28, ఆగస్టు 2018, మంగళవారం

అసలైన సంపద ‘త్రి’నిధి

పదవీ విరమణ చేసిన తరువాత ప్రతి వ్యక్తి వద్ద ఉండాల్సిన సంపదలపై ఆమెరికాలోని యూనివర్సిటీల్లో ఇటీవల పరిశోధనలు జరిగాయి. ప్రధానంగా మూడు సంపదలు ఉండాలని ఈ పరిశోధనల ద్వారా తేల్చి చెప్పారు. ఒకటి ఆరోగ్యం, రెండు, మానవ సంబంధాలు, మూడు తగిన ఆస్తి.
ఆరోగ్యం, మానవ సంబంధాలు, డబ్బు అని ఒక్క ముక్కలో చెప్పినప్పటికీ అర్థం చేసుకుంటే వీటిలో ఆరోగ్యకరమైన జీవిత రహస్యం ఇమిడి ఉంది. జీవితం చివరి దశలోనే కాదు సాధ్యం అయినంత వరకు జీవితంలో ప్రతి దశలోనూ ఈ మూడు సంపదలు అవసరం. చదువుకునే రోజుల్లో తల్లిదండ్రులపై ఆధారపడినప్పుడు డబ్బు అనే సంపద మన చేతిలో ఉండకపోవచ్చు కానీ మిగిలిన రెండు సంపదలు ఉంటాయి.
ఆస్పత్రుల్లో భారీగా ఖర్చు చేస్తే అనారోగ్యానికి చికిత్స లభిస్తుంది కానీ ఆరోగ్యం లభించదు.
ఆరోగ్య సంపదన మనం పుట్టినప్పటి నుంచి మన వెంటే ఉంటుంది. వారసత్వంగా ఆస్తి వస్తుందో రాదో కానీ ఆరోగ్యంపై మాత్రం వారసత్వ ప్రభావం ఉంటుంది. వారసత్వంగా వచ్చే ఆరోగ్యం, అనారోగ్యం ఎలా ఉన్నా బాల్యం నుంచే ఆరోగ్యంపై దృష్టిపెట్టే వారు అదృష్టవంతులు. రిటైర్‌మెంట్, పేదలు, సంపన్నులు అనే తేడా లేదు. ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఇవెవీ అడ్డంకి కాదు. ఆరోగ్యంపై అవగాహన అవసరం. రోగం వచ్చినప్పుడు, వయసు ఉడిగినప్పుడు ఆరోగ్యం గురించి ఆలోచించడం కాదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఆరోగ్యం గురించి ఆలోచించాలి. ఆరోగ్యకరమైన అలవాట్లు జీవితాన్ని హాయిగా జీవించే అవకాశం ఇస్తుంది. కోట్ల రూపాయల సంపద ఉన్నా అనారోగ్యంతో జీవిస్తుంటే కనీసం ఆ డబ్బును లెక్కించే శక్తి కూడా ఉండదు. ఇక వాటిని అనుభవించడం సంగతి తరువాత.
వజ్రాలను కూడా జీర్ణం చేసుకునే వయసులో తినడానికి తిండి లేదు. వజ్రాలను కూడా కొనగల స్థోమత ఉన్నప్పుడు అన్నం కూడా జీర్ణం చేసుకునేంత ఆరోగ్యం లేదు అని ఎంతో మంది ప్రముఖులు తమ జీవిత అంతిమ దశలో ఆవేదన వ్యక్తం చేయడం మనకు తెలిసిందే. ఈ పరిస్థితి రాకుండా నిరంతరం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. అనుభవించడానికి బోలెడు సంపద ఉన్నా, ఆరోగ్యం సహకరించక పోతే బతికున్నప్పుడే నరకం కనిపిస్తుంది. వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నా రిటైర్‌మెంట్ వయసులో అరోగ్యంపై ఏ మాత్రం అశ్రద్ధ చూపినా ప్రమాదం.
మొదటి సంపద ఆరోగ్యం అయితే రెండవ సంపద మానవ సంబంధాలు.
మానవ సంబంధాలు అంటే అప్పటికప్పుడు ఏర్పరచుకునే సంబంధాలు కావు. ఆఫీసులో రిసెప్షనిస్టు, ఎల్‌ఐసి ఏజెంట్లు అప్పటికప్పుడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడవచ్చు. అది వారి డ్యూటీ.
ఆఫీసులో పని చేసే వారంతా మిత్రులు కాక పోవచ్చు. పాతిక మంది పని చేసే చోట అందరితో మాట్లాడినా ఒకరిద్దరితో స్నేహం ఏర్పడవచ్చు. ఇలాంటి స్నేహాలు రిటైర్‌మెంట్ తరువాత కూడా కొనసాగుతాయి. ఉదయం పది నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు ఆఫీసులో కలిసి ఉన్నప్పుడు సహజంగా స్నేహం ఏర్పడుతుంది అయితే అవి ఉద్యోగ విరమణతో ఈ స్నేహాలు ముగిసిపోవచ్చు. అలా కాకుండా నిలిచే స్నేహాలు ఉంటాయి. ఇలాంటి స్నేహాలు రిటైర్‌మెంట్ జీవితానికి గొప్ప సంపదగా నిలుస్తాయి. చదువుకునే రోజుల్లో ఏర్పడే స్నేహాలు చివరి వరకు నిలుపుకొనే వారు అదృష్టవంతులు. వీరితో పాటు బంధువులు. వయసులో ఉన్నప్పుడు ఉద్యోగంలో బిజీగా ఉండి స్నేహితులు, బంధువులను పట్టించుకునే తీరిక లేకపోవచ్చు. బిజీగా ఉన్న రోజుల్లో దీని వల్ల పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. కానీ రిటైర్ మెంట్ తరువాత జీవితంలో దీని ప్రభావం కనిపిస్తుంది. మానవ సంబంధాలు కూడా గొప్ప సంపద. డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుందో, మ్యూచువల్ ఫండ్స్‌లో డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుందో లెక్కలు ఉంటాయి. కానీ మానవ సంబంధాల సంపదకు విలువ కట్టలేం. ఆ సంపద లేనప్పుడు వాటి విలువ తెలుస్తుంది. రిటైర్‌మెంట్ జీవితంలో కరెన్సీ ఒక్కటే ఆనందాన్ని ఇవ్వలేదు. మనసు విప్పి మాట్లాడేందుకు నలుగురు మనుషులు అవసరం. బిజీ జీవితంలో బంధువులకు దూరంగా ఉన్నా, కనీసం రిటైర్‌మెంట్ తరువాత అయినా బంధువులను అవకాశం ఉన్నప్పుడల్లా కలవడం ద్వారా బంధాలను పెంచుకోవచ్చు.
మానవ సంబంధాలు అంటే బయటివారితోనే కాదు కుటుంబ సభ్యులతోనూ మంచి సంబంధాలు ఉండాలి. వయసులో ఉండగా దంపతుల మధ్య ఎన్ని కీచులాటలు ఉన్నా, ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు కాబట్టి అది వేరు. రిటైర్‌మెంట్ జీవితం తరువాత పిల్లలు ఎక్కడెక్కడో స్థిరపడడంతో ఎక్కువ కాలం భార్యాభర్తలే ఉంటారు. దంపతుల మధ్య సంబంధాలు బాగుండాలి. అదే విధంగా పిల్లలు, బంధువులతో మంచి సంబంధాలు రిటైర్‌మెంట్ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. చదువుకునే రోజుల్లోని మిత్రులు, ఉద్యోగ సమయంలో కలిసిన మిత్రులు, మార్నింగ్ వాక్‌లో ఏర్పడే బంధాలు, సాహిత్యంతో అనుబంధం ఉంటే అక్కడ కుదిరిన స్నేహాలు వీటిని నిలుపుకుంటే రిటైర్‌మెంట్ జీవితాన్ని మించిన ఆనందం ఉండదు. జీవిత కాలమంతా బిజీగా గడిపినా కనీసం రిటైర్‌మెంట్ తరువాతైనా ఈ బంధాలతో జీవితాన్ని హాయిగా గడిపేయవచ్చు. ఆరోగ్యం, మానవ సంబంధాలతో పాటు రిటైర్‌మెంట్ జీవితంలో తగిన ఆర్థిక భద్రత అవసరం. రిటైర్‌మెంట్ తరువాత జీతం రాదు. అలా అని ఖర్చులు తప్పవు. రిటైర్‌మెంట్ తరువాత ఏ మేరకు ఖర్చులు ఉంటాయనే అంచనా ఉద్యోగంలో ఉన్నప్పుడే నిర్ణయించుకోవాలి. ఆ మేరకు ఆర్థిక భద్రత కోసం ఏర్పాటు చేసుకోవాలి. పెన్షన్ వచ్చే ఉద్యోగం అయితే ఆర్థిక సమస్యలు తీరినట్టే. కానీ అలా పెన్షన్ సౌకర్యం లేని వారు తమ భవిష్యత్తు ఖర్చులను ముందుగానే అంచనా వేసుకుని తగిన ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే ఆ వయసులో ఖర్చుల కోసం ఇతరుల ముందు చేయి చాచడం, లేదా అప్పుడు కూడా సంపాదిస్తే కానీ గడవని పరిస్థితిలో ఉంటే రిటైర్‌మెంట్ జీవితం కష్టంగా మారుతుంది.
-బి.మురళి(27-8-2018 భూమి )

24, ఆగస్టు 2018, శుక్రవారం

ముసుగు వీరులు!

