుతోంది. గుండె ఆగి చస్తున్నారు. ఒక హీరో తొడ కొడితే రైలు నిలిచిపోతుంది, మరో హీరో చేయ్యి అడ్డం పెట్టి రైలును వెనక్కి తోసేశాడు. ఇదంతా ఎందుకు భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది ఒప్పుకుంటావా? ’’
‘‘ఆ విషయం దశాబ్దాల క్రితమే నిరూపితం అయింది. ’’
‘‘ కదా హీరో ఎంత బలవంతుడైనా ఎవరినైనా కొడితే వాడు భూమి మీద పడిపోవాలి కానీ గాలిలో ఎగరడం ఏమిటి? వాస్తవానికి భిన్నంగా కథలల్లుతున్నారు. కార్లు డివైడర్‌ను గుద్దుకుంటే నుజ్జ నుజ్జు అవుతాయి అంతే తప్ప హీరో కనె్నర్ర చేస్తే సుమోలు గాలిలో లేస్తాయా? ఎగురుతున్నాయి. హీరోలు ఆకాశంలో విమానాలను సైతం చిటికెన వేలితో అడ్డుకునేట్టున్నారు. ’’


‘‘ సినీ మ్యాక్సో, ఐ మ్యాక్సో ఏదో ఉంది కదా వీలున్నప్పుడు ఓ సారి అక్కడికెళ్లి చూడు. అంతా ఇంజనీరింగ్ చదివే కుర్రాళ్లు ఎంతో కష్టపడి ఎంసెట్ రాసి సీటు పొందిన వీళ్లకు సైన్స్ గురిం తెలియదా? చూడోయ్ నువ్వు చెప్పిన వన్నీ నిజమే కానీ గట్టిగా తొడ కొడితే తొడ వాస్తుంది కానీ రైళ్లు ఆగవు అని భూమికి ఆకర్షణ శక్తి ఉంటుందని, సూర్యుడు వేడిగా ఉంటాడు అని ఆకాశంలో ఎగిరే విమానాన్ని ఆపలేమని అన్నీ తెలుసు. సైన్స్ పాఠాలు వినీ వినీ విసుగనిపించే కదా వీళ్లు అబద్ధాలను తెరపై చూసేందుకు వచ్చేది. ఇక్కడ కూడా సైన్స్ పాఠాలే చెబితే క్లాస్ రూమ్‌లా సినిమా హాళ్లు కూడా బోసిపోతాయి. ఇదో మాయా ప్రపంచం. సినిమానే కాదు జీవితం కూడా మాయనే.
పంచె కట్టుకుని పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లి బాబును కలిశారు. ఎందుకు కలిశావయ్యా అంటే రైతుల కోసం విజయవాడ వెళ్లి బాబును కలిశాను. సంక్షేమం కోసం ముచ్చటించాను అని చెప్పుకొచ్చారు. ఆ విషయం సెల్‌ఫోన్‌లో చెబితే పావలాతో అయిపోయేది కదా? ప్రత్యేక విమానం అవసరమా? దానికి డబ్బులు ఎవరిచ్చారు అదో సస్పెన్స్ స్టోరీ. ’’


‘‘ఇంతకూ పవన్ పర్యటన ఉద్దేశం ఏమిటి? రాజకీయ భవిష్యత్తు ఏమిటి?’’ ‘‘అదో సస్పెన్ థ్రిల్లర్. ఒక సినిమా నటుడు వస్తే ముఖ్యమంత్రి ఎదురేగి స్వాగతం పలకడం, అధికారులను పరిచయం చేయడం, మంత్రి ఎస్కార్ట్‌గా వెంట రావడం సస్పెన్స్ సినిమా కథలా లేదూ..!. పవన్ ఒక కథ రాసుకుని నటిస్తుంటే, బాబు తన మనసులో మరో కథకు డైరక్షన్ చేస్తున్నారు. ఇది రెండు గంటల్లో తేలే సినిమా కథ కాదని నడుస్తున్న సినిమా అని ప్రేక్షకులకూ తెలుసు.’’


