29, జనవరి 2018, సోమవారం

బసంత్‌లో రాజకీయ చిత్రాలు
తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎన్టీఆర్‌ను తొలిగించేందుకు బసంత్ టాకీస్‌లోనే పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నో సెంటిమెంట్ సినిమాలు తెరపై ప్రదర్శించిన చోటే సజీవ సెంటిమెంట్ సినిమా ప్రదర్శించారు. ఎన్టీఆర్‌ను దించే ఎపిసోడ్‌లో వైస్రాయ్ హోటల్‌కు లభించినంత గుర్తింపు కీలక పరిణామాలకు వేదికైనా ఇతర ప్రాంతాలకు లభించలేదు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎన్టీఆర్‌ను తొలిగిస్తూ ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ బసంత్ టాకీస్‌లో జరిగిన సమావేశంలోనే తీర్మానం ప్రవేశపెట్టారు. 

మానవ సంబంధాలు, కుటుంబసభ్యుల మధ్య అనురాగా లు, రాగద్వేషాలు, వెన్నుపో ట్లు, అధికారం, డబ్బు కోసం అయినవారిపై నే కుట్రలు.. కష్టాలు, కన్నీళ్ల సెంటిమెంట్లు ఇవన్నీ సినిమాలో చూస్తూ.. అది తెర అని, మనం చూసేది సినిమా అని తెలిసినా.. ఆ నాటకీయతలో లీనమై ప్రేక్షకులుగా మనం కూడా భావోద్వేగాలకు గురవుతుంటాం. సినిమాలు ప్రదర్శించే టాకీసులో అలాంటి అరుదైన దృశ్యాలు కళ్ళముందు నిజంగానే జరుగుతుంటే.. ప్రేక్షకులుగా సినిమా చూసి న కుర్చీలోనే నిజమైన ఆ సంఘటనలు చూసే అరుదైన అవకాశం కాచిగూడలోని బసంత్ టాకీస్‌లో లభించింది.

కాచిగూడ మెయిన్‌రోడ్‌కు సంబంధం లేకుండా గల్లీలో ఉండే ఈ టాకీసు అప్పట్లో ఇళ్ల మధ్య ఉండేది. ఇప్పుడు ఏకంగా అపార్ట్‌మెంట్‌గా మారిపోయింది. మూగ మనసులు, జీవనతరంగా లు, జీవనజ్యోతి, బలిపీఠం, ఆలుమగలు వంటి సెంటిమెంట్ కథాబలం ఉన్న సినిమాలు ప్రదర్శించిన బసంత్‌లో అంతకన్నా బలమైన సెంటిమెంట్ దృశ్యాలు చోటుచేసుకున్నాయి.
ఆ దుష్టున్ని బంధించండి అని జానపద సినిమాల్లో వృద్ధరా జు ఆదేశించగానే సైనికులు ఆ రాజునే బంధిస్తారు. తన వెనుక జరిగిన కుట్రలను ఆ రాజు అప్పటివరకు గుర్తించడు. గుర్తించినా ఏమీ చేయలేని దశలో గుర్తిస్తాడు. సైన్యాధ్యక్షుని కుట్రలను ఛేదిం చి తల్లిదండ్రులను విడిపించిన యువరాజుల కథలు.జానపద సినిమాల్లో సైన్యాధ్యక్షుల కుట్రలను ఛేదించిన యువరాజుల సినిమాలను మార్నింగ్ షోలుగా, విలన్లను మట్టికురిపించిన హీరోల సినిమాలు రెగ్యులర్ షోలుగా ఎన్నో ప్రదర్శించిన ఈ టాకీసులో అలాంటి సంఘటనలు నిజంగానే జరుగడం విశేషం.

బసంత్ టాకీస్ ఇక నడిచే అవకాశం లేదని గ్రహించాక తెర ను శాశ్వతంగా దించేసి ఫంక్షన్‌హాలుగా మార్చారు. అంతకన్నా లాభసాటి ఆలోచన రాగానే దానిని అపార్ట్‌మెంట్‌గా మార్చారు. బసంత్ టాకీస్ అపార్ట్‌మెంట్‌గా అవతారమెత్తక ముందు కీలకమైన రాజకీయ పరిణామాలు అక్కడ చోటుచేసుకున్నాయి. ఎన్టీ రామారావును అధికారం నుంచి దించేసి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సంఘటన అనగానే అందరికీ వైస్రాయ్ హోటల్ గుర్తుకు వస్తుంది. అంతకన్నా కీలక పరిణామం బసంత్ టాకీస్‌లో చోటుచేసుకున్నది.ఒక కుమారుడు తన తండ్రిని ఒక పదవి నుంచి తొలిగించి బోరున ఏడ్చింది ఇక్కడే. ఒక అల్లుడు మామ పదవిని కైవసం చేసుకొని బావమరిదిని ఓదార్చింది ఇక్కడే.

తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎన్టీఆర్‌ను తొలిగించేందుకు బసంత్ టాకీస్‌లోనే పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నో సెంటిమెంట్ సినిమాలు తెరపై ప్రదర్శించిన చోటే సజీవ సెంటిమెంట్ సినిమా ప్రదర్శించారు. ఎన్టీఆర్‌ను దించే ఎపిసోడ్‌లో వైస్రాయ్ హోటల్‌కు లభించినంత గుర్తింపు కీలక పరిణామాలకు వేదికైనా ఇతర ప్రాంతాలకు లభించలేదు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎన్టీఆర్‌ను తొలిగిస్తూ ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ బసంత్ టాకీస్‌లో జరిగిన సమావేశంలోనే తీర్మానం ప్రవేశపెట్టారు. అక్కడివరకు ఉత్సాహంగా వచ్చిన హరికృష్ణ తన తండ్రిని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలిగిస్తూ తీర్మానం చదివి దుఃఖం ఆపుకోలేకపోయారు. సినిమాలు ప్రదర్శించే వేదికపైనే ఏడ్చేశారు. సినీ ప్రేక్షకులు సీట్లపైన మీడియా, పార్టీ నాయకులు ఇప్పుడు ఏమవుతుంది? హరికృష్ణ దుఃఖం వ ల్ల ఎన్టీఆర్‌ను దించేయాలనే నిర్ణయం మార్చుకుంటారా? ఏం చేస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా చంద్రబాబు హరికృష్ణ భుజంపై చేయివేసి అనునయించారు. బాబు సకాలంలో స్పందించి హరికృష్ణ కన్నీటిని నిలిపివేయించారు. ఆ తర్వాత అశోక గజపతిరాజు, ఇతర నాయకులు అనునయించారు. తం డ్రిని కుమారుడు గద్దెదించినట్టు చరిత్ర పుస్తకాల్లో, సినిమాల్లో కనిపించే దృశ్యం బసంత్‌లో కనిపించింది.

తక్కువ బడ్జెట్‌తో అద్భుత కథాబలంతో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన తూర్పుపడమర, నీడ వంటి సినిమాలు బసంత్‌లో విజయవంతంగా ప్రదర్శించారు.ఇక్కడి నుంచే దాసరి నారాయణరావు రాజకీయ పార్టీ ఏర్పాటుచేయాలనీ ప్రయత్నించారు. అది విడుదలకు నోచుకోని సినిమాగానే మిగిలిపోయింది. చిరంజీవి కన్నా ఓ దశాబ్దకాలం ముందే దాసరి రాజకీయపార్టీ ఏర్పాటుకోసం ప్రయత్నించారు. బసంత్ టాకీస్‌లో దాసరి అభిమాన సంఘాల రాష్ట్ర సమావేశం జరిగింది. అందరి అభిప్రాయాలూ తీసుకొని అక్కడే దాసరి పార్టీ ప్రకటిస్తారని తొలుత సమాచారం ఇచ్చారు. అభిమానులు పార్టీ పెట్టాల్సిందేనని సూచించారు. మాజీ ఎమ్మె ల్యే గోనె ప్రకాశరావు అప్పటికప్పుడు ఏ సామాజికవర్గం ఓట్లు ఎక్కడ ఎన్ని ఉన్నాయి. దాసరి పార్టీ పెడితే ఎన్ని సీట్లు వస్తాయో ఆ టాకీసులోనే మీడియాకు లెక్కలు చెప్పారు. దాసరి అభిమానులకు నివేదిక ఇచ్చారు. పార్టీ ఏర్పాటు చేయలేదు. కానీ అక్కడ మాత్రం ఉత్సాహపూరిత వాతావరణం కనిపించింది. పురజనుల కోరికపై దాసరి పార్టీ ఏర్పాటును కొద్దిరోజులు వాయి దా వేస్తున్నారని దాసరి తరపున గోనె మీడియాకు లీకేజీ ఇచ్చా రు. కానీ మీడియా మాత్రం దాసరి పార్టీ విడుదల కావడం లేద ని రాశాయి. దాసరి రాజకీయ సినిమా విడుదల కాకుండానే దాసరి జీవితం ముగిసింది. బసంత్ టాకీస్ కనుమరుగైంది. అప్పుడప్పుడు హిందీ సినిమాలు ప్రదర్శించినా బసంత్‌లో ఎక్కువగా తెలుగు సినిమాలు ప్రదర్శించేవారు.
 
