26, జూన్ 2016, ఆదివారం

బ్రెగ్జిట్-ఉమ్మడి కుటుంబం

‘‘పని మనిషి రాలేదు. బ్రెగ్జిట్ ప్రభావమట! వాళ్ల గుడిసె అద్దె పెంచమని చెప్పారట!మనం జీతం పెంచాలట!పొద్దున అటోవాడు కూడా కిరాయి పెంచితేనే రేపటి నుంచి పిల్లాడిని స్కూల్‌కు తీసుకెళతానంటున్నాడు. ఎవర్ని పలకరించినా బ్రెగ్జిట్ అంటున్నారు! ? ’’
‘‘చిన్నప్పుడు స్కైలాబ్ పడుతుందని, రోజులు దగ్గర పడ్డాయని బర్రెలు, గొర్రెలు అమ్ముకుని జల్సా చేశారు గుర్తుందా? ఇది కూడా అలాంటిదేనన్నమాట’’


‘‘మీరు ఇంటికి ఆలస్యంగా వచ్చి చెప్పే కథలన్నీ నమ్ముతున్నాను కాబట్టి, ఏం చెప్పినా నమ్మేంత అమాయకురాలిని అనుకుంటున్నారా?’’
‘‘అర్ధం కాక అడిగాను. పూర్తిగా తెలియక కాదు. జిహాద్‌లా ఇది కూడా ఏదో ఒక ప్రమాదకరమైందని మాత్రం అర్థమవుతుంది. బ్రెగ్జిట్ వల్ల పని మనిషి, ఆటో వాడు రేట్లు పెంచడం ఏమిటి? వాళ్లకు కనీసం బ్రెగ్జిట్ అని పలకడం కూడా రాదు’’
‘‘ ప్రపంచీకరణ అంటే అంతే. గతంలో సోవియట్ రష్యాలో వాన పడితే మన దేశంలో ఎర్ర పార్టీల వాళ్లు తుమ్ముతారు అనే వారు. రష్యా కుప్పకూలి ఎర్రపార్టీలకు కాలం చెల్లి ప్రపంచీకరణ మొదలయ్యాక ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ వాన పడ్డా ప్రపంచ మంతా తుమ్ముతోంది. పెళ్లప్పుడు నీకు వడ్డాణం చేయిస్తాను అని ఇచ్చిన మాట నిలబెట్టుకుందామనుకునే సరికి బ్రెగ్జిట్‌తో బంగారం ధర పెరిగింది.’’


‘‘ అర్ధం కాలేదు’’
‘‘ఉమ్మడి కుటుంబం అనుకో. ఉమ్మడి కుటుంబంలో లాభాలు నష్టాలు ఎన్నున్నాయో ఐరోపా కూటమిలో అన్నిలాభ నష్టాలు ఉన్నాయి. ఉమ్మడి కుటుంబంలో పని మంతుడు, పని చేయలేని వాడు అంతా బతికేస్తారు. చిన్న కుటుంబంలో ఎవరి బతుకు వారిది అంతే. ఐరోపా కూటమిలో మా అవకాశాలు దెబ్బతింటున్నాయి, మేం విడిగా కాపురం పెట్టుకుంటామని బ్రిటన్ తేల్చేసింది. అంటే కొత్తగా పెళ్లయినప్పుడు మన ప్రేమ ముచ్చట్లకు ఉమ్మడి కుటుంబం అడ్డంగా ఉందని, మనం విడి కాపురం పెట్టుకున్నాం కదా? ఇదే అంతే బ్రెగ్జిట్ అంటే విడిగా కాపురం పెట్టుకోవడం అన్న మాట ’’
‘‘ఈరోజుల్లో భార్యా భర్త ఒకే చోట ఉంటే అదే ఉమ్మడి కుటుంబం అనుకుంటున్నారీ కాలం పిల్లలు. అమ్మనాన్న, చెల్లి అన్న ఇవే కాకుండా ఇంకా చాలా బంధుత్వాలు ఉంటాయి అంటే నమ్మడం లేదు. మహేశ్ బాబు లాంటి హీరోతో ఈ తరానికి తెలియని బోలెడు బంధుత్వాలతో బ్రహ్మోత్సవం తీస్తే ఆదరణ దక్కలేదు. రైళ్లను వెనక్కి పరిగెత్తించే బాలకృష్ణ వల్ల బ్రెగ్జిట్ నష్టాన్ని ఆపలేరంటారా? ’’


‘‘ బాలకృష్టనే కాదు చిరంజీవి వల్ల కూడా కాదు’’
‘‘ఎవరి వల్ల కాకపోయినా రజనీకాంత్ వల్ల కానిది ఉండదు. ఈ యూరప్ వాళ్లకు ఇండియా అంటే చిన్న చూపు అందుకే రజనీకాంత్ లాంటి వారికి ఈ బాధ్యత అప్పగించడం లేదు’’
‘‘సర్లే కానీ సింపుల్‌గా చెప్పాలంటే యూరప్ సమాఖ్యలో ఉండడం వల్ల మా ఉద్యోగాలు, మా అవకాశాలు, మా అభివృద్ధి దెబ్బతింటోంది మా బతుకు మేం బతుకుతాం అని బ్రిటన్ బయటకు వెళ్లింది’’
‘‘ ఇప్పుడర్థమైంది. ఇది తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమం అన్న మాట! కిరణ్‌కుమార్‌రెడ్డి ఎప్పుడో చెప్పాడు. తెలంగాణ ఏర్పాటు చేస్తే ఇలాంటి ప్రమాదాలు తప్పవని అంటే ఇప్పుడు బ్రిటన్‌లో సమైక్యాంధ్ర ఓడిపోయింది అంతే కదా? ’’
‘‘నీకు మునిమాణిక్యం గారి కాంతం బంధువు అవుతారా? ఏమీ లేదు ఆమె కూడా ఇలానే తలా తోకా లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది.’’
‘‘మీ బంధువులంతా నా బంధువులే కదా?’’
‘‘బ్రెగ్జిట్‌కు సమైక్యాంధ్ర తెలంగాణకు కిరణ్‌కుమార్‌రెడ్డికి అసలు సంబంధం ఏముంది?’’
‘‘అలా తేలిగ్గా తీసిపారేయకండి నాకు గుర్తు లేదనుకోకండి. బ్రిటన్ నుండి విడిపోవాలని స్కాడ్‌లాండ్ ఐదువందల ఏళ్ల నుంచి కోరుకుంటోంది. ఓటింగ్ జరిగితే తీరా కలిసే ఉందామనే వాళ్లు మెజారిటీ సాధించారు. అప్పుడు మీరేమన్నారు. సమైక్యాంధ్ర వాదం గెలిచిందని అన్నారు. మరిప్పుడు యూరప్ సమాఖ్య నుంచి బ్రిటన్ బయటకు వెళదామని మెజారిటీ ప్రజలు చెప్పడాన్నిబట్టి తెలంగాణ వాదం గెలిచినట్టే కదా?’’
‘‘విద్యుత్ కొరత లేకపోవడంతో ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ జరిగినా టీవిలో చూస్తూ ఒంటరిగా రాజకీయ శేష జీవితం గడుపుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని మధ్యలో ఎందుకు లాగుతావు’’
‘‘నేను లాగడం ఏమిటి? కావాలంటే విభజన, సమైక్య ఉద్యమ కాలం నాటి పత్రికలు చూడండి తెలంగాణ ప్రభావం దేశం మొత్తం ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద ఉంటుందని చక్కగా రాశారు. ఏమో నండి ప్రపంచాన్ని మేమే శాసిస్తున్నాం అని భావించే అమెరికా మీద కూడా ఈ ప్రభావం ఉందని అనిపిస్తోంది. ఆయనెవరో ట్రంప్ అచ్చం కెసిఆర్‌లానే మా ఉద్యోగాలు మాకే. అమెరికా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు అంటూ అక్కడ స్థిరపడ్డవారిని వణికిస్తున్నారట! పక్కింటి వనజాక్షి వాళ్లింట్లో మాట్లాడుకుంటున్నారు. ట్రంప్ గెలిస్తే వాళ్ల అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేసే చాన్స్ పోతుందని భయపడుతోంది. ట్రంప్‌ను ఓడించేందుకు ఆమె తన ప్రయత్నం తాను చేస్తోంది.’’


