31, మే 2023, బుధవారం

ఊ... అంటే రెండు వేల కోట్లకు అధిపతిని అయి ఉండేవాడిని... ఖరీదైన జీవిత పాఠం జర్నలిస్ట్ జ్ఞాపకాలు -38 --------------------

ఊ... అంటే రెండు వేల కోట్లకు అధిపతిని అయి ఉండేవాడిని... ఖరీదైన జీవిత పాఠం జర్నలిస్ట్ జ్ఞాపకాలు -38 ---------------------------------------------- ఊ అంటావా మామ ఊహు అంటావా మామ అని సమంత అడిగితే పాపం అమాయకురాలు అనిపించింది . ఊహు అని ఎవడంటాడు .. ఊ అనే అంటాడు కదా ? మేం అన్నాం ... ఇప్పుడు కాదు మూడున్నర దశాబ్దాల క్రితం . మేం అంటే నన్ను నేను గౌరవించుకోవడం కాదు . నేనొక్కడినే కాదు ఇంకో ముగ్గురం ఊహు అన్నాం . అబ్బా ఎంత పొరపాటు చేశాం అలా అని ఉండాల్సింది కాదు అని మా అమాయకత్వాన్ని తలుచుకొని మేమే నవ్వుకుంటాం . మా ఊహు విలువ ఒక్కొక్కరికి రెండు వేల కోట్లు . ఔను నిజం ***** ఏడాది క్రితం కా కాలనీ ప్రెసిడెంట్ హై టెక్ సిటీకి దగ్గర అని రెండు కోట్ల రూపాయలతో ఓ ఫ్లాట్ కొన్నాడు . గృహ ప్రవేశానికి పిలిస్తే ... డ్రైవర్ కు అడ్రెస్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటే . వెళ్లి ... వెళ్లి ఓ చోట ఆపి అడ్రెస్ చూస్తున్నాడు . ఎదురుగా చూస్తే తెల్లాపూర్ అని బోర్డు కనిపించింది . మెదక్ జిల్లాలో కూడా ఓ తెల్లా పూర్ ఉంది అని డ్రైవర్ కు చెబితే అతను అలానే నా వైపు చూస్తూ సార్ ఇది మెదక్ జిల్లాలోని తెల్లాపూర్ నే మనం వచ్చింది మెదక్ జిల్లా తెల్లా పూర్ కే అన్నాడు . ***** 1988-89 ప్రాంతం లో మెదక్ జిల్లా ఆంధ్రభూమి స్టాప్ రిపోర్టర్ ను . తెలుగు విశ్వవిద్యాలయం పి ఆర్ ఓ గా చేసి రిటైర్ అయిన చెన్నయ్య (ఈనాడు , మురళీ ధర్ శర్మ ( ఆంధ్ర జ్యోతి ) ఇంకో రిపోర్టర్ ఉండేవారు . జేసీ మహంతి అని ఒరిస్సాకు చెందిన ఐఏఎస్ జిల్లా కలెక్టర్ . తెగ ఉత్సాహంగా పని చేసే వాళ్ళం . ఉమ్మడి రాష్ట్రం లో అప్పుడు తొలిసారిగా తెల్లాపూర్ లో డ్రిప్ ఇరిగేషన్ మొదలు పెట్టారు . అక్కడ పూల తోటలు పెంచడానికి కలెక్టర్ చాలా ప్రోత్సాహం అందించారు . మీరు యువకులు జీవితం గురించి మీ అవగాహన తక్కువ . మీరు చేసేవి ప్రైవేటు ఉద్యోగాలు.. ఉద్యోగానికి , జీవితానికి భద్రత ఉండదు . మీకు ఒక్కొక్కరికి తెల్లాపూర్ లో ఐదెకరాల భూమి ఇస్తాను . మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటూనే పూల తోటలు పెంచండి అని కలెక్టర్ సలహా ఇచ్చారు . అప్పుడు భూములు ఇచ్చే అధికారం జిల్లా కలెక్టర్ లకు ఉండేది . ఆయన చెప్పగానే అందరం ఊహు .. అన్నాం . భూములు తీసుకుంటే ఆఫీస్ లో తెలుస్తుంది , ఉద్యోగాలు పోతాయి అని బయటకు చెప్పక పోయినా అందరి భయం అదే . అప్పుడు దాదాపు అందరికీ 900 నుంచి 11 వందల రూపాయల జీతం . ఆ ఉద్యోగం పోతే ఇంకేమన్నా ఉందా ? అనుకున్నాం . 87 లో ఆంధ్రభూమిలో జొన్నలగడ్డ రాధాకృష్ణ నన్ను ఉద్యోగంలో నియమించారు . జిల్లాకు వెళ్లేప్పుడు జర్నలిస్ట్ లకు ఇంటి స్థలం ఇస్తారు తీసుకో అని చెప్పారు కానీ , వ్యవసాయ భూమి ఇస్తా అంటే ఏం చేయాలో చెప్పలేదు . జేమ్స్ బాండ్ 007 లెవల్ లో అసలు కలెక్టర్ మనకు వ్యవసాయ భూమి ఎందుకు ఆఫర్ చేశారు . ఇందులో ఏమైనా కుంభకోణం ఉందా ? అని మాలో కొందరు పరిశోధన మొదలు పెట్టి , డ్రిప్ ఇరిగేషన్ లో ఏదో ఉండే ఉంటుంది అనుకుని సంతృప్తి పడ్డాం . బహుశా కలెక్టర్ మీ కర్మ అనుకోని ఉండొచ్చు . తరువాత ఆయన విదేశాల్లో శిక్షణ కోసం వెళ్లారు . ***** డ్రైవర్ ఇది మెదక్ జిల్లా తెల్లాపూర్ అనగానే అవన్నీ గుర్తుకు వచ్చాయి . అక్కడ పూల తోటలు లేవు . ఆకాశమంత ఎత్తులో అపార్ట్ మెంట్స్ ఉన్నాయి . మొక్క మహా వృక్షమై భూమి నుంచి ఆకాశాన్ని ముద్దాడి నట్టు కాంక్రీట్ జంగల్ లో ప్రతి భవనం ఆకాశానికి కన్ను గురుతుందేమో అనిపించేంత ఎత్తులో భవనాలు ... ఒక్క ఫ్లాట్ కే రెండు కోట్లు అంటే ఐదెకరాలు వెయ్యి కోట్లు , అపార్ట్ మెంట్స్ నిర్మాణానికి డెవలప్ మెంట్ కు ఇస్తే కనీసం వాటి విలువ రెండు వేల కోట్లు . ఒక్కో రిపోర్టర్ కు రెండువేల కోట్లు అంటే ? కోటి రూపాయల్లో ఎన్ని సున్నాలు ? వెయ్యి కోట్లలో ఎన్ని సున్నాలు ? ఇప్పుడు లెక్కలు బాగానే వస్తాయి కానీ అప్పుడు ముందు చూపు లేకుండే ... *** అంత ఆస్తి చే జారి పోయిందని దిగులు పడుతున్నాను అనుకుంటున్నారా ? అంత లేదు . ఇవన్నీ గాలిలో లెక్కలు . ఒక వేళ ఐదు ఎకరాలు తీసుకుంటే ఉద్యోగం పోయేదేమో , ఐదు ఎకరాలు అప్పుడు అమ్ముకుంటే లక్ష కూడా వచ్చేది కాదేమో . చచ్చి చెడి అమ్మకుండా అలానే ఉంచుకుంటే ఎవడో బకాసురుడు ఆక్రమించుకునే వాడేమో , నా భూమి అంటే హత్య చేసే వాడేమో , ఏమో ఏదైనా జరిగేది . ఇంతకూ చెప్పొచ్చేది ఏమిటంటే హైదరాబాద్ అభివృద్ధి ఊహకు అందనంతగా ఉంటుంది . వర్షం పది నీరు నిలిస్తే ఇదేనా విశ్వనగరం అని టుంరీలు టీవీల్లో హడావుడి చేస్తారు . వర్షం పడితే అమెరికా అయినా హైదరాబాద్ ఐనా అంతే .. ఏ టుంరీ ఏమనుకున్నా హైదరాబాద్ విశ్వనగరమే. రింగు రోడ్డుకు అటా ఇటా అని కాదు ఎటో ఓ వైపు ఇంత స్థలం ఉండడం మంచిది . ఇప్పుడు కాక పోతే ఇంకెప్పుడు కొనలేరు . ప్రజలారా తొందర పడకండి భూమి రిజిస్ట్రేషన్ కు ఆధార్ అనుసంధానం చేస్తున్నారు దీనితో భూముల ఘోరంగా పడిపోతాయి అని మేధావి మిత్రుడు తెగ ప్రచారం చేశాడు . అతను ప్రచారం చేసినప్పుడు పది లక్షలకు ఎకరం అని చెప్పిన భూమి ఇప్పుడు రెండు కోట్లు . తెలంగాణ ఏర్పడగానే 2014 లో ఎన్ టివి లో గొప్ప స్టోరీ చేశారు . హైదరాబాద్ లో నిర్మాణ రంగం పడిపోయింది . బెంగళూరు వెళ్ళిపోయింది అని బెంగళూరులో జరుగుతున్నా నిర్మాణాలు చూపారు . పిల్లర్ల నిర్మాణానికి కనీసం 21 రోజులు పడుతుంది . కనీసం 21 రోజులు ఆగి ntv ఈ స్టోరీ చేసినా బాగుండేది . తెలంగాణ నిర్మాణం చేసిన క్షణం లోనే అంత పెద్ద నిర్మాణాలు ఎలా జరిగాయో . బయటకు వెళ్లి విచారిస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏంటో తెలుస్తుంది . మీడియా తమ పార్టీలకు అనుగుణంగా వార్తలు వండుతుంది . వాటిని పట్టించుకోవద్దు హైదరాబాద్ లో ఇల్లు అంటే బంగారమే ... ఇక జర్నలిజం అంటే ఏదో దేశాన్ని పొడిచేద్దాం , ఉద్దరించేద్దాం అనే భ్రమలు వద్దు . డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ జర్నలిస్ట్ కూడా ఆరు దశాబ్దాల క్రితమే చెప్పారు . సబ్బుల వ్యాపారం లాంటిదే జర్నలిజం అని . వారు ఆరు దశాబ్దాల క్రితం గ్రహించిన దానిని మనం ఇప్పటికైనా గ్రహించక పోతే ఎలా ? ఇప్పుడు అన్ని పార్టీలకు మీడియా ఉంది . పార్టీల మీడియా కాలం ఇది .

ఒక్క చెంప దెబ్బ తో అతని దశ తిరిగింది . ఇద్దరి సీఎం ల అభిమానం పొందారు ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -37

ఒక్క చెంప దెబ్బ తో అతని దశ తిరిగింది . ఇద్దరి సీఎం ల అభిమానం పొందారు ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -37 ------------------//////----------- జాతి రత్నాలు అంటూ ఎన్టీఆర్ ఫోటో చూపించి రెండవ స్థానం లో పరిటాల రవి ఫోటో చూపిస్తారు కొందరు . వన భోజనాలు , సమావేశాలుల్లో ఎన్టీఆర్ కటౌట్ తరువాత పరిటాల కటౌట్ కు అంతటి ప్రాధాన్యత ఉంటుంది . అలాంటి పరిటాలను ఒక అధికారి చెంపదెబ్బ కొడితే ఎలా ఉంటుంది ? ఏం మాట్లాడుతున్నావు ? పరిటాలను అధికారి చెంపదెబ్బ కొట్టడమా ? ఔను చెంపదెబ్బ కొట్టడం ... అందులోనూ టీడీపీ అధికారం లో ఉన్నప్పుడు ... ఇద్దరు సీఎంలు ఆదరించారా ? ఔను చంద్రబాబు ,వై యస్ జగన్ మోహన్ రెడ్డి ... ఒకే సారి కాదు ఒకరి తరువాత ఒకరు అభిమానం చూపించారు . 95 ఆగస్టులో ఎన్టీఆర్ చైతన్య రథం పై పార్వతి తో కలిసి వైస్రాయ్ హోటల్ కు వచ్చారు . లోపలి వెళ్లి తమ్ముళ్ళతో మాట్లాడాలి అనుకున్నారు . కనిపిస్తే చాలు కాళ్ల మీద పడి పోతారు . ఉపన్యాసం ఇస్తే కాళ్ల మీద పడి కన్నీళ్లతో కాళ్ళు కడుగుతారు అనుకోని ఉండ వచ్చు . కానీ వాళ్ళు రాజకీయ నాయకులు ఎన్టీఆర్ లా కళాకారులు కాదు . ఎన్టీఆర్ తన వాహనం తో పాటు వైస్రాయ్ లోకి రావడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు . ఇంద్రారెడ్డి లోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకొని తోసేశారు . నేను ఇంకా హోం మంత్రినే అని ఇంద్రారెడ్డి పోలీసులకు చెబుతున్నాడు . అక్కడ ముఖ్యమంత్రినే ఆపేశారు , హోం మంత్రి ఓ లెక్కనా అని అంత ఉద్రిక్త పరిస్థితి లోనూ నవ్వు వచ్చింది . అప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న పరిటాల రవి గేటు తోసుకొని లోనికి వెళ్ళడానికి ప్రయత్నించారు . అక్కడ ఉన్న పోలీసు అధికారి ఇక్భా ల్ పరిటాల రవిని చెంప దెబ్బ కొట్టి లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు . ప్రభుత్వం పడి పోయిన కీలక సంఘటన లో ఇది భాగమే కానీ ప్రత్యేక వార్తగా నిలువ లేదు . మొత్తం వార్తలో ఓ వ్యాఖ గానే కవర్ అయింది . ***** అనంతరం చంద్రబాబు సీఎం గా కుదురుకున్న తరువాత ఇక్బల్ ను తన సెక్యూరిటీ అధికారిగా నియమించారు . చెంపదెబ్బ కొట్టినప్పటి నుంచి ఇక్బల్ దశ తిరిగింది . బాబు ది యూస్ అండ్ త్రో పాలసీ వాడుకుని వదిలేస్తారు అంటారు కానీ కీలక సమయం లో తనకు అండగా నిలిచిన అధికారులు , మీడియా వామ పక్షాల నాయకుల సహాయం ఉంచుకోలేదు . సహాయానికి మించిన మేలు చేశారు . ఇక్బల్ కు ప్రమోషన్ కూడా వచ్చింది . బాబు సీఎంగా ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు ... ఆ తరువాత పరిణామాలు , లోపలి వ్యవహారాలు తెలియవు కానీ రాష్ట్ర విభజన తరువాత ఇక్బల్ హఠాత్తుగా ysr కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు . జగన్ అతనికి శాసన మండలి సభ్యత్వం కల్పించారు . *** ఒక గృహిణిగా ఉన్న రేణుకా చౌదరి నాదెండ్ల పై చెప్పు విసిరి రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి వెళ్లారు .చెప్పు తో కార్పొరేటర్ టికెట్ వచ్చింది .ప్రచారం లో అప్పటి కాంగ్రెస్ మాస్ లీడర్ పి జె ఆర్ ముందు కారు బానెట్ ఎక్కి తొడ కొడుతూ రారా దమ్ముంటే అని సవాల్ చేసి రాజకీయాల్లో ఎక్కడికో వెళ్లారు . ఈ స్ఫూర్తి తో గత ఏడాది మహానాడులో ఒకరిద్దరు మహిళలు మైకు ముందు తొడగొట్టి సవాల్ చేస్తూ ప్రసంగాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు . ఒక్కో సీజన్ లో ఒక్క చర్య తో పాపులర్ అవుతారు . తొడ గొట్టే టెక్నీక్ అన్ని సార్లు ఫలితం చూప దేమో ... ఇక ఇక్బల్ కు చెంప దెబ్బతో దశ తిరిగింది . ఆ రోజు ఆలా చేసి ఉండక పోతే అందరు పోలీసుల్లా వయసు రాగానే రిటైర్ అయి పెన్షన్ తో కాలక్షేపం చేసే వారు . దెబ్బ తో బాబు దృష్టిలో తరువాత కాలం కలిసొచ్చి జగన్ దృష్టిలో పడ్డారు . ఏమో ఏదో ఓ రోజు మంత్రి కూడా కావచ్చు . *** పరిటాలను తొలిసారి హిమాయత్ నగర్ లో ని టీడీపీ కార్యాలయం లో చూశా . నలుగురైదుగురు రిపోర్ట్రర్ లం ఆయనతో మాట్లాడు తుంటే రెండంచెలుగా మా చుట్టూ లుంగీ బ్యాచ్ ఉంది . ఏదో రాజకీయాలు మాట్లాడుకుంటాం మీరేంటి అంటుకొని నిలబడతారు చిరాగ్గా అని ముందు అన్నా తరువాత తెలిసింది . లుంగీ బ్యాచ్ పరిటాల ప్రైవేటు సెక్యూరిటీ అని ... చివరి వరకు ఎన్టీఆర్ తో ఉన్నారు . ఎన్టీఆర్ ను దించేశాక ఓ రోజు బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ నివాసం లో అరుగు మీద మాటా ముచ్చట . ఈనాడు రిపోర్టర్ కనిపించగానే మీ రామోజీ సంగతి , ఈనాడు సంగతి చెబుతా అని పరిటాల సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు . నేనూ విన్నాను ..ఓ చిన్న పత్రికలో ఈ వార్త వచ్చింది . 2004 లో టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక . ఓ సారి అసెంబ్లీ ఆవరణ లో పరిటాల కనిపిస్తే ఇది బై ఎలక్షన్ కేసే అని గుంపులో ఒకరు అనడం వినిపించింది . తన ప్రాణాలకు ముప్పు ఉందని పరిటాల కూడా గ్రహించారు . అనంత పూర్పా లో ర్టీ సమావేశం లోనే మొద్దు శీను హతమార్చారు .!బావ కళ్ళల్లో ఆనందం చూడాలి అని టీవీ 9 ఇంటర్వ్యూ లో మొద్దు శీను చెప్పిన డైలాగు ఆ రోజుల్లో పూరి జగన్నాద్ పోకిరి సినిమా డైలాగును మించి పాపులర్ అయింది . కొన్ని సినిమాల్లో మొద్దు శీను డైలాగులను కూడా ఉపయోగించు కున్నారు .

29, మే 2023, సోమవారం

ఎన్టీఆర్ ఉసురు తగులుతుందా ? విగ్రహానికి వెనుక నుంచి మొక్కిన ముస్లిం మహిళా నేత :: జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 36

ఎన్టీఆర్ ఉసు రుతగులుతుందా ? విగ్రహానికి వెనుక నుంచి మొక్కిన ముస్లిం మహిళా నేత జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 36 ------------------------------------- శత్రువును ఎదుర్కోలేని బలహీన మైన వ్యక్తి నిన్ను దేవుడే చూసుకుంటాడు . నాకు అన్యాయం చేశావు నా ఉసురు నీకు తాకుతుంది అని శపిస్తాడు . శాపాలు నిజం అవుతాయా ? నిజంగా ఉసురు తగులుతుందా ? ఏమో ఇది కూడా దేవుడు ఉన్నాడా ? లేడా ? దయ్యాలు నిజమా ? అబద్దమా ? అనే చర్చ లాంటిది . ఎప్పటికీ కొనసాగే చర్చ . ఎన్టీఆర్ కుటింబీకులు , పార్టీలో సీనియర్ నాయకులు మరణించినప్పుడల్లా ఎన్టీఆర్ ఉసురు తగిలింది అనే మాట వినిపిస్తుంది . ***** జూబ్లీ హిల్స్ లోని ఎన్టీఆర్ భవన్ లో ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ సమావేశాలు జరిగేవి . సమావేశం జరిగే హాలులో ఎన్టీఆర్ చిన్న విగ్రహం ఏర్పాటు చేసి నివాళి అర్పించి కార్యక్రమం నిర్వహించేవారు . ఒక రోజు ఇలా సమావేశం అని వెళితే టీడీపీ మహిళా నాయకురాలు షంషాద్ బేగం అని నిండా నగలు వేసుకొని వచ్చేది . ఎన్టీఆర్ విగ్రహం వెనుక వైపుకు వెళ్లి కొద్ది సేపు కళ్ళు మూసుకొని తనలో తానే ఏదో మాట్లాడుకుంటూ మొక్కింది . ఎంత అభిమానం ఉన్నా ఎవరైనా ముందు నుంచి మొక్కుతారు. ఈమె వెనుక నుంచి మొక్కుతుంది అని వింతగా అనిపించింది . వెనుక నుంచి వెన్నుపోటు ఒకే కానీ మొక్కడం కూడా నా ? అనిపించింది . ఆమె పెద్దావిడనే వార్త రిపోర్టర్ నాగేశ్వర్ రావుతో బాగుండేది . ఆమె నగల మీద జోకులేసేవాడు . మీడియా కూర్చున్న వద్దకు వస్తే నాగేశ్వర్ రావు పిలిచి ఏంటి కథ వెనుక నుంచి మొక్కుతున్నారు అని నవ్వుతూ అడిగితే ఆమె సీరియస్ గానే చెప్పింది . మెహిదీపట్నం లో సొంత ఇల్లు , ఎగువ మధ్యతరగతి కుటుంబం . పదవులపై పెద్ద పెద్ద ఆశలు ఉన్నా మహిళా విభాగంలో తప్ప ఏమీ రాలేదు . నాకు ఎన్టీఆర్ ఉసురు తగిలిందేమో అనిపిస్తోంది . జీవితం గొప్పగా ఏమీ లేదు . ఎన్టీఆర్ ఉసురు తగిలి ఇలా ఉన్నాను అనిపిస్తోంది . అన్నగారు నేను తెలియక పాపం చేశాను క్షమించు అని మొక్కుతున్నాను . ఏమో ఇదో నమ్మకం మొక్కితే పోయేదేముంది అని చెప్పుకొచ్చింది . **** ఎన్టీఆర్ఎ కుటుంబ సభ్యులు , పార్టీ , మీడియా పెద్దలు వెన్నుపోటులో తమ తమ పాత్రలు పోషించారు . ఎన్టీఆర్ కుమారుడు , కుమార్తె మనవడు అకాల మరణం , అప్పటి కీలక నేతలు బాలయోగి , మాధవరెడ్డి , లాల్ జాన్ బాషా , ఎర్రం నాయుడు , హరికృష్ణ వంటి వారు ప్రమాదాల్లో మరణించారు . ఈ మరణాలు జరిగిన ప్రతిసారి ఎన్టీఆర్ ఉసురు తగిలింది అనే చర్చ వినిపించేది . మీడియా ఇలాంటి నమ్మకాలను రాయదు కానీ పార్టీ నాయకుల్లో చర్చ అయితే జరిగేది . ఎన్టీఆర్ ను దించడం లో మూడు పత్రికలు కీలక పాత్ర వహించాయి . వాటిలో ఆంధ్రప్రభ , ఆంధ్రజ్యోతి యజమానులు పత్రికలు అమ్ముకున్నారు. వందల కోట్లు విలువ చేసే ప్రభ భూమి కోసమే అప్పుడు యాజమాన్యానికి చెప్పి ఒప్పించి బాబుకు మద్దతు ఇచ్చారు అని ఓ ప్రచారం . ఇప్పటికి ఆ భూమి సమస్య పరిష్కారం కాలేదు . ప్రభను సంతాలియ అమ్ముకోవాల్సి వచ్చింది . అదే విధంగా జగదీష్ ప్రసాద్ బాబుకు అండగా నిలిచినా జ్యోతిని అమ్ముకొని వెళ్లి పోవలసి వచ్చింది . ఇటీవలే ఓ వీడియో చూస్తే రామోజీ రావు నాకు 87 ఏళ్ళు , ఒక్క సారి కూడా ఇలా నా దగ్గరకు రాలేదు . కాల మహిమనో , జగన్ మహిమనో ఇలా జరిగింది అంటూ మంచం మీద దీనంగా పలకడం నమ్మకం ఉన్న వారికి ఎన్టీఆర్ కు చేసిన ద్రోహం వల్ల అనిపించింది . ఎన్టీఆర్ఉ సురు గురించి ఇదో రకం వాదన ఐతే దీనికి భిన్నమైన ఉదాహరణలు కూడా చూపవచ్చు . ***** ఎన్టీఆర్ ను దించేసిన వారిలో ఎంతో మంది అత్యున్నత స్థాయికి వెళ్లారు . మొత్తం వ్యవహారానికి నాయకత్వం వహించిన చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రం లో అత్యధిక కాలం సీఎంగా ఉన్నారు . పార్టీ పెట్టిన ఎన్టీఆర్ మూడుసార్లు కలిపి ఐదేళ్లు సీఎంగా ఉంటే బాబు ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు , ఆంధ్రాలో ఐదేళ్లు సీఎం గా ఉన్నారు . చివరి వరకు ఎన్టీఆర్ కు అండగా నిలిచినా ఇంద్రారెడ్డి ప్రమాదంలో మారణించారు . వెన్నుపోటుకు మద్దతుగా నిలిచిన ఆంధ్ర జ్యోతిని ఓనర్ అమ్ముకుంటే.. రిపోర్టర్ గా మద్దతు ఇచ్చిన వ్యక్తి పత్రికను కొనుక్కొని ఓనర్ అయ్యారు . అప్పుడు కీలక పాత్ర వహించిన రిపోర్టర్ లు అందరు కూడా ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితికి వెళ్లారు . ఒక్క ఈనాడు మినహా . ఈనాడులో యాజమాన్యమే ప్రయోజనం పొందుతుంది కానీ మిగిలిన పత్రికల్లా రిపోర్టర్ లు ప్రయోజనం పొందే ఛాన్స్ ఉండదు . వైస్రాయ్ క్యాంపు నుంచి ప్రతి క్షణం రాజగురువును కు సమాచారం ఇచ్చిన కీలక రిపోర్టర్ ను బాబు సీఎంగా కుదురుకున్నాక విజయనగరం బదిలీ చేశారు . రాజుల కథల్లో ఇలాంటి సంఘటనలు కనిపించేవి కీలక ఆపరేషన్ లో పాల్గొన్న వారు తరువాత కనిపించక పోవడం . **** దేవుడు దయ్యం , ఉసురు అన్నీ నమ్మకాలే . కొందరు దేవుడు నిజం దయ్యం అబద్దం అంటారు . అలానే ఉసురు అనేది కూడా మూఢ నమ్మకమే అని దేవుడి మీద ఒట్టేసి చెబుతారు . నమ్మకం అయినా మూఢ నమ్మకం అయినా ఎన్టీఆర్ కుటుంబంలోని వారు, పార్టీలో కీలక నేతలు మరణించినప్పుడల్లా , ఎన్టీఆర్ ఉసురు తగిలింది అనే మాట వినిపించింది ...

