28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

తెలంగాణ ఏర్పాటు రాజ్యాంగ బద్దమా ?విరుద్ధమా ? సుప్రీంకోర్టు లో తేలాలి

రాష్టవ్రిభజన రాజ్యాంగ విరుద్ధం అంటూ ఇంత కాలం వాదిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొంది, తాను అపద్ధర్మ ముఖ్యమంత్రిగా మారిన తరువాత కూడా ఇదే మాట అంటున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. ఇది ఆహ్వానించదగిన ప్రకటన. సీమాంధ్రులే కాదు తెలంగాణ ప్రజలు, తెలంగాణ పార్టీలు, తెలంగాణ కోసం ఉద్యమించిన వారు సైతం ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతించాలి. విభజన రాజ్యాంగ బద్ధంగా జరిగిందా? లేదా? పార్లమెంటుకు ఒక రాష్ట్రాన్ని విభజించే హక్కు ఉందా? లేదా? ఇప్పుడు సుప్రీంకోర్టు తేలుస్తుంది. ఇప్పటికే కొంత మంది పిటీషన్లు వేశారు. ముఖ్యమంత్రి పిటీషన్ వేసినా వేయకపోయినా కనీసం తెలంగాణ న్యాయవాదులు, తెలంగాణ వాదులైనా ఈ అంశంపై పిటీషన్ వేయాలి. రాజ్యాంగ విరుద్ధంగా, అప్రజాస్వామికంగా రాష్ట్ర విభజన చేశారు అని వాదిస్తున్న వారి ప్రశ్నలకు సుప్రీంకోర్టు నుంచే సమాధానం వస్తే బాగుంటుంది.


పార్లమెంటులో విభజన అంశంపై అర్ధవంతమైన చర్చ జరిగితే బాగుండేది కానీ అల్లరి, గొడవ తప్ప అక్కడ చర్చకు అవకాశమే లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితిలో ఈ కేసుల వల్ల సుప్రీంకోర్టులో నైనా వాదనల ద్వారా, తీర్పు ద్వారా ఏది రాజ్యాంగ బద్ధమో! ఏది కాదో తేలుతుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభించిన వెంటనే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాష్ట్ర హైకోర్టులో,సుప్రీంకోర్టులో అనేక పిటీషన్లు దాఖలు అయ్యాయి. పదే పదే ఇదే అంశంపై కోర్టును ఆశ్రయించి కోర్టు సమయం వృధా చేస్తున్నారంటూ విభజనకు సంబంధించిన ఒక కేసులో పిటీషనర్‌కు హైకోర్టు 50వేల రూపాయల జరిమానా కూడా విధించింది. చట్టసభలు చట్టాలను చేస్తాయి. చట్టసభలు చేసిన చట్టాలు రాజ్యాంగ బద్ధంగా లేవు అనుకుంటే కోర్టులను ఆశ్రయించవచ్చు. కోర్టులు ఈ చట్టాలను సమీక్షించి అవి రాజ్యాంగ బద్ధంగా ఉన్నాయో లేలో, చెల్లుబాటు అవుతాయో కావో తేల్చి చెబుతుంది.
సిడబ్ల్యుసి తెలంగాణపై నిర్ణయం తీసుకోగానే రాష్ట్ర విభజన జరపవద్దు అని కోరుకోవడం తప్పు కాదు, విభజన జరగాలని డిమాండ్ చేయడం తప్పు కాదు. ఎవరిష్టం వారిది, ఎవరి వాదన వారిది. కానీ కేంద్రానికి విభజన జరిపే అధికారం లేదని, అప్రజాస్వామికంగా విభజన జరిపారని, అడుగడుగునా రాజ్యాంగ వ్యతిరేకతంగా వ్యవహరించారని విమర్శలు చేశారు. సాధారణ వ్యక్తులు కాదు తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా, మరో తొమ్మిదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా పని చేసిన వారు చేసిన విమర్శలివి. విభజన వల్ల బాబు రాజకీయ జీవితానికి నష్టం అది వాస్తవం. దాని కోసం ఆయన విభజనను వ్యతిరేకించవచ్చు, రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ విభజన జరుపుతోందనే విమర్శ చేయవచ్చు కానీ విభజన రాజ్యాంగ విరుద్ధం అనడం విచిత్రం. పార్లమెంటులో విభజన బిల్లుపెట్టిన సందర్భంలో సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ దశలో మేం జోక్యం చేసుకోము అని కోర్టు చెప్పిన దాని అర్ధం విభజన బిల్లు ఆమోదం పొంది అమలయ్యేంత వరకు కోర్టు జోక్యం చేసుకోదు. అమలు అయ్యాక చట్ట వ్యతిరేకంగా ఎక్కడైనా జరిగిందా అనేది తేలుస్తుంది. దాదాపు అన్ని పార్టీల సీమాంధ్ర నాయకులు సుప్రీంకోర్టులో పిటీషన్లు వేశారు. వాటన్నింటిని కోర్టు కొట్టివేసినా తాజాగా మళ్లీ వేశారు. టిడిపి ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్ వేసిన పిటీషన్‌ను చంద్రబాబు సమర్ధించారు కూడా. విభజన ప్రక్రియ జరిగేప్పుడు సుప్రీం కోర్టులో కేసు పేరుతో హడావుడి చేసిన పయ్యావుల ఇప్పుడు కేసు ప్రస్తావన ఎత్తడం లేదు . 


రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రాన్ని సాధించుకున్నారు అనే విమర్శ అలానే ఉంటే తెలంగాణకు అదో మచ్చలా నిలుస్తుంది. ఈ విమర్శలో నిజా నిజాలను నిగ్గు తేల్చాల్సింది సుప్రీంకోర్టే. రాజ్యాంగ విరుద్ధంగా విభజన జరిగింది అని ఆరోపణలు చేసిన నాయకులను ప్రతివాదులుగా చేరుస్తూ తెలంగాణ వాదులు కోర్టును ఆశ్రయించాలి. రాజ్యాంగ విరుద్ధంగా ఎలా జరిగిందో ఆ నాయకులు నిరూపించాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పాటుపై పడిన మచ్చ తొలగిపోవాలంటే సుప్రీంకోర్టులో వాదన జరగాల్సిందే.. 

26, ఫిబ్రవరి 2014, బుధవారం

చారిత్రాత్మక అపనమ్మకం

ఛీ... ఛీ... దరిద్రం... నాశనమై పోతారు. వాళ్లకు పుట్టగతులుండవు’’
‘‘ఏమైందేంటి శాంతిశ్రీలా ఉండేవాడివి ఉగ్రశ్రీ వయ్యావు. ఎవరిని తిడుతున్నావు? ఎందుకు తిడుతున్నావు??’’
‘‘తిట్టాలా నరికి పోగులు పెట్టాలా? రక్తం మరిగిపోతున్నది’’
‘‘నీ బాధ అర్ధమైంది.. రాష్ట్ర విభజనపైనే కదా నీ కోపం.. అలా కోపం రావడం సహజమేలే నేను అర్ధం చేసుకుంటాను’’
‘‘రాష్ట్ర విభజన ఎప్పుడో ఒకప్పుడు జరగాల్సిందే.. ఆ విషయం నాకూ తెలుసు. కొత్త రాజధాని వచ్చే చోట మా వాళ్లు పొలాలు కూడా కొన్నారు. నా కోపం దాని కోసం కాదు’’


