29, ఏప్రిల్ 2014, మంగళవారం

తెలంగాణ జెండా

కె సిఆర్ -ఈ మూడక్షరాలు తెలంగాణ జెండా.. తెలంగాణ ఆస్తిత్వం... తెలంగాణ ఉద్యమం.. 2001 స్థానిక సంస్థల ఎన్నికలు. నర్సాపూర్ ప్రాంతంలో కేసీఆర్ హెలికాఫ్టర్‌లో వచ్చి ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించి వెళ్తుంటే -ఒక పోలీసు అధికారి ముఖంలో ఆనందం వెళ్లివిరిసింది. కేసీఆర్‌తో కరచాలనం చేసి తన ఆనందాన్ని పంచుకోకుండా ఉండలేకపోయాడు. అతనిలోని అంతటి ఆనందానికి కారణం -తన ఉపన్యాసంలో కెసిఆర్ ఉపయోగించిన పదాలు. సిరా ఆరకముందే పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించారని కెసిఆర్ చేసిన ఉపన్యాసాన్ని ప్రస్తావిస్తూ ‘సిరా’ ఈ మాట వినగానే నా బాల్యంలోకి వెళ్లిపోయాను. ఎప్పుడో చిన్నప్పుడు విన్న మాట అంటూ ఆ అధికారి తనకన్నా చిన్న వయసు వ్యక్తితో ఆనందాన్ని పంచుకున్నాడు.

తెరాస ఆవిర్భావం తరువాత తెదేపా పతనం మొదలైందా? తెదేపా పతనం నుంచి తెరాస ఆవిర్భవించిందా? అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావచ్చు. కానీ తెరాస ఆవిర్భావం మాత్రం తెదేపాను చావు దెబ్బతీసింది. 2001 ఏప్రిల్ 27న తెరాస ఆవిర్భవించిన తరువాత వందరోజులకే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తెదేపా పరాజయం ప్రారంభమైంది. 2004 సాధారణ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. 2009లో తిరిగి అదే తెరాసతో జతకట్టినా తెదేపాకు అధికారం దక్కలేదు.


విద్యుత్ ఉద్యమం, చంద్రబాబుపై భ్రమలు తొలిగిపోతున్న కాలం అది. తెలంగాణ పార్టీ ఏర్పాటుకు అదే సరైన సమయం అని కెసిఆర్ నిర్ణయానికి వచ్చారు. కెసిఆర్‌తోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని చాలామంది భావిస్తారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 95నుంచే కొన్ని ఉద్యమ సంస్థలు తెలంగాణ కోసం సభలు, సదస్సులు, మేధోపరమైన చర్చలు సాగించాయి. వరంగల్‌లో భారీ బహిరంగ సభ సైతం నిర్వహించారు. అయితే కెసిఆర్ రంగ ప్రవేశం చేశాక తెలంగాణ ఉద్యమం రాజకీయ రూపం సంతరించకుంది.
తెలంగాణలో జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో దేశాన్ని ఊపేస్తున్న బిజెపి నేత నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మన్మోహన్‌సింగ్ వంటి హేమాహేమీలు తెలంగాణలో ప్రచారం చేశారు. వీరందరి లక్ష్యం, గురి -కెసిఆర్‌పైనే. అందరి లక్ష్యం ఒక్కరే అయినప్పుడు తెలంగాణలో అతని బలమెంతో తెలుస్తోంది.
మీడియా, అంగబలం, ఆర్థికబలం, కులబలం ఇవన్నీ ఒకవైపు, కెసిఆర్ నాయకత్వం ఒకవైపు.

తెలంగాణ ఇచ్చింది మేమే అని కాంగ్రెస్ చెబితే, దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన స్వాతంత్య్ర సమరయోధులకు క్రెడిట్ ఇస్తామా? స్వాతంత్య్రం ఇచ్చిన బ్రిటీష్‌వాడికి క్రెడిట్ ఇస్తామా? అని కెసిఆర్ ప్రశ్నిస్తారు. ఎవరికి నచ్చినా నచ్చక పోయినా 2001 నుంచి పదమూడేళ్లపాటు రాష్ట్ర రాజకీయాలను తెలంగాణ చుట్టూ తిప్పిన ఘనత కేసీఆర్‌దే.
డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నప్పుడు కేసీఆర్ తెరాస పార్టీని ఏర్పాటు చేశాడు. అప్పటివరకు తెదేపా వారి అంచనా భద్రత కోసం ఆయన డిప్యూటీ స్పీకర్ పదవిలో కొనసాగుతాడని, దమ్ముంటే పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. పార్టీ ఆవిర్భావ సభలో నాటకీయంగా కేసీఆర్ నవ్వు ఒక్క రాజీనామా చేయమంటే నేను మూడింటికి చేస్తున్నాను. డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసన సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి -ఇదిగో రాజీనామా అంటూ వేదికపైనుంచే రాజీనామా లేఖలు అందించడం రాజకీయంగా తెలంగాణ వారిలో కేసీఆర్‌పై విశ్వసనీయత కలిగించింది. నాయకులు, మీడియా, ప్రత్యర్థులు ఎవరైనా కావచ్చు కేసీఆర్ విశ్వసనీతను దెబ్బతీయడానికి చేసిన తీవ్ర ప్రయత్నాలు తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ విశ్వసనీయతను పెంచాయి. 

1954లో జన్మించిన కెసిఆర్ 83లో తొలిసారిగా సిద్దిపేట నుంచి పోటీ చేసి మదన్‌మోహన్ చేతిలో ఓడిపోయారు. 85లో గెలిచారు. తరువాత ఓటమి ఎరుగలేదు. 90వ దశకంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో కరువు మంత్రిగా చేశారు. చంద్రబాబు మంత్రివర్గంలో రవాణాశాఖ మంత్రిగా పని చేశారు. కారు గుర్తుతో సైకిల్‌ను ముప్పు తిప్పలు పెడుతున్నారు.

28, ఏప్రిల్ 2014, సోమవారం

అనువాద వాదం..ఎన్టీఆర్‌కు హిందీ నేర్పడానికి వచ్చి రాజకీయాలు నేర్చుకొన్న యార్లగడ్డ

సమాజంలో మనువాదానికీ , రాజకీయాల్లో మార్క్స్‌వాదానికి కాలం చెల్లి ఉండొచ్చు కానీ రాజకీయాల్లో ఇప్పుడు అనువాద వాదందే కాలం అంటున్నారు. తెలుగునేత అధికారంలో ఉన్నప్పుడు టూరిజం తప్ప అన్ని ఇజాలకు కాలం చెల్లిందని గట్టిగా నమ్మారు. రోడ్డుపక్కన మందులమ్మేవాడు ధర్మేంద్ర, అమితాబ్, హేమామాలిని వంటి వారితో దిగిన ఫోటోలను ప్రదర్శిస్తూ, వారంతా నా క్లయింట్స్ వారికి నేనే చికిత్స చేశాను అందుకే అంత అందంగా, ఆరోగ్యంగా ఉన్నారు అని చెబుతుంటారు. సాక్ష్యంగా ఫోటోలు కనిపిస్తుంటే నమ్మలేమని ఎలా చెబుతాం. అలానే తెలుగునేత టూరిజంను నమ్ముకుని అనేక దేశాలు తిరిగి ఇదిగో సర్ట్ఫికెట్లు వాళ్లంతా తెలుగునాట నేను అద్భుతంగా పాలిస్తున్నానని సర్ట్ఫికెట్ ఇచ్చారు అని ప్రచారం చేసుకునే వారు. ఆయన్ని బాగా నమ్మిన మీడియా ఔను నిజం. ఇక్కడి వారికి ఆయన గొప్పతనం ఏమీ తెలియదు, మీరు కళ్లతో చూసేది నమ్మకండి, అక్కడి వారు ఇచ్చిన సర్ట్ఫికెట్లనే నమ్మండి చెప్పేవి.


పాతాళాభైరవితో పాటు ఎన్నో సినిమాల్లో ఎన్టీవోడు కాళ్లకు మంత్రాల చెప్పులు, మాయావస్త్రం, గుర్రాలు ఏది కనిపిస్తే అది వేసుకుని రాజకుమారిని వెతుకుతుంటాడు. ప్రేమించిన రాజకుమారి కోసమే ఎన్టీవోడు అన్ని వేశాలేస్తే, ఎన్టీవోడి దగ్గర కొట్టుకొచ్చిన సింహాసనం కోసం తెలుగునేత ఎన్ని వేషాలు వేయాలి? పదేళ్ల నుంచి జారిపోయిన సింహాసనం కోసం తెలుగు నేత నమ్ముకోని వాదం లేదు, మొక్కని దేవుడు లేడు. కలవని పార్టీ లేదు. కాలం చెల్లిందన్న కమ్యూనిజాన్ని నమ్ముకున్నా ఫలితం లేకుండా పోయింది. దేశాన్ని ముక్కలు ముక్క లు చేసేందుకే పుట్టింది గులాబీ వాదం అని విమర్శించిన బాబే ఏమో ఏ పుట్టలో ఏ పాముందో అని చివరకు ఆ గులాబీని కూడా నమ్ముకున్నారు.... చేతికి ముల్లు గుచ్చుకుంది కానీ అధికారం దక్కలేదు. చీ..చీ.. గులాబీ అందంగా ఉంటుందనుకున్నాను అది నిజం కాదంటూ అంతకు ముందు ఛీ...్ఛ... రక్త పిపాస సిద్ధాంతి అని తిట్టిన మోడీ ఇజాన్ని నమ్ముకున్నారు. మోడీ ఇజం... పవన్ ఇజం.... బాబు ఇజం అన్ని కలిపితే అధికార ఇజం అంటున్నారు అభిమానులు. 

మోడీది మతోన్మాదం అని నువ్వే చెప్పావు, తిక్కనే నా ఇజం అని పవనే చెప్పుకున్నాడు. అధికారమే మీ ఇజం అని అందరికీ తెలుసు ఇందులో కొత్తేముందని అడిగితే మా ఈ మూడింటి మధ్య కెమిస్ట్రీ కుదిరి కొత్త వాదం పుట్టింది. ఇక మాదే అధికారం అంటున్నారు. మసీదులు కూల్చే పార్టీ అని అంతగా తిట్టిన వారు చేతులు కలపడం భావ్యమా అని కొందరు చాదస్తు వాదులు ప్రశ్నిస్తే, అధికారంలోకి వస్తే సరే లేకపోతే మళ్లీ మసీదులు కూల్చే పార్టీ అని గతంలో కన్నా ఎక్కువ తిడతారు తొందరపడకండి అని సమాధానం వినిపిస్తోంది. శాస్తవ్రేత్తలు తాను అనుకున్న ఫలితాన్ని సాధించేందుకు అనేక పరిశోధనలు చేస్తారు. రాజకీయాలను ఒక శాస్త్రంగా భావించి, విజయం సాధించేందుకు అవసరమైన కెమిస్ట్రీ పై ప్రయోగాలు చేస్తున్నారని అభినందించాలి, అధికారం కోసం ఒక్కో ఎన్నికలోఒక్కో పార్టీతో చేతులు కలుపుతున్నాడని తిట్టడం భావ్యమా! శాస్తవ్రేత్తల ప్రయోగాలకు ఇచ్చే గౌరవం రాజకీయ ప్రయోగాలకు ఇవ్వరా? ఇదేం అన్యాయం?
తెలుగునేత తన వాదాలను ఎప్పటికప్పుడు అలా మారుస్తూ పోతుంటే కొందరు చోటా మోటా నాయకులు అన్ని వాదాలకు కాలం చెల్లింది ఇప్పుడు నడుస్తోంది అనువాదాల కలామే అంటున్నారు.