‘‘ఉమ్మడి కుటుంబం, సమైక్య వాదం, తెలంగాణ వీటికి మద్దతుగా, వ్యతిరేకంగా గంటల కొద్ది వాదించవచ్చు. అలానే యూరప్ సమైక్యలో ఉండాలా? వద్దా అనే దానికి అనుకూలంగా వ్యతిరేకంగా చెప్పొచ్చు. కాలానికి తగ్గట్టు ప్రజలు తమకు నచ్చిన నిర్ణయం తాము తీసుకుంటారు. దాని మంచి చెడును వారే అనుభవిస్తారు. మాకు నచ్చిందే గొప్ప నిర్ణయం. మా నిర్ణయాన్ని మీరూ ఆమోదించాలి మెజారిటీతో సంబంధం లేదు అంటే చీకటి గదిలో విశ్రాంతి జీవితం గడపాల్సి వస్తుంది.’’
‘‘యూరప్ సమైక్యలోని మిగిలిన దేశాలు కూడా తమ దారి తాము చూసుకుంటాయా?’’


‘‘ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి మనం చిలకా గోరింకల్లా ఉన్నామా? కీచులాడుకుంటున్నామా? అన్న దాన్ని బట్టి మిగిలిన వాళ్లు నిర్ణయం తీసుకుంటారు. ’’
‘‘ప్రపంచీకరణతో ప్రపంచం కుగ్రామంగా కాదు ఏకంగా చిన్న కుటుంబంగా మారిపోయింది. మన కాపురం మీదే యూరప్ సమాఖ్య భవిష్యత్తు ఆధారపడి ఉందన్నమాట ’’

జనాంతికం - బుద్దా మురళి 26-6-2016

19, జూన్ 2016, ఆదివారం

‘మాటకు కట్టుబడవలెను’


‘‘డార్లింగ్ గుడ్ న్యూస్. మన కలలు ఫలిస్తున్నాయి.. ’’
‘‘మీ బంధువులెవరన్నా పోయి మనకు ఆస్తి కలిసొస్తుందా? రజనీకాంత్ సినిమాలోలా ఎప్పుడో ఇంటిని విడిచి వెళ్లిపోయిన మీ నాన్న కోట్ల రూపాయల ఆస్తి నీకే చెందుతుందని విల్లు రాశాడా? ’’
‘‘చిలిపి నీ కెప్పుడూ తమాషాలే. అంత కన్నా సంతోషకరమైన వార్త. నేను తల్లిని కాబోతున్నాను. పార్కుల వెంట, ఐ మ్యాక్స్ థియోటర్ల మధ్య పరుగులు మానేసి ఇక మనం పెళ్లి చేసుకోవాలి’’
‘‘వావ్’’
‘‘అదేంటి డియర్ తెలుగు చానల్స్‌లో వంట తినగానే అన్నట్టు వావ్ అంటున్నావ్. నీకిది సంతోషకరమైన విషయమేనా? కాదా? ’’
‘‘నీ కడుపు పండితే నా మనసు నిండుతుంది కదా? ఆ మాత్రం ఊహించలేవా?’’
‘‘ పెళ్ళేప్పుడు చేసుకుందాం?’’
‘‘ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాను. ఇక ఆ సంగతి మరిచిపో’’
‘‘చాలు డియర్ ఈ ఒక్క మాట చాలు.’’
***
‘‘ఏంటీ సీరియస్‌గా రాసుకుంటున్నావ్’’
‘‘కథ రాస్తున్నాను. ఎలా ఉంది చదువు?
‘‘ కథంటావేమిటి? ఇది వార్త అవుతుంది కానీ’’
‘‘రోజూ జరిగే సంఘటనల నుంచే కథలు పుడతాయి. మీడియా ఊహించి కథలు రాస్తూ వాటిని వార్తా కథనాలు అంటున్నాయి. కథలే వార్తలవుతున్న వేళ, వార్తల నుంచి కథలు పుట్టించడం ఎంత కష్టమో నీకేం తెలుసు.
‘‘సరే ముగింపు రాసేయ్’’
‘‘నువ్వు చెప్పు ముగింపు ఎలా ఉంటుందో?’’
‘‘ఇందులో పెద్దగా ఊహించడానికేముంది. ఆ అమ్మాయిని అలా వదిలేసి మోసం చేసి వెళ్లిపోతాడు అంతే’’
‘‘పెళ్లి చేసుకుంటాను అని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాను అని హీరో అంత స్పష్టంగా చెబితే అనుమానించడం న్యాయమా? హీరో మాట ఇచ్చాడంటే దానికి కట్టుబడి ఉండాల్సిందే.’’
‘‘అంటే హీరో పెళ్లి చేసుకుంటాడా? కథలో పెద్ద విశేషం ఏముంది? చేసుకోకపోతే హీరో మోసం చేస్తాడని నువ్వు ఒప్పుకున్నట్టే కదా?’’
‘‘మళ్లీ అదే మాట్లాడతావు.హీరో మాటంటే మాటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు. నువ్వు హీరోను అనుమానించడం అంటే ఈ దేశ ప్రధానమంత్రిని, వెంకయ్యనాయుడును, చంద్రబాబును, కెసిఆర్‌ను, పవన్ కళ్యాణ్‌ను ఇంకా చాలా మందిని అవమానించినట్టే’’
‘‘వాళ్లకు నీ కథకు సంబంధం ఏమిటి? పెద్ద పెద్ద వాళ్ల పేర్లు చెప్పి నన్ను బ్లాక్‌మెయిల్ చేయాలని చూడకు’’
‘‘సంబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీకి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి చెప్పారా? లేదా? నిన్న మొన్న చాలా మంది కేంద్ర మంత్రులు చెప్పారా? లేదా?’’
‘‘ ఔను చెప్పారు?’’
‘‘రాజకీయ హీరోలు చెప్పిన మాటనే నా కథలో హీరో చెప్పాడు. నా కథలో హీరో చెప్పిన మాటను నువ్వు నమ్మడం లేదు అంటే రాజకీయ హీరోల మాటలను కూడా నమ్మడం లేదన్నట్టే కదా? ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని వెంకయ్య, కాపు రిజర్వేషన్ల హామీకి, నిరుద్యోగ భృతి.. ఇంటింటికో ఉద్యోగం హామీకి కట్టుబడి ఉన్నానని బాబు చెప్పారు కదా? మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల హామీకి కట్టుబడి ఉన్నట్టు నిండు సభలో కెసిఆర్ ప్రకటించారు. విదేశాల నుంచి నల్లధనం సంచుల్లో కార్గోల్లో తీసుకు వచ్చి ఒక్కోక్కరి ఖాతాలో 15లక్షలు గుమ్మరిస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని మోదీ చెప్పారా? లేదా?’’
‘‘కట్టుబడి ఉండడం సరే.. ఇవన్నీ ఎప్పుడు అమలు చేస్తారు?’’
‘‘ఇదే నాకు నచ్చదు. కట్టుబడి ఉన్నామని చెప్పినందుకు సంతోషించాలి కానీ ఎప్పుడు చేస్తారు, ఇప్పుడే చేయాలి అని అడగడం న్యాయమా? ’’
‘‘పెళ్లి చేసుకుంటాను అని ఆ హీరో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు సరే. తొమ్మిది నెలల్లో ప్రసవిస్తుంది కదా? మోసం చేశాడని ఆ అమ్మాయి కేసు పెడితే?’’
‘‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది?’’
‘‘అంటే ?’’
‘‘ఓటుకు నోటు కేసులో మనవాళ్లు బ్రీఫ్డ్‌మీ అని బాబు తనకు మాత్రమే ప్రత్యేకమైన భాషలో మాట్లాడింది రికార్డు అయ్యాక చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంతే’’
‘‘అంటే హీరో అలా అమ్మాయిని మోసం చేయడం సరైనదే అంటావా?’’
‘‘నో కామెంట్’’


