27, మార్చి 2016, ఆదివారం

‘బ్రహ్మర్షి’ కన్నయ్య!

‘‘మూస కథలతో ఊపిరి ఆగిపోయే దశలో ఉన్న తెలుగు సినిమాకు ఊపిరి పోసిందట కదా ? ఊపిరి సినిమా’’


‘‘రాజకీయ తెరపై కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్, ప్యామిలీ సెంటిమెంట్ కలగలిసిన సినిమాలు వరుసగా కనిపిస్తుంటే.. ఉపిరి దాకా ఎక్కడ ? ’’
‘‘ నాకైతే రాజకీయాలు బోర్ అనిపిస్తున్నాయి. ’’
‘‘అంతరించి పోతున్న కమ్యూనిస్టులకు, బక్కి చిక్కి పోతున్న కాంగ్రెస్‌కు కన్నయ్య అనే కాలేజీ కుర్రాడు దొరికడం సినిమా కథలానే ఉంది.’’
‘‘మాంత్రికుడు రాజకుమారిని ఎత్తుకెళ్లినప్పుడు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిన రాజుగారికి తోటమాలి ఎన్టీఆర్ దేవుడిలా కనిపించినట్టు ఈ రెండు పార్టీల వారికి దూరమైన సింహాసనాన్ని తీసుకు వచ్చి అప్పగించే తోటమాలిలా కన్నయ్య కనిపిస్తున్నాడా? ’’


‘‘ ముందు నన్ను చెప్పనివ్వు. రాజనాల, ముక్కమాల సినిమా మొదట్లో కనిపించినా చివర్లో కనిపించినా విలన్ అని ఈజీగా గుర్తుపట్టేస్తాం. కానీ ఎప్పుడూ దగ్గుతూ ఉండే గుమ్మడి విలన్ అని చివర్లో కానీ తెలియదు. అందుకే తొందర పడి ఎవరు తోటమాలో, ఎవరు రాజనాలనో ముందే నిర్ణయానికి రావద్దు. ’’
‘‘ అంటే హీరో కాదంటావా? ’’
‘‘ నేనింకా ఏమీ అనలేదు. దసరా బుల్లోడులో కన్నయ్య కోసం వాణిశ్రీ, చంద్రకళ నల్లవాడే అల్లరి పిల్లవాడే అంటూ నల్లనయ్య నా వాడు నా వాడు అని పాడుతారు. ఒకరి కోసం ఒకరు త్యాగం చేసేందుకు సిద్ధపడుతూ కాదు నీ వాడు అంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కనిపిస్తాయి చూడు అచ్చం అలాంటి గుట్టల మధ్య త్యాగం పాట పాడుతుంటారు గుర్తుందా? ’’


‘‘అవును ఐతే’’
‘‘నవయువ నేత రాహుల్‌బాబును, వృద్ధ ఎర్రన్నలను చూస్తుంటే ఎందుకో వాణిశ్రీ, చంద్రకళ పాట గుర్తుకొచ్చింది. నాగేశ్వర్‌రావేమో ఇద్దరితో సరసాలాడుతుంటారు. ఎవరికి వారు కృష్ణయ్య నా వాడే అనుకుంటారు. ఇప్పుడు అచ్చం మన కాలేజీ కన్నయ్యలానే. చచ్చీ చెడి కన్నయ్యను కమ్యూనిస్టులు పైకి తీసుకు వచ్చారు. సిపిఐ జాతీయ నాయకులు నారాయణ తన హోదాను కూడా మరిచి కాలేజీ కుర్రాడికి విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు గంటల తరబడి నిరీక్షించారు. కమ్యూనిస్టు నాయకులు వస్తున్నారంటే చంద్రబాబు, వైఎస్‌ఆర్ లాంటి వారు లేచి ఎదురెళ్లి స్వాగతం పలికేవారు. తనను తాను దైవంగా భావించే ఎన్టీఆర్ సైతం ఎంతో గౌరవించేవారు. అలాంటి కమ్యూనిస్టులు కన్నయ్యను భుజానికి ఎత్తుకుని తమకు పునర్జన్మ ప్రసాదించేందుకు వచ్చిన దేవదూతలా చూస్తున్నారు. సభలు ఏర్పాటు చేస్తున్నారు. సత్కారాలు చేస్తున్నారు. శ్రీకృష్ణుడు నా మిత్రుడు అని కుచేలుడు గర్వంగా చెప్పుకున్నట్టు కన్నయ్య మా నాయకుడు అంటున్నారు. ఎన్నికలకు ఉపయోగపడే చిన్ని కన్నయ్య అని మురిసిపోతున్నారు. కన్నయ్యనేమో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేశ్ సౌందర్యకు తెలియకుండా నేపాలీ అమ్మాయిని ప్రేమించినట్టు, కమ్యూనిస్టులను, కాంగ్రెస్ నాయకులను కన్నయ్య ఒకేసారి కలుస్తున్నారు. కష్టపడి కమ్యూనిస్టులు సభ ఏర్పాటు చేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు అని కన్నయ్య చెబుతున్నాడు. ’’


‘‘ నిజమే ఎందుకలా అంటావు?’’
‘‘ చూడోయ్ కన్నయ్య చదువుకునేది ఎంత ఆఫ్రికన్ స్టడీ అయినా అతనికీ సైన్స్ తెలుసు. లెక్కలు వస్తాయి కదా? రాజకీయ జీవితం కోరుకునే వాడు భవిష్యత్తు ఉన్న పార్టీ వైపు చూస్తాడు కానీ ఊపిరి ఆగిపోయే పార్టీని నమ్ముకుంటాడా? కోమాలో ఉన్న పార్టీల కన్నా పదేళ్లపాటు తిండి ఎక్కువై, రెండేళ్ల నుంచి తిండి లేక నీరసించిన కాంగ్రెస్ బెటర్ అనే లెక్క తెలియనంత అమాయకుడేం కాదు. అందుకే రాహుల్‌బాబుతో టచ్‌లో ఉన్నారు.’’
‘‘ మంచిదే కదా ? ’’
‘‘ తలకు బలమైన గాయం తగలగానే అప్పటి వరకు జరిగిన విషయాలన్ని మరిచిపోవడం, మరోసారి దెబ్బతగలగానే గుర్తుకు వచ్చే సీన్లు గుర్తున్నాయా? అలానే మన కమ్యూనిస్టులకు తప్పులు చేయడం సరిగ్గా మూడు దశాబ్దాల తరువాత అవి తప్పులు అని గుర్తుకు రావడం గుర్తొచ్చింది అంతే. ఇప్పటి తప్పులను వాళ్లు మూడు దశాబ్దాల తరువాత ఒప్పుకుంటారేమోనని. 95 నాటి వెన్నుపోటుకు చేయూత నివ్వడం చారిత్రక తప్పిదం అని ప్రకటించేందుకే ఇంకా తొమ్మిదేళ్ల గడువు ఉంది.’’


‘‘ఇంతకూ కన్నయ్య కథ సూపర్ హిట్టా కాదా? కన్నయ్య హీరోనా కాదా? ఏదీ తేల్చవు’’
‘‘ కొన్ని విషయాలు కాలం తేల్చేంత వరకు వేచి చూడాలి. ‘వైదిస్ కొలవెరి కొలవెరి డీ’ పాట వినిపించిన కొత్తలో భారతీయ ప్రపంచం ఊగిపోయింది. వీళ్ల ఊపు చూసి బయ్యర్లు కోట్లు గుమ్మరించారు. తీరా సినిమా వచ్చాక రోడ్డున పడ్డారు. పాట మరుగున పడింది. బయ్యర్లు ఇల్లు వాకిలి అమ్ముకున్నారు. 


