30, జూన్ 2023, శుక్రవారం

మీడియా కొన్ని పాత్రలను పుట్టిస్తుంది .. హఠాత్తుగా మాయం అవుతారు .... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -61

మీడియా కొన్ని పాత్రలను పుట్టిస్తుంది .. హఠాత్తుగా మాయం అవుతారు జర్నలిస్ట్ జ్ఞాపకాలు -61 ------------------------------------------------------- సార్ ఐడెంటీ కార్డు చూపించండి అని ఆ కుర్రాడు వినయంగా అడిగే సరికి నవ్వుతూ అతని ముందే భారీ బహిరంగ సభకు హాజరైన వారిని లెక్కించాను . నేనూ , మరో జర్నలిస్ట్ , ఆ కుర్రాడి లాంటి మరో పది మంది వాలంటీర్లు , హాజరైన అశేష ప్రజానీకం అంతా కలిసి 50 మంది దాటడం లేదు . ఆ కుర్ర వాలంటీర్ బహుశా 8 లేక తొమ్మిదో తరగతి చదువుతున్నాడు కావచ్చు . కార్డు చూపిస్తాను కానీ మనందరినీ కలిపినా 50 మందే ఉన్నాం కదా ? ఇలా ఆపి కార్డు చెక్ చేయడం నీకు ఎలా ఉంది అని అడిగాను . ఏమో సార్ నాకీ పని చెప్పారు అంతే అన్నాడు . తన ఉద్యమం ద్వారా దేశాన్ని ఒక ఊపు ఊపి , ఢిల్లీ రాష్ట్రంలో , కేంద్రంలో యుపిఏ ఓడిపోయి బిజెపి అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేసిన అన్నా హజారే సికింద్రాబాద్ ఆనంద్ టాకీస్ ఎదురుగా ఉన్న కాలేజీ గ్రౌండ్ లో బహిరంగ సభ . రాష్ట్రం లో ఆయన తొలి సభ కాబట్టి భారీగా ఉంటుంది అనుకోని వెళితే పట్టుమని వందమంది రాలేదు . అన్నా హజారే పాత్రను ఎందుకు పుట్టించారు , ఎవరి కోసం ఆకాశానికి ఎత్తారు ? మీడియానే కాదు ప్రజలు కూడా మాస్ హిస్టీరియా వచ్చినట్టు ఊగిపోయారు . ఇతనే నిజమైన మహాత్మా గాంధీ , భారత రత్న ఇవ్వాలి అని డిమాండ్ చేసిన దేశం తరువాత అతన్ని ఎందుకు పట్టించుకోలేదు ? ఇప్పుడు అతను ఎక్కడున్నాడు ? ఏమిటీ లీల అని ప్రశ్నించుకుంటే రాజకీయం అర్థం అవుతుంది . మీడియా అవసరాలు , రాజకీయ అవసరాల కోసం కొన్ని పాత్రలు ఇలా రాజకీయ తెరమీద పుట్టుకు వస్తాయి . రాజకీయంలో వారి పాత్ర ముగియగానే స్టోర్ రూమ్ లో పడేస్తారు . ఢిల్లీలోనే కాదు ఇక్కడ కూడా అలాంటి బోలెడు పాత్రలను ఇలా పుట్టించారు .. **** తెలంగాణ ఉద్యమ కాలంలో పలు తెలుగు ఛానల్స్ ఇలాంటి అరడజను పాత్రలను పుట్టించారు . వాళ్ళు ప్రతి రోజు టీవీల్లో గంటల తరబడి కనిపించే వారు జాతిని ఉద్దేశించి ప్రసంగించేవారు . ముఖ్యమంత్రి , మంత్రులు , ప్రతిపక్ష నాయకుడి కన్నా టీవీల్లో ఈ పాత్రలే ఎక్కువ సమయం కనిపించేవి . ఈ పాత్రల సృష్టి వెనుక ఆ ఛానల్స్ కు నిర్దిష్టమైన లక్ష్యం ఉంటుంది . వరదలో కొట్టుకు పోతున్నప్పుడు గడ్డి పోచనైనా పట్టుకొని కాపాడుకోవాలనే ప్రయత్నం మీడియా ఈ పాత్రలను సృష్టించడం లో కనిపిస్తుంది . నేను తెలంగాణ వాడినే కానీ తెలంగాణ వద్దు , తెలంగాణ ఏర్పడితే తెలంగాణకు చాలా నష్టం అని నల్లమోతు చిరంజీవి కావచ్చు ( తక్షణ అవసరం కోసం సృష్టించిన పాత్ర కాబట్టి పేరు గుర్తుండడం కష్టమే ) టీవీల్లో తెగ వాదించేవారు . టివి 9 లాంటి నంబర్ వన్ ఛానల్ లో అంతేసి సమయం కేటాయిస్తే ప్రముఖ నాయకుడు అన్నట్టే కదా ? తెలంగాణ ఏర్పడిన తరువాత మళ్ళీ అతన్ని ఒక్క నిమిషం అయినా ఎందుకు చూపలేదు . ఎందుకంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకోవడం లేదు అనే అభిప్రాయం ఏర్పడేట్టు చేసేందుకు పుట్టించిన పాత్ర అది . తెలంగాణ ఏర్పడిన తరువాత ఇక ఆ పాత్ర అవసరం ఏముంది ? నర్రా విజయ లక్ష్మి అని ఒక మహిళా నాయకురాలు ఉండేవారు . బతుకమ్మ తెలంగాణ పండుగ కాదు విజయవాడలో కూడా జరుపుకుంటారు అని ఓ వాదన . లగడపాటి రాజ్ గోపాల్ పిలుపు మేరకు నర్రా విజయలక్ష్మి విజయవాడ వెళ్లి లగడపాటి అన్నయ్య పిలిచాడు అని ఆమె విజయవాడలో బతుకమ్మ ఆడేవారు . హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లి బతుకమ్మ ఆడడం వరకు ప్రముఖ ఛానల్స్ లైవ్ చూపేవారు . ఇక విభజన తరువాత టివి 9 పుట్టించిన పెద్ద పాత్ర శివాజీ ... దేశంలో అన్నా హజారే పాత్రకు ఎంత ప్రాముఖ్యత లభించిందో రాష్ట్రం లో టివి 9 ఆవిష్కరించిన శివాజీ పాత్రకు రాష్ట్ర స్థాయిలో అంత పాపులారిటీ లభించింది . సినిమా అవకాశాలు లేని శివాజీ అనే ఒక నటుడిని టివి 9 స్టూడియోలో కూర్చుండబెట్టి రోజుల తరబడి , కొన్ని గంటల పాటు ఆపరేషన్ గరుడ పేరుతో డ్రామా ఆడించారు . బాబు కూడా జనం తనను దించేయడానికి సిద్ధం అవుతున్నారు అనేది గ్రహించకుండా ఆపరేషన్బా గరుడ నిజమే అంటూ నమ్మించేందుకు ప్రయత్నించారు . బా బు ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ గరుడ ప్రాజెక్ట్ చేపట్టిందని తనకు ఎవరో దానయ్య చెప్పాడు అంటూ శివాజీ టివిలో గంటల తరబడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో వివరించారు . ఆ ఆతరువాత హఠాత్తుగా శివాజీ కోన్ కిస్కా అయిపోయాడు . బీజేపీ కోసం తెలంగాణ ఎమ్మెల్యేలను కొనడానికి బ్రోకర్లు వచ్చి రెడ్ హాండెడ్ గా పట్టుపడినా అంత లావుగా ఉన్న సన్యాసులు బ్రోకర్లుగా వచ్చారు అంటే మేం నమ్మం అని చెప్పిన మీడియా దారిన పోయే వాడు ఎవడో చెప్పాడు అంటే ఆపరేషన్ గరుడ అని రోజుల తరబడి టివిలో చూపారు . ఉద్యమ కాలం లో కెసిఆర్ పుట్టించిన పాత్ర జేఏసీ కోదండరాం . తెలంగాణ ఉద్యమం లో తెరాస దే కీలక పాత్ర , పెద్దన్న పాత్ర అన్ని పార్టీలను కలిపి ఉద్యమం చేయాలని అప్పటికప్పుడు తయారు చేసిన పాత్ర కోదండరాం . తెలంగాణ సాకారం కాగానే తన పాత్ర ముగిసింది అని గ్రహించకుండా అన్ని పార్టీలకు తానే నాయకుడిని అనే భ్రమల్లో ఉండి కోదండరాం దెబ్బ తిన్నారు . సొంత పార్టీ పెట్టారు . కాంగ్రెస్ , టీడీపీలతో చేతులు కలిపారు కాలం కలిసి రాలేదు . టెన్త్ మొదటి సారే పాసై ఇంటర్ లో డుమ్కి కొట్టిన కొందరు కోదండరాం ఉద్యమం వల్లే తెలంగాణ వచ్చింది తెలుసా అని వాదిస్తుంటే , పిల్లలతో ఏం వాదిస్తాం లే అని మౌనంగా ఉండిపోతా . ***** జన్ లోక్ పాల్ అంటూ దేశవ్యాప్త ఉద్యమం చేసిన అన్నా హజారే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అంటే . యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమించడానికి హజారే అవసరం అయ్యారు . ఆ పాత్ర అవసరం తీరిపోయింది . రాజకీయ పక్షాలు , వాటి అనుబంధ సంఘాలు , మీడియా అప్పటి అవసరం కోసం ఆయన్ని ఆకాశానికి ఎత్తింది . ఇప్పుడు వీరికి ఆయన అవసరం లేదు . వీరి ప్రత్యర్థి గ్రూప్ అంత బలమైనది కాదు , వారికి మీడియా లేదు . ఒక పాత్రను ఒకే సారి ప్రయోగిస్తారు . రెండో సారి అది పని చేయదు . **** టివి 9 లో అన్వేషణ అని పాత కాలం నటీనటులు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అని చూపిస్తారు . ఓ సారి ఈ పాత్రలను కూడా అన్వేషించవచ్చు కదా ? ఏదో సందర్భంలో కెసిఆర్ ఓ విషయం చెప్పారు . పిల్లాడిని తండ్రి తన భుజం పై ఎక్కించుకుంటే తాను తండ్రి కన్నా ఎత్తులో ఉన్నాను అనుకుంటాడు . భుజం నుంచి దించేశాక అసలు ఎత్తు తెలుస్తుంది అని ... టివి ఛానల్స్ అంతే ఆయా కాలాల్లోని అవసరాల మేరకు భుజం పై ఎక్కించుకొని స్టూడియోలో కూర్చోబెట్టి మాట్లాడిస్తారు .. అది తాత్కాలికం అని గ్రహించకుండా నిజం అనుకుంటే రాంగోపాల్ వర్మ సినిమాలా జీవితం అట్టర్ ప్లాప్ అవుతుంది . - బుద్దా మురళి

28, జూన్ 2023, బుధవారం

అతను ప్రధానితో రహస్యంగా ఏం మాట్లాడి ఉంటారు? ... అందుకే మహానుభావులు అంటారు ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -60

అతను ప్రధానితో రహస్యంగా ఏం మాట్లాడి ఉంటారు? ... అందుకే మహానుభావులు అంటారు జర్నలిస్ట్ జ్ఞాపకాలు -60 ------------------------------------- ప్రధానమంత్రితో ఎవరైనా ఒక అరగంట ఏకాంతంగా మాట్లాడితే ఏం మాట్లాడి ఉంటారు . ఇప్పుడంటే ఆఫీస్ లో కూర్చొని ఏం మాట్లాడారో తోచింది రాసుకునే మహానుభావులు ఉన్నారు కానీ అప్పకుడలా కాదు ... ఏం మాట్లాడి ఉంటారు ? అధికారులను , జర్నలిస్ట్ లను , రాజకీయనాయకులను అందరి మెదడును తొలిచిన ప్రశ్న . ఐతే ప్రధాని చెప్పాలి , లేదంటే ఆ కలిసిన వ్యక్తి చెప్పాలి .కలిసిన వ్యక్తి కాసింత కోపంతో రుస రుస వెళ్లిపోతుంటే , ఏం మాట్లాడారు అని అడిగితే , వెళ్లి ఆయన్నే అడగండి అని వెళ్లి పోయారు . అలా వెళ్లి పోయిన వారు కాళోజీ , అప్పుడు ప్రధాని పివి నరసింహారావు ... ***** 1994 లో ప్రధాన మంత్రిగా తొలిసారి పివి నరసింహారావు వరంగల్ జిల్లాకు వచ్చారు . వరంగల్ పివి సొంత జిల్లా. పుట్టింది పెరిగింది , ఎదిగింది వరంగల్ జిల్లాలో , దత్తత వెళ్ళింది కరీంనగర్ జిల్లా పివి సాహిత్య ,రాజకీయ జీవితాన్ని తీర్చిదిద్దింది వరంగల్ జిల్లా . పివి వరంగల్ఢి నుంచి ఒక పత్రికను కూడా నడిపించారు . ఢిల్లీ రాజకీయ జీవితాన్ని ముగించి వరంగల్ వచ్చి తిరిగి సాహిత్య జీవితాన్ని ప్రారంభించాలి అనుకుని ఏర్పాట్లు చేసుకున్నారు . ఆ ఉద్దేశంతో ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు . నేను వచ్చేస్తున్నా , సాహిత్యం తో గడుపుదాం అని మిత్రులకు సమాచారం కూడా ఇచ్చారు . అన్నీ అనుకున్నట్టు జరగవు , రాజకీయ జీవితాన్ని వదిలేద్దాం అని నిర్ణయించుకున్న వ్యక్తి రాజీవ్ గాంధీ హత్యతో ప్రధానమంత్రి పదవి చేపట్టాల్సి వచ్చింది . ప్రధాన మంత్రి హోదాలో తొలిసారిగా వరంగల్ వచ్చారు .అప్పులుడక్కడ దాదాపు అరడజను మంది జర్నలిస్ట్ లే ఉండేవారు . వరంగల్ జిల్లా రిపోర్టర్ గా నేనూ అక్కడున్నాను . ఇప్పుడంటే ప్రధాని ఢిల్లీలోనే తొమ్మిదేళ్లయినా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు . అప్పుడు తక్కువ సంఖ్య లో ఉండడం వల్ల వరంగల్ లో పివి ప్రధానిగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడితే ప్రశ్నించే అవకాశం కూడా లభించింది . బిసిలకు టికెట్ల గురించి అడిగితే , ఎక్కువ సీట్లు ఇవ్వడం గురించి చెప్పారు . చాలా మంది రాజకీయ నాయకులు అడిగిన మనిషి ముఖంలోకి చూసి సమాధానం చెబుతారు . ఎంతో సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని , ఎన్నో మార్పులు చూసిన జీవితం కాబట్టి పివి నరసింహారావు ఎదుటి వారిని చూడకుండా చెప్పాల్సింది చెప్పేశారు . అది స్థిత ప్రజ్ఞత అనుకున్నా , నిర్లిప్తత అనుకున్నా ఆయనకు పోయేదేమీ లేదు . ********* పివి నరసింహారావు గెస్ట్ హౌస్ లో ఉన్నారు . ముందుగా నిర్ణయించిన కార్యక్రమం లో కాళోజీ నారాయణ రావు తో సమావేశం లేదు . చిన్ననాటి మిత్రుడు కాదనేవారు ఎవరు . గెస్ట్ హౌస్ లో పివి , కాళోజీ ఇద్దరే అరగంటకు పైగా ఏకాంతంగా మాట్లాడుకున్నారు . ఏం మాట్లాడుకున్నారో తెలియదు . పివి ప్రధాని అయ్యాక వారి బంధువులు చాలా మందికి గ్యాస్ ఏజెన్సీ లు వచ్చాయి . అప్పటి ఆంధ్రప్రభ రిపోర్టర్ ఎంకౌంటర్ వార్త మిస్ అయితే ఉద్యోగం పోయింది . పివి అతని బతుకుతెరువు కోసం మరో వ్యక్తితో కలిపి గ్యాస్ ఏజెన్సీ ఇప్పించారు . బతుకు తెరువు కోసం ఇలా ఉపాధి మార్గాలు చూపడం తప్ప భారీ కాంట్రాక్టులు , వందల కోట్ల కుంభకోణాలు అంటూ లేవు . ప్రధానితో అరగంట భేటీ అంటే ఏ భారీ కాంట్రాక్టు నో , ఎవరికి మంత్రి పదవో , ఢిల్లీలో ఏదో పెద్ద పనే ఉంటుంది అనుకుందామా అంటే అక్కడున్నది కాళోజీ నారాయణరావు . ప్రజలు గోడును నా గోడు అనుకునే రకం . అడిగితే ఆయన్నే అడగండి అని విసవిసా వెళ్లి పోయారు . పీవీని అడగలేం . ఏమై ఉంటుందా ? అనే సందేహం బుర్రలో అలానే ఉండిపోయింది . ***** అటు తరువాత నేను హైదరాబాద్ వచ్చాను . వరంగల్ విషయాలు అక్కడే మరిచిపోయాను . ప్రధానిగా పివి పదవీ కాలం ముగిసిన తరువాత 2001-02 ప్రాంతంలో పబ్లిక్ గార్డెన్ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం లో కాళోజీ నారాయణ రావుకు సహస్ర చంద్ర దర్శనం పేరుతో సన్మానం . ఆ సభలో పివి నరసింహారావు పాల్గొన్నారు . కాళోజీ గురించి మాట్లాడుతో 94లో వరంగల్ లో వారిద్దరి మధ్య జరిగిన సమావేశం గురించి చెప్పారు . ప్రధాన మంత్రితో దాదాపు అరగంట ప్రత్యేకంగా సమావేశం అయితే రకరకాలుగా ఊహించుకుంటారు , ఏం వ్యవహారమో కానీ కాళోజీ ఏం మాట్లాడారో తెలుసా అని పివి వివరించారు . మనం యువకులుగా ఉన్నప్పుడు ఈ దేశం విధానాలు ఎలా ఉండాలని మాట్లాడుకున్నాం , ప్రధానిగా నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావ్ అని కాళోజీ నిలదీశారట . పివి ప్రధాని అయ్యేనాటికి దేశంలోని బంగారం విదేశాల్లో తాకట్టు పెడితే కానీ బతకలేని పరిస్థితి . ఆర్ధిక సంస్కరణలు తీసుకువస్తే తప్ప మనుగడ లేని గడ్డు స్థితి . ఈ విధానాలను మిత్రుడి ముఖం మీదే కాళోజీ నారాయణరావు తీవ్రంగా విమర్శిస్తూ వెళ్లిపోయారట . పివి కానీ , కాళోజీ నారాయణరావు కానీ తమ సొంత బాగు చూసుకున్న వారుకాదు అందుకే మహానుబావులుగా మిగిలిపోయారు . ప్రధానిగా ఉన్నప్పుడు తన మీద వేసిన కేసుల్లో వాదించిన న్యాయవాదులకు ఫీజు ఇవ్వడానికి సొంత ఇంటిని అమ్ముకున్న వారు పివి . ఆర్ధిక సంస్కరణల ఫలాలను దేశం ఇప్పుడు అనుభవిస్తోంది . ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం లో జరిగిన సభలోనే .. సభలో కొందరు యువకులు తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాలని కోరారు . మా కాలం లో మాకు నచ్చింది చేశాం , మీ కాలం లో మీకు నచ్చింది చేయండి అని సమాధానం ఇచ్చారు . ప్రధానులు అందరికీ ఢిల్లీలో సమాధులు నిర్మించినా పివి లాంటి జ్ఞానికి అక్కడ చోటు లేకుండా పోయింది . **** ఆర్ధిక సంస్కరణలు అమలు అయి పాతికేళ్ళు అయిన సందర్భంగా వివిధ రంగాల్లో వచ్చిన మార్పులతో పలు జాతీయ ఛానల్స్ ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు . బెంగళూరుకు చెందిన ఆర్ధిక నిపుణుడు ఒకరు తమ అనుభవాన్ని చెప్పారు . ఆర్ధిక సంస్కరణల కోసం దేశంలోని ఆర్ధిక రంగం మేధావులు అందరితో పివి ఓ సమావేశం నిర్వహించారు . మెజారిటీ మేధావులు సంస్కరణలను వ్యతిరేకిస్తూ ఉపన్యాసాలు . అందరి అభిప్రాయాలు మౌనంగా విన్న పివి ముగింపులో దేశం పరిస్థితి ఇలా ఉంది ఆర్ధిక సంస్కరణలు అమలు చేయడం మినహా మరో మార్గం లేదు అని ముగించారట ... ఆ రోజు పివి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం ఈ రోజు దేశం తలెత్తుకొని నిలిచేట్టు చేసింది . - బుద్దా మురళి

27, జూన్ 2023, మంగళవారం

జర్నలిస్ట్ లు పత్రికలు చదువుతారా ? పత్రికల వార్తలపై కేటీ ఆర్ కు కెసిఆర్ పరీక్ష మనం వార్తలు సృష్టించాలి కానీ చదవడమా ? అన్న ఎన్టీఆర్ ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -59 ____________________

జర్నలిస్ట్ లు పత్రికలు చదువుతారా ? పత్రికల వార్తలపై కేటీ ఆర్ కు కెసిఆర్ పరీక్ష మనం వార్తలు సృష్టించాలి కానీ చదవడమా ? అన్న ఎన్టీఆర్ జర్నలిస్ట్ జ్ఞాపకాలు -59 _______________________ జర్నలిస్ట్ లు పత్రికలు చదువుతారా ? అంటే ఇదేం ప్రశ్న ? వారే చదవక పోతే ఇంకెవరు చదువుతారు , చదవక పోతే జర్నలిస్ట్ గా ఉద్యోగం ఎలా చేస్తారు అనిపిస్తుంది . నిజమే చదువుతారేమో కానీ ఎలా చదువుతారు ? ఏం చదువుతారు ? ఎన్ని పత్రికలు చదువుతారు అనేది కూడా వృత్తిలో సత్తా చాటడంలో కీలకమే . మనం వార్తలు సృష్టించాలి కానీ మనం వార్తలు చదవడం ఏమిటీ బ్రదర్ అని సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్ అనే వారట .. ఓ ఇంటర్వ్యూలో అక్కినేని నాగేశ్వరరావు ఈ అంశం గురించి చెప్పారు . నిజానికి రాజకీయాల పట్ల ఎన్టీఆర్ కన్నా తనకే ఎక్కువ ఆసక్తి అని , మర్రి చెన్నారెడ్డి , జలగం వెంగళరావు వంటివారితో తనకు స్నేహం ఉండేదని, కానీ రాజకీయాల పట్ల ఏ మాత్రం ఆసక్తి లేని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం తనకు ఆశ్చర్యం కలిగించింది అని అక్కినేని చెప్పుకొచ్చారు . బ్రహ్మానందరెడ్డి కాలం లో ఓ సారి షూటింగ్ విరామం లో రాజకీయాల గురించి సీరియస్ గామాట్లాడుకుంటుంటే ఎన్టీఆర్ వచ్చి ఎందుకు బ్రదర్ మనకు ఎలాంటి ఉపయోగం లేని రాజకీయాల గురించి చర్చ ఎందుకు అన్నారని అక్కినేని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు . ఉదయం లేవగానే ఇంటలిజెన్స్ వాళ్ళు , సమాచార శాఖ వారు సీఎం సమాచారం ఇస్తారు . కానీ అంతకు మించి కళ్ళు ఉండాలి లేక పోతే ఏమవుతుందో ఎన్టీఆర్ రాజకీయమే ఉదాహరణ ... ***** మీరు రోజుకు ఎన్ని పత్రికలు చదువుతారు ? తెలంగాణ ఏర్పడిన తరువాత మొదట సంవత్సరం హరిత ప్లాజా లో జరిగిన ప్రగతి నివేదిక మీడియా సమావేశం సందర్భంగా ఇష్టాగోష్టిగా మాట్లాడుతుంటే కె . తారక రామారావు అడిగిన ప్రశ్న . యూ ట్యూబ్ , సామాజిక మాధ్యమాలకు అలవాటు కానీ రోజులు . రోజుకు రెండు మూడు పత్రికలు చదువుతాను అని చెప్పాను . నేను పన్నెండు పత్రికలు చదువుతాను , ఐనా అప్పుడప్పుడు మా నాన్న పత్రికల్లో వచ్చిన వార్తలపై పరీక్ష పెడతారు అని ఓ ఆసక్తి కరమైన ఉదంతం చెప్పారు . ***** కెసిఆర్ ఓ రోజు కేటీఆర్ ను ఈ రోజు ఆంధ్రభూమి చదివావా ? అని అడిగారట చదివాను అని చెబితే ఆసక్తి కలిగించే విషయం ఏముంది అని ప్రశ్నిస్తే చదివిన వార్తలు అన్నీ చెబితే , అది కాదు నీకేమి ప్రత్యేకం అని పించలేదా ? అంటే మరోసారి పేజీలు తిరగేశారు . దేని గురించో అర్థం కాలేదు . ఎడిట్ పేజీలో పాఠకులు రాసే ఉత్తరాల శీర్షిక చదవమంటే కెసిఆర్ చదివారు . ఐనా ఏముంది వీటిలో ప్రత్యేకం అనుకుంటే కెసిఆర్ ఓ పాఠకుడి ఉత్తరం చూపించారు . కాంగ్రెస్ నాయకులు ఎలాగూ చేయరని తెలిసి పోయింది , మీరైనా చేయవచ్చు కదా ? అంటూ పాఠకుడు రాసిన ఉత్తరం . అంటే జనం ప్రజలు కాంగ్రెస్ పై ఆశలు వదిలేసుకున్నారు అంటూ ఆ పాఠకుడి అభిప్రాయం గురించి వివరించారు . రోజుకు 12 పత్రికలు చదివినా కెసిఆర్ ఏదో విషయం అడుగుతూనే ఉంటారని , దాని వల్ల ప్రతి విష్యం తెలుసు కోవడానికి అన్ని పత్రికలు క్షుణ్ణంగా చదువుతాను అన్నారు . టివి 9 బిగ్ డిబేట్ లో మీ ఇంట్లో అందరూ బాగా మాట్లాడుతారు అని రజనీ కాంత్ అంటే మాట్లాడడం కాదు సబ్జెక్ట్ ఉండాలి అని కేటీఆర్ బదులిచ్చారు . అన్ని పత్రికలు ఏదో ఓ పార్టీకి అనుకూలంగా మారాయి ఐనా రాజకీయాల్లో ఉన్నా , జర్నలిజంలో ఉన్నా ప్రతి రోజు పత్రికలు చదవక పోతే పోటీ ప్రపంచంలో దెబ్బ తింటారు . కెసిఆర్ అన్ని పత్రికలు క్షుణ్ణంగా చదువుతారు . చివరకు సాహిత్యాన్ని కూడా చదువుతారు . చదివినప్పుడే విషయ పరిజ్ఞానం ఉంటుంది . ఎప్పుడు, ఎక్కడ , ఏ అంశం పైనైనా మాట్లాడగలరు . **** 95లో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కొత్తలోనే ప్రజల వద్దకు పాలన అని మీడియాతో పాటు బస్సులో జిల్లాలకు వెళ్లేవారు . ప్రధాన పత్రికలతో పాటు, జర్నలిస్టులు కూడా పెద్దగా పట్టించుకోని చిన్న పత్రికలు సైతం బస్సులోనే చంద్రబాబు చూసేవారు . ఉదయమే ఆ పత్రికలు చూస్తే మూడ్ ఆఫ్ అవుతుంది కాబట్టి నేను చూడను అని వై యస్ రాజశేఖర్ రెడ్డి శాసన సభలోనే ప్రకటించారు . లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక కాబట్టి ఈనాడు చదువుతాను అని మరో సందర్భంలో అన్నారు . వై యస్ జగన్మోహన్ రెడ్డికి సొంతంగా పత్రికనే ఉంది . ఆయన పత్రికలు చదవడం గురించి తెలియదు , పత్రికలు చదివే అలవాటు గురించి సభలో కానీ , బహిరంగంగా కానీ చెప్పక పోవడం వల్ల దాని గురించి తెలియదు . జవహర్ లాల్ నెహ్రూ తనను తానే విమర్శించుకుంటూ కలం పేరుతో కాలం రాసేవారు . వాజపేయి చదవడమే కాదు కవిత్వం రాసేవారు కూడా . ప్రధాని మోడీ ఒక్క సారి కూడా విలేకరుల సమావేశం నిర్వహించలేదు . చదవడం గురించి తెలియదు . బాగా చదివే అలవాటు ఉన్న వారే బాగా మాట్లాడగలరు . జిల్లా అనుబంధాలు వచ్చాక కొంతమంది జర్నలిస్ట్ లు జిల్లా పేజీలు చూసి పేపర్ పక్కన పడేసేవారు . మరికొందరు తాము రాసిన వార్త చూడడమే పత్రిక చదివినట్టు భావించేవారు . ఎడిట్ పేజీ చదివే అలవాటు తక్కువ మందికి ఉంటుంది . జర్నలిజంలో ఉండాలి అనుకుంటే వీలైనన్ని పత్రికలు , వీలైనంత చదవాలి . రిపోర్టర్ తిరక్క చెడితే , సబ్ ఎడిటర్ తిరిగి చెడిపోతారు అని మీడియా సర్కిల్ లో ఓ జోక్ . తిరిగినా , తిరగక పోయినా చదివే అలవాటు లేకపోతే రాణించడం కష్టం . - బుద్దా మురళి

