30, మే 2018, బుధవారం

నిర్భయపై ఆర్‌టీఐ ఆయుధ ప్రయోగం

పాలనలో పారదర్శత కోసం తెచ్చిన చట్టం సమాచారహక్కు చట్టం. 2005లో వచ్చిన ఈ చట్టం గురించి సామాన్యులకు ఇంకా పెద్దగా తెలియదు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారాన్ని ఈ చట్టం ద్వారా పొందవచ్చు. సరైన సమాచారం ఇవ్వడం లేదు, ఆలస్యం చేస్తున్నారు, చట్టాన్ని గౌరవించడం లేదని చాలామంది అధికారులపై ఫిర్యాదులు. అదే సమయంలో కక్ష సాధింపులు, వేధింపులకు ఈ చట్టాన్ని వాడుకుంటున్నారని అధికారుల విమర్శ. ఇరువర్గాల వాదనలకు బలమైన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఒక మహిళ తనను వేధిస్తున్న వ్యక్తిపై నిర్భయ పెడితే.. ఆమెను వేధించేందుకు ఆర్‌టీఐ చట్టాన్ని ఉపయోగించుకొంటున్న వ్యక్తి ఉదంతం ఒకటి కమిషన్ దృష్టికి వచ్చింది.
రికార్డులు తారుమారు చేసి తన భూమిని ఇతరుల పేరు మీదికి మార్చారు. స.హ.చట్టం కింద వివరాలు కోరితే స్పందించడం లేదని ఎంతోమంది గ్రామీణ సామాన్యులు కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇలా పేరు మార్చిన బాధితులకు స.హ.చట్టం అండగా నిలుస్తున్నది. వెట్టి చాకి రీ నుంచి విముక్తి పొందినవారికి పునరావాసం కోసం ఉన్న పథకాలు, వాటి అమలు గురించి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒకరు స.హ. చట్టం కింద సమాచారం అడిగారు. దాంతో అధికారులు పునరావాస పథకాలు అమలుచేయడమే కాకుండా ఇలా అడుగడం వల్లనే వారికి న్యాయం చేయగలిగామని సమాచారం అడిగినందుకు అధికారులే కృతజ్ఞతలు చెప్పారు. ఇలా సామాన్యులకు మేలు జరిగినప్పుడు ఈ చట్టానికి సార్థకత. అదే సమయంలో కొందరు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తున్నది.
నిర్భయ చట్టం అత్యంత శక్తివంతమైంది. ఒక మహిళ తనను వేధిస్తు న్న వ్యక్తిపై ఆధారాలతో నిర్భయ చట్టం కింద కేసు పెట్టింది. మాములుగా అయితే ఆ వ్యక్తి సిగ్గుతో చచ్చిపోవాలి. తన జీవిత అయిపోయిందని అనుకోవాలి. కానీ అతను స.హ.చట్టాన్ని ఉపయోగించుకొని ఆ మహిళను వేధిస్తూ కేసు ఉపసంహరించుకొని లొంగిపోతే సరే లేదంటే స.హ.చట్టం కింద నిన్ను ఇలానే వేధిస్తానని బెదిరిస్తున్నాడని కేసులకు సంబంధించిన ఆధారాలతో ఆమె కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ చెప్పిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లాలో ఒక మైనార్టీ మహిళ భర్తతో వివాదం వల్ల ఒంటరి జీవితం గడుపుతున్నది. ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. వివాదాన్ని పరిష్కరిస్తాం, పెద్దమనుషులమని కొందరు ఆమెను కలిశారు. అందులో ఒక వ్యక్తి ఆమెను నన్ను పెళ్లి చేసుకుంటావా? లేదా? అని వేధిస్తున్నాడు. అతను సెల్‌ఫోన్‌లో వేధించినప్పుడు బాధిత మహిళ సెల్‌ఫోన్ లో అతని సంభాషణ రికార్డు చేసింది. పోలీసులకు ఆ రికార్డ్‌ను అందజేసింది . స్థానికంగా ఒకషాప్ ను కాల్చిన సంఘటనలో తన నేరాన్ని సెల్ ఫోన్ సంభాషణల్లో అతను వివరించాడు. దాంతో పోలీసులు దీని ఆధారంగా ఆ వ్యక్తిపై నిర్భయ కేసుతో పాటు, షాప్ తగులబెట్టిన కేసు నమో దు చేశారు.
ఆ మహిళపై కక్ష పెంచుకొని ఏదో ఒక పేరుతో స.హ.చట్టం కింద పిటిషన్లు పెడుతున్నాడు. చట్టం ప్రకారం సర్వీస్ రికార్డ్ వంటి వ్యక్తిగత సమాచారం ఇవ్వవలసిన అవసరం లేకపోయినా ఇచ్చాను. సమాచారం ఇవ్వడానికి నాకు ఇబ్బంది లేదు. కానీ రోజూ స.హ.చట్టం కింద పిటిషన్లు రావడం వల్ల అధికారులు, తోటి టీచర్లు నీ వల్లనే ఇదంతా అని చిరాకు పడుతున్నారని ఆ మహిళ తెలిపింది. నిర్భయ కేసు ఉపసంహరించుకొని నాకు లొంగిపోయే వరకు ఇలా స.హ.చట్టం కింద పిటిషన్లు పెడుతూనే ఉంటానని అతను బెదిరిస్తున్నాడని బాధిత మహిళ లిఖితపూ ర్వకంగా ఫిర్యాదు చేసింది. ఆ వ్యక్తిపై నిర్భయ కేసు, రౌడీషీట్ వంటి కేసులకు సంబంధించిన సమాచారంతో బాధితురాలు పోలీసులను కలిసింది. సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. స.హ.చట్టం కింద ఏదైనా సమాచారం కోరినప్పుడు సంబంధిత సమాచార అధికారి సాధ్యమైనంత వరకు తన వద్ద రికార్డులో ఉన్న సమాచారం ఇవ్వాలి. అంతే కానీ, ఆ ఉద్యోగి తృతీయ సమాచారం అడిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. పక్షం సమాచా రం కోరినప్పుడు మాత్రమే వారిని అడుగాలి.
బాధిత మహిళ ప్రభుత్వ స్కూల్‌లో ఉపాధ్యాయురాలు కావడం వల్ల నేరుగా ఆమె పేరు ప్రస్తావించకుండా ఆమె పనిచేసే పాఠశాలకు సంబంధించి ఏదో ఒక అంశంపై రకరకాల పేర్లతో సమాచారం కోరుతూ దరఖా స్తు చేస్తున్నారు. ఒంటరి మహిళ భయపడకుండా ధైర్యంగా నిలబడటం అభినందనీయం. స.హ.చట్టాన్ని ఉపయోగించుకొని కొంతమంది చేస్తు న్న వ్యవహారాలు చాలాసార్లు కమిషన్ దృష్టికి వచ్చింది కానీ ఒక ఒంటరి మహిళను వేధించినవారు నిర్భయ చట్టం కింద కేసు ఎదుర్కొంటూ బాధిత మహిళను స.హ.చట్టం పేరుతో వేధించడం ఆశ్చర్యం కలిగించిం ది. చట్టాన్ని ఇలా కూడా ఉపయోగించుకుంటున్నారా? అని పోలీసులు కూడా విస్తుపోయి మహిళకు ధైర్యం చెప్పి సమాచార హక్కు కమిషన్‌ను కలువమని సలహా ఇచ్చారు. తోటి ఉపాధ్యాయులు ఇదంతా నీ వల్లనే, నీవల్ల అందరి సమాచారం అడుగుతున్నారని ఆ మహిళపై చికాకు పడటం సరికాదు. ఒంటరి మహిళకు సాటి ఉద్యోగులు ధైర్యం చెప్పి అం డగా నిలవాలి .
పటాన్‌చెరు ప్రాంతానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు అర్థంకాని రాత తో కమిషన్‌కు డజన్లకొద్దీ దరఖాస్తులు చేశారు. అప్పీల్‌పై విద్యాశాఖ అధికారులను పిలిచి మాట్లాడితే పిటిషన్‌దారు మాత్రం రాలేదు. అతను తమ ఇం టికి చాలా దూరంలో ఉద్యోగం చేస్తున్నా డు. కోరిన ప్రాంతానికి డెప్యుటేషన్‌పై పంపేంతవరకు ఇలానే స.హచచట్టం కింద పిటిషన్ పెడతానని అధికారులకు బదులిచ్చాడు.సదాశివపేటలో ఒక టెక్నో స్కూల్‌తో ఒకరికి వివాదం ఒకే స్కూల్‌కు సంబంధించి అటుమార్చి ఇటుమార్చి మొత్తం 19 దరఖాస్తు చేశాడు. అతనికి కావలసింది సమాచారం కాదు వివాదం అంతే. హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో ప్రైవేట్ వ్యక్తుల భవనంలో అద్దెకున్న ప్రభుత్వ పాఠశాలను ఖాళీ చేయించేందుకు స.హ.చట్టం కింద లెక్కలేనన్ని పిటిషన్లు వేయడమే ఒకపనిగా పెట్టుకున్నారొకరు. కేసులు భరించలేక చివరికి భవ నం ఖాళీ చేశారు. మార్కెటింగ్‌శాఖకు సంబంధించి ఒక రు ఇదేవిధంగా లెక్కలేనన్ని కేసులు వేసి ఇబ్బంది కలిగిస్తున్నారని ఆ శాఖాధికారులు చెబుతున్నారు.
ప్రజాధనం దుర్వినియోగాన్ని నివారించడం, పాలనలో పారదర్శకత వంటి పవిత్ర లక్ష్యాలతో ఈ చట్టం వచ్చింది. స.హ.చట్టం కోసం ఉద్యమించినా ఉద్యమకారులు సైతం ఈ చట్టం ద్వారా సామాన్యులకు మేలు జరుగాలని కోరుకున్నారు. కానీ ఇలా వేధింపులకు ఉపయోగించుకుంటారని ఊహించలేదు. కొందరు కొన్నివందల పిటిషన్లు వేస్తున్నారు. దీనివ ల్ల నిజంగా సమాచారం కోరేవారికి ఆలస్యమవుతున్నది. వంద పిటిషన్లు తాము వేయడం కన్నా పిటిషన్ ఎలా రాయాలో తెలియని వంద మందికి నేర్పించడం మంచిది. ఉద్యోగులు 75 శాతం పనిని స.హ.చట్టం కింద సమాచారం ఇవ్వడానికే కేటాయించాల్సి వస్తున్నదని, అవసరమైన సమాచారం సంక్షిప్తంగా స్పష్టంగా అడుగాలని ఒక కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది.
2005లో ఈ చట్టం వచ్చినప్పుడు సాధ్యమైనంత త్వరగా సమాచారం అంతా ఇంటర్‌నెట్‌లో అందరికీ అందుబాటులో ఉండేట్టు చూడాలని చట్టం పేర్కొన్నది. 13 ఏండ్లయినా ఇంకా దీన్ని అమలుచేయడం లేదు. సమాచారం మొత్తం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉండేట్టు చేసి సమాచారం కోసం ఈ చట్టాన్ని ఆశ్రయించాల్సిన అవసరంలేని పరిస్థితి రావాల ని చట్టం చెబుతున్నది. ఆ రోజు ఎంత త్వరగా వస్తే వేధింపులు అంత త్వరగా సమసిపోతాయి.
ఈ చట్టం సాధారణ పౌరులకే కాదు , ప్రభుత్వ అధికారులకూ ఉపయోగపడుతున్నది.

ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి మధుకర్ రాజుకు ప్రమోషన్లో అన్యాయం జరిగితే స.హ.చట్టం ద్వారానే ఆధారాలు సంపాదించి న్యాయపోరాటం జరిపారు. చివరికి అతనికి న్యాయం జరిగింది. అనంతరం అతను స.హ.చట్టం కమిషనర్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు. స.హ.చట్టం వల్ల కలిగే ప్రయోజనాలకు తానే ఒక ఉదాహరణ అని ప్రతి సభలో చెప్పేవారు. చట్టాన్ని మంచికోసం ఉపయోగించుకోవడం అందరి బాధ్యత దుర్వినియోగం చేయడం అంటే మనకు నీడనిచ్చే చెట్టును మనమే నరుక్కోవ డం వంటిదే. ధర్మం కోసం ప్రయోగించాల్సిన ఆయుధాన్ని అధర్మం కోసం ప్రయోగించడం మంచిది కాదు.
-బుద్దా మురళి (నమస్తే తెలంగాణ 30-5-2018)

25, మే 2018, శుక్రవారం

మీకు మీరే బాధ్యులు..