‘‘చాలా గొప్పవారు అని మనం కొందరి గురించి అనుకుంటాం.. కానీ అదేం కాదు. అదో ముసుగట!’’
‘‘ఎవరి గురించి?’’
‘‘ఇంకెవరి గురించి.. వాజపేయి గురించి. భాజపాకి అతను ఓ ముసుగు అని చాలా మంది మేధావులు అంటున్నారు’’
‘‘ఔను.. ఈ మేధావులే ఈ మధ్య కరుణానిధికి అవినీతి ఒక ముసుగు మాత్రమేనని, నిజానికి ఆయనో మహాత్ముడు అన్నారు’’
‘‘ అంటే కరుణానిధి అవినీతి నిజం కాదా? ముసుగు మాత్రమేనా?’’
‘‘అంటే వాజపేయి గొప్పతనం నిజం కాదా? ముసుగు మాత్రమేనా?’’
‘‘ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. నేను కరుణానిధి ముసుగు గురించి అడిగాను. దాని గురించి చెప్పు’’
‘‘నేనడిగిన దానికి నువ్వు చెబితే... నువ్వడిగిన దానికి నేను చెబుతా.’’
‘‘వాళ్ల గురించి మనకెందుకు గొడవ కానీ.. నీ కొత్త ఉద్యోగం ఎలా ఉంది. కొత్త బాస్ ఎలా ఉన్నాడు. పాత బాస్‌లా లేడు కదా?’’
‘‘ఆ రోజులను మళ్లీ గుర్తు చేయకు బాస్. వాడి దగ్గర పని చేసినన్ని రోజులు నరకంలో ఉన్నట్టే ఉండేది. కొత్త బాస్ దేవుడు’’
‘‘పాత బాస్‌కు ధర్మామీటరో, ధర్మవీరుడు అనో ఏదో బిరుదు ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ఇంకా నా చెవుల్లో మార్మోగుతున్నాయి. మరేంటోయ్.. ఇప్పుడలా అంటున్నావు’’
‘‘పొట్టతిప్పలు బాస్. వాడెంత దుర్మార్గుడైనా దేవుడు అనక పోతే ఉద్యోగం ఊడుతుంది. అలాంటి రాక్షసుడి వద్ద అనే్నళ్లు ఎలా పని చేశానా? అని ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. ’’
‘‘ ఆ బిరుదేదో ఇవ్వడానికి పైరవీ చేసిన దాంట్లో నువ్వు మధ్యవర్తిత్వం వహించినట్టున్నావ్’’
‘‘ఔను.. ఖర్చు కూడా నేనే భరించా. వాడికి ఇంత కృతజ్ఞత కూడా లేదు.’’
‘‘మా బాస్ కనిపించే దైవం అంటూ ఆ రోజు నువ్వు చేసిన ఉపన్యాసం నాకింకా గుర్తుంది. మనసులో ఇంత కోపం పెట్టుకుని ఆ రోజు అంత తన్మయంగా ఎలా మాట్లాడావు’’
‘‘మళ్లీ మళ్లీ గుర్తు చేయకు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. చెప్పాను కదా? కడుపు తిప్పలు’’
‘‘తన్మయంగా ఎలా మాట్లాడానా? దీన్నే  ముసుగు అంటారు బాస్. మనసులో ఎంత కోపం ఉన్నా ముసుగు వేసుకుని మీ బాస్‌ను పొగిడావు. ప్రతిక్షణం మనం రకరకాల ముసుగులతోనే జీవనం సాగిస్తాం. ప్రతీవాడూ ముసుగు వేసుకునే జీవిస్తాడు. ఇప్పుడు కూడా నువ్వూ నేనూ అలానే ముసుగు వేసుకునే మాట్లాడుకుంటున్నాం.’’
‘‘అవేం మాటలు.. మనం చిన్ననాటి స్నేహితులం.. మన దగ్గర దాపరికాలేముంటాయ్?’’
‘‘ముసుగు తీసి సహజంగా మాట్లడితే నిన్ను నేను భరించలేను. నన్ను నువ్వు భరించలేవు. ఏ ఒక్కరినీ మరొకరు భరించలేరు. ఆక్సిజన్ లేకుం టే ప్రాణాలు పోతాయనేది ఎంత నిజమో! ముసుగులు లేకపోతే మనం ఉండలేం అనేది అంతే నిజం. వాజపేయి ముసుగు గురించి మాట్లాడుకోవడం మనకు ఆసక్తిగా ఉంటుంది కానీ మన ముసుగు గురించి మాట్లాడుకోవడానికి మనసొప్పదు. అంతే తేడా!’’
‘‘రేపు హాలిడేనే కదా? మన పాండు గెస్ట్‌హౌస్‌లో పార్టీ ఇస్తానంటున్నాడు’’
‘‘వస్తా.. కానీ చిన్న హెల్ఫ్ చేయాలి. నేను ఇంటికి వెళ్లాక నువ్వు కాల్ చేసి అర్జంట్ మీటింగ్ ఉంది, టూర్‌కు వెళ్లాలని మా బాస్ ఫోన్ చేసినట్టు చెయ్యి. ఇలాంటి పార్టీలంటే ఇంట్లో వాళ్లు పంపించరు. నీకు తెలుసు కదా?’’
‘‘నీ ఒక్కడికే ఇల్లు- ఇల్లాలు ఉంది. మా ఇంట్లో వాళ్లు మాత్రం బలాదూర్‌గా తిరిగి తాగి తందనాలాడి రమ్మని మంగళహారతి పట్టి వీర తిలకం దిద్ద పంపిస్తారనుకున్నావా? మీ ఇంటికి నేను ఫోన్ చేస్తాను. మా ఇంటికి నువ్వు ఫోన్ చేయి. మా ఆయన బంగారం అని ఇంట్లో వాళ్ల ముందు ఉన్న మన ముద్రను చెరిగి పోకుండా చూసుకుంటేనే కాపురాలు నిలుస్తాయి. మన ముసుగు తొలగిపోతే అంతే సంగతులు’’
‘‘మనల్ని- రాముడు మంచి బాలుడు అని ఇంట్లో వాళ్లు నిజంగా నమ్ముతారంటావా? లేక నమ్మినట్టు కనిపించే ముసుగును ధరిస్తారంటావా?’’
‘‘చూడోయ్.. మనం ముసుగు వీరులం అని నీ అంతట నువ్వే ఒప్పుకున్నావ్. భార్య ముందు భర్త, తల్లిదండ్రుల ముందు పిల్లలు, పిల్లల ముందు తల్లిదండ్రులు, బాస్ ముందు ఉద్యోగులు, ఉద్యోగుల ముందు బాస్, ప్రేయసి ముందు ప్రియుడు, ప్రియురాలి ముందు ప్రియుడు అంతా.. ముసుగులోనే ఉంటారు. మనమేదో స్వచ్ఛంగా ఉన్నట్టు వాజపేయికి ముసుగు అని చర్చించుకోవడం హాస్యాస్పదంగా ఉంది కదూ!’’
‘‘మన సంగతి వేరు. వాజపేయి లాంటి వారు కూడా ముసుగుతో ఉండడం ఏమిటి? ఆయనకూ, మనకూ తేడా లేదా? ఐతే ఆయన కూడా మనలాంటి సామాన్యుడేనా?’’
‘‘ముసుగు లేనిదే ఒక్క క్షణం కూడా ఉండలేని మనం వాజపేయినేంటి? మహాత్మా గాంధీని కూడా తీవ్రంగా విమర్శిస్తాం. రావణాసురుడికి పది తలలున్నాయంటే నిజంగా పది తలలతో కనిపిస్తాడని కాదు. ఒక్కో సందర్భంలో మన ముఖం ఒక్కో ముసుగు ధరించి కనిపిస్తాం. అన్ని ముసుగులు ఒకే సారి ధరిస్తే మనం కూడా రావణాసురుడిలా పది కాదు అంత కన్నా ఎక్కువ తలలతో కనిపిస్తాం. మనల్ని మనమే భరించలేం. రావణుడు, రాముడు అందరూ మనలోనే ఉంటారు. ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరు బయటకు వస్తారు. ’’
‘‘ముసుగు లేనిదే బతకలేమా?’’
‘‘అదేదో సినిమాలో- పోలీస్ స్టేషన్‌లో అలీని విచారణకు పిలిపిస్తారు. అప్పుడే స్టేషన్‌కు ఓ అందమైన అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి ఊపిరి ఆడనివ్వకుండా అలీ ముద్దు పెడతాడు మనసులోనే. పైకి అమాయకంగా కూర్చుంటాడు. అది సినిమా అయినా మనిషి వాస్తవ రూపం. ముసుగులో మర్యాద కనిపిస్తుంది. ముసుగు తీస్తే అసలు రూపం భరించలేం..’’
‘‘అంటే శవం తప్ప- బతికున్నవాళ్లంతా ముసుగుతోనే ఉంటారంటావు’’
‘‘రసాయనాలు అనే ముసుగు లేకపోతే- శవం అసలు రూపాన్ని చూసి భరించలేం. అందుకే శవానికి రసాయనాల పూత పూస్తారు. ’’
‘‘ముసుగు లేని స్వచ్ఛమైన మనిషిని అని ఎవరైనా అంటే అస్సలు నమ్మకు. తమ ముసుగు తమకే తెలియకుండా దాచిపెడుతున్న వాళ్లే అలా అనగలరు’’
*బుద్దా మురళి (జనాంతికం 24-8-2018)

20, ఆగస్టు 2018, సోమవారం

ఆడంబరాలతో అవస్థలే..

ధనం మన చేతిలోని ఓ ఆయుధం. ఈ ఆయుధాన్ని ఎలాగైనా ప్రయోగించవచ్చు. ఆయుధాన్ని ప్రయోగించడం తెలిసిన వారికి ఇదో వజ్రాయుధంగా నిలుస్తుంది. అది తెలియని వారి చేతిలో భస్మాసుర హస్తంగా మిగిలిపోతుంది. ఇది రెండు వైపులా పదునైన ఆయుధం.
డబ్బు విలువను చెప్పే ఓ కథ : తన కుమారుడు డబ్బుకు ఏ మాత్రం విలువ ఇవ్వక బాధ్యతా రాహిత్యంగా జీవిస్తుండడాన్ని గమనించిన సంపన్న తండ్రి. ఈ రోజు నువ్వు ఎంతో కొంత డబ్బు సంపాదిస్తే తప్ప నీకు ఇంట్లో తిండి లేదని ఆంక్ష విధిస్తాడు. అమ్మమ్మ ను డబ్బులు అడిగి వాటిని తండ్రికి చూపిస్తాడు. ఆ డబ్బు ను తండ్రి బావిలో పడేసి, కుమారుడ్ని భో జనం చేయమంటాడు. మరుసటి రోజు ఇలానే మరొకరి వద్ద డబ్బు తీసుకుని తండ్రికి ఇ స్తాడు. తండ్రి ఎప్పటి మాదిరిగానే బావిలో పడేస్తాడు. ఒక రోజు ఇంట్లో ఎవరూ ఇలా రహస్యంగా డబ్బు ఇవ్వడం తమ వల్ల కాదని చెబితే అనివార్యంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. రోజంతా కూలీ పని చేసి వంద రూపాయలు తీసుకు వచ్చి తండ్రికి ఇస్తాడు. తండ్రి వాటిని బావిలో పారేస్తుంటే కుమారుడు అడ్డుకుని నేనెంతో శ్రమించి వంద రూపాయలు సంపాదించాను. అకారణంగా బావిలో పడేయడం తగదని గట్టిగా వాదిస్తాడు. నీకిప్పుడు డబ్బు విలువ తెలిసింది. ఇంత కాలం డబ్బు బావిలో పారేసినా నువ్వేమీ అనలేదు. ఎందుకంటే అది నువ్వు కష్టపడకుండానే సంపాదించింది దాని విలువ నీకు తెలియదు. కానీ ఇప్పుడు అడ్డుకుంటున్నావంటే ఈ వంద రూపాయల విలువ ఏమిటో నీకు తెలిసింది. నీకు డబ్బు విలువ తెలియజేయాలనే ఇలా చేశాను అంటాడు. ఎంత కష్టపడితే డబ్బు వస్తుందో, దానికి ఎలా విలువ ఇవ్వాలో తండ్రి పాఠం ద్వారా కుమారుడు గ్రహిస్తాడు.
డబ్బు విలువ గ్రహించిన వారు శ్రమ విలువను గ్రహిస్తారు. ఆ డబ్బును గౌరవించడం నేర్చుకుంటారు.
డబ్బు సంపాదించడం ఒక కళ అనుకుంటే డబ్బు మీ చేతిలో ఒక బలమైన ఆయుధం. అనివార్యంగా మనిషి వద్ద ఉండాల్సిన ఆయుధం. ఆ ఆయుధం మిమ్ములను రక్షిస్తుంది. సమాజంలో మీకు గౌరవం కలిగిస్తుంది. ఇదే డబ్బు మన చేతిలో లేక పోతే నిరాశ నిస్పృహల్లో పడేస్తుంది. రక్తసంబంధికులను సైతం పురుగుల్లా చూసేట్టు చేస్తుంది. వృక్షో రక్షిత రక్షితః అన్నారు. వృక్షాన్ని మీరు రక్షిస్తే, వృక్షాలు మిమ్ములను రక్షిస్తాయని. సరిగ్గా డబ్బు విషయంలోనూ అంతే దానికి మీరు విలువ ఇస్తే, అది మిమ్ములను తలెత్తుకునేట్టు చేస్తుంది. విలువ ఇవ్వకపోతే తన బలమేంటో తెలుపుతూ నరకాన్ని చూపిస్తుంది.
అదే డబ్బు మితిమీరినా కష్టమే.. అవసరం అయిన దాని కన్నా తక్కువ ఉన్నా కష్టమే.
ఐకియా పేరు విన్నారా?
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ పదమిది. అదో షాపు పేరు. వేలాది మంది ఆ షాపు దర్శనం కోసం క్యూలు కడుతున్నారు. షాపు నిండిపోయింది. ఏడాది పొడవునా ఉంటుంది తరువాత రండి అని బోర్డు పెట్టారు. అంతటి పేరు గడించిన ఐకియాలో ఫర్నిచర్ సంగతి ఎలా ఉన్నా దాని యజమాని జీవితం ఫర్నిచర్ కన్నా చాలా ఆసక్తికరంగా ఉంది.
ఇంగ్వర్ క్రాంపార్డ్ అనే వ్యక్తి తన ఆరేళ్ల వయసులోనే డబ్బు విలువ గ్రహించి ఆ వయసు నుంచే తోటి పిల్లలకు పెన్సిల్స్ అమ్ముతూ వ్యాపారం ప్రారంభించారు. తానుండే గ్రామంలోని వారికి చౌకగా అగ్గిపెట్టెలు అమ్మాడు. పరీక్షలో ఉత్తీర్ణుడైనందుకు తండ్రి ఇచ్చిన డబ్బుతో వ్యాపారం ప్రారంభించాడు. 17ఏళ్ల వయసులో 1947లో స్వీడన్‌లో ఐకియా స్థాపించారు. ఇప్పుడది ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రఖ్యాత ఫర్నిచర్ కేంద్రం.
విజయం సాధించిన వారంతా చిన్నప్పటి నుంచే మేం వ్యాపారం చేశామని ఇలానే కథలు చెబుతారు అనిపించవచ్చు. చిన్నప్పటి విషయాలే కాదు అతను మరణించేంత వరకు డబ్బుకు ఇదే విధంగా విలువ ఇస్తూ జీవించారు. తాను తలుచుకుంటే వందల విమానాలను కొనుగోలు చేయగలరు. కానీ విమానాల్లో సామాన్యుల మాదిరిగానే ప్రయాణిస్తారు. ఒక మధ్యతరగతి వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో అలానే చివరి వరకు బతికాడు.
కొందరతన్ని పిసినారి అనుకున్నా ఏమనుకున్నా సామాన్యుడి జీవిత విధానాన్ని ప్రేమించి అలానే బతికాడు. ఎంతో మంది సంపన్నుల కుటుంబాలు ఆడంబరాల జీవితంతో నేల కూలిపోయిన ఉదంతాలు మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి. డబ్బు సంపాదించడమే కాదు దానికి విలువ కూడా ఇవ్వాలి. విలువ ఇచ్చిన వారి వద్దనే ధనం నిలుస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలి అంటే ఏం చేయాలో మన పెద్దలు చెప్పారు. దేవుడు నిజమా? కల్పితమా? అనే వాదన వేరు. లక్ష్మీదేవిని గౌరవించడం అంటే డబ్బుకు తగిన విలువ ఇవ్వడమే. లక్ష్మీదేవి నిజమా? కల్పితమా? నిజమైతే చూపించు అంటే చూపించలేకపోవచ్చు. కానీ డబ్బుకు తగిన విలువ ఇవ్వని కుటుంబాలు, జీవితాలు ఎలా కూలిపోయాయో, దరిద్ర దేవత బారిన పడ్డాయో చూపించమని సవాల్ చేస్తే ఎంతో మందిని చూపించవచ్చు.
డబ్బుకు తగిన విలువ ఇచ్చాడు కాబట్టే ఇంగ్వర్ క్రాంపార్డ్ తోటి పిల్లలకు పెన్సిళ్లు అమ్మడం నుంచి వ్యాపారాన్ని ప్రారంభించి, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఐకియాను ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగారు. డబ్బుకు విలువ ఇవ్వని వారు పాతాళంలో పడిపోయారు.
-బి.మురళి

డబ్బు మాట్లాడుతుంది!

