31, జనవరి 2016, ఆదివారం

నేను హైదరాబాద్ ను ....

‘‘గందరోగళంగా కనిపిస్తున్నావ్ , నగరానికి కొత్తా?’’
‘‘కొత్త కాదు..  మీరంతా పుట్టక ముందు నుంచి ఉన్న పాత మీ అందరి కన్నా చాలా పాత.  నా సంగతి సరే ఇంతకూ నువ్వెవరివి? ’’
‘‘నేను పాదచారిని నడిచే బాట ఎక్కడైనా ఉందేమోనని వెతుకుతున్నాను. ఎక్కడ మాయమైందో తెలియడం లేదు. నువ్వేవరో? దేని కోసం నీ అనే్వషణో చెప్పనే లేదు. ’’
‘‘నేను హైదరాబాద్ నగరాన్ని. నా గురించి నేను తెలుసుకుందామని బయలు దేరాను’’
‘‘లోకేశ్ నువ్వేవరో నిన్ను వాళ్ల తాత ఎలా నిర్మించారో చక్కగా చెప్పారు కదా? ’’

‘‘ లోకేశెవరు? కులీకుతుబ్‌షా మనవడా? అలా ముఖం పెట్టావు ఈ హైదరాబాద్ నగరంలో నివసిస్తూ నగరాన్ని నిర్మించిన కులీ కుతూబ్‌షా తెలియదా? ఐదు వందల సంవత్సరాల క్రితం నన్ను నిర్మించి, దేవుని చల్లని చూపుతో అన్ని ప్రాంతాల వారు ఇక్కడ నివసించే విధంగా దీవించమని ప్రార్థించాడు. ఆయన కోరుకున్నట్టే ఇదో మినీ భారత్ అయింది. పుట్టిన పల్లెను ప్రేమించినంతగా హైదరాబాద్‌ను ప్రేమిస్తారు. నీకు కులీకుతూబ్‌షా తెలియదంటే నమ్మలేకపోతున్నాను’’
‘‘మొన్ననే లోకేశ్ బాబు కూడా చరిత్రను కళ్లకు కట్టినట్టు చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని వాళ్ల తాత నిర్మిస్తే, తండ్రి అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో పెడితే, ఆయన ఎక్కడికో తీసుకు వెళతానంటున్నారు. నువ్వు వినలేదా?’’
‘‘వినకపోవడం ఏమిటి? ఆ ఉపన్యాసాలు విన్న తరువాతే కదా నేనెవరో తెలుసుకోవాలని ఇలా బయలు దేరింది. ఇక్కడేవో ఎన్నికలు జరుగుతున్నట్టుగా ఉన్నాయి. వాళ్ల ఉపన్యాసాలు విన్నాను, బుర్రలో గిర్రున తిరుగుతున్నాయి. అందుకే అయోమయంగా కనిపిస్తున్నాను. ‘మీరంటే గూగుల్ వెతుకు తారు. నేను కాస్త మనసు పెట్టి కళ్లు మూసుకుంటే ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిపోతాను. నాకు కనిపిస్తున్న దానికి ఇక్కడ మైకుల్లో వాళ్లు చెబుతున్న దానికి ఏమాత్రం సంబంధం లేదు. తెలుగే సరిగా మాట్లాడలేని ఈ కుర్రాడు హిందీలో నా చరిత్ర చెబితే విని, వీళ్ల తాత గురించి వెతికాను. వీళ్ల తాత వైస్‌రాయ్ హోటల్ వద్ద బస్సుపై కనిపించాడు. మంచి నటుడు శ్రీరాముడు, రావణుడు, కర్ణుడు ఏ వేషం వేస్తే ఆ వేషంలో పరకాయ ప్రవేశం చేసేస్తాడు. దేవుళ్ల పాత్రలో ఈయన నటించారా? దేవుళ్లు ఈయనలా నటించారా? అని సందేహించేంతగా పాత్రలో లీనమయ్యేవారు. పాపం అలాంటి పెద్దమనిషి వైఎస్‌రాయ్ హోటల్ వద్ద బస్సుపై నిలబడి తమ్ముళ్లూ భయపడకండి బయటకు రండి అంటూ వేడుకుంటుంటే, అభిమానులు చెప్పులు విసరడం చూశాక భూ కంపాలకు కూడా కదలని మహానగరాన్ని నేనే కదిలిపోయానంటే నా కళ్లల్లో నీళ్లు వచ్చాయంటే నమ్ము. వాళ్ల నాన్న, తాత, ముత్తాతల వంశం పుట్టక ముందే నేను ప్రపంచ పటంలో ఉన్నాను కదా వీళ్లు ననె్నప్పుడు ప్రపంచ పటంలో పెట్టారో?’’

‘‘అంత మాటంటున్నావ్ కానీ ఆయనే కనుక లేకపోతే నీ ముఖం ఎవరు చూసే వారు? ఆయన హైటెక్ సిటీ కట్టక పోతే హైదరాబాద్‌కున్న విలువేమిటి?’’
‘‘ నేను కనుక హైదరాబాద్‌ను 15నెలల్లో నిర్మించాను, మోదీ కూడా కట్టలేకపోయారు అంటూ ఆయన చెప్పుకుంటున్న మాటలు విన్నాను. నిజంగా అది నీ గొప్పతనం అయితే హైదరాబాద్‌లో 15నెలల్లో కట్టిన మొనగాడు, అమరావతిలో 19 నెలలైనా కనీసం ఓ టాయ్‌లెట్ కూడా కట్టలేకపోయారేమిటి? పోనీ ఇంకా మూడేళ్ల గడువు ఉంది కదా? అమరావతిలో మూడేళ్లలో ఓ హైటెక్ సిటీ కట్టించి చూపిస్తే బాగుంటుంది. నేదురుమళ్లి జనార్దన్‌రెడ్డి కాలంలో రూపకల్పన చేసిన హైటెక్ సిటీ అనే ఓ భవనం నాపై వీళ్ల నాన్న హయాంలో నిర్మించారు. అనేక మంది పాలకులు తమ తమ కాలంలో కొన్ని వందల భవనాలు నా పై నిర్మించారు. ఒక్క భవనం నిర్మించిన మెస్ర్తి ప్రపంచాన్ని తానే నిర్మించాను అనుకున్నట్టుంది. చంటి బాబు లోకల్ అంటూ నా చరిత్ర చెబుతుంటే బుర్ర తిరుగుతోంది. ’’
‘‘ ఐతే నువ్వు హైదరాబాద్ వన్నమాట? ’’
‘‘ అదే చెబుతున్నాను. నేను హైదరాబాద్‌నే కానీ నేనెవరినో తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నాను. ఆయనెవరో చక్కని ప్రాసలతో భలే మాట్లాడుతున్నారు. సినిమాల్లోకి వెళితే టాప్ డైలాగ్ రైటర్‌గా నిలుస్తారు. తరువాత డైరెక్షన్ చేయోచ్చు కూడా కానీ పాపం ఎండలో నిలబడి ప్రాసలతో జనాన్ని ఎంత నవ్విస్తున్నారో? ’’

