31, అక్టోబర్ 2015, శనివారం

ఎన్టీఆర్ .. బాబు.. వైయస్ ఆర్ .. కెసిఆర్ జమానా- మీడియా .....జనం ఆమోదమే పాలనకు కొలమానం

ఒక పాలకుడి సామర్ధ్యానికి పనితీరుకు కొలమానం ఏమిటి? ప్రజాస్వామ్యంలో కచ్చితంగా జనం ఆమోదమే ఒక నాయకుడి పనితీరుకు కొలమానం. అంతే తప్ప మీడియాతో ఆ నాయకుడు ఎలా వ్యవహరించాడు, మీడియా అతన్ని ఎలా ఆకాశానికి ఎత్తింది? ఎంతగా వ్యతిరేకించింది అనేది పాలకుడి పనితీరుకు కొలమానం కానే కాదు. 2004 గుజరాత్‌లో ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల సమయంలో ప్రపంచ వ్యాప్తంగా మీడియా నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శించింది. అదే సమయంలో చంద్రబాబు పాలనను తెలుగు మీడియా ఆకాశానికెత్తింది. ప్రపంచ మీడియా సైతం ఆకాశానికెత్తినట్టు తెలుగు మీడియా తెలుగు పాఠకులకు చెప్పుకొచ్చింది. తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే మీడియా వ్యతిరేకించిన నరేంద్ర మోదీ ఘన విజయం సాధించారు. మీ డియా ఆకాశానికెత్తిన చంద్రబాబు టిడిపి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కేవలం 47 స్థానాలకు పరిమితం అయ్యారు. అది మీడియా రంజక పాలనే తప్ప జనరంజక పాలన కాదని జనం తేల్చారు . 

 నాయకుడి పనితీరుపై మీడియా అంచనా, ప్రజల అంచనాలకు అస్సలు సంబంధం లేకపోవడం వల్ల వచ్చిన ఫలితాలివి. టిడిపి ఆవిర్భావానికి ముందు తెలుగునాట రాజకీయాలు ఒక రకంగా ఉంటే ఆ తరువాత రాజకీయాల్లో పూర్తిగా మార్పు కనిపించింది. మీడియా రాజకీయాల్లో భాగంగా మారిపోయింది. ఇప్పుడు పాలకులు- మీడియా సంబంధాలపై చర్చ సాగుతోంది. చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ ముగ్గురి మీడియా అనుబంధం ఒకరితో ఒకరికి ఏ మాత్రం సంబంధం లేనిది. టి అంజ య్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఆవరణలోని సిఎల్‌పి కార్యాలయం మెట్లమీద ఒక జర్నలిస్టు అంజయ్య భుజంపై చేయి వేసి మాట్లాడిన సందర్భాలు సైతం ఉన్నాయి. చివరకు సెక్యూరిటీ వాళ్లు బతిమిలాడడం వల్ల ఆ విధానానికి స్వస్తి పలికారు.
ఎన్టీరామారావు కొన్ని దశాబ్దాల పాటు నటుడిగా సంపాదించుకున్న ఇమేజ్ వల్ల అభిమానులు ఆయన్ని దేవుడిగా చూసేవారు. తిరుపతి వెళ్లి అటు నుంచి మద్రాస్ వెళ్లి ఎన్టీఆర్‌ను చూసే భక్తులు ఉండేవాళ్లు. అలాంటి ఇమేజ్‌తో రాజకీయ పార్టీ స్థాపించిన ఎన్టీఆర్‌కు మీడియా అండగా నిలిచింది. ఎన్నికల ప్రణాళిక రూపొందించడం మొదలు, అభ్యర్థుల ఎంపిక వరకు మీడియానే చేసింది. అయితే ఆ కాలంలో కాం గ్రెస్‌పై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత వల్ల మీడియా పాత్రపై పెద్దగా విమర్శలు రాలేదు. 


ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత కొద్దిమంది మీడియా వారిని మాత్రమే గుర్తించే వారు. ఆయనకు పత్రికలు చదివే అలవాటు కూడా తక్కువ. మనం వార్తలు సృష్టించాలి కానీ మనం చదవడం ఏమిటి అనేవారట! ఎన్టీఆర్‌ను మినహాయిస్తే ఆ తరువాత ముఖ్యమంత్రులకు మీడియాతో విడదీయరాని బంధం ఏర్పడింది. నువ్వు మరోసారి నా ఇంటికి రా వద్దు, నీ ముఖం నాకు చూపించవద్దు అని విలేఖరుల సమావేశంలోనే ఎన్టీఆర్ ఒక జర్నలిస్టును మందలించారంటే ఆయన్ని దించే కుట్రలో మీడియా పాత్ర ఎంతో తెలుస్తోంది. ఆ తరువాత ఎన్టీఆర్ వద్దకు ఆ జర్నలిస్టు వెళ్లాల్సిన అవసరం ఏర్పడలేదు. ఎన్టీఆర్‌నే వ్యూహాత్మకంగా మీడియా, బాబు కలిసి దించేశారు.
తాను అధికారం చేపట్టడం వెనుక మీడియా పాత్ర ఉండడం వల్ల చంద్రబాబు ముఖ్యమంత్రి మీడియాకు బాగా ప్రాధాన్యత ఇచ్చారు. బదిలీల కోసం, పోస్టింగుల కోసం ముఖ్యమంత్రిగా బాబు ఇంటి వద్దే కాకుండా ఒక జర్నలిస్టు ఇంటి వద్ద సైతం అధికారులు పడిగాపులు కాసిన రోజులు ఉన్నాయి. బాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే అప్పటి వరకు మంత్రిగా ఉపయోగించిన చాంబర్ వద్దే విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతుంటే ఆజాద్ చిస్తీ అనే ఒక జర్నలిస్టు బాబు చెవిలో ఏదో చెప్పడానికి ప్రయత్నించగా, మీరేదైనా చెప్పదలుచుకుంటే బహిరంగంగానే చెప్పండి అంటూ బాబు నిర్మొహమాటంగా చెప్పారు.


 నిజానికి బాబుకు చెవి కొరుకుడు బృందం వేరుగా ఉండేది. ఇతను ఆ బృంద సభ్యుడు కాదు. ముఖ్యమంత్రి చెవి కొరకడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. చెవి కొరుకుడు చూసిన ఉన్నతాధికారులు ఏదేదో ఊహించుకుని చెవి కొరికిన జర్నలిస్టు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితునిగా భావించి వాళ్లు చెప్పినవి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ కిటుకు ఆ జర్నలిస్టుకు తెలుసు, బాబుకూ బాగా తెలుసు. 

