25, ఏప్రిల్ 2018, బుధవారం

వారికీ మనకూ తేడా అదే..!వారెన్ బఫెట్

‘‘అబ్బాయికి ఐటి కంపెనీలో జాబ్ వచ్చింది. ఉద్యోగంలో చేరి రెండు నెలలు అవుతోంది. ప్రారంభ జీతమే నెలకు 60 వేలు. మొనే్న కొత్త కారు కొన్నాం పది లక్షలు. నెల నెలా కిస్తు చెల్లించాలి. పోతే పోయింది. పిల్లల సంతోషం కన్నా మనకింకేం కావాలి?’’
***
హైటెక్ సిటీలో ఉద్యోగమాయె. వాడి స్థాయికి తగ్గట్టు ఇల్లు ఉండాలి కదా? అందుకే మాదాపూర్‌లో కోటి రూపాయల ఫ్లాట్ కొన్నాం. అబ్బాయి ముచ్చట పడ్డాడని కొన్నాను. వాడి జీతం మొత్తం ఇఐంఐలకు పోతోంది. నా జీతంతో ఇల్లు గడుస్తోంది. పిల్లలు కళ్ల ముందు ఎదుగుతుంటే ఇంత కన్నా సంతోషం ఏముంటుంది?’’
***
‘‘మంచి ఉద్యోగం కావడంతో మంచి సంబంధాలు వచ్చాయి. పోతే పోయింది కానీ పెళ్లి ఆర్భాటంగా చేశాం. అప్పు ఇప్పుడు కాకపోతే రేపు తీరుస్తాం కానీ జీవితంలో పెళ్లి ఒకేసారి కానీ మళ్లీ మళ్లీ రాదు కదా? నేనైతే మా పిల్లల మాట ఎప్పుడూ కాదనను. బర్త్‌డేనే ఆర్భాటంగా చేసే నేను పెళ్లి ఖర్చుకు వెనకాడుతానా? ’’
***
కొంచెం అటూ ఇటూగా మధ్య తరగతి కుటుంబరావుల ఇళ్లల్లో ఇలాంటి మాటలే వినిపిస్తాయి. అప్పు చేసైనా ఆనందం అనుభవించాలి.. నా డబ్బు, నా ఇష్టం.. నా అప్పు నేను కట్టుకుంటాను మధ్యలో మీ సలహా ఏంటి? అనే మాట కూడా వినిపించవచ్చు ఎవరైనా సలహాలు ఇవ్వాలని ప్రయత్నిస్తే... కానీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న వారి అలవాట్లను పరిశీలిస్తే మనకు చిత్రంగా అనిపించవచ్చు. కాళ్లు కడిగినప్పుడే కాపురం చేసే తీరు తెలుస్తుంది. అన్నట్టు చిన్న చిన్న అలవాట్లలోనే ఆ పెద్దవారి ఎదుగుదల కనిపిస్తుంది.
రిటైర్ అయ్యేనాటికైనా సొంత ఇల్లు సమకూర్చుకుంటే అదే మనం సాధించిన ఘన విజయంగా చాలా మంది భావిస్తారు. ఇంటి విలువే జీవితంలో తాను సంపాదించిన ఆస్తి చాలా మందికి. మహానగరంలో ఒక సొంత ఇల్లు ఉంది అంటే- కొంచెం అటూ ఇటూగా అర కోటీశ్వరుడన్న మాట.
స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వారు వారెన్ బఫెట్ పేరు వినకుండా ఉండరు. ఇనె్వస్ట్‌మెంట్ గురువుగా ప్రపంచంలో కోట్లాది మంది ఆయన్ని ఆరాధిస్తారు. ప్రపంచంలో పది మంది సంపన్నుల జాబితాలో తప్పని సరిగా కనిపించే వారెన్ బఫెట్ ఇంటి ఖరీదు ఈ లెక్కన ఎంత ఉండాలి? మన ఆస్తిలో వంద శాతం ఇంటి విలువే అయితే ఈ అంకెను తలకిందులుగా తిప్పితే ఎంత అవుతుందో బఫెట్ ఇంటి విలువ సరిగ్గా అంతే. ఆయన ఆస్తిలో 001% మాత్రమే ఆయన ఇంటి విలువ. నెబ్రస్‌కాలోని 1958లో 31,500 డాలర్లకు కొనుగోలు చేశారు. ఐదు పడక గదులున్న ఈ ఇంటినే బఫెట్ అంటిపెట్టుకుని ఉన్నారు. ప్రపంచంలో కెల్లా సంపన్నుడిగా మారినా, ఇంటిని మాత్రం మార్చలేదు. ఇప్పుడు దాని విలువ 250,000 డాలర్లు. తాను పెట్టిన పెట్టుబడుల్లో మూడవ అత్యున్నతమైన పెట్టుబడి ఈ ఇల్లే అంటారాయన నవ్వుతూ. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారికి, డబ్బుకు సంబంధించి ఆయన చెప్పిన మాటలు ఇనె్వస్టర్లకు ఉపనిషత్తు సూక్తుల వంటివి. సంపన్నులు పైలోకం నుంచి ఊడిపడరు. వాళ్లు కూడా మొదట్లో సామాన్యులే. వారి అలవాట్లు, ఆలోచనలే వారిని సంపన్నులుగా మారుస్తాయి.
గంటకో సిగరెట్, రోజుకో ప్యాకెట్ సిగరెట్లు తాగడం ద్వారా ఒక్కో దమ్ముకు బోలెడు సంతోషం కలుగుతుంది. ఇది అప్పటికప్పుడు కనిపించే కిక్కు. కానీ పొగ తాగడం వల్ల రోజుకు ప్యాకెట్, నెలకు 30 ప్యాకెట్లు లెక్క పెడితే డబ్బు, ఆరోగ్యం ఎంత పాడు చేసుకుంటున్నామో చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడు ఊపిరి తిత్తులు రిపేరింగ్‌కు వచ్చి ఆస్పత్రిలో బెడ్ మీద ఉన్నప్పుడు లెక్కిస్తే అలాంటి అలవాట్లు ఉన్నవారికి వారి మీద వారికే కోపం వస్తుంది. ఓ రెండు దశాబ్దాల పాటు పీల్చిన సిగరెట్లు గుండెలకు తూట్లు పొడుస్తుంది. అదే డబ్బును రెండు దశాబ్దాల పాటు ఇనె్వస్ట్ చేస్తే రిటైర్‌మెంట్ జీవితం ప్రశాంతంగా గడిచేట్టు చేస్తుంది.
అప్పు దేని కోసం చేస్తున్నామనేదే ముఖ్యం. అలవాట్లు, ఆడంబరాలకు అప్పులు చేసి రోడ్డున పడే జీవితాలు ఎన్నో కనిపిస్తాయి. సంపన్నుల జీవితాలను గమనిస్తే ఇలాంటి చిన్న చిన్నవే వారిని ఎక్కడికో ఏ విధంగా తీసుకు వెళుతుందో అర్థమవుతుంది. వారెన్ బఫెట్‌కు ఉన్న సంపదతో విశాలమైన భవనాలు నిర్మించుకోవచ్చు కానీ ఇప్పుడున్న ప్రాంతంలో సంతోషంగా ఉండగలుగుతున్నప్పుడు మరో చోటకు వెళ్లి సంతోషం వెతుక్కోవలసిన అవసరం ఏముంది? అంటాడతను. చివరు బఫెట్ వాడే కారు సైతం ఇలాంటిదే. ఆయన తలుచుకుంటే కారు కాదు ఏకంగా కార్ల కంపెనీని కొనగలరు. లాభసాటి అనుకుంటే కార్ల కంపెనీ కొంటారు. కార్ల కంపెనీల షేర్లు కొంటారు. కారు మార్చరు. 2014లో క్యాడిలాక్ కారును 45వేలకు కొనుగోలు చేశారు. అంతకు ముందే ఇదే కంపెనీ 2006 మోడల్ కారు ఉండేది. ఈ కారులో వెళుతుంటే ఇబ్బందిగా ఉందని కుమార్తె చెబుతుంది. ఏడాదికి 3500 కిలో మీటర్లకు మించి తిరగను, తరుచుగా కార్లు మార్చాల్సిన అవసరం ఏముంది అంటారాయన. బ్రేక్‌ఫాస్ట్‌కు 3.17 డాలర్లకు మించి ఎప్పుడూ ఖర్చు చేయనంటారు.
మరీ ఇంత పిసినారా? నాకే గనుక అంత ఆస్తి ఉంటే పెద్ద భవనంలో రాజభోగాలు అనుభవించే వాణ్ణి. విలాస వంతమైన కార్లలో తిరిగే వాణ్ణి అని చాలా మంది అనుకుంటారు. ఆలోచనల్లో ఇలాంటి తేడానే ఒకరిని పేదవారిగా నిలిపితే , మరొకరిని సంపన్నుడిగా మారుస్తుంది. ఎవరో అన్నట్టు పేదవాడిగా పుట్టడం తప్పు కాదు. పేదవాడిగానే ఉండిపోవడం తప్పు. చిత్రంగా మన దేశంలో రాజకీయాలు కూడా పేదరికాన్ని గ్లామరైజ్ చేసేశాయి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సంపన్నులు పేద, మధ్యతరగతి లో పుట్టిన సామాన్యులే తమ ఆలోచనలతో అవకాశాలు అందిపుచ్చుకుని సంపన్నులు అయ్యారు. మన భవిష్యత్తును మన ఆలోచనలే నిర్ణయిస్తాయి.
-బి.మురళి(Published Sunday, 22 April 2018 భూమి )

20, ఏప్రిల్ 2018, శుక్రవారం

అసలేం జరుగుతోంది..?