జనం కోసం ఎదురు చూసిన ఎన్టీఆర్ .... అన్న పార్టీ నుంచి గెలిచింది వదిన ఒక్కరే .... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -58

జనం కోసం ఎదురు చూసిన ఎన్టీఆర్ .... అన్న పార్టీ నుంచి గెలిచింది వదిన ఒక్కరే జర్నలిస్ట్ జ్ఞాపకాలు -58 ---------------------------------- బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ నివాసం . అక్కడ లక్ష్మీ పార్వతి నాయకత్వంలో పొలిట్ బ్యూరో తో పాటు కీలక నేతల ముఖ్య సమావేశం జరుగుతోంది . మీడియా ఆ ఇంటి ఆవరణలో బయటే ఉంది . లోపల మాట్లాడే మాటలు కొంచెం వినిపిస్తున్నాయి . అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిచిన నాయకుడు ఒకరు ఎన్నికల వ్యూహాలు , ఎలా విజయం సాధించాలి అంటూ ఏవేవో చెప్పుకుంటూ పోతున్నారు . అది ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ సమావేశం . ఆ కొత్త పార్టీ తరపున అప్పటి వరకు గెలిచింది అతనొక్కడే కాబట్టి గెలుపు వ్యూహాలు చెబుతున్నాడు . ఎలాంటి పార్టీ ఎలా అయిపొయింది అనిపించింది . దేశ రాజకీయాలను శాసించే నేషనల్ ఫ్రంట్ చైర్ మెన్ , ఓటి చేత్తో కాంగ్రెస్ ను ఓడించి సీఎం అయిన ఎన్టీఆర్ నివాసం . జాతీయ నాయకులు , రాష్ట్రనాయకులు పడిగాపులు కాసిన ఇల్లు . ఎలా అయిపొయింది? . అనిపించింది . ఏదీ శాశ్వతం కాదు ... ****** సినిమా రంగాన్ని వదిలి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు జనం తండోప తండాలుగా ఆయన వెంట నడిచారు . ఇసుక వేస్తే రాలనంత జనం అనే వార్త ఎన్టీఆర్ సభలకు సర్వ సాధారణం అయింది . ముందుగా ప్రకటించిన ప్రాంతానికి 24 గంటలు ఆలస్యం అయినా జనం అలానే ఎదురు చూస్తూ రోడ్డు మీదనే ఉండిపోయిన సందర్భాలు అనేకం . అలాంటి ఎన్టీఆర్ జనం కోసం చాలా సేపు ఎదురు చూశారు . ఎదురు చూసినా జనం రాకపోవడం తో చైతన్య రథం లోనే భోజనం కానిచ్చారు . అప్పటికి చాలా కొద్ది మంది వస్తే వారిని ఉద్దేశించి మాట్లాడారు . ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే అధికారం లోకి వచ్చారు . ఇది అందరికీ తెలిసిందే . ఎన్టీఆర్ ఒకటే పార్టీ పెట్టలేదు . రెండు పార్టీలు పెట్టారు . అన్నగారు పెట్టిన రెండో పార్టీ నుంచి వదిన ఒక్కరే గెలవడం విశేషం . ఎన్టీఆర్ గురించి రాసేప్పుడు , చెప్పేప్పుడు తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం గురించే చెబుతారు కానీ , అట్టర్ ప్లాప్ అయిన రెండో పార్టీ గురించి చెప్పరు . జనం కోసం ఎన్టీఆర్ ఎదురు చూడడమే కాదు స్వయంగా ఎన్టీఆర్ ను జనం ఓడించారు . ఈ రెండూ తెలంగాణ లోనే జరిగాయి . **** ఎన్టీఆర్ , అక్కినేని నాగేశ్వరరావు దివిసీమ తుఫాన్ బాధితుల కోసం జోలెపట్టి విరాళాలు సేకరించేప్పుడు తొలిసారి సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్ లో దర్గా వద్ద బట్టల షాప్ లో విరాళం అడుగుతున్నప్పుడు చూశా . . 82లో టీడీపీ పెట్టినప్పుడు రామకృష్ణ స్టూడియోలో జిల్లాల వారీగా సమావేశాలు. నేను పదవ తరగతి విద్యార్థిని కరీంనగర్ జిల్లాకు చెందిన క్లాస్ మెట్ ఒకరు ఈ రోజు మా జిల్లా మీటింగ్ ఉంది . తెలిసిన వాళ్ళు వస్తారు అంటే అతనితో పాటు వెళ్ళాను . మార్వాడీలు వేసుకునే గద్దె పరుపు దానిపై ఎన్టీఆర్ , నాదెండ్ల కూర్చున్నారు . ఒక ఫోటో గ్రాఫర్ ఫోటో తీస్తే ఎన్టీఆర్ కనులతోనే గద్దించారు . నాదెండ్ల సర్ది చెప్పారు . సాధారణంగా సినిమా వారికి గ్లామర్ ముఖ్యం . ఎలా పడితే అలా ఫోటో తీస్తే ఒప్పుకోరు . ఇది రాజకీయ మీటింగ్ అని నాదెండ్ల సర్ది చెప్పి ఉంటారు . 1989 ఎన్నికల ప్రచారం . గజ్వేల్ లో ఎన్టీఆర్ బహిరంగ సభ కావడంతో అప్పుడు మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ను సంగారెడ్డి నుంచి ఎన్టీఆర్ న్యూస్ కవరేజ్ కోసం గజ్వేల్ వెళ్ళాను . విశాలమైన మైదానంలో సభ కోసం బ్యారీ కేడ్లు ఏర్పాటు చేశారు . చైతన్య రథం పై ఎన్టీఆర్ వస్తే మీడియా తప్ప ఎవరూ లేరు . ఏమైందో అర్థం కాలేదు . ఎన్టీఆర్ వస్తున్నారు అంటే పొలం పనులు కూడా వదిలేసి రోడ్డు మీదకు జనం పరిగెత్తుకు వచ్చిన వార్తలు బోలెడు చదివి ఉండడం తో ఆ దృశ్యం అర్థం కాలేదు . ప్రకాశం జిల్లాకు చెందిన సంజీవ రావు గజ్వేల్ నుంచి టీడీపీ శాసన సభ్యులు . 89లో కూడా ఆయనకే టికెట్ రావడంతో పోటీ చేస్తున్నాడు . ఇప్పుడున్నంత మీడియా హడావుడి అప్పుడు లేదు . నాలుగురైదుగు తప్ప మీడియా పెద్దగా ఉండదు . జనం లేకపోవడంతో సంజీవరావును ఎన్టీఆర్ చైతన్య రథంలోకి పిలిచారు . కొంత సేపటి తరువాత రావచ్చు అని చైతన్య రథంలో నిరీక్షించి , అక్కడే భోజనం చేశారు . ఎన్టీఆర్ మాట్లాడే సమయం లో కూడా గ్రౌండ్ ఖాళీగానే ఉంది . ఈ సభతో 89 ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అర్థం అయింది . గజ్వేల్ ఖాళీ గ్రౌండ్ , ఎన్టీఆర్ ఉపన్యాసం , బ్యారికేడ్లు ఇవన్నీ వచ్చేట్టుగా అప్పుడు నేను తీసిన ఫోటో భూమి , క్రానికల్ లో మొదటి పేజీలో వచ్చింది . అంతకు ముందు భువనగిరిలో భారీ బహిరంగ సభ అని ప్రచారం చేసినా జనం అంతంత మాత్రంగానే వచ్చారు . ఐతే గజ్వేల్ సభలో స్వయంగా జనం కోసం ఎన్టీఆర్ నిరీక్షించినా ఫలితం లేకపోవడం తో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అర్థం అయింది . జనం పొలం పనుల్లో ఉండడం వల్ల రాలేక పోయారు అని సంజీవరావు వివరణ ఇచ్చారు . ఇక్కడి నుంచే 89 ఎన్నికల్లో గీతారెడ్డి సంజీవరావుపై విజయం సాధించారు . ఇందిరాగాంధీ లా తలపై చీర కొంగు కప్పుకొని ఆమె సాగించిన ప్రచారం ఫొటోలతో లోకల్ మీడియాను ఆక్రమించేశారు . 89 ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎన్టీఆర్ చిత్తరంజన్ దాస్ చేతిలో ఓడిపోయారు . అదే దాస్ బాబు నాయకత్వంలోని టీడీపీలో చేరారు . ఎన్టీఆర్ ను ఎన్నికల్లో ఓడించిన చిత్తరంజన్ దాస్ , వెన్నుపోటుతో ఓడించిన బాబు ఒకే గూటికి చేరారు అని అప్పుడు జోకులు వినిపించేవి . అంతకు ముందు పిసిసి అధ్యక్షుడిగా మర్రి చెన్నారెడ్డి సంగారెడ్డి లో జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్నారు . అనంతరం జరిగిన విలేకరుల సమావేశం లో మొదటి సారి కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పారు . 180 + సీట్లు ( 182 నో లేక 183 ) వస్తాయని చెప్పారు . ఆయన చెప్పినట్టే ఒకటో రెండో సీట్ల తేడాతో ఆ జోస్యం నిజమైంది . **** వెన్నుపోటులో బాబు చేతిలో ఎన్టీఆర్ ఓడిపోయారు . న్యాయ పోరాటంలోనూ పరాజయం ఎదురయ్యాక తన వద్ద ఉన్న దాదాపు 30 మంది శాసన సభ్యులతో కలిసి ఎన్టీఆర్ 1996 లో కొత్త పార్టీ పెట్టారు . ఎన్టీఆర్ టీడీపీ అనే పార్టీ పెట్టి సింహం గుర్తుతో పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు . తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు . ఎన్టీఆర్ సినిమా నటునిగా ఉన్నప్పుడు తిరుపతి వెళ్లిన యాత్రికులు చాలా మంది అటు నుంచి మద్రాస్ వెళ్లి ఎన్టీఆర్ ను చూసే వారు . ఎన్టీఆర్ ను దించేశాక అదే తరహాలో పెద్ద సంఖ్యలో జనం ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి చూసి వెళ్లేవారు . అక్కడో జాతరలా ఉండేది . 96 పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఎన్టీఆర్ మరణించారు. చంద్రబాబు నెత్తిన పాలు పోసినట్టు అయింది . పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎన్టీఆర్ బతికి ఉంటే రాజకీయాలు ఎలా ఉండేవో . ఎన్టీఆర్ టీడీపీ తరపున పోటీ చేసిన హేమా హేమీలంతా ఓడిపోయారు . ఎన్టీఆర్ కులారుడు జయకృష్ణ ఎన్టీఆర్ టీడీపీ తరుపున శ్రీకాకుళం నుంచి పోటీ చేసి ఓడిపోయారు . ఎన్టీఆర్ టీడీపీ తరపున ఒకే ఒకరు గెలిచారు . ఉప ఎన్నికల్లో పాత పట్నం నుంచి నందమూరి లక్ష్మీ పార్వతి గెలిచారు . తరువాత ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ అన్నా తెలుగుదేశం పార్టీ పెట్టారు . ఒక్కరు కూడా గెలువ లేదు . ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టినప్పుడు ఇంగ్లీషులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని విమర్శించేవారు . అలాంటి ఎన్టీఆర్ రెండు పార్టీలు పెడితే , కుమారుడు ఓ పార్టీ పెట్టారు . అన్న టీడీపీ , అల్లుడు టీడీపీ , కుమారుడు టీడీపీ , వదిన టీడీపీ ఎన్ని బంధుత్వాలు ఉంటాయో అన్ని టీడీపీలు . వైస్ రాయ్ క్యాంపు బాగా పాపులర్ కానీ ఎన్టీఆర్ కూడా ఓ క్యాంపు నడిపారు అది పెద్దగా పాపులర్ కాలేదు . 30 మంది శాసన సభ్యులతో గోల్కొండ హోటల్ క్యాంపు నడిపారు . విజయాలనే కాదు పరాజయాలను కూడా గుర్తు చేసుకోవాలి . సినిమాలు , జీవితాన్ని మించిన మలుపులు ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఉన్నాయి . బుద్దా మురళి

26, జూన్ 2023, సోమవారం

ఎడిటర్ కు , ఓనర్ కు కోపం వస్తే .... రికార్డ్ సృష్టించి న పీసిసి అధ్యక్షుడు, గవర్నర్ .... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -57

ఎడిటర్ కు , ఓనర్ కు కోపం వస్తే .... రికార్డ్ సృష్టించి న పీసిసి అధ్యక్షుడు, గవర్నర్ జర్నలిస్ట్ జ్ఞాపకాలు -57 ------------------------ ఎడిటర్ కోపంగా ఉన్నాడు . పత్రికా కార్యాలయం లో డెస్క్ వారితో , రిపోర్టర్ లతో సమావేశం . అందరినీ ఒకసారి చూసి మీ కెవ్వఁరికీ సమాజం పట్ల బాధ్యత లేదు . ప్రజల సమస్యలు పట్టవు . జర్నలిజం అంటే ఇదేనా ? మీ రాజకీయ వార్తలే తప్ప జనం గోడు పట్టదా ? అని ఎడిటర్ అందరి మీద కోపం తో ఊగిపోతున్నాడు . . వార్తలు అంటే రాజకీయం , క్రైం మాత్రమేనా ? జనానికి సంబంధించిన కష్టాలు తెలియవా ? జనం లోకి వెళ్ళండి వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు రాయండి .. ఉదాహరణకు గ్యాస్ సిలండర్ బుక్ చేస్తే వారం అయినా రాదు . దీనిపై ఓ మంచి స్టోరీ రాయవచ్చు . రాయండి అంటూ పురమాయిస్తుంటే ఇంతలోనే ఫోన్ మోగింది . ఎడిటర్ ఉపన్యాసం ఇస్తున్నందున అటెండర్ ఫోన్ ఎత్తి ... ఎడిటర్ తో చెబుతాడు ... సార్ మేడం ఫోన్ చేశారు . ఏజెన్సీ వాడు సిలండర్ పంపించాడట . గ్యాస్ సిలండర్ వచ్చింది కాబట్టి ఇక న్యూస్ రాయాల్సిన అవసరం లేదు అని మేడం మీకు చెప్పామన్నారు అంటాడు . ఈ దృశ్యం 1989 ప్రాంతంలో జస్పాల్ భట్టి టివి షో ఫ్లాప్ షో లోనిది . మిగిలిన వారి కన్నా మీడియా వాళ్ళు ఈ సీన్ కు బాగా కనెక్ట్ అవుతారు . భట్టికి ఈ సీన్ ను ఎవరైనా మీడియా వాళ్ళే చెప్పి ఉంటారు . అచ్చం మా ఆఫీస్ లో జరిగిన సీన్ లానే ఉంది అని అన్ని మీడియాల వారికి అనిపించి తీరుతుంది . 1989 ప్రాంతంలోనే వ్యవస్థలో , ప్రభుత్వ కార్యాలయాలలో వ్యవహారాలపై దూరదర్శన్ లో ప్రసారం కావడం , భట్టి వాటిని నిర్మించడం పాత వాటిని యూ ట్యూబ్ లో ఇప్పుడు చూసినా ఆశ్చర్యం వేస్తుంది . ఇప్పుడు ప్రైవేట్ ఛానల్స్ లెక్క లేనన్ని వచ్చినా తమ తమ పార్టీల అనుకూల , ప్రత్యర్థి పార్టీల వ్యతిరేక విధానాలతో కార్యక్రమాలు తప్ప .. భట్టి స్థాయిలో వ్యంగ్య దాడి ఊహించలేం ... ఒక చోట పేరు ఎడిటర్ అని ఉంటుంది , ఇంకో చోట ఓనర్ , మేనేజర్ పేరు ఏదైనా కావచ్చు వారికి కోపం వచ్చింది అంటే అది ప్రపంచ సమస్య అన్నట్టే . కోపం తెప్పించిన వారిని తల తీసేయడానికి తమ మీడియా ద్వారా తీవ్రంగా ప్రయత్నిస్తారు . ***** ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు ఎం . సత్యనారాయణ రావు , గవర్నర్ నరసింహన్ ఇద్దరికీ ఓ సంబంధం ఉంది . ఆ సంబంధం ఏమిటో చెప్పే ముందు . ఇద్దరు పత్రికాధిపతులకు ఎందుకో ఈ ఇద్దరి మీద కోపం వచ్చింది . లోకల్ స్ట్రింగర్ కే కోపం వస్తే ఆ ఏరియాలో భూకంపం తప్పదు అనుకునే రోజులు అవి . ఇక ఏకంగా ఓనర్ కే కోపం వస్తే తమ మీడియాలో వారికి ఉరి శిక్ష అమలు చేయాల్సిందే . ఆంధ్ర జ్యోతిలో అప్పటి గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ పై వారానికి ఓ సారి అన్నట్టు గవర్నర్ మార్పు అనే వార్తలు వచ్చేవి . 2009 లో అయన గవర్నర్ అయ్యారు . 2019 వరకు గవర్నర్ గా కొనసాగారు . జ్యోతిలో మాత్రం రాజీ లేకుండా గవర్నర్ మార్పు అని వార్తలు వచ్చేవి . గవర్నర్ కు సంబంధించి ఆ తరువాత వార్త మోత్కుపల్లి నర్సింహులు గురించి . త్వరలో మోత్కుపల్లికి గవర్నర్ అని వార్తలు వచ్చేవి . అప్పుడప్పుడు ఈనాడులో కూడా వచ్చేవి . ఆ వార్తలు ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చేవి . ఎందుకు వచ్చేవో తెలుసు . టీడీపీ నుంచి జారిపోకుండా అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు రహస్యంగా లీక్ చేసేవారు . ఇవి లీకేజి వార్తలు అని అందరికీ తెలుసు . సాక్షిలో లీకేజి వార్త అని రాసి కొద్ది రోజుల తరువాత గవర్నర్ రేస్ లో ఇనగాల పెద్దిరెడ్డి అని రాశారు . టీడీపీ లీకేజి పవర్ అలాంటిది . నరసింహన్ ను తొలగిస్తారు అనే వార్త చివరకు ఒక జోక్ గా మారింది . ఉమ్మడి రాష్ట్రంలో , తెలంగాణ , ఆంధ్ర రాష్ట్రాల ఏర్పాటు తరువాత ఇప్పటి వరకు అత్యధిక కాలం గవర్నర్ గా చేసిన రికార్డ్ నరసింహన్ దే . తొలుత ఛత్తీస్ ఘడ్ గవర్నర్ గా ఉండి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అదనపు బాధ్యతలు 2009 లో చేపట్టారు . ఉమ్మడి గవర్నర్ , రాష్ట్రపతి పాలన , తిరిగి రెండు రాష్ట్రాల గవర్నర్ , చివరలో తెలంగాణ గవర్నర్ గా 2019 వరకు బాధ్యతలు నిర్వహించారు . ఇంత సుదీర్ఘ కాలం తో పాటు ఇంత వైవిధ్యంగా బాధ్యతలు చేపట్టే అవకాశం భవిష్యత్తులో కూడా ఎవరికీ రాదు . తొలి గవర్నర్ చందూలాల్ మాధవ లాల్ త్రివేది నుంచి ఇప్పటి గవర్నర్లు తమిళ సై , సయ్యద్ అబ్దుల్ నజీర్ వరకు పాతిక మందిలో ఏ ఒక్కరు కూడా కనీసం నరసింహన్ లో సగం కాలం కూడా గవర్నర్ గా ఉండలేదు . కానీ మూడు రోజుల్లో గవర్నర్ మార్పు అని వారానికి ఓ సారి రాసేవారు . కోపం ఎందుకో తెలియదు . ***** ఓ రోజు ఆంధ్రభూమి ఆఫీస్ కు వెళ్ళగానే న్యూస్ ఎడిటర్ అమర్ నాథ్ ఈ రోజు వార్తలు ఏమున్నాయి అని అడిగారు . ఆదివారం రోజు వార్తల కరువు ఉంటుంది . స్టోరీలతో నెట్టుకు రావాలి . వార్తలు ఏమున్నాయి అని అడగ్గానే క్షణం కూడా ఆలోచించకుండా మొదటి పేజీ కోసం పిసిసి అధ్యక్షుడి మార్పు అని ఢిల్లీ నుంచి పావు పేజీ వార్త ఎలాగూ వస్తుంది కదా ? అన్నాను . గవర్నర్ మార్పు వార్త జ్యోతిలో జోక్ గా మారితే పిసిసి అధ్యక్షుని మార్పు వార్త ఆంధ్రభూమిలో జోక్ గా మారింది . రాజ్యసభ అభ్యర్థిగా తనను నిర్ణయించక పోవడం తో భూమి ఓనర్ కు సత్యనారాయణ పై కోపంగా ఉండేది . ఆంధ్రభూమికి కాంగ్రెస్ పత్రిక అని ముద్ర , ఓనర్ కేమో బాబుతో మంచి పరిచయం . అలా అని బాబు కు వ్యతిరేకంగా రాయవద్దు అని ఒక్క సారి కూడా ఆంక్షలు విధించలేదు . పూర్తి స్వేచ్ఛ ఉండేది . ఐతే రాజ్యసభ కోపం తో పిసిసి అధ్యక్షుని పైన రెగ్యులర్ గా, ysr పై అప్పుడప్పుడు రాయించేవారు . ఓ సారి వైయస్ ఆర్ కోపంతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాజ్యసభ టికెట్ దక్కక పోవడంతో తనపై కోపం తో రాయిస్తున్నారని చెడా మాడా తిట్టేసారు . ఆఫీస్ లో స్టాఫ్ తో వ్యవహరించినట్టు రాజకీయాల్లో నాయకులతో వ్యవహరిస్తే ఎలా అని మిత్రులం మాలో మేం అనుకునేవాళ్లం . గవర్నర్ లలో నరసింహన్ ది రికార్డ్ అయితే ఉమ్మడి రాష్ట్రం లో పిసిసి అధ్యక్షుల్లో ఎం . సత్యనారాయణ రావుది రికార్డ్ . తొలి పిసిసి అధ్యక్షుడు నీలం సంజీవరెడ్డి కాలం నుంచి రాష్ట్ర విభజన వరకు ఎక్కువ కాలం పిసిసి అధ్యక్షునిగా ఉన్నది సత్యనారాయణ . 2000 నుంచి 2004 వరకు సత్యనారాయణ పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు . రెండు పత్రికల ఓనర్ లు ఇద్దరి మీద కట్టి కడితే ఇద్దరు తమ తమ పదవుల్లో అత్యధిక కాలం ఉన్న రికార్డ్ సృష్టించడం విశేషం . - బుద్దా మురళి

24, జూన్ 2023, శనివారం

రాజాలా అనుభవించాడు - అటెండర్ లా బతుకీడ్చాడు .. సీఎం తో టిఫిన్ .. ప్రధానితో లంచ్ చేయాలి అంటే జర్నలిజంలోకి రండి ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -56