అన్నా హజారే అవినీతిపై ఉద్యమించినప్పుడు బాబు అన్నా కన్న పెద్ద జాతీయ జెండా భుజాన తగిలించుకుని పాదయాత్ర చేశారు. చివరకు హాజారే సైతం పార్లమెంటు కన్నా తానే ఉన్నతున్ని అనుకున్నారు. తాను ఎంపిక చేసిన పౌర సమాజం సభ్యులు పార్లమెంటు కన్నా ఉన్నతం అని ప్రకటించారు. ఆయన్ని బిజెపి వదిలేసింది ప్రజలు మరిచిపోయారు. నెల తరువాత సికిందరాబాద్‌లో భారీ బహిరంగ సభ పెడితే 50 మంది మీడియా బృందాన్ని కలిపితే మొత్తం 300 మంది వచ్చారు. ’’


‘‘దసరా బుల్లోడు సూపర్ హిట్ సినిమా. కన్నయ్య సూపర్ హిట్ అని ఒప్పుకున్నట్టే కదా? ’’
‘‘ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా షూటింగ్‌కు ఢిల్లీ నుంచి విపి సింగ్ వంటి హేమీ హేమీలెందరో వచ్చారు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ మేనక పాత్రధారి మీనాక్షి శేషాద్రి వీపుమీద ఫైళ్లు పెట్టి సంతకం చేశారు. ఈ సినిమాతో మా పని ఐపోయిందని ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు సైతం బెంబేలెత్తిపోయారు. కానీ సినిమా ఊహించని స్థాయిలో అట్టర్ ఫ్లాప్ అయింది. ఎన్టీఆర్ స్వయంగా ఓడిపోయారు. కన్నయ్య సినిమా కథ దసరా బుల్లోడును పోలి ఉన్నా బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా  ఫలితం గుర్తుకు వస్తోంది. ’’

బుద్దా మురళి (జనాంతికం 27. 3. 2016)

20, మార్చి 2016, ఆదివారం

మచ్చలేని మనిషి!

‘‘ మీరెవరు? యమధర్మరాజులా ఉన్నారు? ?’’
‘‘ యమధర్మరాజునే. నీ పేజీ చింపేశాను, పైకి తీసుకెళుతున్నాను’’
‘‘ ఇదన్యాయం నేనొప్పుకోను. కోర్టుకెళతాను’’
‘‘ అసలేం జరిగింది? ’’
‘‘ వాహనం నడుపుతూ సెల్‌ఫోన్‌లో సినిమా చూస్తూ కాలువలో పడిపోయి. ఇక్కడికొచ్చేశావు. ఇంతకూ అంతగా మైమరిపించిన సినిమా ఏంటో’’
‘‘ ఎంత గొప్ప సస్పెన్స్ సినిమా అయినా ముగింపులో ఏం జరిగిందో తెలుస్తుంది. నాలుగు దశాబ్దాలైనా ఆ సస్పెన్స్ ఇంకా వీడక పోవడంతో ఆలోచనలో పడి కాలువలో పడ్డాను.’’
‘‘ ఏమిటా సస్పెన్స్’’
‘‘60 ఏళ్ల నటరత్న అమ్మా అని తన కన్నా పదేళ్ల చిన్న వయసులో ఉన్న అంజలిని కౌగిలించుకుని కాలేజీలో నేను ఫస్ట్ వచ్చాను అని మురిపెంగా చెబుతాడు. వీరిద్దరి కన్నా మరో పదేళ్ల పిన్న వయసులో ఉన్న గుమ్మడిని చూసి తాతయ్యా అంటూ పండరీబాయి వెనక ఎన్టీఆర్ దాక్కుంటాడు. ’’
‘‘ అవును చాలా సినిమాల్లో ఈ దృశ్యాలు చూశాను’’
‘‘ కొడుకు వయసు కన్నా తల్లివయసు తక్కువని, తాతయ్య వయసు మరింత తక్కువ అని తెలిసినా మేం ఈ దృశ్యాలను చూసి ఎలా తన్మయం చెందామో ఇప్పటికీ అర్ధం కావడం లేదు. ఇది ఎన్నటికీ తీరని సస్పెన్స్ కాదా?’’
‘ నువ్వు ఏవో కథలు చెబుతూ నన్ను ఎక్కడికో లాక్కెళ్లాలని చూస్తున్నట్టున్నావ్, నేను సతీ సావిత్రి కాలం నాటి యముణ్ణి కాదు. టెక్నాలెజీ మీ సొంతమే కాదు మాకూ ఉంది. ’’
‘‘ మీరు యమలీల కాలం నాటి యముడు కాదు.. నేను సతీసావిత్రిని కాదు. బుద్ధున్నోడెవడైనా పై లోకం లోని నరకం నుంచి భూ లోకంలోని నరకానికి తిరిగి వెళ్లాలనుకుంటాడా? ఈ ట్రాఫిక్ జామ్‌లతో బతికే ఓపిక లేదు. పైన ఏమున్నా లేకున్నా ట్రాఫిక్ జామ్ అయితే ఉండదు కదా? చివరి కోరిక తీర్చమని కోరుకుంటున్నాను అంతే ’’
‘‘ సతీ సావిత్రి లా ఇరికించాలని చూస్తున్నావేమో? నీ ప్రాణాలు తప్ప చివరి కోరిక ఏదైనా తీరుస్తాను అడుగు. ’’
‘‘ మాట మీద నిలబడాలి. మాటిచ్చి తప్పవద్దు’’
‘‘ పిచ్చోడా! ఆ రోజుల్లో అంటే టెక్నాలజీ తక్కువ కాబట్టి సావిత్రి మనసులో ఏముందో తెలియక దెబ్బతిన్నాను. నీకు తెలియకుండానే నీ చేతికి చిప్ అతికించాను. నీ మనసులోని మాట కూడా నాకు తెలుసు.చెప్పు ’’
‘‘ మచ్చలేని నాయకుణ్ణి చూడాలని నా జీవితాశయం. మచ్చలేని నాయకుణ్ణి చూడగానే నీ వెంట వచ్చేస్తాను ’’
‘‘ ఏరా నువ్వు కొణిజేటి సుందర్రావు హై స్కూల్‌లో చదివావు కదూ! ఆ స్కూల్‌లో టీచర్ సుబ్బారావు మచ్చలేని మనిషి భూ లోకంలోనే లేడు. శ్రీరాముడు శ్రీకృష్ణుడే కాదు మనకాలం దేవుడనుకునే మహాత్మాగాంధీ జీవితంలో సైతం మచ్చలున్నాయని ఆయన చెప్పిన పాఠాలు గుర్తుయా? ’’
‘‘ ఔను’’
‘‘ ప్రతి మనిషి జీవితంలో చిన్నదో పెద్దదో ఒక మచ్చ ఉంటుంది. నీ చావు తెలివి తేటలు బాగున్నాయి. మచ్చలేని మనిషి ఉండడు కాబట్టి నిన్ను భూ లోకానికి పంపించేస్తాను అనుకున్న నీ ఆచలోన తప్పు’’
‘‘ మచ్చలేని నాయకుణ్ణి చూపించండి లేదంటే భూ లోకానికి పంపించండి’’
‘‘ ముందే చెప్పాను సతీసావిత్రి కాలం నాటి యముణ్ణి కాదు అని ’’
‘‘ అంటే చివరి కోరిక తీర్చకుండానే పైకి తీసుకు వెళతారా? ’’
‘‘ ఒకసారి మాటంటే మాటే... మాట తప్పడానికి మేమేమీ మనుషులం కాదు’’
‘‘ అయితే మచ్చలేని మనిషిని చూపించండి’’
‘‘ ఒక మనిషి చాలా?’’
‘‘ ముందు ఒక్కరిని చూపించండి చాలు’’
‘‘అదిగో అక్కడ రాజకీయ సమావేశం జరుగుతుంది. కనిపిస్తుందా? అక్కడ వేదికపై ఉన్న మహామహులంతా మచ్చలేని నాయకులే కావాలంటే వెళ్లి చూడు’’
‘‘ ఇది అన్యాయం తొండి. వాళ్లు రాజకీయాలను వ్యాపారంగా మార్చి కోట్లు సంపాదించారు. ఎక్కడ ఏ కొత్త ప్రాజెక్టు వస్తే అక్కడ భూములు కొనేశారు. రాజకీయంగా అడ్డు వచ్చిన వాళ్లను లేపేశారు. రాజకీయ జీవితం ప్రసాదించిన వారిని సైతం దారుణంగా దెబ్బతీసిన దుర్మార్గులు కూడా అక్కడున్నారు. అలాంటి వాళ్లను చూపించి మచ్చలేని మనుషులు అని చెబితే నమ్మడానికి నేనేమన్నా అమాయకుడిని అనుకుంటున్నావా? మాట తప్పిన పాపం మూట కట్టుకోవలసి వస్తుంది జాగ్రత్త’’
‘‘ నేను అబద్ధం చెప్పడం లేదురా! మానవా! అదిగో అటు చూడు నిప్పులాంటి మనిషిని, మనుషుల్లో దేవుణ్ణి, ఆక్సిజన్ లేకపోయినా బతికేస్తాను కానీ నైతిక విలువలు పీల్చంది బతక లేను అని ఉపన్యసిస్తున్నాడు చూడు అతను నంబర్ వన్ మచ్చలేని నాయకుడు ’’
‘‘ ఇది మరీ అన్యాయం ఆయనకు వాళ్లందరి కన్నా ఎక్కువ మచ్చలున్నాయి. మచ్చలేని మనిషి అని చెప్పి మోసం చేస్తున్నావు. ఆయన చేసిన ఎన్నో పాపాలకు నేను సాక్ష్యం’’
‘‘ నువ్వు చెబుతున్నది నిజమే, మచ్చలేని నాయకుడు అని నేను చెబుతున్నది నిజమే. చూడోయ్ నీ తెల్లని షర్ట్‌పై ఒక నల్లని రంగు చుక్క పడిందనుకో స్పష్టంగా కనిపిస్తుంది. అదే తెల్లని షర్ట్‌ను మొత్తం నల్లరంగులో ముంచితే?’’
‘‘ ???’’
‘‘ రాజకీయాల్లోనే కాదు అన్ని రంగాల్లో ఇలాంటి మచ్చలేని మనుషులు కనిపిస్తారు. తమకు మచ్చలేదు అని వాళ్లు చెప్పింది కరక్టే ఒక్క మచ్చ ఉంటే గుర్తించవచ్చు, మొత్తం శరీరమే మచ్చల మయం ఐతే? పాన్‌షాప్‌లో అప్పు కోసం ప్రయత్నించే అప్పుల అప్పారావు మొదలుకుని ప్రపంచ బ్యాంకు అప్పు కోసం ప్రయత్నించే నాయకుల వరకు అన్ని రంగాల్లో నూ ఈ మచ్చలేని మహానుభావులు కనిపిస్తారు. విలువల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటే వీరిని ఈజీగా గుర్తించవచ్చు. మరణించిన తరువాత మనిషి తిరిగి జన్మించడం అనేది ఎంత వరకు నిజమో! మనిషై పుట్టిన తరువాత ఏదో ఒక మచ్చలేకుండా జీవితం ఉండకపోవడం కూడా అంతే నిజం. పుట్టినప్పటి నుంచి కోమాలో ఉంటే చెప్పలేం కానీ.. ’’
***
‘‘ ఏమండీ ఎంత ఆదివారం అయితే మాత్రం బారెడు పొద్దెక్కినా ఇంకా లేచేది లేదా?’’
‘‘ఇదంతా కలా? ఒక జీవిత సత్యం తెలిసింది. విలువల గురించి ఎక్కువగా మాట్లాడవద్దు.. మాట్లాడేవారిని నమ్మొద్దు’’
-బుద్దా మురళి (జనాంతికం 20-3-2016)