‘హుషారుగా కనిపిస్తున్నావ్..?’’
‘‘ఉదయమే విశ్వనాథం ఫోన్ చేశాడు. చాలా దిగులుగా ఉన్నాడు. ఏంట్రా విషయం అంటే నీకేం హైదరాబాద్‌లో హాయిగా ఉన్నావ్? మేం హైదరాబాద్‌ను వదులుకున్నాం అని బాధపడ్డాడు’’
‘‘మరి నువ్వేమన్నావ్?’’
‘‘నువ్వు ఒక్క హైదరాబాద్‌నే వదులుకుని అంత బాధపడితే, మేం విజయవాడ, విశాఖ, గుంటూరు, తెనాలి, రాజమండ్రి, కర్నూలు, కడప, అనంతపురాన్ని, ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు తిరుపతి, అన్నవరం, శ్రీశైలం వదులుకుని ఇంకెంత బాధపడాలని అడిగాను’’
‘‘మరేమన్నాడు? ’’
‘‘బుర్ర గిర్రున తిరిగినట్టుంది. ఏమీ అనలేదు. అతను హైదరాబాద్‌ను వదులుకోవడం ఏంటి? నేను తిరుపతి వదులుకోవడం ఏంటి? ఎవరు ఎక్కడికైనా వెళ్లవచ్చు. హైదరాబాద్‌కు వస్తే నినె్నవరూ అడ్డుకోరు, తిరుపతి వస్తే ననె్నవరూ అడ్డుకోరు. చంకలో పిల్లను వదులుకున్నాను, పూర్వులు సంపాదించిన ఆస్తిని వదులుకున్నానని అన్నట్టు ఆ దిగులు వద్దు అని చెప్పానులే! ’’
‘‘నీ దృష్టికి ఇంకేం విశేషాలు రాలేదా?’’
‘‘రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి.’’
‘‘అవెప్పుడు చల్లగా ఉన్నాయని? అవికాదు.. ఇంకేం రాలేదా? ఎప్పుడో నూట పాతిక సంవత్సరాల క్రితం పుట్టిన చలం గురించి, మూడున్నర దశాబ్దాల క్రితం మరణించిన సావిత్రి గురించి ఈ తరం పిల్లలు కూడా మాట్లాడుకోవడం నీకు విశేషంగా అనిపించలేదా? సావిత్రి మహానటి. పాపం వాళ్లయన మోసం చేశాడు. కానీ జెమినీ గణేశన్ పెద్ద భార్య కూతురేమో సావిత్రి కాదు, మా నానే్న మహానటుడు అభిమానులు రసికరాజు అనే బిరుదు కూడా ఇచ్చారని చెబుతోంది..’’
‘‘చూడోయ్ శ్రీరాముని కోణం నుంచి రామాయణం కథ చెబితే అతను పితృవాక్య పాలకునిగా ధీరోధాత్తునిగా, రావణుడు విలన్‌గా కనిపిస్తాడు. ఈ మధ్య రావణున్ని హీరోగా చూపుతూ బోలెడు సాహిత్యం వచ్చింది. ‘అన్నగారు’ ఎప్పుడో సినిమాలు కూడా తీశారు. కథ ఒకటే కానీ ఎవరి కోణం నుంచి చెబుతున్నామనేదే ముఖ్యం. అంతెందుకు? గాడ్సే కోణం నుంచి మహాత్మా గాంధీ కథను కూడా గాడ్సే హీ రోగా రచించారు.’’
‘‘పోనీ.. చలం గ్రేట్ కదూ... ఆయన రాతలు అజరామరణం కదా? కవి మరణిస్తాడేమో.. కానీ ఆయన సాహిత్యం శాశ్వతం ఏమంటావు?’’
‘‘ లక్షల మంది మరణానికి కారణమైన హిట్లర్‌ను రోజూ తలుచుకుంటున్నాం, ప్రపంచానికి అహింస ఆనే ఆయుధాన్ని అందించిన గాంధీని తలుచుకుంటున్నాం. తలుచుకోవడం ఒక్కటే గొప్పతనానికి ప్రతీక కాదు’’
‘‘అంటే చలం హిట్లర్ అంటావా? మహాత్మాగాంధీ అంటావా?’’
పలనా వారు మహాత్ములు, ఫలానా వారు దుష్టులు అని ముద్రలు వేసే అధికారం నీకూ నాకే కాదు.. ఎవరికీ లేదేమో! ’’
‘‘డొంక తిరుగుడు వద్దు చలం గురించి ఏమనుకుంటున్నావో చెప్పు?’’
‘‘ఏ తేదీ నాటి చలం గురించి చెప్పమంటావు? ఓషో ఏమన్నాడు ఊపిరి తీసుకున్న ప్రతిసారి మనిషి కొత్త జన్మ ఎత్తినట్టే అన్నాడు. మనిషి ఎప్పుడూ మారుతుంటాడు. ఈ రోజు నీకు నేను గొప్ప మిత్రునిగా కనిపించవచ్చు. నువ్వడిగిన రూ.ఐదువేల చేబదులు ఇవ్వక పోతే నాలో నీకో దుర్మార్గుడు కనిపించవచ్చు. అభిప్రాయాలు నిరంతరం మారుతాంటాయి. చలం తాను రాసిన రచనలపై తానే పశ్చాత్తాపం చెందిన సందర్భాలు ఉన్నాయి. నీ పుస్తకాల వల్ల ఎం తో మంది పాడయ్యారు.. అలా ఎందుకు రాశావంటే- అప్పుడు అట్లా అనిపించింది రాశానని బదులిచ్చినట్టు చలం మనవరాలు తురగా జానకీరాణి ఓ సందర్భంలో చెప్పారు. చలం జీవితాన్ని అనుభవించాడు, ఆయన సంతానం చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. ఆయనకు అలా అనిపించినప్పుడు అలా రాశాడు అభిమానులేమో అదే మహద్భాగ్యం అనుకుని ఆ అభిప్రాయాలను మెదడులోకి జొప్పించి సొంత ఆలోచనలను పక్కన పెట్టారు.’’
‘‘నువ్వు మహానటి సావిత్రిని, మహారచయిత చలంను తప్పు పడుతున్నావ్?’’
‘‘మళ్లీ అదే మాట.. వాళ్లను తప్పు పట్టడానికి ఒప్పు పట్టడానికి నేనెవరిని? నువ్వెవరివి? సావిత్రి తనకు నచ్చినట్టు తాను బతికింది. చలం తనకు నచ్చినట్టు తాను రాశాడు. నాకు తోచింది నేను చెప్పాను. నీకు నచ్చింది నువ్వు స్వీకరించు. ముద్రలు వేయడానికి మనమెవరం?’’
‘‘నువ్వు విమర్శిస్తున్నావో? సమర్ధిస్తున్నావో అర్థం కాలేదు.’’
‘‘కర్నాటకలో కుమారస్వామి ప్రమాణ స్వీకార దృశ్యాలు చూశావా?’’
‘‘దానికి,దీనికి సంబంధం ఏమిటి?’’
‘‘ఉంది.. సోనియాగాంధీతో కలిసి విజయ హస్తం చూపుతూ అల్లుడు ఎంత సందడి చేశారు. రాహుల్‌ను భుజం తట్టారు’’
‘‘దానికీ.. దీనికి సంబంధం ఏంటో చెప్పు?’’
‘‘టిడిపిని స్థాపించిన అన్నను దించేసినప్పుడు ఎన్టీఆర్ కాంగ్రెస్‌తో చేతులు కలిపారని అల్లుడి బృందం విమర్శలు చేసింది గుర్తుందా? ’’
‘‘ఔను.. కాంగ్రెస్ నుంచి వచ్చిన అల్లుడు.. తన మామ కాంగ్రెస్‌తో కలవడాన్ని జీర్ణం చేసుకోలేకపోయాడు.’’
‘‘ఇటలీ మాత అంటూ నిప్పులు చెరిగిన అల్లుడు అదే మాతతో వెనె్నల్లో హాయిగా ముచ్చట్లు చెప్పు కోవడం చూశావా?’’
‘‘చూశాను.. ఐతే ?’’
‘‘మళ్లీ అదే చెబుతున్నాను. సావిత్రి తనకు తోచినట్టు బతికింది. చలం తనకు నచ్చినట్టు రాశాడు, బతికాడు.. కాంగ్రెస్ వ్యతిరేకత లాభసాటి అనుకున్నప్పుడు అల్లుడు ఆ పని చేశారు. ‘చేయి’తో చేయి కలిపితే లాభసాటి అని ఇప్పుడు అనుకుంటున్నారు. ఏ నిర్ణయం శాశ్వతం కాదు. ఎవరికి లాభసాటి అనుకున్న నిర్ణయం వాళ్లు తీసుకుంటారు. ఆ నిర్ణయం లాభసాటా? కాదా? అనేది కాలం తేలుస్తుంది. చలం ఆలోచనలు అద్భుతం, రాంగోపాల్ వర్మ ఆలోచన మహాద్భుతం అంటూ కార్బన్ కాపీగా మారిపోకు. వాళ్ల అభిప్రాయాలు చదవగలవు కానీ వాటి వెనక ఉన్న ఉద్దేశాలు, ఫలితాలు నీకేం తెలుసు? గద్దర్ అయినా రాంగోపాల్  వర్మ అయినా ఎవరైనా  బతకడానికి తగిన ఏర్పాట్లు చేసుకొని ఏమైనా మాట్లాడవచ్చు .  నువ్వు కూడా నీకు నచ్చిన నిర్ణయం తీసుకో.. ఫలితాన్ని నువ్వే అనుభవించు. సింపుల్‌గా చెప్పాలి అంటే నీ దురదను నువ్వే గోక్కో. ఇతరులు గోక్కోవడం చూసి అనుసరించకు. ఎవరి దురదకు వాళ్లే బాధ్యులు
’’.
‘‘మరి ఓషో అంటున్నావు ’’
‘‘నన్ను ఫాలో కా అని ఓషో ఎప్పుడూ చెప్పలేదు ..అలా కార్బన్ కాపీ లంటే ఆయనకు పడదు కూడా ..  నీకు నువ్వు ఆలోచించుకో అన్నారు ’’
-బుద్దా మురళి (జనాంతికం 24-5-2018)

23, మే 2018, బుధవారం

ఆర్‌టీఐలో ఆకాశ రామన్నలు

మీరు వెతుకుతున్న నేరస్తుడు ఫలానా వ్యక్తి అంటూ తగిన సమాచారంతో పోలీసులకు ఆకాశరామన్న ఉత్తరం రాస్తే.. అందులో విషయాలు నిజమే అనిపిస్తే పోలీసులు విచారిస్తారు. అనేక సందర్భాల్లో పోలీసులకు ఈ ఆకాశరామన్న ఉత్తరాలే కేసు విచారణకు ఎంతో ఉపయోగపడుతాయి. నేరం గురించి, నేరస్తుని గురించి తెలిసినా చెబితే తమ ప్రాణాలకు ముప్పు రావచ్చుననే భయంతో కొందరు చెప్పరు. సమాజం గురించి ఆలోచించే మరి కొందరు నేరస్తులను అలా వదిలివేయలేరు. అలాంటి వారు తగు జాగ్రత్తలు తీసుకొంటూ నేరానికి సంబంధించి తమకు తెలిసిన సమాచారాన్ని పోలీసులకు ఆకాశరామన్న ఉత్తరాల ద్వారా తెలియజేయవచ్చు. అనేక కేసుల్లో ఈ ఆకాశరామన్న ఉత్తరాలు నేర పరిశోధనలో కీలకంగా మారాయి. బంగారం, కలప స్మగ్లింగ్, గుట్కా అమ్మకాల వంటివెన్నో నేరాల్లో ఆకాశరామన్న ఉత్తరాలు కీలక పాత్ర వహించాయి. ఆకాశ రామన్న ఉత్తరాలను పోలీసులు తేలికగా తీసుకోరు. ఉపయోగపడే సమాచారం ఉందనుకొంటే సీరియస్‌గా దృష్టిసారిస్తారు.