రాజాలా అనుభవించాడు - అటెండర్ లా బతుకీడ్చాడు .. సీఎం తో టిఫిన్ .. ప్రధానితో లంచ్ చేయాలి అంటే జర్నలిజంలోకి రండి ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -56 ------------------------------------------------------------------------- మాసిన బట్టలతో దాదాపు 60 ఏళ్ళ వయసున్న అతను సంగారెడ్డి లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందరికీ టీ ఇచ్చేవాడు . అటెండర్ గానే పరిచయం . అక్కడికి వచ్చే నాయకులు ఎంతో కొంత ఇస్తే అదే అతని బతుకు తెరువు . ఓ రోజు ఎందుకో హఠాత్తుగా అప్పటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి చరణ్ మురళి అతను ఎవరో నీకు తెలుసా? అని అడిగాడు . అటెండర్ గురించి తెలుసా అని అడగడానికి ఏముంటుంది ? అనిపించింది . సంగడు తెలియక పోవడం ఏముంది అన్నాను . అప్పటి వరకు నాకు తెలిసిన అతని పేరు సంగడే .. అందరూ అతన్ని సంగడు అనే పిలిచే వారు . అతని పేరు సంగడు కాదు , సంగమేశ్వర్ రావు గారు అని స్వామిచరణ్ చెప్పుకొచ్చారు . హైదరాబాద్ లో నాలుగురైదుగురికి మాత్రమే ఏసీ కారు ఉన్న రోజుల్లో అతను హైదరాబాద్ లో అడుగు పెట్టాడు అంటే అతనికోసం ఏసీ కారు వచ్చేది అని చెబితే నమ్మలేక పోయాను . 1988-89 ప్రాంతంలో సంగారెడ్డిలో జిల్లా రిపోర్టర్ గా ఉన్నప్పుడు మాజీ స్పీకర్ పి రామచంద్రారెడ్డి బిల్డింగ్ లోనే జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఉండేది . అక్కడే సంగడు పరిచయం . స్వామి చరణ్ చెప్పింది నమ్మలేక సంగమేశ్వర రావు గారు సంగడు గా ఎలా అయ్యాడు అని అతన్నే అడిగాను . ****** ఉదయం సీఎంతో టిఫిన్ చేసి , మధ్యాన్నం ప్రధానితో లంచ్ చేయాలి అంటే జర్నలిజం లోకి రండి .. ఇలానే సాగేది హైదరాబాద్ లో ఓ ప్రైవేటు జర్నలిజం స్కూల్ ప్రకటన . ఇప్పుడు కనిపించడం లేదు కానీ ఓ 20 ఏళ్ళ క్రితం ఈ ప్రకటన రోజూ కనిపించేది .నిజంగా జర్నలిస్ట్ ల జీవితం అంత అద్భుతంగా ఉంటుందా ? ఇప్పుడు కాదు ఎప్పుడూ అంత అద్భుతంగ లేదు . ఉండదు . సీఎం లకు , పిఎంలకు మరే పని లేనట్టు జర్నలిస్ట్ లతో టిఫిన్ చేయడం , లంచ్ చేయడమే పనా ? ఇంట్లో భార్యా పిల్లలకు జ్వరం వచ్చినా ఆస్పత్రికి వెళ్లేంత సమయం ఉండదు . కానీ ఓ సినిమా యాక్టర్ భార్య ప్రసవిస్తే గంటల తరబడి ఎండలో కెమెరాలతో ఆస్పత్రి వద్ద పడికాపులు కాయాలి . వాస్తవానికి , ప్రకటనలకు ఎంత తేడా ఉంటుందో ఈ ప్రకటన , ఆస్పత్రి వద్ద పడిగాపులు కాసిన జర్నలిస్టుల ఫోటోనే సాక్ష్యం . ప్రజాప్రతినిధులు , అధికారులు , చివరకు అందరినీ వణికించే లోకల్ గుండాలు సైతం నమస్తే అన్నా అని పలకరించడం మద్యం కన్నా మత్తుగా ఉంటుంది . సగం జీవితం ... అయిపోయాక ఆ మత్తు దిగి అసలు జీవితం అర్థం అవుతుంది . నక్సలైట్ల నాయకుడిగా ల క్షల రూపాయల డెన్ బాధ్యతలు నిర్వహించి , తరువాత జర్నలిజం లోకి వచ్చి తమను తాము కంట్రోల్ చేసుకోలేక దయనీయమైన స్థితిలో చనిపోయిన జర్నలిస్ట్ మిత్రులు తెలుసు .... ఓ వీడియో ఆ మధ్య బాగా పాపులర్ అయింది . టివి 9 రిపోర్టర్ అంటే లోకల్ గా చాలా శక్తి వంతుడు అని అర్థం . ఆ శక్తి మొత్తం చేతిలో లోగో ఉన్నంత వరకే . లోగో లాగేసుకుంటే నీటిలో నుంచి బయట పడ్డ చేపలా గిలగిల కొట్టుకుంటారు . ఏం జరిగిందో అతన్ని ఛానల్ నుంచి తీసేస్తే టివి 9 స్టూడియోలో రవిప్రకాష్ కాళ్ళు పట్టుకొని బతిమిలాడుతున్నాడు . ఎవరో దీన్ని వీడియో తీశారు . కొంతకాలానికి రవిప్రకాష్ ను కూడా ఇలానే బయటకు పంపారు . అలానే గిలగిల కొట్టుకున్నా , డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంకో ఛానల్ పెడతారు , ఛానల్ పెట్టే వారు దొరుకుతారు . అలాంటి వారి పరిస్థితి వేరు . కానీ ఛానల్ లోగో ను చూసుకొని తమంతటి మొనగాడా లేదు అనుకునే వారు , లోగో లాగేసుకుంటే హీరో నుంచి ఒక్కసారి గా జీరో అవుతారు . మారిన కొత్త జీవితాన్ని జీర్ణం చేసుకోవడం అంత ఈజీ కాదు . ఎడిటర్ గా ఉన్నప్పుడు తలపొగరుతో ఉండే ఒకరు పీకేశాక ఓ జర్నలిస్ట్ తో చాలా సేపు ఆప్యాయంగా మాట్లాడారు . అది నిజమా అని అతను నమ్మలేక పోయాడు . కలిసిన వారందరికీ ఈ విషయం చెప్పుకున్నాడు . ఇందులో నమ్మక పోవడానికి ఏముంది ? పీకేసిన ఎడిటర్ ను పలకరించే వాడు ఎవడు ? నువ్వు కలిశావు కాబట్టి అంత ఆప్యాయంగా మాట్లాడాడు అని చెప్పాను . లోకల్ రిపోర్టర్ ( స్ట్రింగర్ ) మరణించినప్పుడు చందాలు వేసుకొని దహన సంస్కారాలు చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి ... ***** ఇది సరే ముందు సంగమేశ్వర రావు సంగడు గా ఎలా మారాడో అది చెప్పు అంటున్నారా ? అక్కడికే వస్తున్నాను . ఇదే ప్రశ్నను సంగడిని అడిగితే ... ***** మదన్ మోహన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా పాపులర్ . ముఖ్యమంత్రి తరువాత అంతటి వైభవం . సంగడు మదన్ మోహన్ కు ఆత్మ లాంటి వాడు . చేయని పాపం లేదు .. ఆడ పిల్లల ఉసురు తగిలింది . మదన్ మోహన్ రాజకీయ జీవితం ముగిసింది . నా జీవితం ఇలా అయింది . అనుకుంటాం కానీ పాపం తగులుతుంది సార్ అంటూ .. చాలా విషయాలు పశ్చాత్తాపం తో చెప్పుకొచ్చాడు . చాత నైతే నలుగురికి మంచి చేయాలి , లేదా ఊరికే ఉండాలి . అన్యాయం చేస్తే ఏదో రూపంలో పాపం మనకు చుట్టుకుంటుంది అని నా నమ్మకం . ఇది మూఢనమ్మకం అన్నా నాకు అభ్యన్తరం లేదు . మనిషిని మనిషిగా ఉండేట్టు చేసే మూఢ నమ్మకం ఐనా నాకు ఇష్టమే . సీఎం లతో టీ తాగి , పీఎం లతో లంచ్ చేస్తాం అనే భ్రమలు ఎంత త్వరగా వీడితే అంత మంచిది . వాస్తవంలో జీవించి , ప్రాక్టికల్ గా ఆలోచించాలి . మహా మహులే రాలిపోయారు , లోగోలతో మనకెందుకు అహంకారం . - బుద్దా మురళి

23, జూన్ 2023, శుక్రవారం

610 జీవో లో కెసిఆర్ పప్పులో కాలేశాడన్న మీడియా టివి వార్తల లెక్కలు బయటపెట్టిన బాబు.... జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 56

610 జీవో లో కెసిఆర్ పప్పులో కాలేశాడన్న మీడియా టివి వార్తల లెక్కలు బయటపెట్టిన బాబు జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 56 ------------------------------------- ఒక అంశాన్ని అందరూ ఒకే కోణం లో చూడాలని లేదు , చూడాల్సిన అవసరం లేదు . మీడియా ఒక కోణం లో చూస్తే రాజకీయ నాయకులు మరో కోణం లో చూస్తారు . ఈ రోజుల్లో అయితే మొత్తం మీడియా కూడా ఒకే కోణంలో చూడదు . తమ తమ మీడియా రాజకీయ అనుబంధ కోణం లో చూస్తే , రాజకీయ పక్షాలు తమ పార్టీ కోణంలో చూస్తాయి . చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విద్యుత్ చార్జీలు పెంచడం , రైతుల ఆందోళన బషీర్ బాగ్ లో కాల్పులు రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకువచ్చాయి . బషీర్ బాగ్ వద్ద కాల్పులు జరిగాయని తెలిసి అసెంబ్లీ వద్ద ఉన్న మీడియా ఏం జరిగింది అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే అప్పుడు మీడియా పెద్దలు తీవ్రవాదులు అసెంబ్లీ ముట్టడికి వచ్చి కాల్పులు జరిపారు అంటే కొద్ది సేపు నిజమే అనిపించింది . తరువాత అసలు విషయం తెలిసింది . తీవ్రవాదులు అని బాబు మీద అభిమానం తో ప్రచారం చేసినా / నమ్మినా , ఈ వ్యవహారం బాబు కొంప ముంచింది . 2004 లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి కానీ , కాల్పులు జరిగిన రోజే బాబు ఓటమి ఖాయం అయింది . అప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కెసిఆర్ విద్యుత్ చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా లేఖ రాయడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు . తెరాస ఆవిర్భావం తరువాత చేపట్టిన తొలి అంశం 610 జీవో . ఈ జీవో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వచ్చింది . ఇతర ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో నిబంధనలకు వ్యతిరేకంగా తెలంగాణలో పని చేస్తున్నారని , 610 జీవో ప్రకారం వారిని తమ తమ ప్రాంతాలకు పంపాలని తెరాస పెద్ద ఎత్తున ఆందోళన జరిపింది . ఆందోళన ప్రభావం తీవ్రంగానే కనిపించింది . **** అసెంబ్లీ సమావేశాలు . 610 జీవో పై ఆందోళన తరువాత జరుగుతున్న తొలి సమావేశం కాబట్టి సభలో పెద్ద ఎత్తున గందరగోళం తప్పదు అనుకున్నారు . సుదీర్ఘమైన చర్చ తరువాత హౌస్ కమిటీ వేయాలి అని కెసిఆర్ డిమాండ్ . ఓస్ ఇంతేనా ? వేసేద్దాం అని బాబు ప్రకటించారు . సాధారణం గా హౌస్ కమిటీలో అధికార పక్షం సభ్యులు ఎక్కువ మంది ఉంటారు . ఛైర్మెన్ కూడా అధికారపక్షమే కాబట్టి హౌస్ కమిటీకి అధికార పక్షం సాధారణంగా వెనుకాడదు . శాసన సభ ప్రశాంతంగా ముగిసింది . మీడియా షాక్ తిన్నది . సభ దద్దరిల్లి పోతుంది , బ్రహ్మాండంగా కవరేజ్ చేయవచ్చు అనుకున్న మీడియా ఒక్క సారిగా ఢీలా పడింది . వ్యూహం తప్పింది , కెసిఆర్ ఏదో చేస్తాడు అనుకుంటే తుస్సుమనిపించారు అని మీడియా కామెంట్స్ . సభలో మైకులు విరిచేస్తారు , బల్లలు విరిగిపోతాయి అని ఆశించిన వారు ఇలా జరిగిందేమిటి అనుకోవడమే కాకుండా తప్పుడు వ్యూహం అని కామెంట్స్ చేశారు . ఉమా సుధీర్ అని ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ హౌస్ కమిటీకి ఒప్పుకొని మౌనంగా ఉండిపోవడం తప్పుడు వ్యూహం అని అంటున్నారు అని ప్రస్తావిస్తే .... అంతకు ముందే మీడియా సమావేశంలో మాట్లాడి వెళ్లిపోతున్న కెసిఆర్ ను కలిసి ఇలా అనుకుంటున్నారు అని ప్రస్తావించాను . గొడవ చేస్తే ఒక్క రోజు పెద్ద వార్త అవుతుంది అంతే కదా ? కానీ హౌస్ కమిటీ వేస్తే ఏమవుతుందో వారికి తెలియదు . హౌస్ కమిటీ సమావేశం అయిన ప్రతిసారి తెలంగాణకు జరిగిన అన్యాయం , తెలంగాణకు దక్కాల్సిన ఉద్యోగాలు , ఇతర ప్రాంతాల వారు ఎంతమంది తెలంగాణ లో పని చేస్తున్నారో శాఖల వారిగా చర్చ ఉంటుంది . ఒక రకంగా హౌస్ కమిటీ అనేది తెలంగాణ ఉద్యమాన్ని ప్రచారం చేస్తుంది అని చెప్పుకొచ్చారు . నిజంగా జరిగింది అదే . సాధారణంగా హౌస్ కమిటీ అనేది ఒక ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేస్తే అదే ప్రభుత్వ హయాంలో తన పని ముగించి నివేదిక ఇస్తుంది . కానీ తొలుత చంద్రబాబు హయాంలో రేవూరి ప్రకాష్ రెడ్డి ఛైర్మెన్ గా హౌస్ కమిటీ వేస్తే అనేక సార్లు సమావేశాలు జరిగాయి . తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛైర్మెన్ గా 610 జీవో పై హౌస్ కమిటీ ఏర్పాటు చేశారు . ఈ కమిటీ ఏర్పాటు వల్ల ప్రతి ప్రభుత్వ శాఖలో, ప్రతి కార్యాలయంలో తెలంగాణ వాదం వినిపించింది .తమ కార్యాలయంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఎంత మంది ఉద్యోగులు ఉన్నారో కార్యాలయాల వారీగా నాయకులకు వివరాలు ఇచ్చేవారు . ఉద్యోగుల్లో తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి ఇది బాగా దోహదం చేసింది . కమిటీ నివేదిక ప్రకారం అప్పటి వైస్సార్ ప్రభుత్వం తెలంగాణ లో ఉన్న ఆంధ్ర ఉద్యోగులు తమ సొంత ప్రాంతాలకు వెళ్ళమని ఒక వైపు ఆర్డర్ ఇస్తూ మరోవైపు కోర్ట్ కు వెళ్లి స్టే తెచ్చుకోమని సలహా ఇచ్చారు . స్టే వల్ల ఒక్క ఉద్యోగి కూడా తరలి వెళ్ళలేదు . అలానే జరుగుతుంది అని అందరికీ తెలుసు . ఐతే తెలంగాణ వచ్చిన తరువాత ఏ ప్రాంతం ఉద్యోగులు ఆ ప్రాంతానికి వెళ్ళ వలసి వచ్చింది . *** మీడియా ఆశించినట్టు సభలో 610 పై భీభత్సం సృష్టిస్తే మీడియాకు మసాలా వార్త దొరికేది కానీ .. తెలంగాణకు నష్టం జరిగేది .... బాబు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఇదే విధంగా మీడియా అంచనా తప్పింది . ఇప్పుడు అమరవీరుల స్మృతి చిహ్నం అమర జ్యోతి నిర్మించిన జల దృశ్యం స్థలంలో తెరాస పార్టీ కార్యాలయం ఉండేది . రాత్రికి రాత్రి పోలీసులు కార్యాలయంలోని వస్తువులు బయట పడేసి ప్రభుత్వ స్థలం అని స్వాధీనం చేసుకున్నారు . దీనివల్ల గొడవ తప్పఁదని మీడియా మొత్తం అక్కడికి పరుగు తీసింది . అక్కడికి చేరిన నాయకులకు కెసిఆర్ ఫోన్ చేసి ఎలాంటి గొడవ చేయవద్దు అని చెప్పి ఒక అద్దె భవనాన్ని మాట్లాడి ఆ వస్తువులు అన్నీ అక్కడకు తరలించారు . అక్కడికి వెళ్లిన మీడియా విస్తుపోవాల్సి వచ్చింది .. **** హింసకు చోటు లేకుండా ఉద్యమించడం వల్లనే తెలంగాణ సాకారం అయింది . హింసతో ఎలక్ట్రానిక్ మీడియాలో బోలెడు ప్రచారం లభించేదేమో కానీ ..కానీ తెలంగాణ సాధనకు ఉపయోగపడేది కాదు . ***** ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు టీడీపీ ఓ ఆశ్చర్యకరమైన లెక్కలు బయటపెట్టింది . దాదాపు డజను న్యూస్ ఛానల్స్ ఉంటాయి . కొద్ది మంది సిబ్బంది షిప్టుల వారీగా 24 గంటల పాటు టివి ఛానల్స్ చూస్తూ ఏ ఛానల్ ఏ పార్టీ వార్తలు ఎంత సమయం చూపిందో జాబితా తయారు చేసేవారు . ఓ సారి విలేకరుల సమావేశంలో బాబు మీడియా సమయంలో ఛానల్స్ రాజకీయ పార్టీలకు వార్తల్లో కేటాయించిన సమయం పై ఈ వివరాలు చదివి వినిపించారు . టివి వార్తల కోసమే పాలన , రాజకీయాలు చేసేవారు ప్రాముఖ్యత ఇచ్చేది ఇలాంటి వివరాలకే ...ఉమ్మడి రాష్ట్రంలోని సగం ప్రాంతంలో 23 సీట్లకు పరిమితం అయిన తరువాత కూడా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో ? వార్తలకు ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలో తెలిసిందో లేదో తెలియదు . ఛానల్స్ ది వారి వ్యాపారం వారిది , నిముషాలు , క్షణాలు లెక్కించడం రాష్ట్రాన్ని పాలించిన , పాలించాలి అనుకుంటున్న పార్టీకి ప్రాధాన్యతా అంశం కాకూడదు . ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా క్షణాలు , నిముషాలు లెక్కించడం జరపలేదు . దూరదర్శన్ మాత్రమే ఉన్నప్పుడు బిజెపి , ఇతర పక్షాలు రాజీవ్ దర్శన్ గా మారింది అని విమర్శించాయి కానీ , ఎప్పుడూ ఏ పార్టీ కూడా క్షణాలు , నిముషాలు లెక్కించలేదు . న్యూస్ కూడా వ్యాపార వస్తువే ఛానల్స్ కు వారి వ్యాపారం వారికి ముఖ్యం , రాజకీయ పార్టీలు తమకు ఏది ముఖ్యమో దానిపై దృష్టి పెట్టాలి . కుక్క తోకను ఆడించవద్దు , తోక కుక్కను ఆడించవద్దు .. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి . - బుద్దా మురళి

22, జూన్ 2023, గురువారం

అక్షయ పాత్ర హైదరాబాద్ ... ఈ నగర నిర్మాణ ముహూర్తంలో ఏదో మహత్తు ఉంది .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -55

అక్షయ పాత్ర హైదరాబాద్ ఈ నగర నిర్మాణ ముహూర్తంలో ఏదో మహత్తు ఉంది .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -55 ----------------------------------- ముహూర్తాల మీద నమ్మకం ఉన్నా లేకున్నా ... హైదరాబాద్ నగరాన్ని ఐదు వందల ఏళ్ళ క్రితం ఏదో అద్భుతమైన ముహూర్తంలోనే నిర్మాణాన్ని ప్రారంభించి ఉంటారు . లేక పోతే అక్షయ పాత్రలా ఎంతమంది వచ్చినా ఎలా తిండి పెడుతుంది . .. ***** హలో ఎక్కడున్నావ్ ? అని ఉదయం ఓ జర్నలిస్ట్ మిత్రుడికి ఫోన్ చేస్తే ట్రాఫిక్ లో చిక్కుకున్నా 45 నిముషాలు అయినా ఆఫీస్ కు చేరుకోలేక పోయాను అని చెప్పి .. ఉద్యమ కాలం నాటి విషయాలు కొన్ని గుర్తు చేశారు . తెలంగాణ ఏర్పడి మేం ఆంధ్రకు వెళ్ళిపోతే మీ రోడ్ల మీద మనుషులు కనిపించరు అని భవిష్యత్తును కళ్ళకు కట్టినట్టు చూపించాడట లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ లో సీనియర్ రిపోర్టర్ ఒకరు . . నిజానికి ఈ పదేళ్లలో హైదరాబాద్ కు బతుకు తెరువు వెతుక్కుంటూ వచ్చిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది . పురాణాల్లో అక్షయ పాత్ర ఎంత మంది తిన్నా వడ్డించేందుకు ఇంకా తిండి ఉండేదట ... అక్షయ పాత్ర నిజమో కాదో తెలియదు కానీ హైదరాబాద్ నిజంగా అక్షయ పాత్రనే .. బతకడానికి ఎంత మంది వచ్చినా వారికి బతుకు తెరువు చూపుతూ కడుపులో పెట్టుకొని దాచుకుంటుంది . ఇంకెంత మంది వచ్చినా అక్కున చేర్చుకుంటూనే ఉంది . ఏ ఆసరా లేకుండా పెద్ద కుటుంబంతో బతుకుతెరువు కోసం హైదరాబాద్ ను ఆశ్రయించిన లక్షల కుటుంబాల్లో మాది ఓ కుటుంబం . మిత్రుడితో మాట్లాడుతుంటే తెలంగాణ ఉద్యమ కాలం లో చాలా మంది హైదరాబాద్ ఏమవుతుంది అన్న సందేహాలు గుర్తుకు వచ్చాయి . **** తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్షం కార్యాలయం లో ఉన్నప్పుడు గాలి ముద్దు కృష్ణమ నాయుడు వచ్చారు . తెలంగాణ ఉద్యమం చివరి దశ . విలేకరుల సమావేశాల్లో మాట్లాడే గాలి ముద్దు కృష్ణమ నాయుడు వేరు . మాములుగా ఉన్నప్పుడు మాట్లాడే ముద్దు వేరు . మా వాళ్ల్లు చాలా మంది ఆదిలాబాద్ లో లెక్చరర్లు గా పని చేస్తున్నారు అని ఏదో చెబుతుంటే .. అదేంటీ మీది చిత్తూరు జిల్లా కదా ? మీతో పని చేసిన లెక్చరర్లు చిత్తూరులో ఉంటారు కానీ ఆదిలాబాద్ లో ఏంటీ ? అంటే .. నేను విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మా వాళ్ళు చాలా మందిని నేనే లెక్చరర్లుగా నియమించెను అని నవ్వుతూ చెప్పారు . అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది అని వెంటనే బదులిచ్చాను . ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ముద్దు కృష్ణమ నాయుడు విద్యాశాఖ మంత్రి . ఆ కాలంలో నియామకాలకు ఇష్టానుసారంగా చేసే అవకాశం ఉండేది . ముద్దు ఎన్టీఆర్ కు నమ్మిన బంటు . 94లో టీడీపీ విజయం సాధించాక బాబు ను అనుమానంగా చూస్తూ ఒక దశలో స్పీకర్ గా గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఉంటే బాగుంటుంది అని పరిశీలించారు . ఎందుకో సాధ్యం కాలేదు . యనమల స్పీకర్ గా ఉండి ఎన్టీఆర్ కు అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెన్నుపోటు విజయవంతం కావడంలో తన వంతు పాత్ర పోషించారు . గాలి స్పీకర్ గా ఉంటే ఎలా ఉండేదో ? **** ఉద్యమం చివరి దశకు చేరుకున్న సమయంలో అసెంబ్లీ లాబీ లో ముద్దు అనేక విషయాలు చెప్పారు . తెలుగుదేశం లో ఉన్న తెలంగాణ నాయకులు ఒకరిద్దరు తప్ప ఎవరూ పార్టీ విడిచి పోరు . నాకు కాంగ్రెస్ , టీడీపీ రెండింటితో అనుబంధం ఉంది . కాంగ్రెస్ లో మన ఖర్చు మనమే భరించాలి , కానీ అదే టీడీపీలో అయితే టికెట్ ఇస్తారు , ఎన్నికల్లో ఖర్చుకు డబ్బు ఇస్తారు . చివరకు పరిశీలకులుగా ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తే ప్రయాణానికి టికెట్ కూడా పార్టీ నుంచే ఇస్తారు . ఇంత సౌకర్యం వదిలి ఎవరు పోతారు అని గాలి విశ్లేషించారు . ఆ సమయంలో అతని అంచనా నిజమే అని తేలింది . ఐతే హైదరాబాద్ గురించి గాలి అంచనా తలక్రిందులు అయింది . ***** అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పై చర్చ రోజు గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఓ లెక్క చెప్పారు . ఆ రోజుకు హైదరాబాద్ నగరంలో ఎన్ని నిర్మాణాలు జరుగుతున్నాయో ఓ లెక్క చెప్పి .. ఒక వేళ తెలంగాణ వస్తే ఈ నిర్మాణాలు ఆగిపోతాయి . ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న వారు పెద్ద సంఖ్యలో వెళ్ళిపోతారు . ఒక వైపు నిర్మాణాలు ఆగిపోవడం , మరో వైపు ఖాళీ కావడం ఆలోచించు ఎలా ఉంటుందో అని తన మనసులో ముద్రించుకున్న ఖాళీగా ఉన్న హైదరాబాద్ రూపాన్ని ప్రదర్శించారు . అదే సమయంలో యన్ టివి లో బెంగళూరులో జరిగే భారీ నిర్మాణాల దృశ్యాలు చూపుతూ హైదరాబాద్ ఖాళీ అయింది అంతా బెంగరులు వెళ్లారు అని ఉత్సాహంగా స్టోరీలు వండి వార్చారు . ఇప్పటికీ అవకాశం చిక్కినప్పుడల్లా హైదరాబాద్ ను తమ వార్తల ద్వారా ఖాళీ చేయాలనీ చూస్తారు . ఏ వార్త లేక పోతే టివి 9 వాళ్ళు యుగాంతం వార్త , ntv వాళ్ళు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఢమాల్ అనే ప్రత్యేక స్టోరీలు చూపుతారు . ఓ సారి సాక్షి వాళ్ళు ఓ అడుగు ముందుకు వేసి కరోనా సమయంలో రియల్ ఎస్టేట్ పై ఓ చిత్రమైన వార్త వేశారు . కొన్న ధర కన్నా పదింతలు తక్కువకు అమ్ముతాము అన్నా ఎవరూ రావడం లేదు అని రాశారు . పదింతలు అంటే అంటే ఉచితంగా ల్యాండ్ ఇచ్చి డబ్బుకు కూడా ఇవ్వడం అన్నమాట . గతంలో ప్రధాన మంత్రికి మీడియా సలహాదారుగా పని చేసిన సంజయ్ బారువా కూడా తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ ఏదో అవుతుంది అనుకున్నాను . కానీ నా భయాలు పటాపంచలు అయ్యాయి . అద్భుత ప్రగతి సాధించింది అన్నారు . ఆ రోజుల్లో మీడియా చూపించిన భయం ఆ స్థాయిలో ఉండేది . బారువా లాంటి వారిని కూడా భయపెట్టేట్టుగా ... సరే ముద్దు కృష్ణమ చెప్పిన లెక్క ఏమైంది ? ఆ భవనాల నిర్మాణం ఆగిపోయిందా ? అంటే అది తెలియదు కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత గాలి ముద్దు కృష్ణమ నాయుడు కుమార్తె డాక్టర్ హైదరాబాద్ లో ఓ పెద్ద ఆస్పత్రి నిర్మించారు అది తెలుసు . *** నేను కన్నెర్ర చేస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మొత్తం పోతుంది అని సీఎంగా ఉన్నప్పుడు హెచ్చరించిన చంద్రబాబు విజయవాడలో అద్దె భవనంలోనే ఉన్నా , హైదరాబాద్ లో మాత్రం పెద్ద భవనం నిర్మించుకున్నారు . బుద్దా మురళి