సినిమాకో సూపర్ హిట్ కథ!

‘‘కళ్ళ ముందే ఎంత ప్రతిభ ఉన్నా గుర్తించక పోవడం తెలుగు వారి దురదృష్టం’’
‘‘ఆ ప్రతిభ మాకూ చెబితే తెలుసుకుని తరిస్తాం’’
‘‘పగబట్టిన కుక్క అని బ్రహ్మాండమైన టైటిల్‌తో నా దగ్గరో సూపర్ హిట్ సినిమాకు కథ ఉంది. మంచి నిర్మాత దొరకడమే తరువాయి’’
‘‘అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ అని ఓ హీరో ఉన్నాడు తెలుసా? అతని డేట్స్ ఉన్నాయట నిర్మాత కావాలట!. బ్రహ్మాండమైన సినిమాలు తీసిన అల్లుగారే కొడుకుతో సినిమా తీసే సాహసం చేయకుండా వేరే నిర్మాత కోసం వెతుకుతుంటే నువ్వేంటోయ్ 1960 నాటి టైటిల్‌కు నిర్మాత కావాలా? ’’


‘‘ ననే్నమైనా అను నా కథను, టైటిల్‌ను అవమానించకు’’
‘‘ ఐనా ఈ రోజుల్లో పగబట్టిన కుక్క, ప్రేమించిన నక్క, వెంట పడిన కోతి సినిమాలను ఎవరు చూస్తారోయ్, అప్పుడెప్పుడో 1960 - 70లో ఏ జంతువుతో సినిమా చూసినా ఎగబడి చూశారు. మనుషులే జంతువుల కన్నా చిత్రంగా వ్యవహరిస్తున్న ఈరోజుల్లో జంతువుల పిచ్చి చేష్టలను చూసేదెవరు? ’’
‘‘రాజవౌళి ఈగను హీరోగా పెట్టి సినిమా తీస్తే జనం చూడలేదా? తీసే దమ్ముండాలి కానీ ఈగ, దోమ, చీమ కాదేది హిట్ ఫార్ములాకు అనర్హం.’’
‘‘ అంతోటి గొప్ప కథేంటో చెప్పు ’’
‘‘ విజయవాడలో మైనర్ బాబు కారులో వేగంగా వెళుతుంటే అడ్డంగా వచ్చిన విద్యార్థి ప్రమాదంలో చనిపోతాడు. మైనర్ బాబు ఎమ్మెల్యే కుమారుడు. కుక్క అడ్డం రావడం వల్లే ఆ విద్యార్థి ప్రమాదంలో మరణించాడని పోలీసులు తెలివి తేటలతో పరిశోధించి కనుగొంటారు. అదే పోలికలున్న కుక్క హైదరాబాద్‌లో మరో మంత్రి మైనర్ బాబు కారుకు అడ్డం పడి, ఆ మైనర్ బాబు అల్లరి పాలయ్యేట్టు చేస్తుంది. ఇది లైన్ దీన్ని డవలప్ చేసుకోవాలి. హీరో ఎవరో తేలితే కథ సిద్ధం చేసుకోవచ్చు. ఈగ నాని అనుకో తాను ప్రేమించిన అమ్మాయిని రక్షించడానికి విలన్లను తుద ముట్టించడానికి హీరోనే కుక్కలా హైదరాబాద్, విజయవాడ ఎక్కడ బడితే అక్కడ ప్రత్యక్షం అవుతున్నట్టు కథ సాగుతుంది. ’’
‘‘ మరి రజనీకాంత్ హీరో అయితే ?’’


‘‘నువ్వు వెటకారంగా అడిగినా నేను సీరియస్‌గానే ముందే ఆలోచించాను. అమెరికాను దెబ్బతీయడానికి ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చి ప్రపంచ నాయకులందరినీ అప్రతిష్టపాలు చేసేందుకు ఆ యా దేశాలకు పంపిస్తుంటారు. అలానే విజయవాడ, హైదరాబాద్ తరువాత వైట్ హౌస్‌లోకి వెళ్లేట్టు చేస్తారు. అమెరికా అధ్యక్షుని కూతురు తన కారుకు అడ్డంగా వచ్చిన కుక్కను చూసి ముచ్చటపడి పెంచుకుందామని తండ్రిని ఒప్పిస్తుంది. అలా వైట్ హౌస్‌లో చేరిన కుక్క అక్కడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఐఎస్‌ఐఎస్‌కు చేరవేస్తుంది. ప్రపంచం ప్రమాదంలో పడడంతో దేశాధ్యక్షులంతా కలిసి రజనీకాంత్‌ను గడ్డం పట్టుకుని బతిమిలాడుతారు. కుర్ర హీరోయిన్లతో పాటలు పాడిన తరువాత రజనీకాంత్‌కు విలన్ ఎవరో ఎక్కడున్నారో తెలిసిపోతుంది. తాను మరో కుక్కలో పరకాయ ప్రవేశం చేసి వైట్ హౌస్‌లో చేరి వైట్ హౌస్‌లోని కుక్క అధ్యక్షున్ని కిడ్నాప్ చేసే ప్లాన్‌ను భగ్నం చేస్తాడు. డబ్ చేసి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయవచ్చు. ’’
‘‘బెజవాడ రౌడీలు , గుంటురు మసాలా? హైదరాబాద్ బిర్యానీ, వరంగల్ మిర్చి, విశాఖ చేపలు అంటూ ఈ మధ్య రాంగోపాల్ వర్మ జిల్లా లేవల్ సినిమాలు తీసి బాగానే సంపాదిస్తున్నాడు కదా? అలానే మనం స్మాల్ బడ్జెట్‌తో పొలిటికల్ సెనే్సషనల్ స్టోరీతో సినిమాగా తీయలేమా? ’’
‘‘అద్భుతంగా తీయగలం. నెలకు రూపాయి జీతంతో నిప్పులా బతికే నాయకున్ని విలన్ విపక్ష నాయకుడు ఎలాగైనా దెబ్బతీయాలని దుష్ట శక్తులతో కలిసి కుక్కను రంగంలోకి దింపుతాడు. ఆ కుక్క మంత్రులు, ఎమ్మెల్యేల కుమారుల కారు కింద పడుతూ ప్రభుత్వం బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుంటుంది. నాయకుడు ఈ విషయాన్ని గ్రహించి నేరస్తులకు కాదు ముద్దాయిలపై ఫిర్యాదు చేసే బాధితులకే శిక్ష అనే కొత్త చట్టం తీసుకు వచ్చి విపక్ష నేతను శిక్షించి ప్రజలను కన్నబిడ్డల్లా పాలిస్తాడు. ’’
‘‘మధ్య సోషల్ పాంటసీ సినిమా రాక చాలా రోజులైనట్టుంది. మనం తీస్తే వర్కవుట్ అవుతుందంటావా? ’’


