30, ఆగస్టు 2015, ఆదివారం

ప్రత్యేక హోదా...... చిదంబర రహస్యం!

‘‘సారీ రాణి మనం పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదు... మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోడం లేదు. మన ఇద్దరి కులాలు ఒకటే, ప్రాంతాలు ఒకటే .. మా ఇంట్లో వాళ్లకు నువ్వు నచ్చిన విషయం కూడా నిజమే కానీ మారిన పరిస్థితుల వల్ల కొన్ని సాంకేతిక కారణాలతో ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది ..వద్దంటే వద్దంటున్నారు నన్ను మరిచిపో...’’


‘‘రాజా నవ్వు జోక్ చేస్తున్నావా? ’’
‘‘నా ముఖం చూస్తే జోక్ చేస్తున్నట్టు ఉందా? జోక్ చేసినా నవ్వే స్థితిలో నేను లేను.. నువ్వు నన్ను మరిచిపోవలసిందే రాణి. ఒకే దారిలో పయనిస్తున్నా రైలు పట్టాలు ఎప్పుడూ కలువవు.. ఉల్లిగడ్డ రేట్లు ఎప్పుడూ తగ్గవు నువ్వూ నేను ఎప్పుడూ కలవం ఇది నిజం అర్ధం చేసుకో రాణి’’


‘‘అంత మాటనకు రాజా! మనం ఎన్నిసార్లు చూడలేదు. వంద రూపాయలకు కిలో పలికిన టమోటా ఒక్కో సారి రూపాయి ధర కూడా పలకక మదనపల్లి మార్కెట్‌లో రోడ్డుపై రైతులు కుప్పలుగా పారబోయడం చూడలేదా? ఆకాశంలోకి వెళ్లిన రాకెట్ కూడా ఏదో ఒక నాడు కిందికి దిగాల్సిందే... ఉల్లిగడ్డ కూడా అలా ఏదో ఒక రోజు కింద పడిపోతుంది రాజా! ఉల్లిగడ్డ ధర పెరిగిందని మన ప్రేమకు అన్యాయం చేయడం నీకు న్యాయం కాదు రాజా’’


‘‘ఉల్లిధర తగ్గొచ్చు, సమన్యాయం అంటే ఏంటో ఏదో ఒక రోజు బాబు చెప్పొచ్చు.. ఉండవల్లి తక్కువ మాట్లాడవచ్చు. కానీ మన పెళ్లి సాధ్యం కాని విషయం అర్ధం చేసుకో రాణి. దేశంలో ఎన్నడైనా ఏ రైలైనా సమయానికి రావడం నువ్వు చూశావా? ’’
‘‘రాజా నువ్వు కాదంటే నేను బతక లేను.. మనం ఒకటవుతాం .. నాకా నమ్మకం ఉంది. ’’


‘‘ దిల్‌సుఖ్‌నగర్ నుంచి సాయంత్రం కూకట్‌పల్లికి వెళ్లాలనుకోవడం తప్పు కాదు... కానీ అరగంటలో చేరుతాననుకోవడం అజ్ఞానం, చేరాలనుకోవడం అత్యాశే. చేరి తీరుతానని ప్రతిజ్ఞ చేయడం మూర్ఖత్వం. ఇది కూడా అంతే రాణి’’
‘‘రాజా! ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. అలానే ఏదీ అసాధ్యం కూడా కాదు. నువ్వు చెప్పింది ఈరోజు సాధ్యం కాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు సాధ్యం అవుతుంది రాజా! హయత్‌నగర్ నుంచి కూకట్‌పల్లికి వెళ్లడం ఇప్పుడు మార్స్ గ్రహాన్ని చేరుకోవడం అంత కష్టం కావచ్చు కానీ ఏనాటికీ సాధ్యం కాదని ఎందుకనుకుంటావు రాజా! ’’


