30, ఆగస్టు 2019, శుక్రవారం

బిక్షగాడి యుద్ధ నినాదం

‘‘మనిషన్నాక అనేక పనులుంటాయి. ఏం మీకుండవా? వారం రోజులు సెలవు పెడితే ఇక అంతేనా? ప్రపంచంలో ఎవరూ సెలవు పెట్టరా? ఏం నువ్వు సెలవు పెట్టవా? అంతెందుకు ట్రంప్ భార్యాపిల్లలతో విహారానికి వెళ్లడా? మోదీ మొన్న వెళ్లలేదా? అతనెవరో చానల్ అతనితో కలిసి అడవుల్లో తిరగలేదా? మీ అందరూ సెలవు పెడతారు. నేనెందుకు సెలవు పెట్టోద్దు’’
‘‘మీ బాసే కాదు బాస్ ప్రపంచంలో ఏ బాస్‌కైనా సెలవులంటే పడదు. అంతెందుకు మీ ఇంట్లో పనిమనిషి సెలవు పెడితే మీ ఆవిడ ఊరుకుంటుందా? ఏమైందో చెప్పు?’’
‘‘ఫేస్‌బుక్‌లో స్టేటస్ అప్‌డేట్ చేశాను కూడా సెలవుపై వెళుతున్నాను. వారం రోజులు ఎవరికీ అందుబాటు లో ఉండను అని. ఇన్ని దశాబ్దాల నుంచి లేని తొందర ఈ వారంలోనే వచ్చిందా? నేను సెలవులో ఉన్నది చూసి నిర్ణయం తీసుకుంటారా?’’
‘‘ఔను తప్పే కుటుంబ పెద్దగా చెప్పకుండా కుటుంబం కీలక నిర్ణయం తీసుకోవడం తప్పే. మీ ఇంట్లో వాళ్లు నీ సెలవులో అంత కీలక నిర్ణయం ఏం తీసుకున్నారు?’’
‘‘ఇంటి నిర్ణయం కాదు.’’
‘‘మరి?’’
‘‘నేను సెలవులో ఉన్నది చూసి మోదీ కాశ్మీర్‌పై నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక ఆయనకు ట్రంప్ మద్దతు కూడా ఉన్నట్టుంది. ఇదేం ప్రజాస్వామ్యం ఇదేం దేశం. సెలవులు ముగించుకుని వచ్చాక, నా అభిప్రాయం అడిగి నిర్ణయం తీసుకోవలసింది’’
‘‘ఓరి భడవా! ఇదా విషయం నువ్వు సరదాగా అంటున్నావో సీరియస్‌గా అంటున్నావో తెలియదు కానీ... సామాజిక మాధ్యమాల్లో కొందరి కామెంట్లు చూస్తుంటే నాకూ ఇలానే అనిపించింది. అదేదో ఫేస్‌బుక్‌లో బిజీగా ఉండే వీరితో చర్చించిన తరువాతనే మోదీ నిర్ణయం తీసుకోవాలి అన్నట్టుగా ఉంది. సామాజిక మాధ్యమాలు పుట్టక ముందు ఇలాంటి మాటలు ‘లెఫ్ట్’ వైపు వారి నుంచి వినిపించేవి. వామవాదం వారు చిక్కిశల్యమై అదృశ్యమయ్యారు. కానీ వారి మాటలు వినిపిస్తున్నాయి.’’
‘‘ ఈ రోజు వంట ఏం వండుతున్నావ్! డియర్ అని భార్యను ముద్దుగా అడిగితేనే.. ఫోరా కుయ్యా వండింది ఇష్టం ఉంటే తిను లేకుంటే వెళ్లిపో అని గట్టిగా చెబుతుంది. అలాంటిది కాశ్మీర్ వంటి కీలక విషయంపై కోన్ కిస్కాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారా! మన అమాయకత్వం కానీ... ఏదో ప్రజాస్వామ్యం .. చీకటి రోజు, హక్కులు అనే మాటలు ఉపయోగించేందుకు బాగుంటాయని అంటుంటాం’’
‘‘నీలో నాకు బాగా నచ్చే విషయం ఇదేనోయ్! ఎక్కువ సార్లు సిల్లీగా ఆలోచించినా, తరువాత ప్రాక్టికల్‌గా ఆలోచించి నిన్ను నువ్వే సముదాయించుకుంటావ్’’
‘‘రోజూ చచ్చే వాడి కోసం ఏడిచే వాడెవడు అన్నట్టు రోజూ ఏడవడం కన్నా కాశ్మీర్‌పై ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమైతే అది అయింది చూద్దాం ఏమవుతుందో?’’
