24, ఫిబ్రవరి 2017, శుక్రవారం

వాస్తవిక వాదం‘‘నీ వెనక కోట్ల రూపాయల ఆస్తి, సారా వ్యాపారం, వడ్డీ వ్యాపారం లేక బాగా ఆదాయం తెచ్చి పెట్టే ఎన్‌జివో ఏమన్నా ఉందా? మరేముందని పోజులు కొడుతున్నావ్’’
‘‘నా వెనుక అణగారిన జనం ఉన్నారు. నా మెదడులో విప్లవ భావాలు ఉన్నాయి? మా ఇంట్లో గుట్టలు గుట్టలుగా ఎర్ర పుస్తకాలున్నాయి?’’
‘‘ఓ జెండా ఉంది, దాన్ని మోసేందుకు ఓ కర్ర ఉంది. అది కూడా చెప్పు’’
‘‘ఔను! నేను ఎస్‌ఎస్‌సి చదివేప్పుడు మా సీనియర్ ఇచ్చిన కర్ర ఇప్పటికీ కాపాడుకున్నా. జెండా మాత్రం చీకిపోవడం వల్ల నాలుగైదు సార్లు మార్చాను.’’
‘‘నీకు కర్ర అప్పగించిన ఆ సీనియర్ ఆ మెడికల్ కాలేజీ ఓనరా? వడ్డీ వ్యాపారా? ఉమ్మడి రాజధాని జూబ్లీహిల్స్‌లో ప్లాట్లు, భవనాలు, సాంస్కృతిక రాజధానిలో వ్యాపారాలు చేసే సీనియరా? ఆయన చేతి నుంచి కర్ర అందుకోవడం ఎంతైనా నీ అదృష్టం.’’
‘‘నీకెలా తెలుసు?’’
‘‘ తెలిసిన వాళ్లు సీటు కోసం ప్రయత్నిస్తే ఒక్కో సీటు కోటిన్నర ఖరీదు అని తెలిసింది.’’
‘‘చివరకు సొంత కొడుక్కు కూడా ఆ కర్ర ఇవ్వకుండా నన్ను నమ్మి నాకే ఇచ్చాడు.. నాకు ఇంకేం కావాలి? ’’
‘‘ఔను.. కర్ర నీకిచ్చి మెడికల్ కాలేజీ కొడుక్కు ఇచ్చిన ఆయన త్యాగాన్ని- శరీరాన్ని ఒలిచి దానం చేసిన శిబి చక్రవర్తితో కూడా పోల్చలేం.’’
‘‘నీ మాటల్లో ఏదో వెటకారం ఉంది? విప్లవ భావాలు, విప్లవ త్యాగాలు అర్థం కావాలంటే నెల జీతంపై బతికే నీలాంటి వాడి వల్ల కాదు. జీతాలు, ఇంక్రిమెంట్లే మీలాంటి కుటుంబరావులకు అర్థమవుతాయి. ఎప్పటికైనా విప్లవ శక్తులదే విజయం.. మీలాంటి విప్లవ ప్రతిఘాతక శక్తుల గురించి మావో ఎప్పుడో చెప్పాడు’’
‘‘నేనెప్పుడూ సికిందరాబాద్ దాటి వెళ్లలేదు. నా గురించి కూడా మీ మామ చెప్పాడా? ఏం చెప్పాడురా? ’’
‘‘మరదే.. మామ కాదు మావో’’
‘‘అంత ఆప్యాయంగా పలికితే మీ మేనమామ అనుకున్నా. నా గురించి మావోకు కూడా తెలియడం చిత్రంగా ఉందిరా! ’’
‘‘వెటకారం అర్థం అవుతోంది. మేమూ అనగలం. ఆ ముఖ్యమంత్రి ఫాం హౌస్ గురించి చెప్పమంటావా? ’’