అవినీతిపరులైన ఉద్యోగుల అవినీతి సంపాదన కూడా ఆకాశరామన్న ఉత్తరాల ద్వారా బయటపడుతుంది. అవినీతిపరులను పట్టుకోవడంలో ఏసీబీకి ఆకాశరామన్న ఉత్తరాలు బాగా ఉపయోగపడుతాయి. కొందరు సాధారణ ఉద్యోగులు కూడా అక్రమంగా కోట్లు సంపాదిస్తున్నారు. ఇలాంటి వారి సమాచారం ఆకాశరామన్న ఉత్తరాల ద్వారానే ఎక్కువగా అందుతుంది. నేరానికి, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసినవారు తమ పేరు వివరాలు తెలియకుండా తాము అజ్ఞాతంలో ఉంటూ ఆకాశరామన్న పేరుతో అధికారులకు సమాచారం అందించడం ఎప్పటినుంచో ఉన్నదే. సమాచారహక్కు చట్టం కింద ఆకాశ రామన్న సమాచారం అడుగవచ్చా? అంటే చట్టం దానికి అంగీకరించదు. అయితే పూర్తిగా ఆకాశరామన్న అని కాదు కానీ కొంతవరకు అవకాశం ఉన్నది. 

సమాచారహక్కు చట్టం కింద సమాచారం కోరడం ద్వారా దేశంలోని అనేక రాష్ర్టాల్లో హక్కుల కార్యకర్తలపై దాడులు జరిగాయి. కొన్ని రాష్ర్టాల్లో హత్యలు కూడా జరిగాయి. పాలనలో పారదర్శకత కోసం సమాచారహక్కు చట్టం తీసుకువచ్చారు. అప్పటివరకు ప్రయోజనం పొందినవారికి ఈ పారదర్శకత నచ్చక దాడులకు దిగారు. తమ వివరాలు రహస్యంగా ఉంచుతూ సమాచార హక్కు కింద వివరాలు కోరే అవకాశం లేదా? వివరాలు బహిర్గతమైతే ప్రాణభయం ఉంది. మరేం చేయాలి. దాడి జరిగే అవకాశం ఉన్నది కాబట్టి మా వివరాలేమీ చెప్పం, మాకు సమాచారం కావాలని తమ వివరాలు ఏమీ ఇవ్వకుండా కొందరు దరఖాస్తు చేస్తున్నారు. సమాచారహక్కు చట్టం ప్రకారం వీరికి సమాచారం ఇవ్వడం సాధ్యంకాదు. సమాచారం కోరేవారి పేరు, చిరునామా ఉండాలని చట్టం చెబుతున్నది. సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరుతున్న అభ్యర్థి తాను సమాచారం ఎందుకు కోరుతున్నారో కారణాలు వివరించాల్సిన అవసరం లేదు. 

తనకు సమాచారం అందించేందుకు అవసరమైన వివరాలు మినహా ఎలాంటి వ్యక్తిగత వివరాలు అవసరం లేదని చట్టం చెబుతున్నది. ఆకాశ రామన్న ఉత్తరం ద్వారా సమాచారం కోరితే సమాచార అధికారి వివరాలు ఎలా పంపాలి? ఎక్కడికి పంపాలి. ఇక కోరిన సమాచారం అభ్యర్థికి రానప్పుడు సమాచార కమిషన్‌కు అప్పీల్ చేసుకున్నప్పుడు అక్కడా చిరునామా కావలసిందే. కమిషన్‌కు చేసుకొనే అప్పీలులో అప్పీలు దాఖలుచేసే వ్యక్తి పేరు, చిరునామా ఉండాలని చట్టం చెబుతున్నది. అప్పీలుదారునికి, సమాచార అధికారికి విచారణ కోసం కమిషన్ నోటీసు ఇవ్వాలంటే చిరునామా తప్పనిసరి. కమిషన్ అప్పీళ్లను పరిష్కరించే విధానంపై 2006 ఫిబ్రవరి 25న ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం జారీచేసిన జీవోలో కమిషన్ నోటీసులు అందజేయడం గురిం చి వివరణ ఇస్తూ, నేరుగా అందజేయడం, రిజిష్టర్ పోస్ట్‌ద్వారా పంపడం చేయాలని పేర్కొన్నారు. కమిషన్ విచారణకు అప్పీలుదారు లేదా అతని ప్రతినిధి వ్యక్తిగతంగా హాజరుకావచ్చు లేదా హాజరుకాకుండా ఉండవచ్చు. అయితే చట్టంలో పేర్కొన్నవిధంగా సమాచారహక్కు చట్టం కింద సమాచార అధికారిని సమాచారం కోరినప్పుడు పేరు, చిరునామా ఉండాలి. 

సమాచారం ఇవ్వకపోతే అప్పిలేట్ అధికారికి, కమిషన్‌కు పిర్యాదు చేసినప్పుడు కూడా పేరు, చిరునామా అవసరం. కాబట్టి ఇక్కడ ఆకాశ రామన్న ఉత్తరాల ద్వారా సమాచారం కోరడం సాధ్యం కాదు. సమాచారహక్కు కింద సమాచారం కోరే వారిపై దాడులు జరుగుతున్న సమయంలో సమాచారం కోరేవారి భద్రత కోసం వారి వివరాలు బహిర్గతం చేయకుండా ఉండటం సాధ్యం కాదా? అంటే దీనికో మార్గం ఉన్నది. చట్టాన్ని పాటిస్తూనే వివరాలు రహస్యంగా ఉంచవచ్చు. సమాచారహక్కు చట్టం సెక్షన్ 6(2)లో సమాచారం కోరే వ్యక్తి ఎవరైనా సమాచారం కోరడానికి గల కారణం వివరించాల్సిన అవసరంలేదు. తనకు కబురు చేసేందుకు అవసరమైన వివరాలు మినహా ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసారం లేదని పేర్కొన్నది. దీన్ని ప్రస్తావిస్తూ గోయంక్ కలకత్తా హైకోర్ట్‌ను ఆశ్రయించారు.
Buddamurali
పోస్ట్‌బాక్స్ నెంబర్ ఇస్తూ సమాచారం కోసం దరఖాస్తు చేస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. పోస్ట్‌బాక్స్ నెంబర్ అంటే సమాచారం పంపడానికి అవసరమైన వివరాలున్నట్టే. పోస్ట్‌బాక్స్ నెంబర్ ఇవ్వడం అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు అవసరమైన వివరాలున్నట్టే. పోస్ట్‌బాక్స్ నెంబర్ ఇచ్చిన తర్వాత పేరు, చిరునామా కోసం ఒత్తిడి తీసుకురావద్దని కోర్టు సూచించింది. పోస్ట్‌బాక్స్ నెంబర్‌కు సమాచారం పంపడంలో ఏమైనా ఇబ్బందులున్నాయని సమాచార అధికారి భావిస్తే పేరు, చిరునామా వివరాలు అడుగవచ్చు. కానీ అవిశేక్ గోయంకా కేసులో అలాంటిది లేదని కోర్టు భావించింది. ఈ కేసు తర్వాత పోస్ట్‌బాక్స్ నెంబర్‌ను కూడా చిరునా మాగా భావించి సమాచారం ఇవ్వాలని ఈ తీర్పును ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అన్ని రాష్ర్టాలకు సమాచారం పంపింది. కొన్ని కంపెనీలు ఉద్యోగ నియామకాలతో పాటు కొన్ని సందర్భాల్లో తమ పేరు బయటకు తెలియకుండా పోస్ట్‌బాక్స్ నెంబర్ ఇస్తారు. పోస్టాఫీసుకు నిర్ణీత మొత్తం చెల్లిస్తే వారో నెంబర్ కేటాయిస్తారు. ఆ పోస్ట్‌బాక్స్‌కు వచ్చిన ఉత్తరాలు ఆ కంపెనీ తీసుకొంటుంది. ఇదే విధంగా ఎవరైనా వ్యక్తులు సైతం పోస్టాఫీస్‌లో పోస్ట్‌బాక్స్ నెంబర్ తీసుకోవచ్చు. దరఖాస్తులో పోస్ట్‌బాక్స్ నెంబర్ ఇవ్వడం అంటే పరోక్షంగా మీ పేరు, చిరునామా ఇచ్చినట్టే. అదే సమయంలో మీ పేరు, చిరునామా రహస్యంగా ఉన్నట్టే. కొన్ని సందర్భాల్లో దాడుల ప్రమాదం ఉన్నదనుకొంటే పోస్ట్‌బాక్స్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. అంతే తప్పా ఆకాశరామన్న ఉత్తరంలా ఊరు, పేరు లేకుండా సమాచారహక్కు చట్టం కింద సమాచారం పొందడం సాధ్యం కాదు.
బుద్దా మురళి (నమస్తే తెలంగాణ 23-5-2018)

21, మే 2018, సోమవారం

డబ్బు మాట్లాడుతుంది!