సినిమా టాకీస్‌లో జనం అంతంత మాత్రమే కాగా సైకిల్‌స్టాండ్‌లో సైకిళ్ల సంఖ్య ఇంకా తక్కువగా ఉండేది. టాకీసుకు పక్కనే వెదురుబొంగులు అమ్మేవారు, అనధికారికంగా సైకిల్‌స్టాండ్ నిర్వహించేవారు. టాకీసులోని సైకిల్ స్టాండ్‌కన్నా తక్కువధర, టికెట్ దొరక్కపోతే రిటన్ తీసుకువెళ్ళవచ్చుననే సౌకర్యం కల్పించడంతో ఎక్కువమంది అనధికార స్టాండ్‌లోనే సైకిల్ పార్క్ చేసేవారు. ఇప్పుడంటే ఓ కుటుంబం సినిమాకు వెళ్లాలంటే ఓ వెయ్యి రూపాయలు కావాలి. ఆ రోజుల్లో ఓ ఐదు రూపాయలుంటే చాలు సైకిల్ స్టాండ్, ఇంటర్‌వెల్ ఖర్చుతో సహా. శోభన్‌బాబుకు సోగ్గాడు అనేది మరో పేరుగా మారిపోయిం ది. ఆ సినిమా విడుదల సందర్భంగా శోభన్‌బాబు తన సన్నిహితులతో ఈ సినిమా తర్వాత ఈ సినిమా పేరే తనపేరుగా మారిపోతుందని చెప్పారట. దానికి తగ్గట్టుగానే శోభన్‌బాబును అప్పటి నుంచి సోగ్గాడు శోభన్‌బాబు అని పిలిచారు. సోగ్గాడు సినిమా బసంత్‌లో 1975లో 110 రోజులు ఆడింది.శోభన్‌బాబు విజయవంతమైన ఎన్నో సినిమాలు ఇందులో ప్రదర్శించారు. ఇద్దరు అమ్మాయిలు, కన్నవారి కలలు, చక్రవా కం, రాధాకృష్ణ, దీపారాధన, ప్రతీకారం వంటి సినిమాలు బసంత్‌లో విజయవంతంగా ప్రదర్శించారు.

బసంత్ టాకీస్ కు భారీ కటౌట్ లు ఏర్పాటు చేసే వారు . వై యం సీఏ నుంచి కాచిగూడ కు వెళ్లే వారికి ఆ కటౌట్ లు కనువిందు చేసేవి . ఆ ప్రాంతం లో కన్నడ వారు ఎక్కువగా ఉండడం తో అప్పుడప్పుడు ఉదయం పూట కన్నడ సినిమా ప్రదర్శించే వారు .  లవకుశ ,బసంత్ లో ఏడాది పాటు నడిచింది . దేవుడు చేసిన మనుషులు కూడా ఏడాది ప్రదర్శించారు . 
సినిమా చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనూ బసంత్‌కు స్థానం ఉంది. ఎన్నో విజయవంతమైన సినిమాలు ప్రదర్శించిన బసంత్ మారిన పరిస్థితులను తట్టుకోలేక మూతపడి, బసంత్ అపార్ట్‌మెంట్‌గా కొత్తరూపు సంతరించుకున్నది.
-బుద్దా మురళి (జ్ఞాపకాలు నమస్తే తెలంగాణ 29-1-2018)

26, జనవరి 2018, శుక్రవారం

ఏం కోరుకుంటే అదే...‘‘నా పూర్తి పేరు చెబితే మీరు షాక్ అవుతారు? తాటికొండ పాపారావు నా పూర్తి పేరు’’
‘‘తాటికొండ పాపారావు అని తెలుగు టీచర్ అటెండెన్స్ పిలిస్తే, ఎస్ సార్ అంటూ కర్ణ కఠోరంగా నువ్వు బదులివ్వడం ఇప్పటికీ చెవుల్లో గింగురు మంటూనే ఉంది దీంట్లో షాక్ ఏముంది?’’
‘‘మా కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో మా పిల్లలను చూస్తే మీరు షాకవుతారు.’’
‘‘ఒరేయ్ షాకు నువ్వు తెలుగు వెబ్‌సైట్‌లో పని చేస్తున్నావు కదూ? నిజంగా ఇది మాకు షాకేరా? చదువుకునే రోజుల్లో ఏ కొత్త సినిమా విడుదలైనా నీ హడావుడే కనిపించేది. టాకీసులను కడిగి, అలంకరించే వాడివి. నువ్వు ఏనాటికైనా సినిమా హీరోవు అవుతావని అంతా కలలు కన్నాం. నువ్వేంటిరా అ దిక్కుమాలిన షాకింగ్‌ల వెబ్‌సైట్‌లో చేరి విద్యుత్ శాఖలో పనిచేసే లైన్ మెన్‌లా షాకులిస్తూ బతుకుతున్నావ్’’
‘‘కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది. మొన్న రాత్రి పడుకునేప్పుడు మా ఆవిడకు గుడ్‌నైట్ చెప్పడానికి బదులు నీకో షాకింగ్ న్యూస్ నీతోపాటు పడుకుంటున్నది నేనే అని చెప్పాను. మా ఆవిడ తలమీద టపాటపా కొట్టింది. మాటలకు కర్త, కర్మ, క్రియ తప్పనిసరి అన్నట్టు షాకింగ్ వెబ్‌సైట్‌లో పనిచేయడం మొదలు పెట్టాక ప్రతి మాటకు ముందోసారి, వెనకోసారి షాకింగ్ న్యూస్ అనాల్సి వస్తోంది. నా జీవితం షాకింగ్‌లలో కరిగిపోయింది. ’’
‘‘నీ జీవితం నీకే షాకింగ్‌రా’’
‘‘ దశాబ్దాల క్రితం అంతా కలిసి చదువుకున్న మనం ఈరోజు ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందిరా? మనలో అటెండర్ మొదలుకొని, ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వరకు ఉన్నాం. చదివింది ఒకే స్కూల్, ఒకే స్థాయిలో జీవితాన్ని ప్రారంభించిన వాళ్లం అయినా మన స్థితిలో ఎంత తేడాలున్నాయిరా? అచ్చం మినీ ఇండియాలా ఉన్నాం మనం. ఇలా ఎందుకు జరుగుతుందంటావ్’’
‘‘అమెరికా నయా సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారి విధానం, మనిషిని మనిషి దోచుకునే వ్యవస్థ, విప్లవం.’’
‘‘ఒరేయ్ భాస్కర్ పరీక్షల్లో నువ్వు రాసిన సమాధానాలు చూసి నువ్వు ఏదో రాశావు. దానికి మార్కులు వేయాలో వద్దో తేల్చుకోలేక పంతులు జుట్టు పీక్కునే వాడు. ఎదుటివారిని గందరగోళంలో పడేసి ఏదో చెప్పాడు, కానీ ఏంటో అర్థం కావడం లేదు అనుకునేట్టు చేయడంలో నీ స్టైల్ చిన్నప్పటి నుంచి అలానే ఉంది. మారలేదు. కాస్త అర్థం అయ్యేట్టు చెప్పు’’
‘‘చిన్ననాటి మిత్రులు కాబట్టి మీ దగ్గర మనసు విప్పి మాట్లాడుతున్నాను. చదువు ముగియక ముందే అడవి బాట పట్టాను. ఏం సాధించానో తెలియదు. నావే అర్థం కాని మాటలంటే, నా కన్నా అర్థం కాకుండా మాట్లాడే వాళ్లు చాలామంది అడవుల్లో ఉండేవాళ్లు. అడవుల్లో మేం విప్లవాన్ని వండుకుని, విప్లవానే్న తినేవాళ్లం. 30 ఏళ్ల తరువాత ఏం సాధించామని ఆలోచిస్తే కన్నీళ్లు ఆగలేదు. బోరున ఏడ్చి ప్రశాంతంగా ఆలోచించి, జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నాం. మీరంతా గొప్పగా మీరు సంపాదించిన డిగ్రీలు, కట్టుకున్న ఇళ్లు, కొనుక్కున్న ప్లాట్ల గురించి, బ్యాంకు బ్యాలెన్స్‌ల గురించి, అమెరికాలో ఉన్న పిల్లల గురించి చెబుతుంటే, నేనేమో నామీద ఉన్న కేసుల సంఖ్య, కాల్చిన బస్సుల గురించి, చేసిన హత్యల గురించి చెప్పుకోవలసి వచ్చింది.’’
‘‘ఈ దేశం ఎవరికోసం కొందరు గుడిసెల్లో బతుకుతుంటే అంబానీలు 80 అంతస్థుల భవనాల్లో ఉంటారా? ఎవడబ్బ సొత్తు, విప్లవం వర్థిల్లాలి. నా దేశాన్ని నిర్బంధం నుంచి విముక్తి చేస్తాను. మనిషి పుట్టుకతో స్వేచ్ఛా జీవి, ఈ స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు’’
‘‘ఎవర్రా ఆ బుడ్డోడు మన పెద్ద వాళ్ల మీటింగ్‌కు వచ్చి పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు. ’’
‘‘మా అబ్బాయే కాస్త మార్పు ఉంటుందని నేనే తీసుకొచ్చాను. వాడు కడుపులో ఉండగానే మా ఆవిడ నేను జాయింట్‌గా ఐఐటి కలలు కన్నాం . నర్సరీ కన్నా ముందు ప్రెగ్నెన్సీ కోర్సు మొదలు పెడితే అప్పటి నుంచి ఎంసెట్ వరకు చై.నా విద్యాసంస్థల్లోనే చేర్పించాం. పుట్టక ముందు నుంచే వాడి స్వేచ్ఛను హరించామని వాడికి కోపం. ఎంసెట్ తరువాత ఒక్కసారి స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగు పెట్టడంతో, కొత్త వాతావరణానికి అలవాటు పడక పిచ్చిపిచ్చిగా విప్లవం అంటాడు. అంబానీ అంటాడు. ప్రపంచాన్ని మార్చేస్తానంటాడు. డాక్టర్లను కలిస్తే ఈ వయసులో, ఈ కాలంలో ఇది కామన్. దీన్ని చై.నా ఎఫెక్ట్ అంటారు. దీనికి చికిత్స లేదు. ఏదో ఒక రోజు హఠాత్తుగా మామూలు మనిషి అవుతాడని డాక్టర్లు చెప్పారు.’’
‘‘అంతరిక్ష యాత్రీకులు భూమిపై దిగాక ఒకేసారి భూమి వాతావరణంలో బతకలేరు. క్రమంగా అలవాటు చేస్తారు. అలానే కార్పొరేట్ విద్యా సంస్థల్లో పుట్టి పెరిగిన వారిని ఎంసెట్ తరువాత స్వేచ్ఛా జీవితం క్రమంగా అలవాటు చేయాలి.’’
‘‘ఈ దేశంలో 75శాతం సంపద ఒక శాతం మంది సంపన్నుల చేతిలోనే ఉందట! ఇది అన్యాయం కదూ? అందుకే విప్లవం వస్తుందని, రావాలని నేనూ కోరుకుంటున్నాను’’
‘‘ముక్కు మూసుకుని ఇంట్లో కూర్చుంటేనో, అడవి బాటపట్టి బస్సులు తగలబెడితేనో, బోనస్ డబ్బులతో కవితా సంకలనాలు ప్రచురించి మిత్రులకు ఉచితంగా పంచి పెడితేనో, అభిమాన హీరో సినిమా విడుదల రోజున టాకీసులను కడిగి శుభ్రం చేస్తేనే సంపద వాళ్ల చేతిలో వచ్చి పడిపోవడం లేదు. చట్టబద్ధంగా సంపాదిస్తే తప్పేంటి?’’
‘‘ఏరోయ్ సంపన్నులను సమర్ధిస్తున్నావంటే నువ్వు కూడా కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్టున్నావ్’’
‘‘కుక్కను కొట్టినా డబ్బులు రాలుతాయి అంటారు. కొట్టిచూడు కరిస్తే రాబిస్ వ్యాధి వస్తుందేమో కానీ డబ్బులు రాలవు.’’
‘‘ఇంతకూ నువ్వేమంటావు’’
‘‘సంపన్నుడివి కావాలనుకుంటే నీ ఆలోచనలు ఆ దిశగా సాగాలి. డబ్బుతో పని లేదు. ఆబిడ్స్‌లో ఆదివారం రోజు దొరికే పాత పుస్తకాలే నాకు పెన్నిధి అనుకుంటే తప్పు లేదు. సాహిత్య వ్యవసాయం చేస్తూ సంపద పంట పండడం లేదేమిటని దిగులు పడకు. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు నీకేం కావాలో ప్రశాంతంగా ఆలోచించుకుని ఆ మార్గంలో వెళ్లమంటాను. చట్టబద్ధమైనది ఏదీ తప్పు కాదు.’’
-బుద్దా మురళి (జనాంతికం 26-1-2018)