‘‘నువ్వు చెబుతున్నది వెంకయ్య గురించా? ఆయన డైలాగ్ రైటర్ కాదు, గొప్ప రాజకీయ నాయకుడు. ’’
‘‘ అదే చెప్పబోతున్నా రైటర్ కాబోయి లీడర్ అయ్యారు. ఇంకో నాయుడితో కలిసి హైదరాబాద్‌ను మేమే సృష్టించామని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ తెరిచి చూస్తే హైదరాబాద్ పార్లమెంటుకు పోటీ చేసే ప్రయత్నం చేస్తే ఆ పార్టీ వాళ్లే ఈయన్ని కింద పడేస్తే కర్నాటకలో తేలి పార్లమెంటులో ప్రత్యక్షం అయ్యారు. ’’
‘‘ కెసిఆర్‌ను కలువలేకపోయావా? చరిత్రను అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టుగా చెబుతారు’’
‘‘ గంగాజమునా తహజీబ్ అంటూ హైదరాబాద్ గురించి చెబుతున్నారు. హుస్సేన్‌సాగర్ తాగునీటి సరస్సుగా ఉన్నప్పటి కాలం నుంచి నగరాన్ని వర్ణించి చెబుతున్నారు. నిజమా? అనుకుని హుస్సేన్ సాగర్ నీళ్లు నోట్లో పోసుకున్నావనుకో చరిత్రలో కలిసిపోతాం అంతే’’

‘‘అయ్యో నీ గురించి నీకు ఆయనే చెప్పలేకపోయారంటే ఇంకెవరు చెబుతారు? ఆ అసదుద్దీన్ అని ఒకాయన ఉన్నారు. ఆయనకు తెలియని చరిత్ర లేదు. ’’
‘‘ ఆయన్ని  కలిశాకే మరింత గందరగోళం పెరిగింది. అందరూ హైదరాబాద్‌ను నిర్మించింది మేమే అంటే ఈయనేమో హైదరాబాద్‌నే నేను అంటున్నారు. మరి ఆయన హైదరాబాద్ అయితే నేనెవరిని? అనే ఆలోచన బుర్రను తొలిచేస్తుండడంతో ఇలా రోడ్డున పడ్డాను.’’
‘‘ చరిత్రకే చరిత్ర చెబుతున్న పసి కూనలను చూస్తుంటే జాలేస్తోంది. శ్రీరాముడంతటి దేవునికి నేనెవరినీ అనే సందేహం వచ్చి వశిష్టుని ఇంటి తలుపు తట్టాడు. ఎవరూ అని గురువు అడిగితే అది నేనెవరో తెలుసుకోవడానికే వచ్చాను అన్నారట! రాములోరికి గురువు ఉన్నారు నీకు అదీ లేరు. ఇంటింటి తలుపు తట్టు ఎవరో ఒకరు చెప్పకపోరు .’’
-బుద్దా మురళి (జనాంతికం 31-1-2016)

24, జనవరి 2016, ఆదివారం

ఏమిటీ వార్తలు?

‘‘ఇరానీ రానీ హోటల్‌లో టీ తాగే డబ్బుతో రెండు పేపర్లు కొనుక్కోవచ్చు. ఉడిపి హోటల్‌లో టీ అయితే రెండు తెలుగు పత్రికలకు తోడు ఓ ఇంగ్లీష్ పత్రిక వస్తుంది. ఇంట్లో చానల్ ఆన్ చేస్తే 24 గంటల పాటు వార్తలు చెప్పే చానల్స్ తెలుగులో 24, ఇతర భాషల్లో మరో 64 ఉన్నాయి. ఎంత జర్నలిస్టు మిత్రుడిని అయితే మాత్రం రోజూ ఇలా వచ్చి, ఏంటి వార్తలు అని  వార్తలు అడుక్కోని వెళ్లడం నాకేమీ నచ్చలేదోయ్ కామేశం’’


‘‘ పత్రికల్లో, టీవిల్లో వాళ్లకు నచ్చిన వార్తలు వేస్తారు. నాకు నచ్చిన వార్తలు, నాకు నచ్చేట్టుగా చెప్పేది నువ్వే. అందుకే నిన్ను అడుగుతున్నాను? టీ డబ్బులతో పత్రికలు కొని వార్తలు చదవ వచ్చేమో కానీ టీ ఇచ్చి మరీ వార్తలు చెప్పేవారు ఉండరు కదరా! చెల్లెమ్మా మంచి వేడివేడి టీ పంపించు.. సర్లేవోయ్ సంక్రాంతికి ఊరెళ్ళి వచ్చావు కదా? అక్కడి వార్తలేంటి? మన చిన్ననాటి మిత్రులు ఏమంటున్నారు?.’’
‘‘మన వీరేశం సినిమా హాల్‌ను, వ్యవసాయాన్ని చూసుకుంటూ ఊళ్లోనే ఉన్నాడు. ’’
‘‘ వాడెందుకు తెలియదు మన స్కూల్‌లో అందరి అవసరాలు తీర్చిన ఫైనాన్షిర్ కదరా? వాళ్ల సినిమా హాలులో ఉచితంగా చూసిన సినిమాలు, దొంగచాటుగా వాడు ఇంట్లోంటి ఎత్తుకొచ్చిన డబ్బుతో సిటీకి వెళ్లి చూసిన సినిమాలు ఎప్పటికీ మరిచిపోను’’
‘‘కత్తితో జీవించే వాడు ఆ కత్తికే బలవుతాడు అన్నట్టు పాపం ఆ సినిమాలే వాడి కొంప ముంచాయి.’’
‘‘ఏమైంది? ’’


‘‘ మహేశ్ బాబునే చేసుకుంటానని వాళ్ల అమ్మాయి పట్టుపట్టిందట! మహేశ్ బాబు ఆ పేరు వింటేనే వైబ్రేషన్ అని ఒకటే గోల. మహేశ్‌కు ఎప్పుడో పెళ్లయిపోయింది. వాళ్ల నాన్నలా రెండో పెళ్లికి ఒప్పుకోడని అంతా నచ్చజెప్పడంతో సరే మహేశ్ అంత అందగాడు అయితే పెళ్లికి ఒప్పుకుంటాను అంది.’’
‘‘ ఊరి విశేషాలు చెప్పరా అంటే అష్టాచెమ్మా సినిమా కథ చెబుతున్నావా? ఆ సినిమా నేనూ చూశాను’’
‘‘ ఆష్టాచెమ్మా సినిమా కథ కాదు.. వీరేశం గాడి కష్టాల కథ. డబ్బుకు కొదవ లేదు కానీ ఉన్న ఒక్క కూతురుకు ఎంతో తంటాలు పడి మహేశ్‌బాబంతటి అందగాడిని వెతికి పట్టుకొచ్చి పెళ్లి చేశారు. ’’
‘‘ సంతోషం ఇంకేం’’


‘‘సంతోషమే కానీ అది తక్కింది పెళ్లి కుమారుడికి. శోభనం  రాత్రి తెల్లవారాక  పెళ్లి కొడుక్కు బట్టతల అని తెలిసింది. రెండు రోజులు గడిచాక మహేశ్‌బాబుది కూడా బట్టతల అని అబ్బాయి ఆధారాలతో సహా నిరూపించాడు. ఇప్పుడేం చేయాలో వీరేశం గాడికి, వాడి కూతురుకు అర్ధం కావడం లేదు. జీవితమంటే రెండు గంటల సినిమా కాదాయే. మహేశ్ అంత అందం ఉంది, మహేశ్‌లా బట్టతల ఉంది. కోర్టుకు వెళ్లినా కేసు నిలవదు.’’