‘‘ మరి నువ్వు చెప్పు ఇంతకూ పవన్ రాసుకున్న కథేమిటి? ’’
‘‘ కొన్ని సార్లు హీరో కాల్షిట్ లభించగానే షూటింగ్ మొదలు పెడతారు. కథ సెట్‌లో రాసుకుంటారు. పవన్ సినిమా కూడా అంతే ముందు షూటింగ్ ప్రారంభించి 2019 నాటికి అవసరం మేరకు కథ రాసుకుందామని పవన్ అనుకుంటున్నారు. ఎన్నో సినిమాలకు డైరెక్షన్ చేసి తల పండిన బాబు హీరో సినిమా కథకు ముగింపు ఎలా పలకాలో మనసులోనే అనుకుని డైరెక్షన్ చేస్తున్నారు. హీరో కథ హీరోదే, డైరెక్టర్ కథ డైరెక్టర్‌దే సినిమా ముగింపు కాలమే చెబుతుంది. ఇంతకూ చెప్పొచ్చేదేమిటంటే గాలిలో సుమో లేవడం సాధ్యమా? పవన్ రాజకీయాల్లో రాణిస్తాడా? అనే ఆలోచన మాని జరుగుతున్న సినిమాను చూసి ఏన్ జాయ్ చేద్దాం. ’’

బుద్ధా మురళి (జనాంతికం 15. 11.20 5)

9, నవంబర్ 2015, సోమవారం

బడా రాజన్ - చోటా స్క్రీన్!

‘‘బ్రే‘కింగ్ న్యూస్... న్యూస్ చానల్స్ చరిత్రలోనే అద్భుతమైన ఇంటర్వ్యూ మీరు చూడబోతున్నారు. బడా రాజన్ గారూ నమస్కారం సార్..రాష్టప్రతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, బిల్‌గేట్స్, బిల్ క్లింటన్ వంటి ఎంతో మంది ముఖ్యులతో ఎలాంటి తత్తరపాటు లేకుండా మాట్లాడాం కానీ మీతో మాట్లాడుతుంటే నాలోని ఎగ్జయిట్ మెంట్ ఆపుకోలేక పోతున్నాను. పాటుతో మాటలు తడబడుతున్నాయి.’’
‘‘నూటా 20 కోట్ల మంది ప్రజలు, ప్రపపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని గడగడలాడించిన రియల్ హీరోను ప్రత్యక్షంగా చూసినప్పుడు తత్తరపాటు సహజమే ’’


‘‘ మీ గురించి చెబుతారా? ’’
‘‘ ప్రపంచ యువతకు నా సందేశం పేరుతో నా ఆత్మకథ రాయాలని నిర్ణయించుకున్నాను. కళకు ప్రాంతం, మతం, కులం భేదం ఉండదని గొప్పగా చెప్పుకుంటారు. అందులో నిజం లేదు. నేరస్తులకు మాత్రమే కులం, మతం, ప్రాంతం అనే తేడా ఉండదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నేరాలకు పాల్పడతారు. ప్రాంతీయ బేధం ఉండదని చెప్పుకునే అర్హత మాకే సొంతం. ప్రపంచ యువతను చైతన్య పరిచే విధంగా నేర ప్రపంచానికి గైడ్‌లా ఉపయోగపడే విధంగా ఆత్మకథ రాస్తాను ’’


‘‘మిమ్ములను కన్న పుణ్యమూర్తుల పేర్లు? మీ బాల్యం ఎలా గడిచిందో మా ప్రేక్షకులకు చెబుతారా? ’’
‘‘ తప్పకుండా నన్ను కన్నది ఏ మూర్తులో నాకు తెలియదు. కానీ బాల్యం మాత్రం అద్భుతంగా గడిచింది. చిన్న చిన్న దొంగతనాలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ పోయాను. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి ఆనాడు పడిన బలమైన పునాదే కారణం. హైదరాబాద్‌లో బ్లాక్ టికెట్లు అమ్మడంపై యాదగిరి వద్ద శిక్షణ పొంది, ముంబైలో అమలు చేసి, ఇంతటి వాడినయ్యాను. అంటే హైదరాబాద్ ను ప్రపంచ పటం లో చేర్చింది ముందు నేనే . జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా మనం నడిచి వచ్చిన దారిని మరువ వద్దు . బాంబులు పేల్చి పారిపోయినా, హత్యలు చేసి దొరక్కుండా తప్పించుకున్నా నా చిన్ననాటి అనుభవం ఉపయోగపడింది. ’’


