12, అక్టోబర్ 2014, ఆదివారం

అందాల హీరోను జీరోగా మార్చిన వ్యసనం


ధనం -మూలం 14


‘‘విలాసవంతమైన కారులో తిరిగిన హరనాథ్ చివరి దశలో బస్సు కోసం బస్టాప్‌లో వేచి ఉండడాన్ని చూశాను. నాకు జీవితం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు‘‘  అని ఒక సందర్భంలో హాస్యనటుడు అలీ హరనాథ్ జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. బాలనటునిగా వచ్చి హీరోగా ఎదిగిన అలీకే కాదు ఈ తరం నటులు ఎంతో మందిపై అలనాటి నటుల అవసాన దశ తీవ్రమైన ప్రభావం చూపించింది.


ఆచ్చం సినిమా హీరోలా ఉన్నాడు అనే మాట అచ్చంగా సరిపోయే నటుడు హరనాథ్. హీరో అంటే అందంగా ఉంటాడు అనే మాటకు సాక్షం హరనాథ్.
అంత అందమైన హీరోతో జతగా నటించేందుకు ఆనాటి హీరోయిన్లు ఆసక్తి చూపించే వారు. ఒక్క విషపు చుక్క మొత్తం పాలను పనికిరాకుండా చేసినట్టు ఒక్క వ్యసనం చాలు ఎంత గొప్ప హీరో జీవితాన్నయినా కాల్చి బూడిద చేసేందుకు.
***
చేసే వృత్తిని ప్రేమించాలి. వృత్తిని ప్రేమించాల్సిన చోట వ్యసనాన్ని ప్రేమిస్తే ఏమవుతుంది. తొలి తెలుగు అందాల హీరో హరనాథ్ జీవితం అవుతుంది.
వృత్తిని ప్రేమించాలని మహాత్మాగాంధీ ఏనాడో చెప్పారు. మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల దేశంలో పర్యటించినప్పుడు ఢిల్లీలో యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఇదే మాట చెప్పారు. వృత్తిని ప్రేమించి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారి జీవితాలు ఇతరులకు ప్రేరణ కలిగిస్తాయి. వ్యసనాన్ని ప్రేమించి జీవితాన్ని విషాదంగా మార్చుకున్న వారి జీవితాలు ఇతరులకు జీవితం పట్ల జాగ్రత్తలు చెబుతాయి.
***
గుండమ్మ కథ సినిమాను చూడని తెలుగు వారు ఉండరేమో! ఇందులో ఎన్టీఆర్‌తో పాటు హరనాథ్ నటించారు. కావాలంటే ఈ సినిమా మరో సారి చూడండి హరనాథ్ ఎన్టీఆర్ కన్నా పొడుగ్గా ఉంటాడు. అందంగా కనిపిస్తాడు. కనిపించడమే కాదు నిజంగా అందగాడు. ఎంత అందగాడు అంటే హరనాథ్‌ను రోడ్డు మీద చూసి ఒక నిర్మాత హీరోగా అవకాశం ఇచ్చాడు. సినిమాల్లో నటించాలని ఉన్నా దాని కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. మద్రాస్ నగరంలో ఈ అందగాడ్ని చూసి సినిమాల్లో నటిస్తావా? అని అడిగి మరీ గుత్తా రామినీడు తన సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చాడు. మా ఇంటి మహాలక్ష్మి సినిమాలో హీరోగా హరనాథ్ సినిమా జీవితం ప్రారంభం అయింది. అతనికి సినిమాలో నటించడం తెలుసు కానీ విపరీతమైన పోటీ ఉండే సినిమా రంగంలో తన చుట్టూ పోటీదారులే ఉంటారని, వారితో కూడా నటించాల్సి ఉంటుందనే విషయం గ్రహించలేదు. కొందరు జాగ్రత్తలు చెప్పినా అప్పటికే ఇతరుల మాటలు వినలేనంత మత్తులో పడిపోయాడు. పోటీ రాజకీయం ఒక అందమైన నటుని జీవితానికి విషాద ముగింపు పలికింది.