28, మే 2023, ఆదివారం

ఎన్టీఆర్ ఫోటోలు టాయిలెట్ లో .. పార్టీ రసీదులో బొమ్మ మాయం .ఎండల పేరుతో మహానాడు తేదీ మార్పు:: గుర్తుకొస్తున్నాయి జర్నలిస్ట్ జ్ఞాపకాలు -35 ___________

ఎన్టీఆర్ ఫోటోలు టాయిలెట్ లో .. పార్టీ రసీదులో బొమ్మ మాయం .ఎండల పేరుతో మహానాడు తేదీ మార్పు గుర్తుకొస్తున్నాయి జర్నలిస్ట్ జ్ఞాపకాలు -35 ___________ ఎన్టీఆర్ ను దించేసి చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తరువాత హిమాయత్ నగర్ లోని ఓ బిల్డింగ్ లో కొంతకాలం పార్టీని నడిపించారు . భవనం చిన్నది , తక్కువ గదులు , వచ్చి పోయే వారి సంఖ్య చాలా ఎక్కువ . ఆ బిల్డింగ్ లోనే అందరూ ఉపయోగించే కామన్ టాయిలెట్ లోకి వెళ్ళాను . ఓ మూలకు చూస్తే మనసు చివుక్కు మంది . చదువుకునే రోజుల నుంచి నచ్చిన సినిమా నే తప్ప ప్రత్యేకంగా నచ్చిన నటుడు అంటూ లేరు . మార్నింగ్ షో పాత సినిమాలు తక్కువ ధర టికెట్ తో సినిమా హాలులో ప్రదర్శించేవారు . దాదాపు పాత సినిమా అలా చూసిందే . కత్తి చేతబట్టి యస్ వి ఆర్ , రాజనాల , సత్యనారాయణ వంటి విలన్ల ను చిత్తూ చేసిన అందాల హీరోగానే ఎన్టీఆర్ రూపం మెదడులో ముద్రించి ఉంటుంది .ఆ లాంటి ఎన్టీఆర్ ను ఎంత అవమానకరంగా దించేశారు అనే బాధ ఓ వైపు .. దించేసి కొద్ది రోజులకే ఎన్టీఆర్ ప్రచార ఫోటోలు టాయిలెట్ లో ఓ మూలకు వరుసగా పేర్చి ఉండడం తో చివుక్కు మనిపించి , మౌనంగా వెళ్ళిపోయాను . మనసులో ఏమున్నా రిపోర్టర్ గా నా పని నేను చేయలి . ***** ఫోటో గ్రాఫర్ బాలాజీ అని ఉండేవారు . అక్కడ మూలకు ఫోటోలు ఉంటాయి . ఫోటో తీయి ఎవరికీ చెప్పకు అని కోరాను . మనం ఫోటోలు తీసుకున్నట్టు పార్టీ వాళ్లకు , మిగతా ఫొటోగ్రాఫర్లకు తెలియొద్దు అని వార్నింగ్ . మరో రెండు మూడు రోజులు అయితే ఎన్టీఆర్ జయంతి ఆ రోజు వస్తే బాగుంటుంది అని ... ఆంధ్రభూమి మొదటి పేజీలో టాయిలెట్ లో ఉన్న ఎన్టీఆర్ ఫొటోలతో వార్త సంచలనం . అప్పుటికి ఎన్టీఆర్ వర్గం లో మిగిలి ఉన్న కొద్ది మంది లక్ష్మీ పార్వతి , ఇంద్రారెడ్డి లాంటి వాళ్లు ఎన్టీఆర్ కు నివాళి అర్పించి ఈ వార్తను ప్రత్యేకంగా ప్రస్తావించారు . ఎన్టీఆర్ పై బాబు వర్గానికి ఉన్న గౌరవం దీనితో తెలుస్తుంది అని విమర్శించారు . ఎన్టీఆర్ ఫోటోలు తీసుకువెళ్లి అక్కడ పెట్టండి అని బాబు చెప్పాడు అని నేను అనుకోవడం లేదు . కానీ దైవంగా అప్పటివరకు పూజలు అందుకున్న నాయకుడిని ఒక్క సారి దించేసి కిందపడేసిన తరువాత అక్కడ పనిచేసే అటెండర్ కూడా అలానే చూస్తాడు . ఆ ఫోటోలు అక్కడ పెట్టడంలో అతనికి తప్పేమీ అనిపించదు. రాజకీయంగా ఎన్టీఆర్ బొమ్మను మళ్ళీ ఉపయోగించుకునే రోజులు వస్తాయని అక్కడి అటెండర్ లాంటి సామాన్యుడికి ఆలోచన ఎందుకు వస్తుంది . పత్రికలో వార్త రాగానే తీసేశారు . ***** బాబు చేతికి పగ్గాలు వచ్చిన తరువాత మొదట్లోనే ఒకదాని తరువాత ఒకటి ఎన్టీఆర్ గుర్తులు చెరిపేయాలి అని ప్రయత్నించారు . ఎన్టీఆర్ బతికి ఉండగానే బాబు సీఎంగా గ్లామర్ రాజకీయాలకు కాలం చెల్లింది , ప్రజలు పనితీరుచూసి ఆదరిస్తారు అన్నారు పార్టీ సభ్యత్వ రుసుం రసీదుపై ఎన్టీఆర్ ఫోటో ఉండేది . బాబు పార్టీ అధ్యక్షుడు అయిన మొదట్లోనే ఎన్టీఆర్ ఫోటో తొలగించి చంద్రబాబు తన ఫోటో ముద్రించారు . హరికృష్ణ అభ్యన్తరం వ్యక్తం చేశారు . ఇప్పటికీ బాబు ఫోటోనే ఉంది సూర్యుడు పుట్టినప్పటి నుంచి మే నెలలో ఎండలు ఉంటాయి . నిజానికి మే లో ఎండలు కాదు . ఎండలు ఉండే కాలానికే మనం మే అని పేరు పెట్టుకున్నాం . మే 27,28,29 న మహానాడు జరుగుతుంది . తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి , అంటే ఎన్టీఆర్ హయం నుంచి కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజున మహానాడు జరుగుతుంది . . ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజున జరిగే మహానాడు తేదీలు మార్చాలి అని ప్రయత్నించారు . ఒక సంవత్సరం మహానాడు మేలో నిర్వహించలేదు . దానికి ఈనాడులో పెద్ద వార్త రాయించారు . మే లో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మే లో మహానాడు నిర్వహించవద్దు అని నిర్ణయం అని వార్త . ఆ తరువాత మారిన పరిస్థితుల్లో మళ్ళీ ఎన్టీఆర్ ను ముందుకు తీసుకువచ్చి ఏకంగా దేవుడిని చేశారు . ***** బాబు గారే కంప్యూటర్ కనిపెట్టారు , హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు , సత్యనాదెళ్లను చదివించారు అని గట్టిగా నమ్మే టీడీపీ ఐటీ తరం కుర్రాళ్ళు కొందరికి ఈ విషయాలు ఏమీ తెలియవు . బాబు తో ఏదో గట్టు పంచాయతి ఉండి రాస్తున్నాను అనుకోని కామెంట్స్ పెడితే ఒక్క క్షణం అనిపిస్తుంది . రాయడం అవసరమా ? అని అలా అనుకున్న సమయం లోనే ఉదయం మాడభూషి శ్రీధర్ ఫోన్ చేసి ప్రోత్సహిస్తూ చెప్పిన మాటలు చాలా సంతోషం కలిగించాయి . వారు కేంద్ర సమాచార హక్కు మాజీ కమిషన్ , న్యాయ నిపుణులు , విద్యార్థులకు న్యాయ పాఠాలు బోధించే ప్రొఫెసర్ . ఆనాటి జ్ఞాపకాలు బాగారాస్తున్నారు . రాయండి నేను అప్పుడు లా పాఠాలు బోధించే లెక్చరర్ గా ఉంటూ కూడా వైస్రాయ్ హోటల్ వద్దకు రోజూ వచ్చేవాడిని . మీరు రాసినవి నేను కళ్ళతో చూశాను . న్తర్కు జరిగిన అన్యాయం చూసి చాలా బాధవేసింది . కొన్ని ఇంగ్లీష్ పత్రికల్లో అప్పుడు నేను చూసినవి రాశాను . మీ రాతలు అవన్నీ గుర్తు చేస్తున్నాయి అన్నారు . ఆరోగ్య సమస్య వల్ల కొన్ని రోజుల నుంచి ఎక్కువగా మాట్లాడలేక పోతున్నారు .ఐనా దాదాపు పదిహేను నిమిషాలు కష్టపడి మాట్లాడారు . పూర్తిగా కోలుకొని మాట్లాడేందుకు, రాసేందుకు నాకు ఇంకా రెండేళ్లు పట్టవచ్చు అప్పుడు న్యాయ కోణం లో రాస్తాను అని . ఎన్టీఆర్ కు ఎవరెవరు ఏ విధంగా అన్యాయం చేశారో మాట్లాడ సాగారు . అప్పుడు అనిపించింది వెన్నుపోటులో భాగస్వాములుగా ఉండి ఆర్థికంగా ఎంతో బాగుపడిన వారే నీతులు చెబుతూ రాస్తుంటే మౌనంగా ఉండడం , రాయక పోవడం అన్యాయం అనిపించింది . *** ఎంత కాలం ? ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వారే ఎన్నికల కోసం ఆయనకు దేవుడి రూపం కల్పించి ఓట్లు అడగడం ఉన్నంత వరకు వెన్నుపోటు గురించి రాస్తూనే ఉంటారు ... ( వేటపాలెం గ్రంథాలయం అందుబాటులో ఉన్న వారు 1996 మేలో ఆ ఫోటోలు వచ్చిన ఆంధ్రభూమి ఫోటో సంపాదిస్తే కృతజ్ఞతలు )

27, మే 2023, శనివారం

సకుటుంబ వెన్నుపోటు .. ^ ఇప్పుడు రాస్తున్నారు .. మరి అప్పుడెందుకు రాయలేదు ^ :: జర్నలిస్ట్ జ్ఞాపకం _________________

_________ `వెన్నుపోటు అని ఇప్పుడు రాస్తున్నారు . మరి అప్పుడెందుకు రాయలేదు ? మీ జర్నలిస్ట్ లంతా బాబు వైపే ఉన్నారు కదా ? ` అప్పటి జ్ఞాపకాలను రాస్తుంటే ఒకరు వ్యక్తం చేసిన సందేహం . 95 సంఘటన పై MIC టీవీ లో ఇంటర్వ్యూ చేస్తూ ఇదే ప్రశ్న అడిగారు . 90 శాతం మీడియా బాబు వైపే ఉన్నప్పుడు బాబు కోరుకున్నట్టుగానే మీడియాలో కవరేజ్ వస్తుంది . బాబు కోరుకున్నట్టు ఒక దుష్ట శక్తిపై బాబు సాధించిన విజయంగానే మీడియా చిత్రీకరించడం సహజం . ఐతే నేను ఇప్పుడే కాదు అప్పుడు కూడా వెన్నుపోటు అనే రాశాను . నా గొప్పతనం అని చెప్పడం లేదు . ఆంధ్రభూమిలో అప్పుడు నాకు లభించిన వకాశం జర్నలిస్ట్ మిత్రులు బుద్ధవరపు రామకృష్ణ వేటపాలెం గ్రంధాలయం నుంచి ఆగస్టు వెన్నుపోటుకు సంబంధించి అప్పటి అన్ని పత్రికల ఫోటోలు తీసుకున్నారు . ఆంధ్రభూమి కి సంబంధించి మొదటి పేజీ ఫోటోలు ఇచ్చారు . అప్పుడు ఎందుకు రాయలేదు అనే ప్రశ్నకు సమాధానం చెప్పాను కానీ అప్పటికప్పుడు ఆధారం చూపలేను కదా ? రామకృష్ణ పంపిన ఫొటోల్లో చూస్తే అల్లుడు ఒక్కరి వెన్నుపోటు కాదు , సకుటుంబ వెన్నుపోటు అని మొత్తం కుటుంబం ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచింది నేను రాసిన వార్త 26 ఆగస్టు 1995 ఆంధ్ర భూమి లో కనిపించింది . ప్రజాస్వామ్యం లో నాలుగో స్థంభం , పత్రికా స్వేచ్ఛ వీటి మతలబు బాగానే తెలుసు . మీడియా స్వేచ్ఛ అంటే పెట్టుబడి పెట్టిన యజమాని స్వేచ్ఛ కానీ వార్తలు రాసే జర్నలిస్ట్ ల స్వేచ్ఛ కాదు . తన మిత్రుడి అవినీతిని ప్రశ్నిస్తే పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయించే రోజులు ఇవి . సుప్రీం కోర్ట్ తీర్పును కూడా పక్కన పెట్టి ఢిల్లీ పై ఆర్డినెన్స్ తో అధికారం చెలాయిస్తున్న కాలం . ప్రజల ఓటుతో అధికారంలోకి వచ్చిన పాలకులే ఇలా ఉంటే .. తమ డబ్బు పెట్టుబడి పెట్టి , ఉద్యోగులకు జీతాలు ఇచ్చి లాభం కోసం పత్రిక నడిపే యజమానులు తమ ప్రయోజనాలకు అనుగుణంగా పత్రిక నడుపుతారు కానీ , న్యాయం , ధర్మం , పత్రికా స్వేచ్ఛ వంటి పడికట్టు పదాల కోసం పత్రిక నడపరు . ఐతే తమది వ్యాపారం , మాకు లాభం వచ్చేట్టు నడుపుతాం అని నిజాయితీగా ఒప్పుకోరు నిజాయితి , నీతి , పత్రికా స్వేచ్ఛ , ప్రజాస్వామ్యం అనే పడికట్టు పదాలను వాడుతూ పత్రికా వ్యాపారం నడుపుతారు . అప్పుడు మెజారిటీ మీడియా బాబు కోసం, బాబు చేత అన్నట్టుగా నడిచాయి . మిగిలిన పది శాతం లో ఆంధ్రభూమి స్వరం చిన్నది . అంతమందికి వినిపించే అవకాశం లేదు . అప్పటి వ్యవహారం లో మేజర్ మీడియా ఎన్టీఆర్ ను దించేయడం , బాబు ఇమేజ్ను ఆకాశమంత ఎత్తుకు పెంచడం లో క్రియాశీలక పాత్ర వహించింది . ఆంధ్రభూమి యాజమాన్యం అస్సలు పట్టించుకోలేదు . ఎడిటర్ కు వదిలేసింది . యాజమాన్యం ది విచిత్రమైన తత్త్వం . నమ్మితే పత్రిక ఓనర్ ఎడిటర్ నే అన్నంత గౌరవం ఇస్తారు . ఎవరు చెప్పినా వినరు . ఒక్కసారి నమ్మకం పోయింది అంటే గేటు బయట నుంచి అటు నుంచి ఆటే పంపిస్తారు . లోపలి వచ్చి ఛాంబర్ లో సొరుగు సర్దుకునేంత అవకాశం కూడా ఇవ్వరు . ముందుగా ఏర్పాట్లు చేసుకున్నప్పుడు భూమి వారి దృష్టికి రాలేదో మరేంటో కానీ ఆంధ్రభూమిలో వెన్నుపోటుపై స్వేచ్ఛగా రాసుకునే అవకాశం ఉండేది . కాంగ్రెస్ పేపర్ అని ఠక్కున అనేస్తారు .డీసీ యజమాని , ఆంధ్రజ్యోతి యజమాని ఇద్దరూ గతం లో కాంగ్రెస్ తరపున రాజ్య సభ సభ్యులుగా ఉన్న వారే . కాంగ్రెస్ రాజ్యసభ సభ్యునిగా డీసీ యజమాని ఉండేవారు , ఆంధ్ర జ్యోతి యజమాని ఉండేవారు . ఐతే జ్యోతి టీడీపీని భుజాన వేసుకుంది . డిసి యాజమాన్యం ఎన్నో కీలక సందర్భాల్లో వైయస్ ఆర్ కు , msr కు వ్యతిరేకంగా , టీడీపీకి అనుకూలంగా రాసింది . ఆ వివరాలు మరోసారి . 95 ఆగస్టు లో ఆంధ్రభూమి ఇచ్చిన స్వేచ్ఛను నేను పూర్తిగా ఉపయోగించుకున్నాను . స్వేచ్ఛ ఇచ్చినా ఉపయోగించు కోలేని వారిని చూశాను . ఆగస్టు సంక్షోభం అయినా , తెలంగాణ ఉద్యమం ఐనా అనుమతించిన మేరకు స్వేచ్ఛను జర్నలిస్ట్ గా ఉపయోగించుకున్నాను . నా జీవితంలో అదో గొప్ప సంతృప్తి . ఒక సీనియర్ దాదాపు 20 ఏళ్ళ తరువాత వెన్నుపోటు అని ఓ వ్యాసం లో రాస్తే నేను 95లోనే రాశాను అని గుర్తు చేశా ... వెన్నుపోటుకు నెల ముందు మీడియాలో విపరీతంగా ఎన్టీఆర్ కు లక్ష్మి పార్వతికి వ్యతిరేకంగా వార్తలు వచ్చేవి . బాగా పరిచయం ఉన్న జర్నలిస్ట్ మిత్రుడితో ఈ అంశం పై అప్పుడు మాట్లాడితే మీడియా బాధితుడి వైపు ఉండాలి . అందుకే ఆ రాతలు అన్నారు . వాదన బాగానే ఉంది అనిపించింది . ఎన్టీఆర్ ను దించేశాక , ఇప్పుడు ఎన్టీఆర్ బాధితుడు కదా మరి ఇప్పుడు మీడియా ఎన్టీఆర్ వైపు ఉండాలి కదా ? బాబు వైపే ఉందేమిటి అని అడిగాను . గతంలో అయన వాదన గుర్తు చేస్తూ ... మిత్రుడు భుజం తట్టి రాజకీయాల్లో తమకు అనుకూలంగా ఉండే అనేక వాదనలు ఆ సమయానికి అనుకూలంగా ఉండేవి వినిపిస్తారు అని నవ్వారు . చంద్రబాబు ఒక్కరే కాదు దగ్గుబాటి , ఎన్టీఆర్ కుమారులు , కుమార్తెలు అందరూ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారు అని సకుటుంబ వెన్నుపోటు అని రాశాను . ఎన్టీఆర్ కుమార్తె పురంద్రేశ్వరీ అప్పుడు దగ్గుబాటి ని ప్రోత్సహించి బాబు శిబిరంలోకి పంపించారు అని ప్రచారం . ఓ వ్యాసంలో ఈ మాట నేను అప్పుడు రాస్తే ఫోన్ చేసి , మిమ్ములను ఖండించమని అడగడం లేదు . మీకు విషయం తెలియాలి అని చెబుతున్నాను . ఆమె వెళ్ళమని నన్ను ప్రోత్సహించలేదు . నేనే నిర్ణయం తీసుకున్నాను . తండ్రి పరిస్థితిపై ఆమె బాధపడ్డారు అని చెప్పారు . ఇది మీరు రాయాలి అని చెప్పడం లేదు . మీకు వాస్తవం తెలియాలి అని చెబుతున్నాను అన్నారు . ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన మొత్తం కుటుంబం ఇప్పుడు ఎన్టీఆర్ దేవుడు , పండుగ చేసుకోండి పూజించండి అని పిలుపునిస్తోంది . దేవుడు కాదు అని కోర్ట్ కు వెళ్లిన చిన్న నటిని మా నుంచి బహిష్కరించి పొట్టకొడుతున్నారు . దేవుడు కాదు అన్నందుకే మా నుంచి తరిమేసిన ఈ సినీ పెద్దలు వెన్నుపోటులో ఎన్టీఆర్ కు కాదు బాబుకు అండగా నిలిచారు .

26, మే 2023, శుక్రవారం

మోడీని దారిలో ఆపాను .. ... ఆశ్చర్య పోయారు... జర్నలిస్ట్ జ్ఞాపకం

మోడీని దారిలో ఆపాను .. ... ఆశ్చర్య పోయారు... జర్నలిస్ట్ జ్ఞాపకం --------------------------- మోడీని దారిలో ఆపి .... ఒక్క నిమిషం ఆగు ... ఏ మోడీ ?.. నిరవ్ మోడీనా ? కాదు ... మరి లలిత్ మోడీనా ? హే.. కాదు ... నరేంద్ర మోడీ నే .. కలలోనా ? కాదు ... నిజం ... తొమ్మిదేళ్లయినా ఒక్కసారి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు . మీడియాతో మాట్లాడరు .. ఏ మీడియా ఐనా వ్యతిరేకంగా రాస్తే , మాట్లాడితే మిత్రుడు ఆ మీడియాను కొనేస్తారు . కోపం తెప్పించారని NDTV లాంటి మీడియానే కొనేశారు . అలాంటిది .. నువ్వు ఆంధ్రభూమి రిపోర్టర్ గా ప్రధాని నరేంద్ర మోడీని దారిలో ఆపేసి మాట్లాడాను అంటే మేం నమ్మాలి . నేను ప్రధాని నరేంద్ర మోడీని ఆపాను అని చెప్పలేదు . నరేంద్ర మోడీని ఆపాను అని చెప్పాను . అది కాదు కానీ NDTV లో మహిళా జర్నలిస్ట్ జాకబ్ రాజీనామా ఉదంతం పై మోడీని ఆపిన సంఘటన గుర్తుకు వచ్చింది . మహిళలకు మోడీ ఎంత గౌరవం ఇస్తారు అనే స్టోరీ చేయమని చెబితే - ఆ వివాదం తో 20 ఏళ్ళ ఉద్యోగానికి జాకబ్ రాజీనామా చేశారట . రాజకీయాల్లో ఐనా , మీడియాలో నైనా , చివరకు మన జీవితంలో నైనా తెరవెనుక జరిగింది అంతా బయటకు రాదు . కారణం బయటకు చెబుతున్న దైనా కావచ్చు , చెప్పనిదైనా కావచ్చు ఆమె రాజీనామా నిజం , మోడీ మహిళలకు గౌరవం ఇస్తారనే స్టోరీ NDTV లో రావడం నిజం . మోడీని దారిలో నిలిపాను అని చెప్పి మళ్ళీ ఎక్కడికో వెళుతున్నావు ... ముందు ఆ విషయం చెప్పు .. సరే అక్కడికే వస్తాను . ***** 2004-05 లో హై టెక్స్ కన్వెన్షన్ హాలులో ప్రవాసీ భారతీయ దివస్ జరిగింది . రెండేళ్ల కోసారి ఒక్కో రాష్ట్రంలో జరుగుతుంది . వై యస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన తొలి పెద్ద కార్యక్రమం . దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి వివరించి పెట్టుబడులు పెట్టాలి అని nri లను కోరే కార్యక్రమం . ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రం కాబట్టి వై యస్ ఆర్ ఏర్పాట్లపై ఎక్కువ దృష్టి పెట్టారు . అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు . వైస్సార్ ఉపన్యాసం రొటీన్ గా ఉంది . ఈ సమావేశం లో నరేంద్ర మోడీ ఉపన్యాసం ప్రత్యేకంగా అనిపించింది . అప్పుడాయన గుజరాత్ ముఖ్యమంత్రి .గుజరాత్ గాలిలోనే వ్యాపారం ఉంటుంది . మీరు ఇక్కడి కన్నా విదేశాల్లో అయితే ఎక్కువ సంపాదించవచ్చు అని పుట్టిన దేశాన్ని వదిలి విదేశం వెళ్లిన వారు . ఇక్కడ పెట్టుబడి పెట్టండి అంటే పెడతారా ? ఎక్కడ ఎక్కువ లాభం ఉంటే అక్కడ పెడతారు . కాబట్టి పెట్టుబడి పెట్టండి అని అడగను . ఈ దేశానికి మీరో సహాయం చేయవచ్చు . మీరు ఏ దేశంలో అన్నా అక్కడి వారికీ ఇండియాలోని పర్యాటక ప్రదేశాల గురించి చెప్పండి . ప్రవాస భారతీయులు ఒక్కొక్కరు కనీసం ఐదు మంది ఆ దేశం వారిని ఇండియాకు పర్యాటకులుగా వచ్చేట్టు చేస్తే , ఎంత మంది పర్యాటకులు వస్తారు ? ఎంత విదేశీ మారక ద్రవ్యం వస్తుందో నరేంద్ర మోడీ లెక్కలతో ఉపన్యసించారు . ఉపన్యాసం ప్రత్యేకంగా అనిపించింది . **** హై టెక్స్ చాలా విశాలంగా ఉంది .ఆ ప్రాంతంలో మీడియా కెమెరాలు లేవు . సెక్యూరిటీ హడావుడి లేదు . అప్పుడు ఆంధ్ర జ్యోతిలో పని చేస్తున్న జర్నలిస్ట్ మిత్రుడు వెంకటా చారి (తరువాత జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ) నేనూ ఇద్దరం ఉపన్యాసం విన్నాక హాలులో నడుచుకుంటూ వస్తుంటే ఎదురుగా నరేంద్ర మోడీ ఒక్కరే వస్తున్నారు . గోద్రా అల్లర్లతో అప్పటికే బాగా పాపులర్ . మనకు అవసరం అయిన దానికన్నా ఎక్కువే హిందీ వస్తుంది కదా ? మోడీని పలకరించి చూద్దాం పదా అని ముందుకు వెళ్లి . ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా మేం పలానా మీడియా. మీటింగ్ లో మీ ఉపన్యాసం బాగుంది. అని పొగడ్త బాణం వేసాం . అది బాగానే పని చేసింది . మీడియా నన్ను మెచ్చుకుంటుంది కూడానా ? అని మోడీ నవ్వారు . అంతకు ముందు గోద్రా పై మీడియా మోడీని తీవ్రంగా విమర్శించడం తో మీడియా మెచ్చుకుంటుంది కూడానా ? అని ఆశ్చర్య పోతూ నవ్వారు . మాకు కావలసింది మోడీ ని అక్కడ నిలబెట్టడం కాసేపు మాట్లాడి , అవకాశం ఉంటే మంచి వార్త సంపాదించడం . దారిలో మోడీని ఆపడం , కొద్ది సేపు మాట్లాడడం వరకు సక్సెస్ అయ్యాం . రిపోర్టర్ అనే వాళ్ళు తాజా సమాచారం తో సిద్ధంగా ఉంటే ఎవరితోనైనా ఏమైనా , ఎక్కడైనా మాట్లాడవచ్చు . తాజా సమాచారం అంటే సివిల్స్ కు సిద్ధం అయినట్టుగా కష్టపడాల్సిన అవసరం లేదు . ప్రతి రోజు పేపర్ చదివితే చాలు . పేపర్ చదవడం అంటే మనం రాసిన వార్త మనం చదివి అలసి పోవడం కాదు. పేపర్ మొత్తం సంపాదకీయం తో సహా చదవడం . **** దారిలో నిలిపి మోడీ తో మేం ఇద్దరం అలా మాట్లాడుతుండగానే దారికి ఒక వైపు వివిధ రాష్ట్రాల స్టాల్స్ ఉన్నాయి . మాకు దగ్గర లోనే ఉన్న స్టాల్ లో ఓ మహిళను మోడీ , మోడీని ఆ మహిళ ఒకే సారి చూసి పలకరించుకున్నారు . గుజరాత్ కు చెందిన ఆ మహిళ చాలా కాలం విదేశాల్లో ఉన్నట్టు ఉన్నారు . ముఖం లో ఆ మార్పు ఉంది . బాగా మారిపోయారు అంటూ మోడీ అదే విషయం ప్రస్తావిస్తూ ఆ స్టాల్ దగ్గర ఉన్న మహిళ వద్దకు వెళ్లిపోయారు . ఆమెతో మాట్లాడేప్పుడు కొద్ది సేపు నిరీక్షించినా మా వైపు వచ్చే అవకాశం కనిపించక పోవడంతో వెళ్లి పోయాం . మోడీ మహిళలను గౌరవించడం గురించి ndtv స్టోరీ సంగతి ఎలా ఉన్నా ... మా ముందే మా ఇద్దరు రిపోర్టర్లను మాట్లాడుతుండగానే వదిలేసి మోడీ మహిళ వద్దకు వెళ్లారు .