నిదానమే ప్రధానం - ఆలస్యం విషయం
ఈ రెండు మాటలు చెప్పింది మన పెద్దలే. నిదానం ప్రధానం అంటూనే ఆలస్యం అమృతం విషయం అంటారు. రెండింటిలో ఏది పాటించాలి అనేది కొందరి సందేహం అయితే, పెద్దలిలానే చెబుతారు. వారి మాటలు పాటించాల్సిన అవసరం లేదు అనేది కొందరి జోకులు. రెండూ అక్షర సత్యాలే. ఏ సమయంలో ఏ మాట పాటించాలి అనే నిర్ణయంలోనే మన విజ్ఞత దాగి ఉంటుంది.
‘‘డబ్బు అన్నింటినీ కొనలేదు. డబ్బుతో వాచీ కొనగలవేమో కానీ సమయాన్ని కొనలేవు, డబ్బుతో పుస్తకాన్ని కొనగలవు కానీ జ్ఞానాన్ని కొనలేవు. డబ్బుతో బెడ్‌ను కొనగలవు కానీ నిద్రను కొనలేవు. డబ్బుతో నీకు హోదా రావచ్చు కానీ ఆదరణ దక్కదు. డబ్బుతో రక్తాన్ని కొనగలవు కానీ జీవితాన్ని కొనలేవు.
అంటే డబ్బే అన్నీ చేయలేదు అంటావు. డబ్బు సమస్యలంటావు. సరే నేను నీ మిత్రున్ని కదా? ఈ సమస్యలన్నీ నేను భరిస్తాను. నీ డబ్బు మొత్తం నాకిచ్చేయ్’-
డబ్బు అన్నీ కొనలేవు అనే మాటలపై ప్రచారంలో ఉన్న ఓ జోకు ఇది.
డబ్బుపై రష్యన్ భాషలో ఓ మంచి కథ కూడా ఉంది.
ఒక కుటుంబరావు చిన్న కుటుంబం, ఆదాయం తక్కువే అయినా ఉన్న దాంట్లో భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటాడు. ఓ రోజు అతనికో బంగారు నాణెం దొరుకుతుంది. దాన్ని రుద్దితే అందులో నుంచి మరో నాణెం వస్తుంది. అలా రుద్దుతూనే ఉంటాడు. నాణాలు వస్తుంటాయి. ఇదో మాయానాణెం. ఎన్నిసార్లు రుద్దితే అన్ని నాణాలు వస్తాయని అశరీరవాణి పలుకుతుంది. ఇంటిలోని నేలమాళిగలోకి వెళ్లి ఎవరికీ కనిపించకుండా నాణాన్ని అలా రుద్దుతూనే ఉంటాడు. తన కుటుంబాన్ని, పిల్లలను చివరకు తనను తాను మరిచిపోయి నాణాన్ని రుద్దుతూనే ఉంటాడు.
గడ్డం పెరిగిపోతుంది. తనను తానే గుర్తించలేని స్థితికి చేరుకుంటాడు. హఠాత్తుగా భార్యా పిల్లలు గుర్తుకు వస్తారు. ఇక నాణాలు చాలు, వారిని చూడాలని అనుకుని బయటకు వస్తాడు. అతన్ని ఎవరూ గుర్తు పట్టరు. పిల్లలకు పిల్లలు పుడతారు. అంతా జీవితంలో సంతోషాన్ని అనుభవిస్తుంటారు. జీవితంలో అన్నీ వదిలేసి ఇంత కాలం నేను సాధించింది ఏమిటని కుప్పకూలిపోతాడు.
ఇది కథ మాత్రమే కాదు. మన జీవితం కూడా.
డబ్బు సంపాదనలో పడి, బతకడం మానేస్తున్నాం. కుటుంబం, పిల్లలు, చిన్న చిన్న సంతోషాలు అన్నీ వదిలి మాయా నాణెం వెంట పరుగులు పెడుతున్నామేమో కదా?
ఇంతకూ డబ్బు సంపాదించమంటున్నారా? వద్దంటున్నారా? అనే సందేహం వస్తుందా? మళ్లీ మొదటి సమస్యకు వద్దాం. ఈ పెద్దలు ఎప్పుడూ ఇంతే నిదానమే ప్రదానం అంటారు, ఆలస్యం అమృతం విషం అంటారు. అలానే డబ్బులేకపోతే ఎవరూ పట్టించుకోరు అంటారు. డబ్బే ముఖ్యం కాదంటారు. రెండింటిలో దేన్ని అనుసరించాలి అంటే రెండూ నిజమే. జీవితంలో అన్నీ సమపాళ్లలో ఉండాలి. కుటుంబం ముఖ్యమే, కెరీర్ ముఖ్యమే, డబ్బు సంపాదనా ముఖ్యమే. వీటన్నింటిని సమన్వయం చేసుకోవడమే జీవితం. ఒకటి లేకపోతే మరోటి ఉండరు.
పాత సినిమా పాటలు వింటూ భార్య ముఖాన్ని చూసుకుంటూ మహా అయితే ఒక రోజంతా ఇంట్లోనే ప్రేమను తింటూ ఉంటావేమో ! కానీ డబ్బు లేకపోతే కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోరు. విలువ ఇవ్వరు.
కుటుంబానికి తగిన సమయం ఇవ్వాలి, అదే సమయంలో డబ్బు సంపాదన ఉండాలి. ఒకదాని కోసం మరోదాన్ని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. రెండింటికి ప్రాధాన్యత ఇస్తే జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి. సమాజంలో గుర్తింపు విలువ ఉంటుంది.
డబ్బు అన్నీ ఇస్తుంది. డబ్బు మనిషిని శక్తివంతునిగా మారుస్తుంది. తన జీవితంపై తనకు పట్టు ఉంటుంది. అనేక సమస్యలకు కారణం డబ్బు. అది చేతిలో ఉంటే సమస్యలను పరిష్కరించుకోవచ్చు. డబ్బు లేకపోవడం అదే ఒక పెద్ద సమస్య. అనేక సమస్యలను డబ్బు పరిష్కరిస్తుంది కానీ డబ్బు లేని సమస్యను మరేదీ పరిష్కరించదు. డబ్బే పరిష్కరిస్తుంది. డబ్బు ఆత్మవిశ్వాసంతో పాటు ధీమా గా ఉండేట్టు చేస్తుంది. ఆర్థికంగా బాగున్నప్పుడు తనకు ఏదీ చేయాలనిపిస్తే అది చేయగలం. లేదంటే ఇష్టం ఉన్నా లేకున్నా జీతం ఇచ్చే పనిలో ఉండాల్సి వస్తుంది. మన జీవితం మీద మనకు హక్కు లేని పరిస్థితి వస్తుంది. ఆర్థికంగా స్వేచ్ఛ లేని పరిస్థితిలో. డబ్బు సమాజంలో గౌరవం ఇస్తుంది. గుర్తింపు ఇస్తుంది.
ఒకప్పుడు మద్రాస్‌లో ఒక వెలుగు వెలిగిన ఎస్ వరలక్ష్మి కారులో వెళుతుంటే డ్రైవర్‌ను ఆపి కానిస్టేబుల్ ఏదో ప్రశ్నించి వాదనకు దిగాడట! ఎస్ వరలక్ష్మి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తే, ఆ కానిస్టేబుల్ కనీసం పట్టించుకోలేదు. ఎస్ వరలక్ష్మి నవ్వుకుని కానిస్టేబుల్‌కు ఒక నోటు ఇవ్వగానే వెళ్లి పొమ్మని దారి చూపాడట! గొల్లపూడి మారుతీరావు ఈ విషయాన్ని ఇటీవల రాశారు.
ఎస్ వరలక్ష్మి తెలుగు తమిళ సినిమాల్లో కొన్ని దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగిన నటి. ఆ రోజుల్లో ఆమెను గుర్తించని వారు లేరు. ఆ ట్రాఫిక్ పోలీస్ కొత్త తరానికి చెందిన వాడు. పాత తరంలో ఎస్ వరలక్ష్మి కీర్తి గురించి అతనికి తెలియదు. కీర్తి ప్రతిష్టలకు కాల పరిమితి ఉంటుంది కానీ డబ్బుకు కాలపరిమితి ఉండదు. ఎప్పుడైనా డబ్బు శక్తివంతమైంది. డబ్బుకు మనం విలువ ఇస్తే అది మనకు విలువ ఇస్తుంది. గత కాలంలో తెలుగు సినిమాల్లో, తెలుగు సాహిత్యంలో పేదరికానికి చాలా గ్లామర్ కల్పించారు. పేదరికాన్ని గ్లామరైజ్ చేసిన వారు కూడా డబ్బు సంపాదన కోసమే ఆ పని చేశారు తప్ప పేదరికాన్ని ప్రేమించేందుకు కాదు. చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా సంపాదించడం, సంపన్నులు కావడం తప్పు కాదు.
*
-బి.మురళి(14-8-2018)

డబ్బులు ఊరికే రావు!

డబ్బులు ఊరికే రావు అంటూ ఈ మధ్య ఒక బంగారు నగల వ్యాపారి ప్రచారం అందర్నీ ఆకట్టుకుంది. అతని బంగారు షాపు ముందు కొత్త సినిమా విడుదలైనప్పుడు కనిపించేంత జనం చేరారంటే ఆ ప్రకటన ఎంతగా ప్రభావం చూపిందో అర్థం అవుతుంది. డబ్బులు ఊరికే రావు అని అతను చెబుతున్నా... పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి నగలు కొనేందుకు ఎగబడ్డారు. డబ్బులు ఊరికే రావు అని చెబుతూనే మీ జేబులు ఖాళీ చేయించడం అంటే ఆ వ్యాపారి తెలివి తేటలను మెచ్చుకోవలసిందే.
మోసగాళ్లుంటారు జాగ్రత్త అంటూ కొన్ని మేయిల్స్, ఎస్‌ఎంఎస్ సందేశాలు వస్తుంటాయి. ఒక వైపు మోసగాళ్ల గురించి జాగ్రత్తలు చెబుతూనే మోసం చేసే కిలాడీలు వీళ్లు.
డబ్బులు ఊరికే రావు అనే అతని ప్రచార ఉద్దేశం ఏదైనా... డబ్బులు ఊరికే రావు అనేది అక్షర సత్యం. అది అర్థం అయితే మన డబ్బుకు మనం విలువ ఇస్తాం. మోసగాళ్ల బారిన పడం. చాలా మందికి పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపితే డబ్బులు ఊరికే రావు అనే కనీస అవగాహన లేకుండా మోసపోతుంటారు.
మీ నగలన్నీ ఈ చెంబులో వేయండి. నెల రోజుల పాటు చెంబును పూజ చేయండి తరువాత చెంబు మీద ఉన్న గుడ్డను తెరిచి చూస్తే మీ నగలు రెట్టింపు అవుతాయి. మీ ఇంట్లో సమస్యలు మటుమాయం అవుతాయి. అంటూ దాదాపు మూడు దశాబ్దాల నుంచి మోసం చేస్తూనే ఉన్నారు. దాదాపు పదేళ్ల క్రితం ఇలాంటి దృశ్యాలు సినిమాల్లో కూడా చూపారు. ఇలాంటి మోసాలేం విచిత్రంగా అనిపించవు కానీ... ఇలాంటి మోసాల గురించి ఇంతగా ప్రచారం జరుగుతున్నా, సినిమాల్లో చూపినా ఇంకా ఇదే తీరులో మోసపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మోసపోయే వారి పరిస్థితి ఎలా ఉన్నా. ఇలాంటి పురాతన ట్రిక్స్‌తో ఇంకా జనాన్ని మోసం చేయవచ్చునని జనం తెలివిపై అంత విశ్వాసం ఉన్న మోసగాళ్ల తెలివి ఆశ్చర్యం కలిగిస్తుంది. మూడు దశాబ్దాల క్రితం నుంచి ఉన్న ఇలాంటి మోసాలు మరో మూడు దశాబ్దాలు అయినా ఎక్కడికీ పోవు అలానే ఉంటాయి. ఉత్త పుణ్యానికి నగలు రెట్టింపు అవుతాయి అంటే మనకు ఆశ పుడుతుంది కానీ ఉత్త పుణ్యానికి నగలు రెట్టింపు కావు అనే అవగాహన ఉండదు. నగలు రెట్టింపు చేసే మంత్రాలే వారికి వచ్చి ఉంటే మీరిచ్చే వంద రూపాయల కోసం మీ ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతారు.
మీరు పదివేల రూపాయలు డిపాజిట్ చేస్తే రెండు నెలల్లో రెట్టింపు ఇస్తాం అనే ప్రచారాన్ని చూసి చాలా మంది డిపాజిట్ చేసి మోసపోతుంటారు. వేరువేరు స్కీంల పేర్లతో ఇలాంటి మోసాలు గతంలో జరిగాయి. భవిష్యత్తులో కూడా జరుగుతాయి. డబ్బు గురించి సరైన అవగాహన లేకపోవవడం వల్లనే ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి.
మనం బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే దాదాపు ఏడు శాతం వరకు వడ్డీ చెల్లిస్తారు. గృహ రుణాలు, విద్యా రుణాలు, పరిశ్రమల స్థాపనకు రుణాల నుంచి వ్యక్తిగత రుణాల వరకు వివిధ రకాల రుణాలు ఇస్తాయి. 10 శాతం నుంచి 14 శాతం వరకు వడ్డీతో బ్యాంకులు రుణాలు ఇస్తాయి. మనకు ఏడు శాతం వడ్డీ చెల్లించే బ్యాంకులు ఆ డబ్బును పది శాతం నుంచి 14శాతం వరకు వడ్డీకి రుణాలు ఇస్తాయి. మనకు చెల్లించే వడ్డీకి, బ్యాంకులు వసూలు చేసే వడ్డీకి మధ్య ఉన్న తేడానే బ్యాంకు వచ్చే లాభం. ప్రైవేటు వడ్డీ వ్యాపారులైనా, బ్యాంకులైనా అంతే. మనకు చెల్లించే వడ్డీ, వారు వసూలు చేసే వడ్డీ మధ్య ఉండే తేడానే వారి లాభం.
ఎవరో ప్రైవేటు వ్యక్తి, సంస్థ వచ్చి మూడు నెలలకే మీ డిపాజిట్‌పై రెట్టింపు డబ్బు ఇస్తామంటే ఈజీగా నమ్మేస్తున్నారు. ఇది ఎలా సాధ్యం అనే ఆలోచనే లేదు. ఏడు శాతం వడ్డీని బ్యాంకులు ఎలా చెల్లిస్తున్నాయి అంటే? 12శాతం వడ్డీకి ఇతరులకు ఇచ్చి, డిపాజిట్లపై ఏడు శాతం చెల్లించగలుగుతున్నాయి. నెలకు 30 శాతం వడ్డీ ఇవ్వాలి అంటే మీ డిపాజిట్‌ను ఆ వ్యక్తి కనీసం 40 శాతం ఆదాయం వచ్చే విధంగా పెట్టుబడి పెట్టాలి. ఇది సాధ్యమా?
అయితే ఇలాంటి మోసగాళ్ల వద్ద డబ్బులు డిపాజిట్ చేసే వాళ్లు ఇదంతా ఆలోచించరు. మన వద్ద లక్ష రూపాయలు ఉంటే వాని వద్ద డిపాజిట్ చేస్తే నెలకు పదివేలు ఇస్తానంటున్నాడు. హాయిగా ఇంటి ఖర్చు వెళ్లిపోతుంది అనే ఆలోచనే తప్ప లక్ష రూపాయలకు నెలకు పదివేల రూపాయలు చెల్లించడం ఎలా సాధ్యం. మనం డిపాజిట్ చేసిన డబ్బును వాళ్లు ఏ విధంగా ఇనె్వస్ట్ చేస్తారు. మనకు లక్షకు పదివేలు ఇవ్వాలి అంటే వారికి అంత కన్నా ఎక్కువ ఆదాయం రావాలి కదా? అది ఎలా సాధ్యం అనే ఆలోచన ఏ మాత్రం రాదు. మనం డిపాజిట్ చేసిన లక్ష నుంచి రెండు మూడు నెలల పాటు క్రమం తప్పకుండా పదేసివేలు వడ్డీగా చెల్లిస్తారు. దీనితో అతనిపై నమ్మకం కలుగుతుంది. చాలా మంది డిపాజిట్ చేస్తారు. వారి లక్ష్యం మేరకు డబ్బు సమకూరిన తరువాత బిచాణా ఎత్తివేస్తారు. ఇలాంటి సంఘటనలు కొన్ని వందల నగరాల్లో, పట్టణాల్లో జరిగాయి. అయినా ఇప్పటికీ నమ్ముతూనే ఉంటారు. డబ్బుకు సంబంధించి, వడ్డీకి సంబంధించి కనీస అవగాహన ఉంటే ఇలా మోసపోరు.
తవ్వకాల్లో బంగారు కడ్డీలు దొరికాయి మీకు చౌకగా ఇచ్చేస్తాం. డబ్బు తీసుకొని రండి అంటే వెళ్లిపోవడమే. బంగారం ఎక్కడైనా బంగారమే. మార్కెట్ ధరకు ఎక్కడైనా అమ్ముడు పోతుంది. ఎక్కడో ఉత్తరాది రాష్ట్రం నుంచి ఇక్కడున్న మీకు ఫోన్ చేసి చెప్పగానే వెళ్లిపోవడమేనా? బంగారం చౌకధరకు కొట్టేద్దామనే ఆలోచనే తప్ప బంగారం ఎక్కడైనా బంగారమే నాకు ఫోన్ చేసి అమ్మాల్సిన అవసరం ఏమిటనే ఆలోచన రాదు.
మిమ్ములను రాత్రికి రాత్రి లక్షాధికారులను చేయాలని, మీ డిపాజిట్లను రెండు మూడు నెలల్లో రెట్టింపు చేయాలని ఎవరో కంకణం కట్టుకుని వేచి చూస్తున్నట్టు కనీస అవగాహన లేకుండా డబ్బులు ముట్టచెప్పడం- మోసపోవడం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. డబ్బులు డబ్బులను సంపాదిస్తాయి అక్షర సత్యం. అయితే అది రెండు మూడు నెలల్లో ఎక్కడా రెట్టింపు కావు. మోసాలకు దూరంగా ఉండాలి అంటే డబ్బులు ఊరికే రావు అనే కనీస అవగాహన జీవితంలో ఉండాలి.
*
-బి.మురళి(8-8-2018)

