30, ఏప్రిల్ 2023, ఆదివారం

కొత్త సచివాలయం - పాత జ్ఞాపకాలు

కొత్త సచివాలయం - పాత జ్ఞాపకాలు జ్ఞాపకాలు 6 తెలంగాణ కొత్త సచివాలయం అద్భుతం గా తీర్చి దిద్దారు . ఈ కాలానికి తగ్గట్టు ఆధునిక సౌకర్యాలు , భద్రత ఏర్పాట్లు కనిపిస్తున్నాయి . గతం, లో సచివాలయం అంటే పైరవీ కారులు , ఆందోళన చేసే వారు ఎవరంటే వారు దూసుకువెళ్ళే వారు . ఇప్పుడు అనుమతి ఉంటేనే లోనికి ప్రవేశం , ఏ ఫ్లోర్ కు వెళ్ళడానికి అనుమతి ఉంటే ఆ ఫ్లోర్ కే వెళ్ళాలి . పాత సచివాలయానికి సంబంధించి అనేక అనుభవాలు . ఉమ్మడి రాష్ట్రం లో 95లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు . అంతకు ముందు సచివాలయం చుట్టూ వివిధ సమస్యలతో ఆందోళనలు చేసే వారి టెంట్ లతో ఎప్పుడూ సందడిగా ఉండేది . సచివాలయం ఎదురుగా , ఫుట్ ఫాత్ పైన ఎక్కడ చూసినా టెంట్ లు బాధితుల దీక్షలు కనిపించేవి . చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సచివాలయం వద్ద నిషేధాజ్ఞలు విధించి , ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ఏర్పాటు చేసి , అక్కడే ధర్నాలకు అవకాశం కల్పించారు . సచివాలయం లో ప్రెస్ రూమ్ లో అనేక చర్చలతో హాట్ హాట్ గా ఉండేది . కొందరు సీనియర్ లు అక్కడున్న సోఫాలో కునికి పాట్లు పడుతుంటే ల్యాండ్ లైన్ ఫోన్ పై కొందరు కబ్జా చేసే వారు . అప్పుడింకా సెల్ ఫోన్ లు రాలేదు . ఉచితంగా ల్యాండ్ లైన్ అందుబాటులో ఉండడం తో ఒక్క క్షణం కూడా విరామం తీసుకోకుండా ఆ ఫోన్ పని చేస్తూనే ఉండేది . ప్రెస్ రూమ్ ఎదురుగా చాలా మంది పెదరాయుడు లు కనిపించే వారు . పెదరాయుడు పెద్ద చెట్టుకింద కూర్చొని తీర్పులు చెబుతున్నట్టు ప్రెస్ రూమ్ ఎదురుగా ఒక పెద్ద వృక్షం ఉండేది . ఆ వృక్షం చుట్టూ గ్రామాల్లో చావిడి మాదిరిగా ఓ పది మంది కూర్చునే అవకాశం ఉండేది . సచివాలయానికి పని కోసం వచ్చినా , పైరవీ కోసం వచ్చినా అటు నుంచి వెళ్లాల్సిందే అక్కడున్న అందరి కళ్ళల్లో పడాల్సిందే .. ఆ చెట్టు అక్కడున్న వారి దృష్టి తమకు ఇబ్బంది కరం గా మారిందని అసెంబ్లీ లో చర్చ జరిగింది . అప్పుడు బిజెపి శాసన సభ్యునిగా ఉన్న మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అసెంబ్లీ లో ఈ చెట్టు గురించి ఫిర్యాదు చేశారు . ప్రజా సమస్యలపై అధికారులను కలిసేందుకు వెళితే సచివాలయం లో చెట్టువద్ద ఉన్న వాళ్ళు పైరవీల కోసం వచ్చినట్టు చూస్తున్నారని శాసన సభలో చెప్పారు . ఆ తరువాత చెట్టు చుట్టూ కూర్చోవడానికి అనువుగా ఉన్న ప్రాంతాన్ని తగ్గించారు . కూర్చునే వకాశం లేక పోయినా అక్కడే నిలబడి చర్చలు చేసే వారు . ప్రెస్ రూమ్ కు వెనక వైపున ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఛాంబర్ ఉండేది . నిజాం కాలం లో నిర్మించిన చెక్క మెట్లు భలే ఉండేవి . ఎన్టీఆర్ ఇష్టంగా ఈ ఛాంబర్ ను ఎంపిక చేసుకున్నారు . ఆగస్టు సంక్షోభం లో ఎన్టీఆర్ ను దించేసేంత వరకు అదే ఛాంబర్ లో ఉన్నారు . ఎన్టీఆర్ ను అధికారం నుంచి దించేయడానికి చంద్రబాబు నాయకత్వం లో తొలిసారిగా శాసన సభ్యుల , పార్టీ నాయకుల సమావేశం జరిగింది ఈ సచివాలయం లోనే . పోస్టాపీసు పైన చంద్రబాబు ఛాంబర్ ఉండేది . 1995 ఆగస్టు లో తొలుత నల్లగొండ జిల్లాకు చెందిన నాయకులు బాబుకు బొకే ఇచ్చి అభినందించారు . అనంతరం ఒకరి తరువాత ఒకరు శాసన సభ్యులు రాసాగారు . ఏదో జరుగుతుంది అని రిపోర్టర్ లు వచ్చే సరికి నాయకులు అందరినీ బయటకు పంపారు . లోపల ఎంత మంది శాసన సభ్యులు ఉన్నారో ఎవరికీ తెలియదు . 70 మంది శాసన సభ్యులు అని ఓ అంకె ప్రచారం లోకి వచ్చింది . ఎలా అంటే కూర్చోవడానికి ప్లాస్టిక్ ఛైర్లు తెప్పించారు . వాటిని లెక్కబెట్టిన ఓ జర్నలిస్ట్ 70 అని అంకె తేల్చారు . 70 ప్లాస్టిక్ కుర్చీలను 70 మంది శాసన సభ్యులుగా తేల్చేశారు . ప్రెస్ రూమ్ లో ఉన్న ల్యాండ్ లైన్ నుంచే రామోజీ రావుకు వాళ్ళ రిపోర్టర్ ఈ సమావేశానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చే వారు . సాయంత్రానికి సచివాలయం నుంచి క్యాంపు వైస్ రాయ్ హోటల్ కు మారింది . నెల రోజుల్లో ఎన్టీఆర్ మాజీ అయిపోగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు సచివాలయం లోకి అడుగు పెట్టారు . తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న చివరి దశలో కూడా సచివాలయం లో తెలంగాణ వారిపై పెత్తనం చెలాయించేవారు . చివరి దశలో ఓ మహిళా ఉద్యోగి మేం వెళ్లి పోతే మీరు ఎందుకూ పనికి రారు , పాలించడం రాదు అని కెమెరాల ముందే తిట్టింది . 2014లో తెలంగాణ ఆవిర్భావం ఎన్నికలు జరిగాయి . కొత్త ముఖ్యమంత్రికి సచివాలయ ఉద్యోగులు స్వాగతం పలికి , సచివాలయం లో అభినందన సభ నిర్వహించడం ఆనవాయితి. ముఖ్యమంత్రిగా తొలిసారి సచివాలయానికి వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సిబ్బంది ఘన స్వగతం పలికారు . సభ నిర్వహించారు . జులై నెలలో ఎప్పుడూ లేనంత ఉడక పోత . సభలో కెసిఆర్ ఇదే చెప్పారు . హైదరాబాద్ వాతావరణం ఇది కాదు ఎంత చల్లగా ఉండేది . చెట్లు పెంచి వాతావరణాన్ని మళ్ళీ చల్లగా ఉండేట్టు చేద్దాం అని వాతావరణం వల్ల కొద్ది సేపే ప్రసంగించి ముగించారు . ఇప్పుడు నూతన సచివాలయం లో 30 శాతం స్థలం పచ్చ దనానికి కేటాయించారు . నూతన సచివాలయం ఆధునికతతో పాటు పచ్చదనం తో కళకళ లాడుతోంది . బుద్దా మురళి (నమస్తే తెలంగాణ 29-4-2023)