‘‘అక్కడ ఎకరా ఐదు లక్షలట! అంటే మొత్తం ఫాం హౌజ్‌లోని 60 ఎకరాలు అమ్ముకుంటే మీ ఎర్ర గురువు మెడికల్ కాలేజీలో రెండు సీట్లు రావు.’’
‘‘మేధావులు సిద్ధాంతాల గురించి మాట్లాడతారు. వ్యక్తిగత విషయాలు వద్దు. గతి తార్కిక భౌతిక వాదం... మానవ జాతి.. విప్లవాలు.... ’’
‘‘ఆగాగు.. నేను సామాన్యున్ని ఏదో గవర్నమెంట్ స్కూల్‌లో వానా కాలం చదువులు. చూసి చదవడం కూడా రాని పేర్లు చెప్పి భయపెడితే ఎలా? పూర్వం పండితులు ఇలానే సంస్కృత శ్లోకాలు చెప్పి సామాన్యులను భయపెట్టేవాళ్లు. సంస్కృతాన్ని వ్యతిరేకించినా మీ విప్లవ వీరులు నాలాంటి సామాన్యులను భయపెట్టడానికి, భ్రమల్లో ఉంచేందుకు అదే టెక్నిక్ వాడుకుంటున్నారు. అచ్చం సంస్కృతంలో నోరుతిరగని పేర్లు చెప్పి భయపెట్టినట్టే నువ్వు నాకు నేను వినని ప్రపంచంలోని దేశాల పేర్లు నాయకుల పేర్లు చెప్పి భయపెడితే ఎలా? సింపుల్‌గా చెప్పు ? ’’
‘‘వా..! నన్నిలా ఇబ్బంది పెట్టడం న్యాయమా? స్కూల్‌లో చదువుకున్నప్పటి నంచి నాకు మా సీనియర్లు ఇలానే చెప్పేవాళ్లు. వాటినే వల్లెవేయడం అలవాటైంది. నువ్వేమో ఆ పేర్లు, సిద్ధాంతాలు లేకుండా మాట్లాడమంటున్నావ్.. నేనేం మాట్లాడాలి.?’’
‘‘నాకు అర్థం అయ్యేంత సింపుల్‌గా చెప్పు ’’
‘‘ ప్రపంచంలో ఇలా ఎందుకు ఉంది? అని ముందు మనను మనం ప్రశ్నించుకోవాలి. కొందరు పేదలుగా, కొందరు సంపన్నులుగా ఎందుకు ఉన్నారో బాగా ఆలోచించాలి. దోపిడీ వల్లనే ఆర్థిక అసమానతలు ఏర్పడ్డాయి. ఇది అర్థం చేసుకున్న తరువాత విప్లవం వస్తుంది. విప్లవం వచ్చిన తరువాత అందరూ సమానం అవుతారు?’’
‘‘ అంటే అప్పుడు స్కూల్‌కెళ్లే పిల్లలు వేసుకునే యూనిఫామ్‌లా అంతా ఒకేలా కనిపిస్తారా?’’
‘‘ఆ వెటకారమే వద్దు .. అంతా సమానం అవుతారంటే ఒకే యూనిఫాం వేసుకుంటారని కాదు. ఆర్థిక అసమానతల గురించి అర్థం అయ్యాక విప్లవం వస్తుంది. అప్పుడు అంతా సమానం అవుతారు?’’
‘‘ఇంతేనా.. నాకు తెలుసులే ఆర్.నారాయణ మూర్తి సినిమాలా విప్లవం వచ్చాక అంతా పాట పాడి వెళ్లి పోతారు అంతే కదా? ’’