21, జూన్ 2023, బుధవారం

దాన వీర కర్ణ ముహూర్తం సూపర్ హిట్ ఎన్టీఆర్ , బాబు ముహూర్తం అట్టర్ ప్లాప్ .. ఫలించని జోస్యం జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 54 ---------------------

దాన వీర కర్ణ ముహూర్తం సూపర్ హిట్ ఎన్టీఆర్ , బాబు ముహూర్తం అట్టర్ ప్లాప్ .. ఫలించని జోస్యం జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 54 ------------------------------------------ ^^ ఎన్టీఆర్ గారు నేను చెబుతున్నాను నా మాట వినండి . మీరు సినిమాను సంక్రాంతికి విడుదల చేయండి . సూపర్ హిట్ అవుతుంది ^^ అని అతను చెప్పగానే భలే వారే ఇంకా పదిహేను రోజులు కూడా లేదు . ఎలా సాధ్యం అని ఎన్టీఆర్ అనుమానం వ్యక్తం చేస్తే , నేను చెబుతున్నాను ఏమీ కాదు సంక్రాంతికి నేను ముహూర్తం ఖరారు చేశాను. తరువాత నన్ను అనొద్దు మీ ఇష్టం . ఆ మాటతో ఎన్టీఆర్ సినిమాను సంక్రాంతికి విడుదల చేశారు . ఆ సినిమా ఓ చరిత్ర సృష్టించింది . ఆ సినిమా దాన వీర శూర కర్ణ . అదే సమయంలో సాంకేతిక విలువలతో కృష్ణ కురుక్షేత్రం సినిమా తీశారు . దాన వీర శూర కర్ణ సాంకేతిక అంశాల్లో కురుక్షేత్రం ముందు పేలవంగా ఉన్నా , ఎన్టీఆర్ నటన , డైలాగులు , పాటలతో ఒక చరిత్ర సృష్టించింది . ఆ సినిమాకు ముహూర్తం పెట్టింది బివి మోహన్ రెడ్డి . అంతకు ముందే ఎన్టీఆర్ కు బివి మోహన్ రెడ్డి మాట మీద , ముహూర్తం మీద గురి . దాన వీర శూర కర్ణ విజయం తో మోహన్ రెడ్డి మాట మీద మరింత గురి కుదిరియింది . అడవి రాముడు షూటింగ్ నుంచి ఎన్టీఆర్ కర్నూల్ లో ఉన్న బివి మోహన్ రెడ్డికి ఫోన్ ముందు నేను భయపడ్డాను కానీ మీ మాట మీద నమ్మకం తో సంక్రాంతికి విడుదల చేశా , మన సినిమా చరిత్ర సృష్టిస్తోంది అని మెచ్చుకున్నారు . అదొక్కటే కాదు మిత్రులతో సరదాగా మాట్లాడుతూ నామినేట్ పోస్ట్ తీసుకోవలసిన కర్మ నాకేందుకు పోటీ చేస్తాను మంత్రిని అవుతాను అని ఐదేళ్ల ముందే మీడియా మిత్రుల ముందు తన గురించి తాను చెప్పుకున్న జోస్యం కూడా నిజమైనది . జోతిష్యం లో అతనికి తిరుగులేదు అని పేరుంది . . అతని మాటకు తిరుగులేకుండా పోయింది . ఎన్టీఆర్ పక్కన ఆయనకు చోటు పర్మనెంట్ అయిపొయింది . 95లో ఎన్టీఆర్ ను వెన్నుపోటుతో దించేశాక , ఎన్టీఆర్ మళ్ళీ సీఎం అవుతారు అని జోస్యం చెప్పారు . మరి అయ్యారా ? లేదు ఏకంగా పైకే పోయారు . ఎవరు ? ఎన్టీఆర్ .. ***** ^^ బివి మోహన్ రెడ్డి కర్నూల్ లో ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నా ప్రముఖ రాజకీయ నాయకులకు సన్నిహితులు . జలగం వెంగళరావు , మర్రి చెన్నారెడ్డి సీఎం లుగా ఉన్నప్పుడు సన్నిహితులు . 1978 లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు కర్నూల్ జిల్లా రాజకీయాల్లో శేషాద్రి అనే జర్నలిస్ట్ ప్రముఖులు . వారి ఇంట్లోనే రాజకీయ నాయకులు సమావేశం అయి చర్చించుకునేవారు . మర్రి చెన్నారెడ్డి శాసన మండలి సభ్యులను ఖరారు చేశారు . సంతోషమ్మ అనే మహిళను మండలి సభ్యురాలిగా నియమించారు . అప్పుడు సమితి ప్రెసిడెంట్ గా తరువాత కోట్ల హయాంలో మండలి సభ్యులుగా పని చేసిన యస్ . రఘురామిరెడ్డి బివి మోహన్ రెడ్డితో సరదాగా మాట్లాడుతూ మీ మిత్రుడు మర్రి చెన్నారెడ్డి సీఎంగా ఉన్నారు , సంతోషమ్మను కూడా మండలి సభ్యురాలిని చేశారు , మరి నువ్వెప్పుడూ mlc అవుతున్నావు అంటే , మండలి ద్వారా నాకేం కర్మ .. నేరుగా పోటీ చేస్తా , మంత్రిని అవుతాను అని 78లో చెప్పారు , 83లో నిజంగానే పోటీ చేశారు , మంత్రి అయ్యారు . .78లో మోహన్ రెడ్డి ఆ మాట చెప్పినప్పుడు అందరూ తేలిగ్గా తీసుకున్నారు . ఐదేళ్ల తరువాత నిజం అయ్యాక అయన చెప్పే జ్యోతిష్యం మీద , ముహూర్తాల మీద గురి కుదిరింది . . . బివి మోహన్ రెడ్డి కర్నూల్ జిల్లాలో ఇంజనీర్ గా పని చేస్తున్నప్పుడు చెప్పిన జోస్యం నీకు ఎలా తెలుసు అని సందేహం కదా ? మోహన్ రెడ్డి ఇంజనీర్ గా కర్నూల్ జిల్లాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు హిందూ రిపోర్టర్ గా అక్కడ దాసు కేశవరావు ఉండేవారు . తరువాత హైదరాబాద్ లో హిందూ బ్యూరో చీఫ్ గా టీడీపీ చూసేవారు .తరువాత రెసిడెంట్ ఎడిటర్ అయ్యారు . మాటల సందర్భం లో మోహన్ రెడ్డి జోస్యం గురించి చెప్పారు . మోహన్ రెడ్డి కూడా నేను చెప్పిన జోస్యం నిజమైంది కావాలంటే కేశవరావును అడగండి అనే వారు . ఎన్టీఆర్ కు దైవం మీద నమ్మకం ఉండేది కాదు, కానీ మోహన్ రెడ్డి జ్యోతిష్యం మీద అపారమైన నమ్మకం ఉండేది . ఇద్దరి మధ్య బంధం ఎలా ఏర్పడిందో కానీ ఎన్టీఆర్ సినిమా హీరోగా ఉన్నప్పటి నుంచే మోహన్ రెడ్డి జోస్యం మీద మంచి గురి . ఏ కార్యం అయినా మోహన్ రెడ్డి ముహూర్తం పెట్టాల్సిందే ... ****** 1995 ఆగస్టు లో ఎన్టీఆర్ ను దించేసిన తరువాత కూడా దాదాపు 30 మంది శాసన సభ్యులు ఎన్టీఆర్ శిబిరంలోనే ఉండేవారు . వారిలో బివి మోహన్ రెడ్డి ఒకరు . మీడియా పెద్దగా ప్రచారం కల్పించేది కాదు కానీ ఈ 30 మంది రోజూ ఏదో ఒక నీరసన కార్యక్రమం చేపట్టే వారు . ఓ రోజు అసెంబ్లీ గేటు ముందు బైఠాయించి నిరసన కార్యక్రమం . మీడియా ముందు జ్యోస్యం చెబుతున్నాను అని మోహన్ రెడ్డి ప్రకటన . అంతా గుమిగూడిన తరువాత ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు . నేను జోస్యం చెబుతున్నాను , నిజం అయి తీరుతుంది అన్నారు . బాబు వద్ద ఉన్న శాసన సభ్యులు అందరూ వచ్చేస్తారు , మళ్ళీ ఎన్టీఆర్ సీఎం అవుతారు అని జోస్యం చెప్పారు . ఎన్టీఆర్ మళ్ళీ సీఎం అయ్యే మాట దేవుడెరుగు చనిపోయారు . శాసన సభ్యులు అందరూ ఎన్టీఆర్ వద్దకు వచ్చేస్తారు అని జోస్యం చెప్పిన మోహన్ రెడ్డి ఎన్టీఆర్ మరణించాక మిగిలిన వారితో కలిసి తానే బాబు శిబిరం లో చేరిపోయారు . మరోసారి మీడియా బలవంతం వల్ల 2004 ఎన్నికల ఫలితాలపై ఎన్టీఆర్ భవన్ లో జోస్యం చెప్పారు . టీడీపీకి అప్పుడు రెండువందల పైగానే సీట్లు వస్తాయని ఏదో అంకె చెప్పారు . టీడీపీ గెలుస్తుంది అని ... కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది టీడీపీ చరిత్రలోనే తక్కువ సీట్లు సాధించింది . అంతకు ముందు ఓడిపోయిన చరిత్ర ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో 2004లోనే టీడీపీకి తక్కువ సీట్ల రికార్డ్ . **** 2004 ఎన్నికలకు రోజులు దగ్గర పడ్డాయి . అసెంబ్లీలో హడావుడి . లాబీ లో వెళుతుంటే మోహన్ రెడ్డి ఛాంబర్ . చీఫ్ రిపోర్టర్ చారి నేనూ కలిసి వెళుతున్నాం . మోహన్ రెడ్డి కనిపించ గానే చారి బాబాయ్ ఈ సారి ఎన్నికలు ఎలా ఉంటాయి అని మోహన్ రెడ్డిని అడిగారు . బ్రహ్మాండంగా గెలుస్తాం అని మోహన్ రెడ్డి ధీమాగా చెప్పారు . చీఫ్ రిపోర్టర్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎందుకులే అని వింటూ ఉండిపోయా . కొద్ది సేపు మాట్లాడి ఇద్దరం వెళుతుంటే .. మోహన్ రెడ్డి చేయి పట్టి ఛాంబర్ లోకి లాగాడు . ఎన్నికలు ఎలా ఉంటాయని అనుకుంటున్నావు అని మోహన్ రెడ్డి నన్ను అడిగితే ఒకింత సంతోషం వేసింది . ఇంతకు ముందు అతనే జోస్యం చెప్పి ఇప్పుడు నన్ను అడుగుతున్నారు అనుకోని , బహుశా ఎవరు ఏమనుకున్నా పరవాలేదు అని నిర్మొహమాటంగా చెబుతాను అనే ఉద్దేశం తో అడుగుతున్నారు అనుకోని 1999 లోనే తృటిలో గెలిచారు , ఈ సారి ఓడిపోతారు అని చెప్పాను . ఎన్టీఆర్ అంటే ఓ నమ్మకం ఉండేది .. నేను బాబు వర్గంలో చేరినప్పటి నుంచి మంత్రి పదవి ఇచ్చారు , ఇప్పటికీ మంత్రినే కానీ టికెట్ ఇస్తారా ? ఇవ్వరా ? అనే అనుమానం అంటూ ఎన్టీఆర్ కు బాబుకు తేడా చెప్పుకొచ్చారు . 1978లోనే అంత ధీమాగా జోస్యం చెప్పిన మోహన్ రెడ్డి 2004 నాటికి తనకు టికెట్ వస్తుందో రాదో తనకే తెలియని స్థితికి వచ్చారు . అంతా కాల మహిమ అనిపించింది . బుద్దా మురళి

20, జూన్ 2023, మంగళవారం

మీరు చూసిన తొలి నటుడు గ్లామర్ రాజకీయాలకు కాలం చెల్లిందన్న బాబు చుట్టూ తారలే ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -54

మీరు చూసిన తొలి నటుడు గ్లామర్ రాజకీయాలకు కాలం చెల్లిందన్న బాబు చుట్టూ తారలే జర్నలిస్ట్ జ్ఞాపకాలు -54 ------------------------------------ తొలిసారి మీరు చూసిన సినిమా యాక్టర్ ఎవరో గుర్తున్నారా ? పద్మనాభం తీసిన దేవత సినిమాలో ఓ సన్నివేశం కొత్తగా ఉంది . ఎన్టీఆర్ , సావిత్రి నటించిన ఈ సినిమా పద్మనాభం తీశారు . 1965 లో వచ్చిన సినిమా . ఆ కాలం లో సినిమా తారలు అంటే దేవుళ్ళు అనుకునేంత అభిమానం ఉండేది . ఆ సినిమాలో పద్మనాభం మద్రాస్ వెళ్లి పలువురు సినిమా తారలను కలుస్తారు . సినిమా వాళ్ళ ఇంటిని , ఇంటివద్ద నటులు ఎలా ఉంటారో చూపిన ఈ సీన్ చిన్నప్పుడు అలా మనసులో ముద్రించుకుపోయింది . తామే వెళ్లి తారలను కలుస్తున్నట్టు ఎవరికి వారు భావించేట్టుగా ఉందా దృశ్యం . ప్రతివారికి తాము మొదటి సారి చూసిన నటులు అలా గుర్తుండి పోతారు . ఇప్పుడు హుసేన్ సాగర్ అంటే విషపు నీళ్లలా కనిపిస్తాయి కానీ . ఓ 50 ఏళ్ళ క్రితం శుభ్రంగా ఉండేవి . స్థానికులకు సముద్రం లేని లోటు తీర్చేట్టుగా ఉండేది . స్థానికులు హుసేన్ సాగర్ లో స్నానం చేసేవారు . తొమ్మిదేళ్ల వయసులో మా నాన్న , అన్నలతో కలిసి వెళ్లి తిరిగి వస్తుండగా ట్యాంక్ బండ్ పై ఓ హిందీ సినిమా షూటింగ్ . భారత్ , పాక్ యుద్ధం తరువాత అక్కడ పాకిస్థాన్ నుజయించి తెచ్చిన ట్యాంక్ ఏర్పాటు చేశాక ట్యాంక్ బండ్ అంటున్నారు కానీ అంతకు ముందు హుసేన్ సాగర్ అనే పిలిచేవారు తారల పేర్లు , సినిమా పేరు తెలియదు . ముందు ఓ కారు , హీరోయిన్ ఆకు కూరలు పట్టు కొని వెళుతుంటే చేతి నుంచి పడిపోతాయి . కొద్దిగా పెద్దయ్యాక రహత్ మహాల్ ( ఇప్పుడు రాజా ) లో మార్నింగ్ షో చూస్తే ఆ సినిమా కోరా కాగజ్ అని . జయబాధురి , విజయ్ ఆనంద్ నటించారని తెలిసింది . 1974 ప్రాంతంలో నేను చూసిన తొలి తారలు వీళ్ళే ... అది సరే ఇది వదిలేస్తే ఎంతమంది తారలను చూశావు అని అడిగితే ? నేను తారలను చూసేందుకు వెళ్ళలేదు . తారలే నేనున్నా చోటికి వచ్చారు . ఒక్కరు ఇద్దరు కాదు గుంపులు గుంపులు . మరీ బడాయి అనుకుంటున్నారా ? నిజం తారలు గుంపులు గుంపులుగా వచ్చింది నిజం . ఐతే వారు వచ్చింది నేను ఉన్న చోటుకు .. అంటే చంద్రబాబు ఉన్న ఎన్టీఆర్ భవన్ లో నేనూ ఉన్నాను . వాళ్లంతా బాబు కోసం ప్రచారం చేయడానికి వచ్చారు . ***** చంద్రబాబు ఎన్టీఆర్ ను దించేసిన తరువాత ఎన్టీఆర్ బాబుకు వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టారు . పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి . అప్పుడు బాబు గ్లామర్ రాజకీయాలకు కాలం చెల్లింది అంటూ ఎన్టీఆర్ జమానా ముగిసిపోయింది , పని మంతుడిని అయిన తననే జనం ఆదరిస్తారు అని చెప్పుకొచ్చారు . బాబు తొలి స్టేట్ మెంట్ గ్లామర్ రాజకీయాలకు కాలం చెల్లింది అని చెప్పడమే అయినా తన గ్లామర్ మీద నమ్మకం లేకుండా మొదటి నుంచి చంద్రబాబు సినీ గ్లామర్ పైనే ఆధారపడ్డారు . ఇప్పుడు జగన్ తో ఒంటరి పోరాటం సాధ్యం కాదు అని గ్రహించి పవన్ కళ్యాణ్ మద్దతు సాధించారు . ఇప్పుడే కాదు 95 నుంచి ఇప్పటి వరకు బాబు సినీ గ్లామర్ నే నమ్ముకున్నారు . బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం లో ఎన్టీఆర్ శ్రీ రాముడిగా నటిస్తే సీతగా నటించిన గీతాంజలి , అక్కినేని అందాల రాముడితో నటించిన ఆనాటి గ్లామర్ క్వీన్ లత గుర్తు పట్టనంతగా మారిపోయిన తరువాత ఎన్టీఆర్ భవన్ లో దర్శనం ఇచ్చారు . కర్నూల్ జిల్లా రైల్వే కోడూరు టికెట్ కోసం ఆమె ఎన్టీఆర్ భవన్ చుట్టూ బాగానే తిరిగారు . గీతాంజలి మొదలుకొని బాబు కాలం నాటి లయ వరకూ అందరూ ఎన్టీఆర్ భవన్ లో కనిపించేవారు . అప్పటి మా అధ్యక్షుడు , నటుడు మురళీ మోహన్ వీరందరినీ సమన్వయ పరిచేవారు . షూటింగ్ జరిగేప్పుడు ఏ స్టూడియోకు వెళ్లినా ఐదారుగురు నటులకు మించి కనిపించరు . కానీ ఎన్టీఆర్ భవన్ లో మాత్రం ఎన్నికల సీజన్ వచ్చింది అంటే డజన్ల కొద్ది నటీ నటులు కనిపించేవారు . నిర్మాతలు , దర్శకులు , హీరోలు , హీరోయిన్ లు , క్యారక్టర్ ఆర్టిస్ట్ లు ఒకరేమిటి ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాకు కావలసిన వారంతా అక్కడ కనిపించేవారు . సినిమా రంగంలో అప్పటి వరకు నంబర్ వన్ గా ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు సహజంగా సినిమా వాళ్ళు అంతా ఆయనకు అండగా నిలిచారు , ప్రచారం చేశారు అనుకుంటారు . సినిమా వాళ్లంతా టీడీపీకి అండగా నిలిచింది ఎన్టీఆర్ హయాంలో కాదు చంద్రబాబు హయాంలో ... ఎన్టీఆర్ హయాంలో రావుగోపాలరావు ఒక్కరే టీడీపీ తరపున ప్రచారం చేశారు . అలా అని మిగిలిన నటులంతా కాంగ్రెస్ అని కాదు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు . తరువాత కాలం లో జయప్రద , మోహన్ బాబు పార్టీకి తమ సేవలు అందించారు . ******* హిమాయత్ నగర్ లో బాబు హయాంలో టీడీపీ కార్యాలయం ఉన్నప్పుడు రాజేంద్రప్రసాద్ హీరోగా బిజీ గానే ఉన్నా , పార్టీ కార్యాలయానికి వచ్చి ఎన్టీఆర్ ఆదేశాలతోనే బాబు ఎన్టీఆర్ ను దించేశారు అని బోలెడు రాజకీయ జ్ఞానాన్ని జర్నలిస్ట్ లకు బోధించేవారు . అతన్ని నిరుత్సాహ పరచడం ఇష్టం లేక నమ్మినట్టు ముఖం పెట్టే వాళ్ళం . ఎన్టీఆర్ ఆదేశాల మేరకే 83లో బాబు కాంగ్రెస్ లో ఉండిపోయారా ? అని అమాయకంగా ప్రశ్నిస్తే అంతే కదా అని సినీ పక్కీలో చెప్పుకొచ్చారు . విజయవాడలో స్థలానికి సంబంధించి ఏదో సమస్య వల్ల రాజేంద్రప్రసాద్ అప్పుడు బాబు సేవలో ఉండక తప్పలేదు అని వినిపించింది . బాబు హయాంలో ఓ సారి ఎంపీగా గెలిచిన కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో అనేక కథలు చెప్పారు . ఆ కథల సారాంశం ఎన్టీఆర్ ను రాజకీయాల్లో నడిపించింది తానే అని .... ఒక్కసారి టికెట్ తోనే సత్యనారాయణ రాజకీయం ముగిసింది . ఆ కాలం నాటి హీరోయిన్ శారద కూడా ఒకేసారి గెలిచి తరువాత దూరం అయ్యారు . నిర్మాత డి రామానాయుడు కూడా అంతే ఒక సారి గెలిచి రాజకీయాలకు దూరంగానే ఉన్నారు . ఓ సారి రామానాయుడు సినిమా రిపోర్టర్ లు అందరినీ ఎన్టీఆర్ భవన్ కు తీసుకువచ్చి తనకు సంబంధించిన బుక్ ఏదో బాబుతో ఆవిష్కరణ ప్రోగ్రాం . బాబు వెళుతూ వెళుతూ దారిలోనే బుక్ ఆవిష్కరించారు . ఇంతోటి దానికి ఇక్కడి వరకు ఎందుకు మా స్టూడియోలోనే చేసుకునే వారం అని నాయుడు అందరికీ వినిపించేట్టుగానే అసంతృప్తి వ్యక్తం చేశారు . హాస్య నటులు ఏవీయస్ , నటులు దర్శకులు , ఎంపీ శివప్రసాద్ ఇద్దరూ పార్టీ అధికార ప్రతినిధులుగా రోజూ మీడియాను కలిసేవారు . ప్రెస్ మీట్ పెట్టేప్పుడు నేను అధికారులతో చాలా సేపు మాట్లాడి , చాలా అంకెలు తీసుకోని వస్తాను , మీరేంటి నేను ప్రిపేర్ అయి వచ్చిన వాటిలో ఒక్కటీ అడగకుండా ఏదో అడిగేస్తారు అని మొదట్లో నొచ్చుకునేవారు . ఇప్పుడు వెలిగిపోతున్న బండ్ల గణేష్ అప్పుడు చోటా నటుడు . బండ్ల A సినిమాలో హీరోగా నటించాడు , ఏ సినిమానో చెప్పరా బాబూ అని ఏవీఎస్ బండ్లను ఆటపట్టించేవాడు . అలాంటి సినిమా పేరు బయటకు రావద్దు అని బండ్ల సిగ్గుపడేవారు . జయప్రద ఎన్టీఆర్ హయాంలో పార్టీలో చేరి బాబు వైపు ఉంటే , జయసుధ బాబు హయాంలో మహానాడులో చేరారు . ***** ఇక బాబు జమానా మొదలయ్యాక పార్టీకి సేవలు అందించిన తారలు జాబితా కన్నా , సేవలు అందించకుండా దూరంగా ఉన్న తరాల జాబితా చిన్నది , చెప్పడం ఈజీ . కీలక పరిణామాల్లో జయప్రద సేవలు అందించారు . 95లో ఎన్టీఆర్ ను దించేశాక తొలి బహిరంగ సభ నిజాం కాలేజీలో జరిగింది . ఆ సభలో మోహన్ బాబు మాట్లాడుతూ లక్ష్మి పార్వతికి వ్యతిరేకంగా శాసన సభ్యులంతా తన వద్దకు వచ్చి బోరున ఏడ్చారని , ఎన్టీఆర్ ను దించేయాలని వేసుకున్నారని , దాంతో తానూ దించేసినట్టు సినిమా డైలాగుల్ల్లా చెప్పుకొచ్చారు . టీడీపీతో ఇతనికి నూకలు చెల్లాయి అని అప్పుడే అనిపించింది . తరువాత ఏదో కారణం తో క్రమశిక్షణ చర్య అని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు . **** ఎన్టీఆర్ జీవించి ఉన్నప్పుడే గ్లామర్ రాజకీయాలకు కాలం చెల్లింది అని ప్రకటించిన బాబు చివరకు టి డి యల్ పి కార్యాలయంలో న్యూస్ పేపర్ కటింగ్స్ ను అతికించే చిన్న ఉద్యోగి వేణుమాధవ్సి నిమాల్లోకి వెళ్ళాక అతని గ్లామర్ పై కూడా ఆధారపడ్డారు . రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో నంద్యాల ఉప ఎన్నికలు వస్తే కామెడీ నటుడు వేణుమాధవ్ ప్రచారం చేసి బాబు ఇచ్చిన హామీల అమలు బాధ్యత నాదీ , నన్ను నమ్మండి అని ప్రచారం చేశారు . బాబు మోహన్ తొలుత లక్ష్మీపార్వతి పార్టీలో చేరి అమలాపురం నుంచి పోటీ చేశారు . ఎన్టీఆర్ తనకు కలలో వచ్చి లక్ష్మి పార్వతికి అండగా నిలబడమని చెప్పారని అందుకే లక్ష్మి పార్వతి పార్టీలో చేరినట్టు ప్రకటించారు . తరువాత బాబు పార్టీలో చేరి మంత్రి కూడా అయ్యారు . నోటి దురుసుతో రాజకీయాల్లో రాణించలేక పోయారు . చంద్రబాబు కు తాను అవసరం కానీ తనకు చంద్రబాబు అవసరం లేదు అని బాబు మోహన్ బహిరంగంగా ప్రకటించారు . ఆ మధ్య టివిలో జయసుధ , బాబు మోహన్ క్రైస్తవ ప్రచారం కోసం టివిలో మాట్లాడారు . ఇప్పుడు బాబు మోహన్ బీజేపీలో ఉన్నారు . జూనియర్ ఎన్టీఆర్ , తారక రత్న , బాలకృష్ణ ల సినిమా గ్లామర్ ను బాబు అవసరం ఉన్నప్పుడల్లా వాడుకుంటూనే ఉన్నారు . ***** ఎన్టీఆర్ అక్కినేని , కృష్ణ , చిరంజీవి , విజయనిర్మల , బాలకృష్ణ విజయశాంతి వంటి చాలా మంది నటీ నటులతో రాజకీయాలు మాట్లాడే అవకాశం దొరికింది . కోట శ్రీనివాస్ ను బీజేపీలో చేరినప్పుడు కలిశా . 2014 లో రాష్ట్ర విభజన అమలులోకి రాకుండానే ఉమ్మడి లోనే ఎన్నికలు జరిగాయి . పోలింగ్ తరువాత ఎన్టీఆర్ భవన్ లో మురళీ మోహన్ కనిపించారు . తారలను బృందాలుగా ఎన్నికల ప్రచారానికి పంపింది వారే .. భవన్ లో మీడియాతో మాట్లాడుతూ మేం ప్రచారానికి వెళ్ళినప్పుడు తెలంగాణ లో ప్రజలు తిరగబడలేదు . ఓటు వేయక పోవచ్చు కానీ మా రాకను వ్యతిరేకించలేదు అని ఏదో చెప్పుకొచ్చారు . వ్యతిరేకించడం అంటే ఓటు వేయక పోవడమే నండి . మా ఊరు ఎందుకు వచ్చావు అని కొట్టరు కదా ? అని వివరించాను . - బుద్దా మురళి