‘‘ విషయం చెప్పకుండా తిట్ల దండకం వినిపిస్తున్నారంటే విభజనపైనే అనుకున్నాను ’’
‘‘డబ్బు ఈ రోజు ఉంటుంది. రేపు పోతుంది. కుక్కను కొడితే డబ్బు రాలుతుంది. . అది కాదు ముఖ్యం. నమ్మకం ముఖ్యం. ఆ నమ్మకాన్ని పోగొడితే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఎవరైనా డోం ట్ కేర్.. నమ్మకం కోసం ప్రాణం ఇస్తాను. నాకు మొత్తం ప్రజాస్వామ్యం మీదనే నమ్మకం పోతోంది. ’’
‘‘ఏం మోసం చేశారేమిటి? ఒకడికమ్మిన ప్లాట్ ను మళ్లీ నీకమ్మారా?’’
‘‘ఇందులో మోసం ఏముంది? ఇది కామన్ కదా. ప్లాట్ అన్నాక ఇద్దరు ముగ్గురికి అమ్ముతా రు. అందులో బలవంతుడెవడో వాడికే ఆ ప్లాట్ దక్కుతుంది. బలహీనుడు కోర్టుకెళతాడు. ఇది కామనే, అందరూ చేసేదే. అది కాదులే విషయం’’


‘‘ఇంకేంటి సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇస్తానని చెప్పి మన సుబ్బారావుగారబ్బాయి ఆ అమ్మాయికి కడుపు చేసిన సంగతా ఏంటి?’’
‘ 
భలే వాడివయ్యా నువ్వు. నీ ఆలోచనలు మరీ సిల్లీగా ఉంటాయి. నేను ప్రధానమంత్రి గురించి చెబుతుంటే నువ్వు హీరోయిన్ కాబోయి గర్భవతి అయిన అమ్మాయి గురించి చెబుతావు. అది కామన్ లేకపోతే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సినిమాలు తీసేది,తీస్తామని నమ్మించేది వీళ్లను హీరోయిన్‌లుగా దేశం మీదికి వదలడానికా? ఎవరి టార్గెట్‌లు వారికుంటాయి. ఆ అమ్మా యి హీరోయిన్ కావాలనుకుంది. వాడు అమ్మాయి కావాలనుకున్నాడు. ఇందులో మోసం ఏముం ది...? ఇలాంటివి కామన్’’

‘‘ఏంటయ్యా నీ బాధ ప్రధానమంత్రి అంటా వు, ప్రజాస్వామ్యం అంటావు. ఇంతకూ నీ నమ్మకాన్ని వమ్ము చేసిందెవరు? ’’
‘‘నా ఒక్కడిని మోసం చేస్తే పరవా లేదు. మొత్తం దేశాన్నే  మోసం చేశారు. ప్రజాస్వామ్యా న్ని మోసం చేశారు. ఇది చారిత్రక మోసం ’’
‘‘ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నావు, నీ వయసెంత ? ప్రజాస్వామ్యం గురించి నీకేం తెలుసేమిటి? ’’
‘‘ ఇదిగో నా వయసెంతని కాదు. 1952లో జరిగిన తొలి పార్లమెంటు ఎన్నికలు మొదలుకొని, మన రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో ఏ పార్టీ ఎలాంటి హామీలు ఇచ్చిందో, ఎలా ఉల్లంఘించారో వివరాలన్నీ నా దగ్గరున్నాయి. ఒకటి రెండు విడవ మంటావా? ’’
‘‘ ఏదీ విడువు వింటాను’’
‘‘ ఇందిరాగాంధీ నాలుగు దశాబ్దాల క్రితం గరీబీ హటావో అని నినాదం ఇచ్చిందా? ’’
‘‘ఔను ఆ నినాదం పుణ్యమే అని కదా పేదలు ఇప్పటికీ కాంగ్రెస్ వెంటే ఉంది’’
‘‘ఇప్పుడు దేశంలో పేదలున్నారా? లేరా? ’’
‘‘ఎందుకు లేరు. ప్రపంచంలోని సగం మంది పేదలు, సగం మంది నిరక్ష్యరాస్యులు మన సోదరులే కదా? ’’
‘‘దీన్ని బట్టి నీకేమర్ధమైంది గరీబీ హటావో అని నినాదం ఇచ్చి అధికారంలోకి వచ్చినా హామీ నెరవేర్చలేదనే కదా? ’’
‘‘ ఔను నిజమే! ’’
‘‘ ఇంకా చెప్పనా! వంద రోజుల్లో ధరలు తగ్గిస్తామని, కాంగ్రెస్ కే హాత్ ఆమ్ ఆద్మీకే సాత్ అన్నారు. కానీ ధరలు తగ్గలేదు. ప్రభుత్వం ఆమ్ ఆద్మీలకు కాకుండా అమీర్‌లకే సాత్ ఇచ్చిందని తేలిందా? లేదా? ’’
‘‘ ఇందులో సందేహం ఎందుకు? నిజమే.’’
‘‘ ఒక్క కాంగ్రెసే కాదు బిజెపి ఏం చెప్పింది. అధికారం ఇస్తే రామ మందిర నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చింది. నిర్మించారా? ’’
‘‘ నిర్మించలేదు.’’


‘‘బాబు ఎప్పుడైనా మాట మీద నిలబడ్డారా? ’’
‘‘ ఛీ...  .
ఛీ ... ఎందుకు అబద్ధం చెప్పాలి బాబు ధర్మప్రభువులు ఒక్కమాట మీద నిలబడలేదు ’’
‘‘తోడల్లుడు దగ్గుబాటికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి  కారులో కలిసి సచివాలయానికి వెళదామని హామీ ఇచ్చారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, సంపూర్ణ మద్య నిషేధం , అబ్బో ఇంకా చాలా హామీలు ఇచ్చారు ... ఏ ఒక్కటైనా అమలు చేశారా? ’’
‘‘ చేయలేదు ’’
‘‘మన చిరంజీవి బాబు సంగతేంటి
సామాజిక న్యాయం నుంచి, కాంగ్రెస్‌లో విలీ నమై అమ్మ మాటే నా మాట అన్నారా? లేదా?’’
‘‘ఔనవును అన్నారు ’’
‘‘మన జగన్ బాబు అధికారంలోకి రాకముందే బోలెడు అధికారం అనుభవించాడు ఆ బాబేమన్న తక్కువ తిన్నాడా?
‘‘ఎంత తిన్నాడో తెలియదు కానీ గిట్టని వాళ్లు మాత్రం లక్ష కోట్లు తిన్నాడంటారు.’’
‘‘ అవన్నీ సరే ఇంతకూ నీ నమ్మకాన్ని ఎవరు వమ్ము చేశారు ? ఏదేదో చెబుతున్నావు?’’
‘‘అక్కడికే వస్తున్నాను’’


‘‘ తొలి ఎన్నికల నుంచి గరీబీ హటావో వరకు,  అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలోనూ, రాష్ట్రంలోనో ఏ పార్టీ అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోదు అని మన రాజకీయ పార్టీల మీద, ప్రజాస్వామ్యం మీద మనకు గట్టి నమ్మకం ఉందా? లేదా?’’

‘ఒక్క పార్టీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోదు. అని మన గట్టి నమ్మకం. ’’
‘‘ కదా! మరి అలాంటప్పుడు తెలంగాణ ఇస్తామని ఇచ్చిన హామీకి సిగ్గులేకుండా కాంగ్రెస్, బిజెపి ఎలా కట్టుబడి ఉన్నాయి. వీళ్లసలు మనుషులేనా? వీళ్లకు ప్రజల నమ్మకాలతో పని లేదా? వీళ్లు మాటకు కట్టుబడి ఉండరనే నమ్మకంతోనే కదా!  రెండేళ్ళ రాజకీయ అనుభవం ఉన్న జగన్ బాబు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అల్లుడు బాబు లాంటి నేతలంతా మాట తప్పి చక్కగా రాజకీయ సంప్రదాయాలను గౌరవిస్తే , నూటా పాతికేళ్ళ చరిత్ర ఉందని చెప్పుకొనే కాంగ్రెస్ , దేశాన్ని పాలించడానికి ముస్తాబవుతున్న బిజెపి కి ఆ మాత్రం సిగ్గులేదా ? మాట తప్పాలనే సాంప్రదాయాన్ని పాటించాలనే ఇంగిత జ్ఞానం లేదా ? ఇక వీళ్ళు  దేశాన్నేం పాలిస్తారు ?  మాట తప్పుతారనే నమ్మకం తోనే కదా   ఇంత కాలం మనం నిచ్చింతగా ఉంది. మన నమ్మకాన్ని వమ్ము చేసిన వీళ్లను నరికి పోగులు పెడితే తప్పా నువ్వే చెప్పు’’
‘‘ ఆ ....????’’