28, ఏప్రిల్ 2023, శుక్రవారం

ఆంధ్రా కిమ్ శంకర పిచ్చయ్య ... ఓ జ్ఞాపకం 5

ఆంధ్రా కిమ్ శంకర పిచ్చయ్య ... ఓ జ్ఞాపకం శంకర పిచ్చయ్య తెలుసా ? అని నేటి ఐటీ కుర్రాళ్లను అడిగితే , ఎవరూ ? సుందర్ పిచాయ్ కు ఏమవుతారు అని అడుగుతారు . ఏమీ కారు . ఆగండాగండి నేను కూడా మీ కన్నా ముందే శంకర పిచ్చయ్య గురించి గూగుల్ ఏమన్నా చెబుతుందేమో అని చూస్తే ఆది శంకరా చార్య గురించి మోయలేనంత సమాచారం చూపించింది . ఆ ప్రయత్నాలను పక్కన పెట్టి జ్ఞాపకాల్లోకి వెళితే ... 93 -94 లో వరంగల్ జిల్లా రిపోర్టర్ గా ఉన్నప్పుడు పత్రికల్లో ప్రతి రోజు లక్ష్మీ పార్వతి , శంకర పిచ్చయ్య గురించి పుంఖాను పుంఖాలుగా వార్తలు . ఇప్పుడు కొరియా కిమ్ గురించి ప్రపంచం భయపడుతున్నట్టు వార్తలు ఎలా వస్తున్నాయో ఓ మూడు పత్రికల్లో శంకర పిచ్చయ్య గురించి అలా వచ్చేవి . అంటే అతను ఆ కాలం నాటి ఆంధ్రా కిమ్ అన్నమాట . లక్ష్మీ పార్వతి సోదరుడు వరంగల్ ఈనాడు రిపోర్టర్ నళినీకాంత్ గుంటూరు బదిలీ అయి వెళ్ళాడు . గుంటూరు వెళ్లి ఉద్యోగం లో చేరి కొన్ని రోజులు పని చేసి వరంగల్ వచ్చాడు . వరంగల్ లోని తమ ఇంట్లో శుభకార్యం రావాలి అని రిపోర్టర్ లు అందరినీ పిలిచాడు . గుంటూరు బదిలీ అయి వెళ్లిన అతను శంకర పిచ్చయ్య గురించి చెప్పాడు . మా ఇంట్లో పంక్షన్ కు శంకర పిచ్చయ్య కూడా వస్తున్నాడు అని చెప్పగానే తోటి రిపోర్టర్ లలో ఉత్సాహం . ఆ మాట ముందే చెబితే పిలువక పోయినా ఫంక్షన్ కు మేం వచ్చేస్తాం అన్నాం . కిమ్ వస్తున్నాడు అంటే బొట్టు పెట్టి పిలవాలా ? వాలిపోతాం . ఆంధ్రా కిమ్ వస్తున్నాడు అంటే రాకుండా ఎలా ఉంటాం . ****** అందరూ పంక్షన్ జరిగే చోట ఉంటే రిపోర్టర్ లం మాత్రం గేటు దగ్గర నిలబడి శంకర పిచ్చయ్య కోసం చూస్తున్నాం . అంతా పంక్షన్ కు వచ్చిన వాళ్ళే ఒక్కరిలోనూ శంకర పిచ్చయ్య ముఖం కనిపించలేదు . ఒక్కొక్కరిని చూస్తూ ఉండగా .. బక్క పలుచగా , పొట్టిగా కనిపించిన ఓ వ్యక్తిని చూస్తూ ఇతను శంకర పిచ్చయ్య కాదు పిచ్చయ్య అని జోకులేసుకున్నాం . ఎంత ఎదురు చూస్తున్నా శంకర పిచ్చయ్య కనిపించలేదు . మా పరిస్థితి గమనించి నళినీకాంత్ బయటకు వచ్చి , శంకర పిచ్చయ్య ఎప్పుడో వచ్చాడు మీరు లోపలి రండి అని లోపలి తీసుకు వెళ్లి శంకర పిచ్చయ్యను పరిచయం చేస్తే ఆశ్చర్య పోవలసి వచ్చింది . తెలుగు పత్రికల్లో శంకర పిచ్చయ్య ఆకృత్యాలు పేజీలకు పేజీలు రోజూ వచ్చేవి . పాతాళా భైరవి సినిమాలో ఎన్టీఆర్ ను మట్టుపెట్టడానికి వచ్చిన మాయల మాంత్రికుడు యస్వీఆర్ లా ఉంటాడు అనుకుంటే కనీసం డిటెక్టివ్ సినిమాల్లో విలన్ ఆర్ నాగేశ్వర రావులా కూడా లేడు . లోనికి వెళ్తున్నప్పుడు శంకర పిచ్చయ్య కాదు ఉట్టి పిచ్చయ్య అని మేం జోకులు వేసుకుని నవ్విన వ్యక్తే శంకర పిచ్చయ్య . అనుమానం తిరక రోజూ పత్రికల్లో అంతంత పెద్ద వార్తల్లో విలన్ మీరేనా ? నిజంగా మీరే శంకర