ఉండవల్లి అరుణ్‌కుమార్ సోనియాగాంధీ దృష్టిలో పడి ఎంపి అయింది అనువాదం వల్లనే కదా? అని తమ వాదమే కరెక్ట్ అంటూ వీళ్లు ఆధారాలు చూపిస్తున్నారు. నిన్నమొన్న టిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన శ్రావణ్ కూడా రాహుల్ దృష్టిలో పడ్డాడంటే అనువాదాన్ని నమ్ముకునే కదా? అనుకున్న దానం నాగేందర్ ఎంతో మందిని పక్కకు తోసి అనువాదంతో చెలరేగిపోయి కాళిదాసు కవిత్వం కొంత నా సొంత పైత్యం కొంత అని అనువాదాన్ని కొత్త పుంతలు తొక్కించారు రాహుల్ సభలో. రాహుల్ మాట్లాడింది, అనువాదకుడు మాట్లాడింది రెండు విడివిడిగా రాసుకోలేక చచ్చామని విలేఖర్లు వాపోయారు. ఇక నుంచి ఉపన్యాసకుడి కోసం ఒక రిపోర్టర్, అనువాదకుడి ఉపన్యాసం కోసం మరో రిపోర్టర్‌ను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.


అనువాద మహిమను వీరందరి కన్నా ముందు గుర్తించింది వెంకయ్యనాయుడు. హిందీని తెలుగులోకి అనువాదం చేయడాన్ని నమ్ముకుని ఆయన బిజెపి జాతీయ అధ్యక్షుడి స్థానం వరకు వెళ్లారు. ఆయన మార్గంలోనే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఎన్టీఆర్‌కు చేరువయ్యారు, అటు నుంచి బిజెపికి దగ్గరయ్యారు. ఎన్టీఆర్‌కు హిందీ నేర్పడానికి వచ్చిన యార్లగడ్డ హిందీ నేర్పలేదు, కానీ తాను రాజకీయాలు నేర్చుకున్నారు. రాజ్యసభ సభ్యులయ్యారు. ఈ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి అలసిపోయిన తరువాత చంద్రబాబు కొంత కాలం హిందీ నేర్చుకోవడానికి, ఆ తరువాత ఉర్దూ నేర్చుకోవడానికి ప్రైవేటు ట్యూషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఓ హిందీ పత్రిక ఎడిటర్, మరో ఉర్దూ పత్రిక రిపోర్టర్ ఆయనకు ఈ భాషలు నేర్పడానికి కొంత వరకు ప్రయత్నించారు. వీళ్ల నుంచి బాబుకు హిందీ, ఉర్దూ రాలేదు, బాబు నుంచి వాళ్లకు రాజకీయం అంటలేదు. 

సీటు కోసం ప్రయత్నించడం కన్నా అనువాదంలో అనుభవం సంపాదించి హై కమాండ్ దృష్టిలో పడడం మేలు అనుకుంటున్నారు అనువాద వాదాన్ని నమ్ముకున్న వాళ్లు. పవన్ కల్యాణ్ సాహసోపేతంగా రాసిన పవనిజం పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నించి రాంగోపాల్ వర్మ, యండమూరి వీరేంధ్ర నాథ్ లాంటి మేధావులే చేతులెత్తేశారు. పవనిజాన్ని ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్‌లోకి, తెలుగు నుంచి తెలుగులోకి అనువాదం చేయడానికి ఎవరికైనా అసక్తి ఉంటే ప్రయత్నించ వచ్చు. భవిష్యత్తు మొత్తం అనువాద వాదానిదే.

26, ఏప్రిల్ 2014, శనివారం

శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిన సామెత.. ప్రత్యామ్నయ -జెపి


అంద రికీ శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందట! ఈ సామెతలానే ఉంటుంది -లోక్‌సత్తా జాతీయాధ్యక్షుడు నాగబైరవ జయప్రకాశ్ నారాయణ రాజకీయ వ్యవహారం. సాంప్రదాయ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా లోక్‌సత్తా పుట్టిందని చెప్పే జెపి -తాను పోటీ చేసే నియోజక వర్గం ఎంపికలో మొదటినుంచీ సాంప్రదాయ రాజకీయాలనే ఆశ్రయించారు.

1994 మేలో ఎన్టీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆయనను దించేసే వ్యూహ రచన సాగింది. ఆగస్టు గండం ఈసారి ఎన్టీఆర్‌ను రక్షించలేకపోయింది. చిన్నల్లుడు, పెద్దల్లుడు ఒక్కటయ్యారు. అయినా అప్పటికీ వారి వద్ద మెజారిటీ ఎమ్మెల్యేలు కూడలేదు.


-‘అసెంబ్లీ రద్దు చేస్తానని ప్రకటించండి. జారిపోయిన ఎమ్మెల్యేలు భయపడి వెనక్కి వస్తారు’ అంటూ ఓ ఆసామీ ఎన్టీఆర్‌కు సలహా ఇచ్చాడు. సలహా నచ్చడంతో -ఎన్టీఆర్ ప్రకటించేశారు. అంతే -సీన్ రివర్సయ్యింది. ఎన్టీఆర్ దెబ్బకు వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు వెనక్కి రాలేదు. వెనక్కి వెళ్దామా అన్న ఆలోచనల్ని కూడా బుర్రల్లోంచి తుడిచేశారు. సరికదా -ఎన్టీఆర్‌తో ఉన్నవాళ్లూ అల్లుళ్ల వద్దకు పారిపోయారు. ఎన్టీఆర్‌కు ఈ సలహా ఇచ్చింది -ఆయన వద్ద ఐఏఎస్ అధికారిగా కీలకస్థానంలో ఉన్న జయప్రకాశ్ నారాయణ అని అప్పట్లో వినిపించిన మాట.
తరువాత జెపి ఎక్కువ రోజులు పదవిలో ఉండలేదు. లోక్‌సత్తా పేరిట సంస్థ స్థాపించారు. స్థానిక సంస్థలకు అధికారాలు, గ్రామ స్వరాజ్యం కోసం సంస్థ తరుఫున పలు సదస్సులు నిర్వహించారు. లోక్‌సత్తాను 2006లో రాజకీయ పార్టీగా మార్చారు.

సాంప్రదాయ రాజకీయాలకు భిన్నం -ప్రత్యామ్నాయ రాజకీయం. అదేంటో చూపిస్తామంటూ జెపి అట్టహాసంగా ప్రకటనలు గుప్పించారు. ప్రారంభంలో లోక్‌సత్తా పట్ల యువత బాగానే ఆకర్షణకు గురైంది. ‘కులం, మతం, ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేయడం సాంప్రదాయ పార్టీల నైజం. లోక్‌సత్తా దీనికి భిన్నం’ అని జెపి ప్రకటించారు. అయితే -పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే లోక్‌సత్తా సాంప్రదాయ రాజకీయానే్న అనుసరించింది. తమ వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లిని జెపి పోటీకి సురక్షిత స్థానంగా ఎంపిక చేసుకోవడం సాంప్రదాయ రాజకీయమే. ఎవరు ఎక్కడినుంచైనా పోటీ చేయవచ్చు. కానీ సాంప్రదాయ పార్టీలు గెలుపు గుర్రాలంతా దీన్ని ముద్దుగా పిలుచుకుంటాయి. అంటే ఆ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఎవరైతే గెలుస్తారు? అనే లెక్కలన్నమాట. చివరకు ఇప్పుడు జెపి అదే లాజిక్కుతో మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు.

లోక్‌సత్తాకు 2009 ఎన్నికల్లో రెండు శాతం వరకు ఓట్లు రావడంతో కాంగ్రెస్ కుట్రలో భాగంగానే లోక్‌సత్తా పుట్టిందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ బృందం తీవ్రంగా విమర్శలు చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ మనిషి కనుకే జెపికి నామినేటెడ్ పదవిని సోనియా గాంధీ కట్టబెట్టిందనేది తెదేపా ఆరోపణలకు ఆధారం. 2009 ఎన్నికల వరకూ తెదేపా, లోక్‌సత్తా తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నాయి. చివరకు ఏం జరిగిందో తెలీదుకానీ, ఇప్పుడు -దేశానికి మోడీ, రాష్ట్రానికి బాబు, హైదరాబాద్‌కు జెపి కావాలని జెపి నినాదం ఇస్తున్నారు. సాంప్రదాయ రాజకీయాలకు ప్రత్యామ్నాయ రాజకీయాలంటూ ప్రచారం చేసిన జెపికి మోడీలో కనిపించిన ప్రత్యామ్నాయ రాజకీయం ఏమిటి? అనే విమర్శ వినిపిస్తోంది. 1980 ఐఏఎస్ అయిన జెపి అధికారిగా ఉన్నప్పుడు, లోక్‌సత్తా సంస్థను నిర్వహించినప్పుడు మంచి పేరే సంపాదించారు. జెపికి నామినేషన్ వేసేందుకు రాజమౌ ళి కావాలి, ప్రచారానికి పవన్ కల్యాణ్, గెలవడానికి మోడీ కావాలి. ఇవి అవకాశవాద రాజకీయాలుకావా? అన్నది మల్కాజిగిరిలో జెపితో పోటీ పడుతున్న స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్న. దీనికి సమాధానం చెప్పేదెవరు?

23, ఏప్రిల్ 2014, బుధవారం

కిట్టీ పార్టీల్లో ఆడవారు పొలిటికల్ కిట్టీ పార్టీ లలో మగవారు

పూర్వకాలంలో పెళ్లికి వెళ్లడం అంటే కనీసం రెండు వారాల వ్యవహారం. పెళ్లికి మూడు రోజుల ముందు వచ్చి వారం రోజుల పెళ్లి చూసి మూడు రోజుల తరువాత వెళ్లేవారు. పెళ్లంటే సందడే సందడి. ఇప్పుడు కనీసం రిజిస్ట్రార్ ఆఫీసులో ఇంటి రిజిస్ట్రైషన్‌కు పట్టినం త సమయం కూడా పట్టడం లేదు పెళ్లికి. అక్షింతలు వేసే సమయానికి వచ్చి క్షణాల్లో మాయమవుతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల్లో బంధువుల మధ్య పరాచికాలు, ఆడవారి ముచ్చట్లు ఇప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించే అపురూప దృశ్యాలు. ఈ తరం వారికి ఎన్ని ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా ఆనాటి సంబరాలు తీరని లోటే. బహుశా ఈ లోటును పూడ్చుకోవడానికే కిట్టీ పార్టీలు పుట్టాయేమో! ఇండియా, పాకిస్తాన్‌లలో మాత్రమే ఈ కిట్టీ పార్టీలు కనిపిస్తాయి. ఆడవారు ప్రతి నెల ఒకరి ఇంట్లో కిట్టీ పార్టీలు చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కొంత డబ్బు వేసి అందరు కలిసి నెలకు ఒకరి ఇంట్లో పార్టీ చేసుకుంటారు. నెల రోజుల అలసట ఒక్క రోజు కిట్టీ పార్టీతో తీరిపోతుంది.