‘‘అది కాదు శ్రమ దోపిడీ గురించి ఆర్థం చేసుకున్నాక విప్లవం వచ్చి అంతాసమానం అవుతారు’’
‘‘నువ్వు అర్థం చేసుకున్నావా? ’’
‘‘ఇంట్లో గుట్టల కొద్దీ పుస్తకాలు ఉన్నాయని ఇప్పుడే చెప్పాను కదా? ’’
‘‘పుస్తకాలను నమిలి మింగేసి జీర్ణం చేసుకున్న నీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? నాయకులకు కోట్ల రూపాయల ఆస్తులు, నాకేమో జెండా కర్ర ఎందుకిలా? అనే ప్రశ్న వేసుకున్నావా? ’’
‘‘ఇదే పుస్తకంలో ఉంది?’’
‘‘ఇది పుస్తకాల్లో ఉండదు. జీవితంలో ఉంటుంది. నీ ఏడుపు నువ్వే ఏడవాలి. నీ తిండి నువ్వే తినాలి. నీ తిండి గింజలు నువ్వే సంపాదించుకోవాలి. ప్రపంచంలోని ఆర్థిక అసమానతల గురించి ఆలోచించే దానిలో ఒక్క నిమిషం నీ ఆర్థిక కోణం గురించి నువ్వు ఆలోచించుకుంటే నువ్వు బాగుపడేవాడివేమో? విప్లవాల సినిమాకైనా ఎవడో ఒకడు పెట్టుబడి పెట్టాలి. విప్లవాల సినిమా కూడా వ్యాపారమే. తీసేవాడు పెట్టుబడి దారు, చూసేవాడు వినియోగ దారుడు. సినిమాలో కూర్చున్న రెండు గంటలు విప్లవం వచ్చేసినట్టే ఉంటుంది. బయటకు వెళ్లాక వాస్తవ జీవితం వేరుగా ఉంటుంది. రెండు గంటల సినిమా వాస్తవం అనే భ్రమలో ఉంటే పరవాలేదు. జీవితమంతా భ్రమలో ఉంటే విప్లవం రాదు, జీవితం పనికి రాకుండా పోతుంది. విప్లవాన్ని, నాస్తిక వాదాన్ని ఊరురా బోధించిన ఎంతో మంది చివరి రోజుల్లో మహాభక్తులయ్యారు. రుద్రాక్షలు ధరిస్తే ఆదృష్టం వరిస్తుందని ఒకాయన ఆథ్యాత్మిక చానల్‌లో అమ్ముతుంటారు. ఒకప్పుడు ఆయన ఏలూరులో పేరు మోసిన నాస్తికుడు. విప్లవ పాఠాలు చెప్పినంత  స్పీడ్‌గా రుద్రాక్షలూ అమ్ముతున్నారు. కాళ్లకు వేసుకొనే చెప్పుల వ్యాపారం నుంచి  మెదడు ను ప్రభావితం మీడియా వ్యాపారం వరకు టాప్‌లో ఉన్న వారంతా ఒకప్పటి విప్లవ కారులే. నాస్తిక బ్రహ్మలే .  భ్రమల్లోంచి ఎంత త్వరగా వాస్తవిక జీవితంలోకి వస్తామనే దానిపైనే జీవితం ఆధారపడుతుంది. వాస్తవంలో జీవించు, నిన్ను నువ్వు తెలుసుకో, వాస్తవిక వాదానికి  మించిన సిద్ధాంతం లేదు, విప్లవం లేదు. ’’
*బుద్ధా మురళి (జనాంతికం 24. 2. 2017)  