పిచ్చయ్య నా అంటే ఔను అని చెప్పి . తన గురించి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు , లెక్చరర్ గా పని చేస్తున్నాను ఏవేవో రాస్తున్నారు . మీరు నా జీవితం తో ఎందుకు ఆడుకుంటున్నారు ? ఎందుకు రాస్తున్నారు అని అవే పత్రికల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నాను , పట్టించుకోవడం లేదు అలానే రాస్తున్నారు అని వాపోయాడు . శంకర పిచ్చయ్య వచ్చిన ఆ పంక్షన్ కు ఆనాటి వరంగల్ టీడీపీ హేమా హేమీలు కడియం శ్రీ హరి , ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు మిగిలిన నేతలు వచ్చారు . *** లక్ష్మీ పార్వతి పెంపుడు పిల్లిని కూడా డైనోసర్ అని తెలుగు పత్రికలు రాస్తున్న రోజులు అవి . ముచ్చటగా మూడు పత్రికలు ఈ వార్తలు పంచుకొని వడ్డించే వారు . సాధారణం గా పత్రికల మధ్య పోటీ ఉంటుంది . ఎన్టీఆర్ ను దించేసి కుట్రలకు సంబంధించిన ఈ వార్తల్లో పోటీ లేకుండా పరస్పర సహకారం తో పని చేసేవారు . అప్పటి వరకు లక్ష్మీ పార్వతి , శంకర పిచ్చయ్యల గురించి పుంఖాను పుంఖాలుగా రాసిన వారు ఎన్టీఆర్ ను దించేసి తరువాత శంకర పిచ్చయ్య అనే ఓ పాత్ర ఉండేది అనే విషయం కూడా మరిచిపోయారు . ఎన్టీఆర్ మరణించిన తరువాత ఓ రోజు అంతకు ముందు ఉదయం లో పని చేసిన బసవేశ్వర రావు అనే ఓ జర్నలిస్ట్ మళ్ళీ శంకర పిచ్చయ్య వస్తారట అందరినీ కలిపి ఏదో చేస్తారట పెద్ద ప్లాన్ తో ఉన్నాడు అంటూ కథ చెబుతుంటే మధ్యలోనే ఆపేసి ఎన్టీఆర్ ను పైకి పంపిన తరువాత కూడా శంకర పిచ్చయ్యనా ? ఎన్టీఆర్ బాబును ఏమీ చేయలేక కుమిలి పోయి , పైకి పోయారు , ఇక పిచ్చయ్యలు ఏం చేస్తారు అన్నాను . ***\ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు అట తెలుగు తనాన్ని ప్రపంచ వ్యాప్తం గా తీసుకువెళ్లిన అంటూ ఎన్ టి వి లో ఏదో చెబుతుంటే గుర్తుకు వచ్చింది . ఎన్టీఆర్ మరణించిన కొద్ది గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో అశోక గజపతి రాజు మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ మరణం పై లక్ష్మీ పార్వతి పై అనుమానం ఉందని అన్నారు . ఆ తరువాత కొంత కాలానికి ఎన్టీఆర్ మరణం పై విచారణ జరిపించాలనే డిమాండ్ ను బాబు పట్టించుకోనందుకు నందమూరి హరి కృష్ణ మంత్రి పదవికి రాజీనామా చేశారు . తెలుగు తనాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిన వ్యక్తి మరణం మిస్టరీ తెలుసుకోవాలి అనే హక్కు తెలుగు వారికి లేదా ? తన తండ్రి మరణం వెనుక కుట్ర తెలుసుకునే హక్కు కుమారుడికి లేదా ? శంకర పిచ్చయ్య మరణించారు అని వినిపించింది . ఈ రోజుల్లా అన్ని పార్టీలకు అప్పుడు మీడియా లేదు . ఒకే పార్టీ కోసం మీడియా పని చేసింది . దాంతో ఎన్టీఆర్ లాంటి వారే ఏమీ చేయలేక కుమిలి పోయి చనిపోయారు . ఇప్పుడంటే మృతుడే హంతకుడేమో అనే అనుమానం కలిగేట్టుగా ఒక్కో పత్రికలో ఒక్కో రకం వార్తలు .