సంపద వ్రతం

హలో డ్రాలో మీ సెల్ నంబర్ లక్కీ నంబర్‌గా తేలింది. లక్ష్మీదేవి రాగిరేకులు అందరికీ రెండు వేలు మీకు డ్రాలో వచ్చింది కాబట్టి ఆరు వందలకే ఇస్తాం. డబ్బులు చెల్లించండి ఇంటికి రాగిరేకులు వచ్చేస్తాయి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. అదృష్టం మిమ్ములను వరిస్తుంది.
***
మీకు ఉద్యోగ సమస్యనా? పిల్లల పెళ్లిళ్లు, వ్యాపారంలో భాగస్వామి మోసం, డబ్బు లేక ఇబ్బందులా? వీటన్నింటికీ ఒకే పరిష్కారం మా కంపెనీ రాగిరేకులు ధరించండి మీ సమస్యలన్నీ చిటికెలు పరిష్కారం అవుతాయి.
ఇలాంటి ప్రకటనలు రోజూ టీవిల్లో కనిపిస్తూనే ఉంటాయి. ఈ మధ్య మానసిక సమస్యలు పెరగడంతో జనంలో భక్త్భివం కూడా పెరిగింది. ఆధ్యాత్మిక ఉపన్యాసాల కోసం భక్తి చానల్స్‌ను చూస్తుంటే మధ్యలో ఇలాంటి వారి ప్రకటనలకు కొదవ ఉండదు. నరేంద్ర మోదీ మొదలుకుని చాలా మంది ప్రముఖ నాయకుల ఫొటోలు చూపిస్తూ వీరి పూజల ఫలంగానే వారికి అధికారం దక్కిందన్నట్టు చెబుతారు. వీరి యంత్రాలు వల్లనే అంబానీ అంతటి వాడు అయ్యాడంటారు? నిజంగా వీరి యంత్రాలు అంత శక్తివంతమైనవా? వీరు తయారు చేసే ఆ రాగిముక్కలకే అంత శక్తి ఉంటే మోదీకి ఇవ్వడం ఎందుకు వీళ్లే ధరించి ప్రధానమంత్రి అయ్యేవాళ్లు. ఆ రాగిరేకుకు అంత శక్తి ఉంటే అంబానీకి ఆరువందలకు అమ్ముకోవడం ఎందుకు ఇంట్లో పెట్టుకుంటే వీళ్లే సంపన్నులు అయ్యే వాళ్లు కదా? కొంత మంది ఉద్యోగులను నియమించుకుని ఇంటింటికి ఫోన్ చేసి రాగిరేకులు అమ్ముకొని సంపాదించడం ఎందుకు, ఆ రేకులు ఇంట్లో తగిలించుకుంటే సరిపోతుంది కదా? రూపాయి విలువ చేసే రాగిరేకులను ఆరువందల రూపాయలకు అంటగట్టే వ్యాపారులు బాగుపడతారేమో కానీ రేకులు కొన్న వాళ్లు బాగుపడరు. పైగా ఆ రేకుల కోసం పెట్టిన డబ్బులు నష్టం.
***
ఇలాంటి రాగిరేకుల అమ్మకాలు, అదృష్టాలు, వ్రతాల గురించి మిత్రుల చర్చల్లో ఒకరు లక్ష్మీదేవి వ్రతం గురించి చెప్పారు. ఆ వ్రతం దీక్షతో ఆచరిస్తే డబ్బుకు సంపన్నులు ఎలా అవుతారో ఒకరు వివరించారు. ఆ వ్రత విధానం వింటే మీరు కూడా నిజమే అది పని చేస్తుంది అని ఒప్పుకోక తప్పదు.
ఒకవైపు రాగిరేకులు, వ్రతాలు ఏవీ పని చేయవు. అంటూనే మరోవైపు లక్ష్మీదేవి వ్రతం పని చేస్తుందని, ప్రభావం ఉంటుందని, సంపన్నులు అవుతారని చెప్పడం డబుల్ స్టాండర్డ్ అనిపించవచ్చు కానీ వాస్తవం ఆ వ్రతం పని చేస్తుంది అనే నమ్మకం నాకుంది.
ఇంట్లో పూజా మందిరంలో ఒక బిందెను పెట్టి లక్ష్మీదేవిని పూజించి రోజుకు ఒక రూపాయి నాణెం ఆ బిందెలో వేయాలి. ఒకేసారి బిందె నిండా నాణాలు వేయవద్దు. రోజుకు ఒక నాణెం మాత్రమే వేయాలి. ఇదీ ఆ వ్రతంలో ప్రధానమైన షరతు. బిందె పూర్తిగా నిండేందుకు ఏళ్లు పడుతుంది. అయితే బిందెలో నాణాలు క్రమంగా పెరుగుతూ ఉన్నా కొద్ది ఆర్థిక పరిస్థితిలో మార్పు సష్టంగా కనిపిస్తుంది. స్థూలంగా ఆ వ్రతాన్ని ఆచరించడం గురించి మిత్రుడు చెప్పిన విధానం.
మంత్రించిన రాగిరేకులు పని చేయనప్పుడు లక్ష్మీదేవి బిందె వ్రతం ఎలా పని చేస్తుంది? అని ప్రశ్నిస్తే, జాగ్రత్తగా ఆలోచిస్తే పని చేసి తీరుతుంది.
రాగిరేకులు కొనడానికి డబ్బులు ఖర్చు చేయాలి. ఈ వ్రతంలో ఇతరులకు పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. బిందె ఇంట్లోనే ఉంటుంది. బిందెలో వేసిన నాణాలు ఇంట్లోనే ఉంటాయి. ఇక్కడ నష్టపోయేదేమీ ఉండదు.
మరి ఈ వ్రతం ఎలా పని చేస్తుంది? అంటే ...
ఒకే చోట ఉద్యోగం, ఒక జీతం పొందేవారి ఆర్థిక పరిస్థితి ఒకేలా ఉండదు. ఒక తండ్రికి ఐదుగురు సంతానం అనుకుంటే పెద్దయ్యాక ఐదుగురి ఆర్థిక పరిస్థితి ఒకేలా ఉండదు. తండ్రి పిల్లలందరికీ ఒకే విధమైన సౌకర్యాలు కల్పించినా పిల్లలందరి ఆర్థిక పరిస్థితి ఒకేలా ఉండదు. వారి ఆర్థిక పరిస్థితికి వారి ఆలోచనా ధోరణి ప్రధాన కారణం. ఒకే విధమైన స్థితిలో ఉన్నప్పటికీ ఆర్థికంగా బాగుపడదాం ఆనే ఆలోచనతో ఉన్న వారు దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎవడు కష్టపడతాడు ఉన్నదాంట్లో సుఖపడదాం అనే ఆలోచన ఉన్నవారు దానికి అనుగుణంగానే సినిమాలు, యాత్రలు అంటూ ఉన్నదాంటో సంతృప్తి పడుతూ జీవిస్తారు.
ఒకరు సంపన్నులుగా మారినా, పేదవారిగా జీవిస్తున్నా దానిలో ప్రధాన పాత్ర వారి ఆలోచనా ధోరణే. ఆలోచనా ధోరణే మన జీవితంపై ప్రభావం చూపుతుంది.
ఇక లక్ష్మీదేవి వ్రతం విషయానికి వస్తే, మంత్రాలకు చింతకాయలు రాలవు అనేది ఏ మంత్రానికైనా వర్తిస్తుంది. కానీ ఇక్కడ చింతకాయలు రాలుతాయి. మంత్రాలకు కాదు ఆలోచనలకు.
సంపన్నుడిని కావాలి, ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలి ఆనే ఆలోచనతో వ్రతం ప్రారంభిస్తారు. బిందెలో రోజూ ఒక రూపాయి వేస్తారు. ఆ రూపాయి పిల్లలు పెట్టదు మనం బిందెలో ఎన్ని రూపాయలు వేస్తే అనే్న ఉంటాయి. కానీ రోజుకో నాణెం వేయడం వల్ల సంపన్నులం కావాలి అనే ఆలోచన రోజు రోజుకు మనసులో బలపడుతుంది. దానికి తగ్గ కార్యాచరణ చేపడతాం. తొలుత డబ్బును వృథా చేసే ఆలోచన తగ్గుతుంది. తరువాత డబ్బు డబ్బును సంపాదిస్తుందనే విషయం తెలిసి సంపాదించింది ఇనె్వస్ట్ చేయాలనే ఆలోచన వస్తుంది. డబ్బు సంపాదించాలనే ఆలోచన వస్తుంది. క్రమంగా సంపదకు సంబంధించిన పాజిటివ్ ఆలోచనలు చుట్టు ముడతాయి. బిందెలో ఒక్కో రూపాయి పెరుగుతుంటుంది. మనసులో సంపదకు సంబంధించిన ఒక్కో ఆలోచన రూపుదిద్దుకుంటుంది. ఇలాంటి వ్రతం చేసేవారు డబ్బు వృథా చేయమని చెప్పినా చేయరు. వారికి సంపద విలువ తెలుసు.సంపదకు సంబంధించి సరైన ఆలోచన, డబ్బుకు ఉండే విలువ గ్రహించడం వంటి ఆలోచనలు ఈ వ్రతం పుణ్యమా ఆని మనసులో స్థిరపడతాయి. ఆలోచనలే మనిషిని సంపన్నుడిగా మారుస్తాయి. ఆ ఆలోచనలకు ఈ వ్రతం దోహదం చేస్తుంది.
డబ్బును వృధా చేసుకుని, మోసగాళ్లను మేపే వ్రతాల కన్నా మన ఇంట్లోనే మన డబ్బు ఉండడంతో పాటు మనకు డబ్బు విలువ నేర్పించే లక్ష్మీదేవి వ్రతం ఆచరణ యోగ్యమైనదే..
-బి.మురళి(30-7-2018)

ఆయువు పెరుగుతోంది..