22, జనవరి 2018, సోమవారం

మూగ బోయిన మూకీల కాలం నాటి రాజేశ్వర్ టాకీస్


సినిమా పుట్టక ముందు పుట్టిన టాకీసు అది ...టాకీసు అంటేనే సినిమాలు ప్రదర్శించేది . మరి  సినిమా పుట్టక ముందు టాకీసు ఎలా పుడుతుంది ? పుట్టి ఏం చేస్తుంది ?
నిజమే ఇప్పటి సినిమాలు పుట్టక ముందు మూకీ సినిమాలు ఉండేవి .. మూకీ సినిమాలు ప్రదర్శించే కాలం లోనే రాజేశ్వర్ టాకీస్ పుట్టింది .. మరో తొమ్మిదేళ్ల పాటు ఎలాగోలా నడిస్తే వందేళ్లు పూర్తి చేసుకునేది .  ఓ తరం వారికి జ్ఞాపకాలను మిగిల్చి రాజేశ్వర్ టాకీసు తలుపులు ముసుకు పోయాయి ..

తెలుగు సినిమా వయ సు 87 ఏండ్లు అయి తే అంతకన్నా ఐదేండ్ల పెద్ద వయసులో రాజేశ్వర్ టాకీ సు నిశ్శబ్దంగా కాలగర్భంలో కలిసిపోయింది. 1931లో తొలి తెలుగు సినిమా భక్త ప్రహ్లాద వస్తే, సికింద్రాబాద్‌లో రాజేశ్వర్ టాకీసు 1926లో ప్రారంభమైం ది. రాజేశ్వర్ టాకీసు ప్రారంభమైన ఆరేండ్ల తర్వాత తొలి తెలు గు సినిమా వచ్చింది.ఢిల్లీలో 86 ఏండ్ల రీగల్ టాకీ సు మూతపడితే జాతీయ పత్రికల్లో ప్రత్యేక వార్తా కథనాలు వచ్చాయి. అంతకన్నా పాత టాకీసు రాజేశ్వర్ పత్రికల్లో సింగిల్ కాలం వార్తగా కూడా కనిపించకుండా చరిత్రలో కలిసిపోయింది.
1957లో వచ్చిన సువర్ణ సుందరి సినిమా ఈ టాకీసులో బ్రహ్మాండంగా నడిచిందని అక్కడ పనిచేసిన సిబ్బంది ఇప్పటికీ గర్వంగా చెప్పకుంటారు. అక్కినేని సువర్ణ సుందరి, ఎన్టీఆర్ గులేభకావళి కథ, శోభన్‌బాబు మనుషులు మారాలి, చలం నటించిన సంబరాల రాంబాబు వంటి సినిమాలను సగర్వంగా ప్రదర్శించిన ఈ టాకీసు చివరిదశలో బతుకు పోరాటంలో థర్డ్ గ్రేడ్ చిత్రాలను సైతం ప్రదర్శించింది. మోండా మార్కెట్లో కూరగాయలు కొనుక్కొని ఆనంద్‌భవన్‌లో టిఫిన్ చేసి, రాజేశ్వర్ టాకీసులో సినిమా చూడటం ఒక తరానికి ఓ అలవాటు.
***
ఎన్టీఆర్ రావణుడిగా నటించిన భూకైలాస్ 1958లో మొదటి సారి విడుదల కాగా కొంత కాలం తరువాత రాజేశ్వర్ టాకీసు లో రెండవ సారి విడుదల అయినా జనం కిక్కిరిసి పోయారు . టికెట్ లు అయిపోతే  అలానే క్యూలో కూర్చుంటే డైలాగులు అన్నీ వినిపించేవి . తరువాత షో కు సినిమా చూడడం ఇలాంటి అనుభవాలు అయిదు దశాబ్దాల క్రితం చాలా మందికి నేటికీ తాజాగా ఉన్నాయి ఆ టాకీసు జ్ఞాపకాల్లో
***

మూకీల కాలంలో ప్రారంభమైన రాజేశ్వర్ టాకీస్ మారిన పరిస్థితులను తట్టుకొని నిలబడేందుకు ప్రయత్నించింది. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామని పోస్టర్లతో వెలిగిపోయిన ఆ టాకీసును చూసిన కళ్లతోనే అవేవో రాత్రులు అంటూ బూతు పోస్టర్లను బాధగా చూడాల్సి వచ్చింది ఆ ప్రాంతవాసులు. చివరికి ఆ బూతు సినిమాలు కూడా రాజేశ్వర్ టాకీసును బతికించలేకపోయాయి.
తెలుగు సినిమా చరిత్ర కన్నాముందు చరిత్ర రాజేశ్వర్ టాకీసుది. 1926లో ప్రారంభమైన రాజేశ్వర్ టాకీసులో మూకీ సినిమాలు కూడా ప్రదర్శించారు.

ఒకప్పడు అందమైన బట్టలకు ఖజానా శ్రీ ఆనంద్ క్లాత్ స్టోర్ తంధానా అనే ప్రచార పాట రేడియోలో తెగ వినిపించేది. చందన, బొమ్మన కాలం కన్నాముందు బట్టల వ్యాపారానికి సికింద్రాబాద్ పేరుగాంచిన ప్రాంతం. జెక్సానీ రామ చంద్రయ్య బట్టల దు కాణం, ఆనంద్ క్లాత్‌స్టోర్‌ను దాటుకొని ముందుకువెళ్లాక శ్రీరామ బుక్‌డిపో తర్వాత దర్శనమిస్తుంది రాజేశ్వర్ టాకీస్.
నిలబడి టిఫిన్ తినడం అలవాటయ్యాక కూర్చొని తినే ఆనంద్ భవన్‌ను చిన్నచూపు చూశారు. ఇప్పడు ఆనంద్ భవన్ మూతపడింది. రామచంద్రయ్య బట్ట లు దుఖాణం లేదు. ఆనంద్ క్లాత్ స్టోర్ మూసేశారు . మోండా మార్కెట్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరపడింది. రాజేశ్వర్ టాకీస్ కాలగర్భంలో కలిసిపోయింది. మార్కెట్ ప్రాం తంలో ఇవి ల్యాండ్ మార్కులు.

1930-40 నాటి హైదరాబాద్ రాష్ట్ర జీవితాన్ని వివరిస్తూ రాసిన నవలలో తమిళ రచయిత అశోక మిత్రన్ సికింద్రాబాద్ గురించి వివరిస్తూ మొహంజొదారో నాగరికతను అక్కడి తవ్వకాల్లో బయటపడిన నీటిపారుదల కాలువలు చిత్రించినట్టుగా సికింద్రాబాద్ నాగరికత అంతా గల్లీలనబడే సందుగొందు ల్లో నిక్షిప్తమై ఉంది అంటారు. నిజం గా అలాంటి ఒక సం దులోనే రాజేశ్వర్ టాకీసు ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి కూడా ఈ టాకీసుకు వచ్చి సినిమాలు చూసేవారు. ఆ కాలంలో పెద్దగా టాకీసులుండేవి కావు.
 