‘‘ఐనా ప్రపంచం క్లిష్టపరిస్థితిలో ఉంటే నువ్వు అంతగా నవ్వడం ఏమీ బాగోలేదు ’’
‘‘నా నవ్వుకు ప్రపంచం క్లిష్టపరిస్థితిలో ఉండడానికి అస్సలు సంబంధం లేదు. ఐనా ప్రపంచం క్లిష్టపరిస్థితిలో ఉందని నీకెవరు చెప్పారు?’’
‘‘మరెందుకు నవ్వుతున్నావ్?’’
‘‘పాకిస్తాన్ కార్టూనిస్ట్ ఎవరైనా తెలిస్తే బాగుండు కార్టూన్‌కు ఓ మంచి ఐడియా వచ్చింది’’
‘‘ఏమా ఐడియా?’’
‘‘అక్టోబర్‌లో భారత్‌తో యుద్ధం చేస్తామని పాక్ మంత్రి ఒకరు ప్రకటించారు కదా? ఒక రూపాయి దానం చేయండి బాబూ! ఇండియాతో యుద్ధం చేస్తాం అని అడుక్కుంటున్నట్టు కార్టూన్ వేస్తే పేలిపోతుంది కదూ’’
‘‘పాకిస్తాన్ మీడియాలో ఇలాంటి కార్టూన్ వేస్తే ఆ పత్రికను పేల్చేస్తారు.’’
‘‘ఇండియాలో వేస్తే...’’
‘‘ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తారు. రాజకీయ పక్షాలు, సిద్ధాంతాలు, సామాజిక వర్గాలు, రాష్ట్రాలను బట్టి ఉంటుంది’’
‘‘ఏది ఉదాహరణకు ఒక్కటి చెప్పు?’’
‘‘మోదీ భక్తులు అహంకారంతో వేసిన కార్టూన్ ... అంటారు లిబరల్ వాదులు’’
‘‘ఎప్పటి నుంచో నాకో సందేహం? తమ దేశం ఏం చేసినా తప్పు పట్టే మేధావులు మన దేశంలోనే ఉంటారా? అన్ని దేశాల్లో ఉంటారా? తప్పును తప్పు అని నిలదీయడం అభ్యుదయం అవుతుందా? ఏం చేసినా తప్పు అనడమే అభ్యుదయమా?’’
‘‘మరీ దేశమంతా అలానే ఉన్నారనుకోకు... మొన్న పాక్ దేశీయులు అమెరికాలో భారత జాతీయ పతాకాన్ని కాలుతో తొక్కుతూ నినాదాలు చేస్తుంటే ఓ మహిళా జర్నలిస్టు అడ్డుకుని జాతీయ పతాకాన్ని చేతిలోకి తీసుకుంది. అందరూ ఒకేలా ఉంటారని ఎందుకనుకుంటావు’’
‘‘నువ్వు ఎందుకు నవ్వావో చెప్పనే లేదు’’
‘‘మా వద్ద అణుబాంబులు ఉన్నాయి. ఇండియాపై అణుబాంబులు వేస్తామని పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్ హెచ్చరించాడు. ఇదెంత సీరియస్ విషయం కదా? దీనిపై ఒక నెట్‌జన్ కామెంట్ చేస్తూ మా వద్ద ఉన్న అణుబాంబులు మేమేమైనా రాహుల్ గాంధీ పెళ్లిలో వేయడానికి ఉపయోగించుకుంటామా? అని ప్రశ్నించాడు. అది గుర్తుకు వచ్చి’’
‘‘అవి రెండూ జరిగే పనులు కావు’’
‘‘ఏ రెండు’’
‘‘రాహుల్ పెళ్లి.. యుద్ధంలో అణుబాంబుల ప్రయోగం’’
‘‘అలా అనుకుంటావు. నీకు గుర్తుందా. తెలంగాణ సమస్య, కాశ్మీర్ వివాదం ఎప్పటికీ పరిష్కారం కావు అని చాలా మంది కొన్ని దశాబ్దాల పాటు జోకులేసుకున్నాం. తెలంగాణకు కెసిఆర్ రూపంలో పరిష్కారం లభిస్తే, మోదీ రూపంలో కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించింది. ’’
‘‘అంతే అంటావా?’’