58ఏళ్లకు రిటైర్‌మెంట్. దేశంలో సగటు ఆయుఃప్రమాణం 70 సంవత్సరాలు. అంటే రిటైర్ అయ్యాక సగటున పనె్నండేళ్లపాటు జీవితం ఉంటుంది. ఇది సగటు లెక్క మాత్రమే. ఇతర వ్యక్తుల కన్నా కచ్చితమైన ఆదాయం ఉండే ఉద్యోగ వర్గాల జీవిత కాలం ఇంకా ఎక్కువే ఉంటుంది. క్రమంగా ఆయుః ప్రమాణం ఇంకా పెరుగుతూనే ఉంది. గమనించారా?
ఆసాధ్యం అని తెలిసినా మనిషి శాశ్వతంగా బతికే ఉండాలని కోరుకుంటాడు. ఈ కోరిక ఈనాటిది కాదు. మరణం లేకుండా వరం ప్రసాదించమని మునులు, రాక్షసులు, రాజులు తపస్సు చేసిన కథలు కూడా మనకున్నాయి. పురాణాల్లో, కథల్లో కూడా శాశ్వతంగా బతికి ఉండే అవకాశం కనిపించలేదు. కానీ వైద్య రంగంలో వినూత్న ప్రయోగాలు, సాంకేతిక ఆభివృద్ధి మనిషి ఆయుః ప్రమాణాన్ని క్రమంగా పెంచుతోంది. పలానా రోగం వస్తే ఇక మరణమే శరణ్యం అనుకున్న ఎన్నో రోగాలకు ఇప్పుడు మందులు ఉన్నాయి.
ఆయుః ప్రమాణం పెరుగుతున్నందుకు సంతోషించాలి కానీ అది కూడా ఒక సమస్యేనా? అనుకుంటున్నారా? నిజమే సరైన రీతిలో దీనికి సిద్ధం కాకపోతే అది కూడా ఒక సమస్యనే అవుతుంది.
పత్రికల్లో ఒకే రోజు రెండు ఆసక్తికరమైన వార్తలు వచ్చాయి. ఈ రెండు వార్తలు పెద్ద వారిని అప్రమత్తం చేసే వార్తలు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చిన ఆస్తిని సరిగా చూసుకోక పోతే వెనక్కి తీసుకోవచ్చునని ముంభై హైకోర్టు తీర్పు చెప్పింది. ముంభైలో తల్లి దండ్రులు తమ పిల్లలకు తమ ఫ్లాట్‌లో 50 శాతం వాటాను పిల్లలకు గిఫ్ట్ గా ఇచ్చారు. పిల్లలు సరిగా చూడడం లేదని గిఫ్ట్‌ను రద్దు చేశారు. దీనిపై ట్రిబ్యునల్‌లో తల్లిదండ్రులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తరువాత ముంభై హైకోర్టుకు వెళితే హై కోర్టు కూడా తల్లిదండ్రులకు అనుకూలంగా తీర్పు చెప్పింది. పెద్దవారిని చూసుకోవాలసిన బాధ్యత సంతానానిది. అలా చూడనప్పుడు అంతకు ముందు ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకునే హక్కు వారికి ఉంటుందని కోర్టు తీర్పు. ఒకసారి ఆస్తి మొత్తం తమ చేతిలో పడితే ఇక పెద్ద వారిని పట్టించుకోవలసిన అవసరం లేదు అని భావించే వారికి ఈ తీర్పు చెంప పెట్టు.
గూడ అంజయ్య తెలంగాణ సమాజాన్ని నాలుగు దశాబ్దాల పాటు తన పాటలతో చైతన్య పరిచిన కవి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు పాట వినని తెలుగు వారుండరు. తన కలంతో, గళంతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూత లూగించారు. గూడ అంజయ్య తల్లి పేరు మీద ఉన్న పదెకరాల పొలాన్ని మనవలు, మనవరాళ్లు తమ పేరు మీద రాయించుకుని ఆమెను అనాధలా వదిలేశారు.
ఇలా చేయడం ధర్మమా? అధర్మమా అనే చర్చ కన్నా ఇలాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఎవరికి వారు ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచింది. వృద్ధాప్యం శాపంగా మారకుండా ఉండాలంటే వయసులో ఉండగానే జాగ్రత్తలు అవసరం.
ఇక మొదట ప్రస్తావించిన రిటైర్‌మెంట్ వయసు విషయానికి వస్తే... చాలా ఉద్యోగాలకు చాలా రాష్ట్రాల్లో రిటైర్‌మెంట్ వయసు 58. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం రిటైర్‌మెంట్ వయసును 55గా నిర్ణయించారు. ఆప్పుడు సగటు ఆయుః ప్రమాణం 60 ఏళ్లు. అప్పటి లెక్కల ప్రకారం చాలా తక్కువ మంది ఐదేళ్లకన్నా ఎక్కువ కాలం రిటైర్‌మెంట్ తరువాత పెన్షన్ సౌకర్యం పొందారట! 55ఏళ్లకు రిటైర్‌మెంట్ తరువాత మహా అయితే ఓ ఐదేళ్లు బతికే వారు కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఉండేవి కావు. తరువాత దాన్ని 58కి పెంచారు. ఆరోజుల్లో రిటైర్‌మెంట్ తరువాత జీవించే కాలం తక్కువ కాబట్టి ఇదో సమస్య అనిపించలేదు. కానీ ఇప్పుడు సగటు ఆయుఃప్రమాణం 70 కాగా, అత్యధిక మంది రిటైర్ ఉద్యోగులు 75 ఏళ్ల వయసు దాటుతున్నారు. రిటైర్ అయి వందేళ్ల వయసు దాటిన వారు కూడా ఉన్నారు. వేళ్ల మీద లెక్కించదగిన చాలా స్వల్ప సంఖ్యనే కావచ్చు కానీ వందేళ్ల వయసు వారు కూడా ఉన్నారు. వీరిని సమావేశపరిచి సత్కరించాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల శాఖ నిర్ణయించింది. 58ఏళ్లకు రిటైర్ అయిన వారు సగటున 75ఏళ్ల వరకు జీవించడం అంటే దాదాపు ఇంకా పాతికేళ్లపాటు ఉంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు రిటైర్ అయిన వారికి పెన్షన్ విధానాలను మారుస్తున్నారు. ప్రభుత్వాలపై ఎక్కువ భారం పడకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
పెరిగిన ఆయుః ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు పెన్షన్ విధానాలను మారుస్తున్నప్పుడు ఎవరికి వారు తమకు సంబంధించి భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉంది. రిటైర్ అయిన తరువాత కూడా దాదాపు పాతిక సంవత్సరాలు జీవించి ఉండే అవకాశం, పని చేసే అవకాశం ఉంటుందనే స్పృహతో ఉండాలి. అలా లేకపోతే వృద్ధాప్యం శాపంగా మారుతుంది. ఉద్యోగి కావచ్చు, వృత్తి పని వారు కావచ్చు, వ్యాపారి ఎవరైనా కావచ్చు. సగటు ఆయుః ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మా పిల్లలు అలాంటి వారు కాదు అని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ సమాజాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాంటి వారు కాకపోతే మంచిదే కానీ ఐతే...
రిటైర్‌మెంట్ తరువాత కూడా స్వతంత్రంగా జీవించడానికి తగిన ప్రణాళిక ఉద్యోగంలో ఉన్నప్పుడే అవసరం. శరీరం సహకరించినంత వరకు పని చేయవచ్చు. రిటైర్‌మెంట్ తరువాత నచ్చిన పని కల్పించుకోవచ్చు. నచ్చిన విధంగా జీవించేందుకు ఏర్పాట్లు చేసుకోవచ్చు. సంపాదించే సమయంలో, ఉద్యోగంలో ఉన్నప్పుడే దీని కోసం ప్రణాళికలు అవసరం. సరైన ప్రణాళికలు ఉంటే రిటైర్‌మెంట్ జీవితం అద్భుతంగా ఉంటుంది. లేదంటే నరకంగా మారుతుంది. రిటైర్‌మెంట్ తరువాత డబ్బు, సంపాదన ఒక్కటే కాదు మనకున్న సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే ప్రణాళిక కూడా వయసులో ఉన్నప్పుడే ఉండాలి. మన జీవితం ఎలా ఉండాలో మన చేతి రాతల్లో రాసి ఉండదు. మనం చేసే పనుల్లో ఉంటుంది.
-బి.మురళి(23-7-2018)

డబ్బు సంపాదించడం నేరమా?

డబ్బు సంపాదించడం నేరమా? సంపన్నులంతా నేరస్తులేనా? పేదరికం వరమా? మీరు పేదరికాన్ని ప్రేమిస్తున్నారా? డబ్బును ద్వేషిస్తున్నారా? నిజానికి పైకి డబ్బును, సంపన్నులను ద్వేషిస్తున్నట్టు కనిపించే వారు సైతం మనసులో వీటిని విపరీతంగా ప్రేమిస్తుంటారు.
డబ్బు సంపాదించే వాళ్లంతా ద్రోహులు కాదు. పేదరికం ఒక వరం కాదు. పాత సినిమాలు, అభ్యుదయ సాహిత్యం డబ్బు సంపాదనపై నెగిటివ్ భావనలు కలిగించాయి. పేదరికాన్ని గొప్పగా చూపుతూ చాలా సినిమాల్లో అద్భుతమైన డైలాగులు ఉన్నాయి. కొన్ని దశాబ్దాల పాటు ఇవి మన మెదడుపై ఎంతో కొంత ప్రభావం చూపించాయి.
ప్రారంభ కాలంలో సినిమాలు, పత్రికలు, సాహిత్యంలో వామపక్ష భావజాలం ఉన్నవారి ప్రభావమే ఎక్కువ. వీరు పేదరికంలో ఉండడమే అదృష్టం అన్నట్టుగా చూపించారు.
ప్రారంభంలో తెలుగు సినిమాల్లో సంపన్నులు విలన్లు ఊరి జనాన్ని హింసిస్తుంటారు. ఊరిలోని పేద హీరో సంపన్న భూస్వామిని దారిలోకి తెస్తాడు. దాదాపు పాత సినిమాల్లోని కథలన్నీ ఇవే. చిత్రంగా ఆసినిమాలను నిర్మించింది జమిందారి కుటుంబాలు, సంపన్నుల కుటుంబాలే. ఒక రూపాయి పెట్టుబడి పెట్టిన వ్యాపారి తన పెట్టుబడికి మించి ఆదాయం రావాలని కోరుకుంటాడు. ఆ కాలంలో ఐనా ఈ కాలంలో ఐనా సినిమా వ్యాపారమే. దేశంలో పేదలే ఎక్కువ. వారు సినిమా చూస్తేనే తమ పెట్టుబడికి తగిన ఆదాయం వస్తుంది. ప్రేక్షకులు వారి ప్రొడక్ట్ కొనే వారు. కొనేవారికి నచ్చినట్టు ఉన్న ప్రొడక్టే అమ్ముడు పోతుంది. అమ్ముడు పోతేనే పెట్టుబడికి తగిన లాభాలు వస్తాయి. పేదలను హీరోలుగా, సంపన్నులను విలన్లుగా చూపే ఈ సినిమాలను నిర్మించింది జమిందార్లు, సంపన్నులే. పేదరికంలో బతకడం చాలా గొప్పతనం అనే భ్రమలు బాగానే పని చేశాయి. పేదరికంపై అద్భుతమైన డైలాగులు రాసే రచయిత, దర్శకులు, నటించే నటులు ఎవరూ పేదరికంలో ఉండడానికి ఇష్టపడరు.
పేదరికంలో పుట్టడమేమీ తప్పు కాదు. కానీ పేదరికాన్ని ప్రేమిస్తూ పేదరికంలో ఉండడమే గొప్ప అనే మానసిక స్థితి తప్పు. దాని నుంచి బయటపడడం మంచిది. చాలా మంది వామపక్ష నాయకులు మెడికల్ కాలేజీల వ్యాపారంలో, వడ్డీ వ్యాపారం, మద్యం వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కోట్లు సంపాదించారు. కానీ పేదరికం సాహిత్యానికి తమ వంతు సహకారం అందించారు.
***
సికిందరాబాద్ శివారు ప్రాంతంలో రోజు కూలీ చేసుకుని బతికే కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి. రోడ్డుకు ఒకవైపు గుడిసెలు, మరో వైపు నీళ్ల ట్యాంకర్ ఆపారు. కార్లు వెళ్లడానికి దారి లేకుండా పోయింది. కొంచం పక్కన ఆపుకోవచ్చు కదా? అని నీళ్ల ట్యాంకర్ అతన్ని కారు డ్రైవర్ చెప్పడమే ఆలస్యం ఆ గుడిసెళ్లోంచి ఒకరు వచ్చి అచ్చం ఆర్ నారాయణ మూర్తి తరహాలోనే ఈ పేదలు గుక్కెడు నీళ్లు కూడా తాగడాన్ని సహించలేరా! మీ డబ్బున్న వారే మనుషులు కానీ పేదలు కాదా? అంటూ అచ్చం సినిమాలోలానే డైలాగులు వినిపిస్తుంటే విన్నవారు మనసులోనే నవ్వుకుంటూ వెళ్లిపోయారు. కారులో వెళ్లడం పాపం, గుడిసెలో పేదరికంలో గడపడం అదృష్టం అన్నట్టుగా అతని సినిమా డైలాగులు ఉన్నాయి. ఇలాంటి డైలాగులు సినిమాల ప్రభావం నుంచే వస్తాయి. సాంఘిక చిత్రాలు ప్రారంభం అయినప్పటి నుంచి ఇదే తరహాలో సంపన్నులు అంటే విలన్లు, పేదరికం అదృష్టం అన్నట్టుగా చూపించారు. సినిమాల యుగం ప్రారంభం అయినప్పటి నుంచి సినిమాల్లో గుడిసె వాసుల్లోనే మానవత్వం, ప్రేమ అన్నీ ఉంటాయి. డబ్బులున్న వారు విలన్లు. నిజానికి అలాంటి సినిమాలు తీసేది కూడా డబ్బులతోనే, డబ్బులు సంపాదించేందుకే పేదరికం కథలు తీస్తారు. నిర్మాత, దర్శకుడు, అందులో నటించిన నటులు అంతా డబ్బున్నవాళ్లే. పేదరికాన్ని ఎంతగానో ప్రేమించే కథలు రాసే రచయితలు సైతం పేదరికానే్నమీ ప్రేమించరు. ఎంత త్వరగా సంపన్నులం కావాలనే కోరుకుంటారు.
రోజు కూలీపై బతికే వారిపై విప్లవ సినిమాల డైలాగుల ప్రభావం చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. మద్యం షాపులను వేలం పాటల ద్వారా విక్రయిస్తారు. భవన నిర్మాణ కార్మికులు పేద్ద సంఖ్యలో ఉండే ఇలాంటి ప్రాంతాల్లో వైన్‌షాపులకు వేలం పాటలు అత్యధిక ధర పలుకుతుంది.
రోజుకు ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల కూలీ వస్తుంది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు పదివేల రూపాయల లోపు జీతానికి కూడా పని చేస్తున్నారు. అలాంటిది రోజు కూలీ అంత కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. ఐతే వీరికి తాము సంపాదించిన దానిలో కొంత పొదుపు చేయడం, ఇనె్వస్ట్ చేయడం వంటివి అలవాటు చేస్తే వారి జీవితాలు పేదరికం నుంచి బయటపడతాయి. ఏ రోజు సంపాదన ఆ రోజు ఖర్చు కావడం, మద్యానికి ఖర్చు చేయడం వల్ల పేదరికానికి శాశ్వతం బంధువులుగా ఉండిపోతారు. పేదరికం నుంచి బయటపడాలి, సంపాదించిన దానిని పేదరికం నుంచి బయటపడే సాధనంగా ఉపయోగించుకోవాలనే ఆలోచన రావాలి. స్వతఃహాగా ఆలోచన వచ్చిన వారు ఆ స్థాయి నుంచి కూడా ఎదుగుతున్నారు. ఇంజనీరింగ్ తరువాత సెల్‌ఫోన్ కంపెనీ కోసం కేబుల్స్ తవ్వే కూలీ పని చేసిన యువకుడు ఇప్పుడు బంజారాహిల్స్‌లో కోట్ల రూపాయల కంపెనీ ఓనర్. అతని జీవితం నిజంగా పేదరికాన్ని పారద్రోలాలి అనుకునే వారికో గ్రంథం. మరో నాలుగేళ్లపాటు కంపెనీ నిర్వహించి, తరువాత తనలా పేదరికం నుంచి బయటపడేందుకు మిగిలిన వారికి వ్యక్తిత్వ వికాసం గురించి పాఠాలు చెప్పాలని ఆ యువకుడు నిర్ణయించుకున్నారు. పేదరికంపై పోరాటానికి ఇలాంటి యువకుల జీవితాలు ఆదర్శం అంతే కానీ పేదరికాన్ని గ్లామరైజ్ చేసే సినిమాలు, డైలాగులు, సాహిత్యం కాదు.
పేదరికంలో పుట్టినా, పేదరికం నుంచి బయటపడేసేది మాత్రం మన మనసే. ఎదగాలి అనే బలమైన కోరిక ఉన్నప్పుడు పేదరికాన్ని జయించవచ్చు. మనం ఏం కావాలన్నా, మన భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకున్నా ముందు మన మనస్సు దానికి సిద్ధం కావాలి. నా జీవితం ఇంతే, పేదరికంలోనే పుట్టి, పేదరికంలోనే చనిపోవాలని నా నుదుటి మీద రాసి ఉంది అని మీరు పదే పదే మీ మెదడుకు సందేశాలు ఇస్తే, మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం ఉంటుంది. అలా కాకుండా నా చుట్టు ఎంతో మంది పేదరికాన్ని జయించిన విజేతలు ఉన్నారు. అలా నేనెందుకు చేయలేను అని మిమ్ములను మీరు ప్రశ్నించుకుంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని పేదరికంపై విజయం సాధించవచ్చు.
చట్టవిరుద్ధంగా సంపాదించడం తప్పు కానీ చట్టబద్ధంగా సంపాదించడం, సంపన్నులుగా మారడం తప్పు కాదు. అవకాశాన్ని అందిపుచ్చుకోక పోవడమే తప్పవుతుంది. పేదరికం సినిమాల్లో చూపినంత గ్లామర్‌గా ఉండదు. పేదరికాన్ని ప్రేమించడం, సంపన్నులను ద్వేషించడం పాత కాలపు ఫ్యాషన్. పేదలంటే హీరోలు, సంపన్నులు విలన్లు అనేది సినిమాల్లో మాత్రమే నిజ జీవితంలో అలా ఉండదు.
దాన్ని వదిలేయండి పేదరికాన్ని పారద్రోలండి. చట్టబద్ధంగా సంపాదించండి దీని కోసం మనసును ముందు సిద్ధం చేసుకోండి. పాత భావాలను పారద్రోలండి.
-బి.మురళి(16-7-2018)