‘‘ సూపర్ హిట్టవుతుంది. యమలీల నుంచి యమగోల వరకు పెద్ద ఎన్టీఆర్ నుంచి బుల్లి ఎన్టీఆర్ వరకు అందరు హీరోలను కష్టకాలాల్లో ఆదుకున్నది సోషియో పాంటసీ చిత్రాలే కదా? ఇద్దరు హీరోయిన్లు, బికినీతో స్నానాల ఘట్టాలు, ముంబై సెక్సీ హీరోయిన్‌తో యముడికి ఒక సాంగ్ పెట్టామంటే ప్రేక్షకులకు తిక్కరేగిపోవాలి. ప్రజాప్రతినిధులు, వాళ్ల పిల్లలు కారులో ఎక్కడికి వెళ్లినా కుక్కలు వెంటపడి వేధిస్తుంటాయి. హే భగవాన్ మాకు ఏమిటీ పరీక్ష అని వాళ్లు దేవున్ని నిందిస్తూ పాట పాడతారు. అప్పుడు యముడు ప్రత్యక్షమై మీలో కుక్కలాంటి విశ్వాసం ఉందా? లేదా? పరీక్షించడానికి నేనే పంపాను నా పరీక్షలో మీరు నెగ్గారు మీకు మరణం లేకుండా వందేళ్ల వరకు హీరోగా తెలుగు సినిమాలో నటిస్తూ నా తరఫున ప్రేక్షకుల తిక్క కుదుర్చమని యముడు హీరోను దీవిస్తాడు. ఆ కుక్క యుముడితో పాటు నరకానికి వెళ్లిపోతుంది. ’’
‘‘పదివేల జనాభా ఉండే కృష్ణానగర్‌లో లక్ష మంది సినిమా జీవులు కనిపిస్తారు. వాళ్లలో వేలమంది కాబోయే దర్శకులు, రచయితలు ఉంటారు. వారెవరికీ తట్టని పగబట్టిన కుక్క కథ నీకే తట్టింది అద్భుతం’’
‘‘ఔను’’


‘‘ఓ ఎమ్మెల్యే, మరో మంత్రి వారు వీరని కాదు ఎవరికి ఏ సమస్య వచ్చినా కుక్క కథ చెప్పి తప్పించుకుంటున్నారు. వాళ్ల సొంత కథను కాపీ కొట్టడానికి నీకు సిగ్గనిపించడం లేదా? వాళ్లేంతో కష్టపడి రాసుకున్న కథను నిమిషాల్లో కాపీ కొట్టేస్తావా? నువ్వసలు మనిషివా? ’’
‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా అని సినిమా తీస్తే రాంగోపాల్ వర్మను మించి పోతాం కదా? ఆలోచించు’’
‘‘ ఈ కథ మీద కాపీరేట్ హక్కులు కథను సృష్టించిన వాళ్లేకే ఉంటాయి. వాళ్ల అనుమతి లేనిదే మనం కుక్క కథను వాడుకుంటే జైలుకు పంపిస్తారు అసలే రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లు’’- బుద్దా మురళి (జనాంతికం 13. 3. 2016)

19, మార్చి 2016, శనివారం

చక్రం తిప్పిన బాబు చక్రబంధంలో...

ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన చంద్రబాబునాయుడు ఇప్పుడు చక్ర బంధంలో ఇరుక్కు పోయారు. సొంత రాష్ట్రంలో, ఢిల్లీలో, చివరకు పొరుగు రాష్ట్రం ఆయనకు అన్నీ సమస్యలుగా మారాయి. పివి నరసింహారావు తరువాత ఢిల్లీలో కీలక భూమిక పోషించిన రాజకీయ నాయకుడు చంద్రబాబు. ‘‘ఐకె గుజ్రాల్, దేవగౌడలను ప్రధానమంత్రులను చేసింది నేనే. బిఆర్ అంబేద్కర్‌కు భారత రత్న ఇప్పించింది నేనే. వాజ్‌పాయికి స్వర్ణచతుర్భుజి ఐడియా చెప్పింది నేనే,’’ అంటూ కొన్ని అతిశయోక్తులను ప్రచారం చేసుకున్నా, కేంద్రంలో రాజకీయంగా కీలక భూమిక పోషించిన విషయం మాత్రం వాస్తవం. ముఖ్యమంత్రిగా తిరుగులేని నాయకునిగా ఉంటూ ఢిల్లీలో ఫ్రంట్ కన్వీనర్‌గా కీలక భూమిక పోషించారు.


‘ప్రధానమంత్రి పదవి కోసం ఒక గదిలో నేను ఇంటర్వ్యూ నిర్వహిస్తుంటే ఒకరి తరువాత ఒకరు వచ్చారు, అలా గుజ్రాల్‌ను ఎంపిక చేశాను’’ అని బాబు ఒక సారి చెప్పుకున్నారు. అలాంటి చంద్రబాబు ఆంధ్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తరువాత వరుసగా అన్నీ సమస్యలే. విభజనకు ముందు తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేల వల్ల, ఆంధ్రలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరడం వల్ల తరుచుగా ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో ఒక్కటంటే కనీసం ఒక్క చోట కూడా టిడిపి విజయం సాధించలేదు. డిపాజిట్లు కూడా కోల్పోయింది. విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే, ఆంధ్రలో బాబు అధికారంలోకి వచ్చారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిడిపిల మధ్య ఓట్ల శాతం తేడా స్వల్పమే అయినా అప్పటి వరకు ఒక్క సీటు గెలవని పార్టీ ఏకంగా అధికారంలోకి రావడం విశేషం. 

నిజానికి రాజకీయ పక్షాల కన్నా ప్రజలే విభజనను జీర్ణం చేసుకుని తగు నిర్ణయం తీసుకున్నారు. విభజనతో షాక్‌లో ఉన్న రాష్ట్రానికి తొమ్మిదేళ్ల పాలనా అనుభవం ఉన్న చంద్రబాబే బెటర్ అని నిర్ణయించుకున్నారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి రావడం ఖాయం అనే అభిప్రాయం బలంగానే వినిపించింది. ఇటు బాబు అటు మోదీ అయితే ఆంధ్ర అభివృద్ధికి తిరుగులేదు అనుకున్నారు.