అసలేం జరుగుతోంది..?
ఇంతకీ ఏం జరుగుతోంది..?’’
‘‘శ్రీరెడ్డి పేరు శ్రీ శక్తిగా మారింది.బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి సినిమాల్లో త్యాగ మయ హీరో తప్పులన్నీ తనపై వేసుకొని రాజు వయ్యా మహ రాజు వయ్యాఅని పించుకొన్నట్టు వర్మ శ్రీ తప్పులను తనపై వేసుకొన్నాడు . వర్మకు ఇది కొత్త పాత్రే 
 . దేశంలో ఇరవై నిమిషాలకో అత్యాచారం జరుగుతోందని తేలింది. ప్రధాని దీక్షను తీవ్రంగా విమర్శించిన ముఖ్యమంత్రి ఈనెల 20న ‘హోదా’ కోసం దీక్ష చేస్తానని ప్రకటించారు. దీక్షకు కోట్ల రూపాయల ఖర్చుతో అదిరిపోయే ఏర్పాట్లు .ఫెడరల్ ఫ్రంట్‌లో కలిసేది లేదని సిపిఎం నేత తమ్మినేని ప్రకటించారు’’

‘‘తమ్మినేని పార్టీ ఇంకా ఉందా? ఉంటే ఎక్కడ..?’’
‘‘దేశమంటే రెండు తెలుగు రాష్ట్రాలేనా? ’’
‘‘సర్లే.. కమ్యూనిస్టులు కలవకపోయినా- ఒక్క సీటు గెలవక పోయినా , వాళ్లే ప్రధానమంత్రి అయితే సంతోషమే! మంగళగిరి సీటు కోసమే ఈ మహోద్యమం అని గిట్టని వాళ్లు విమర్శిస్తున్నారు. నేను ఎన్నో విశేషాలు చెబితే, తమ్మినేని గురించే అడిగావంటే ఆయనంటే నీకెంత అభిమానమో తెలుస్తునే ఉంది.’’
‘‘ఐతే- ఇప్పుడు శ్రీ శక్తి గురించి మాట్లాడనా మరి.. వద్దులే.. చట్టాన్ని ఆశ్రయించాలని పవన్ కల్యాణ్ చెప్పినందుకే నానా బూతులు తిడుతోంది.. ఆమె సంగతి మనకెందుకులే... ఆ చానల్స్ గంటల తరబడి.. రోజుల తరబడి చూపిస్తున్నా, చర్చిస్తున్నా ఇప్పటికీ నాకు విషయం అర్థం కాలేదు. టీవీ చర్చల్లో మొదటి రోజు ఆమె తెలుగు సినిమాల్లో తెలుగు వారికి అవకాశం ఇవ్వాలని కోరింది. ఒక సినిమా ఆయన ఫోన్ చేసి అవకాశం ఇస్తానన్నాడు. వ్యవహారం ఎటు నుంచి ఎటు పోయిందో.. ఆమెను మహోద్యమ నాయకురాలిగా ప్రకటించేశారు. ఇలా ఎలా అయిందని ఎవరినైనా అడుగుదామంటే నేనెంత అజ్ఞానంలో ఉన్నానో అందరికీ తెలిసిపోతుందని అడగలేదు. ఈ పాపులారిటీతో ఆమె రెండు రాష్ట్రాల్లో జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తే ఎన్నికల్లో నిలబడేట్టుగానే ఉంది. పది మంది అనుచరులు లేని వాళ్లు కూడా పార్టీ పెట్టేస్తుండగా, ఆమె పెడితే కొత్తగా పోయేదేముంది?’’
‘‘రాఖీ సావంత్ ఆ మధ్య పార్టీ పెట్టింది. ఏమైందో తెలియదు. పద్మనాభం హీరోగా వచ్చిన జాతకరత్న మిడతం భొ ట్లు సినిమా చూశావా? మిడతం భొట్లు తన నోటికి వచ్చింది ఏదో అనేస్తాడు. అవే జరుగుతాయి. అంతా అతడ్ని కా లజ్ఞానిగా కీర్తిస్తారు. కాలం కలిసొస్తే శ్రీరెడ్డి కాస్తా స్ర్తిశక్తిగా మా రుతుంది. ’’
‘‘అర్థం కాలేదు..’’
‘‘కొన్ని విషయాలు అర్థం అయి కాకుండా ఉంటేనే బాగుంటుంది. జ్యోతిలక్ష్మి డ్యాన్స్‌లా?’’
‘‘ఒకదానికొకటి అస్సలు సంబంధం లేదు కదా? ’’
‘‘ఉందనుకుంటే ఉంది.. లేదనుకుంటే లేదు.’’
‘‘ఏమడిగినా సినిమాలనే ఉదహరిస్తావెందుకు?’’
‘‘సినిమాలు, జీవితం వేరు కాదు.. పాలలో నీళ్లలా ఒకదానిలో ఒకటి కలిసిపోయాయని నమ్ముతాను కాబట్టి’’
‘ఈ వివాదాలు ఎందుకు కానీ.. ఎల్లుండి ఢిల్లీలో మా అబ్బాయి గృహ ప్రవేశం.. నువ్వు వస్తావా?’’
‘‘మీ వాడు తొందరపడి ఢిల్లీలో ఇల్లు కట్టాడు.’’
‘ఢిల్లీ కొచ్చిన ముప్పేముంది? వద్దంటున్నావు’’
‘ 
‘ఢిల్లీ భస్మం అయినప్పుడు అందులో ఉన్న మీ వాడి ఇల్లు కూడా బూడిద అవుతుంది.’’
‘‘1999లో, 2012లో యుగాంతం జరిగిపోతుందని వి న్నాం. 2018లో యుగాంతం అని కొత్తగా ప్రచారం ఏదైనా ప్రారంభం అయిందా? ’’
‘‘నీవేం మిస్సవుతున్నావో నీకే అర్థం కావడం లేదు. హైదరాబాద్ పత్రికల్లో చదివితే నీకేముందని? తెలంగాణకు వరప్రసాదం కాళేశ్వరం, రైతులకు వ్యవసాయ పెట్టుబడి.. వంటి చప్పటి వార్తలే తప్ప. మసాలా ఉన్న గొప్ప వార్తలు మి స్సవుతున్నావు.’’
‘ఢిల్లీలో శివప్రసాద్ వేషాలతో పాటు అన్నీ చూసి తరించాను. మరింకేం మిస్సయ్యాను.?
‘‘మూడోకన్ను తెరిస్తే ఢిల్లీలో ప్రభుత్వం భస్మం అవుతుందని నందమూరి బాలకృష్ణ అనంతపూర్‌లో చెప్పిన వార్త హైదరాబాద్‌లో వచ్చిందా? ’’
‘‘రాలేదు..’’
‘‘తెలుగువారు ఒక్కసారి తొడకొట్టి ఢిల్లీకి వినిపించాలని పిలుపు ఇచ్చారు. నువ్వు విన్నావా? ’’
‘‘నిజమా? నాకు తెలియదు.. బహుశా ఆయన పిలుపు అమరావతి ఎడిషన్ దాటి పోలేదేమో .. పోయి ఉంటే నిజంగా ఒక్కసారి తెలుగు వారంతా తొడ కొడితే ఢిల్లీ ప్రభుత్వం గజగజ వణికిపోకుండా ఉంటుందా? ’’
‘‘వ్యంగ్యమా..?’’
‘‘కంటిచూపుతో ఆయన రైలును వెనక్కినడిచేట్టు చేశాడు. ఈ రోజే టీవీలో చూశా.. అదేదో సినిమాలో పాతికమంది ఆడవిలన్లతో త్రిష బాలకృష్ణపై దాడికి వస్తుంది. ఏం జరుగుతుందా? అని ఉత్కంఠ.. పాతికమంది ఆడపులుల్లా మీదకు వస్తుంటే ధైర్యంగా ఉన్న బాలకృష్ణ..’’
‘‘ఆ.. ఆ అప్పుడేమవుతుంది?’’
‘‘నేను కూడా ఇలానే ఏమవుతుందా? అని ఉత్కంఠగా చూశాను. అమ్మాయిలు అడుగులో అడుగేసుకుంటూ పైపైకి వస్తుంటే జేబులో చెయ్యి పెట్టిన బాలకృష్ణ..’’
‘‘గన్ తీశాడా..?’’
‘‘అంతకన్నా శక్తివంతమైన ఆయుధం’’
‘‘ఎకె 47?’’
‘‘అది జేబులో పట్టదు. 
జేబులో నుంచి బాడీ స్ప్రే తీసి తనపై కొట్టుకున్నాడు. అంతే.. చీల్చి చెండాడానికి వచ్చిన ఆ పాతిక మంది అమ్మాయిలు ఆ వాసనకు.. అదే ఫర్మ్యూమ్ సువాసనకు ఆయనపై పడిపోతే పాపం.. త్రిష వాళ్లను పక్కకు లాగలేక నానా తంటాలు పడింది.’’
‘‘మేగ్నట్‌కు ఇనుము అతుక్కు పోయినట్టు, పాతిక రూపాయల బాడీ స్ప్రేకు పాతికమంది అతుక్కు పోతారని బాలయ్య బాబు ద్వారా- ఆ సినిమా సభ్యసమాజానికి గొప్ప సందేశం ఇచ్చింది.’’
‘‘ఎన్టీఆర్, బాలయ్య బాబులను మించి సాహసాలు చేసిన హరికృష్ణ టాలెంట్‌ను తొక్కేస్తున్నారు. ’’
‘‘వీరిని మించిన టాలెంట్..? నేను నమ్మను..’’
‘‘ఇద్దరు ఎన్టీఆర్‌లు, బాలకృష్ణల వరకు ఏం చేశారు- మహా అయితే పులిని, సింహాన్ని చంపేశారు, సుమోలను గాలిలోకి లేపారు. అంతే కదా? కానీ హరికృష్ణ సింహాన్ని చిత్తుగా ఓడించి కాడికట్టి పొలం దున్నించాడు.’’
‘‘ఆ..’’
‘‘విజయరామరాజు సినిమాలోనట.. టీవీలో ఆ దృశ్యం వస్తే చూశా. ఇంతటి టాలెంట్ వల్ల తనకు ఎప్పటికైనా ప్రమాదం అని తెలిసే కావచ్చు హరిని పక్కన పెట్టారు. ’’
‘‘మన చర్చ దారి తప్పుతుందేమో?’’
‘‘ఎలా?’’
‘‘సినిమా వేరు, వాస్తవం వేరు. రాజకీయ పరిణామాలు అనే సీరియస్ విషయాలను నువ్వు సినిమాలతో కలిపి మాట్లాడుతున్నావ్’’
‘‘్ఢల్లీ భస్మం చేయడం గురించి బాలయ్య బాబు చెప్పి న డైలాగు సినిమాలో కాదు అనంతపురం సభలో.. ఆ డైలాగు విని జనం కేరింతలు కొట్టారు. ప్రత్యేక హోదా ఇచ్చేస్తాం అని మోదీ ప్రకటించినా అంతటి చప్పట్లు వినపడవేమో! సినిమా, వాస్తవం కలిసిపోయి చాలాకాలం అయింది. రెండు గంటల్లో సినిమా ముగుస్తుంది. రాజకీయ సినిమా ఏళ్ల తరబడి సాగుతుంది. ఎన్నికల ఏడాదిలో రాజకీయ సినిమా మలుపులతో ఉర్రూతలూగిస్తుంది.’’
‘‘ఎంత గొప్ప సినిమా ఐనా రెండు గంటల తరువాత థియేటర్ నుంచి బయటకు రావాలి. రాకపోతే జీవితం ఉండదు. ’’ *