నిదానమే ప్రధానం - ఆలస్యం అమృతం  విషం
ఈ రెండు మాటలు చెప్పింది మన పెద్దలే. నిదానం ప్రధానం అంటూనే ఆలస్యం అమృతంవిషం  అంటారు. రెండింటిలో ఏది పాటించాలి అనేది కొందరి సందేహం అయితే, పెద్దలిలానే చెబుతారు. వారి మాటలు పాటించాల్సిన అవసరం లేదు అనేది కొందరి జోకులు. రెండూ అక్షర సత్యాలే. ఏ సమయంలో ఏ మాట పాటించాలి అనే నిర్ణయంలోనే మన విజ్ఞత దాగి ఉంటుంది.
‘‘డబ్బు అన్నింటినీ కొనలేదు. డబ్బుతో వాచీ కొనగలవేమో కానీ సమయాన్ని కొనలేవు, డబ్బుతో పుస్తకాన్ని కొనగలవు కానీ జ్ఞానాన్ని కొనలేవు. డబ్బుతో బెడ్‌ను కొనగలవు కానీ నిద్రను కొనలేవు. డబ్బుతో నీకు హోదా రావచ్చు కానీ ఆదరణ దక్కదు. డబ్బుతో రక్తాన్ని కొనగలవు కానీ జీవితాన్ని కొనలేవు.
అంటే డబ్బే అన్నీ చేయలేదు అంటావు. డబ్బు సమస్యలంటావు. సరే నేను నీ మిత్రున్ని కదా? ఈ సమస్యలన్నీ నేను భరిస్తాను. నీ డబ్బు మొత్తం నాకిచ్చేయ్’-
డబ్బు అన్నీ కొనలేవు అనే మాటలపై ప్రచారంలో ఉన్న ఓ జోకు ఇది.
డబ్బుపై రష్యన్ భాషలో ఓ మంచి కథ కూడా ఉంది.
ఒక కుటుంబరావు చిన్న కుటుంబం, ఆదాయం తక్కువే అయినా ఉన్న దాంట్లో భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటాడు. ఓ రోజు అతనికో బంగారు నాణెం దొరుకుతుంది. దాన్ని రుద్దితే అందులో నుంచి మరో నాణెం వస్తుంది. అలా రుద్దుతూనే ఉంటాడు. నాణాలు వస్తుంటాయి. ఇదో మాయానాణెం. ఎన్నిసార్లు రుద్దితే అన్ని నాణాలు వస్తాయని అశరీరవాణి పలుకుతుంది. ఇంటిలోని నేలమాళిగలోకి వెళ్లి ఎవరికీ కనిపించకుండా నాణాన్ని అలా రుద్దుతూనే ఉంటాడు. తన కుటుంబాన్ని, పిల్లలను చివరకు తనను తాను మరిచిపోయి నాణాన్ని రుద్దుతూనే ఉంటాడు.
గడ్డం పెరిగిపోతుంది. తనను తానే గుర్తించలేని స్థితికి చేరుకుంటాడు. హఠాత్తుగా భార్యా పిల్లలు గుర్తుకు వస్తారు. ఇక నాణాలు చాలు, వారిని చూడాలని అనుకుని బయటకు వస్తాడు. అతన్ని ఎవరూ గుర్తు పట్టరు. పిల్లలకు పిల్లలు పుడతారు. అంతా జీవితంలో సంతోషాన్ని అనుభవిస్తుంటారు. జీవితంలో అన్నీ వదిలేసి ఇంత కాలం నేను సాధించింది ఏమిటని కుప్పకూలిపోతాడు.
ఇది కథ మాత్రమే కాదు. మన జీవితం కూడా.
డబ్బు సంపాదనలో పడి, బతకడం మానేస్తున్నాం. కుటుంబం, పిల్లలు, చిన్న చిన్న సంతోషాలు అన్నీ వదిలి మాయా నాణెం వెంట పరుగులు పెడుతున్నామేమో కదా?
ఇంతకూ డబ్బు సంపాదించమంటున్నారా? వద్దంటున్నారా? అనే సందేహం వస్తుందా? మళ్లీ మొదటి సమస్యకు వద్దాం. ఈ పెద్దలు ఎప్పుడూ ఇంతే నిదానమే ప్రదానం అంటారు, ఆలస్యం అమృతం విషం అంటారు. అలానే డబ్బులేకపోతే ఎవరూ పట్టించుకోరు అంటారు. డబ్బే ముఖ్యం కాదంటారు. రెండింటిలో దేన్ని అనుసరించాలి అంటే రెండూ నిజమే. జీవితంలో అన్నీ సమపాళ్లలో ఉండాలి. కుటుంబం ముఖ్యమే, కెరీర్ ముఖ్యమే, డబ్బు సంపాదనా ముఖ్యమే. వీటన్నింటిని సమన్వయం చేసుకోవడమే జీవితం. ఒకటి లేకపోతే మరోటి ఉండరు.
పాత సినిమా పాటలు వింటూ భార్య ముఖాన్ని చూసుకుంటూ మహా అయితే ఒక రోజంతా ఇంట్లోనే ప్రేమను తింటూ ఉంటావేమో ! కానీ డబ్బు లేకపోతే కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోరు. విలువ ఇవ్వరు.
కుటుంబానికి తగిన సమయం ఇవ్వాలి, అదే సమయంలో డబ్బు సంపాదన ఉండాలి. ఒకదాని కోసం మరోదాన్ని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. రెండింటికి ప్రాధాన్యత ఇస్తే జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి. సమాజంలో గుర్తింపు విలువ ఉంటుంది.
డబ్బు అన్నీ ఇస్తుంది. డబ్బు మనిషిని శక్తివంతునిగా మారుస్తుంది. తన జీవితంపై తనకు పట్టు ఉంటుంది. అనేక సమస్యలకు కారణం డబ్బు. అది చేతిలో ఉంటే సమస్యలను పరిష్కరించుకోవచ్చు. డబ్బు లేకపోవడం అదే ఒక పెద్ద సమస్య. అనేక సమస్యలను డబ్బు పరిష్కరిస్తుంది కానీ డబ్బు లేని సమస్యను మరేదీ పరిష్కరించదు. డబ్బే పరిష్కరిస్తుంది. డబ్బు ఆత్మవిశ్వాసంతో పాటు ధీమా గా ఉండేట్టు చేస్తుంది. ఆర్థికంగా బాగున్నప్పుడు తనకు ఏదీ చేయాలనిపిస్తే అది చేయగలం. లేదంటే ఇష్టం ఉన్నా లేకున్నా జీతం ఇచ్చే పనిలో ఉండాల్సి వస్తుంది. మన జీవితం మీద మనకు హక్కు లేని పరిస్థితి వస్తుంది. ఆర్థికంగా స్వేచ్ఛ లేని పరిస్థితిలో. డబ్బు సమాజంలో గౌరవం ఇస్తుంది. గుర్తింపు ఇస్తుంది.
ఒకప్పుడు మద్రాస్‌లో ఒక వెలుగు వెలిగిన ఎస్ వరలక్ష్మి కారులో వెళుతుంటే డ్రైవర్‌ను ఆపి కానిస్టేబుల్ ఏదో ప్రశ్నించి వాదనకు దిగాడట! ఎస్ వరలక్ష్మి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తే, ఆ కానిస్టేబుల్ కనీసం పట్టించుకోలేదు. ఎస్ వరలక్ష్మి నవ్వుకుని కానిస్టేబుల్‌కు ఒక నోటు ఇవ్వగానే వెళ్లి పొమ్మని దారి చూపాడట! గొల్లపూడి మారుతీరావు ఈ విషయాన్ని ఇటీవల రాశారు.
ఎస్ వరలక్ష్మి తెలుగు తమిళ సినిమాల్లో కొన్ని దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగిన నటి. ఆ రోజుల్లో ఆమెను గుర్తించని వారు లేరు. ఆ ట్రాఫిక్ పోలీస్ కొత్త తరానికి చెందిన వాడు. పాత తరంలో ఎస్ వరలక్ష్మి కీర్తి గురించి అతనికి తెలియదు. కీర్తి ప్రతిష్టలకు కాల పరిమితి ఉంటుంది కానీ డబ్బుకు కాలపరిమితి ఉండదు. ఎప్పుడైనా డబ్బు శక్తివంతమైంది. డబ్బుకు మనం విలువ ఇస్తే అది మనకు విలువ ఇస్తుంది. గత కాలంలో తెలుగు సినిమాల్లో, తెలుగు సాహిత్యంలో పేదరికానికి చాలా గ్లామర్ కల్పించారు. పేదరికాన్ని గ్లామరైజ్ చేసిన వారు కూడా డబ్బు సంపాదన కోసమే ఆ పని చేశారు తప్ప పేదరికాన్ని ప్రేమించేందుకు కాదు. చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా సంపాదించడం, సంపన్నులు కావడం తప్పు కాదు.
*
-బి.మురళి(ఆంధ్రభూమి ఆదివారం 20-5-2018)

18, మే 2018, శుక్రవారం

పిడకలు -ప్లిప్ కార్ట్ -ప్రజాస్వామ్యం

‘‘ఈ కాలం పిల్లలకు బొత్తిగా లోకజ్ఞానం లేకుండా పోయిందండీ రావుగారూ! ఆన్‌లైన్‌లో.. అదే ప్రపంచమని బతికేస్తున్నారు.’’
‘‘స్మార్ట్ ఫోన్  పుట్టినప్పటి నుంచి ఉన్నదే కదా? ఇప్పుడు కొత్తగా ఏమైందని?’’
‘‘అది కాదండీ రావుగారూ.. మా వాడు ఏమన్నాడో తెలుసా? అన్‌లైన్‌లో ప్రజాప్రతినిధుల అమ్మకాలు, కొనుగోళ్లు చేయవచ్చు కదా? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు క‘ర్నాటకం’ ఎందుకు? అని అంటున్నాడు’’
‘‘ఐదు రోజుల మ్యాచ్‌ను ఎంజాయ్ చేసిన తరం మనది, 20ట్వంటీని కూడా బోర్ అంటున్న తరం వాళ్లది. వాళ్లకు బాల్ బాల్‌కూ ఫలితం తేలిపోవాలి.’’
‘‘అది కాదురా అని అబ్బాయికి రాజకీయం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తే వాడేమన్నాడో తెలుసా? మరీ చాదస్తంగా మాట్లాడకు డాడీ నాలెడ్జ్ లేనిది నాకు కాదు మీకే... ఇంకా సంచీ పట్టుకుని షాప్‌కు వెళ్లి పప్పులు, ఉప్పులు తేవడం కాదు. అప్‌డేట్ కావాలి. కూరగాయలు కోసం అమ్మతో కలిసి సంతకు వెళ్లడం కాదు. ‘బిగ్ బాస్కెట్’కు ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తే పాలకూర కట్టలు కూడా ఇంటికొచ్చి ఇచ్చి పోతారని నాకే క్లాస్ తీసుకుంటున్నాడు. రెండు రూపాయలు విలువ చేసే పాలకూర కట్ట ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. ఫ్లిప్‌కార్ట్ వాడు పది రూపాయలకు మూడు పిడకలు ఆన్‌లైన్‌లో అమ్ముతున్నాడు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రజాప్రతినిధుల ధర పిడకల కన్నా తక్కువగా ఉంటుందా? ఆన్‌లైన్‌లో ఎందుకమ్మరు? అని ప్రశ్నిస్తున్నాడు. ’’
‘‘నాకూ అలానే అనిపిస్తుంది. స్టార్ హోటల్స్, క్యాంపు లు ఇవన్నీ అవసరమా? ఆన్‌లైన్‌లో అమ్మకాలు జరిపి, అమ్మకం పన్ను కూడా వసూలు చేస్తే ప్రభుత్వానికి బోలెడు ఆదాయం. సమయం ఆదా అవుతుంది. ఫ్లిప్‌కార్టును వాల్‌మార్ట్ వాళ్లు కొన్నారట కదా? అమెరికా వాడి తెలివే తెలివి. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో దొరకనివి కూడా ఇప్పుడు దొరుకుతాయి చూస్తూ ఉండండి.. ఫ్లిప్‌కార్టును వాల్‌మార్ట్ చేపట్టగానే ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధుల అమ్మకాలు కూడా ఆన్‌లైన్‌లో మొదలవుతాయి. అసలు ధర ఎంతో తెలియక రహస్యంగా అమ్మకాలు, కొనుగోళ్లు సాగడం వల్ల అమాయకులు త క్కువ ధరకు అమ్ముడు పోతున్నారు. ప్రజాస్వామ్యం అన్నప్పుడు అందరికీ సరైన ధర లభించాలి. ఆన్‌లైన్‌లో అయితే అమ్మేవారికి, కొనేవారికి న్యాయం జరుగుతుంది. దేశ వ్యాప్తంగా అన్ని మార్కెట్‌లను ఆన్‌లైన్ చేసినప్పుడు ‘ప్రజాస్వామ్యం’ అమ్మకాలను ఆన్‌లైన్ ఎందుకు చేయరు? అదే జరిగితే ఫలితాలు వచ్చిన గంటలోనే కర్నాటకలో పాలన మొదలయ్యేది. ఇలా ఐతే ప్రజాస్వామ్యం ఎలా ముందుకు వెళుతుంది? ’’
‘‘రావుగారూ మీకు కామర్స్ తెలుసుకానీ, రాజకీయాలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటే ఏమీ తెలియదు! అబ్బాయితో అంటే వాడేమన్నాడో తెలుసా? ’’
‘‘ప్రపంచం మారిపోయిందన్న విషయం నీకే తెలియడం లేదు డాడీ! గ్రామ సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కోసం గ్రామాల్లో వేలం వేస్తారు. వచ్చిన డబ్బును గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు. గ్రామానికి వర్తించిన ఈ సూత్రం మొత్తం నియోజక వర్గానికి అప్లై చేసి వేలం వేస్తే వందల కోట్లు వస్తాయి.. ఆ నిధులను నియోజక వర్గ అభివృద్ధికి ఖర్చు చేయవచ్చు. జిఎస్‌టి వసూలు చేయవచ్చు. మహారాష్టల్రో పండే సంత్రాలను, కాశ్మీర్‌లో పండే ఆపిల్స్‌ను రైతులు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అలానే నేతలు ఒక ప్రాంతంలో అమ్ముడు పోవడం ఏమిటి? మార్కెట్ ఎక్కడుంటే అక్కడ లభించాలి. ఉల్లిగడ్డలు ఎక్కడైనా అమ్ముకోవచ్చు కానీ ప్రజాస్వామ్యంలో అత్యంత ఖరీదైన నేతలకు ఈ సౌకర్యం ఉండొద్దా? మొన్న బాబాయ్ బెంగళూరులో ఉద్యోగం వచ్చిందని వెళ్లిపోతూ ఇక్కడ ఓటును రద్దు చేసుకుని అక్కడ నమోదు చేసుకున్నాడు కదా? ఓటరు దేశంలో ఎక్కడికి వెళ్లినా తన ఓటును అక్కడ నమోదు చేసుకోవచ్చు. మరి ఓటరుకు ఉన్న సౌలభ్యం నేతలకు ఎందుకు ఉండరాదు? ఒకసారి గెలిచిన వారు దేశంలో ఎక్కడైనా చెలామణి కావాలి. దీని వల్ల గిట్టుబాటు ధర లభిస్తుంది. అవసరం అయిన వారికి సరైన ధరలో నేతలు లభిస్తారు. టెక్నాలజీ లేక ముందు రాసుకున్న నిబంధనలు మార్చాల్సి అవసరం ఉంది డాడీ అని మా వాడు వాదిస్తున్నాడండి. పాలన అంటే పాలకూర కట్టలు కొనడం అనుకున్నారా? ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడం అంత ఈజీ కాదు.’’
‘‘మీరు ఎంఏ పొలిటికల్ సైన్స్ అని తెలుసు?’’
‘‘ప్రజాస్వామ్యం పాఠ్యపుస్తకాల్లో ఉన్నట్టు ఉండదని నాకు తెలియదా? నేనన్నది నేతలను కొనడం అంత ఈజీ కాదు అని. కర్నాటకలో వైస్రాయ్ హోటల్ లేకపోవడమే అసలు సమస్య అని ఓ కుర్రకుంక అంటున్నాడు. అసలు వీళ్లకు రాజకీయం ఏం తెలుసు? వైస్రాయ్ హోటల్ వల్లనే అధికారం వస్తే ఆ హోటల్ ఓనరే సీఎం అయ్యేవాడు. రాజకీయాలంటే ఎన్ని తెలివి తేటలు ఉండాలి? విలువలు మరచి నీతులపై ఉపన్యాసాలు ఇవ్వాలి. ఏం మాట్లాడతారు.. తెలిసీ తెలియకుండా! మార్కెట్‌లో వినియోగదారుడే దేవుడు కానీ డెమొక్రటిక్ మార్కెట్‌లో క్రయవిక్రయాలు ఈజీ కాదు. ఆ మధ్య కొనుగోళ్లకు వెళ్లి 50 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చి చివరకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. హైదరాబాద్‌లో పొరుగు రాష్ట్రం పోలీస్ స్టేషన్లు పెడతాం అని వార్నింగ్ ఇచ్చిన వాళ్లు. కొనుగోళ్ల వ్యవహారం కెమెరాకు, కొన్నవారి గొంతు సెల్‌ఫోన్‌కు చిక్కగానే పదేళ్ల ఉమ్మడి బంధం కూడా వదులుకొని రాత్రికి రాత్రి సొంత ఊరు వెళ్లాల్సి వచ్చింది. ’’
‘‘అయినా ఇవీఎంలను రిమోట్‌తో కంట్రోల్ చేసి కావలసిన ఫలితాలు తెచ్చుకున్నారట కదా? అదేదో సరిగా ఆపరేట్ చేయవచ్చు కదా? ఎటూ కాకుండా ఈ ‘హంగ్’ లెక్కలెందుకు?’’
‘‘చూడండి.. రావుగారూ.. పైకి చెప్పుకోవడానికి మొహమాట పడతాం ప్రతివాడూ మేధావే. ఫలితాలు ఇలా వస్తాయని ఒక లెక్క చెబుతాం. ఫలితాలు వచ్చాక మన అంచనా నిజం కాకపోతే మన ఇగో హర్ట్ అవుతుంది. ఇవీఎంలను మేనేజ్ చేశారని మన ఈగోను సంతృప్తి పరుచుకుంటాం.’’
‘‘సరే.. ఇంతకూ గద్దె ఎవరికి? ?’’
‘‘ఏ దేశమైనా 11 మంది బృందంతో క్రికెట్ అడుతుంది. కానీ పాకిస్తాన్ జట్టు మాత్రం పనె్నండు మందితో ఆడుతుంది- అని ఆప్పట్లో ఓ జోక్. అంటే- రిఫరీ కూడా వారి జట్టులో సభ్యుడే’’
‘‘అది కాదండీ.. నేను కర్నాటక గురించి అడిగితే మీరు పాక్ క్రికెట్ జట్టు గురించి మీరేదో చెబుతున్నారు’’
‘‘మీరడిగిందే నేను చెప్పానండి రావుగారూ.. మీరే అర్థం చేసుకోలేదు’’