ఏవరో జర్నలిస్టు చెప్పినట్టు నేను నడుచుకుంటాను అని మీరు అనుకుంటున్నారు కదా అని బాబు చాలా సార్లు మీడియా ముందే అడిగే వారు. ఆయన అలా అడగడం వెనుక ఉద్దేశం తనను ఎవరూ నడిపించ డం లేదని చెప్పడం. అయితే ప్రారంభంలో మాత్రం ముఖ్యమంత్రిగా తాను స్థిరపడాలి అనే ఉద్దేశంతో చెప్పినవి చేశారు. చంద్రబాబు మొత్తం జర్నలిస్టుల సంక్షేమం కోసం పెద్దగా పట్టించుకోలేదు కానీ తనను నమ్మిన కొద్ది మందిని ఎక్కడికో తీసుకు వెళ్లారు. జీతాలు కూడా సరిగా చెల్లించలేని సంస్థల్లో పని చేసిన వారిని బంజారాహిల్స్ భవంతుల స్థాయికి తీసుకు వెళ్లారు. రిలయన్స్ లాంటి కంపెనీలో ఉన్నత స్థాయి కల్పించారు. మేనేజ్‌మెంట్ కోటాలో తన వాటా కింద ఒకరిద్దరి పిల్లలకు మెడికల్ సీటు కూడా ఇప్పించారు. మహా అయితే ఓ డజను మంది జర్నలిస్టుల మంచి చెడులు ఆయన చూసుకున్నారేమో కానీ వేలాది మంది సామాన్య జర్నలిస్టులకు ఆయన పాలనలో ఒరిగింది ఏమీ లేదు.


ఇక వైఎస్‌ఆర్‌ది బాబు కన్నా పూర్తి భిన్నమైన శైలి. సచివాలయానికి వచ్చినప్పుడు, పోయేప్పుడు మీడియాతో మాట్లాడే విధానం బాబు హయాంలో ఉంటే దానికి స్వస్తిపలికి అవసరం ఉంటే తానే పిలిచి మాట్లాడతానని అన్నారు. ఆ రెండు పత్రికలు అంటూ మీడియా తీరును బహిరంగంగానే విమర్శించే వారు. ప్రజలను ఒప్పించి అధికారంలోకి వచ్చినా మీడియాను ఒప్పించలేమని, మీడియా మదిలో టిడిపినే ఉంటుందనే భావనతో సొంతంగా మీడియా ఏర్పాటు చేసుకున్నారు. అసెంబ్లీ జరిగేప్పుడు లాబీల్లో కనిపించే జర్నలిస్టులను పేరు తెలియకపోయినా ఏం సార్ అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ వెళ్లే వారు. ఒకరిద్దరు జర్నలిస్టులకు సొంత వ్యవహారాలు చక్కబెట్టినా మొత్తం జర్నలిస్టుల సంక్షేమం కోసం కొంత వరకు ప్రయత్నించారు. హెల్త్ కార్డుల వల్ల ఎంతో మంది జర్నలిస్టులకు మేలు జరిగింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు సొంత ఇంటి కలను నిజం చేయాలనుకుని భూమి కేటాయించారు. అనేక కేసులు పడ్డాయి సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో ఇప్పటి వరకు వివాదం పరిష్కారం కాలేదు. వైఎస్‌ఆర్ తరువాత వచ్చిన రోశయ్య ఉన్నది కొద్ది రోజులే కాబట్టి చెప్పు కొదగిన పరిణామాలేమీ జరగలేదు. జర్నలిస్టుల వద్ద ఆరోగ్య బీమా కోసం డబ్బులు వసూలు చేసి కార్డులు ఇవ్వని ఘనత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానిది. బహుశా ఈదీ అమీన్‌లాంటి పాలకులు సైతం బీమా సొమ్ము తీసుకుని హెల్త్‌కార్డులు ఇవ్వకుండా అనారోగ్యంతో కొందరు జర్నలిస్టులు మరణించేట్టు చేసి ఉండరు.


చెన్నారెడ్డి కాలం నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి కాలం వరకు కాంగ్రెస్, టిడిపిలు, ము ఖ్యమంత్రులు ఎందరు మారుతున్నా జర్నలిస్టు నాయకులుగా అధికార గణం వద్ద అధికారం చెలాయించేది మాత్రం వాళ్లే. ఎవరు మారినా మీరు మాత్రం కొనసాగుతున్నారని ఒకసారి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారి ముందు ఆశ్చర్యపోయారు. పార్టీలు మారినా వీరి ప్రాభవం తగ్గలేదు. కానీ కొత్త రాష్ట్రం ఏర్పడడంతో పరిస్థితి పూర్తుగా మారిపోయింది.


బాబు వైఎస్‌ఆర్‌ల కన్నా కెసిఆర్‌ది భిన్నవైఖరి. కొమ్ములు తిరిగాయని భావించే జర్నలిస్టులను సైతం పట్టించుకోరు. అదే సమయంలో ఏదో మారుమూల గ్రామానికి చెందిన గ్రామీణ విలేఖరితో సైతం ఆప్యాయంగా కబుర్లు చెబుతారు. బాబు హయాంలో సచివాలయంలో, అసెంబ్లీలోకి ఆయన వచ్చేప్పుడు పోయేప్పుడు మీడియానే స్వాగతం పలికి, మీడియానే వీడ్కోలు పలికేది. వైఎస్‌ఆర్ దీన్ని కొంత తగ్గిస్తే, కెసిఆర్ కనీసం అటువైపుకూడా మీడియా రాకుండా చేశారు. దీన్ని కొమ్ములు తిరిగిన వాళ్లు, ముఖ్యమంత్రితో ఆప్యాయ సంబంధాల వల్ల వ్యవహారాలు నడిపిన వారు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. 

పాలన ఎలా ఉందో, ప్రజల కష్టనష్టాలు గురించి మీడియాలో రాయడం జర్నలిస్టు బాధ్యత అంతే కానీ ఆ సంగతులు ముఖ్యమంత్రి చెవిలో చెప్పడం డ్యూటీ కాదు కదా? చెవి కొరకనివ్వక పోతే నియంతృత్వం, అహంకారం అంటూ ఆ గగ్గోలు ఎందుకు? ఎప్పుడంటే అప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఇస్తే అది అద్భుతమైన పాలనా? పాలనను ప్రజల కోణంలో చూడాలి, తప్ప జర్నలిస్టులకు ముఖ్యమంత్రి ఎంత వరకు దగ్గరగా ఉన్నారనే దాన్ని బట్టి కాదు. మీడియా వల్ల అధికారంలోకి వచ్చిన నాయకుడిలోనే క్రమం గా మార్పు వచ్చింది. 

అలాంటిది 14 ఏళ్లపాటు ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన నేత మీడియా సహాయంతో అధికారంలోకి వచ్చిన నేతలా ఉండాలని ఎలా కోరుకుంటారు? జర్నలిస్టు పెద్దన్నలుగా అధికారం చెలాయించిన వారికి ఇది కష్టకాలమే అయితే కావచ్చు. కానీ దానితో ప్రజలకు సంబంధం లేదు. గతంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం తీసుకునే చర్యలపై టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలో చేర్చింది. హామీలు అమలు చేస్తారా? లేదా ? అనేది కాలం చెబుతుంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో జర్నలిస్టులు చెప్పాలి కానీ జర్నలిస్టు పెద్దలే ప్రపంచం అని తాము బాగుంటే ప్రపంచం బాగున్నట్టు , తమను పట్టించుకోక పోతే నియంతృత్వం, అహంకారం అనుకోవడమే అసలైన అహంకారం.