ఘనా ఘన సుందరా కరుణా రస మందిరా
అది పిలుపో మేలు కొలుపో
అది మధుర మధురమ ఓంకారమో
ఈ పాట ఒకప్పడు తెలుగునాట భక్తి ఉద్యమంలా వినిపించింది. 1973లో వచ్చిన భక్తతుకారాం సిని మా తెలుగు నాట సంచలనం. రాజేశ్వర్‌లో ఈ సిని మా ప్రదర్శించిన సమయంలో సినిమా హాలులా కాకుండా అదో దేవాలయంలా కనిపించేది. సినిమా హాలు ఆవరణలోనే విఠలేశ్వరుని ప్రతిమను ఏర్పాటుచేశారు. ఆ సినిమా నడిచినన్ని రోజులు టాకీసును దేవాలయంగా చూశారు. రాజన్నగౌడ్ రాజేశ్వర్ టాకీసును 1926లో ఏర్పాటుచేస్తే అక్కడ పనిచేసిన సిబ్బంది ఇప్పటికీ ఆయన పేరు వినగానే దేవుడు సార్ చాలా మంచివారు. టికెట్ దొరక్క చిన్న కుర్రా ళ్లు ఏడిస్తే వెళ్లి కూర్చోరా అని పంపేవారు అని టాకీసులో 36 ఏండ్లు పనిచేసిన విజయ్‌కుమార్ అనే ఉద్యోగి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రాజ న్న గౌడ్ తర్వాత ఆయన కుమారుడు టాకీసును నడిపారు. తర్వాత యాజమాన్యం చేతులు మారింది. మూతపడింది. తొలుత ముందువరుసలో బెంచీలుండేవి. టికెట్ ధర కూడా మోండాలో కూరగాయ ల్లా చాలా తక్కువ ఉండేది. ఇక సింగిల్ తెర టాకీసు లు కావు, మల్టీప్లెక్స్‌లు కూడా నడవవు అని ఏమీ చదువుకోని విజయకుమార్ సినిమా టాకీసుల జోస్యం చెప్పారు.
***
^^ మా అక్క పేరు సీత .. మా అమ్మను డెలివరీ కోసం గాంధీ ఆస్పత్రి లో చేర్పించారు . రాజేశ్వర్ లో సీతా రామ కళ్యాణం సినిమా ఆడుతోంది . నాన్నకు బోర్ కొట్టి అమ్మను తీసుకోని రాజేశ్వర్ కు తీసుకు వెళ్లారు . సెకండ్ షో ఛుఇసి వచ్చిన కొద్దీ సేపటికి మా అక్కయ్య పుట్టింది . అందుకే సీత అని పేరు పెట్టారు .  సీత పేరు వద్దు కష్టాలు పడుతుంది అని ఎంత మంది వారించినా నాన్న వినలేదు . మా అక్క ప్రస్తుతం అమెరికా లో ఉంటుంది ^^ అని రాజేశ్వర్ తో తన అనుబంధాన్ని ఓ జర్నలిస్ట్ మిత్రుడు పంచు కొన్నారు ... 
***
1958లో రాజేశ్వర్ ఎన్టీఆర్ జి వరలక్ష్మి , కృష్ణకుమారి , రేలంగి నటించిన రాజనందిని ప్రదర్శించారు . అక్కినేని నటించిన చక్రధారి సినిమా బాగా నడిచింది . 1966లో బాలయ్య , రాజశ్రీ , రేలంగి నటించిన విజయ శంఖం ప్రదర్శించారు . పద్మనాభం నటించి నిర్మించిన పొట్టి ప్లీడర్ బాగా నడిచింది . 77లో భక్త ప్రహ్లద రెండవ సారి విడుదల అయినప్పుడు కూడా అదే క్రేజీ . 76లో సూపర్ స్టార్ కృష్ణ పాడిపంటలు సినిమా ఈ టాకీస్ లో దుమ్ము దులిపింది . 
**

సికింద్రాబాద్ సందుల్లో నుంచినడవడమే కష్టం  ఇక పార్కింగ్? ఇప్పుడు రాజేశ్వర్ టాకీసు కార్ల పార్కింగ్ ప్లేస్ గా మారింది . తిరిగి టాకీసు తెరువకపోతారా? అని స్థానికులు ఆశగా ఎదురుచూస్తుంటే మా బకాయిలు ఏనాటికైనా చెల్లించకపోతారా? అని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. అక్కడ పనిచేసిన వారితో మాట్లాడుతుంటే ఓ మధ్య వయసు మహిళ టాకీసు మొత్తం కలియ తిరగసాగింది. ఏమీలేదు అంటూతనకు తానె భారంగా చెప్పుకొంటూ  ఏమీ మాట్లాడకుండారాజేశ్వర్ టాకీస్ జ్ఞాపకాలతో  భారంగా వెళ్లిపోయింది ... 
- బుద్దా మురళి (జ్ఞాపకాలు నమస్తే తెలంగాణ 21-1-2018) 
టాకీస్ 5 

19, జనవరి 2018, శుక్రవారం

ప్రపంచానికి నా పిలుపు

‘‘ఏరా చేతిలో పెన్ను పట్టుకుని ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టు ఫోజు ప్రాక్టీస్ చేస్తున్నావంటే కొత్త కవితా సంకలనం కోసం సిద్ధమవుతున్నట్టున్నావ్?’’
‘‘రావోయ్ రా! అలాంటిదేమీ లేదు. ఐనా ఆ ఫోటో ట్రెండ్ మారి చాలా కాలమైంది. కవితా సంకలనాలకు చివరి పేజీ ఫోటో అంటే, ఇప్పుడు కావలసింది చేతిలో పెన్ను కాదు, నెరిసిన గడ్డం మాసిన ముఖం... ఏమోయ్! అరగంట క్రితం టీ తెమ్మని చెప్పాను కదా? ఒకటి కాదు రెండు టీలు తీసుకురా!’’
‘‘ఇంతకూ దేని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నావో చెప్పనే లేదు. ’’
‘‘ప్రాణమిత్రుడివి నీ దగ్గర దాపరికమెందుకు? ప్రజలకు ఏదో ఒక పిలుపు ఇవ్వాలనిపిస్తోంది. ఏదో ఒక పిలుపు ఇవ్వందే సుఖంగా నిద్ర కూడా పట్టేట్టు లేదు. అవే ఆలోచనలు వెంటాడుతున్నాయి.’’

‘‘క్షయ గురించి అమితాబ్ ప్రకటనలు చూస్తున్నావు కదా? ఎడతెరిపి లేకుండా అలా దగ్గు రావడం క్షయ లక్షణం. వరుసగా తుమ్ములు వస్తుంటే జలుబు లక్షణం ఎలానో సమాజానికి ఏదో పిలుపు ఇవ్వాలనే ఆలోచన వెంటాడడం మేధావి లక్షణం. నీలోని మేధావి ముదిరిపోతున్నాడు అనేందుకు ఇదే తార్కాణం. కక్కొచ్చినా, కల్యాణం వచ్చినా ఆగనట్టే సమాజానికి పిలుపు ఇవ్వాలనే ఆలోచన వచ్చినా ఆగదు. ఎయిడ్స్‌కు మందు లేదు నివారణ ఒక్కటే మార్గం అన్నట్టు పిలుపు ఇవ్వడం ఒక్కటే ఈ ఆలోచనలకు మందు’’
‘‘నా ఆలోచనలను పొగుడుతున్నావో? వెటకారం చేస్తున్నావో అర్థం కావడం లేదు’’
‘‘మేధావులను అందరూ తొలుత పిచ్చివాళ్లుగానే పరిగణించారు. విజయం సాధించేంతవరకు అంతా ఇలా చిన్నచూపు చూస్తారు. కార్య సాధకుడు ఇలాంటి వాటికి భయపడడు. వచ్చావా ఉగాది మళ్లీ వచ్చావా అంటూ మొదటి సారి నువ్వు కవిత రాసినప్పుడు ఎవరేమన్నారో గుర్తుందా? వాటిని పట్టించుకుంటే ఈ రోజుకు పనె్నండు కవితా సంకలనాలు వెలువరించే స్థాయికి వచ్చేవాడివా? పట్టించుకోవద్దు. ప్రొసీడ్’’
‘‘అంతే అంటావా?.. కానీ నేనిచ్చే పిలుపు ప్రత్యేకంగా ఉండాలి. అందరూ పాటించి తీరాలి అనేది నా కోరిక ’’
‘‘పూర్వం ఒక రాజు గారు ప్రజలంతా ఉదయం పడుకుని, రాత్రి పూట మేల్కొనాలని ప్రజలకు పిలుపు ఇచ్చాడని చిన్నప్పుడు కథ చదివాం గుర్తందా? ఆ పిలుపు ఇప్పుడు నువ్వు ఇవ్వు’’
‘‘రాజరికంలో రాజుగారు ఇలాంటి పిలుపు ఇచ్చినా పట్టించుకున్నారు కానీ ఇప్పుడు వర్కవుట్ కాదేమో! ఐనా జనం ఎక్కడ పడుకుంటున్నారు 24 గంటలు మెలకువగానే ఉంటున్నారు. నగరాలు అసలు నిద్రపోవడం లేదు. ఇంకేదన్నా వెరైటీ పిలుపు ఉంటే చెప్పు’’
‘‘నేను రావడానికి అరగంట ముందు టీ తెమ్మని మీ ఆవిడకు పిలుపు ఇచ్చావు. నేను వచ్చాక రెండు టీలు అని పిలుపు ఇచ్చావు. అరగంట గడిచినా మీ ఆవిడ నీ టీ పిలుపును ఖాతరు చేసినట్టు కనిపించడం లేదు. ఇంట్లో శ్రీమతినే నీ పిలుపు పట్టించుకోనప్పుడు ప్రపంచం నీ పిలుపునకు ఎలా స్పందిస్తుందా?అనే చిన్న అనుమానం’’
‘‘పిచ్చోడా! ఇదసలు సమస్యనే కాదు. ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్తలు, మేధావులకు ఇది కామన్ సమస్య. ఇంట్లో భార్య ఖాతరు చేయకపోవడం, భార్య రాచి రంపాన పెట్టడం వల్లనే ఎంతోమంది తత్వవేత్తలు, మేధావులు ఈ ప్రపంచానికి ఎంతో ఇచ్చారు. అలా కాకపోతే - ‘స్వానుభవమున చాటు సందేశమిదే పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాపురముండాలోయ్ ఎల్లర సుఖము చూడాలోయ్’ అంటూ పాటలు పాడుకుంటూ ఉండేవాళ్లు. ఎంత గొప్ప మేధావి పిలుపునకైనా ప్రపంచం స్పందిస్తుంది కానీ ఇంట్లో భార్యలు స్పందించరు. ఇదసలు సమస్య కానే కాదు.’’
‘‘సమస్య కానప్పుడు పిలుపు ఇవ్వడం గురించి ఇంకా దీర్ఘాలోచనలు దేనికి?’’
‘‘పిలుపు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చాను కానీ ఎవరికి పిలుపు ఇవ్వాలి? ఏమని పిలుపు ఇవ్వాలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను. ’’
‘‘అప్పుడెప్పుడో లాల్‌బహదూర్ శాస్ర్తీ దేశంలో పేదరిక నిర్మూలన కోసం వారంలో ఒక రోజు తినవద్దని పిలుపు ఇచ్చారని చరిత్ర పుస్తకాల్లో చదివాను.’’
‘‘నాకూ తెలుసు కానీ ఈ పిలుపునకు పెద్దగా స్పందన రాలేదు. అలా కాదు అందరూ తప్పనిసరిగా అమలు చేసి తీరాల్సిన విధంగా పిలుపు ఇవ్వాలని నా ఆలోచన’’
‘‘దసరా పండగ జరుపుకోవాలని, ఆ రోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లాలని, రావణ దహనం చేయాలని ప్రజలకు పిలుపు ఇచ్చేయ్. తెలంగాణలో ప్రజలు దసరా రోజున నీ పిలుపుమేరకే ఇలా చేశారని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంకెందు కాలస్యం’’
‘‘సంక్రాంతికి సొంతింటికి వెళ్లాలని ఆంధ్ర లో  పిలుపు ఇస్తే చక్కగా పాటించారట ’’
‘‘ఇంకా ఏదైనా వెరైటీ పిలుపు ఇవ్వడం ద్వారా చరిత్రలో నిలిచిపోదామని!’’
‘‘హైదరాబాద్‌కు వచ్చిన వాళ్లు, హైదరాబాద్‌లో ఉన్న వాళ్లు తప్పని సరిగా ఇరానీ చాయ్ తాగాలని పిలుపు ఇవ్వు. నీకో విషయం తెలుసా? కొంతమంది సుదూర ప్రాంతాల నుంచి ఇరానీ చాయ్ తాగేందుకే హైదరాబాద్ వస్తారు. ఎవరు టీ తాగినా నీ పిలుపు మేరకు టీ తాగినట్టు ఉంటుంది. పిలుపు ఇవ్వాలనే నీ కోరికా తీరుతుంది.’’
‘‘ఐడియా బాగానే ఉంది కానీ మరీ ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా ఇంకాస్త విస్తృతంగా ఉంటే బాగుంటుంది’’
‘‘పోనీ హిందువులు ఆలయాలకు వెళ్లాలని, క్రైస్తవులు చర్చిలకు వెళ్లాలని, ముస్లింలు మసీదులకు, సిక్కులు గురుద్వారాలకు వెళ్లాలని పిలుపు ఇవ్వు. ప్రపంచమంతా నీ పిలుపునకు స్పందించినట్టుగా ఉంటుంది.’’
‘‘ఇదేదో ఐడియా బాగుంది. మీమీ మతాచారాల ప్రకారం ప్రార్థనాలయాలకు వెళ్లమని ప్రపంచ ప్రజలకు పిలుపు ఇస్తాను. నీతో చర్చంచిన తరువాత కొత్తకొత్త పిలుపుల కోసం కొత్త ఆలోచనలు వచ్చాయి. జనవరి ఒకటిన న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోవాలని, ఆదివారం సెలవు దినంగా పాటించాలని ప్రపంచానికి పిలుపు ఇవ్వాలనుకుంటున్నాను’’
‘‘నీ పిలుపుల రోగం గురించి  విన్నాక ప్రపంచానికి నేను కూడా ఏదో ఒక పిలుపు ఇవ్వాలనుకుంటున్నాను.. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ప్రపంచానికి ఏదో ఒక పిలుపు ఇవ్వాలనేది ప్రపంచ ప్రజలకు నా పిలుపు’’
‘‘ అంతా చదివారు కదా? ప్రపంచానికి మీరూ ఏదో ఒక పిలుపు ఇవ్వండి. ఇప్పటికే ఆలస్యం అయింది . మీ పిలుపు ఏమిటో చెప్పండి ’’