***
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటారు అంటే అచ్చం ఎన్టీఆర్‌లా ఉంటారు అనేంత గట్టి నమ్మకం తెలుగు ప్రేక్షకులకు. మరి అలాంటి ఎన్టీఆర్‌కు సైతం హరనాథ్‌లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కనిపించాడు. స్వయంగా ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా సీతారామ కళ్యాణంలో శ్రీరాముడి పాత్ర కోసం ఎవరా? ఎవరా? అని తెగ ఆలోచించిన తరువాత హరనాథ్ వారి ముందు శ్రీరామునిగా ప్రత్యక్షం అయ్యారు. ఎన్టీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకొని శ్రీరామునిగా హరనాథ్ మెప్పించారు. ఒక్క శ్రీరాముడే కాదు శ్రీకృష్ణుడి వేషంలో ఎన్టీఆర్‌కు తిరుగులేదు. కానీ భీష్మలో స్వయంగా ఎన్టీఆర్ సూచన మేరకే హరనాథ్‌కు శ్రీకృష్ణుడిగా నటించే అవకాశం లభించింది.
***
‘‘సినిమా రంగం తీవ్రమైన పోటీ ఉండే రంగం. నీ పోటీ వల్ల ఎవరికైతే ఇబ్బంది కలుగుతుందో వారు నిన్ను దెబ్బతీయాలని ప్రయత్నించవచ్చు. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండడం అనేది ముఖ్యం ’’ అంటూ ఓ సందర్భంలో అలనాటి హీరో రంగనాథ్ సినిమా రాజకీయాల గురించి చెప్పుకొచ్చారు. ఒక్క సినిమా అనే కాదు ఏ రంగంలోనైనా పోటీ ఉంటుంది. పోటీదారుడు దెబ్బతీయడానికి ఎంతకైనా తెగిస్తాడు. జీవితంలో ఎదగాలనుకునే వారు ఏది ముఖ్యమో ఆలోచించుకోవాలి. ఎవరి కర్మకు వాళ్లే బాధ్యులు.
హరనాథ్‌పై కూడా ఇలా ఏదో కుట్ర జరిగిందనే ప్రచారం సినిమా రంగంలో బలంగా ఉంది. జరిగితే జరిగి ఉండవచ్చు కూడా... కానీ తన పరిస్థితికి తానే బాధ్యుడు అవుతాడు. అందమైన హరనాథ్ జీవితం అలా ముగియడానికి అతనే కారణం అవుతారు తప్ప మరొకరు కాదు.
***
అందమైన హీరోయిన్‌ను తెరపై చూస్తేనే ప్రేక్షకుడు సమ్మోహితుడు అవుతాడు. అది తెర అని తాను చూసేది బొమ్మ అని తెలుసు అయినా ఆ హీరోయిన్ అందం అంతగా స్పందింపజేస్తుంది. అలాంటిది అంత అందగత్తె పక్కన నటించే హీరోలు ఎలాంటి స్పందన లేకుండా ఉండేవారు అని వారి వారి అభిమానులు గొప్పగా చెప్పుకుంటారు. ఈ ప్రచారంలోని నిజా నిజాలు దేవుడికే తెలియాలి.
ఆయా వర్గీయుల ప్రచారం ఎలా ఉన్నా గ్లామర్ ప్రపంచం అయినా సినిమారంగంలో వ్యవసనాలు లేని వారు చాలా అరుదు. అయితే జీవితంలో దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో లెక్కలు తెలిసిన వారు జాగ్రత్తగా ఉన్నారు. ఆ లెక్కలు తెలియని వారు బొక్క బోర్లా పడ్డారు.
అంత అందమైన రూపం ఉండి ఏం లాభం. హరనాథ్‌కు కొద్ది పాటి ముందు చూపు లేక జీవితంలో దెబ్బతిన్నారు. ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్ తరువాత స్థానం హరనాథ్‌దే అని స్థిరపడిపోయింది. సాధారణ అభిమానులే కాదు హీరోయిన్లు కూడా హరనాథ్‌కు అభిమానులుగా మారిపోయారు.