  • - బుద్దా మురళి 
  • 31/10/2015

25, అక్టోబర్ 2015, ఆదివారం

బాబు+ తిరుపతి ప్రసాదం =మోదీ + యమునా తీర్థం

‘‘సినిమా కళనా వ్యాపారమా? కళాత్మక వ్యాపారమా? ’’
‘‘ నీ ప్రశ్నలో సమాధానం ఉందని నీ భ్రమ ’’
‘‘ అంటే సినిమా కళాత్మక వ్యాపారం కాదా? మరేంటి? ’’
‘‘రాజకీయం అంటే కళనా? సైన్సా? నువ్వేమనుకుంటున్నావో ముందు చెప్పు’’


‘‘రాజకీయం అంటే రాజకీయమే.. అందులో కళ, సైన్స్ ఏముంది? ’’
‘‘సినిమా అంటే సినిమానే అందులో కళేముంది, కళాత్మక వ్యాపారం ఏముంది అని నేను సమాధానం చెబితే సరిపోతుందా? ’’
‘‘సినిమా వేరు, రాజకీయం వేరు. ఇంతకూ నువ్వేమనుకుంటున్నావో చెప్పు’’
‘‘ సినిమా, రాజకీయం, మతం, అన్నీ లెక్కలే... ప్రతి దానిలో లెక్కలుంటాయి. అలా అని వెంకట్రామా అండ్ కో ఎక్కాల పుస్తకం చూస్తే ఈ లెక్కలు కనిపించవు. కానీ ప్రతి దానిలో కనిపించని లెక్కలుంటాయి.’’
‘‘నేను నమ్మను. నాకు రాజకీయాలన్నా చిరాకే లెక్కలన్నీ చిరాకే నీ సమాధానం నాకు అస్సలు నచ్చలేదు. ’’


‘‘నువ్వీ  మాట అనడం వెనక కూడా ఒక లెక్కంది. నాకు ఐటి నాలెడ్జ్ లేదనుకో ఐటి అంటే పరమ బోర్ నాకు చిరాకు అంటాను. నాలెడ్జ్ లేదు అని చెప్పడానికి అహం అడ్డొచ్చి చిరాకు అంటాం. అలానే రాజకీయాలపై అవగాహన లేక రాజకీయాలంటే చిరాకు అంటాం ఇదో లెక్క. ’’
‘‘నువ్వు నన్ను కన్‌ఫ్యూజ్ చేయాలని ప్రయత్నిస్తున్నావు. రాజకీయం లెక్కలు ఎలా అవుతుంది. ’’
‘‘బాబు గారు ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పారు. మోదీ మా రాష్ట్రానికి వస్తే అరెస్టు చేయిస్తాను అన్నారు. ఆదే మోదీతో ఇప్పుడు బాబుగారు చేతు లు జోడించి అడుగుతున్నాను అని మాట్లాడుతున్నారు. దీనే్నమంటావు’’
‘‘లెక్కలకు దీనికి సంబంధం ఏముంది? ’’


‘‘అక్కడికే వస్తున్నాను. కేంద్రంలో ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరం అయినన్ని సీట్లు రానప్పుడు కలగూర గంపలా ఎన్‌డిఏ, యుపిఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అప్పుడు బాబుగారికి వచ్చిన సీట్లు కీలకమయ్యాయి. దాంతో కేంద్రంలో చక్రం తిప్పారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి సొంతంగానే సంపూర్ణ మెజారిటీ వచ్చింది. ఏ పార్టీ మద్దతు అవసరం లేదు. లెక్కల్లో వచ్చిన తేడా వల్ల పరిస్థితులు మారిపోయాయి. రాజకీయాలంటే లెక్కలు కాకుంటే ఇంకేంటి? ఇంకో ఉదాహరణ చెప్పాలా? నాదెండ్ల ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేస్తే వెన్నుపోటు అన్నారు, అదే బాబు చేస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నారు తేడా ఏంటో తెలుసా? లెక్కలే. నాదెండ్లకు ఎమ్మెల్యేల లెక్క సరిపోలేదు. బాబు హయాంలో లెక్క సరిపోయింది. లెక్కల్లో వచ్చిన తేడాతో ఒక సంఘటనకు రెండు వేరు వేరు పేర్లు . రాజకీయాలంటే లెక్కలే’’
‘‘మరి తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ కదా? తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్‌ను ఆంధ్రలో ఓడించారు. తెలంగాణలో గెలిపించలేదు.. ఇక్కడ ఏ లెక్కలు పని చేశాయి’’
‘‘ఇక్కడా లెక్కలే పని చేశాయి... తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీనే అని ఉద్యమ నాయకుడు కెసిఆరే చెప్పారు. అందుకే కదా ఇంటిల్లిపాది వెళ్లి సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పారు. మేం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామని బిజెపి చెప్పింది. ప్రధానమంత్రిగా మోదీ స్పీడ్ చూస్తుంటే వంద రోజులు కాదు కదా వందేళ్లయినా వాళ్లు తెలంగాణ ఇవ్వకపోయే వారు. ఏడాదిన్నరలో ఉద్యోగులనే కేటాయించని వాళ్లు వంద రోజుల్లో తెలంగాణ ఇచ్చే వాళ్లా? పార్టీల లెక్కలు పార్టీల కుంటాయి. ప్రజల లెక్కలు ప్రజల కుంటాయి. తెలంగాణ ఇచ్చింది సోనియానే అని కెసిఆర్ చెప్పినా జనం తమ లెక్కలు తాము వేసుకుని టిఆర్‌ఎస్‌కే అధికారం అప్పగించారు. పెళ్లికి వెళ్లినా, అయ్యప్ప దీక్షలోనైనా, చివరకు గాంధీ భవన్‌లో గాంధీ జయంతిలోనూ కాంగ్రెస్ నేతలు ఘర్షణ పడకుండా ఉండలేరు. వారి చేతిలో అప్పుడే పుట్టిన పసికందు తెలంగాణను పెడితే ఏమవుతుందో జనం బాగానే లెక్కలు వేసుకుని టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. కాంగ్రెస్ లెక్క తప్పింది కానీ జనం లెక్క తప్పలేదు. ప్రజాస్వామ్యం అంటే జనం లెక్కలే కదా? ’’