బుద్దా  మురళి (జనాంతికం 20.4.2018)

16, ఏప్రిల్ 2018, సోమవారం

విలువలకే ప్రాధాన్యం

డబ్బుకు మనం విలువ ఇస్తే- అది మనకు విలువ ఇస్తుంది. మనం నిర్లక్ష్యం వహిస్తే ధనం తానేంటో చూపిస్తుంది. అసామాన్య విజయాలు సాధించిన కొందరి జీవిత అలవాట్లను తెలుసుకుంటే మనపై వారి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది.
చేతిలో చిల్లిగవ్వ లేని హీరో అందమైన అమ్మాయిని ప్రేమిస్తాడు. ‘డబ్బు లేని నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎలా పోషిస్తావ’ని తండ్రి ప్రశ్నిస్తే- ‘మిస్టర్ కుటుంబరావ్.. డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాదు. ఆరునెలల్లో నీ కన్నా ఎక్కువ సంపాదించి చూపిస్తాను’ అని ఏమీ లేని బికారి హీరో కోటీశ్వరుడైన హీరోయిన్ తండ్రిని చాలెంజ్ చేసి, తాను ముందుగా చెప్పినట్టుగానే ధనం సంపాదించి హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటాడు. ఇది సినిమా కథ. ఇలాంటివి సినిమాల్లోనే సాధ్యం అవుతాయి కానీ నిజజీవితంలో అలా ఉండదు. జీవితంపై ఎలాంటి అవగాహన లేకుండా ఆవారాగా తిరిగే హీరో సినిమాలో కోటీశ్వరుడు అవుతాడేమో కానీ నిజ జీవితంలో అలా జరగదు.
మనం నడిచే దారే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇన్ఫోసిస్ సుధామూర్తి ప్రేమ- జీవితం సినిమా కథ లాంటిదే. ఐతే సినిమాలో హీరో చాలెంజ్ చేసి సంపాదించి హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటాడు. కానీ సుధామూర్తి దంపతులు సామాన్యులుగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, తమ జీవిత విధానం ద్వారా సంపన్నులు అయ్యారు. ఎంతటి సంపన్నులు అంటే వాళ్ల కంపెనీలో ఓ పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టిన వారు కేవలం పదేళ్లలో కోటీశ్వరులు అయ్యారు. వేల కోట్ల ఆస్తి ఉన్న ఆ దంపతులను చూస్తుంటే- మధ్యతరగతి కుటుంబీకుల్లా కనిపిస్తారు. అలా కనిపించడమే కాదు, వారి జీవిత విధానం కూడా అలానే ఉంటుంది.
సుధామూర్తి ఇచ్చిన పదివేల రూపాయల పెట్టుబడితో నారాయణమూర్తి ‘ఇన్ఫోసిస్’ సంస్థను ప్రారంభించి అంతర్జాతీయంగా ఖ్యాతి గడించారు. ఒకరు ఇంటి బాధ్యత, ఇంకొకరు కంపెనీ బాధ్యత పంచుకుని జీవితంలో ఊహించని స్థాయికి ఎదిగారు.
ఖరీదైన చీర కొనుక్కోవడానికి కూడా ఇష్టపడిన సుధామూర్తి ఇంట్లో సుమారు 20 వేల పుస్తకాలున్నాయి. ఇంటి కోసం కొనడమే కాదు, కర్నాటకలో దాదాపు 60వేల గ్రంథాలయాలకు ఈ దంపతులు ఉచితంగా పుస్తకాలు అందజేశారు. వీరి పెళ్లి ఖర్చు కేవలం ఎనిమిది వందల రూపాయలు. ఆ ఖర్చును చెరి సగం భరించామని సుధామూర్తి నవ్వుతూ చెబుతుంటారు.
అసామాన్య విజయాలు సాధించిన వారు ఎలాంటి ప్రత్యేకతలు కలిగి ఉండరు. అందరిలానే వీరికీ రోజుకు ఇరవై నాలుగు గంటలే ఉంటాయి. అందరిలానే రెండు చేతులు, రెండుకాళ్లే ఉంటాయి. కానీ 24 గంటలూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆలోచనలే మనిషిని ఉన్నత స్థాయికైనా, పతనానికైనా తీసుకువెళతాయి. మనం ఎలాంటి ఆలోచనలతో వెళుతున్నామనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
సినిమా రంగంలో అత్యున్నత స్థానం నుంచి అధఃపాతాళానికి పడిపోయిన ఎందరో మహానుభావుల గురించి మనకు తెలుసు. దీనికి భిన్నంగా ఒక సామాన్యురాలు అత్యున్నత స్థాయికి చేరుకున్న సుధామూర్తి ఎందరికో స్ఫూర్తిదాతగా నిలిచారు.
ఆడవారి షాపింగ్ మీద ఉన్నన్ని జోకులు మరే అంశంపై ఉండవేమో! గంటల తరబడి మహిళలు షాపింగ్‌లో కాలం గడుపుతారనే పేరు. వారు అలంకరణకు ప్రాధాన్యత ఇవ్వడం సాధారణమే. కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి ఉన్న మహిళ షాపింగ్‌కు వెళితే ఎలా ఉంటుందో అని మనం ఏవేవో ఊహించుకుంటాం. కానీ, ‘ఇన్ఫోసిస్’ నారాయణ మూర్తి భార్య, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి గత 20 ఏళ్ల నుంచి కనీసం ఒక చీర కూడా కొనలేదు. పుణ్యక్షేత్రమైన కాశీకి వెళ్లిన వారు తమకు ఇష్టం అయిన ఏదో ఒక దాన్ని అక్కడ వదిలేయడం సంప్రదాయం. ఎక్కువ మంది తమకు నచ్చిన ఆహార పదార్థాన్ని వదిలేస్తారు. సుధామూర్తి మాత్రం షాపింగ్ అలవాటును వదిలేశారు. అప్పటి నుంచి కొత్తగా చీరలేమీ కొనలేదు.
‘అక్రమాల ద్వారానే డబ్బు సంపాదిస్తారనే ఆలోచన తప్పు. ధర్మ బద్ధంగా కూడా ధనం సంపాదించవచ్చు’ అని ఇన్ఫోసిస్‌ను ప్రారంభించినప్పుడు తన మిత్రులను ఉద్దేశించి నారాయణమూర్తి చెప్పిన మాట. చెప్పడమే కాదు, ఆయన ఆచరణలో చూపించారు. విలువలకు కట్టుబడిన ‘ఇన్ఫోసిస్’ సంస్థ ఐటి రంగంలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా నిలిచింది.
భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ‘ఇగో’ల పోరాటం కాదు. ఒకరికొకరు చేయుతనివ్వడం. సుధామూర్తి వల్లనే తాను విజయం సాధించానని, తన విజయంలో ఆమెదే ముఖ్యపాత్ర అని నారాయణమూర్తి చెబుతారు. విచ్చలవిడిగా ధనం ఖర్చు చేసి, ఖరీదైన కార్లలో తిరగడమే సంపన్నత కాదు. వందల కోట్ల ఆస్తి ఉన్నా సామాన్యుల్లానే జీవిస్తూ, తాము సంపాదించిన డబ్బుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సంపూర్ణ జీవితం గడుపుతున్న సుధామూర్తి, నారాయణమూర్తి దంపతుల జీవితం ఆద్భుతం. డబ్బుకు మనం విలువ ఇస్తే అది మనకు విలువ ఇస్తుందని ఈ దంపతుల జీవితాలను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఏ రంగంలోనైనా సకాలంలో అడుగు పెట్టడం ముఖ్యం అంటారు నారాయణ మూర్తి. 1971లోనే ఐటి రంగం అభివృద్ధిని ఊహించి ఆ రంగంలో అడుగు పెట్టడమే కాకుండా ఘన విజయం సాధించి, విలువలతో జీవనం సాగిస్తున్నారు. విలాసాలతో ఎంతో మంది సంపన్నులు బికారులుగా మారిపోయిన ఈ కాలంలో సామాన్యులకే కాదు, సంపన్నులకూ వీరి జీవితం ఆదర్శప్రాయం.
-బి.మురళి

13, ఏప్రిల్ 2018, శుక్రవారం

జైజై.. ఫేక్‌న్యూస్..!