19, జూన్ 2023, సోమవారం

ఎంఐఎం అసదుద్దున్ ను హడలెత్తించిన కొండయ్య ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు 53

ఉమ్మడి రాష్ట్రంలో , ఇప్పుడు తెలంగాణ లో నైనా ఫలితాలు ఎలా ఉండవచ్చు అని రకరకాలుగా చెబుతారు కానీ పాత నగరంలోని నియోజక వర్గాల ఫలితాల విషయంలో అందరిలో ఏకాభిప్రాయం ఉంటుంది . పాతనగరం సీట్లను యం ఐ యం పార్టీకి వదిలేసి లెక్కలు చెబుతారు . అలాంటిది యంఐయం నేత అసదుద్దీన్ ఒవైసి సైతం హడలి పోయేట్టు చేశారు ఒకరు . ఎవరు అమానుల్లా ఖాన్ నా ? అంటే.. . అమానుల్లా ఖాన్ పార్టీ ఎంబీటీ కి మూడు అసెంబ్లీ సీట్లు వస్తే ఎంఐఎం కు ఒకటే స్థానం వచ్చిన సందర్భం ఉంది . అమానుల్లా ఖాన్ శాసన సభ్యుడిగా ఉండి ఒవైసి పై ఎంపీగా పోటీ చేసి దెబ్బ తిన్నారు.. కానీ లేకపోతే పాతనగరం ఒవైసి చేతి నుంచి అమానుల్లా ఖాన్ చేతికి వచ్చేది . ఖాన్ కాదు మరెవరూ అంటే ? కొండయ్య .. ఔను నిజం కొండయ్య .. ఈ కొండయ్య ఎవరో అసదుద్దీన్ ఒవైసీకి తెలియక పోవచ్చు , కొండయ్యకు ఒవైసి తెలిసి ఉండక పోవచ్చు కానీ కొండయ్య వల్ల ఎంఐఎం హడలి పోయిన విషయం నిజం .. ****** ఛానల్స్ తిరగేస్తుంటే NTV లో కేఏ పాల్ కనిపించగానే అలానే వింటూ ఉండిపోయాను . నేనే కాదు హాస్యాన్ని ఇష్టపడే ఎవరైనా పాల్ ను వింటూ ఉండిపోవలసిందే . 350 మంది ఎంపీలు తనకు పాదపూజ చేశారని , ప్రధాని కూడా పాదపూజ చేశారని చెప్పుకుపోతున్నాడు . ఈ సారి అధికారంలోకి వచ్చేది తానే అని జగన్ కన్నా ధీమాగా చెబుతున్నారు . కరోనా కష్టకాలంలో అందరి ముఖాల్లో కాసేపైనా నవ్వులు పూయించింది కేఏ పాల్ . ఆయన చెబుతున్నవి నిజం అని కనీసం ఆయన కూడా అనుకోరు అందరూ వింటూ ఎంజాయ్ చేస్తారు . ఒకప్పుడు ఆయన అమెరికా అధ్యక్షుడిని కలిసింది నిజమే . అనేక మంది దేశాధినేతలతో సమావేశం అయింది నిజమే . సొంత విమానం నిజమే . ఇవన్నీ గతం ఇప్పుడు ఎక్కడా నోటాకు వచ్సినన్ని ఓట్లు కూడా ఆయనకు రావు కానీ ఆంధ్ర , తెలంగాణ నే కాదు మొత్తం దేశంలో తన పార్టీనే అధికారం లోకి వస్తుంది అని ధీమాగా చెబుతాడు . పక్కన ఉన్న జ్యోతి తో సాక్ష్యం చెప్పిస్తారు . సాధారణంగా ఎన్నికల ప్రచారంలో ఒక పార్టీ వారిని మరో పార్టీ వారు శత్రువులా గుర్రున చూస్తారు . కానీ పాల్ కనిపించారు అంటే ఏ పార్టీ వారైనా నవ్వుతూ సెల్ఫీ తీసుకుంటారు . అంతా నిజమే అనుకొని ఆయన చెప్పే మాటలు వింటుంటే తేడా మనకా ? ఆయనకా ? అర్థం కాదు . ఇదో చిత్రమైన మానసిక స్థితి బాగానే మాట్లాడుతారు , బాగానే ఉంటారు . ఒక్కో సారి తెలివిగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది కానీ ఏదో తేడా ఉంటుంది ... **** ముందు కొండయ్య గురించి చెప్పండి మధ్యలో కేఏ పాల్ కథ ఏమిటీ అంటే ? అక్కడికే వస్తున్నాను . ఇంతకూ కొండయ్య ఎవరు ? అప్పటి నగర పోలీసు కమిషనరా ? ఎన్నికల అధికారా ? రా అధికారా ? అంటే ఇవేవీ కాదు . మానసికంగా కొంత తేడా ఉన్న వ్యక్తి . బాగా మాట్లాడేవాడు . సమాజానికి ఏదో మేలు చేయాలి అనుకునే వాడు . ఒక్క మాటలో చెప్పాలి అంటే కేఏ పాల్ ను కొత్తవారు చూస్తే ఎవరికైన అనుమానం వస్తుందా ? కొత్తవారికే కాదు పాల్ పాత పలుకుబడి చూసి ఇప్పటికీ విమర్శించాలి అంటే కొంత కష్టమే . ఐడీపీయల్ లో శాస్త్రవేత్తగా చేశాను అని చెప్పేవారు . ఎన్నికల విధానంలో మార్పు రావాలి అంటూ ప్రచారం చేసేవారు . గ్యాప్ ఉద్యమం అంటూ ఒక సారి పోటీ చేసిన వారు రెండవ సారి పోటీ చేయవద్దు అని ఇలా ఉండేవి అతను సూచించే మార్పులు . **** ఎన్నికల సంస్కరణలపై ఓ సారి లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ నౌబత్ పహాడ్ వద్ద ఉన్న తమ పార్టీ కార్యాలయంలో చర్చ . మీడియా కూడా ఉంది . ఇంతలో కలకలం . కొండయ్య వచ్చి మీరు నిజంగా ఎన్నికల సంస్కరణలు కోరుకుంటే నేను చెప్పిన సంస్కరణలపై ఎందుకు చర్చించడం లేదు అని వాదన . కొందరు కార్యకర్తలు కొండయ్యను ఎత్తుకెళ్ళి బయట పారేసి వచ్చారు . మీరు కంగారు పడకండి మా మీటింగ్ ఎప్పుడు జరిగినా ఇది కామన్ అని జయప్రకాశ్కూ నారాయణ అందరినీ కు ర్చోబెట్టారు . **** 2002 హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు . గార్గ్ అని ఐఏఎస్ రాష్ట్ర ఎన్నికల అధికారి . వారిని ఎలా ఒప్పించారో కానీ కొండయ్య ఎన్నికల సంస్కరణలకు ఒప్పించారు . హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు వేసే ప్రతి ఒక్కరు వేలి ముద్ర వేయాలి . వేలి ముద్రలు రికార్డ్ చేస్తారు . దీనివల్ల బోగస్ ఓట్లు వేయడం ఉండదు అని కొండయ్య ఒప్పించారు . ఆ ఎన్నికల్లో తొలిసారి వేలిముద్రలను రికార్డ్ చేశారు . హైదరాబాద్ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 30 శాతం లోపే పోలింగ్ జరిగింది . ఓల్డ్ సిటీలో బోగస్ ఓట్ల మాట దేవుడెరుగు తమ ఓటు తాము వేయడానికే భయపడ్డారు . వేలి ముద్రలు రికార్డ్ కావడం వల్ల ఉద్యోగానికి గల్ఫ్ దేశాలకు వెళితే అడ్డంకి కావచ్చు అని భయపడ్డారు . పోలింగ్ జరుగుతుండగానే అసదుద్దీన్ వేలిముద్రల నిబంధన పార్టీకి కొంప ముంచెట్టు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు . కొండయ్య పుణ్యమా ? అని అతి తక్కువ శాతం పోలింగ్ రికార్డ్ నమోదు అయింది . తాను చేసిన అభివృద్ధి పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఐతే ఆ రోజు క్రికెట్ వల్ల పోలింగ్ శాతం తక్కువగా ఉందని అప్పుడు సీఎంగా ఉన్న బాబు చెప్పారు . తీగల కృష్ణారెడ్డి మేయర్ అయ్యారు . ఎన్నికల సంస్కరణలు తెచ్చిన కొండయ్యకు పాల్ తో పోలికా అంటే ? .... **** కొండయ్య రెగ్యులర్ గా ఆంధ్రభూమి ఆఫీస్ కు నా కోసం వచ్చే వారు . అతను కనిపించగానే మిగిలిన వారు మీ ఫ్రెండ్ అంటూ జోకులేసేవారు . చిత్రమైన ఉద్యమాలు చేసేవారు . కర్నూల్ వెళ్లి అర్ధరాత్రి ఓ.. ఓ .. అని అరుపులు .. ఎందుకీ అరుపులు అని అడిగితే అరుపులకు జనం లేచి ఏమైంది అనిఅడిగితే ఎన్నికల సంస్కరణల అవసరం గురించి వారికి వివరిస్తారు . ఒక సారి గుండు కొట్టించుకునే ఉద్యమం . కొండయ్య , అయన భార్య మాత్రమే గుండుకొట్టించుకున్నారు . ఏదో తేడా ఉందని మాట్లాడడం తగ్గించాను . ఎన్నికల సంస్కరణలపై పిచ్చి పిచ్చి రాతలతో కరపత్రాలు ముద్రించేవారు . చదవడానికి కూడా తీసుకోకుండా పంపిస్తే ... ఆ తరువాత ఎన్నికల సంస్కరణలు రాకుండా రామోజీ రావుకు నేను అమ్ముడు పోయాను అని ఓ కరపత్రం లో నా గురించి రాసి నాకే ఇచ్చాడు . రామోజీకి అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నాను . మీరే బేరం ఆడండి , చేరి సగం తీసుకుందాం అని చెప్పి పంపాను . తరువాత ఏమయ్యాడో పట్టించుకోలేదు . చాలా నెలల తరువాత వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి ఆఫీస్ లో కింద ఉన్నాను అంటే వెళ్ళాను . బ్యాంకు లో అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే కలకత్తా వెళ్లమంటున్నారు . నన్ను సిబిఐ వాళ్ళు ఫాలో అవుతున్నారు అంటూ ఏవేవో చెబుతుంటే పాపం ఇంటిల్లి పాది తేడానే అనుకోని పని ఉందని ఆఫీస్ లోకి వెళ్ళిపోయా . **** నాలుగు దశాబ్దాల క్రితం సినిమా తీసిన మూడు పాతికల వయస్సున్న ఒకాయన తన ఫోన్ లను పదేళ్ల నుంచి ట్యాపింగ్ చేస్తున్నారు అని ఆరోపించారు . పదేళ్ల నుంచి తాను ఎవరితో మాట్లాడడం లేదని , తనతో ఎవరూ మాట్లాడడం లేదని .. మాట్లాడకుండా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాని ఆరోపణ . అసలు ఏం జరిగిందో తెలియదుకాని ఎవరేం మాట్లాడుకుంటున్నారో రహస్యంగా వినడం ఫోన్ ట్యాపింగ్ అవుతుంది కానీ .. ఫోన్ లో మాట్లాడకుండా చేయడం ట్యాపింగ్ ఎలా అవుతుందో ? మాట్లాడుకుంటే రహస్యాలు వినొచ్చుకాని , మాట్లాడకుండా చేస్తే ఏం తెలుస్తుంది . ఫోన్ బాగా లేదా ? సిగ్నల్స్ లేవా ? ఏమో కొందరి మాటలు అస్సలు అర్థం కావు ...

17, జూన్ 2023, శనివారం

పవన్ తొలి మాటతోనే నాయకుడు కాదనిపించింది . చిరంజీవి పవన్ పార్టీలతో అనుబంధం .... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -52

పవన్ తొలి మాటతోనే నాయకుడు కాదనిపించింది . చిరంజీవి పవన్ పార్టీలతో అనుబంధం జర్నలిస్ట్ జ్ఞాపకాలు -52 ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధం గా ఉన్నాను అంటూ పిఠాపురం లో పవన్ కళ్యాణ్ ఉపన్యాసం కొద్దిగా చదివాక అన్నా దమ్ముల పార్టీలు , ఒక రిపోర్టర్ గా వాటితో అనుబంధాలు గుర్తుకు వచ్చాయి . పవన్ ఉపన్యాసం పూర్తిగా వినాలి అంటే అభిమాని అయినా కావాలి , వ్యతిరేకించే రాంగోపాల్ వర్మ అయినా కావాలి . లేదా ఆ వార్తను కవర్ చేయాల్సిన డ్యూటీ ఉన్న రిపోర్టర్ అయినా కావాలి . నేనూ ఈ మూడూ కాదు కాబట్టి పూర్తిగా వినలేక కొద్దిగానే విన్నాను . అప్పటి వరకు పవన్ కళ్యాణ్ అంటే మా సినిమా రిపోర్టర్ లు చూపించిన సినిమా తప్ప ప్రత్యక్షంగా అంచనా లేదు . పుస్తకాలు చదువుతాడు , మేధావి , మాజీ మావోలు , వరంగల్ మేధావి పవన్ వెనుక ఉన్నారు అంటూ సినిమా రిపోర్టర్ సినిమా చూపించేవాడు . అతను చెప్పిన దాన్ని బట్టి అంచనా వేసే వాడిని . అంతకు ముందు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం తరపున పవన్ ప్రచారం చేసినా చిరంజీవి పైనే తప్ప కుటుంబ సభ్యులపై పెద్దగా దృష్టి పెట్టలేదు . కాంగ్రెస్ నాయకులను పంచెలు ఊడదీసి కొట్టాలి అని పవన్ చెప్పిన సినిమా డైలాగు బాగా పాపులర్ . అంతే తప్ప అతని రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అని పెద్దగా దృష్టి పెట్టలేదు . అన్నా దమ్ములు ఇద్దరి రాజకీయాలపై అవగాహన ఉంది . పవన్ కళ్యాణ్ సొంతంగా పార్టీ పెట్టి మైకు ముందు మాట్లాడిన మొదటి మాటతోనే ఇతను రాజకీయ నాయకుడు కాదు , రాజకీయాల్లో నిలబడలేడు అని చెప్పేశాను . పవన్ మిత్రుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ మాట వినగానే రెండు చేతులు జేబులో పెట్టుకొని అలా వెళుతూనే ఉన్నాను అన్నట్టే ఉండింది నా పరిస్థితి . **** 14 మార్చ్ 2014 ( తేదీ నెట్ లో చూశా . మరీ అంత బాగా గుర్తు పెట్టుకోలేను ) సాయంత్రం సమయం . ఆంధ్రభూమి ఆఫీస్ లో అప్పుడు రెండే టివిలు ఉండేవి . సెల్ ఫోన్ లో టివి చూసే రోజులు కావు . ఎడిటర్ ఛాంబర్ లో టివి చూడలేక . ఇంజనీర్లు ఉండే చోట టివి ముందు గుంపుగా చేరిపోయాం . పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రకటన చేసే మీటింగ్ అది . హైటెక్స్ లో మీటింగ్ . వేదిక అంటూ ఏమీ లేదు . కార్పొరేట్ లుక్ . మైకు ముందు పవన్ ఒక్కరే ఉన్నారు . వెదికే లేదు . ఇక వేదిక మీద ఎవరుంటారు . ఈ పదేళ్ల కాలం లో పవన్ తో పాటు వేదిక పై మరొకరు నాదెండ్ల మనోహర్ కనిపిస్తున్నారు అంతే అంతకు మించి మార్పు లేదు . ఆ రోజు హై టెక్స్ లో అభిమానుల కోలాహాలం . పేపర్ ఆఫీస్ లో పని పక్కన పెట్టి గుంపుగా టివి ముందు చేరాం అంటే అక్కడ అభిమానుల సందడి ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించవచ్చు . ఆంధ్ర , తెలంగాణ అనే తేడా లేకుండా టివి ముందు చేరిన గుంపులో పవన్ అభిమానులే ఎక్కువ . పవన్ మైకు చేతిలోకి తీసుకోని చెప్పిన మొదటి మాట ఈ మీటింగ్ కు వచ్చే ముందు కూడా పార్టీ పెట్టాలా ? వద్దా ? అని ఆలోచించాను అన్నారు . ఆ మొదటిమాట వినగానే ఇతను నాయకుడు కాదు , పార్టీ విజయం సాధించదు అని అంచనా వేశాను . మరో ఐదు నిముషాలు విని చాలు అనుకోని నాయకుడు , కాదు , పార్టీ గెలవదు అని అభిప్రాయం చెప్పాను . నువ్వు తెలంగాణ ఏర్పాటు కోరుకుంటున్నావు , పవన్ సమైక్యాంధ్ర అంటున్నాడు కాబట్టి నువ్వు అలానే అంటావులే అని తెలంగాణ మిత్రుడే అన్నాడు . పవన్ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించడం పెద్ద ఆశ్చర్యం కాదు , వింత కాదు , ఊహించని నిర్ణయం కాదు . దానికి దీనికి సంబంధం లేదు అన్నాను . ***** పవన్ తొలి మాటతోనే ఒక అంచనాకు ఎలా వచ్చాను అంటే . రాజకీయాల గురించి ఎవరెన్ని నీతి సూక్తులు చెప్పినా .. రాజకీయాలు చాలా ఖరీదైనవి . ఒక వ్యక్తికి వ్యాపారం , వృత్తి , ఉద్యోగం , జీవనం ఎలానో ? రాజకీయ నాయకుడికి రాజకీయం అలాంటిదే . ఒక నియోజక వర్గంలో ఒక పార్టీ నుంచి సీరియస్ గా కనీసం ముగ్గురు టికెట్ ఆశిస్తారు . మూడు పార్టీలు అనుకుంటే కనీసం ఐదుగురు ఐదేళ్ల పాటు టికెట్ కోసం ఖర్చు చేస్తారు . ముగ్గురికి మూడు పార్టీల నుంచి టికెట్ వస్తుంది . ఒక్కరు గెలుస్తారు . మిగిలిన వారి పెట్టుబడి వృధా అయినట్టే . రాజకీయం అంటే అంత రిస్క్ ఉంటుంది . మనం పాతిక వేల జీతానికే ఇంకో పత్రికలో చేరాలి అంటే అది ఉంటుందా ? నాలుగు కాలాలు నడుస్తుందా ? జీతాలు ఇస్తారా ? అని పాతిక సందేహాలు వ్యక్తం చేస్తాం . అలాంటిది ఒక పార్టీ నుంచి నాయకుడు జన సేన లోకి రావాలి అన్నా , లేదా కొత్త వాళ్ళు తమ భవిష్యత్తును పణంగా పెట్టి జనసేన లోకి రావాలి అంటే వారిలో ఎంత విశ్వసం కలిగించాలి . రేపు మనం అధికారంలోకి వచ్చేస్తున్నాం అనే విశ్వాసం కలిగిస్తే టికెట్ ఆశించే వాళ్ళు సమయం , డబ్బు వెచ్చిస్తారు . పార్టీ ప్రకటన చేసే నిమిషం వరకు పార్టీ పెట్టాలా ? వద్దా ? అని ఆలోచించే నాయకుడిని నమ్మి తమ భవిష్యత్తు పణం గా పెట్టి వచ్చేది ఎవరు ? అభిమానులు వేరు , రాజకీయ నాయకులు వేరు . పవన్ కు ఎవరికీ లేనంత మంది అభిమానులు ఉన్నారు . నాయకులే లేరు .. ఆయన్ని ఇప్పటికీ రాజకీయ నాయకుడు అనుకునే వారు తక్కువ .ఐతే తొమ్మిదేళ్లు పార్టీని నడిపిస్తాడు అనుకోలేదు . ఐనా ఆయన ఒక్కరు తప్ప పార్టీ అంటూ ఏముంది ? వన్ మాన్ షో నడిపే పార్టీల్లోనూ చెప్పుకోవడానికి కొందరు నాయకులు ఉంటారు. జనసేన లో పవన్ తప్ప ఎవరూ లేరు . ఆయనకు నాయకుడిగా గుర్తింపు లేదు . ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు బాగా లేదు ? ఏం తప్పు చేస్తుంది ? ఆ పార్టీని ఓడించి మిమ్ములను గెలిపిస్తే ఇంత కన్నా గొప్పగా ఏం చేస్తారు ? అది చెప్పగలగాలి. అంతే తప్ప నాకు జగన్ నచ్చలేదు కాబట్టి ఓడిస్తాను ఇది శాసనం అంటే సినిమా డైలాగులకు బాగుంటుంది . జనం నమ్మి ఓటు వేయడానికి తమ భవిష్యత్తు మీ చేతిలో పెట్టడానికి ఆ డైలాగులు పని చేయవు . ప్రజలు వేరు అభిమానులు వేరు . సినిమా వేరు రాజకీయం వేరు . **** 2008 లో చిరంజీవి పార్టీ పెడతాడా ? పెట్టాడా అని అనుకుంటున్న రోజుల్లో సతీష్ అని ఓ జర్నలిస్ట్ ఫోన్ చేశాడు . చిరంజీవికి సన్నిహితుడు మాక్స్ ఐ విజన్ కాసు ప్రదీప్ రెడ్డి కాసేపు మాట్లాడుదాం అంటున్నారు వస్తావా ? అంటే పరిగెత్తుకెళ్ళాను . బేగంపేట లో హాస్పటల్ అక్కడ అల్లు అరవింద్ నిలువెత్తు ఫోటో ఉంది . చిరంజీవి పార్టీ పెడితే ఎలా ఉంటుంది అని చాలా సేపు చర్చలు అప్పుడు ఈనాడులో ఉన్న విజయ్ , ఆంధ్రజ్యోతి రిపోర్టర్ , నేనూ , సతీష్ . నలుగురం . సతీష్ ఏ పేపర్ అంటే అతనికి పేపర్ ఉండదు . ఏదో ఊరు పేరు లేని చిన్న పేపర్ కానీ అతనికి తెలియని నాయకుడు ఉండేవారు కాదు ఉమ్మడి రాష్ట్రం లో ... చర్చలు రాయవద్దు అని కండిషన్ కానీ .. మరుసటి రోజు అన్ని పత్రికల్లో చిరంజీవి పార్టీ పెడుతున్నట్టు ఈ చర్చల సారాంశాన్ని అందరూ రాశారు . చిరంజీవి పార్టీ పెడుతున్నట్టు మొదటి సారి చిరంజీవితో మాట్లాడి రాసింది సి హెచ్ వి ఏం కృష్ణారావు . **** శోభానాగిరెడ్డి అని టీడీపీ శాసన సభ్యురాలిగా [పరిచయం చిరంజీవి పార్టీ పెట్టాక ప్రజారాజ్యం లో చేరారు . చిరంజీవి సన్నిహితులు గోపాల్ అని నిర్మాత నీతో మాట్లాడుతారు అని శోభానాగిరెడ్డి చెబితే బంజారాహిల్స్ లోని చట్నీస్ హోటల్ లో కలిశాను . అన్ని పార్టీల గురించి , వామపక్షాల గురించి గోపాల్ అనేక విషయాలు అడిగారు . ఉమ్మడి రాష్ట్రంలో చిరంజీవికి 30 వరకు సీట్లు రావచ్చు అని చెబితే అంతేనా అని విస్తుపోయారు . అప్పుడు జ్యోతిలో 90 శాతం మహిళలు , 90 శాతం యువత చిరంజీవికే ఓటు అని ఏవేవో పిచ్చి పిచ్చి సర్వేలు వేశారు . వాటినినమ్మకండి 30 వస్తే సక్సెస్ అన్నాను . అపరిచితుడు సినిమా కథ కొద్దిగా చెప్పాడు . తెలుగులో తానే తీసుకున్నట్టు చెప్పాడు . కథ చాలా వెరైటీగా ఉంది . సూపర్ హిట్ అవుతుంది అని చెప్పాను . ( హోటల్ లో టిఫిన్ బిల్లు ఆయనే కట్టారు ) అపరిచితుడు సూపర్ హిట్టయింది . చిరంజీవి పార్టీనే అట్టర్ ఫాప్ అయింది . అన్నిటికీ టైం ముఖ్యం . ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం లేని సమయం . చిరంజీవి వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమం , కాంగ్రెస్ , టీడీపీ పరస్పరం ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయి . బాబు హయాంలో వరుసగా ఐదేళ్ల కరువు , వై యస్ ఆర్ హయాంలో వర్షాలు , పథకాలు బాగా ప్రభావం చూపాయి . కాలం కానీ కాలం లో విడుదల కావడం తో చిరంజీవి ప్రజారాజ్యం సినిమా ప్లాప్ అయింది . ఎన్నికల తరువాత ప్రజారాజ్యం నుంచి గెలిచిన శాసన సభ్యులు చిరంజీవి తో కాంగ్రెస్ లో కలుద్దాం మీరు వస్తా మంటే మీ నాయకత్వంలో కలుస్తాం లేదంటే మేమే వెళ్లి కలిసి పోతాం అని ప్రతిపాదన . టీడీపీలో ఆఫీస్ సెక్రెటరీ ఏఎం రాధాకృష్ణ ఉండేవారు . ప్రజారాజ్యం లో చేరారు . చిరంజీవికి సన్నిహితులు . చిరంజీవి ఏం చేస్తే బాగుంటుంది అని పార్టీలో చర్చ రాధాకృష్ణ అదే ప్రశ్న నన్ను అడిగారు . రాజకీయ పార్టీ అంటే అంతా రెడీ అయ్యాక వచ్చి నటించి పోవడం కాదు . చాలా ఓపిక ఉండాలి . ఓపిక ఉంటే పార్టీ నడప మనండి ,భవిష్యత్తు ఉంటుంది . ఓపిక లేక పోతే కాంగ్రెస్ లో కలిపేస్తే రాజ్యసభ కేంద్రంలో మంత్రి పదవి అన్నాను . ప్రజారాజ్యం ను వైయస్ ఆర్ పెట్టించారు అని , చిరంజీవి పార్టీని అమ్మేశారు అని ఎవరికి తోచిన ప్రచారం వాళ్ళు చేస్తారు కానీ . చిరంజీవి కాంగ్రెస్ లో పార్టీని కలుపక పోతే శాసన సభ్యులే కలిపేసే వారు .వారి భవిష్యత్తు వారికి ముఖ్యం . రాజకీయాల్లో అన్నదమ్ములు ఇద్దరూ సూపర్ స్టార్లు , రాజకీయాల్లో అన్నా దమ్ములు ఇద్దరూ ఫెల్యూర్ స్టార్లు .. తమ్ముడేమో తన కోసం కాకుండా చంద్రబాబు కోసం తంటాలు పడుతున్నాడు అనిపిస్తోంది . రాజకీయాల్లో అంత నిస్వార్ధం వర్కౌట్ అవుతుందా ? బుద్దా మురళి