రెండో ఆదాయం!

‘‘మీకు రెండవ ఆదాయం ఉందా?’’
‘‘మాది మీలా ప్రభుత్వ ఉద్యోగం కాదు రెండవ ఆదాయం ఉండేందుకు. మీకేం అదృష్టవంతులు. ఒక చేయితో కాదు రెండు చేతులా సంపాదిస్తారు. ’’
ఇలాంటి సంభాషణ మనం చాలా సార్లు వినే ఉంటాం. రెండవ ఆదాయం అంటే అక్రమ సంపాదనేనా? మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు కంపెనీలో ఉద్యోగులు, వ్యాపారులు, వృత్తి నిపుణులు ఎవరైనా కావచ్చు ప్రతి వారికి ఒకటే ఆదాయం ఎప్పటికైనా ప్రమాదకరమే. రెండవ ఆదాయంపై దృష్టి సారించడం ప్రతి ఒక్కరికీ అవసరం.
నోకియా ఒకప్పుడు సెల్‌ఫోన్‌లు తయారు చేసే గొప్ప కంపెనీ. బజాజ్ చేతక్ స్కూటర్లు ఒకప్పుడు బ్లాక్‌లో అమ్ముడు పోయేవి. ఆ స్కూటర్ కావాలంటే దాదాపు ఏడేళ్ల పాటు వెయిటింగ్ లిస్ట్‌లో మన పేరు చూస్తూ గడిపేయాల్సి వచ్చేది. బైక్‌ల విజృంభణతో స్కూటర్ల ఉత్పత్తి నిలిచిపోయింది. సెల్‌ఫోన్ ప్రపంచాన్ని ఏలిన నోకియా కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు తమ జీవితానికి ఢోకా లేదనే ధీమాతో బతికే వారు. ఆ కంపెనీలు కుప్పకూలిపోవడంతో వాటిపై ఆధారపడిన కుటుంబాలు ఒక్కసారిగా దిక్కు తోచని స్థితిలో పడిపోతాయి. గొప్ప కంపెనీలు అనే కాదు ఏ వ్యక్తి అయినా అప్పటి వరకు తనకు ఉపాధి కల్పిస్తున్న సంస్థ దెబ్బతినడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడిపోతారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో పలు ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసినప్పుడు చాలా మంది ఉద్యోగులు మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నారు. అప్పటి వరకు ఒక విధమైన జీవితానికి అలవాటు పడిన వారు తాము పని చేసే సంస్థ మూతపడగానే తట్టుకోలేరు. ప్రభుత్వ రంగ సంస్థ అయినా ప్రైవేటు సంస్థ అయినా ఉద్యోగి కోలుకోలేరు.
మారుతున్న కాలంలో ఉద్యోగ అవకాశాలు విపరీతంగా పెరిగాయి. అదే సమయంలో ఏ సంస్థలో ఎవరి ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. పాతికేళ్ల లోపు వయసులోనే ఐటి కంపెనీల్లో ఉద్యోగం వేలల్లో జీతం. అంతా బాగుందనుకుంటుండగా ఉద్యోగం ఎప్పుడు పోతుందో ఎందుకు పోతుందో తెలియని పరిస్థితి. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చినా, అమెరికా- చైనాల మధ్య సుంకాల యుద్ధం జరిగినా, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఎవరి ఉద్యోగానికి ఎసరు వస్తుందో తెలియని పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలకు అవకాశాలు ఉన్నాయి, అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగితే ఉపాధి ఎక్కడ దెబ్బతింటుందో తెలియని పరిస్థితి. ఎక్కడో అమెరికా తీసుకునే నిర్ణయం ఎక్కడో మారుమూల గ్రామం మనె్నవారిపల్లి గ్రామానికి చెందిన యువకుడు పని చేసే మాదాపూర్‌లోని ఐటి కంపెనీపై పడొచ్చు. ఉద్యోగం ఊడొచ్చు. అంటే ట్రంప్‌ను కలలో కూడా చూడని గ్రామీణ కుటుంబంపై ట్రంప్ నిర్ణయం తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
జీవితం అంటే భయపెట్టడానికి చెప్పడం కాదు. మారిన పరిస్థితుల్లో ఏ నిర్ణయం, ఎవరి తప్పు ఎవరి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పలేం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త అవసరం. ఒకసారి ఉద్యోగంలో చేరితే 58 ఏళ్లకు శాలువా కప్పి రిటైర్‌మెంట్‌కు వీడ్కోలు పలికే రోజులు కావివి. ఏమైనా జరగవచ్చు. సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి తన ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. ఉన్న ఉద్యోగం ఊడవచ్చు. ఏదైనా జరగవచ్చు.
వ్యతిరేక భావనలు కలిగించడం కాదు. మన కళ్ల ముందే ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సాధించి క్యాంపస్ సెలక్షన్‌లో ఉద్యోగం పొంది జీవితం హ్యాపీడేస్ సినిమాలా గడిచిపోతుందనుకునే కుర్రాడికి కంపెనీలో ప్రతికూల పరిస్థితులు ఎదురైతే తట్టుకోవడం కష్టం. ఇలా జరుగుతుందని కాదు, జరగదని కాదు.
కానీ రెండవ ఆదాయంపై దృష్టి సారిస్తే, ఆ కుటుంబం ఇలాంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకోవడమే కాదు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటుంది. రేపటిపై ధీమాగా జీవిస్తుంది. రెండవ ఆదాయం అంటే అక్రమంగా సంపాదించడం, నీతిని వదిలేయడం కాదు.
చేసే ఉద్యోగంలో జీతం ఎంతైనా కావచ్చు. ఖర్చులు తగ్గించి పొదుపును పెంచి సరైన రీతిలో ఇనె్వస్ట్ చేస్తే ఆ పొదుపే రెండవ ఆదాయానికి మార్గం అవుతుంది.
హిందీ సినిమా రంగంలో టాప్ హీరోలు కోట్ల రూపాయల్లో పారితోషికం తీసుకుంటారు. సినిమా రంగంలో అవకాశాలు ఎంత కాలం ఉంటాయో తెలియదు. టాప్ హీరోలు అందరూ సినిమా ఆదాయంపైనే కాకుండా ఇతర ఆదాయాలపై దృష్టిసారించారు. తాము సంపాదించిన డబ్బును హోటల్స్, రియల్ ఎస్టేట్, పరిశ్రమల వంటి రంగాల్లో పెట్టుబడి పెడుతున్నారు. సినిమాల్లో అవకాశాల సంగతి ఎలా ఉన్నా ఇతర రంగాల్లో వీరు పెట్టిన పెట్టుబడి వీరిని ఎక్కడికో తీసుకు వెళుతుంది. సినిమాల్లో అవకాశాలు లేకపోయినా సినిమాల ద్వారా సంపాదించిన దాని కన్నా ఇతర వ్యాపార మార్గాల ద్వారా వీరికి ఎక్కువ ఆదాయం వస్తోంది. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే వారు ఆ స్థాయిలో రెండవ సంపాదనపై దృష్టిసారిస్తే, సామాన్య ఉద్యోగి తన స్థాయిలో తాను రెండవ ఆదాయంపై దృష్టిసారించాలి. పన్ను రాయితీల కోసం ఉద్యోగులు ఏటా లక్షా 50వేల రూపాయల వరకు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. కొంత కాలానికి ఇదే పెద్ద ఆదాయం కావచ్చు. అందరి ఆలోచనలు ఒకే రకంగా ఉండవు, ఒకే రకమైన అభిరుచులు, అవకాశాలు ఉండక పోవచ్చు. అవకాశం ఉన్నంత వరకు ఒకే ఆదాయంపై ఆధారపడకుండా చట్టబద్ధంగా రెండవ ఆదాయంపై దృష్టిసారించడం ఈ కాలంలో అందరికీ అవసరం. చాలా మంది ఇంటిపై పెట్టుబడిని రెండవ ఆదాయంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలా మందివి పెన్షన్ లేని ఉద్యోగాలు. చివరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో సైతం పెన్షన్ విధానం మారింది. ఇలాంటి పరిస్థితిలో తాను ఉండడంతో పాటు అద్దె వచ్చే విధంగా సొంత ఇంటిని సమకూర్చుకోవడంపై చాలా మంది దృష్టి సారిస్తున్నారు. నగరాల్లో ఉన్న వారికి ఇది మంచి అవకాశం. ఇంటి విలువ పెరగడంతో పాటు పెన్షన్‌లా నెల నెలా అద్దె రూపంలో ఆదాయం వస్తుంది.
ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన రేలంగి నరసింహారావు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సినిమాల్లో పెద్దగా సంపాదించింది లేదని, ఆ రోజుల్లో కట్టిన ఇంటిపై ఇప్పుడు వస్తున్న అద్దెనే తనకు జీవనాధారం అని వివరించారు. ఆదాయం గడించేప్పుడే సరైన ఇనె్వస్ట్‌మెంట్ చేయాలి. భద్రమైన జీవితానికి రెండవ ఆదాయం అనివార్యం.
-బి.మురళి(9-7-2018)

18, ఆగస్టు 2018, శనివారం

దేశద్రోహులకో దేశం!