ఏమోయ్.. మీ అన్నయ్య వచ్చాడు.. కాస్త టీ తీసుకురా!’’
‘‘చక్కెర కాస్త ఎక్కువేసి తీసుకురా చె ల్లెమ్మా.. ‘హోదా’ కోసం నా వంతు ఉద్యమం ఇదే. షుగర్ ఉన్నా ఎక్కువ చక్కెర వేసుకుని టీ తాగడం ద్వారా కేంద్రానికి నిరసన తెలుపుతున్నా..’’
‘‘ఇదేదో బాగుందిరోయ్! నిరసనలో భాగంగా సాయంత్రానికి బదులు, ఉదయమే బార్‌కు వెళదామా?’’
‘‘నిరసన ఉద్యమాలు మీ మగాళ్లకేనా? ఆడాళ్లం కూడా వస్తాం. ఏమంటారు అన్నయ్య గారూ.. వదిన ఇంటి దగ్గరే ఉంది కదా?’’
‘‘ఏదో సరదాగా అన్నాను లేవోయ్.. నిజంగా వెళ్లేంత ధైర్యం ఉందా నాకు.. ఐనా ఇదేంటోయ్.. ఇంటర్వెల్ నుంచి సినిమాకు వెళ్లడం, వంద మీటర్ల పాదయాత్ర, పెరుగుకు బదులు మజ్జిగతో అన్నం తినడం, రెగ్యులర్‌గా వెళ్లే బాబాయ్ హోటల్‌కు బదులు అబ్బాయ్ హోటల్‌లో చట్నీ లేకుండా ఇడ్లీ తినడం ఉద్యమమేనా?’’
‘‘ప్రత్యేక హోదా గురించి పార్లమెంటులో అడిగితే జవహర్ లాల్ నెహ్రూ గురించి, స్వాతంత్య్ర పోరాటం గురించి ప్రధాని చెబితే తప్పు లేదు కానీ పప్పు లేకుండా సాంబార్‌తో వడలు తింటూ ఉద్యమిస్తే తప్పా? ఉద్యమం జాతీయ స్థాయి మీడియాను ఆకర్శించడానికి ఆలూ రహిత సమోసాలు తింటూ ఉద్యమిస్తాం’’
‘‘ప్రధాని అంటే గుర్తుకు వచ్చింది. నీకో రహస్యం తెలుసా? బలూచిస్తాన్‌ను ఇండియాలో కలిపేయడానికి 1947లో అక్కడి రాజు ఒప్పందం చేసుకున్న తరువాత కూడా నెహ్రూ వద్దని తిరస్కరించాడు ?’’
‘‘నిజమా..?’’
‘‘అంతేకాదు.. నేపాల్ కూడా ఇండియాలో కలిసి పోతాం అంటే నెహ్రూనే వద్దన్నాడు. శ్రీలంకనూ అలానే తిరస్కరించాడు.. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే 1950లో ఇండియాకు ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం ఇస్తామని ఆఫర్ ఇస్తే నెహ్రూ వద్దన్నాడు. 1955లో రష్యా ఇలానే ఆఫర్ ఇచ్చినా నెహ్రూ ససేమిరా అన్నాడు.’’
‘‘ఎందుకు వద్దన్నాడు..? కొంపదీసి మోదీ ప్రధాని అయితే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడవుతాడని- దశాబ్దాల క్రితమే ఊహించి అన్నింటికీ నెహ్రూ వద్దని మోకాలడ్డాడా ఏంటి?’’
‘‘కాదు.. అసలు నెహ్రూ ఈ దేశస్థుడు కాడు. ఇరాన్‌కు చెందిన వాడు.. అందుకే వద్దన్నాడు.’’
‘‘నిజమే కానీ ఇంత ఆశ్చర్యకరమైన విషయాలు ఏ మీడియాలో రాలేదేంటి? అన్ని పార్టీలకూ మీడియా ఉంది కదా? ఎందుకు రాలేదంటావు. ఐనా ఇవన్నీ నీకెలా తెలిశాయి?’’
‘‘అందుకే చెప్పాను వాట్సాప్‌ను రెగ్యులర్‌గా చూడాలని. ఇలాంటి అద్భుతమైన రహస్యాలు ప్రచురించే ధైర్యం మీడియాకు లేదు. వాట్సాప్‌లో పెడతారు. మా వాట్సాప్ గ్రూప్‌లో చేరు.. నీకూ తెలుస్తాయి విశ్వ రహస్యాలు ఎన్నో’’
‘‘నాన్నోయ్ .. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ అంటే ఎవరు నాన్నా?’’
‘‘ఏరా! లక్షల ఫీజు కట్టి నిన్ను కార్పొరేట్ స్కూల్స్‌లో చేర్పించింది ఇందుకేనా? గాంధీ జీ , నెహ్రూల గురించి తెలుసుకొంటే ఇక ఐఐటీ సీటు నీకేమొస్తుంది .?ఇంకా ఎక్కువగా టైం లేదు. ఇంకో ఆరేళ్లయితే ఐఐటి ఎంట్రెన్స్ టెస్ట్ రాయాలి. టెస్ట్‌కు సిద్ధం కాకుండా టైం వృథా చేస్తున్నావు. ఆరేళ్లంటే ఇలా చూస్తుండగానే వచ్చేస్తుంది. గదిలోకెళ్లి చదువుకో.. ఐనా గాంధీ, నెహ్రూ ఈ పేర్లు నీకెవరు చెప్పార్రా? రేపు మీ స్కూల్‌కు వచ్చి ప్రిన్సిపాల్‌ను- లక్షల్లో ఫీజు చెల్లిస్తే మీరు చెప్పే చదువు ఇదేనా? అని నిలదీస్తాను.. కడిగేస్తాను.’’
‘‘స్కూల్‌లో చెప్పలేదు నాన్నా! టైం వేస్ట్ అని మా టెక్నో స్కూల్‌లో స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటివి కూడా జరపరు. మా ఫ్రెండ్ టింకూ వాళ్ల నాన్న ఫోన్‌లోని ఆశ్చర్యకరమైన వార్తలు మా అందిరికీ ఫార్వర్డ్ చేశాడు. టింకూ వాళ్ల నాన్న అదేదో పార్టీ ప్రచారం వాట్సాప్ వార్తలు తయారు చేస్తాడు. ఈ వార్తలు మార్కెట్‌లోకి విడుదల కాక ముందే టింకూ మాకు చూపిస్తాడు. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా ప్రాక్టిస్ చేసేప్పుడు బ్రిటీష్ వాళ్లు కొన్ని కేసులు ఇచ్చారట! ఆ కృతజ్ఞతతో గాంధీజీ మా దేశానికి స్వాతంత్య్రం వద్దే వద్దు మీ ఇష్టం ఉన్నన్ని రోజులు పాలించుకోండి అని రాసిచ్చాడట! సాక్షి సంతకం నెహ్రూ చేశాడట! ‘అప్పటికి ఇంకా పుట్టని వాళ్ళ ’ పార్టీ వారు ఈ ఘోరాన్ని చూడలేక పోరాటం చేసి స్వాతంత్య్రం తీసుకువచ్చారట! మళ్లీ ఇప్పుడు బ్రిటీష్ వారికే దేశాన్ని అప్పగించే కుట్ర జరుగుతుందట! ఇవన్నీ మాకు వాట్సాప్‌లో వచ్చాయి. అంతేకాదు నాన్నోయ్.. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత బ్రీటిష్ సామ్రాజ్యాన్ని ఇండియాలో కలిపేయాలని ఆ దేశ ప్రజలంతా కోరితే.. బ్రిటన్ రాణి అంటే ఉన్న అభిమానంతో నెహ్రూ- ‘మీ దేశాన్ని మీరే పాలించుకోండి మాకు వద్దు’ అన్నాడట! నెహ్రూ చాలా తప్పు చేశాడు కదా నాన్నా.. బ్రిటన్‌ను మన దేశంలో కలిపేస్తే పాస్‌పోర్ట్, వీసా కోసం ఇబ్బంది పడేవాళ్లం కాదు. మీరు చెప్పుకునే వా ట్సాప్ వార్తలన్నీ పాతవి నాన్నా.. టింకూ మాకు కొత్త కొత్త వార్తలు జనానికి చేరకముందే చెబుతాడు. ’’
‘‘ఔన్రా.. ట్రంప్‌కు పాలించడం రావడం లేదు. మీ ‘చినబాబు’ను మా దేశానికి పంపించండి అని అమెరికా ప్రజలు ఏడుస్తూ వేడుకుంటున్నారట! అమెరికా కన్నా సొంత రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అని చినబాబును పంపడం లేదట! ’
‘‘వీళ్ళ ప్రచారం ఇలా ఉంటే ప్రచారం లో ప్రపంచానికి పాఠాలు చెప్పే వాళ్ళు ప్రధాని గుజరాత్ లో ప్రాథమికోన్నత పాఠశాల లో చదివేప్పుడు పక్క వాడి టిఫిన్ బాక్స్ నుంచి డోక్లా ఎత్తుకెళ్లిన దాన్ని కళ్ళకు కట్టినట్టు చూపుతూ ప్రచారం చేస్తున్నారు . ప్రపంచం లోని ప్రతి సమస్యకు ప్రధాని ఏవిధంగా కారకులో  అరటి పండు వలిచి పెట్టినట్టు వివరిస్తున్నారు . ప్రచారం లో సమ ఉజ్జిల మధ్య రసవత్తర మైన పోటీ చూస్తుంటే విఠలాచార్య సినిమాలో కాంతారావు రాజనాల ల మధ్య కత్తి యుద్ధం చూస్తున్నంత రంజుగా ఉంది .  
‘‘ఏమండీ.. ఇవన్నీ నిజమేనా? ’’
‘‘పిచ్చి పార్వతీ.. ఇంతోటి దానికే ఇలా షాకైతే ఎలా? నీకు వడ్డాణం చేయిస్తాను, బంగారు గాజులు చేయిస్తానని పెళ్లప్పుడు మాటిచ్చి ఇప్పటి వరకు ఎందుకు చేయించలేదో తెలుసా? ’’
‘‘డబ్బు లేక..’’
‘‘డబ్బు లేక కాదు.. నెహ్రూ వద్దన్నాడు.. లేకపోతే ఎప్పుడో చేయించేవాణ్ణి. అప్పుడు పక్కనే ఉన్న మహాత్మా గాంధీ కూడా అభ్యంతరం చెప్పలేదు.’’
‘‘గాంధీ ఐతేనేం, నెహ్రూ ఐతే నేం.. మగాళ్లంతా ఇంతే.. భార్యకు బంగారు నగలు చేయించాలంటే వద్దనేవాళ్లే’’
‘‘ఇవన్నీ వింటుంటే పిచ్చెక్కేట్టుగా ఉంది.. ఏది వ్యంగ్యమో, ఏది నిజమో అర్థం కావడం లేదు.’’
‘‘ఐదేళ్ల పాలనలో సాధించినవి చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నవాళ్లు ఇదిగో మేం ఇవి సాధించాం తిరిగి అవకాశం ఇవ్వండి అని అడుగుతారు. చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడే.. ఎవరి స్థాయిలో వాళ్లు తాంతియా తోపేదే తప్పంతా అని ఫేక్ న్యూస్‌పై ఆధారపడతారు.’’
*