25, ఫిబ్రవరి 2014, మంగళవారం

తెలంగాణా అస్తిత్వాన్ని విలీనం చేస్తారా ?

డెబ్బయవ దశకంలో జరిగిన జై తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాలు ఏడాది రెండేళ్లకు మించి సాగలేదు. ఎంత ఆవేశంగా వచ్చాయో అంతే చప్పున చల్లారాయి. మలి దశ తెలంగాణ ఉద్యమం రోజు రోజుకు ఉధృతం అవుతూ 13 ఏళ్ల తరువాత కూడా సగర్వంగా తలెత్తుకొని నిలవడానికి ప్రధాన కారణం ఇది ఆస్తిత్వ పోరాటం.


ఉద్యమం విజయవంతం అయ్యాక ఇప్పుడు టిఆర్‌ఎస్ కాంగ్రెస్ విలీన చర్చ సాగుతోంది. భౌగోళిక తెలంగాణను సాధించుకోవడం అంటే పది శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్టు, సాధించిన తెలంగాణను సమున్నత స్థాయిలో నిలబెట్టడానికి పునర్నిర్మాణం జరపడం 90 శాతం లక్ష్యం అని ప్రొఫెసర్ జయశంకర్ తరుచుగా అనే వారు. ఇప్పుడు తెలంగాణ సాధించారు. లక్ష్యం ముగిసినట్టేనా? మిగిలిన 90 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది?


‘‘సీమాంధ్ర పార్టీల అవసరం మనకు లేదు, స్వీయ అస్తిత్వం కోసం తెలంగాణ పార్టీ అవసరం’’ అని పలు సందర్భాల్లో కెసిఆర్ బహిరంగ సభల్లో చెబుతూ వచ్చారు. సాధించిన తెలంగాణను గమ్యం చేర్చేందుకు ఇదే పోరాట పటిమ చూపిందేకు తెలంగాణ పార్టీ ఉండాల్సిందే. అది టిఆర్‌ఎస్ కావచ్చు, కొత్తగా తెలంగాణ కోసం పుట్టే పార్టీలు కావచ్చు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన అంశం అస్తిత్వ పోరాటం. నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో అన్యాయం వల్లనే ఉద్యమం అంటే ప్యాకేజీలతో ఈ సమస్య పరిష్కారం అయ్యేది. ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా ఎన్ని 610జివోలు జారీ చేసినా ఎవరూ తమ అస్తిత్వాన్ని వదలుకోవడానికి సిద్ధపడరు. తెలంగాణ భాషకు, యాసకు, సంస్కృతికి చివరకు తెలంగాణ అనే పదానికే అవమానం జరినప్పుడు, చివరకు తన గడ్డమీద తానే పరాయి దిగా నిలిచినప్పుడు అస్తిత్వ వాదంగానే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరిగింది. తెలంగాణలోని ప్రతి పల్లె ప్రతి కులం, ప్రతి మనిషి ఈ పోరాటంలో తానున్నానని చాటి చెప్పాడు. అస్తిత్వ వాదంతోనే ఉద్యమం సాగినప్పుడు తెలంగాణ సాకారం అయినప్పుడు తెలంగాణకు సొంత రాజకీయ పార్టీ ఉండా లా? అనే ప్రశ్న ఉదయించడమే విడ్డూరం. 

తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఎన్టీఆర్ రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకున్నారు కానీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగు భాష, సంస్కృతి కోసం పెద్దగా చేసిందేమీ లేదు. పైగా అప్పటి వరకు తెలుగు సంస్కృతి కోసం అంతో ఇంతో కృషి చేసిన నాటక , సంగీత అకాడమీ, సాంస్కృతిక అకాడమీ, అధికార భాష సంఘం వంటి వాటినన్నింటిని రద్దు చేశారు. సాధారణ ఎన్నికలకు ఎనిమిది నెలల ముందు ఆవిర్భవించిన టిడిపిని ప్రజల ఆదరించడానికి తెలుగువారి ఆస్తిత్వ పోరాటం ఎంత మాత్రం కాదు. అప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై ప్రజలకు పీకల లోతు కోపం ఉంది. ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. మేం వేదిక మొత్తం సిద్ధం చేసిన తరువాత అందులో ఎన్టీఆర్ వచ్చి కూర్చున్నట్టు అయింది అని ఆనాటి రాజకీయాలను విశే్లషిస్తూ బిజెపి నేత కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్‌రావు ఒక సారి వ్యాఖ్యానించారు. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉంది, తనకు ప్రజల్లో విపరీతమైన సినిమా గ్లామర్ ఉంది. దీంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ విజయం సాధించగలిగింది.


ఎలాంటి సినిమా గ్లామర్ లేదు , రాజకీయాల్లో నాలుగేళ్లపాటు మంత్రిగా పని చేసిన అనుభవం, సొంత జిల్లాలో గుర్తింపు తప్ప పక్క జిల్లాలో సైతం పెద్దగా గుర్తింపులేదు, తెలంగాణ వాదాన్ని నమ్ముకొని కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో 13 ఏళ్లపాటు అలుపెరగని పోరాటం చేయడం, చివరకు అసాధ్యం అనుకున్న తెలంగాణ కలను సాకారం చేశారు. కెసిఆర్ వెనక ఉన్న అసలైన బలం తెలంగాణ అస్తిత్వ పోరాటం. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరినా, రాజీనామా చేసినా, పదే పదే ఉప ఎన్నికల్లో పోటీ చేసినా, ఒకసారి కాంగ్రెస్‌తో మరోసారి టిడిపితో చేతులు కలిపినా అన్నింటికీ తెలంగాణ వాదులు సరేనన్నారు. కెసిఆర్ ప్రతి వ్యూహం సరైనదే అనే ఉద్దేశం తో కాదు... కెసిఆర్‌తోనే తెలంగాణ అస్తిత్వ వాదానికి గుర్తింపు లభిస్తుందనే గట్టి నమ్మ కం.. కెసిఆర్‌పై తెలంగాణ వారికే కాదు..... సీమాంధ్రులకు సైతం గట్టి నమ్మకం. అందుకే కెసిఆర్‌ను తెలంగాణకు గుర్తింపుగా తెలంగాణ వాదులు భావిస్తే, తెలంగాణను వ్యతిరేకించే సీమాంధ్ర నాయకులు సైతం కెసిఆర్‌నే తెలంగాణకు ప్రతిరూపంగా భావించారు. 