‘‘ హీరోకు శిక్ష పడాలా? వద్దా’’
‘‘నా జీవితం తెరిచిన పుస్తకం’’
‘‘అవినీతి సంపాదన గురించి నాకు తెలియదనుకోకు’’
‘‘నేను చూసిన మొదటి సినిమా నిప్పులాంటి మనిషి.. నేనిప్పుడు నిప్పు. నిప్పుకు చెదలు అంటవు. నిప్పును కౌగిలించుకున్నవాడు బతికి బట్టకట్టడు’’
‘‘ప్రజలు, ప్రజాస్వామ్యం అంటే నీకు మరీ అంత చులకనా?’’
‘‘సమాజమే దేవాలయం, ఓటర్లే దేవుళ్లు. ఎన్నికలే జాతర. ప్రభుత్వమే హుండీ. దేశమంటే ఎటిఎం లాంటిది అకౌంట్ ఉన్నవాడు కార్డుతో, ఖాతా లేని వాడు ఎటిఎంను పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళతాడు.’’


‘‘ఒక్క దానికి కూడా సూటిగా సమాధానం చెప్పవా?’’
‘‘మీకు రాజకీయాలు కావాలి. నాకు ప్రజల అభివృద్ధి ముఖ్యం.రోజుకు పాతిక గంటలు కష్టపడతాను’’
‘‘ హీరో మాటకు కట్టుబడి ఉండడం అంటే పెళ్లి చేసుకుంటాడు అనే అనుకోవాలా? దయచేసి అర్ధం చెప్పు. దీని గురించే ఆలోచిస్తే పిచ్చెక్కేట్టుగా ఉంది’’


‘‘ చూడోయ్ ఎన్నోసార్లు ఇంట్లో మీ ఆవిడ బియ్యం నిండుకున్నాయి. పప్పులు నిండుకున్నాయి అని చెప్పి ఉంటుంది కదా?’’
‘‘ మా ఇంట్లోనే కాదు అందరు సామాన్యుల ఇళ్లళ్లో ఇది మామూలే’’
‘‘బియ్యం, పప్పు డబ్బాలు ఖాళీ అయితే సామాన్య ఇల్లాలే నిండుకున్నాయి అంటుంది. ఇల్లాలే సంకేత భాష ఉపయోగిస్తే, దేశాలను రాష్ట్రాలను ఏలే పాలకుల భాషకు మరెన్ని అర్ధాలు ఉండాలి.’’
‘‘ అంటే ప్రత్యేక హోదా, ఇంటికో ఉద్యోగం, 12 శాతం రిజర్వేషన్లు అన్నీ ఉట్టి మాటలేనా? ’’
‘‘మళ్లీ మొదటికొచ్చావు. కట్టుబడి ఉన్నామని అంత స్పష్టంగా చెబుతుంటే నీకు సందేహం ఎందుకు? ’’
‘‘ ఇంతకూ ఆ హీరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? లేకపోతే చట్టం అతన్ని శిక్షిస్తుందా?’’


‘‘నో కామెంట్. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రజాస్వామ్యంలో విలువలు ముఖ్యం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’’

జనాంతికం - బుద్దా మురళి19-6-2016

-

12, జూన్ 2016, ఆదివారం

మేధావికి కోపమొచ్చింది!

‘‘పినాకిని వాళ్ల అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది. హైదరాబాద్‌లో మూడు వందల గజాల ప్లాట్, పాతిక లక్షల కట్నం ఇస్తున్నారట!’’
‘‘అమ్మాయి అందవికారంగా ఉంటుందా?

 ‘‘ఎందుకలా అడిగావు ?’’

‘‘ కాలం మారి చాలా కాలం అయింది. అమ్మాయిలే అబ్బాయిలను రిజెక్ట్ చేస్తున్నారు. మన కాలంలో అబ్బాయి కట్నం వద్దంటే ఏదో లోపం అనుకునే వాళ్లు. ఇప్పుడు అమ్మాయికి భారీ కట్నం ఇస్తే ఏదో లోపం అనుకుంటున్నారు.’’