9, ఏప్రిల్ 2018, సోమవారం

ధనం మూలం...ఒక పొరపాటుకు యుగములు వగచేవు-

ఒక పొరపాటుకు యుగములు వగచేవు- అంటాడో సినీ కవి. తారలకే కాదు ఏ రంగంలో ఉన్న వారికైనా మనుషులందరికీ ఇది వర్తిస్తుంది. ఒక పొరపాటు జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది. పేదరికంలో పుట్టి సంపన్నులుగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. కానీ సుదీర్ఘ కాలం మహరాణిలా బతికి, చివరి రోజుల్లో దీనంగా బతకడం వంటి కష్టాలు పగవాడికి కూడా వద్దు అనిపిస్తుంది.
అన్నీ అనుకున్నట్టే జరగవు.. నిజమే. కానీ మన చేతిలో ఉన్నంత వరకైనా మనం కోరుకున్నట్టు జీవితంలో చివరి దశ ఉండేట్టు ముందుగానే ప్రణాళిక రూపొందించుకోవచ్చు.
ఆమె పేరు ఎస్. వరలక్ష్మి ఆమె జీవితం నిజంగానే దేవుడిచ్చిన వరం లాంటిది. కానీ- ముగింపు శాపం లాంటిదే.
ఎస్.వరలక్ష్మి ఈ తరం వారికి తెలియకపోవచ్చు. అందమైన రూపం, దానికి తగిన గాత్రం. పాటలు పాడే మాట దేవుడెరుగు, మాటలు రాకపోయినా డబ్బింగ్‌తో నడిపించేస్తున్న కాలం ఇది. తెలుగు సినిమాలకు ప్రారంభ కాలంలో నటులు తమ పాటలను తామే పాడుకునే వారు. ఆ తరువాత నేపథ్య గాయనీ గాయకులు వచ్చారు. భానుమతి, ఎస్.వరలక్ష్మి లాంటి వారు తమ పాటలు తామే పాడేవారు. ఎస్.వరలక్ష్మి నటన ఎంత బాగుంటుందో, ఆమె పాటలు కూడా అంతే బాగా పాడేవారు. 1936లో బాలనటిగా తన నట జీవితాన్ని ప్రారంభించిన వరలక్ష్మి నటించిన చివరి సినిమా 1986లో వచ్చిన ‘ముద్దుల కృష్ణయ్య’. ఐదు దశాబ్దాల పాటు బాలనటిగా, హీరోయిన్‌గా, క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా సుదీర్ఘ కాలం నటించిన ఆమె జీవితం ఎలా ఉండాలి? సరైన ప్రణాళిక లేకపోతే చివరి రోజులు ఎంత దుర్లభంగా మారుతాయో ఎస్.వరలక్ష్మి జీవితాన్ని చూసిన వారికి కన్నీళ్లు తెప్పించాయి.
***
ఓసారి పలకరిద్దామని మద్రాస్‌లో ఎస్.వరలక్ష్మి ఇంటికి ఆ కాలం నటులు జమున, గీతాంజలి వెళ్లారు. ‘‘ఒకప్పుడు సినిమాలో హీరోయిన్‌గా మంచి అందగత్తెగా ఒక వెలుగు వెలిగిన వరలక్ష్మిని ఆ స్థితిలో చూసి తట్టుకోలేక పోయాను. నైటీలో అనామకంగా కనిపించిన ఆమెను చూసి ఏడ్చేశాను. మతిస్థిమితం సరిగా లేని కుమారుడికి అన్నం తినిపిస్తూ పాత నైటీతో ఆమె కనిపించారు. అందమైన రూపం, అద్భుతమైన గాత్రానికి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆనాటి వరలక్ష్మినేనా నేను చూస్తున్నది అని కన్నీళ్లు వచ్చాయి. ఆమెను గట్టిగా కౌగిలించుకుని ఏడ్చాను. అమ్మా అన్నీ పోయాయి. చివరకు ఆ గాత్రం అయినా నీతో ఉందా? ఒక పాట పాడు అని కన్నీటితోనే అడిగాను. పాడింది. రూపం మారినా గొంతు అద్భుతంగా ఉంది. మధురంగా పాడింది. మేం ఆ ఇంట్లోకి వెళ్లినప్పటి నుంచి ఎస్ వరలక్ష్మి భయం భయంగా పైకి చూస్తూ మీరు వెళ్లిపోండి... మీరు వెళ్లిపోండి .. వాళ్లు చంపేస్తారు-అని భయం భయంగా మాట్లాడింది. ఎవరు చంపుతారు? నీకే భయం లేదు. మేమున్నాం.. అని ఎంత ధైర్యం చెప్పినా మీరు వెళ్లండి.. అంటూ పంపించింది. మద్రాస్ నగర పోలీసు కమిషనర్‌కు చెప్పి పోలీసు భద్రత ఏర్పాటు చేయమని కోరాను’’ అంటూ ఇటీవల ఈ వ్యాస రచయిత సీనియర్ నటి జమునను కలిసినప్పుడు వరలక్ష్మి గురించి చెప్పారు. అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితను కలిసి ఎస్.వరలక్ష్మిని ఆర్థికంగా ఆదుకోవాలని కోరాను. తనతో పాటు హీరోయిన్లుగా నటించిన కొద్ది మందికి జయలలిత ఒకసారి విందు ఇచ్చారు. ఆ విందులో కలిసినప్పుడు ఐదులక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలని కోరితే ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పాను. ఐదు కాదు ఎస్ వరలక్ష్మి పేరు మీద పది లక్షలు డిపాజిట్ చేసి ఆ వడ్డీ ఆమెకు వచ్చే ఏర్పాటు చేసినట్టు చెప్పారు. బాల నటిగా, హీరోయిన్‌గా, క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా ఐదు దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగిన నటి చివరి దశ అలా ఉండడం తట్టుకోలేక పోయాను. ఎస్ వరలక్ష్మి వివాహం తరువాత అలా మారిపోయారు. ఇంట్లో వాళ్లు ఎవరితో కలవనిచ్చే వారు కాదు. ఒకసారి రావికొండల రావు ఆమెను పలకరించేందుకు వెళితే ఇంట్లో వాళ్లు కలిసే అవకాశం ఇవ్వలేదు.
ఆ కాలనీకి చెందిన ప్రముఖ నిర్మాత ఎఎల్ శ్రీనివాసన్‌ను ఎస్.వరలక్ష్మి పెళ్లి చేసుకున్నారు. వివాహం తరువాత ఆమెను పంజరంలో బంధించినట్టు అయింది. ఆమెకు కుమారుడు, కుమార్తె. సినిమా రంగానికి చెందిన వారు ఎవరైనా ఆమెను కలిసేందుకు ఇంటికి వచ్చినా కలవనిచ్చే వారు కాదు. కుమారుడి మానసిక స్థితి సరిగా లేకపోవడం, ఇంటిని బందిఖానాగా మార్చిన కుటుంబం ఆమెను బాగా కుంగదీశాయి.
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నాడు పుట్టడం వల్ల ఆమెకు వరలక్ష్మి అని పేరు పెట్టారు. 1939లో వచ్చిన బాలనాగమ్మ, 1957లో వచ్చిన సతీసావిత్రి వంటి సినిమాల్లో నటించారు. దీపావళి, శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం, మాంగల్య బలం, ఆదర్శ కుటుంబం, ప్రేమ్‌నగర్, బొమ్మా బొరుసా, శ్రీకృష్ణార్జున యుద్ధం, లవకుశ, సత్య హరిశ్చంద్ర, శ్రీకృష్ణ పాండవీయం, ఉమ్మడి కుటుంబం వంటి సినిమాల్లో ఆమె నటించారు. తెలుగులోనే కాకుండా పలు తమిళ సినిమాల్లో కూడా నటించారు.
ఈ రోజుల్లో హీరోయిన్లకు రెండు మూడేళ్లపాటు స్థిరంగా అవకాశాలు దొరకడం లేదు. ఐనా వాళ్లు జాగ్రత్తగా ఉంటున్నారు. ఐదు దశాబ్దాల పాటు సినిమా రంగంలో ఉన్నా ఎస్.వరలక్ష్మి మాత్రం తన వివాహ విషయంలో అజాగ్రత్తగా ఉండడం వల్ల చివరి రోజులు దయనీయంగా గడిచాయి. ఐదు దశాబ్దాలు అద్భుతంగా గడిచిన ఆమె జీవితం అంతిమ దశలో మాత్రం బాధాకరంగా సాగాయి.
చివరి దశలో జీవితం ఎలా గడవాలనేది జీవితం ప్రారంభ దశలోనే నిర్ణయించుకోవాలి. దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. లేకపోతే ఎవరికైనా అంతిమ దశ బాధాకరంగానే ముగుస్తుంది. జీవిత చరమాంకం ఏ విధంగా ఉండాలనేది మన చేతిలోనే ఉంటుంది. మన గురించి మనమే పట్టించుకోనప్పుడు దేవుడు కూడా పట్టించుకోడు.
ఎస్.వరలక్ష్మిని జీవిత కాలమంతా అదృష్టం వెన్నంటి నిలిస్తే, చివరి దశలో మాత్రం దురదృష్టం బలంగా ప్రభావం చూపింది.
- బుద్ధా మురళి(

6, ఏప్రిల్ 2018, శుక్రవారం

ఆర్టీఐ ద్వారా అడుగాల్సిందేమిటి?

సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 13 ఏండ్లు అవుతున్నా, సమాచారం అంటే ఏమిటి? సమాచారం పరిధిలోకి వచ్చే అం శాలు ఏమిటీ? అనే దానిపై దరఖాస్తుదారులకే కాదు, ప్రజా సమాచార అధికారులకు సందేహాలు అలానే ఉన్నాయి. సమాచార హక్కు చట్టంలో సమాచారం పరిధిలోకి ఏం వస్తాయో స్పష్టంగా ఉంది.తెలంగాణ సమాచార కమిషన్‌కు ఇటీవల ఆసక్తికరమైన కేసులు కొన్ని వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ విభాగాధిపతులు తమ కార్యాలయాల వద్ద ఏర్పాటుచేసిన నేమ్ బోర్డుల ఫొటోలు కావాలని స.హ.చట్టం కింద అడిగారు. పలువురు దరఖాస్తుదారులు ఇదేవిధంగా కోరారు. స.హ.చట్టం కింద తాము కోరిన ఫొటోలు ఇవ్వలేదని సమాచా ర కమిషన్‌కు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదు అందినప్పుడు ఇరు పక్షాలను పిలిచి విచారించడం కమిషన్ బాధ్యత.

ఫొటోలు తీసివ్వాలని కోరడం, ఫొటోలు తీసి ఇవ్వడం స.హ.చట్టం కిందికి వస్తుందా? అని విచారించే ముందు చట్టంలో సమాచారం నిర్వచనం చూడాలి. రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈ-మెయిల్స్, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఉత్తర్వులు, లాగ్ బుక్స్, కాంట్రాక్టులు, నివేదికలు, పేపర్లు, శాంపిళ్లు, మోడల్స్, డేటా, ఎలక్ట్రానిక్ రూపంతో పాటు ఏ రూపంలో ఉన్న సమాచారమైనా స.హ. చట్టం కిందికి వస్తుంది. ఏదైనా పత్రం, రాత ప్రతి, ఫైల్, ఏదైనా మైక్రో ఫిల్మ్ వంటివి సమాచారం కిందకు వస్తాయి.
అధికార యంత్రాంగం వద్ద ఉన్న ఈ సమాచారాన్ని స.హ.చట్టం కింద పొందవచ్చు. పనులను, పత్రాలను, రికార్డులను తనిఖీ చేసే హక్కు ఉం టుంది. రికార్డులలో ఉన్న సమాచారాన్ని ఎత్తి రాసుకోవచ్చు. వాటి నఖ లు , సర్టిఫైడ్ కాఫీ తీసుకోవచ్చు. టేపులు , వీడియో క్యాసెట్ల రూపంలో సమాచారం ఉంటే వాటి కాపీ తీసుకోవచ్చు. కంప్యూటర్‌లో సమాచారం ఉంటే ప్రింటవుట్‌ల ద్వారా ఆ సమాచారం తీసుకోవచ్చు. ఇది సమాచార హక్కులో భాగం.

ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న సమాచారం మొత్తం మాకు ఒక సీడీ లో కావాలని కోరేవారు కొందరు. మేము కోరిన రూపంలో సమాచారం ఇవ్వాలని కోరేవారు కొందరు. ఇలాంటి దరఖాస్తులు, సమస్యలు చాలా చోట్ల రావడంతో దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సమాచారం అంటే ఏమిటో చట్టం స్పష్టం చేసినప్పటికీ కొందరు పలు సందేహాలు వ్యక్తం చేయడంతో 2008లో కేంద్రం స్పష్టత ఇచ్చింది.

కొందరు సమాచార అధికారిని తమ పరిధిలో లేని సమాచారం కోర డంతో ఈ వివరణ అవసరమైంది. సమాచారం తమకు పలానా ఫార్మట్ లో కావాలని, సీడీల రూపంలో కావాలని కొందరు అడుగుతున్నారు. సమాచార అధికారి వద్ద సమాచారం ఏ రూపంలో ఉంటే అదే రూపం లో ఇవ్వాలని dopt. (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) స్పష్టత ఇచ్చింది. ఫొటో కాపీ రూపంలో సమాచారం ఉంటే ఫొటో కాపీ రూపంలోనే ఇవ్వాలి. ఫ్లాపీ రూపంలో ఉంటే ఫ్లాపీలోనే సమాచారం ఇవ్వాలి. సమాచారం రూపాన్ని మార్చివ్వాల్సిన అవసరం లేదు. సమాచార అధికారి వద్ద ఉన్న సమాచారాన్ని ఇవ్వాలి కానీ ఇతర విభాగాల నుంచి సేకరించి ఇవ్వడం సమాచార అధికారి బాధ్య త కాదు. కొందరు సమాచారాన్ని తాము కోరుకున్న భాషలోకి అనువా దం చేసి ఇవ్వాలని కోరుతుంటారు. సమాచారం ఎలా ఉంటే అలానే ఇవ్వవచ్చు.

ప్రభుత్వ కార్యాలయంలో సమాచార అధికారి తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఏ రూపంలో ఉందో అదే రూపంలో ఇస్తారు. అంతే కానీ తాము కోరిన రూపంలో కాదు. ఉదాహరణకు సమాచారం సీడీ రూపంలో ఉంటే సీడీ కాపీ ఇస్తారు అంతే కానీ ఫైల్ రూపంలో డ్యాకుమెంట్‌గా ఉన్న సమాచారం మొత్తం సీడీ రూపంలో ఇవ్వాలని కోరినా నిబంధనల మేరకు ఫైల్ రూపంలోనే ఇవ్వాలి.

సమాచార అధికారి తమ కార్యాలయంలో ఉన్న సమాచారం, ఉండే సమాచారం మాత్రమే ఇవ్వాలి కానీ సమాచార హక్కు కింద సమాచారం కోరితే తన వద్ద లేకుండా ఇతర కార్యాలయాల నుంచి తెప్పించి ఇవ్వాలి అని చట్టం ఎక్కడా చెప్పడంలేదు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని 30 రోజులలోపు దరఖాస్తుదారునికి ఇవ్వడం ముఖ్యం. ప్రభుత్వ కార్యాలయాల వద్ద , విభాగాధిపతుల ఛాంబర్‌ల వద్ద ఉన్న నేం ప్లేట్స్ ఫొటోలు కావాలని స.హ.చట్టం కింద కొంతమంది దరఖాస్తు చేశారు. నేం ప్లేట్ ఏర్పాటుచేశారా లేదా? అనేది సమాచారం కిందకు వస్తుంది కానీ, నేం ప్లేట్ ఫొటోలు కావాలని కోరడం స.హ.చట్టం కిందకు రాదు.

ఏది స.హ.చట్టం కిందకు వస్తుందో? ఏది రాదో అనే అనుమానాలతో అధికారులు నేం ప్లేట్ ఫొటోలు తీసివ్వడమే కాకుండా అన్ని విభాగాల నుంచి ఈ ఫొటోలు కోరడంతో ఆయా విభాగాల వారికీ లేఖలు రాశారు. దరఖాస్తుదారులు కోరినవిధంగా నేం ప్లేట్ ఫొటోలు తీసి ఇవ్వమని.. స.హ.చట్టం కింద సమాచారం ఇవ్వకపోతే జరిమానా విధిస్తారనే భయం తో కొందరు అధికారులు ఫొటోలు తీసి ఇచ్చారు. కోరిన భాషలో, కోరిన ఫార్మట్‌లో సమాచారం ఇచ్చారు. కొందరు అధికారులు సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపుతుంటే, కొందరు తమ పరిధిలో లేని సమాచారం కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు . సమాచారం తెప్పించుకొని ఇస్తున్నారు. కొందరేమో సమాచారం తమ కార్యాలయంలో లేదు అని చేతులు దులుపు కొంటున్నారు.

ప్రభుత్వ కార్యాలయాల వద్ద నేం ప్లేట్ ఏర్పాటు మంచిదే .. ఏ కార్యాలయం వద్దనైనా అలా ఏర్పా టు చేయకపోతే, ఏర్పాటు చేశారా లేదా అనేది సమాచారహక్కు కిం ద తెలుసుకోవచ్చు. ఏర్పా టుచేయమని కోరుతూ ఆ కార్యాలయానికి లేఖ రాసి, తానూ రాసిన లేఖపై ఏ చర్య తీసుకున్నారు అని సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడు గవచ్చు. అంతే తప్ప ఫొటో కోరడం సమాచారం హక్కు చట్టం కిందకు రాదు. ఫైల్స్‌లో ఉన్న సమాచార కాపీ కోరవచ్చునని చట్టం చెబుతున్నది. నేమ్ ప్లేట్ ఫొటో అనేది సమాచారం కిందకు రాదు. నేం ప్లేట్ ఏర్పాటు చేశామని సమాచారం ఇవ్వడం మాత్రమే సమాచార హక్కు కిందకు వస్తుంది. కాబట్టి నేం ప్లేట్ ఏర్పాటు చేశామనే సమాచారం ఇస్తే సరిపోతుంది. స.హ.చట్టం 4(1)బి కింద ప్రభుత్వ కార్యాలయంలోని అధికార యంత్రాంగానికి సంబంధించిన వివరాలు, వారు నిర్వర్తించే విధులు ఏమిటో అందరికి అందుబాటులో ఉండాలి. సమాచారం కోరితే ఒక పేజీ కి రెండు రూపాయలు తీసుకోవాలి.

యూనివర్సిటీలు కొన్నిపత్రాలకు నిర్ణీత మొత్తం చార్జీలు వసూలు చేస్తుంటారు. ఉదాహరణకు యూనివర్సిటీ కొన్ని పత్రాలకు 500 రూపాయలు వసూలు చేయాలనేది యూనివర్సిటీ నిర్ణయించిన ధర. స.హ. చట్టం కింద ఒక పేజీకి రెండు రూపాయలు కాబట్టి రెండు రూపాయలతో తాము కోరిన కాపీ ఇవ్వాలని కొందరు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రెండు రూపాయలకు ఇవ్వడం ఇక్కడ వర్తించదు యూనివర్సిటీ ముందుగానే ధర నిర్ణయించింది. కాబట్టి ఆ మేరకు చెల్లించాలి. ధర గురించి 2005, అక్టోబర్ 13న ఒక జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. నిర్ణీత ధర ముద్రించిన ముద్రిత సామగ్రి టెక్ట్స్, ప్లాపీ, సీడీలు, మరే రూపంలో ఉన్నా ముద్రిత ధరకు ఇవ్వాలి. నిర్ణీత ధర ముద్రించని వాటికి పేజీకి రెండు రూపాయలు తీసుకోవాలి. మ్యాపులు, ప్లాన్లు దాని వాస్తవ ధరకు ఇవ్వాలి. స.హ.చట్టంపై సమాచార అధికారులు స్పష్టమైన అవగాహనతో ఉంటే సమాచారం కోరేవారికి, సమాచార అధికారులకూ ప్రయోజనకరం.
-బుద్ధా మురళి (నమస్తే తెలంగాణ 4-4-2018)

పదివేలు కట్టు.. పార్టీ పెట్టు..