సీమాంధ్రులు తెలంగాణకు వ్యతిరేకంగా కెసిఆర్‌పై ఎక్కువ పెట్టిన బాణాలన్నీ, చేసిన విమర్శలన్నీ, రాసిన రాతలన్నీ తెలంగాణలో కెసిఆర్ ప్రభావాన్ని పెంచడానికి ఉపయోగపడ్డాయి. అంతకు ముందు హేమా హేమీలు అనుకున్న ఎంతో మంది నాయకులు పోటీగా తెలంగాణ వాదం వినిపించినా తెలంగాణ అంటే కెసిఆరే అనే తెలంగాణ వాదులు భావించడం వల్ల ప్రత్యామ్నాయం వైపు కనె్నత్తి చూడలేదు. విజయశాంతి, నరేంద్ర, గద్దర్, దేవేందర్‌గౌడ్ లాంటి వారిని కెసిఆర్‌కు ప్రత్యామ్నాయంగా నిలపాలని మీడి యా తీవ్రంగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మీడియా కులం కార్డును ప్రయోగించినా దాన్ని తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదు. ఒకటి రెండు శాతానికి మించని కెసిఆర్ సామాజిక వర్గం ఏదనేది తెలంగాణ వారు పట్టించుకోలేదు, సీమాంధ్ర మీడియా, నాయకులు ఈ అంశానే్న ప్రధానంగా ఎత్తి చూపించినా పట్టించుకోలేదు. చివరకు విజయశాంతి, నరేంద్రలు తమ పార్టీలను టిఆర్‌ఎస్‌లో విలీనం చేయాల్సి వచ్చింది. దేవేందర్ గౌడ్ తన పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేశారు. మీడియా బలం, ఆర్థిక బలం, రాజకీయ బలం ఉన్న సీమాంధ్ర వర్గాన్ని ఎదుర్కోవడానికి కెసిఆరే తెలంగాణ వారికి ఏకైక దిక్కుగా కనిపించారు. తమ అస్తిత్వాన్ని తాము ఇష్టపడం, తమ అస్తిత్వానికే సవాల్‌గా మారిన పరిస్థితులను ఎదుర్కోవాలన్న కసితో తెలంగాణ వారు కెసిఆర్ నాయకత్వానికి కొండంత అండగా నిలిచారు. పదే పదే రాజీనామాలతో తెలంగాణపై ఎంత అభిమానం ఉందో చూపించాలని కోరినా విసుక్కోలేదు. తీరా ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తరువాత టిఆర్‌ఎస్‌ను ఎలాగైనా కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కొందరి ప్రయత్నం. ఇది కాంగ్రెస్‌పై ప్రేమతో కాదు... టిడిపిని ఎలాగైనా అధికారంలోకి తీసుకు రావాలని, ఆ పార్టీ బాగుపడేట్టు చేయాలనే కోరికతో..


ఈ రెండు పార్టీలు విలీనం కాకపోతే ఇప్పటి వరకు వచ్చిన అన్ని సర్వేల ప్రకారం తెలంగాణలో టిఆర్‌ఎస్ మొదటి స్థానంలో, కాంగ్రెస్ రెండవ స్థానంలో నిలుస్తుంది. ఇక మూడవ, నాలుగవ స్థానం కోసం టిడిపి, వైకాపా, బిజెపి పోటీ పడాలి. అలా కాకుండా టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అయితే టిడిపి, బిజెపి కలిసే అవకాశాలు ఉంటాయి. దాంతో వాళ్లు రెండవ స్థానంలో బలమైన ప్రత్యర్థులుగా నిలుస్తారు. టిడిపి మేలు కోరే వారికి కావలసింది ఇదే. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కెసిఆర్ మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకోవలసిందే, వెంటనే విలీనం చేయాలి అంటూ టిటిపి నాయకులు విలేఖరుల సమావేశాలు ఏర్పాటు చేసి డిమాండ్ చేయడం రాజకీయ విడ్డూరం.


ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని తెలంగాణ ఏర్పాటు చేసినందుకు తనకు రాజకీయ ప్రయోజనం ఉండాలని, టిఆర్‌ఎస్ విలీనం వల్ల అది సాధ్యం అవుతుందని కాంగ్రెస్ భావిస్తూ ఉండవచ్చు. కానీ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన టిఆర్‌ఎస్ ఇతర పార్టీల వలే ఒక కుటుంబ పార్టీ కాదని, పార్టీతో సంబంధం లేకుండా తెలంగాణ వాదం కోసం ఎంతో మంది తెలంగాణ వాదులు చేసిన కృషి వల్ల టిఆర్‌ఎస్ ఒక రాజకీయ పార్టీగా నిలదొక్కుకుందని గ్రహించాలి. ‘‘నియోజక వర్గానికో జగ్గారెడ్డి ఉంటాడు, మనం తెలంగాణ సాధించి కాంగ్రెస్‌లో విలీనం అయితే ఈనగాచి నక్కల పాలు చేసినట్టు ఇలాంటి వారికి తెలంగాణ అప్పగించినట్టు అవుతుంది’’, అని గతంలో పార్టీ నేతలతో కెసిఆర్ అన్నట్టు వార్తలు వచ్చాయి.


ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవం నినాదాన్ని జనంలోకి తీసుకువెళ్లినట్టుగా కెసిఆర్ తెలంగాణ ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఉపయోగించలేదు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం టిఆర్‌ఎస్‌ను తెలంగాణ ఆత్మగౌరవ నినాదంగానే భావించారు. ఒకవైపు అభివృద్ధి సాధించడంతో పాటు మరో వైపు తెలంగాణ సంస్కృతి, కళలు, తెలంగాణ ఆస్తిత్వం నిలిచిపోయేట్టు, మహోన్నతంగా వెలిగిపోయేట్టు చేయాల్సిన బాధ్యత టిఆర్‌ఎస్‌పై ఉంది. విలీనం వల్ల ఇది సాధ్యం కాదు. తెలంగాణ జాగృతి సంస్థ చొరవ వల్ల గత దశాబ్ద కాలంలో తెలంగాణలో మళ్లీ బతుకమ్మ పండుగ సగర్వంగా తలెత్తుకుని నిలిచింది. తెలంగాణ ఉద్యమమే లేకపోయి ఉంటే మహానగరంలో కాదు మారుమూల పల్లెలో సైతం బతుకమ్మ బిక్కుబిక్కుమంటూ కనిపించీ కనిపించకుండా దాక్కునేది. ఒక చిన్న సంస్థ ఆ పని చేసినప్పుడు తెలంగాణ సంస్కృతి తలెత్తుకునేట్టు తెలంగాణ ప్రభు త్వం చేయలేదా? ప్రాంతీయ సంస్కృతులపై జాతీయ పార్టీలు పెద్దగా దృష్టి పెట్టలేవు. అవి ప్రాంతీయ పార్టీల వల్లనే సాధ్యం. తెలంగాణ ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు చూపించాలనుకుంటే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవచ్చు. ఎంపి సీట్లు ఎన్ని వచ్చినా కాంగ్రెస్‌కే భరోసా ఇవ్వవచ్చు. కానీ విలీనం చేస్తే ఇంత కాలం సాగించిన అస్తిత్వ పోరాటానికి అర్ధమే లేకుండా పోతుంది. తెలంగాణ ఆస్తిత్వమే లేకుండా పోతుంది. ఆస్తిత్వ పోరాటాన్ని గౌరవించాలనుకుంటే తెలంగాణకు సొంత రాజకీయ పక్షాలు అవసరం. అది టిఆర్‌ఎస్ కావచ్చు, మరే పార్టీ అయినా కావచ్చు కేవలం తెలంగాణ కోసమే పని చేసేట్టుగా ఉండాలి. 
టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అయితే ఇప్పుడు కాకపోయినా వచ్చే ఎన్నికల నాటికైనా తెలంగాణ కోసం మరో బలమైన పార్టీ వస్తుంది. రాజకీయంగా చూసినా విలీనం తప్పుడు వ్యూహం అవుతుంది. తమిళనాడు తరహాలో కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సొంత రాష్ట్రానికి ప్రయోజనం కలగాలి అంటే తెలంగాణ పార్టీ ఉండాల్సిందే. కొత్త రాష్ట్రం తప్పటడుగులు తప్పవు అలాంటి సమయంలో కేంద్రంలో అనుకూల ప్రభుత్వం లేకపోతే మరిన్ని కష్టాలు తప్పవు. తెలంగాణ ప్రజలు తమ భవిష్యత్తును టిఆర్‌ఎస్ చేతిలో పెట్టినప్పుడు ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది.

19, ఫిబ్రవరి 2014, బుధవారం

‘‘భస్మాసుర’’ బ్రహ్మాస్త్రం!