-బుద్దా మురళి (19. 1. 2018 జనాంతికం ) 

16, జనవరి 2018, మంగళవారం

రాహత్ మహల్ కోరా కాగజ్
అత్యద్భుత చిత్రము యొక్క అద్భుత విజయం పక్షి రాజావారి బీదల పాట్లు తారలు నాగయ్య -లలిత- పద్మ 
రాహత్ మహల్ లో సమయము , ఆటలు యధా ప్రకారం - జనవరి 16-1951లో అంటే 67 ఏళ్ళ క్రితం గోలకొండ పత్రికలో సినిమా ప్రకటన . 
 మహల్ అదెక్కడా? అనే ప్రశ్న ఈ తరం వారికిఉదయించవచ్చు . 
ఆ సినిమా టాకీసు పేరు అర్థం ఆ రోజుల్లో తెలియలేదు. కానీ ఆ పేరులోనే ఆహ్లాదం ఉన్నది. ముషీరాబాద్‌లోని ఈ సినిమా హాలును ఇప్పటికీ అక్కడివారు రాత్ మహల్ అనే పిలుస్తారు. రాత్ మహల్ అంటే రాత్రి ప్యాలెస్ అని అర్థం. కానీ దాని అసలు పేరు రాహత్‌మహల్. రాహత్ అని రహత్అని కొన్ని ప్రకటనల్లో ఉంది. రాహత్   అంటే అరబ్బీ భాషలో విశ్రాంతి, రిలీఫ్ అని అర్థం. మహల్ అంటే ప్యాలెస్. ఎన్నో సమస్యలతో సతమతమయ్యే సగ టు జీవి కాసేపు సేదతీరేది సినిమాహాలులోనే. దానికి తగ్గట్టుగానే కళాత్మకహృద యంతో ఈ సినిమా హాలుకు రహత్ మహల్ అని పేరు పెట్టారు.
రాహత్ని ాఅని అరబ్బీ పేరు పెట్టినా ప్రారంభం లో ఎక్కువగా తెలుగు సినిమాలే ప్రదర్శించే వారు .కాంతారావు , కృష్ణ కుమారి , రాజనాల నటించిన కనకదుర్గ పూజా మహిమ ఇందులో ప్రదర్శించారు  గుండమ్మ కథ వంటి సినిమాలు ప్రదర్శించారు. 
  యజమాని ఎవరు? హాలులో ఎవరి వాటా ఎంత? ఆదాయం వస్తుందా? లేదా? అనే ఆలోచన లు అప్పుడు అస్సలు లేవు. కానీ సినిమాహాలు రూపం మారిన తర్వాత ఇది వనపర్తి రాజాలదని తెలిసింది.ఇప్పుడు రహత్ మహల్ లేదు. కానీ రాజా పేరుతో అదే చోట మూడు టాకీసులు నిర్మించారు. పేరుకు తగ్గట్టు విశా లమైన స్థలంలో ఈ టాకీసు ఉండేది. చుట్టుపక్కల ఎక్కువ గా ముస్లింలు నివసించే ప్రాంతం కావడంతో ఎక్కువగా హిందీ సినిమాలే విడుదలయ్యేవి.
టాకీసు ఉన్నది ముషీరాబాద్‌లో అయినా ముషీరాబాద్, బోలక్‌పూర్, బాకారం, జమీస్తాన్‌పూర్, రాంనగర్ వారికి అందుబాటులో ఉండేది. ఈ ప్రాంతాల హిందీ సినిమా ప్రేమికులకు రహత్ మహల్ ఒక మధుర జ్ఞాపకం. తొలిసా రి సినిమా షూటింగ్ చూసింది కోరా కాగజ్ హిందీలో బాగా హిట్టయిన ఈ సినిమా రహత్ మహల్లోనే చూశాను. జన్మకో శివరాత్రి అన్నట్టు ఎప్పుడో ఒకసారి తెలుగు సినిమాను ప్రదర్శించేవారు.ఈ రోజుల్లో సినిమాహాలు బుకింగ్ వద్ద మొదటి తరగతి, రెండవ తరగతి, మూడవ తరగతి అని ఎక్కడైనా కనిపిం చిందా? కావాలంటే నగరంలోని అన్ని టాకీసులు తిరిగి చూడండి ఒక్కచోట కూడా కనిపించదు. కానీ ఆ రోజుల్లో రహత్ మహల్లో ఆడేవి హిందీ సినిమాలే అయినా బుకింగ్ దగ్గర మాత్రం తెలుగులోనే మొదటి తరగతి, రెండవ తరగ తి, మూడవ తరగతి అని రాసి ఉండేది. మూడవ తరగతి చదువుకుంటున్నవారికే టికెట్లు ఇస్తారేమో అని అనుకొని ఐదవ తరగతి చదువుతున్నా టికెట్లు ఇచ్చేవాడికి మూడవ తరగతి అని అబద్ధం చెప్పాలని నిర్ణయించుకుని క్యూలో నిలబడిన సందర్భాలు చాలామందికి ఉన్నాయి.
కోరా కాగజ్ సినిమాలోని ఒక సీనును ట్యాంక్‌బండ్‌పై చిత్రీకరించారు. నటుల పేర్లు తెలియదు. కానీ ట్యాంక్‌బండ్ పై స్త్రీ పాత్రధారి వెళ్తుంటుంది. కారుపై వెళుతూ హీరో ఆమె కు కారు తగిలిస్తాడు. ఈ చిన్న సీనును తీసేందుకు కొన్ని గం టలపాటు షూటింగ్ జరిగింది. సినిమా షూటింగ్ అంటే ఇం త కష్టమా? అనిపించింది మొదటిసారి.రహత్‌మహల్లో లెక్కలేనన్ని హిందీ సినిమాలు చూసినా కోరా కాగజ్ సినిమా అనుభవం ప్రత్యేకం. అప్పటివరకు హిందీ సినిమాలు అంటే డిష్యూం డిష్యూం ఫైట్స్‌కు పెట్టింది పేరు. డిష్యూం మాట దేవుడెరుగు ఈ సినిమాలో కనీసం ఒక చెంపదెబ్బ సీన్ కూడా లేకపోవడంతో ఇదేం సినిమా అనిపించింది 1974లో. ఆ ఏడాది హిందీలో పాపులర్ సినిమాగా కోరా కాగజ్‌కు అవా ర్డు దక్కింది.అమర్ అక్బర్ ఆంథోని. ఆ కాలం లో ఒక ఊపు ఊపిన హిందీ సినిమా. ఆ సినిమాను చూసింది రహత్ మహ ల్‌లోనే ఉదయం పూట పాత తెలుగు సినిమాలు ప్రదర్శించేవారు. మూడు ఆటలు ఎక్కువగా హిందీ సినిమాలే ప్రదర్శించేవారు. దగ్గరలోనే ముషీరాబాద్ హైస్కూల్ కావడంతో ఇంటర్వె ల్‌లో టాకీసుకు వచ్చి హాజరు వేయిం చుకొని వెళ్లడం అక్కడి విద్యార్థులకు అలవాటు.ఇక్కడ చూసిన సినిమాల కన్నా విన్న సినిమాలు ఎక్కువ. బయటకు సినిమా మొత్తం వినిపించేది. కాసేపు అక్కడ గడిపి వెళ్లడం ఓ వ్యాపకం.