‘‘ఈ పరిష్కారాలు కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చక పోవచ్చు. పరిష్కార ఫలితాల కాలం చెబుతుంది.’’
‘‘మరి పాక్ యుద్ధం చేస్తే..’’
‘‘వెనకటికొకడు లేస్తే మనిషిని కాను అన్నాడట! నిండా అప్పుల్లో మునిగిపోయి... కాగితం రెండు వైపుల వాడాలని, పెట్రోల్ ఎక్కువగా వాడొద్దు అనేంత వరకు వచ్చిన పాక్ ఆర్థిక పరిస్థితి తెలిసే అడుగుతున్నావా? ఒక దేశం మరో దేశంతో యుద్ధం చేయడం అంటే దొంగ చాటుగా మానవ బాంబులను ప్రయోగించడం కాదు.’’
‘‘ఔను ఈ మధ్య పాక్ మేధావుల ఉపన్యాసాల వీడియోలు కొన్ని చూశాను. మన గ్రామాల్లో ఎవరు కనిపించినా అప్పులు అడిగే వాడ్ని చూస్తే పారిపోతారు. ఇప్పుడు ప్రపంచమనే గ్రామంలో పాక్ పరిస్థితి అలానే ఉందని పాక్ మేధావి ఒకరు చెప్పారు.ఐనా ప్రజలను సంతృప్తి పరిచేందుకు యుద్ధం అంటూ ప్రకటనలు చేయాలి తప్పదు’’
‘‘ఔను బిక్షగాడు యుద్ధం చేయడు.’’

బుద్ధా మురళి (జనాంతికం 30-8-2019)

20, ఆగస్టు 2019, మంగళవారం

ఇన్వెస్ట్ మెంట్ పంట

సంపాదన లేకపోయినా ఇనె్వస్ట్ చేయవచ్చు. ఇదేదో లాటరీ కాదు. లక్కీ స్కీం అంత కన్నా కాదు. ఇది నిజం. జీవితంలో విజయం సాధించే వారు ఆచరించి చూపిన మార్గం. సాధారణంగా 20 వరకు చదువు సాగుతుంది. ఆ తరువాత ఉద్యోగ వేట వెంటనే ఫలిస్తే, 20 నుంచి 25 ఏళ్ల వయసు నుంచి సంపాదన మొదలవుతుంది. ముందు చూపు ఉన్న వారు అప్పటి నుంచి పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్‌ను ప్రారంభించవచ్చు. ఇది చాలా మంది చేసేదే. కానీ ఇంకాస్త ముందు చూపు ఉంటే సంపాదన మొదలు కాక ముందే ఇనె్వస్ట్‌మెంట్ ప్రారంభించవచ్చు. 
ఇనె్వస్ట్‌మెంట్ అంటే మన మదిలో మెదిలేది. కేవలం డబ్బు మాత్రమే. కానీ ఆ డబ్బు సంపాదనకు అవసరం అయిన జ్ఞానాన్ని సంపాదించడం కూడా ఇనె్వస్ట్‌మెంట్‌గానే భావించాలి. డబ్బుకు సంబంధించిన జ్ఞానం లేనప్పుడు ఎంత డబ్బు ఒకరి చేతికి ఇచ్చినా అది నిలవదు. అదే డబ్బుకు సంబంధించిన జ్ఞానం ఉన్నవారి వద్ద ఆ డబ్బు మరింతగా పెరుగుతుంది. చదువుకునే రోజుల్లో మన వద్ద బోలెడు సమయం ఉండవచ్చు. కానీ ఇనె్వస్ట్‌మెంట్‌కు అవసరం అయిన డబ్బులు ఉండక పోవచ్చు. ఆ సమయంలో మనపై మనకు ఆత్మవిశ్వాసం అవసరం. డబ్బు డబ్బును ఆకర్శిస్తుంది. ఇది నిజం. ఇది జ్ఞాన యుగం. టాటాలు, బిర్లాలు, అంబానీల వంటి శ్రీమంతుల కుటుంబాలే కాదు. సాధారణ కుటుంబాల వాళ్లు సైతం జ్ఞానంతో సంపన్నులు అవుతున్న కాలం ఇది.