సరే మరి ఆడవారు కిట్టీ పార్టీతో సేద తీరుతున్నారు. మరి మగవారు....
పెళ్లిళ్లు వారం రోజుల పాటు అట్టహాసంగా జరిగినట్టే పూర్వం రాజకీయ పార్టీల ఏర్పాటుకు భారీ కసరత్తు జరిగేది. సిద్ధాంతాలు, పార్టీల విధానాలపై సుదీర్ఘ మంతనాలు సాగేవి. అందుకే ఆ కాలంలో పార్టీలు పెద్దగా పుట్టలేదు. మరిప్పుడు చేస్తున్న ఉద్యోగం ఊడిపోతే ఊరికే ఉండడం ఎందుకని పార్టీ పెడుతున్నారు. హీరోకు వయసు మీద పడితే రిటైర్‌మెంట్ జీవితంలో కాలక్షేపం కోసం పార్టీ పెట్టేస్తున్నారు. అన్నమీద కోసం వస్తే పార్టీ, బావ మీద కోపం ఉంటే పార్టీ ( అన్నాటిడిపి) భర్త జ్ఞాపకాలు నిలుపుకోవడానికో పార్టీ , షూటింగ్‌లు పెద్దగా లేకపోవడంతో కాలక్షేపం కోసం అన్నట్టు రాఖీసావంత్ ఓ పార్టీ పెట్టేశారు. జగన్మోహిని, ఆ మోహినీ ఈ మోహినీ అంటూ 80వ దశకంలో జయమాలిని సినిమాలు ఒక ఊపు ఊపాయి. అందులో హీరోయిన్ జయమాలిని అయితే హీరో నరసింహారాజు. ఆయనకు ఎన్టీఆర్‌పై కోపం వచ్చి మీది తెలుగుదేశం అయితే నాది భారత దేశం అంటూ భారత దేశం పేరుతో ఒక పార్టీ పెట్టేశాడు.బహుశా పార్టీ పెట్టినట్టు ఆ తరువాత ఆయన కూడా మరిచిపోయినట్టున్నారు. టీవి సీరియల్స్‌లో వయసుకు మించి వృద్ధ పాత్రల్లో అడపాదడపా కనిపిస్తున్న ఈయన ఇప్పుడు జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున కూకట్‌పల్లిలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నటునిగా సొంత పార్టీ పెట్టుకోవలసిన వయసు వచ్చినా అంతో ఇంతో డబ్బు కావాలి కదా అది సాధ్యం కాకపోడవంతో జై సమైక్యాంధ్ర పార్టీని నమ్ముకున్నారు.


కిట్టీపార్టీలతో కాలక్షేపం చేయాలని ఆడవారికి, రాజకీయ పార్టీలతో కాలక్షేపం చేయాలని నటులకు ఉన్నప్పుడు ప్రశాంత జీవితం గురించి బోధించే స్వాములు, బాబాలకు మాత్రం ఉండదా? ఏమిటి?
పిరిమిడ్ ధ్యానకేంద్రం తెలుగునాట గత రెండు దశాబ్దాల నుంచి మారుమూల పల్లెలకు సైతం ప్రాకింది. సుభాష్‌పత్రి ధ్యానంతో పాటు రాజకీయాలతో కాలక్షేపం ఎలాగో నేర్పించేశారు. అసెంబ్లీ, పార్లమెంటు ఏ ఎన్నికలైనా సరే పిరమిడ్ పార్టీ అన్ని నియోజక వర్గాల్లో పోటీ చేస్తుంది. స్వాములకు ఈ రాజకీయాలు అవసరమా? అనే ప్రశ్న ముఖం మీద కనిపించగానే ఆయనే నవ్వుతూ చెబుతారు. మేం పోటీ చేసేది గెలిచేందుకు కాదు. ఈ ఎన్నికల పుణ్యమా అని రాష్ట్ర వ్యాప్తంగా మా పిరమిడ్ సంస్థకు ప్రచారం లభిస్తుంది. ఇంత తక్కువ ఖర్చుతో అంత తక్కువ సమయంలో రాష్ట్రం మొత్తంలో ప్రచారం లభించే మార్గం ఇంకేమైనా ఉంటే చెప్పండి అంటారు. రాష్ట్రంలో దాదాపు మూడు కోట్ల మంది ఓటర్లు ఓటు వేసే ముందు ఆ పార్టీ పేరు, గుర్తు చూడనైతే చూస్తారు కదా?


అత్తారింటికి దారేది సినిమా సూపర్ హిట్టయినా పవన్ కల్యాణ్ ప్రచారం సినిమా పేజీలకే పరిమితం అయింది. ఆయన సినిమా జీవితం మొత్తంలో ఎంత ప్రచారం లభించిందో ఒక్క జనసేనతో అంతకు మించి ఎన్నో రేట్లు ప్రచారం లభించింది. ఇది సీరియస్ పార్టీ కాదు, రాజకీయ కిట్టీ పార్టీ అని తెలుసు అయినా బోలెడు ప్రచారం. ఎవరు రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి అధికారంలోకి రావాలనుకుంటారు. కానీ పవన్ కల్యాణ్ సరికొత్త రాజకీయాలకు తెర తీశారు. ఆయన పోటీ చేయరు, ఆయన పార్టీ తరఫున ఎవరూ పోటీ చేయరు. కానీ ఆయన తనకు నచ్చిన నియోజక వర్గంలో నచ్చిన పార్టీకి ప్రచారం చేస్తారు. పవన్ పార్టీ భారత రాజకీయాల్లో కొత్త అధ్యాయం. ఇదో కొత్త మలుపు. మూడున్నరేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసినా ఎందుకో గానీ కిరణ్ కుమార్‌రెడ్డికి కూడా కిట్టీ పాలిటిక్స్‌పైనే ఆసక్తి కలిగినట్టుగా ఉంది. కొత్త పార్టీ పెట్టారు, గెలుస్తాం, అధికారంలోకి వస్తాం అని ధీమాగా ప్రకటించేశారు. అంతా బాగానే ఉంది కానీ ఆయన మాత్రం పోటీ చేయడం లేదు. అదేంటి అంటే మహాత్మాగాంధీ పోటీ చేశాడా? లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పోటీ చేశారా? అని తులసీరెడ్డి గారు కోపంగా అడుగుతున్నారు. 

మనకు మరో మహాత్ముడు దొరికాడని సరిపుచ్చుకోవాలి. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూలు కూర్చున్న ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపిస్తుంటుంది. అలానే ఇప్పుడు నేటి మహాత్ముడు కిరణ్, ఆయన పక్కన నెహ్రూలా తులసీరెడ్డిని చూసుకుని మనం మురిసిపోవాలి. ధాన్యం గురించి ప్రచారం చేయడానికే ఎన్నికల్లో పోటీ అని పిరమిడ్ సుభాష్ పత్రి గారి మాటల్లానే సమైక్యాంధ్ర ఆవశ్యకత గురించి ప్రజలకు వివరించడానికే జై సమైక్యాంధ్ర పోటీ అని కిరణ్ చెబుతున్నట్టుగా ఉంది. కిట్టీ పార్టీ ఖర్చు అందరు కలిసి భరిస్తారు, కిట్టీ పొలిటికల్ పార్టీల ఖర్చు కోసం అధికారంలో ఉన్నప్పుడు సంపాదిస్తారు. రెండింటి లక్ష్యం మాత్రం ఒకటే. కాసేపు కాలక్షేపం అంతే.

20, ఏప్రిల్ 2014, ఆదివారం

దొంగల మ్యానిఫెస్టో..దొంగ వృత్తికి రిస్క్ అలవెన్స్‌తో పాటు, ప్రభుత్వ సొమ్ముతో రిస్క్ బీమా

‘‘ఈసారి మనం పీపుల్స్ మ్యానిఫెస్టో ప్రకటిద్దాం. చట్టబద్ధమా? చట్ట వ్యతిరేకమా? అనే సందేహం వద్దు, ఏం కావాలో ప్రజలు చెబితే, మనం వాటిని ఇచ్చేస్తున్నామని తీర్మానం చేసి మ్యానిఫెస్టోలో చేరుద్దాం. మీమీ నియోజక వర్గాల జనం డిమాండ్లతో నిర్మొహమాటంగా ఒక జాబితా రూపొందించి, వచ్చేవారం తీసుకు రండి’’అని అధ్యక్షుడు ప్రకటించాడు.
***
నియోజక వర్గాల నుంచి వచ్చిన నాయకులు వరుసగా జాబితాలు చదివారు. కలర్ టీవి, ల్యాప్‌టాప్, నెలకు వెయ్యి రూపాయల టాక్ టైం ఫ్రీ, రోజుకు రెండు పూటల భోజనం, ఉదయం టిఫిన్, సాయంత్రం టీ పథకం ఇలా కామన్‌గా ఉన్న డిమాండ్లతో ఒక జాబితా రూపొందించారు. మహిళలకు నెలకో చీర, వారానికో లిప్‌స్టిక్, ఏడాదికో మేకప్ బాక్స్, మగవారికి రోజుకో సిగరెట్ డబ్బా, గుట్కా, యువతకు హెరాయిన్, నవతకు రెండు రోజులకో సినిమా టికెట్ పథకాల డిమాండ్లను చదివి వినిపించారు. అధ్యక్షుడు మైకు పుచ్చుకుని ’’ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలు కోరుకున్న పాలన. ప్రజలు మద్యం , హెరాయిన్ కోరుకుంటే అందించడం వారి ప్రతినిధులుగా మన బాధ్యత. అధికారంలోకి రాగానే చట్టాలను మార్చి ఇంటింటికి హెరాయిన్ పథకాన్ని ప్రవేశపెడదాం’’ అని అధ్యక్షుడు చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టి ఆమోదం తెలిపారు. ఒక నేత లేచి దీనిపై నాకు కొంత అభ్యంతరం ఉంది అని మైకు అందుకున్నాడు. 


‘‘మనం ఎక్కడికి వెళుతున్నాం, ప్రజాస్వామ్య స్ఫూర్తి, భారతీయత మనలో లోపిస్తోంది. విదేశీ హెరాయిన్ పై ప్రేమ చూపించే మీరు మన భారతీయ గంజాయి గురించి ఒక్కసారైనా ఆలోచించారా? ఇదేనా మీ దేశభక్తి ఇందుకేనే మనం రాజకీయాల్లోకి వచ్చింది’’ అని ఆవేశంగా మాట్లాడాడు. అధ్యక్షుడు లేచి ‘‘ఆవేశం వద్దు మా దేశ భక్తి మీ దేశభక్తికన్నా విశాలమైంది. అది ఒక్క దేశానికే పరిమితం కాలేదు. అనేక దేశాలపై మాకు భక్తి ఉంది. అందుకే అన్ని దేశాల్లో పెట్టుబడులు పెట్టాను, బ్యాంకుల్లో దాచుకున్నాను. నీది దేశ భక్తి అయితే నాది దేశాల భక్తి. నా దేశాల భక్తిని ఎవరూ శంకించలేరు. ఇంటింటికి హెరాయిన్ అంటే అందులో గంజాయి, గుట్కా, వంటి స్వదేశీ ఉత్పత్తులన్నీ వస్తాయి’’ అని ఆవేశంగా చెప్పాడు.