‘‘ మీ జీవితం చాలా ఆసక్తి కరంగా ఉంది’’
‘‘ కష్టపడనిదే ఏదీ సాధ్యం కాదు. దేశంలో కొన్ని లక్షల మంది దొంగ వెధవలు ఉన్నారు. మరి నాలాంటి వాడే అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడంటే కారణం? నాలో ఉన్న ప్రత్యేకతలే కదా? ’’


‘‘నిజమేనండి ఏ రంగంలోనైనా ప్రత్యేకతలు ఉంటేనే ఎదుగుతారు. అనాధ  శవాలు కొని కాలువలో పడేసి, ఈ శవాలు ఎక్కడివి? అని స్పెషల్ స్టోరీలు చేసి ఎదిగిన జీవితాలు మావి! మాఫియాలానే మీడియాలోనూ పోటీ పెరిగిపోయింది. ’’


‘‘ మీడియా అంటే గుర్తుకొచ్చింది. మేం ఎంతో కష్టపడితే ఈ స్థాయికి వచ్చాం. మా కాలంలో మీడియా ఇంత ప్రోత్సాహకరంగా లేదు. మేం ఎదిగిన తరువాత సినిమాలే మాకు వెన్నుతట్టి ప్రోత్సహించాయి .. తరువాత మీడియా. కానీ ఈ తరం నేరస్తులు అదృష్టవంతులు. బావ కళ్లల్లో వెలుగు చూసేందుకే హత్య చేశాను అని కోన్ కిస్కా గాడు ఒక్క పంచ్ డైలాగు టీవిల్లో పేలిస్తే తెల్లారే సరికి వాడు పాపులర్ నేరస్తుడు అయిపోతున్నాడు. కనీసం డజను హత్యలు, రేప్‌లు, దోపిడీలు చేస్తే కానీ నేరస్తుడిగా సమాజం నుంచి మాకు తగిన గుర్తింపు లభించేది కాదు. చానల్స్‌ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఔత్సాహిక నేరస్తులకు చక్కని ప్రోత్సహం అందిస్తున్నారు. తగిన ప్రచారం కల్పిస్తున్నారు. శతృదేశంతో వీరోచితంగా పోరాడి విజయం సాధించే సైన్యాధ్యక్షుడికి కూడా ఇవ్వనంత ప్రచారం నేరస్తులకిస్తున్నారు. మా కాలంలో ఇప్పుడున్నంత ప్రచారం ఉంటే నేను ఎప్పుడో విశ్వనేరస్తుడ్ని అయ్యేవాడిని. అయితే నాకో బాధ కూడా ఉంది. మీడియా ఇంత ప్రోత్సహం అందిస్తున్నా, మనం నేరస్తులను ఎగుమతి చేసే స్థాయికి ఎదగలేదు. నైజీరియా అనే చిన్న దేశం ఇంత పెద్ద దేశానికి నేరస్తులను దిగుమతి చేయడమే నాకు కొంత బాధగా ఉంది.’’


‘‘ దీనిపై మీరేమైనా చేయాలనుకుంటున్నారా? ’’
‘‘నాకో ఆలోచన ఉంది. క్రికెటర్లు, టెన్నిస్ ప్లేయర్లు పేరు ప్రఖ్యాతులు వచ్చిన తరువాత అకాడమీ ఏర్పాటు చేస్తారు కదా? ప్రభుత్వం తగిన ప్రోత్సహం ఇచ్చి అవసరం అయిన నిధులు ఇస్తే నేరస్తుల అకాడమీ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తాను. అప్పుడు నైజీరియాకు కూడా మనమే ఎగుమతి చేయవచ్చు. ’’
‘‘మీ జీవిత లక్ష్యాలు? నిజానికి ఈ రంగానికి సంబంధించి ఒక సెజ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది . ’’
‘‘నా జీవితంలో నేను కోరుకున్నవి అన్నీ సాధించాను. మీలాంటి వాళ్లు హీరోలను దేవుళ్లుగా కొలుస్తారు. అలాంటి హీరోలే మా దర్శనం కోసం పడిగాపులు కాస్తారు. కనిపిస్తే కాళ్లు మొక్కుతారు. సహాయం కోరుతారు. ఈ దేశంలో మహాత్మాగాంధీపై ఒకే ఒక సినిమా వచ్చింది. అదీ విదేశీయుడు నిర్మించింది. నా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో సినిమాలు నిర్మించారు. ఇక మొత్తం నా కథ అధారంగా 1999లో ‘వాస్తవ్’ వచ్చింది. సంజయ్‌దత్ పోషించిన పాత్ర నాదే. ఆ తరువాత ‘కంపెనీ’ సినిమాలో వివేక్ ఒబేరాయ్ పోషించిన చందు పాత్ర నాదే. ఈ జీవితానికి ఇది చాలు’’