నన్నప నేని రాజకుమారి భయపడిన వేళ ....ఓ జ్ఞాపకం 4

83 తెలుగుదేశం బ్యాచ్ మహిళా నాయకులు రాజకీయాల్లో ఓ సంచలనం ... ఈ బ్యాచ్ టీడీపీ ద్వారా వచ్చినా అన్ని పార్టీల్లో ఓ వెలుగు వెలిగారు .ఆంధ్ర లోనే కాదు .... తెలంగాణ లోనూ ..మూలాలు ఆంధ్ర ఐనా కాట్రగడ్డ ప్రసూన , గడ్డం రుద్రమ దేవి వంటి వారు తెలంగాణాలో ఆ కాలం లో వెలిగి పోయారు .. భయం అనేది నా డిక్షనరీ లోనే లేదు అని బాలకృష్ణ లాంటి వారు సినిమా డైలాగులకు పరిమితం కానీ 83 బ్యాచ్ టీడీపీ మహిళా నేతలు ఆచరణలో చూపారు ... వీరు టీడీపీ , కాంగ్రెస్ , ప్రజాస్వామ్య తెలుగు దేశం ఎక్కడున్నా పాలలో నీళ్లలా కలిసి పోయారు . ఆడపడుచు ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగినంత ఈజీగా కాంగ్రెస్ టీడీపీ రెండూ తమ పుట్టిల్లు లే అని స్వతంత్రంగా తిరిగే వారు .కాంగ్రెస్ లో ఉంటే టీడీపీ లో ఉంటే కాంగ్రెస్ అధికార కక్ష లోకి పాద రసం లా దూసుకెళ్లే వారు ... బాబు సీఎం గా ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో బాబు తన ఛాంబర్ వద్ద ఉన్నారు ... ఎప్పటి మాదిరిగానే బీట్ రిపోర్టర్ లు లోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆపేసి ఎవరినీ అనుమతి ఇవ్వడం లేదని సెక్యూరిటీ ఆఫీసర్ ఆపేశారు ... కొద్ది సేపటి తరువాత కొమ్మినేని , రాధాకృష్ణ వస్తే వారినీ ఆపేసి నాకు ఎవరైనా ఒకటే అన్నట్టు బడుగు జర్నలిస్ట్ ల వైపు సెక్యూరిటీ అధికారి విజయ గర్వం తో చూశారు ... సాయికుమార్ పొలీస్ డైలాగు అంత స్ట్రిక్ట్ గా కనిపించాడు ఆ అధికారి ... అందరం ఛాంబర్ బైటే నిలబడ్డాం ... ఇంత లోనే కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న రాజకుమారి దూసుకొచ్చి అక్కడో అధికారి ఉన్నాడు అనే ద్యాస కూడా లేకుండా పక్కకు తోసి ఛాంబర్ లోకి వెళ్లారు .. అధికారి మమ్ములను చూడనట్టే ఎటో చూడసాగాడు ... లోపలి ఎంత స్పీడ్ గా వెళ్లిందో అంతే స్పీడ్ గా ఆమె బయటకు వచ్చి , బయట పేపర్లతో ఏదో పని కోసం వచ్చిన వ్యక్తి చేయి పట్టుకొని లోనికి లాక్కెళ్ళింది ... అధికారి జర్నలిస్ట్ లను చూసి ఓ వెర్రినవ్వు నవ్వాడు ... ఆమె చదివింది ఐదో ఆరో తరగతి కానీ మనకెవరికీ లేని ధైర్యం ఉంది . ఆమె దూసుకెళ్లినట్టు మనం ఎవరం దూసుకెళ్లలేం లేం అని నేను అంటే ఓ నేత ఆమె చదువుకోలేదు కాబట్టే అలా దూసుకెళ్ల గలిగింది ... అదే చదువు కొంటే మనలా ఇలా బయట ఉండేది అన్నారు ... **** ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి ఆమె టీడీపీ లో చేరారు . 2004లో లో కాంగ్రెస్ అధికారం లోకి రాగానే టీడీపీ అధికార ప్రతినిధిగా రోజూ తిట్ల దండకం ... కాంగ్రెస్ అభిమానులకు అధికారం లోకి వచ్చాము అనే ఆనందం కూడా లేకుండా పోయింది ... Ysr కు సన్నిహితం గా ఉండే రవి చంద్ బాగా ఆలోచించి మందు కనిపెట్టాడు ...అప్పటికప్పుడు గంగా భవాని ని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా నియమించారు ... ఇద్దరూ 83 టీడీపీ బ్యాచ్ మేట్స్ ... క్లాస్ మేట్స్ , బ్యాచ్ మేట్స్ మాత్రమే కాకుండా ఒకే స్కూల్ లో రాజకీయ పాఠాలు నేర్చుకున్న వారు .... బంజారాహిల్స్ లో ఉన్న నన్నప నేని రాజకుమారి ఇంటి పైకి గంగా భవాని తన మహిళా అనుచరులతో కలిసి వెళ్లి దాడి చేసింది ... దమ్ముంటే బయటకు రా తేల్చుకుందాం అని గంగా భవాని తొడగొట్టి సవాల్ చేశారు ... అప్పటి వరకు సవాల్ చేయడం అంటే ఎవరి పార్టీ కార్యాలయం లో వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆవేశం తెచ్చుకొని తిట్టడమే , కానీ ఇలా ఓ మహిళా నేత ఇంటికి మరో మహిళా నేత అనుచరులతో వెళ్లి దాడి చేయడం అదే మొదటి సారి కావడం తో నన్నపనేని భయపడి పోయారు ... పెదరాయుడు సినిమాలో పెదరాయుడు తో అతని ఉద్యోగి ఏదైతే చూడకూడదు అనుకున్నానో అది చూశాను అయ్యగారు అని డైలాగు పైకి చెప్పక పోయినా మీడియాగా మనసులోనే ఆ డైలాగు చెప్పుకున్నాం ... కొద్ది సేపటి తరువాత పోలీసులు వచ్చి పరిస్థితి అదుపులోకి తెచ్చారు . నన్నపనేని భయపడింది అదే తొలిసారి . ఒక మహిళా నాయకురాలిపై అనుచరులతో మరో మహిళా నేత దాడి చేయడం అదే మొదటి సారి అదే చివరి సారి ...వజ్రాన్ని వజ్రం తోనే కోయాలి అన్నట్టు ....రవి చంద్ నన్నప నేని అనే వజ్రాన్ని గంగా భవాని అనే వజ్రం తో ....... బురదలో ఫ్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసినా , పోలీసులను తల్లి బిడ్డ చెంపదెబ్బలు కొట్టినా బోలెడు ప్రచారం లభిస్తుంది మీడియా లో ...పాత సిలబస్ తో రాజకీయం చేసే వారు ఇలాంటి వాటికి మురిసి పోతారేమో కానీ.... ప్రజలు మాత్రం ఈ రాజకీయాలను ఇష్టపడడం లేదు .. రాజకుమారి , గంగా భవానిల రాజకీయానికి కాలం చెల్లింది ... వారికి ఎప్పుడో తెలిసింది . మిగిలిన వారికి ఎన్నికల తరువాత తెలుస్తుంది ... *** ఓసారి రాజకుమారి నన్నప నేని నవరత్నాలు అని తొమ్మిది పుస్తకాలు రాసి ఫైనల్ చేసే ముందు చూడామని ఇస్తే కొద్ది సేపు చూసి వెనుక వైపు కవర్ పేజీలో పెద్ద తప్పు ఉంది అన్నాను ... ఏదీ ఏదీ అని అడిగితే ఆమె పుట్టిన తేదీ చూపా అప్పుడు ఆమెకు 55 .... బుక్ లో 55 అని ఉంది ... మీకు 40 ఏ కదా అంటే ఎంత మురిసి పోయారో .... ఇంకో ఆరు నెలల పాటు సోర్స్ గా ఉండేందుకు ఈ డోస్ పని చేస్తుంది అనుకున్నాను ...