‘‘మళ్లీ కన్యాశుల్కం వస్తుందేమో’’
‘‘మేధావుల చర్చ విసుగేసి సినిమా చానల్స్‌లో కన్యాశుల్కం మళ్లీ వస్తే చూశా’’
‘‘చిన్నపిల్లలూ ,మేధావులు ఒక్కటే వారికి ఎప్పుడూ తృప్తి ఉండదు. స్థిరంగా ఉండరు. వారికేం కావాలో వారికే తెలియదు’’
‘‘మేధావులంటే నీకు చాలా చిన్నచూపు. వారి అసంతృప్తిపై ఏమంటావు?’’
‘‘ప్రత్యేక హోదా కోసం వీరోచితంగా, సాహసోపేతంగా ఒక పూట దీక్ష చేసిన ఆంధ్ర మేధావి గురించా?’’
‘‘కాదు’’


‘‘మేధావుల్లో అనేక రంగులున్నాయి. అనేక దారులు ఉన్నాయి . లెఫ్ట్ మేధావులు , రైట్ మేధావులు . ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అంటే రోజుకు రెండుసార్లు ఆకస్మిక తనిఖీలు చేయాలి. గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఫైళ్లను స్వయంగా పరిశీలించాలని, అలా ఐతేనే వాళ్లు పని చేస్తున్నట్టు అని మన నమ్మకం. గవర్నమెంట్ ఆఫీసులో ఇన్ని ఫైళ్లు పెరుకుపోతే ప్రధానమంత్రి విదేశీ పర్యటనలు చేయడం ఏమిటని మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఏదో ప్రచారం కోసం వీటిలో వాళ్లు వేళ్లు,కాళ్లు,చేతులు,చీపుర్లు పెడతారు. అంతే తప్ప వారి పని ఇది కాదు. ప్రధానమంత్రి అంటే ఏమన్నా గవర్నమెంట్ ఆఫీసులో క్లర్కా 10 నుంచి సాయంత్రం ఐదు వరకు ఉండేందుకు. దేశాలు తిరిగితే ఆయా దేశాలతో సంబంధాలు బలపడతాయి. ఆకస్మిక తనిఖీలతో ప్రచారం తప్ప ఏమొస్తుంది. ప్రధాని పర్యటనలను మేధావులు ఎందుకు విమర్శిస్తారో వారికే తెలియాలి..’’


‘‘నేను తెలంగాణ మేధావుల గురించి అడుగుతున్నాను’’
‘‘పవన్, మహేశ్, ఎన్టీఆర్‌ల సినిమాలు చూస్తావా? తాము చూస్తున్నది వాస్తవ ప్రపంచం కాదు. సినిమా తెర అనే విషయం మరిచిపోయి హీరోలు చేసేదంతా నిజమేనని, హీరో తలుచుకుంటే ప్రపంచంలో సాధ్యం కానిది ఏదీ ఉండదని అభిమానులు అనుకుంటారు. ఐతే సినిమా చూసేది పిచ్చోళ్లేమీ కాదు.’’
‘‘ రాజకీయాల గురించి అడుగుతుంటే సిల్లీగా సినిమాల గురించి చెబుతున్నావు’’
‘‘రెండూ ఒకటే. ‘రాజకీయం సినిమానే. నేను నటుణ్ని’అని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో సగర్వంగా ప్రకటించారు. తెలుగునాట సినిమాలు రాజకీయాలు అద్వైతంలా ఒకటే. ’’


‘‘కెసిఆర్‌ను ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు కదా దాని గురించి చెప్పు’’
‘‘మహాత్మాగాంధీనే స్వాతంత్య్ర పోరాట కాలంలో విమర్శించారు. ఇప్పటికీ విమర్శిస్తున్నారు. హిందూమతంలో దైవాన్ని విమర్శించే నాస్తికత్వం కూడా భాగమే. చార్వాకుల గురించి తెలిసిందే కదా? కెసిఆర్, కోదండరామ్ ఎవరూ విమర్శలకు ఎవరూ అతీతులు కారు. విమర్శలో సారం ఏంటీ? అనేది ముఖ్యం.’’


‘‘సరే అదే చెప్పమంటున్నాను. విమర్శలో సారం ఉందా? లేదా?’’
‘‘అప్పటి వరకు అమ్మాయిలతో సముద్ర స్నానాలు చేస్తున్న హీరో ప్రపంచం ప్రమాదంలో పడిందనే సమాచారం అందగానే 007 అంటూ రంగంలోకి దిగి ప్రపంచాన్ని రక్షిస్తాడు. ఇది ఇంగ్లీష్ సినిమాల కథ. అదే తెలుగులోకి వస్తే దేశానికి, రాష్ట్రానికి, కుటుంబానికి, హీరోయిన్‌కు ఎంత కష్టం వచ్చినా మహేశ్‌బాబు వచ్చి రక్షిస్తాడు. ఎంతటి క్లిష్టపరిస్థితిలోనైనా సినిమా హాలులోని ప్రేక్షకుడు చలించడు. హీరో వచ్చి రక్షిస్తాడనే పూర్తి భరోసాతో మల్టీఫ్లెక్స్‌లో కాలుమీద కాలు వేసుకొని సినిమాలో నిమగ్నమవుతాడు.’’
‘‘మళ్లీ నువ్వు సినిమాల్లోకి వెళ్లావు.’’
‘‘నువ్వడిగిందే నేను చెబుతున్నాను. నీకు విషయం అర్ధం కావడం లేదు. కోదండరామ్ మాటలను బట్టి కెసిఆర్‌ను విమర్శించాడని నువ్వనుకుంటున్నావ్..  కానీ ఆలోచిస్తే  కెసిఆర్ ను  తెలంగాణా హీరో గా భావిస్తున్నారని   నాకనిపిస్తోంది ..  టాలీవుడ్ హీరో చిటికెలో సమస్యలు పరిష్కరిస్తున్నప్పుడు తెలంగాణా హీరో రెండేళ్లలో తెలంగాణా సమస్యలు పరిష్కరించాలేరా ?  అనేది వారి విమర్శలోని ప్రశ్న కావచ్చు .  హీరోపై అభిమాని పెట్టుకున్నన్ని ఆశలు తెలంగాణ ప్రభుత్వంపై పెట్టుకున్నారని అర్థమవుతుంది.’’
‘‘ఎలా?’’
‘‘సాధారణ తెలంగాణ ప్రజలకు వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి కరువు పోతుందని, నాలుగైదేళ్లలో ప్రాజెక్టులు పూర్తవుతాయని, మూడేళ్లలో మిషన్ భగీరథ పూర్తయి ఇంటింటికి నీళ్లు వస్తాయని అనుకుంటున్నారు. కానీ సినిమాలో హీరో క్షణాల్లో అన్ని సమస్యలు పరిష్కరించాలని అభిమాని కోరుకున్నట్టు తక్షణం తెలంగాణ సర్వ సమస్యలను కెసిఆర్ పరిష్కరించేస్తారని  అనుకున్నారేమో’’
‘‘సూటిగా చెప్పు’’