స్టూవర్ట్‌పురం నాయకుడు లేచి మా వర్గ ప్రయోజనాలు మాకు ముఖ్యం. మేం స్టూపవర్ట్‌పురం నియోజక వర్గానికి మాత్రమే పరిమితం అయ్యామనుకుంటే పొరపాటు జనాభాలో మేం తొమ్మిదిన్నర శాతం మందిమి ఉన్నాం . పేర్లు వేరైనా మీది మాది ఒకే వృత్తి. కానీ మీకేమో బోలెడు ప్రచారం మాకేమో రిస్క్ ఎక్కువ. ఇంత కాలం ప్రభుత్వంపై ఆధారపడకుండా మా వృత్తిలో మేం బతికాం ఇక మా డిమాండ్లు ఆమోదించాల్సిందే. రాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఎవరినీ రోడ్డుపైకి రానివ్వకుండా నిషేధాజ్ఞలు విధించాలి. ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉండరాదు. వృత్తిలో మరణించిన వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. 60 ఏళ్లు దాటిన వారు వృత్తిలో చురుగ్గా ఉండలేరు వారికి ప్రత్యేక బృతి ఇవ్వాలి’’ అంటూ డిమాండ్ల జాబితాను చదివి వినిపించారు. అధ్యక్షుడు లేచి ‘‘ ఇంతోటి డిమాండ్లకు అంత బిల్డప్ ఇచ్చావేమిటయ్యా! ఈ డిమాండ్లన్నీ ధర్మబద్ధంగానే ఉన్నాయి ఏమంటారు’’ అని అధ్యక్షుడు. అడిగాడు.


చప్పట్లతో ఆ డిమాండ్లను ఆమోదిస్తున్నట్టు అందరూ చెప్పారు. ‘‘ అతి పురాతనమైన దొంగ వృత్తికి రిస్క్ అలవెన్స్‌తో పాటు, ప్రభుత్వ సొమ్ముతో రిస్క్ బీమా కూడా చేయిస్తామని హామీ ఇస్తున్నానని ’’ అధ్యక్షుడు చప్పట్ల మధ్య ప్రకటించాడు. విచారంగా కూర్చున్న ఓ నేత వైపు చూసి ‘‘తమ్ముడూ మీ డిమాండ్లను వినిపించనే లేదు. మనం ఉన్నదే ప్రజల కోసం ఎలాంటి డిమాండ్లయినా సరే మ్యానిఫెస్టోలో చేర్చడానికి రెడీ చెప్పు బ్రదర్ చెప్పు ’’అని మళ్లీ మళ్లీ అడిగాడు.
ఆ నేత కళ్ల నుంచి కన్నీరు ఉబుకుతోంది...‘‘ మనం రామరాజ్యం స్థాపిస్తామని ఎన్నికల ప్రచారంలో చెబుతున్నాం. శ్రీరాముని కొలువులో ఇలానే గూఢచారి ప్రజలు అనుకున్న మాటలు చెప్పాల్సిన సందర్భం వస్తే సంకోచించాడు. కానీ రాముడేమన్నాడు ఎవరేమనుకున్నా సరే చెప్పమన్నాడా? లేదా? సీతను అడవులకు పంపాల్సిన విషయం అయినా సరే రాజు వద్ద రహస్యాలు దాచవద్దు చెప్పు బ్రదర్ చెప్పు’’ అని రెట్టించి అడిగాడు.

భార్య ను అ డవులకు పంపడం పెద్ద త్యాగమేమీ కాదు అలాంటిదైనా ఎగిరి గంతేసి చెప్పేవాన్ని కానీ మా నియోజక వర్గ ప్రజలు దుర్మార్గమైన డిమాండ్లు వినిపిస్తున్నారు. చదవడానికే నాకు నోరు రావడం లేదు. అయినా చదవడం నా ధర్మం మనసు దిటవుచేసుకుని చదువుతున్నాను.
అయ్యా దొంగల రాజ్యం ధర్మప్రభువులకు మా నియోజక వర్గ ప్రజల డిమాండ్ మీ దోపిడీకి మేము ఎప్పుడూ అడ్డుగా నిలవం. మావి రెండే రెండు డిమాండ్లు అవి ఆమోదించిన వారికే మా ఓటు.
ఎంతటి స్థాయి నాయకుడైనా అక్రమంగా సంపాదించిన సొమ్ములో సగం నియోజక వర్గ ప్రజలకు సమానంగా పంచాలి. ఇక మిగిలిన సగం సింగపూర్‌లో పెట్టుబడులో, స్విస్‌బ్యాంకులో డిపాజిట్లు చేయడం మానేసి స్వదేశంలోనే పెట్టుబడులు పెట్టాలి అని పూర్తిగా చదవకముందే, అన్ని నియోజక వర్గాల అభ్యర్థులు నో అని ఏకగ్రీవంగా గట్టిగా అరిచారు. ఈ డిమాండ్లను మేమే కాదు మా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు సైతం ఆమోదించరు, మెడమీద తలకాయ ఉన్న నాయకుడెవరూ ఆమోదించరు అని అందరూ కోరస్‌గా చెప్పారు. 


‘‘ఎంతో కష్టపడి సంపాదించుకున్న అవినీతి సొమ్ముపై ఆంక్షలా దేశం ఎటుపోతోంది . దేశంలో కొంత భాగం పక్కదేశం వాడికి ఇచ్చేయమంటే ఇస్తాం కానీ మా ఆక్రమ సంపాదన ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకునే అధికారం మాకు లేదంటే సహించం’’ అని అధ్యక్షుడు ఉబికి వస్తున్న దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ కళ్లు తుడుచుకున్నాడు. నాయకుల అక్రమాస్తులకు ఎసరు పెట్టే ఇలాంటి ఆలోచనలకు పురిటిలోనే బ్రేకు వేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

16, ఏప్రిల్ 2014, బుధవారం

చూడాలని ఉంది

రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడు కౌరవ సభలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించినప్పుడు దృతరాష్ట్రుడికి సైతం కళ్లను ప్రసాదిస్తాడు. నల్లనయ్య విశ్వరూపాన్ని చూసి న కళ్లతో ఇక మరేదీ చూడలేనన్న దృతరాష్ట్రుడు తన మునపటిలానే గుడ్డితనాన్ని కోరుకుంటాడు. అద్భుతమైన ఒక సినిమాను చూసినప్పుడు ఇక మరే సినిమా చూడబుద్ధి కాదు. మంచి సాహిత్యం చదివినా అలానే అనిపిస్తుంది. మన జీవిత కాలంలో ఏదో ఒక అద్భుమైన దృశ్యాన్ని చూడాలని కోరిక ఉంటుంది. అది చూశాక మరో దృశ్యం కళ్ల ముందు నిలవదు. అలానే ఈ ఎన్నికల్లో ఎన్నో అద్భుతమైన దృశ్యాలు మనకు ప్రత్యక్షం అయ్యాయి, మరి న్ని అద్భుత దృశ్యాలు రాజకీయ తెరపైకి రాబోతున్నాయి.


ప్రశ్నించడానికే జనసేనను పుట్టించిన పవన్, దేశంలోని అవినీతిని కడిగేయడానికి గుజరాత్ మార్క్ కత్తిపట్టుకుని దేశం మీద పడ్డ మోడీ, ఒక్క రూపాయి జీతంతో నీతిమంతంగా స్టార్ హోటల్ స్థాయి పార్టీ కార్యాలయాన్ని, పార్టీని నడుపుతున్న నీతిబాబు,గనులను మింగేసిన శ్రీరాములు, ఆయన బాస్ గాలి జనార్దన్‌రెడ్డి ఒకే వేదికపై నుంచి జాతికి నీతి బోధ చేస్తే చూసి తరలించాలని ఉంది. ఇదేం తీరని కోరికేం కాదు, అత్యాశ అంత కన్నా కాదు. గాలి బిజెపిలోనే ఉన్నాడు కాబట్టి ఈ కోరిక తీరుతుంది, జైలులో ఉన్నాడు కాబట్టి ఇప్పుడే తీరదు. గాలి మినహా మిగిలిన నేతలంతా కర్నాటకలో కలిసి ప్రచారం చేసి బిజెపి గాలిని సృష్టించనున్నారు. ఆ దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లు, నీతి బోధ వినేందుకు రెండు చెవులు చాలవు. గాలి జనార్దన్‌రెడ్డి గొప్పతనం గురించి ఒకవైపు జగన్ మరోవైపు బాబు చెబుతుంటే నా సామిరంగా చూసిన వారికి కన్నుల పండగే. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. 

నీతి బోధ చేసే హక్కు అందరికీ ఉన్నప్పుడు బిజెపిలో విలీనం అయిన శ్రీరాములుకు ఎందుకు లేదు, శ్రీరాముడ్ని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉపయోగించుకున్న బిజెపికి ఎందుకు లేదు.


బంగారం తాకట్టు గురించి ఏ చిరుద్యోగిని అడిగినా ఠక్కున చెబుతాడు. బంగారం మార్వాడి కొట్టులో తాకట్టు పెట్టడం కన్నా, ముత్తుట్ ఫైనాన్స్‌లో బెటర్, అంత కన్నా జాతీయ బ్యాంకుల్లో మరింత బెటర్. మధ్యతరగతి జీవి కొద్దిపాటి డబ్బుకోసమే బంగారం తాకట్టుపెట్టేటప్పుడు ఇంతగా ఆలోచిస్తే సంపన్న రాజకీయ ప్రాణులు మన కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటప్పుడు ఇంకెంత ఆలోచిస్తారు. తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెడతారా? అని తెలుగులో మాట్లాడగలిగిన, మాట్లాడలేని నాయకులంతా తెగ విమర్శించే వారు. నిజమే కదా? మనం తాకట్టుపెట్టిన బం గారం సురక్షితంగా ఉండాలి, వడ్డీ రేటు తక్కువుండాలి. అలానే ఆత్మగౌరవం అంతగా భద్రత లేని, ప్రయోజనం లేని ఢిల్లీలో తాకట్టు ఎందుకు అనేది వారి ప్రశ్న. ఇంటి పక్కన ఉన్న మార్వాడి కొట్టు కన్నా కాస్త దూరం అయినా పరవాలేదు అని జాతీయ బ్యాంకుకు వెళతాం, అలానే ఢిల్లీ నుంచి మరో వెయ్యి కిలో మీటర్ల దూరం వెళ్లి పోటీ పడి తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. సినిమా తారలు గుజరాత్‌లో క్యూ కడితే, కాస్త పేరున్న బాబులు మాత్రం వ్యవహారం టెలిఫోన్‌లోనే నడిపిస్తున్నారు.