25, మే 2023, గురువారం

దగ్గుబాటి రాజకీయంగా పరాజితుడు - మనిషిగా విజేత జర్నలిస్ట్ జ్ఞాపకాలు

దగ్గుబాటి రాజకీయంగా పరాజితుడు - మనిషిగా విజేత జర్నలిస్ట్ జ్ఞాపకాలు ^^ మీరు బాబు గారి తోడల్లుడు . ఆయనేంటో మీకు బాగా తెలియాలి . ఇప్పటి వరకు నేను జిల్లాల్లో పని చేశా , హైదరాబాద్ వచ్చి నెల రోజులు అవుతుంది . బాబు ఏమిటో ఒక్క సారికే నాకు అర్థం అయింది . బాబు ఏంటో మీకు తెలియలేదా ? ఎలా నమ్మారు ^^ దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో నేను మాట్లాడిన మొదటి మాటలు . అయన తన ట్రేడ్ మార్క్ చిరునవ్వుతో అలా జరిగిపోయింది అన్నారు . మోసపోయాను అనే బాధ కనిపించలేదు , చిరునవ్వే డామినేట్ చేసింది . 1995లో ఎన్టీఆర్ ను దించేసి చంద్రబాబు సీఎం అయ్యాకదగ్గుబాటి ఇంటికి వెళ్లే సరికి ఆయన శాసన సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు . ^^ నిన్నటి వరకు వాళ్లంతా బయటకు వస్తామని అన్నారు . అందరికీ బాబు ఫోన్ చేసి వెళ్ళవద్దు అని చెబుతూ, మీకు మంత్రిపదవి ఇస్తాను, కార్పొరేషన్ ఛైర్మెన్ పదవి ఇస్తాను అని చెబుతుంటే, అంతా తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు .^^ ఇదీ ఆ రోజు దగ్గుబాటి చెప్పిన విషయం . ***** దేవదత్ పట్నాయక్ అని ఓ డాక్టర్ ఉన్నారు . మహాభారతం , రామాయణం వంటి పురాణాల ఆధారంగా ఆధునిక జీవితం మేనేజ్ మెంట్ పై దాదాపు రెండువందల పుస్తకాలు ఇంగ్లీషులో రాశారు . పలు ఇంగ్లీష్ పత్రికల్లో కాలమ్స్ రాస్తారు . ఓ ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు నిర్వహించిన సదస్సులో యాంకర్ చాలా వివరంగా ఓ ప్రశ్న అడిగింది . మహాభారత యుద్ధంలో శ్రీ కృష్ణుడు అనేక సార్లు ధర్మ విరుద్ధంగా వ్యవహరించారు . నువ్వు నా కుమారుడివే పాండవులను చంపవద్దు అని కర్ణుడి వద్దకు రాయబారం పంపడం , భీష్ముడి వద్దకు అర్జునుడిని పంపి నువ్వు ఎలా మరణిస్తావు అని రహస్యం తెలుసుకోవడం వంటివి వివరించి , ఇన్ని చేసిన శ్రీ కృష్ణుడిది ధర్మ పోరాటం అని ఎలా అంటారు అని అడిగింది . సుదీర్ఘమైన ప్రశ్నకు పట్నాయక్ సంక్షిప్తంగానే సమాధానం చెప్పారు . మీరు చెప్పినవి కరెక్ట్ కానీ అక్కడ పాండవులు , శ్రీకృష్ణుడు ఎవరితో యుద్ధం చేస్తున్నారు ? దుర్యోధనుడి వంటి దుర్మార్గుడితో దుర్యోధనుడితో యుద్ధం అలానే చేయాలి . అది ధర్మ విరుద్ధం అని మరోలా చేస్తే పాండవులు ఓడిపోయే వారు కౌరవులు విజయం సాధించేవారు . మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది కూడా యుద్ధ నీతిలో ముఖ్యమైనది అని వివరించారు . ఈ ధర్మ సూక్ష్మం గ్రహించక పోవడం వల్లనే దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాజకీయాల్లో బాబు చేతిలో మోసపోయారు . మోసపోయారు అనడం కన్నా ఓడిపోయారు అనడం సబబు . తాను నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఎదుటి వారు కూడా నిజాయితీగా ఉండాలని కోరుకోవడం అత్యాశే . *** దగ్గుబాటి వెంకటేశ్వర రావు , నారా చంద్రబాబు ఇద్దరూ ఎన్టీఆర్ అల్లుళ్ళు . ఇద్దరిలో ఆర్థికంగా , చదువు పరంగా దగ్గుబాటి ముందున్నారు . పైగా కులానికి సంబంధించిన గ్రేడింగ్ లోనూ దగ్గుబాటి ది ముందువరుస . ఐతే బాబు రాజకీయం ముందు నిలువ లేక పోయారు .ఎన్టీఆర్ ను దించేసిన వైస్రాయ్ క్యాంపు సమయంలో క్యాంపు లో కన్నా దగ్గుబాటి శిబిరం లో శాసన సభ్యుల సంఖ్య ఎక్కువ .దగ్గుబాటి చెప్పడం తో వీళ్లంతా వైస్రాయ్ శిబిరానికి వెళ్లారు . దగ్గుబాటి ఉప ముఖ్యమంత్రి పదవి . రోజూ మనిద్దరం ఒకే కారులో సచివాలయానికి వెళదాం ఇదీ ఇద్దరి మధ్య అలిఖిత ఒప్పందం . సీఎంగా బాబు కుదురుకోగానే ఒకే కారులో వెళ్లడం మాట దేవుడెరుగు పొమ్మనలేక పొగపెట్టాలని దగ్గుబాటి ఫోన్ చేసినా బాబు లిఫ్ట్ చేయలేదు . తన వర్గం తో బయటకు వెళ్ళాలి అని దగ్గుబాటి ప్రయత్నాలు చేస్తుండడం తో పాలేటి రామారావు తప్ప దగ్గుబాటితో ఎవరూ వెళ్లరు అని ఆంధ్రభూమిలో రాశాను . ఆయనకు బాగా కోపం తెప్పించింది . డిసి యజమాని వెంకట్రామ్ రెడ్డి తో పార్లమెంట్ లో పరిచయం . నాపై ఫిర్యాదు . ఎడిటర్ పిలిచి ఓ సారి మాట్లాడి రా అని చెబితే వెళ్ళాను . ఫిర్యాదు చేసినప్పటికీ ఇంటికి వెళితే చాలా మర్యాదగా మాట్లాడారు . చాలా సౌమ్యుడు , ఎదుటి వారికి గౌరవం ఇస్తారు . ఐనా రాజకీయాలకు సంబంధించి నా అభిప్రాయం మారలేదు . ఇంటికి వెళితే అప్పుడు శాసన సభ్యులకు ఫోన్ చేస్తూ కనిపించారు . దగ్గుబాటి ఆశించినట్టు 70 మంది శాసన సభ్యులు రాలేదు , నేను రాసినట్టు ఒకే ఒక mla కాదు . పన్నెండు మంది దగ్గుబాటితో పాటు తిరిగి ఎన్టీఆర్ నివాసానికి వచ్చారు . లక్ష్మీ పార్వతి ని చూపించి ఎన్టీఆర్ ను దించేసి అధికారంలోకి వచ్చింది బాబు . కానీ బాబు ఒక్కసారి కూడా ఆమెను బహిరంగంగా విమర్శించలేదు . యెర్ర బస్సు అని ఆమెను విమర్సగించింది దగ్గుబాటి , దుష్ట శక్తి అని తిట్టింది హరికృష్ణ . నాయకుడు తిట్టిస్తాడు , తాను తిట్టడు . రాజకీయ నాయకుడు ఇతరులను పని ముట్లుగా ఉపయోగించుకుంటారు కానీ తానె పని ముట్టుగా మారడు . బాబు కరుడుగట్టిన రాజకీయ నాయకుడు . బాబు వెంట వెళ్లి మధ్యలో వదిలేసి ఎలా వస్తారని ఎన్టీఆర్ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశం లో ఆంధ్రప్రభ తరపున దేవులపల్లి అమర్ గట్టిగా ప్రశ్నించారు . ఏమీ అనలేక ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడు , హస్త కళల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మెన్ సాయిబాబాబా తన పక్కన ఉన్న అనుచరుడి చెంప చెళ్ళు మనిపించాడు . ఇదంతా దగ్గుబాటి రాజకీయాల్లో పరాజిత గా .. **** అధికారాంతమున చూడాలి అన్నారు పెద్దలు . విపరీతమైన అధికారం అనుభవించి అధికారం నుంచి దిగిపోయిన తరువాత వారిని చూస్తే జాలి వేస్తుంది . సహజంగా ఉండలేరు . సినిమావాళ్లు , రాజకీయ నాయకులు డిమాండ్ తగ్గినప్పుడు అందరిలోకి రావడానికి ఇష్టపడరు . మందులో మునిగిపోయే నటులు , అజ్ఞాతంలోకి వెళ్లిపోయే నాయకులు ఎంతో మంది . అటు సినిమా గ్లామర్ తో ఇటు రాజకీయాలతో సంబంధం ఉన్న దగ్గుబాటి రాజకీయాలకు స్వస్తి పలికి సాహిత్య జీవితం గడుపుతున్నారు . ఉమ్మడి రాష్ట్రం లో ఎన్టీఆర్ తరువాత రెండు పవర్ సెంటర్ లు ఉండేవి . ఒకటి దగ్గుబాటిలు రెండు బాబు . అప్పుడు పవర్ సెంటర్ అంటే అల్లా టప్పా కాదు . తరువాత కాంగ్రెస్అ లో , బీజేపీలో చేరి రాజకీయాలకు స్వస్తి పలికారు . దశాబ్దాల పాటు అధికార కేంద్రంగా ఉండి రాజకీయాలు వదిలేసి పుస్తకాలు చదువుతూ , పుస్తకాలు రాస్తూ ప్రశాంత జీవితం గడుపుతున్నారు . ప్రపంచ చరిత్ర ఆది నుండి నేటి వరకు - ఆ తరువాత అని చరిత్రను అధ్యయనం చేసి సంక్షిప్తంగా ప్రపంచ చరిత్రను పుస్తకంగా తీసుకువచ్చారు . భగత్ సింగ్ గా నటించేందుకు చాలా కాలం క్రితం దగ్గుబాటి ప్రయత్నించారు . స్టీల్ ఫోటో కూడా విడుదల చేశారు . 95 వెన్నుపోటు పై సినిమా తీసేందుకు 96లో ప్రయత్నించారు . 82 ;ఓ టీడీపీ ఆవిర్భావం నుంచి 95 వెన్నుపోటు వరకు ఆ తరువాత నడుస్తున్న చరిత్ర వరకు దగ్గుబాటి రాస్తే బాగుండు . సాక్షుల కన్నా పాత్రదారులకు నాటకం గురించి ఎక్కువ తెలిసే అవకాశం ఉంది . దగ్గుబాటి తన కోణం నుంచి ఐనా 95 వెన్నుపోటును రికార్డ్ చేయాలి . ఒక చరిత్ర కొన్ని నిజాలు పేరుతో దగ్గుబాటి వెంకటేశ్వర రావు 95 నాటి పరిణామాలపై పుస్తకం రాశారు

23, మే 2023, మంగళవారం

ూడు తరాలకు ముచ్చెమటలు పట్టించిన నాయకుడు:ఎన్టీఆర్ పయనమెటు ?: జర్నలిస్ట్ జ్ఞాపకం

మూడు తరాలకు ముచ్చెమటలు పట్టించిన నాయకుడు జర్నలిస్ట్ జ్ఞాపకం "ఎక్కడో ఆదిలాబాద్ జిల్లా మారుమూలలో ఉండేవాడిని . మహానుభావుడు ఎన్టీఆర్ వల్ల ఇప్పుడు ఢిల్లీలో కేంద్రమంత్రిగా ఉన్నాను . ఆయన మహానుభావుడు కానీ ఆయన పిల్లలు ..... ఎన్టీఆర్ ను దించేసేప్పుడు నేనూ కొంత మందిమి బాలకృష్ణను కలిశాం లక్ష్మీ పార్వతిని బయటకు పంపాలి అంటే ఎన్టీఆర్ ను దించేయాలి . ఎన్టీఆర్ ను దించేసి లక్ష్మీ పార్వతి వెళ్ళాక మళ్ళీ సీఎం ను చేస్తాం అని చెప్పాం . మళ్ళీ సీఎం ను చేస్తారు కదా అని అమాయకంగా అడిగాడు .. ఒక సారి దించేశాక మళ్ళీ ఎవరైనా సీఎం ను చేస్తారా ? ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలు రామకృష్ణ టాకీస్ లో వారం నిర్వహించాలి అనుకున్నాం వారం పాటు అక్కడ ఎన్టీఆర్ జీవిత విశేషాలతో ఎగ్జిబిషన్ నిర్వహించాలి అని హరికృష్ణను అడిగితే, వారం రోజులా ఇవ్వలేను ఒక్క రోజు ఐతే ఒకే అన్నాడు .." కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు సముద్రాల వేణుగోపాల చారి ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో పంచుకున్న విషయాలు ఇవి . ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనక పోవడం పై వస్తున్న వార్తలు చదివాక ఇది గుర్తుకు వచ్చింది . అది సరే జూనియర్ ఎన్టీఆర్ మూడు తరాలకు ముచ్చెమటలు పట్టించిన నాయకుడు అంటున్నావు . ఎలా ? ఆ మాట నేనెక్కడన్నాను . మూడు తరాలకు ముచ్చెమటలు పట్టించింది . జూనియర్ ఎన్టీఆర్ కాదు . చంద్రబాబు . మూడు తరాలను వాడుకున్నది, వారిని యూస్ అండ్ త్రో అని వదిలేసింది బాబు . ఎన్టీఆర్ నటుడు కానీ చంద్రబాబు కల్తీ లేని వందశాతం రాజకీయనాయకుడు . రాజకీయ నాయకుడికి రాజకీయం తప్ప ఇంకేమి ఉండకూడదు . ఒకసారి మోసపోతే మోసం చేసిన వారిది తప్పు . రెండవ సారి మూడవ సారి అలా మోసపోతూనే ఉంటే మోసపోయిన వారిది తప్పు అవుతుంది తప్ప మోసం చేసిన వారిది కాదు . బాబు ఎన్టీఆర్ ను కోలుకోకుండా దెబ్బ కొట్టారు . ఆ దెబ్బకు తట్టుకోక ఎన్టీఆర్ క్షోభ తో పోయారు . ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణను వెన్నుపోటు కన్నా ముందే బాబు రంగం లో దింపారు . అదే హరికృష్ణ బాబు తనను మోసం చేశాడు అని టీడీపీ నుంచి బయటకు వెళ్లి అన్నా తెలుగుదేశం అని ఓ పార్టీ పెట్టి బాబుది యూస్ అండ్ త్రో పాలసీ అని విమర్శించారు . అంతకు ముందు తన తండ్రి మరణం పై విచారణ జరపనందుకు నిరసన వ్యక్తం చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు .ఆ తరువాత కూడా వారి కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ బాబు కోసం రంగం లో దిగారు . 2009 లో టీడీపీ , తెరాస కలిసి పోటీ చేశాయి . జూనియర్ బాబు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు . ప్రచారం లో ప్రమాదం ,గాయం . వాహనం లో జూనియర్ బెడ్ పై పడుకొని బాబు తో ఫోన్ సంభాషణ ... టివి లో లైవ్ ... మధ్యలో సంధాన కర్త కొమ్మినేని శ్రీనివాస్ ... ఆరోగ్యం జాగ్రత్త అని బాబు అంకుల్ మీ ఆరోగ్యం జాగ్రత్త అని జూనియర్ ... లైవ్ లో చూసిన వారికి రక్త సంబంధం సీన్ ను మించి రక్తి కట్టించింది .. ఆ ప్రచారం లో జూనియర్ రాజకీయ పంచ్ డైలాగులు అభిమానులను ఉర్రుతలూగించాయి . నువ్వు ఇంకా భ్రమల్లో ఉన్నావు జూనియర్ కోసం జనం గంటల తరబడి వేచి చూస్తున్నారు . నువ్వు ఇంకా కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నావు అని టీడీపీ మిత్రులు మందలించారు . గంటల తరబడి వేచి చూస్తున్నది నిజమే ... దూరం నుంచి చూస్తే చాలు జన్మ ధన్యం అయింది అనుకుంటున్నది నిజం . ఈలలతో యెగిరి గంతులు వేస్తున్నది నిజం ... ఐతే కాంగ్రెస్ గెలుస్తుంది . ఎందుకంటే ఈ అభిమానులు కొత్తగా వచ్చిన వారేమీ కాదు మొదటి నుంచి వారు మీ పార్టీ అభిమానులే . జూనియర్ ను చూసి సంబరపడుతున్నారు అంతే అన్నాను . ప్రచారం ముగిశాక కొద్ది మంది మీడియా వాళ్ళు జూనియర్ ను కలిస్తే - టీడీపీ అధికారం లోకి వస్తుంది . ఐతే తెరాస మద్దతు అవసరం లేకుండా అధికారం లోకి రావాలి అని కోరుకుంటున్నాను అని మనసులోని మాట బయట పెట్టారు . జూనియర్ కోరుకున్నట్టు టీడీపీ కి తెరాస మద్దతు అవసరం పడలేదు . ఎందుకంటే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నే గెలిచింది . ఆ తరువాత పరిణామాలతో జూనియర్ ను బాబు బృందం దూరం పెట్టింది / జూనియర్ ఎన్టీఆర్ బాబు బృందాన్ని దూరం పెట్టారు . మొత్తం మీద దూరం పెరిగింది . 2014 ఎన్నికల సమయం లో జూనియర్ ఎన్టీఆర్ నాకు రాజకీయాలపై అంతగా అవగాహన లేదు . అందుకే ప్రచారానికి వెళ్లడం లేదు అని ప్రకటించారు . 2009 లో రాజకీయ ప్రసంగాలతో అదరగొట్టిన వారు ఐదేళ్ల తరువాత మరింత రాటు దేలుతారు కానీ అవగాహన తగ్గుతుందా ? రాజకీయ పరిజ్ఞానం తక్కువ అని చెప్పడం ద్వారా తనకు రాజకీయ పరిజ్ఞానం పెరిగిందని నిరూపించారు . ఇప్పుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు జూనియర్ దూరంగా ఉండడం చర్చనీయాంశం గా మారింది . తాతయ్య కల , నాన్న కోసం అన్నీ హంబక్ . ఎవరి లెక్కలు వారికి ఉంటాయి . ఈ ఎన్నికల్లో జూనియర్ ప్రచారం చేస్తే టీడీపీ గెలుస్తుంది అనుకుందాం . దాంతో ఆయన కేం లాభం బాబు సీఎం అవుతారు, వారసుడిగా లోకేష్ కు ఎదురు లేదు .టీడీపీ ఈసారి కూడా ఓడి పోతే నాయకత్వ మార్పు పై ఒత్తిడి పెరుగుతుంది . గత ఎన్నికల తరువాత చివరికి బాబు సభల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్ లు చూపి నినాదాలు చేశారు . 2024 లో టీడీపీ ఓడిపోతే ... ఆ తరువాత పార్టీపై ఒత్తిడి పెరుగుతుంది . పార్టీ తన చేతికి వచ్చే అవకాశం ఉంటుంది . 2029 నాటికి ఆర్థికంగా , సినిమా ఇమేజ్ పరంగా ఆగ్ర స్థానం లో ఉంటాడు . ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినా , చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి విఫలం అయినా , రజనీ కాంత్ రాజకీయ ప్రవేశం పై వెనకడుగు వేసినా ఈ అన్ని సందర్భాల్లో కాలం ది కీలక పాత్ర . తాత ఎన్టీఆర్ నే మట్టికరిపించిన బాబుకు మనవడు ఎన్టీఆర్ ను దెబ్బ తీయడం పెద్ద కష్టమా ? అనిపించ వచ్చు . నీటిలో ఉన్నంత వరకే మొసలికి బలం . తాతా మనవడు అని కాదు కలిసి వచ్చే కాలం , కలసి రాని కాలం అని కాలం ముఖ్యం . మూడు తరాలను ఉపయోగించుకున్న బాబు ను తక్కువగా అంచనా వేయవద్దు . బాబు అల్లుడు , మామ ,షడ్డకుడు , అన్న ( రామ్మూర్తి నాయుడుకి ) ఇవేవి కాదు ఆయన నిఖార్సైన రాజకీయ నాయకుడు .

22, మే 2023, సోమవారం

జయప్రద , రేణుకా చౌదరి బాబు ల చిదంబర రహస్యం మూడు దశాబ్దాలైనా బయటపడని విషయం : జర్నలిస్ట్ జ్ఞాపకాలు

జయప్రద , రేణుకా చౌదరి బాబు ల చిదంబర రహస్యం మూడు దశాబ్దాలైనా బయటపడని విషయం : జర్నలిస్ట్ జ్ఞాపకాలు ..... ఏదైనా వివాదంపై ముఖ్యనాయకుల సమావేశం జరిగితే , సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకునేంత వరకు జర్నలిస్ట్ లకు నిద్ర పట్టదు . క్యాబినెట్ సమావేశంలో మీడియాకు విషయాలు చెబితే తాట వలుస్తా అని సీఎం హెచ్చరిస్తే క్యాబిజెట్ ముగియగానే ఈ విషయం కూడా మీడియాకు తెలిసిపోతుంది . 95లో చంద్రబాబు ముఖ్యమంత్రి ఎంపీలుగా ఢిల్లీలో జయప్రద , రేణుకా చౌదరి వెలిగిపోతున్న రోజులు . ఇద్దరి మధ్య ఎందుకో వివాదం తలెత్తింది . జయప్రదను ఉద్దేశించి ఓ ఇంగ్లీష్ పత్రికలో రేణుక చౌదరి పింప్ అంటూ ఏదో వాఖ్య చేశారు . పంచాయతీ చంద్రబాబు వద్దకు వచ్చింది . హిమాయత్ నగర్ లోని టీడీపీ కార్యాలయం మంచి మాస్ మసాలా న్యూస్ వస్తుంది అని మీడియా చాలా సేపు ఎదురు చూసింది . ఇద్దరితో బాబు సుదీర్ఘంగా మంతనాలు . ఇలాంటి సమావేశం ఏది జరిగినా తరువాత మీడియాను పిలిచి మా ఇద్దరి మధ్య ఏమీ లేదు , ఇదంతా మీడియా కల్పించిన సృష్టి అని రొటీన్ డైలాగులు , ఒకరినొకరు కౌగిలించుకున్న ఫోటో షెషన్ తో ముగుస్తుంది . కానీ ఆ రోజు ఏం జరిగిందో , బాబు ఇద్దరికీ ఏం చెప్పారో ? ఏం రాజీ కుదిర్చారో ఎవరికీ తెలియదు . వీరిద్దరూ చెప్పలేదు . అటు బాబు మీడియా ముందు నోరు విప్పలేదు . జర్నలిస్ట్ లు ఎంత ప్రయత్నించినా ఈ ముగ్గురి నుంచి విషయం బయటకు రాలేదు . ఆ సమావేశం జరిగి 28 ఏళ్ళవుతున్నా సమావేశంలో ఏం జరిగి ఉంటుంది అనే సందేహం తొలుస్తూనే ఉంటుంది . తోచింది రాసుకోవడమే కానీ ఏం జరిగిందో ఆ ముగ్గురికి తప్ప ఎవరికీ తెలియలేదు . టీడీపీ నాదే అని ఎన్టీఆర్ వేసిన కేసు కొట్టేసి బాబుదే అని తీర్పు వచ్చింది . తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిబదిలీ అయ్యాక జయప్రద వెళ్లి బొకే ఇచ్చిన ఫోటో ను సైతం మీడియా సంపాదించింది కానీ .. ఇప్పటికీ సమావేశం వివరాలు సంపాదించలేదు . ఆ తరువాత ఇద్దరూ టీడీపీకి దూరం అయ్యారు / దూరం పెట్టారు . సమాజ్ వాది పార్టీలో చేరారు . అమర్ సింగ్ ఆశీస్సులతో ములాయం పార్టీలో ఉత్తరాదిలో జెండా ఎగురవేశారు . అనంతరం అమర్ సింగ్ కె అడ్రెస్ లేకుండా పోయింది . ములాయం సింగ్ లేరు . వాళ్ళ అబ్భాయి తాజా రాజకీయ జీవితాన్ని వెతుక్కుంటున్నారు .ఇక రేణుకా చౌదరి చంద్రబాబు సిఫారసు లేకుండానే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లో కేంద్రమంత్రి పదవి చేపట్టారు . తరువాత టీడీపీకి దూరం అయి కాంగ్రెస్ లో చేరారు . మధ్యలో సొంతంగా ఓ పార్టీ పెట్టారు . పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో శాసన సభ్యులు గెలిచారని , వారి పేర్లు చెప్పను రహస్యం అని జెమిని టివి ధర్మ పీఠం లో చెప్పారు . జయప్రద , రేణుకా , బాబుల సమావేశం చిదంబర రహస్యమే తెలుసుకోలేక పోతున్నాం , ఆ రహస్య శాసన సభ్యుల పేర్లు తెలుసుకొనే అదనపు శ్రమ ఎందుకులే అని ఎవరూ ఆ మాటను సీరియస్ గా తీసుకోలేదు . సోనియాగాంధీకి తృటిలో ప్రధాన మంత్రి పదవి తప్పిపోయినప్పుడు ఢిల్లీలో త్యాగం మీటింగ్ పెట్టి కాంగ్రెస్ నేతలంతా ఆమెను వేనోళ్ళుగా పొగడసాగారు . రేణుకా చౌదరి వంతు వచ్చింది . ఆమె కాంగ్రెస్ కు కొత్త ఆ ఏం మాట్లాడుతుంది లే అనుకున్నారు . ఆమె మైకు పట్టుకొని బోరున ఏడ్చారు . మాటలు లేవు మాట్లాడుకోడాలు లేవు మైకు కూడా తడిచిపోయేంతగా , కరిగిపోయేంతగా ఏడ్చారు . టీడీపీ ట్రైనింగా ? మజాకానా ? అనుకున్నారు అంతా . తెలంగాణ ఏర్పడేప్పుడు సీఎం రేస్ లో నేను లేను చాలా పనులు ఉన్నాయి అని ప్రకటించారు . ఇప్పుడు ఆంధ్ర నుంచి పోటీకి ప్రయత్నిస్తున్నారు .(ఒకే గవర్నర్ రెండు రాష్ట్రాలకు ఉన్నప్పుడు ఒకే సీఎం రెండు రాష్ట్రాలకు సీఎం గా ఉంటే తప్పేమిటి ?) ఏదో ఒక పార్టీలో చేరాలి అని జయప్రద తీవ్రంగా ప్రయత్నిస్తున్నా కాలం , వయసు , పరిస్థితులు సహకరించడం లేదు . కాంగ్రెస్ వెలిగిపోతే రేణుకా చౌదరి వెలిగిపోయే వారు . కానీ .... పరిస్థితులు కలిసి రావడం లేదు . అన్ని రోజులు మనవే కావు . రోజుల సంగతి ఎలా ఉన్నా 28 ఏళ్ళు గడిచినా ఆ సమావేశం చిదంబర రహస్యం ఏమిటో తెలియడం లేదు . ఏమై ఉంటుందా ? అని 95లో హైదరాబాద్ లో రిపోర్టింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి రిటైర్ అయ్యాక కూడా ఆ ప్రశ్న నన్ను తొలుస్తూనే ఉంది . ఇంతకూ ఏం జరిగి ఉంటుందో ?