‘‘ఎన్టీఆర్ తొలిసారి సిఎం అయినప్పుడు ఒక  అద్భుత ప్రయోగం చేయడానికి ప్రయత్నించారు. అప్పుడే పుట్టిన కొందరు పసిపిల్లలను తీసుకు వచ్చి ఈ మనుషులకు దూరంగా పెంచి, నాయకులను చేయాలనుకున్నారు. వారికి కుటుంబం ఉండదు కాబట్టి సమాజం కోసం పని చేసే నాయకులుగా మారుతారు అని చెప్పారు. ఇంట్లో అల్లుళ్ల పోరుతో ప్రయోగాన్ని అటకెక్కించారు. కుటుంబం గురించి కాకుండా కేవలం సమాజం గురించే ఆలోచించే పౌరులను ప్రత్యేకంగా ఉత్పత్తి చేయాలనుకోవడం బ్రహ్మాండమైన ఆలోచన కదా? మావోయిస్టులు సైతం ఇలానే ఆచరణ సాధ్యం కాని కలలు కంటుంటారు. పాఠ్యపుస్తకాల్లో ఉన్న రాజకీయ సిద్ధాంతాలు ప్రంపంచంలో ఎక్కడా ఆచరణలో కనిపించవు. గద్దర్ గొప్ప గాయకుడు కానీ నాయకుడు కాలేక పోయారు. ఎన్టీఆర్ మహానటునిగా పూజలందుకున్నా నాయకునిగా నిలదొక్కుకోలేదు. రెండుసార్లు వెన్నుపోటు పాలయ్యారు. మేధావి వేరు రాజకీయ నాయకుడు వేరు. ఐన్‌స్టిన్ లాంటి ప్రపంచలోనే మేటి మేధావిని పిలిచి పదవి ఇస్తామంటే నేను పాలనకు పనికిరాను అని తిరస్కరించారు.’’
‘‘ఇంతకూ ఎవరిది తప్పో? ఎవరిది ఒప్పో చెప్పనే లేదు’’
‘‘కోదండరామ్ దృష్టిలో కోదండరామ్‌ది కరెక్ట్ కెసిఆర్‌ది తప్పు. కెసిఆర్ దృష్టిలో కెసిఆర్‌ది కరెక్ట్ కోదండరామ్‌ది తప్పు. ఎవరి పని వాళ్లు చేస్తారు. మన పని మనం చేద్దాం’’

-జనాంతికం - బుద్దా మురళి (12-6-2016)

