27, డిసెంబర్ 2015, ఆదివారం

అకాల మేధావులు!!

‘‘ఎన్నాళ్లయింది నిన్ను చూసి.. ఎక్కడున్నావ్, ఏంటీ విశేషాలు ’’
‘‘ రేపటి జీవితం ప్రశాతంగా గడవాలంటే ఎంతో కొంత వెనకేసుకోవాలి కదా? ఆ పని పూర్తయింది. ఇప్పుడు దేశం మీద పడ్డాను. చిర్లాగీలో పుంగోనియా ఫిల్మోత్సవ్ కెళ్లాను. మస్త్ ఎంజాయ్ చేశాను.అక్కడి నుంచి వస్తున్నా ’’
‘‘చార్మినార్ చౌరస్తాలో సంగం థియోటర్‌లో సినిమా చూడడమే ఓ పండుగలా ఉండేది నాకు.. నువ్వు గ్రేట్ . పవన్, మహేశ్‌బాబుల సినిమాలేవీ లేవు, రజనీకాంత్ సినిమా విడుదలకు మరో రెండేళ్లవుతుందట! అంత దూరం ఏ సినిమా కోసం వెళ్లావు? ’’
‘‘ నా చేతిలో ఇంగ్లీష్ నవల కనిపించిన తరువాత కూడా నీకీ ప్రశ్న ఎలా అడగబుద్ధయింది? ’’


‘‘ మరే సినిమా’’
‘‘ తెలుగొక్కటే కాదమ్మా ప్రపంచంలో అనేక భాషలున్నాయి. నేను వెళ్లింది అల్లాటప్పా సంగం థియోటరో, సుదర్శన్ 35 ఎంఎం కాదు. హిబ్రూ తెగ వారి భాషలో సినిమా ఎంత అద్భుతంగా ఉందనుకున్నావు. ఫిల్మ్ ఫెస్టివల్‌లో 83 భాషల్లోని అద్భుతమైన సినిమాలు చూసేశాను.ఏంటీ అలా వింతగా చూస్తున్నావ్’’
‘‘నువ్వు మా అప్పిగాడివేనా? ఎంత మారిపోయావు. చిన్నప్పుడు నా ఆన్సర్ షీట్‌లో కాపీ కొట్టి పాసైన అప్పిగాడితోనేనా నేను మాట్లాడుతున్నది. పివి నరసింహారావు 16 భాషలు నేర్చుకుంటే అబ్బో అనుకున్నాం. అన్ని భాషల సినిమాలు చూడడమే కాకుండా వాటిని అద్భుతంగా వర్ణిస్తున్నావంటే నువ్వు సామాన్యుడివి కాదు. నిజంగా నువ్వు గ్రేట్‌రా? ఇంతకూ నీకు ఎన్ని భాషలు వచ్చు. ’’
‘‘ ఎవరికీ చెప్పను అని ఒట్టేస్తే నీకీ రహస్యం చెబుతాను. అయితే చిన్న కండీషన్ మరీ అలా అప్పిగా అని పిలవకు. కావాలంటే ఆఫ్‌గా అంటూ కాస్త స్టయల్‌గా పిలువు ’’


‘‘ సరే పిలుస్తాలే ఆ రహస్యం చెప్పు ’’
‘‘ నా సంగతి నీకు తెలుసు కదా? నాన్న గవర్నమెంట్ ఉద్యోగి, నాకు యూనివర్సిటీలో మంచి ఉద్యోగమే దొరికింది. బినామీ పేర్లతో వ్యాపారాలు బాగానే సాగుతున్నాయి. ఎలా పుట్టిందో కానీ నాకూ మేధావిగా గుర్తింపు పొందాలనే కోరిక బలంగా పుట్టింది. అంతే మిత్రుల సహకారంతో అతి త్వరలోనే మేధావి వర్గంలో నాకంటూ ఓ గుర్తింపు సంపాదించాను. నవ్వనంటే చెబుతాను హీ..హీ.. ఈ మధ్య కవిత్వం కూడా రాసేస్తున్నాను. బార్లో కూర్చున్నప్పుడు నా కవితలు విని మిత్రులు వాహ్‌వా అంటూ మెచ్చుకుంటుంటే ఆ కిక్కే వేరు. ఒక్కోసారి నేను కవిత చదవక ముందే వాళ్లు మెచ్చుకుంటుంటారు. వంటల ప్రోగ్రామ్‌లో వంట అంతా అయ్యాక ఆ అమ్మాయి రుచి చూసి జీవితంలో తొలిసారి తిన్నట్టుగా వావ్ అంటుంది చూడు. బార్లో నా కవితలు విని అచ్చం అలానే అంటారు. ఓసారి నిన్నూ తీసుకెళతాలే.. ’’