21, మే 2023, ఆదివారం

మానసిక ఆరోగ్యం... ధైర్యం కోసం ఆ మీడియానే చూడండి .. చదవండి ఓ జ్ఞాపకం

మానసిక ఆరోగ్యం... ధైర్యం కోసం ఆ మీడియానే చూడండి .. చదవండి ఓ జ్ఞాపకం హా ... హా ... ఇప్పుడేమంటావ్ ? 2018 డిసెంబర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉదయమే టివిలో చూస్తుంటే ఫోన్ లో హా ... హా ... ఇప్పుడేమంటావ్ ? అనే ప్రశ్న ఆమె స్వరం లో అంత సంతోషం చాలా కాలం తరువాత విన్నాను . ఫలితాలు ఎలా ఉంటాయి అనే దానిపై ఆమె అంతకు ముందే నాతో పందెం వేసింది . ఏబీఎన్ ఛానల్ లో మహాకూటమి దూసుకెళ్తుంది . మహాకూటమికి 30 కి పైగా స్థానాలు ఇచ్చి తెరాస కు అందులో పావు సగం స్థానాలు కూడా ఇవ్వలేదు .. ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి ల హయాంలో తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన మహిళా నాయకురాలు అట్లూరి రమాదేవి . కృష్ణాజిల్లా మూలాలు ఉన్న నిజామాబాద్ నాయకురాలు . ఎన్టీఆర్ హయం లో రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవులు , నామినేటెడ్ పదవులు చేపట్టిన ప్రముఖ నాయకురాలు ఫోన్ చేసి ఇప్పుడేమంటావు ...నీ మీద విజయం సాధించాను చూడు అన్నట్టు మన పందెం ఇంకాస్త పెంచుదామా ? ధైర్యం ఉందా ? అని ఆమె ప్రశ్నించింది . ఎంతో కాలం తరువాత ఆమెలో ఉత్సాహం , ఆ స్వరంలో ఆనందం చూసి .. వాటిని ఎందుకు దూరం చేయాలి అనుకొని ... మీ ఇంట్లో మీరు ఏబీఎన్ ఛానల్ చూస్తున్నారు కదా ? అని అడిగాను . ఔను అని సమాధానం వచ్చింది . మనం డబ్బు కోసం పందెం కాయలేదు కదా ? మన అంచనా ఎవరిది కరెక్ట్ అవుతుంది అని తెలుసు కోవడానికి అంతే ... అంతకు ముందు 2004 నుంచి ప్రతి ఎన్నిక , 2014 లో తెలంగాణ ఏర్పాటు , తరువాత ఎన్నికలు అన్ని పందాల్లో ఆమె అంచనాలు తప్పడం ఇప్పుడు టివిలో మహాకూటమి దూసుకెళ్తుండడం తో ఆమె చాలా సంతోషంగా ఉంది . మళ్ళీ పందెం పెంచడం ఎందుకు కానీ ,ఓట్ల లెక్కింపు ఇప్పుడే మొదలైంది కదా ? కొంత సమయం తరువాత మాట్లాడుకుందాం అని ఆమె సంతోషానికి భంగం కలుగనివ్వ లేదు . ***** 2018 ఎన్నికల్లో మహాకూటమి ఏ దశలోనూ తెరాస కు దరిదాపుల్లోకి రాలేదు . 30 సీట్లకు ఓట్ల లెక్కింపు ప్రారంభం లో రాలేదు . ఓట్ల లెక్కింపు ముగింపు లోనూ రాలేదు . ఐతే మహా కూటమి ఏర్పాటు సన్నాహాల నుంచి కూడా ఆంధ్ర జ్యోతి , abn అండగా నిలిచాయి . నిజమైన స్నేహితుడు ఓటమిలో కూడా భుజం తట్టి అండగా నిలుస్తాడు అని నిరూపిస్తూ ... ఓట్ల లెక్కింపు ప్రారంభం ఐన తరువాత కూడా ఈ మీడియా తన మద్దతు కొనసాగించింది .. ఉదారంగా ప్రారంభం లోనే 30 స్థానాలు ఇచ్చి , అందులో పావు సగం కూడా తెరాస కు ఇవ్వకుండా తమ ఛానల్ లో తెరాస ను చిత్తుగా ఓడించారు . ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాల్లో మీడియా ఉంది కానీ , ఎలక్షన్ కమిషన్ లేదు . ఐనా ఈ మీడియా మహాకూటమి ని విజయ పథం లో తీసుకెళ్తే ఎన్నికల కమిషన్ మాత్రం అస్సలు పట్టించు కోకుండా తెరాస దూసుకెళ్తున్నట్టు లెక్కలు చెప్పింది . తాను ఒంటి చేత్తో మహాకూటమికి విజయం చేకూరుస్తున్నా ... మిగిలిన ఛానల్స్ అన్నీ ఎన్నికల కమిషన్ ఫలితాలే చెబుతుండడం తో దమ్మున్న ఛానల్ కూడా ఎన్నికల కమిషన్ చెప్పిన ఫలితాలనే చూపక తప్పలేదు ...మహాకూటమి తరుపున చంద్రబాబు విస్తృత ప్రచారం తో హడలెత్తించారు . ప్రముఖ పత్రికలను , ఛానల్స్ ను చూస్తే ఎంతటి వారికైనా మహా కూటమి విజయం ఖాయం అనిపించి తీరుతుంది . అలానే అనుకున్నారు . **** కొన్ని గంటల తరువాత నీరస మైన స్వరం తో అట్లూరి రమాదేవి ఫోన్ చేసి .... ఏంటి ఇలా జరుగుతోంది అని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు . 2004 ,2009 , 2014 ఎన్నికల ఫలితాలు , 2014 లో తెలంగాణ వస్తుంది అని , 2014 , 2018 ఎన్నికలు ఏంటీ అన్నీ నీ అంచనాలే కరెక్ట్ అయ్యాయి .... ఈ అన్ని విషయాల్లో ఇద్దరం పందెం వేసుకున్నాం . పందెం వేసుకోవడమే తప్ప గెలిచినా తీసుకున్నది లేదు . తెలంగాణ వస్తుంది అనే పందెం పై మాత్రం వదిలేది లేదు ఇవ్వాల్సిందే అని పట్టుపట్టాను . ఎన్నికల జోస్యం వేరు తెలంగాణ ఆవిర్భావ పందెం వేరు అన్నాను . ***** సరే ఇప్పుడు నన్నేం చేయమంటావు ? అని ప్రశ్నిస్తే ... నేను మా ఇంట్లో కూర్చొని మీ ఇంట్లో మీరు ఏ ఛానల్ చూస్తున్నారో చెప్పగలిగాను అంటే అంతో ఇంతో అంచనా వేయగలను అని తెలియడం లేదా అన్నాను .తెలంగాణలోనే కాదు ఆంధ్ర లో కూడా ఇలానే ఉంటుంది అన్నాను . నన్నేం చేయమంటావు అని మళ్ళీ అడిగితే మీ ఇంట్లో అన్ని గదుల్లో ఆంధ్రజ్యోతి వేయించుకోండి abn ఛానల్ చూడండి అన్నాను ... నేను బాధలో ఉంటే నీకు జోకులా అని సీరియస్ అయ్యారు . మీకు జోక్ అనిపించ వచ్చు కానీ నేను సీరియస్ గా చెబుతున్నాను . ఆ మీడియా మాత్రమే మిమ్ములను రక్షిస్తుంది . తెలంగాణ ఏర్పాటు , ఎన్నికల్లో అడ్రెస్ లేకుండా పోవడం , 2019 లో ఆంధ్రాలో వచ్చే ఫలితాలు చిన్న దెబ్బలు కాదు . వాటిని తట్టుకొని మానసికం గా నిలబడడం అనేది చిన్న విషయం కాదు . ప్రత్యర్థి ఘన విజయం సాధించినా మరుసటి రోజు నుంచే టీడీపీ ని ఆకాశానికి ఎత్తడం మాములు విషయం కాదు . ఆ వార్తలు పత్రికల్లో ఛానల్ లో చూస్తే పరవాలేదు మళ్ళీ మనం వస్తాం , నిన్న అలా రిజల్ట్స్ వచ్చాయి కానీ ఈరోజు ఎన్నికలు జరిగినా మనం వస్తాం అనే ధైర్యం వస్తుంది . జోక్ అనుకుంటే మీ ఇష్టం కానీ పాత పరిచయం తో చెబుతున్నా మీరు మానసికంగా క్రుంగి పోకుండా ఆత్మ విశ్వాసం తో ఉండాలి అంటే ఆ మీడియానే చదవండి , వినండి మరో మీడియా వైపు వెళ్ళకండి అని నిజాయితిగా సలహా ఇచ్చాను . ఐతే నేను సలహా ఇవ్వక పోయినా వాళ్ళు చేసే పని అదే అని నాకు తెలుసు . రాజకీయాల సంగతి ఎలా ఉన్నా ... 175 లో 23 స్థానాలకే పరిమితం అయి దిక్కు తోచని స్థితిలో కొట్టు మిట్టాడుతున్న పార్టీకి భుజం తట్టి లేవండి రేపటి రాజ్యం మీదే అని ఆత్మవిశ్వసాన్ని కలిగించడం మాములు విషయం కాదు .. వారిది మాములు సేవ కాదు . మోటివేషనల్ స్పీకర్లు , సైకాలజిస్ట్ లు తమ వద్దకు వచ్చిన వారికి మహా అయితే ఓ గంట సేపు కౌన్సిలింగ్ చేస్తారు . కానీ మీడియా మాత్రం ప్రతి రోజు , ప్రతి క్షణం రోజుల తరబడి , ఏళ్ల తరబడి ఒక సమూహం మొత్తానికి కౌన్సిలింగ్ చేయడం మాములు విషయం కాదు . దానికి చాలా దమ్ముండాలి . .. నన్ను అపార్ధం చేసుకుంటారు కానీ ఎంతో మందికి నేను ఇలా సలహా ఇచ్చాను . మీ ఆరోగ్యం కోసం ఆ మీడియానే చూడండి మరో మీడియా చూడకండి అని .... **** కుమార్ అని హిందీ మిలాప్ లో జర్నలిస్ట్ మిత్రుడు ఉండేవాడు . జీతం విషయం లో అసంతృప్తి ...చాలా ఏళ్ల క్రితం ఓ రోజు సచివాలయం లో ఆంధ్ర జ్యోతి ఢిల్లీ కి వెళుతున్నా అని చెప్పాడు . నీ మెంటాలిటీ కి అస్సలు సూట్ కాదు వద్దు అన్నాను . ఓ ఆరేడు నెలల తరువాత తిరిగి వచ్చాడు . అదే సచివాలయం లో అన్నా అక్కడ జరిగేది ఒకటి వీళ్ళు రాయమనేది ఒకటి నా వల్ల కాదు అని వచ్చేశాను అన్నాడు . పది రూపాయలు పెట్టి షాప్ లో ఆ పేపర్ కొంటే ... మూడు రూపాయలు ఎక్కువ ఇచ్చావు అని షాప్ వాడు సంతోష పడే వాడు . నీకు ఢిల్లీ వరకు వెళ్లాల్సిన శ్రమ తప్పి విషయం తెలిసేది కదా అన్నాను . ఏదైనా అనుభవం ఐతే కానీ తత్త్వం బోధపడదు ... ఇప్పుడు అన్ని పార్టీలకు మీడియా ఉంది ... ఒకే పార్టీకి మీడియా ఉన్న ఆ రోజులే వేరు ... నోట్ - ఆరోగ్యం కోసం ఆ మీడియాను చూడండి అంతే కానీ చూసింది నిజమే అనుకోని పందాలు కాసి దెబ్బ తినకండి ..

20, మే 2023, శనివారం

ఏం పిల్లడో వెల్దమొ స్త వా ? ... వెళితే బతుకు బస్టాండే వంగపండుతో .. ఓ జ్ఞాపకం

ఏం పిల్లడో వెల్దమొ స్త వా ? ... వెళితే బతుకు బస్టాండే వంగపండుతో .. ఓ జ్ఞాపకం ఎన్టీఆర్ భవన్ లో 2004 .. టీడీపీ అధికారం కోల్పోయిన కొత్తలో .. ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే వెళ్ళాను . వేదిక పై ఉన్న అతను బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా ఉన్నారు , ఎవరో గుర్తుకు రావడం లేదు . ఒక ప్రముఖ నాయకుడి ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పి అతను రాకముందు రెండు మూడు బృందాలతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించడం అక్కడ కొత్తేమీ కాదు . ఐతే అక్కడున్న వ్యక్తి ఎవరా ? అనే ఆలోచనలోనే మునిగిపోయాను . ఎన్టీఆర్ భవన్ లో మనకు తెలియని నాయకుడా ? అని అతన్నే చూస్తూ ఆలోచిస్తున్నాను . నేను వంగపండును అంటూ అతను మాట్లాడడం మొదలు పెట్టాక అర్రే ప్యాంట్ , షర్ట్ లో ఉండడం వల్ల గుర్తు పట్టలేక పోయాను . వీరు పాటపాడేప్పుడు ధోవతి తో ఉంటారు కదా అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను . చంద్రబాబు విధానాలు నచ్చి టీడీపీలో చేరాను అని , టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్నట్టు .. చంద్రబాబు విధానాలపై ప్రచారం చేస్తాను . ఇదీ వంగపండు ప్రెస్ కాన్ఫరెన్స్ సారాంశం . వంగపండు మాట్లాడడం ముగించి కిందికి వచ్చిన తరువాత నన్ను నేను పరిచయం చేసుకొని చంద్రబాబు విధానాలు మీకు ఏం నచ్చాయో చెబితే .. మేమూ అనుసరిస్తాం చెప్పండి అంటే .. కొద్ది సేపు ఆగి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తాం అనే హామీ అని చెప్పారు . ఎన్నికల్లో కూడా బాబు ఉచిత విద్యుత్ ఇస్తే విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసు కోవాల్సి వస్తుంది అని చెప్పారు . వైయస్సాఆర్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తుంది . అదే ఒక గొప్ప సిద్ధాంతం అనుకుంటే ఉచిత విద్యుత్ ఇస్తున్న కాంగ్రెస్ సిద్ధాంతం అవుతుంది కానీ వస్తే ఇస్తాం అంటున్న టీడీపీ సిద్ధాంతం ఎలా అవుతుంది అంటే .. ఏమీ చెప్పలేక పోయారు . తన పాటలతో లక్షలాది మందిని ఉర్రుతలూగించిన వంగపండు మౌనంగా ఉండి పోయారు . ఆయన పాటలంటే నాకు చాలా ఇష్టం . నాయకుడితో మాట్లాడినట్టు కాకుండా గాయకుడితో మాట్లాడినట్టు మాట్లాడాను . ఆయన ఇబ్బంది గమనించి మీకు నేను చదివిన ఓ ఉదంతం గురించి చెబుతాను అని హిందీ నటుడు రాజ్ కపూర్ గురించి చదివింది చెప్పాను . **** ఓ సారి రాజ్ కపూర్ స్మగ్లర్ హాజీ మస్తాన్ ఇంటికి వెళ్లారు . దీనిపై తీవ్రవిమర్శలు వచ్చాయి . మహానటుడు స్మగ్లర్ ఇంటికి వెళ్లడం ఏమిటా ? అని .. రాజ్ కపూర్ కు ఇది తెలిసి నేను హాజీ మస్తాన్ ఇంటికి వెళ్లడం తెలిసి మీరంతా విమర్శిస్తున్నారు కదా ? ముంభైలో భారీ సభ ఏర్పాటు చేసి అందరి ముందు హాజీ మస్తాన్ కాళ్ళు మొక్కుతాను అన్నారు . ఎందుకూ అంటే .. మేరా నామ్ జోకర్ సినిమా ప్ ఫ్లాప్ అయిన తరువాత నిండా మునిగిపోయాడు . చుట్టూ అప్పులు . ఆత్మహత్య చేసుకోవాలి అని గోవా వెళ్ళాడు . అదే గోవాలో హాజీ మస్తాన్ ఉన్నాడు . . ఇలా వచ్చారేమిటి అని రాజ్ కపూర్ ను పలకరించాడు . ఊరకనే అని చెబితే .. కాదు మీ ముఖం లో ఏదో తేడా ఉంది . సమస్య ఏమిటో చెప్పండి అంటే .. సినిమాలో లాస్ , అప్పుల గురించి చెప్పాడు . ఎవరెవరికి ఎంత ఇవ్వాలి ఆ జాబితా ఇవ్వండి . మళ్ళీ మీరు సినిమా చేయడానికి ఎంత కావాలి అని అడిగి . మరుసటి రోజు ఎవరికి చెల్లించాల్సింది వారికి వెళ్ళిపోయింది . రాజ్ కపూర్ ను ఇష్టపడే భారతీయులు ఒక్కొక్కరు ఒక్క రూపాయి ఇచ్చినా రాజ్ కపూర్ కు ఆత్మహత్య ఆలోచన రాకపోతుండే .. హాజీ మస్తాన్ ఎవరు అనేది నాకు అనవసరం . అవసరానికి నన్ను ఆదుకున్నాడు నాకు ఆ కృతజ్ఞత ఉంది అని రాజ్ కపూర్ చెప్పారు . ఇది చెబితే వంగపండు ఆసక్తిగా విన్నారు . తరువాత నేను నాయకుల నుంచి వార్తలు సేకరించే పనిలో పడిపోయాను . **** వంగపండుతో మాట్లాడేప్పుడు మిగిలిన జర్నలిస్ట్ లు కూడా ఉన్నారు . బయటకు వెళ్ళడానికి మెట్ల వద్దకు వచ్చినప్పుడు వంగపండు తన దగ్గరకు రమ్మని పిలిస్తే వెళ్ళాను . మీరు చెప్పింది కరెక్ట్ . అందరికీ వంగపండు పాట కావాలి కానీ వంగపండు కుటుంబ సమస్యలు ఎవరికీ పట్టవు . నా వల్ల మా అబ్బాయికి ఉద్యోగం రావడం లేదు , పెళ్లి కావడం లేదు . అమ్మాయికి ఆరోగ్య సమస్యలు , చికిత్సకు డబ్బు లేదు . గద్దర్ ఒక్కరే కాదు ఎంతో మంది పాడడం లో నన్ను అనుసరించారు . పేరు ప్రఖ్యాతులు పొందారు ఎక్కడో ఉన్నారు . నా పరిస్థితి మాత్రం బాగాలేదు . టీడీపీ వాళ్ళు ఆర్ధిక సహాయం చేస్తామన్నారు అని చెప్పుకొచ్చారు . తన పాటలతో లక్షలాది మందిలో వేడి పుట్టించి ఉర్రుత లూగించిన గాయకుని పరిస్థితి బాధేసింది . మిమ్ములను ఇంతకు ముందు ఎప్పుడూ కలువక పోయినా మీ పాట బాగా ఇష్టం . ముందు మనిషి బతకాలి . దాని కోసం ఒకరికి అపకారం చేయకుండా ఏం చేసినా తప్పు కాదు . మీరు టీడీపీకి ప్రచారం చేయడం అస్సలు తప్పు కాదు . ఐతే మీరు చేసే పనికి ఒక సిద్ధాంతం ఆపాదించడమే నాకు తప్పు అనిపించింది అన్నాను . **** వివిధ ఇజాలపై ఊగిపోయే మిత్రులతో మాట్లాడేప్పుడు ఓ మాట చెబుతుంటా ... ఆర్ యస్ యస్ , ఆర్ యస్ యు , మావోయిజం , స్త్రీ వాదం , పురుష వాదం ఆ ఇజం ఈ ఇజం , తాజాగా పవన్ ఇజం .. ఈ ఇజాలు ఏవైనా కావచ్చు . అవి గొప్పవి అనను , చెడ్డవి అనను .. ఆ ఇజాలపై అద్భుతంగ ఉపన్యాసాలు ఇచ్చే వారు ఉంటారు కదా ? వారితో ఓ సారి మాట్లాడి అడగాల్సింది ఇజం లో సందేహాలు కాదు . మీరు అద్భుతంగా సిద్ధాంతాలు చెబుతున్నారు బాగున్నాయి , కానీ ఏ ఇజం అనుసరించినా ఇల్లు గడవడానికి ఒక ఉపాధి మార్గం ఉండాలి కదా ? మీరు ఎలా బతుకుతున్నారు అని అడగాలి . పెన్షన్ , ఉద్యోగం , ఎన్జీవో , సొంత వ్యాపారం ఏదైనా కావచ్చు . వారి ఉపాధి మార్గం తెలుసుకొని , ముందు వారిలా సంపాదించడం మొదలు పెట్టి ఆ తరువాత వారి జెండాలు మోయమని చెబుతుంటా ... **** మీరు చేసింది తప్పేమీ కాదు అని వంగపండు తో అభిప్రాయాలు పంచుకున్నాను . తొలుత టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడి పదవి యిస్తామని అన్నారు . ఇప్పుడేమో సాంస్కృతిక విభాగం లో పని చేయమంటున్నారు అని వంగపండు చెప్పారు . రాజకీయమే అంత అన్నాను . ఆ రోజు తరువాత వంగపండు మళ్ళీ ఎన్టీఆర్ భవన్ లో కనిపించలేదు . వంగపండు కమ్యూనిస్ట్ పార్టీల కోసం గజ్జె కట్టారు . తరువాత టీడీపీ , 2009 లో కాంగ్రెస్ కోసం పని చేసారు . వంగపండు కుమార్తె  వై యస్ ఆర్ కాంగ్రెస్ లో ఉన్నారు . 