16, జూన్ 2023, శుక్రవారం

మీడియా మాయాజాలం - కల్కి మాయలు రెండింటి థియరీ ఒకటే ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -51

మీడియా మాయాజాలం - కల్కి మాయలు రెండింటి థియరీ ఒకటే జర్నలిస్ట్ జ్ఞాపకాలు -51 ----------------------------------------- మోకాలికి , బోడిగుండుకు సంబంధం కలిపినట్టు మీడియాకు , కల్కికి సంబంధం ఏమిటీ అనిపించ వచ్చు. సంబంధం ఉంది . ప్రజల నమ్మకాలతో ఆడుకొనే ఓ స్వామీజీనే ఈ విషయంపై నాకు జ్ఞానోదయం కలిగించారు . 2009 ఎన్నికల సమయంలో పేజీలకు పేజీలు ఈనాడులో అబద్దాలు వండివార్చేవారు . ఇంత అబద్దాలు ఎలా అని ఈనాడులో పని చేసే ఓ మిత్రుడిని అడిగితే , అతను చెప్పిన సమాధానం , కల్కి గురించి అతని శిష్యుడు బయట పెట్టిన విషయం రెండింటి వెనుక ఫార్ములా ఒకటే .. మీడియా మాయాజాలం ,కల్కి మాయలు రెండూ ఒకటే అనిపించింది . **** ఇప్పుడు ఏమయ్యాడో ఎక్కడోన్నాడో తెలియదు. కానీ ఓ పదేళ్ల క్రితం వరకు కల్కి భగవాన్ ఓ వెలుగు వెలిగారు . ఆ మధ్య ఆయన ఆశ్రమం పై ఐటీ దాడులు జరిగాక ఏమయ్యాడో తెలియదు . మీడియా కూడా దృష్టి పెట్టలేదు. అంతకు ముందు ఎక్కడ చూసినా కల్కి పేరు మారుమ్రోగేది . ఒక విషయం లో మాత్రం కల్కిని మెచ్చుకోవాలి . చాలా మంది తాము దేవుడి అవతారం అని చెప్పుకుంటారు . కల్కి మాత్రం తాను దేవుడిని అని చెప్పుకోవడం తో పాటు తన భార్యను దేవతగా చెప్పే వారు . ఆ జంట ఫోటోలను దేవుడు , దేవతగా పూజించేవారు . న్యూస్ టైం లో కల్కి గురించి , ఆశ్రమం లో జరిగే వ్యవహారాల గురించి వరుస కథనాలు వచ్చాయి . మిగిలిన పత్రికల్లోనూ వచ్చాయి . న్యూస్ టైం లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు . ఆ సమాచారం మొత్తం మీడియాకు తానే ఇచ్చాను అని కల్కి శిష్యుడు అజయ్ భగవత్ పాద ఓ సారి కలిసినప్పుడు చెప్పారు . బజనరాహిల్స్ లో అప్పుడు పోలీస్ బాస్ గా ఉన్న భాస్కర్ రావుకు చెందిన భవనం లో అజయ్ భగవత్ పాద ఉండేవారు . వార్తా సేకరణలో భాగం గా కాకుండా ఓ ఫ్రెండ్ కోసం అక్కడికి వెళ్ళాను . ఫ్రెండ్ అజయ్ భగవత్ పాదను పరిచయం చేశారు . చాలా సేపు మాట్లాడాను . అప్పుడు నేనో సందేహం బయట పెట్టాను . నేను మిమ్ములను అవమానించాలి అని అడగడం లేదు . కేవలం నా సందేహం తీర్చుకోవాలి అని అడుగుతున్నాను అని ముందే చెప్పి అడిగాను . నేనే దేవుడిని అనిచెప్పడం , బాబాల్లో శక్తులు అన్నీ బోగస్ ఆ సంగతి నాకు తెలుసు . ఎంతో మంది బాబాలు మహిళలపై అత్యాచారాలు చేశారు . భక్తుల నమ్మకాలను సొమ్ము చేసుకున్నారు . ఈ వార్తలు రోజూ పత్రికల్లో వస్తూనే ఉన్నాయి . ఐనా ఈ స్వాములు రోజూ పుడుతూనే ఉన్నారు . భక్తులు వస్తూనే ఉన్నారు , మోసపోతూనే ఉన్నారు . ఇదెలా సాధ్యం అని నా సందేహం బయటపెట్టాను . ముందుగా భగవత్ పాద గురించి చెప్పాలి . పెద్ద కంపెనీలోనే మార్కెటింగ్ విభాగం లో జనరల్ మేనేజర్ గా చేసేవారు .కల్కికి శిష్యుడుగా మారాడు . చదువుకున్న వ్యక్తి , మార్కెటింగ్ విభాగంలో పని చేసిన అనుభవం వల్ల తక్కువ సమయంలోనే కల్కికి దగ్గరయ్యాడు , కల్కి దందాలు తెలుసుకున్నాడు . క్రైస్తవులు ఒక బాక్స్ లోకి వెళ్లి తమ పాపాలు చెప్పుకొని ఉపశమనం పొందినట్టు కల్కి వరపూజ అని ఒకటి ప్రవేశపెట్టారు . భక్తుల గుంపులో కల్కి మనుషులే కొందరు చేరి కొద్ది సేపటి తరువాత జీవితంలో తాము చేసిన తప్పులు చెప్పి ఏడ్చే వారు . వారిని చూసి మిగిలిన వారు . ఐతే అంతా కళ్ళు మూసుకొని ఉండాలి . ఏడ్చాక తమ తలపై ఎవరో తడితే భగవంతుడే వచ్చి తట్టాడు అనుకుని.. సహజంగా కష్టాలు చెప్పుకున్న ఆతరువాత , ఏడ్చిన తరువాత మనసు తేలిక పడుతుంది . వరపూజలో దేవుడు తమను ఎలా కరుణించాడో కథలు కథలుగా చెప్పేవారు . ఇందులో నుంచి సంపన్న భక్తులు , మహిళా భక్తులు కొందరిని టార్గెట్ చేసేవారు . దీన్ని దగ్గరనుంచి చూసిన అజేయ భగవత్ పాద కల్కి సాగిస్తున్న మొత్తం వ్యవహారాన్ని మీడియాకు తానే చెప్పినట్టు అజయ్ నాకు చెప్పారు . . ఆ సమయం లో న్యూస్ టైం లో రాసిన కథనాలకు భక్తులు కార్యాలయంపై దాడికి వెళ్లారు . కల్కి దగ్గర ఎలా మోసాలు జరుగుతాయో చెప్పేందుకు అజయ్ భగత్ పాద దేవుడి అవతారం ఎత్తారు . ఐతే భక్తులు రావడం , కానుకలు , అంతా బాగానే ఉండడం తో అసలు లక్ష్యం వదిలేసి అజయ్ భగవత్ పాదా కూడా దేవుడిగా పూజలు అందుకో సాగారు . అప్పుడు కలిసి మనసులో సందేహాన్ని బయటపెడితే ఆసక్తికరమైన సమాధానం చెప్పారు . ***** బాబాల చేతిలో మోసపోయిన వారు అంతా కలిపి ఎంత మంది ఉంటారు అని అడిగితే , సంఖ్య తెలియదు చాలా మందే అన్నాను . వెయ్యి , పది వేలు , పోనీ లక్ష అనుకోండి . రాష్ట్రమంతా , దేశమంతా వదిలేయండి . హైదరాబాద్ కె పరిమితం అవుదాం . కోటి మంది జనాభాలో లక్ష మంది మోసపోయారు అని మీరంటారు . నేను మోసం చేయడానికి ఇంకా 99 లక్షల మందిమిగిలే ఉన్నారు అని నేను అనుకుంటాను . ఇంకా భారీ మార్కెటింగ్ స్కోప్ ఉందని నేను అను కుంటాను అని మార్కెటింగ్ భాషలో వివరించారు . ఈ థీరీని సరిగా అర్థం చేసుకుంటే మీడియా వార్తలు , లాటరీ వచ్చింది అనే ఫోన్ కాల్స్ , రకరకాల ఆన్ లైన్ మోసాలు పెద్దగా ఆశ్చర్యం అని పించవు . ఈ మోసాలకు ఇంకా విస్తృతమైన మార్కెట్ ఉంది అనిపిస్తుంది . **** 2009 సమయంలో టీడీపీ , ఆ పార్టీ అధికారంలోకి రావాలి అని కోరుకుంటున్న వర్గాలు సర్వ శక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి . టీడీపీ విజయాన్ని కోరుకుంటున్న మీడియా టీడీపీని మించి సర్వశక్తులు ఒడ్డి పోరాడింది . వార్తలు చూస్తే భయమేసేది . టీడీపీ గెలవకపోతే యుగాంతం తప్పదేమో అనిపించేవి ఆ వార్తలు . తెల్ల పేపర్ఆ లో నల్లని అక్షరాలు అన్నీ నిజాలే అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం ఉండదు . మేనేజ్ మెంట్ కోరిక మేరకు వార్తలు ఉంటాయి కానీ ప్రజల అభిప్రాయాలకు వార్తలకు సంబంధం ఉండదు . ఉదాహరణకు అప్పటి వరకు ఆంధ్రజ్యోతిలో పని చేసిన జర్నలిస్ట్ సాక్షిలో చేరగానే ... అప్పటి వరకు అంతా విధ్వంసంగా కనిపించింది , పచ్చగా కాలనిపిస్తుంది . అతని తప్పేమీ లేదు . మేనేజ్ మెంట్ కోరుకున్నది రాయాలి . ఒక పార్టీని ఓడించి , ఒక పార్టీని గెలిపించడానికి తన వంతు కృషి చేయాలి . ఆ సమయంలో ఈనాడులో వచ్చిన ఒక వార్త అలా గుర్తుండి పోయింది . 1995 నుంచి 2014 వరకు ఆంధ్రభూమిలో టీడీపీ బీట్ చూశా . 95లో టీడీపీ కార్యాలయం హిమాయత్ నగర్ లో ఉంటే 96-97 లో బంజారాహిల్స్ కు మారింది . సికిందరాబాద్ నుంచి బంజారాహిల్స్ కు ప్రతి రోజు ఒక్క సారి , ఒక్కో సారి రోజుకు రెండు సార్లు 97 నుంచి 2014 వరకు బైక్ పై వెళ్లిన అనుభవం నాది . ఈ పది కిలో మీటర్ల దూరానికి గంట సమయం పట్టేది . *** 2009 ఎన్నికల సమయంలో ఈ నాడులో వచ్చిన వార్త పంజాగుట్ట ఫ్లై ఓవర్ ఫోటో వేసి దాని నిర్మాణానికి అయిన వ్యయం , సమయం , ప్రాజెక్ట్ పొడవు వంటి వివరాలు అన్ని రాసి ఫలితం వృధా అని రాశారు . టాఫిక్ జామ్ అవుతోంది కాబట్టి అంతా వృధా అయింది అని స్టోరీ . ఇలానే ఐదేళ్ల వై యస్ ఆర్ పాలనలోని అన్ని ప్రాజెక్టుల గురించి ఎన్నికల ముందు స్టోరీలు . మిగిలినవి నాకు తెలియదుకాని 97నుంచి 2014 వరకు తెలిసిన దారి అరగంట పంజాగుట్ట చౌరస్తా వద్ద టాఫిక్ లో చిక్కుకు పోవలసి వచ్చేది ఇప్పుడు సికింద్రాబాద్ లోని మా ఆఫీస్ నుంచి అరగంట లోపే టీడీపీ ఆఫీస్ కు వస్తున్నాను . ఫ్లై ఓవర్ వల్ల ఫలితం అని అలా ఎలా రాసేస్తారు అని ఈనాడులో మిత్రుడిని అడిగితే , ఇదొక్కటే కాదు ఇందిరమ్మ ఇల్లు వంటి అనేక పథకాల వల్ల పాజిటివ్ ప్రభావం ఉంటుంది అని చెప్పినా , అన్నింటిపై వ్యతిరేకంగా రాయమని ఆదేశాలు అని సమాధానం వినిపించింది . మరి నా పంజాగుట్ట అనుభవం అని అడిగితే అచ్చం అజయ్ భగవత్ పాద చెప్పిన సమాధానమే చెప్పారు . పంజాగుట్ట ప్లై ఓవర్ ను ఉపయోగించే కొన్ని వేల మంది వార్త నిజం కాదు అనుకుంటారు . కానీ మిగిలిన కోట్ల మంది నిజం అనుకుంటారు కదా ? అని సమాధానం అలానే పంజాగుట్ట వార్త అబద్దం అని ఇంతలా వాదిస్తున్న నువ్వు మిగిలిన వార్తలు నిజమే అనుకుంటున్నావు కదా ? అని మిత్రుడు ప్రశ్నించాడు . కల్కి మాయాబజార్ సృష్టికి , మీడియా మాయాజాలానికి తేడా లేదు అనిపించింది . ఐతే కాలం మారింది . ఇప్పుడు మనం చూపింది సమాచారం కాదు . సమాచారం అనేక చోట్ల నుంచి వస్తోంది . మాయాబజార్ లకు కాలం చెల్లింది . బాబాలది , మీడియాది అందరిదీ వ్యాపారమే . బుద్దా మురళి

14, జూన్ 2023, బుధవారం

తనను తానే ఓడించుకున్న డీసీ రెడ్డి ... తెలంగాణ ఆత్మ ఆంధ్రభూమి జర్నలిస్ట్ జ్ఞాపకాలు -50

తనను తానే ఓడించుకున్న డీసీ రెడ్డి తెలంగాణ ఆత్మ ఆంధ్రభూమి జర్నలిస్ట్ జ్ఞాపకాలు -50 ..... ప్రత్యర్థి పై విజయం సాధిస్తే వీరుడు . తనపై తానే విజయం సాధిస్తే మహావీరుడు . మహావీరుడు కావడం చాలా కష్టం . అందుకే మహావీరుడు దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు . మరి తనను తానే ఓడించుకున్న వారిని ఏమనాలి ? ఉదయమే టివిలో డిసి ప్రమోటర్లను అరెస్ట్ చేసిన ఈడీ అనే వార్త చూడగానే . వెంకట్రామ్ రెడ్డి తనను తానే ఓడించుకున్నవారు అనిపించింది . ఒక్కరికీ జీతాలు ఎగ్గొట్టలేదు . ఎవరినీ కడుపుమీద కొట్టలేదు . మూసేసిన తరువాత కూడా ఇంట్లో కూర్చోబెట్టి ఏడాది జీతాలు ఇచ్చారు . నాకు రావలసింది ఏదో రాలేదు అనే కోపం తో రాయడం కాదు . బాధతో రాయడం . అంతా బాగానే ఉంది కానీ సంస్థను ఎలా నడపాలో అలా నడపకుండా తనను తానే ఓడించుకున్నారు . ఉదయం మిత్రుడు ఫోన్ చేసి టీవీ చూశావా ? అని అడిగాక చూస్తే ఈ వార్త .. ఒక్క సారిగా పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి . అంతా మునిగిపోయిన తరువాత కూడా తప్పు ఎక్కడ జరిగింది అని మాట్లాడుకోక పోతే మనకు మనం ద్రోహం చేసుకున్నట్టే ... మరో వ్యక్తి మరో సంస్థ తప్పు జరగకుండా చూసుకోవచ్చు . 2008 లో ఐ పి యల్ ఏర్పాటు డక్కన్ క్రానికల్ కు శనిలా పట్టుకుంది . అయ్యర్ అనే వ్యక్తి శని ప్రతినిధిలా డిసి లో అడుగు పెట్టాడు . ఈ అయ్యర్ ఎక్కడి నుంచి ఊడి పడ్డాడో కానీ సంస్థను దెబ్బ కొట్టాడు . వెంకట్రామ్ రెడ్డి ,అయ్యర్ ఇద్దరినీ అరెస్ట్ చేశారు . ఈ కేసులో ఎనిమిదేళ్ల సారి అరెస్ట్ చేశారు . అప్పుడు జర్నలిస్ట్ మిత్రుడు రాంలాల్ సింపుల్ గా ఓ మాట చెప్పారు . ఆఫీస్ పక్కన అజంతా టాకీస్ గేటు వద్ద మిర్చి బజ్జి బండి వద్ద నిలబడి మాట్లాడుకుంటూ - ఈ మిర్చి బజ్జిల అతనికి కూడా ఓ ప్లాన్ ఉంటుంది . వర్షం వస్తే ఎంత పిండి కలపాలి , రాకపోతే ఎంత కలపాలి అనే లెక్కలు ఉంటాయి . మేనేజ్ మెంట్ కు ఈ మాత్రం ముందు చూపు లేనట్టుంది అని .. ***** డిసి , ఆంధ్రభూమి మొదటి యాజమాన్యం తమిళులు . మొదట డిసి పత్రిక తెచ్చి , తరువాత ఆంధ్రభూమి తెచ్చారు . తరువాత నెల్లూరుకు చెందిన తిక్కవరపుచంద్రశేఖర్ రెడ్డి తీసుకున్నారు . మొదటి యజమాని , రెండవ యజమాని తెలంగాణ వారు కాదు . గుర్తున్నంత వరకు ఆంధ్రభూమి మొదటి ఎడిటర్ నుంచి మూత పడే సమయంలో ఎడిటర్ గా ఉన్న సదాశివ శర్మ వరకు ఒక్కరు కూడా తెలంగాణ వారు లేరు .. ఎడిటర్ లు సత్య సుబ్రహ్మణ్యం , గోరాశాస్త్రి , గజ్జెల మల్లారెడ్డు , ఎబికె ప్రసాద్ , పతంజలి , సి కనకాంబరరాజు , శాస్త్రి , సదాశివ శర్మ వీరిలో ఒక్కరు కూడా తెలంగాణ కాదు . కానీ ఆంధ్రభూమి అంటే తెలంగాణ ఆత్మగా భావించేవారు . ఓనర్ నెల్లూరు రెడ్డి , సిఇఓ థామస్ ఆంధ్ర ఐనా భూమి అంటే తెలంగాణ అనే ముద్ర ఉండేది . ఎక్కువ మంది సిబ్బంది , యూనియన్ తెలంగాణ కు చెందిన వారు ఉండేవారు . ఈనాడు పత్రిక రాక ముందు మార్గదర్శి ప్రకటనలు కూడా ఆంధ్రభూమికే ఇచ్చారు . తెలంగాణ లో ఒకప్పుడు ఆంధ్రభూమి లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉన్న పత్రిక . 1969 లో తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా నిలిచింది . డిసి , భూమి లో పని చేసేవారు రాష్ట్ర స్థాయిలో నాయకత్వం స్థాయిలో ఉండేవారు . రాష్ట్రంలో రాయలసీమ , విశాఖ , నెల్లూరు , విజయవాడ లలో ఎడిషన్ లు పెట్టినా భూమి పై తెలంగాణ ముద్రపూర్తిగా చెరిగిపోలేదు . ఎంతో కొంత మిగిలే ఉంది . శాస్త్రి సమైక్యాంధ్ర ముద్ర కోసం తీవ్రంగా ప్రయత్నించినా తెలంగాణ ముద్ర పూర్తిగా చెరిగిపోలేదు . ******* ఐ పి యల్ లో డక్కన్ ఛార్జర్స్ ను డిసి వాళ్ళు కొన్న రోజు ఆఫీస్ మొత్తం సంబరంగా ఉంది . ఏదో విజయం సాధించినట్టు ఆనందంగా ఉన్నారు . ఆఫీస్ బయటకు వచ్చి మిత్రులం బృందాలుగా చర్చలు . బాగా గుర్తున్న చర్చ రిపోర్టర్ శైలేంద్ర నేనూ గేటు బయట మాట్లాడుకుంటూ పత్రిక నడపాల్సిన వాళ్ళు దాన్ని మరింత బాగా ఎలా నడపాలి , కొత్త ఎడిషన్ లు ఎలా తేవాలి అని ఆలోచించాలి కానీ ఈ క్రికెట్ ను కొనడం ఏందీ ? మనను ఏం చేయదలుచుకున్న అని ఆందోళన పరస్పరం పంచుకునే వాళ్ళం . ఒక పార్ట్ టైం , ఫుల్ టైం , జర్నలిస్ట్ లు ఏజెంట్లు అంతా కలిసి ఉమ్మడి రాష్ట్రంలో మూడు నాలుగు వేల మంది ఉంటారు . యాజమాన్యం వ్యక్తి కాదు వారు తీసుకునే నిర్ణయం నాలుగువేల మంది జీవితాలపై ప్రభావం చూపుతుంది . తెలిసిన మిత్రుడి వద్ద 30 ఏళ్ళ నుంచి చిట్టీలు వేస్తా . ఓ రోజు అతను అన్నా నేను మందు తాగను , వ్యసనాలు లేవు , ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పాడు . ఏదో వందేళ్లు బతకాలి అని కాదు . అతను వడ్డీ వ్యాపారం కూడా చేస్తాడు . రిటైర్ అయిన వాళ్ళు ఇతని వద్ద వడ్డీ కోసం డబ్బు దాచుకుంటే , ఇంకొంత ఎక్కువ శాతానికి ఇతను వడ్డీకి ఇస్తాడు . వ్యసనాల వల్ల నాకేమన్నా అయితే నన్ను నమ్మి డబ్బు పెట్టిన వృద్దులకు అన్యాయం అవుతుంది . వాళ్లకు కనిపెంచిన పిల్లల మీద కన్నా న మీద ఎక్కువ నమ్మకం ఉంచి డబ్బు పెట్టినందుకు నేనెంత జాగ్రత్తగా ఉండాలి అని ... అందుకే వ్యసనాలకు దూరం అన్నాడు . ఓ పాతిక మంది వృద్ధుల నమ్మకం కోసం అతను అలా ఉంటే నాలుగు వేల మంది జీవితాలు ఆధార పడి ఉండే సంస్థ మరింత జాగ్రత్త గా , బాధ్యతతో ఉండాలి . కొన్ని వందల కంపెనీలకు ఛైర్మెన్ గా ఉన్న టాటా అన్ని కంపెనీలకు కొంత సమయం కేటాయిస్తారు . వీళ్ళేమో భూమిని ఎడిటర్ కు వదిలేసి తమది కాదు అనుకున్నారు . ఏం జరుగుతుందో ఎవరైనా చెబితే తరువాత వాళ్ళు ఉద్యోగంలో ఉండరు . **** ఆందోళన పరిస్థితులపై కాస్త మనసు విప్పి మిత్రులం గార్డెన్ హోటల్ లో మాట్లాడుకునే వాళ్ళం . యూనియన్ లో చోటా నాయకుడు నేనూ శైలేంద్ర మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి ఎండీ సార్ తాగే సిగార్ మూడు వేలకు ఒకటి తెలుసా అని ఏదో చెబుతుంటే .. అంతకు ముందు చాలా సార్లు భరించినా ఆ రోజు భరించలేక .. పది రూపాయలకు గంట చుట్ట ప్యాకెట్ వస్తుంది కదా అన్నాను . రూపాయికి ఒకటి దొరికే గంట చుట్ట ను , మూడు వేలకు ఒకటి ఉండే సిగార్ ను చుట్ట అనే అంటారు అని వివరించా... ఎడిటర్ పేపర్ ను అమ్ముకుంటున్నా పట్టించుకోలేదు . ఐపియల్ కొన్నప్పటి నుంచే ఏదో ఒక అపశకునం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది . అంతర్జాతీయ ప్లేయర్ లకు ఇంట్లో పార్టీ ఇస్తే అగ్ని ప్రమాదం , కాలింది .. కాలిన మచ్చ పోదు . అరెస్ట్ మచ్చ పోదు . వ్యాపారం లో దెబ్బ తీయాలి అని పోటీ దారుడు అన్ని రకాలుగా ప్రయత్నిస్తాడు . న్యూస్ టైం , టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి హేమా హేమీలైన సంస్థలు కూడా డిసి రెడ్డిని ఓడించలేక పోయాయి . తన చేతులతో తానే ఓడించుకున్నారు . మంచి మనిషి అయితే సరిపోదు . ఎప్పటి నుంచో ఉన్న సంస్థ భూమి . తరువాత వచ్చిన రామోజీ వందల ఎకరాల సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటే , తండ్రి నిర్మించి ఇచ్చిన సామ్రాజ్యాన్ని కూడా ప్రశ్నార్ధకంగా మార్చారు . - బుద్దా మురళి

13, జూన్ 2023, మంగళవారం

ఎడిటర్ లలో మహానుభావులూ ఉంటారు ... కూర్చొని మాట్లాడే అవకాశం కోసం రాజీనామా చేసిన జర్నలిస్ట్ .. జర్నలిస్ట్ జ్జ్ఞాపకాలు -48