అర్జునుడు భూ చక్రం వేయగానే, కర్ణుడు లక్ష్మీ అటంబాంబు లాంటిదాన్ని పేల్చేవాడు. అప్పుడు గ్రాఫిక్స్ లేదు, టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందలేదు కాబట్టి బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి పాత సినిమాల్లో కురు పాండవులైనా, మరే దేవుళ్లయినా మనం దీపావళికి కాల్చే మందుగుండు సామగ్రి లాంటి ఆయుధాలతోనే యుద్ధాలు చేసేవారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, గ్రాఫిక్‌తో ఎలాంటి మాయాజాలాన్నైనా సృష్టించవచ్చు కానీ ఏం లాభం? ఇప్పుడు పౌరాణిక సినిమాలే రావడం లేదు. పోనీ హీరోలైనా కొత్త టెక్నాలజీ ఉపయోగించుకుని యు ద్ధాలు చేస్తారా? అంటే అదీ లేదు. విలన్ గట్టిగా మాట్లాడితే ఆ సౌండ్‌కే ఎగిరి అవతల పడతాడేమో అనిపించేంత సన్నగా ఉండే హీరో ఒకే ఒక్కడు వంద మందిని ఎడమ చేతితో కొట్టేస్తున్నాడు. కుడి చేతితో హీరోయిన్‌ను కౌగిలించుకుంటాడు.


నిజమో కాదో కానీ నాల్గవ ప్రపంచ యుద్ధంలో రాళ్లే ఆయుధాలు అవుతాయని ఐన్‌స్టిన్ అన్నారట! అదేంటయ్యా టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతుంది కదా అని సందేహం వ్యక్తం చేస్తే, నిజమే మూడవ ప్రపంచ యుద్ధం నాటికి టెక్నాలజీ మరీ పెరిగిపోతుంది. అప్పుడు చిన్నా చితక దేశాలు కూడా అణ్వాయుధాలు ఉపయోగిస్తాయ కదా! దాంతో సర్వనాశనం అవుతుంది కాబట్టి నాలుగవ ప్రపంచ యుద్ధం నాటికి మనిషి మళ్లీ ఆదిమానవుని దశలోనే ఉంటాడని చెప్పడం అన్నమాట!


నిజాం పాలించిన కాలంలో రజాకార్లను ఎదుర్కోవడానికి తెలంగాణ పల్లెల్లో కారం పొడిని కూడా ఆయుధంగా ఉపయోగించారు మహిళలు. ఒకప్పుడు ఎవరి వద్ద ఎక్కువ పాడి ఉంటే వాడే గొప్ప. ఇప్పుడు ఏ దేశం దగ్గర ఎక్కువ ఆయుధాలుంటే ఆ దేశమే గొప్ప. ఐతే దానికి అమెరికా అనుమతి ఉండాలి. సద్దాం హుసేన్ సొంతంగా ఆయుధాలు సమకూర్చుకుంటే.. తన మాట వినకుండా ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఆయుధాలు సమకూర్చుకుంటే ఇక నేనెందుకు అని బోలెడు ఆవేదన చెంది, ఆ తరువాత సద్దాంను మట్టుపెట్టాడు పెద్దన్న. లాడెన్ దగ్గర కూడా ఇలా ఆయుధాలు బాగానే ఉండేవి ఐతేనేం అమెరికాకు నచ్చలేదు. దాంతో ఎన్ని ఆయుధాలు ఉన్నా ఎక్కడో పాకిస్తాన్‌లో దాక్కు న్నా అమెరికా కళ్లు కప్పలేకపోయాడు. 

నాటి పౌరాణికాలు ఇప్పటికీ నచ్చడానికి ప్రధాన కార ణం ఆయుధాలేనేమో! నువ్వు పలానా ఆయుధం ప్రయోగిస్తే, నేను ఈ ఆయుధం ప్రయోగిస్తాను కాచుకోరా అంటూ ఇద్దరు దేవుళ్లు బాణాలు విడిస్తే అవి సుర్రు మంటూ సౌండ్ చేసుకుంటూ నిప్పులు కురిపిస్తూ వెళ్లేవి. ఏ ఆయుధం ఎక్కువ నిప్పులు కురిపిస్తే అది అంత గొప్ప ఆయుధమన్నమాట! యుద్ధంలో ఇద్దరూ చేతికి అందేంత దూరంలోనే ఉన్నా ఎందుకో కానీ ఇద్దరూ నేరుగా బాణాలు వేసుకోరు. ఒకరు ఆకాశంలోకి బాణం వదిలితే అది ఐదు నిమిషాల పాటు అలా వెళుతూనే ఉంటుంది. నాలుగు నిమిషాల తరువాత ప్రత్యర్థి దానికి విరుగుడుగా మరో బాణం వేస్తాడు. రెండూ మార్గమధ్యలోనే ఢీకొని కింద పడిపోయేవి. ఎదురెదురుగానే ఉన్నారు కదా నేరుగా బాణం వదలకుండా అలా ఆకాశంలోకి ఎందుకు వదిలారు? అనే సందేహానికి ఇప్పటికీ సమాధానం దొరకలేదు. బహుశా ఆనాటి యుద్ధ నియమాల్లో ఇది కూడా ఒకటేమో!


వజ్రాయుధం, బ్రహ్మాస్త్రం ఇవి ఆనాటి పాపులర్ అస్త్రాలు. అదేం చిత్రమో కానీ వజ్రాయుధం ఇంద్రుడి వద్ద ఉన్నా ప్రతి ఒక్కడూ అతన్ని ఓడించేవాడే. పైగా ఆయన దేవతలకు రాజు. మరీ ఇంత బలహీనమైన రాజేమిటో?
ఆ మధ్య లగడపాటి రాజగోపాల్ మా వద్ద బ్రహ్మాస్త్రం ఉంది అని చెప్పగానే అప్పటి వరకు ఆంధ్ర, తెలంగాణ చరిత్రను చదువుతూ పోయిన చరిత్ర కారులంతా ఒక్కసారిగా పురాణాలపై పడ్డారు. బ్రహ్మాస్త్రాన్ని ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రయోగించారు.బ్రహ్మాస్త్రానికి విరుగుడు ఉం దా? అనే అనే్వషణలో పడిపోయారు. అణ్వాయుధాలు ప్రయోగించినప్పుడు అమెరికా అధ్యక్షుడి లాంటి వారిని రక్షించేందుకు సురక్షిత ఏర్పాట్లు ముందుగానే చేసి ఉన్నారట!అలానే బ్రహ్మాస్త్రం ప్రయోగించినప్పుడు ఎలా ఎదుర్కోవాలని తర్జనభర్జనలు పడ్డారు. రాజకీయాల్లో మీడియాను మించిన బ్రహ్మాస్త్రం లేదంటారు. అయితే ఇది గత వైభవమే. మీడియా బ్రహ్మాస్త్రంతోనే బాబు ఎన్టీఆర్ లాంటి పాపులర్ నేతను ఇంటికి పంపించగలిగారు. అయితే ఆ ఆయుధాన్ని పదే పదే వాడడంతో అది నిరుపయోగంగా మారింది. పైగా ప్రత్యర్థులు సైతం ఇలాంటి ఆయుధాలు సంపాదించేశారు.
మరి ఇంతకూ బెజవాడ బెబ్బులి చెబుతున్న బ్రహ్మాస్త్రం ఏమిటా? అని అంతా ఆలోచిస్తుండగానే ఆయన బ్రహ్మాస్త్రం ప్రయోగించారు.
ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలోని చట్టసభలో లగడపాటి పెప్పర్ స్ప్రే అనే ఆయుధాన్ని ప్రయోగించగానే ఎంపిలు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు.


ఔను నిజం అది బ్రహ్మాస్తమ్రే అని తెలంగాణ వాదులు మనసులోనే సంబర పడ్డారు. ఎందుకలా అంటే. తెలంగాణ అవసరం అని తెలంగాణ ప్రజలను ఒప్పించడానికి కెసిఆర్‌కు దశాబ్దా కాలం పట్టింది. అయినా జాతీయ మీడియా దృష్టిని ఆకట్టుకోలేకపోయారు. కానీ ఈ బ్రహ్మాస్త్రంతో దేశం మొత్తానికి తెలంగాణ ఏర్పాటు అవసరం అని లగడపాటి చెప్పినట్టు అయింది. జాతీ య మీడియా వద్దన్నా మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి. ఆయుధం ప్రయోగించినప్పుడు కళ్ల నీళ్ల పర్యంతం అయిన ఎంపిలంతా ఇప్పుడు కసితో తెలంగాణకు అండగా నిలుస్తారు. ఇంత కన్నా మాకు ఉపయోగపడే బ్రహ్మాస్త్రం ఏముంటుంది? అనేది తెలంగా వాదుల వాదన. బుర్రలో గుజ్జు లేకుండా చేతిలో ఆయుధం మాత్రమే ఉంటే ఒక్కోసారి శత్రువు చేతిలోని ఆయుధం కూడా ప్రత్యర్థికి ఉపయోగపడుతుంది. భస్మాసురుడి చేతిలో బ్రహ్మాస్త్రం ఉంటే ఏమవుతుంది. అది భస్మాసురుడినే మింగేస్తుంది. అదే జరిగింది.