‘‘కలలు కనడం మంచిదే కానీ నువ్వు పగటి కలలు కంటున్నావు రాణి’’
‘‘నావి పగటి కలలు కాదు రాజా! మెట్రో రైలు ముందు మీడియా ఎంత గట్టిగా తుమ్మినా పనులు ఆగలేదు. వచ్చే ఏడాది మెట్రో రైలు పూర్తవుతుంది అప్పుడు దిల్‌సుఖ్‌నగర్ నుంచి అరగంటలో కూకట్‌పల్లికి వెళ్లి చూపిస్తాను అప్పుడు ఒప్పుకుంటావా? రాజా మన పెళ్లికి’’
‘‘చూడు రాణి ఎపి ఎక్స్‌ప్రెస్ పేరు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అని మార్చవచ్చు కానీ మా ఇంట్లో వాళ్లు ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే అంతే దానికి తిరుగుండదు’’
‘‘నాకు అర్ధమైంది రాజా! నువ్వు నా స్నేహితురాలిని ప్రేమిస్తున్నావు కదూ’’
‘‘నిన్ను ఎంతగా ప్రేమించానో నీ స్నేహితురాలిని అంతే గట్టిగా ప్రేమించాను. నిజానికి నీ దగ్గర చెప్పిన ప్రేమ కబుర్లు అన్నీ నీ స్నేహితురాలికి కూడా చెప్పాను. ఒకే ప్రేమ లేఖను పేర్లు మార్చి ఇద్దరికీ ఇచ్చాను. ఇవన్నీ నిజమే కానీ నేను మీ ఇద్దరినీ చేసుకోలేను. ప్రస్తుతానికి మా పెద్దలు బిహార్ సంబధం చూశారు. వాళ్ల మనసు ఎప్పుడు మారుతుందో తెలియదు. నేను వాళ్ల మాట గౌరవించాల్సిందే.


‘‘ఎన్ని సాయంత్రాలు మనం వెన్నెల్లో ఊసు లాడుకున్నాం  . నువ్వు లేనిదే నేను లేనని ఎన్ని కబుర్లు చెప్పావు రాజా! నీ కోసం ప్రాణాలిస్తానన్నావు, నా హృదయంలో నీకు ప్రత్యేక హోదా ఉంటుందన్నావు.. ఈ సూర్యచంద్రులే దానికి సాక్షం అన్నావు’’
‘‘ఆ సమయానికి తగ్గట్టు ఏదో చెబితే దానే్న పట్టుకుని పాకులాడితే ఎలా డియర్.. ఎక్కడో దూరంగా ఉన్న సూర్యచంద్రులు కాదు పార్లమెంటు సాక్షిగా పాలకులు ఇచ్చే హామీలకే దిక్కు లేదు. నీకింకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ప్రత్యేక హామీ నీ ఒక్కదానికే కాదు నీ ప్రెండ్ రాగిణిక్కుడా సరిగ్గా ఇదే మాట చెప్పాను.. రాత్ గయి బాత్ గయి అనే మాట తెలియదా? ’’
‘‘రాజా ఇప్పటి వరకు బతిమిలాడాను. నువ్వు వినక పోతే మన ప్రేమ కథను ఆధారాలతో సహా బయటపెడతాను.. ఏమనుకుంటున్నావో’’
‘‘నా ఆధారాలు నువ్వు బయటపెడితే నీ ఆధారాలు నేను బయటపెడతాను. గొడవెందుకు కానీ ఇద్దరం రాజీకొద్దాం. నీకు నా హృదయంలో ప్రత్యేక హోదా ఎప్పుడూ ఉంటుంది. బాబు మనసులో ఎన్టీఆర్‌కు, కెసిఆర్ మనసులో చంద్రబాబుకు, తెలుగు హీరోల మనసులో అభిమానులకు ప్రత్యేక హోదా ఉన్నట్టే నా మనసులో నీకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది.’’


‘‘ప్రత్యేక హోదా అంటే పెళ్లి చేసుకుంటావా రాజా!’’
‘‘మళ్లీ అదే మాట అంత కన్నా ఎక్కువే అంటున్నాను కదా’’
‘‘ఎప్పుడు? ’’
‘‘కెసిఆర్ దళితులందరికీ మూడెకరాల భూమి , బాబు ఇంటికో జాబు ఇవ్వగానే, జగన్ ఓదార్చడం ఆపివేయగానే, విదేశీ బ్యాంకుల్లో దాచిన నల్ల డబ్బును మోదీ ఇంటికి 15లక్షలు పంచగానే, వెంకయ్యనాయుడు ప్రాస రహితంగా మాట్లాడగానే, పాకిస్తాన్ దావుద్‌ను మన దేశానికి అప్పగించగానే,ఆంధ్ర ప్రదేశ్ మత్తయ్యను తెలంగాణకు అప్పగించగానే  మాట నిలబెట్టుకుంటా రాణి ’’
‘‘స్పష్టంగా డేట్ చెప్పు రాజా!’’
‘‘2019 వరకు ఆగు చెబుతాను’’
‘‘అంత మాటన్నావు చాలు రాజా!’’