10, ఫిబ్రవరి 2017, శుక్రవారం

పురుచ్చితలైవి- 2

‘‘తెలుగు పాపులర్ సినిమా తమిళ్ డబ్బింగ్ చూస్తున్నట్టుగా ఉంది?’’
‘‘న్యూస్ చానల్స్‌లో సినిమానా?’’
‘‘తెలుగునాట 1995లో జరిగింది. 22ఏళ్ల తరువాత ఇప్పుడు తమిళనాడులో జరుగుతోంది. కథ పాతదే కానీ, కాలానికి తగ్గట్టు పాత్రలను కొంత మార్చారు. ఇక్కడ ఎన్టీఆర్ సమాధి వద్ద కనిపించిన సీన్ లే  అక్కడ- చెన్నైలో మెరీనా బీచ్ వద్ద జయలలిత సమాధి లో రిపీట్ అవుతున్నాయి . ’’
‘‘ప్రాంతీయ పార్టీని, ఉచిత పథకాలను, పసుపు రంగును తమిళనాడు నుంచి తెలుగునాడు కాపీ కొడితే, ఇప్పుడు జరుగుతున్న సినిమా మొత్తం తెలుగునాడు నుంచి తమిళనాడు కాపీ కొట్టింది. ’’
‘‘నిజమా?’’
‘‘అనుమానం ఎందుకు? ఇంకో విచిత్రం 1984 నాటి సినిమా గుర్తు చేసుకో, ముషీరాబాద్ రామకృష్ణ స్టూడియో గోడ మీద నిలబడి ప్రజాస్వామ్య విజయం అంటూ వెంకయ్యనాయుడు ఆవేశపూరిత నినాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. విద్యాసాగర్‌రావూ ఉన్నరక్కడ. ఇప్పుడు వాళ్లే అదే కథతో తమిళ సినిమాలో ప్రత్యర్థి వైపు ప్రధాన పాత్రధారులుగా నిలబడ్డారు. అవే పాత్రలు మళ్లీ పోషించేందుకు వాళ్లది చిన్నా చితక పార్టీ కాదాయె.. కేంద్రంలో భారీ మెజారిటీతో అధికారంలో ఉన్న పార్టీ ’’
‘‘ఇంతకూ తమిళనాడులో ఏం జరుగుతోంది ?’’
‘‘అంతా కొండ- వెంట్రుక ఆటాడుతున్నారు’’
‘‘జల్లికట్టులా ఇలాంటి ఆట కూడా ఉందా?’’
‘‘ప్రతి మనిషి జీవితంలో ఈ కథ తత్త్వం ఇమిడి ఉంటుంది. నీలో- నాలో సైతం ’’
‘‘ నేనెప్పుడూ వినలేదు’’


‘‘ఐశ్వర్యా రాయ్ ప్రపంచ సుందరిగా ఎంపిక కాగానే పిచ్చి కవిత్వమంతా కక్కేసి ఆమెకు ప్రేమలేఖ రాశావు. ఆమెకు తెలుగు రాదు అంటే నువ్వేమన్నావ్? కన్నడ లిపి, తెలుగు లిపి దగ్గర దగ్గరగానే ఉంటాయి. చదివి ఆమె మురిసిపోతే ఓకే.. లేదంటే ఒక ఉత్తరమే కదా అని అన్నావా? లేదా? ’’
‘‘ ఆ రోజుల్లో అందంగా ఉన్న హీరోయిన్‌లందరికీ ఇలానే లవ్ లెటర్స్ రాసే వాడిని. ఒక్క లెటర్‌కూ రిప్లై రాలేదు’’
‘‘దీన్నే  కొండ- వెంట్రుక తత్త్వం అంటారు’’
‘‘ ఆ రోజుల్లో ఐశ్వర్యారాయ్‌ని ప్రేమించనోళ్లు ఉన్నారా? నేను రాయి వేశా, నువ్వు వేయలేదు. ఐనా- తమిళనాడు రాజకీయాలకు, నా ప్రేమకథలకు సంబంధం ఏంటి?’’


‘‘ఓ ఉత్తరం- వస్తే ఐశ్వర్యారాయ్ అనుకున్నట్టే, తమిళనాడులో కేంద్రం సహా అంతా ఇదే ఆట ఆడుతున్నారు. కొండను వెంట్రుకతో లాగడం అంటారు దీన్ని. వస్తే కొండ వస్తుంది. పోతే ఓ వెంట్రుక పోతుంది. ’’
‘‘1995లో తెలుగునాట ఎం జరిగిందో, తమిళనాడులో ఇప్పుడు అదే జరుగుతోంది. అందుకే ఫలితం ఎలా ఉంటుందా? అని తమిళులతో పాటు తెలుగువారు కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కథ రోజుకో మలుపు తిరుగుతోంది. కమెడియన్ అనుకున్న తమిళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఒక్కసారిగా ‘కబాలి’ అన్నట్టు డైలాగులు మార్చేస్తున్నాడు. అసలేం జరుగుతోంది? ’’