‘‘మరి తెలంగాణ ఉద్యమ కారుడిగా కెసిఆర్ తెలంగాణలో గెలిచినప్పుడు విభజనను వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేసిన జగన్ పార్టీ ఆంధ్రలో గెలవాలి కానీ, విభజకు ఆమోదం తెలుపుతూ రెండుసార్లు లేఖలు ఇచ్చిన బాబు పార్టీ గెలవడం ఇదేం లెక్క’’
‘‘ఇదీ కూడా లెక్క ప్రకారమే జరిగింది. పార్టీల లెక్కలు వేరు, జనం లెక్కలు వేరని ముందే చెప్పాను కదా? ఆంధ్రలో మెజారిటీ ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి రాజీనామాతో మెజారిటీ మనకే అని జగన్ లెక్కలేసుకున్నారు. విభజనతో సమైక్యాంధ్ర ఘట్టం ముగిసిపోయింది. పాలన అనుభవం ఎవరికి ఉంది? అని జనం లెక్కలేసుకున్నారు. అందుకే కిరణ్ కుమార్‌రెడ్డి సమైక్యాంధ్ర పార్టీకి పార్టీ గుర్తు చెప్పులే మిగిలాయి’’
‘‘సరే ఇప్పుడు అమరావతి శంకుస్థాపనలోనూ లెక్కలే ఉన్నాయంటావా? ’’
‘‘లెక్కలంటే రాజధాని కోసం సేకరించిన 33వేల ఎకరాల భూమి మాత్రమే కాదు. అన్ని వేల ఎకరాల సేకరణ వెనుక ఎవరి లెక్కలు వారికుంటాయి అది వేరు. అక్కడున్నవి అన్నీ లెక్కలే. అక్కడ రాజధానిని నిర్ణయించడం వెనుక లెక్కలుంటాయి. కెసిఆర్ ఇంటికి వెళ్లి బాబు పిలవడం, కెసిఆర్ వెళ్లి ప్రపంచంలోనే గొప్ప రాజధాని నిర్మాణంలో మా వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చి రావడం వెనుక ఎవరి లెక్కలు వారి కుంటాయి. పిలిచినాయన లెక్కలు పిలిచినాయనకు ఉంటాయి. వెళ్లినాయన లెక్కలు వెళ్లినాయనకుంటాయి. మోదీ లెక్కలు మోదీకుంటాయి. పవిత్రమైన తిరుపతి ప్రసాదం ఇచ్చి మోదీని బాబు ప్రసన్నం చేసుకుందామని లెక్కలేసుకుంటే యమునా నది తీర్థం ఇచ్చి మోదీ లెక్క సరి చేసుకున్నారు. ’’


‘‘వ్యాపారంలో ఏటేటా బ్యాలెన్స్ షీట్ చూసుకుంటారు. ప్రజాస్వామ్యం అంటే ఐదేళ్లకోసారి ప్రజలు రాజకీయ నాయకులు బ్యాలెన్స్ షీట్ చూసి లెక్కలు వేయడమే నన్న మాట. కులాలు, మతాలు, ఓట్లు లెక్కలే ప్రజాస్వామ్యం అని తెలిసొచ్చింది. ’’
‘‘ప్రజలకూ వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి ’’  

 - బుద్దా మురళి (జనాంతికం 24.10. 2015)

19, అక్టోబర్ 2015, సోమవారం

మేలుకో మేధావి మేలుకో

‘‘రండన్నయ్య గారూ రండి. ఆయన లోపల సీరియస్‌గా రాసుకుంటున్నారు. ’’
‘‘ ఏరా అంత సీరియస్‌గా ఆలోచిస్తున్నావ్ . పాకిస్తాన్ ఏమైనా యుద్ధానికి సిద్ధమైందా? ఏంటి? ’’
‘‘ అంత కన్నా ప్రమాదకరమైన విషయం. ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదు.. ఎవడి వల్లా కాదు..’’
‘‘ విషయం చెప్పకుండా అచ్చం అలా టీవిలో మాట్లాడినట్టు మాట్లాడితే నాకేం అర్ధమవుతుంది? చిన్ననాటి మిత్రున్ని కలుద్దామని వస్తే నువ్వు అంత సీరియస్‌గా ఉండి, నన్ను అయోమయంలో పడేస్తే ఎలా? ’’
‘‘ ఈ దేశాన్ని పాలించే వాళ్లు ఏం చేస్తున్నట్టు నిద్ర పోతున్నారా? మిలట్రీ ఏం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది. మోదీ ఏం చేస్తున్నాడు పారిక్ ఎక్కడున్నాడు. సుష్మ నుంచి ఎంతో ఆశించాం. ఇలా చేస్తుందని అనుకోలేదు. ?’’
‘‘ వావ్ మన క్లాస్‌మెట్ సుష్మ నీకు టచ్‌లోనే ఉందా? కాలేజీ బ్యూటీ చదువుకునేప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడాలంటేనే భయం. సుష్మతో పాటు అన్నపూర్ణ, శోభ ఇంకా లత ఉండేవాళ్లు కదా? అబ్బ ఎంత చలాకీగా ఉండేవాళ్లో. అప్పుడేమో మాట్లాడేందుకు ధైర్యం ఉండేది కాదు. ఇప్పుడేమో మాట్లాడదామంటే వాళ్ల ఫోన్ నంబర్ తెలియదు. జీవితం ఇంతేరా? కనీసం ఆ సుష్మ ఫోన్ నంబర్ ఉన్నా ఇవ్వరా? మాట్లాడతా? ’’
‘‘అందుకే చెప్పాను ఈ దేశాన్ని బాగు చేయడం ఎవడి వల్లా కాదని. నేను చెబుతున్నది దేశం గురించి. సుష్మ అంటే మన క్లాస్ మెట్ కాదు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ గురించి. అయినా 50 ఏళ్ల వయసొచ్చినా ఇంకా నీకు అనాటి అమ్మాయిలతో మాట్లాడాలని ఉంది కానీ ఈ దేశానికి వస్తున్న ప్రమాదం గురించి కొంచం కూడా బాధలేదా? ’’
‘‘ సుష్మ అని అంత చనువుగా అంటే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అని ఎలా అనుకుంటానురా! క్లాస్‌మెట్ సుష్మను గుర్తు చేసుకున్నావేమో అనుకున్నా. ఎంతైనా నువ్వు చాలా గ్రేట్‌రా ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను చిన్నప్పటి ప్రెండ్స్ కన్నా ఎక్కువ క్లోజ్‌గా పిలుస్తావంటే నీ అదృష్టం చూస్తే కన్ను కుడుతోందిరా! ’’
‘‘ ఇదిగోండి అన్నగారు టీ తీసుకోండి. ఉదయం పాలవాడు వచ్చినప్పుడు చూడాల్సిం ది. మీ ప్రెండ్ అధికార దర్పం, సమాజంలో పలుకుబడి’’
‘‘ప్రెండ్స్ ఏదో దేశం గురించి మాట్లాడుకుంటున్నాం. మధ్య నీ ఉపన్యాసం అవసరమా? వెళ్లు’’