ఈ దశలోనే ఎస్‌వి రంగారావు హరనాథ్‌ల స్నేహం బాగా పెరిగిపోయిందని సినిమా పరిశ్రమలో ప్రచారం.
ఇద్దరూ మహానటులే. నటనలో పోటీ పడితే బాగుండేది కానీ వ్యసనంలో పోటీ పడ్డారు. సినిమా షూటింగ్‌కు వస్తారో? రారో తెలియదు. వస్తే మద్యం మత్తులో వస్తారో, మామూలుగా వస్తారో తెలియదు. అవకాశాలు ఒక్కొక్కటిగా జారిపోయాయి. హరనాథ్ తరువాత వచ్చిన కృష్ణ, శోభన్‌బాబు లాంటి వారు అవకాశాలను అందిపుచ్చుకుని తమ స్థానాలను సుస్థిరపరుచుకుంటున్న సమయంలో హరనాథ్ మాత్రం మద్యం మత్తులోనే మునిగిపోయారు.

1959లో మా ఇంటి మహాలక్ష్మి సినిమాలో హీరోగా చిత్ర రంగ ప్రవేశం చేసిన హరనాథ్ చివరకు బతికేందుకు ఏదో ఒక సినిమా అనే దశకు చేరుకుని 84లో చిరంజీవి హీరోగా వచ్చిన నాగు సినిమాలో అసలు డైలాగులే లేని పాత్రలో నటించారు. అదే ఆయన చివరి సినిమా. కలిసి ఉంటే కలదు సుఖం, భీష్మ, గుండమ్మ కథ, పెంపుడు కూతురు, మురళీ కృష్ణ, అమర శిల్పి జక్కన్న, సర్వర్ సుందరం, భక్త ప్రహ్లాద, కథానాయిక మొల్ల, లేత మనసులు వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు. జమున హరనాథ్ జంటగా నటించిన దాదాపు అన్ని సినిమాలు హిట్టయ్యాయి. ఏదో వివాదంతో ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్‌లు జమున పై నిషేధం విధించారు ఆమెతో నటించేందుకు నిరాకరించారు. ఆ సమయంలో జమున, హరనాథ్‌ల జంటకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు.
సెప్టెంబర్ 2, 1936లో తూర్పు గోదావరి జిల్లా రాపర్తిలో జన్మించిన హరనాథ్ పూర్తి పేరు బుద్ధరాజు వెంకట అప్పల హరినాధరాజు . హరనాథ్‌కు ఒక కుమారుడు, ఒక కుమార్తె. ప్రముఖ నిర్మాత శ్రీనివాసరాజు హరనాథ్ కుమారుడే.

ఒక వ్యసనం 53 ఏళ్ల ప్రాయంలోనే హరనాథ్ జీవితాన్ని ముగించేట్టు చేసింది. సినిమాలకు దూరమై నవంబర్ 1, 1989లో హరనాథ్ కన్ను మూశారు. 1961 నుంచి 72 వరకు తెలుగు సినిమాలో హరనాథ్ స్వర్ణయుగం కనిపించింది. వ్యసనాన్ని నువ్వు సరదాగానే ప్రారంభించవచ్చు .. కానీ వ్యసనానికి పరాచికాలు నచ్చవు ఎలాగైనా నిన్ను దొంగ దెబ్బతీయాలని, నీ జీవితాన్ని తన అదుపులోకి తీసుకోవడానికి సీరియస్‌గా ప్రయత్నిస్తుంది. ఇది గ్రహిస్తే జీవితం నీ చేతిలో   ఉంటుంది లేదంటే విషాదం లో కలిసిపోతుంది . 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం