29, మే 2016, ఆదివారం

నేతల్లోనే తాత్విక చింతన ఎక్కువ

‘‘ఎన్నయినా చెప్పు ఏదీ శాశ్వతం కాదు’’
‘‘ అవును ఈ ఇరానీ హోటల్‌లో మనం వన్‌బై టూ చాయ్ తాగుతూ గంటల కొద్ది మాట్లాడుకునే వాళ్లం. పాటకో ఐదు పైసలు తీసుకుని ఇష్టమైన పాట వేసేవాడు. ఇది శాశ్వతం అనుకున్నాం. ఇప్పుడా కుర్చీలు లేవు, కూర్చోని మాట్లాడుకునే ఛాన్స్ లేదు.’’
‘‘వన్‌బై టూ టీ గురించి కాదు ’’
‘‘హీరోల గురించా? తెలుగు సినిమాల్లో మేమే బాద్షాలం, నంబర్ వన్‌లం అనుకున్న టాప్ హీరోలందరూ ఒక్క హిట్ కూడా లేక గండిపేట ఎండిపోయాక నీళ్లు లేక చేపలు కొట్టుకున్నట్టు హిట్ కోసం గిలగిల లాడుతున్నారు. అమ్మతోడు అడ్డంగా నరికేస్తాను అని కేకలేసిన మనవడికి అల్లుడి మనుషులు కిందకు నీళ్లు తెచ్చే దాకా ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. కంటిచూపుతో చంపడం కన్నా తడిగుడ్డతో గొంతు కోయడం ఇంకా ప్రమాదకరం అని అర్ధం చేసుకునే వయసు కాదాయె. మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీర్, పవన్ కళ్యాణ్‌లలో టాప్ వన్ ఎవరో తేల్చుకోలేక అభిమానులు తలలు పట్టుకున్నారు. ముగ్గురికీ ఒకేసారి బ్రహ్మాండమైన ప్లాపులు వచ్చాయి. విజయాలు ఎవరికీ శాశ్వతం కాదని ముగ్గురి పరాజయాలు నిరూపించాయి. ’’


‘‘నేనేం చెప్పాలనుకుంటున్నావో నన్ను చెప్పనిస్తావా? లేదా? ఏదీ శాశ్వతం కాదు నువ్వనుకుంటున్న రజనీకాంత్ కూడా శాశ్వతం కాదు. ఆ కాలంలో ఎన్టీఆర్, అక్కినేని, కాంతారావు, కృష్ణ, జగ్గయ్య హీరో ఎవరైనా రామయ్య తాత, హిందీలో రామూ కాకా ఉండి తీరాల్సిందే. ఇప్పుడు వాళ్లెక్కడా కనిపించడం లేదు. ’’
‘‘ అంటే నువ్వు చెప్పదలుచుకున్నది ఎన్టీఆర్ గురించే కదా నిజమే కాంగ్రెస్‌ను కూకటి వెళ్లతో పెకిలించిన ఎన్టీఆర్ కీర్తి తప్ప ఏదీ శాశ్వతం కాదు. ఎన్టీఆర్ కలియుగ దైవం. తెలుగు వారి ఆశాజ్యోతి. అందుకే గోదావరి ఒడ్డున దేవుని రూపంలో పూజలందుకుంటున్నారు’’
‘‘చూడోయ్ నువ్వన్నట్టు ఎన్టీఆర్ దైవం అనుకుంటే ఆ దైవాన్ని సైతం మట్టికరిపించిన అల్లుడు దేవదేవుడు అవుతాడు కదా? ఎన్టీఆర్ అత్యంత శక్తివంతుడు అయితే అలాంటి ఎన్టీఆర్‌ను ఓడించిన అల్లుడు మహా శక్తివంతుడు కదా? అయినా నేను చెప్పాలనుకుంటున్నది సినిమా వాళ్ల గురించి కాదు ’’


‘‘మరెవరి గురించో చెప్పవచ్చు కదా? ’’
‘‘ కొత్త సెల్‌ఫోన్ కొన్నాను. అప్పటి నుంచి గమనిస్తావేమో, అడుగుతావేమో అనుకున్నాను. ’’
‘‘ ఓహో అదా సంగతి.. ఏదీ శాశ్వతం కాదన్నది సెల్‌ఫోన్ల గురించా? ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఫోనే అద్భుతం. హైదరాబాద్ లాంటి మహానగరంలో పదేళ్లు నిరీక్షిస్తే కానీ ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్షన్ వచ్చేది కాదు. టెలిఫోన్ డిపార్ట్‌మెంట్ వాళ్లను ఏదైనా సమస్యపై కలవాలంటే ప్రధానమంత్రిని కలిసినంత కష్టపడాల్సి వచ్చేది. పాపం వాళ్లు అదే శాశ్వతం అనుకున్నారు. అదే సెల్‌ఫోన్ సిబ్బంది మన గల్లీలోకి కూడా వచ్చి కూరగాయలు అమ్ముకున్నట్టు రోడ్డు పక్కన ల్యాండ్ లైన్ కనెక్షన్ ఇస్తాం, తీసుకోండి బాబు తీసుకోండి అంటూ పిలుస్తుంటే నాకూ అలానే అనిపించింది. నిజమే మనం అనుకుంటాం కానీ ఏదీ శాశ్వతం కాదు. జెమ్స్‌బాండ్ 007లా ప్రతోడు అప్పట్లో పేజర్‌ను ప్యాంటు జేబుకు తగిలించుకుని స్టైల్‌గా కనిపించేవాడు. రోజుకో మాడల్ సెల్‌ఫోన్లు మారుతున్న రోజుల్లో ఏదీ శాశ్వతం కాదనే విషయం బాగానే అర్ధమైంది.’’


‘‘ ఈ లోకంలో ఇదే పెద్ద సమస్య. ప్రతోడు జాతిని ఉద్దేశించి మాట్లాడేందుకు ఉత్సాహం చూపిస్తాడు కానీ ఎదుటి వాడు ఏదో చెప్పాలనకుంటున్నాడు. వాడి మాట కూడా వినాలనుకోరు. ’’
‘‘సర్లే చెప్పు వింటా.. ఏదో చెప్పాలనకుంటే వెంటనే చెప్పేయాలి. వేదాలకు భాష్యం చెబుతున్నంత ఫోజు కొట్టి ఏదో చెప్పబోతున్నాను అని ముఖం పెట్టి వౌనంగా ఉంటే, వినడానికి అంత సేపు ఓపిక పట్టేంత సహనం ఎవరికుంటుంది? ఇప్పుడు నాలెడ్జ్ ఏ ఒక్కడి సొత్తో కాదు. గూగుల్ అందరికీ అందుబాటులో ఉంది. అప్పుడంటే మీడియా మొఘల్ తన కళ్లతో జగతిని చూపించే వారు. ఫేస్‌బుక్ వాల్ కూడా మీడియా లాంటిదే, ఈరోజుల్లో ఎవరి కళ్లతో వాళ్లు ప్రపంచాన్ని చూస్తున్నారు, ఇతరులకు చూపిస్తున్నారు.’’
‘‘ దాని గురించి కాదు. నోకియా అంటే ఒకప్పుడు సెల్‌ఫోన్‌కు పర్యాయ పదం. ఫిన్‌లాండ్ అనే చిన్న దేశం అర్థిక వ్యవస్థ మొత్తం ఆ సెల్‌ఫోన్ కంపెనీపైనే ఆధారపడి ఉండేది. తామే శాశ్వతం అనుకున్న నోకియా చివరకు నష్టాల్లో పడి అమ్ముకోవలసి వచ్చింది. నోకియాను కొన్నందుకు మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీకే నష్టం తప్పలేదు. ఏదీ శాశ్వతం కాదు కాలం మారుతుంది అనే చిన్న విషయాన్ని గ్రహిస్తే నోకియా అలానే వెలిగిపోయేది. ఏదీ శాశ్వతం కాదనే విషయం సత్యం కంప్యూటర్స్ దెబ్బతో ఐటి కుర్రాళ్లు గ్రహించారు.’’
‘‘ హమారా బజాజ్ అంటూ బజాజ్ స్కూటర్ ప్రకటన చూస్తే ఇప్పటి సినిమాల కన్నా ఎక్కువ సంతోషం వేసేది. అచ్చం ల్యాండ్ లైన్ ఫోన్లలానే పదేళ్లపాటు వెయిట్ చేస్తే కానీ బజాజ్ స్కూటర్ దొరికేది కాదు. ఒక్కసారిగా వెనకబడి, కాలగర్భంలో కలిసిపోయింది. ’’
‘‘ తలనొప్పికి పర్యాయ పదం అమృతాంజన్. పాపం తలనొప్పి శాశ్వతం కాదు అమృతాంజన్‌కు నంబర్ వన్ స్థానం శాశ్వతం కాదు అని తేలిపోయింది. ’’


‘‘ ఏదీ శాశ్వతం కాదు అనేది గ్రహిస్తే జీవిత తత్వం బోధపడుతుంది. పోయే లోపే నాలుగు మంచి పనులు చేస్తాం. ’’
‘‘ ఏదీ శాశ్వతం కాదు అనే విషయాన్ని జ్ఞానులు, తత్వవేత్తలు, ఆథ్యాత్మిక వాదులు వీరందరి కన్నా ముందే రాజకీయ నాయకులు గ్రహించారని నా కచ్చితమైన నమ్మకం’’
‘‘ ఎలా ?ఎలా? ’’
‘‘ అధికారంలోకి రాగానే పదవి శాశ్వతం కాదని నాయకులు అధికారంలో ఉన్నప్పుడే తర తరాలకు సరిపడా సంపాదిస్తున్నారు. రాజకీయ వారసులకు పెట్టుబడి సమకూర్చుకుంటున్నారు. 58 ఏళ్ల వరకు శాశ్వతం అనే నమ్మకం ఉన్నా కొందరు ఉద్యోగులేమో దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకుంటున్నారు ఏదీ శాశ్వతం కాదనే గట్టి నమ్మకంతో ’’-బుద్దా మురళి (జనాంతికం 29. 1. 2016)  

22, మే 2016, ఆదివారం

మూడో ‘సీసా’ మహిమ!

‘‘ఫలితాలు ఏమంటున్నాయ్’’
‘‘మగవాళ్ల కోసం మొగలిరేకులు సీరియల్‌ను రెండు గంటల సినిమాగా మారిస్తే ఎలా ఉంటుందో అలా ఉందని సామాజిక మాధ్యమాల్లో ఒకటే గోల. టాప్ హీరో సినిమా హిట్టయితే థియోటర్లలో అభిమానుల సంబరాలు పట్టయితే ఫేస్‌బుక్‌లో నెట్ జన్లు వేడుకలు జరుపుకుంటారు.’’


‘‘సినిమా కాదు. రాజకీయాల గురించి ?’’
‘‘ఆయనెవరూ తమిళ మెగాస్టార్ విజయకాంత్‌కు డిపాజిట్ దక్కలేదు. ఆయనవి ఎన్నికల్లోనూ అచ్చం సినిమా డైలాగులే. కల్లు కంపౌండ్‌లోకి అడుగు పెట్టినప్పుడు బెరుకు బెరుకుగా వెళ్లి ఒక సీసా తీసుకుని మూలన కూర్చునే వాడు, మూడో సీసా తరువాత మూడో కన్ను తెరిచి విశ్వరూపం చూపిస్తాడు. అప్పటి వరకు ఎవరి కాళ్ల కిందనో నలుగుతున్నట్టు కనిపించిన వాడు ప్రపంచాన్ని తన కాళ్ల కింద అదిమి పెట్టినట్టు కలలు కంటుంటాడు. అచ్చం సినిమాలో మన హీరోలు కూడా తొలుత మొదటి సీసాలా కనిపించిన వారు మూడు నాలుగు హిట్ల తరువాత తమ డైలాగులను తామే నిజమని నమ్ముతారు. పాపం విజయకాంత్ కూడా అలానే నమ్మాడు. వాళ్లవి కేవలం సినిమా డైలాగులు మాత్రమే అని గుర్తు చేసే విధంగా తమిళ జనం విజయకాంత్ పార్టీలో ఒక్కరికి కూడా డిపాజిట్ దక్కకుండా చేశాడు. రాజకీయాలకు ప్యాకప్ చెప్పి తిరిగి మేకప్‌ను నమ్ముకుంటున్నట్టు ప్రకటించేట్టు చేశారు. కరుణను గెలిపించే అధికారం మా చేతిలో ఉందని మీడియా భావిస్తే, ఓటర్లు మాత్రం 93 ఏళ్ల కరుణకు విశ్రాంతి అవసరం అని నిర్ణయించి అమ్మపైనే తమకు ప్రేముందని చాటి చెప్పారు. ’’


‘‘ కల్లు కంపౌండ్‌ల గురించి బాగా చెబుతున్నావ్ ఏంటీ సంగతి?’’
‘‘ సినిమా ఎలా ఉందో చెప్పాలంటే సినిమా తీసిన అనుభవం ఉండాలా? అక్కడ ఒక్క చోట మాత్రమే మనిషిలోని మరో మనిషి బయటకు వచ్చి విశ్వరూపం చూపిస్తాడని, అనుకున్న మాటలను మెకప్ లేకుండా మాట్లాడతాడు. సినిమాల్లో సహజంగా డైలాగులు రాసేందుకు ఎన్నోసార్లు కల్లు కంపౌండ్‌లను సందర్శించి అక్కడ సంభాషణలను ఆసక్తిగా విన్నానని తనికెళ్ల భరణి ఏదో సందర్భంలో తన సహజ డైలాగుల్లోని రహస్యాన్ని బయటపెట్టారు. ’’


‘‘ఏదో సినిమా అంటావు, జయ అంటావు, ఎన్నికల్లో అసలైన పాయింట్ చెప్పడం లేదు.’’
‘‘నీ ఉద్దేశం బిజెపి ఘన విజయం గురించి చెప్పాలి. అంతే కదా? ఆస్తి పోతే పోయింది కానీ కోర్టులో వ్యాజ్యం ఎలా వేయాలో తెలిసింది అని సంబర పడ్డట్టుగా ఉంది’’
‘‘అంటే’’
‘‘ నరేంద్ర మోదీగారు కొలువు తీరిన ఢిల్లీలో రాజకీయాల్లో ఓనమాలు రాని ఆమ్‌ఆద్మీ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బిహార్‌లో చావు తప్పి కన్ను లోట్టపోయింది. చివరకు మోదీ సొంత రాష్ట్రంలోనూ స్థానిక ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు బుల్లి అసోంలో విజయం సాధించి పాకిస్తాన్‌పై యుద్ధం చేసి గెలిచినంత సంబరపడుతున్నారు. రాజకీయాలంటే లెక్కలు ఎన్ని అసోంలు కలిపితే ఒక ఉత్తర ప్రదేశ్ అవుతుంది? బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బలహీనపడ్డాక జ్ఞానోదయం కలిగింది. ’’


‘‘క్లాస్‌లో అన్ని సబ్జెక్టుల్లో అత్తెసరు మార్కులు వచ్చి వెనకబెంచిలో ఉన్న వాడు ఏదో ఒక సబ్జెక్టులో మంచి మార్కులు తెచ్చుకుంటే భుజం తట్టి మెచ్చుకోవాలి. విజయం సాధించినప్పుడు కూడా సన్నాయి నొక్కులేనా నీ పద్ధతేం నచ్చలేదు. ’’
‘‘సర్లే ఆసోం మాత్రమే కాదు ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ ఇలానే విజయం సాధించాలని కోరుకుంటాను సరేనా?’’
‘‘కాంగ్రెస్ రహిత భారత్ కలలను సాకారం చేసే కమలానికి నీ ఆశీర్వాదాలు అవసరం లేదు’’


‘‘ టీవిలు వచ్చిన కొత్తలో ఇటి అండ్ టి అనే ప్రభుత్వ రంగ సంస్థ పోర్టబుల్ టీవిలు వచ్చేవి. 30 ఏళ్లు వాడిన తరువాత బోరుకొట్టి పక్కన పెట్టడమే తప్ప అవి పని చేయక పోవడం అంటూ ఉండేది కాదు. టెక్నాలజీ పెరిగాక బ్రహ్మాండమైన టీవిలు ఎన్నో వస్తున్నాయి. ఇవి మూడేళ్లు పని చేస్తే గొప్ప ’’
‘‘ అంటే ?’’
‘‘ 130 ఏళ్ల తరువాత కాంగ్రెస్ రహిత భారత్ అని నినాదం వినిపిస్తే, టెక్నాలజీ పెరిగాక 10ఏళ్లలోపే కమలం రహిత భారత్ అనే నినాదం వినిపించదనే నమ్మకం ఏంటి? ’’


‘‘ నువ్వు ఎన్ని వ్యంగ్యోక్తులు విసిరినా ఇప్పుడు నిజంగానే భారత్ వెలిగిపోతోంది అనే మాట నిజం’’
‘‘ 2004లోనే భారత్ వెలిగిపోయింది కదా? బిజెపికి నా వంతు విరాళం ఇప్పుడే 15 లక్షలు ప్రకటిస్తున్నాను ’’
‘‘నిన్ను అపార్థం చేసుకున్నాను. 15లక్షలు ఇచ్చేయ్’’
‘‘ ఇదిగో 15లక్షల చెక్కు. ప్రస్తుతానికి నా అకౌంట్‌లో రూపాయి కూడా లేదు. విదేశాల నుంచి నల్లడబ్బు తెప్పిస్తాను ఒక్కోక్కరి ఖాతాలో 15లక్షలుంటాయని మోదీ చెప్పారు కదా? వాటి కోసమే ఖాతా కొనసాగిస్తున్నాను. నా ఖాతాలో పడగానే పార్టీ విరాళంగా తీసుకోవచ్చు. దేశ ప్రధానమంత్రినే నమ్మక పోతే ఇంకెవరిని నమ్ముతావు? ’’


‘‘ నువ్విలా మాట్లాడుతూనే ఉండు ఆ పదిహేను లక్షలు తీసుకునే రోజు వస్తుంది. అది సరే ఇండియా సంగతి వదిలేయ్ అమెరికా ఫలితాలు ఎలా ఉండొచ్చు? ’’
‘‘ ట్రంప్ అచ్చం మన రేవంత్‌రెడ్డి లాంటి వారే. ట్రంప్ మాటలు మీడియాను ఆకర్షిస్తాయి కానీ ఓటర్లను ఆకట్టుకోవు. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా అందరి కన్నా ఎక్కువగా రేవంత్‌కే ప్రచారం వచ్చింది. కానీ ఆ పార్టీకి ఎక్కడా డిపాజిట్ రాలేదు. అలానే ట్రంప్ మాటలు ప్రపంచ వ్యాప్తంగా మీడియాను ఆకట్టుకుంటున్నాయి’’


‘‘అమెరికాలో ఎవరు గెలిస్తే మనకు మంచిదంటావు?’’
‘‘ మీ పక్కింటి సుబ్బారావు వాళ్ల అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదా తాడేపల్లి గూడెం సంబంధం అయితే నీకు బెటరా? వరంగల్ సంబంధం బెటరా? అంటే ఏమంటావు. పెళ్లి చేసుకునేది వాడు మంచైనా చెడైనా అనుభవించాల్సింది వాడే కానీ పొరుగింటోళ్లం మనకేం సంబంధం. ట్రంప్ గెలిచినా, హిల్లరీ క్లింటన్ గెలిచినా వారికి ఆ దేశ ప్రయోజనాలు ముఖ్యం కానీ ఇండియా ప్రయోజనాలు కాదు.’’

15, మే 2016, ఆదివారం

రాజకీయ ఫోటోలు

‘‘బుగ్గ మీద చేయి పెట్టుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్ ఏంటీ విశేషం’’
‘‘అర్జంట్‌గా కథా రచయితను ఐపోవాలనుకుంటన్నాను. చేతిలో పెన్ను దీర్ఘాలోచనలో ఉన్నట్టు ముఖం పెట్టి ఫోటో దిగాలి. ’’
‘‘ఒకప్పుడు కథా రచయిత అంటే మాసిన గడ్డం, భుజాన సంచి, తెగిపోయిన చెప్పులు సింబాలిక్‌గా ఉండేవి. ఇప్పుడు కథ రాయడానికి సింగపూర్, హాంకాంగ్ వెళ్లే రోజులు వచ్చాయి. కథే ఉండని తెలుగు సినిమాకు కథ రాయడానికి సింగపూర్‌లు, హాంకాంగ్‌లు ఎందుకో? అర్థం కాదు ’’
‘‘ సినిమా కథ కాదు... నేను సీరియస్ కథలు రాయాలనుకుంటున్నాను.’’
‘‘ రాయాలనుకుంటే ముందు చదవాలి. ఫోటో కోసం ప్రాక్టీస్ ఎందుకు? ’’
‘‘ ఎవరో రాసిన కథలు మనం చదవడం ఏమిటి ? అవమానం. మనం రాసింది జనం చదవాలి ’’
‘‘ అంతా నీలానే ఆలోచిస్తున్నారేమో చదివే వారి కన్నా రాసే వారే ఎక్కువ కనిపిస్తున్నారు.’’


‘‘ ఇద్దరు మనుషుల మధ్య చచ్చినా ఏకాభిప్రాయం కుదరని సాహిత్య చర్చ మనకెందుకు కానీ ముందు ఫోటో సంగతి ఆలోచించు’’
. నువ్వు తీసే ఫోటో జ్ఞానపీఠ్ అవార్డుకు ఉపయోగపడే స్థాయిలో ఉండాలి’’
‘‘ రచయిత రాసిన దాంట్లో సరుకు ఉండాలి కానీ ఫోటో ఏముంటుందోయ్’’
‘‘ ఫోటో అని అంత తేలిగ్గా తీసివేయకు. ఫోటోలు చరిత్రను నిర్మిస్తాయి. చరిత్ర సృష్టిస్తాయి. ’’
‘‘ ఎలా ? ’’
‘‘ ల్యాండ్ లైన్ ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నట్టు ఫోటో మూడు నాలుగు దశాబ్దాల క్రితం ఓ ఫ్యాషన్, నుమాయిష్‌లో కారు ముందు నిలబడి ఫోటో దిగడం ఓ ష్యాషన్.. ఆ కాలంలో ల్యాండ్ లైన్ ఫోన్ సామాన్యులకు ఉండేది కాదు. తమకు ఏదైతే లేదో అవి ఉన్నట్టు చూపించుకోవాలనే ప్రయత్నం ఏ స్థాయిలో ఉన్న వారైనా చేస్తారు. ఫోన్ ఉండదు కాబట్టి ఫోన్ మాట్లాడుతున్నట్టు ఫోటో, కారు లేదు కాబట్టి కారు పక్కన నిలబడి ఫోటో అలా అన్నమాట’’


‘‘ అవును నేను స్కూటర్ నడుపుతున్నట్టు చిన్నప్పుడు నాంపల్లి నుమాయిష్‌లో ఫోటో దిగాను. ఆ ఫోటో అంటే నాకు ఇప్పటికే ప్రాణం’’
‘‘ మనలాంటి వారికే కాదు ఇలాంటి క్రేజీ ఇప్పటికీ ఉంటుంది. మహా మహా నాయకులకూ ఉంటుంది. ’’
‘‘ నమ్మలేకపోతున్నాను’’
‘‘ నీకు గుర్తుందా 96 నుంచి 2003 వరకు చంద్రబాబు చాలా కాలం కంప్యూటర్ వౌస్‌ను పట్టుకుని ఉన్న ఫోటోలు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనిపించేవి. ఆ ఫోటోల మీద జనం క్రేజీ తగ్గిందని గ్రహించాక పోలం దున్నుతున్న బాబు ఫోటోలు దర్శన మిచ్చాయి’’
‘‘ అవును అప్పటికే పరిస్థితి చేయి దాటి పోవడంతో రైతు గెటప్ ఫోటోలు ప్రభావం చూపలేదు. ’’


‘‘ ప్రభావం చూపలేదని ఎందుకంటావు. ఈ ప్రభావం వల్లనే కదా వైఎస్‌ఆర్ మొదటి నుంచి రైతు గెటప్ ఫోటోల ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.’’
‘‘ అవును కెసిఆర్ ఏకంగా ఫాం హౌస్‌లో పంటలే పండిస్తున్నారు. మిషన్ కాకతీయలో మట్టి ఎత్తుతూ మట్టి మనిషి ఫోటోలను కెసిఆర్ నమ్ముకున్నారు.’’
‘‘నిజంగా ఫోటోకు అంత విలువ ఉంటుందంటావా?’’
‘‘ ఫోటో అంటే ఏమనుకున్నావ్, దేశ చరిత్రను మలుపు తిప్పేస్తుంది. రాజకీయాల్లో చక్రం తిప్పుతుంది. ఫోటో జెనిక్ ఫేస్ ఉంటే చాలు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తిరుగులేదు. ’’


‘‘ నిజమా? ’’
‘‘ అనుమానం ఎందుకు అదేదో దేశంలో కాందీశీకుల సమస్యను ఎవరూ పట్టించుకోలేదు కానీ చిన్న పిల్లాడి శవం సముద్రం వడ్డుకు కొట్టుకు వచ్చినప్పటి ఫోటో చూశాక ప్రపంచం మొత్తం స్పందించింది. దేశాలు దిగిరాక తప్పలేదు. ’’
‘‘ అవునూ అదేదో దేశంలో జరిగినట్టు నేనూ చదివాను కానీ మన దగ్గర అంత ప్రభావం ఉంటుందంటావా? ’’
‘‘ అక్కడి కన్నా ఇక్కడే ప్రభావం ఎక్కువ చూపింది. చరిత్రను కళ్ల ముందు చూపించమంటావా? దేశ రాజకీయాలను, రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పింది ఈ ఫోటోలే.. ’’


‘‘ ఎప్పుడు? ఎలా? ’’
‘‘ అత్యవసర పరిస్థితి తరువాత 77 ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయి తిరిగి మళ్లీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది ఒక ఫోటోనే అంటే నమ్ముతావా? ఇందిరాగాంధీ ఓడిపోయింది. జనతాపార్టీ అధికారంలో ఉంది. ఆ కాలంలో బిహార్‌లోని ఒక మారుమూల గ్రామం బెల్చీలో దళితులను భూస్వాములు ఊచ కోత కోశారు. మారుమూల గ్రామం రవాణా సౌకర్యాలు లేవు. వర్షా కాలం. విషయం తెలియగానే ఆ గ్రామానికి వెళ్లి తీరాల్సిందే అని ఇందిరాగాంధీ నిర్ణయించుకున్నారు. ఉక్కు మహిళ ఒక నిర్ణయం తీసుకుంటే అమలు జరగాల్సిందే. వాహనాలు వెళ్లలేని ప్రాంతానికి ఏనుగును ఎక్కి వెళ్లింది గ్రామంలోని దళితులకు ధైర్యం చెప్పింది. ఇందిరాగాంధీ ఏనుగెక్కిన ఫోటో దేశ వ్యాప్తంగా మీడియాలో ఒక సంచలం. జనం జేజేలు పలికారు. ఇంకేం తిరిగి అధికారంలోకి రావడానికి ఈ ఫోటోతో బీజం పడింది. ’’
‘‘ నిజమే నువ్వు చెబుతుంటే గుర్తుకొచ్చింది. విమానాశ్రయంలో టి అంజయ్యను రాజీవ్ అవమానించిన ఫోటో, రోడ్డుపైన ఎన్టీఆర్ స్నానాలు చేస్తున్న ఫోటోనే కదా? కాంగ్రెస్‌ను దించి ఎన్టీఆర్‌ను సిఎంను చేసింది. ’’
‘‘ తనను దించేసినప్పుడు ఎన్టీఆర్ నల్ల దుస్తుల ఫోటోలతో జనం సానుభూతి కోసం ప్రయత్నించినా ఆ ఫోటో వర్కవుట్ కాలేదు. ’’


‘‘ రాజకీయ నాయకులు విజయం సాధించాలంటే మంచి ఫోటో సెన్స్ ఉండాలంటావు’’
‘‘ ఆ మాట నేను అనలేదు. ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగింది. క్షణాల్లో నీకు కావలసిన రీతిలో ఫోటోను తయారు చేసి ఇస్తున్నారు. మహాత్మాగాంధీ, నరేంద్ర మోదీ భుజం భుజం కలిపి స్వాతంత్య్ర పోరాటం చేశారనే ఫోటో కావాలన్నా క్షణాల్లో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం అవుతున్నాయి. ’’
‘‘ అంటే ఫోటోలకు విలువ లేదంటావా? ’’
‘‘ ఆ మాట నేను చెప్పలేదు. కొన్ని ఫోటోలు, కొన్ని కోట్ల ఖర్చుతో బోలెడు ప్రచారం లభించవచ్చు . కానీ జన రంజకంగా పాలిస్తే, ప్రజలు తమ హృదయాల్లోనే పాలకుల ఫోటోలను శాశ్వతంగా ముద్రించుకుంటారు. శాశ్వత ఫోటోలను వదిలి  గ్రాఫిక్ పొటోలు , మార్ఫింగ్ ఫోటోల వెంట పడొద్దని చెబుతున్నాను’’

-బుద్దా మురళి (జనాంతికం 15. 5.2016)

8, మే 2016, ఆదివారం

పవన్ తో ఆంధ్రకు .. రజనీకాంత్ తో విశ్వానికే ప్రత్యేక హోదా

‘‘పవన్ కళ్యాణ్ తలుచుకుంటే నిమిషంలో ప్రత్యేక హోదా వస్తుందని శివాజీ చెప్పారు. వస్తుందంటావా? ’’
‘‘ ఏ శివాజీ? చత్రపతి శివాజీని నేను చూడలేదు, శివాజీ గణేషన్ పోయి చాలా కాలం అయింది. ’’
‘‘ నీ కన్నీ వెటకారాలే? శివాజీ అని ఓ మాజీ హీరోలే. ప్రత్యేక హోదా కోసం ఆయన చేసే ఉద్యమాలు ఒక ప్రత్యేక ఛానల్‌లో మాత్రమే కనిపిస్తాయి. ’’
‘‘ నిజమే పవన్ తలుచుకుంటే ఆంధ్రకు ప్రత్యేక హోదా, బాలకృష్ణ తలుచుకుంటే ఏకంగా దేశానికే ప్రత్యేక హోదా వస్తుంది. ’’

‘‘అదెలా సాధ్యం? ’’
‘‘ తెలుగు సినిమా హీరోల శక్తి నీకు తెలియడం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా వారినే తాలిబన్లు ముప్పు తిప్పలు పెడితే తెలుగు హీరో మాత్రం వాళ్లతో తెలుగులో మాట్లాడి మూడు చెరువుల నీళ్లు తాగించి వాళ్లను మట్టుపెడతాడు తెలుసా? వర్థమాన హీరోనే అలా చేస్తే ఇక సీనియర్ హీరోలు చేయలేంది ఏముంటుంది. హీరోలు తలుచుకుంటే పాకిస్తాన్, చైనాను ఒకేసారి మట్టికరిపించగలరు. ’’
‘‘నీది పోయేదేముంది. పాకిస్తాన్, చైనాతో పాటు అందులో అమెరికాను కూడా చేర్చు ’’
‘‘ పప్పులో కాలేశావ్! నీకు సినిమా బిజినెస్ గురించి ఏ మాత్రం అవగాహన లేదు. అమెరికాలో మన తెలుగు వాళ్లు చాలా మంది ఉన్నారు. తెలుగు సినిమాకు ఓవర్సిస్ వ్యాపారం కూడా బాగా ఉంది. ఇక్కడ విడుదలైన సినిమాలు ఒకటి రెండు రోజుల ముందే అమెరికాలోనూ విడుదలవుతాయి. తెలుగు హీరోపైన ఎంత నమ్మకం ఉన్నా? తాము పని చేసే అమెరికాపై వారికి అంతకు మించి అభిమానం ఉంటుంది కాబట్టి తెలుగు హీరో చేతిలో సూర్య చంద్రులు ఓడిపోయినా సహిస్తారు కానీ అమెరికా ఓడిపోవడాన్ని అస్సలు తట్టుకోరు. కావాలంటే తెలుగు సినిమా చరిత్రను అధ్యయనం చేయి ఒక్కటంటే ఒక్క కథ కూడా అమెరికాను ఓడించినట్టు ఉండదు. ఐతే రజనీకాంత్‌కు మినహాయింపు ఉంది ఆయన తలుచుకుంటే విశ్వానే్న జయిస్తాడు. ప్రపంచానికే ప్రత్యేక హోదా సాధిస్తారు’’
‘‘ సినిమా సంగతి కాదు.. హోదా కోసం పవన్ ప్రయత్నించవచ్చు కదా? ’’

‘‘ పవనే అవసరం లేదు బాలయ్య బాబైనా, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, చివరకు బన్నీ అయినా సరే వంద కోట్లు ఉంటే సాధించవచ్చు’’
‘‘ వావ్ వంద కోట్లతో కేంద్రం మెడలు వంచి సాధించవచ్చునంటే అంత కన్నా సంతోషం ఏముంటుంది? ఎలా ఎలా? ’’
‘‘గణాధిపత్యం కోసం ఇద్దరు కుమారుల మధ్య శివపార్వతులు పోటీ పెడితే వినాయకుడు ఏం చేశాడు? సుబ్రమణ్య స్వామిలా నేనంత స్పీడ్‌గా మూడు లోకాలు చుట్టి రాలేను అని తల్లితండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి షార్ట్‌కట్‌లో మూడు లోకాలు చుట్టి వచ్చాడు కదా? అలానే కేంద్రాన్ని ఒప్పించడం కష్టం కాబట్టి షార్ట్‌కట్‌లో కార్యం సాధించుకోవచ్చు’’
‘‘ ఎలా? ఎలా? ’’
‘‘ ఓ వంద కోట్లతో కేంద్రం మెడలు వంచిన కథతో సినిమా తీసి’’
‘‘ నేనింత సీరియస్‌గా అడుగుతుంటే సినిమా కథ చెబుతావేంటి? ప్రజల జీవితాలు నీకు సినిమా కథలా కనిపిస్తున్నాయా? ’’

‘‘ తెలుగు వారికి సినిమా, రాజకీయం, జీవితం అన్నీ ఒకటే. శ్రీకృష్ణ తులాభారంలో తులసీ దళం వేశాక కానీ శ్రీకృష్ణుడి బరువుకు సమానం అయినట్టు అప్పటి వరకు త్రాసు అటూ ఇటూ ఊగుతుంటే పవన్ కళ్యాణ్ అనే తులసీ దళంతోనే కదా త్రాసు బాబు వైపు తూగింది. సినిమా వేరు జీవితం వేరు అని ప్రజలు అనుకుంటే త్రాసు అలా తూగేది కాదు కదా? ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినా చిరంజీవికి ఎన్నో కొన్ని ఓట్లు సీట్లు వచ్చినా సినిమా గ్లామరే కదా? లేకపోతే దేశం కోసం వాళ్లేం త్యాగం చేశారని... దేశంలో మిగిలిన వారి సంగతి వేరు కానీ తెలుగు వారికి మాత్రం సినిమా, రాజకీయం, జీవితం మూడూ ఒకటే అన్నీ కలిసిపోయే ఉంటాయి. మోదీ మోసం చేశాడని కోపంగా ఉంటే ఆ కథలో చివరకు ఆయన్ని కూడా అధికారం నుంచి దించేసినట్టు చూపించి ప్రతీకారం తీర్చుకోవచ్చు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ సైతం రాజకీయాల్లో అట్టర్ ప్లాప్ అయ్యారు. అదే మన తెలుగునాట చోటా మోటా శివాజీ కూడా దేశ పటం నుంచి ఆంధ్రప్రదేశ్‌ను వేరు చేస్తామని సినిమా డైలాగులు చెబుతుంటారు. మీడియా ఆకాశానికెత్తుతుంది. గడ్డం చేసుకునే ఓపిక లేని మాజీ నటుడు  భారీ డైలాగులు చెబుతుంటే మీడియా సీరియస్‌గా తీసుకొని ప్రసారం చేయడమే సిల్లీగా అనిపించడం లేదూ! ’’

‘‘ఇంతకూ అసలు విషయం చెప్పడం లేదు? హోదా వస్తుందా? రాదా? ఆ విషయం చెప్పు’’
‘‘సినిమా డైలాగులు తప్ప చిత్తశుద్ధితో ప్రయత్నాలు జరుగుతున్నాయా? నువ్వు చెప్పు ముందు? ’’
‘‘ అంటే మోదీ ఢిల్లీని తలదనే్నలా రాజధాని నిర్మిస్తాను అన్నారు కదా? ’’
‘‘ ఎన్నికల ప్రచారంలో మోదీ అలా చెప్పింది నిజమే. చత్తీస్‌ఘడ్ రెండు వేల కోట్లతో రాజధాని నిర్మించుకుందని పార్లమెంటులో మొన్న జైట్లీ చెప్పిందీ నిజమే! చూడోయ్ చదువుకునేప్పుడు ప్రేమించే రోజుల్లో నువ్వు అమ్మాయిలకు ఎన్ని కబుర్లు చెప్పావు. ఆకాశం దింపాలా? నెల వంక తుంచాలా? అంటూ ఎన్ని పాటలు పాడావు? ’’
‘‘ నిజమేనోయ్ ఆరోజులు తలుచుకుంటేనే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుంది? ’’

‘‘ కదా? ప్రేమించి పెళ్లి చేసుకుని మరిప్పుడేం చేస్తున్నావ్ కరివేపాకు తెంపుకురా అని భార్య పిలిచినా పేపర్ చదువుతున్నాను అని చిరాకు పడతావు. ఆకాశం దింపుతానన్నోడికి కరివేపాకు తుంచడం ఓ సమస్యనా? ’’
‘‘ అది వేరు ఇదివేరు’’
‘‘ ప్రేమించేప్పుడు మాయమాటలు చెప్పినట్టు, ఎన్నికల సమయంలో నాయకులు వారి స్థాయిలో వారు మాయమాటలు చెబుతారు’’

‘‘ఓటరు దేవుళ్లను మోసం చేస్తే’’
‘‘దేవుడి పేరుతో అధికారంలోకి వచ్చి దేవుడినే పక్కన పెట్టారు. ఓటరు దేవుడ్ని పక్కన పెట్టడం ఓ లెక్కా’’
‘‘ ఒక్క విషయంలో మాత్రం ఇరు రాష్ట్రాలు సంతోషపడాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరు రాష్ట్రాలను కేంద్రం సమానంగా చిన్నచూపు చూస్తోంది. ’’
‘‘ అంటే మన కర్మ ఇలా కాలిపోవలసిందేనా? ’’
‘‘ సినిమా, రాజకీయం, జీవితం మూడింటిని వేరు చేసేంత వరకు ఇంతే’’ 
-బుద్దా మురళి (జనాంతికం 8. 5. 2016)

7, మే 2016, శనివారం

రెండు ప్రాజెక్టులు-ఒక జ్ఞాపకం

ఉత్తర, దక్షిణ తెలంగాణను సస్య శ్యామలంగా మార్చే రెండు ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఈ తరుణంలో ఒక పాత జ్ఞాపకం..