ఎంటీ.. అంత రహస్యంగా స్మార్ట్ ఫోన్ లో  లీనమయ్యావు’’
‘‘స్వచ్ఛ పనిలో ఉన్నాను. మెసేజ్‌లతో ఫోన్ బరువుగా మారింది. క్లీన్ చేస్తున్నాను’’
‘‘నాకు తెలుసులే.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షల మెసేజ్‌లతో ఫోన్ నిండిపోయి ఉంటుంది?’’
‘‘కాదు.. ఆ మెసేజ్‌లు మహా అయితే ఆరేడు వచ్చి ఉంటాయి. ఈసారి చిత్రంగా స్వాతంత్య్ర దినోత్సవ వ్యతిరేక మెసేజ్‌లతో ఫోన్ నిండిపోయింది. మనకింకా స్వాతంత్య్రం రాలేదు. ఇదేనా స్వాతంత్య్రం? ఎవరి కోసమీ స్వాతంత్య్రం? అంటూ ఆరేడు వేల మెసేజ్‌లు వచ్చాయి. ఆశ్చర్యకరంగా ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వ్యతిరేక శుభాకాంక్షలతో ఫేస్‌బుక్ నిండిపోతుందనే జ్యోతిష్యాల పోస్ట్‌లే కొన్ని వేల రేట్లు ఎక్కువగా కనిపించాయి. అపర మేధావులు పెట్టిన ఈ పోస్టులు చూసి చాలామంది స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం సిగ్గు పడాల్సిన విషయంగా భావించి భయపడి దూరంగా ఉండిపోయారు. ’’
‘‘ఉగ్రవాదికి అనుకూలంగా పోస్టులు పెట్టిన వారు కూడా భయపడనంతగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షల పోస్టులు పెట్టడానికి భయపడే రోజులు వస్తాయని కలలో కూడా అనుకోలేదు.’’
‘‘నిన్న ఓ షార్ట్ ఫిల్మ్ చూశా. దేశభక్తి అవసరం అని ఫేస్‌బుక్‌లో ఒకరు పోస్టు పెట్టి మిత్రులందరికీ చూపిస్తాడు. ఆఫీసులో తోటి ఉద్యోగికి ఆపద వస్తే ఉద్యోగులు తలా ఇంత ఆర్థిక సహాయం చేస్తారు. ఫేస్‌బుక్‌లో దేశభక్తి పోస్టు పెట్టిన వ్యక్తి మినహా. దేశభక్తి ఉన్నవారికి మానవత్వం ఉండదు అని ఆ షార్ట్ ఫిల్మ్ ద్వారా జాతికి సందేశం ఇచ్చారు.’’
‘‘వావ్.. ఏం ఐడియా..! కొద్దిగా మార్పులు చేస్తే ఈ షార్ట్ ఫిల్మ్‌కు అంతర్జాతీయ అవార్డు ఖాయం. ఈ షార్ట్ ఫిల్మ్‌ను తెలుగులో కాకుండా ఇంగ్లీష్‌లో తీసి కష్టాల్లో ఉన్న సహ ఉద్యోగికి అస్సలు సహాయం చేయని వ్యక్తి దేశభక్తి పోస్టులు చేసిన వ్యక్తి అయితే, అందరి కన్నా ఎక్కువ ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి ఏవరా? అని విచారిస్తే, అంతర్జాతీయ టెర్రరిస్టు అని తేలుతుంది. ఈ ముగింపుతో షార్ట్ ఫిల్మ్ తీస్తే అదిరిపోతుంది. వచ్చే ఏడాదికి మనం ఈ మార్పులతో కొత్తగా షార్ట్ ఫిల్మ్ తీసేద్దాం. ’’
‘‘ప్రపంచంలో వ్యాపారానికి అనుకూలంగా ఉండే దేశాల జాబితాను వరల్డ్ బ్యాంకు తయారు చేస్తుంది కదా? అలానే తమ దేశాన్ని తాము ద్వేషించే వారు ప్రపంచంలో ఎక్కువగా ఉండే దేశం ఏది అన్నది సర్వేను ఎవరైనా చేశారా?’’
‘‘్భలే ఉంది. ప్రపంచంలో సంపన్న దేశం, నివసించడానికి అనువుగా ఉండే దేశం, అత్యంత సంతోషంగా ఉండే దేశం అనే సర్వేలు జరుగుతాయి కానీ ఓ దేశాన్ని, ఆ దేశ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలను ఎక్కువగా వ్యతిరేకించే వారు అత్యధికంగా ఉండే దేశం ఏది? అనే సర్వేలేమీ జరగలేదు అనుకుంటా!’’
‘‘నిజంగా జరిగి ఉంటే మనం ఊహించని ఫలితాలు వస్తాయేమో.. అమెరికా ప్రపంచంలోకెల్లా సంపన్న దేశం అనుకుంటాం కదా? కానీ ప్ర పంచ సంపన్న దేశాల్లో అమెరికాది మొదటి స్థానం కాదు కనీసం పదో స్థానం కూడా కాదు. అమెరికాది 12వ స్థానం అయితే. ఖతార్ అనే చిన్న దేశం ప్రపంచంలోకెల్లా సంపన్న దేశం కావడం విచిత్రం కదా? రక్షణ విషయంలోనే కాదు అనేక విషయాల్లో ఖతార్ ఇతర దేశాలపై ఆధారపడ్డా సంపన్నత విషయంలో మాత్రం మొదటి స్థానంలో నిలవడం విచిత్రం’’
‘‘నిజమా? ప్రపంచానికి ఆయుధాలు అమ్ముతున్న అమెరికా ప్రప్రంచంలోకెల్లా సంపన్న దేశం అనుకున్నా. ’’
‘‘చాలా మంది యువత కలల ప్రపంచమైన అమెరికా కన్నా సంపన్న దేశాలు 11 ఉండడం విచిత్రమే. ఐతే ఆ 11 దేశాలు కూడా అమెరికా కనుసన్నల్లో బతుకుతూ ఉండొచ్చు.. అది వేరే విషయం.’’
‘‘పోనీలే సంపన్న దేశం కాకపోయినా మన జాతీయ పతాకం, మన జాతీయ గీతం ప్రపంచంలో నంబర్ వన్ అని యునెస్కో తేల్చింది కదా? ఇంకేం కావాలి?’’
‘‘సరిగ్గా గుర్తు చేశావు. బోగస్ వార్తల్ని ప్రచారంలో చేయడంలో సర్వే జరిగితే మనమే మొదటి స్థానంలో నిలుస్తామోమో! జాతీయ గీతం, జాతీయ జెండా సర్వేల గురించి ఐదారేళ్ల నుంచి ఈ బోగస్ ప్రచారం మొదలుపెట్టింది ఎవరో తెలియదు. కానీ చివరకు యునెస్కో సైతం బాబోయ్ మమ్ముల్ని వదిలేయండి. మేం అలాంటి సర్వేలేమీ నిర్వహించం అని ప్రకటించింది. ’’
‘‘ మేమేం సర్వేలు నిర్వహించం అని నిజంగానే యునెస్కో ప్రకటించిందా? లేక ఇది కూడా నకిలీ ప్రచార గ్రూప్‌కు పోటీగా పుట్టిన బోగస్ ప్రచారం అయితే కాదు కదా?’’
‘‘ఏమో ఆ దిశగా ఆలోచించలేదు’’
‘‘పోనీ మన దేశం ఎందులో నంబర్ వన్‌గా నిలిచిందో చెప్పు. ‘సున్న’ను కనిపెట్టింది మన వాళ్లే కాబట్టి. ఈ లెక్కల్లో మన స్థానం అదే అంటావా?’’
‘‘నేనేమీ అనను. ఎందులో నంబర్ వన్నో కూడా నాకు తెలియదు. ’’
‘‘ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఓ ఆలోచన చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డలు కొందరిని తల్లితండ్రులకు దూరంగా ఒక చోట పెరిగేట్టు చేస్తే, వారు పెద్దవారయ్యాక ఎలా చూద్దామనుకున్నారు? ఆ ఆలోచన వర్కౌట్ కాలేదు కానీ అలా జరిగి ఉంటే కులాలు, మతాలు లేకుండా విశాల దృక్ఫథంతో మేధావులుగా మారి ఉండేవారేమో కాదా?’’
‘‘మేధావులుగా మారేవారో కొత్త హిప్పీల తెగలా ఉండేవారో..?’’
‘‘స్వాతంత్య్ర దినోత్సవాన్ని తమ దేశ పండుగలను, సంస్కృతిని, సంప్రదాయాలను, మాతృభాషలను అవహేళన చేసేవారు ఏ దేశంలో ఎక్కువ ఉన్నారో సర్వే జరిపితే ఫలితం ఎలా ఉంటుందంటావు?’’
‘‘దేశం దాటి వెళ్లని నాకు ఇతర దేశాల సంగతి తెలియదు కానీ. యునెస్కో వాళ్లు జోక్యం చేసుకుని దేశద్రోహులు ఎక్కువ ఉండే దేశం ఏదో సర్వే జరిపితే బాగుండేది’’
‘‘యునెస్కో ఆ పని చేస్తుందో లేదో కానీ. అన్ని దేశాల్లోని దేశ ద్రోహలందరినీ దేశ బహిష్కరణ చేస్తే, అలాంటి వారితో ఏర్పడే కొత్త దేశానికి పేరు పెట్టడం ఈజీ’’
‘‘ఏం పేరు..?’’
‘‘దేశద్రోహుల దేశం..!’’

-బుద్దామురళి (జనాంతికం 17-8-2018)

10, ఆగస్టు 2018, శుక్రవారం

లాడెన్ వియ్యంకుడు.. హిట్లర్ తోడల్లుడు!

‘‘పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల చరిత్ర చూడాలని పాత కాలంలో అనుకునేవారు కదా?’’
‘‘ఔను.. అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో పెళ్లి సంబంధాల సైట్లు చూడడమే కానీ ఏడు తరాల చరిత్ర చూసేవారెవరు? అలా అంటే- ఇంకా ఇదేం చాదస్తం అంటారు’’
‘‘ఈ కాలంలో కూడా ఇలా కుటుంబ చరిత్రను చూసేవాళ్లున్నారు.’’
‘ మొన్న జరిగిన మీ బాబాయ్ కొడుకు పెళ్లి గురించేనా?’’
‘‘మా బంధువులు కాదు. మన దేశం కూడా కాదు. మొన్న లాడెన్ కొడుకు పెళ్లి జరిగింది. అమ్మాయి ఎవరని అడగవేం?’’
‘‘అడకగ పోయినా చెబుతావు కదా? నువ్వే చెప్పు?’’
‘‘అదే మరి.. అల్లాటప్పా కోన్ కిస్కా అమ్మాయిని ఎలా చేసుకుంటాడు? తన కుటుంబం స్థాయికి తగ్గ సంబంధం వెతికి మరీ చేసుకున్నాడు. అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రంపై ఉగ్రవాదులు విమానంతో దాడి చేసిన విషయం గుర్తుందా?’’
‘‘ఎందుకు గుర్తు లేదు. పాపిష్టి ఉగ్రవాదులు అమానుషంగా దాడి చేసి 17వందల మంది ప్రాణాలను హరించారు. ప్రపంచం వారిని ఎలా మరిచిపోతుంది? ఏ పాపం ఎరుగని ఆ 17వందల మంది కుటుంబాలు ఇంకా ఆ ఆవేదన నుంచి బయటపడి ఉండవు. ఈ దాడి తరువాత అమెరికాలో ప్రజల ఆలోచనా ధోరణి మారిపోయిందట! ’’
‘‘గుర్తింది కదా? ఆ దాడికి నాయకత్వం వహించింది హైజాకర్ల నాయకుడు మహమ్మద్ అట్టా. ఆయన కుమార్తెనే లాడెన్ కుమారుడు పెళ్లి చేసుకున్నాడు.’’
‘‘మనలాంటి కుటుంబరావుల పిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటేనే తగిన సంబంధం వెతకడానికి ఎంత కష్టపడతాం? ఆ రోజుల్లో అంటే పెళ్లిళ్ల పేరయ్యల వద్ద పెళ్లి సంబందాలు రెడీగా ఉండేవి. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే పెళ్లి సంబంధాల సైట్లు వచ్చాయి. అబ్బాయి మహేశ్ బాబులా, అమ్మాయి కత్రినా కైఫ్‌లా ఉండాలని కోరుకుంటారు. ఆన్‌లైన్‌లో సమాచారం కూడా అలానే ఉంటుంది. మహేశ్ బాబులా ఉంటాడని ఫోటో చూపించి, బ్రహ్మానందంలా బట్టతల ఉన్న అబ్బాయిని అంటగట్టారని అమ్మాయి వాళ్లు, కత్రినా కైఫ్ అని చెప్పి కంత్రీ పిల్లను అంటగట్టారని అబ్బాయి వాళ్లు వీధిన పడ్డ కేసులు ఎన్ని చూడడం లేదు? గంతకు తగ్గ బొంత అన్నట్టు మనలాంటి వాళ్లకే ఇన్ని సమస్యలుంటే నరరూప రాక్షసులు తమ పిల్లలకు సంబంధాలు కుదుర్చుకోవడం అంటే సామాన్యమా? వేలాది మందిని హతమార్చిన లాడెన్‌ను అమెరికా బృందం మట్టుపెట్టాక తండ్రి లేని ఆ బిడ్డకు పెళ్లెలా అవుతుందో, తగిన సం బంధం దొరుకుతుందా? అని ఆయన అభిమానులెంత ఆందోళన చెందారో..’’
‘‘ఇక్కడ సమస్య పెళ్లి గురించి కాదు. లాడెన్ కొడుకు అంటే మామూలు కాదు.. వారి కుటుంబం స్థాయికి తగిన సంబంధం దొరకాలి. ఐటీ కంపెనీలో పనిచేసే కుర్రాడికి అదే కంపెనీలోనో, మరో కంపెనీలోనో పనిచేసే ఐటీ అమ్మాయి దొరకడం పెద్ద కష్టం కాదు. ప్రపంచాన్ని గడగడలాడించిన వారి పిల్లలకు సంబంధాలు ఈజీనా..? ’’
‘‘మీరేదో వెటకారంగా మా ట్లాడుతున్నట్టుంది. వాళ్ల తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లలకేం సంబంధం?’’
‘‘కాళ్లు కడిగినప్పుడే కాపురం చేసే తీరు తెలుస్తుందని పెద్దలంటారు. లాడెన్ కుమారుడికి సంబంధాలు వెతికినప్పుడు, ట్విన్ టవర్స్ కూల్చేసిన వాడి కుమార్తెకు సంబంధం వెతికినప్పుడు వీరి కాపురం తీరు తెలుస్తోంది. మీరన్నట్టు వీరి కడుపున శాంతికపోతాలు పుడితే వద్దనడానికి నేనెవరిని? మహా అయితే మరో పిల్ల లాడెన్ పుట్టవద్దని కోరుకుంటా అంతే. ’’
‘‘తమ సిద్థాంతాల కోసం ప్రపంచాన్ని గడగడలాడించే పనిలో బిజీగా ఉండే లాడెన్ లాంటి ఉగ్రవాదులు, ప్రపంచాన్ని జయించాలని చూసే హిట్లర్ లాంటి గొప్పవాళ్లు తమ పిల్లలకు సంబంధాలపై అస్సలు దృష్టిపెట్టరు. ఆ మధ్య ముంబయి డాన్ దావుద్ ఇబ్రహీం పిల్లల పెళ్లి గురించి చదివాను. దావుద్ షడ్డకుడని, చోటా షకీల్ వియ్యంకుడు ఇతనే అని చెప్పుకోవడం ఎంత గొప్పగా ఉంటుంది! అమెరికా అధ్యక్షుడిని అని చెప్పుకున్నంత గొప్పగా ‘హిట్లర్ తోడల్లుడు, దావుడ్ వియ్యంకుడు’ అని అని చెప్పుకోవాలంటే పెట్టి పుట్టాలి.
హాజీ మస్తాన్, అబు సలేం, చోటా రాజన్, వరదరాజు ముదిలియార్ వంటి డాన్‌లు ముంబయి చీకటి సామ్రాజాన్ని ఈజీగానే ఏలేశారు కానీ తమ పిల్లలకు తమ కుటుంబ స్థాయి సంబంధాల కోసం ఎంత కష్టపడ్డారో పాపం! వీరికోసం ‘డాన్ ఫ్యామిలీ పెళ్లి సంబంధాల వెబ్‌సైట్’ ప్రారంభించే ఆలోచన ఇంకా ఎవరికీ రానట్టుంది. ట్రై చేస్తావా? అలానే వందల కోట్ల డబ్బుతో ఏసీబీ దాడుల్లో పట్టుపడిన వారికి కూడా ఓ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ఉండాల్సిందే. ఏసీబీ దాడుల తరువాత చాలా మంది పలుకుబడి సమాజాంలో ఆమాంతం పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాం.
పైకి ఎవరెన్ని నీతులు చెప్పినా నిజాయితీ పరుడంటే ఎవరైనా ఇంతే కదా? వీడి దగ్గరేముంటుంది బూడిద? అని దూరంగా ఉంటారు. అదే ఏసీబీ దాడిలో పట్టుపడ్డాడంటే సంపన్నుడు అని అంతా గుర్తించినట్టే. ఏసీబీ దాడుల్లో దొరికితే వంద కోట్ల ఉద్యోగుల క్లబ్, రెండువందల కోట్ల క్లబ్, అలానే మర్డర్ చేసిన వారికి, దోపిడీలు చేసిన వారికి విడివిడిగా క్లబ్‌లు ఉంటే వీరి మధ్య పెళ్లి సంబంధాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు’’
‘‘అది సరే.. లాడెన్ కుమారుడికి కట్నం కింద ఏమిచ్చి ఉంటారు?’’
‘‘అదేదో సినిమాలో అడుక్కునే వాడు తన కూతురు పెళ్లికి రెండు మూడు వీధులు రాసిస్తాడు. ఆ వీధుల్లో అడుక్కోమని. అలానే బాంబులేయడానికి ఏదో ఓ ఖండాన్ని లాడెన్ కుమారుడికి మహమ్మద్ అట్టా కుటుంబం వారు కట్నంగా ఇచ్చే ఉంటారు.’’
‘‘లాడెన్ కుమారుడికి ట్విన్‌టవర్ కూల్చిన హైజాకర్ల కుటుంబంతో సంబంధం కుదిరిందని నీకు కుళ్లు’’
‘‘ఈ రోజుల్లో ఉద్యోగం , సొంతిళ్లు ఉన్నా అబ్బాయిలకు సంబంధాలు కుదరడం లేదు. ‘పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య’ రోజు రోజుకూ అన్ని సామాజిక వర్గాల్లోనూ పెరిగిపోతుంది. ఎంతైనా లాడెన్ అదృష్టవంతుడు తనకు తగిన వియ్యంకుడు దొరికాడు.’’