5, జూన్ 2016, ఆదివారం

తాతా మనవడు - లోక కళ్యాణం

‘‘సాటి మనిషిలోని మేధస్సును మనం ఒప్పుకోం. మేధావులందరూ ఎప్పుడో ఒకప్పుడు పిచ్చివాళ్లుగా ముద్ర పడిన వారే.’’
‘‘ఈ రోజుల్లో మేధావి అని పిలిస్తే సిగ్గుపడాలి కానీ, ఇంత బాధెందుకోయ్’’
‘‘నా బాధ లోకం గురించి. మేధావుల మాటలను తేలిగ్గా తీసుకునే సమాజం గురించి’’
‘‘అంత ఇదై పోవలసిన అవసరం లేదు. ఐన్‌స్టీన్ లాంటి మహా మహా మేధావులనే పిచ్చి వాళ్లను చూసినట్టు చూశారు. కొందరికైతే ఉరిశిక్ష వేశారు. రాళ్లతో కొట్టారు. దేశ బహిష్కరణ శిక్ష విధించారు.?’’
‘‘నా సంగతి కాదు. ఒక మాట చెప్పు. అమెరికా వెళ్లి వచ్చిన వాడు అక్కడి సంగతులు చెబుతుంటే నువ్వు అమెరికా వెళ్లలేదు కాబట్టి అసలు అమెరికా అనే దేశమే లేదు అని వాదిస్తే ఎలా ఉంటుంది’’
‘‘ చీ..చీ.. అలా ఎందుకు వాదిస్తాను. అమెరికాను కనిపెట్టింది నేనే, అని ఎవడైనా చెబితే వ్యతిరేకిస్తా కానీ అమెరికా లేదని నేనెందుకంటాను?’’
‘‘ నేనూ అదే చెబుతున్నాను. ఒక విషయం మనకు తెలియదనుకో ఇక ప్రపంచంలో ఎవరికీ తెలియదు అనుకుంటే ఎలా? తెలిసిన వారి తెలివిని మెచ్చుకోవాలి. మనుషుల్లో ఇంత సంకుచితత్వం ఏంటోయ్? ’’
‘‘ ఇంతకూ ఏమైంది? ’’
‘‘అభిమన్యుడు తెలుసుకదా? తల్లి కడుపులో ఉండగానే యుద్ధ తంత్రం తెలుసుకున్నాడు. పద్మవ్యూహంలోకి ప్రవేశించడం నేర్చుకున్నాడు.’’
‘‘ఔను మహాభారతంలో ఉంది. అనుమానం ఎందుకు? ’’
‘‘ అష్టావక్రుడి గురించి చదివే ఉంటావు. తన తండ్రి పాండిత్యాన్ని తల్లి కడుపులో ఉండగానే గ్రహించి తప్పును ఎత్తి చూపుతాడు. తండ్రికి ఆగ్రహం కలిగి అష్ట వంకరలతో అష్టావక్రునిగా పుట్టమని శపిస్తాడు. తల్లి గర్భంలో ఉండగానే అంత తెలివి ఉన్నందుకు సంతోషించాలి కానీ ఇలా శపించడం ధర్మమా? ’’
‘‘అస్సలు కానే కాదు.. అయితే పురాణాల్లో ప్రతి శాపానికి ఓ కారణం ఉంటుంది. శాపలన్నీ లోక కళ్యాణం కోసమే. ఐనా అప్పుడెప్పుడో పురాణాల కాలంలో జరిగిన దానికి ఇప్పుడు బాధపడుతున్నావంటే నువ్వు రోజు రోజుకు చాలా సెన్సిటివ్ అవుతున్నావోయ్’’
‘‘ఆనాటి సంగతికి కాదు ఈనాటి బాలమేధావుల విషయంలో సమాజం చిన్నచూపు చూడడం బాధేస్తోంది. ఏమైందో చెప్పి నీ బాధను కొనసాగించు’’
‘‘పెదబాబుకు ప్రధానమంత్రి పదవి చేపట్టే చాన్స్ వస్తే, కొద్ది నెలల టెంపరరీ ఉద్యోగం ప్రధానమంత్రి పదవి కన్నా కొన్ని ఏళ్ల టెంపరరీ ఉద్యోగం ముఖ్యమంత్రి పదవే లాభసాటి అని చినబాబు సలహా ఇచ్చారు. ’’
‘‘వావ్ ఎంత రాజకీయ పరిజ్ఞానం. పొలిటికల్ సైన్స్ స్టూడెంటా? ’’
‘‘కాదు కామర్స్ స్టూడెంట్?’’
‘‘అందుకేనా ఏది లాభసాటో చక్కగా చెప్పారు’’
‘‘చెప్పేది పూర్తిగా విను. ఎటూ తేల్చుకోలేక ఎంఎ ఎకనామిక్స్ పెదబాబు ఆలోచిస్తుంటే, తొమ్మిదో తరగతి పాల బుగ్గల పసి వయసులోనే చినబాబు ఈ చిక్కుముడిని ఈజీగా విప్పేసి పూవు పుట్టగానే పరిమళిస్తుంది అని స్కూల్ తెలుగు టెక్ట్స్ బుక్‌లో చదువుకున్న పాఠాన్ని ఆచరణలో చూపించారు. దానికి మనం మెచ్చుకోవాలా? వద్దా ? అది చెప్పు ముందు. మెచ్చుకునే విశాల హృదయం లేకపోయినా పరవాలేదు పైగా అనుమానిస్తున్నారు. మేధావులందరూ ఇలా అవమానాలపాలైన వారే’’
‘‘చినబాబు నిజంగా చెప్పాడంటారా? మరి అప్పుడేమో బాబుగారు తెలుగు గాలి, తెలుగు నేల, తెలుగు నీళ్లు, తెలుగు గోంగూర, తెలుగు ఆవకాయను వదిలివెళ్లను. తెలుగు వాడి అభివృద్ధి అంతు చూసేంత వరకు ఇక్కడే ఉంటాను అందుకే ప్రధానమంత్రి పదవి త్యాగం చేశానని 96 నుంచి మోదీ హయాం వరకు చెబుతూనే ఉన్నారు. ఇరవై ఏళ్ల తరువాత తూచ్ అది కాదు అసలు నిజం వేరు. జీనియస్ ఐన మా అబ్బాయి లెక్కలేసి చెప్పడంతో నేనా నిర్ణయం తీసుకున్నాను అని చెబుతున్నారు. ఏది అబద్ధమో? తెలియడం లేదు. ఇది నిజమే అంటావా? ఎంఎ కన్నా తొమ్మిదో తరగతికి ఎక్కువ తెలుస్తుందంటావా?’’
‘‘నాకు అదే చిర్రెత్తుకొస్తుంది. మేధావులను ఇలా అనుమానించడం తగదు. పురాణాల మీద నీకు నమ్మకం ఉంది కదా? తల్లి గర్భంలో ఉన్నప్పుడే జ్ఞాన కాంతులు వెదజల్లిన వారు మనకు ఎంత మంది లేదు. అంతెందుకు శ్రీకృష్ణుడు తెలుసు కదా?’’
‘‘ఎందుకు తెలియదు? రాజమండ్రిలో గోదావరి పుష్కరాల్లో నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేశారు నేనూ చూశాను.’’
‘‘ సర్లే ఆ సంగతి ఎందుకు కానీ శ్రీకృష్ణుడు అంతకు ముందు నుంచే ఉన్నారు. శ్రీకృష్ణుడు పసికూనగా ఉన్నప్పుడే ఎంత మంది విలన్లను చంపేశాడు. తెలుగుసినిమాల్లో ముంబై విలన్లను చూసే మనం బెంబేలెత్తిపోతున్నాం. అలాంటిది పసికూనగానే శ్రీకృష్ణుడు సముద్రం మధ్యలో నుంచి వెళ్లడానికి దారి చేశాడు. కాళీయునిపై నృత్యం చేశాడు. లేడీ విలన్ అని జాలి కూడా చూపకుండా కంటి చూపుతో చంపేశాడు. ఇవన్నీ నిజం కాదంటావా? నీలో నాస్తిక భావాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి గమనిస్తున్నాను’’
‘‘అయ్యో అపార్ధం చేసుకోకు ప్రతి రోజు లేవగానే దేవున్ని మొక్కుతాను. ప్రతి శనివారం గుడికి వెళతాను. దైవభక్తి విషయంలో నన్ను అనుమానించకు. వాళ్లంటే దేవుళ్లు కానీ ఈ కాలంలో పిల్లాడు అంత ముందు చూపుతో గొప్ప సలహా ఇవ్వడం, ఈ చారిత్రక సత్యాన్ని కమ్యూనిస్టుల్లా ఈయన పాతికేళ్ల తరువాత బయటపెట్టడం ఎందుకో.... ?’’
‘‘అదే అంటున్నాను. ఉన్నారో లేదో తెలియని దేవుళ్లు చేశారన్నది నమ్ముతాం కళ్ల ముందు మానవ రూపంలో కనిపించే మానవ దేవుళ్ల మేధస్సును ఒప్పుకోం. ’’
‘‘దేవుళ్లు ఏదీ చేసినా లోక కళ్యాణం కోసమే అని ప్రతి పౌరాణిక సినిమా చాటి చెప్పిన సత్యం. చినబాబు సలహా కూడా లోక కళ్యాణం కోసమే. సలహా ఇచ్చి ఉండకపోతే మొత్తం దేశమే ప్రయోగ శాలగా మారేది. సలహాతో దేశాన్ని రక్షించినట్టే కదా ’’
‘‘అంతే .. అంతే..’’
‘‘ఇంకో సందేహం. 96కు ఏడాది ముందే కదా? తాతయ్యను దించేయడానికి ఇదే సరైన సమయం అని మనవడే సలహా ఇచ్చి ఉండొచ్చంటావా?’’
‘‘ఈప్రశ్నకు ఇంకో పాతికేళ్ల తరువాత చినబాబు సమాధానం చెబుతారు’’
బుద్దా మురళి (జనాంతికం 5-6-2016)

2, జూన్ 2016, గురువారం

తెలంగాణా జైత్ర యాత్ర

‘‘తెలంగాణ సాధించామని సంబరపడుతున్నారు. ఈ సంబరాలు ఎక్కువ రోజులు ఉండవు. ఆరునెలలు గడిస్తే కెసిఆర్‌పై తెలంగాణ ప్రజలు తిరగబడతారు, తిరిగి ఆంధ్రలో కలిపేయమని ఉద్యమిస్తారు.’’ తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఉమ్మడి రాష్ట్రం మంత్రిగా ఉన్న టిజి వెంకటేశ్ చెప్పిన మాటలివి. ఆయన కోరుకున్న తెలంగాణ అది. ఇటీవల ఒక టీవి చానల్‌లో నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు లైవ్‌లో మాట్లాడుతుంటే ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి ఫోన్ చేసి ‘‘సార్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడం మా నాయకుల వల్ల కాదు. కెసిఆర్ ప్రయత్నిస్తే ఆంధ్రకు ప్రత్యేక హోదా సాధ్యం అవుతుంది. దయచేసి మీరీ ప్రయత్నం చేయాలి’’ అని అభ్యర్థించారు. ఉద్యమ కాలంలో మీడియాలో టిజి వెంకటేశ్ పేరు ఎక్కువగా వినిపించేది. ఇప్పుడాయన రాజకీయంగా తెరమరుగయ్యారు.