‘‘విలేజ్ వార్తలు చాలు..ఇంకేంటి విశేషాలు’’
‘‘ నేను పనీ పాటా లేకుండా కూర్చున్నట్టు నీకూ.. మా ఆవిడకు అనిపిస్తుండొచ్చు. కానీ ఏం వార్త రాయాలని ఆలోచిస్తూ ఉంటాం’’
‘‘ అదేంటిరా! జరిగినవి రాయడం, చూపించడమే జర్నలిజం కదా? కథ రాసినట్టు ఊహించడం ఏమిటి? ’’
‘‘జరిగిన సంఘటనకు అక్షర రూపం ఇవ్వడం పూర్వకాలం నాటిది. అనుకున్నది రాయడం, చూపడమే నవీన జర్నలిజం.కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది కానీ, చల్లకొచ్చి ముంత దాచినట్టు ఏదో దాస్తున్నావేంటి?’’
‘‘ ఏమీ లేదు నాకు బాగా తెలిసిన ప్రెండ్ ఇది ఇచ్చాడు. చానల్స్‌లో, పత్రికల్లో ప్రముఖంగా రావాలి. నా చిన్నప్పటి మిత్రుడు ఉన్నాడని, హామీ ఇచ్చి వచ్చాను. సింపుల్‌గా నాలుగు డిమాండ్లు మీడియాలో రావాలి. ’’


‘‘ప్రధానమంత్రి వెంటనే రాజీనామా చేయాలి
కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి
సీతాఫల్‌మండిలో రోడ్డును వెడల్పు చేయాలి
అక్కపల్లి రేషన్ షాప్ డీలర్‌షిప్ రద్దు చేయాలి
నాకు నెల రోజుల సెలవు కోసం మా బాస్‌ను కేంద్రం ఒప్పించాలి... ఇట్లు అక్కపల్లి మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అంకయ్య... వామ్మో ఇలాంటి డిమాండ్లు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇంతకూ అంకయ్య ఏం చేస్తాడు యూనివర్సిటీ ప్రొఫెసరా? ’’


‘‘ ఏం అలా అడిగావ్? ’’
‘‘పాఠాలు చెప్పకపోయినా ప్రధానమంత్రి తప్పుకోవాలి అని డిమాండ్ చేయగలిగేది వాళ్లే అందుకే అడిగాను. ’’
‘‘ కాదు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. అంతా చర్చించి ప్రతి డిమాండ్ సహేతుకంగా ఉందని తేలిన తరువాతనే అక్కపల్లి డిమాండ్స్‌ను రూపొందించారు. డిమాండ్ల పత్రం చదవగానే యూనివర్సిటీ ప్రొఫెసరా? అని అడిగావ్ కదా? ప్రభుత్వ ఉద్యోగులను, యూనివర్సిటీ ప్రొఫెసర్లను ఒక రకంగా ప్రైవేటు ఉద్యోగులను ఒక రకంగా చూడడం అంటే వివక్ష చూపడమే కదా? అదేదో యూనివర్సిటీ వివాదంపై ఆఫ్రికా, అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రధానమంత్రిగా వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. మాకు జరుగుతున్న అన్యాయానికి మేం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. మా వాడు ఏదో సరదా పడి కాశ్మీర్ వెళ్లి వద్దామని నెల రోజులు సెలవు పెడితే ఉద్యోగం కావాలో, కాశ్మీర్ కావాలో తే

ల్చుకోమన్నారు. ఇప్పుడు చెప్పు మా డిమాండ్ల సహేతుకమైనవా కాదా? అమెరికాలో సైతం మా డిమాండ్లపై ఉద్యమించేందుకు అక్కడున్న మన ఊరి వాళ్లకు మేయిల్ చేశాను. ప్లకార్డులు పట్టుకుని వివక్షకు వ్యతిరేకంగా ఆమెరికాలో ఆందోళన చేయమని చెప్పాను’’


‘‘ అమెరికాలో ఓ స్కూల్ పిల్లాడు ఏదో సరదాగా బాంబు అంటే తీసుకెళ్లి లోపలేశారు. ఇక మీ వాళ్లు అమెరికాలో ఉద్యమాలు చేస్తే కార్గోలో కుక్కి ఇండియాలో పడేస్తారు జాగ్రత్త. చదువుకుంటామని వచ్చిన పిల్లలనే రెండు రోజులు చీకటిగదిలో బంధించి పంపిస్తున్నారు. ఒక్కోసారి ఇండియాను ఇండియా పాలించడం కన్నా అమెరికా పాలించడమే బెటర్ అనిపిస్తుందిరా! ఇంకేమన్నా మాట్లాడితే నామీద కూడా వర్ణ వివక్ష అని కేసు పెట్టేట్టుగా ఉన్నావు.  నాకెందుకులే నన్ను వదిలేయ్.ఏ దేశానికైనా అనేక శత్రు దేశాలు ఉంటాయి. కానీ బహుశా దేశంలోనే సొంత దేశానికి వ్యతిరేకంగా దేశంలోనే మరో  శత్రు దేశం ఉన్న ఘనత మనకే దక్కుతుందేమో!’’
-బుద్దా మురళి (జనాంతికం 24-1-2016)

20, జనవరి 2016, బుధవారం

కెటిఆర్‌కు వారసత్వ పరీక్ష...కెసిఆర్ ఆరోగ్యం పై పుకార్లు .. వారసత్వం లో ఎన్టీఆర్ కెసిఆర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు ఎలా అయినా ఉండవచ్చు, ఎన్నికలు జరగకముందే ఒక కీలకమైన విషయంలో మాత్రం ఈ ఎన్నికలు స్పష్టత నిచ్చాయి. కెసిఆర్ రాజకీయ వారసుడు ఎవరు? అనే ప్రశ్న ఉదయించక ముందే కెసిఆర్ వారసుడు కెటిఆర్ అని తేల్చేశాయి. 