‘‘ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లిస్తున్నావ్.. ముందన్ని భాషలు ఎలా నేర్చుకున్నావో చెప్పు. బాల మేధావుల గురించి చదివాను కానీ ఈ అకాల మేధావులను ఇప్పుడే చూస్తున్నా? ’’
‘‘ చాలా సింపుల్. ఒక ఇంగ్లీష్ నవల కొనుక్కోని ఎప్పుడు చూసినా ఆ నవల మధ్యలో రెండువేళ్లు గుచ్చి ఉండాలి. అంటే అక్కడి వరకు చదివామని అర్ధం. ఎక్కడ అంతర్జాతీయ సినిమాలున్నా వెళ్లాలి. అన్ని సినిమాలు నాకైతే ఒకేలా కనిపిస్తాయి. పక్కనున్నోడు వావ్ అంటే మనం అంతే. ఫెంటాస్టిక్, మార్వలెస్ అంటూ మధ్యమధ్యలో శబ్దాలు చేయాలి. ఓసారి కరెంటు పోయి తెర నల్లగా కనిపిస్తే ఎప్పటిలానే ఫెంటాస్టిక్ అని అరిచి ఇబ్బందుల్లో పడ్డాను. అప్రమత్తంగా ఉండాలి. ’’


‘‘ ఓస్ ఇంతేనా’’
‘‘ ఇంతేనా అని తేలిగ్గా తీసుకోకు. ఈ స్థాయి దాటి మేధావుల్లో నీ గ్రేడ్ పెరగాలంటే ఊరంతా దసరా సంబరాల్లో ఉంటే నువ్వు రాముడే రాక్షసుడు, రావణుడే దేవుడు అని ప్రకటించాలి. కనీసం డజను టీవి కెమెరాలు నీ ముందు వాలిపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అంతా చేసే దాన్ని వ్యతిరేకించాలి. అయితే కొన్ని మతాల చాలా సెన్సిటివ్ నరికి పోగులు పెడతారు అటువైపు వెళ్లవద్దు. సేఫ్ గేమ్ ఆడాలి.’’
‘‘ అకాల వర్షాల్లా నేను అకాల మేధావిని కావాలంటే కెసిఆర్ చేస్తున్న యాగం వల్ల ప్రపంచానికి ఎంత నష్టమో చెప్పేస్తా? టాంజానియాలో ఆర్థిక సంక్షోభానికి, అమెరికా దౌర్జన్యానికి, రైతుల ఆత్మహత్యలకు, రింగురోడ్డులో ప్రమాదాలకు, కూకట్‌పల్లి నుంచి పంజాగుట్ట వరకు ఎప్పుడూ ట్రాఫిక్ జామ్ కావడానికి యాగమే కారణం.? ’’
‘‘ వావ్ ఇంతలోనే ఎంత ఎదిగిపోయావు. నాతో మాట్లాడడమే ఎడ్యుకేషన్ అని ఆనాడు గిరీశం అన్నాడు. నేడు నేను నిరూపిస్తున్నాను. పొద్దునే్న పంచాంగం కూడా చూశా, ఈరోజు మంచి రోజు . యాగానికి వ్యతిరేకంగా గళమెత్తు. మేధావి వర్గంలో చేరిపో.. నేను అర్జంట్‌గా వెళ్లాలి. ’’
‘‘ రేపటి నుంచి మొదలు పెడతా? ఆదివారం చివరి రోజు కదా యాగానికి వెళుతున్నాం. రేపటి నుంచి రంగంలోకి దిగుతా? సరే నువ్వు అంత అర్జంట్‌గా ఎక్కడికెళుతున్నావ్’’


‘‘ నేనూ కూడా యాగానికే. మా ఆవిడ ఈరోజు వెళ్లి తీరాల్సిందే అని వార్నింగ్ ఇచ్చింది. యాగానికి వెళున్నట్టు తెలిస్తే, మేధావి వర్గం వెలివేస్తుంది. వెళ్లకపోతే కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు పంపిస్తారు. దేనికైనా లెక్కలు ముఖ్యం. బృందంలో ఉండేది కొద్ది సేపు ఇంట్లో ఉండేది జీవిత కాలమంతా అందుకే ఇంటావిడ నిర్ణయానికే మొగ్గు చూపించాను. సరే కలిసే వెళదాం. మళ్లీ చెబుతున్నా మనం యాగానికి వెళ్లినట్టు ఎక్కడైనా చెప్పావా? నామీద ఒట్టే. ’’
‘‘ అంటే మేధావులంతా ఇంతేనా? ’’
‘‘ అలా ఏమీ కాదు దేవున్ని నమ్మేవారైనా, నమ్మని వారైనా ప్రచారానికి దూరంగా ఆత్మ సంతృప్తి కోసం ప్రజల కోసం పని చేసే ఎందరో మహానుభావులు ఉన్నారు. ఈ వ్యాపారాలు, ఆదాయాలు చూసుకుంటూ ఆ మహానుభావుల జాబితాలో చేరడం మనకు కష్టం. ఏదో ఇలా అకాల మేధావుల్లా ఉండిపోదాం. ’’
‘‘నువ్వు నిజంగా బతక నేర్చిన మేధావివి’’

బుద్దా మురళి (జనాంతికం 27. 12. 2015)