19, మే 2023, శుక్రవారం

పళ్లూడగొట్టుకొని బంగారు పళ్ళు పెట్టించుకొన్న జర్నలిస్ట్ అద్దె కట్టలేక అటవీ  ప్రాంతం లో అంతిమ రోజులు అతని జీవితం ఓ పాఠం జ్ఞాపకాలు 

పళ్లూడగొట్టుకొని బంగారు పళ్ళు పెట్టించుకొన్న జర్నలిస్ట్ అద్దె కట్టలేక అటవీ  ప్రాంతం లో అంతిమ రోజులు అతని జీవితం ఓ పాఠం జ్ఞాపకాలు  ^ ^  చూశారా బంగారు పళ్ళు పెట్టించుకున్నాను . నా పళ్ళు బాగానే ఉన్నాయి కానీ చిన్నప్పటి నుంచి పేదరికం లోనే గడిపాను . ఇప్పుడు డబ్బులు వచ్చాయి . బాగున్నా పళ్ళు తీసేసి బంగారు పళ్ళు  పెట్టించుకున్నాను ^^ ఇదో జర్నలిస్ట్ వాస్తవ కథ .  పేదరికం  జీవితం లో చాలా పాఠాలు నేర్పిస్తుంది . మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే .  నేర్చుకోక పోతే మరింత పేదరికంలోకి నెట్టేసి క్రూరంగా నవ్వుతుంది . రంగారావు అని ఆంధ్రప్రభలో జర్నలిస్ట్ . నాకు  పెద్దగా పరిచయం లేదు కానీ నా   మిత్రుడికి మంచి ఫ్రెండ్ . మా ఇద్దరి మధ్య తరుచుగా రంగారావు ప్రస్తావన వచ్చేది . ఈ మధ్య కలిసినప్పుడు రంగారావు గురించి అడిగితే రాజమండ్రి సమీపం లో గిరిజన ప్రాంతంలో అనాథలా మరణించాడు అని చెప్పుకొచ్చాడు . సరదాగా బంగారు పళ్ళు పెట్టించుకున్న అతను ఇక్కడ అద్దె భరించలేక నాలుగు వందల రూపాయల అద్దె కోసం గిరిజన ప్రాంతానికి వెళ్లి ఒక్క చిన్న గదిలో చివరి రోజులు గడిపారు . ***** ఖమ్మం లో జర్నలిస్ట్ లకు ప్లాట్ ల కోసం  28 ఎకరాల స్థలం కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది . హైదరాబాద్ జర్నలిస్ట్ లకు భూమి బదలాయించాలి అని ఉద్యమం వార్తలు . ఇవి చూశాక రంగారావు జీవితం గుర్తుకు వచ్చింది . అతను ఆంధ్రప్రభలో కాంట్రాక్ట్ ఉద్యోగి . జీతం తక్కువ ఉంటుంది . ఉద్యోగ భద్రత అస్సలు ఉండదు . జీవితం మొత్తం లో అతను చేసిన ఒకే ఒక లాభసాటి పని సకాలం లో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో దరఖాస్తు చేయడం . దరఖాస్తు చేసిన వేళా విశేషం అతనికి ప్లాట్ అలాట్  అయింది . దాదాపు రెండు దశాబ్దాల క్రితం గోపన్ పల్లి లోని ప్లాట్ 36 లక్షలకు  అమ్మేశాడు .  ఇప్పుడు అక్కడ దాని విలువ మూడు కోట్ల రూపాయలు ఉంటుంది . రెండు దశాబ్దాల క్రితం 36 లక్షలు అంటే చాలా పెద్ద మొత్తమే . డబ్బు సంపాదించడమే కాదు దాన్ని హోల్డ్ చేసే సామర్ధ్యం కూడా ఉండాలి .  ఆ డబ్బుతో ఉప్పల్ వద్ద చిన్న ఇల్లు కుటుంబం అంతా జల్సాగా వెళ్లేందుకు ఓ కారు కొన్నాడు . సరిపోవడం లేదు అని కారుతో పాటు ఓమిని కొన్నారు . చదువు ఒంటబట్టక చిన్న ఉద్యోగం చేస్తున్న కొడుకు తో ఉద్యోగం మానేయించి బేకరీ పెట్టించాడు .  చేతిలో ఇంత డబ్బు ఉన్నాక కాంట్రాక్ట్ ఉద్యోగం ఎందుకు అని ఉద్యోగం మానేశాడు . సరైన ప్లాన్ లేకపోతే కొండలే కరిగిపోతాయి 36 లక్షలు ఓ లెక్కనా ? రెండు కార్లలో ఆలయాల సందర్శన . సరదాగా పళ్లూడగొట్టుకొని బంగారు పళ్ళు పెట్టించుకోవడం వంటివి అన్నీ చేశారు . చిన్న పాటి ఇల్లు కూడా  అమ్మేసి అద్దె ఇంట్లోకి మకాం మారింది . వ్యాపారం తెలియక ఎక్కడ అమ్ముడుపోనివి వీరి బేకారికే అంటగట్టే వారు . ఒక శుభముహుర్తం లో  బేకరీ మూసేసి కొడుకు మళ్ళీ ఉద్యోగం లోకి . చిన్న ఇంటికి కూడా హైదరాబాద్ లో అద్దె చెల్లించలేక రాజమండ్రి దగ్గర లోని అటవీ ప్రాంతంలో నెలకు నాలుగు వందల  అద్దెతో చిన్న గదిలోకి జీవితం మారింది . అప్పటి వరకు పేదరికంలో గడిపిన వారికి  హఠాత్తుగా సంపద వస్తే రెండు రకాలుగా  వ్యవహరిస్తారు . పేదరికం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసు కాబట్టి  మళ్ళీ తనను పేదరికం ప్రేమించకుండా ఉండాలని జాగ్రత్తలు తీసుకునే వారు కొందరైతే .. నేనిప్పుడు పేదరికం లో లేను నా పరిస్థితి మారింది చూడు అని బంగారు పళ్ళు పెట్టించుకుని  బోల్తా పడేవారు కొందరు . **** జర్నలిస్ట్ లకు ఎవరూ పాఠాలు చెప్పలేరు ... ఎందుకంటే  వాళ్ళు తలుచుకుంటే బార్ షాప్ లో కూర్చొని అమెరికా  పీచమణచగలరు . అందరూ అలా అని కాదు జీవితం గురించి ఏ మాత్రం అవగాహన లేనివారే అలా ఉంటారు . మహబూబ్ నగర్ జిల్లాల్లో  దొంగసారాయి వ్యాపారం గురించి రాసినందుకు డీకే భరత్ సింహా రెడ్డి అనుచరులు రాధాకృష్ణ అనే పార్ట్ టైం విలేకరి ని కిడ్నాప్ చేశారు . ఉదయం లో జొన్నలగడ్డ రాధాకృష్ణ అనే మంచిమనిషి  మహబూబ్ నగర్ రాధాకృష్ణను హైదరాబాద్ కు పిలిచి ఫోటో గ్రాఫర్ గా ఉద్యోగం ఇచ్చారు . అతని కి అదృష్టం కలిసొచ్చి జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో ప్లాట్ దక్కింది . కిడ్నాప్ తో తంతే బూరెల బుట్టలో పడ్డట్టు అయింది . ఆ ప్లాట్ అమ్మి బోలెడు అద్దెలు వచ్చే విధంగా ఉప్పల్ లో పెద్ద బిల్డింగ్ కొనేసాడు . అతను మేధావి కాదు కాబట్టి అలా చేయగలిగాడు . **** జర్నలిస్ట్ ల అందరి జీవితాలు అందరికీ తెలిసిన ఓ అరడజను మంది జీవితల్లా ఉండవు . పారిశ్రామిక వేత్తలు , సాధారణ జర్నలిస్ట్ నుంచి పత్రికను కొనే స్థాయికి ఎదగడం , పవర్ ప్రాజెక్ట్ లు , కోట్ల ఆదాయం ఉండే వారు మహా అయితే అరడజను లోపే ఉంటారు . ఎక్కువ మంది జీవిత పోరాటం లో బాగా అలసిపోయిన వారే ఉంటారు . ఈ సంగతి మనకూ తెలుసు పాలకులకు తెలుసు . ఉమ్మడి రాష్ట్రం లో వేల కోట్ల రూపాయల భూములు ఆక్రమించుకున్న రాజకీయ కుటుంబాల వారు  వారు సైతం మేం అధికారం లోకి వస్తే జర్నలిస్ట్ లకు ప్లాట్స్ ఇస్తామని మ్యానిఫెస్టోలో పెడతాం అంటున్నారు . ఆక్రమించుకున్న భూమిలో ఓ ఎకరం ఇస్తాం అంటే నమ్మకం కుదిరేది . కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు . అప్పటివరకు వేచి చూడాలి . వచ్చాక రంగారావులం అవుదామా ? రాధాకృష్ణలం అవుదామా ? అనేది మన ఇష్టం . 

నోట్లో నాలుక లేని గొనె ప్రకాష్ జర్నలిస్ట్ లు నేర్చుకోదగిన పాఠాలు ఓ జ్ఞాపకం

నోట్లో నాలుక లేని గొనె ప్రకాష్ జర్నలిస్ట్ లు నేర్చుకోదగిన పాఠాలు ఓ జ్ఞాపకం ఇదేం శీర్షిక ? గొనె ప్రకాష్ కు నోట్లో నాలుక లేకపోవడం ఏమిటి ? ఆయన ప్రత్యేకతే నోట్లో నాలుక ... ఒక సారి మాట్లాడడం మొదలు పెట్టారు అంటే ఆపడం యాంకర్ తరం కూడా కాదు . టివి 9 రజనీ కాంత్ కూడా ఆపలేడు . చరిత్ర చెబుతాడు . నాలుకేసుకొని బతికేస్తున్న గొనె ప్రకాష్ను నోట్లో నాలుక లేని గొనె ప్రకాష్ అంటావా ? అని కోపం రావచ్చు . ఒకసారి ఊహించండి నోట్లో నాలుక లేని గొనె ప్రకాష్ ఎలా ఉంటారో ? ఊహించ లేం కదా ? బహుశా కొమ్మినేని శ్రీనివాస రావు పరిస్థితి కూడా ఇలానే అయిందేమో గోనెకు నాలుక ప్రసాదించారు . అదేదో సినిమాలో బ్రహ్మానందం డ్రాయర్ గురించి డైలాగులు చెబుతూ స్త్రీ ప్రసాదించిన జీవితం మగాడిది అని అంటాడు .. అలానే గొనె అభిమానులకు కోపం వచ్చినా సరే కొమ్మినేని ప్రసాదించిన వరం గొనె ప్రకాష్ నాలుక ... ***** ఉమ్మడి రాష్ట్రం లో టీడీపీ బీట్ రిపోర్టర్లు అందరూ శాసన సభలో టిడి యల్ పి - సియల్ పి ( టీడీపీ, కాంగ్రెస్ ) ల మధ్య పిచ్చాపాటి చర్చల్లో గొనె ప్రకాష్ వచ్చారు . రాజకీయ సంఘటనలు, నాయకుల పేర్లు , తేదీలు ఆయన నాలుక మీద నాట్యం చేస్తుంటాయి అని చాలా మంది నమ్మకం . ఆ చర్చలో nda ప్రభుత్వం. మంత్రి వర్గం లో టీడీపీ చేరింది అని గొనె వాదన ... ఎర్రం నాయుడు Nda లో మంత్రి అని గొనె వాదన .చేరలేదు బయటి నుంచి మద్దతు అని రాజకీయాల్లో ఓ కొత్త పదం కనిపెట్టి టీడీపీ మద్దతు ఇచ్చింది . స్పీకర్ పదవి ( బాలయోగి )తీసుకోవడం తప్ప మంత్రి వర్గం లో చేరలేదు అని కొమ్మినేని తో సహా టీడీపీ రిపోర్టర్ ల వాదన ... గొనె లో ఆవేశం రగులు కుంది . నేను చెప్పింది తప్పు అయితే నాలుక కోసుకుంటాను అని కొమ్మినేనితో పందెం . నాలుక కోసుకోవడం తో పాటు కొంత నగదు - పందెం . ఎర్రంనాయుడుకు ఫోన్ చేసి మంత్రివర్గం లో చేరారా లేదా అడగమని గొనె నాకు చెబితే ... నేను ఫోన్ చేయను నీకు ఆ మాత్రం తెలియదా అని ఎర్రం నాయుడు అంటారు అని నేను .. గోనెలో ఆవేశం మరింత పెరిగింది . రికార్డ్ లు చూపించి మీరంతా తప్పు అని నిరూపిస్తాను అని అసెంబ్లీ లో ఉన్న లైబ్రరీకి గొనె వెళ్లారు . విషయం తెలుసు కాబట్టి నేను రికార్డ్స్ చూసేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు . **** రికార్డ్స్ చూసి బయటకు వచ్చిన గొనె కొంత ఆశ్చర్యంగా ఈ రికార్డ్స్ చూసేంత వరకు నేను టీడీపీ మంత్రివర్గం లో చేరింది అనే అనుకుంటున్నాను . అనుకోవడమే కాదు ఎన్నో సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ లో దీనిపై తీవ్రంగా విమర్శించాను ... ఒక్క రిపోర్టర్ కూడా మీరు చెబుతున్నది తప్పు మంత్రివర్గం లో చేరలేదు అని చెప్పలేదు ఎందుకో అని విస్తు పోయారు . నగదు సంగతి తెలియదు కానీ నాలుక వద్దు అని కొమ్మినేని వదిలేశారు .. *** గొనె మాటల ప్రకారం ఆయన ఒక తప్పును కొన్ని డజన్ల సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెబితే ఒక్కసారి కూడా అది తప్పు అనలేదు అంటే యాంత్రికంగా పని చేయడం అన్నమాట . క్లర్క్ లా చెప్పింది రాసుకోవడం కాదు ఆలోచించ గలగాలి . మనం రాసిన వార్త మనం చదువుకుంటే చాలు అని కాదు . పత్రిక మొత్తం చదివినప్పుడు ఇలా నాయకులు తప్పు చెబితే ప్రశ్నించ వచ్చు . ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రిక విలేఖరికి ఎక్కువ గౌరవం , తక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రిక వారికి తక్కువ గౌరవం అనే అభిప్రాయం ఎలా ఉన్నా - విషయ పరిజ్ఞానం ఉన్న జర్నలిస్ట్ కు విలువ ఉంటుంది . జర్నలిజం లోనాలుగు కాలాలు ఉండాలి అనుకుంటే విషయ పరిజ్ఞానానికి నిరంతరం మెరుగులు దిద్దుకోవడం అవసరం .

17, మే 2023, బుధవారం

బాబులో నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించారు ఓ జ్ఞాపకం

బాబులో నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించారు ఓ జ్ఞాపకం చంద్రబాబు ఇమేజ్ ను మీడియా ఏ స్థాయికి తీసుకువెళ్ళింది అంటే అధికారులు సైతం ఆయనలో భగవంతుడిని చూసే స్థాయికి తీసుకువెళ్ళింది . జనం ఓడించి ఇంట్లో కూర్చోబెట్టేంత వరకు అదే ఇమేజ్ భ్రమల్లో ఉండిపోయారు . బాబు గారిని చూస్తూ , ఆయన ఎదుట కూర్చొని మాట్లాడుతుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి తో నేరుగా మాట్లాడుతున్నట్టు అనిపించింది .. ఉద్యోగం వదిలి పోటీ చేస్తే ప్రభావం ఎలా ఉంటుంది ? ఏమవుతుంది? అనే ఆలోచనలు ఏమీ రాలేదు . ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినట్టు ఉండింది - ఓ అధికారి చెప్పిన మాటలు ఇవి ******* 2004 ఎన్నికల సమయం లో చంద్రబాబు కొందరు అధికారులను ఎన్నికల రంగం లో నిలిపారు .అలా సూర్యాపేట అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కొత్త అభ్యర్థిని నిలపాలి అనుకోని సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ గా ఉన్న పాల్వాయి రజనీ కుమారిని నిలబెట్టారు . ఆమె ఓడిపోయారు . ఓసారి ఎన్టీఆర్ భవన్ లో మాట్లాడినప్పుడు మీరు గ్రూప్ వన్ ఆఫీసర్ , మున్సిపల్ కమిషనర్ గా జనం తో మాట్లాడి ఉంటారు . అవన్నీ పోనివ్వండి .. 1999 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ తో తెలుగుదేశం గెలిచింది . కాంగ్రెస్ టీడీపీ మధ్య ఓట్ల తేడా స్వల్పమే . ఆ తరువాత విద్యుత్ ఉద్యమం , కాల్పులు , తెలంగాణ ఉద్యమం , వరుసగా కరువు . ఒక్కో దానికి కనీసం ఒక శాతం ఓట్లు తగ్గుతాయి కదా ? టీడీపీ గెలుస్తుంది అని ఎలా అనుకున్నారు ? అని ఆమెను అడిగితే . మీరు రిపోర్టర్ , అన్ని ప్రాంతాల వారితో మాట్లాడతారు అంచనా వేయడానికి మీ పరిస్థితి వేరు నా పరిస్థితి వేరు . మీడియాలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తారు . బిల్ గేట్స్ , క్లింటన్ వంటి వారే బాబు ఆలోచనలకు ఫిదా అయ్యారని మీ మీడియా వాళ్లే రాసేవారు . చంద్రబాబు నాయుడు పిలిచి ఎదురుగా కూర్చొని మాట్లాడుతుంటే స్వయంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తో మాట్లాడుతున్నాను అని భావించాను కానీ ఈ ఆలోచనలు ఏమీ రాలేదు అన్నారు . ఆమెకు టికెట్ ఇవ్వాలి అని అప్పటికప్పుడు నిర్ణయించి , ప్రధాని , సీఎం వంటి వారు పర్యటిస్తున్నప్పుడు ట్రాఫిక్ మొత్తం నిలిపి వారి వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చినట్టు సూర్యాపేట నుంచి హైదరాబాద్ వరకు పాల్వాయి రజనీ కుమారిని ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేస్తూ హైదరాబాద్ కు వచ్చేట్టు చేశారు .ఎన్నికల్లో నిలిచినా ప్రతి ఒక్కరికి గెలుస్తామని, మంత్రి అవుతామని ప్రోటోకాల్ మర్యాదలు ఉంటాయని ఆశ ఉండడం సహజం . సూర్యాపేట నుంచి హైదరాబాద్ వచ్చెనందుకు ఆ ఒక్క రోజే ఆమెకు రాజభోగం . ఎన్నికల్లో ఓడిపోయాక వాస్తవం తెలిసి వచ్చింది . **** బాబు హయం లో దాదాపు రెండు రోజులకు ఒక సారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్ష జరిపేవారు . ఆ సమీక్షల్లోని డొల్లతనం బహిరంగం గా అందరి ముందు బాబుకు చెప్పింది రజనీ కుమారి . ఓటమి తరువాత జరిగిన సమీక్ష లో సార్ మీరు రెండు మూడు రోజులకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అభివృద్ధి నివేదికలు అడిగే వారు . రెండు మూడు రోజుల్లో మార్పు ఏముంటుంది ? కొంత గడువు ఇస్తే బాగుండేది . దాంతో మేం గత సమీక్షలో చెప్పిన అంకెలు కొంత పెంచి చెప్పేవాళ్ళం . అందరూ ఇదే పని చేశారు అంటూ టెలికాన్ఫరెన్స్ ల డొల్ల తనాన్ని ఆమె బయటపెట్టారు . నిజానికి ఈ టెలికాన్ఫరెన్స్ లు మీడియా కోసం మీడియా సమక్షం లో జరిగేవి . వీటివల్ల మీడియాలో బోలెడు వార్తలు వచ్చాయి కానీ రాజకీయం గా ఉపయోగపడలేదు . స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ని చూసినట్టు తన్మయం చెందిన వారే రెండు వారాల్లోనే ధైర్యంగా బాబు ముందే టెలికాన్ఫరెన్స్ ల డొల్లతనం బయట పెట్టడం విశేషం . ఖమ్మం జిల్లాకు చెందిన ఫణీశ్వరమ్మ ఎంపీ డివో గా ఉద్యోగం చేస్తుంటే పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చారు . ఓడిపోయాక ఆమె ఎన్టీఆర్ భవన్ లో జరిగే ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొనే వారు. ఓసారి నృత్యం కూడా చేశారు . తిరిగి ఉద్యోగం లో చేరకుండా ఇదేంటి అని యాత్ర నాయకులు విస్తుపోయేవారు . 2004 లో టీడీపీ ఓడిపోయాక . ఉద్యోగం వదిలి ఎన్నికల్లో పోటీ చేసిన వారికి వై యస్ రాజశేఖర్ రెడ్డి తిరిగి ఉద్యోగం లో చేరే అవకాశం కల్పించారు . కొందరు ఉద్యోగం లో చేరారు . కొందరు ఎలాగూ బయటకు వచ్చాము వ్యాపారం చేద్దాం అని ఉద్యోగం లో చేరలేదు . ఉద్యోగులకు టికెట్ ఆఫర్ చేయడం లో బాబు గారికి , ప్రత్యర్థి పార్టీ వారు అయినా సరే ఓడిపోయిన వారికి తిరిగి ఉద్యోగం ఆఫర్ చేయడం లో వై యస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఎవరి రాజకీయం వారికి ఉంటుంది . టికెట్ ఇవ్వడం లో బాబు లెక్కలు బాబుకు ఉంటే ఉద్యోగం లో చేరడానికి ఆఫర్ ఇవ్వడం వెనుక వై యస్ ఆర్ లెక్కలు వై యస్ ఆర్ లెక్కలు వై యస్ ఆర్ కు ఉంటాయి . ఉద్యోగం లో ఉంటే ఎంత ? రాజకీయంగా ఎదిగితే ఎంత అని అభ్యర్థులూ లెక్కలు వేసుకుంటారు . ఎవరి లెక్కలు వారు చూసుకొని లాభనష్టాలు బేరీజు వేసుకొని లాభసాటి నిర్ణయం తీసుకుంటారు . తీసుకున్న నిర్ణయం ఒక్కోసారి లాభసాటి కాక పోవచ్చు అది వేరు .

16, మే 2023, మంగళవారం

ముఖ్యమంత్రిని ఇంట్లోకి రానివ్వలేదు ... ఓ జ్ఞాపకం 

ముఖ్యమంత్రిని ఇంట్లోకి రానివ్వలేదు ... ఓ జ్ఞాపకం  ముఖ్యమంత్రి తన చేతిలో బొకే పట్టుకొని అరగంట పాటు గుమ్మం ముందు నిలబడ్డా లోపలికి రానివ్వలేదు .... ఆగాగు సినిమా కథ  చెబుతున్నావా ? కాదు సినిమా వాళ్ళ కథ .. నిజంగా జరిగిన కథ చెబుతున్నాను . సినిమా కథ అయినా ? సినిమా వాళ్ళ కథ అయినా కొంత సహజంగా ఉండాలి . మేం మరీ అంత అమాయకులుగా కనిపిస్తున్నామా ?  సీఎం అంటే ప్రోటోకాల్ ఉంటుంది . ఏ ఇంటికి ఎప్పుడు వెళ్లాలో ముందుగానే నిర్ణయిస్తారు . సెక్యూరిటీ వాళ్ళు అక్కడ ముందే చేరి అన్నీ చూసుకుంటారు . సీఎం వెళ్లడం , అరగంట ఇంటి ముందు నిరీక్షించడం , ఐనా ఇంట్లోకి రానివ్వకపోవడం కాశీ మజిలీ కథలా ఉంది . నిజమండి బాబూ నమ్మండి . కథ కాదు నేను కళ్ళతో స్వయంగా చూసిన  సంఘటన . జర్నలిస్ట్ వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా , ఎన్నో చారిత్రక సంఘటనల ప్రత్యక్షంగా చూసే అదృష్టం లభిస్తుంది . ఏ వందేళ్లకు ఓ సారి జరుగుతాయి అనిపించే చారిత్రక సంఘటనలకు ఆ కాలం జర్నలిస్ట్ లకు   ప్రత్యక్షం గా చూసే అవకాశం లభిస్తుంది . 1995 ఆగస్టులో చంద్రబాబు ఎన్టీఆర్ ను దించేసి నెల రోజుల వైస్రాయ్ ఎపిసోడ్ తరువాత సెప్టెంబర్  1 న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు .  అనంతరం బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ నివాసానికి వెళ్లారు . **** మహాభారత యుద్ధంలో  శ్రీకృష్ణుడి సలహాతో అర్జునుడు భీష్ముడి వద్దకు వెళ్లి  కాళ్లకు మొక్కి తాతా నువ్వు ఎలా చేస్తావో చెప్పి ఆశీర్వదించు అంటాడు . మహాభారతం లో తప్ప ఇలాంటి దృశ్యం ఊహించలేం . నువ్వు ఎలా చస్తావు చెప్పి పుణ్యం కట్టుకో అని ఎవరైనా ఎవరినైనా అడగ గలరా ? కనీసం ఊహించగలమా ? అర్జునుడు జయం యుద్ధం లోనే అడిగాడు . బాబు మాత్రం ఎన్టీఆర్ ను వెన్నుపోటుతో దించేసి చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు . తనలో తానే కుమిలి పోతున్న ఎన్టీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకోవాలి అనే ఆలోచన అద్భుతం . చేతిలో బొకే పట్టుకొని దాదాపు అరగంట పాటు హాలులోనే ఉన్నారు . ఎన్టీఆర్ ఉన్న గదిలోకి రమ్మని పిలుపు రాలేదు . కొంత సేపు చూసి బాబు వెనక్కి వెళ్లి పోయారు . తన కాళ్లపై పడితేనే తమ జీవితం  ధన్యం అయింది అని మురిసిపోయిన శాసన సభ్యులు  తనను దించేయడం తో అవమాన భారాన్ని తట్టుకోలేక కుమిలిపోతున్న ఎన్టీఆర్ చంద్రబాబును లోపలి రానివ్వకపోవడం లో పెద్ద విశేషం ఏమీ లేదు . కానీ తానే దించేసి , మళ్ళీ ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళాలి అనే ఆలోచన రావడం చంద్రబాబులో వందశాతం రాజకీయ నాయకుడు ఉన్నారని రుజువు చేస్తుంది . 95 ఆగస్టు లో అసెంబ్లీ సమావేశం లో అప్పటికి ఎన్టీఆర్ ఇంకా ముఖ్యమంత్రి నేను సభా నాయకుడిని నన్ను  ఎందుకు దించేస్తున్నారు , నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని ఎన్టీఆర్ ఎంత వేడుకున్నా అప్పుడు   స్పీకర్ గా ఉన్న యనమల రామకృష్ణుడు అవకాశం ఇవ్వలేదు . అదే ఎన్టీఆర్ బాబు ముఖాముఖి చూసుకున్న చివరి  సందర్భం . ఇంటికి వచ్చినా బాబును లోనికి రానివ్వలేదు . ఆ ఆతరువాత ఎన్టీఆర్ మరణించారు .  అధికారం నుంచి దించేశాక ఎన్టీఆర్ మృత దేహం వద్దకే బాబు వెళ్లారు కానీ జీవించి ఉన్నప్పుడు కలవలేదు . 

15, మే 2023, సోమవారం

ఏంటీ టికెట్ కోసమా ? అసెంబ్లీ కి అడిగితే పార్లమెంట్ కు ఇచ్చారు ... ఓ జ్ఞాపకం ...