ఎన్నికలు జరుగుతాయా? లేదా? జరిగితే ఎప్పుడు అని విపక్షాలు ఆయోమయంలో ఉన్న కాలంలోనే కెటిఆర్ హైదరాబాద్‌ను చుట్టు ముట్టేశారు. వారసుడు సరే వారసునికి పట్ట్భాషేకం ఎప్పుడు? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చాలా బలంగా జరుగుతున్నా వారి అంచనాలను పటాపంచలు చేస్తూ కెసిఆర్ వచ్చే ఎన్నికల్లో సైతం తన నాయకత్వంలోనే విపక్షాలకు భంగపాటు తప్పదనే దోరణిలో దూసుకుపోతున్నారు.


పన్నెండు  గంటలపాటు  క్యాబినెట్ సమావేశం .. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఇదో రికార్డు. ఉదయం పదకొండు గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం అయితే రాత్రి 11 గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలనపై సుదీర్ఘంగా  మీడియాకు వివరించారు. అంత సమయం పాటు క్యాబినెట్ సమావేశం జరిగిందని రెండు వారాల తరువాత ప్రత్యేకంగా చెప్పుకోవడంలో ప్రాధాన్యత లేకపోవచ్చు. కానీ ఆ సమయంలో ఇటు మీడియాలో, అటు మంత్రుల మధ్య ఒకే సమయంలో భిన్నంగా సాగిన ఆలోచనలే ఇక్కడ కీలకం.


2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయినప్పుడు టిఆర్‌ఎస్ ఉనికిని కెసిఆర్ నాయకత్వాన్ని సీమాంధ్ర నాయకత్వం సీరియస్‌గా తీసుకోలేదు. కరీంనగర్ బహిరంగ సభ తరువాత ఇది ఆషామాషి వ్యవహారం కాదనే నిర్ణయానికి వచ్చారు. ఆ తరువాత సిద్దిపేట ఉప ఎన్నికల్లో కెసిఆర్ విజయం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కెసిఆర్ ఉనికి చాటుకోవడం. దాదాపు అదే సమయం నుంచి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై చాలా బలంగా ప్రచారం ప్రారంభమైంది. మాట్లాడేది మీడియానే, ప్రచారం చేసేది మీడియానే అయితే నేరుగా ఏ మీడియా కూడా ఆరోగ్యంపై వార్తలను ప్రసారం చేయదు. కానీ ప్రచారం చేస్తుంది. ఈ ప్రచార ప్రభావం తోటి మీడియా మిత్రులపై కూడా పడుతుంది. మార్చిలో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు కదా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మీట్‌ది ప్రెస్‌లో ఒక జర్నలిస్టు కె తారక రామారావును అడిగిన ప్రశ్న. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై పుట్టిన పుకారుకు మర్యాదకరమైన రూపం ఇస్తే పుట్టిన ప్రశ్న ఇది.


ఇక మళ్లీ క్యాబినెట్ సమావేశం విష యానికి వస్తే ఉదయం పదకొండుకు క్యాబినెట్ సమావేశం ప్రారంభం అయ్యాక. క్యాబినెట్ ముగియగానే బ్రీఫింగ్ ఉంటుంది అని మీడియాకు సమాచారం పంపారు. మహా అయితే ఒంటిగంట వరకు అయిపోతుందని భావించారు. ఎంతకూ ముగియకపోవడంతో అప్పటికే ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి ఇద్దరు ముగ్గురు విలేఖరులు మారిపోయారు. అర్ధరాత్రి వరకైనా సరే అని సిద్ధపడిన చివరి విలేఖరుల బృందం మిగిలింది. ఆ బృందం సైతం దాదాపు నాలుగు గంటల పాటు ఎదురు చూస్తూ విసిగిపోయి ఉంది. రెండు రోజుల్లో గవర్నర్ మార్పు అని ఏడాది నుంచి ప్రచారం చేస్తున్న మీడియాకు చెందిన విలేఖరి ఒకరు కెసిఆర్ ఆరోగ్యం బాగాలేదట కదా? కిడ్ని మార్పుకోసం అమెరికా వెళతారట కదా? అంటూ చర్చ మొదలు పెట్టగానే పక్కనున్న మరో జర్నలిస్టు... ఈవయసులో మనం నాలుగు గంటల పాటు వేచి చూసి అపసోపాలు పడుతున్నాం, సిఎం పన్నెండు  గంటల పాటు క్యాబినెట్ సమావేశంలో మాట్లాడుతున్నారు. ఆరోగ్యంగా ఉన్న యువకులం నాలుగు గంటల పాటు వేచి చూడలేకపోతుంటే ఆ వయసులో ముఖ్యమంత్రి అన్ని గంటల పాటు సమావేశం నిర్వహిస్తున్నారంటే ఆరోగ్యంగా ఉన్నట్టా లేనట్టా? అని చిరాకు పడుతూ ప్రశ్నించాడు. కొద్ది సేపటికే సిఎం కన్నా ముందు విలేఖరుల వద్దకు వచ్చిన మంత్రులు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు మీలో ఎంత మంది స్పృహతప్పి పడిపోయారో అని క్యాబినెట్లో  అనుకుంటున్నాం అని చమత్కరించారు.


తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వర్గాలు చివరకు కెసిఆర్ ఆరోగ్యంపై సైతం ఉద్యమ కాలం నుంచే భయంకరంగా ప్రచారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి ఈ ప్రచారం మరింత పెంచారు. చివరకు కిడ్ని మార్పిడి కోసం అమెరికా వెళుతున్నారనే ప్రచారం సాగింది. ఆరోగ్యంగా ఉన్నవారికి మాత్రమే చైనా వాల్ ఎక్కేందుకు అనుమతి ఇస్తారు. కెసిఆర్ చైనా వాల్ ఎక్కి వచ్చినా ఈ ప్రచారం మాత్రం ఆగలేదు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే కెటిఆర్‌కు గ్రేటర్ బాధ్యతలు అప్పగించారు. శంకుస్థాపనల పేరుతో  కెటిఆర్ నగరాన్ని చుట్టేశారు. టిడిపి, టిఆర్‌ఎస్ ప్రాంతీయ పార్టీలు ఏవైనా కావచ్చు, పొలిట్ బ్యూరో, ఎన్నికల కమిటీలు, కార్యవర్గాలు అన్నీ ఉత్తుత్తివి. అధినేత ఒక నిర్ణయం తీసుకుని వ్యూహాన్ని ఆచరణలో పెట్టిన తరువాతనే కమిటీల ఏర్పాటు తతంగం సాగుతుంది. కెటిఆర్ గ్రేటర్ ఎన్నికల కోసం హైదరాబాద్‌ను చుట్టేయడంతో వారసత్వంపైన, కెసిఆర్ ఆరోగ్యంపైన మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎన్నికల్లో చావు తప్పి కన్నులోట్టపోయినట్టుగా ఉన్న విపక్షాలకు, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వర్గాలకు కెసిఆర్ అనారోగ్యం అనే పుకారు కాసింత ఉపశమనం కలిగించవచ్చు.... కానీ కెసిఆర్‌కు అనారోగ్యం అని నమ్మిన నాయకులు రాజకీయాల్లో చావుదెబ్బతిని రాజకీయ విశ్రాంతి తీసుకుంటుంటే, కెసిఆర్ మాత్రం మరో పదేళ్ల తరువాత చేతికి అంది వచ్చే వారసునికి రాజకీయ శిక్షణ ఇవ్వడంలో చురుగ్గా ఉన్నారు. 