27, ఏప్రిల్ 2023, గురువారం

శ్రీకృష్ణ కమిటీ నివేదికతో TDLP లో సంబరాలు

నా జోస్యమే నిజమైంది... ఓ జ్ఞాపకం 3 తెలంగాణ అంశం పై వేసిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక ఇచ్చింది . అసెంబ్లీ లోని TDLP కార్యాలయం లో ఉన్నాం ... కమిటీ నివేదికలో తొలి సిఫారసు టీవీ స్క్రీన్ పై కనిపించగానే TDLP లో ఒక్క సారిగా సంబరాలు మిన్నంటాయి . తొలి సిఫారసు రాష్ట్రాన్ని సమైక్యాంధ్ర గా అలానే ఉంచాలి అని ... Tdlp లో సిబ్బంది నాయకులు ఒకరినొకరు అభినందించుకున్నారు ... అక్కడ తెలంగాణ సిబ్బంది ఎలాగూ లేరు నాయకులు కూడా వాస్తవ పరిస్థితి యెరిగి ఉండేవారు ... అంతా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న వారే ... శ్రీకృష్ణ కమిటీ తొలి సిఫారసు సమైక్యాంధ్ర అని రావడం తో వారి ఆనందం సహజమే ... తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజి , రాయల తెలంగాణ , ఇలా వరుసగా ఐదు సిఫారసుల తరువాత ,చిట్ట చివరగా ఆరవ అంశం తెలంగాణ ఏర్పాటు ... మొదటి అంశానికే ప్రాధాన్యత ఉంటుంది కానీ ఆరవ అంశం వరకు ఎందుకు వస్తారని Tdlp లోనే కాకుండా అసెంబ్లీ ఆవరణలో ఉన్న అన్ని పార్టీల శాసన సభ్యుల కార్యాలయాల్లో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న వారు సంబరం తో ఒకరినొకరు కౌగిలించు కొని అభినందించు కున్నారు ... Tdlp లో ఇంకాస్త ఎక్కువ ఆనందం ... పానకం లో పుడకలా వారి ఆనందానికి మనమెందుకు అడ్డు అని నవ్వుకుంటూ tdlp లో మెట్లు దిగి కిందికి వస్తుంటే టీడీపీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్ర శేఖర్ రెడ్డి కనిపించారు . నిఖార్సైన బాబు అభిమాని ... రాయడానికి కాక పోయినా వివిధ అంశాల పై నిర్మొహమాటం గా చర్చించు కునే వాళ్ళం .. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక పై నువ్వే మనుకుంటున్నావ్ అని రావుల చర్చ మొదలు పెట్టారు .. వాళ్ళ ఆనందాన్ని ఎందుకు కాదు అనాలి అని అక్కడ మాట్లాడ లేదు కానీ కమిటీ నివేదిక తో వారు సంబర పడే విషయం ఏమీ లేదు ..నివేదిక గురించి ఒక్క మాట లో చెప్పాలి అంటే ? సోనియా గాంధీ గారు తెలంగాణ పై మీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోండి ... అని కమిటీ చెప్పింది అంతే అన్నాను ... రావుల శేఖర్ రెడ్డి tdlp లో ఆనందంతో ఊగి పోతున్న వారిని చూస్తూ .... నీ అభిప్రాయం కరెక్ట్ ఎంతైనా సీనియర్ సీనియరే అన్నారు .2014 ఎన్నికలకు ముందు తెలంగాణ వస్తుంది ... అప్పటి వరకు కాల యాపన కోసం ఈ కమిటీ లు అని చెప్పాను . అదే జరిగింది . తెలంగాణ రావాలి అనేది తెలంగాణ వారి కోరిక , రావద్దు అనేది వ్యతిరేకించే వారి కోరిక ... ఇందులో తప్పేమీ లేదు ... కోరిక కు , అంచనాకు తేడా గ్రహిస్తే అంచనా తప్పదు ... జర్నలిస్ట్ కు కోరిక నిజం కాక పోవచ్చు కానీ , అంచనా ను కోరిక డామినేట్ చేయకూడదు ... తెలంగాణ ఇచ్చింది , తెచ్చింది కాంగ్రెస్ కదా ? కాంగ్రెస్ ను ఆదరించక పోవడం అన్యాయం కదా ? అని కొందరు వాదిస్తుంటారు ... తెలంగాణ కోసం ఉద్యమించింది తెలంగాణ ప్రజలు , నాయకత్వం వహించింది కెసిఆర్ , ఇచ్చింది సోనియా గాంధీ గారు . ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేక పోయినా తెలంగాణ రాక పోతుండే .. అంటే సోనియా ఇచ్చింది కదా ? అంటే కాంగ్రెస్ ఇచ్చింది కదా ? కాదు సోనియా గాంధీ ఇచ్చారు . సోనియా గాంధీ ఒక్కరే కాంగ్రెస్ కాదు ..ఇవ్వ వద్దు అని అడ్డుకున్న ysr , కిరణ్ కుమార్ రెడ్డి , లగడ పాటి నాయకత్వం లో అడ్డుకున్న ఆంధ్ర కాంగ్రెస్నాయకులు , ysr నాయకత్వం లో తెలంగాణ వద్దన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు .... సమైక్యాంధ్ర కోసం జగన్ పిలుపు మేరకు శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన కొండా సురేఖ , తెలంగాణ ప్రజలు సకల జనుల సమ్మె లో ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి కి మద్దతుగా పెద్ద సంఖ్యలో ప్రజలను హైదరాబాద్ తరలించిన డీకే అరుణ అందరు హేమా హేమీలైన కాంగ్రెస్ నాయకులే ... వారి అడ్డగింపు మహోద్యమంను జనం మరిచి పోలేదు ... అదే విధంగా సోనియా గాంధీ సహాయాన్ని మరిచి పోరు ... చాలా మంది బలవంతులు అడ్డుకున్నా పొన్నం ప్రభాకర్ , మధుయాష్కీ గౌడ్ లాంటి ఎంతో మంది పార్టీలోని పెత్తందార్లను వ్యతిరేకించి కూడా తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారు . అందుకే కాంగ్రెస్ ను రెండో స్థానం లో నిలిపారు .. తెరాస , కాంగ్రెస్ , టీడీపీ , బీజేపీ , ysr కాంగ్రెస్ , జనసేన ఏ పార్టీని ఐనా ఓటర్లు గెలిపించ వచ్చు . ఓటర్లు తప్పు చేయరు ... ఆ సమయానికి తగిన నిర్ణయం తీసుకుంటారు .. అంటే సోనియా గాంధీ , కాంగ్రెస్ వేరు అంటావు ? కాంగ్రెస్ లో సోనియా గాంధీ ఒక్కరే కాదు చాలా మంది ఉన్నారు ...