ఎడిటర్ లలో మహానుభావులూ ఉంటారు ... కూర్చొని మాట్లాడే అవకాశం కోసం రాజీనామా చేసిన జర్నలిస్ట్ .. జర్నలిస్ట్ జ్జ్ఞాపకాలు -48 ------------------------------------------ ఎడిటర్ లు అందరూ శాడిస్టులేనా ? మంచివాళ్ళు లేరా ? అంటే ఎందుకు లేరు . లోకంలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఉన్నట్టే ఎడిటర్స్ లోకం లో మంచివాళ్ళూ ఉన్నారు . శాడిస్ట్ లూ ఉన్నారు. . ప్రముఖ కవి , జర్నలిస్ట్ ప్రసేన్ ఆంధ్రభూమిలో ఉన్నప్పుడు ఎడిటర్ శాస్త్రి ఛాంబర్ కు వెళ్లి రాజీనామా లేఖ ఇచ్చారు . ఎడిటర్ నిర్లక్ష్యంగా చూసి రాజీనామా ఎందుకూ అని అడిగారు . కె. రామచంద్రమూర్తి (అప్పుడు ఆంధ్ర జ్యోతి ) వద్ద కూర్చొని మాట్లాడవచ్చు అందుకే వెళుతున్నాను అని సమాధానం చెప్పారు . శాస్త్రి సంబంధించిన వ్యక్తిగత పని .. మరీ ముఖ్యమైన వ్యక్తిగత పని పై ఎవరినైనా ఛాంబర్ కు పిలిస్తే కుర్చీలో కూర్చోమని చెప్పి మాట్లాడుతాడు . కుర్చొవయా అని ప్రేమగా పలకరించాడు అంటే మనకేదో పెద్ద పని చెబుతున్నాడు అని అర్థం . అద్దాల నుంచి బయట చూసే జర్నలిస్ట్ లు ఏదో కీలక సమావేశం , ఇతనికి ఎడిటర్ ప్రాధాన్యత ఇస్తున్నాడు అనిపిస్తుంది . అది ఎడిటర్సొం త పని మీద చర్చ అని నేను ఊహించింది / అంచనా వేసింది ఎప్పుడూ తప్పలేదు . చివరకు ఈనాడు కూడా పూర్తి స్థాయిలో వెజ్ బోర్డు అమలు చేయలేదు . అంధ్ర భూమి అమలు చేసింది . అలాంటిది మంచి జీతం వచ్చే ఉద్యోగం వదిలి తక్కువ జీతానికి వెళ్లడం అంటే ... ప్రసేన్ తన భార్య పుట్టిన రోజు సందర్బంగా రెండు మూడు సార్లు రాశారు . భార్య (ప్రభుత్వ ఉద్యోగి) ఉందనే ధైర్యం తో మంచి జీతం వచ్చే ఉద్యోగం వదిలి శాస్త్రి కబంధ హస్తాల నుంచి బయటపడ్డాను అని రాశారు . ******** కూచిమంచి (పూర్తి పేరు గుర్తు రావడం లేదు ) వారి గురించి ఆంధ్రభూమి ప్రత్యేక సంచికలో చదివాను . వారిని గోరాశాస్త్రికన్నా ముందు ఎడిటర్ గా ఉండమని కోరితే ఉండలేను అన్నారు . కనీసం ఒక్క సంవత్సరం ఉండమని కోరితే సరే అని ఒప్పుకున్నారు . ఒక రోజు ఆఫీస్ లో సంపాదకీయం రాసి ... ఈ రోజుతో ఒక్క సంవత్సరం పూర్తి అవుతుంది అని వెళ్లిపోయారు . రాజకీయ నాయకుల సిఫారసులతో మేనేజ్ మెంట్ కు చెప్పించుకుని పీఠాధిపతులుగా అధికారం చెలాయించిన వారిని చూసి కూచిమంచి లాంటివారు నిజమేనా ?అనిపిస్తుంది . తొమ్మిది అడుగుల ఛాంబర్ నుంచి ముల్లోకాలను శాసిస్తున్నాం అనుకునే వారు శాడిస్ట్ ఎడిటర్లు . అదే సమయంలో మనిషిని మనిషిగా చూసిన మంచి మనుషులు అయిన ఎడిటర్ లు కూడా ఉన్నారు . 1969 తెలంగాణ ఉద్యమానికి ఆంధ్రభూమి కేంద్రంగా ఉండేది . ఉద్యమానికి నాయకత్వం వహించిన రఘువీర్ లాంటి పలువురు ఆంధ్రభూమి జర్నలిస్ట్ లే ... ఎడిటర్ గోరాశాస్తి సమైక్యవాది . సమైక్య వాదం తో ఆయన సంపాదకీయాలు రాసేవాళ్ళు . మిగిలిన జర్నలిస్ట్ లు అందరూ తెలంగాణ ఉద్యమాన్ని బలపర్చారు . ఉద్యమానికి నాయకత్వం వహించారు . ఐనా ఎప్పుడూ ఒకరి స్వేచ్ఛను ఒకరు అడ్డుకోలేదు . శాస్త్రి కాలం లో పని చేసిన మా తరం వారికి ఇది కనీసం ఊహకు కూడా అందదు . కథలు , కవిత్వం , వార్తలు , వ్యాసాలు , చివరకు సినిమా సమీక్షలు సైతం ఎడిటర్ కోణంలో రాయాలి . తెలంగాణ ఉద్యమం ఉదృతం అయిన తరువాత రాసుకోవడానికి కొంత స్వేచ్ఛ లభించింది . జ్యోతిలో ఎడిట్ పేజీ వరకు ఈ స్వేచ్ఛ కనిపిస్తుంది . మిగిలిన పేజీలన్నీ బాబు కోసం ఐనా, ఎడిట్ పేజీలో భిన్నాభిప్రాయలకు చోటు ఉంటుంది . వార్త ఎడిటర్ గా టంకశాల అశోక్ సింపుల్ గా ఉండేవారు . పొత్తూరి వెంకటేశ్వరరావుది పెద్ద మనిషి తత్త్వం **** గజ్జెల మల్లారెడ్డి ఎడిటర్ గా ఉన్నప్పుడు జొన్నలగడ్డ రాధాకృష్ణ అని భూమిలో ఉండేవారు . మల్లారెడ్డి ఎడిటోరియల్ , మాటకచేరి , పణ్యభూమి కాలం రాసి వెళ్లేవారు . పేపర్ మొత్తం రాధాకృష్ణ చూసుకునేవారు . ఆంధ్రభూమికి దగ్గరలోనే ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివాను . టెన్త్ నుంచే భూమిలో ఏదో ఒకటి రాసేవాడిని . అది ఎవరికి గుర్తుంటుంది లే అనుకున్నాను . ఈ మధ్య ఒక పంక్షన్ లో దేవులపల్లి అమర్ నేనూ భోజనం చేస్తుంటే ... నువ్వు పంపే వ్యాసాలు అప్పుడు భూమిలో నేనే చూసేవాడిని , ఉత్తరాల నుంచి మొదలు పెట్టి ఎడిట్ పేజీ వ్యాసాల వరకు రాసేది . నీ నుంచి కవర్ వచ్చింది అంటే ఎడిట్ కూడా చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు ఉండేది అని గుర్తు చేశారు . విజయవాడ ఎడిషన్ 87 లో పెడుతుంటే రిపోర్టర్ లు , సబ్ ఎడిటర్స్ కావాలి అని ప్రకటన . దరఖాస్తు చేశావా ? అని రాధాకృష్ణ అడిగితే , డిగ్రీ పరీక్షలు రాశాను , ఇంకా ఫలితాలు రాలేదు . రెండు వారాల్లో వస్తాయి అందుకే దరఖాస్తు చేయలేదు అని చెప్పాను .అప్పటికే ఎడిట్ పేజీలో చాలా వ్యాసాలు వచ్చాయి . వాటికి పారితోషకం కూడా ఇచ్చేవారు . ఎన్నో వ్యాసాలు రాశావు , డిగ్రీ ఫలితాలు నీకెందుకులే అని నేను ఎం డి తో మాట్లాడుతాను అని చెప్పి మాట్లాడి విజయవాడలో పరీక్ష రాసే అవకాశం ఇచ్చారు . వెంటనే సంగారెడ్డి లో మెదక్ జిల్లా రిపోర్టర్ గా నియమించారు . నన్ను , వెల్జాల చంద్ర శేఖర్ , అయూబ్ ఖాన్ ముగ్గురినీ రాధాకృష్ణ నియమించారు . ముగ్గురిలో ఇద్దరం ఇప్పటికీ రాస్తూనే ఉన్నాం . అయూబ్ ఖాన్ చాలా కాలం క్రితమే ఈ రంగం వదిలి వెళ్లారు . రిపోర్టర్ గా నియామకం తరువాత ఓ సారి ఆఫీస్ కు వస్తే జొన్నలగడ్డ రాధాకృష్ణ మీది ఏ కులం అని అడిగారు . ఆ ఆ ప్రశ్న అర్థం కాలేదు అన్నట్టు ముఖం పెడితే , ఏమీ లేదు .. నువ్వు మా కులం అని నేను నిన్ను ప్రోత్సహిస్తున్నాను అని ఆఫీస్ లో గుసగుస లు అందుకే అడిగాను అన్నారు . మీ కులం కాదు అన్నాను . అప్పుడూ ఇప్పుడూ మరో పని లేదు , వ్యసనం లేదు .. రాయడమే వ్యసనం దాంతో అప్పుడు ప్రతి రోజు భూమిలో నా పేరు కనిపించేది . మల్లారెడ్డి పేరు మురళి పేరు పేపర్ లో రోజూ కనిపించాల్సిందే అని రాధాకృష్ణ జోక్ వేసి . కులం గురించి ఉరికే అడిగాను ఎక్కువగా ఆలోచించకు అదిలేయ్ అన్నారు . జిల్లాల్లో రిపోర్టర్ లకు అక్రిడేషన్ ఇస్తారు . ఆ ఫారం మీద ఎండి సంతకం చేశారు . ఎండి కాదు ఎడిటర్ సంతకం చేయాలి అని తిప్పి పంపితే .. అప్పుడు ఆ ఫారం పట్టుకొని మల్లారెడ్డి ఛాంబర్ కు మొదటి సారి వెళ్ళాను . కొద్దిగా పక్కకు ఉండే బిల్డింగ్ లో ఆయన ఛాంబర్ . వెళ్ళగానే ఫారం ఇచ్చి విషయం చెబితే .. ఓహో బుద్దా మురళి అంటే నువ్వేనా అని ప్రసన్నముగా నవ్వి సంతకం చేశారు . ఆయనది ఎంత గొప్ప మనసు , విశాల హృదయం అనేది అప్పుడు అర్థం కాలేదు కానీ అదే శాస్త్రి వద్దకు అలా వెళితే .. ముందు ఉద్యోగం ఊడబెరికే వారు . దాదాపు 15 ఏళ్ళ పాటు భూమిలో పని చేసి రాజీనామా చేసి కొంత కాలానికి తిరిగి వచ్చిన విష్ణు ప్రియా అనే సబ్ ఎడిటర్ ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడానికి నిర్ణయం . ఎడిటర్ ఇంకా ఆఫీస్ కు రాలేదు . ఆమె వచ్చి పని చేసిన ఆఫీస్ కదా అని కంప్యూటర్ పై ఏదో టైప్ చేస్తుంటే అప్పుడే వచ్చిన శాస్త్రి తన అనుమతి లేనిదే కంప్యూటర్ ముట్టుకున్నారని , ఉద్యోగంలో చేర్చుకోవడం లేదు అని చెప్పి పంపించేశారు . తరువాత ఏ బీకే ప్రసాద్ ను ఎడిటర్ గా నియమించారు . వారితో పాటు శ్రీనివాసరావు అని ఒకరు ఉండేవారు . హడావుడి తప్ప పెద్దగా ఏమీ మార్పు కనిపించలేదు . వామపక్షాల వాళ్ళు సాధారణంగా పార్టీ వారిని మీడియాలో కూడా జొప్పిస్తారు . తామే మేధావులం అనే గట్టి మూఢనమ్మకాలు కూడా కొందరు వామపక్షాల వారికి ఎక్కువే . ఆఫీస్ లో ఫర్నిచర్ అటు ఇటు మార్చడం తప్ప పత్రిక అభివృద్ధికి పెద్దగా ప్రభావం చూపినట్టు గుర్తుకు రావడం లేదు . తరువాత పతంజలి ఎడిటర్ గా వచ్చారు . అద్భుతమైన వ్యంగ్యం రాస్తారు . గురజాడ అప్పారావుకన్నా నాకు పతంజలి వ్యంగ్యం నచ్చుతుంది అంటే అలా అనకు పతంజలి కూడా ఈ మాటను ఒప్పుకోరు అని సబ్ ఎడిటర్ రాజేశ్వర ప్రసాద్ అనే వారు . పతంజలి 90-92 ప్రాంతం లో ఆంధ్రభూమిలో అద్దం అని ఒక పేజీ పరిచయం చేశారు . దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పత్రికల్లో వచ్చినవాటిని తెలుగులో అనువాదం చేసి వేసేవారు . అందులో ఆ పత్రిక ఫోటో ఉండేది . ఏ మాత్రం ఇగో చూపకుండా అందరితో కలిసి పోయే వారు . ఆంధ్రభూమిలో పతంజలి చెప్పిన గొప్ప జోక్ ... అప్పుడు ఈనాడు నుంచి న్యూస్ టైం రాబోతుంది దాని ప్రభావం పై సహజంగా డక్కన్ క్రానికల్ లో ఆందోళన ఉంటుంది . ఈనాడు పెద్ద పత్రిక , మంచిమార్కెటింగ్ నెట్ వర్క్ ఉంటుంది . అప్పుడు పతంజలి కూల్ గా డక్కన్ క్రానికల్ ను వెంకట్రామ్ రెడ్డి ( డిసి ఎండి ) కూడా ఏమీ చేయలేడు అన్నారు . అంటే డిసి ఎండీనే ఏమి చేయలేనప్పుడున్యూస్ టైం ఏం చేస్తుంది అని ... అదే నిజమైంది న్యూస్ టైం , టైమ్స్ అఫ్ ఇండియా నే కాదు .. చివరకు డిసి ఎండి వెంకట్రామ్ రెడ్డి కూడా డిసి ని ఏమీ చేయలేక పోయారు . వేల కోట్ల రూపాయల ఫ్రాడ్ లో ఇరికినా డిసి చెక్కుచెదరలేదు . ఆఫీస్ ముహూర్త బలం తప్ప లేకపోతే మేనేజ్ మెంట్ మెళుకువలు ఏమీ తెలియని వీరి చేతిలో డిసి చెక్కుచెదరకుండా ఉండడం ఏమిటీ అని స్టాఫ్ అనుకునే వారు . మేనేజ్ మెంట్ కు మెళుకువలు నేర్పే ఓ ప్రోగ్రాం లో ఓ మంచిమాట చెప్పారు . ఇతర సంస్థలు రెట్టింపు జీతం ఇస్తామని పిలిచేంతగా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి , సంస్థను వదిలిపెట్టి పోవడానికి ఉద్యోగి ఇష్టపడనంతగా ప్రేమించాలి.. భూమిలో ఇతర పత్రికలతో పోలిస్తే రెట్టింపు జీతం . ఐతే పని చేసే వారికి చేయని వారికి ఒకే ట్రీట్ మెంట్ ఉండేది . ఎడిటర్ ఎవరు , ఓనర్ ఎవరు అనేది సంబంధం లేకుండా భూమిని ప్రేమించి తమ ఇంటిలా భావించిన సిబ్బంది ఉండడం భూమి ప్రత్యేకత ... ఎంతో మంది మహానుభావులు పని చేయడం వల్లనే ఆ సంస్కృతి నిలిచిపోయింది . - బుద్దా మురళి

20ఏళ్లయినా జాడ లేని బడుగు ^ సీత ^ ... మీడియా రాజకీయాలకు అతి తెలివితో బలి ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -49 ---------------------------------

మీడియా రాజకీయాలకు అతి తెలివితో బలి ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -49 ---------------------------------- ఒకటి కాదు రెండు కాదు .. దాదాపు 20 ఏళ్ళ నుంచి ఓ బడుగు^ సీత ^ జాడ తెలియడం లేదు . ఎక్కడున్నారో , ఏమయ్యారో ? ఎక్కడ అజ్ఞాత జీవితం గడుపుతున్నారో ? నా జర్నలిస్ట్ జీవితం లో ఇదో ఆసక్తికర సంఘటన కావడం తో గుర్తుకు వచ్చింది . నా జీవితంలోనే కాకుండా ఆంధ్రభూమి సంస్థ లోనూ ఓ ఆసక్తికరమైన అనేక మలుపులు తిరిగిన సినిమా కథలాంటి కథ . బాస్ ల రాజకీయాలకు బలైన ఓ అమాయక , బడుగు ^ సీత^ ఉదంతమిది . సంగారెడ్డిలో 87 లో పని చేసేప్పుడు సీతా మాణిక్యం అనే కుర్రాడు పరిచయం. సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పాడు . ఆ తరువాత నేను అనేక జిల్లాలు తిరిగి హైదరాబాద్ వచ్చాక వీరి విషయం మరిచిపోయాను . ఓ రోజు సీతా మాణిక్యం ఆంధ్రభూమి ఆఫీస్ కు వచ్చి సినిమా రంగం పై ఓ బుక్ రాసినట్టు చెప్పాడు . అటెండర్ గా పని చేసే తండ్రి రిటైర్ అయితే వచ్చిన డబ్బుతో సినిమా రంగం పై బుక్ .. ఆ బుక్ లో ఏముందో ఊహించగలరా ? అప్పడు సినిమా రంగం లో వెలిగిపోతున్న దర్శకేంద్రులు , దర్శక రత్నలు , దర్శక బ్రాహ్మలు , దాసరి నారాయణరావు , రాఘవేంద్రరావు లాంటి ఇంకా చాలా మంది హేమా హేమీలు సినిమాల్లో ఏం తప్పు చేస్తున్నారు , సినిమా ఎలా తీయాలో వారికి సూచనలు చేస్తూ పుస్తకం రాశాడు . కొడుకు సినిమా రంగాన్ని ఏలేస్తాడు అనుకున్నాడో ఏమో కానీ రిటైర్ మెంట్ డబ్బులు ఇస్తే బుక్ వేశారు . అమాయకత్వం అంతటితో ముగియలేదు. ఆ పుస్తకాన్ని తీసుకోని రాఘవేంద్రరావు , దాసరి తో పాటు అప్పటి దర్శకులు అందరినీ కలిసి ఈ బుక్ చదివి సినిమా ఎలా తీయాలో తెలుసుకోండి అన్నట్టు ఇచ్చి వచ్చాడు . ఆ సమయంలో ఆ దర్శకుల ముఖ కవళికలు ఉహించుకోవాల్సిందే ... సినిమాల్లో అవకాశం కోసం ఎదురు చూస్తున్న సీతా మాణిక్యం ఈ పుస్తకం ద్వారా ప్రముఖ దర్శకుల దృష్టిలో పడతాను అనుకున్నాడు . వారి నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తుంటే ఎంతకూ పిలుపు రాలేదు . అటునుంచి నరుక్కు వద్దాం అనుకొని ప్లాన్ మార్చాడు ***** చాలా మంది సినిమా జర్నలిజం ద్వారా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తారు . చాలా మంది విజయం సాధించారు కూడా . అదే మార్గంలో వెళ్ళాలి అని ఆంధ్రభూమిలో పార్టీ టైం విలేకరి ( స్ట్రింగర్ ) గా చేరాడు . మెల్లగా సినిమా పై ఆసక్తి ఉందని ఎడిటర్ కు చెబితే ఒకే అని పంపారు . ఓ రోజు ఏదో రహస్యం అన్నట్టు ఆఫీస్ దగ్గర ఉన్న ఇరానీ హోటల్ కు తీసుకువెళ్లి , రహస్యంగా దాచిన పేపర్ లు చేతిలో పెట్టారు . అంతా చదివి నేను ఆశ్చర్యంతో చూస్తాను అనుకున్నాడు . ఆ పేపర్లు చదివి అతని చేతిలో పెట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు ఎడిటర్ ఇష్టపడరు . మడిచి ఇంట్లో పెట్టుకో అన్నాను . సినిమా జర్నలిస్ట్ లు అందరూ కవర్లు తీసుకోని సినిమా వార్తలు రాస్తారు అనేది ప్రధాన అంశం . పోనీ ఈ సంస్కృతిని వ్యతిరేకిస్తున్నాడా ? అంటే అది కాదు , మీరే డబ్బులు తీసుకుంటారా ? నాలాంటి కొత్త వారికి ఇప్పించరా ? అని అడుగుతున్నట్టుగా ఉంది . నీ బాధ నీకు డబ్బులు ఇవ్వకపోవడం అయితే అదే అడుక్కో ఇంత పెద్ద వ్యాసం ఎందుకు అని చెప్పాను .. ****** నేను ఊహించని విధంగా మరుసటి వారం ఆంధ్రభూమి సినిమా సంచిక వెన్నెలలో పెద్దగా వచ్చింది . రివ్యూలు నిష్పక్ష పాతం గా రాస్తారని భూమి సినిమా స్పెషల్ వెన్నెలకు సినిమా రంగం లో మంచి పేరుంది . సినిమా జర్నలిస్ట్ లు , సినిమా వాళ్ళు చూపే వివక్ష , కవర్ల సంస్కృతి పై మాణిక్యం వ్యాసం సంచలనం సృష్టించింది . సినీ రిపోర్టర్ ల కుటుంబం సమావేశమై మాణిక్యం ను బహిష్కరించాలని నిర్ణయించారు . బయటి నుంచి బయటే పంపించారు . అతను ఎడిటర్ కు చెప్పడం తో ఎడిటర్ శాస్త్రి ఫోన్ చేసి మన సినిమా రిపోర్టర్ ను బహిష్కరించారు . వెళ్లి సినిమా వాళ్లందరితో మాట్లాడి ఓ స్టోరీ రాయి అని ఆదేశం ... రాజకీయ నాయకులనంటే ఆడుకోవచ్చు కానీ మనుష రూపం లో ఉన్న దేవతలం అనుకునే సినిమా వాళ్ళ దగ్గరకు పోవడమా ? తప్పదు అని మిత్రుడు చక్రధర్ కు ఫోన్ చేస్తే వస్తా అంటే ఇద్దరం వెళ్ళాం . హీరో వెంకటేష్ ను కలిసి విషయం చెబితే .. మీకు తెలుసు కదా వివాదాల్లో నేను జోక్యం చేసుకోను అన్నారు . నాకేం తెలుసండి .. మిమ్ములను మొదటి సారి కలుస్తున్నాను అన్నాను . అక్కినేని నాగేశ్వర రావు సుదీర్ఘంగా మాట్లాడారు . స్టూడియో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో కడతారు . ఇది అందరి సొత్తు అందరూ రావచ్చు . ... బహిష్కరించడం తప్పు ఇలా సాగింది ఆక్కినేని ఉపన్యాసం . అందుబాటులో ఉన్న వారితో మాట్లాడి పెద్ద స్టోరీ రాసి ఎడిటర్ కు ఇచ్చాను .పార్టీ కార్యాలయాల్లో ఎంత పెద్ద నాయకుడైన జోకులేస్తూ మాట్లాడే రిపోర్టర్ కు బంజారాహిల్స్ లో అడ్రెస్ లు వెతుక్కొని , నటులను పట్టుకొని మాట్లాడడం చాలా కష్టమే . ***** సాయంత్రం ఏం జరిగిందో , ఎవరు రాయబారం నడిపారో తెలియదు . నేను రాసిన వార్త ను పక్కన పెట్టి ఎడిటర్ తేలిగ్గా వద్దులే అన్నారు . వద్దులే అనే వాడు నన్ను అంత ఇబ్బంది పెట్టి ఉదయం అంత ఆవేశంగా మాట్లాడడం ఎందుకు అనిపించింది . ఎడిటర్ ఆవేశానికి తగ్గట్టు రోడ్డున పడి తిరిగాను . ఇలా ఎందుకు జరుగుతుంది అనేది , వయసు , అనుభవం పెరిగాక అర్థం అవుతుంది . సాధారణంగా ఇలాంటి తెలివి తేటలు గల్లీ లీడర్లు చూపిస్తారు . ఇద్దరి మధ్య పంచాయితి పెట్టి పెద్ద మనిషిలా వాటిని పరిష్కరిస్తారు . తనతో వార్త రాయించి , తనను బహిష్కరించిన తరువాత తనను అటు సినిమా వాళ్ళు , ఇటు భూమి పట్టించుకోక పోవడం తో సీతా మాణిక్యం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం . అదీ సినిమా ఫక్కీలోనే ... ఆంధ్రభూమి ఆఫీస్ గేటుకు అనుకొనే కార్పొరేట్ ఆస్పత్రి ఉంటుంది . ఆంధ్రభూమి గేటు వద్ద పడిపోతే కాళ్ళు కార్పొరేట్ ఆస్పత్రి వద్ద ఉంటాయి . నిద్రమాత్రలు మింగి పడిపోగానే అంతా పరిగెత్తి ఆస్పత్రిలో చేర్పించాం . సాయంత్రం గుడిపూడి శ్రీ హరి రాయబారానికి వచ్చారు . మీరూ , ఎడిటర్ , సినిమా వాళ్ళు అంతా బాగానే ఉంటారు . పాపం ఆ పిచ్చోడే అని ఏదో అంటే ఆయన అంతా సర్దుబాటు చేస్తాను అన్నారు . తరువాత పోలీసులు వస్తే జరిగింది పూసగుచ్చినట్టు వివరించా .. తరువాత నాకు చుట్టుకుంటుంది అని తెలియక .. తెలిస్తే ఎడిటర్ ను కలవండి వారికి అంతా తెలుసు అనేవాడిని .అప్పుడు ప్రముఖ సినిమా జర్నలిస్ట్ లు అంతా ఈ కేసులో కోర్ట్ చుట్టూ తిరిగారు . తన ఆత్మహత్యకు ఎవరెవరు కారణమో మాణిక్యం ఓ లేఖ రాసిపెట్టడం తో అందులో పేర్లు ఉన్నసినిమా రిపోర్టర్ లు అందరూ కోర్ట్ చుట్టూ తిరగాల్సి వచ్చింది . సీతా మాణిక్యం ఒక రకంగా సినిమా రిపోర్టర్ లకు సినిమా చూపించాడు . ***** పనికిరాని వ్యాసం వేయడం ఎడిటర్ తప్పు . ఎడిటర్ అంటే దేవుడు . దేవుడు ఆజ్ఞాపిస్తే ఏదైనా చేయవచ్చు అనుకోని ఆవేశంతో ఊగి పోవడం రిపోర్టర్ తప్పు .. రాయించేప్పుడు భరోసా ఇచ్చి , సమస్య వచ్చినప్పుడు తన్ని పంపిస్తారు అనేది రిపోర్టర్ కు సగం జీవితం సంకనాకి పోయాక తెలుస్తుంది . ***** తరువాత మాణిక్యం ఏమయ్యాడో అంతా మరిచిపోయాక ఆఫీస్ లో కలకలం .ఎడిటర్ గ్రంథసాంగుడు , కళాకారుడు అంటూ పెద్ద కరపత్రం అన్ని పత్రికా కార్యాలయాల్లో హాట్ టాపిక్ గా మారింది . చివరకు దీన్ని సైతం తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఎడిటర్ ప్లాన్ . అసమర్ధత తో రైలు ప్రమాదం జరిగితే దేశ ద్రోహుల కుట్ర నాకే ఓటు వేయండి అని ప్రచారం చేసినట్టు . నక్సల్స్ కింద బాంబు పెడితే ముందస్తుకు వెళ్లి నాకే ఓటు వేయమన్నట్టు .. తన కళారూపాలపై వచ్చిన కరపత్రాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూశారు . చూడ్డమే కాదు కరపత్రాన్ని అడ్డుపెట్టుకొని ఆఫీస్ లో భయానక వాతావరణాన్ని సృష్టించి అందరూ తన గుప్పిటలో ఉండేట్టు చేసుకున్నారు . ఆఫీస్ లో ఎవరికి ఎవరు పడక పోతే కరపత్రం వాడే వేసి ఉంటాడు అని అనుమానం . చివరకు బయటి నుంచి రాసే పాత్రికేయ అనే సినిమా ఫ్రీ లాన్సర్ , అప్పుడు రిటైర్ మెంట్ కు దగ్గరగా ఉన్న సుగం బాబు అనే సబ్ ఎడిటర్ ను పట్టుకొని కరపత్రం నువ్వే వేశావు కదా ? అని బెదిరింపు . అతను వణికిపోయాడు . భూమిలో యూనియన్ చాలా స్ట్రాంగ్ . పాత్రికేయను పట్టుకొని ఏరా మా స్టాఫ్ ను బెదిరించేంత మొనగాడివా ? ఇంకోసారి ఆఫీస్ కాంపౌండ్ లో కనిపించవద్దు అని వార్నింగ్ ఇచ్చి పంపారు . యూనియన్ అనేది లేకపోతే పర్మనెంట్ ఉద్యోగి అనే వాడిని ఒక్కడిని ఉంచకుండా పంపించి ... భయంతో వణికిపోయే.. తన కనుసన్నల్లో ఉండే విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులతో ఎడిటర్ఆ ఫీస్ నింపేసేవారు .. కరపత్రం ఎడిటర్ మీద వస్తే ఎడిటర్ సంతోషంగానే ఉన్నారు కానీ ఆఫీసులో ఒక్కొక్కరు వణికిపోతున్నారు . తప్పు చేయనప్పుడు వణికిపోవడం ఎందుకు? అని డైలాగులు చెప్పవచ్చు . ఆ రోజుల్లో పత్రికల్లో ఉద్యోగం అంటే అంతే .. ముళ్ళు వచ్చి ఆకుమీద పడ్డా? ఆకు వెళ్లి ముళ్ళు మీద పడ్డా .. ఉడేది కాంట్రాక్ట్ ఉద్యోగి ఉద్యోగం .. పర్మనెంట్ ఉద్యోగి అయితే బదిలీ . సీతా మాణిక్యం తప్ప ఇంకెవరికీ మీ మీద కరపత్రం వేయాల్సిన అవసరం లేదు . అతనే అని శాస్త్రీయంగా విశ్లేషించి చెప్పాను . రాత్రి 11. 40 వరకు అత్యవసర సమావేశాలు . నేను చేసిన శాస్త్రీయ విశ్లేషణ కు తల ఉపినట్టు అనిపించింది . హమ్మయ్య అనుకున్నాను . అందరినీ రక్షించాను అని నన్ను నేను మనసులోనే అభినందించుకొని .. ఇంటికి వెళ్ళాను . సికింద్రాబాద్ నుంచి వారాసిగూడ మా ఇంటికి వెళ్ళడానికి దాదాపు పదిహేను నిమిషాల సమయం పడుతుంది . బైక్ పార్కు చేసి ఇంట్లో అడుగుపెడుతున్నాను . ల్యాండ్ లైన్ ఫోన్ రింగ్ అయింది . అర్ధరాత్రి ఎవరు ఫోన్ చేశారా ? అని చూస్తే ఫోన్ ఎత్తగానే ఎడిటర్ ... ఆ కరపత్రాలు పంచడం అయిపోయిందా ? అని అడిగాడు . అలా అడిగితే ఉద్యోగికి గుండె ఆగినంత పని అవుతుంది . సైకాలేజి పై అభిమానం , అయన తీరు గురించి ఎంతో కొంత అవగాహన ఉండడం వల్ల .. భయపడకుండా .. కరపత్రాలు పంచడం కాదు .. మురళి ఆ కరపత్రం చదువుతుండగా నేను చూశాను అని ఎవరైనా చెప్పినా ఆధారాలు అవసరం లేదు .. రాజీనామా చేస్తాను అన్నాను . ఇది పొలిసు కానిస్టేబుల్ తరహా విచారణ . ఒక వేళ నిజంగానే కరపత్రాలు పంచితే భయపడి పోయి చూశాడేమో అనుకోని నిజం చెబుతారు . చదివాను అంటే రాజీనామా చేస్తాను అనేసరికి ... ఒక్కసారిగా తగ్గిపోయి అదేంటీ నువ్వు చదవలేదా అని అడిగారు . చదవలేదు . చదవను అన్నాను . అందులో నీ గురించి కూడా ఉంది . చదవకపోవడం ఏమిటీ అంటే , నేనెంటో నాకు తెలుసు , వాడెవడో కరపత్రం లో చెప్పాలా ? అందుకే చదవలేదు అన్నాను . అంతకు ముందే ఆంధ్రప్రభ మిత్రుడు చెన్నూరు గణేష్ కరపత్రం పంపుతాను అంటే వద్దు అన్నాను . నువ్వు మొదట్లో మంచివాడివి అని , ఇప్పుడు ఎడిటర్ కు చెంచా గా మారా వు అని కరపత్రం లో రాశాడు అని మిత్రుడు చెబితే మేనేజ్ మెంటే ఎడిటర్ కు చెంచా గా మారిపోయింది .. ఉద్యోగులు ఒక లెక్కనా అని జోకేసి . కరపత్రం చదివే ఆసక్తి లేదు అని చెప్పాను . ******* అంతా మరిచిపోయాక ఓ రోజు నాకు కోర్ట్ నుంచి వారెంట్ ... సీతా మాణిక్యం కేసులో సాక్షిగా హాజరు కమ్మని . ఎడిటర్ ను కలిసి వారెంట్ చూపితే కోర్టు కు వెళ్లాల్సిన అవసరం లేదు అన్నాడు .. నిజానికి నేను ఇదంతా రాసింది. జర్నలిజం లోకి కొత్తగా వచ్చే వారికి ఈ విషయం చెప్పడానికే . ఎడిటర్, మేనేజ్ మెంట్ అంటే కనిపించే దైవం అన్నంత భ్రమలు ఉంటాయి మనకు కొత్తలో ... ఎడిటర్, మేనేజ్ మెంట్ చెప్పాక , పోలీస్ స్టేషన్ , కోర్ట్ , చట్టాలు అన్నీ పిపీలికల్లా కనిపిస్తాయి . మేనేజ్ మెంట్ , ఎడిటర్ అనే వారు పని కోసం భుజం తడతారు . కేసు అయితే పక్కకు తప్పుకుంటారు . కోర్టుల గురించి ఏ మాత్రం అవగాహన ఉన్న వారు కూడా వారంట్ ను పట్టించుకోవలసిన అవసరం లేదు కోర్ట్ కు వెళ్ళ వద్దు అని చెప్పరు . ఎడిటర్ మాట విని వెళ్లక పోతే అరెస్ట్ వారంట్ వస్తుంది . అప్పుడు ఇదే ఎడిటర్ ఉద్యోగం నుంచి తీసేయమని రికమండ్ చేస్తారు . దీన్ని గ్రహించి నిర్ణయం తీసుకోవాలి న్యాయవాది అయిన ఫ్రెండ్ ను అడిగితే వెళ్ళాలి .... భయపడకు అని ... సినీ దర్శకుడు జంధ్యాల ఓ కేసులో కోర్ట్ కు వస్తే చమటలు పట్టాయి వణికిపోయారు అని న్యాయవాద మిత్రులు చెప్పారు . నువ్వు యల్ యల్ బి అయ్యాక కోర్ట్ చూసి ఉంటావ్ .. నేను టెన్త్ లోనే చూశాను . టెన్త్ హాలిడేస్ లో పోతుకూచి సాంబశివరావు అని న్యాయవాది వద్ద జాబ్ చేసేవాడిని . అప్పటి వరకు కోర్ట్ అంటే జస్టిస్ చౌదరి సినిమా తరహాలో వాదించుకుంటారు అనుకున్నా . ఎలా ఉంటుందో తెలుసు అన్నాను . ఎడిటర్ కు చెప్పకుండా కోర్ట్ విచారణకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నా ... సినిమా షూటింగ్స్ లో దర్జాగా కనిపించే సినిమా జర్నలిస్ట్ లంతా కోర్ట్ లో కనిపించారు . వాయిదా పడ్డ ప్రతిసారి ఇలా వస్తున్నాం అన్నారు . బాధితుడు సీతా మాణిక్యం తప్ప అంతా ఉన్నారు . బోనులో నిల్చున్నాక జడ్జీ సీతా మాణిక్యం ఏడీ అని అడిగారు . నాకేం తెలుసు ... ఔను సీతా మాణిక్యం ఏడీ అని నేనూ అడిగాను . సరే మీరు వెళ్ళండి అని పంపించారు . తరువాత నన్ను ఎప్పుడూ పిలవలేదు . కేసు ఏమైందో పట్టించుకోలేదు . ఐతే దాదాపు రెండు దశాబ్దాల నుంచి సీతా మాణిక్యం కోసం చూస్తూనే ఉన్నా ఎక్కడైనా కనిపిస్తాడేమో అని ఏమయ్యాడో తెలియదు .. ఆ రోజు ఎడిటర్ పనికిరాని ఆ వ్యాసం వేయకపోయి ఉంటే జర్నలిస్ట్ గా ఎక్కడో పని చేస్తూ ఉండేవాడు . మాణిక్యం లా కాకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి .. ప్రాక్టికల్ గా ఉండాలి . చట్టం కన్నా ఎడిటర్/ మేనేజ్ మెంట్ గొప్పవాడు కాదు .. - బుద్దా మురళి