తాను పదేళ్లు పాలించడమే కాకుండా తన వారసునిగా కెటిఆర్‌ను తీర్చిదిద్దడానికి పూనుకుని కెటిఆర్‌కు తొలి అసైన్‌మెంట్‌గా గ్రేటర్ హైదరాబాద్ బాధ్యతలు అప్పగించారు. గ్రేటర్ మేయర్ పీఠం టిఆర్‌ఎస్‌ది కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కెటిఆర్ ధీమాగా చెబుతున్నారు. తెలంగాణ జనాభాలో 30శాతం మంది గ్రేటర్ పరిధిలోనే ఉంటారు. ఉద్యమ కాలంలో తెలంగాణలో టిఆర్‌ఎస్ జెండా ఎగురవేసినా గ్రేటర్ పరిధిలోకి వచ్చే సరికి అంతగా ప్రభావం చూపలేకపోయింది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత గ్రేటర్‌లో టిఆర్‌ఎస్ ప్రభావం బలంగా కనిపిస్తోంది. మేయర్ పీఠం దక్కించుకోక పోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కెటిఆర్ సవాల్ చేసినా విపక్షాలు స్వీకరించలేనంత బలంగా టిఆర్‌ఎస్ గ్రేటర్‌లో కనిపిస్తోంది. సాధారణంగా అధికార పక్షానికి నెగిటివ్ ఉంటుంది. కానీ 18 నెలల్లో టిఆర్‌ఎస్ సానుకూల వాతావరణం ఏర్పడేట్టు చేయడంలో కెసిఆర్ విజయం సాధించారు.


గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోనే కెసిఆర్ వారసుడు ఎవరు? అనేది తేలిపోయింది. కెసిఆర్ వారసుడు ఎవరు? అనే దానిలో పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు అందరికీ స్పష్టత ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో వారసుడు ఎవరు అనేది ప్రజలకు, పార్టీ శ్రేణులకు కూడా స్పష్టమైంది. బలం లేకపోవడం వల్లనే గత ఎన్నికల్లో అసలు పోటీ చేయని గ్రేటర్‌లో కెటిఆర్ నాయకత్వంలో విజయం సాధిస్తే, వారసత్వానికి ప్రజల నుంచి కూడా ఆమోదం లభిస్తుందనే వ్యూహంతోనే గ్రేటర్ బాధ్యతలు కెటిఆర్‌కు అప్పగించి ఉండవచ్చు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టిన టిడిపినే మూడవ తరం వారసుడిని సిద్ధం చేసుకుంటోంది. ప్రాంతీయ పార్టీలకు ఔనన్నా కాదన్నా కుటుంబ సభ్యులే వారసులవుతారు.
ఎన్టీఆర్ తన వారుసుడిని తాను నిర్ణయించలేకపోయారు. చాలా కాలం క్రితం బాలకృష్ణ తన వారసుడు ఎన్టీఆర్  అని ప్రకటిస్తే, ఆ ప్రకటన ఉపసంహరించుకునే విధంగా చంద్రబాబు ఒత్తిడి తెచ్చి విజయం సాధించారు. లక్ష్మీపార్వతి తన వారసురాలు అని ఎన్టీఆర్ ఎప్పుడూ ప్రకటించలేదు. కానీ ఆమెను సాకుగా చూపించి దించేసిన సమయంలో హరికృష్ణను ముఖ్యమంత్రిని చేయాలని ప్రతిపాదించారు. టిడిపికి ఎన్టీఆర్ కోరుకున్నట్టుగా కుమారుడు వారసుడు కాలేదు. బలవంతంగా అల్లుడు వారసుడయ్యారు. బాబు మాత్రం పగడ్బందీగా తన కుమారుడిని వారసుడిగా తీర్చిదిద్దుతున్నారు. ఎన్టీఆర్ తన  అల్లుడి రాజకీయాన్ని అర్ధం చేసుకోలేదు, కుమారులకు రాజకీయ పరిజ్ఞానం లేదు. దాంతో ఎన్టీఆర్ కోరుకున్న విధంగా టిడిపికి వారసుడు రాలేదు.


 కానీ కెసిఆర్ విషయం అలా కాదు. రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉంది. ఈ కాలానికి తగిన నాయకుడి లక్షణాలున్న తెలివైన కుమారుడు ఉన్నారు. సహజంగా ఎవరైనా తన వారసత్వం తన కుమారుడికే దక్కాలని కోరుకుంటారు. కుమారులకు తెలివితేటలు లేకపోతేనే వారసత్వం దక్కకుండా పోతుంది. కెసిఆర్ సైతం అంతే బయటి వారికి అనుమానాలు ఉండవచ్చు కానీ హరీశ్‌రావుకు ఈ విషయంలో చాలా స్పష్టత ఉంది.
సమర్ధుడైన కుమారుడు ఉన్నప్పుడు తారక రామారావే వారసుడు అవుతాడు కానీ మేనల్లుడినైనా తానెలా అవుతాననే అవగాహన హరీశ్‌రావుకు ఉంది. చదువుకునే రోజుల నుంచే కెసిఆర్ వెంట ఉన్న హరీశ్‌రావు రాజకీయాల్లో ఆ మాత్రం అవగాహన లేని వారేమీ కాదు. తనకు అప్పగించిన పని విజయవంతంగా పూర్తి చేసుకుని రావడమే తప్ప మీడియా కోరుకుంటున్నట్టు తిరుగుబాటు చేసే రకం కాదు. విపక్షాలు ఆశిస్తున్నట్టు పార్టీని చీల్చే రకం కాదు. ప్రాక్టికల్‌గా ఆలోచించే నాయకుడు కాబట్టే వారసుడు ఎవరు? అనే దానిపై హరీశ్‌రావుకు స్పష్టత ఉంది.  హరీష్ రావు ఏదో చేయాలని  తెలంగాణను వ్యతిరేకించిన వారు , ఇతర పార్టీ లు బోలెడు ఆశలు పెట్టుకుంటే హరీష్ రావేమో తనకు కెసిఆర్ అప్పగించిన మిషన్  విజయవంతంగా పూర్తి చేస్తున్నారు .. నారాయణ ఖేడ్ ఉప ఎన్నికల  వ్యుహల్లో ఉన్నారు . వారసత్వం విషయంలో కుటుంబం నుంచి కెటిఆర్‌కు ఎలాంటి ఆటంకాలు ఉండవు. గ్రేటర్‌లో టిఆర్‌ఎస్ గెలిస్తే భవిష్యత్తు వారసుడు కెటిఆర్ అని జనం నుంచి ఆమోద ముద్ర పడుతుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కెటిఆర్‌కు వారసత్వ పరీక్ష. పరీక్షలో నెగ్గినా ఫలితం కోసం కెటిఆర్ చెప్పినట్టే మరో పదేళ్లు నిరీక్షించాలి. ఎందుకంటే కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి విపక్షాలు ప్రచారం చేస్తున్నట్టుగా, తెలంగాణ వ్యతిరేక మీడియా కోరుకుంటున్నట్టుగా లేదు. చైనా వాల్ ఎక్కేంత, రోజుల తరబడి అధికారులతో సమీక్షలు , పన్నెండు గంటల క్యాబినెట్ సమావేశాలు  జరిపేంత ఆరోగ్యంగా ఉన్నారు.