జ్ఞాన సముపార్జన కాలంలో, జ్ఞానంపై మన సమయాన్ని ఇనె్వస్ట్ చేయాలి. సంపాదన మొదలు పెట్టే కాలానికి అది మీకెంతో ఉపయోగపడుతుంది. ఇంకా చదువుకుంటున్నాను. చదువు పూర్తయి, ఉద్యోగం రావాలి ఆ తరువాత ఇనె్వస్ట్‌మెంట్ గురించి ఆలోచిస్తాను అనుకునే రోజులు కావు ఇవి. నీకు ఎక్కడ అవకాశం ఉంటే అది ఇనె్వస్ట్ చేయవచ్చు. నిరంతరం ఇనె్వస్ట్ చేయవచ్చు. చేతిలో ఒక రూపాయి లేకపోయినా ఇనె్వస్ట్‌మెంట్ ప్రారంభించవచ్చు.
జీవితానికి ఉపయోగపడే జ్ఞానంపైన, చదువు పూర్తయిన తరువాత ఏ రంగంలో స్థిరపడాలి అనుకుంటున్నారో ఆ రంగం గురించి అవసరమైన జ్ఞాన సముపార్జనపై సమయాన్ని ఇనె్వస్ట్ చేయవచ్చు.
ఇంజనీరింగ్ కావచ్చు, సాధారణ డిగ్రీ కావచ్చు. ఏదో ఒక డిగ్రీతో ఉద్యోగం లభిస్తుంది అనుకునే రోజులు కావు ఇవి. అవకాశాలు పెరిగాయి అదే సమయంలో పోటీ పెరిగింది. పోటీ కాలానికి తగ్గట్టుగా మీ సమయాన్ని జ్ఞాన సముపార్జన కోసం ఇనె్వస్ట్ చేయవచ్చు.
ఉద్యోగం లేదా వృత్తి, వ్యాపారం ద్వారా మీరు సంపాదన ప్రారంభించినప్పుడు ఈ జ్ఞానం మీకు ఎంతో ఉపయోగపడుతుంది.
జ్ఞానంపైనే కాదు చదువుకునే వయసులో ఆరోగ్యంపై కూడా ఇనె్వస్ట్ చేయవచ్చు. చదువు, సంపాదన, వృత్తి ఏదైనా ఈ శరీరంతోనే కదా చేసేది. అందుకే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. నడక, వ్యాయామం, యోగా వంటివాటికి పైసా ఖర్చు అవసరం లేదు. అది మీకు బోలెడు లాభాలను తెచ్చిపెడుతుంది.
సంపాదన ప్రారంభించాకే ఖర్చు
సంపాదన ప్రారంభించిన తరువాతనే ఖర్చు మొదలు పెట్టాలి. చదువుకునే రోజుల్లో చదువుకు అవసరమైన ఖర్చు మినహా మిగిలిన వాటిపై అనవసర ఖర్చు చేయవద్దు. సంపాదించినప్పుడు చేసిన ఖర్చులోనే సంతృప్తి ఉంటుంది. దీని వల్ల డబ్బుకు విలువ ఇవ్వడం తెలుస్తుంది. సంపాదనకు మించి ఖర్చు చేయవద్దు. సంపాదన కన్నా ముందే ఖర్చు మొదలు పెట్టవద్దు.
డబ్బులు కాచే చెట్లు
డబ్బులు చెట్లకు కాస్తాయా?