‘‘ నువ్వు సీరియస్‌గా ఆలోచిస్తున్నా విషయం ఏంటో చెప్పనే లేదు? ’’
‘‘ అదేరా! అరుణాచల్ ప్రదేశ్‌కు సమీపంలో చైనా భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మిస్తోంది. మన పాలకులు ఏం చేస్తున్నారు? ఒకవైళ చైనా ప్రాజెక్టు నుంచి నీటిని ఒకేసారి విడిచిపెడితే అరుణాచల్ ప్రదేశ్ ఏం కావాలి. దీనిపై మొన్న మా చానల్‌లో ఒక అద్భుతమైన స్టోరీ చేశాను చూడలేదా? ’’
‘‘స్టోరీ అంటే కథ కదరా? వీక్లీల్లో వేసేవారు. ఇప్పుడు 24 గంటల న్యూస్ చానల్స్‌లో కూడా కథలు వేస్తున్నారా? ’’
‘‘అబ్బా నీకన్నీ విడమర్చి చెప్పాలి. ఇక్కడ స్టోరీ అంటే నువ్వనుకునే చందమామ కథ, వీక్లీ కథ కాదు. అంటే నేను సొంతంగా తయారు చేసిన ప్రత్యేక కథనం. ’’
‘‘చైనా వెళ్లి వచ్చావా? ’’
‘‘అంత అదృష్టమా? ఇక్కడి నుంచి పక్క రాష్ట్రం కూడాపోలేదు’’
‘‘మరి చైనా హఠాత్తుగా ప్రాజెక్టు కడుతోందని నీకెలా తెలిసింది? అంటే సైన్యమో ఎవరో ఒకరు బయటపెడితేనే నీకీ విషయం తెలిసింది కానీ నువ్వు చైనా వెళ్లి పరిశోధించి తెలుసుకున్నదేమీ కాదు కదా? ’’
‘‘నిజమే ననుకో కానీ మొద్ద నిద్ర పోతున్న ప్రభుత్వాలను నా స్టోరీస్‌తో నిద్ర లేపుతాను. ముందే మేల్కొని పాకిస్తాన్‌ను అదిలించి, చైనాను బెదిరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? అమెరికాతో వ్యూహాత్మకంగా స్నేహం చేసి, రష్యాను దూరం పెట్టి ఉంటే వేరుగా ఉండేది. దేశాన్ని ఇంత కాలం పాలించిన వారికి ఈ వ్యూహం లేకపోవడం వల్లే సమస్య వచ్చిపడింది. దేశాన్ని పాలించే వాళ్లు ఈ సమస్యలను ఊహించడంలో విఫలమయ్యారు. అందుకే చెబుతున్నాను ఈ దేశాన్ని ఎవడూ బాగు చేయలేడు.’’
‘‘నువ్విలా మేధావివి అవుతావని చదువుకునే రోజుల్లోనే అనుకున్నాం. మేమంతా టెక్ట్స్ బుక్స్ చదువుతూ కెరీర్ గురించి మాట్లాడుకుంటుంటే నువ్వు గ్లోబ్‌లో కూడా సరిగా కనిపించని ఏవేవో దేశాల్లో జరిగే ఉద్యమాల గురించి, నాయకుల జీవితాల గురించి మాట్లాడేటోడివి. ’’
‘‘అదిగో అలాంటి మాటలకు పడిపోయే అన్నగారు బంగారం లాంటి సంబంధాలను వదులుకుని ఈయన్ని పెళ్లి చేసుకున్నాను. ఈయన గారు కాలేజీల్లో ఉపన్యాసాలల్లో ఏవేవో దేశాల పేర్లు అక్కడి విప్లవ వీరుల పేర్లు చెబుతుంటే పడిపోయాను. ఇగో ఇన్నాళ్ల కాపురం తరువాత ఈయనకు ఆ పేర్లు తప్ప జీవితానికి ఉపయోగపడేది ఏమీ తెలియదు అని నాకు తెలిసొచ్చింది. ఇప్పుడనుకొని ఏం లాభం ? పాల వాడు పొద్దునే్న వార్నింగ్ ఇచ్చి వెళ్లాడు. కిరణాషాపుకు వెళ్లాలంటే సిగ్గుగా ఉంది. మూడు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే వేరే ఉద్యోగం చూసుకోవచ్చు కదా మమ్ముల నెందుకు ఇబ్బంది పెడతారని నానా మాటలు అనిపోయాడు. ’’
‘‘ ఏంట్రానిజమా? ఎప్పుటి నుంచి ఇలా? ఎందుకిలా? ’’
‘‘ఉన్నంతలో బాగానే జీతాలు ఇచ్చే సంస్థలోనే ఉద్యోగం చేశాడు. అదేదో మాయదారి చానల్ నువ్వు కోరుకున్న డిజిగ్నేషన్ ఇస్తాను అనగానే ఎగిరి వాలిపోయాడు’’


‘‘ఇచ్చాడా? ’’
‘‘కావలసిన డిజిగ్నేషన్ ఇచ్చాడు కానీ జీతాలే ఇవ్వడం లేదు. చైనాను ఇండియా సరిగా అంచనా వేయలేదని, పాకిస్తాన్ పరిణామాలు గమనించలేదని కథనాలు బాగానే చెబుతాడు. ఉద్యోగానికి వెళుతున్న సంస్థ జీతాలు ఇచ్చేదా? ఇవ్వనిదా? అనే అంచనా మాత్రం వేయలేదు ’’
‘‘ చాల్లే నేను ప్రపంచ గుట్టు విప్పుతుంటే నువ్వు ఫ్రెండ్ ముందు ఇంటి గుట్టు విప్పుతున్నావా? అసలు ఉక్రేనియాలో ఉగ్రవాదు.....’’


‘‘ ఇక చాల్లేరా! నా కళ్లు తెరిపించావు.. వస్తాను... పోతూ.. పోతూ నీకో మాట చెప్పాలనుంది రా ... అందరినీ మేలుకోలపాలని నిరంతరం ఆలోచిస్తున్న నువ్వే ముందు  మేలు మేలుకోవలసిన అవసరం ఉంది .. ముందా విషయం గుర్తించు   ’’
-  బుద్దా మురళి (జనాంతికం .. 18. 10.201 5)

11, అక్టోబర్ 2015, ఆదివారం

కొత్త దేవుళ్లు!