‘‘ అదేదో సినిమాలో గంగ ‘చంద్రముఖి’గా మారినట్టు జయలలిత మృతి తరువాత తమిళనాడులో నేతలంతా ఒక్కసారిగా తమ తమ పాత స్టైల్‌ను పాతరేసి విజృంభించేస్తున్నారు. చివరకు కేంద్రం, గవర్నర్ సైతం.. ’’
‘‘వీళ్లు కొట్లాడుకుంటే వాళ్లేం చేస్తారు? ప్రధానమంత్రేమో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ‘స్నాన’ విశేషాలను పార్లమెంటులో చెబుతున్నారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ విద్యాసాగర్‌రావు పెళ్లిళ్లు, పేరంటాళ్లకు తిరుగుతున్నారు. మధ్యలో వాళ్లనెందుకంటావు? ’’
‘ఢిల్లీ లో  చక్రం తిప్పిన అనుభవంతో మోదీని అరెస్టు చేస్తా అని పలికిన బాబు అదే మోదీ వద్ద వంగి నిలుచోవడం చూశావు కదా? సర్వ స్వతంత్ర తెలంగాణ సిఎం కెసిఆర్‌కు మోదీ అపాయింట్‌మెంట్ ఇచ్చి టైం లేదు పో అన్నారు కదా? మరి జయలలిత విషయానికి వస్తే మోదీనే  చెన్నైలోని ఆమె ఇంటికి వెళ్లి పరిచయం చేసుకుని వచ్చారు. తమిళనాడు అంటే అంత శక్తిమంతమైంది. దేశంలోనే స్వతంత్ర దేశం లాంటిది. శత్రు దుర్బేధ్యం లాంటి తమిళనాడు కోటకు బిజెపి వెంట్రుక వేసి లాగింది. వస్తే కోట వస్తుంది. పోయేందుకు తమిళనాడులో ఆ పార్టీకి ఏమైనా ఉంటే కదా? దీన్నే  కొండను వెంట్రుకతో లాగడం అంటారు. ఈ అటలను మొదట బిజెపి మొదలు పెట్టింది. తరువాత అంతా ఫాలో అవుతున్నారు.’’
‘‘అంతే అంటావా? ’’


‘‘ఇంకా అనుమానం ఎందుకు? ప్రాంతీయ పార్టీలో బలమైన నేతను ఏ నాయకుడూ నమ్మడు. అందుకే జయలలిత పన్నీర్ సెల్వంను పదే పదే ముఖ్యమంత్రిని చేసింది. ఆ నమ్మకాన్ని సెల్వం నిలబెట్టుకున్నాడు. పట్టుమని పది మంది మద్దతు కూడా కూడగట్టుకోలేక పోయాడు. తనకు 131 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శశికళ చెబితే, ఆరుగురు ఎమ్మెల్యేలు వెంట రాగా పన్నీరు సెల్వం గవర్నర్ ముందు బల నిరూపణ చేస్తానంటే అర్థం కావడం లేదా? అచ్చంగా సెల్వం కూడా అంతే.. వస్తే సిఎం పీఠం, కొత్తగా పోయేదేముంటుంది?’’
‘‘మరి డిఎంకె?’’
‘‘ఇంకో నాలుగేళ్లు విపక్షంలోనే ఉండాలి. అధికార పక్షం రెండుగా చీలిపోతే అధికారం ముందస్తుగానే వస్తుంది. అందుకే పన్నీరు సెల్వంకే మా ఓటు అని స్టాలిన్ ప్రకటించాడు. వస్తే అధికారం, కొత్తగా పోయేదేమీ లేదు. అలనాడు కాంగ్రెస్‌ను నమ్ముకొని చరణ్‌సింగ్ ప్రధానమంత్రి పదవి చేపట్టినట్టు ఉంటుంది- డిఎంకెను నమ్ముకుని అన్నాడిఎంకె నేత ముఖ్యమంత్రి పదవి కి పోటీ పడడం .’’


‘‘సెల్వం క్యాంపులో ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే? ’’
‘‘వైస్రాయ్‌లో చంద్రబాబు క్యాంపులా అంత పాపులర్ కాలేదు. కానీ అప్పుడు ఎన్టీఆర్ గోల్కొండ హోటల్‌లో ఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహించారు. రోజురోజుకూ పలచబడడంతో తిండి దండగ అని క్యాంపు ఎత్తేశారు. తమను గెలిపించిన ఎన్టీఆర్‌నే ఎమ్మెల్యేలు వదిలేశారు. మళ్లీ కనీసం తానైనా గెలుస్తాడో లేదో తెలియని పన్నీరు సెల్వంను నమ్ముకుని ఎమ్మెల్యేలు ఉంటారా? ‘చిన్నమ్మ’లోనే ‘అమ్మ’ను చూసుకోక తప్పదు. సెల్వం మరో లక్ష్మీపార్వతి కావడం ఖాయం.’’