.. బుద్దా మురళి ( ఎడిట్ పేజి 20-1-2016)   

18, జనవరి 2016, సోమవారం

కురు వృద్ధులు...కుర్ర నేతలు

‘‘నీకు ప్రపంచ పటాల గురించి తెలుసా? ’’
‘‘ఓ సినిమాలో కృష్ణ్భగవాన్ చెప్పినట్టు మేమూ టెన్త్ పాసైన వాళ్లమే. దేశాలను గుర్తించే పరీక్షలు రాసిన వాళ్లమే. ఆబిడ్స్ హెడ్ పోస్ట్ఫాసు చుట్టూ, సికిందరాబాద్ స్టేషన్ వద్ద, రాజేశ్వర్ థియేటర్ వద్ద శ్రీరామా బుక్ డిపో ఉంది కదా? అక్కడ కూడా దొరుకుతాయి ’’
‘‘కవి హృదయం అర్ధం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటావ్! కొనుక్కోవడానికి కాదు నేనడిగింది’’
‘‘ మరెందుకు అడిగావ్?’’
‘‘ ఈ మధ్య వార్తలు వినడం లేదా? ’’


‘‘ఆ మధ్య ఫ్యాషన్ చానల్ ఎఫ్ చానల్‌ను బ్యాన్ చేసినప్పటి నుంచి జబర్థస్తీతో సరిపెట్టుకుంటున్నాను. ఎంతైనా విదేశీ ఎఫ్ చానల్ ఇచ్చిన కిక్కు స్వదేశీ ఎఫ్ చానల్ ఇవ్వదనుకో’’
‘‘ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను ఎవరు పెట్టారో తెలుసా? ’’
‘‘ ఎవరింట్లో ఎక్కడ ఏం పెట్టుకోవాలో అది వారిష్టం. నువ్వూ ఒక ప్రపంచ పటం కొనుక్కోని అందులో నీ సెల్‌ఫోన్ పెట్టుకో వద్దనడానికి నేనెవరిని? ’’
‘‘ అది కాదయ్యా బాబు ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను మేమే పెట్టామని కాంగ్రెస్ కురువృద్ధుడు, ఒకప్పటి జనతాదళ్ గురు వృద్ధుడు జైపాల్‌రెడ్డి చెప్పారు. వినలేదా? ’’
‘‘ ఆదా సంగతి జైపాల్‌రెడ్డి కన్నా ముందు బిజెపి లక్ష్మణ్ కూడా చెప్పారు కదా? ’’
‘‘ ఇంకెక్కడి బంగారు లక్ష్మణ్. లక్ష రూపాయల అవినీతితో ఆయన రాజకీయ జీవితం ముగిసింది, దాంతో ఆయన జీవితం కూడా ముగిసింది కదా? ’’
‘‘ఆ లక్ష్మణ్ కాదు బిజెపిలో ఇంకో లక్ష్మణ్ ఉన్నారు లే! ఈయన డాక్టర్. బహుశా హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో ఎవరు పెట్టారనే దానిపై పరిశోధించారేమో! ఎన్‌డిఏ అధికారంలో ఉన్నప్పుడు బాబుకు చెప్పి హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టించింది మేమే అని లక్ష్మణ్ చెప్పారు. ఇంతకూ జైపాల్‌రెడ్డి ఏం చెప్పారు’’
‘‘ అసలు ప్రపంచ పటాలు తయారు చేసే కర్మాగారమే మాది, మేం ఈ కాలం నాయకులం కాదు కురు వృద్ధులం. మాకు ప్రచారం అంటే ఎలర్జీ . కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టేందుకు అవసరమైన వేల కోట్లు మంజూరు చేశామని. పాత తరం కాబట్టి ఇప్పటి వాళ్లలాప్రచారం చేసుకోలేదని చెప్పారు’’


‘‘ మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ప్రచారం విషయంలో మాత్రం ఆయన చెప్పింది నిజం. ఓల్డ్‌సిటీకి మాత్రమే పరిమితమైన ఎంఐఎంకు సైతం సొంత మీడియా ఉంది. కాంగ్రెస్‌లో రాజకీయ ఓనమాలు నేర్చుకొని వెళ్లిన బాబు,కెసిఆర్‌లకు సైతం సొంత మీడియాలు, బయటి నుంచి పక్క నుంచి వెనక నుంచి మద్దతు ఇచ్చే మీడియాలు ఉన్నాయి. కానీ పాపం ఒక్క కాంగ్రెస్‌కే లేదు. ’’
‘‘ ఏంటీ హఠాత్తుగా కాంగ్రెస్ మీద జాలి పెరిగిందా? ’’
‘‘ లేదు సొంతానికి దోచుకోవడమే తప్ప వారికి ప్రచారానికి పెట్టుబడి పెట్టాలని తెలియదు అంటున్నాను. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో హైటెక్ సిటీకి అంకురార్పణ జరిగింది. బాబు తొలిసారిగా ఎమ్మెల్యే అయిన 78లోనే హైదరాబాద్‌లో ఐటి కంపెనీలు ఉన్నాయి. కానీ ప్రపంచానికి ఐటిని పరిచయం చేసింది బాబే అని ఈ తరం వాళ్లు చాలా మంది నమ్ముతారు. ప్రచారం అంటే అలా ఉండాలి. బాబుకు ఐటిలో ఎలాంటి పరిజ్ఞానం లేదు. సత్యనాదెళ్ల సైతం బాబు స్ఫూర్తితో ఐటి రంగంలోకి వచ్చాడని ప్రచారం. ప్రపంచ యువతకు ఐటిపై ఆసక్తి కలిగేట్టు చేసింది ఆయనే అని చాలా మంది గట్టి నమ్మకం. ఆయన సొంత కుమారుడు మాత్రం కామర్స్ విద్యార్థి. కాంగ్రెస్‌లో రాజకీయ ఓనమాలు దిద్ది బయటకు వెళ్లి ప్రచారంలో దూసుకెళ్తున్న బాబు కెసిఆర్‌ల వద్ద కాంగ్రెస్ కురువృద్ధులు పాఠాలు నేర్చుకోవాలి’’