అది 2004 ఎన్నికల ఫలితాలు వెలువడి చంద్రబాబు పార్టీ ఓడిపోయి వైఎస్‌ఆర్ అధికారంలోకి వచ్చిన సమయం. అప్పటికే మూడేళ్ల నుంచి వరుస కరవు. తెలంగాణ కరువు రక్కసిలో చిక్కుకుని విలవిలవాడుతున్న కాలమది. ఆత్మహత్యలు అలానే కొనసాగుతున్నాయి. మెదక్ నియోజక వర్గంలో రైతు ఆత్మహత్య సంగతి తెలిసి అప్పుడు టిడిపి రాజ్యసభ సభ్యునిగా ఉన్న,రాయల సీమకు చెందిన  సి రామచంద్రయ్య నాయకత్వంలో ఒక బృందాన్ని చంద్రబాబు రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు పంపించారు. ఆ రైతు కుటుంబంలో మిగిలింది ఆమె ఒక్కతే. అంతకు ముందే పంటలు పండక కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. తరువాత భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన ఆమెను పరామర్శించడానికి వెళ్లిన సి రామచంద్రయ్య ఆమె స్థితి చూసి నిర్ఘాంత పోయాడు.


వెళ్లి వచ్చిన తరువాత తన అనుభవాన్ని ఎన్టీఆర్ భవన్‌లో విలేఖరులతో పిచ్చాపాటి మాట్లాడుతూ పంచుకున్నాడు. ఆమెను పరామర్శించడానికి వెళ్లిన నేను ఆమె స్థితిని చూశాక మనసు కలత చెందింది. కొడుకు, భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖంలో ఏ మాత్రం జీవ కళ లేదు. దుఃఖం లేదు, నిర్జీవ రూపంతో మాట్లాడుతున్నట్టుగా ఉం ది. ఏమని ఓదార్చాలో అర్ధం కాలేదు. చంద్రబాబు వద్దకు వెళ్లి ఇదే విషయం చెప్పాను. ఏంటి సార్ ఇంత కాలం మనం చేశామని చెప్పుకుంటున్న అభివృద్ధి, గ్రోత్ రేట్ ఏది సార్ అంటూ బాబుతో చెప్పిన విషయాలను మిత్రులతో పంచుకున్నారు. అంతకాలం అధికారం చెలాయించిన పార్టీకి చెందిన ఎంపిగా తెలంగాణలో కరవు పీడిత గ్రామంలో రైతు కుటుంబాన్ని చూసిన తరువాత చలించిన సి రామచంద్రయ్య నోటి నుంచి వచ్చిన మాటలివి. రాయలసీమ కరువు ను చూసిన రామచంద్రయ్యను కూడా ఆనాటి తెలంగాణ పల్లెల్లోని కరువు కదిలించింది . 


అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు ఉభయ గోదావరి జిల్లాల కన్నా మెదక్‌లోనే గ్రోత్ రేట్ ఎక్కువ అంటూ జిల్లాల వారిగా గణాంకాలు విడుదల చేసేవారు. ఆ గ్రామంలోని పరిస్థితిని రైతు కుటుంబాన్ని చూసిన తరువాత సి రామచంద్రయ్యకు అంకెలు వేరు వాస్తవ జీవితం వేరని అర్ధమైంది. అదే విషయాన్ని మిత్రులతో పంచుకున్నారు. సి రామచంద్రయ్య చూసిన ఒక్క గ్రామం, ఒక్క రైతు కుటుంబం పరిస్థితే కాదు ఆ కరవు కాలంలో వర్షంపై ఆధారపడి పంటలు పండించే ప్రతి తెలంగాణ పల్లె పరిస్థితి ఇదే. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. తనకు ఏం కావాలో, తన ప్రాధాన్యతలు ఏమిటో ? వాటిని ఎలా సాధించుకోవాలో తనకు బాగా తెలుసు. తనకు ఏది ప్రయోజనమో ఆ నిర్ణయం తీసుకుని అమలు చేసే సత్తా ఉన్న రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ.
ఉత్తర, దక్షిణ తెలంగాణలను సస్యశ్యామలం చేసే రెండు ప్రాజెక్టులకు రెండు రోజుల తేడాతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావులు శంకుస్థాపన చేశారు. దక్షిణ తెలంగాణను సస్యశ్యామలంగా మార్చే పాలమూరు ఎత్తి పోతల ప్రాజెక్టుకు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో సుదీర్ఘ పాలనానుభవం ఉన్న నాయకులు, రాజ్యాంగ నిపుణులు అని చెప్పుకున్న వాళ్లు , కాకలు తీరిన పెద్దలు, చివరకు పార్టీ కార్యాలయాల్లో ఉగాదికి పంచాగ పఠనంలో తెలంగాణ ఒక కల అని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజల సంకల్పం, నాయకత్వం, ఆ కలను నిజం చేసింది. ఉద్యమ కాలంలో అయ్యేదా పొయ్యేదా? అని వినిపించినట్టుగానే ఇప్పుడు ఉత్తర, దక్షిణ తెలంగాణను సస్య శ్యామలం చేసే రెండు ప్రాజెక్టులపై సన్నాయి నొక్కులు వినిపిస్తున్నాయి.


ప్రాజెక్టులపై ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్న తెలంగాణ విపక్షం విమర్శలతో తమను తాము బలహీన పరుచుకుంటోంది. పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. ప్రాజెక్టు నిలిపివేయాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను బాబు వ్యతిరేకించడం లేదని విపక్ష నాయకుడు జగన్ మరింత తీవ్ర స్వరంతో విమర్శిస్తున్నారు. దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఓటుకు నోటు వల్లనే బాబు ప్రాజెక్టులను వ్యతిరేకించడం లేదనేదని జగన్ ఆరోపణ.
తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఏకమైనందున, ప్రాజెక్టుల నిర్మాణం కోసం తెలంగాణ ఏకం కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపు ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లో అధికార పక్షం, విపక్షం జల రాజకీయాలు చేయడం సాధారణమే.. దీనితో ప్రజలకు సంబంధం లేదు. తెలంగాణ ఏర్పాటు అనివార్యం అని కెసిఆర్ ఎంత గట్టిగా నమ్మారో ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం జరిగి తీరుతుందని తెలంగాణ రైతాంగం అంతే గట్టిగా నమ్ముతోంది.
ఈ రోజుల్లో కనిపించడం లేదు కానీ పాత రోజుల్లో ప్రతి పెళ్లిలో ఎవరో ఒకరు పెద్దగా అరుస్తూ అందరి దృష్టిని ఆకర్షించేవాడు. కూరలో ఉప్పు తక్కువైందనో, పెరుగు గట్టిగా లేదనో వంకాయ కూర చప్పగా ఉందనో కారణం చూపుతూ అరిస్తే అందరూ వానిపై దృష్టికేంద్రీకరించేవారు. ఉప్పు తక్కువ కావడం అతని సమస్య కాదు. ఐడెంటిటీ క్రైసెస్‌తో అందరి దృష్టిలో పడాలి అనేదే అతని ప్రధాన సమస్య. ఇలానే ప్రాజెక్టులపై కొందరి విమర్శలున్నాయి.


ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే తెలంగాణ సస్య శ్యామలం అవుతుంది. రాజకీయంగా టిఆర్‌ఎస్‌కు ఉపయోగపడుతుంది. అదే ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వ విఫలం అయితే తెలంగాణ ప్రజలకు తీరని నష్టం, విపక్షాలకు రాజకీయంగా బాగా కలిసి వస్తుంది. తమకు కలిసి వచ్చే అవకాశం కోసం రాజకీయ పార్టీలు ఎదురు చూడడం సహజమే. కానీ రాజకీయ పార్టీల ప్రయోజనం కన్నా రాష్ట్ర ప్రజల ప్రయోజనం ముఖ్యం. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రాజెక్టులు పూర్తి కావాలని కోరుకోవాలి. ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వం తప్పు చేస్తే శాస్ర్తియంగా ఇది తప్పు ఇలా చేస్తే మరింత ప్రయోజనం అని చెప్పగలగాలి. అలాంటి ప్రయత్నమేదీ విపక్షాల నుంచి కనిపించడం లేదు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తే సమావేశంలో కాంగ్రెస్, టిడిపి పాల్గొనలేదు. అయితే కాంగ్రెస్ మాత్రం ఏప్రిల్ తొమ్మిదిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రభుత్వం చేస్తున్న తప్పును సవివరంగా చెబుతామని ప్రకటించింది. తరువాత వాయిదా అన్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో బిజీగా ఉంటాం, ఆ తరువాత అన్నారు. అంబేద్కర్ జయంతి ముగిసి 20 రోజులు అవుతున్నా ఇప్పటికీ కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఊసేత్తడం లేదు. రీ ఇంజనీరింగ్ డిజైన్‌లో తప్పులుంటే రాష్ట్రానికి దాని వల్ల నష్టం కలిగితే ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉంది.


జల యజ్ఞం పేరుతో వైఎస్‌ఆర్ హయాం లో జరిగిన హడావుడి తెలంగాణ ప్రజలకు తొలిసారి ప్రాజెక్టులపై ఆశలు రేకెత్తించాయి. నిధుల కేటాయింపు, నీటి మాటలు అంకెల్లో ఘనంగానే కనిపించాయి. ఏం జరిగిందో కానీ వైఎస్‌ఆర్ ఐదేళ్లపాలనా కాలంలో తెలంగాణను వర్షాలే ఆదుకున్నాయి కానీ ప్రాజెక్టుల యజ్ఞ్ఫలం దక్కలేదు. ‘‘శాసన సభ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. కెసిఆర్ ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల గడువే ఉంది, ఐదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాను అని చెబుతున్నారు కాబట్టి ప్రజలను మోసం చేయడమే’’ ఓ కాంగ్రెస్ నేత వాదన ఇది. నిజమే మూడేళ్ల వరకు ఏమీ చేయకుండా ఐదేళ్లలో పూర్తి చేస్తాను అంటే ఇది ఫక్తు ఎన్నికల మాటే అని విశ్వసించాల్సిన అవసరం లేదు. ఏటా 25వేల కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయిస్తున్నారు. ఐదేళ్ల సంగతి పక్కన పెడదాం. మూడేళ్లలో 75వేల కోట్లు ఖర్చు చేయాలి. 75వేల కోట్ల ఖర్చు కంటికి కనిపించకుండా ఉంటుందా? ఖర్చు చేయకుండా , ఏ పని చేయకుండా చేశామని చెప్పడం సాధ్యం అవుతుందా ? అలా చెబితే వాస్తవం ఏమిటో విడమరిచి చెప్పే ప్రజా సంఘాల చైతన్యానికి తక్కువేమీ కాదు తెలంగాణా లో .. కోటి ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంలో మూడేళ్లలో సగానికి పైగా లక్ష్యాన్ని చేరుకొంటారు. ప్రాజెక్టు అంటే ఐదేళ్లు, పదేళ్లు అనే పాత విధానం కాదు. వచ్చే ఏడాదిన్నర కాలంలోనే కాళేశ్వరం నుంచి మిడ్ మానేరు దాకా నీటిని పంపించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కాలువలు తవ్వి జేబులు నింపుకోవడం కాదు. బ్యారేజీలు, పంప్ హౌజ్‌లు, రిజర్వాయర్లు సమాంతరంగా నిర్మించనున్నట్టు ప్రభు త్వం ప్రకటించింది.
తెలంగాణ సంపన్న రాష్ట్రం, రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రం, విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ఇవన్నీ నిజాలే అయినా గ్రామీణ తెలంగాణ మాత్రం ఇంకా పేదరికంలోనే ఉంది. ఈ పేదరికం తాము పుట్టక ముందు ఉంది, పుట్టిన తరువాత ఉంది, వారసత్వ సంపదగా ఈ పేదరికానే్న వారసులకు ఇచ్చి వెళతాం అనేది నిన్నటి తెలంగాణ మాట. కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి తెలంగాణ ప్రజల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. పేదరికానికి వీడ్కోలు పలుకుతామనే ఆశాభావం తెలంగాణ పల్లెల్లో కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఏ పార్టీకి ప్రయోజనం, ఏ పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడేస్తుందనే రాజకీయ లెక్కల కన్నా ఆరు దశాబ్దాల తరువాత ప్రజల్లో కనిపిస్తోన్న ఆశలను నిజం చేయడం ప్రభుత్వ బాధ్యత.- బుద్దా మురళి (ఎడిట్ పేజి 7. 6. 2016)

1, మే 2016, ఆదివారం

హీరో 101 వ సినిమాకో కథ

‘‘అంత శ్రద్ధగా రాస్తున్నావు.. ఏంటి శ్రీశ్రీకి నివాళినా? ’’
‘‘తెలుగు సినిమాకు నివాళి.. ఆ ఏంటో అన్నావు. సరిగా వినలేదు’’
‘‘ ఏం రాస్తున్నావు ?’’
‘‘ మన తెలుగు హీరో 101వ సినిమాకు కథ రాస్తున్నాను. చదువు’’


***
పొలం నుంచి కారులో హీరో 200 కిలోమీటర్ల స్పీడ్‌తో ఇంటికి వెళుతున్నాడు. హఠాత్తుగా కారు నిలిచిపోయింది. నడిచే వెళదామని రెండు అడుగులు వేశాడు. విలన్లు దాడి చేసేందుకు చెట్టు చాటును పొంచి ఉన్నారు. ఆకాశంలో విమానం వెళుతున్న శబ్దం వినిపించి హీరో తల పైకెత్తి చూశాడు. వేగంగా పరిగెత్తే రైలును కంటి చూపుతో వెనక్కి వెళ్ళేట్టు చేసిన తనకు కంటిచూపుతో విమానాన్ని కిందికి దించడం ఓ లెక్కా అనుకున్నాడు. ప్రయాణీకులను ఇబ్బంది పెట్టడం మా వంశాచారం కాదు అంటూ ముందడుగు వేశాడు. విమానం ఒక్కసారిగా హీరో ముందు వాలిపోయింది. పైలట్ కిందకు దిగి సార్ విమానంలో ఎక్కండి మీ ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తాను. అని ప్రాదేయపడ్డాడు. హీరో సంశయిస్తూ చూస్తుంటే సార్ నాకు తెలుసు సహాయం చేయడమే తప్ప ఇంకొకరి నుంచి సహాయం పొందడం మీ వంశాచార రాజ్యాంగంలోనే లేదు. నేను మీ పాలేరును ఎర్రటి ఎండలో గొడ్లు కాస్తుంటే ఓసారి మీరు నా భుజంపై చేయి వేసి. బాగా చదువుకో వృద్ధిలోకి వస్తావు అని ఆశీర్వదించారు. మీ దయ వల్లనే నేను పైలట్‌ను అయ్యాను. మీ ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తే విమానం పావనం అవుతుంది. నా జీవితం ధన్యమవుతుంది. ఇది మీరు నాకు చేసే మహోపకారం అని ప్రాదేయపడడంతో హీరో వేడుకోలుకు కరిగిపోయి విమానం ఎక్కాడు.