‘‘ఇంతకూ నీ హృదయంలో ప్రత్యేక హోదా కన్నా విలువైన స్పెషల్ అంటున్నావు అది ఏంటి రాజా!’’
‘‘చిదంబరం వెళ్లావా?’’
‘‘వెళ్లలేదు...’’
‘‘అక్కడే దేవుడు ఉంటాడో తెలుసా? చిదంబరంలోని దేవుడ్ని చూస్తే మీ ఇద్దరికీ నేనివ్వబోయే ప్రత్యేక హోదా ఏమిటో అందులోనే కనిపిస్తుంది. ’’
‘‘చిదంబరం ఆలయంలో ఉండేది శూన్యమే అంటారు కదా రాజా?’’
‘‘నేను కాదన్నానా?’’
‘‘అంటే నువ్వు గాఢంగా ప్రేమించిన మా ఇద్దరికీ నువ్విచ్చే స్పెషల్ ???’’

-బుద్దా మురళి (జనాంతికం 30-8-2015)

23, ఆగస్టు 2015, ఆదివారం

హీరోలూ...! నిరుద్యోగులు.. షష్టిపూర్తులూ...!@ 60

‘‘మీ ఇంటికొచ్చి ఇంత సేపైంది ఓ మాట లేదు.. ముచ్చట లేదు. అసలేమైంది నిన్ను చెల్లెమ్మ గానీ తలపై బలంగా కొట్టిందా? ఏంటి? ’’
‘‘నాకు అంత అదృష్టమా అన్నయ్య గారూ! వయసు మీద పడింది కదా తలమీద కొడితే మెదడు చిట్లిపోతుందేమోననే భయంతో కొట్టడం లేదు. ఏం జరిగిందో తెలియదు కానీ ఎవరితోనూ మాట్లాడవద్దని నిర్ణయించుకున్నారు.’’


‘‘ఏం జరిగిందిరా! నాక్కూడా చెప్పకూడదా? ’’
‘‘నువ్వు మరీ బలవంత పెట్టేస్తున్నావు. నిర్మోహమాటంగా మాట్లాడితే నీకూ కోపం వస్తుంది? ’’
‘‘కాలేజీలో చదువుకునేప్పుడు విశాలక్ష్మికి నేను ప్రేమ లేఖ రాయడం, అవిడ నా చెంప ఛెళ్లు మనిపించడం తప్ప ఏ విషయంపైనైనా నిర్మొహమాటంగా మాట్లాడు. నాకేమీ అభ్యంతరం లేదు. ’’
‘‘మొన్న పుట్టిన రోజున అనాథాశ్రయంలో, వృద్ధాశ్రయంలో కాస్సేపు సరదాగా గడుపుదామని వెళ్లాను ’’

‘ఇందులో తప్పేముంది. సమాజం నిర్లక్ష్యం చేసిన వారిని ఆప్యాయంగా పలకరించడం కన్నా పుణ్యం ఏముంటుంది? ’’
‘‘ అదే నేను చేసిన తప్పు. నేను వెళ్లే సరికి అచ్చం చిక్కడ పల్లి సిటీసెంట్రల్ లైబ్రరీలో గ్రూప్ వన్‌కు ప్రీపేర్ అవుతున్న కుర్రాళ్ల సమూహంలా కనిపించింది ఆ వృద్ధాశ్రమం. అంతా తలో చెట్టు కింద పుట్ట కింద చేరి పుస్తకాలు చదువుకుంటున్నారు. రాసుకుంటున్నారు. భలే ముచ్చటేసింది. సరే ఆ వృద్ధాశ్రమం నిర్వాహకులు మనకు తెలిసిన వారే కావడంతో అందరినీ ఒక చోట చేర్చారు. అయినా కొందరు దగ్గరికి రాకుండా సీరియస్‌గా ఏదో రాసుకుంటూ కనిపించరు. వీలునామా రాస్తున్నారా తాతయ్యా? అంటూ ఆప్యాయంగా పలకరించాను అంతే... ’’
‘‘ నువ్వు చెప్పు ఇందులో తప్పేమైనా ఉందా? ’’
‘‘ తప్పేముందిరా! ప్రేమ, ఆప్యాయత ఉంది కానీ’’
‘‘ కదా? కానీ ఆక్కడ రాసుకుంటున్న వారంతా ఒక్కసారిగా నాపై దాడికి దిగారు. పిచ్చపిచ్చగా ఉందా? ఏమనుకుంటున్నావని నిలదీశారు. ’’


‘‘ ఇంతకూ వాళ్లేం రాసుకుంటున్నారు, నీ మీద కోపమెందుకు? కొంపదీసి ఈ వయసులో అక్కడున్న అమ్మమ్మలు, తాతయ్యలు ఒకరికొకరు ప్రేమలేఖలు రాసుకుంటున్నారా? ఏమిటి? ఆ..ఆహా ...హా...’’
‘‘ ఆపురా నీ నవ్వు !’’
‘‘ మరేంటో విషయం చెప్పు’’
‘‘ వాళ్లంతా పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్నారట! వాళ్లలో ఒక్కరు కూడా 60 ఏళ్ల లోపు వాళ్లు లేరు. కొత్త ప్రభుత్వం పదేళ్ల పొడిగింపు, వికలాంగుల కోటా, ఆ కులం, ఈ కులం ఇతర విభాగాల కింద ప్రత్యేక పొడిగింపులతో 62ఏళ్ల వరకు కూడా ఉద్యోగానికి పరీక్షలు రాసే చాన్స్ వచ్చింది. 58 ఏళ్లకు రిటైర్‌మెంట్.. 62ఏళ్ల వరకు పరీక్ష రాసే చాన్స్.. పుట్టిన రోజున వాళ్లను ఆప్యాయంగా పలకరించాలని వెళ్లి వాళ్లతో చివాట్లు తిని వచ్చేశాను..’’
‘‘ ఔను పుట్టిన రోజంటే గుర్తుకొచ్చింది.. చిరంజీవికి 60 ఏళ్లట. నమ్మబుద్ధి కావడం లేదు కదూ.. రాంగోపాల్ వర్మ కూడా ఇదే మాట అన్నాడు కదా? చిరంజీవికి 60 అంటే ఒప్పుకోం 26 మాత్రమే అని ప్రకటించేశాడు. ఏంటో చిరంజీవి నా కన్నా వయసులో పెద్ద అంటే అస్సలు ఒప్పుకో బుద్ధి కావడం లేదు ’’


‘‘ముందు నేను చెప్పేది విను. ఆ తరువాత నీ గోడు చెప్పు వింటాను. మా మేనమామ కొడుకు ముఖేష్ కనిపిస్తే అభిమానంతో ఏంటోయ్ హీరో అని పలకరించాను’’
‘‘ఇందులో తప్పేమైనా ఉందా? ’’
‘‘ పెద్దవాడినని కూడా చూడకుండా ఒక్కసారిగా గయ్‌మని లేచాడు. ఏంటీ నాకెమన్నా 60 ఏళ్లు దాటాయనుకుంటున్నావా? జస్ట్ 30 ఏళ్లు మాత్రమే.. మరోసారి హీరో అని పిలిస్తే మర్యాద దక్కదు అని వార్నింగ్ ఇచ్చాడు. ఏంటో ఏం మాట్లాడినా ఇలా రివర్స్ అవుతుందని కొద్ది రోజులు మాట్లాడవద్దనుకున్నాను’’
‘‘ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు కానీ చిత్రంగా ఉంది కదూ ఒకవైపు చిరంజీవి షష్టిపూర్తి జరుపుకుంటూ మరోవైపు కొత్త సినిమా కోసం చర్చలు సాగిస్తున్నారు. షష్టిపూర్తి వేడుకలు ముగియగానే హీరోయిన్‌తో కలిసి పార్కుల్లో కిందా మీద పడి బోర్లుతూ ప్రేమ కబుర్లు చెప్పడం విచిత్రంగానే ఉంటుంది కదూ’’
‘‘ ఇందులో విచిత్రం ఏముందోయ్ అన్నగారు 60 ఏళ్ల వయసులో అమ్మా నేను కాలేజీలో ఫస్ట్ వచ్చానమ్మా అంటూ ఇంటికి పరిగెత్తుకు రావడం, ఎన్టీఆర్ కన్నా సగం వయస్సున్న తల్లి ఆనంద బాష్పాలు రాలుస్తూ నా కలలు ఫలించాయి బాబూ ఫలించాయి అంటూ కన్నీళ్లు తుడుచుకోవడం... ఎన్టీఆర్ చేతిలో నోట్‌బుక్ పట్టుకుని సీరియస్‌గా చదువుకుంటూ ఆయన కన్నా పావుసగం వయస్సున్న హీరోయిన్ కవ్వించినా పట్టించుకోక పోవడం ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఆ రోజులే వేరు. ’’
‘‘ సరైన సమయంలో సినిమాల్లోకి వచ్చి టాప్ లేపిన చిరంజీవి ఏడేళ్ల ముందు రాజకీయాల్లోకి వచ్చి దెబ్బతిన్నారు కానీ 60 ఏళ్ల వయసులో ఇప్పుడు వచ్చి ఉంటే ఎన్టీఆర్‌లా సక్సెస్ అయి ఉండేవారేమో అనిపిస్తుంది. ఆజాను బాహుడు కావడం వల్ల ఎన్టీఆర్ నిజానికి తన వయసు కన్నా పెద్దగా కనిపించే వారు.తెలుగు సినిమాలు బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్‌లోకి వచ్చిన కాలంలోనే ఎన్టీఆర్ వయసు కన్నా పెద్దగా కనిపించే వారు. తాత వయస్సు ఉంటేనే హీరో అనే నమ్మకం ఆ కాలంలో బలంగా ఉండడంతో ఎన్టీఆర్ నెట్టుకొచ్చారు.


చిరంజీవి కూడా ఎన్టీఆర్‌లా 60 ఏళ్ల వరకు సినిమాల్లో నటించి, . ఇంత కాలం ఆదరించిన తెలుగు ప్రేక్షకుల కోసం ఏమైనా చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాను అనే డైలాగు వినిపిస్తే పేలేది కదా? పైగా ఢిల్లీలో తెలుగు పాలకులకు ప్రధాని కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. తెలుగు ఆత్మగౌరవం డైలాగుకు మళ్లీ మంచి రోజులు వచ్చి ఉండేవి. ఏడేళ్ల ముందు రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశారు, ఇప్పుడు తనకు 60 ఏళ్లు అని ప్రకటించి మరో తప్పు చేశారు. హీరోలు అభిమానుల దృష్టిలో దేవుళ్లు.. దేవుళ్ల వయసు ఎప్పుడూ పాతికేళ్ల వద్దే ఆగిపోతుంది.
-బుద్దా మురళి (జనాంతికం 23.8.201 5)

2, ఆగస్టు 2015, ఆదివారం

మంగళసూత్రం-బ్యాలెట్ బాక్స్

‘‘ఇదిగో నిన్నే  కాస్త వేడివేడిగా టీ పెట్టివ్వు..నా గదిలోకి ఎవరినీ రానివ్వకు. నేను రాసుకుంటున్నాను’’


‘‘చాల్లెండి బడాయి.. మీకు కవిత్వం సోకిన తరువాత మనింటికి బంధువులను పిలిచినా రావడం లేదు. పులి బోనులోకి వెళ్లేంత అమాయకులెవరుంటారు. కాలనీలో అందరి ఇళ్లలో దొంగతనాలు జరిగినా చివరకు దొంగలకూ మనిల్లంటే చిన్నచూపే. మీనాక్షి కూతురు పెళ్లికి వెళితే మా పిన్ని మీ ఆయన కవిత్వం రాస్తారా? అని సీరియస్‌గా అడిగి కిసుక్కున్న నవ్వింది. అక్కడున్న వారంతా ఫక్కున నవ్వేసరికి కొట్టేసినట్టు అయింది. నాన్న కూడా చాలా బాధపడుతున్నారండి చూడమ్మాయ్ ఇద్దరాడపిల్లలున్నారు. వాళ్ల చదువులు, పెళ్లిళ్లు ఎన్నో ఖర్చులుంటాయి. ఇలా మీ ఆయన కవితా సంకలనాలు అంటూ ఖర్చు పెడుతున్నారని బాధపడుతున్నారు. ఆయన సొంత సమయంలో కవిత్వం రాసుకుంటూ, సొంత డబ్బుతో ముద్రించుకుంటున్నారు. నీకేంటి అని నిలదీశాను. మీ ఆయన కవిత్వం రాయడం మానేస్తే, ఆస్తిలో వాటా ఇస్తాను, రిటైర్ అయిన తరువాత వచ్చే డబ్బంతా ఇచ్చేస్తాను అని నాన్న ఆఫర్ ఇచ్చాడు. నేను కోపంగా నాలుగు తిట్టి వచ్చేశాను కానీ నాన్న గారి ఆఫర్ గురించి ఓ సారి ఆలోచించండి’’


‘‘నువ్వూ, మీ నాన్నే కాదు ఈ ప్రపంచం మొత్తం నాకు ఎదురు తిరిగినా నేను కవిత్వం రాయడం ఆపను. నా కవిత్వంతో భూకంపం సృష్టిస్తాను. సమాజాన్ని మార్చేస్తాను. ’’

‘‘మీరు సమాజాన్ని మార్చడం కాదు కానీ కవిత్వం విషయంలో మిమ్మల్ని ఎవరూ మార్చలేరు. మాకీ కష్టాలు తప్పవనే విషయం నాకెప్పుడో అర్ధమైంది లెండి. ఏదో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి కవిత్వం రాసినా ఉద్యోగం నుంచి ఎవడూ తీసేయలేడు కాబట్టి బతికి పోయాం కానీ అదే ప్రైవేటు ఉద్యోగం అయితే రోడ్డున పడేవాళ్లం’’


‘‘ మేధావులను  తొలుత అంతా ఇలా పిచ్చివాళ్లుగానే చూశా రు’’
‘‘ పిచ్చివాళ్లంతా మేధావులు కాదు’’
‘‘ నన్ను పిచ్చివాడికింద జమేస్తున్నావా? ’’
‘‘ ఒక్క కవిత్వం విషయంలో తప్ప మీరు మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ’’


‘‘ఘంటసాలకు పాడడం రాదని, అమితాబ్‌ను నటించలేవని, రేఖ, హేమామాలిని నటనకు పనికిరారని, మార్లిన్ మాన్రోను ఎక్కడైనా ఉద్యోగం చూసుకో పొమ్మన్నారు. నా ప్రతిభ మీకు ఇప్పుడు అర్థం కాదు.’’
‘‘మీ కవిత్వం వల్ల జేబులు ఖాళీ కావడం తప్ప బుర్రలు నిండుకుంటాయంటే నేనైతే నమ్మలేను. పోస్ట్‌మెన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. వాడేదో ఉత్తరాలు ఇచ్చి పోవడానికి వస్తే కొత్త కవిత్వం రాశాను వినవోయ్ అని వినిపించారట! నీళ్లు రావడం లేదని అపార్ట్‌మెంట్ అత్యవసర సమావేశం జరిగితే సామాన్యుడి సమస్యలపై రాసిన కవిత అంటూ మీరు కవిత్వం చదవడం మొదలు పెట్టారు. కాలనీ ప్రెసిడెంట్ గుండె నొప్పి అంటూ వెళ్లిపోయాడు. సమస్య అలానే ఉండిపోయింది. ’’


‘‘ప్రజలను చైతన్య పరిచే వాడంటే ఎవరికైనా కోపమే. రాజులు ఉరితీసేవాళ్లు, ప్రజాస్వామ్యంలో ఎన్‌కౌంటర్ చేస్తున్నారు. నా కవిత్వంతో ప్రజలను చైతన్య పరచడం ఆపే ప్రసక్తే లేదు కానీ... ఇప్పుడు నేను రాసేది కవిత్వం కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు పదిహేనున దేశ ప్రజలను ఉద్దేశించి ఎర్రకోట నుంచి ప్రసంగిస్తారు కదా ఆ ఉపన్యాసాన్ని రాయబోతున్నాను ’’
‘‘ నిజమా! క్షమించండి మీరు కవి అనుకొని చిన్న చూపు చూశాను. మీలో ఇంత ప్రతిభ ఉందని, ప్రధాన మంత్రి ఉపన్యాసాన్ని రాసేంత సీనుందని అస్సలు ఊహించలేదు. కవిగారూ నా ఉపన్యాసం మీరే రాయాలని అని నరేంద్ర మోదీ అంతటి వారు అడిగారంటే మన జీవితానికి ఇంత కన్నా ఇంకేం కావాలి. కవిగా మిమ్ములను అంటరాని వానిగా దూరం చేసిన వారందరికీ ఈ విషయం ఇప్పుడే చెబుతాను ’’