విభజన జరిగిపోయిన తరువాత ఎన్నికల్లో తెలంగాణలో తెలంగాణ వాదం వినిపించింది ఎవరు అని తెలంగాణ ప్రజలు చూశారు కానీ, ఆంధ్రలో సమైక్యాంధ్ర వాదం ఎవరిది అని చూడలేదు. అలా చూసి ఉంటే అధిష్టానాన్ని ధిక్కరించి సమైక్యాంధ్ర వాదాన్ని వినిపించి ఏకంగా జై సమైక్యాంధ్ర పార్టీనే ఏర్పాటు చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి ని ఆదరించే వారు. ఆయనకు కనీసం ఒక్క చోట కూడా డిపాజిట్ దక్కకుండా ఘోరంగా ఉండేది కాదు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌తో సహా పార్టీ ఎమ్మెల్యేలంతా విభజనకు వ్యతిరేకంగా రాజీనామా చేసినందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేవారు. విభజనకు మద్దతుగా రెండు సార్లు లేఖలు ఇచ్చిన బాబును గెలిపిం చే వారు కాదు. ప్రజలు సమైక్యాంధ్ర యోధు లు ఎవరు అని చూడలేదు కాబట్టే ఇవి జరగలేదు. పాలనా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బాబును గెలిపించారు. అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు తన పాలనానుభవంతో ఆంధ్రకు మేలు చేసే విధంగా వేగంగా నిర్ణయాలు తీసుకుని ఉండాల్సింది.
ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు తప్పటడుగులు వేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రచారంతోనే దేన్నయినా సాధించవచ్చు అనే భ్రమ నుంచి చంద్రబాబు బయటపడాలి. గతంలో మాదిరిగా మీడియా ఒకే పార్టీకి, ఒకే వర్గానికి లేదు. ఒకవైపు అన్యాయంగా విభజించి కట్టుబట్టలతో పంపించారు. రాజధాని లేదు అంటుంటారు. మరోవైపు నర్సరావుపేటను ప్రపంచంలోనే టాప్ 10 నగరాల్లో ఉండేట్టు చేస్తానంటారు. మరో నెల రోజులకే అమరావతిని ప్రపంచంలో టాప్ టెన్ నగరాల్లో ఒకటిగా నిలుపుతానని అంటారు. దేశానికి ఆర్థిక రాజధాని ముంబై నగరమే ప్రపంచంలో టాప్ 10 నగరాల జాబితాలో లేదు. ఇక నర్సరావుపేట ముంబైని దాటుకుని వెళ్లాలి. లక్ష కోట్లు అంటూ జగన్‌పై చేసిన విస్తృతమైన ప్రచారం ఎన్నికల్లో ఉపయోగపడింది, ఇప్పు డూ ఉపయోగపడుతోంది. ఇంకెంత కాలం దీనిపైనే ఆధారపడతారు? ఆంధ్ర ముఖ్యమంత్రిగా బాబు తన పనితీరుతో ప్రజలను మెప్పించాలి.


ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం సొంత బలంతో అధికారంలోకి రావడమే చంద్రబాబుకు పెద్ద దెబ్బ. గతంలో బిజెపి ప్రభుత్వం బాబు మద్దతుతో కేంద్రంలో అధికారం చేపట్టింది. బలమైన మిత్రపక్షం కావడం వల్ల అప్పుడు బాబుకు ప్రాధాన్యత ఉండేది. భారీ మెజారిటీని ఊహించని మోదీ ముందు జాగ్రత్తగా టిడిపితో పొత్తు పెట్టుకున్నారు. సొంత బలంతో అధికారంలోకి వచ్చాక బాబుకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడంలేదు. చక్రం తిప్పడం అటుంచి మోదీ దర్శన భాగ్యం కూడా బాబుకు అంత సులభంగా దక్కడం లేదు. మోదీకి బాబు మద్దతు ఉపసంహరించుకోవాలని జగన్ డిమాండ్. బాబు మద్దతుతో నిలబడ్డ ప్రభుత్వం అయితే మద్దతు ఉప సంహరించుకుంటారనే భయం ఉండేది. మోదీ ప్రభుత్వానికి బాబు మద్దతు ఉపసంహరించుకున్నా, కొనసాగించినా తేడా ఉండదు. మోదీ లెక్కలు వచ్చే ఎన్నికల్లో బిజెపికి తగ్గే సీట్లను భర్తీ చేసుకోవడమే. బాబు వెళ్లిపోతాడు అనుకుంటే జగన్, టిఆర్‌ఎస్‌ల మద్దతు కోసం బిజెపి ప్రయత్నించే అవకాశం ఉంది. దీని వల్ల బాబు వల్ల తగ్గే సీట్ల కన్నా ఈ రెండు పార్టీల వల్ల కలిసి వచ్చే సీట్లు రెట్టింపు ఉంటాయి. వచ్చే ఎన్నికల తరువాతైనా, ప్రస్తుతానికైనా ఒక పార్టీ కన్నా రెండు పార్టీల బలం రెట్టింపు. దీం తో బాబును ఢిల్లీలో పెద్దగా పట్టించుకోవడం లేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీని తప్పించాలని బాబు డిమాండ్ చేసినందుకే ఈ కోపం అని కొందరి విమర్శ. అత్యున్నత స్థాయిలో ఉన్న నాయకులు ఏ పార్టీ వల్ల ఎంత వరకు మేలు, ఎంత వరకు నష్టం అని లెక్కలనే ప్రధానంగా చూస్తారు. ఆ రోజు ఏమన్నాడు, ఈ రోజు ఏమన్నాడు అని లెక్కలు చూసుకునేందుకు వాళ్లేమీ స్కూల్ పిల్లలు కాదు. రాజకీయం అంటే కూడికలు, తీసివేతలు.
తుఫాన్ నష్టం కావచ్చు, రాజధాని నిర్మాణానికి నిధులు, విభజన చట్టంలోని హామీల అమలు వంటి వాటిపై కేంద్రం బాబు ఇమేజ్ పెంచే స్థాయిలో సహకరించడం లేదు. ఇక ఐదేళ్ల పాటు ఆంధ్రకు ప్రత్యేక హోదా అనేది కాలం చెల్లిన హామీ అనేది తేలిపోయింది. గత రెండేళ్ల నుంచి ప్రత్యేక హోదా అదిగో ఇదిగో అని ఇంకా నమ్మిస్తూనే ఉన్నారు. బాబు మద్దతుతో బతికి బట్టకడితే ప్రత్యేక హోదా ఇచ్చేందుకు బిజెపికి ఎలాంటి అడ్డంకులు ఉండేవి కాదు. అవసరం లేదు కాబట్టి ఇప్పుడు అన్నీ అడ్డంకులే. 