ఏంటీ టికెట్ కోసమా ? అసెంబ్లీ కి అడిగితే పార్లమెంట్ కు ఇచ్చారు ... ఓ జ్ఞాపకం ... 1999 ఎన్నికల సమయం .. చంద్రబాబు నివాసం లో మీడియా నిరీక్షణ .. ఉదయం నుంచి రాత్రివరకు పగలు రాత్రి అనే తేడా లేకుండా గంటల తరబడి నిరీక్షణ.. హాలులో సోఫాలోనే జారగిలపడి ... కళ్ళు మూతలు పడ్డాయి .. కళ్ళు తెరిచి చూస్తే పక్కన చింపిరి జుత్తు తో అదే సోఫాలో ఓ మహిళ .... గంటల తరబడి తిండి తిప్పలు లేక అసహనం , నీరసం ... పక్కన ఆమె కనిపించడం తో అసహనం గానే ఏంటీ మీరు కూడా టికెట్ కోసమా.? అని అడిగితే అటు నుంచి ఊహించని సమాధానం . శృంగవరపు కోట అసెంబ్లీ సీటు అడిగితే , భద్రాచలం పార్లమెంట్ సీటు ఇచ్చారు అని సమాధానం . నిద్ర తేలిపోయింది . మరెందుకు వచ్చారు అంటే ? టికెట్ తీసుకోని నేను ఇంట్లోనే ఉన్నాను , ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవడం లేదని ఫిర్యాదు చేశారట . దాంతో బాబు గారు రమ్మంటే వచ్చాను అని సమాధానం . అంతకు ముందు ఆమెను పార్టీ కార్యాలయం లో ఎప్పుడూ చూడలేదు . ఆమెతో మాట్లాడినా రాజకీయాల గురించి ఏమీ తెలియదు అని అర్థం అవుతుంది . విషయం తెలుసుకుంటే ఆమె భర్త ఎన్టీఆర్ భవన్ వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహించే పోలీసు .99 ఎన్నికల్లో బాబు తటస్తుల నినాదం ఇచ్చారు .!ఒక అప్లికేషన్ నే కదా ఇస్తే పోయేదేముంది అని ఆమె భర్త చెప్పడం తో ఇచ్చారు .st అసెంబ్లీ నియోజక వర్గం శృంగవరం కోటకు దరఖాస్తు చేస్తే ఏకంగా భద్రాచలం పార్లమెంట్ టికెట్ ఇచ్చారు . అసలు ప్రచారం చేయడం లేదని బాబు పిలిచి మాట్లాడిన అభ్యర్థి దుంపా విజయ మేరీ ఎన్నికల్లో విజయం సాధించారు కూడా ... తటస్తుల కోటాలో టీడీపీ లో చేరినవారు ఆ తరువాత పెద్దగా కనిపించ లేదు . విజయ మేరీ కూడా తరువాత కనిపించ లేదు .పదవీ కాలం ముగిశాక ఆమె రాజకీయాల్లో ఎక్కడా కనిపించలేదు . పార్టీ ఆమెను పట్టించుకోలేదు . ఆమె పార్టీని పట్టించుకోలేదు . పార్టీ తరపున పోటీ చేశారు గెలిచారు ఇప్పుడెక్కడున్నారు ? ఎందుకు పార్టీకి దూరం అయ్యారు అని పార్టీ పట్టించుకోలేదు . ఒక మిత్రుడు చెప్పిన సమాచారం ప్రకారం . హైదరాబాద్ లో ఆమెకు త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఉంటే అమ్మేసి , డబుల్ బెడ్ రూమ్ ఇంటికి మరి అమ్మాయి పెళ్లి చేశారు .  ****** జెరాక్స్ చేసుకొని మళ్ళీ ఇచ్చేస్తా అనగానే వెయ్యి పేజీల బుక్ నా చేతిలో పెట్టాడు ఆ ఎంపీ ... నవ్వు వస్తున్నా ఆపుకుంటూ సీరియస్ గానే అడిగాను మళ్ళీ ఇవ్వాలి అంటూ అతను లావు పాటి బుక్ చేతిలో పెట్టాడు .పార్లమెంట్ సమావేశాల ముందు కేంద్రం లో రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ సమస్యలతో ఓ బుక్ తయారు చేసి ఎంపి లకు ఇస్తారు ... వీటిని చదివే ఎంపీలు చాలా తక్కువ .. వార్తలు రాసుకోవచ్చు అని మీడియాకు ఆసక్తి . అలా అని మీరు ఎలాగూ చదవరు మాకు ఇవ్వండి అని అడగలేం ... అలా ఇస్తే కనీసం బుక్ చదివే ఓపిక లేదు రాష్ట్రం గురించి వీళ్ళేం మాట్లాడుతారు అని మీడియా అనుకుంటుంది అని సందేహం . దాంతో కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్టు జెరాక్స్ తీసుకోని ఇస్తా అనగానే సైఫుల్లా అనే ఎంపీ ఇచ్చేశాడు . ఏ రిపోర్టర్ ఐనా వెయ్యి పేజీలు జెరాక్స్ తీసుకోని ఇస్తాడా ? ఇవ్వాలన్నా మీటింగ్ ముగియగానే తిరిగి వెళ్లి పోయిన అతని ఎలా ఇస్తారు .. ఈ టెక్నీక్ చూసి మిత్రుడు వార్త రిపోర్టర్ నాగేశ్వర్ రావు ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి వద్దకు వెళ్లి సార్ జెరాక్స్ తీసుకోని ఇస్తా అంటే నిర్మోహ మాటంగా అతను తిరస్కరించాడు . నేను అక్కడికి వచ్చి టెక్నీక్ మంచిదే కానీ సరైన వ్యక్తి వద్ద ప్రయోగించ లేదు ... మొత్తం ఎంపీల్లో ఆ బుక్ కచ్చితంగా చదివే వారు ఎవరైనా ఉన్నారా అంటే సోలిపేట పేరు ముందు చెప్పవచ్చు .. సోలిపేట ను వదిలి ఇంకెవరి వద్ద నైనా ప్రయత్నించు అని చెప్పాను .. సోలిపేట రాజ్యసభ సభ్యులు ఐనా వ్యవహారాలు ఏమీ ఉండవు శ్రద్దగా చదువుతారు . సైఫుల్లా విషయానికి వస్తే కాలం కలిసి వస్తే అదృష్ట లక్ష్మి ఇంటికి వచ్చి తలుపు తడుతుంది అనడానికి ఉదాహరణ ... 96 లో ఆయనకు ఫోన్ లేదో లేక ఎన్టీఆర్ భవన్ లో ఆయన ఫోన్ నంబర్ లేదో కానీ ఎన్టీఆర్ భవన్ నుంచి అనంతపూర్ లో పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి సైఫుల్లాను పిలిపించి రాజ్యసభ సభ్యత్వం కల్పించారు . 96లో రాయలసీమ నుంచి ఒక ముస్లిమ్ నాయకుడి అవసరం పడింది . సైఫుల్లా పంట పండింది . బాబు ఎంతో మంది పారిశ్రామిక వేత్తలను , సంపన్నులను రాజకీయాల్లోకి ఆకర్షించారు . తటస్తుల కోటానో , రిజర్వేషన్ కేటగిరి కిందనో ఒక్కో సారి ఊహించని విధంగా కొందరి పంట పండింది .. Mla టికెట్ కోసం దశాబ్దాల తరబడి నిరీక్షించే వారు ఎంతో మంది కనిపిస్తారు కొంత మందికి అదృష్టం అలా వళ్ళో వచ్చి వాలి పోతుంది . రాజకీయాలు లాటరీ లాంటివే ...

13, మే 2023, శనివారం

ఒక వార్త రెండు పిట్టలు... ఓ జ్ఞాపకం ...

ఒక వార్త రెండు పిట్టలు ఓ జ్ఞాపకం ... తెలుగు యువత అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్ వరల్డ్ బ్యాంకు కు బదులు ఉన్నత విద్యా మండలి నుంచి ఋణం తీసుకోవాలి అనుకుంటున్న ప్రభుత్వం ... Ysr సీఎం గా ఉన్నప్పుడు ఈ రెండు వార్తలు ఆంధ్ర ప్రభ మొదటి పేజీలో చూడగానే తోటి రిపోర్టర్లు , ప్రభుత్వం , రాజకీయపక్షాలు బుర్ర గోక్కోవడం మొదలు పెట్టారు ... ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా ysr బంధువు ఉండేవారు ... ఈ వార్త పై వివరణ ఇవ్వడానికి మీడియాను పిలిచి వెర్రి చూపులు చూడసాగాడు ... ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యం లోనే ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తారు .. దానికి కొంత ఫీజు వసూలు చేస్తారు .అందులో కొంత మిగులుతుంది .. అదే ఉన్నత విద్యా మండలి ఆదాయం .. వేల కోట్ల రూపాయలను దేశాలకు , రాష్ట్రాలకు ఋణం ఇచ్చే ప్రపంచ బ్యాంకు ఎక్కడ ? విద్యా మండలి ఎక్కడ ? రెండింటికి పోలిక ఏమిటో అర్థం కాక , ఏం సమాధానం చెప్పాలో తెలియక ఉన్నత విద్యా మండలి కార్యదర్శి క్రిస్టోఫర్ వెర్రి చూపులు ..... @@@ ఎన్టీఆర్ భవన్ లో అదే పరిస్థితి ... టీడీపీ పుట్టిన కొత్తలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు తెలుగు యువత అధ్యక్షుడు ... ఆ తరువాత ప్రాధాన్యత లేదు .... సినిమాల్లో నంబర్ వన్ గా వెలిగిపోతున్న జూనియర్ ఎన్టీఆర్ పనీ పాటా లేని , ఉండని యువత పోస్ట్ ఎందుకు తీసుకుంటారు అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు .... *** అటు టీడీపీ , ఇటు ఉన్నత విద్యా మండలి , ఈ రెండు విభాగాల వార్తలు రాసే మీడియా ఆ రోజంతా వీటి గురించే .... ఎందుకు రాశారు ? ఎవరు రాశారు అని ... ***** బాబు హయం లో కొందరు టీడీపీ రిపోర్టర్ లే కాదు విద్యా విలేఖరులు కూడా కొందరు ఓ వెలుగు వెలిగారు . కొందరు సొంత విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు . అలా సొంత విద్యా సంస్థ ఏర్పాటు చేసుకున్న జర్నలిస్ట్ కొంత కాలం గడిచాక తిరిగి జర్నలిజం లోకి వచ్చారు . రాజకీయం , సినిమా , జర్నలిజం ఏదైనా కావచ్చు రోజూ కనిపిస్తేనే గుర్తింపు . చాలా గ్యాప్ తీసుకోని తిరిగి వస్తే పట్టించుకోరు ...మరేం చేయాలి ... బాగా కష్టపడి పని చేస్తే పదేళ్లలో కూడా రాని గుర్తింపు ఒకే ఒక్క రోజులో అంతకు మించి గుర్తింపు తెచ్చు కున్నాడు ... అతను తిరిగి జర్నలిజం లోకి రాగానే రెండు బీట్లు ఇచ్చారు . టీడీపీ , విద్యా శాఖ ... అతను వస్తూనే జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగు యువత అని రాజకీయ వార్త . ప్రపంచ బ్యాంకు నుంచి కాకుండా ఉన్నత విద్యా మండలి నుంచి ఋణం అని విద్యా శాఖ వార్త రాసి కలకలం సృష్టించాడు . ఇది నిజామా ? సాధ్యమా ? ఎవరికీ అవసరం లేదు . నువ్వు రాసింది నిజం కాలేదు అని అడిగే బాస్ ఉండరు కానీ , వాళ్ళు రాసింది నువ్వెందుకు రాయలేదు అని అడిగే బాసులు ఉంటారు ... ఒకే ఒక రోజులో అతని తిరిగి జర్నలిజం లోకి వచ్చాడు అని సర్వ జనులకు తెలిసేట్టు చేసిన అతనితెలివి తేటలకు ముచ్చటేసింది .. తెల్లటి పేపర్ మీద నల్లటి అక్షరాలతో కనిపించేదంతా నిజమే అనుకునే వారి సంఖ్య తక్కువేమి కాదు ... నిజం అబద్దం ఈ రెండే కాదు వార్తల వెనుక ఎన్నో రహస్యాలు , ప్రయోజనాలు దాగి ఉంటాయి ... మేనేజ్ మెంట్ ప్రయోజనాలు , ఎడిటర్ , బాస్ , రిపోర్టర్ ఎవరి ప్రయోజన మైనా కావచ్చు ... నల్లటి అక్షరాలు అన్నీ నిజాలు కావు అబద్దాలు కావు ....

పీఎం , సీఎం ఏం మాట్లాడుకున్నారో రాధాకృష్ణకు ఎలా తెలుస్తుంది? ఓ జ్ఞాపకం

పీఎం , సీఎం ల మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నారో రాధాకృష్ణకు ఎలా తెలుస్తుంది? జగన్ , నరేంద్ర మోడీల్లో ఎవరో ఒకరు ఆయన సోర్స్ కావచ్చు ఆ సంగతి నాకు తెలియదు ... కానీ ఆయన రిపోర్టర్ గా తిరిగేప్పుడు ... ఆయనకు తెలియంది , సామాన్య జర్నలిస్ట్ కు తెలిసింది . ఓ జ్ఞాపకం ఉంది చెబుతాను . ఓ జ్ఞాపకం కొన్ని గంటల పాటు ముఖ్యమంత్రి వద్ద .. పొలిట్ బ్యూరో సభ్యులు , బాబు సన్నిహిత జర్నలిస్ట్ రాధాకృష్ణ లతో ఉండి ..... వీరికన్నా ఎక్కువ తెలిసిన వారు ఎవరుంటారు ? ఈ రోజు ఇంతకు మించి ఏమీ ఉండదు అని ఆఫీస్ కు వెళ్లి వార్త రాసి హాయిగా నిద్ర పోయి తెల్లవారగానే పత్రిక చూస్తే అంతకు మించి జరిగింది చదివితే మన అతి విశ్వసం పై ఎవరో కొట్టినట్టు ఉంటుంది . *** బాబు తొలి సారి సీఎం అయినప్పుడు రాజ్యసభ ఎన్నికలు ... ఐదుగురిని ఎంపిక చేయాలి ... అర్ధరాత్రి వరకు పొలిట్ బ్యురో... నాలుగు పేర్లు బయటకు వచ్చాయి .మీటింగ్ తరువాత నలుగురైదుగురు జర్నలిస్ట్ లు బాబుతో సమావేశం ... అందులో ఒకరు రాధాకృష్ణ ... ఆయన రిపోర్టర్ గా రంగంలో తిరిగే రోజులు ... నాలుగు పేర్లు ఫైనల్ అయ్యాయి . ఐదవ పేరు రేపు అని బాబు ... బాబుగారే చెబుతున్నారు కదా వెళదాం అని రాధాకృష్ణ ... హేమాహేమీలైన్ పొలిట్ బ్యూరో నేతలు సైతం అదే మాట ... సరే అని అంతా వారి వారి ఆఫీస్ లకు ... తెల్లవారును జ్యోతి తో పాటు అన్ని పత్రికల్లో నాలుగే పేర్లు .... ఒక్క వార్తలో తప్ప .... అందులో ఐదు పేర్లు ...ఐ దూ కరెక్ట్ పేర్లే ... బాబు ఆత్మకు .... హేమా హేమీలకు తెలియని పేరు వార్త రిపోర్టర్ నాగేశ్వర రావు కు ఎలా తెలిసింది ... పైగా ఆ రోజు అర్ధరాత్రి వరకు బాబు ఇంట్లో బాబు తో ఉన్న రిపోర్టర్ లలో అతను లేడు .... మరుసటి రోజు అతన్ని పట్టుకొని ఎలా ? హౌ ? అని అడిగితే .... మీరంతా బాబు ఇంట్లో ఉన్నారు కదా . అప్పుడు నేను అక్కడికి రాకుండా ఆ చౌరస్తా లో ఉన్నాను ... పొలిట్ బ్యూరో అయిపోగానే నేతలు వెళ్లేప్పుడు ....చందూలాల్ మీరు అతన్ని నాయకుడిగానే చూడరు .. అతను పొలిట్ బ్యూరో మెంబర్ ... వెళ్లి అతని కారులో కూర్చొని ......పేర్లు తీసుకున్నాను..... బాబు , నంబర్ టూ అనుకునే మంత్రుల కన్నా ఎవరూ పట్టించుకోని చిన్న మంత్రులు మనం పలకరిస్తే మురిసి పోయి చెబుతారు .....జర్నలిస్ట్ లు ఆచరించాల్సిన పాఠం ఇది ... చిన్న వారి వద్దే పెద్ద సమాచారం పొందడం ఈజీ ... మరి జగన్ మోడీ రహస్యం గా మాట్లాడు కునేది రాధాకృష్ణకు ఎలా తెలుసో చెప్పలేదు ... అది చాలా ఈజీ అక్కడ ఏం మాట్లాడుకున్నారో రాయాలి అంటే సోర్స్ ఉండాలి .. రాయాలి అనుకున్నది రాసేసేందుకు సోర్స్ ఎందుకు ?

11, మే 2023, గురువారం

నగ్న సత్యం ...బట్టలిప్పితేనే మీడియా గుర్తిస్తుంది ....ఓ జ్ఞాపకం

నగ్న సత్యం ఓ జ్ఞాపకం కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ... బట్టల పై పన్నులు విధించాలి అని నిర్ణయం ... దీనికి వ్యతిరేకంగా వస్త్ర వ్యాపారులతో కలిసి చంద్రబాబు ఇందిరాపార్క్ వద్ద ధర్నా .... ఈ పన్ను విధింపు వల్ల ప్రజలు ఇక బట్టలు కట్టుకోలేరు అని టీడీపీ తీవ్ర ఆందోళన ... దేశం లో ఎన్ని కోట్ల మంది బట్టలు వేసుకుంటారో , వారంతా కాంగ్రెస్ కు వ్యతిరేకం గా ఓటు వేస్తే ఏమవుతుందో వస్త్ర వ్యాపారాలు గణాంకాలతో సహా వివరిస్తున్నారు ... ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి ... వర్షపు తుంపర్లు పడుతుంటే సునామీ అని ప్రచారం చేసే సత్తా ఆ పార్టీకి ఉంది ... బాబు ధర్నా అంటే రిపోర్టర్ గా కవర్ చేయాలి . హడావుడిగా వెళ్లి ఇందిరాపార్క్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియం లో బైక్ పార్క్ చేసి లాక్ వేస్తుంటే ...పక్కనే ఉన్న చెట్టు వెనక నుంచి ఓ ఆదిమానవుడి నా వైపు రాసాగాడు ... 80 ప్రాంతం లో తెలుగులో ఆదిమానవుల మూగ సినిమాలు చాలా వచ్చేవి . సినిమాలో మాటలు ఉండవు . శరీరం పై ఆకులే ఉండేవి ... అలానే ఇతను శరీరం మీద నూలు పోగు కూడా లేదు . నడుముకు ఆకులు ఉన్నాయి ... దగ్గరకు వచ్చి పలకరించి ఎలా ఉంది అని అడిగాడు ... వస్త్రాల పై పన్ను వేస్తే జనం ఇక బట్టలు కట్టుకోకుండా ఆకులు కట్టుకొని తిరుగుతారు అని సింబాలిక్ గా చూపిస్తున్నాడు అన్నమాట .. పార్టీ నిరసన ప్రోగ్రాం ఏది జరిగినా ఈనాడు సిటీ పేజీ లో ఇతని ఫోటో రావలసిందే ... రైతు , నిరుద్యోగి , ధరలు పెరిగితే కుటుంబరావు ఏ నిరసన ఐనా ఇతని ఫోటో తప్పని సరి ... రైతు ఆవేదన , నిరుద్యోగి ఆక్రోశం అంటూ క్యాప్షన్ తో ఇతని ఫోటో ... అన్ని వేషాలు ఒకే వ్యక్తివి అని ఫోటో గ్రాఫర్ కు తెలుసు సబ్ ఎడిటర్ కు తెలుసు . మంచి ఫోటో కావాలి అంటే తప్పదు ... అతని పేరు కృష్ణ గౌడ్ అంబర్ పేట టీడీపీ చోటా లీడర్ .. దగ్గరకు వచ్చి ఎలా ఉంది అని అడిగితే , నీ కోణం లో సూపర్ ... ధర్నాకు సంబంధించి బాబు ఫోటో వేసినా వేయక పోయినా నీ ఫోటో వేసి తీరాల్సిందే అన్నాను .. అతను వెళ్ళాక మరో యువ లీడర్ చౌదరి అని మీ లాంటి వాళ్ళు కూడా అతన్ని ఎంకరేజ్ చేయడం బాగా లేదు ... మేం ధర్నాకు డబ్బు ఖర్చు చేసి ఏర్పాట్లు అన్నీ చేస్తే మాకు ప్రచారం రాదు ... అతను వచ్చి బట్టలు విప్పి ఆకులు కట్టుకుంటే ప్రచారం అని బాధ పడ్డాడు ... చూడు చౌదరి అతను చేసింది కరెక్ట్ అని నేను చెప్పలేదు ... అతని కోణం లో కరెక్ట్ అన్నాను .. బట్టలు వేసుకొని రావడం కామన్ ... ఇది మీడియాకు నచ్చదు ... పూర్వం మీడియా అంటే ప్రజలకు సమాచారం చేరవేసేది అని ... ఇప్పుడు మీడియా అంటే వినోదం , కాలక్షేపం ... విలువలు లేకుంటేనే మీడియాలో ప్రాధాన్యత లభిస్తుంది ... పైగా అదే మీడియా పడిపోతున్న విలువలు అంటూ గగ్గోలు పెడుతుంది . దుర్యోధనుడు పుట్టినప్పుడు నక్కల అరుపులు వినిపించాయట ... చెట్టు చాటు నుంచి ఆకులు కట్టుకొని వచ్చిన ఆ చోటా లీడర్ వచ్చినప్పుడు ... వెర్రి తలలు వేయబోతున్న మీడియా శబ్దాలు అప్పుడు వచ్చే ఉంటాయి ....

కళ్ళు తెరిపించిన ys రాజారెడ్డి హత్య కేసు లో ముద్దాయి ఓ జ్ఞాపకం

కళ్ళు తెరిపించిన ys రాజారెడ్డి హత్య కేసు లో ముద్దాయి ఓ జ్ఞాపకం టీడీపీ ఓడిపోయి ysr సీఎం ఐన కొత్తలో ఓ సారి శాసన సభలో ysr తాను మారాను అంటూ తన తండ్రిని చంపిన పార్థసారధి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు ఐనా ఏమీ చేయలేదు అని ఏదో ఉపన్యాసం లో చెప్పారు ... మరుసటి రోజు టీడీపీ నుంచి మీడియాకు సమాచారం సోమాజీ గూడా ప్రెస్ క్లబ్ లో పార్థసారధి ప్రెస్ కాన్ఫరెన్స్ అని .... పార్టీ వాళ్లే మాట్లాడించినా పార్టీకి సంబంధం లేదు అని చెప్పడానికి ఇలా బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిస్తారు ... టీడీపీ హయం లో పార్థసారధి రెడ్డి కి మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పదవి ఇచ్చారు ... అతన్ని చూస్తే మార్కెట్ కమిటీలో క్లర్క్ అనిపించాడు కానీ సినిమాల్లో లా రాయల సీమ రాజకీయ నాయకుడు అనిపించ లేదు .. Ysr తో నాకు ప్రాణభయం ఉంది ... అందుకే శాసన సభలో నా గురించి చెప్పాడు అని స్క్రిప్ట్ ప్రకారం ఏదో చెప్పాడు ... బయటకు వచ్చాక అతనికి జ్ఞాన బోధ చేయాలి అనిపించింది .. నేను పలానా అని పరిచయం చేసుకొని చూడు బాబు నీ భయం తప్పు ... సీఎం అనే పదవి ముందు దీనిపై ఆసక్తి ఉండదు ... అధికారం అనేది అన్నిటి కన్నా మించిన మత్తు ... స్ర్తీ , పాత కక్షలు , మద్యం , బంధుత్వాలు ఇవేవి అధికారం అనే మత్తు ముందు ఎందుకూ పనికి రావు ... కాబట్టి ysr నన్ను చంపిస్తాడు అనే నీ భయం ఓ భ్రమ ... చంపుమని నువ్వు ముందుకు వెళ్లి నిలబడ్డా చంపడు .... పదవి బాబూ పదవి .... నిన్ను ఎవరు చంపినా అనుమానం ys పైకి వెళుతుంది ... రాజకీయ ప్రయోజనం టీడీపీ కి వస్తుంది ... కాబట్టి నీ ప్రాణాలకు ఎవరి తోనైనా ముప్పు ఉందా అంటే బాబు పార్టీ వల్ల ఉంది ... ఎందుకంటే వారికే లాభం అని చెప్పి ... అంతా విని అంతే అంటారా అని ఆలోచనలు పడ్డాడు .... అతన్ని వదిలేసి నా పనిమీద నేను వెళ్లి పోయాను ... ప్రాణ భయం తో ఉన్నవాడికి భరోసా కల్పించాను అనుకుంటూ ..... ఆ విషయం మరిచి పోయాను ... ఓ సారి ఎన్టీఆర్ భవన్ నుంచి బయటకు వస్తుంటే గేటు పక్క నుంచి సార్ ... సార్ అని వినిపిస్తే చూశా .... పార్థసారధి రెడ్డి ... మీరు ఆ రోజు చెప్పారు కదా అని విషయం అంతా గుర్తు చేశాడు .. మీరు చెప్పాక బాబును కలిశాను ... మీకు ysr తో ప్రాణ భయం లేదు ... ఉంటే గింటే బాబు తోనే ఉంది అని మురళి చెప్పాడు అని బాబుకు వివరంగా చెప్పాను ... ఆ మాటలు విని బాబు కంగారుగా నాకేం ఖర్మ అన్నారు అని వివరించాడు ... నేను కంగారు పడి నీ ముఖం చూస్తే పాపం అనిపించి చెప్పాను , అవన్నీ నా పేరు తో బాబుకు చెప్పడం తప్పు కదా ? అని ప్రశ్నిస్తే .... పార్థసారధి చిద్విలాసం గా నవ్వి ... మీరు చెప్పాక బాగా ఆలోచించాను ... నిజమే కదా అనిపించి ఒక వేళ నన్ను ఏమైనా చేస్తారేమో .... మీడియా ఇలా కూడా ఆలోచిస్తుంది అని బాబుకు చెప్పడానికే అలా అన్నాను అని బదులిచ్చాడు .. నువ్వు కనిపించేంత అమాయకుడివేమి కాదు ... మీలాంటి వారి విషయం లో తొందరగా ఓ నిర్ణయానికి రావద్దు అనుకోని - అతను నా కళ్ళు తెరిపించాడు అనుకున్నాను .... మళ్ళీ హత్య , సిబిఐ . అరెస్టులు అనే వార్తలు చూస్తే గుర్తుకు వచ్చింది ... ఆ తరువాత పార్థసారధి రెడ్డి ఎప్పుడూ కలువ లేదు ...