  ‘‘ విశ్వ శాంతి , దేశాభివృద్ధి ,ఆంధ్రకు ప్రత్యేక హోదా కోసం పదిమంది కర్ణాటక ప్రతిపక్ష సభ్యులు అధికార పక్షానికి మద్దతు ఇచ్చినట్టు తెల్లవారు జామున కల వచ్చింది . నిజమవుతుందా ?’’
‘‘ తెల్ల వారు జామున వచ్చిన కళలు నిజమవుతాయి ’’
‘‘ప్రజాస్వామ్యం లో విలువలు రోజు రోజుకు పెరుగుతున్నాయి . ఒకప్పుడు కోటి రూపాయలు పలికిన సరుకు ఇప్పుడు వంద కోట్లు పలుకుతుందట . నిజానిజాలు స్వామికి తెలియాలి ’’
‘‘ఏ స్వామికి ?’’
‘‘వెంకన్న స్వామికి 
‘‘పాపం ఆయనే  కష్టాల్లో ఉన్నారు .’’ 
-బుద్దా మురళి (జనాంతికం 18-5-2018)

14, మే 2018, సోమవారం

జమున విజయరహస్యం

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 జగన్నాథ ఆలయం సమీపంలోని రోడ్డు గుండా వెళితే అడవిని తలపించే అపార్ట్‌మెంట్. పేరుకు అది అపార్ట్‌మెంట్ అయినా విశాలమైన ఆవరణ, కృత్రిమంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫాల్స్. అటవీ ప్రాంతానికి వచ్చామేమో అనిపిస్తుంది.
ఆ అపార్ట్‌మెంట్‌లో విశ్రాంతి జీవితం గడుపుతున్న జమునను కలవడానికి వెళ్లినప్పుడు ఏ జర్నలిస్టుకైనా ముందు కళ్ల ముందు కనిపించే వాస్తవం ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆ కాలం నాటి నటీనటులు చాలా మంది మహానటులుగా గుర్తింపు పొందినా అంతిమ దశలో మాత్రం దయనీయమైన జీవితం గడిపారు. కానీ జమున జీవితం దీనికి భిన్నంగా ఉంది. వయసు మీద పడినా తగ్గని ఆత్మవిశ్వాసం. దేవుడి దయవల్ల ఇంకా నలుగురికి సహాయం చేసే స్థితిలోనే ఉన్నాను అని చెప్పారు.
***
ఆర్థికంగా బలహీనంగా ఉండడం మనిషిని నిర్వీర్యం చేస్తుంది. డబ్బుకు పేదవాళ్లం కానీ గుణానికి కాదు అనే గంభీరమైన డైలాగులు సినిమాల వరకు బాగానే ఉంటాయి. కానీ మనిషిని బలహీనుడిగా మార్చేస్తాయి.
ఆర్థికంగా ఫరవాలేదు అనుకున్నప్పుడు మనిషి ఆత్మవిశ్వాసంతో ఉండగలడు.
తెలుగు సినిమా రంగంలో ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్‌ను రెండు కళ్లు అంటూ సినిమా వాళ్లు ఇప్పటికీ చెబుతుంటారు. ఆ రెండు కుటుంబాల పట్టు సినిమా రంగంపై ఇంకా ఉండడం వల్ల వీరు పోయి ఇంత కాలం అయినా అదే మాట మాట్లాడతారు. ఇక మనకు సినిమాల్లో అవకాశాలు అవసరం లేదు అనుకున్న వయసులో సహజకవి మల్లె మాల లాంటి వారు ఎన్టీఆర్ గురించి నిర్మొహమాటంగా తన మనసులోని అభిప్రాయాన్ని రాసిన పుస్తకాన్ని వెంటనే మార్కెట్ నుంచి వెనక్కి తెప్పించుకోవలసి వచ్చింది. మల్లెమాలకు సినిమాల్లో ఇక భవిష్యత్తు లేదని ధైర్యంగా రాశాడు. కానీ మల్లెమాల కుమారుడికి ఇంకా భవిష్యత్తు ఉంది కాబట్టి ఆ పుస్తకాన్ని మార్కెట్ నుంచి వెనక్కి తెప్పించారు. 76ఏళ్ల వయసులో ఈ మధ్య చంద్రమోహన్ కూడా ధైర్యంగా ఎన్టీఆర్ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక సినిమాలో ఎన్టీఆర్‌కు తమ్ముడిగా చంద్రమోహన్‌ను ఎంపిక చేశారు. షూటింగ్‌కు సిద్ధమై రిహార్సల్స్ చేసుకుంటుంటే బాలకృష్ణను ఆ పాత్రకు ఎంపిక చేశారు. ఇక జీవితంలో ఎన్టీఆర్‌తో నటించవద్దని నిర్ణయించుకున్నాను. ఎన్టీఆర్ నీకో మంచి పాత్ర ఇస్తాలే బ్రదర్ అన్నాడట! ఆయన ఆఫర్ చేశాక రిజెక్ట్ చేయాలని అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఎలాంటి ఆఫర్ చేయలేదని, నిర్మాత ద్వారా విషయం తెలిసిన ఎంజి రామచంద్రన్ తనతో పాటు నటించేందుకు తమిళ సినిమాలో అవకాశం ఇచ్చారని చంద్రమోహన్ చెప్పారు. ఆర్థికంగా బలంగా ఉన్న చంద్రమోహన్ ఇప్పుడు భయపడాల్సిన స్థితిలో లేరు. అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన వయసు కాదు. దాంతో ధైర్యంగానే మాట్లాడేశారు.
ఎన్టీఆర్ మరణించి రెండు దశాబ్దాల గడిచిన తరువాత కూడా ఆయనపై ఎవరికైనా వ్యతిరేక అభిప్రాయం ఉంటే వ్యక్తం చేయలేని పరిస్థితి. అలాంటిది ఎన్టీఆర్ సినిమాల్లో ఒక వెలుగు వెలుగుతున్న కాలంలో ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడడం అంటే ఊహించగలమా? అదీ సినిమాల్లో ఆయనతో హీరోయిన్‌గా నటించే నటి ఒకరిని కాదు ఏకంగా రెండు కళ్ల వ్యతిరేకతను తట్టుకుని సినిమా రంగంలో బతికి బట్టకట్టడం అంటే ఊహించగలమా?
అసాధ్యం అనుకున్న దీన్ని జమున సాధ్యం చేసి చూపించింది.
మీలో ఇంతటి ధైర్యానికి కారణం ఏమిటని ఆసక్తిగా ఆమెను అడిగినప్పుడు 1930-40 ప్రాంతంలోనే మా నాన్న ఎగుమతి వ్యాపారంలో ఉన్నారు. పసుపు, పొగాకు విదేశాలకు ఎగుమతి చేసేవారు. మా నాన్న కలిగించిన ఆత్మవిశ్వాసమే నా ధైర్యానికి కారణం అంటూ చెప్పుకొచ్చారు.
ఎంతో మంది మహానటులు సినిమాల్లో ఎంతో ఉన్నత స్థానానికి వెళ్లి చివరి దశలో చితికి పోయి పూట గడవడమే కష్టం అయిన దశకు చేరుకున్నారు. ధనం- మూలం పేరుతో అలాంటి నటుల గురించి వరుసగా రాస్తూ జమున అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాను. చాలా మంది నటీనటులు ఆర్థికంగా చితికి పోయారు. నటులకు ఇదేమైనా శాపమా? ఈ శాపం నుంచి మీలాంటి నటులు ఎలా తప్పించుకున్నారని ప్రశ్నిస్తే, ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
‘‘ఒకరికి పైసా అప్పు ఇచ్చేది లేదు, ఒకరి వద్ద అప్పు తీసుకునేది లేదు. నేను మొదటి నుంచి దీనికి కట్టుబడి ఉన్నాను. ఇష్టపూర్వకంగా సహాయం చేశాను కానీ అప్పు ఇవ్వలేదు.. సావిత్రి, నాగయ్య, కాంతారావు వారు వీరు అని కాదు సినిమా రంగానికి చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నది సినిమాలు తీయడం వల్ల. వ్యసనాల వల్ల ఆస్తి కరిగిపోదు. కొంత ఆర్థికంగా నష్టపోవచ్చు కానీ వ్యసనాల వల్ల ఆస్తులు కరిగిపోయిన వారు ఎవరూ లేరు. నిర్మాతగా సినిమాలు తీయడం వల్ల దెబ్బతిన్న వారే ఎక్కువ. మనం నటులం నటనకే పరిమితం కావాలి అని మొదటి నుంచి అనుకున్నాను. దానికే కట్టుబడి ఉన్నాను. నిర్మాతగా మారి ఉంటే నా పరిస్థితి కూడా దెబ్బతినేది. భానుమతి మాత్రం నిర్మాతగా మారినా దెబ్బతినలేదు. దానికి కారణం వారికి స్టూడియో ఉండడం వల్ల. సావిత్రి నిర్మాతగా సినిమా తీయడం వల్లనే ఆర్థికంగా దెబ్బతిన్నారు. జెమినీ గణేషన్‌కు మార్కెట్ ఉన్న సమయంలో సినిమా మొదలైంది. హఠాత్తుగా మార్కెట్ పడిపోయింది. సినిమా ఆలస్యం అయింది. జెమినీ గణేషన్ మార్కెట్ మళ్లీ పుంజుకుంది. ఆ సమయంలో సినిమాను అమ్మేసుకుంటే సావిత్రి దెబ్బతినేది కాదు. కానీ తానే స్వయంగా విడుదల చేయడం, సినిమా విడుదల సమయానికి జెమినీ గణేషన్ మార్కెట్ మళ్లీ పడిపోవడంతో చేతులు కాల్చుకుంది. మిస్సమ్మ సినిమాలో నటించినందుకు ఆ రోజుల్లో నిర్మాతలు పదిహేనువేల పారితోషికం లేదా కారు ఇస్తామని చెప్పారు. ఆ సినిమాలో ముఖ్యనటులు అందరికీ ఇదే ఆఫర్. అప్పుడు నేను కారు తీసుకున్నాను. అంతకు ముందు కారు తీసుకోవాలని కొందరు చెప్పినా మా నాన్న మాత్రం అవకాశాలు ఎలా ఉంటాయో తెలియదు. తొందర పడి కారు తీసుకుంటే తరువాత అవకాశాలు లేకపోతే ఇబ్బంది పడతావు అని నాన్న చెప్పారు. ప్రారంభం నుంచే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉన్నాను. భూములు కొన్నాను. భవనాలు కొన్నాను. మేడ్చల్‌లో 50 ఎకరాల భూమిని ఆ మధ్య మా అబ్బాయి అమెరికాలో ఇళ్లు నిర్మించుకోవడానికి అమ్మేశాను’’ అంటూ చెప్పారు. తెలుగు సినిమాకు రెండు కళ్లు ఎన్టీఆర్ ఎఎన్‌ఆర్ ఆ రోజుల్లో జమునను బహిష్కరించినప్పుడు ఆమె అస్సలు భయపడలేదు. ఆ సమయంలోనే హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా మంచి అవకాశాలు వచ్చాయి. తెలుగులో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. సారీ చెప్పేందుకు జమున ససేమిరా అన్నారు. చివరు టీ కప్పులో తుఫానులా ఎవరూ సారీ చెప్పకుండానే వివాదం సమసిపోయింది. ఆర్థిక అంశాల్లో మొదటి నుంచి ఒక ప్రణాళికా బద్ధంగా ఉండడం, సంపాదించిన డబ్బును సరైన విధంగా ఇనె్వస్ట్ చేయడం వల్ల జమున ఎప్పటికీ జముననే అనుకునేట్టు ఆత్మవిశ్వాసంతో బతక గలుగుతున్నారు. ఒక్క సినిమా రంగం అనే కాదు ఏ రంగంలోనైనా చాలా మంది అధికారం చలాయించిన వారు చివరి దశలో ఆర్థికంగా బలంగా లేకపోవడం వల్ల దయనీయంగా బతుకుతారు. మొదటి నుంచి సరైన విధానంలో ఆర్థిక ప్రణాళిక రూపొందించుకున్న వారికి చివరి దశ కూడా సంతోషంగా గడిచిపోతుంది. అది మన చేతిలోనే ఉంది. మన ఆలోచనలే మన తలరాతలను రాస్తాయి. మన తలరాతలను మరెవరో రాయరు. 1936 ఆగస్టు 30న హంపిలో జన్మించిన జమున 82ఏళ్ల వయసులోనూ ఆత్మవిశ్వాసంతో బతుకుతున్నారంటే ప్రారంభ కాలంలో ఆమె జీవన విధానమే కారణం.
--బి.మురళి
(ఆంధ్ర భూమి 6-5-2018)