24, ఏప్రిల్ 2023, సోమవారం

 నేతలందరి ఇంటి పేరు సీఎం .. సీఎం 

ఓ డిప్యూటీ సీఎం కథ 
.
1995-96 లో ఓ రోజు అసెంబ్లీ క్యాంటిన్ లో టీడీపీ mla మల్యాల రాజయ్య నేను టిఫిన్ చేస్తున్నాం ..
ఓ mla వచ్చి రాజయ్యను హాయ్ డిప్యూటీ సీఎం బాగున్నావా ? అని భుజం తట్టి వెళ్లి పోయారు ... ఒకరు కాదు ఇద్దరు కాదు అప్పటికి కనీసం పది మంది mla లు రాజయ్యను డిప్యూటీ సీఎం అని నవ్వి వెళ్లి పోతున్నారు ...
****
సీఎం .. సీఎం అనే నినాదాలను ఆపమని పవన్ ఎంత చెప్పినా అభిమానులు వినరు ... ఇక ఈటెల , బండి , ప్రవీణ్ కుమార్ ఎవరి ఉపన్యాసం ఐనా సీఎం సీఎం అంటూ అభిమానులు ఇచ్చే నినాదాలతోనే మొదలవుతుంది .
కేఏ పాల్ , షర్మిల మాత్రం వీరికన్నా భిన్నంగా కాబోయే సీఎం నేనే అని చెబుతుంటారు ... ఇప్పుడు దాదాపు అందరు నాయకులకు సీఎం సీఎం అనేది ఇంటి పేరుగా మారిపాయింది ...95 లో అలా కాదు ..
***
మల్యాల రాజయ్యను అందరూ డిప్యూటీ సీఎం అంటుంటే ఆయనతో ఉన్న చనువు తో నేను ఏంటీ అందరూ నిన్ను అలా బనాయిస్తున్నారు ( వెటకారం చేస్తున్నారు ) అని అడిగితే .... ఆయన ఒక్క సారిగా సీరియస్ ముఖం పెట్టి ... ఇందులో బనాయించడం ఏముంది నేను డిప్యూటీ సీఎం అవుతాను అన్నారు .
మల్యాల రాజయ్య మేజిస్ట్రేట్ గా చేసే వారు . టీడీపీ లో చేరి ఆందోల్ నుంచి mla అయ్యారు . బడ్జెట్ లీక్ అని 88 లో ఎన్టీఆర్ 32 మంది మంత్రులతో రాజీనామా చేయించి కొత్తవారితో మంత్రివర్గం ఏర్పాటు చేశారు .. అలా రాజయ్యకు ఆర్థక శాఖ మంత్రి పదవి లభించింది ... Mla గా ఆయన , రిపోర్టర్ గా నేను సికింద్రాబాద్ నుంచి సంగారెడ్డి కి బస్సులో వెళ్లే వాళ్ళం .. పరిచయం బాగానే ఉంది ..
డిప్యూటీ సీఎం అనే పిలుపును ఆయన అంత సీరియస్ గా తీసుకోవడం వింతగా అనిపించింది ...ఇంతకూ మీరు డిప్యూటీ సీఎం అవుతున్నారని ఎవరు చెప్పారు ? బాబు చెప్పారా ? అని అడిగితే వంద కాపీ లు ముద్రించే ఓ చిన్న పత్రికలో జగన్మోహన్ అనే జర్నలిస్ట్ రాశాడు ... ఇలాంటి పత్రికలు మార్కెట్ లో కనిపించవు ... వంద కాపీ లు ముద్రించి అవసరం అయిన చోట ఉచితంగా పంపిణీ చేస్తారు ...అలా టీడీపీ mla లకు పంచారు ....
మరీ ఎక్కువగా ఆశపడుతున్నావు , డిప్యూటీ సీఎం ఇవ్వరు అని కారణాలు చాలా వివరంగా చెప్పాను ...
అంతా విన్నాక ఆయన నువ్వు ఎన్నయినా చెప్పు జగన్ మోహన్ రాసింది నచ్చింది ... ఐనా కాక పోయినా డిప్యూటీ సీఎం అనే పలకరింపు హాయిగా ఉందని సంతోషం గా చెప్పాడు ...
చివరకు అతను మంత్రి కూడా కాలేదు ..
నిజం ఎవడికి కావాలి ... చెవులకు ఇంపుగా ఉండే మాటలు కావాలి కానీ .....- 