12, ఫిబ్రవరి 2014, బుధవారం

ఓ నేతల్లారా మీరు మీ పిల్లలు మీ వంశం వెయ్యేళ్ళు మమ్ములను పాలించాలి

అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి,అప్పుల్లోనే మరణిస్తాడని మన రైతుకు నిర్వచనం. అలానే అధికారంలోనే పుట్టి, అధికారంలోనే పెరిగి, అధికారంలోనే శాశ్వతంగా ఉండాలనుకునేవాడే రాజకీయ నాయకుడు. పూర్వం పెళ్లి కాగానే కొత్త దంపతులను గంపెడు పిల్లలతో వెయ్యేళ్లు వర్థిల్లమని ఆశీర్వదించేవారు. వెయ్యేళ్లు బతకాలని ఎవరికుండదు. అది సాధ్యమా? కాదా? అనే లాజిక్ వదిలేస్తే, అందరికీ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కడు హైదరాబాద్‌లో నీకెన్ని ఫ్లాట్లున్నాయి అని అడుగుతారు. హైదరాబాద్‌లో బతికేందుకు పడే పాట్లు ఎవడిక్కావాలి? మనకెన్ని ఫ్లాట్లుంటే అంత గొప్ప. ఇప్పుడు పిల్లల సంఖ్య కన్నా ప్లాట్లు, ఫాట్ల సంఖ్యనే ముఖ్యం. ఇంతకు ముందు పెళ్లి చేసుకుంటే ఓ ఇంటివాడయ్యాడు అనే వాళ్లు. ఇప్పుడు కొత్త దంపతులను హైదరాబాద్‌లో త్వరలోనే సొంతింటి వాడవు కా అంటూ ఆశీర్వదిస్తున్నారు.


కాలం మారింది మనుషులను ఆశీర్వదించే మాటలు మారినట్టే నాయకులను ఆశీర్వదించే మాటల్లోనూ చాలా మార్పులు వచ్చాయి. పూర్వం ఖద్దరు వేసుకున్న నాయకుడు అంటే భార్య మంగళహారతి పాడి వీర తిలకం దిద్ది పంపించేది. స్వాతంత్య్రం కోసం పోరాడుతూ మా ఆయన జైలుకు వెళుతున్నాడని వీరనారి సగర్వంగా ప్రకటించుకునేది. ఇప్పుడు జైలు నుంచి బెయిల్‌పై వస్తే వీరతిలకాలు దిద్దుతున్నారు. కేసుకే భయపడి స్టే తెచ్చుకున్నాడు వాడిదీ ఒక బతుకేనా మా నాయకుడు చూడు ధైర్యంగా కేసు ఎదుర్కొని బెయిల్‌పై వచ్చాడని రొమ్మువిరుచుకుని అభిమానులు సగర్వంగా ప్రకటించుకుంటున్నారు. వ్యవహారం కేసు వర కు రాకుండా రాజీ పడిన వాడి కన్నా రాజీపడకుండా జైలుకు వెళ్లి వచ్చిన వాడే వీరుడు కదా? అనే ఆలోచన పెరిగితే తప్పేముంది.


ఎన్నికల సమయంలో నాయకులు నా ఓటు నీకే అని ఓటరు నుంచి, అందరి ఓట్లు మీకే అని పెద్దల నుంచి ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు. చిన్నా చితక నాయకులు కోరుకునే ఆశీర్వాదాలు ఇవి. కానీ కొందరు ఘరానా నాయకుల కోరికలు పొందాలనుకునే ఆశీర్వాదాలు మాత్రం భారీ స్థాయిలోనే ఉన్నాయి.
జీవిత కాలమంతా అధికారంలో ఉండాలని అనుకుంటున్నాను అని ఎవరైనా అంటే ఏమనుకుంటారు,్ఛ..్ఛ.. ఎంత వీడికెంత అధికార దాహం అని చీత్కరించుకోకుండా ఉంటారా? ఇదే మాటను కాస్త తిప్పి చెబితే ఎంత చక్కగా ఉంటుంది. దేశంలో అవినీతిని పారద్రోలేంత వరకు రాజకీయాల్లో ఉండాలని అనుకుంటున్నాను, అవినీతి రహిత భారత దేశం ఏర్పడగానే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటున్నారు రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తే అయినా, రాజకీయ ఆలోచనలకు కొత్తేమీ కాదని నిరూపిస్తున్నారు. ఆయన ఐదేళ్లు అధికారంలో ఉండడం కష్టమే అనుకుంటుంటే, ఐదారు నెలల కూడా ప్రభుత్వం నిలబడేట్టు లేదని అనుభవజ్ఞులు అంటుంటే, ఆయన మాత్రం తన జీవిత కాలమంతా రాజకీయాలను వీడేట్టుగా లేరు, ఆయన మాట ప్రకారం చూస్తే మాత్రం మానవ జాతి బతికి ఉన్నంత వరకు ఆయన రాజకీయాల్లో ఉండేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే మనిషి అనేవాడు ఉన్నంత వరకు అవినీతి ఉంటుంది. అవినీతి ఉన్నంత వరకు ఆయన రాజకీయాల్లో ఉంటారటమరి! అన్ని విషయాల్లో బాబుగారు కాపీ కొడుతున్నారని అంటారు కానీ ఈ విషయంలో మాత్రం బాబునే కేజ్రీవాల్ కాపీ కొట్టారని మనం సగర్వంగా ప్రకటించుకోవచ్చు. పేదరికం లేని సమాజాన్ని చూడడమే నా ధ్యేయం, అప్పటి వరకు అలుపెరగని పోరాటం చేస్తాను, అధికారంలో ఉంటాను అని బాబుగారు ఎన్నోసార్లు చెప్పారు. అవినీతి, పేదరికం ప్రపంచంలో ఏ దేశంలోనైనా లేకుండా పోయిందా? భవిష్యత్తులో పోతుందా? మేం రాజకీయాల్లో శాశ్వతంగా ఉంటామని బాబుగారు చెప్పిన మాటలను కేజ్రీవాల్ మరో రూపంలో కాపీ కొట్టారు. అదేదో ఇంగ్లీష్ సినిమాను కళాత్మకంగా కాపీ కొట్టి రాజవౌళి ఈగ తీసినట్టు.


2012వరకు నేనే అని పెదబాబు విజన్ 2020 అంటే సర్లే ఇక నాకెప్పుడు చాన్స్ వస్తుందని చినబాబు లోకేశ్ రాజకీయాలకు దూరం గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన్ని ఎంత ఫోకస్ చేయాలని ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. హీరో మంచి ఫాంలో ఉన్నప్పుడు అబ్బాయి రంగంలోకి వస్తే హీరోగా స్థిరపడతాడు. అలానే నాయకుడు మంచి ఫాంలో ఉండగానే వారసుడు వస్తే నిలబడతాడు. పెదబాబు పాపులారిటీ గ్రాఫే కిందికి పడిపోతే ఇక చినబాబు చేసేదేముంటుంది.