విశాలమైన ఆవరణ చివరలో సినిమా హాలు. ఎంట్రెన్స్ లోనే క్యాంటిన్, క్యాంటిన్ ముందు విశాలమైన ఖాళీ స్థలం. అప్పటి కార్మిక నాయకుడు, ఇప్పటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బుల్లెట్ మీద టంచనుగా రహత్ మహల్‌కు రోజూ వచ్చేవారు. సినిమా చూసేందుకు కాదు. క్యాంటిన్ ఎదురుగా ఖాళీ స్థలంలో తనకోసం వేచి ఉన్న వారి సమస్యలను పరిష్కరించి వెళ్లేవారు.ఈ ప్రాంతం చుట్టుపక్కల ఎక్కువగా శ్రమజీవులే. దినమంతా పనిచేసేవారే. మిగిలిన ఆటలకన్నా సెకండ్ షోలోనే ఎక్కువమంది కనిపించేవారు. కొంతకాలానికి సినిమా హాలును మూసేశారు. రహత్ మహల్‌ను మూసినచోట ఇప్పడు రాజా పేరుతో మూడు సినిమా హాళ్లను నిర్మించారు. ముందు షాపింగ్ కాంప్లెక్స్, లెక్కలేనన్ని షాపులు. వెనుక మూడు సినిమా హాళ్లు. సూక్ష్మంలో మోక్షం సాధించాలి అని ఆధ్యాత్మికవేత్తలు భావించినట్టుగానే తక్కువ స్థలంలో ఎక్కు వ వ్యాపారం సాగించాలనేది నేటి మాట. అందుకే విశాలం గా ఉన్నరహత్ మహల్ అంతరించి ఇరుకుగా మూడు టాకీసులు, డజన్లకొద్దీ షాపులు వెలిశాయి. పాతతరం వారికి రహత్ మహల్ జ్ఞాపకాలు ముఖ్యం. కొత్తతరం యజమానులుకు లాభం ముఖ్యం.ఎప్పటిలానే ఈ టాకీసుల్లో హిందీ సినిమాలనే విడుదల చేస్తున్నారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసే విధంగా క్యాంటిన్ లో కొంతభాగం అలానే ఉంది.

ముగ్గురు అన్నదమ్ములు విలన్ కారణంగా విడిపోతారు. అమర్ అక్బర్ ఆంథోనీగా మూడు మతాలకు చెందిన వారి గా పెరిగి పెద్దవుతారు. ముగ్గురు తాము అన్నాదమ్ములమని, విలన్ కారణంగా తమ కుటుంబం విడిపోయిందని గ్రహిం చి ప్రతీకారం తీర్చుకుంటారు. ఈ కథతో లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. కానీ అమర్ అక్బర్ ఆంథోనీ సూపర్‌హి ట్ అయింది. రహత్ మహల్‌లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.విడిపోయిన ముగ్గురు అన్నదమ్ములు చివరకు ఒకటవుతారు. రహత్ మహల్ మాత్రం ఒకటి నుంచి మూడయింది. కానీ ఆ కళ మాత్రం కనిపించడం లేదు. ఆ తరం వారికి రహత్ మహల్ ఒక జ్ఞాపకం మాత్రమే. ఇప్పుడు బయటినుంచి చూస్తే ముందుగా కనిపించేవి షాపులు. వాటివెనుక సినిమా టాకీసులు.
బుద్దా మురళి (జ్ఞాపకాలు నమస్తే తెలంగాణ 14-1-2018)
టాకీస్ 4 

12, జనవరి 2018, శుక్రవారం

మన కాలం దేవుళ్ళు

‘ఈ కాలంలో ఉన్న మనం అదృష్టవంతులం’’
‘‘మనలా టెక్నాలజీని ఉపయోగించుకుంటున్న తరం మరేదీ లేదు. చిన్నప్పుడు ట్రంక్ కాల్ చేయాలంటే ప్యాట్నీలో ఉన్న టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌కు వెళ్లి టోకన్ తీసుకుని గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. ఇప్పుడు అమెరికాలో ఉన్న కూతురు హైదరాబాద్‌లో ఉన్న తల్లితో ట్యాబ్‌లో వంకాయ కూర గురించి, సాంబారులో ఉప్పు గురించి లైవ్‌లో మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఇల్లూ 24 ఇంటూ 7 లైవ్ వంటల చానల్‌గా మారిపోయింది అంటే టెక్నాలజీ పుణ్యమే కదా? ’’
‘‘ముప్పయి ఏళ్ల క్రితం మనమీ టెక్నాలజీని ఊహించలేదు. అలానే వచ్చే ఇరవై ఏళ్లలో టెక్నాలజీ ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో మనం ఊహించలేం. స్మార్ట్ ఫోన్ లేనిదే జీవించలేని స్థితికి చేరుకున్న మనం సెల్‌ఫోన్ లేకుండా చిన్నప్పుడు ఎలా బతికామని ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అలానే మరో రెండు మూడు దశాబ్దాల తరువాత టెక్నాలజీలో బతికే వాళ్లు ఇప్పటి మన జీవితం గురించి తెలుసుకొని ఓ మైగాడ్ స్మార్ట్ఫోన్ అనే పాత టెక్నాలజీతో పాపం ఎలా బతికారో అని మనమీద సానుభూతి చూపొచ్చు. మనం అదృష్టవంతులం అని నేను చెప్పింది టెక్నాలజీ గురించి కాదు. ’’
‘‘మరింక దేని గురించి?’’
‘‘ఉన్నావా? అసలున్నావా? అంటూ అనుమానం వ్యక్తం చేసిన మహామహా భక్తులు కూడా ఒక్కోసారి నిజంగా దేవుడు ఉన్నాడో లేడో నిర్థారించుకోలేక సతమతమయ్యారు. అలాంటిది మనం ఏకంగా దేవుళ్లు ఉన్న కాలంలో బతకడం అదృష్టవంతులమే కదా? ’’
‘‘ఈ కాలంలో దేవుళ్లను సినిమాల్లో చూసే అదృష్టం కూడా లేదు అలాంటిది నువ్వు దేవుళ్లను చూశావా? మొన్ననే కనిమొళి 2జి స్కామ్ నుంచి విజయవంతంగా బయటపడినందుకు తిరుపతి వెళ్లి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుని తిరుపతిలో అసలు దేవుడే లేడని ప్రకటించింది. అలాంటిది నువ్వు దేవుళ్లను చూశావా? ’’
‘‘కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడి, బయటపడ్డాక ఆమెకు దేవుడు లేడనే అనుమానం వచ్చి ఉంటుంది. సహజమే కదా? ఆమెకే కాదు ఒక్కోసారి నాక్కూడా- నిజంగా దేవుడుంటే కుంభకోణాలు చేసిన వారు ఎలా బయటపడతారు అనిపిస్తుంది. కనిమొళిని చూసి విజయ్ మాల్యా అనవసరంగా దేశం విడిచి వచ్చానని సిగ్గుపడుతున్నాడేమో!’’
‘‘కేసు నుంచి బయటపడిన వారు దేవుడున్నాడనడం మామూలే, కానీ ఈమె కాస్త వెరైటీగా కేసు నుంచి బయటపడగానే దేవుడు లేడు అంటోంది. రుజువేంటి అని ఎవరైనా అడిగారో లేదో అడిగితే కేసు నుంచి నేను బయటపడడమే దేవుడు లేడు అనేందుకు రుజువు అంటుందేమో?. చర్చ పక్కదారి పట్టినట్టుంది. దేవుళ్లను చూశానన్నావు ఏంటాకథ’’
‘‘మొన్న బ్లాక్ బస్టర్ సినిమా అట్టర్ ప్లాప్ అయింది కదా?’’
‘‘నువ్వు మరీ ఇంత దుర్మార్గుడివి అనుకోలేదు. ఒక సినిమా అట్టర్ ఫ్ల్లాప్ అయితే దేవుడున్నాడని అంటావా? అంటే ఆ సినిమా అట్టర్ ఫ్ల్లాప్ కావాలని దేవుళ్లను మొక్కుకున్నావన్న మాట! ఫ్ల్లాప్ వెనుక అదేదో పార్టీ యువ నేత ఉన్నాడంటారనుకున్నారు చాలా మంది. కానీ దేవుడున్నాడన్న మాట’’
‘‘దేవుళ్లు ఉన్నారు. మొదట్లో మన సినిమాలన్నీ పౌరాణికమే. మనకు దేవుళ్లు పరిచయం అయింది ఈ సినిమాల ద్వారానే. 1936లో వచ్చిన తొలి తెలుగు సినిమా ‘్భక్తప్రహ్లాద’ పౌరాణికమే. దాదాపు 70వ దశకం వరకు దేవుళ్లను మనం సినిమాల్లోనే చూశాం.’’
‘‘ఔను నిజం ముఖ్యంగా 60వ దశకంలో వచ్చిన దేవుళ్ల సినిమాలను ఇప్పటికీ మైమరిచి చూస్తాం. ఆ తరువాత దేవుళ్ల సినిమాలు ఎందుకు రాలేదంటావు?’’
‘‘దేవుళ్లే కళ్లెదుట కనిపిస్తుంటే ఇక దేవుళ్ల సినిమాలు ఎవరు చూస్తారని అనుకున్నారేమో, దేవుళ్ల సినిమాలు తగ్గిపోయాయి.?’’
‘‘అన్నీ చెబుతున్నావుకానీ దేవుళ్లను ఎక్కడ చూశావు? ఎప్పుడు చూశావు ఆ సంగతి మాత్రం చెప్పడం లేదు.’’
‘‘ఇరాక్‌పై అమెరికా దాడి, ట్విన్ టవర్స్‌ను విమానంతో పేల్చడం, మన పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడిపై టీవిలో ఉద్వేగ పూరితంగా చర్చలు జరిపినట్టుగా, అంతకన్నా కొంచెం ఎక్కువగా ఓ తెలుగు సినిమా విడుదలపై ప్రజలేమనుకుంటున్నారు అని తెలుగు చానల్స్ అన్నీ కట్టకట్టుకుని చర్చించాయి. ఆ చర్చలప్పుడు నాకు దేవుళ్లు ఉన్నారని జ్ఞానోదయం అయింది.’’
‘‘అదే ఎలా అని ?’’
‘‘బ్లాక్‌బస్టర్ అని ప్రచారం జరిగి అట్టర్ ఫ్ల్లాప్ అయిన సినిమాను చూసి బయటకు వస్తున్న ప్రేక్షకుడు నాకీ జ్ఞానోదయం కలిగించాడు. ఆ ప్రేక్షకుడి తల్లి ఏరా బిడ్డా దెబ్బలు తగిలించుకున్నావు అని అడిగితే.. అమ్మా ఓసారి నీకు దెబ్బలు ఎలా తగిలాయి అని నిన్ను అడిగితే దైవ దర్శనం కోసం వెళితే తొక్కిసలాటలో దెబ్బలు తగిలాయి అని చెప్పావు. నేను నా అభిమాన హీరో సినిమాకు వెళితే నాకీ దెబ్బలు తగిలాయి. హీరోనే నాకు దైవం అని గర్వంగా చెప్పాడట! తన్మయంతో అతను చెప్పడం, టీవి చర్చల్లో ఉన్న ఓ అమ్మ మనసు ఉప్పొంగిపోవడం చూశాక కలికాలం దేవుళ్లు మన హీరోలే అనిపించింది. అప్పుడెప్పుడో భారతదేశ జనాభా 10- 20 కోట్లు ఉన్నప్పుడు ముక్కోటి దేవతలు అన్నారు. ఇప్పుడు వంద కోట్లు దాటినప్పుడు అదే దామాషా ప్రకారం దేవుళ్ల సంఖ్య కూడా పెరగాలా? వద్దా? రాష్ట్రాల సంఖ్య, నియోజక వర్గాల సంఖ్య పెరుగుతున్నప్పుడు దేవుళ్ల సంఖ్య ఎందుకు పెరగొద్దు’’
‘‘అవును నిజమే రజనీకాంత్ తమిళదేవుడు అయినట్టుగానే చాలా రాష్ట్రాల్లో చాలా మంది నట దేవుళ్లు జీవిస్తున్న కాలంలో మనం ఉండడం మన అదృష్టమే. ఈ విషయంలో ఉత్తరాది వారి కన్నా దక్షిణాది వాళ్లం అదృష్టవంతులం.’’
‘అభిమానులకు దేవుళ్లు కనిపిస్తారో లేదో కానీ. లింగ, కబాలీ, కాటమరాయుడు, వంటిసినిమాల నిర్మాతలు , బయ్యర్లకు  ఆ సినిమాల విడుదల తరువాత నిజంగానే దేవుడు కనిపించి ఉంటాడు. తమ్ముడి తాజా సినిమా  ను కొన్న వాళ్లకు దేవుడు కనిపించే ఉంటాడు 
... బిచ్చగాడు డబ్బింగ్  సినిమా నిర్మాతను కోటీశ్వరుణ్ణి చేస్తే, కాపీ కథల కలియుగ దేవుళ్ల సినిమా కోటీశ్వరులను బిచ్చగాళ్లను చేస్తోంది. ఇదంతా దేవుళ్ల మహిమ.’’
బుద్దా మురళి (జనాంతికం 12-1-2018)