‘‘అంటే- శశికళ తప్ప అందరిదీ కొండ- వెంట్రుక తత్త్వమేనా? ’’
‘‘ఆమెకు వచ్చేదే తప్ప పోయేది ఏమీ లేదు’’
‘‘టెన్షన్‌తో గుండెపోటు వస్తుందేమో?’’
‘‘రాదు.. అమె మూడు దశాబ్దాల పాటు జయలలితకు నీడలా ఉంది.జయలలిత నీడ కూడా భయపడదు ’’


‘‘ఇంతకూ ఏం జరుగుతుందో చెప్పలేదు?’’
‘‘శశికళ నిన్నటి వరకు జయలలితకు చెలికత్తె. బిజెపి వారు కొండ-వెంట్రుక ఆటతో ఆమెను ‘పురుచ్చితలైవి- 2’ను చేశారు. కేంద్రాన్ని ఎదిరించిన వీరవనితగా జయలానే అభిమానులతో ఆమె పూజలు అందుకునేట్టు చేశారు.’’ *

బుద్ధా మురళి (జనాంతికం 10-2-2017)

3, ఫిబ్రవరి 2017, శుక్రవారం

సూర్యుడినిదింపేద్దాం....నేల పైకి

టీవీలో జబర్దస్త్ చూస్తున్నావా?’’
‘‘ ఇవాళ పంచమి.. అలాంటివి చూస్తామా? ’’
‘‘బడ్జెట్ వార్తలు వింటున్నట్టున్నా వా! జన్‌ధన్ ఖాతాల్లో వేస్తానన్న 15 లక్షల గురించి ఏమైనా చెప్పాడా? ’’
‘‘లేదు’’
‘‘ఇంతకీ జన్‌ధన్ ఖాతాల్లో ఎంత వేస్తారట!’’
‘‘లేదు’’
‘‘పెద్దనోట్ల రద్దుతో ఎంత నల్లధనం బయటపడిందో చెప్పాడా? ’’
‘‘లేదు’’
‘‘మరేం వింటున్నావ్ ?’’
‘‘ జైట్లీ మాటకోసారి చక్కని హిందీ కవిత చదువుతున్నాడు. వాటి కోసమే వింటున్నా. కవితా పఠనం అయిపోయేంత వరకు ఏమైనా పనుంటే చూసుకోని మళ్లీ రా!’ ’
***
‘‘ఏరా.. అంత తీక్షణంగా నన్ను పైకి, కిందికి చూస్తున్నావ్? జుట్టుకు రంగేశా.. హీరోలా ఉన్నా కదూ? మా పక్కింటావిడ నవ్వుతూ ఎప్పుడూ లేనట్టు చూసింది.’’
‘‘ఆ జుట్టు తీసేసి విగ్గు పెట్టుకుంటే అచ్చం 60 ఏళ్ల వయసులో ఉన్న తెలుగు సినిమా హీరోలా కనిపిస్తావ్! పోయే వయసులో ఈ వేషాలేంటి? అని మీ పక్కింటావిడ నవ్వుకుందేమో! నేను తీక్షణంగా చూస్తున్నది నిన్ను కాదు? పైనున్న సూర్యుడిని, కిందున్న భూమిని’’
‘‘ఎందుకు?’’
‘‘సూర్యుడిని భూమిపైకి తీసుకు రావాలనుకుంటున్నా? ఎలా ఉంది ఆలోచన?’’
‘‘నీకేమైనా పిచ్చా..? సూర్యుడ్ని భూమిపైకి తీసుకు రావడం ఏంటిరా! 107 రూట్ బస్సును వారాసిగూడకు తీసుకు వస్తానని అన్నంత ఈజీగా చెప్పేస్తున్నావ్’’
‘‘అలా ఆశ్చర్యపోకు.. మేధావులను అంతా ముందు పిచ్చివాళ్లనే అనుకుంటారు’’
‘‘నిజమే.. ప్రతి పిచ్చివాడు మేధావి కాదు. మేధావులందరూ పిచ్చి వాళ్లు కాదు’’