రారా కృష్ణయ్య... రా.. రా.. కృష్ణయ్య దీనులను కాపాడా రా... రారా.. కృష్ణయ్య అని పాడుతున్నట్టుగా నమో... నమో... అంటూ గుజరాత్‌కు పరుగులు తీస్తున్నారు. నిజానికి గుజరాతీలకు మంచి వ్యాపార దక్షత ఉంటుంది. వారితో వ్యాపారం నిక్కచ్చిగా ఉంటుంది. టన్నుల కొద్ది ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టేందుకు తెలుగు వాళ్లు పోటీ పడుతున్నారని తెలియగానే ఒకరికి తెలియకుండా ఒకరితో బేరాలు సాగించారు. మంచి తరుణం మించిన దొరకదు అని మన వాళ్లు పరుగులు పెడుతున్నారు. ఈ తాకట్టు వ్యాపారంలో గుజరాత్ నేత మోడీకి గుజరాత్ వ్యాపారి అంబానీ ఫైనాన్స్ దండిగానే ఉందని ప్రచారం. నిజా నిజాలు మోడీకి, అంబానీకి తెలియాలి. గుజరాతీల వ్యాపార దక్షతకు మురిసిపోయి వాళ్లకు తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టేందుకు ఉత్సాహ పడుతున్నారు.
ఎన్నికల ముందు మోడీకి కుడిభుజంగా బాబు, ఎన్నికల తరువాత ఎడమ భుజంగా జగన్ ఉంటే చూసే వారికి కన్నుల పండగే. మోడీకి కుడి ఎడమలుగా బాబు జగన్‌లు బుర్రకథలో వంత పాడే వారిలా మోడీ విజయ కథలు చెబితే వినాలనిపించడం లేదూ!


పెద్దగా సీట్లు రాని బాబుతో ఎన్నికల ముందు పొత్తు కన్నా ఎక్కువ సీట్లు వచ్చే నాతో ఎన్నికల తరువాత పొత్తు పెట్టుకోండి అంటూ జగన్ గుజరాత్‌కు చిలక రాయబారం పంపించేశాడు. రెండేళ్ల రాజకీయ అనుభవం ఉన్న జగన్‌కే ఇన్ని లెక్కలు తెలిస్తే మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన మోడీకి ఎన్ని లెక్కలు తెలియాలి. ఎన్నికల ముందు బాబు ఎన్నికల తరువాత జగన్, ఒకరు ఎడమ పక్క మరొకరు కుడిపక్క నిలవక తప్పదు అని మోడీ లెక్కలు వేసుకున్నారేమో ! ఎంత లౌకిక పాఠాలు చెబుతున్నా, ఎన్నికల తరువాత కెసిఆర్ పోకుండా ఉంటారా? వస్తానంటే మోడీ వద్దంటారా? అప్పుడు ఈ ముగ్గురు నేతలను మోడీతో చూసి తనకా చాన్స్ దక్కనందుకు కిరణ్ ఏమనుకుంటారో? ఇలాంటి అరుదైన దృశ్యాన్ని చూసే అదృష్టాన్ని మనకీ ఎన్నికలు ప్రసాదించాయి.


2009 ఎన్నికల సమయంలో కెసిఆర్ ఇంటికి బాబు, రాఘవులు వెళ్లడం, టీ కప్పులో తుఫాను సృష్టిస్తామని చేసిన చారిత్మ్రాక దృశ్యాలను కనులారా చూడలేని వారికి ఈసారి అంతకు మించిన అరుదైన దృశ్యాలు కనిపించబోతున్నాయి. మూడు రంగుల కండువాలు తీసేసి మొత్తం కాంగ్రెస్ క్యాబినెట్‌లో సగం మంది బాబు పార్టీ నుంచి మరో సగం మంది వైకాపా నుంచి పోటీ చేస్తుండడం రాజకీయ వినోదాత్మక వింత దృశ్యమే. ఇంకా విచిత్రం 95లోనే బాబు తన ప్రతిభనూ చూపించారు, పదేళ్ల నుంచి చతికిలపడ్డారు. కానీ బాబులోని పాలనా దక్షత ఇప్పుడే గ్రహించామంటున్నారు ఆయన పార్టీలో చేరుతున్న వారు.

14, ఏప్రిల్ 2014, సోమవారం

మగవారి మాటలకు అర్థాలే వేరులే...


ఆడవారి మాటలకూ అర్ధాలే వేరులే అని పాడుతున్న ఆ పురుషుడి మాటలకు సైతం అర్ధాలు వేరు. నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అమ్మాయి అంటే అదేం కాదు మీ మాటలకు అర్ధాలు వేరు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి అలా అంటున్నారు అని మగవాడు ఆమె మాటలకు కొత్త అర్ధం చెబుతాడు. ఒకవేళ ఆ అమ్మాయి నువ్వంటే నాకిష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అందనుకోండి. అప్పుడు సమస్యనే లేదు. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అనాల్సిన అవసరమే ఉండదు. అంటే అమ్మాయి ఏం మాట్లాడినా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికే మగవాడు ఈ మాటను ప్రచారంలోకి తెచ్చాడేమో. అందుకే మగవారి మాటలకూ అర్ధాలే వేరులే అనుకోవాలి. ప్రేమ విషయంలో ఆడ, మగ మాటల విషయంలో అర్ధాలు ఏవైనా రాజకీయాల్లో మాత్రం ప్రతి ఒక్క నాయకుడి మాటలకు అర్ధాలు వేరుగా ఉంటాయి.
బంధువుల అబ్బాయికి పెళ్లి కాలేదని మునిమాణిక్యం భార్యతో వాపోతుంటే నేను అప్పుడే అనుకున్నాను, బర్మాకెళొచ్చిన వాడికి పిల్లనెవడిస్తారని అంటుంది భార్య. బర్మాకు వెళ్లిరావడానికి పెళ్లి సంబంధం కుదరకపోవడానికి సంబంధం ఏమిటో అర్ధం కాక దానికీ దీనికి సంబంధం ఏమిటని ఆమెనే అడుగుతాడు. వంకర కాళ్లతో నడిచే వాడు బర్మాకు కాకుండా ఇంకెక్కడికి వెళతాడు లేండి అంటూ మరో మాట అనేస్తుంది. పెళ్లి, బర్మా, వంకర కాళ్లు ఒకదానికొకటి ఏ మాత్రం సంబంధం ఉండదు, అదే అడిగితే ఇంకేం చెబుతుందో అని మునిమాణిక్యం వౌనంగా ఉన్నట్టుగానే ఇప్పుడు ఓటర్లు ఎన్నికల కాలంలో వౌనంగా ఉండడమే మంచిదనుకుంటున్నారు.
కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తున్న రాఖీసావంత్ ముంబై రోడ్లను కత్రినా కైఫ్ నడుములా మార్చేస్తానని చెబుతోంది. ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. ఆమె మాటలకు అర్ధం కత్రినా కైఫ్‌ను రోడ్డున పడేయాలన్న కోపమే తప్ప రోడ్లను అంత మృదువుగా మార్చాలనే కోరిక కాదు.
ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి నేత అమిత్‌షా ఆయన తలపై వెంట్రుకలనే కాపాడుకోలేకపోయాడు, ఇక రాజకీయాల్లో ప్రతీకారం ఏం తీర్చుకుంటాడు అని సమాజ్‌వాది పార్టీ నేత ఆజంఖాన్ సందేహం వ్యక్తం చేశాడు. ఎన్నికల్లో ఒక పార్టీని ఓడించమని, మరో పార్టీ ప్రజలకు పిలుపును ఇవ్వడం సహజమే. ఐదేళ్లపాలనపై ప్రతీకారం తీర్చుకోనే విధంగా ఓటువేయమంటారు, దానికి తలపై వెంట్రుకలకు సంబంధం ఏమిటో? పోనీ బిజెపిలో తల వెంట్రుకలు బాగా కాపాడుకున్న వారికి ఓటువేయమని ఆజంఖాన్ చెబుతారు. అలా అయితే మోడీకి జై అంటారేమో ఆయన తలపైన జుట్టుతో పాటు గడ్డం కూడా బాగానే పెంచారు.
ఎన్నికల సీజన్‌లో నాయకులందరి మాటలు ఇలానే ఉంటాయి. పార్టీ ఎందుకు పెడుతున్నావయ్యా అంటే ప్రశ్నించేందుకు అని పవన్ కల్యాణ్ చెప్పినట్టు. ఆయనేదో ఈ ఎన్నికల్లో వీరవిహారం చేస్తాడని అభిమానులు బాగానే ఆశలు పెట్టుకున్నారు. ఆశలు పెట్టుకున్నవారిది తప్పు కానీ ఆయన మొదటి రోజే అసలు విషయం చెప్పాడు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు జన సేవ పొడిగింపుఅని చెప్పనే చెప్పాడు. అంటే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేసిన తరువాత ఆ ఫోర్స్ చేసింది లేదు, ఆయన ఏ సమస్యపై స్పందించింది లేదు. మళ్లీ పార్టీ ప్రకటన సమయంలోనే దాని గురించి ప్రస్తావించాడు. అంటే జనసేవపై ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ లాంటిదే ఇది అని చెప్పకనే చెప్పాడు.
సినిమాల్లో హీరోను, హీరోయిన్‌ను ఎంపిక చేసుకున్నప్పుడు ప్రచారానికి రావాలనే కండిషన్ కూడా ఆ ప్యాకేజీలో భాగంగా ఉంటుంది. అలానే పవన్ కల్యాణ్ పార్టీ ఏర్పాటు మరో పార్టీ కోసం ప్రచారం వరకే ప్యాకేజీనా? లేక పోటీ చేసి సహాయం చేయాలనేది ప్యాకేజీలో భాగమే అనేది ఎన్నికలు అయితే కానీ స్పష్టం కాదు.
మల్కాజిగిరి పార్లమెంటు నియోజక వర్గంపై అన్ని పార్టీల నాయకులు అమితాసక్తి చూపించారు. అప్పటి వరకు పార్టీతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తికి టిడిపి టికెట్ ఇచ్చారు బాబుగారు. ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్న వాళ్లు పార్టీలో ఇంత మంది ఉంటే వారందరినీ కాదని ఆయనకెందుకిచ్చారా?అని అందరి సందేహం. అదే విషయాన్ని బాబును అడిగితే పార్టీకి కొందరు ద్రోహం చేసి వెళ్లారు, పార్టీని కాపాడుకోవడానికే అని సమాధానం ఇచ్చారు. నిజమే పార్టీని కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలైనా తీసుకోవాలి తప్పు లేదు. ఆ మధ్య గాంధీ భవన్ ముందు బౌన్సర్‌లను కాపలాగా పెట్టారు. గతంలో ఎన్నికల సమయంలో గాంధీభవన్‌ను తగలబెట్టిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా బౌన్సర్‌లను ఏర్పాటు చేశారు. అలానే పార్టీని కాపాడుకోవడానికి మల్కాజిగిరి టికెట్ బాబు బౌన్సర్‌కు ఇచ్చాడేమో అనుకున్నారు. కానీ ఆయన బౌన్సర్ కాదు ప్రముఖ విద్యా వ్యాపారి. విద్యా వ్యాపారికి టికెట్ ఇస్తే ఆయన పార్టీని కాపాడడం ఏమిటో తమ్ముళ్లకు అర్ధం కాక బుర్ర గోక్కున్నాడు. డబ్బులున్నాయని ఇచ్చామని నేరుగా చెప్పవచ్చు కదా?అనేది కొందరి ప్రశ్న...
తల తిక్క సమాధానాల్లోంచి అసలు విషయం గ్రహించాలి కానీ నాయకులు ఏ విషయమైనా నేరుగా చెబుతారా? చెప్పనే చెప్పరు. కాంతానికి ఏదో విషయంలో మునిమాణిక్యంపై కోపం వచ్చిందని అంతే తప్ప ఆ కుర్రాడికి పెళ్లి కావద్దనో, కాదనో చెప్పడం కానే కాదు. ఆకాలం నాటి కాంతమే ఇలా మాట్లాడితే ఇక రాజకీయ నాయకులు విషయం నేరుగా చెబుతారా? మీ దగ్గర అంత డబ్బులేదు, అందుకే మీకు టికెట్ ఇవ్వలేదు ఆయన దగ్గర డబ్బుంది టికెట్ ఇచ్చాను అని చెబితే మీడియా ఊరుకుంటుందా?
ఎన్టీఆర్‌ను ఎందుకు దించావయ్యా బాబు అని అల్లుడిని అడిగితే ఎన్టీఆర్ విధానాలు అమలు చేయడంలో ఎన్టీఆర్ విఫలమయ్యారు. ఎన్టీఆర్ విధానాలు అమలు చేసేందుకే ఆయన్ని దించాను అని అల్లుడు చెప్పినప్పుడే అర్ధమైంది ఆయన మాటలకు అసలైన అర్ధాలు వేరుగా ఉంటాయి అని..
.