వైఎస్‌ఆర్ గ్రాఫ్ పైనే ఉన్న కాలంలోనే ఆయన పై లోకాలకు వెళ్లడంతో జగన్‌కు ఆ గ్రాఫ్ కలిసొచ్చింది. ఇంకా అధికారంలోకి రాలేదు కానీ అప్పుడే విజన్ 2044 అంటున్నారు. అదేంటయ్యా అంటే రాసిపెట్టుకోండి 30 ఏళ్లపాటు పాలించేస్తానని భరోసా ఇస్తున్నారు.
అద్వానీకి కాలం కలిసిరాలేదు కానీ వాజ్‌పాయి తరువాత రంగంలో ఉండేవారు. నేనింకా ఔట్ కాలేదు రంగంలో ఉన్నాను అని ఆయన చెబుతున్నా పాపం ఆ పార్టీలో వినిపించుకునేవారేరి? ఎంత కాలం ఉండేది మోడీ చెప్పడం లేదు కానీ గుజరాత్‌లో ఆయన వ్యూహాన్ని చూస్తే ఒక్కసారి అవకాశం అంటూ లభించాలి కానీ వాజ్‌పేయి ఎవరు, అద్వానీ ఎవరు? అని బిజెపి వాళ్లతోనే చెప్పించగలరు. కంప్యూటర్‌ను కనిపెట్టింది మన బాబే అని మనం నమ్మినట్టుగానే మోడీతోనే బిజెపి ఆవిర్భవించింది అని నమ్మించగలరు. జాతీయ చినబాబు రాహుల్ గారేమే అధికారం ముళ్లకిరీటం అంటూనే ఆ ముళ్లకిరీటాన్ని మన కోసం ధరించేందుకు సిద్ధమంటున్నారు.
మన కోసం, మన బాగు కోసం ముళ్లకిరీటాలు ధరించేందుకు, తమ జీవిత కాలమంతా అధికారంలో ఉండేందుకు ముందుకు వస్తున్న మన నాయకుల త్యాగాన్ని దేంతో పోల్చగలం?


11, ఫిబ్రవరి 2014, మంగళవారం

ఇంటి ఆవరణలో ఇద్దరు రాజులుచాలా కాలం క్రితం  మిత్రుడు చెప్పిన కథ 
రచయిత ఎవరో తెలియదు .. కథ గుర్తున్నంత వరకు .. రష్యాలో విప్లవం తరువాత కమ్యునిస్ట్ ప్రభుత్వం ఏర్పడుతుంది .. అప్పటి వరకు అక్కడి రచయితలు జార్ చక్తవర్థుల అరాచకాల గురించి  కథలు కథలుగా రాశారు ..కమ్యునిస్త్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పెట్టుబడి దారుల దేశం నుంచి ఒక పెట్టుబడి దారుడు రష్యా రచయితను తన ఇంటికి పిలుస్తాడు . 
రష్యా రచయిత ఆ పెట్టుబడి దారున్ని చూసి ఆశ్చర్య పోతాడు 
పెద్ద పెద్ద రాజ భావనల్లో ఉంటాడని అనుకున్నాను .. మామూలు భవనం లోనే ఉన్నాడు అనుకుంటాడు 

పెద్ద పొట్టతో , కోరలతో అచ్చం రాక్షసుడిగా ఉంటాడనుకున్న పెట్టుబడి దారుడు .. రెండు కాళ్ళు , రెండు చేతులతో మాములు గానే ఉన్నాడని రచయిత వింతగా చూస్తాడు . భోజనాల వేళ కాగానే సరే ఇప్పుడైనా వీడి  అసలు రూపు తెలుస్తుంది అనుకుంటాడు పెట్టుబడి ారుడు మనుషులను అలానే సజీవంగా పిక్కు తింటాడు   అనే ఆలోచనతో రచయిత ఉంటాడు . మళ్లీ ఆశ్చర్యం ఒక పుల్క , రెండు ఇడ్లీలు మాత్రమె తింటున్నాడు పెట్టుబడి దారుడు . రచయితకు బుర్ర గిర్రున తిరుగుతుంది .. పెట్టుబడి దారుడి గురించి తాను అనుకున్నది అంతా అబద్దం అనిపిస్తుంది 
సాయంత్రం వరండాలో కూర్చొని పెట్టుబడి దారుడు , రష్యా నుంచి వచ్చిన రచయిత పిచ్చాపాటి మాట్లాడుకుంటారు 
అప్పటి వరకు పెట్టుబడి దారుల గురించి తాను అనుకున్నది ,  చూస్తున్నది రచయిత చెబుతాడు 
పెట్టుబడి దారుడు వినయంగా నవ్వి ఉరుకుంటాడు 
కొద్ది సేపటి తరువాత పెట్టుబడిదారుడు రాజుల గురించి చెప్పా మంటాడు 
రాజులు ఎంత సంపన్నులో , వారి భవనాలు ఎంత పెద్దవో రచయిత కథలు కథలుగా వర్ణించి చెబుతాడు 
అంత వి న్న పెట్టుబడి దారుడు 
ఇద్దరు రాజులను కొనాలంటే ఎంతవుతుంది  అని అడుగుతాడు . 
రచయితకు దిమ్మ తిరిగి పోతుంది 
రాజులను కొనడం ఏమిటి ? అయినా మీకెందుకు అని అడుగుతాడు 
ఏమి లేదు నేను చిన్నప్పటి నుంచి రాజుల గురించి చదవడమే కాని చూడలేదు .. మా ఇంటి వరండాలో ఇద్దరు రాజులు కత్తి యుద్దం చేస్తుంటే సరదాగా చూడాలని ఉంది 
అందకే ఇద్దరు రాజులను కొనాలనుకున్తున్నను , ఏ పాటి అవుతుందేమిటి  అని అడుగుతాడు 
రచయితకు అప్పుడు తెలుస్తుంది పెట్టుబడి దారుని శక్తి ఏమిటో ?
వాడు మామూలు మనిషిలానే ఉంటాడు, మామూలు మనిషి లానే  తింటాడు కానివా డి పెట్టుబడి వాడితో ఏమైనా చేయిస్తుంది 
( తెలంగాణా ఏర్పాటుకు పెట్టుబడి దారులు కల్పిస్తున్న అడ్డంకులు చూశాక కథ గుర్తుకు వచ్చింది ) 

5, ఫిబ్రవరి 2014, బుధవారం

చాయ్ కప్పులో మోడీ

ఉదయం లేవగానే చాయ్ లేందే గడవదు. బ్రిటీష్‌వాడు పోతూ పొతూ మనకు అంటించిన అలవాట్లలో ఒకటి ఇంగ్లీష్ రెండు టీ. ఆరు దశాబ్దాల క్రితమే మనకు స్వాతంత్య్రం లభించిందని అనుకుంటాం కానీ మనం జీవిత కాలమంతా ఈరెండింటికి బానిసలమే. అద్భుమైన మార్కెటింగ్‌కు పాఠం లాంటిది చాయ్. బ్రిటీష్ వాడి పాలనా కాలంలో తొలుత రోడ్లమీద టీ ఉచితంగా పంచేవారు. దాని కోసం కొన్ని సంవత్సరాల పాటు వాళ్లు తంటాలు పడ్డారు. మెల్లగా జనానికి టీ అలవాటైంది. టీ లేనిదే ఉండలేని స్థితికి వచ్చారు. అప్పడు చాయ్‌పత్తి అమ్మడం మొదలుపెట్టారు. ఇప్పుడు దేశంలో కొన్ని కోట్ల మంది రోజూ కోట్లాది కప్పుల టీ తాగుతున్నారు. బ్రిటీష్‌వాడికి ఇప్పుడు టీ తాగే అలవాటు ఉందో లేదో కానీ వాడు వదిలేసినా మనం వదలలేకపోతున్నాం. బ్రిటీష్‌వాడు పాలించిన సీమాంధ్రలో కన్నా నిజాం పాలించిన తెలంగాణలోనే టీ అలవాటు ఎక్కువ ఉండడం వింతే.
టీ విదేశీయుడు అలవాటు చేసిందైనా స్వదేశీ పార్టీ బిజెపి దాన్నుంచి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోంది. చాయ్‌పై చర్చ అంటూ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉదయం ఇంట్లో టీ తాగినా, హోటల్‌కు వెళ్లి టీ తాగినా టీ అనే మాట వినిపించగానే నరేంద్ర మోడీ కళ్ల ముందు ప్రత్యక్షం అయ్యే విధంగా టీ అలవాటును మార్చుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోంది. పెద్దపెద్ద పనులకు పెద్ద పెద్ద అధికారులు తలెత్తుకుని ముక్కు పిండి మరీ లంచాలు వసూలు చేస్తే, చప్రాసీ లాంటి సామాన్యులు చాయ్ పైసలు ఇవ్వండి సార్ అని చేతులు నలుపుకుంటూ అడుగుతాడు. చాయ్ అనగానే ఎవరైనా కరిగిపోవలసిందే కాదనలేరు.