12, జూన్ 2023, సోమవారం

ఎడిటర్ మరణిస్తే .... విధ్వం సుకునికి నివాళినా ? అని జర్నలిస్ట్ లుబుక్ వేశారు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -47

ఎడిటర్ మరణిస్తే .... విధ్వం సుకునికి నివాళినా ? అని జర్నలిస్ట్ లుబుక్ వేశారు .. ఒక్కొక్కడు ఒక్కో నరహంతకుడు ... మన ఎడిటర్ దేవుడు అని తప్పించుకున్నా ...
----------------------------------------- రాజకీయ నాయకుడు , సంపన్నుడు , పారిశ్రామిక వేత్త , రచయితలు మరణిస్తే పెద్ద ఎత్తున నివాళి , అవకాశం ఉన్న వాళ్ళు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వ్యాసాలు రాస్తూ ప్రచురించడం కామన్ . ఇలాంటి స్మృతి సాహిత్యం బోలెడు ఉంది మనకు . కానీ ఓక్ పత్రిక ఎడిటర్ మరణిస్తే అతను పెట్టిన బాధల వల్ల ఎంత మంది జీవితాలు నాశనం అయ్యాయో , ఎంత మంది జీవితాలు రోడ్డున పడ్డాయో వ్యాసాలు రాసి , పుస్తకం ప్రచురించడం గురించి విన్నారా ? ఇండియన్ ఎక్స్ ప్రెస్ , ఆంధ్రప్రభలో సర్వాధికారాలు చెలాయించిన సుందరం దయనీయ మైన స్థితిలో మరణించిన తరువాత నలుగురు పాత్రికేయులు సుందరం , దీక్షితులు జర్నలిస్ట్ ల జీవితాలతో ఎలా ఆడుకున్నారో వ్యాసాలు రాసి పాత్రికేయ విలువల విధ్వంసకులకు నివాళులా ? అని పుస్తకం ప్రచురించారు . నాకు తెలిసినంత వరకు ఒక వ్యక్తి మరణించాక అతని ఆకృత్యాల గురించి రాసి పుస్తకం గా ప్రచురించడం అదే మొదటి సారి. ఇప్పటివరకు అదే చివరి సారి . సుందరం తో పాటు దీక్షితులు గురించి రాశారు . ఒక వ్యక్తి మరణిస్తే అతను ఎలాంటి వాడైనా ఇంద్రుడు చంద్రుడు , శిబి చక్రవర్తి , దానకర్ణుడు అని రాయాల్సిందేనా ? అదే మన సంస్కృతి నా ? నిజం చెప్పడం పాపమా ? నిజం ఎక్కడో ఒక చోట రికార్డ్ కావాలి . ***** 2010 ఓ రోజు ఉదయమే జనాంతికం వ్యాసం రాయడానికి ఆంధ్రభూమి కార్యాలయానికి ఉదయమే వెళ్ళాను . వ్యాసం పూర్తి చేసి రిపోర్టర్ గా రొటీన్ డ్యూటీ కి వెళ్ళాలి . సాధారణంగా ఆ టైం లో ఆఫీస్ లో ఎవరూ ఉండరు . లోపలి వెళ్ళగానే మూర్తి అని సండే ఇంచార్జ్ పిలిచి సుందరం మీద జర్నలిస్ట్ నామాల విశ్వేశ్వర రావు వేసిన బుక్ చూపించి , ఈ బుక్ లో ఉన్న సుందరం పేరు తీసేసి మన ఎడిటర్ శాస్త్రి పేరు పెడితే జర్నలిస్ట్ లను వేధించే విషయం సేమ్ కదండీ అన్నారు . కాదండి మన ఎడిటర్ దేవుడు అని బదులిచ్చాను . మీరు కెమెరా ముందు మాట్లాడుతున్నారు ( ఆఫీస్ లో సిసి కెమెరాలు ఉంటాయి ) బయట మాట్లాడుదాం అని బయటకు దరి తీస్తుంటే .. నేను బయట కూడా మీతో ఇలానే మాట్లాడతాను . మన ఎడిటర్ దేవుడు .. మరో మాటే లేదు అన్నాను . ఆఫీస్ లో ప్రతి ఒక్కరు ఇంకొకరిని ఎడిటర్ ఇన్ఫార్మర్ గా చూస్తారు . అంటే అందరూ నన్ను ఎడిటర్ ఇన్ఫార్మర్ గా చూస్తారు . అందరినీ నేను ఎడిటర్ ఇన్ఫార్మర్ గా చూస్తాను . నిజానికి ఇది ఈనాడు సంప్రదాయం అని ఈ మధ్యనే చదివాను . మాజీ ఈనాడు ఉద్యోగి ఒకరు ఈనాడులో ఇన్ఫార్మర్స్ వ్యవస్థ గురించి రాశారు . టీ తాగుతూ ఇద్దరు మాట్లాడుకున్న విషయాలు కూడా మేనేజ్మెంట్ కు తెలిసి పోతాయి . తల్లి తన పిల్లలు ఒకరి మీద ఒకరిని నిఘా పెట్టినట్టు ఈనాడులో నిఘా ఉంటుంది అని ఎవరో రాశారు . ఈనాడు నుంచివచ్చిన శాస్త్రి ఇదే విధానాన్ని ఆంధ్రభూమిలో అమలు చేశారు . ప్రతి ఒక్కరిని ఇన్ఫార్మర్స్ గా మార్చుకున్నారు . సోవియట్ రష్యాలో ప్రతి ఒక్కరిపై ఇంకొకరి నిఘా ఉంటుంది అనుకునే వాళ్ళం . అలా అన్నమాట . కొత్తలో ఓ సారి ఏం జరుగుతుందో చెప్పాలి , నువ్వు చెప్పక పోతే నాకు తెలియదు అనుకున్నావా ? అన్నారు . ఎవరేం మాట్లాడుకుంటున్నారో నన్ను అడిగినప్పుడు , నేనేం మాట్లాడుతున్నానో ఇతరులను అడుగుతారు కదా ? నాకు ఆ మాత్రం తెలియదా? అనిబదులిచ్చాను . బయట టీ తాగేప్పుడు ఏదో జోకులేసుకుంటాం అంతకు మించి ఏం మాట్లాడుతాం . అన్నింటికన్నా నా ఉద్యోగం నాకు ముఖ్యం ఏమీ మాట్లాడుకోము అని చెప్పాను .. ఆఫీస్ లో అందరూ ఇన్ఫార్మర్ లే అయినా రోజూ ఎడిటర్ తో మాట్లాడేవారిని ఇంకాస్త ఎక్కువ ఇన్ఫార్మర్స్ గా ఇతరులు చూస్తారు . ఆఫీస్ లోని వారినే కాదు ఇతర పత్రికల వారిని సైతం అలానే చూసే పరిస్థితి. ఓ సారి వార్తలో ఎడిటర్ టంకశాల అశోక్ ను ఎడిటర్ బుక్ ఏదో రివ్యూ కోసం ఇవ్వడానికివెళితే ఎడిటర్ అమానవీయంగా వ్యవహరిస్తారట కదా ? అని ఏదో అడిగితే , సిబ్బంది తో పని చేయించాలి అంటే ఆ మాత్రం తప్పదు అన్నాను . దేవులపల్లి అమర్ కూడా ఓ సారి ఏదో అడిగితే లేదండి మా ఎడిటర్ చాలా గొప్పవాడు అన్నాను . అభిప్రాయం కన్నా ఉద్యోగం ముఖ్యం . భూమిలో అందరూ ఇన్ఫార్మర్మూ లే అయినా మూర్తికి కాస్త ఎక్కువ ఇన్ఫార్మర్ అనే గుర్తింపు . అతను ఏం మాట్లాడినా నేను మన ఎడిటర్ దేవుడండీ అనే మాట నుంచి దిగడం లేదు . హఠాత్తుగా అతనికో అనుమానం వచ్చింది . ఔను ఈ బుక్ రాసిన అతను ఇంతకు ముందే నా చేతికి ఇచ్చి వెళ్ళాడు . మీరు ఇప్పుడే ఆఫీస్ కు వస్తున్నారు . ఇందులో ఏముందో మీ కెలా తెలుసు అని అడిగాడు . దొరికిపోయా నా ? అనుకుని తేరుకొని .. ఇప్పుడే ఆఫీస్ కు వస్తుంటే గేటు దగ్గర కలిశాడు అతనివద్ద చూశాను అని తప్పించుకున్నాను . నిజానికి ఆ బుక్ ప్రచురిస్తున్నామని చెబితే వద్దు అని చాలా సేపు నచ్చజెప్పాను . ఆ బుక్ వేయాల్సిందే అని వారు నిర్ణయించుకోవడానికి కారణం ఆంధ్రజ్యోతిలో వచ్చిన వ్యాసం . ***** సుందరం మరణించాక ఆంధ్రజ్యోతిలో జగన్ వ్యాసం రాశారు . అక్షర బద్ధుడు సుందరం అని నివాళి వ్యాసం . ఆ వ్యాసం లో సుందరం గురించి తక్కువగా , జగన్ తన గురించి ఎక్కువగా రాసుకున్నారు అనేది ఓ విమర్శ . ఆంధ్రప్రభలో సుందరం వేధింపుల వల్ల జర్నలిస్టులు మరణించారు , అనారోగ్యం పాలయ్యారు , మాట్లాడితే దేశం లో ఏదో ఒక రాష్ట్రానికి బదిలీ చేసి వేధించేవారు . అలాంటి వ్యక్తి గురించి ప్రభలో ఎవరిని అడిగినా అతని పైరవీలు , వేధింపులు చెబుతారు మీరు ఇలా రాయడం ఏమిటీ అని కొంతమంది జర్నలిస్ట్ లు , సుందరం బాధితులు ఆంధ్రజ్యోతికి వెళ్లి మేం రాసిన వ్యాసం కూడా వేసుకోవాలి అని ఎడిటర్ శ్రీనివాస్ ను నిలదీశారు . ఆ నివాళి వ్యాసం రాయడమే ఎక్కువయింది , దానికి మళ్ళీ ఖండన వ్యాసమా ? వేయం పో అని పంపించారు . దాంతో కొంతమంది కలిసి బుక్ వేయాలి అని నిర్ణయించుకున్నారు . నాకు నామాల చెబితే వద్దు అన్నాను . పత్రికల మధ్య , ఎడిటర్స్ మధ్య ఇగోలు ఉంటాయి. పోటీ ఉంటుంది . కానీ మనుషులను వేధించడం లో ఐక్యత ఉంటుంది . బుక్ వేస్తే నీకు ఎక్కడా ఉద్యోగం రాకుండా చేస్తారు . ఇబ్బంది అవుతుంది వద్దు అని చాలా సేపు చెప్పాను . ఐనా జర్నలిస్ట్ ఎలా ఉండకూడదంటే ( కెవి కూర్మనాథ్ ) పాత్రికేయ తక్షకులకు సానుభూతా ? (దామోదర్ ప్రసాద్ పతక మూరు ) అక్షర భక్షకుడికి బానిస నివాళి ( నామాల విశ్వేశ్వర రావు ) నామ మాత్రం సుందరం ( నరేష్ నున్నా ) . వ్యాసాలతో బుక్ వచ్చింది . చిత్రమేమంటే ఈ బుక్ అన్ని పత్రికల కార్యాలయాలకు వెళ్ళినప్పుడు ఎడిటర్ పేరు మారిస్తే అన్ని పత్రికల్లో ఇంతే కదా ? ఎవడైతే నేం ఒక్కొక్కడు ఒక్కో నరహంతకుడు అని శ్రీ శ్రీ కవిత్వం ప్రతి చోట వినిపించింది . కొన్ని చోట్ల మేనేజ్ మెంట్ , కొన్ని చోట్ల ఎడిటర్ , కొన్ని చోట్ల మేనేజర్ కావచ్చు కానీ అన్ని చోట్ల ఒకటే కథ . చాలా మంది బాధితులు నామాలకు ఫోన్ చేసి బుక్ వేసేప్పుడు మాతో మాట్లాడితే మా బాధ రాసె వాళ్ళం , బుక్ ప్రచురణకు మా వాటా డబ్బులు ఇచ్చేవాళ్ళం అని నిష్టుర మాడారు . ***** రిటైర్ అయ్యాక ఏమైనా రాయవచ్చు అది వేరు . కానీ ఉద్యోగం చేస్తూ ఆ నలుగురు తమ బాధలు రాయడం మాములు విషయం కాదు . ఇంత ఇబ్బంది పడుతూ ఉద్యోగం చేయడం ఎందుకు బయటకు వెళ్ళవచ్చు కదా అనే ప్రశ్న కొందరి నుంచి రావచ్చు . అప్పుడు ఉన్నవే నాలుగు పేపర్లు . ఈనాడు అక్కడే కొత్తవారిని తీసుకోని ట్రైనింగ్ ఇస్తుంది . మిగిలిన మూడింటిలో ప్రభ , భూమిలో మాత్రమే మంచి జీతం . ఒక చోట ఉద్యోగం పోతే మరో చోట ఉద్యోగం దొరకడం అంత ఈజీ కాదు . జర్నలిజంలో చాలా ఏళ్ళు ఉన్న తరువాత అది తప్ప ఇంకో పని రాదు . లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వెళుతుంటే మూలమలుపు లో విశాల మైన ఖాళీ స్థలం కనిపిస్తుంది . వందల కోట్ల రూపాయల విలువైన స్థలం . అది ఆంధ్రప్రభ ఆదీనంలో ఉంది . విన్నంత వరకు ఆ స్థలానికి సంబంధించి సరైన డ్యాకుమెంట్లు లేవు . ఎన్టీఆర్ ను దించేసి సమయం లో మనం బాబుకు అండగా నిలుద్దాం ల్యాండ్ సమస్య పరిష్కరించుకోవచ్చు అని సుందరం యాజమాన్యాన్ని ఒప్పించారు . సుదీర్ఘ కాలం బాబు సీఎంగా ఉన్నా ఇప్పటికీ ల్యాండ్ సమస్య పరిష్కారం కాలేదు .అలానే పాడుపడినట్టు ఉంది . ల్యాండ్ సమస్య పరిష్కారానికి తరుచుగా యజమాని కుమారుడు ఆఫీస్ కు వచ్చి సుందరం ముందు కూర్చునే వారట ...సాధారణంగా యజమాని వద్దకు ఎడిటర్ వెళతారు కానీ పని పెద్దది .. ఆంధ్రప్రభను అక్కడ పని చేసే వారే చంద్రప్రభ అని ముద్దుగా పిలుచుకునే వారు . ల్యాండ్ సమస్య పేరుతో సుందరం ఆంధ్రప్రభను చంద్ర ప్రభగా మార్చి తాను ప్రయోజనం పొందారుకాని యాజమాన్యం పేపర్ అమ్ముకొని ... ల్యాండ్ సమస్య పరిష్కారం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉంది . **** మిత్రుడు నామాలకు ఫోన్ చేసి మీరు అప్పుడు పబ్లిష్ చేసిన బుక్ కావాలి .. అప్పుడు వద్దని చెప్పినా బుక్ ఎందుకు వేశారు అని అడిగాను . నాకు ఉద్యోగం అవసరమే కానీ రోడ్డున పడితే సహాయం చేసేందుకు మా అన్నలు ఉన్నారు . వాళ్ళు ఒక్కొక్కరు కోటీశ్వరులు .. మీ పరిస్థితి అంతే మీకు ఉద్యోగం బతుకు తెరువు. ఒక వేళ ఉద్యోగం పోయినా హైదరాబాద్ లోనే వ్యాపారం చేసే మీ అన్నలు ఆదుకుంటారు . కానీ ఒక రోజు ఆఫీస్ లో ఓ పేద బ్రాహ్మణుడు బాధతో చెప్పిన మాటతో బుక్ వేయాలి అనుకున్నాను అన్నాడు . ఇంట్లో పిల్లకు పాలపొడి తెమ్మన్నారు , డబ్బు లేదు , లీవు అడగలేను , మాట్లాడితే ఉద్యోగం తీసేస్తామని బెదిరిస్తారు . ఇదేం జీవితం అని సుందరం వేధింపులు చెప్పి బాధపడ్డాడు . ఏమైనా జరగనివ్వు బుక్ వేయాలని అనుకున్నాను వేశాను అని చెప్పాడు . **** చివరి రోజుల్లో సుందరం దయనీయమైన స్థితిలో మరణించారు . ఆరోగ్య సమస్యలు . చేతితో ఆహరం కూడా తినలేని స్థితి . దోశ ముక్క నోట్లో పెట్టుకున్నా గొంతు దాటి పోని స్థితి అని చూసిన వారి మాట . దేవుడు ఉన్నడా ? కర్మ ఫలం ఈ జీవితం లోనే అనుభవిస్తామా ? ఏమో తెలియదు కానీ . ఉంటే బాగుండు . ఈ జన్మలో చేసిన దానిని ఫలితం ఇక్కడే అనుభవిస్తామనే నమ్మకం ఉంటే మనిషి మనిషిలా వ్యవహరిస్తాడు . సాటి మనుషులను మనుషుల్లా చూస్తాడు . ఎడిటర్ కానివ్వండి ఓనర్ కానివ్వండి . ***** ఏమీ లేదు . దేశాన్ని ఉద్ధరిద్దామని జర్నలిజం లోకి రావాలి అనుకుంటున్నప్పుడు ఇక్కడి పరిస్థితులు ఓ సారి తెలుసుకొని నిర్ణయం తీసుకుంటావని .. ఒకసారి ఊబిలో కూరుకుపోతే బయటపడలేవు . దేశాన్ని మార్చే మాట దేవుడెరుగు బయట దేవుడిగా పూజలు అందుకునే రాక్షసులను తట్టుకొని బతకడం అంత ఈజీ కాదు . - బుద్దా మురళి