9, ఏప్రిల్ 2014, బుధవారం

తెలుగునేతతో అంతరాత్మ ఇంటర్వ్యూ!

తెలుగునేత ఈల వేస్తూ అద్దంలో తనను తాను చూసి ముసిముసిగా నవ్వుకున్నా డు. ఎంత కాలమైనా నేనేంటో ఎవరికీ తెలియదు. ఎవరికో ఎందుకు నా ఆత్మకు కూడా తెలియదు అని మనసులోని మాటను బయటికే అన్నాడు.
అంతరాత్మను కూడా నమ్మని నువ్వు ర్ర్ రోజు నన్ను పిలవడం సంతోషంగా ఉంది  పిలిచావు కదా వచ్చాను అని అంతరాత్మ అద్దంలో నుంచి మాట్లాడడం మొదలు పెట్టింది. తెలుగు నేతతో  అంతరాత్మ సంభాషణ ఇలా సాగుతోంది 

‘‘మంచి ఉషారు మీదున్నట్టున్నావు’’
‘‘ఔను చాలా రోజుల తరువాత..’’
‘‘మరి సరదాగా ఒక ఇంటర్వ్యూ చేయనా? ’’
‘‘నువ్వా ? నన్ను ఇంటర్వ్యూ చేస్తావా? ’’
‘‘నీ ముఖం ఏమడుగుతావు? అడుగు ?’’
‘‘ ఇంత కాలం అయినా తిండికి నోచుకోని పేదలను చూస్తే ఎవరికైనా జాలి వేస్తుంది కదా? పేదరికాన్ని ఎలా నిర్మిస్తావు? ’’
‘‘ పేదరిక నిర్మూలనకు తొలి సంతకం చేస్తా’’
‘‘ రైతు ఆత్మహత్యలకు అంతులేదు.’’
‘‘ రైతుల ఆత్మహత్యలను నిషేధిస్తూ రెండవ సంతకం చేస్తాను’’
‘‘ రైతులు, అప్పుల్లో కూరుకుపోయారు’’
‘‘ అప్పులన్నింటిని రద్దు చేస్తూ మూడవ సంతకం చేస్తా’’
‘‘ ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తానంటున్నావు. కనీసం రెండు కోట్ల కుటుంబాలు ఉంటాయి కదా? ఉద్యోగాలు ఎలా ఇస్తావు’’
‘‘ ఏదో ఒక నాడు అందరికీ ఉద్యోగాలు అంటూ నాలుగవ సంతకం చేస్తాను’’
‘‘ 12 గంటల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అన్నావు కదా? ’’
‘‘ అవును దీనిపై ఐదవ సంతకం చేస్తాను’’
‘‘ అది సరే మీరు సంతకం చేస్తే పేదరికం ఎలా నిర్మూలన అవుతుంది.’’
‘‘ పదేళ్ల నుంచి ప్రభుత్వ ఫైళ్ల మీద సంతకం చేయక చేతులు దురద పెడుతున్నాయి.’’
‘‘గోక్కుంటే పోతుంది కదా? ’’
‘‘ ఇది మామూలు దురద కాదు .. పదవితో తప్ప దేనితోనూ దీన్ని గోక్కోలేం. దురద తీరేంత వరకు సంతకాలు చేస్తా అంతే.. సంతకాలు నేనే చేయాలి. సమస్యలను పెట్టుబడిగా పెట్టుకొని మన భవిష్యత్తు చూసుకోవాలి కానీ నువ్వెవడవయ్యా బాబు నన్ను సమస్యను పరిష్కరించమంటావు.’’
‘‘సరే కొన్ని ప్రశ్నలు అడుగుతాను నిజాయితీగా చెబుతావా?’’
‘‘  ఏ పార్టీ అయినా కావచ్చు , వై నాయకుడైనా కావచ్చు రాజకీయ నాయకుడు నిజాయితీగా చెబుతాడు అనే మాట నువ్వు నమ్ముతావా? అయితే చెబుతా అడుగు? ’’
‘‘ఎన్నికల్లో ఏ సంవత్సరంలో ఏమన్నావో చెప్పమంటావా? ఆ రోజు నేనడిగిన ప్రశ్న, నువ్వు చెప్పిన సమాధానం కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది చెబుతా విను.’’
***
‘‘బిజెపితో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు?’’
‘‘దేశ ప్రయోజనాల కోసం(2014)’’
‘‘వామపక్షాలతో ? ’’
‘‘దేశ ప్రయోజనాల కోసం ’’
‘‘మరి టిఆర్‌ఎస్‌తో పొత్తు ఎందుకు పెట్టుకున్నట్టు ?’’
దేశ ప్రయోజనాల కోసమే (2009)
‘‘ అంతకు ముందు ఏమన్నారు?’’
‘‘మసీదులను కూల్చే పార్టీ అధికారంలోకి వస్తే దేశం అల్లకల్లోలం అవుతుంది. దేశ ప్రయోజనాల కోసమే వామపక్షాలతో కలిసి వెళుతున్నాం (1998)’’
‘‘మసీదులను కూల్చే పార్టీతో మీకు పొత్తేంటి?
కాంగ్రెస్ నుంచి దేశాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. దేశ ప్రయోజనాల కోసమే బిజెపితో పొత్తు (1999)’’
‘‘దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం, మీ కోసం నేను ఉర్దూకూడా నేర్చుకుంటాను, బిజెపితో పొత్తు పెట్టుకోవడం నా రాజకీయ జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. దేశం కోసం బిజెపికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను (2004 ఎన్నికల తరువాత)’’
‘‘గుర్తు కొచ్చాయా? నువ్వన్నమాటలే’’


‘‘కాదని ఎవరన్నారు?’’
‘‘నా ప్రతి నిర్ణయానికి దేశ ప్రయోజనమే ముఖ్యం. భవిష్యత్తులో బిజెపిని వదిలి వామపక్షాలను కలిసినా, ఎన్‌డిఏను నట్టేట ముంచి థర్డ్ ఫ్రంట్ వెంట పడ్డా అన్నీ దేశ సంక్షేమం కోసమే.’’
‘‘ప్రతి ఎన్నికల్లో పార్టీలు మార్చడంలో దేశ సంక్షేమం ఏముంది? ’’
‘‘పిచ్చోడా! దేశం అంటే నువ్వేమనుకుంటున్నావు?’’
‘‘ దేశమంటే భారత దేశమే కదా? ’’
‘‘ తెలియక పోతే తెలుసుకోవాలి?’’
‘‘ ఓహో తెలిసింది... తెలిసింది. మీ దృష్టిలో దేశం అంటే తెలుగుదేశం’’
‘‘దేశం అంటే తెలుగుదేశం అని నేను చెప్పా నా? దేశ ప్రయోజనం అంటే నా దృష్టిలో నా ప్రయోజనం..నేను పదవిలో ఉండడమే దేశ ప్రయోజనం.అందుకోసం ఏమెట్లయితే నాకేం.. ’’


‘‘హమ్మా! ఇదా నీ ఆలోచన... ఈవిషయం ప్రజలకు చెప్పనా? ’’
‘‘చెబితే నిన్ను పిచ్చోడు అనుకుంటారు. నాకు బలం ఉంటే తెలంగాణను ఆపే వాడిని అని సీమాంధ్రలో చెప్పిన మరుసటి రోజే తెలంగాణకు వచ్చి నేనిచ్చిన లెటర్ వల్లనే తెలంగాణ వచ్చింది, నేనెప్పుడూ తెలంగాణ వాదినే అని చెప్పినప్పుడు నీకు అర్ధం అయి ఉండాలి నేనేంటో నా బలమేంటో? ఒకే సభలో కుడివైపు తెలంగాణ కోరుకున్న తెలంగాణ వారిని, ఎడమవైపు సమైక్యాంధ్ర కోరుకున్న సీమాంధ్రులను కూర్చోబెట్టి కుడి ఎడమలను రంజింప జేసే విధంగా మాట్లాడే సత్తా ఉన్న నాయకుడ్ని నేను... నాతో పెట్టుకోకు.’’


‘‘నీరహస్యాలన్నీ నాకు తెలిసిపోయాయి...’’
‘‘ నిజమే కానీ తెలిసినా ఏమీ చేయలేవు. నువ్వు నా అంతరాత్మవు , నా అనుమతి లేనిదే ఈ విషయాలను నువ్వు బయటపెట్టలేవు. ఆత్మతో కూడా రహస్యాలు పంచుకోవద్దనే సిద్ధాంతం నాది. ఇప్పటికే ఎక్కువగా మాట్లాడావు ఇక చాలు  లోపలికి వెళ్లు ’’

చివరి మాట తోటి నాయకులకు ఏమైనా సదేశం ఇస్తావా ?
నా జీవితమే నా సందేశం 
అది కాదు ఇంకో మాట చెప్పు 
రాజకీయాల్లో ఉన్నప్పుడు మనసులో మాట  బయటకు చెప్ప  వద్దు. చెప్పిన దానికి కట్టుబడి ఉండవద్దు 

5, ఏప్రిల్ 2014, శనివారం

పెను’గాలి! ఆ రోజు స్పీకర్ పదవి తీసుకోని ఉంటే 95వెన్నుపోటు కథ ఏమయ్యేదో ?

          

  పేరులో ఏముందిలే అంటారు -పెద్దలు. పేరులోనే కాదు ఇంటి పేరులోనూ ఏదో ఉండే ఉంటుంది -అనిపిస్తుంది ముద్దుకృష్ణమ నాయుడు గాలిని చూస్తే. ఆయన తెదేపాలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్లు ఆయనవి -గాలి మాటలు అనేవాళ్లు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు తెదేపా వాళ్లు -గాలి మాటలు పట్టించుకోం అనేవారు. పురాణమైనా రోజూ వింటే బోరు కొడుతుంది. అలాగే -గంటకోసారైనా అవినీతిపై తీవ్రారోపణలు చేయడంతో -గాలి ఆరోపణలకు ఆరోప్రాణం లేకుండా పోయింది. మంత్రిగా ఉన్నపుడు -ప్రచారంలో కొత్తపుంతలు తొక్కారు. 