10, మే 2023, బుధవారం

కరెంట్ బిల్లు కట్టవద్దన్న ysr ..కట్టని బాబు అట్టుడికిన అసెంబ్లీ .. ఓ జ్ఞాపకం

కరెంట్ బిల్లు కట్టవద్దన్న ysr ..కట్టని బాబు అట్టుడికిన అసెంబ్లీ .. ఓ జ్ఞాపకం ప్రతిపక్ష నాయకుడిగా విద్యుత్ బిల్లులు కట్టవద్దు అని ysr పిలుపును ఇస్తే ,ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాటిస్తే ఎలా ఉంటుంది .. ఇది నిజంగా జరిగింది అసెంబ్లీ అట్టుడికింది ... అలా జరగడానికి తనకు తెలియకుండానే సహకరించిన వ్యక్తికి ఆ విషయం ఇప్పటికీ తెలియదు . 2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందు విద్యుత్ అంశం రాష్ట్రాన్ని అట్టుడికించేట్టు చేసింది .. ఒక వైపు విద్యుత్ ఉద్యమం తరువాత తెరాస ఆవిర్భావం . వ్యవసాయానికి విద్యుత్ చార్జీలు పెంచినందుకు బిల్లులు చెల్లించ వద్దు అని ysr పిలుపు .. రాష్ట్రమంతటా విద్యుత్ అంశం పైనే చర్చ ..... **** సచివాలయం లో పని ముగించుకొని ఆఫీస్ కు వెళ్ళడానికి సిద్ధమవుతుంటే సీఎం ఆఫీస్ లిఫ్ట్ ఆపరేటర్ మా ఇల్లు మీ ఆఫీస్ వైపే అక్కడి వరకు లిఫ్ట్ ఇస్తారా ? అని అడిగారు ..అప్పుడు బాబు సీఎం సీఎం ఆఫీస్ అటెండర్ కు కూడా ఎన్నో విషయాలు తెలుస్తాయి ... వారిని మాట్లాడించే సామర్ధ్యం మనకు ఉంటే .... నేను మంచి శ్రోతను .. ఎదుటి వారితో మాట్లాడించ గలను ... పిచ్చాపాటి ఏవేవో విషయాలు శ్రద్దగా విన్నాను ... నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామం లో బాబుకు వ్యవసాయ పొలం ఉంది అనేది గుర్తుండి పోయింది .. అంతకు ముందు ఆ విషయం ఎక్కడా వినలేదు .. *** ఓ రోజు ఆకాశ రామన్న ద్వారా ఓ సమాచారం అందింది . నెల్లూరులో బాబుకు వ్యవసాయ పొలం ఉంది . విద్యుత్ మీటర్ నంబర్ వివరాలు .. దాదాపు లక్ష రూపాయలకు పైగా విద్యుత్ బకాయిలు .. చాలా రోజుల నుంచి చెల్లించడం లేదు . సీఎం ది కాబట్టి అధికారులు అడిగే ధైర్యం చేయరు .. చెప్పే ధైర్యం చేయరు ... ఇప్పటి మాదిరిగా మీటర్ నంబర్ ఆన్ లైన్ లో చూస్తే బకాయి ఎంత ఉంది ? యజమాని ఎవరు అని తెలిసే రోజులు కావు ... ఆదివారం అధికారులు ఉండరు .. ఉన్నా చెప్పరు .. *** విలేజ్ పేరు చూశాక గుర్తుకు వచ్చింది .. ఆ రోజు లిఫ్ట్ ఆపరేటర్ చెప్పిన ఊరు ఇదే ... న్యూస్ ఎడిటర్ అమర్ నాథ్ కు విషయమంతా చెప్పి దేవుడు శాసించాడు , భాషా పాటించాడు అని రజనీ కాంత్ డైలాగులా - వైయస్సార్ విద్యుత్ బిల్లులు కట్టొద్దని పిలుపు ఇచ్చాడు , చంద్రబాబు పాటించాడు అని వివరంగా వార్త రాస్తే బ్యానర్ వేశారు .మరుసటి రోజు అసెంబ్లీ ... ఈ అంశం పై అసెంబ్లీ అట్టుడికింది ... విద్యుత్ బిల్లు కట్టక పోవడం సాధారణ సమయం లో పెద్ద అంశం కాదు .. కానీ విద్యుత్ బిల్లులు కట్టవద్దు మేం అధికారం లోకి రాగానే మాఫీ అని వైస్సార్ పిలుపు ఇస్తే , కట్టక పోతే కనెక్షన్ కట్ అని బాబు హెచ్చరికలు ... దానితో వార్త ప్రాధాన్యత సంతరించుకుంది . నెల్లూరులో పొలం నిజమే , చాలా రోజుల నుంచి బిల్లు కట్టనిది నిజమే. దాంతో బాబు సమర్ధించు కోలేక పోయారు ... లిఫ్ట్ ఇస్తే అతను నాకు న్యూస్ లో లిఫ్ట్ ఇచ్చాడని మనసులో అనుకున్నాను ...ఈ విషయం లిఫ్ట్ ఆపరేటర్ కు ఇప్పటి వరకు తెలియదు . చాలా సార్లు యాంకర్లు , రిపోర్టర్ లు ఎక్కువగా మాట్లాడతారు ... నాయకులు , అధికారులను మాట్లాడనివ్వక సక్సెస్ అయ్యాము అనుకుంటారు . మనం తక్కువ మాట్లాడి మనకు వార్తలు ఇచ్చే వారితో ఎక్కువ మాట్లాడించాలి ..మహా మహులే కాదు చిన్న వారి వద్ద కూడా బోలెడు సమాచారం ఉంటుంది ...

ఎన్టీఆర్ భవన్ క్యాంటిన్ కూ ఉంది చరిత్ర

ఎన్టీఆర్ భవన్ క్యాంటిన్ కూ ఉంది చరిత్ర జ్ఞాపకాలు 2004 లో తెలుగుదేశం ఓడిపోయాక ఓ రోజు ఎన్టీఆర్ భవన్ లో నన్నప నేని రాజకుమారి చూడు మేం ఓడిపోయినా ఎన్టీఆర్ భవన్ ఎప్పుడూ కళకళ లాడుతోంది అంటే ఓ క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను క్యాంటిన్ బంద్ చేసిచూడండి ఎన్టీఆర్ భవన్ ఎంత కళకళ లాడుతుందో చూడండి అన్నాను ... ఆమె ఫకాలున నవ్వి అంతేనా ? అన్నారు . పేరుకు క్యాంటిన్ కానీ అక్కడ ఎన్నో చర్చలు జరిగేవి . ఎర్రంనాయుడు , ఉమ్మారెడ్డి , లాల్ జాన్ బాషా వంటి హేమాహేమీలు అక్కడ భోజనం చేస్తూ మీడియాతో బోలెడు సంగతులు పంచుకునే వారు . అప్పుడప్పుడు బాబు కూడా ... **** పార్టీ పుట్టినప్పటి నుంచి హిమాయత్ నగర్ లో టీడీపీ కార్యాలయం ఉండేది . ఆ భవనం ఓ నవాబులది . పార్టీ నాయకుడు కూడా .. ఎన్టీఆర్ ను బాబు దించేశాక ప్రభుత్వం , పార్టీ , బ్యాంకు డిపాజిట్లు అన్నీ బాబు తీసేసుకున్నా పెద్ద మనసుతో ఈ అద్దె భవనాన్ని మాత్రం ఎన్టీఆర్ కు వదిలేశారు . అదే హిమాయత్ నగర్ లో ఈ భవనానికి కొద్ది దూరం లోనే అదే నవాబు గారికి ఇంకో భవనం ఉండేది . దాన్ని బాబు టీడీపీ కి ఇచ్చారు . బాబు నాయకత్వం లో టీడీపీ తొలుత ఇక్కడి నుంచే పని చేసేది . బాబు బంజారాహిల్స్ లోని తన ఇంటికి వచ్చేప్పుడు , వెళ్లేప్పుడు దారిలోని ఓ విశాలమైన ఖాళీ స్థలం పై పడింది . అది ప్రభుత్వ స్థలం mch వాళ్ళు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాడని కి ఏర్పాట్లు చేశారు . ప్రభుత్వాన్నే స్వాధీనం చేసుకున్నప్పుడు ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకోవడం ఎంత పని ... ఎన్టీఆర్ విధానాల పై విస్తృత చర్చ కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ అంటూ , ఆ ట్రస్ట్ పేరు మీద ఈ స్థలం తీసుకోని బిల్డింగ్ కట్టారు ... దాదాపు 16 ఏళ్ళు రోజూ వెళ్ళాను . ఎన్టీఆర్ విధానాల పై రహస్యంగా ఏం చర్చలు జరుపుతారో తెలియదు . సుదూర ప్రాంతాల్లో సమావేశాలు ఉన్నప్పుడు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసి మీడియాను అక్కడికి తీసుకువెళ్లడం మాములే . హిమాయత్ నగర్ లోని పార్టీ కార్యాలయం నుంచి వాహనాలు ఏర్పాటు చేసి బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ భవన్ కు తీసుకువెళ్ళేవారు ... ఇప్పుడంటే ఎన్టీఆర్ భవన్ సిటీ మధ్యలో ఉన్నట్టు కానీ అప్పుడుదూరం అనిపించేది . అందుకే కొద్ది రోజులు మీడియాకు వాహనాలు ఏర్పాటు చేశారు . భవనం లో దాదాపు ఒకే సారి వెయ్యి మంది భోజనం చేయగల క్యాంటిన్ ప్రత్యేకం ...దాదాపు రాష్ట్ర విభజన వరకు క్యాంటిన్ సందడిగా ఉండేది ... ప్రెస్ కాన్ఫరెన్స్ లో నాయకులు మొక్కుబడిగా మాట్లాడినా ఆ క్యాంటిన్ లో మనసు విప్పి ఆలోచనలు పంచుకునే వారు .ఆ క్యాంటిన్ లో ఎన్నో రుచికరమైన వార్తలు దొరికాయి . ఈ భవన్ , క్యాంటిన్ గురించి అన్ని పార్టీల వారిలో ఆసక్తి ఉండేది . పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు యం . సత్యనారాయణ రావు ఓ సారి బహిరంగం గానే మీ భవన్ అద్భుతంగా ఉంటుందట ... చేయి పెట్టగానే ట్యాప్ నుంచినీళ్లు వస్తాయట కథలు కథలుగా చెప్పుకుంటున్నారు ఓ సారి వచ్చి చూస్తాను అన్నారు . ఒక పార్టీ కార్యాలయాన్ని ప్రత్యర్థి పార్టీ అధ్యక్షుడు బహిరంగం గా పొగడడం అదే మొదటి సారి చివరి సారి . తెలంగాణ నేతలు - అద్దెకు షాప్ అక్కడ క్యాంటిన్ కే కాదు భవన్ లో భాగంగా ఒక పక్కకు ఓ టీ షాప్ ఉండేది . సిగరెట్లు , టి , సమోసా అమ్ముతారు .దానికీ ఓ చరిత్ర ఉంది . తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న రోజులు ఆ షాప్ ముందు టీడీపీ నేత అమర్నాథ్ తో పిచ్చాపాటి .. తెలంగాణ వెనుకబడి ఉంది అంటే ఈ ప్రాంత నేతల వైఫల్యమే... ప్రాజెక్ట్ లు కట్టమని అడగక పోవడం వాళ్ళ తప్పే కదా ? ఇలా సాగుతుంది ఆయన వాదన ... నేను అంతా విని బాగా మాట్లాడవు అని మనం టి తీసుకున్న షాప్ ఉంది కదా ? మీ వాదనకు ఇదే సమాధానం . దివాకర్ అని అప్పుడు డీసీ లో ఉండేవారు సీనియర్ రిపోర్టర్ ఓ రోజు సరదాగా మాట్లాడుతూ ఎన్టీఆర్ భవన్ బయట ఉన్న ఆ చిన్న షాప్ అద్దెకు ఇప్పించు మురళి ఈ ఉద్యోగం కన్నా అది బెటర్ అంటే నేను సీరియస్ గానే తీసుకోని విచారించాను . అడగాలే కానీ అదెంత పని అనుకున్నాను . విషయం తెలుసుకుంటే ఆమ్మో అనిపించింది .. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తులసీ రామ్ అని ఉండేవారు మాజీ ఎంపీ .. తన కుమారుడి కోసం ఆ షాప్ అద్దెకు అడిగారు .. బాబును ఎన్నిసార్లు కోరినా కాలేదు ... ఉపాధ్యక్షుడు అంటే బాబు తరువాత స్థానం ... ఆయన అడిగితే ఓ షాప్ అద్దెకు ఇవ్వలేదు . షాప్ దగ్గర కూడా ఆయన పలుకుబడి పని చేయలేదు ... ప్రాజెక్ట్ ల దాకానా ? అంటే నవ్వుతూ వాదన అంగీకరించాడు ... హేమా హేమీలు ఎందరు ప్రయత్నించినా దిక్కులేదు . నారా భువనేశ్వరి సిఫారసుతో ఒకరికి ఇచ్చారు ... అందుకే మహా భక్త రామదాసులు కూడా మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని అటు నుంచి నరుక్కు వస్తారు ... తెలంగాణ వాళ్ళు ఆ క్యాంటిన్ దక్కించు కోవడం లో విఫలమయ్యారు కానీ ... తెలంగాణ ను దక్కించు కోవడం లో విజయం సాధించారు .. **** ఎన్టీఆర్ భవన్ బయట ఖాళీ స్థలం లో కిందకూర్చొని దాదాపు అరడజను మంది ఖద్దరు బట్టలు అమ్మేవారు ....పార్టీ సమావేశం ఉంటే కనీసం డజను మంది ఖద్దరు బట్టలు అమ్మేవారు . ఎవరు అధికారం లోకి వస్తారు ? ఎవరు పోతారు అని ముందుగా పోలీసులు గ్రహిస్తారు అంటారు ... తెలంగాణ ఏర్పడగానే అక్కడ డజను మంది బట్టల వ్యాపారుల స్థానం లో ఇద్దరే కనిపించారు . తరువాత ఒక్కరూ కనిపించ లేదు ... ఏ లెక్కలో తెలియదు కానీ తెలంగాణ ఏర్పడ్డాక కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ లో టీడీపీ విలువ పదివేల కోట్లు ఉంటుంది అన్నారు . నాకు ఆ లెక్కలు తెలియవు కానీ ఈ సెంటర్ లో మ్యారేజ్ హాల్ లేదు ... ఎన్టీఆర్ భవన్ మ్యారేజ్ హాల్ కు సరిగ్గా సరిపోతుంది అన్నాను . ఇప్పటికీ అదే అభిప్రాయం ..... **** కబుర్ల కేం కానీ ఎన్టీఆర్ భవన్ సిటీకి దూరం అనుకున్న కాలం నుంచి టీడీపీ రిపోర్టర్ ను అంటున్నావు మరి ఏమైనా భూములు , ప్లాట్స్ అంటారా ? ఆయనే ఉంటే బార్బర్ తో పనేంటి అని భూములు , ప్లాట్స్ కొని ఉంటే ఈ కథలు కాకరకాయలు రాస్తూ ఎందుకుంటాను ? భూముల లెక్కలు చూసుకుంటూ ఉండే వాడిని కానీ

6, మే 2023, శనివారం

ఈనాడు రిపోర్టర్ వచ్చాడా ? ఓ జ్ఞాపకం

ఈనాడు రిపోర్టర్ వచ్చాడా ? ఓ జ్ఞాపకం రెండు దశాబ్దాల క్రితం వరకు తన వృత్తి జీవితం లో ప్రతి జర్నలిస్ట్ ప్రతి రోజూ విన్న మాట ఇది ... **** ఓ రోజు ఇంటికి రాగానే నా కోసం ఓ వ్యక్తి పరిగెత్తు కొచ్చి చేతిలో ఓ ఐడెంటీ కార్డు పెట్టాడు ... కార్డు చాలా బాగుంది నాణ్యతతో మెరిసి పోతుంది ... అతను చదువుకోలేదు అప్పుడప్పుడు డ్రైవర్ గా పని చేస్తాడు .ఏంటీ అని అడిగితే నేను జర్నలిస్ట్ ను అయ్యాను .. ఆ కార్డు అదే అని చెప్పాడు .. ఎంత ఇమ్మన్నారు ? అని ప్రశ్నించాను .సాధారణంగా ఎవరైనా ఉద్యోగం వచ్చింది అంటే , ఎంత జీతం అని అడుగుతారు ... నేను అలా అడగ లేదు ఎంత ఇమ్మన్నారు అంటే 25 వేలు ఇవ్వమన్నారు అని బదులిచ్చాడు ... ఏదో యూ ట్యూబ్ ఛానల్ మూడో నాలుగో 9 నంబర్ లు ఉన్నాయి ... నీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే వాటికి ఇంకో తొమ్మిది కలిపి నువ్వే యూ ట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు ... ఒక్కడూ పైసా ఇవ్వడు అని వివరంగా చెబితే నిరాశగా వెళ్లి పోయాడు ... అతని బైక్ మీద మాత్రం ప్రెస్ అనే స్టిక్కర్ మెరిసి పోతోంది ...ఆ స్టిక్కర్ వెలుగుల్లో మీడియా భవిష్యత్తు స్పష్టం గా కనిపించింది **** ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా ఐదారుగురు రిపోర్టర్ లు మాత్రమే ఉండేవారు ... తెలుగు దేశం అనే కాదు కాంగ్రెస్ , బీజేపీ , వామపక్షాలు రాజధాని లో నైనా జిల్లాలో నైనా ఈనాడు రిపోర్టర్ వచ్చాడా అని అడిగి రాకపోతే యేవో కబుర్లతో కొంత సమయం గడిపే వారు ... ఆ కబుర్ల అసలు ఉద్దేశం అందరికీ తెలిసినా తెలియనట్టే నటించే వారు ... తెలుగు దేశం లో ఇది కొంత ఎక్కువే ... 95-96 తరువాత మెల్లగా ఈ టివి వచ్చిందా అని చూసే వారు .. 2000 ప్రాంతం లో టివి 9 కోసం ఎదురు చూసే వారు ... ఆ తరువాత ఎలక్ట్రానిక్ మీడియా తుఫాన్ . ఏ పేపర్ , ఏ ఛానల్ గురించి అడిగే పరిస్థితి లేదు . రెండు దశాబ్దాలు గడిచాక యూ ట్యూబ్ సునామీ ... మీడియా కానిది ఎవరో తేల్చు కోవడం కష్టం ... ఓ సారి వికారాబాద్ లో సబితా ఇంద్రారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ లో దాదాపు 50 యూ ట్యూబ్ ఛానల్స్ లోగోలు చూసి బిత్తర పోయారు . గతం లో మీడియా ప్రశ్నలకు నాయకులు బిత్తర పోయే వారు . ఇప్పుడు సంఖ్య చూసి భయపడుతున్నారు . ఇప్పుడు ప్రతి నేత కాదు కాదు ప్రతి మనిషి మీడియానే .... నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ తరువాత ఎన్టీఆర్ తిరిగి సీఎం అయినప్పుడు స్టాఫ్ ముందు రామోజీ రావు ఇక్కడ ప్రభుత్వాలను మార్చబడును అని బోర్డు పెట్టాలి అన్నారట నవ్వుతూ ... ఉండవల్లి పేరు మన పత్రికలో రాకూడదు అని ఆదేశించిన రామోజీ మార్గదర్శి వ్యవహారం లో ఉండవల్లి సంధించిన రెండు చిన్న ప్రశ్నలకు ఈనాడు లో రోజు రెండు పేజీల వివరణ . ఎంతో మంది పై దాడుల వార్తలు ఫొటోలతో ప్రచురించిన రామోజీ రావు పై అలాంటి దాడి జరిగితే ఆయన బెడ్ పై పడుకున్న ఫోటో మీడియా లో వస్తుంది అని కలలో కూడా అనుకోలేదు .కాల మహిమ ... ఆర్థిక సంస్కరణల తరువాత మీడియా వారు కూడా గుర్తించనంత మార్పులు మీడియాలో వేగం గా చోటు చేసుకున్నాయి . లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఎబియన్ ఛానల్ లో లోకేష్ ను మనం తక్కువగా అంచనా వేస్తాం కానీ ఓ ప్రపంచ ప్రముఖ వ్యాపార వేత్త లోకేష్ తెలివికి మురిసి పోయి వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు అని స్టోరీ వేలల్లో చూస్తే సినీ నటుడు నాగబాబు దీనిపై వ్యంగ్యం గా నా ఇష్టం అని ఛానల్ అప్పుడే ప్రారంభించి ప్రసారం చేస్తే లక్షల్లో చూశారు . కాలం అన్నిటికన్నా శక్తి వంతమైంది ఏదీ శాశ్వతం కాదు .... మార్పును తట్టుకొని నిలిచిన జీవులే బతికి ఉంటాయి మిగిలినవి అంతరించి పోతాయి అంటుంది సైన్స్ ... *** ఈ తరం వాళ్ళు చెబితే నమ్మక పోవచ్చు .. ఓ కార్టూనిస్ట్ సంగారెడ్డి కి వస్తే ఇసుక వేస్తే రాలనంత జనం ... ఆడ మగ అతన్ని చూసేందుకు వెంటపడ్డారు ... ఆంధ్రభూమి వీక్లి ఎడిటర్ కనకాంబర రాజు , కార్టూనిస్ట్ మల్లిక్ ఇతర రచయితలు 86-87 లో సంగారెడ్డి వస్తే అప్పటి వాళ్ల క్రేజీ ...ఇప్పుడు కనకాంబర రాజు లేరు . ఆంధ్రభూమి వీక్లి లేదు .యూ ట్యూబ్ లో స్టాండప్ కామెడీ అని మల్లిక్ వీడియో చూస్తే ఆశ్చర్యం వేసింది .. 79 మంది చూశారు ఆ వీడియోను ... ఇంకా పాతవి ఉన్నాయా అని చూస్తే ఏడాది క్రితం వీడియో ను దాదాపు మూడు వేల మంది చూశారు ... జనం ఆయన్ని చూసేందుకు 87 లో ఎగబడ్డారు ఇప్పుడు .... కాల మహిమ ...కాలానికి తగ్గట్టు మార్పు చెంది యండమూరి వీరేంద్రనాథ్ ఒక్కరు నిలిచారు ... సినిమా యాక్టర్ ల అంత క్రేజ్ ఉన్న ఆనాటి భూమి వీక్లి రచయితల్లో యండమూరి మినహా ఎవరూ నిలువ లేదు . మార్పును ఎవరూ ఆపలేరు ...మీడియా ఐనా ఏదైనా మార్పు అనివార్యం .

అటు బిర్యానీ -ఇటు ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ఓ జర్నలిస్ట్ కు మూడు కోట్ల రూపాయల పాఠం

అటు బిర్యానీ -ఇటు ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ఓ జర్నలిస్ట్ కు మూడు కోట్ల రూపాయల పాఠం ఓ జ్ఞాపకం .... రాక్సీ లో నార్మా షేరర్ బ్రాడ్వే లో కాంచన మాల ఉడిపి శ్రీకృష్ణ విలాస్ లో - అటు చూస్తే బాదం హల్వా ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ ... రెండింటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలో శ్రీ శ్రీ కే కాదు ఎవరికైనా కష్టమే .. జర్నలిస్ట్ కే కాదు ప్రతి మనిషి జీవితం లో ఇలా రెండింటిలో ఒకటి నిర్ణయించు కోవలసి ఉంటుంది ... 95లో ఎన్టీఆర్ ను దించేశాక కొన్ని రోజులకు ఎన్టీఆర్ మీడియాకు ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు .. ఈనాడు , జ్యోతిని ఎన్టీఆర్ , ఆయన పార్టీ ఇంటి మీడియాగా భావించే వారు .. ఇంటి పత్రికల జర్నలిస్ట్ లను ఇంటి మనుషులుగా చూసే వారు . మిగిలిన వారిని అసలు పట్టించుకునే వారు కాదు . ఇంటి మీడియానే అల్లుడితో కలిసి వెన్నుపోటు పొడవడం తో విలవిల లాడిన ఎన్టీఆర్ ఇతర మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వసాగారు. ఆంధ్రభూమి తరపున ఎన్టీఆర్ ను ఇంటర్వ్యూ చేసేందుకు నేను , మరో రిపోర్టర్ కేఎన్ చారి వెళ్లాం . ఇంటి ముందు నిరీక్షణ ఇంకా మా వంతు రాలేదు . ఈలోపు చారికి మరో జర్నలిస్ట్ నుంచి ఫోన్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఇస్తారో తెలియదు ... ఈ లోపు బిర్యానీ తినివద్దాం అని పిలుపు ... అదే విషయం చారి చెబితే నేను రాను ఈ లోపు వాళ్ళు పిలిస్తే అన్నాను ... బిర్యానీ , ఎన్టీఆర్ ఇంటర్వ్యూ లో నేను ఇంటర్వ్యూ కే ఓటు వేసి నీ ఇష్టం ఉంటే నువ్వు వెళ్ళు అన్నాను .చారి వెళ్ళాడు ... కొద్ది సేపటి తరువాత ఎన్టీఆర్ నుంచి పిలుపు నేను వెళ్లి ఇంటర్వ్యూ చేశాను ... అల్లుడు చేసిన ద్రోహం తన భవిష్యత్తు కార్యాచరణ గురించి ఎన్టీఆర్ చెప్పుకుంటూ వచ్చారు ... కనిపిస్తే చాలు పాదాల పై పడి పోయే తమ్ముళ్లే వెన్ను పోటు పొడవడం తట్టుకోలేక పోయారు ... నీరసించి పోయారు . మునుపటి రాజసం లేదు . చారి తో పాటు అప్పుడు బిర్యానీ కోసం వెళితే జీవితం లో మళ్ళీ ఎన్టీఆర్ ఇంటర్వ్యూ దొరికేది కాదు ...ఎందుకంటే ఆ తరువాత కొన్ని రోజులకే ఎన్టీఆర్ మరణించారు .ఒక జర్నలిస్ట్ కు తమ కాలం నాటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేయాలి అని ఉంటుంది . **** నామాల విశ్వేశ్వర్ రావు అని జర్నలిస్ట్ మిత్రులు ఆంధ్ర ప్రభ లో ఉండే వారు ... పర్మనెంట్ ఉద్యోగి... జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వ ఫారం , డీడీ తీసి జర్నలిస్ట్ నాయకుడికి ఇచ్చారు . ఆ నాయకుడు నాలుగిళ్ళ పూజారి . అన్ని యూనియన్లు అతని చేతిలోనే ... కొంత కాలానికి సభ్యులకు ప్లాట్ కు డబ్బు కట్టమని నోటీసులు . తాను పర్మనెంట్ ఉద్యోగి , సీనియర్ ను తనకన్నా జూనియర్లు పైగా పర్మనెంట్ కాదు వారికి నోటీసు నాకు రాలేదు అని సొసైటీ ఆఫీస్ కు వెళితే.... నువ్వసలు సభ్యత్వ దరఖాస్తు చేయలేదు పో అన్నారు ... అక్కడ దుమ్ము దూళి తీసి చెత్తా చెదారాన్ని వెతికితే ఓ చోట అతని దరఖాస్తు , డీడీ పడి ఉంది ... అప్పటి కే పుణ్యకాలం తీరిపోయింది ...నాలుగిళ్ళ పూజారి అయిన నాయకుడికి ఎన్నో పనులు ఉండవచ్చు . నీ దరఖాస్తు పై నీకు శ్రద్ద లేనప్పుడు అతనికి ఉండాలి అని ఏముంది ? నాయకుడికి ఇవ్వకుండా తన దరఖాస్తు తానే ఆఫీస్ లో ఇచ్చి ఉంటే ఇప్పుడు ఓ ప్లాట్ కు ఓనర్ అయి ఉండేవాడు . గోపనపల్లి లోని జర్నలిస్ట్ కాలనీలో ఆ ప్లాట్ విలువ ఇప్పుడు మూడు కోట్ల రూపాయలు .. ఆ రోజు అతనికి ఎంత ముఖ్యమైన పని ఉన్నా మూడు కోట్ల రూపాయలకు మించిన పని ఐతే కాదు .. జర్నలిస్ట్ అనే కాదు ఎప్పుడు ఏది ముఖ్యమో ఆ పని చేయాలి లేదంటే ...చదువుకొనే వయసులో సినిమా హాలులో హీరో కటౌట్ ను పాలతో కడగడం లో బిజీ గా ఉంటే చదువు తరువాత సినిమా హాల్స్ కడిగే పనే దక్కుతుంది . బిర్యానీ కోరుకునే వారికి బిర్యానీ దక్కుతుంది ఎన్టీఆర్ ఇంటర్వ్యూ కోరుకున్న వారికి ఇంటర్వ్యూ దొరుకుతుంది. ఏం కోరుకుంటున్నారో అది సాధించేందుకు ప్రయత్నించాలి .