‘‘ మీరెలా అరెస్టయ్యారు’’
‘‘ నేనా అరెస్టా? ప్రతి మనిషికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం సహజం అలానే మాకు లొంగు బాటు వయసు సహజం. ’’
‘‘ యువతకు మీరిచ్చే సందేశం. మహాత్మాగాంధీకి కూడా భయపడరు. డాన్‌కు భయపడతారు. డాన్ కావడం, దేశాన్ని దోచుకోవడం, మర్డర్లు చేయడం గురించి లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. చూడండి నేర్చుకోండి. హీరోలుగా సమాజం గుర్తింపు పొందండి. చానల్స్‌లో దేశానికి సందేశం ఇవ్వండి ’’
***
‘‘నువ్వు చేసిన ఇంటర్వ్యూతో మన చానల్ రేటింగ్ ఎక్కడికో పోయింది. వెరిగుడ్.. భారత రత్న సిఎన్‌ఆర్ రావు హైదరాబాద్ వచ్చారు. ఇంటర్వ్యూ చేస్తావా? ’’
‘‘యుఆర్ ఇన్సల్టింగ్ మీ.. నేనేంటి ఎవరో రావును ఇంటర్వ్యూ చేయడం ఏమిటి? బడా రాజన్ లాంటి వారిని ఇంటర్వ్యూ చేసిన నన్ను మీరిలా అవమానించడం సరికాదు. అవసరం అయితే బడా రాజన్‌కు చానల్ పెట్టమని సలహా ఇచ్చి అక్కడ సిఇఓగా చేరిపోగలను ఏమనుకుంటున్నారో?’’

-బుద్దా మురళి (జనాంతికం 8.11. 2015)

1, నవంబర్ 2015, ఆదివారం

అసహన వీరులు!

‘‘హాయ్ డార్లింగ్ ఎలా ఉన్నావు, ?ఎక్కడున్నావ్?’’
‘‘వావ్ బంగారం ఇప్పుడే నీ గురించి తలుచుకున్నాను. నువ్వే ఫోన్ చేశావు’’
‘‘ నీ మాటలు నమ్మను’’
‘‘ నీలో ఇంత అసహనాన్ని తట్టుకోలేక పోతున్నాను బంగారం.. సాయంత్రం మనం రెగ్యులర్‌గా కలిసే స్మశాన వాటికకు రా అక్కడ వివరంగా మాట్లాడుకుందాం.’’
‘‘ స్మశాన వాటికకు రమ్మనడం అంటే మన ప్రేమకు సమాధి కడతానని చెప్పడమే కదా? ’’
‘‘ అనుమానించడం భార్యల లక్షణం. మనకింకా పెళ్లి కాక ముందే ఇంతగా అనుమానించడం నాకస్సలు నచ్చలేదు. స్మశాన వాటిక అంటే నా ఉద్దేశం ఘాట్ అదే రెగ్యులర్‌గా మనం కలుసుకునే ఎన్టీఆర్ ఘాట్‌కు’’