ఇంటి వద్ద హీరో ఆశీస్సుల కోసం చాలా మంది వేచి ఉన్నారు. అయ్యగారూ మా బిడ్డకు మీరే పేరు పెట్టాలని ఓ డజను మంది తల్లిదండ్రులు హీరో కాళ్ల మీద పడ్డారు. యండమూరి వీరేంద్రనాథ్ రాసిన పిల్లలకు పేర్లు పుస్తకం 50 రూపాయలు పెట్టి కొంటే కొన్ని వేల పేర్లు దొరుకుతాయి. 50 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని పేదలు పేరు కోసం హీరో కాళ్ల మీద పడ్డారు. వరుసగా వాళ్లందరికీ పేర్లు పెడుతూ హీరో వెళుతున్నారు.


దూరంగా ఒక మధ్య వయసు వ్యక్తి నిలబడ్డాడు. హీరో అతని వైపు చూస్తూ ఏం పరవాలేదు. మా వంశాచారం ప్రకారం ఏమడిగినా మేం సహాయం చేయడానికి సిద్ధం. మోహమాటపడకండి అడగండి అని అభయం ఇచ్చారు. బాబయ్యా మీరు నన్ను గుర్తు పట్టలేదు? అని ఆ అగంతకుడు ఆగాడు. రోజూ ఎంతో మంది మిమ్ములను సహాయం కోసం కలుస్తారు. ఎంత మందినని మీరు గుర్తు పెట్టుకుంటారు బాబయ్యా! నేను... నేను... అంటూ ఆ మధ్య వయసు అగంతకుడు రెండు చేతులు జోడించి మీరూ మీ నాన్న గారు మా దేశానికి వచ్చినప్పుడు మీ ఇద్దరి ఆశీర్వాదం వల్ల నేను ఇంతటి వాడిని అయ్యాను. ఇప్పుడు నేను అమెరికా అధ్యక్షుడు ఒబామాను ... మీ వంశానికి నేను రుణపడి ఉన్నాను బాబయ్యా! పనుల వత్తిడి వల్ల ఇంత కాలం మిమ్ములను కలువలేకపోయాను క్షమించండి బాబయ్యా! అంటూ ఒబామా రెండు చేతులు జోడించి హీరోను వేడుకున్నారు. 

చాలా సంతోషం జీవితంలో మంచి స్థితికి వచ్చారు. అభిమానుల నుంచి మా వంశం ఆశించేది ఇదే అంటూ హీరో అభిమానిని దీవించాడు. హీరో ఇంట్లో మనిషి అన్నపూర్ణ కనిపించగానే అమ్మా ఒబామాకు కడుపు నిండా అన్నం పెట్టి పంపు మన ఇంటికి వచ్చిన వాళ్లను కడుపు నింపి పంపడం మన ఇంటి ఆచారం అని చెప్పి హీరో లోపలికి వెళ్లిపోయాడు.


***
‘‘తెలుగు సినిమా ప్రేక్షకులంటే నీకెలా కనిపిస్తున్నారు. ఇదేం కథ. వెయ్యి మంది జనాభా లేని బోడి గ్రామంలో ఓ మోతుబరిని ప్రపంచ నాయకుడిగా బిల్డప్... అదేమన్నా శ్రీకృష్ణ దేవరాయ వంశమా ? మొఘలాయిల వంశమా ? కొద్దిగ నన్నా సహజత్వం ఉందా? కథైనా కాస్త నమ్మేట్టుగా ఉండాలి’’


‘‘ నువ్వు మరీ పాత కాలంలో ఉన్నావోయ్.. టెక్నాలజీ పెరిగింది. ఇంకా పాత కాలం ఆలోచనల్లోనే ఉన్నావు. సినిమాకు కథలు ఎక్కడి నుంచి వస్తాయి. జీవితం నుంచే కదా? ’’
‘‘ అంటే జీవితం ఇంత అసహజంగా ఉందా?’’
‘‘ మొన్నో పెద్ద రాజకీయ నాయకుడు ఏమన్నాడు. జగన్ ఇంటికి టిఫిన్‌కు పిలిచాడు. వెళ్లగానే మెడలో కండువా వేసి పార్టీలో చేర్చుకున్నాడు అని చెప్పాడు... ఓ మంత్రి కొడుకు అమ్మాయి చెయ్యి పట్టుకుని ఎందుకు లాగావురా! అని ప్రశ్నిస్తే కుక్కను తప్పించడానికి అన్నాడు ఇది సహజంగా ఉందా? అల్లరి చేస్తున్నాడని మంత్రి కొడుకును పిలిచి చితక్కొట్టించి పోలీసులకు పట్టించిన ఆ యువతి కాస్తా ఇప్పుడు అబ్బే అదంతా ఓ కల నా భ్రమ... అంతా ఉత్తుత్తిదే అని చెప్పగానే కోర్టు కేసు కొట్టేసింది. ఇందులో ఎవరి చర్య సహజంగా ఉంది చెప్పు ’’
‘‘ అంటే అది వేరు ఇది వేరు’’


‘‘ ఏళ్లపాటు జైలులో ముప్పు తిప్పలు పెట్టి పాపం అమాయకులు ఏమీ తెలియదు అని వదిలేయడం సహజంగా ఉందా? బుల్లి రాష్ట్రాన్ని సింగపూర్, జపాన్, చైనా, అమెరికా చేస్తాననడం సహజంగా ఉందా? మాల్యా దేశంలో ఉన్నంత వరకు వౌనంగా ఉండి, పారిపోయాక, పాలకులు సీరియస్ కావడం సవ్యంగా ఉందా? ఓడిపోయిన వాడు కోర్టులో ఏడిస్తే, గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడుస్తాడని మనకో పాత సామెత. ఆ ఇద్దరికీ కనీసం ఏడ్చే అవకాశం కూడా లేకుండా దాన్ని కూడా ఈ మధ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లాక్కున్నారు. ’’
‘‘ దానికీ దీనికేం సంబంధం? ’’
‘‘ మన జీవితాలు సవ్యంగా లేవు, మన వ్యవస్థలు సవ్యంగా లేవు. మన రాజకీయాలు సవ్యంగా లేవు. మొత్తం సమాజమే సవ్యంగా లేదు. సవ్యంగా లేని సమాజంలో సినిమా కథలు మాత్రం సవ్యంగా ఉండాలని కోరుకోవడం ధర్మమా? ’’


‘‘ నిజమేనోయ్ కానీ మరీ విమానంలో లిఫ్ట్’’
‘‘ అంటే సినిమాలో ఈ ఒక్కటి తప్ప అంతా సవ్యంగానే ఉందంటావా? అభిమాని కనిపిస్తే ముద్దు పెట్టాలి, లేదంటే కడుపు చేయాలి అని యువతకు జ్ఞానబోధ చేసే హీరోల ఇమేజ్‌పై నీకు జెలసీ. అందుకే ఇలా విమర్శస్తున్నావు.. అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని, అట్టర్ ఫ్లాప్‌లను అడ్డుపెట్టి ఇలాంటి సినిమాలను ఆపలేవు ’’ - బుద్దా మురళి (జనాంతికం 1. 5. 2016)