20, డిసెంబర్ 2015, ఆదివారం

కాల్ మనీ -వాణిశ్రీ చీరలు .. సావిత్రి అందాలూ

‘‘మనం ఎక్కడికి వెళుతున్నామో అని ఆలోచిస్తే ఒక్కో సారి భయం వేస్తుంటుంది’’
‘‘ నిజమే.. అవసరం కోసం అప్పు తీసుకుంటే రాక్షసులు ఆడవారి జీవితాలతో ఆడుకుంటారా? ఆ రాక్షసులను ఎన్‌కౌంటర్ చేసేయాలి.’’
‘‘ఆ సంగతి మనకెందుకు వదిలేయండి. ఆటోవాడు మీటరు మీద ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నాడు ఇంత కన్నా దుర్మార్గం ఉంటుందా? ’’
‘‘ ఇవన్నీ కామన్.. మరీ అంత దుర్మార్గం ఏమిటండి వయసులో ఉన్న ఆడవారిని వారి, పిల్లలను అప్పు చెల్లించలేదని వ్యభిచారం చేయిస్తారా? ప్రజాప్రతినిధులతో జల్సాలకు విదేశాలకు పంపిస్తారా? చదువుతుంటేనే రక్తం సలసల కాగిపోతోంది. ’’
‘‘ఇలాంటివి కామన్ .. ఇందులో అన్ని సామాజిక వర్గాల వారున్నారు. అసలు అందం అంటే మహానటి సావిత్రిదేనండి.. ఎం అందం, ఏం అభినయం. కన్యాశుల్కం చూశారా? లొట్టిపిట్టలు అంటూ నవ్వుతూ ఆమె చెప్పే డైలాగు మనను గిలిగింతలు పెట్టి కవ్విస్తున్నట్టుగా ఉండదూ ’’
‘‘నేను కాల్ మనీ గురించి చెబుతుంటే మీరేంటండి కన్యాశుల్కం అంటారు.’’
‘‘కన్యాశుల్కం నాటకమైనా సినిమా అయినా నాకు నచ్చలేదు అన్న పిచ్చొడ్ని నేను మొదటి సారి చూస్తున్నాను. కన్యాశుల్కం నాటకంలోని ప్రతి డైలాగు ఇప్పటికీ కంఠతా వచ్చిన వాళ్లున్నారు. దేవదాసులో అంత చిన్నవయసులో సావిత్రి ఎంత పరిణితి కనబర్చిందండి. ఏం నటన ఏం నటన. ’’
‘‘ అది కాదండి కొత్త రాజధాని ఇమేజ్ ఏమై పోతుంది. రుణాలిచ్చి ఆడవారి మానాలు దోచుకునే కాల్‌మనీ రాక్షసులు, ఇసుక మాఫియాను అడ్డుకున్న అధికారులను చితక్కోట్టే ప్రజాప్రతినిధులను ఇలా విచ్చలవిడిగా వ్యవహరించే వారిని వదిలేయడం న్యాయమా? పాలకులు కొన్ని విషయాల్లో కఠినంగా ఉండాలి కదా?’’
‘‘ సరే ఏం చేస్తాం మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలి. మహానటి సావిత్రి గురించి మాట్లాడితే వినేంత ఓపిక కూడా మీకు లేదు.. దానవీర శూరకర్ణ చూశారా? తెలుగు సినిమా చరిత్రలో అజరామరమైన సినిమా అది. ఒక్కో డైలాగు ఒక్కో ఆణిముత్యం కదటండి. ఏమంటివేమంటివి? ఇది క్షాత్ర పరీక్షే కానీ... చిత్రం భళారే విచిత్రం .... ఆ సినిమాలో ఎన్టీఆర్ ఆరున్నర కిలోల కిరీటం, మూడు కిలోల 534 గ్రాముల బరువైన నగలు, రెండు కిలోల బరువున్న పాదరక్షలు, ఆరకిలో మేకప్ ఉపయోగించారు తెలుసా? ’’
‘‘అప్పు చేయడం తప్పు కాదు. ఇంత అన్యాయం ఏంటండి. మనమిప్పుడు మాట్లాడుకోవలసింది ఓలమీ తిక్కరేగిందా? ఒళ్లంతా తిమ్మిరెక్కిందా? అనే పాటలో ఎన్టీఆర్ హీరోయిన్ పిరుదులపై ఎన్ని సార్లు కొట్టారు. తన పిరుదులను ఎన్నిసార్లు తిప్పారు అని కాదండి. ఎట్టాగో ఉన్నాది ఓలమీ ఏటేటో అవుతుందే చిన్నమ్మి అంటూ వాణిశ్రీ కొంగు జారినప్పుడు చూసి అక్కినేని ఎన్నిసార్లు బొర్లాపడిపోయాడు అని కాదండి మనం చర్చించాల్సింది. చట్టం అంటూ ఒకటి ఉందని, నేరాలకు పాల్పడిన వారి పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుంది అనే సందేశం ప్రజల్లోకి వెళ్లాలి కదండి’’
‘‘ అబ్బా మీరేంటండి నక్షత్రకుడు హరిశ్చంద్రుడ్ని వదలకుండా పట్టుకున్నట్టు, మీకు ప్రపంచంలో మరే అంశం దొరకనట్టు కాల్ మనీ కాల్ మనీ అని పట్టుకుని కూర్చున్నారు. మాస్టారు ప్రపంచం చాలా స్పీడ్‌కు ముందుకు వెళ్లిపోతోంది మారండయ్యా మారండి. మోనాలిసా మనం ఎటు నుంచి చూసినా నవ్వుతున్నట్టు కనిపిస్తుంది. ఇదెలా సాధ్యం 

అయిందంటారు.? బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించేప్పుడు ఎంత అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చారండి. నాదృష్టిలో ఆయన రచనలన్నింటిలోకీ అదే ఉత్కృష్టమైంది.’’


‘‘ ఈ చర్చ నాకు నచ్చలేదు అంటున్నాను. ’’
‘‘ ఈ కాకా హోటల్‌లో మనం చర్చించుకోవడానికి ఇంత కన్నా ముఖ్యమైంది ఏముంది? మీకు సావిత్రి అన్నా పడదు. ఎన్టీఆర్ నచ్చరు, అక్కినేని అంటే గిట్టదు. పోనీ జెమ్స్‌బాండ్ కృష్ణ గురించి మాట్లాడుకుందామంటే ముఖం చిట్లిస్తారు. వాణిశ్రీ చీరల గురించి తెలియకుండానే ఆ వయసు దాటి వచ్చారా? ఈ సబ్జెక్ట్స్ గురించి చర్చిచేంత అవగాహన మీకు లేకపోతే పోనీ జబర్ధస్త్ ప్రోగ్రామం గురించి మాట్లాడుకుందామా? ’’
‘‘వాటి గురించి నాకు తెలియదు’’


‘‘మీరు కళాకారులను అవమానిస్తున్నారు, జాతి నాయకులను అవమానిస్తున్నారు జాతీయ నాయకులను అవమానిస్తున్నారు. చివరకు బాబా సాహేబ్ అంబేద్కర్‌ను సైతం అవమానిస్తున్నారు. మీ ప్రవర్తన పాకిస్తాన్ తీవ్రవాదుల కన్నా తీవ్రంగా ఉంది. మీకు గాంధీ అన్నా లెక్క లేదు, సర్దార్ పటేల్ అన్నా పట్టింపు లేదు. ఇలాంటి వారిని ఉగ్రవాదులుగా ప్రకటించి దేశ బహిష్కరణ శిక్ష వేయాలి’’
‘‘మీరు అపార్థం చేసుకున్నారు. నేను వాళ్లేవరినీ అవమానించ లేదు. ప్రపంచంలో తెలుగు వారికి ఎక్కడ అన్యాయం జరిగినా స్పందిస్తానని హామీ ఇచ్చారు. కాల్ చేస్తే వచ్చేస్తానన్నారు కాల్‌మనీ విషయంలో ఇలా ఉన్నారేమిటని? దేశంలో మన పరువేం కావాలని అంటున్నాను తప్ప నేనెవరినీ అవమానించలేదు. కావాలంటే మా ఇంటికి వచ్చి చూడు అంబేద్కర్ సాహిత్య సంకలం మొత్తం నాదగ్గరుంది. ’’


‘‘ అందరినీ అవమానిస్తున్న మీలో మార్పు రావాలని కోరుతూ ఒక రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. ’’
‘‘వామ్మో వాళ్లందరినీ అవమానించానని నువ్వు ప్రచారం చేస్తే ఏమైనా ఉందా? క్షమించు కాల్‌మనీ కాలనాగుల గురించి అస్సలు మాట్లాడను.’’
‘‘అలా రా దారికి... కుబేరుడు శ్రీవేంకటేశ్వరస్వామికి అప్పిచ్చి ఇంకా వడ్డీ వసూలు చేస్తూనే ఉన్నాడుకదా? కాల్ మనీ కేసుపై విచారణ కలియుగం ప్రారంభం నుంచి మొదలు పెట్టాలి. అంటే నువ్వు దైవాన్ని కూడా అవమానిస్తున్నావన్నమాట. ఆర్‌బిఐ చేసేది వడ్డీ వ్యాపారమే. ప్రపంచ బ్యాంకు దేశాలకు అప్పులిస్తుంది అంటే నువ్వు ప్రపంచ బ్యాంకుకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా కుట్రకు తెర తీస్తున్నావన్నమాట? ’’


‘‘కావాలంటే ఏడాది సస్పెండ్ చేసుకో నన్ను క్షమించి వదిలేయ్ ’’
-బుద్దా మురళి (జనాంతికం 20. 12.2015) 

13, డిసెంబర్ 2015, ఆదివారం

పచ్చిపులుసు, పులావ్, పుంటికూర, రాగి సంకటి మహాకూటమి

‘‘అంత సీరియస్‌గా ఉన్నావ్ ఏం వండుతున్నావ్ ? ఐనా జరిగింది రాయాలి కానీ ఇలా వండి రాయండం ఏంటోయ్?’’
‘‘ ఇది అల్లాటప్పా వంట కాదు బాబాయ్ చూస్తూ ఉండూ. ఈ వంటతో ప్రభుత్వానికి దిమ్మతిరిగి పోతుంది’’
‘‘ ఏం నీ వంటలో అంత మసాలా ఉందా? ’’


‘‘ వంట అంటే అల్లాటప్పా వంట కాదు బాబాయ్.. పచ్చిపులుసు, పులావ్..  పుంటికూర... రాగి సంకటి  మహాకూటమి.. ఈ దెబ్బతో ప్రభుత్వం పని ఐపోయినట్టే’’
‘‘అదేదో జంద్యాల సినిమాలో శ్రీలక్ష్మి చిత్రమైన వంటలు వండి నట్టు నువ్వేమైనా కొత్త కొత్త వంటల ప్రయోగాలు చేస్తున్నావా ? చక్కగా వార్తలు రాసుకోవలసినోడివీ స్టోరీలంటూ వంటలు వండి చివరకు వంటల్లోనే స్థిరపడిపోదామనుకుంటున్నావా? భానుమతి వంటలు కృష్ణకుమారి వంటలు అంటూ ఆనాటి మేటి హీరోయిన్ల పేరు మీద చాలానే వంటల పుస్తకాలు షాపుల్లో దొరుకుతున్నాయి. ఆయనెవరో 24 గంటల వంటల చానల్ మొదలు పెడితేనే చూసేవాళ్లు దిక్కులేదు. నీకెందుకోయ్ ఆ వంటలు వదిలేయ్’’
‘‘ బాబాయ్ నేను వండుతున్నది నిజమే.. కానీ అది తినే వంట కాదు . వంట నిజమే కానీ అది చదివే వార్త కూడా కాదు. ’’
‘‘ వంట మొదలు పెట్టక ముందే నీకు  కవిత్వం వచ్చేస్తుందంటే  ఆ వంట తిన్నాక ఏమవుతుందో? ఏమైతే నాకేం కానీ ఉదయమే పిన్ని పులిహోరా చేసింది కడుపు నిండా తిన్నాను. పక్కింటి రెడ్డి గారు ప్రేమతో సర్వపిండి పంపించారు. అద్భుతంగా ఉందనుకో. మధ్యాహ్నం అంతా  ఉడిపి హోటల్‌కె ళుతున్నాం.  నీ వంట రుచి చూసేందుకు ఎవరో ఒకరు దొరక్క పోరు . మందుల కంపెనీల వాళ్లు ప్రాణాలు హరించే మందులను ప్రయోగించాలంటేనే ఎంతో మంది ముందుకు వస్తున్నారు. నీ వంట రుచి చూసేందుకు ఆ మాత్రం సాహసం చేయరా? చాలా మంది వస్తారు. భయపడకు. పది మంది పేషంట్లు పోతే కానీ ఒక డాక్టర్ తయారు కాడు. ఎంతో మంది బలయితే కానీ ఒక వంట వాడు విజయవంతం కాడు  .. నువ్వు ధైర్యంగా ఉండు.. నేను వెళ్లిపోతున్నాను’’


‘‘ అదేదో పార్టీ నాయకుడిలా అలా వన్‌సైడ్‌గా మాట్లాడడమేనా? ఎదుటి వాళ్లు చెప్పేది వినిపించుకోవా? బాబాయ్.. నేను వండేది వంట కాదని చెప్పాను, మరేంటి అని అడగవా? ’’
‘‘ వంట కాదా? నిజమా? అయితే ఏదైనా పరవాలేదు చెప్పు వింటాను. పెద్దగా పని కూడా ఏమీ లేదు. ’’
‘‘ బాబాయ్ రాష్ట్రంలో ఎంత మంది జనం ఉన్నారు. వీరిలో పచ్చిపులుసు అంటే ఇష్టపడే వాళ్లు ఎంత మంది. బిర్యానీ తినేవాళ్లు, పులావ్ తినే వాళ్లు, నాన్‌వెజ్‌లో పుంటికూర ఇష్టపడే వాళ్లు, వెజ్‌లో టమాట అంటే పడి చచ్చేవాళ్లు ఎంత మంది? చింతకాయ తొక్కును ఇష్టపడే వాళ్లు, అవకాయ లేనిదే ముద్ద దిగదనే వాళ్లెంత మంది? రాగి సంకటిని కన్నా మిన్నగా భావించే వాళ్ళు ఎంతమంది ?  అన్ని లెక్కలు నా దగ్గరున్నాయి’’


‘‘ఏరా కర్రీ పాయింట్ ఏమైనా మొదలెట్టదలిచావా? ఏంటోరా బాబూ ఇంటర్‌నెట్ అందుబాటులోకి వచ్చాక ఏ వ్యాపారంలో ఎవరు వందల కోట్లు సంపాదిస్తారో అర్థం కావడం లేదు. మనం ఎర్రబస్సు అని తేలిగ్గా అనేస్తాం కదా? అదే పేరుతో నిజామాబాద్ కుర్రాళ్లు రెడ్ బస్ అంటూ ఆన్‌లైన్‌లో బస్సు టికెట్లు బుక్ చేసుకునే వ్యాపారం మొదలు పెట్టి వందల కోట్లకు అమ్ముకున్నారట! నీ ఐడియా బాగుందిరా! ఏమో దశ తిరిగి నీ కర్రీ పాయింట్ వ్యాపారం వందల కోట్లకు అమ్ముడు పోవచ్చు. తెలంగాణ ఉద్యమ కాలంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కెసిఆర్ కర్రిపాయింట్ పెట్టుకో ఎవరొద్దన్నారు అంటే చాలా మంది ముఖ్యమంత్రిని అంతేసి మాటలు అంటారా? అని విరుచుకుపడ్డారు గుర్తుందా? ఆ మరుసటి రోజు కెసిఆర్ అసలు విషయం చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి అప్పటికే బెంగళూరులో క్రరీ పాయింట్ వ్యాపారం ఉందట! సిఎంగా ఉంటూ కర్రీ వ్యాపారం కొనసాగించారంటే ఏరా నిజంగా ఆ వ్యాపారం లాభసాటిగా ఉంటుందా? ’’


‘‘ నేనేదో చెప్పాలనుకుంటాను. నువ్వు కనీసం వినకుండా ఉపన్యాసం ఇచ్చేస్తుంటావు. నేను చెప్పేది విను బాబాయ్... నేను చెబుతున్న వంటకాల్లో బ్రహ్మాండమైన రాజకీయం ఉంది? ’’
‘‘ సరే చెప్పు ’’
‘‘ రాష్ట్రంలోని ప్రజలందరి తిండిపై నా దగ్గర సమగ్ర సర్వే ఉంది. పచ్చిపులుసు, అవకాయ, బిర్యానీ, పుంటికూర, పెద్ద కూర రాగి సంకటి మహాకూటమి ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని దించేస్తా’’


‘‘ 2009లో వైఎస్‌ఆర్‌కు వ్యతిరేకంగా ఇలాంటిదే ఏదో మహాకూటమి ఏర్పాటు చేశారు కదా? ’’
‘‘ అది రాజకీయ పార్టీల మహాకూటమి బాబాయ్ ఇది అలాంటిది కాదు. ఇది పార్టీలతో సంబంధం లేకుండా కేవలం ఆహార అలవాట్ల ఆధారంగా ఏర్పడే మహాకూటమి’’
‘‘ అంటే ఏం చేస్తావురా?’’


‘‘ రాష్ట్రంలో భారీగా పెద్ద కూర ఉత్సవాలు నిర్వహిస్తామని ఒక గ్రూపువస్తుంది. ప్రభుత్వం అనుమతి ఇస్తే ఇది పెద్ద కూర ప్రభుత్వం అని పప్పు కూర గ్రూపుతో ఆందోళన చేయిస్తాం. ప్రభుత్వం పచ్చిపులుసు గ్రూపుపై ప్రేమతో పెద్దకూర, పప్పు కూర వర్గాలను వేధిస్తోందని తటస్థంగా ఉండే బిర్యానీ వర్గం ర్యాలీలు తీస్తుంది. ప్రజలకు తమకిష్టమైన వంటకం వండుకునే హక్కు లేదా? అని మనిషి మెదడును ఇష్టంగా తినే గ్రూపుతో రాష్ట్రంలో ఆందోళనలు చేస్తాయి. అసలేం జరుగుతుందో అర్థం కాక, ఎవరిని వ్యతిరేకించాలో తెలియక అధికార పక్షం జుట్టు పీక్కుంటుంది. తలనొప్పితో అధికార పక్షం కాఫీ తాగితే టీ వర్గంతో ఆందోళన చేయిస్తాం, టీ తాగితే కాఫీపై చిన్నచూపు అంటూ రోడ్లపై బైటాయిస్తాం. పాలు తాగితే, పిల్లలకు పాలు కూడా దక్కకుండా చేస్తున్నారని పిల్లలతో ధర్నాలు చేస్తాం. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుంది. ఎన్నికల నాటికి పచ్చిపులుసు పులావ్ పుంటికూర రాగి సంకటి మహాకూటమి ఏర్పడి అధికారంలోకి వస్తుంది. ’’
‘‘ ఎలా ఉంది బాబాయ్ మన రాజకీయ వంటకం’’
****

వంట రాజకీయాన్ని అమలు చేసిన తరువాత .... 
***


‘‘ఏరా పోలీసులు బాగా కొట్టారా? ఏదో వండారని లోపలేశారు. ఇంతకూ మీకు లోపల ఏ కూర వడ్డించారు? ’’
‘‘చదువుకోరా అంటే ఈ వంటకాలేంటిరా అని కుళ్ల బొడిచారు. పచ్చిపులుసు కోసం చింతపండును పిండినట్టు పిండేశారు బాబాయ్ ’’
ములాఖత్ టైం అయిపోయింది ఇక లోపలికి వెళ్లండి.