‘‘ఆసక్తిగా చూస్తున్నావ్ .. ఏంటో?’’
‘‘ఆయన పార్లమెంటు మెట్లకు మొక్కుతున్న ఫొటో. మా మామను నేనే రాజకీయాల్లోకి తీసుకు వచ్చా, నన్ను చూసే మోదీ పాలించడం నేర్చుకున్నాడని అని తనకు తాను ఆయన ఎంత మెచ్చుకున్నా... మీడియా డార్లింగ్ అని ముద్దుగా పిలిపించుకున్నా.. ఈ విషయంలో మాత్రం మోదీ ముందు ఈయన నటన వెలవెలబోయింది. గుజరాతీ నటనలో జీవం ఉంది. ఫొటోగ్రఫీ దర్శకునికి ఉన్నంత అవగాహన మోదీలో ఉంటే, ఈయన మాత్రం పెళ్లిళ్ల ఫొటోగ్రాఫర్‌తో సినిమా షూటింగ్ చేయించినట్టు.. ఆ ఫొటో ఎంత పేలవంగా ఉందో చూడు.. రాయలసీమ ఫ్యాక్షన్ కథల నేపథ్యంలో మట్టిన ముద్దాడే సీన్ తొలిసారి ‘ఇంద్ర’లో సూపర్ డూపర్ హిట్టయింది. చివరకా సీన్ అల్లరి నరేష్ పేరడీ సీన్‌గా మారిపోయింది. అప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పి, ఇప్పుడు తొలిసారి పార్లమెంటుకు వచ్చినట్టు ముద్దాడితే సీన్ ఏం పండుతుంది?’’
‘‘ఆ ఫొటో గురించి కాదు..’’
‘‘మరేంటి..?’’
‘‘ఆ సంగతి వదిలేయ్! ఏంటీ మార్కెట్‌లో విశేషాలు?’’
‘‘రామ్‌చరణ్ తొలిసారిగా నటించాడట!’’
‘‘తొలిసారిగా నటించడం ఏమిటి? ఆయన సినిమాలు చాలానే వచ్చాయి కదా?’’
‘‘నిజమే..కానీ తొలిసారి ‘నటించాడని’ అంతా అంటున్నారు. అలా ఎందుకంటున్నారో నాకూ తెలియదు’’
‘‘సినిమాల సంగతి మనకెందుకు.. రాజకీయాలు ఎలా ఉన్నాయి? కొత్తపార్టీల గురించి ఏమనుకుంటున్నావ్?’’
‘‘జనసేన పార్టీకి అధ్యక్షుడు మినహా కార్యవర్గం ఏమీ లేకపోతే కొత్త పార్టీ అంటావా? నాలుగవ వార్షికోత్సవం కూడా ఘనంగా జరుపుకున్నారు. ’’
‘‘పార్టీ అంటే అదొక్కటేనా? ’’
‘‘చూడోయ్ రాజధాని నగరంలో ఓ చిన్న చాయ్ సెంటర్ పెట్టాలన్నా, ఇడ్లీ బండి, టిఫిన్ సెంటర్ పెట్టాలంటే, గినె్నలు, స్టౌ, కుర్చీలు, అడ్డాకు ఓ పాతిక వేలన్నా కావాలి. కానీ ఓ పార్టీని రిజిస్టర్ చేయించాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు పదివేలుంటే చాలు. రిజిస్టర్ అయిన పార్టీలు దేశంలో 1866 ఉన్నాయి. ఇంకొన్ని దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్ చూడు రిజిస్ట్రేషన్ ఖర్చు, విధి విధానాలు, దరఖాస్తు ఫారాలు అన్నీ సిద్ధంగా ఉంటాయి.’’
‘‘మనమో పార్టీ పెడితే ఎలా ఉంటుంది?’’


‘‘నాకు ఆసక్తి లేదు, ఆ శక్తీ లేదు. సినిమా నేపథ్యం ఉంటే సరుకు లేకపోయినా ఫరవాలేదు. లక్షల మంది మీటింగ్‌లకు వస్తారు. కాలం కాని కాలంలో పార్టీ పెడితే ఎన్టీఆర్ పార్టీనైనా ఎవరూ పట్టించుకోరు. ఉన్న పార్టీని అల్లుడు టేకోవర్ చేశాక ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టి, నల్లడ్రెస్ వేసుకుని తిరిగితే ఎవరూ పట్టించుకోలేదు. ఎన్టీఆర్ 1982లో పార్టీ పెడితే నేల ఈనిందా, ఆకాశానికి చిల్లులు పడిందా? అన్నట్టు జనం! 14 ఏళ్ల తరువాత అదే ఎన్టీఆర్ 1996లో మరో పార్టీ పెడితే దిక్కూ దివాణం లేదు.’’
‘‘మరెవరు పార్టీ పెడితే బాగుంటుంది? ఉద్యమ నేతలు రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెడితే- రాజకీయ భూకంపం రాదా?’’
‘‘కొన్ని డైలాగులు సినిమాలకు బాగుంటాయి. సినిమాల్లో సీరియస్‌గా అనిపించిన డైలాగులు నిజ జీవితంలో సిల్లీగా ఉంటాయి. బుడ్డ ఎన్టీఆర్ తెలుసు కదా? మాస్ ఫాలోయింగ్‌లో పెద్ద ఎన్టీఆర్‌నే మించి పోయాడంటారు అభిమానులు. కంటి చూపుతో చంపేస్తాను అనే డైలాగు బాగా పాపులర్ అయింది. 2009 ఎన్నికల్లో కంటిచూపుతో మహాకూటమిని గెలిపిస్తానని ఎన్నో ఊర్లు తిరిగాడు. గెలవ లేదు సరికదా? ఆ తరువాత మామ రాజకీయాలను తట్టుకోలేక .. సినిమా రంగంలోనూ అడ్రెస్ లేకుండా చేస్తారని కంగారు పడి .. నాకు రాజకీయాలు తెలియవు బాబోయ్ అని అస్త్ర సన్యాసం చేశాడు.’’
‘‘ఉద్యమ నేపథ్యం.. ?’’
‘‘ఇరోమ్ షర్మిలా గుర్తుందా? దేశ చరిత్రలో ఆమెలాంటి ఉద్యమ కారులు ఇంకెకవరినైనా చూపిస్తావా? 16 ఏళ్లపాటు ఆహారం తీసుకోకుండా నిరాహార దీక్ష చేసింది. ఆమె ఉద్యమాన్ని ప్రపంచం గుర్తించింది. అవార్డులతో సత్కరించింది. ‘గ్లోబల్ ఐకాన్ ఆఫ్ ప్రొటెస్ట్’ అంటూ జాతీయ, అంతర్జాతీయ మీడియా, ఉద్యమ సంఘాలు ఆమెను ఆకాశానికెత్తాయి. జీవితంలో ముఖ్యమైన యవ్వన కాలమంతా ఆమె దీక్షలోనే గడిపింది. ఇంతకుమించిన త్యాగం ఉద్యమాల చరిత్రలో ఇంకోటి ఉంటుందా? ’’
‘‘ఆమె సంగతి వేరు’’
‘‘జీవితాన్ని ఉద్యమానికి అంకితం చేసిన ఆమె రాజకీయ పార్టీ స్థాపించి మణిపూర్ ఎన్నికల్లో పోటీ చేస్తే కేవలం 90 ఓట్లు వచ్చాయి. ఆమె పార్టీ తరఫున మిగిలిన వారికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలియదు. ముఖ్యమంత్రి పదివి చేపట్టి వ్యవస్థను సంస్కరిస్తానని అని ఆమె ప్రకటన చేసిన వార్తకు రెండు వందల కామెంట్లు వచ్చాయి. అందులో సగం ఓట్లు కూడా ఆమెకు రాలేదు. ఫేస్‌బుక్ వాల్ మీద, ఇంటి గోడల మీద నినాదాలను చూసి మనం ఎలా ఊహించుకున్నా- జనం తీర్పు ముఖ్యం. ఆమె ఉద్యమాన్ని తప్పు పట్టడం లేదు. చిన్న చూపు చూడడం లేదు. ప్రజలెప్పుడూ తప్పు చేయరు. ఏ కాలానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అలా నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మనకు నచ్చక పోవచ్చు.’’
‘‘పోనీ- ప్రజలను ఆకట్టుకునే విధంగా పార్టీని ఎలా ప్రారంభించాలో చెప్పు’’
‘‘మంచి ప్రశ్న.. జనాకర్షక పార్టీని స్థాపించడం ఎలా? అని ఓ పుస్తకం రాయవచ్చు. ఈ బుక్ విడుదలకు ఇదే సరైన సమయం. ఓ వ్యక్తి సినిమాల్లో తెగ ప్రయత్నించి విఫలమై, సినిమా తీయడం ఎలా అని తండ్రి గ్రాట్యూటీ డబ్బులతో ఓ బుక్ రాశాడు. బుక్ అమ్ముడు పోలేదు, సినిమాల్లో చాన్స్‌లు దక్కలేదు.. తండ్రి డబ్బులు మిగలలేదు. సినిమాకైనా, రాజకీయాలకైనా సక్సెస్ ఫార్ములా అంటూ ఉండదు. అలా ఉంటే దేశంలో రిజిస్టర్ అయిన 1866 పార్టీలు అధికారంలో ఉండేవి. ప్రతివాడూ హీరో అయ్యేవాడు. కాలం కలిసి రాక అద్వానీ లాంటి వారు మౌ నంగా ఉన్నారు. దేనికైనా కాలం ముఖ్యం. పూజారి దేవుడు కాలేడు. 