‘‘ ఆవేశపడకు విదేశీ పాలకులు మన దేశానికి వచ్చినప్పుడు పార్లమెంటును ఉద్దేశించి మాట్లాడతారు. అలానే నరేంద్ర మోదీ అప్పుడప్పుడు మన దేశంలో కూడా పర్యటించడానికి వచ్చినప్పుడు మన్‌కి బాత్ అంటూ రేడియోలో మాట్లాడుతూ మనసులోని మాట మాట్లాడతారు. ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ ఉపన్యాసంలో ఏం మాట్లాడాలో మీరే చెప్పండి అని దేశ ప్రజలకు మోదీ ఆఫర్ ఇచ్చారు అదీ విషయం’’ పనిలో పనిగా నా కవిత ఒకటి ప్రస్తావిస్తూ మోదీ ఉపన్యాసం సిద్ధం చేస్తున్నాను’’
****
‘‘ఏమండీ రాయడం పూర్తయిందా? ఎంత వరకు వచ్చింది.’’
‘‘నువ్వూ వినవోయ్ స్వాతంత్య్రం వచ్చింది... వచ్చింది స్వాతంత్య్రం... స్వాతంత్య్రం మీద కవిత రాశాను. ఇక మ్యాటర్ రాయాలి ’’
‘‘మళ్లీ వచ్చావా? ఉగాది అంటూ ఉగాదికి రాశారు. దసరా, దీపావళి, స్వాతంత్య్ర దినోత్సవం అన్నీంటికీ అదేనా? మన విషయం ఏమన్నా రాశారా? రాయకపోతే చెబుతా నోట్ చేసుకోండి ’’
‘‘మన విషయమా ఏంటది?’’
‘‘ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో విదేశాల్లో దాచుకున్న నల్లధనం దేశంలోకి తెస్తామని, ఆ డబ్బు పంచితే ఒక్కోక్కరికి ఎంత వస్తుందో మోదీ చెప్పారు కదా? ఇంట్లో నలుగురం ఉంటున్నాం. మీ అమ్మా నాన్నలను కూడా ఇంట్లోనే ఉండమని చెప్పాను. పాపం ఈ వయసులో వాళ్లకు ఎవరున్నారని, అందరి వాటాలు కలుపుకుంటే గాంధీనగర్‌లో ఒక చక్కటి ఫ్లాట్ కొనొచ్చు. మొన్న మా తమ్ముడు వెళ్లి ఫ్లాట్ చూసొచ్చాడు వాడికి బాగా నచ్చింది. .. విదేశాల్లో దాచిన సొమ్ము నుంచి చెప్పినట్టుగానే మీ వాటా మీకిచ్చేస్తున్నాను అని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ఉపన్యాసంలో రాయండి. మన దరిద్రం తీరిపోతుంది. ’’


‘‘చూడోయ్ ప్రేమికులు పార్కుల్లో తిరిగేప్పుడు ప్రియుడు ఎన్నో మాటలు చెబుతాడు. పెళ్లయ్యాక వాటిని అంత సీరియస్‌గా తీసుకోవద్దు. మెడలో మంగళసూత్రం పడేంత వరకే ప్రేయసీ ప్రియులు, బ్యాలెట్ బాక్స్‌లో ఓటు పడేంత వరకే ఆ కబుర్లు. మెడలో మంగళసూత్రం, - బ్యాలెట్ బాక్స్‌లో ఓటు రెండూ ఒకటే.... పార్కులో విన్న ఊసులు ఇంట్లో వినాలనుకోవడం అత్యాశే. ఇదీ అంతే