జ్ఞానం ఉంటే.. సంపద మీ వెంటే..

లక్ష్మి, సరస్వతి .. ఈ ఇద్దరూ ఒకరున్న చోట మరొకరుండరు అంటారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న కాలం ఇది. ఎక్కడ సరస్వతీ దేవి ఉంటే అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటోంది. ఒకప్పుడు సంపన్నుల సంతానం మాత్రమే ధనికులు. ఇప్పుడు సరస్వతి కటాక్షం ఉంటే లక్ష్మి వారిని వెతుక్కుంటూ వస్తోంది. బెంగళూరు ఐటి కంపెనీలో ఉద్యోగం చేసే నిజామాబాద్ కుర్రాళ్ల మెదడులో పురుడు పోసుకున్న ‘రెడ్‌బస్’ ఆలోచన వారిని సంపన్నులుగా మార్చింది. వారిని కోటీశ్వరులుగా మార్చింది సరస్వతి దేవే. ఆలోచనలే మనుషులను సంపన్నులుగా మారుస్తున్న కాలం ఇది.
‘డబ్బు డబ్బును ఆకర్షిస్తుంది..’- అనేది పాతమాట. మనకు ప్రతి రోజు కొన్ని వేల ఆలోచనలు వస్తాయి. వాటిని ఆచరణలో పెట్టిన వారే విజేతలవుతారు. పూర్వకాలంలో సాంప్రదాయ వ్యాపారంలో ఉన్న వారికి సరస్వతి తోడు ఉండడం అచ్చిరాలేదేమో! సరస్వతి, లక్ష్మి ఒకే చోట ఉండరనే మాట ఆ కాలనికి సరిపోవచ్చు. ఇప్పుడు ఒకటి లేకపోతే మరొకరటి ఉండదు. సరస్వతి లేకపోతే లక్ష్మీదేవి ఈ కాలంలో ఎక్కువ రోజులు నిలువదు.
ప్రపంచంలో ప్రముఖ కంపెనీల సిఇఓలందరికీ ప్రధానంగా ఉండే అలవాటు ఏమిటంటే ప్రతినిత్యం ‘చదవడం’. సిఇఓలే కాదు, ఏ రంగంలో ఉన్న వారిలోనైనా కామన్‌గా కనిపించే అలవాటు ఇది. కొంత ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ‘పోర్బ్స్’ జాబితాలో చోటు సంపాదించుకున్న ప్రపంచ సంపన్నులు, ప్రముఖ కంపెనీల సిఇఓలకు బాగా చదివే అలవాటుంది. చదవడం నుంచే వారు విశ్రాంతి పొందుతున్నారు. వారు పని చేసే రంగానికి సంబంధించిన కొత్త ఆలోచనలను పుస్తకాలు చదవడం నుంచి పొందుతున్నారు.
రాజకీయాల్లోనూ బాగా చదివే అలవాటున్నవారు రాణిస్తున్నారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినా కొత్త కొత్త ఆలోచనలతో దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు బాగా చదివే అలవాటు దీనికి దోహదం చేసింది. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సిఇఓల అలవాట్లపై ఇటీవల ఒక సర్వే నిర్వహించారు. బాగా చదివే అలవాటు తమను ఉన్నత స్థితికి తీసుకు వెళ్లిందని వారు పేర్కొన్నారు.
ప్రఖ్యాత కంపెనీల సిఇఓలు ఏటా సగటున 60 పుస్తకాలు చదువుతున్నట్టు తేలింది. ఎక్కువగా వీరు తమ రంగానికి సంబంధించిన పుస్తకాలు, జీవిత చరిత్రలు, మానవ సంబంధాలు, వృత్తిలో నైపుణ్యానికి సంబంధించిన పుస్తకాలు చదువుతున్నారు. సక్సెస్ సాధించిన వారి జీవిత చరిత్రలను చదవడం వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు, వాటిని అధిగమించిన తీరు తమకు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ‘ఫేస్‌బుక్’ సృష్టికర్త జుకర్ బర్గ్ యూనివర్సిటీ చదువును మధ్యలోనే ఆపినా పుస్తకాలు చదివే అలవాటు తనకు ఎంతగానో ఉపయోగపడిందని చెబుతుంటారు. ప్రపంచంలో ఇనె్వస్ట్‌మెంట్ గురుగా పేరుపొందిన వారెన్ బఫెట్‌కు పుస్తకాలు బాగా చదివే అలవాటుంది. 11ఏళ్ల వయసు నుంచే పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టి 13 ఏళ్ల వయసు నుంచి ఆదాయ పన్ను చెల్లిస్తున్న బఫెట్‌కు పుస్తకాలే పెట్టుబడులకు సంబంధించిన గురువులు. ప్రపంచ సంపన్నుల ఫోర్బ్స్ జాబితాలో ఈసారి మూడవ స్థానంలో నిలిచిన బఫెట్‌కు- అత్యంత ఇష్టమైన పని పుస్తకాలు చదవడం. అన్ని రకాల పుస్తకాలు ఆయన చదువుతారు. ఏ కంపెనీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుటుంది? అనే అంశాలపై కొత్త ఆలోచనలను ఆయనకు పుస్తకాల నుంచే లభిస్తుంది. ‘నేను రోజుకు కనీసం ఐదువందల పేజీలు చదువుతాను. ఇలా చదవడం ద్వారా వచ్చిన జ్ఞానం చక్రవడ్డీలా ఉపయోగపడుతుంది’ అని ఆయన చెబుతారు. ఈ రోజుల్లో పుస్తకాలు కొనడం ఖరీదైన వ్యాపకం ఏమీ కాదు. పైగా ఇంటర్‌నెట్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పుస్తకాలు మన అర చేతిలో ఇమిడిపోతున్నాయి.
చాలా మందికి పుస్తకం చదవాలంటే బద్ధకం. జుకర్ బర్గ్ 2015 నుంచి నెలకు రెండు పుస్తకాలు చదవాలని నిర్ణయించుకున్నారట! ఇప్పటికీ ఆచరిస్తున్నారు. మంచి పుస్తకాలు పెద్ద ఎత్తున సేకరిస్తున్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అపూర్వమైన, అరుదైన వేలాది పుస్తకాలను సేకరించి నెట్‌లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రాజెక్టు చేపట్టారు. ఆయన కుమారుడు ఈ ప్రాజెక్టు నిర్వహిస్తున్నారు. దీన్ని అనవసర ఖర్చుగా వారు భావించడం లేదు. భారతీయ జ్ఞాన సంపదను అందరికీ అందుబాటులో తీసుకు వచ్చే ప్రయత్నంగా భావిస్తున్నారు. నారాయణమూర్తి భార్య సుధామూర్తి పుస్తకాలు చదవడమే కాదు, చాలా పుస్తకాలు రాశారు. వివిధ గ్రంథాలయాలకు వీరు పెద్ద సంఖ్యలో పుస్తకాలు సమకూర్చుతున్నారు. మైక్రోసాఫ్ట్ సిఇఓ బిల్‌గేట్స్ ఎంత బిజీగా ఉంటున్నా వారానికి ఒక పుస్తకం చదవాలనే నియమం పెట్టుకుని కచ్చితంగా పాటిస్తున్నారు. జీవితంలో విజయం సాధించాలంటే పుస్తకాలు చదవాలంటారు ఆయన.
ఇక, ఆర్థికంగా విజయం సాధించిన వారు రోజూ కనీసం అరగంట పాటు చదువుతారని సర్వేలో తేలింది. ఎక్కువగా జీవిత చరిత్రలు, చరిత్ర, రాజకీయ పరిణామాలు, కంపెనీల విజయగాధలకు సంబంధించిన పుస్తకాలు చదువుతున్నారు. సంపద కూడబెట్టుకోవడం అంటే అంతా డబ్బు రూపంలోనే కాదు. ఆరోగ్యంగా ఉండడం, మానసికంగా బలంగా ఉండడం, జీవితాన్ని ఆస్వాదించడం అన్నీ సంపదనలే. జ్ఞాన సముపార్జన కూడా ధనమే. కంటికి కనిపించక పోవచ్చు కానీ అదీ ఆరోగ్యమే. సంపాదన మరింత పెరగాలంటే జ్ఞాన ధనం ముఖ్యం.
--బి.మురళి
(ఆంధ్రభూమి 13-5-2018)

11, మే 2018, శుక్రవారం

ఇది.. గుండెపోటు తనం!