బుద్దా మురళి (జనాంతికం 13. 12.2015)

6, డిసెంబర్ 2015, ఆదివారం

మద్రాస్ వరదల్లో కొట్టుకు పోయిన అసహనం

‘‘ముళ్ల మీద కూర్చున్నంత ఇబ్బందిగా కూర్చున్నావు? ఏమైంది’’
‘‘ఏమీ లేదు’’
‘‘కానీ, గాంధీభవన్‌లో దానం నాగేందర్‌లా కూర్చున్నావు.. ఆయన పార్టీలో ఉంటాడనే నమ్మకం లేదు. వెళతానని చెప్పడం లేదు. బయటకు దూకాలా వద్దా అని గుమ్మం పై అసహనంగా కూర్చొని ఉన్నాడు. నువ్వు కూడా అచ్చం అలానే కనిపిస్తున్నావు.
‘‘ అంటే?’’
‘‘ ముఖం చూస్తే తెలుస్తుంది ఆ లక్షణం. బయటపడేందుకు కారణాలను ఆనే్వషించే చూపులు అవి. నువ్వు కూడా నన్ను తప్పించుకొని వెళ్లిపోవడానికి కారణం వెతుకుతున్నట్టుగా అనిపిస్తే’’
‘‘ నీతో నాకేం భయమా? అలాంటిదేమీ లేదు.. మద్రాస్‌ను తలుచుకుని’’
‘‘ నిజమే మద్రాస్ పరిస్థితి ఆవేదన కలిగిస్తోంది. ’’
‘‘ దాని గురించి కాదు. జాతీయ చానల్స్ చూస్తున్నావా? ’’
‘‘చూస్తున్నా.. ఎప్పుడూ లేని విధంగా జాతీయ చానల్స్ కూడా మద్రాస్ పరిస్థితిని చూపిస్తున్నాయి. ’’


‘‘ అది కాదు... జాతీయ చానల్స్‌లో మొన్నటి వరకు అసహనంపై అద్భుతమైన డిబేట్స్ జరిగేవి. ఎక్కడెక్కడి రంగు రంగుల మేధావులు ఆవేశంగా మాట్లాడేవారు. ఈ మద్రాస్ తలనొప్పితో ఆ చర్చలు ఎక్కడా కనిపించడం లేదు. అదీ నాబాధ’’
‘‘ నిజమే టీవిల్లోనే కాదు సామాజిక మాధ్యమాల్లోనూ మద్రాస్ గురించే చర్చలు. రామకృష్ణమఠం, ఆర్‌ఎస్‌ఎస్ వంటి ఎన్నో సేవా సంస్థలు మద్రాస్‌లో వరద బాధితులను ఆదుకుంటున్నాయి. ఆహార పొట్లాలు అందిస్తున్నాయి. సిక్కుల సేవా సంస్థ కూడా పెద్ద ఎత్తున అక్కడే వంటకాలు చేసి బాధితులకు వడ్డిస్తోంది. మానవత్వం చచ్చిపోలేదు బతికే ఉందని గట్టిగా అరవాలన్నంత బాగా అక్కడ సంస్థలు సేవలు అందిస్తున్నాయి. ’’
‘‘ అన్ని హిందూ సంస్థల గురించి చెప్పావు కానీ నీకు ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసి సహాయ సామగ్రిని మద్రాస్ పంపిన వార్త కనిపించలేదా? మద్రాస్‌లో మసీదులను బాధితుల కోసం తెరిచి మంచినీళ్లు అందిస్తున్న వార్త కనిపించలేదా? ’’


‘‘ నిజమే సరిగ్గా గుర్తు చేశావు. ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసి సహాయ సామగ్రిని పంపినట్టు చూశాను.  పలు ముస్లిం సంస్థలు సహాయ చర్యలు చేపట్టారు . మతాలకు అతీతంగా మద్రాస్‌లో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు తెలుగు వారు తమిళులు అనే తేడా లేకుండా బాధితులను ఆదుకున్నారు. మతం గురించి ఎవరూ గుర్తు చేసుకోలేదు. మానవత్వం చనిపోలేదు అని అప్పుడప్పుడు మనుషులకు గుర్తు చేయడానికేనేమో ఈ ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. నేపాల్‌లో భారీ భూ కంపం వస్తే వాళ్ళేవరో మత గ్రంథాలను భారీ ఎత్తున పంపించి అభాసు పాలయ్యారు. మద్రాస్‌లో మాత్రం అలా కాకుండా మతానికి ప్రమేయమే లేకుండా మనుషులు స్పందించారు. వరద నీటికి మతం, కులం, భాష తేడా ఉండదు. దానికి తెలిసింది ప్రకృతి ధర్మం ఒక్కటే. ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపినప్పుడు మనిషి తనలోని మానవత్వాన్ని ప్రదర్శించే అవకాశం వస్తుంటుంది అనిపించింది మద్రాసీలకు చేయూతనందించే చేతులను చూసినప్పుడు. తమిళ హీరోలు నల్లగా ఉంటారని మన తెలుగు సినిమాల్లో వెటకారం చేస్తాం. కానీ ఆ నల్లని హీరోల మనసు ఎంత విశాలమో వరద సహాయంలో చూశాం. ’’
‘‘ ఇక చాల్లే... నేను చెప్పాలనుకున్నదాన్ని చెప్పనివ్వకుండా నువ్వు ఏదేదో చెబుతున్నావు’’