ఇక సొంత రాష్ట్రం విషయానికి వస్తే కులాల ఆధిపత్య పోరుసాగుతోంది. మహిళా అధికారిపై ఎమ్మెల్యే దాడి జరిపినా చర్య తీసుకోలేదనే విమర్శ ప్రభుత్వానికి మచ్చగా నిలిచింది. గోదావరి పుష్కరాలు మొదలుకొని ఎన్నో విషయాల్లో ప్రభుత్వం విమర్శల పాలైంది. ప్రత్యేక హోదా సాధించలేకపోయారని విపక్షాలు బలంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. రాజకీయాల్లో నైతిక విలువల గురిం చి, నేను నిజాయితీపరుణ్ణి, నిప్పును అంటూ తన గురించి తాను ఎక్కువగా చెప్పుకునే రాజకీయ నాయకుడు దేశం మొత్తంలో చంద్రబాబు తప్ప ఎవరూ ఉండరు. నాయకుల నిజాయితీ నచ్చితే ప్రజలు వేనోళ్లుగా పొగుడుతూ ఉండవచ్చు కానీ తనకు తానే ఇలా ఎవరూ చెప్పుకోరు. వేలికి ఉంగరం, చేతికి వాచీ కూడా లేని నాయకుణ్ణి అంటూ ఈ రెండింటిని తన నిజాయితీగా నిదర్శనంగా చూపడం నవ్వులపాలయ్యేట్టుగా ఉంది. సెల్‌ఫోన్‌లు వచ్చాక వాచీలు వాడేవారు అరుదు. గతంలో రోజుకు రెండు ఇడ్లీలు, పుల్కాలు మాత్రమే తింటాను అని తానెంత నిజాయితీ పరుడో గతంలో చెప్పుకునే వారు.
మనవడితో ఆడుకునేంత సమయం కూడా లేకుండా 18 గంటల పాటు కష్టపడుతున్నానని చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి మనవడితో ఆడుకుంటున్నారా? వంకాయ మసాలాతో తిన్నారా? ఎన్ని గంటలు పడుకుంటున్నారు అనేది ప్రజలకు అనవసరం. ముఖ్యమంత్రిగా అధికారం అప్పగించిన తరువాత ప్రజలకు ఏం చేశారు అనేది ముఖ్యం.ఇక అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ పరువు తీసేట్టుగా సాగుతున్నాయి. రికార్డులోకి ఎక్కని మాటలను పక్కన పెడితే ఇక కొవ్వు ఎక్కిందా? మగతనం ఉందా? ఇవీ అసెంబ్లీలో వినిపించిన కొన్ని ‘ఆణిముత్యాలు.’ బాబుకు ఢిల్లీలో, సొంత రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి కూడా ఇబ్బంది తప్పడం లేదు. పాలనకు కొత్తే అయినా మొదట్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 1956 నిబంధన వంటి కొన్ని తప్పటడుగులు వేసినా పథకాల్లో తమకు తిరుగులేదని తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకుంటోంది. మీడియాలో అనుకూల వార్తలు ఎన్ని వచ్చాయి? వ్యతిరేక వార్తలు ఎన్ని అనే లెక్కలు పాలనకు కొలమానం కాదు. ఎన్నికల ఫలితాలే కొలమానం. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం వంటివి ప్రభుత్వానికి ప్రత్యేక ఇమేజ్ తెచ్చి పెట్టాయి. బాబు హయాంలో క్లింటన్‌ను హైదరాబాద్‌కు రప్పిస్తే, ముందు మీ రాష్ట్రంలో తాగునీరు లేని గ్రామాలు చాలా ఉన్నాయి వాటికి నీటి సౌకర్యం కల్పించండి అని ఆయన హైటెక్ సిటీవద్ద జరిగిన సమావేశంలో చెప్పి వెళ్లారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీటిని అందించే పథకం పనులు వేగంగా సాగుతున్నాయి.
కళ్యాణలక్ష్మి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం వంటివి ఆంధ్రలో సైతం అమలు చేయనున్నట్టు ఆంధ్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలోని షీ టీమ్స్ తరహాలో ఆంధ్రలో ప్రవేశపెట్టనున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ పథకాలతో పాటు ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాల పనితీరును ప్రతి అంశానికి పోల్చు తూ ప్రజలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ తరువాత టిడిపి అధికారంలోకి వచ్చిన సమయాల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పూర్తిగా భ్రష్టుపట్టించింది ఇప్పుడు మేం ఒక్కొక్కటి దారిలో పెడుతున్నాం అని చెప్పేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. తెలంగాణలో ఏం జరుగుతుందో ఆంధ్రలో చూస్తున్నారు, ఆంధ్రలో ఏం జరుగుతుందో తెలంగాణలో చూస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో పాలనను బేరీజు వేసుకుంటున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల తీరును పోల్చి చర్చించుకుంటున్నారు. ఇది కూడా చంద్రబాబుకు ఇబ్బంది కలిగించే అంశమే.


 మొత్తం మీద ఢిల్లీ, ఆంధ్ర, తెలంగాణ బాబుకు అన్నీ చక్రబంధాలే. రెండేళ్లు గడిచాయి, ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ఇప్పుడే ఒక అంచనాకు రావడం తొందరపాటు. మూడేళ్లలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటాయి. మూడేళ్ల కాలం అంటే కాపురాన్ని చక్కదిద్దుకోవడానికి ఇంకా చాలా కాలం ఉన్నట్టే.
-బుద్దా మురళి (ఎడిట్ పేజి )

10, మార్చి 2016, గురువారం

నా తెలంగాణా కోటి ఎకరాల వీణ

పేదరికం, కరవు, రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, అశాంతితో యువత, ఎన్‌కౌంటర్‌లు తెలంగాణ అనగానే ఒకప్పుడు గుర్తుకు వచ్చే వరుస క్రమం. ఇప్పుడు తెలంగాణ ముఖ చిత్రం మారుతోంది. నా తెలంగాణ కోటి రతనాల వీణ నిన్నటి మాట, నా తెలంగాణ కోటి ఎకరాల వీణ రేపటి మాట.

 సస్యశ్యామల తెలంగాణకు ఆంకరార్పణ జరిగింది. గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర తెలంగాణల మధ్య కుదిరిన ఒప్పందం చారిత్రక ఒప్పందం. పాలమూరు-రంగారెడ్డి దక్షిణ తెలంగాణను సస్య శ్యామలంగా మారిస్తే, మహారాష్టత్రో కుదిరిన ఒప్పందంతో కాళేశ్వరం తదితర ప్రాజెక్టులతో ఉత్తర తెలంగాణ స్వరూపాన్ని మారుస్తుంది. ఇది సాకారం కావడానికి మరో రెండు మూడేళ్లు పట్టవచ్చు. కానీ ప్రాజెక్టులు పూర్తి అయి తీరుతాయని తెలంగాణ వాదులకే కాదు తెలంగాణ ఆవిర్భావాన్ని తీవ్రంగా వ్యతిరేకించే వారికి సైతం స్పష్టత ఉంది. రెండు మూడేళ్లలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే తెలంగాణ కోటి ఎకరాల వీణగా పచ్చని పైర్లతో కళకళ లాడుతుంది.


తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ, కానీ ఆత్మమాత్రం గ్రామాలే. హైదరాబాద్‌కు ప్రపంచ ప్రఖ్యాత ఐటి కంపెనీలు ఎన్నయినా రావచ్చు. గూగుల్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, అమెజాన్ ఒకటేమిటి ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీలు ఎన్నయినా క్యూ కట్టవచ్చు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశానికి అంటవచ్చు. లక్షల మందికి హైదరాబాద్ ఐటి రంగం ఉపాధి కల్పించ వచ్చు. ఫ్లై ఓవర్లు, స్కై వేలతో ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందవచ్చు. విశ్వనగరంగా హైదరాబాద్ ప్రపంచ పటంలో చేరవచ్చు. ఇవేవీ అసాధ్యం కాదు. హైదరాబాద్‌లో ఇలాంటివి ఎన్ని జరిగినా గ్రామాలకు ఇంత కాలం ఒరిగిందేమీ లేదు. గ్రామాల్లో బీడుబారిన భూములు పచ్చదనంతో కళ కళ లాడినప్పుడే సాధించిన తెలంగాణకు అర్ధం. పరమార్ధం. గుండెకాయ సరిగా ఉంటేనే శరీరం సజీవంగా ఉంటుంది. కాబట్టి కచ్చితంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నిలబెట్టాల్సింది. ఇంకా పెంచాల్సిందే. రెండేళ్ల కాలంలో ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది.

 తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ధరలు అడుగంటి పోతాయని, చీకటి రోజులు తప్పవని హెచ్చరించిన వారికి చెంప ఛెళ్లుమనిపించేలా టిఆర్‌ఎస్ పాలించింది. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు అనేక హైదరాబాద్‌కు వచ్చేట్టు చేసింది. గుండెను జాగ్రత్తగా కాపాడుకుంది. ఇక గుండె తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడు ఆత్మపై దృష్టిసారించాలి. నెలకు వెయ్యి రూపాయల ఆసరా, ఆరు కిలోల బియ్యం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఒక మనిషి ప్రశాంతంగా జీవించేందుకు ఉపయోపడతాయి. ఒక పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి అద్భుతంగా పని చేస్తాయి. దీనికే పాలకులు తృప్తి పడితే ఇంత కాలం పాలించిన వారికి ఇప్పుడు పాలిస్తున్న వారికి తేడా ఉండదు. కేవలం జీవిస్తే సరిపోదు. తెలంగాణ గ్రామాలు సంపదతో కల కలలాడాలి. అది ఐటితో సాధ్యం కాదు వ్యవసాయంతోనే సాధ్యం అవుతుంది.

 పంట పండించే పొలం ఖరీదు ఎకరానికి లక్ష అయితే , అదే రియల్ ఎస్టేట్‌లో ప్లాట్లుగా మారిస్తే దాని ఖరీదు కోటి రూపాయలు కావచ్చు. ఒకేసారి కోటి రూపాయల ధర పలికినా దాని వల్ల కలిగే అభివృద్ధి కన్నా లక్ష రూపాయల ధర పలికే వ్యవసాయ పొలంలో పంట పండిస్తే గ్రామాల్లో కలిగే అభివృద్ధి ఎక్కువ.