ఏరా..? అంత దిగులుగా ఉన్నావు? ప్రధానమంత్రి పదవికి ఓకే అని రాహుల్, సిఎం పదవికి సిద్ధం అని రేవంత్ ప్రకటించారు.. ఇంకెందుకు దిగులు. ఈ దేశం మరీ గొడ్డు పోలేదు. పాలించేందుకు ఎవరో ఒకరు వస్తారులే దిగులు పడకు’’
‘‘నా దిగులుకేం కానీ, నాకన్నా ఎక్కువ దిగులుగా కనిపిస్తున్నావ్? ఏమైంది?’’
‘‘ దిగులు నా కోసం కాదు.. కర్నాటక ఎన్నికల కోసం ’’
‘‘పోటీ చేస్తున్న ఏదో ఒక పార్టీ గెలుస్తుంది. ఏవరో ఒక నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు. దానికంత దిగులెందుకు? కాలం కలిసొస్తే పోటీ చేయని నాయకుడు కూడా ముఖ్యమంత్రి కావచ్చు. కింగ్ మేకరే కింగ్ కావచ్చు. ఐనా కర్నాటక ప్రజలకు లేని దిగులు నీకెందుకు? పదవి పోతుందేమోనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, పరువుపోతుందేమోనని ప్రచారం చేసిన ప్రధాని మోదీ దిగులుపడితే అర్థం ఉంది? ఊళ్లోపెళ్లికి ఎవరిదో హడావుడి అన్నట్టు వారికి లేని దిగులు నీకెందుకోయ్’’
‘‘నేను కూడా సరిగ్గా ఈ విషయంలోనే దిగులు పడుతున్నాను. నువ్వన్నట్టు ఎవరి పెళ్లికో ఎవరి హడావుడినో అన్నట్టు. కర్నాటక ఎన్నికలకు తెలుగు వారి హడావుడి చూస్తుంటే, ఫలితాలు వచ్చాక ఏమవుతుందా? అని దిగులవుతుంది. అమెరికాలో ఎవరు గెలవాలో, కర్నాటకలో ఎవరు ఎవరిని ఓడించాలో, కులాల వారిగా తెలుగువారు ఫత్వాలు జారీ చేస్తుంటే, ఫలితాలు వచ్ఛాక ఓడినవారు ప్రతీకార ఫత్వాలు జారీ చేస్తే ఎలా ఉంటుందా? అని దిగులు. మన వాళ్లు అక్కడి తెలుగు వాళ్ల కోసం తెలుగులో జారీ చేసిన ఫత్వాను- తెలుగు రాదు కాబట్టి ట్రంప్ చదవలేదు గనుక బతికి పోయాం. కన్నడ భాషకు తెలుగు భాష దగ్గరగా ఉంటుంది. మన ఫత్వా వాళ్ల దృష్టిలోనూ పడింది. ఫలితాలు తేడాగా వస్తే. మన వాళ్ల పరిస్థితి?’’
‘‘మరీ అతిగా ఊహిస్తున్నావోయ్! ఐటీ కంపెనీల్లో ఉద్యోగం కోసం వెళ్లే మన వాళ్లు ఓటర్లుగా నమోదు చేయించుకోవడం, క్యూలో నిలబడి ఓటు వేయడం, ఫత్వాను పాటించడం జరిగే పనేనా? పోనీ ఎప్పటి నుంచో ఉన్న తెలుగువాళ్ల ఓట్లు భారీగా ఉన్నాయనుకున్నా, కులం, ఉప కులం, తెగ అన్నీ చూసుకునే ఓటు వేస్తారు.  హిల్లరీ సలహా సంఘం లో మనవాళ్ళు , ట్రంప్  సలహా సంఘం లోనూ మన వాళ్ళు దూరి పోయారు . ఇద్దరిలో ఎవరు గెలిచినా ఫలించిన తెలుగు వ్యూహం అంటాం . హిల్లరీ గెలవాలి అని పత్వా ఇచ్చింది మనమే . ట్రంప్ గెలవాలని కాశీలో పూజలు చేయించింది మనమే . ఇద్దరిలో ఎవరు గెలిచినా మనదే గెలుపు . మన వాళ్ళు ఎక్కడున్నా పది మంది తెలుగు వాళ్లకు సగటున పన్నెండు సంఘాలు ఉంటాయి .  ఒకే కుటుంబం నుంచి భార్య ఒక పార్టీ నుంచి మంత్రి , భర్త మరో పార్టీ నుంచి పదవి . కుటుంబమే వేరు వేరు పార్టీలుగా చీలిన ఈ రోజుల్లో మన పత్వా పని చేస్తుందా ?  అన్ని పార్టీలకూ ఆ ఓట్లు చీలిపోతాయి నువ్వేమీ కంగారుపడకు. ’’
‘‘సరే కానీ- నా దిగులు సంగతి చెప్పాను. మరి ఇంతకూ నీ దిగులెందుకో చెప్పనే లేదు’’
‘‘నీది మరీ లోకల్ సమస్య.. నాది విశ్వమానవ సమస్య’’
‘‘ఏంటది?’’
‘‘మూడు రోజులు తక్కువ 500 కోట్ల సంవత్సరాల్లో సూర్యుడు అంతమవుతాడట!’’
‘‘ఇదేం లెక్క జ్యోతిష్కుడు చెప్పాడా? ’’
‘‘కాదు.. సైంటిస్ట్‌లే మూడు రోజుల క్రితం- ఐదువందల కోట్ల సంవత్సరాల్లో సూర్యుడు అంతరిస్తాడని చెప్పారు. నేను ఆ మూడు రోజులు మినహాయించి చెప్పాను.’’
‘‘ఏమండోయ్! సూర్యుడు అంతరిస్తే ఇక మనం సంసారం చేసినట్టే. ఏసీ పెట్టుకున్నప్పటి నుంచి కరెంటు బిల్లు భరించలేకపోతున్నానని ఇప్పటికే ఏడుస్తున్నారు. ఇక సూర్యుడు అంతరిస్తే కచ్చితంగా పగలు లైట్లు తప్పవు. విద్యుత్ బిల్లు రెట్టింపు అవుతుంది. ఇప్పుడే చెబుతున్నాను. కావాలంటే మీ సిగరేట్ల ఖర్చు, సినిమాలు, టీ ఖర్చు తగ్గించుకోండి. అంతే కానీ విద్యుత్ బిల్లు పెరుగుతోందని ఇంటి ఖర్చు తగ్గిస్తే మాత్రం ఊరుకునేది లేదు.’’
‘‘నాన్నోయ్.. సూర్యుడు అంతరిస్తే ఇక మేం స్కూల్‌కు వెళ్లాల్సిన అవసరం లేదా?’’
‘‘ఏదో ముతక సామెత చెప్పినట్టు- సూర్యుడు చచ్చిపోతాడురా దేవుడా అని నేను అందోళన చెందుతుంటే మధ్యలో మీరేంటి?’’
‘‘తుఫాన్‌ను ఆపేసినట్టు సూర్యుడి మరణాన్ని ఆపలేరా! ఇలాంటి రోజు వస్తుందనే అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేరని ఎప్పుడో అన్నారు.’’
‘‘తెలిసీ తెలియకుండా మాట్లాడకు. సూర్యోదయాన్ని ఆపలేరు అని చెప్పడంలో కవి హృదయాన్ని అర్థం చేసుకోవాలి. ఏదో విప్లవ పార్టీలకు డిమాండ్ బాగా ఉన్న రోజుల్లో ఇలాంటి డైలాగులు పాపులర్ . ఇది అర్జున్‌రెడ్డి కాలం, ఆర్. నారాయణమూర్తి కాలం కాదు.’’
‘‘ఏమండీ.. మీకు చెప్పొద్దని దాచి పెట్టాను. మా తమ్ముడు మాదాపూర్‌లో త్రిబుల్ బెడ్‌రూం ఫ్లాట్ కొంటున్నాడు. అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడు. నిన్ననే తమ్ముడు, మరదలు వచ్చి చెప్పారు. అడ్వాన్స్ వెనక్కి తీసుకోమంటారా? సూర్యుడే అంతరించినప్పుడు రియల్ ఎస్టేట్ ధరలు పడిపోకుండా ఉంటాయా? ’’
‘‘హైదరాబాద్ గాంధీనగర్‌లో మూడు వందల రూపాయలకు మూడు వందల గజాల ప్లాటు అమ్మిన కాలం నుంచి ధరలు తగ్గుతాయనే మాటలు వింటున్నాను. తెలంగాణ వస్తే స్థలాల ధరలు పడిపోతాయని కొందరు, రాకుంటే పడిపోతాయని మరి కొందరు తెగ ప్రచారం చేశారు. నోట్ల రద్దుతో డమాల్ అని కొందరు, జిఎస్‌టితో రియల్ ఎస్టేట్ శకం ముగిసినట్టే అని మేధావులు అంచనా వేశారు. మొన్నటికి మొన్న రిజిస్ట్రేషన్‌కు ఆధార్ అనుసంధానం వల్ల భూముల ధరలు పాతాళంలో పడిపోవడం ఖాయమన్నారు. తీరా మొన్న హెచ్‌ఎండిఏ వాళ్లు ప్లాట్లను వేలం వేస్తే లక్షా 56 వేల రూపాయలకు గజం ధర పలికింది. ఒకేసారి ఇంత ధర పలకడం వల్ల రియల్ ఎస్టేట్ పడిపోతుందని మళ్లీ ప్రచారం. పెరుగుట విరుగుట కొరకే అనేది రియల్ ఎస్టేట్‌కు వర్తించదు. పెరుగుట పెరుగుట కొరకే ’’
‘‘అన్నయ్య గారూ.. మీరు మరోలా అనుకోవద్దు, మా వారూ, మీరూ మరీ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు.. అంత మంచిది కాదేమో? మగవాళ్లకే గుండెపోటు ప్రమాదం ఎక్కువట.. ఎందుకో తెలుసా?’’
‘‘ఆడవారి నుంచి గృహహింసను తట్టుకోలేక కావచ్చు.. హా..హా..’’
‘‘కాదన్నయ్య గారూ.. ప్రపంచంలోని ప్రతి సమస్యపై మగాళ్లు అతిగా ఆలోచిస్తారు కాబట్టి గుండెపోటు ఎక్కువ. కర్నాటక ఎన్నికల ఫలితాలపై అక్కడి నాయకుల్లో కన్నా ఆ వార్తలు రాసే మీడియా వారిలో, ఆయా పార్టీల అభిమానుల్లో ఆందోళన ఎక్కువగా ఉంది. ఎన్నికల్లో ఒక్క నాయకుడికి కూడా గుండెపోటు రాదు కానీ మీడియావారికి, అభిమానులకు గుండెపోట్లు వస్తున్నాయి. క్రికెట్ ఆడేవారి కన్నా అది చూసీ మీలాంటి వారిలో ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది? ఎందుకంటారు?’’
‘‘అది కూడా నువ్వే చెప్పమ్మా..!’’
‘‘టెన్షన్ నాయకులకుండాలి కానీ మీకెందుకు? రేపేం జరుగుతుందో తెలియదు. ఐదువందల కోట్ల సంవత్సరాల తరువాత అంతరించే సూర్యుడి గురించి ఆందోళన అవసరమా? అతిగా ఆలోచించడం మేధావితనం కాదు గుండెపోటు తనం అవుతుంది.’’
*

బుద్దా మురళి(జనాంతికం - 11-5-2018)

4, మే 2018, శుక్రవారం

నవ్వుకుందాం హాయగా..