‘‘రైట్ సోదరులు ఆకాశంలో ప్రయాణించే విమానాన్ని తయారు చేస్తున్నామని అన్నప్పుడు ప్రపంచం ఇలానే పిచ్చి వాళ్లను చూసినట్టు చూసింది. నా ఆలోచన నీకు అర్థం కావాలంటే చాలా కాలం పడుతుంది.’’
‘‘ఎంత కాలం పడుతుంది? ’’
‘‘పరిశోధనకా?’’
‘‘కాదు.. నువ్వు పిచ్చాసుపత్రికి వెళ్లడానికి. సూర్యుడ్ని భూమిపైకి తేవడం ఏంటి? అక్కడికెళ్లే చానే్స లేదు.. వెళితే భస్మవౌతారు’’
‘‘అచ్చం ఇలానే గాలిలో నిలబడలేం, కింద పడిపోతారని కొం దరు రైట్ సోదరులకు చెప్పారు’’
‘‘ సూర్యుడ్ని భూమిపైకి దించడం ఎందుకు?’’
‘‘విద్యుత్ ఖర్చు ఎంతవుతుందో నీకేమన్నా తెలుసా? ఇంట్లో చేదబావి ఉంటే కావలసినన్న నీళ్లు కావలసినప్పుడు తోడుకోవచ్చు. సూర్యుడు భూమిపై ఉంటే అంతే.. కావలసినంత వెలుగు, విద్యుత్, వేడి కావలసినప్పుడు వాడుకోవచ్చు. ఒక్క వ్యవసాయానికే కాదు.. అన్నింటికీ విద్యుత్ ఫ్రీ.. ఫ్రీ... ’’
‘‘నీ ఆలోచన సరికాదేమో? సొలార్ పవర్ గురించి ఆలోచించినా ఫర్వాలేదు, కానీ సూర్యుడ్నే...’’
‘‘చూడోయ్ అబ్దుల్ కలాం ఏమన్నారు? థింక్ బిగ్ అని చెప్పారు. సొలార్ పలకలు చిన్న ఆలోచన.. సూర్యుడ్నే కొట్టుకు రావడం బిగ్ థింకింగ్’’
‘‘పెద్దగా ఆలోచించమన్నారు. కానీ పిచ్చిగా ఆలోచించమని అనలేదు’’
‘‘కుంతీదేవి రమ్మంటే వచ్చినప్పుడు మనం ప్రయత్నిస్తే సూర్యుడు కిందికి రాడా? హనుమంతుడు సూర్యుడ్ని మింగబోయాడు. మనం అతిథిలా ఆహ్వానిస్తున్నాం. ’’
‘‘అవన్నీ పురాణాలు..’’
‘‘పుష్పక విమానం , అణ్వయుధం ఇవన్నీ ముందు  పురాణాల్లోనే పుట్టాయి. వాణిశ్రీ వయసులో ఉన్నప్పుడు కృష్ణం రాజు ఆకాశం దించాలా? నెలవంకా తుంచాలా?- అంటే ఎంత సిగ్గుపడిందో గుర్తుందా? ’’
‘‘అది సినిమా..’’
‘‘సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుడు నరుడే- అని సినీకవి చెప్పాడు కదా? విశ్వామిత్రుడి ప్రతిసృష్టిలో సూర్యుడు కూడా ఉండే ఉంటాడు కదా?’’
‘‘నీతో వాదించలేను. సూర్యుడితో పెట్టుకోకు.. బహుశా ఆయన కుమారులు శని నీ నెత్తిన కూర్చోని, తన సోదరుడు యముడి వద్దకు నిన్ను పంపాలని అనుకుంటున్నాడేమో.. అందుకే నీకీ ఆలోచనలు’’
‘‘చరిత్ర సృష్టిస్తే నమ్మారు. పురాణాలు సృష్టిస్తే ఆదరించారు. మనం ఈ రెండింటినీ కలిపి పురాణాల చరిత్ర సృష్టిస్తాం’’
‘‘ఆ.. ఇప్పుడర్థమైంది ఆయన దావోస్‌ను అమరావతికి తీసుకు వస్తాను అన్నప్పటి నుంచి నీకిలాంటి ఆలోచలు వస్తున్నాయి కదూ?.’’
‘‘మేధావులంతా ఒకే రకంగా ఆలోచిస్తారనేది నిజమే కానీ ఈ ఆలోచన నా సొంతం. ఇతర రాష్ట్రాల వాళ్లు పోటి పడక ముందే దావోస్‌ను అమరావతికి తీసుకురావడం ఖాయం. పాపం ‘బాబు’గారే స్వయంగా వెళ్లి అమరావతికి దావోస్‌ను మోసుకు రావాలి.. కెసిఆర్ కైతే కనీసం పంపించడానికి కెటిఆర్ ఉన్నాడు.’’