8, జనవరి 2018, సోమవారం

ప్యారడైజ్ అంటే బిర్యానీ కాదు సినిమా టాకీసు

దానవీర శూరకర్ణలోని చిత్రం భళారే విచిత్రం ఈ పాట నిజంగా చిత్ర మే.. సుయోధన సార్వభౌముడికి డ్యూయె ట్ పెట్టాలనే ఆలోచనే ఓ చిత్రం. సి.నారాయణరెడ్డి ఆ పాటను అద్భుతంగా రాస్తే ప్రభ ఆ పాటలో అంతకుముందు ఏ సిని మాలోనూ కనిపించనంత అందంగా కనిపిస్తుంది. చిత్రమైన పాట ఉన్న ఈ సినిమా ప్యారడైజ్‌లో బాగా నడిచింది. ఆ సినిమా హాల్ చరిత్ర ఇంతకన్నా చిత్రమైనది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ఏ సీ టాకీసుగా (1954) ప్యారడైజ్ టాకీసు పేరుతో రికార్డ్ నమోదు అయి ఉంది. ఈ టాకీసులో అనేక విచిత్రాలు, జ్ఞాపకాలు.. అద్భుతాలు ఉన్నాయి.
మీరు ఏ సినిమా హాలుకు వెళ్లినా ఇంటర్వెల్‌లో తలుపు లు అన్నీ మూసేస్తారు. ఇష్టం ఉన్నా లేకున్నా టాకీసులోని క్యాంటిన్‌లోనే చిరుతిండి కొనుక్కోవాలి. తలుపులు తీస్తే అంతకన్నా తక్కువ ధరతో, మంచి రుచికరమైన పదార్థాలు బయట కొనుక్కుంటారు. అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా క్యాంటిన్లో నాసిరకం చిరుతిళ్లు ఎక్కువ ధరకు కొనాలి. సిని మా హాలులోని క్యాంటిన్‌పై నిర్వాహకులకు అంత నమ్మ కం. అందుకే గేట్లకు తాళాలు వేస్తారు. తలుపులు ముస్తారు.

కానీ చిత్రం భళారే విచిత్రం అనిపించేట్టుగా ప్యారడైజ్ లోని క్యాంటిన్ అంతర్జాతీయ బ్రాండ్ కావడం. ఆ బ్రాండ్ విలువ కోట్ల రూపాయలు కావడం. ప్యారడైజ్ టాకీసు మూతపడింది కానీ అందులోని క్యాంటిన్ మాత్రం అదే పేరుతో అంతర్జాతీయ బ్రాండ్‌గా మారింది. ప్యారడైజ్ అం టే ఈతరం వారికి తెలిసింది హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ నేం. కానీ ఒకప్పుడు ఎన్నో మంచి మంచి తెలుగు సినిమా లు ఆడిన టాకీసు ప్యారడైజ్.
సికింద్రాబాద్‌లో హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ఆడే టాకీసులు ఎక్కువగా ఉన్నా ప్యారడైజ్‌లో మాత్రం ఎక్కువగా తెలుగు సినిమాలే ఆడేవి. దానవీర శూర కర్ణ, దేశోద్ధారకులు వంటి పలు హిట్ సినిమాలు ఎక్కువ రోజులు ఆడాయి.
ప్యారడైజ్ హోటల్ తమ ప్రగతిని వివరిస్తూ ఓ బోర్డు ఏర్పాటుచేశారు. సికింద్రాబాద్ ప్రాంతంలో ప్యారడైజ్ అనే పేరుతో పిలిచిన ఒక టాకీసులో చిన్న క్యాంటిన్‌గా 1953లో ఆవిర్భవించినట్టు రాసుకున్నారు. క్రమంగా టాకీసు ప్రభా వం తగ్గుతుండగా, అదే సమయంలో క్యాంటిన్ చిన్న హోట ల్‌గా మారింది. అటు నుంచి ఎవరూ అందుకోలేని స్థాయికి వెళ్తే టాకీసు మాత్రం మూతపడింది. టాకీసు మూతపడి అందులోని క్యాంటిన్ అంతర్జాతీయ బ్రాండ్‌గా మారడం సినిమాను మించిన విచిత్రం. ప్యారడైజ్‌లో ఎక్కువగా తెలు గు సినిమాలు ప్రదర్శించినా అప్పడప్పుడు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ప్రదర్శించేవారు.
 