‘‘ అంటే హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టింది కాంగ్రెస్ వాళ్లేనా? ’’
‘‘నీకో విషయం తెలుసో లేదో, హైదరాబాదే కాదు మీ ఊరు మా ఊరు కూడా ప్రపంచ పటంలో ఉంటుంది. నీకు అనుమానంగా ఉంటే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా నీ అడ్రస్‌తో మీ ఊరికి లెటర్ రాయించుకో. ఆ లెటర్ నీకు చేరకపోతే నన్నడుగు. ’’
‘‘ ఇంతకూ నువ్వేం చెబుతున్నావ్? ’’
‘‘ ఏం చేశావని కాదు నువ్వేం ప్రచారం చేసుకున్నావ్ అనేది ముఖ్యం. అంతా అయిపోయాక, మా హయాంలోనే హైటెక్ సిటీకి రూపకల్పన జరిగిందని, అంజయ్య హయాంలో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగిందని చెప్పుకుంటే లాభం లేదు. ’’
‘‘ ప్రచారం ఒక్కటే చాలా? ’’
‘‘ చాలదు. ప్రచారంతో అధికారంలోకి వచ్చినా నిలబెట్టుకోవడానికి ఏదో చేసి చూపించాలి. అలా చేయకపోవడం వల్లనే ప్రచారంతోనే అధికారంలోకి వచ్చిన మోదీ ప్రాభవం తగ్గుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో బాబు ఘోరంగా ఓడిపోయారు. అయితే గెలిచేందుకు ముందు ప్రచారం తప్పని సరి. ప్రపంచ చరిత్రలో ఎంతో మంది రాజులు అధికారం కోసం తండ్రిని చంపిన కొడుకులున్నారు, అన్నలను చంపిన తమ్ముళ్లు భర్తలను చంపిన భార్యలు ఉన్నారు.. అధికారం కోసం మామను దించి,చెప్పులు విసిరివేయించి, మానసిక క్షోభకు గురి చేసి అనంతలోకాలకు పంపి, అదే మామను శ్రీకృష్ణుడిగా విగ్రహాన్ని పెట్టి తాను పూజిస్తూ ప్రజలను పూజించేట్టు చేసినట్టు, పురాణాల్లో కానీ చరిత్రలో కానీ చూపిస్తావా? అధికారం కోసం చంపాల్సి వస్తే చంపు తప్పదు, కానీ దేవునిగా ప్రచారం చేయి అధికారం నీదే. పవర్ ఆఫ్ ప్రచారం. ఇది తెలియకనే కాంగ్రెస్ చావుబతుకుల మధ్య కొట్టు మిట్టాడుతోంది.
‘‘ ఐతే ఏం చేయమంటావు? ’’


‘‘ ఐటి వచ్చిన కొత్తలో 60 ఏళ్ల వృద్ధులకు 20 ఏళ్ల కుర్రాళ్లు పాఠాలు నేర్పించేవాళ్లు. కాలంతో పోటీ పడాలంటే తప్పదు లేదంటే కాలగర్భంలో కలిసిపోతావు. రాజకీయంలో ఉండాలంటే కాంగ్రెస్ కురు వృద్ధులు రాజకీయ కుర్రాళ్ల వద్ద ప్రచార పాఠాలు నేర్చుకోవాలి.’’
‘‘ ఇంతకూ హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో ఎవరు చేర్చారో చెప్పనే లేదు’’
‘‘ హైదరాబాద్ సంగతి ఎలా ఉన్నా, మోదీ ట్విట్టర్‌లో తెలంగాణ లేకపోయినా మన దేశ పటంలో తెలంగాణను చేర్చింది మాత్రం కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ఉద్యమం’’

బుద్దా మురళి (జనాంతికం 17-1-2016)

10, జనవరి 2016, ఆదివారం

పార్టీ పెడదాం..రా!