’94 ఎన్నికల్లో తెదేపా విజయం ఖాయమని అంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లోనే తేలిపోయింది. విజయం ఖాయం అని తేలాక మంత్రి పదవులకు ఎంపికలు కూడా లోపాయకారిగా జరిగిపోతున్నాయి. ఆ సమయంలోనే అల్లుడి కదలికలపై మామకు అనుమానమొచ్చింది. ఏదైనా జరగొచ్చనుకున్నారు. ఫలితాలు వచ్చాయి. ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత స్థాయిలో కాంగ్రెస్ ఓడిపోయింది. స్పీకర్ పదవి తీసుకోండి అని ఎన్టీ రామారావు, లక్ష్మీపార్వతి దంపతులు గాలి ముద్దు కృష్ణమనాయుడిని కోరారు. ముద్దుకృష్ణమ నాయుడు ఎన్టీఆర్‌కు వీరభక్త హనుమాన్ అన్నట్టుగా ఉండేవారు. దానికితోడు జిల్లాలో అల్లుడికి గాలికి పడటం లేదు. జరగరానిది ఏమైనా జరిగితే స్పీకర్ మనవాడు కావడం మంచిదనుకున్నారు. కానీ మంత్రి పదవిలో చురుగ్గా ఉండే ముద్దు తనకు స్పీకర్ పదవి ఇష్టం లేదన్నారు. ఒకవేళ ఆ రోజు గాలి ముద్దు కృష్ణమనాయుడు స్పీకర్ పదవి తీసుకోవడానికి అంగీకరించి ఉంటే -1995 వెన్నుపోటు కథ ఎలాంటి మలుపులు తిరిగి ఉండేదో? ఎన్టీఆర్‌కు సన్నిహితంగా మెదిలిన 12మంది మంత్రులను అప్పుడు డర్టీ డజన్ అంటూ బాబు వర్గం -మీడియాలో బాగా ప్రచారం చేసింది. ఆ పనె్నండు మందిలో ముద్దుకృష్ణమనాయుడు మొదటి వారు.
గాలి ముద్దు కృష్ణమనాయుడికి -చంద్రబాబుతో ప్రారంభంలో మంచి స్నేహం ఉండేది. పేకాట ఆడే ప్రాణమిత్రులు ఎంతగా కలిసి పోతారో అలా ఉండేవారు. క్రమంగా దూరం పెరుగుతూ వచ్చింది. 95లో ఎన్టీఆర్‌ను దించేసిన తరువాత ఒకరి తరువాత ఒకరు తిరిగి చంద్రబాబు నాయకత్వంలో పని చేసేందుకు పార్టీలో చేరినా ముద్దుకృష్ణమ మాత్రం మనసు చంపుకోవడానికి  ఇష్టపడలేదు. కాంగ్రెస్‌లో చేరారు. సిఎల్పీ కార్యాలయంలో ప్రతి రోజు చంద్రబాబుపై ధ్వజమెత్తేవారు. వీర కాంగ్రెస్ వాదులను మించి విమర్శలు చేసేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నా సాకారం కాలేదు. 2009లో తెదేపా అధికారంలోకి వస్తుందనే అంచనాకు వచ్చారు. ఆయన గెలిచారు. కానీ పార్టీ అధికారంలోకి రాలేదు. మళ్లీ ప్రతిపక్షమే. అయితే తాను తిట్టాల్సిన నాయకుడి పేరు మారింది అంతే. ముద్దు కృష్ణమనాయుడు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు తెదేపాను, తెదేపాలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ను తిట్టడంలో తనకుతానే సాటి అని నిరూపించుకున్నారు. వెయ్యి కోట్ల పనుల్లో పదివేల కోట్ల కుంభకోణం అంటూ ధైర్యంగా విమర్శలు చేయడంలో గాలికి గాలే సాటి.
ఇలా ఇష్టం వచ్చినట్టు విమర్శించడం వీళ్లకు సరదా అని మీరనుకుంటారేమో -కానే కాదు. నేనో మాట అంటే ప్రత్యర్థి పార్టీ వాళ్లు అనకుండా ఉంటారా? పడాలి తప్పదు. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నాయకుడు చెప్పినట్టు తిట్టక తప్పదని ఓ సందర్భంలో తన ఆవేదన వ్యక్తం చేశారు. 95లో ఎన్టీఆర్ హయాంలో పోయిన మంత్రి పదవి ఇప్పటికీ ఆయనకు దక్కినట్టే దక్కి దూరమవుతోంది. చిత్తూరు జిల్లా వెంకటాపురం గ్రామంలో 1947 జూన్‌లో జన్మించిన గాలి -ఎన్టీఆర్ తెదేపాను ఏర్పాటు చేసినప్పుడు లెక్చరర్‌గా పని చేసేవారు. ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. శాసన సభకు ఆరుసార్లు ఎన్నికయ్యారు. ఏ పార్టీలో ఉన్నా ఎక్కువగా విలేఖరుల సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడేది ఆయనే. ఏం మాట్లాడినా గాలి మాటలు అనే విమర్శ మాత్రం ఇప్పటికీ -వినిపిస్తూనే ఉంది. 

3, ఏప్రిల్ 2014, గురువారం

లెక్కల్ల్లో జగన్

  

ఎ క్కడ రాణించాలన్నా -ముందు ఓ లెక్కుండాలి. అంటే -లెక్కల్లో పట్టుండాలి. అది వ్యాపారం కావొచ్చు. జీవితమో.. రాజకీయమో కావొచ్చు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వయసు లెక్కకు -చిన్నది. రాజకీయ వయసు -అంతకన్నా చిన్నది. పొలిటికల్ అకౌంటెన్సీలో మాత్రం -ఆయనది వయసుకు మించిన పరిణతి. ఆ ఆసక్తితోనే బికాం చదివారు. తరువాత ఎంబిఏ కోసం విదేశాలకి వెళ్లారు. పొరుగు దేశంలో ఎంబీయే చేయడంకంటే సొంతూళ్లో వ్యాపారం లాభసాటి అని లెక్కలేసుకున్నారు. అందుకే విదేశాల నంచి -మధ్యలోనే తిరిగొచ్చేశారు. జగన్ తండ్రి -వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 60ఏళ్ల వయసులో రాజకీయాల నుంచి రిటైర్‌కావాలంటూ పదే పదే చెప్పేవారు. (ఆయనదో లెక్క).

బాబాయ్‌తో రాజీనామా చేయించి కడప నుంచి పార్లమెంటుకు పోటీ చేసేందుకు జగన్ సిద్ధమయ్యారు. కానీ -సోనియా నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదు. 2009 పార్లమెంటు ఎన్నికల్లో కడప నుంచి పోటీ చేసి వైఎస్సార్‌కు వారసునిగా సన్నద్ధమవుతున్న సమయంలో హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మరణించడంతో జగన్ రాజకీయ జీవితం ప్రశ్నార్ధకమైంది. అధికార పక్షం మంత్రులు, ఎమ్మెల్యేలంతా జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని సంతకాలు చేశారు. ఎవరు చేశారో.. ఇంకెవరు చేయించారోనన్న విషయం పక్కనపెడితే -మొత్తంమీద మెజారిటీ ఎమ్మెల్యేలు సంతకాలు చేసేశారు. జగన్ స్పీడ్‌కు హైకమాండ్ మాత్రం బ్రేకేసేసింది.

స్క్రీన్ మీదకు -రోశయ్యను ముఖ్యమంత్రిగా తెచ్చింది. రోశయ్య కాలం దీర్ఘంగా నడిచిపోతుంటే -కుర్రాడు జగన్ వౌనంగా ఉండలేక పోయాడు. పీఠం దక్కని తనని -సంతకాలు పెట్టిన ఎమ్మెల్యేలే ఓదార్చకపోడంతో తానే జనాన్ని ఓదార్చేందుకు బయలుదేరారు. అక్కడే -్భవిష్యత్ ప్రణాళికకు బ్లూప్రింట్ తయారు చేసుకున్నారు.

ముసుగులో గుద్దులాటకు ఫుల్‌స్టాప్ పెట్టారు. హైకమాండ్‌ను కలిసి లెక్కలు తేల్చుకుందామన్న నిర్ణయానికి వచ్చారు. లాభసాటి అయితే కొనసాగటం. లేదంటే -కొత్త దారి చూసుకోవటం. ఇదీ అప్పటి ఆయన నిర్ణయం.
కుటుంబ సమేతంగా -పార్టీ చీఫ్ సోనియాను కలిశారు. ‘నీ భవిష్యత్ నాకొదిలెయ్’ అన్న ఒక్క మాటొస్తే చాలనుకున్నారు. కనీసం కేంద్రంలో మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ -్ఢల్లీలో ఉన్నది హై’కమాండ్. తీపి కబుర్లు వినడమే తప్ప, వినిపించాలని అనుకోదు. అదే జరిగింది. జగన్ లెక్క కరెక్టయ్యింది. ఒక్కసారి మాజీ సిఎంల సంతానాన్ని మనసులోనే పరీక్షించారు. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి.. ఇలా ఎందరో మాజీ సిఎంల సంతానం భవిష్యత్ పార్టీలో ఎలా ఉందో లెక్కలేశారు. లేట్ చేస్తే లెక్క తప్పే ప్రమాదం ఉందని, చాలామందిలాగే తానూ ప్రవాహంలో పుడకలా మిగిలిపోతానని అంచనా వేసుకున్నారు.
భవిష్యత్ అయోమయమైన పార్టీలో ఉండేకంటే -పార్టీ పెట్టి భవిష్యత్ చూసుకోవడం బెటరనుకున్నారు. అంతే -కాంగ్రెస్ నుంచి జగన్ వేరుపడ్డారు. అప్పటికి రాష్ట్రంలో వైఎస్సార్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే వైఎస్సార్ కనుక -వైఎస్సార్ కాంగ్రెస్ పేరిట కొత్త పార్టీకి పురుడు పోశారు. కొత్త పార్టీని భుజనేసుకుని -జనంలోకి వెళ్లారు. వైఎస్సార్ సంక్షేమ పథకాల ప్రభావం ప్రజల్లో ఎంతబలంగా ఉందో ఓదార్పులో తిరుగుతూ ఒడుపుగా పసిగట్టారు.
వైఎస్సార్ అధికారాన్ని పుత్రుడు దుర్వినియోగపర్చి కోట్లు స్వాహా చేశారని కేసులు పుట్టుకొచ్చాయి. జగన్ సహా మంత్రులు, ఐఏఎస్ అధికారులు జైలుపాలయ్యారు. అయితే ఇదంతా ఒక కుటుంబంపై అందరూ కలిసి సాధిస్తున్న కక్షగానే సామాన్యులు భావించి, ఉప ఎన్నికల్లో ఘన విజయం చేకూర్చి పెట్టారు.