ఏమండోయ్, చిన్నోడు ఏమంటున్నాడో చూశారా?’’
‘‘ఏరా.. ఇంకా స్కూల్‌కు రెడీ కావడం లేదు’’
‘‘నేను స్కూల్‌కు రాజీనామా చేశా నాన్నా’’
‘‘ఎందుకురా?’’
‘‘ముందు పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలు ఏమిటో అధ్యయనం చేస్తాను. విద్యాశాఖ మంత్రిగా వారి సమస్యలు పరిష్కరిస్తాను. అందుకే రాజీనామా చేశాను. టీచర్ల తీరు నాకు నచ్చలేదు. మానవ హక్కులను ఉల్లంఘించే విధంగా పాఠాలు చెబుతున్నారు. ఒక్కో స్కూల్‌కు వెళతాను. విద్యార్థులతో మాట్లాడతాను. సమస్యలు తెలుసుకుని, ఏదైనా పార్టీలో చేరి విద్యాశాఖ మంత్రిని కావాలా? లేక నేనే పార్టీ పెట్టాలా? అని నిర్ణయం తీసుకుంటాను.’’
‘‘నువ్వింకా పిల్లాడివిరా! ఇప్పుడే పార్టీ పెట్టలేవు’’
‘‘ఐతే బాలల హక్కుల సంఘానికి వెళతాను’’
‘‘ఎందుకు?’’
‘‘ఆయనెవరో ఐపిఎస్ ఆఫీసర్ తెలుగునాట హీరోగా మీడియా గుర్తింపునకు అలవాటు పడి, మహారాష్టల్రో ఎలాంటి గుర్తింపు రాకపోవడంతో రాజీనామా చేసేసి రాజకీయాల్లోకి వచ్చి వ్యవసాయ శాఖ మంత్రి కావాలని కోరుకుంటే.. ఆహా ఓహో అన్నారు. చదుకునే పిల్లల సమస్యలను పరిష్కరించడానికి నేను స్కూల్‌కు రాజీనామా చేసి విద్యార్థుల సమస్యలపై అధ్యయనం చేస్తానంటే ప్రతి ఒక్కరూ విమర్శించడమే, పెద్దలకో న్యాయం, పిల్లలకో న్యాయమా? బాలలకు హక్కులు లేవా? ఇదేనా ప్రజాస్వామ్యం. ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకున్నది . ఇందుకోసమేనా మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది?’’
‘‘బాగైందా? పిల్లాడు ఇంట్లో ఉన్నప్పుడు టీవీలో ఆ దిక్కుమాలిన చర్చలు చూడకండి అంటే విన్నారా? పిల్లాడికి రాజకీయ అవగాహన ఉండాలి అన్నారు. ఇప్పుడు అనుభవించండి..’’
‘‘అరే బడుద్దాయ్.. ముందు స్కూల్‌కు వెళ్లు.. నీతో తరువాత మాట్లాడతాను’’
‘‘స్కూల్‌కు వెళుతున్నా చదువుకోవడానికి కాదు. స్కూల్ పిల్లల చదువు సమస్యలను అధ్యయనం చేయడానికి..’’
‘‘హా..హా.. పులి కడుపున పులే పుట్టిందోయ్ కుటుంబరావు. మీ వాడికి నిన్ను మించిన రాజకీయ పరిజ్ఞానం అలవడినట్టుగా ఉంది.’’
‘‘రావోయ్.. రా!.. ఏమేవ్ మీ అన్నయ్య వచ్చాడు. టీ తీసుకురా! మావాడి సంగతికేం కానీ .. దేశంలో ఏం జరుగుతోంది? ఏంటీ విశేషాలు?’’
‘‘నెల్లూరులో ఓ అటెండర్ వద్ద వంద కోట్ల ఆస్తి దొరికిందట!’’
‘‘చిన్నచేపల గురించి ఏం మాట్లాడతావు కానీ.. నాకైతే పాపం అనిపించింది. ఆ అల్పజీవి అంత సొమ్ము కూడబెట్టడానికి ఎంత కష్టపడ్డాడో? శ్రమశక్తి అవార్డు పొందాల్సిన వాడు’’
‘‘ప్రచారానికి దూరంగా ఉండాలని ఆ అవార్డు వద్దన్నాడేమో కానీ- అతను కోరుకుంటే దక్కని అవార్డు ఉంటుందా? జోక్ కాదు నిజంగా చెబుతున్నాను. ఎవరికీ చిక్కకుండా, అనుమానం రాకుండా వంద కోట్లు నొక్కేయడం, దాచి పెట్టడం అంటే మాటలా? ఎంత శ్రమ పడాలి. ఎంత శక్తి ఉండాలి. జేబులు ఖాళీగా ఉన్నా ఎంతో ఆస్తి ఉన్నట్టు పోజులు కొడుతూ, కారు కొని నెలవారీ వాయిదాలు కట్టలేక ముఖం చాటేస్తూ, పైకి సంపన్నుల్లా నటించే వారున్న ఈ రోజుల్లో వంద కోట్ల ఆస్తి ఉండి అటెండర్‌గా పని చేస్తూ ఏమీ లేనట్టు నటించడం అంటే పాపం.. అతను ఎంత క్షోభను అనుభవించాడో. అందుకు శ్రమశక్తి అవార్డే కాదు. నటభూషణ అవార్డు కూడా ఇవ్వాలి’’
‘‘ఇలాంటి అవతార పురుషులు ప్రతి చోట, ప్రతి ఆఫీసులో ఉంటారు కానీ దేశ రాజకీయాలు ఎలా ఉన్నాయి?’’
‘‘ముఖ్యమంత్రులకు దిష్టి తీయాలి?’’
‘‘ఈ నగరానికేమైంది అనే ప్రకటన గుర్తుకు వచ్చి, ఈ ముఖ్యమంత్రులకేమైంది అనిపిస్తోంది?’’
‘‘ఔను ఏమైంది? అన్నింటికీ నేనే అనే ముఖ్యమంత్రి ఏకంగా తాను పుట్టక ముందు స్వాతంత్య్ర పోరాటం చేసి బ్రిటీష్ వారిని గడగడలాడించానని సెలవిచ్చారు. ఆ మధ్య పోతనతో రామాయణం రాయించారు.’’
‘‘గంటల తరబడి మాట్లాడినప్పుడు మాట జారదా? దానికి ఇన్ని జోకులా?’’
‘‘అన్నింటికీ నేనే అంటారు కాబట్టి మాట జారడం కాదు.. సీరియస్‌గానే చెప్పారేమో అని అనుమానం. ఏంటీ అలా గోళ్లు గిల్లుకుంటున్నావ్! గోళ్లు పెరిగితే త్రిపుర ప్రభుత్వాన్ని విమర్శించు’’
‘‘ఎందుకు?’’
‘‘పుండు గోక్కుంటే ఎంత హాయిగా ఉంటుందో, పెరిగిన మన గోళ్లను ఎవరైనా తీస్తే అంత హాయిగా ఉంటుంది. తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తే గోళ్లు తీసేస్తామని త్రిపుర సిఎం బంపర్ ఆఫర్ ఇచ్చాడట. పత్రికల్లో చూశాను.’’
‘‘గోళ్లు పెరిగిన వారంతా ఒకేసారి త్రిపుర పాలకుడ్ని విమర్శిస్తే సరి.. గోళ్లు పీకే ఉచితసేవ అందుకోవచ్చు’’
‘‘అంటే త్రిపుర పాలకుడి పాలనాకాలం అంతా గోళ్లు పీకడంతోనే గడచిపోతుందేమో?’’
‘గోళ్లు గిల్లుకోవడం కన్నా గోళ్లు పీకడం బెటర్ కదా! గుడ్డికన్నా మెల్ల మేలు అన్నట్టు’’
‘‘అది సరే.. బ్రిటిష్‌వారితో పోరాడి వారిని గడగడలాడించిన జాతి మా  పార్టీ అని ఆయన గారన్నారట.. మేధావులు ఊరికే అనరు.. ఆ మాటల వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది?’’
‘‘ఆయన అన్నదాంట్లో తప్పేముంది? ప్రతి మాటా అక్షర సత్యం. చినబాబు ఇప్పుడిప్పుడే తెలుగు అక్షరాలు నేర్చుకుంటున్నాడు. చినబాబు తప్పు మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు కానీ పెదబాబు కూడా...’’
‘‘చినబాబును నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావు. పెద్ద ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నపుడు ఢిల్లీలో చక్రం తిప్పడానికి హిందీ నేర్చుకునే ప్రయత్నం చేశారు. ఆయనకు హిందీ రాలేదు కానీ హిందీ నేర్పించే ప్రయత్నం చేసిన యార్లగడ్డ ఢిల్లీలో ఓ మోస్తరు చక్రం తిప్పే స్థాయికి ఎదిగారు . ఉమ్మడి రాష్ట్రంలో మైనారిటీ ల మనసు దోచేందుకు   పెదబాబు ఉర్దూ నేర్చుకునే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. ఆయనకు  ఉర్దూ రాలేదు. ఉర్దూ నేర్పే ప్రయత్నం చేసినాయన ఉర్దూ మరచిపోలేదు. రాష్ట్ర విభజనతో ఉర్దూ అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు చినబాబు ఖర్చుకు వెనుకాడకుండా తెలుగు నేర్చుకుంటుంటే అభినందించాల్సింది పోయి విమర్శలా?’’
‘అదిసరే.. మా పార్టీ స్వాతంత్య్రం కోసం పోరాడిందని ఎందుకన్నాడంటావ్?’’
‘‘కవి హృదయం అర్థం చేసుకోవాలి.. మన దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటానికి నాయకత్వం వహించిన పార్టీ ఏది?’’
‘‘కాంగ్రెస్ పార్టీ..’’
‘‘మరి ఆయన చెప్పింది  
అదే కదా! ఈరోజు దేశంలో ఉన్న అన్ని పార్టీలకూ మాతృసంస్థ కాంగ్రెస్ కదా.. అంటే దేశం కోసం పోరాడి స్వాతంత్య్రం తెచ్చామని గర్వంగా ప్రకటించే హక్కు అన్ని పార్టీలకూ ఉంది. నదులన్నీ సముద్రం లో కలిసినట్టు పార్టీలన్నీ కాంగ్రెస్ నుంచి పుట్టినవే ..  అన్ని పార్టీలూ ఆ తానుముక్కలే అని నిజాయితీగా చెప్పినందుకు అభినందించాలి.’’
‘‘ఏంటో... నారదుడికి గూగుల్ కన్నా ఎక్కువ తెలుసు అని ఒక సీఎం, స్వాతంత్య్రం వచ్చాక పుట్టినా స్వాతంత్య్రం కోసం పోరాడింది తమ పార్టీయేనని మరో సీఎం.. మహాభారత కాలంలోనే ఇంటర్నెట్ ఉందని మరో మేధావి అనడం.. పాలకుల ప్రకటనలు వింటుంటే ఏదో తికమకగా ఉం ది’’
‘‘ వ్యవసాయం దండగ అంటే తప్పు పట్టారు ఇప్పుడొకాయన ఉద్యోగం కోసం ఎదురు చూడడం దండగ వ్యవసాయం చేసుకోండి అంటే తప్పు పడుతున్నారు .. పాపం పాలకులు ఏం మాట్లాడినా తప్పేనా ? ’’
‘‘చూడోయ్.. దేశంలో సమస్యలు ఎప్పుడూ ఉంటాయి.. మొఘలుల కాలంలో, బ్రిటీష్ వారి హ యాంలో సమస్యలున్నాయి.. నెహ్రూ పాలనలో ఉన్నా యి.. ఇప్పుడూ ఉన్నాయి.. భవిష్యత్‌లోనూ ఉంటాయి... ఇంతటి సమస్యల్లోనూ మనం హాయిగా  నవ్వుకునేలా ప్రకటనలు చేస్తున్న పాలకులను మన పాలిట వరంలా భావించాలి’’
‘‘అంతేలే.. సమస్యల సుడిగుండంలో కొట్టుకుపోకుం డా హాయిగా నవ్విస్తున్నారు నేటి పాలకులు తమ ప్రకటనలతో...’’ *
-- బుద్ధా మురళి (జనాంతికం 4-5-2018)