4, మే 2023, గురువారం

వ్యతిరేకంగా రాయండి ప్లీజ్ ....బాలసాయిబాబా 10

వ్యతిరేకంగా రాయండి ప్లీజ్ ....బాలసాయిబాబా ఓ జ్ఞాపకం 10 .... మ్యూజియం లో ఓ పుర్రెను చూసి విద్యార్థులు ఆసక్తిగా అడిగితే గైడ్ అది హిట్లర్ పుర్రె అని చెబుతాడు ... మరో చిన్న పుర్రె కనిపిస్తే అది హిట్లర్ చిన్నప్పటి పుర్రె అంటాడు ... ఇది చిన్నప్పుడు చదివిన జోక్ ... ఈ జోక్ ప్రాణం పోసుకొని కళ్ళ ముందు కనిపిస్తే ? 87లో ఆంధ్రభూమి రిపోర్టర్ గా సంగారెడ్డి లో ... అప్పుడే అయూబ్ ఖాన్ అనే మిత్రుడిని కర్నూల్ రిపోర్టర్ గా నియామకం ... ఓ రోజు కర్నూల్ వెళితే నేను వెళ్లిన సమయానికి ఆంధ్రభూమి ఆఫీస్ లో అయూబ్ ఖాన్ ఓ క్యాసెట్ వింటున్నాడు . వినడం పూర్తయ్యాక క్యాసెట్ లో మార్పులు చేర్పులు సూచించాడు ... అప్పుడే భక్తులను కరుణించేందుకు అవతరించిన బాలసాయి బాబా ఉపన్యాస తొలి క్యాసెట్ అది ... ఒక వైపు సాయిబాబా అవతారం అని పుట్టపర్తి సాయిబాబా ఉండగా , అదే టైం లో బాలసాయి బాబా ఏంటి అన్నాను .. పైగా ఇతను ఇంటిల్లి పాది ఉర్దూ మాట్లాడే ముస్లిం ...బాలసాయి ఉపన్యాసాన్ని ఇతనికి పంపి సలహాలు అడుగుతున్నాడు ... కొత్తగా మొదలు పెట్టాడు... నాకు అనుకూలం గా రాయమని అడగడం లేదు .. వ్యతిరేకం గానే రాయండి అని అడుగుతున్నాడు ... అని చెప్పాడు .. అనుకూలంగానే కాదు బాబాలు , తమకేవో శక్తులు ఉన్నాయి అని ప్రచారం చేసుకొని సంపాదించే వారు .. వ్యతిరేక ప్రచారం ద్వారా కూడా సంపాదిస్తారనే మొదటి సారి అర్ధమైంది ... 92-93 లో నల్లగొండ రిపోర్టర్ గా మీడియా టూర్ లో మార్గ మధ్యలో బాలసాయి ఆశ్రమానికి వెళ్ళాం ... అప్పుడప్పుడే కార్యకలాపాలు పెరుగుతున్నాయి ... మేనేజర్ పేరు రామారావు అని గుర్తు పుట్టపర్తి సాయిబాబా అంత ఉదృతంగా మీ ఆశ్రమం పెరగడం లేదేమిటి అంటే పుట్టపర్తి ఒకే సారి పెరగలేదు సమయం పడుతుంది ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాం అన్నాడు . నేను ఒక వ్యాపారం గురించి అడిగినట్టే అడిగాను అతను ఓ వ్యాపారం లానే చెప్పాడు .. 95 లో తిరిగి తిరిగి హైదరాబాద్ వచ్చాను ... కొద్ది రోజులకు బాలసాయి తన సామ్రాజ్యాన్ని హైదరాబాద్ కు కూడా విస్తరించాడు ... కర్నూల్ లో కొందరు జర్నలిస్ట్ లకు బాల సాయి అన్ని రకాలుగా సహాయం చేశారు ...ఒకరిద్దరు సొంత చిన్న పత్రిక పెట్టుకొంటే సహాయం చేశారు. ఈ విషయం తెలిసి పత్రిక పెడుతున్నాం అని ప్రకటనల రూపం లో సహాయం కోసం ఒకరు వెళ్లారు ... ముదిగొండ శివ ప్రసాద్ లాంటి చారిత్రక నవలా రచయిత బాలసాయి భక్తి గీతాల ఆలాపనలో అక్కడ ఉండడం చూసిన వారికి వింతగా అనిపించింది ... చిన్నప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్ లో నన్నయ్య , తిక్కనలతో పాటు ఉప వాచకం లో ముదిగొండ శివ ప్రసాద్ నవల చదివిన జీవితం కాబట్టి అక్కడ ఆయన బాలసాయి కీర్తనలు ఆలాపనలో ఉండడం వింతగా అనిపించింది ... సహాయం కోసం వెళ్లిన వ్యక్తికి వెంటనే ప్రత్యేక దర్శనం లభించింది .. ఓ వెండి ఉంగరం కూడా లభించింది ... నేనేదో సుఖ పడిపోతున్నాను ... నేను సాయంత్రం రెడీ అయి దర్శనం ఇస్తే...వీళ్లంతా పాటలు పాడుతూ నన్ను కీర్తిస్తుంటే నా అంత అదృష్టం లేదు అనుకుంటారు . కానీ నా అంత దురదృష్ట వంతుడు లేడు ... ఒక గ్రూప్ చేతిలో నేను బందీని వాళ్ళు చెప్పినట్టు నడుచు కోవాలి అని బాలసాయి తన గోడు వెళ్ళ బోసుకున్నాడు ... ఆ సమయం లో ఏమి మాట్లాడకుండా మరో సారి వెళితే బాలసాయి చుట్టూ ఉన్న బృందం అడ్డుకున్నారు . ప్రత్యేక దర్శనాలు మళ్ళీ మళ్ళీ ఉండవు అని బాలసాయి వద్దకు వెళ్లనివ్వలేదు ...మిత్రులుబాలసాయి సహాయం తో పత్రిక పెట్టాలి అనే ఆలోచన కార్య రూపం దాల్చలేదు కానీ ఇలాంటి స్వామిజీ ల జీవితం ఎంత నరకప్రాయం వాళ్ళను ఎలా బంధీలుగా చేస్తారు అనేది అర్థమైంది ... చాట్ జిపిటి తో ఐటి తో సహా ఏ ఉద్యోగానికి భరోసా లేదు అంటున్నారు .... నిజమే ఏ ఉద్యోగానికైనా ప్రమాదం ఉండవచ్చు ... కానీ జ్యోతిష్యం , మంత్రాలూ , మహిమలు , తాయెత్తులు , పవిత్ర ఆయిల్ ,వాస్తు వ్యాపారాన్ని ఏమీ చేయలేరు .. మనిషి ఉన్నంత వరకు ఈ వ్యాపారాలు ఉంటాయి . అందుకే నెమో ఐటి నిపుణుడు అంటూ ఛానల్స్ లో తెగ హడావుడి చేసిన ఒకాయన మీ పేరు చెబితే మంత్రం వేసి మీ తలనొప్పి పోగొడుతాను అని వ్యాపారం మొదలు పెట్టారు . వ్యతిరేక ప్రచారం కూడా వీరి వ్యాపారాభి వృద్ధికి శ్రీ రామ రక్ష .....

జనం నాడి తెలిసిన జర్నలిస్ట్ - టివి 9 యజమానుల నాడి నే జనం నాడి

జనం నాడి తెలిసిన జర్నలిస్ట్ - టివి 9 యజమానుల నాడి నే జనం నాడి ఓ జ్ఞాపకం 8 సోడాబుడ్డి కళ్లద్దాలు , పెరిగిన గడ్డం , లాల్చీ పైజామా ... ఇదీ పాత తెలుగు సినిమాల్లో జర్నలిస్ట్ అనగానే కనిపించే రూపం .. జనం మనసు పై ఈ ముద్ర బలంగా పడిపోయింది. ఓ సారి విశ్వనాద్ ఆనంద్ ను ఒకరు ఏం చేస్తావ్ అని అడిగితే చెస్ ప్లేయర్ ను అని చెబితే ... చేస్ ఆడుతావు సరే బతకడానికి ఏం చేస్తావు అని అడిగారట .. సినిమాల్లోని ఈ జర్నలిస్ట్ రూపం పుణ్యమా అని జర్నలిస్ట్ ను అని చెబితే ,అది సరే బతకడానికి ఏం చేస్తావ్ అని అడిగే వారు ఓ కాలం లో .. పవర్ ప్రాజెక్ట్ లు, సొంత వ్యవహారాలు నడిపే వారు ఉన్నా చాలా కాలం పాటు సరే బతకడానికి ఏం చేస్తావ్ అని వినిపించేది . ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక పాత సినిమాల్లోని లాల్చీ పైజామా, పెరిగిన గడ్డం రూపం చెరిగి పోయింది .. అందమైన అమ్మాయిలు , సూటు బూటు రిపోర్టర్ లు ఆ స్థానం ఆక్రమించుకున్నారు .. బుర్రకు ప్రాధాన్యత తగ్గి రూపానికి , గడగడ మాట్లాడడానికి ప్రాధాన్యత పెరిగింది .. సినిమా యాక్టర్ లలా జర్నలిస్ట్ లకు ప్రచారం లభించింది . ఇలా ప్రచారం కల్పించడం లో టివి 9 ముందుంది .. అప్పటి వరకు కొమ్ములు తిరిగిన ప్రింట్ మీడియా జర్నలిస్ట్ లు కూడా వెనక్కి వెళ్లగా టివి జర్నలిస్ట్ లు ముందుకు వచ్చారు . రజనీ కాంత్ ను బిగ్ డిబేట్ లో టివి 9 హైలెట్ చేయడం బాగుంది ... ఐతే ..... జనం నాడి తెలిసిన జర్నలిస్ట్ అంటూ రజనీ కాంత్ ను ప్రోమోలో ఆకాశానికి ఎత్తిన ప్రచారం తో కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి . నిజంగా జనం నాడి తెలిసిన జర్నలిస్ట్ నా ? అంటే ఏమో .... 2004-5 లో రజనీ కాంత్ టివి 9 లో తొలి వార్త ... కాంగ్రెస్ తెరాస పొత్తు తో పోటీ .కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది .మంత్రి వర్గం లో తెరాస చేరింది . తరువాత మంత్రులంతా రాజీనామా చేశారు . అప్పుడు విదేశాల్లో ఉన్న సంతోష్ రెడ్డి రాజీనామా చేయలేదు .. తెరాస ఆవిర్భావం తరువాత తొలి బెనిఫిషరీ అతనే .... విదేశాల నుంచి వచ్చాక కూడా రాజీనామాకు వెనకడుగు . Ysr సన్నిహితం ... ఎట్టకేలకు రాజీనామాకు సిద్దపడి తెరాస కార్యాలయం వద్ద మీడియా తో నేను మంత్రి పదవికి రాజీనామా చేశాను . నాదే నిజమైన తెరాస . తెలంగాణ ఉద్యమాన్ని నేనే నడిపిస్తాను అని ప్రకటించారు ... వయసు వల్ల ఆయన వాయిస్ ఇంత స్పష్టంగా లేదు కానీ దాని అర్థం ఇదే .. టివి 9 జర్నలిస్ట్ గా రజనీకాంత్ తొలి కవరేజ్ ఇదే . *** జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికలు . మాలతి అని టివి 9 టీడీపీ రిపోర్టర్ ... రజనీ కాంత్ ను నన్ను ఒకరికొకరిని పరిచయం చేశారు . రజనీ కాంత్ తో నా మొదటి మాట మీరు పలానా కదా ? ( ప్రాంతం , సామాజిక వర్గం , పార్టీ ఏదైనా ఉహించు కోవచ్చు ) అని అడిగాను . అతను నవ్వి నా యాసను బట్టి తెలుసు కున్నారా ? అని అడిగాడు .. మా సొంత జిల్లా సొంత గ్రామం వారి యాసను కూడా నేను గుర్తించ లేను .. కానీ మీ మొదటి వార్త వినగానే గ్రహించాను అన్నాను . సాధారణం గా జర్నలిస్ట్ తాను నిష్పక్ష పాతం అని నటించడానికి ప్రయత్నిస్తారు కానీ తెలిసి పోతుంది .. మీరు సంతోష్ రెడ్డి వార్త కవర్ చేస్తూ ఇక తెలంగాణ ఉద్యమం కెసిఆర్ నాయకత్వం లో నడుస్తుందా ? సంతోష్ రెడ్డి నాయకత్వం లో నడుస్తుందా వేచి చూద్దాం అని ముగించారు . తెలంగాణ ను కోరుకునే హక్కు తెలంగాణ వారికి ఉన్నట్టే వద్దు అనే హక్కు ఇతర ప్రాంతాల వారికి ఉంటుంది . అందులో తప్పులేదు కానీ తెలంగాణ ఉద్యమం కెసిఆర్ నాయకత్వం లోనా ? సంతోష్ రెడ్డి నాయకత్వం లోనా అనడం లోనే మతలబు ఉంది . అన్నాను . రాజీనామా తో అప్పటి నుంచి సంతోష్ రెడ్డి రాజకీయ జీవితం ముగిసింది . తానే తెలంగాణ ఉద్యమం నడుపుతాను అని ప్రకటించి 19 ఏళ్ళు అవుతున్నా ఆయన ఉనికి ఎక్కడా కనిపించలేదు . వినిపించలేదు . వయసు అనారోగ్యం వల్ల ఇంటికే పరిమితం అయ్యారు . *** 2009 ఎన్నికల సమయం లో ఐ వెంకట్రావు మహా టివి. పెడితే రజనీ కాంత్ అందులో చేరారు . బాబును ఎలాగైనా అధికారం లోకి తీసుకు రావాలి అని ఛానల్ ద్వారా విశ్వ ప్రయత్నాలు .. ఒకరోజు వెంకట్రావు , రజనీకాంత్ ఇద్దరు ఛానల్ లో కూర్చొని ఫలితాలు తేల్చేశారు .ఏ నియోజక వర్గం లో ఏ కులం వారి ఓట్లు ఎన్ని ఉన్నాయి ? ఏ కులం వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేస్తారో స్టూడియో లోనే వీళ్లిద్దరు తేల్చేసి బాబుకు 180 కి పైగా సీట్లు ఇచ్చి అధికారం లోకి తెచ్చారు . ఐతే ఈ లెక్కలు జనం మాట దేవుడెరుగు ఆ ఛానల్ ఉద్యోగులు కూడా నమ్మలేదు ... దాంతో మళ్ళీ ysr గెలిచారు . *** ఇంతకూ రజనీ కాంత్ కు జనం నాడి తెలుసంటావా లేదా ? మార్చురీలో శవాలు తప్ప ఎవరూ తటస్తంగా ఉండరు . నాడి ? జనం నాడి కాదు జర్నలిస్ట్ లకు తెలిసేది , తెలవాల్సింది యాజమాన్యాల నాడి .... యజమానులు తమ నాడి నే జనం నాడి అనుకుంటారు ... అనుకోవాలి అంటారు .. ఉద్యోగాల్లో ఉండాలో లేదో తేల్చేది యజమానుల నాడి నే కానీ జనం నాడి కాదు ... ఇప్పుడు జనం నాడి ని నిర్ధేశించేంత బలం మీడియాకు లేదు ...

2, మే 2023, మంగళవారం

లెక్కల తాబేలు - అంకెల మాంత్రికుడు

లెక్కల తాబేలు - అంకెల మాంత్రికుడు ఓ జ్ఞాపకం 7 నాలుక పైనే అంకెలు , రాజకీయ చరిత్ర కలిగిన నాయకుల్లో గొనె ప్రకాష్ వంటి వారు ఇంకొకరు లేరు . పతంజలి గారు లెక్కల తాబేలు అని ఓ అద్భుతమైన కథ రాశారు . కథ సంక్షిప్తంగా . తాబేళ్ల రాజ్యం లో ఓ తాబేలు సరదాగా లెక్కలు నేర్చుకుంది. 27వ ఎక్కం ముందు నుంచి వెనక నుంచి ముందుకు ఎలా అంటే అలా చెప్పగలదు . ఏ విషయం ఐనా లెక్కలతో చెప్పేస్తుంది . నృత్యం , భవన నిర్మాణం ఏదైనా కావచ్చు లెక్కలతో అద్భుతంగ చెబుతుంది ...లెక్కల్లో ఆ తాబేలును ఓడించే వారు లేరు . లెక్కల తాబేలు లెక్కల ప్రతిభ తాబేళ్ల రాజ్యం రాజుకు తెలుస్తుంది . రాజసభకు పిలిపించి ప్రతిభను పరీక్షించి ముగ్ధుడై రాజు తన కొలువులో ఉండమంటాడు ... ఏ విషయం ఐనా లెక్కల తాబేలు చెప్పే లెక్కలకు తిరుగు ఉండదు . లెక్కల తాబేలుతో చర్చించి రాజు నిర్ణయాలు తీసుకునే వారు . ఓ సారి లెక్కల తాబేలు రాజుతో రాజా మన దేశం లో తాబేళ్ల సంఖ్య పెరుగుతుంది . దేశం సరిపోదు పొరుగున ఉన్న కోతుల దేశం పై దండ యాత్ర చేసి ఆక్రమించు కుందాం అని లెక్కలు చెబుతారు .. తాబేళ్ల డిప్ప ఎంత బలంగా ఉంటుంది .కోతులు ఎంత శక్తితో ఎంత సమయం లో ఎన్ని సార్లు కొట్టగలవు . వాటిని తాబేళ్లు ఎలా తట్టుకోగలవు అని లెక్కలు చెబుతాడు ... రాజు ఆ లెక్కలకు సంతృప్తి చెంది పొరుగు దేశం పై దాడికి వెళ్తాడు తన తాబేళ్ల సైన్యం తో ..... *** 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తెరాస పొత్తుతో పోటీ . కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది . మాతో పొత్తు వల్లే కెసిఆర్ గెలిచాడు అని ysr , ఇతర కాంగ్రెస్ నేతల విమర్శలు .. మాతో పొత్తు వల్లే మీకు అధికారం వచ్చింది అని తెరాస విమర్శ . దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి అని కెసిఆర్ కు కాంగ్రెస్ సవాల్ .. సరే అని కెసిఆర్ రాజీనామా.... కరీంనగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ... *** ఓ రోజు ఆంధ్రభూమి లో ఉండగా ఎడిటర్ శాస్త్రి పిలిచి కరీం నగర్ ఫలితం ఎలా ఉంటుంది అని అడిగితే ... కెసిఆర్ గెలుస్తాడు అంటే తెలంగాణ వాదిగా కాదు మాములుగా చెప్పు అని అడిగాడు .. చాలా మందికి కోరిక , అంచనా ఈ రెండింటికి తేడా తెలియదు . నా కోరిక , అంచనా రెండూ ఒకటే ... అని బలంగా చెబితే .... లేదు ఓడిపోతున్నాడూ ఇదిగో లెక్కలు చూడు అని కొన్ని పేపర్లు ఇచ్చాడు . కరీం నగర్ చరిత్ర , గ్రామాలు , కులాలు , మతాలు , గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు గెలుపు ఓటముల వివరాలు .... దీని ప్రకారం తెరాస గెలువదు అని తేల్చారు .ఆలెక్కలు పాత చరిత్ర అన్నీ నిజాలే ... ఈ వివరాలు ఎలక్షన్ కమిషన్ వద్ద కూడా లేక పోవచ్చు .. ఈ లెక్కలు మీకు ఇచ్చిన రిపోర్టర్ ఎవరో కానీ వాటిని తయారు చేసింది మాత్రం గొనె ప్రకాష్ ... మరెవరూ ఇలా తయారు చేయలేరు అని చెప్పాను ... ఈ లెక్కలు వేరు , ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల పోరు వేరు అన్నాను ... నువ్వెంత చెప్పునా నా కెందుకో తెరాస ఓడి పోతుంది అనిపిస్తోంది అని ఎడిటర్ లెక్కల పేపర్ ను ఆసక్తిగా చూస్తూ అన్నారు . పైగా ysr సర్వశక్తులను కరీం నగర్ లో మోహరించాడు అన్నారు . సార్ మీరు ఎడిటర్ నేను రిపోర్టర్ మీరు తలుచుకుంటే ఇప్పుడు నన్ను బదిలీ చేయవచ్చు , ఏమైనా చేయవచ్చు . నేను మీకు భయపడాలి ... అలాంటిది నేనే ఇలా ధైర్యం గా మీ అభిప్రాయానికి వ్యతిరేకం గా చెబుతుంటే .... కరీం నగర్ ఓటరు ఎవడికి భయపడతాడు ... ధైర్యంగా తెలంగాణకు ఓటు వేస్తాడు అని చెప్పాను .... **** లెక్కల తాబేలు లెక్కలకు ముచ్చట పడి రాజు చేరదీసినట్టే .... తెలంగాణ రానే రాదు ... ఢిల్లీ వెళ్లి వచ్చిన కెసిఆర్ ముఖ కవళికలు చూస్తే చెప్పేయ వచ్చు అంటూ గొనె చెప్పే అద్భుత మైన లెక్కలు గొనెను ysr కు సన్నిహితం చేశాయి . RTC ఛైర్మెన్ అయ్యారు ... లెక్కలతో చెలరేగి పోతున్నారు . కరీం నగర్ ఫలితం ఎలా రాబోతుందో గొనె చెప్పిన లెక్కలు వారందరికీ నచ్చాయి .. కరీంనగర్ లో అంతకు ముందు ఎక్కడా పెట్టనంత ఖర్చు ... కాంగ్రెస్ తరఫున అన్ని కుల సంఘాలు మత సంఘాలు , చివరకు అసదుద్దీన్ ఒవైసి ని సైతం ysr రంగం లోకి దించారు . కరీంనగర్ లో తెరాస ఓడి పోతే తెలంగాణ వాదం అయిపోయినట్టే అని తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించే వారు అనుకున్నారు . తెలంగాణ ఏర్పాటును కోరుకున్న వారు కూడా ఇదే అనుకున్నారు .. **** తాబేళ్ల రాజ్యం రాజు కోతుల రాజ్యం పై దండయాత్రకు వెళ్లారు కదా ? ఏమైంది అంటారా ? తాబేళ్లు దాడి చేయగానే కోతులు ప్రతిఘటించాయి .కోతులు తాబేళ్ల డిప్ప మీద కొడుతున్నా వాటికి ఏమీ కాలేదు ... అచ్చం లెక్కల తాబేలు చెప్పినట్టే జరుగుతోంది ..... ఓ సీనియర్ కోతి ముందుకు వచ్చి పిల్ల కోతుల్లారా తాబేలు తో పోరాడాల్సిన తీరు అది కాదు అని చెవిలో ఏదో చెప్పింది ... కోతులన్నీ సమరోత్సాహం తో తాబేళ్లను పట్టుకొని .... తలక్రిందులు చేసి కొట్టి చంపాయి ... డిప్ప మీద కొడితే ఏమవుతుందో లెక్కల తాబేలు చెప్పింది కానీ తల కిందులు చేసి కొట్టి చంపుతారని ఊహించ లేదు ... **** కాంగ్రెస్ తెరాస పొత్తు తో పోటీ చేస్తే 50 వేల తో గెలిస్తే , తెరాస సొంతం గా పోటీ చేస్తే రెండున్నర లక్షల మెజారిటీ తో విజయం సాధించారు . గొనె చెప్పిన లెక్కలకు ముగ్దులై చాలా మంది కరీంనగర్ పై పందెం కాసి పెద్ద మొత్తం లో నష్టపోయారు ... Clp వద్ద ఆ రోజు వినిపించిన మాటల్లో ఓ మార్వాడీ అతనే 50 లక్షలు నష్టపోయారు ... తెలంగాణ రాదు అని గొనె చెప్పిన లెక్కలు . కరీంనగర్ లో తెరాస గెలువదు అని చెప్పిన లెక్కలు , తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లు అవుతున్నా ,కరీంనగర్ గెలిచి 18 ఏళ్ళు అవుతున్నా , గొనె చెప్పిన ఈ లెక్కలు ఇప్పుడు విన్నా కన్విన్సింగ్ గా ఉంటాయి . గొనె చెప్పే లెక్కలు , చరిత్ర లో ఒక్క అబద్దం ఉండదు . ఈ లెక్కలు , చరిత్ర ఆధారంగా భవిష్యత్తు లో ఏం జరగబోతుందో అతను చెప్పింది ఏదీ నిజం కాదు . - బుద్దా మురళి