ప్రత్యేక హోదా కోసం ఎవరు ప్రయత్నించినా సాధ్యం కాదు. కానీ ఒక రాష్ట్రం పని చేస్తున్న తీరుపై చివరకు ఆ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన రాష్ట్ర ప్రజల్లో సైతం ఇలాంటి నమ్మకం కలిగిందంటే అది తెలంగాణ సాధించిన విజయమే. ఏ ప్రభుత్వం అయినా ప్రజల విశ్వాసాన్ని పొందడం కన్నా మించిన విజయం ఉండదు. తెలంగాణలోనే కాకుండా ఆంధ్రలోనూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని చూరగొందనేందుకు ఇదే నిదర్శనం. ఈ రెండు సంఘటనలకు మధ్య రెండేళ్ల కాలం ఉంది. తెలంగాణ సాధించిన అభివృద్ధి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజల్లో కలిగించిన విశ్వాసం కనిపిస్తోంది. తెలంగాణ ప్రజల్లోనే కాకుండా తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్వహించిన ఆంధ్ర ప్రదేశ్‌లో సైతం తెలంగాణ ప్రభుత్వం పట్ల సానుకూల ధోరణి ఏర్పడింది. ఒక వ్యక్తి టీవిలో మాట్లాడిన దాన్ని అందరి అభిప్రాయంగా భావించలేం నిజమే. కానీ హైదరాబాద్ జనాభాలో మూడొంతుల మందిమి మేమే, 60లక్షల జనాభాలో 50 లక్షల మంది మావారే అంటూ ఆంధ్ర నాయకులు ఉద్యమ కాలంలో లెక్కలు చెబుతూ వచ్చారు. అలాంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార పక్షం రికార్డు స్థాయిలో 99 డివిజన్లలో విజయం సాధించడం అంటే రెండేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని టిఆర్‌ఎస్ సాధించిందనేందుకు బలమైన ఉదాహరణ.
ఆవిర్భవించిన ఆరునెలల్లో తెలంగాణ కుక్కలు చింపిన విస్తరి అవుతుందని నమ్మిన వాళ్లు, కావాలని కోరుకున్న వారు లెక్కలేనంత మంది ఉన్నారు. టిజి వెంకటేశ్ లాంటి ఒకరిద్దరు తమ మనసులోని మాట బయటకు చెప్పారు. అలా బయటకు చెప్పని రాజకీయ నాయకులు, మేధావులు, సినిమా పెద్దలు, అన్ని రంగాల్లోనూ లెక్కలేనంత మంది ఉన్నారు. ‘మీకు పాలించడం చాతకాదు, మీకు తినడం నేర్పింది మేమే. సంస్కృతి నేర్పింది మేమే’ అని ఒక ఆంధ్ర ఎంపినే ఉద్యమ కాలంలో బహిరంగంగా విమర్శించారు. ఉద్యమ నేతగా కెసిఆర్ లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షుసులే అన్నట్టు ఆంధ్రలంతా తెలంగాణ వ్యతిరేకులే అని విమర్శించినా, తెలంగాణ ఆవిర్భవించిన తరువాత మీ కాలుకు ముల్లు గుచ్చుకుంటే కంటితో తీస్తాను అని భరోసా ఇచ్చారు. ఉద్యమ కాలంలో అటు ఇటు రెండు వైపుల నుంచి పరుష వాఖ్యలు సహజమే. ఆంధ్రలో కలిపేయమని తెలంగాణ ప్రజలే ఉద్యమిస్తారని గట్టిగా నమ్మిన ఆంధ్ర నాయకుల మాటలు ఎలా ఉన్నా, తెలంగాణ ఆవిర్భవించిన తరువాత పోరాడి సాధించుకున్న తెలంగాణ వారిని సైతం ఒక విధమైన అనుమానం వెంటాడేది. తెలంగాణ ప్రయోగం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే విఫలం అవుతుందా? అనే అనుమానం ఎదో మూల మెదడును తొలిచేది. శాపనార్థాలను, విమర్శలను, భయాలను ఆందోళనలను,అనుమానాలను అన్నింటిని పటాపంచలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం విజయవంతమైన పాలన సాగించింది.

 కాళ్లు కడిగిన రోజే కాపురం చేసే తీరు తెలుస్తుంది అన్నట్టు మొదటి రెండేళ్లు దేశం దృష్టిని ఆకట్టుకునే విధంగా పాలన సాగించిన తెలంగాణ దేశంలో తమకు తిరుగు లేదని నిరూపించుకుంటోంది.
తెలంగాణ అవసరాలు ఏమిటో సరిగ్గా గుర్తించిన ప్రభుత్వం ఆ దిశలోనే రెండేళ్ల పాలన సాగించింది. ఆత్మగౌరవ ఉద్యమం, స్వయం పాలన కోసం సాగించిన ఉద్యమం, అవమానం, వివక్షపై తిరుగుబాటు, సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమం అంటూ తెలంగాణ ఉద్యమాన్ని ఎవరే కోణంలో చూపినా, ఉద్యమంలో ఎవరు ఏ కారణంతో పాల్గొన్నా సాధించిన తెలంగాణ అభివృద్ధి పథంవైపు పయనిస్తేనే ఉద్యమానికి సార్థకత. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి సురక్షితమైన మంచినీటి అందించే పథకానికి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇచ్చింది. కోటి ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రాజెక్టులకు ఏటా 25వేల కోట్లు కేటాయిస్తోంది. మిషన్ కాకతీయ విజయవంతం అయితే గ్రామాల స్వరూపం మారుతుంది. ఈ పథకాలు విజయవంతంగా అమలు చేసే దిశలో ప్రభుత్వం సరైన అడుగులే వేస్తోంది అని ఉప ఎన్నికల్లో ప్రజలే తీర్పు ఇచ్చారు. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరోవైపు తెలంగాణ భవిష్యత్తును తీర్చి దిద్దే విధంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కోటి ఎకరాలకు సాగునీరు వంటి పథకాలు చేపట్టడం వల్ల తెలంగాణ ప్రజల్లో ఎప్పుడూ లేని విధంగా ఆశావాహ దృక్ఫథం కనిపిస్తోంది. వరుసగా రెండేళ్ల కరువు మినహాయిస్తే తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా పెద్ద సమస్యలు అంటూ ఏమీ రాలేదు.