అనే ఈ మాటను మనం ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగించే ఉంటాం. వినే ఉంటాం. డబ్బులు గురించి ప్రస్తావన వచ్చినప్పుడో, డబ్బులు అడిగినప్పుడో చాలా మంది డబ్బులు చెట్లకు కాస్తాయా? అని ప్రశ్నిస్తారు. నిజమే డబ్బులు చెట్లకు కాస్తాయి. ఐతే అన్ని చెట్లకు కాయవు. అందరి చెట్లకు కాయవు. డబ్బు లక్షణాలను గ్రహిస్తే మీ చెట్టుకు కూడా డబ్బులు కాస్తాయి.
అన్ని విత్తనాలు చెట్లు కావు. అన్ని భూముల్లో పంటలు పండవు. సరైన విత్తనాలను ఎంపిక చేసుకుని, సరైన భూమిలో వాటిని నాటాలి. పంటను నిరంతరం పరిశీలిస్తుండాలి. మంచి రైతు మాత్రమే మంచి పంట పండిస్తాడు. చెట్లకు చీడపురుగులు పడితే తగిన చర్యలు తీసుకోవాలి. నీరుపోయాలి. కలుపు తీయాలి. అప్పుడే మంచి పంట చేతికి వస్తుంది. డబ్బులు కూడా అంతే.
పంట వేసినప్పటి నుంచి కోతలు, పంటను మార్కెట్‌కు చేరేంత వరకు రైతు నిరంతరం కష్టపడతాడు. అప్రమత్తంగా ఉంటాడు. అప్పుడే మంచి పంట చేతికి వస్తుంది. లాభసాటిగా ఉంటుంది.
డబ్బు వ్యవహారంలో సైతం అచ్చం ఇదే విధంగా ఉండాలి. అప్పుడే చెట్లకు డబ్బులు కాస్తాయి.
మంచి విత్తనాలను, మంచి నేలలో పాతితేనే పంట పండుతుంది. ఇనె్వస్ట్‌మెంట్ సైతం అంతే. లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే ఏడాదిలో రెండు లక్షలు ఇస్తాం అనే ఆఫర్‌లను నమ్మితే నకిలీ విత్తనాలను పొలంలో నాటినట్టే. తాలు విత్తనాలతో పంట పండదు. పెట్టుబడి వృధా అవుతుంది. సరైన విత్తనాలు అంటే సరైన దానిలో పెట్టుబడి పెట్టడం. పెట్టిన పెట్టుబడి ఏ రీతిలో పెరుగుతుందో నిరంతరం పర్యవేక్షించాలి. బ్యాంకులో డిపాజిట్ చేసే కళ్లు మూసుకుని పడుకున్నా, రోజూ లెక్కలు చూసుకున్నా పెరుగుదల చాలా స్వల్పంగానే ఉంటుంది. మంచి ఆదాయం రావాలి అంటే మంచి ఆదాయం ఉన్న రంగాల్లో పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడి ఏ విధంగా పెరుగుతుందో ఎప్పటికప్పుడు చూసుకోవాలి. అప్పటికప్పుడు అవసరం ఐన మార్పులు చేర్పులు చేయాలి. మంచి విత్తనాలు, మంచి భూమి, సరైన రీతిలో మంచి పంట పండించినట్టుగానే సరైన రీతిలో ఇనె్వస్ట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. డబ్బులు చెట్టుకు కాస్తాయా అంటే కచ్చితంగా కాస్తాయి. అయితే మంచి పంట పండించే సత్తా మనలో ఉందా? అనేది ముఖ్యం. తాలు విత్తనాలతో మంచి పంట పండించలేం.
-బి.మురళి

ఫ్రీడం ఫండ్

స్వాతంత్య్ర పోరాటం గురించి మనం చదివే ఉంటాం. స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఎంతోమంది మన జీవితాలకు ప్రేరణగా నిలిచారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆ కాలంలో విద్యార్థులు చదువులను వదిలేశారు. న్యాయవాదులు ఎంతో ఆదాయం వచ్చే వృత్తిని వదిలిపెట్టి స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. ఎందుకు? బానిసత్వం భరించరానిది కాబట్టే స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం తెగించారు.
మరి మనమేం చేస్తున్నాం?
చేయడానికి ఏముంది. అప్పుడంటే బ్రిటీష్ పాలనలో ఉన్నాం, బానిసత్వం నుంచి విముక్తి కోసం బ్రిటీష్ వారిపై పోరాడే అవకాశం వారికి దక్కింది. ఇప్పుడు మనం స్వేచ్ఛా జీవులం ఎవరి మీద పోరాడాలి అనే కదా? అనిపిస్తోంది.
మనం నిజంగా స్వేచ్ఛా జీవితం గడుపుతున్నామా? బానిసత్వంలో లేమా? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి నిజంగా మనం అంత స్వతంత్రులమా? నచ్చక పోయినా, మనసు ఒప్పుకోక పోయినా ఉద్యోగం చేస్తున్న వారు మనలో ఎంత మంది లేరు.
నరాలు తెగిపోయే టెన్షన్‌ను అనుభవిస్తూ ఇష్టం లేకపోయినా జీతం కోసం ఉద్యోగం చేస్తున్న వారు ఎంత మంది లేరు. ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఏదైనా కావచ్చు అనివార్యంగా చేస్తున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. నిజానికి ఇదో రకమైన బానిసత్వం.
జీతం రాకపోతే ఇల్లు గడవదు. జీవితం సాగదు కాబట్టి మనసుకు నచ్చినా నచ్చక పోయినా చేయాల్సిందే. ఇదో రకం బానిసత్వమే కదా? చట్టం ఆమోదించిన బానిసత్వం కాదా?
పోనీ ఇంత ఒత్తిడిని అనుభవిస్తూ ఉద్యోగం చేసినా అది, రిటైర్ అయ్యేంత వరకు ఉంటుందా? అంటే అనుమానమే? ప్రభుత్వ ఉద్యోగాలకే భరోసా లేని రోజులివి. బిఎస్‌ఎన్‌ఎల్ ఎప్పుడు మూత పడుతుందో అన్నట్టుగా ఉంది. విమానయాన సంస్థలు మూత పడ్డవి కొన్ని, దివాళా అంచుల్లో ఉన్నవి కొన్ని. జెట్ విమాన యాన సంస్థ పుణ్యమా అని పెలెట్లు కూడా జీతాల కోసం రోడ్డున పడ్డ దృశ్యాలు చూశాం. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్నో మూత పడ్డాయి. ఉద్యోగులు రోడ్డున పడ్డారు. అమెరికాలో ఐబిఎంలో ఏవేవో కారణాలతో రెండు మూడేళ్లలో లక్ష మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారని వార్తలు వచ్చాయి.
ఏతా వాతా చెప్పొచ్చేది ఏమిటంటే ఏ ఉద్యోగం కూడా గుండెలు మీద చేయి వేసుకుని హాయిగా రిటైర్ అయ్యేంత వరకు ఉంటుంది అనే భరోసా లేదు. అలా ఉంటే అదృష్టమే కానీ లేకపోయినా పరిస్థితులు మారిపోయినా భయపడాల్సిన అవసరం లేని స్థితికి ఎవరికి వారే చేరుకోవాలి.
దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వారి కాలంలో మనం లేకపోవచ్చు. కానీ మన స్వాతంత్య్రం కోసం మనం చిన్న పాటి ప్రయత్నం చేయలేమా?
ఫ్రీడం ఫండ్...
నిజమే మన స్వాతంత్య్రం కోసం మనమే ఏర్పాటు చేసుకునే ఫండ్.
వ్యాపారం, ఉద్యోగం, వృత్తి మీ సంపాదన మార్గం ఏదైనా కావచ్చు. కానీ మీ ఆదాయంలో లేదా మీ జీతంలో కనీసం పది శాతాన్ని ఫ్రీడం ఫండ్‌గా కేటాయించాలి. పది శాతం పొదుపు చేసి సరైన రీతిలో ఇనె్వస్ట్ చేస్తే ఏడాదికి దాదాపు పది శాతం వడ్డీ వస్తుంది. చక్రవడ్డి మహత్యం వల్ల క్రమంగా అది పెరుగుతూనే ఉంటుంది. ఒకనాటికి ఆ ఫ్రీడం ఫండ్ మీకు నిజంగానే స్వాతంత్య్రాన్ని ప్రసాదిస్తుంది. ఉద్యోగం లేకపోయినా బతికే స్థితికి చేరుకుంటారు. అలానే కొనసాగిస్తే రిటైర్‌మెంట్ తరువాత మీరు కోరుకున్న విధంగా జీవించడానికి అవసరమైన డబ్బు ఈ ఫ్రీడం ఫండ్ సంపాదించి పెడుతుంది.
ఉద్యోగంలో చేరిన కొత్తలో పొదుపు అనేది ప్రారంభంలో అంతగా ఆసక్తి కలగకపోవచ్చు. కానీ భవిష్యత్తులో తలెత్తే సమస్యలను దృష్టిలో పెట్టుకుంటే ఈ రోజు ప్రారంభించిన చిన్న పొదుపే భవిష్యత్తులో కొండంత అండగా నిలుస్తుందే విషయం తెలుస్తుంది.
పొదుపు ఒకసారి అలవాటు కావడం కష్టం. అలవాటు ఆయిన తరువాత అదెంత మంచి అలవాటో మీరే ఇతరులకు చెప్పగలరు.
పొదుపు చేసిన డబ్బును సరైన విధంగా ఇనె్వస్ట్ చేయాలి. మీకు తెలిసిన రంగంలోనే ఇనె్వస్ట్ చేయాలి. ఆర్థిక రంగంలో నిపుణుల అభిప్రాయం ప్రకారం మన పొదుపును మూడు రకాలుగా ఇనె్వస్ట్ చేయవచ్చు.
1. మొదటి విభాగంలో నష్ట్భయం అస్సలు లేని విధంగా పెట్టుబడి పెట్టాలి. బ్యాంకులో డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్, బాండ్లు వీటిలో ఆదాయం తక్కువగా ఉండవచ్చు కానీ నష్ట్భయం ఉండదు.
2. రెండవ భాగాన్ని ఆదాయం ఎక్కువ, అదే విధంగా నష్ట భయం ఎక్కువగా ఉండే వాటిలో ఇనె్వస్ట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. స్టాక్ మార్కెట్‌లో ఎగుడు దిగుడులు ఎక్కువ. వస్తే ఆదాయం విపరీతంగా రావచ్చు, అదేవిధంగా నష్ట్భయం ఉంటుంది. రిస్క్ ఎంతో ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఈ విభాగంలో కొంత వరకు ఇనె్వస్ట్ చేయవచ్చు.
3. ఈ రెండింటికి భిన్నంగా కొంత భాగాన్ని మూడవ విభాగంలో ఇనె్వస్ట్ చేయవచ్చు. ప్రధానంగా స్టాక్ మార్కెట్‌లో వచ్చిన ఆదాయం కొంత వరకు మూడవ విభాగంలో ఇనె్వస్ట్ చేయాలి. మీ పొదుపును మూడు విభాగాలుగా చేసుకుని ఇనె్వస్ట్ చేయడం వల్ల ఒక దానిలో నష్టపోయినా మరో విభాగం ఉంటుంది. ఇక మొదటి విభాగంలో ఎలాంటి నష్ట్భయం లేని ఇనె్వస్ట్‌మెంట్ కాబట్టి మిగిలిన రెండు విభాగాల్లో దెబ్బతిన్నా మొదటి విభాగం ఆదాయం వల్ల కనీస అవసరాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మూడు విభాగాల్లోనూ ఆదాయం వస్తే మీ పంట పండినట్టే.
పొదుపు అనేది ప్రారంభంలో పెద్దగా ఆసక్తి అనిపించక పోవచ్చు. కానీ రేపటి రోజును ఊహించుకుంటే పొదుపు ఒక అలవాటుగా మారుతుంది. మీ స్వేచ్ఛ కోసం ఫ్రీడం ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ఈ రోజే మంచి రోజు. మంచి పనికి ఏ రోజైనా మంచి రోజే మీ వయసు? మీ ఆదాయం? మీ వృత్తి ఏదైనా కావచ్చు. పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్‌కు అన్నీ మంచి రోజులే ఈ రోజే ఫ్రీడం ఫండ్ కు శ్రీకారం చుట్టండి.
-బి.మురళి (11-8-2019)