చాణక్యుడు రాజనీతిని బోధించగలడు, రాజు కాలేడు.’’ *
-

 - బుద్దా మురళి(జనాంతికం-6-4-2018)

‘ఆపరేషన్ సులభ్’ నీదీ నాదీ ఒకే కథ..!

‘‘ఒరేయ్.. అర్జంట్‌గా 18 వందల రూపాయలివ్వు’’
‘‘నేనేమన్నా ఎటిఎంను అనుకున్నావా? ఇష్టం వచ్చినప్పుడు అడిగినన్ని డబ్బులు నీకు ఇచ్చేందుకు?’’
‘‘ఎటిఎం అనుకుంటే నీ దగ్గరకెందుకొస్తాను. ఎటిఎంలో డబ్బులుండవని నాకు తెలియదా? ’’
‘‘పోనీ.. నన్ను బ్యాంకును అనుకున్నావా? ’’
‘‘బ్యాంకు అనుకుంటే ఐదారువేల కోట్ల రూపాయలు తీసుకుని విదేశాలకు చెక్కేయడానికి వెళతా, కానీ కేవలం 18 వందల కోసం బ్యాంకుకు ఎందుకు వెళతాను? అవసరానికి ఆదుకునే మిత్రుడివనే నీ దగ్గరకు వచ్చాను’’
‘‘అది సరే కానీ- ఈ పద్దెనిమిది వందల లెక్క ఏంటి?’’
‘‘విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ కావాలి కదా? పాస్ పోర్ట్ కావాలంటే 18 వందలు కావాలి’’
‘‘ఆ మాట నీకెవరు చెప్పారు. ఆన్‌లైన్‌లో వెయ్యి రూపాయలతో పాస్‌పోర్ట్ వస్తుంది.. మరి 18 వందలెందుకు?’’
‘‘రోడ్డు మీద నడిచేప్పుడు సెల్‌ఫోన్‌లో ఫేస్‌బుక్ మాత్రమే కాదు, గోడల మీద ఏం రాసుందో కూడా చదవాలి. 18 వందలకు పాస్ పోర్ట్ ఇప్పిస్తామని రాసిన గోడమీద రాతలు చూడలేదా? ఆన్‌లైన్‌లో అప్లై చేయడం నాకు రాదు. 18 వందలు ఇస్తే అంతా వాళ్లే చూసుకుంటారు.’’
‘‘ఉద్యోగం లేదు, నాటకాల్లో అవకాశాలు లేవు. పనీపాటా లేదు. నీకెందుకురా.. పాస్‌పోర్ట్?’’
‘‘అమెరికా వెళ్లాలి. దానికి పాస్‌పోర్ట్ ఉండాలి. టైం లేదు. తొందరగా ఇవ్వు’’
‘‘పాస్‌పోర్ట్‌కేం కానీ పద్దెనిమిది వందలిస్తే వారంలో వచ్చేస్తుంది. అమెరికా వెళ్లాలంటే అదొక్కటి సరిపోదు. వీసా కావాలి. ఐనా అంత అర్జంట్‌గా అమెరికా ప్రయాణం ఎందుకో చెప్పొచ్చు కదా?’’
‘‘అది చాలా రహ స్యం.. సారీ.. చెప్పలేను’’
‘‘సారీ... ఎందుకో చె ప్పేంత వరకు డబ్బులు ఇచ్చేది లేదు’’
‘‘సరే చెబుతాను. కా నీ ఇది అత్యంత రహ స్యం. ప్రపంచ చరిత్రను మార్చే రహస్యం. మనిద్దరి మధ్యనే ఉండాలి. ఎవరికీ చెప్పనని మాటిస్తేనే చెబుతాను.’’
‘‘సరే చెప్పి ఏడువ్’’
‘‘ట్రంప్‌ను కలవడానికి అమెరికా వెళ్లలని నిర్ణయించుకున్నా ను. ఆ తరువాత రష్యా వెళతాను. ముందు ఢిల్లీ వెళతా.. రేపే తొప్పాయ పాలెం వెళతాను’’
‘‘నువ్వు మాట్లాడే దానికి అసలేమైనా అర్థం ఉందా? తొప్పాయ పాలెం నుంచి అమెరికా వరకు వెళ్లి ఏం చేస్తావు. ఏంటో.. నీకేదో పిచ్చి పట్టినట్టు అనిపిస్తోంది..’’
‘‘మేధావులు మొదట పిచ్చివాళ్లుగానే కనిపిస్తారు.’’
‘‘ మేధావులు పిచ్చివాళ్లలా కనిపించవచ్చు. కానీ పిచ్చివాళ్లంతా మేధావులు కాదు. సరే విషయం చెప్పు..’’
‘‘నువ్విచ్చే పద్దెనిమిది వందలు కావాలి.. నువ్వు నమ్మినా నమ్మక పోయినా విషయం చెప్పాలి గనుక చెబుతున్నాను. ఒక పెద్ద అంతర్జాతీయ కుట్రను అంతర్జాతీయ మీడియా ముందు బహిర్గతం చేయనున్నా. ఆ దెబ్బతో నా పేరు ప్రపంచంలో మార్మోగిపోతుంది. ప్రపంచాన్ని రక్షించిన సూపర్ మ్యాన్‌గా గుర్తింపు వస్తుంది. ’’
‘‘ముందు అసలు విషయం చెప్పు.. సస్పెన్స్‌లో ఉంచకు’’
‘‘తొప్పాయపాలెం సర్పంచ్‌ను అధికారం నుంచి దించేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోంది. ఆ ప్లాన్ సక్సెస్ కాగానే అదే ఫార్ములాతో రా ష్ట్రాల ముఖ్యమంత్రులను, దేశ ప్రధానిని తప్పిస్తారు. తరువాత ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వాన్ని పడగొట్టి- ఇరాన్, ఇరాక్‌ల పాలకులను మార్చి, అటు నుంచి అమెరికా అధ్యక్షుడిని బంధించి, రష్యాను విచ్ఛిన్నం చేసి ప్రపంచాన్ని తొప్పాయ పాలెం అదుపులోకి తీసుకురావడానికి పెద్ద కుట్ర జరుగుతోంది. ఈ విషయాన్ని మన లోకల్ మీడియా అర్థం చేసుకోలేదు. అందుకే అమెరికా వెళ్లి ప్రపంచ మీడియా ముందు వైట్ బోర్డ్‌పై ఈ కుట్ర గురించి పూసగుచ్చినట్టు వివరిస్తా..’’
‘‘ఏరా! మీ ఆవిడతో ఇంట్లో ఏదో గొడవ అని పుట్టింటికి వెళ్లిపోయిందని విన్నాను. సీరియస్ గొడవే జరిగినట్టుంది. నీ తలమీద దెబ్బలు బలంగా తాకాయా?’’
‘‘నేను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నాను. స్పృహలో ఉండే మాట్లాడుతున్నా.. భార్య కొట్టిన దెబ్బలకే బుర్ర పని చేయకుండా ఉండేంత బలహీనుడిని కాను, ఇలాంటి దెబ్బలు నాకేమీ కొత్త కాదు.’’
‘‘నీ మాటలు వింటుంటే ఆరోగ్యంగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు. కానీ మాటల్లోనే ఏదో తేడా కనిపిస్తోంది.’’
‘‘నమ్మడం కష్టం.. కానీ నేను చెప్పిన కుట్ర నిజం.’’
‘‘సరే నిజమే అనుకుందాం. ఈ కుట్ర సంగతి నీకెలా తెలిసింది?’’
‘‘మొన్న పనిమీద మరో రాష్ట్రానికి వెళుతుంటే బస్సు ఆగింది. లఘుశంక తీర్చుకోవడానికి సులభ్ కాంప్లెక్స్‌కు వెళ్లాను. పక్క వరుసలోని టాయిలెట్‌లో ఎవరున్నారో ముఖం చూడలేదు. కానీ ఇద్దరు వ్యక్తులు తొప్పాయ పాలెం సర్పంచ్‌ను దించేయడం మొదలుకుని ప్రపంచాన్ని తమ గ్రామం గుప్పిట్లోకి తీసుకు రావడానికి ఏమేం చేయాలో మాట్లాడుకున్నారు. వాళ్లు మాట్లాడుకున్న ప్రతి మాట నాకు గుర్తుంది. నా పని ముగించుకుని పక్క వరుసలోని టాయిలెట్‌లోకి వెళ్లే సరికి అప్పటి వరకు మాట్లాడి వ్యక్తి కనిపించలేదు. కానీ అక్కడి గోడల మీద ఏవేవో మాటలు, కుట్రలు రాసి ఉన్నాయి. ‘ఆపరేషన్ సులభ్’ అని ఈ కుట్రకు వాళ్లు పేరు పెట్టుకున్నారు. నేను విన్న ప్రతి మాటను రాసి పెట్టుకున్నా. ‘ఆపరేషన్ సులభ్’తో ప్రపంచాన్ని తమ గుప్పెట్లోకి తీసుకోవాలని వారు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటా. ఈ ప్రపంచాన్ని కాపాడుతా. ఇదంతా అమెరికాలో ప్రపంచ మీడియాకు వివరిస్తా. ఈ ప్రపంచం నా సేవను గుర్తించుకుంటుంది. ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా పరవా లేదు. ప్రపంచం కోసం నేనీ త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’’
‘‘నీ మాట నమ్ముతున్నా. నువ్వు విన్నది నిజమే కానీ- సులభ్ కాంప్లెక్స్‌లో వినబడే మాటలు, అక్కడి గోడల మీద కనిపించే రాతలను సీరియస్‌గా తీసుకోవద్దు. నువ్వు చూసిన గ్రామంలోనే కాదు అన్ని చోట్లా టాయిలెట్స్‌లో ఇలాంటి మాటలు వినిపిస్తాయి, రాతలు కనిపిస్తాయి. ఇక ఇంటికి వెళ్లు. మీ ఆవిడకు నేను నచ్చజెబుతాలే.’’
***
‘శివాజీ.. ఇప్పుడు నీ కథ గుర్తుకొస్తుందా? నీదీ నాదీ ఒకే కథ.’

-

 - బుద్దా మురళి(జనాంతికం 4-2018)