షాయెద్ మేరీ షాదీకా ఖయాల్ ఆయాహై ఇసీ లియే మమ్మినే తుజే చాయ్‌పే బులాయా హై అంటూ హీరోతో కలిసి యుగళగీతం పాడుతుందో హిందీ సినిమాలో హీరోయిన్. ఈ అమ్మాయి పెళ్లి హీరోతో చేయాలనే ఆలోచన వచ్చినట్టుంది అందుకే అమ్మ నిన్ను టీకి పిలిచింది అని చెబుతుందా హీరోయిన్. హంస రాయబారంలా ప్రేమకు టీ రాయభారం అన్నమాట. పెళ్లి చూపుల్లో గతికితే అతకదు అని ఏమీ తినరు. టీ తాగితే పెళ్లి సంబంధం కుదరదు అనే నమ్మకం ఏమీ లేదు పైగా టీ తప్పనిసరిగా ఇస్తారు. కొన్ని కోట్ల మందికి టీ తాగందే దినం గడవదు. అలాంటప్పుడు ఆ టీనే మనం ప్రచార అస్త్రంగా వాడుకుంటే పోలే అనుకున్నారు మోడీ. మన రాష్ట్రంలోనే కాదు ఇప్పుడు దేశం మొత్తం టీ చుట్టే తిరుగుతుంది. గత దశాబ్ద కాలం నుంచి కెసిఆర్ రాష్ట్ర ప్రజల ఆలోచనలను టీ చుట్టు తిప్పితే, ఇటీవల మోడీ టీ చుట్టు తిప్పేందుకు బాగానే ప్రయత్నిస్తున్నారు. కెసిఆర్ టీ, మోడీ టీ రెండు వేరువేరు టీలు. కానీ ఇది టీ కాలం అనేది మాత్రం నిజం.
ఆ కాలంలో టీ అలవాటు లేదు కాబట్టి ధర్మరాజును దుర్యోదనుడు పాచికల ఆటకు ఆహ్వానించాడు. లేకపోతే టీ విందుకు పిలిచేవాడు. ఎంత ఎక్కువ టీ తాగినా అయ్యేదేముంది. అన్నాదమ్ములు హాయిగా ఉండేవారు అసలు యుద్ధమే ఉండేది కాదు. కానీ అప్పుడు టీ లేకపోవడం వల్ల దుర్యోధనుడు జూదానికి ఆహ్వానిస్తే ఆనాటి ఆచారం ప్రకారం ధర్మరాజు వెళ్లక తప్పలేదు. చివరకు ఆ జూదంలో అంతా పొగొట్టుకోవలసి వచ్చింది. ఇప్పుడు మోడీ అందరినీ టీకి పిలుస్తున్నాడు. రాజకీయ నాయకులు తమ పాపులారిటీని పెంచుకోవడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టరు. కంప్యూటర్ కనిపించగానే ఇది చంద్రబాబే కనిపెట్టారు అన్నంతగా ఆయన, ఆయన అభిమానుల ప్రచారం సాగింది. కంప్యూటర్ వాడే వారి కన్నా టీ తాగే వారి సంఖ్య కచ్చితంగా చాలా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి బాబుకు కంప్యూటర్‌లు వర్కవుట్ కాకపోయినా మోడీకి టీ వ్యూహం బాగానే వర్కవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కంప్యూటర్ బాబుకు పర్యాయ పదం అయినట్టు ఇప్పుడు టీ అనే ప్రస్తావన వస్తే చాలు అది మోడీకి ప్రచారంగా ఉపయోగపడాలనేది బిజెపి ఎత్తుగడ.


దేశం లో ఆల్కా హాలికుల కన్నా  చాయ్ హాలికులే ఎక్కువ . 
సైకిల్ తొక్కే వాడి ఓట్లన్నీ నాకే అని ఎన్టీఆర్ సైకిల్ గుర్తును ఎంపిక చేసుకున్నట్టుమోడీకి  తమపార్టీ గుర్తు చాయ్ కప్పును ఎంపిక చేసుకోవలని ఉండే ఉంటుంది ..  రోడ్డు మిద సైకిళ్ళు కనిపించడం లేదు.  టిడిపికి అధికారం దక్కడం లేదు . కాని చాయ్ అలవాటు అలా కాదు కదా?   మరుగుదొడ్లు, ఆలయాలు లేని గ్రామాలు ఉండొచ్చు కానీ టీ కొట్టు లేని గ్రామం కనిపించదు. అందుకే మోడీ టీ స్టాల్స్‌నే తమ ప్రచార కేంద్రాలుగా ఉపయోగించుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా టీ స్టాల్స్‌లో రాజకీయ చర్చకు శ్రీకారం చుట్టనున్నారు. చాయ్‌పై చర్చ అంటూ దేశ వ్యాప్తంగా టీ స్టాల్స్‌లో రాజకీయ చర్చను మోడీ ప్రారంభించనున్నారు. టీ స్టాల్స్‌లో కూర్చొని ఆన్‌లైన్‌లో ప్రశ్నలు అడిగితే మోడీ వారికి సమాధానాలు చెబుతారు. టీస్టాల్‌లో అమర్చిన టీవిల్లో వాళ్లు మోడీని చూస్తూ ఆయన మాటలు వింటూ టీ తాగొచ్చు. టీ బిల్లు బిజెపి వాళ్లే చెల్లిస్తారు అది వేరే విషయం.
మహాకూటమి ఏర్పాటు సమయంలో కెసిఆర్ ఇంటికి చంద్రబాబు, రాఘవులు, నారాయణ బృందం టీ పార్టీకి వెళ్లింది. టీ తాగాక రాఘవులు మీడియాతో టీ కప్పులో తుఫాను సృష్టిస్తామని చెప్పుకొచ్చారు. తరువాత మహాకూటమి ఏర్పడింది అయితే తుఫాను మాత్రం రాలేదు. ఇప్పుడు చాయ్‌పై చర్చ అంటూ మోడీ భారత రాజకీయాల్లో టీ కప్పుతో తుఫాను సృష్టిస్తామని అంటున్నారు. ఈ తుఫాను మో డీని ప్రధానమంత్రిని చేస్తుందా? లేక టీ కప్పు లో తుఫానుగానే మిగిలిపోతుందా? అనేది కాల మే నిర్ణయిస్తుంది.


ప్రజాస్వామ్యాన్ని పూరి గుడిసెలోని టీ స్టాల్ వరకు తీసుకు వచ్చిన మోడీ మహానుభావుడని కొందరంటే... గిట్టని వారు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే.. అసెంబ్లీ, పార్లమెంట్లలో ఇప్పుడెలాగూ చర్చలు సాగడం లేదు. వాటి కన్నా కాలేజీ క్యాంటీన్ కావచ్చు, రోడ్డుమీదున్న ఇరానీ హోటల్ కావచ్చు టీ తాగుతూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపై నిర్మొహమాటంగా చర్చలు సాగుతుంటాయి. ఇందులోనూ ఇప్పుడు రాజకీయ పక్షాలు ప్రవేశించాక ఇక చర్చలేం జరుగుతాయి. ప్రజాస్వామ్యానికి ఇంత కన్నా నష్టమేముంది అని టీ స్టాల్‌లో రాజకీయ చర్చలు సాగించే  ఔత్సాహికుల ఆవేదన .