***


‘‘హాయ్ డార్లింగ్’’
‘‘హాయ్ బంగారం ’’
‘‘ ఇంతకూ ఘాట్‌కు ఎందుకు రమ్మన్నట్టు డార్లింగ్’’
‘‘మన ప్రేమ పుట్టింది ఇక్కడే సమాధి చేద్దామని పిలిచాను ’’
‘‘ నేను లేకుండా క్షణం బతకలేను అన్నావ్ ఇప్పుడిలాంటి మాటలేంటి డార్లింగ్’’
‘‘ చూడు బంగారం స్మశాన వాటికలో పుట్టే స్మశాన వైరాగ్యం తాత్కాలికమే. ఈ ఘాట్‌లో పుట్టిన ప్రేమలు కూడా శాశ్వతం కాదు. మనమే కాదు మన చుట్టు కనిపించే వందల ప్రేమ జంటల పరిస్థితి ఇంతే. ప్రేమించుకునేప్పుడు ప్రపంచంలో మనంత అద్భుతమైన ప్రేమ జంట లేదనుకుంటాం. విడిపోయేప్పుడు ప్రపంచంలో ఇంత బాధ ఎవరికి లేదనుకుంటాం రెండూ అబద్ధాలే. ’’
‘‘ ఎందుకు విడిపోదామనుకుంటున్నావో చెప్పు ’’
‘‘అసహనాన్ని భరించలేను. దేశంలో అందరిలో అసహనం పెరిగిపోతోంది. నీలోనూ రోజు రోజుకు అసహనం పెరిగిపోతుంది. బంగారం అంటూ నీకు నేనిచ్చిన అవార్డును తిరిగి తీసుకుంటున్నాను. డార్లింగ్ అంటూ నువ్వు నాకిచ్చిన అవార్డు తీసేసుకో.. మన ప్రేమను ఇంతటితో మరిచిపో’’
‘‘ ఇచ్చేయడానికి ఇదేమన్నా సాహిత్య అవార్డులా? నా పరిస్థితేం కాను’’
‘‘ ఈ ప్రశ్నలు నరేంద్ర మోదీని గెలిపించే ముందు వేసుకోవలసింది. ’’
‘‘ ఏంటి డార్లింగ్ నరేంద్ర మోదీ అంటావు అసలు నీకేమైంది. ’’
‘‘ మనం విడిపోవడానికి ము మ్మాటికి నరేంద్ర మోదీనే కారణం. పాలకుడు అంటే దేశానికి తండ్రి లాంటి వాడు. దేశంలో ఎక్కడేం జరిగినా దానికి పాలకుడిదే బాధ్యత కదా? మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మ వయసులో ఉన్న అమ్మాయితో ఈ తిరుగుళ్లేంటి బాబు అని ఎంత అసహనం వ్యక్తం చేసింది. మోదీ అధికారంలోకి రాక ముందు మీ అమ్మ ఎప్పుడైనా అలా మాట్లాడిందా? ’’


‘‘ మా అమ్మకు ఈ మధ్య మనం ప్రేమించుకుంటున్నామనే అనుమానం కలిగింది. అందుకే కొంత కోపంగా మాట్లాడిందేమో కానీ మోదీకి మా అమ్మ మాటలకు అస్సలు సంబంధం లేదు. నన్ను నమ్ము ’’
‘‘ అంతేనా మీ తమ్ముడు మొన్న స్కూల్‌లో ఎవడో నచ్చక పోతే పైన ఇంకు పోశాడట కదా? మీ కుటుంబంలో అందరికీ ఇలా అసహనం పెరిగిపోతోంది అందుకే నీ డార్లింగ్ అవార్డు నీకిచ్చేస్తున్నాను, బంగారం అవార్డు నాది నాకిచ్చేయ్’’


‘‘ స్కూల్‌లో వాళ్లకు వాళ్లకు ఏదో గొడవలు ఉన్నాయి. మోదీకి మా కుటుంబానికి సంబంధం ఏమిటి? ’’
‘‘ ఇంటి పెద్ద మంచి వాడైతే ఇల్లు బాగుంటుంది. కుటుంబం బాగుంటే గ్రామం బాగుంటుంది. గ్రామం బాగుంటే రాష్ట్రం, తర్వాత దేశం. అంటే ఇప్పుడు దేశం బాగాలేకనే కదా మీ ఇంట్లో వాళ్లు అసహనంగా ఉన్నది. మీ ఇంట్లో వాళ్ల అసహనానికి దేశాన్ని పాలించే మోదీనే కదా కారణం. ’’
‘‘ అలా అనుకుంటే రాష్ట్రాలను పాలించే ముఖ్యమంత్రులు కారణం కావాలి కదా? ’’
‘‘ చూశావా నా అభిప్రాయాన్ని మన్నించే సహనం నీలో లేదు అందుకే రాష్ట్రాలను పాలించే వారి గురించి చెబుతూ రాజకీయం చేస్తున్నావు’’