రియల్ ఎస్టేట్ ధరల్లోనే సంపద దాగి ఉంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని స్థానికులంతా సంపన్నులు కావాలి. కానీ అలా జరగలేదు. కారు చౌకగా అమ్ముకున్న స్థానికుల పరిస్థితి దయనీయంగా ఉంటే కారు చౌకగా పొలాలను కొని ప్లాట్లు చేసిన వారు అపర కుబేరులయ్యారు.
ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు ఇప్పుడు కూడా మీడియా రంగం, రియల్ ఎస్టేట్, సినిమా రంగం అదీ ఇదని కాదు భారీ ఎత్తున పెట్టుబడులు అవసరం అయిన అన్ని రంగాల్లో కొన్ని ప్రాంతాల వారిదే ఆధిపత్యం. దానికి కారణం అక్కడ ఎప్పుడో నిర్మించిన ప్రాజెక్టులే. తిండి అవసరాలు తీరిన తరువాత అదనపు సంపాదనతో ఎన్నో ఆలోచనలు వస్తాయి, పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. అలా అదనపు సంపాదన సాధించిన వర్గాలే ఇప్పుడు అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి .


తెలంగాణలో హైదరాబాద్ విశ్వనగరం అయితే కావచ్చు కానీ గ్రామాల్లో పరిస్థితి ఇప్పటికీ సామాన్యుల జీవితం చేతికి నోటికి అన్నట్టుగానే ఉంది. రెండు మూడేళ్లలో కోటి ఎకరాలు సాగులోకి వస్తే గ్రామాల స్వరూపమే మారిపోతుంది. తెలంగాణ స్వరూపం మారిపోతుంది. ఆసరా కోసమో, ప్రభుత్వం కట్టించే ఇళ్ల కోసమే ఎదురు చూడరు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై ఇంత కాలం మొసలి కన్నీరే కార్చారు. 

తెలంగాణ ఆవిర్భవించిన కొత్తలో రైతుల ఆత్మహత్యలపై మీడియా అతిగా ప్రచారం చేసింది. ఇలా ప్రచారం చేయడం ద్వారా మీడియా ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకుందో, రైతులకు ఏ విధంగా ఆత్మ స్థయర్యం కలిగించదలుచుకుందో తెలియదు. ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ చేస్తానని ప్రకటించి చేయలేదని, దాని వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నానని అని ఒక రైతు లేఖ రాసి మరణిస్తే మీడియా పట్టించుకోలేదు. కానీ తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై చివరకు దసరా పండుగను కూడా జరుపుకోవద్దని మానవతా వాదులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో తెలంగాణ రైతుల కష్టాలపై సానుభూతి కన్నా తెలంగాణ సాధించుకున్నారనే కసి ఎక్కువ ఉంది. 

తెలంగాణను నడిపించేందుకు తాము సరైన నాయకత్వానే్న ఎన్నుకున్నామని ప్రజలు పదే పదే అనుకునేట్టుగా అధికార పక్షం ముందుకు వెళుతుంటే కాంగ్రెస్, టిడిపి వంటి విపక్షాలు తమ వైఖరి ద్వారా ఇదే విషయాన్ని చాటి చెబుతున్నాయ. హైదరాబాద్ లేనిదే తెలంగాణ లేదు. అయితే తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు. గ్రామాలు పచ్చగా ఉంటేనే తెలంగాణ సంపన్న తెలంగాణ అవుతుంది.


ప్రాజెక్టుల నిర్మాణం ద్వారానే తెలంగాణ సస్య శ్యామలం అవుతుంది. కోటి ఎకరాలకు సాగునీటిని అందిస్తామని ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్ ప్రకటించిన దాన్ని సీరియస్‌గా పట్టించుకోని వారు ఉంటే ఉండవచ్చు. ఉంటారు కూడా. కానీ తొలి రెండేళ్ల కాలం పగడ్బందీగా పథకాల రూపకల్పనపై దృష్టిసారించిన టిఆర్‌ఎస్ ఇప్పుడు తెలంగాణ పేదరికాన్ని శాశ్వతంగా పారద్రోలేందుకు సరైన మార్గంలో పయనిస్తోంది. అధికార పక్షం ఏం చేసినా వ్యతిరేకిస్తాం అనే ధోరణికి బదులు పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం పథకాలపై అసెంబ్లీ సమావేశాల్లో అర్ధవంతమైన చర్చ జరగాలి. రాజకీయ కోణంలో కాకుండా నిపుణులతో చర్చించి ఈ ప్రాజెక్టులు, ఒప్పందాల్లోని మంచి చెడులపై చర్చ జరగాలి. ప్రాజెక్టులు పూర్తయితే అధికార పక్షానికి మేలు జరుగుతుంది అనే కోణంలో కాకుండా ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణకు మేలు జరుగుతుంది, పూర్తయి మేలు జరగాలి అనే కోణంలో చర్చ జరగాలి. అధికార పక్షం అయినా, విపక్షం అయినా సర్వం తెలిసిన మేధావులేమీ కాదు. నీటిపారుదల రంగ నిపుణులతో చర్చించి ప్రభుత్వం నిర్ణయంలో తప్పులు ఏమైనా ఉంటే ఎత్తి చూపాలి. అదే విధంగా అధికార పక్షం సైతం సాంకేతికంగా తాము తీసుకున్న నిర్ణయం ఏ విధంగా సరైనదో అర్ధవంతంగా వివరించాలి. అంతిమంగా అధికార, విపక్షాల లక్ష్యం తెలంగాణ ప్రయోజనం కావాలి. ఈ అంశంలో తెలంగాణ ఒక విధంగా అదృష్ట వంతురాలే.


ప్రాజెక్టులతో అభివృద్ధి చెందిన ఆంధ్రలో కులాది పత్యంతో రాజకీయాలు సాగుతున్నాయి. కుల రాజకీయాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఆంధ్ర నేతలు నడిపించే తెలంగాణ రాజకీయాల్లో అదే ధోరణి కనిపించేది. కానీ ఇప్పుడు అది బలహీనపడింది. నామ మాత్రంగా నిలిచింది. దాని గురించి పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. ప్రాణహిత-రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేంద్రానికి చంద్రబాబు ఫిర్యాదు చేస్తే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశ్నించలేరు. ప్రశ్నించడం సాధ్యం కాదు కూడా. తెలంగాణ ప్రయోజనాలను అడ్డుకునే వారిని ప్రశ్నించలేనప్పుడు ఆ పార్టీని ప్రజలు ఎలా ఆదరిస్తారు? తెలంగాణ సాధించిన పార్టీ అధికార పక్షంగా, తెలంగాణ ఇచ్చిన పార్టీ విపక్షంగా నిలిచింది. 

తెలంగాణ ప్రజల అభివృద్ధి ఈ రెండు పక్షాల ప్రధాన అజెండాగా ఉండాలి. ఉంది కూడా. ఆవిధంగా ఉండడం తెలంగాణ అదృష్టం. అయితే ఈ ప్రయత్నాలన్నీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విధంగా ఉండాలి. బడ్జెట్ సమావేశాల్లో ఇది ప్రతిబింబించాలి.
బుద్దా మురళి (ఎడిట్ పేజి 10-3-2016)

6, మార్చి 2016, ఆదివారం

కుక్కే మందు కొట్టింది!

బుద్దా మురళి (జనాంతికం 6-3-2016)