‘‘నరేంద్ర మోదీకి నారా బాబుకు ఒక విషయంలో చక్కని పోలికుంది’’
‘‘ కార్పొరేట్ కంపెనీలపై ప్రేమనా?’’
‘‘ఈ కాలంలో పాలకులెవరైనా కార్పొరేట్‌పై ప్రేమ చూపించాల్సిందే. ఏ రాష్ట్రంలోనైనా కామనే నేను చెబుతున్నది అది కాదు’’
‘‘ఎన్నికల పొత్తు కుదరక ముందు బాబే ఈ విషయం చెప్పారు. మోదీ నన్ను చూసి అభివృద్ధి నేర్చుకున్నారు అని. అభివృద్ధి విషయంలోనే కదా ఇద్దరి మధ్య పోలిక. ’’


‘‘ తింగరి పల్లి సర్పంచ్ కూడా ఇదే మాట అన్నాడులే, నన్ను చూసే ఒబామా అమెరికాను అభివృద్ధి చేస్తున్నాడని, ఆ మాట విని వార్డ్ మెంబర్ కంకికొడవలి కంకన్న చైనా అభివృద్ధికి మా వార్డే స్ఫూరి అని బదులిచ్చాడు.. వార్డు మెంబరైనా ఓడిపోయిన ముఖ్యమంత్రి అయినా తన గురించి తాను ఇలా చెప్పుకోవడం కామన్’’
‘‘ఏం చెప్పినా అది కాదంటున్నావు మోదీ, బాబుల్లో కామన్ ఏంటో నువ్వే చెప్పు ఇద్దరూ
 విదేశాల్లో తెగ తిరిగేస్తున్నారు .. నువ్వన్నది దాని గురించే కదా ?’’
‘‘అధికారం లో ఉన్నప్పుడు కాక పోతే రాజకీయాల నుంచి తప్పుకున్నాక విదేశాల్లో తిరుగుతారా ? అది కాదు 

‘‘మరింకేమిటి ? ’’
‘‘ మోదీ బాబు ఇద్దరూ దేవుళ్లే ’’
‘‘ఎలా? ’’


‘‘ ఇద్దరికీ అభిమానులు గుడి కట్టారు. గుడి మాన్యాలను స్వాహా చేసిన వాళ్లు వేల మంది కనిపిస్తారు ఈ దేశంలో గుడి ఉన్నది ఇద్దరు పాలకులకే. ’’
‘‘ మోదీకి ఎప్పుడో గుడి కట్టారు. కానీ కొత్త రాజధాని అమరావతిలో బాబుకు గుడికడుతున్నారు. రాజధాని ప్రారంభోత్సవానికి వస్తున్న మోదీ పనిలో పనిగా గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటారేమో చూడాలి’’
‘‘ దేవుడే తన పక్కన ఉంటే దైవదర్శనానికి గుడికెందుకు వెళ్లడం’’
‘‘ ఇంతకూ దేవుడు ఎలా ఉంటాడని నువ్వు అనుకుంటున్నావ్?’’
‘‘ ఇదేం ప్రశ్న. బాబు గుడిలో దేవుడు బాబులానే ఉంటాడు. ఆ దేవుడికి గడ్డం కూడా ఉంటుంది. శ్రీకృష్ణుడికి మీసాలు ఉండేవా ? అని గతంలో టీవిలు, ఇంటర్‌నెట్ లేని రోజుల్లో పెద్ద చర్చ జరిగింది. గడ్డం విషయంలో అలాంటి సందేహాలేమీ ఉండవు ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా? ’’


‘‘ దేవున్ని ఏ రూపంలో ప్రతిష్టిస్తున్నారో? ’’
‘‘ ఇంకా అక్కడి వరకు ఆలోచన రానట్టుంది. నన్నడిగితే మాత్రం శ్రీకృష్ణుడి రూపంలో బాబు విగ్రహాన్ని ప్రతిష్టిస్తే బాగుంటుంది. శ్రీకృష్ణుడు దుష్టపాలకుడైన మేనమామ కంసున్ని సంహరిస్తే, బాబు ఎన్టీఆర్‌ను దుష్టపాలకుడు అని చెప్పి అధికారం నుంచి దించి మానసికంగా కృంగీదీసి పైకి పోయేట్టు చేశారుకదా? శ్రీకృష్ణుడి రూపం కరెక్ట్’’
అలా అంటే శ్రీరాముని రూపం కూడా సరిపోతుంది. శ్రీరాముడు చెట్టు చాటు నుంచి వాలిని సంహరించాడు కదా? నేరుగా ఎదుర్కోలేక. బాబు కూడా అంతే ఎన్టీఆర్‌ను నేరుగా ఎదుర్కోలేదు కదా? ’’
‘‘ నువ్వు చెప్పింది నిజమే కానీ ఆల్ రెడీ రాజమండ్రిలో గోదావరి నదిలో ఎన్టీఆర్ రూపంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఒకే రూపంలో మామా అల్లుళ్ల దేవుడి విగ్రహాలు బాగోవు’’
‘‘ అసలుదేవుడి రూపం ఎలా ఉండేదో? ’’
‘‘ చాలా మంది దేవుడు అచ్చం ఎన్టీఆర్‌లా ఉంటారని చెప్పగా విన్నాను, రాయగా చదివాను’’
‘‘ చెప్పిన వాళ్లు, రాసిన వాళ్లు నిజంగా దేవున్ని చూశారా? ’’
‘‘ లేదు..’’
‘‘ మరి ఏదో అచ్చం మా పెద్దమ్మ కొడుకులానే ఉన్నాడు అన్నంత ఈజీగా అచ్చం శ్రీరామునిలానే ఉన్నాడని ఎలా చెబుతారు’’
‘‘ ఒకరు ఇద్దరు కాదు చాలా మంది చెప్పారు కాబట్టి మనం నమ్మాలి అంతే ఎదురు ప్రశ్నించవద్దు’’


‘‘ నిజం ఒక్కరు చెప్పినా అబద్ధం కోటి మంది చెప్పినా సత్యం సత్యమే అవుతుంది కానీ సంఖ్యతో దానికి సంబంధం లేదు. సత్యం వేరు ప్రజాస్వామ్యం వేరు. ప్రజాస్వామ్యానికి అంకె ముఖ్యం, సత్యానికి కాదు. ’’
‘‘ తెలుగు సినిమా అభిమానులేమో ఎన్టీఆర్ అచ్చం శ్రీకృష్ణుడిలా, శ్రీరాముడిలా ఉన్నావంటారు. రావణుడు, దుర్యోధనుడు, కర్ణుడు కూడా అచ్చం ఎన్టీఆర్‌లానే ఉండేవారంటారు. కర్నాటక వాళ్లేమో హిందూ దేవుళ్లందరూ కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌లా ఉండేవాళ్లంటారు. టీవిలో హిందీ సీరియల్ రామాయణం, మహాభారత్ చూశాక ఉత్తరాది వాళ్లేమో రామానంద్‌సాగర్ రామాయణం అచ్చం అరుణ్‌గోయల్ లానే శ్రీరాముడు ఉండేవారని నమ్మేశారు. మహాభారత్ చూశాక శ్రీకృష్ణుడంటే నితీశ్ భరద్వాజ్ అని ఢంకా బజాయించి చెప్పేశారు. మనకు వారి భాష తెలియకపోవచ్చు, వారి సినిమాలు చూసి ఉండక పోవచ్చు కానీ దేశంలో ఎన్ని భాషల్లో సినిమాలు తీస్తారో అన్ని భాషలకు అచ్చం శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇలానే ఉంటారు అనిపించే నటులున్నారు.’’
‘‘ మరి నువ్వు చెప్పు దేవుడు ఎలా ఉంటారో? ’’
‘‘ ఎవరు చూసి వచ్చారని, రవివర్మ దేవుళ్ల బొమ్మలు చూసి దేవుడు ఇలానే ఉంటాడని సినిమాల వాళ్లు నిర్ణయించేశారు కానీ ఎవరైనా చూసొచ్చారా? ’’
‘‘ దేవుడు నిర్వికారుడు అంటారు కదా? ’’