‘‘ రెండు వందల పాతిక రూపాయలకు కిలో కంది పప్పు ధర పెరిగితే పప్పు తినడం మానేశాం కానీ పాలకులను నిందించని మా లాంటి సామాన్య కుటుంబాలే దేశంలోని కోట్లాది మందివి. ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే గుర్తు పట్టలేనంత కాలుష్యం ముఖానికి అంటుకుంటే టెర్రరిస్టుల్లా ముఖానికి ముసుగు ధరించి వెళుతున్నాం కానీ అసహనంతో ఎవరినీ ఏమీ అనని సహన జీవితాలు మావి. చదివిని చదువుకు తగిన ఉద్యోగాలు లేక ఇంజనీరింగ్ చదివి చప్రాసీ ఉద్యోగాలు చేసేందుకు సిద్ధమయ్యే జీవితాలు మావి. ఉత్తర ప్రదేశ్‌లో చప్రాసీ ఉద్యోగాలకు లక్షల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు క్యూలో నిలబడి దరఖాస్తు చేసుకున్నారు కానీ మేధావుల్లా అసహనంతో ఊగిపోలేదు. మెజారిటీ మతంలో పుట్టడమే పాపం అన్నట్టు పాలకులు వ్యవహరించినా పూర్వజన్మలో చేసుకున్న పాపం అనుకుని సహనంతో భరించిన జీవితాలు మావి. స్కూల్‌లో బొట్టుపెట్టుకున్నా, మాతృభాషలో మాట్లాడినా మూర్ఛ రోగులకు ఇత్తడి బిళ్ల కట్టినట్టు కట్టి తప్పయింది జీవితంలో ఇక బొట్టు పెట్టుకోము, తెలుగులో మాట్లాడం అని రాసి శిక్ష అనుభవించడమే కానీ ఇదేంటని అడగని సహనం మాది. మాలాంటి కోట్లాది కుటుంబాలే కాదు. ఈ దేశమే సహనానికి మారుపేరు. అలాంటిది ఈ దేశీయులకు అసహనం అంటావేమిటి? నువ్వన్నట్టు ఒక్కటి మాత్రం నిజం. దేశంలో అసహనం పెరిగిపోతోంది అది అక్షర సత్యం. మేధావుల్లో అసహనం పెరిగిపోతోంది. తమకు నచ్చని పార్టీ అధికారంలోకి వస్తే అసహనం వెర్రి తలలు వేస్తోంది. మాట్లాడే స్వేచ్ఛను హరిస్తున్నారని సమావేశం నిర్వహిస్తే అనుపమ్‌ఖేర్ తన అభిప్రాయం చెబుతుంటే మేధావులంతా అసహనంతో ఊగిపోయారు. నీకు నచ్చని సిద్ధాంతాన్ని నమ్మే పాలకులు అధికారంలోకి వస్తే సహించక పోవడం అసహనం. నీ కులం కాని వాడు ముఖ్యమంత్రి అయితే సహించక పోతే అసహనం. ’’


‘‘ ఇలా మాట్లాడుతావని తెలుసు కాబట్టే మనం విడిపోదామన్నాను’’


‘‘ చాలా మంచి పని చేశావు. ఇంకో విషయం తెలుసా? మానసిక వైద్యులకే మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయట! అలానే దేశంలో అసహనం పెరిగిపోతోందని ఆందోళన చెందే మీలాంటి వారే అసహనంతో బాధపడుతున్నారు అంతే తప్ప దేశానికి అసహనం లేదు. పైగా మీలాంటి వారి అసహనాన్ని సైతం భరించేంత సహనం ఈ దేశం సొంతం. ’’
మేధావుల మౌనం, మేధావుల అసహనం రెండూ ఒకటే 
-బుద్దా మురళి ( జనాంతికం 1-11-2015)