23, ఏప్రిల్ 2023, ఆదివారం

దాసరి పార్టీ పుట్టక ముందే అలా గిట్టి పోయింది


ఓ జ్ఞాపకం ....
ఉదయం నాలుగు గంటలు కావస్తుంది ... ల్యాండ్ లైన్ ఫోన్ రింగ్ కావడం తో ఈ టైంలో ఎవరు ఫోన్ చేసి ఉంటారు ? ఎందుకు చేసి ఉంటారు అని గాబరాగా ఫోన్ ఎత్తితే ... అటు నుంచి గొనె ప్రకాష్ ... మిమ్ములను నమ్మి వార్త చెబితే అలానేనా రాసేది .. సోర్స్ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి .. ఇలా రాస్తే ఇంకోసారి ఎలా చెబుతాం . అంటూ అతను మాట్లాడుతూ పోతూనే ఉన్నాడు ... నాకు షాక్ .. అతని మాటలకు కాదు .. తెల్లవారు జామున నాలుగు గంటలకు అతను ఆంధ్రభూమి చదవడం , వార్త పై స్పందించడం .... అతను అడిగిన వాటిని పట్టించు కోకుండా ఆశ్చర్యంగా అదేంటి ఇంత పొద్దున మీకు పేపర్ రావడం , చదవడం అయిపోయిందా ? అని అడిగాను ...
****
దాదాపు 1997-98 ప్రాంతం ... 
ఎన్టీఆర్ కు ముందు ఆ సామాజిక వర్గం ప్రముఖులు కొందరు మనకంటూ ఓ పార్టీ ఉండాలి అని తీవ్రంగా ప్రయత్నించినట్టే ... చిరంజీవి కన్నా ముందు ఆ సామాజిక వర్గం నుంచి ప్రయత్నాలు జరిగాయి .. అలా దాసరి నారాయణ రావు ఓ పార్టీ పెట్టాలి అనుకున్నారు ... అంకెలు , చరిత్ర తో మాట్లాడే గొనె ప్రకాష్ దాసరి వద్ద చేరారు ... ఉమ్మడి రాష్ట్రం లో కాపు ఓట్లు ఎన్ని ? జిల్లా , నియోజక వర్గమే కాదు .. గ్రామాల వారీగా కూడా కులాలు , ఓట్ల లెక్కలు , చరిత్ర ఆయన నాలుక మీద ఉంటుంది .. మీరు పార్టీ పెట్టడమే ఆలస్యం సీట్లు వచ్చి పడిపోతాయి అని దాసరికి లెక్కలు చెప్పారు . ఆ లెక్కలకు ఎవరైనా ఆశ్చర్య పోవలసిందే ...
బసంత్ టాకీస్ లో దాసరి అభిమాన సంఘాల సమావేశం .. దాసరి పుట్టిన రోజు నాటికి కొత్త పార్టీ అన్నట్టుగా ప్రచారం .. పార్టీ ఎలా పెట్టాలి , అధికారం లోకి వచ్చాక ఏం చేయాలి అభిమాన సంఘాల విస్తృత చర్చ .... ఈ మీటింగ్ కన్నా ముందే పార్టీ పెడతారు అనే వార్తలు ...
అట్టహాసంగా మీటింగ్ జరిగినా పార్టీ పెట్టడానికి దాసరి జంకుతున్నారు అని చూచాయగా వినిపించింది ..
ఆ సమాచారం కోసం ప్రయత్నిస్తుంటే గొనె ప్రకాష్ కలిసి మీకో వార్త చెబుతాను ...అని ... పురజనుల కోరికపై దాసరి పార్టీ ఏర్పాటును వాయిదా అని రాయాలి అని చెప్పారు ..
***
పార్టీ ఏర్పాటు వాయిదా అని రాయాలి అని నేను చెబితే , పార్టీ ఏర్పాటు చేయడం లేదు అని రాశారు . మీరు సోర్స్ ను దూరం చేసుకున్నారు . అంటూ గొనె చెబుతూనే పోతున్నారు . అది సరే నాలుగు గంటలకు ఆంధ్రభూమి పాఠకుల వద్దకు వస్తుందా ? ఎలా సాధ్యం అయింది అని అడిగాను .. గొనె అవకాశం ఉంటే ప్రింటింగ్ అయి పత్రిక బయటకు రాగానే చదువుతారు అని తెలిసింది .. ప్రింటింగ్ వద్దకు వెళ్లే అవకాశం లేకపోతే, తెల్లవారు జామునే పేపర్ డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్లి చదువుతారు .
దాసరి పార్టీ వాయిదా ఎప్పటికీ కార్యరూపం దాల్చ లేదు ... తరువాత బాబు వద్ద ఓ సమావేశం లో మీరు మీడియాను కాదు మా సినిమా వారిని నమ్ముకోండి . బోలెడు ప్రచారం కల్పిస్తాం అని సలహా ఇచ్చారు . అటుతరువాత కాంగ్రెస్ లో చేరి కేంద్ర మంత్రి అయ్యారు ..
****
సరే మరి సోర్స్ ను పోగొట్టుకున్నావు అని గొనె అడిగిన దానికి ఏం సమాధానం చెప్పారు ? 
దాసరి పార్టీ పెడితే మీరు సోర్స్ అవుతారు కానీ ... అసలు పార్టీనే పెట్టనప్పుడు మీరు సోర్స్ ఏమిటీ అని నవ్వాను ....