‘‘ నువ్వు చెప్పింది మద్రాస్ వరదల గురించి నేను చెబుతున్నది అదే కదా? ’’
‘‘ అదే కానీ కోణం వేరు. మా మేధావులు ఎంతో కృషి చేసి దేశంలో అసహన పరిస్థితిపై ఒక చక్కని వాతావరణం సృష్టించాం. చివరకు మేం సృష్టించిన వాతావరణ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా పని చేసింది. అంత అసహనం పనికి రాదు అని తీవ్రవాద దేశాలు సైతం ఇండియాకు సుద్దులు చెప్పేంతగా అసహనం పై ప్రచారం చేయగలిగాం. జాతీయ ఛానల్స్‌లో ఎక్కడ చూసినా అసహనంపై చర్చలే. ఎంతటి సహన వంతుడికైనా అసహనం పుట్టేంతగా మేం ప్రచారం చేస్తే, మద్రాస్ వరదలు మా ప్రయత్నాన్ని బూడిదలో పోసిన పన్నీరులా మార్చేసింది. ’’
‘‘ పాపం మద్రాసేం చేసింది’’


‘‘ వందేళ్లలో ఎప్పుడూ లేనంత వర్షాలు ఇప్పుడే కురవాలా? మరీ బుద్దిలేకపోతే సరి 50 సెంటీమీటర్ల వర్షపాతం కురవడం ఏమిటి? జాతీయ చానల్స్ దృష్టిలో దేశం అంటే ఢిల్లీ, ముంబై మాత్రమే. కానీ భారీ వర్షాల దెబ్బతో మద్రాస్ కూడా దేశంలో భాగమే అని, దక్షిణ భారత దేశం కూడా ఇండియాలో భాగమేనని మద్రాస్ వరదల్లో చానల్స్ మునిగితేలక తప్పలేదు. అక్కడికే మా ప్రయత్నం మేం చేశాం. రోజు కొక మేధావి మీ టీవి చర్చల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. అసహనంపై చర్చించండి అని సందేశం పంపినా పట్టించుకోలేదు. మేం ఎంతో కష్టపడి తయారు చేసిన అసహన వాతావరణం వరదల్లో కొట్టుకు పోయింది. ఒక వాతావరణం సృష్టించడం, దాన్ని నమ్మడం, నమ్మించడం అంత ఈజీ కాదు. అంతా పోయింది వరదల్లో కొట్టుకు పోయింది. ’’


‘‘ అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది. సరే మళ్లీ ప్రయత్నించవచ్చు కదా’’
‘‘ఒక రేంజ్‌లో హైప్ క్రియేట్ చేసి విడుదల చేసిన సినిమా ఢమాల్ మంటే ఒక పాట కలిపి మళ్లీ విడుదల చేస్తే ఎలా ఉంటుందో ఇదీ అంతే. ఒక ఇష్యూ మూత పడిందంటే చానల్స్ మళ్లీ వాటికి ప్రాధాన్యత ఇవ్వవు. ’’
‘‘ సరే ఏం చేస్తారు.. మరో అవకాశం కోసం వేచి చూడండి. అయినా మన కళ్ల ముందే కనిపిస్తుంది కదా? మద్రాస్‌లో మతాలు, కులాలకు అతీతంగా ఒకరినొకరు ఆదుకుంటున్నారు ఇంకా ఈ దేశంలో మత ‘అసహనం’ ఉం దంటావా? ఆ మత సంస్థలు మద్రాస్‌లో సేవ చేస్తున్నాయి కదా? మీరు సేవలో వారితో పోటీ పడి ప్రజల మనసు దోచుకోవచ్చు కదా? ’’
‘‘ మా ఉద్యమాలే దోపిడీకి వ్యతిరేకం. మనసే కాదు దోచుకోవడం ఏదైనా కావచ్చు మేం   దానికి వ్యతిరేకం. ’’


‘‘నిజమేలే అంత దూరం వెళ్లి సేవ చేయాలంటే ఓపిక ఉండాలి, మనసు రావాలి ఓ పది మందైనా ఉండాలి. కానీ టీవిలో అసహనం అంటూ గట్టిగా బల్లగుద్ది వాదించాలంటే ఒక వ్యక్తి చాలు. అతనికి నోరుంటే చాలు!! వరదల్లో కొట్టుకు పోయిన అసహనం వెతికేందుకు ప్రయత్నించండి.  ఎక్కడో ఒక చోట దొరక్క పోదు .  ’’  - బుద్దా మురళి (జనాంతికం -6. 12. 2015)