‘‘దేశమంటే అమెరికాలా ఉండాలి... లాడెన్ పాకిస్తాన్‌లో ఉన్నాడని తెలిసి రాత్రికి రాత్రి విమానంలో దాడి చేసి చంపి శవాన్ని తీసుకెళ్లారు. మాట్లాడని మన్మోహన్‌కన్నా సూపర్ మ్యాన్‌లా శత్రువుల గుండెల్లోకి దూసుకెళ్తాడని మోదీని గెలిపించాం. మన ఆశల మీద ఇలా నీళ్లు చల్లుతడాని అనుకోలేదు. ఈ పార్టీలతో లాభం లేదు... మరో పార్టీ రావాలి’’
‘‘ నేను కూడా నీ వాదనతో పూర్తిగా ఏకీభవిస్తున్నా కొత్త పార్టీ రావలసిందే. నేను కోరుకున్న తెలంగాణ ఇది కాదు. ఆదివారం సెలవు రోజు గన్‌పార్క్‌కు వెళ్లి అమర వీరుల స్థూపం చూసొచ్చాను. విలువైన సెలవు రోజు త్యాగం చేసింది సామాజిక కోసం, కనీసం సైన్స్ తెలంగాణ అయినా ఒప్పుకునే వాడిని. పిల్లాడు ముచ్చటపడి గన్ కొనివ్వమంటే ఇవ్వమా? అడవుల్లో ఆయుధాలతో స్వేచ్ఛగా తిరిగే తెలంగాణ వస్తుందనుకుంటే యాగాలు చేసే తెలంగాణ వచ్చింది. మేం పోరాడింది సామాజిక తెలంగాణ కోసం తప్ప దొరల తెలంగాణ కోసం కాదు. ’’
‘‘ నేనూ అంతే బాస్ బాబు మీద నాకెన్ని ఆశలుండేవి. మొన్న పంచిన వంద పదవుల్లో మా వ్యతిరేక సామాజిక వర్గం వారికి ఇద్దరికి ఇచ్చాడు. ఇప్పుడు ఇద్దరే కావచ్చు కానీ ఆ సంఖ్య పెరగదనే గ్యారంటీ ఏముంది? నా మనసు విరిగిపోయింది మరో పార్టీ రావలసిందే’’
‘‘ జగన్ ఓదార్పు నాకేమాత్రం నచ్చడం లేదు.. నా ఓటు కూడా మీకే మరో పార్టీ రావలసిందే’’
‘‘నాదీ సేమ్ అభిప్రాయం. హీరో అంత స్మార్ట్‌గా కనిపిస్తే అఖిలేష్ యాదవ్ వల్ల ఈ దేశం బాగు పడుతుందని అనుకున్నాను మరో పార్టీ రావలసిందే ’’
‘‘ కొత్త పార్టీ రావలసిన అవసరం లేదా? నువ్వు మాట్లాడవేం?’’
‘‘ నేను మీ అందరి కన్నా ఎక్కువ బాధపడుతున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. చలినే జయించ లేక మఫ్లర్‌లో దాక్కున్న కేజ్రీవాల్ ఇక అవినీతినేం ఎదుర్కొంటారు. జలుబును జయించిన వారికే నా మద్దతు . మరో పార్టీ అవసరం ఉందని మీ అందరి కన్నా ముందు నేనే అనుకున్నాను. ’’
‘‘ లాలూ, నితీష్, మమతా దీదీ ఇప్పుడున్న నాయకులందరి పైనా నాకు ఆశలు పోయాయి.’’
‘‘దేశంలోని ఒక్క నాయకుడిపై కూడా మనకు నమ్మకం లే దు. మనం ఉద్యమించాలి?’’
‘‘ దేనిపై ఉద్యమించాలి?’’
‘‘తెలుగులో హీరోయిన్లు లేకపోతే అంతకు ముందు తమిళనాడు నుంచి ఇప్పుడు ముంభై నుంచి తెచ్చుకుంటున్నారు. ముంభై వారికి హీరోయిన్లు లేకపోతే సన్నిలియోన్ లాంటి హీరోయిన్లను ఎక్కడెక్కిడి నుంచో దిగుమతి చేసుకుంటున్నారు. రెండున్నర గంటల సినిమాల్లో నటించేందుకు హీరోయిన్లు, విలన్లను దిగుమతి చేసుకుంటున్నప్పుడు రాజకీయాల్లో నిరంతరం నటించేందుకు ఇతర దేశాల నుంచి నాయకులను ఎందుకు దిగుమతి చేసుకోవద్దు? ’’
‘‘నీ ఆలోచన విప్లవాత్మకమైనది. కమ్యూనిస్టు పార్టీలు సిద్ధాంతాలను దిగుమతి చేసుకునే వారు. దేవుడు లేడని నమ్మే విదేశీ నాయకులను దేవుడిలా పూజించే వారు. నువ్వు వారి కన్నా ఒక అడుగు ముందుకేసి ఏకంగా నాయకులనే దిగుమతి చేసుకుందామంటున్నావ్. మన సిద్ధాంతాలకు అనుగుణంగా విప్లవాత్మక ఆలోచనలతో కొత్త పార్టీ రావాలి. ’’
‘‘ ఔను కొత్త పార్టీ రావాలి.. రావాలి... రావాలి. కోరస్‌గా మా అందరి అభిప్రాయం ఇదే’’
‘‘ ఇక్కడ సమావేశమైన రెండు డజన్ల మంది మేధావుల్లో ఏ ఒక్కరు కూడా ఇప్పుడున్న పార్టీల పట్ల సానుకూలంగా లేరు. దేశ ప్రజలంతా కొత్త పార్టీ కోసం ఎదురు చూస్తున్నారని తేలిపోయింది. కొత్త పార్టీ పెట్టేద్దాం . అందరి అభిప్రాయాలతో తాజ్‌మహల్ హోటల్ డిక్లరేషన్ విడుదల చేద్దాం . పార్టీ ఎలా ఉండాలో ఒక్కొక్కరు చెప్పండి’’
‘‘ పార్టీ మా మత వాదంతోనే ఉండాలి. ఇతర మతాలను దూరం పెట్టాలి. అలా అయితేనే నేను పార్టీలో ఉంటాను. ’’
‘‘ ఓహో అలాగా అయితే మా మతం వాళ్లం బయటకు వెళుతున్నాం’’
‘‘ఈ ప్రపంచంలో అత్యంత మేధావులు, సంపన్నులు, బుద్ధి జీవులు ఏ సామాజిక వర్గంలో ఉన్నారనే ప్రశ్న వస్తే మా సామాజిక వర్గం పేరే ముందుంటుంది. మా ‘ఎక్స్’ సామాజిక వర్గానికి బద్ధ శత్రువులు ‘వై’ సామాజిక వర్గం వాళ్లు. పార్టీలో వై సామాజిక వర్గం ఉంటే నేను ఉండను. ’’
‘‘ నేను సైన్‌టిఫిక్ తెలంగాణ పక్షం సామాజిక తెలంగాణ అంటే కొత్త పార్టీలో నేనుండను’’
‘‘దేశంలోని పార్టీలన్నీ ఉత్తరాది పెత్తనంతో ఉన్నాయి. మన పార్టీలో దక్షిణాది ఆధిపత్యం ఉండాలి. ’’
‘‘కొత్త పార్టీపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతుంటే ఈ అభిప్రాయాలు నచ్చక కొంత మంది వెళ్లిపోయారు. పోయినోళ్లు పోయారు ఉన్నవాళ్లే మన వాళ్లు. ఇక పార్టీ ఆర్థిక విధానాలు ఎలా ఉండాలో మీరంతా మీ మీ అభిప్రాయాలు చెప్పండి’’
‘‘ ఉత్తర దక్షిణ, తెలంగాణ ఆంధ్ర, కమ్మ, రెడ్డి, వెలమ, కాపు కులం ఏదైనా ప్రాంతం ఏదైనా ఇంత కాలం మగవారే పెత్తనం చెలాయించారు. కొత్త పార్టీ నాయకత్వం మహిళలకు అప్పగిస్తామంటేనే మేం ఉంటాం. లేదంటే మేం ఆరుగురం వెళ్లిపోతున్నాం’’
‘‘అంతా మేధావులమే కాబట్టి ఒకరి విధానాలు ఒకరికి నచ్చకపోవడం సహజమే. అంతా వెళ్లిపోయారు. చివరకు మనం ఇద్దరమే మిగిలాం. అన్ని అంశాల్లో మన ఇద్దరి అభిప్రాయాలు ఒకటే. వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఒక్కో నీటి చుక్కతోనే మహా సముద్రం ఏర్పడుంది. మన ఇద్దరం ముందడుగు వేద్దాం. వచ్చే వాళ్లు వస్తారు? ఏమంటావు బ్రదర్ నేను పైలట్ నువ్వు కో పైలట్’’
‘‘అలా వద్దు కానీ ఇద్దరం పైలట్స్‌గానే ఉందాం. ఇంకోటి అడగడం మరిచి పోయాను. నేను మహేశ్‌బాబు అభిమానిని.. నువ్వుకూడా అంతే కదా? ’’
‘‘కాదు నేను పవన్ కళ్యాణ్ అభిమానిని’’
‘‘ సారీ బ్రదర్ నేను ఎవరితోనైనా చేతులు కలుపుతాను కానీ ఆ హీరో అభిమానులతో కలపలేను. మనకు పొసగదు. రెండుగా చీలిపోయి ఎవరి దారిలో వాళ్లం వెళదాం. ఎవరి పార్టీని వాళ్లు పెట్టుకుందాం. ’’
ముక్తాయింపు: అందరికీ అన్ని విషయాలు నచ్చే పార్టీ భూ మండలంలో ఎక్కడా పుట్టలేదు ..  పుట్టదు ... 

(జనాంతికం 10-1-2015)