‘‘ రూపం సంగతి ఎలా ఉన్నా దేవుడికి రంగు పట్టింపు ఉందనిపిస్తోంది’’
‘‘ ఎందుకలా?’’
‘‘ మొన్న తిరుమలలో ఒక హోటల్‌కు గులాబీ రంగు వేయిస్తే గగ్గోలు పెట్టారు.. తెల్లారే సరికి రంగు మార్చారు.’’
‘‘ అమరావతిలో గుడిని పచ్చరంగుతో నింపేస్తారేమో?’’
‘‘ తెలంగాణ ఇచ్చినందుకు ఆ మధ్య శంకర్‌రావు సోనియాగాంధీకి గుడి కడతానన్నారు. ఏమైందో? ’’
‘‘ విగ్రహం కూడా తయారు చేయించారు. ఈ లోపు ఎన్నికలు వచ్చాయి . తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం రాలేదు. ఆంధ్రలో అడ్రస్ లేకుండా పోయింది. కేంద్రంలో ప్రతిపక్ష హోదా దక్కలేదు. దాంతో విగ్రహం అటకెక్కింది. శంకర్‌రావు మాజీ అయ్యారు. ’’
‘‘ ప్రజాస్వామ్యంలో నాయకులను దేవుళ్లను చేస్తూ, గుళ్లు కట్టడం ఏమిటి? ’’
‘‘ మనిషి భయం నుంచి బయట పడేందుకు దేవున్ని సృష్టించాడు అంటారు హేతువాదులు. మన నుంచి భయాన్ని పారద్రోలేందుకు దేవుడి సృష్టి జరిగితే మంచిదే కానీ తమ పాలనతో ప్రజలను భయపెట్టే పాలకులను దేవుళ్లను చేసి గుడి కట్టడమే రాజకీయం. ’’
‘‘ ఇప్పటికే మనకు మూడు కోట్ల దేవుళ్లు ఉన్నారు. ఈ కొత్త దేవుళ్లు అవసరమా? ’’
‘‘ దేవున్ని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఎంతో కాలం తపస్సు చేసేవాళ్లు. ఇప్పుడు పాలక దేవుళ్లను ప్రసన్నం చేసుకోవాలంటే కొత్త కొత్త టెక్నిక్‌లు అవసరం. గుడి కట్టడం అందులో ఒకటి. లేకపోతే అమరావతికి టిడిపి నేత గురించి ఇంతగా ప్రచారం జరుగుతుంది అంటే గుడి కట్టడం వల్లనే కదా. భక్తుడి తపస్సు ఫలించినట్టే కదా? శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు. బతుక నేర్చిన ఉపాయాల్లో పాలకులకు గుళ్లు కట్టడం ఒకటి.’’


‘‘ దేవుడు ప్రసన్నం అయ్యాక గుడి ఉంటే ఎంత లేకుంటే ఎంత? రష్యాలో కమ్యూనిస్టు దేవుడు స్టాలిన్ విగ్రహాలనే కూల్చేశారు.’’
**

-బుద్దా మురళి (జనాంతికం 11. 10.2015 )

4, అక్టోబర్ 2015, ఆదివారం

ఔను! వాళ్లు మేధావులు!!

‘‘నాచేతిలో గన్ ఉంటే ఇలాంటి వాళ్లను వరుసబెట్టి కాల్చి పారేసేవాడ్ని.. వీళ్లను ... ’’


‘‘అంత ఆవేశపడుతున్నావ్ అంటే . మన దేశంలోకి ఉగ్రవాదాన్ని దిగుమతి చేస్తున్న పొరుగు దేశం మీదనే కదా  ఆ కోపం ?’’
‘‘మా ఇంటి పొరుగు వారిని ప్రేమించాలనే బలమైన కోరిక ఉన్నా వాళ్లా యన కండలు చూసి భయంతో ఊరుకున్నాను. లేకపోతే ఎప్పుడో పొరుగు వారిని ప్రేమించే వాడ్ని. అలాంటిది నేను పొరుగు దేశాన్ని వ్యతిరేకిస్తానా? ’’
‘‘అభం శుభం తెలియని అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న నర రూపరాక్షసులు ఉగ్రవాదుల మీద కోపం సహజమే. మన పార్లమెంటు మీద దాడి చేశారు. తాజ్ హోటల్‌పైన, ముంబాయి, ఢిల్లీ ఎక్కడ పడితే అక్కడ ముష్కరులు దాడి చేసి ప్రాణాలు తీస్తుంటే కోపం రాదా? ఏం పాపం చేశారని గోకుల్ ఛాట్‌లో పిల్లా పాపలతో సంతోషంగా ఛాట్ తినడమే వారు చేసిన పాపమా? బాంబులు పెట్టి ప్రాణాలు తీస్తారా? అలాంటి వారిని వరుసగా నిలబెట్టి చంపినా తప్పు లేదు. నాకు అర్థమయింది నీ కోపం వారి పైనే  ’’


‘‘మీరు అపార్ధం చేసుకుంటున్నారు. నాకు వాళ్లమీద ఎలాంటి కోపం లేదు. మనకు అన్నీ నెగిటివ్‌గా ఆలోచించడం అలవాటైంది. వాళ్ల సాహసాలను ఒకసారి పాజిటివ్ కోణంలో ఆలోచించి చూడండి. ఒక్కసారి కూకట్‌పల్లి నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు ప్రయాణించి చూడు తాతలు గుర్తుకొస్తారు.అలాంటిది దేశం కాని దేశం నుంచి అర్ధరాత్రి నాటు పడవలో కసబ్ అనే ఆ కుర్రాడు రావడానికి ఎంత ఇబ్బంది పడ్డాడో? తలుచుకుంటేనే జాలేస్తోంది. సరైన తిండి కూడా లేకుండా రోజుల తరబడి సముద్రంలో ప్రయాణించి ఇండియాలో అడుగు పెట్టిన అతని సాహసానికి నేను అబ్బురపడతాను. కానీ కాల్చివేయాలని ఎందుకనుకుంటాను. మీరు గమనించలేదేమో ఇలాంటి వారిని ఉరి తీయడాన్ని తప్పు పడుతూ సంతకం చేసిన మేధావుల్లో నా పేరు కూడా ఉంది. ’’