పాలనలో కొత్త పుంతలు తొక్కుతున్న ప్రభుత్వం రాజకీయంగానూ కొత్త సంప్రదాయాలను నెలకొల్పితే బాగుండేది అనేది కొందరి అభిప్రాయం. టిఆర్‌ఎస్ మంత్రివర్గంలో ఉన్న దాదాపు సగం మంది సమైక్యవాదం వినిపించిన వారు, సమైక్యవాద పార్టీ కోసం పని చేసిన వారున్నారు. చంద్రబాబుతో పాటు విభజనను అడ్డుకోవడానికి బెంగాల్ వెళ్లి మమతను కలిసిన వారూ ఉన్నారు. సాధారణ ఎన్నికల్లో టిడిపిలో ఉండి తరువాత టిఆర్‌ఎస్‌లో చేరిన వారూ ఉన్నారు. ఇలాంటి వారు ఎవరూ వద్దని పార్టీ మడికట్టుకుని ఉంటే తెలంగాణ విఫల ప్రయోగంగా మిగిలిపోయి ఉండేది. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారు నవ్వుకునే విధంగా ఉండేది. దేశంలోని బంగారాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టి దేశం దివాళా తీసిన సమయంలో పివి నరసింహారావు ప్రధానమంత్రి పదవి చేపట్టారు. మైనారిటీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి జార్ఖండ్ ఎంపిలను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకున్నారు. ఇది నైతికమా అనైతికమా అంటే కచ్చితంగా అనైతికమే అంటారు. నైతికతకు కట్టుబడి మడికట్టుకుని పివి కూర్చొని ఉంటే బంగారం తాకట్టు పెట్టే దశ నుంచి విదేశాలను అడుక్కునే దశకు చేరుకుని ఉండేది దేశం. కానీ పివి అలా చేయడం వల్ల ఆర్థిక సంస్కరణలు అమలు చేయడం వల్ల దేశం ఈరోజు ప్రపంచంలోనే ఒక బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. రాజ్యాన్ని కాపాడుకోవడం రాజు తొలి ధర్మం. 14ఏళ్లు నాతో పాటు ఉద్యమం చేసిన వారే పార్టీలో ఉండాలి, వారికే టికెట్లు అని కెసిఆర్ మడికట్టుకుని ఉంటే పార్టీ అధికారంలోకి వచ్చేదే కాదు.


ఏర్పడితే ఎంత అద్భుతంగా పాలించుకోవచ్చు, రాష్ట్రాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చునో చెప్పిన కెసిఆర్ అధికారంలోకి వస్తేనే వాటిని అమలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అందుకే ఎవరు పార్టీలో చేరారు, ఎవరు పార్టీ మారారు అంటూ ఎవరెన్ని విశే్లషణలు చేసినా సాధారణ తెలంగాణ ప్రజలు మాత్రం ఎన్నికల ఫలితాల రూపంలో ప్రభుత్వం సరైన దారిలోనే వెళుతోందని చెబుతున్నారు. విడిపి అసోసియేట్స్ ఇటీవల దేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రులపై జరిపిన సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచారు. తెలంగాణ పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం అభినందనల్లో ముంచెత్తారు. టిఆర్‌ఎస్‌కు సాధారణ మెజారిటీ కన్నా కేవలం మూడు సీట్లు ఎక్కువ వచ్చాయి. శాసన మండలి ఎన్నికల సమయంలో టిడిపి నాయకత్వం కొందరు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించింది. ఓటుకు నోటు వ్యవహారంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండకపోయి ఉంటే ఐదారుగురు ఎమ్మెల్యేలను టిడిపి తమవైపుతిప్పుకుని ఉండేది. ప్రభుత్వం ఇరకాటంలో పడేది. పాలించడమే కాదు రాజకీయమూ తెలుసు అని తెలంగాణను అస్థిరపరచాలని చూసిన వారి ఎత్తుగడను తిప్పికొట్టడమే కాకుండా ఏడాది తిరిగే సరికల్లా వారికి అస్థిత్వమే లేకుండా చేయడంలో రాజకీయంగా టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది.


తెలంగాణ ఆవిర్భవించినా, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినా, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలు మావే అన్నట్టుగా కొందరి వైఖరి ఉండేది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలోనే ఏ పార్టీకి లేనంత మెజారిటీ టిఆర్‌ఎస్‌కు లభించింది. పాలేరు ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. తెలంగాణలో టిఆర్‌ఎస్ జైత్ర యాత్ర హైదరాబాద్, పాలేరుతో సంపూర్ణం అయింది. సాధారణంగా ఎంత గొప్ప ప్రజాదరణ ఉన్న నాయకుడైనా అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది రెండేళ్లు గడిచిన తరువాత ప్రజల్లో కొంత వ్యతిరేకత ప్రారంభం అవుతుంది. నరేంద్ర మోదీ విషయంలో సైతం అదే జరిగింది. కానీ చిత్రంగా తెలంగాణలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ కాలంలో కన్నా, సాధారణ ఎన్నికల సమయంలో కన్నా అధికారంలోకి వచ్చిన తరువాత టిఆర్‌ఎస్ బలం మరింతగా పెరిగింది. ప్రజల్లో టిఆర్‌ఎస్ పట్ల విశ్వాసం పెరిగింది. అనేక రాష్ట్రాల వారున్న గ్రేటర్‌లో ఘన విజయమే దీనికి నిదర్శనం.


గతంలో కనీసం డిపాజిట్ తెచ్చుకునే స్థితిలో కూడా లేని నారాయణఖేడ్, పాలేరు వంటి నియోజక వర్గాల్లో సానుభూతి పవనాలకు ఎదురొడ్డి ఘన విజయం సాధించింది. టిఆర్‌ఎస్ ఫక్తు ఒక రాజకీయ పార్టీనే అని కెసిఆర్ ప్రకటించినా, ఒక రాజకీయ పార్టీగానే విపక్షాలు టిఆర్‌ఎస్‌ను విమర్శించినా తెలంగాణ ప్రజలు మాత్రం అలా భావించడం లేదు. అలా భావించి ఉంటే ఉప ఎన్నికలను రెండు రాజకీయ పార్టీల మధ్య పోటీగా ప్రజలు చూసి ఉండేవారు. అలా చూసి ఉంటే టిఆర్‌ఎస్‌కు ఈ స్థాయిలో విజయం లభించి ఉండేది కాదు. తెలంగాణ విజయాన్ని తెలంగాణ ప్రజలు తమ విజయంగా భావిస్తున్నారు. మా రాష్ట్రం మా పాలన, మా ప్రభుత్వం అనే బలమైన భావన ప్రజల్లో కలిగించడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం విజయం సాధించింది. ప్రభుత్వం పట్ల ఆదే స్థాయి నమ్మకం తెలంగాణలో స్థిరపడిన ఇతర రాష్ట్రాల వారిలో సైతం కలిగించడంలో ప్రభుత్వం విజయం సాధించింది. రెండేళ్ల పాలన ముగిసింది. రాబోయే రోజులు చెప్పిన మాటలు వేగంగా ఆచరణలో చూపాల్సిన కాలం. తాను చేపట్టిన పథకాల అమలే తెలంగాణ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష.- బుద్దా మురళి (2-6-2016 ఎడిట్ పేజి )
తెలంగాణా జైత్ర యాత్ర