‘‘హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని ఒంటి చేత్తే తీసుకువచ్చినప్పుడు, శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని చిటికెన వేలితో లేపినప్పుడు- ఇదీ సాధ్యమేనేమో అనిపిస్తోంది. ఆయన ఉపన్యాసం మొన్న నేనూ విన్నాను. ప్రపంచ దేశాలన్నింటినీ రాజధానికి మళ్లీస్తానని, దావోస్‌ను రాష్ట్ర రాజధానికి తీసుకు వస్తానని ఈ ధైర్యంతోనే చెప్పారేమో! విజయవాడ- అమరావతి అనుసంధానం ఇంకా పూర్తి కాకున్నా, ఈ లోపు ప్రపంచాన్ని అనుసంధానం చేస్తానని చాలా ఆత్మవిశ్వాసంతో ప్రకటించడం నాకు బాగా నచ్చింది.’’
‘‘మొదట ఏదైనా నమ్మశక్యం కాకుండానే ఉంటుంది. ఆచరణకు వచ్చేంత వరకు ఎక్కడైనా ఇంతే.’’
‘‘నీతో మాట్లాడిన తర్వాత నాకు పూర్తి క్లారిటీ వచ్చింది. నాదో రిక్వెస్ట్. పనిలో పనిగా ఈ భూగోళాన్ని కూడా అనుసంధానం చేయి. ఇప్పుడున్న దేశాలు అడ్డదిడ్డంగా ఉన్నాయి. ఇండియాకు పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. అమెరికాలో వర్షం పడ్డా మనం తుమ్ముతాం. ఇండియా- అమెరికా సుదూర దేశాలు’’
‘‘ఐతే ’’
‘‘దేశాలను మార్చేయ్ మన పక్కన పాకిస్తాన్, చైనా, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ కాకుండా ఇండియా పక్కన అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు ఉండేట్టు చూడు. అసలే ట్రంప్ అదేదో వీసాలకు కొత్త ఆంక్షలు అంటూ మన వాళ్లను భయపెడుతున్నాడు. ఇరుగు పొరుగు దేశాలు ఐతే ఎంచక్కా మెట్రో రైలు ఎక్కి మనం అమెరికాకు వెళ్లి రావచ్చు. పాకిస్తాన్‌ను మాత్రం ఆఫ్రికాలో పడేయ్. ఆకలితో చస్తే పీడాపోతుంది.’’
‘‘ఆ’’
‘‘నీతో సాధ్యం కాకపోతే చెప్పు.. ఈ ఐడియాను ఆయనకు చెప్పేస్తాను. దావోస్‌ను అమరావతికి తెచ్చినప్పుడు దేశం కోసం ఈ మాత్రం చేయలేడా? ప్రపంచంలో నేటి అశాంతికి కారణం వాస్తు సరిగాలేకే. ఈసారి వాస్తును చూసి మరీ దేశాలను మార్చు. దక్షిణాదికి అన్యాయం జరుగుతోంది. ఆ హిమాలయాలను దక్షిణాదికి మార్చు వాస్తు మారి దశ మారుతుంది .’’

 - బుద్దా మురళి(జనాంతికం 3. 2. 2017) 

*