-బుద్దా మురళి (జనాంతికం 10-8-2018)

3, ఆగస్టు 2018, శుక్రవారం

లంచమిస్తే శిక్ష!

తంతే బూరెల బుట్టలో పడడం అంటే ఇదేనేమో?’’
‘‘నిన్ను ఎవరు తన్నారు? ఎక్కడ పడ్డావు?’’
‘‘నా సంగతి కాదు. ఇకపై లంచం తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా నేరమేనట! లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఏడేళ్లపాటు జైలు శిక్షనట! లంచగొండులకు పండగే పండుగ.. ఇక నిర్భయంగా లంచాలు తీసుకోవచ్చు. ఎవరైనా ప్రశ్నిస్తే, లంచం ఇవ్వడానికి వచ్చాడని ఎదురు ఫిర్యాదు చేయవచ్చు.’’
‘‘చిన్నప్పుడు చదివిన కథ ఒకటి గుర్తుకొచ్చింది. లంచాలకు అలవాటు పడ్డ రాజోద్యోగి ఒకరి గురించి రాజుగారికి తెలిసి, చాలా వార్నింగ్‌లు ఇచ్చాడట! ఐనా ఎలాంటి మార్పు లేదు. ప్రాధాన్యత లేని, ప్రజలతో సంబంధం లేని పని అప్పగిస్తే చచ్చినట్టు మారతాడనుకున్న రాజు అతనికి సముద్రం ఒడ్డున పని అప్పగించాడు. అలలు లెక్కపెట్టి సముద్రంలో రోజుకు ఎన్ని అలలు వస్తున్నాయో చెప్పాలి. కొంత కాలానికి రాజుగారికి ఆ ఉద్యోగి ఎలా మారాడో, ఎలా ఉన్నాడో చూడాలనిపించి మారువేషంలో వెళ్లి చూశాడు. రాజోద్యోగి గతంలో కొలువులో ఉన్నప్పటి కన్నా ఇప్పుడు మరీ ఎక్కువ ఉత్సాహంగా కనిపించాడు. సముద్రంలో అలలు లెక్కించడంలో పై ఆదాయం ఏ విధంగా సాధ్యం అని రాజుగారు అడిగితే- అతను చెప్పిన సమాధానం కళ్లు తెరిపించింది. సముద్రం అన్నాక సరకులతో కూడిన భారీ పడవలు రావడం సహజమే. అవి వచ్చినప్పుడు రాజోద్యోగి వారిని అడ్డగించి సముద్రంలో అలలు లెక్కించే కీలకమైన బాధ్యతలను రాజు నాకు అప్పగించారు. మీ పడవలు ఆగడం వల్ల అలలు లెక్కించే పనికి ఆటంకం అవుతోందని అడ్డగిస్తుండగా, రాజోద్యోగితో మనకెందుకు గొడవ అని అడిగినంత ఇచ్చి వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఇక్కడే ఆదాయం ఎక్కువగా ఉందని రాజోద్యోగి సంతోషంగా చెప్పుకొచ్చాడు’’
‘‘ఈ కథకు, దీనికి సంబంధం ఏముంది?’’
‘‘అధికారంలోకి వచ్చిన ప్రతి రాజు కూడా తనదైన శైలిలో అవినీతిని నిర్మూలించాలనుకుంటాడు. కానీ అది మనుషుల జీవితంలో భాగంగా మారిపోయింది. ‘ఆత్మను నాశనం చేయలేరు’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అవినీతి అనేది మన వ్యవస్థ ఆత్మ. ఈ ఆత్మను అంగీకరించాల్సిందే తప్ప నిర్మూలించలేం అంటున్నాను. అలలు లెక్కించే పని అప్పగిస్తే, అవినీతి పరుడు మారిపోతాడని ఆ రాజు భావిస్తే, లంచం ఇచ్చేవారిని సైతం శిక్షిస్తే లంచాలు కనిపించకుండా పోతాయని ఈ రాజు భావిస్తున్నారు.. అందుకే ఈ కథ చెప్పాను’’
‘‘మరీ అంత నిరాశావాదం అయితే ఎలా? అమెరికా లాంటి దేశాల్లో అవినీతి అస్సలు ఉండదు తెలుసా? ’’
‘‘బల్లకింద చేతులు పెట్టడం అనే పదానికి ఆ దేశం వారికి అస్సలు అర్థం తెలియదు. కన్సల్టెన్సీ ఫీజు అని వాళ్లు దానికి ముచ్చటగా పేరు పెట్టుకుని చట్టబద్ధం చేశారు.’’
‘‘మన దేశంలో కూడా ప్రతి పనికి లంచం ఎంతో నిర్ణయించి దానికి ఇలానే ఓ ముద్దు పేరు పెట్టుకుంటే లంచం సమస్య తీరిపోతుంది కదా? ’’
‘‘పోదు.. ఆ మధ్య ఒకరు జీతాలు పెంచితే లంచాలు ఉండవన్నారు. జీతాలు బాగా నే పెరిగాయి. మరి లంచాలు మాయం అయ్యాయా? కావు. కన్సల్టెన్సీ ఫీజు అని నిర్ణయించినా.. కన్సల్టెన్సీ ఫీజు చెల్లించావు మరి నా వాటా అనే మాట వినిపించి తీరుతుంది. నీకు పెళ్లయిందా?’’
‘‘నా పెళ్లికి, లంచాలకు సంబంధం ఏంటోయ్’’
‘‘నిజాయితీగా చెప్పు .. నీకు పెళ్లయినా పక్క చూపులు చూస్తావా? లేదా?’’
‘‘నేను మగాణ్ణి’’
‘‘కదా! పక్క చూపులు చూడడం మగాడి జన్మహక్కు అని నువ్వు భావించినట్టే. బల్లకింద సంపాదన మా జన్మహక్కు అని కొందరి గట్టి నమ్మకం. ’’
‘‘ సరదాగా అన్నా... పక్కచూపులు చూస్తే మా ఆవిడ ఊరుకుంటుందా?’’
‘‘మీ ఆవిడ లేనప్పుడు నువ్వు పక్కచూపులు చూసినట్టే ఎవరూ చూడనప్పుడు వాళ్లు బల్లకింద చేయి పెడతారులే’’
‘‘లంచం ఇచ్చే వాడుంటేనే కదా? తీసుకునే వాళ్లుంటారు.. అందుకే లంచం ఇచ్చేవాళ్లను కూడా శిక్షించడం ద్వారా లంచాల సంస్కృతికి చరమగీతం పాడాలని ప్రయత్నం’’
‘‘ఇంకా నయం బల్లలు ఉన్నాయి కాబట్టి బల్లకింద చేతులు పెడుతున్నారని, ప్రభుత్వ కార్యాలయాల్లో అసలు బల్లలు లేకుండా చేసేయలేదు’’
‘‘ఇదేదో బాగుందోయ్ ఐడియా. అసలు బల్లలు లేకుండే చేస్తే ఇక బల్లకింద చేతులు ఎలా పెడతారు?’’
‘‘చేతులు లేకుండా చేసేస్తే చేతులు తడపడం ఉండదు ఏమంటావు?’’
‘‘ఈ ఐడియా బాగానే ఉంది.. పాలకులకు చెప్పాలి. అదేదో దేశంలో తప్పు చేస్తే.. తప్పు చేయడానికి కారణం చేతులే కదా? అని చేతులు నరికేస్తారట! బల్లకింద చేతులు పెట్టేందుకు వీలు లేకుండా అసలు చేతులే లేకుండా చేశాకే ఉద్యోగ బాధ్యతలు అప్పగించాలి’’
‘‘చూడోయ్.. మనుషులందరికీ ఏదో ఒక సమస్య ఉంది. మనుషులందరికీ మనుషులతోనే సమస్య. సమస్యలు లేకుండా చేయాలంటే అసలు మనుషులే లేకుండా చేస్తే ఎలా ఉంటుందంటావు’’
‘‘తల నరికేసి.. చుండ్రు సమస్య పరిష్కరించానని మురిసినట్టుంది.’’
‘‘ఏం చేసినా విమర్శించడమేనా?’’
‘‘సమస్య పరిష్కరించడం కన్నా ఏదో చేసినట్టు నటించడం చాలా?’’
‘‘పోనీ- నువ్వు చెప్పు.. అవినీతి లేకుండా చేయాలంటే ఏం చేయాలో.. సిటిజన్ చార్టర్ అని ప్రతి కార్యాలయంలో ఏ పని ఎన్ని రోజుల్లో అవుతుందో రాస్తారు కదా? అలానే ఏ పనికి ఎంత ముట్ట చెప్పాలో రాస్తే బాగుంటుందా?’’
‘‘అది కాకుండా- నాకెంతిస్తావ్? అని అడుగుతారు అప్పుడు’’
‘‘రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వం రూపాయి ఖర్చు పెడితే లబ్దిదారులకు పది పైసలు చేరేవనేవారు..’’
‘‘ఔను.. అప్పటి నుంచి ఈ పది పైసల విలువ పెంచాలని ప్రయత్నాలు ప్రారంభిస్తే, రూపాయి విలువే తగ్గింది కానీ పది పైసల విలువ పెరగనేలేదు. ’’
‘‘నీతో మాట్లాడుతుంటే నాకో బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. కరెన్సీ ఉండడం వల్లనే కదా? ఈ అవినీతి సమస్య. అసలు కరెన్సీ మొత్తాన్ని రద్దు చేసి, బార్టర్ సిస్టం ప్రవేశపెడితే...’’
‘‘గట్టిగా అనకు విన్నారంటే మన్‌కీ బాత్ అంటూ అవినీతి నిర్మూలనకు కరెన్సీని రద్దు చేసినా చేస్తారు. అసలే ఎన్నికలు సమీపిస్తున్నాయి కనుక ఏదో అద్భుతం చేసి చూపించాలి’’
*బుద్దా మురళి (జనాంతికం 3-8-2018)