కెరీర్ విషయంలో జగన్ -లెక్క తప్పలేదు. అందుకే కాంగ్రెస్‌ను వదిలేశారు. కొత్త పార్టీ పెట్టారు. లెక్కను సరిగ్గా నిర్దేశించుకోలేక మరో మార్గంలో వెళ్లివుంటే ఇప్పటికి -జగన్ చాలామంది మాజీ సిఎంల పుత్రరత్నంలాగే ఉండి ఉండేవాడు.
ఎంతోమంది హేమాహేమీలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి మనసు చంపుకుని అప్పటి వరకు తిట్టిన బాబును ఆకాశానికెత్తుతున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమనే డైలాగును అరగదీస్తున్నారు. లెక్కల్లో విఫలమైవుంటే -అలాంటివాళ్ల జాబితాలో జగన్ కూడా ఉండిఉండేవాడే. లెక్క తప్పలేదు కనుకే -క్యూలో ఉండాల్సిన జగన్ ముందు ఇప్పుడు క్యూ ఉంటోంది. 16 నెలలు జైలులోవున్నా పార్టీని ఉప ఎన్నికల్లో పరిగెత్తించారు. సార్వత్రిక ఎన్నికల్లో సర్వేలన్నీ -ఆంధ్రలో అధికారం జగన్ పార్టీకేనని చెప్పే స్థితికి తెచ్చారు. ఇంతా చేస్తే జగన్ వయసు -42 ఏళ్లు. రాజకీయం వయసు ఐదేళ్లు. అందులో 16 నెలల కాలం జైలు జీవితం. కానీ  
ర్టీ ఇయర్స్ పాలి’ట్రిక్స్‌లో ఉన్నవాళ్లకు చమటలు పట్టిస్తున్నారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే సొంత మీడియా ఎంతో అవసరమని చిన్నతనంలోనే గ్రహించిన నేత. 

తెలంగాణ, సమన్యాయం, సమైక్యం అంటూ ఎప్పటికప్పుడు మాట మార్చినా అన్నీంటిలో -ఆయనకు ఉండే లెక్కలు ఆయనకున్నాయి. అవే -జగన్‌ను కాపాడుతున్నాయి.

2, ఏప్రిల్ 2014, బుధవారం

పురాణాల కాలంలోనూ పార్టీ ఫిరాయంపులు!

‘‘మన రాజకీయ నాయకుల్లాంటి బతుకు శత్రువుక్కూడా వద్దనిపిస్తోంది’’
‘‘వాళ్లకేమైంది? బాగానే సంపాదిస్తున్నారు కదా?’’
‘‘సంపాదనకేముంది. కుక్కను కొడితే డబ్బులు రాలుతాయి.
విషయం అది కాదు... మన నాయకులు ఏం చేసినా తప్పు పడుతున్నారు ఏం ఇతరులు చేస్తే తప్పు కానిది నాయకులు చేస్తే తప్పా?’’
‘‘విషయం ఏమిటో నేరుగా చెప్పు ’’


‘‘రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారని అందరూ తిట్టుకుంటున్నారు కదా?’’
‘‘తిట్టరా మరి ఏ మాత్రం సిగ్గులేకుండా సొంతింటికి వచ్చానని ఒకరు, ఇంత కాలం నేనున్నది సొంతిల్లు అనుకున్నాను, కాదు కాదు ఇదే నా సొంతిల్లు అని మరొకడు అంటుంటే వినడానికి మనకే సిగ్గుగా ఉంది వాళ్లు నిస్సిగ్గుగా ఎలా చెబుతున్నారో ఆ మాటలు ?’’


‘‘ఇలా పార్టీలు మారడం అనేది రాజకీయ పార్టీలు ఏర్పడక ముందు నుంచే ఉంది. ఆ విషయం తెలుసా? నీకు?’’
‘‘పార్టీలే లేనప్పుడు పార్టీలెలా మారుతారు?’’
‘‘పార్టీలు మారడం ఏదో ఈ కాలంలోనే మన నాయకుల నుంచే మొదలైనట్టు చెబుతున్నారు కానీ పురాణాల కాలం నుంచి ఉంది. మనకు అనుకూల మైన పార్టీలోకి మారితే మంచి పని చేశాడని అభినందించడం, నచ్చ ని పార్టీలోకి మారితే తిట్టడం ఇప్పుడే కాదు, పురాణాల కాలం నుంచే ఉంది. ’’
‘‘నిజమా!’’


‘‘ఔను! అంతే కాదు ఒక కుటుంబంలో అన్న ఒక పార్టీలో ఉంటే తమ్ముడు మరో పార్టీలో ఉండడం కూడా కొత్తదేమీ కాదు అప్పటి నుంచే ఉంది. శ్రీకృష్ణుడు పాండవుల పార్టీలో ఉంటే బలరాముడు కౌరవుల పార్టీలో ఉన్నారు. అయితే ఆ రెండు పార్టీల వాళ్లది కౌరవ వంశమే. అలానే ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని పార్టీలదీ కాంగ్రెస్ వంశమే. కౌరవ హీరో దుర్యోధనుడు, పాం డవ హీరో అర్జునుడి నుండి, శ్రీకృష్ణుడి వర కు అన్ని పాత్రల్లో అదరగొట్టిన మన అన్నగారి కుటుంబ సభ్యులు తలా ఒక పార్టీలో ఉ న్నారని అంటారు కానీ అందులో తప్పేముంది? శ్రీకృష్ణుడి కుటుంబంమే అప్పుడు న్న రెండు పార్టీల్లో ఉంటే శ్రీకృష్ణుడి వేషం వేసిన అన్నగారి కుటుంబం అన్ని పార్టీల్లో ఉంటే తప్పేమిటి?


ఎన్నికలను కురుక్షేత్ర యుద్ధంతో పోల్చినప్పుడు ఆనాటి సాంప్రదాయాలను ఎలా కాదంటారు ’’
‘‘సరే కానీ పార్టీలు మార్చడం పురాణాల కాలంలోనే ఉందన్నావు కదా?’’
‘‘అదే చెబుతున్నాను. రామాయణం తెలుసు కదా? రావణుడు శ్రీరాముడితో యు ద్ధం చేస్తుంటే అతని తమ్ముడు ఏ పార్టీలో ఉండాలి. రావణుడి పార్టీలోనే కాదు. చివరి వరకు విభీషణుడు నీ కోసం ప్రాణాలిస్తాను అన్నా అని నమ్మించి అన్న ప్రాణాలు తీసే మార్గం తెలుసుకుని శ్రీరాముడి వైపు వెళ్లాడా? లేదా? ’’


‘‘ అది లోక కళ్యాణం కోసమే కదా? ’’
‘‘అంతేలే ఎదుటి వాడు చేస్తే వెన్నుపోటు. అదే మనం చేస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ అని ఇప్పుడు మనం చెప్పుకునే మాట అప్పటి నుంచీ ఉంది. మనకు నచ్చితే పార్టీ మారడం లోక కళ్యాణం నచ్చక పోతే మహా పాపం. విభీషణుడు వెళ్లింది మాత్రం అన్న పోతే రాజ్యం తన వశం అవుతుందనే కోరికతోనే. రావణుడు అసలే మహ శక్తి సంపన్నుడు, ఆయన మరణం కూడా అంత సులభం కాదని తమ్ముడికి బాగా తెలుసు. అన్నపై ఉన్న ప్రేమ కన్నా అధికారంపై మమకారం ఎక్కువ కావడంతో పార్టీ ఫిరాయించాడు అధికారం సాధించాడు. సుగ్రీవుడు చేసింది కూడా ఇదే కదా అన్న తన్ని తరిమేస్తే శ్రీరాముడు స్నేహ హస్తం అందించారు. నిజానికి ఈ పార్టీ ఫిరాయింపుల ద్వారానే శ్రీరాముడు విజయం సాధించాడంటే అతి శయోక్తి కానే కాదు. 
విభీషణుడే  తొలి పార్టీ ఫిరాయింపు దారుడు ..  శ్రీరాముడికి మద్దతుగా వానర సైన్యం లభించడం, లంకలో తమకు చేయూత నిచ్చే విభీషణుడు లభించడం ఈ రెండు జరిగి ఉండక పోతే శ్రీరాముని విజయం సాధ్యమయ్యే దా?’’

‘‘అలా అంటే కర్ణుడిది కూడా పార్టీ ఫిరాయింపే అంటావేమో!
‘‘కాదు కానే కాదు... తన సొంత పార్టీ పాండవులది అనే విషయం కర్ణుడికి తెలియనే తెలియదు. యుద్ధ సమయంలో తల్లి చెప్పినా సొంత పార్టీలోకి వెళ్లడానికి ఇష్టపడకుండా నమ్మి అవకాశం కల్పించిన దుర్యోధనుడి పార్టీలోనే ఉండిపోయాడు. ’’
‘‘అవును నువ్వన్నది నిజమే! ఓటమి ఖాయం అని తెలిసినా కొంత మంది నాయకులు పార్టీ మారకుండా ఉన్నట్టు కర్ణుడు పార్టీ మారలేదు.’’
‘‘తమకు నచ్చితే పార్టీలు మారడాన్ని ప్రోత్సహించిన శ్రీమహావిష్ణువు నచ్చక పోతే పార్టీ మారితే తల నరికేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అమృతం చేజిక్కిన తరువాత దాని కోసం రెండు పార్టీల వాళ్లు కొట్టుకున్నారు. రాష్ట్రంలో కొన్ని పార్టీల్లో మైనింగ్ వంటి భారీ వ్యవహారాలు, భారీ ప్రాజెక్టుల కాంట్రాక్టుల్లో అధికార పక్షానికి 60 శాతం, ప్రతిపక్షానికి 40 శాతం అని చక్కగా పంచుకుంటారు. సముద్రం నుంచి అమృతాన్ని వెలికి తీసినప్పుడు అలానే రెండు పార్టీలు పంచుకుంటే సరిపోయేది. దేవతలు, రాక్షసులు రెండు పార్టీలు కలిసి కృషి చేయడంతోనే అమృతం లభించింది. ఇద్దరూ పంచుకోవాలి కదా? విష్ణుమాయతో తమ పార్టీ వారికే పంచే ఏర్పాటును శ్రీమహావిష్ణువు తెలివిగా చేశాడు. ఇది గ్రహించి రాహు కేతువులు చొక్కాల రంగులు మార్చి అధికార పక్షంలో గుట్టు చప్పుడు కాకుండా చేరిపోయారు. అందరితో పాటు అమృతం తాగుతుంటే మన పార్టీ వాళ్లలా కనిపించడం లేదే అని అనుమానం వచ్చి చక్రం అడ్డేస్తాడు. అంటే వాళ్లు పార్టీ మారడాన్ని అడ్డగించడం అన్న మాట! ’’
‘‘ ఆ ’’
‘‘భీష్ముడు కౌరవుల పక్షాన ఉన్నా యుద్ధం లో పాండవులే గెలవాలని కోరుకుంటాడు .అలానే కొందరు  ఏ పార్టీ లో ఉన్నా తమ సామాజిక వర్గం పార్టీ నే గెలవాలని కోరుకోవడం సామాజిక బాధ్యతగా భావిస్తారు 
దేవతలు, దేశాలే పార్టీలు మారుతున్నప్పుడు పాపం అల్పజీవులు నాయకులు మారితే తప్పా?’’

‘‘అంటే నాయకులను దేవతలు అంటున్నావా ?’’
‘‘దేవుళ్ళు కనిపించరు , గెలిచాక నాయకులు కనిపించరు అంత మాత్రాన నాయకులు దేవతలని నేనెలా అంటాను ’’

‘‘మరేమంటావు ’’

‘‘మధుర వాణి గిరీశం తో జత కట్టింది , గిరీశం ఎగస్పార్టీ తో జత కట్టింది అయినా గురజాడ గారు ఆమెను ఒక్క మాటైనా అన్నారా ?
అనలేదు కదా .. మన నాయకుల బతుకు మధుర వాణి కన్నా హీనం అయిపోయిందని చెప్పదలుచుకున్నాను అంతే .  మీరేమంటారు ?’’