‘‘ మీరెప్పుడయ్యారు మేధావులు? ఆ వార్త ఎప్పుడొచ్చింది? ’’
‘‘ చేతిలో ఇంగ్లీష్ బుక్, భుజానికి బట్ట సంచి. సంచిలో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ నెరిసిన గడ్డం. ఇవన్నీ చూసిన తరువాత కూడా నేను మేధావిని అయ్యాను అనే నమ్మకం నీకు కలగ లేదంటే నీ దురదృష్టానికి నేనేం చేయలేను. నేను మేధావిననే విష యం అందరికీ తెలియడానికి ఎంతో కష్టపడి అందరి సంతకాల మధ్యలో నా సంతకాన్ని జొప్పించాను.. ’’
‘‘ఇంతకూ ఎవరిని కాల్చేయాలనుకున్నావో ఆ ఒక్కటీ చెప్పలేదు.. జీహాదీ పేరుతో అమాయకులను చంపే వారిపైనా? పార్లమెంటుపై దాడి చేసిన వారినా? ’’
‘‘పార్లమెంటులోకి వెళ్లడానికి ఎంపిలే అష్టకష్టాలు పడతారు. అక్కడ సెక్యూరిటీ అంత ఇబ్బంది కరంగా ఉంటుంది. అలాంటి ప్రాంతానికి తీవ్రవాదులు వెళ్లినందుకు వాళ్ల సాహసాన్ని మెచ్చుకోవాలి కానీ తప్పు పట్టడం ఎందుకు? జీహాద్ వారి మనోభావం. ఎవరి మనోభావలను నొప్పించే అధికారం మనకు లేదు. ’’


‘‘మరింకెవరిపై నీ కోపం. అడవుల్లో ఆయుధాలు పట్టుకుని ఆటో డ్రైవర్లను, కూలీలను కిడ్నాప్ చేయడం, ఇన్ఫార్మర్లుఅని కాల్చి చంపడం, కాంట్రాక్టర్లను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసే తీవ్రవాదులపైనా నీ కోపం’’
‘‘ఎంత మాటన్నావు... చిక్కడపల్లి నుంచి మల్కాజిగిరి వరకు, ఎల్‌బి నగర్ నుంచి ఉప్పల్ వరకు అక్కడ ఇక్కడ అని కాదు. ఎక్కడైనా దోమ కాటును తప్పించుకొని దమ్ముంటే సుఖంగా నిద్ర పోయామని ఒక్కరిని చెప్పమను చూస్తాను. మహానగరంలోనే మనం దోమల దాడిని తట్టుకోలేక అల్లాడి పోతుంటే పాపం ఆ అడవి బిడ్డలు దోమలు, పురుగులు, పాములను తప్పించుకుంటూ ఎండకు ఎండి, వానకు తడుస్తూ ఒక చేతితో ఆయుధాలు, మరో చేతితో ఇన్ఫార్మర్ల తలలు పట్టుకుని భారంగా నడవడమే జీవితంగా గడిపే అడవి బిడ్డలను గుండెలకు హత్తుకుంటాను కానీ వాళ్లనెందుకంటాను. పిల్లలు తుపాకీతో ఆడుకుంటే ముచ్చటపడతాం కానీ తప్పు పడతామా? చిన్నప్పుడు బొమ్మ తుపాకీ పెద్దయ్యాక నిజమైన తుపాకీ తేడా అంతే ... ’’
‘‘మరింకెవరిని వరుసగా కాల్చాలనుకుంటున్నావ్’’


‘‘ఎందరో మహానుభావులు దేశం కోసం సర్వస్వం అర్పించి స్వాతంత్య్రం సాధించింది ఇందుకోసమేనా? పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్నది ఇందుకోసమేనా? ఆరవై ఏళ్ల కొట్లాటతో తెలంగాణ సాధించుకున్నది ఇందుకోసమేనా? ’’
‘‘నీ ఆవేశం, ఆవేదన నా కర్ధమైంది. కానీ ఎందుకోసమో ? ఎవరిపై కోపమో తెలియడం లేదు’’
‘‘ఈ దేశానికో సంప్రదాయం, సంస్కృతి ఉంది? ఎంతో మంది ఎన్నో సార్లు ఈ దేశంపై దాడులు చేశారు. ప్రపంచ పటంలో బూతద్దం పెట్టుకుని చూస్తే కానీ కనిపించని బుడ్డ బుడ్డ దేశాల వాళ్లు కూడా దాడి చేశారు. ఆలయాలపై దాడులు చేశారు. సంపద దోచుకున్నారు. మత మార్పిడులు చేశారు’’
‘‘ఔను నిజమే చేశారు. కానీ వాళ్లను ఇప్పుడు కాల్చాలంటే కుదరదు, ఆ పనులు చేసిన వంశాలన్నీ గతించి కాలగర్భంలో కలిసిపోయాయి. ’’
‘‘నా కోపం వాళ్ల మీద కాదు. అన్ని సార్లు దాడులు చేసినా, సంపద దోచుకెళ్లినా మనం పల్లెత్తు మాట అనలేదు. అతిథిని గౌరవించడం మన ధర్మం... అతిథి దేవోభవ అని నిరూపించుకున్న వాళ్లం మనం. వాళ్లమీద నాకెందుకు కోపం కానీ’’
మరి ఇంకెవరి పై ఆ ధర్మాగ్రహం ’’

 ‘‘ఉదయమే ధర్మ సందేహాలు అంటూ టీవిల్లో మాట్లాడుతున్నారు. మనిషి జీవితానికి విలువలు ముఖ్యం అంటున్నారు. పతనం అయితే సమాజం ప్రమాదంలో పడుతుందని ధర్మోపన్యాసాలు చేస్తున్నారు. గణపతి విగ్రహాల ఏర్పాటు వల్ల 22వేల కోట్ల 575 రూపాయల 45 పైసల ప్రజా సంపద వృధాఅవుతుంది తెలుసా? బతుకమ్మ, అట్లతద్ది వల్ల ఈ ప్రపంచానికి  ఎంత నష్టమో తెలుసా?  ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి గురించి బాధ పడుతున్నారు కానీ బతుకమ్మ పండుగ ,రక రకాల  పూజల పేరుతో పూలను హత్య చేయడం గురించి మాట్లాడరేం ..  ఇలాంటివి ప్రోత్సహించే వాళ్లను వరుసబెట్టి కాల్చేయాలనిపిస్తోంది. ’’
‘‘నా అనుమానాలు తీరిపోయాయి. ఇప్పుడొప్పుకుంటున్నాను. నువ్వు కొత్తగా మేధావి మతం పుచ్చుకున్నవాడివి, ట్రైనింగ్ పిరియడ్ ముగిసిపోయిన కరుడు కట్టిన సెక్యూలరిస్టువి ’’ 
- బుద్దా మురళి (జనాంతికం 4.1 0.201 5)