ఆపదలో ఉన్న వారిని రక్షించినా యమపాశమై చుట్టుకుంటోంది. ... ఇదేం లోకం’’
‘‘ఈ విషయం సుప్రీంకోర్టు గుర్తించే ప్రమాదాల్లో ఉన్న వారిని రక్షించే వారిని వేధించకుండా చట్టాలు తీసుకు రావాలని సూచించింది. ’’
‘‘ నేను చెప్పేది దాని గురించి కాదు. రోడ్డు మీద ఎవరు చస్తే నాకేం.’’
‘‘ మరి దేని గురించి ?’’
ఆంధ్ర మంత్రిగారి కుమారుడు హైదరాబాద్‌లో నంబర్ లేని కొత్త కారులో రోడ్డుమీద పోతుంటే హచ్ కుక్క కనిపించింది. దాని ముఖం చూడగానే ప్రేమ కోసం పరితపిస్తున్నట్టు దివ్యదృష్టితో కనిపెట్టారు. కారు దిగి ఆ కుక్క పిల్లను ప్రేమగా నిమిరాడు. ఇది తప్పా? ఈ దేశంలో స్వేచ్ఛగా ఒక కుక్క పిల్లలను నిమరడం నేరమా? ఇటీస్ వెరీ దారుణం. వేర్ వుయ్యార్ గోయింగ్... కుక్కను ఆప్యాయంగా ముట్టుకుంటే, ప్రమాదంలో ఉన్న దాన్ని రక్షించాలని ప్రయత్నిస్తే కేసులు పెట్టడమా? ఎక్కడున్నాం మనం. ప్రజాస్వామ్య దేశంలోనేనా? గాంధీ, నెహ్రూ ఈ దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చింది ఇందుకోసమేనా? అర్థరాత్రి స్ర్తి వంటరిగా నడిచిన రోజే స్వాతంత్య్రం అని మహాత్ముడు అన్నారు, కానీ చూస్తుంటే అర్థరాత్రి మంత్రుల కుమారులు కూడా స్వేచ్ఛగా రోడ్డు మీద నడిచే పరిస్థితి లేదు. మార్చండి మన రాజ్యాంగాన్ని, మార్చండి మన చట్టాలను’’‘బాగా వాదిస్తున్నావోయ్.. రేపు కోర్టులో ఇదే వాదన వినిపించు జడ్జికి కూడా ముచ్చెమటలు పడతాయి. మంత్రి కుమారుడు బాగా తాగి ఎవరో అమ్మాయి చెయ్యి పట్టుకుని లాగాడని, ఆమెను ఫాలో అయినట్టు సిసి టివిల్లోని పుటేజ్‌ను టీవిల్లో తెగ చూపించేస్తున్నారు కదా? ’’

‘‘ శ్రీరాముడ్ని ప్రజలు అనుమానించారు, సీతమ్మను శ్రీరాముడు అనుమానించిన దేశం ఇది. మంత్రి గారు ఆంధ్ర రాజధానిలో కొన్న భూములను, కుమారుడి కొత్త కారును, ఆ దర్పాన్ని చూసి కన్నుకుట్టిన వారు ఇలాంటి నిందలు వేయడం సహజం. ఈ విషయం నీకు తెలుసా? వినాయక చవితి రోజున మంత్రి కుమారుడు రాత్రి పడుకునే ముందు పాలు తాగుతుంటే పాల గ్లాసులో చంద్రుడు కనిపించాడు. అతనిపై నీలాప నిందలు తప్పవు అని అప్పుడే అనుకున్నారట! నీకు తెలుసు కదా? శ్రీకృష్ణుడంతటి వాడికి వినాయక చవిత రోజున పాలలో చంద్రుడు కనిపిస్తే, నీలాప నిందల బారిన పడక తప్పలేదు. ఇక కిశోర్‌లు, సుశీల్‌లు ఎంత? ’’
‘‘ అంటే ఆ మంత్రి కుమారుడిది తప్పేమీ లేదంటావు?’’
‘‘ నిజాలు నిలకడ మీద తేలుతాయి. అసలు విషయం చెప్పాలా? నిజానికి మందు కొట్టింది మంత్రి కుమారుడు కాదు.. ఆ కుక్క! నిజం నువ్వు నమ్మాలి. రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా అడ్డ దిడ్డంగా పరిగెత్తిందంటే మందు కొట్టిందనడానికి ఇంకేం సాక్షం కావాలి. ఆ కుక్కను అరెస్టు చేసి, మద్యం తాగిందా లేదా? అని పరీక్షించాల్సిన పోలీసులు తమ బాధ్యత మరిచి బాధ్యతాయుతమైన మంత్రి కుమారుడిపై బాధ్యతా రాహిత్యంగా కేసు పెట్టారు. ఒక్క క్షణం ఆలోచించు ప్రపంచానికే పాఠాలు చెప్పిన ముఖ్యమంత్రి మంత్రివర్గంలోని ఒక మంత్రి కుమారుడు అంటే అల్లాటప్పా కాదు. మంత్రి కుమారుడి అసామాన్యమైన ప్రతిభ వల్ల ఏనాటికైనా ఇటు కెటిఆర్‌కు అటు జగన్‌కు ప్రమాదం పొంచి ఉందని గ్రహించే కుట్ర పన్ని ఇలా చేశారు.’’
‘ నువ్వన్నదే నిజమైతే... బాబు వారుసుడికి ప్రమాదం కావచ్చు ’’
‘‘ ఇదంతా ఎందుకు? అంత బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న మంత్రి కుమారుడు ఇలాంటి పనులు చేస్తాడని నువ్వు నమ్ముతున్నావా? ’’
‘‘ మనకన్నా రెట్టింపు జిల్లాలు, నాలుగింతల సంపద, దేశానికి ఆర్థిక రాజధానిగా గుర్తింపు ఉన్న మహారాష్ట్ర మంత్రిగారే విమానంలో ఏయిర్ హోస్టెస్‌తో అభ్యంతర కరంగా వ్యవహరించి పదవి పోగొట్టుకున్న విషయం తెలియదా? దేశంలోనే ఎదురు లేని పోలీసు వీరుడిగా నిలిచిన గిల్ ఒంటి చేత్తో పంజాబ్‌లో తీవ్రవాదాన్ని తుద ముట్టించాడు. అదే గిల్ మరో చేత్తో ఐఎఎస్ అధికారిని గిల్లి నవ్వుల పాలయ్యాడు కదా? ఏకంగా అసెంబ్లీలోని సెల్ ఫోన్‌లో బూతు సినిమాలు చూస్తూ పట్టుపడ్డ ప్రబుద్ధులున్నారు. హోదాకు చిల్లల పనులకు సంబంధం ఏమిటోయ్’’
‘‘ ఎక్కడో ఢిల్లీలో అత్యాచారం జరిగితే తీసుకు వచ్చిన నిర్భయ చట్టం కింద మన మంత్రి కుమారుడిపై కేసు పెట్టడం అంటే ఉత్తరాది పెత్తనాన్ని దక్షిణాదిపై రుద్దడమే కదా? నిర్బయ చట్టానికి వ్యతిరేకంగా నిర్బాగ్యుడు చట్టం కోసం తెలుగు వాళ్లం ఉద్యమించాలి’’
‘‘ ఇదేం చట్టం, దీని లక్ష్యం ఏంటి? ’’
‘‘ మంత్రులన్నాక ఎన్నో బాధ్యతలు ఉంటాయి. సామాన్యుడు ఓ రెండు వందల గజాలు కొనుక్కుని ఇల్లు కట్టుకున్నట్టు వీళ్లు కనీసం వెయ్యి ఎకరాలైనా కొనుక్కుని చక్కగా అభివృద్ధి చేయాలనుకుంటారు. దీన్నీ తప్పు పడుతున్నారు. సామాన్యులకు మంత్రులకు ఒకే చట్టాలు అంటే ఎంత అన్యాయం. కార్మిక చట్టాలు ఇతర సాధారణ చట్టాలు ఎస్‌ఇజడ్‌లలో వర్తించవు. అలానే మంత్రులు, వారి దగ్గరి కుటుంబ సభ్యులకు ఇలాంటి చట్టాలు వర్తించకుండా రాజకీయ ఎస్‌ఇజడ్‌లను ఏర్పాటు చేసి, అందరికీ వర్తించే చట్టాలు వీరికి వర్తించవు అనే చట్టాలు తీసుకురావాలి. లేక పోతే అభివృద్ధి నిలిచిపోతుంది? లోకం అల్లకల్లోలమవుతుంది. మన ఇమేజ్ దెబ్బతింటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పాలకులు చట్ట వ్యతిరేకమైన చర్యలు ఏం చేసినా చట్ట ప్రకారం రక్షణ కల్పించడం ఈ చట్టం లక్ష్యం. ’’
‘‘ ఏం చేసినా పాలకులు వదిలేస్తున్నారు కదా? ’’
‘ పాలకుడు పెద్ద మనసుతో చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు, కానీ చట్టం తీసుకు వచ్చి కాపాడాలి. నిర్బయ చట్టానికి పోటీగా నిర్బాగ్యుడు చట్టం తీసుకురావాలి. ఈ చట్టం ప్రకారం పెద్ద వాళ్లు ఎలాంటి తప్పు చేసినా ఎవరైనా కేసు పెడితే కేసు పెట్టిన వారినే బొక్కలో వేయాలి.’’
‘‘ అసలు కుక్కే లేదని టీవిల్లో సిసి పుటేజ్ చూపిస్తున్నారు కదా? ’’
‘‘ అసలు కుట్ర దారు ఐన కుక్కను మాయం చేసిన ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి’’