1977 జనవరి 14న ప్యారడైజ్‌లో విడుదలైన దాన వీర శూర కర్ణ సినిమా ఓ సంచలనం. ఎక్కువ రోజులు నడిచిన సినిమానే కాదు. ఎక్కువ నిడివిగల సినిమా కూడా. ప్యారడైజ్‌లో ఈ సినిమా విడుదల అని ఆ రోజుల్లో పత్రికల్లో వచ్చి న ప్రచార ప్రకటన చాలా ఆకర్షణీయంగా ఉండే ది. దుర్యోధనుడిగా ఎన్టీఆర్ పెద్ద గద ను పట్టుకొన్న పోస్టర్ ఆకట్టుకొనే విధంగా ఉండేది. ద్రౌపదిగా శారద వస్ర్తాపహరణం కృష్ణుడి గా ఎన్టీఆర్ అరచేతి నుంచి చీరలు రావడం, మాయాజూదంలో ఓడిపోయి పాండవులు దీనంగా కూర్చున్న దృశ్యంతో తొలుత పత్రికల్లో ప్రచార ప్రకటన వచ్చినా గదతో దుర్యోధనుడి పోస్టర్ ఎక్కువగా పాపులర్ అయింది. ఆ కాలంలో ప్యారడైజ్ టాకీసు జన ప్రవాహంతో నిండిపో యింది. దేశోద్ధారకులు సినిమా కూడా ఈ టాకీసులో బాగా ఆడింది. దాన వీర శూర కర్ణకు ముందు అక్కినేని నాగేశ్వర్ రావు, వాణిశ్రీ నటించిన ఆలుమగలు సినిమా బాగానే నడిచింది.
ఇప్పుడంటే అసలు విడుదలకు నోచుకోని సినిమాలు, ఒకరోజుకే ఎత్తేసే సినిమాలకు సైతం టీవీలో బోలెడు ప్రచా రం లభిస్తున్నది. ఆ రోజుల్లో పత్రికల్లో ప్రకటనలు, పోస్టర్‌లే ప్రచారం. పత్రికల ప్రకటనలో అన్ని టాకీసులు ఎయిర్ కం డిషన్డ్ అని రాస్తే ప్యారడైజ్ ఎయిర్‌కూల్ అని రాసుకొనేది. 

సికింద్రాబాద్‌లో పాష్ ఏరియా జవహర్‌నగర్ ఈ టాకీసుకు పక్కనే.. రాజధాని నగరంలో తొలి అపార్ట్‌మెంట్ నిర్మాణం ఈ ప్రాంతంలోనే జరిగింది. సింధ్ కాలనీ.. వారు పూజించే ప్రత్యేక ఆలయం ఈ ప్రాంత ప్రత్యేకతలు. కొత్త సినిమా ఏది విడుదలయినా మొదటి మూడురోజులు నాలు గు ఆటలు అదే సినిమా ప్రదర్శించేవారు. నాలుగవ రోజు నుంచి ఉదయం ఆట పాత సినిమాను మార్నింగ్ షో గా తక్కువ రేటు టికెట్లతో ప్రదర్శించేవారు.

అమర శిల్పి జక్కన్న , ఆలు మగలు , ఊరికి ఉపకారి , వెలుగు నీడలు , ఆత్మ బలం , చాణక్య చంద్ర గుప్త వంటి సినిమాలు ప్యారడైజ్ లో విడుదల అయ్యాయి . ధరమ్ వీర్ వంటి సూపర్ హిట్ హిందీ సినిమా కూడా నటరాజ్ లోనే విడుదల అయింది . 
***
నిజాం పాలనా కాలం లోనే ప్యారడైజ్ టాకీస్ ను అంజయ్య గౌడ్ నిర్మించాడు . ఇప్పుడు ఆ ప్రాంతం లో కనిపించే నెహ్రూ విగ్రహం ఆ కాలం లో ఆయన ఏర్పాటు చేసిందే .
తమ టాకీసులో  ప్రదర్శించేందుకు ఓ సినిమా అనుమతి కోసం  కోసం అంజయ్య గౌడ్ మద్రాస్ కు వెళ్ళడానికి  రైలు కోసం వెళితే అప్పటికే వెళ్ళిపోయింది లో  తరువాత స్టేషన్ లో ఎక్కేందుకు కారులో వెళితే అక్కడా రైలు దొరకలేదు ఆ తరువాత స్టేషన్ కు వెళ్లి కారులో వెళ్ళాడు అదే ఆయన పాలిట టాకీసు పాలిట శాపంగా మారింది రైలు పట్టాలు భారీ వర్షానికి కొట్టుకు పోయి రైలు ప్రమాదం లో మరణించిన వారిలో  అంజయ్య గౌడ్ కూడా ఉన్నారు .   జనగామ వద్ద జరిగిన రైలు ప్రమాదం లో మొత్తం 120 మంది వరకు మరణించారు అందులో అంజయ్యకూడా ఉంది. ఉన్నారు 27-9-1954లో ప్రమాదం జరిగింది . అగ్గిపిడుగు సినిమా కొనేందుకు వెళ్లారు 
ఆ తరువాత అంజయ్య కుమారుడు ప్యారడైజ్ బాధ్యత తీసుకొన్నాడు 
కొద్దికొద్దిగా టాకీసు జాగా ను హోటల్ గా మారిన క్యాంటిన్ ఓనర్ కు అమ్మ సాగాడు టాకీసును నడపడం ఇక తనవల్ల కాదని భావించి మొత్తం అమ్మకానికి పెట్టాడు 
టాకీసు ఆవరణ లోనే ఉన్న తన తండ్రి సమాధి ని కదిలించి వద్దు అలానే ఉంచాలి అనే కండిషన్ తో టాకీసు మొత్తం అమ్మేశారు.  సికింద్రాబాద్ నడి బొడ్డున ఉన్న నటరాజ్ ను అమ్మి అలియా బాద్ లో ఓ టాకీసు నిర్మించి కొంత కాలానికి అదీ అమ్మేశారు 
అంజయ్య వారసులు అంజయ్య నిర్మించిన టాకీసును కాపాడ లేక పోయారు కానీ సమాధిని మాత్రం అలానే ఉంచాలనే కండిషన్ పెట్టారు . 
****
సికింద్రాబాద్ చరిత్రలో ఒక భాగంగా నిలిచిన ప్యారడైజ్ 1987లో మూతపడింది. అదే స్థలంలో, అదే పేరుతో వెలిసిన ప్యారడైజ్ హోటల్ తన చరిత్రను అక్కడ రాసిపెట్టింది. ఒక సినిమా హాలులో క్యాంటిన్ అంతర్జాతీయ బ్రాండ్‌గా మారడం అభినందనీయమే కానీ.. అదే సమయంలో తన జన్మకు కారణమైన ప్యారడైజ్ రికార్డును నమోదుచేసి ఉంటే బాగుండేది. ప్యారడైజ్ సినిమా టాకీసుగా ఉన్నప్పటి ఫొటో కానీ సినిమా షీల్‌లు ఆ టాకీసుకు సంబంధించిన ఎలాంటి చరిత్ర, చిత్రాలు అక్కడ లేవు. ఇక్కడ ఒకప్పుడు ప్యారడైజ్ పేరుతో ఒక సినిమా టాకీసు ఉండేదని చెప్పినా నమ్మేట్టుగా లేదు.
ప్యారడైజ్‌లో బిర్యానీ ఎంత ఫేమస్ అంటే.. రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా వచ్చి ఇక్కడ బిర్యానీ తిని వెళ్లేంత గా. బిర్యానీ ప్రియులకు ఇది నిజంగా ప్యారడైజే (స్వర్గం) కానీ ఇందులో ఎన్నో సినిమాలు చూసిన నాటితరం వారికీ మాత్రం ఇక్కడికి రాగానే టాకీసు కనిపించకపోవడం గుండె ల్లో గుచ్చుకున్నట్టుగా ఏదో వెలితిగా ఉంటుంది.

బుద్దా మురళి (జ్ఞాపకాలు , నమస్తే తెలంగాణ 7. 1. 2018)
టాకీస్ 3 

5, జనవరి 2018, శుక్రవారం

గజల్ - రజనీ - ఉప్మా

‘‘మీఅన్నయ్య వచ్చాడు. నాకోసం చేసిన ఉప్మాను మీ అన్నయ్యకు పెట్టు’’
‘‘ఇప్పుడే తిని వచ్చాను. ఉప్మా వద్దు చెల్లెమ్మా’’
‘‘అర్జునా తిండి అన్నాక ఆలూ బిర్యానీ ఉంటుంది. ఉప్మా ఉంటుంది. ఆలూ బిర్యానీ అనగానే పొంగి పోవడం, ఉప్మా అనగానే ఢీలా పడిపోడం ధీరుల లక్షణం కాదు .  టమాటా రైస్‌కు, టమాటా బాత్‌కు ఒకేలా స్పందించడమే స్థిత ప్రజ్ఞత. ’’
‘‘ఉప్మాపై నేనెవరి మనోభావాలను గాయపరచను. ఆ సంగతి వదిలేయ్ . ఏంటీ కొత్త సంవత్సరం విశేషాలు’’
‘‘ఏమున్నాయి గజల్ శ్రీనివాస్ తెలుగు వారిని ఎక్కడికో తీసుకు వెళ్లాలని అనుకుంటే, పోలీసులు ఆయన్ని జైలుకు  తీసుకెళ్లారు. ‘స్వాతి ఎపిసోడ్ ముగిసిపోయింది. రజనీకాంత్, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌ల గురించి ఎంతయినా మాట్లాడుకోవచ్చు. గజల్ దొరకడంతో మాచిరాజు బతికిపోయాడు. ’’
‘‘ గజల్ బాగా పాడే అతను అలా చేశాడు అంటే నాకే కాదు మంత్రి గారికి కూడా నమ్మకం కుదరడం లేదు
’’
‘‘పందులను పెంచలేని నువ్వు  రాజకీయాలకు పనికిరావు అని అప్పుడెప్పుడో రాజీవ్‌గాంధీని లాలూప్రసాద్ యాదవ్ విమర్శించినట్టు గజల్ బాగా పాడడానికి, అలాంటి వాడు కావడానికి సంబంధం ఏమిటోయ్. ఎంతయినా ‘కళాకారుడు’ కదా?’’
‘‘కళాకారుడు అని ఒత్తి పలుకుతున్నావు. నువ్వు కళాకారుల మనోభావాలు గాయపరుస్తున్నావు’’
‘‘నేనెక్కడి ఒత్తిపలికాను. నా గొంతే అంత. తప్పు చేస్తే పరవాలేదు కానీ ఒత్తి పలికితే తప్పా? ’’
‘‘అతను అలాంటివాడు కాదు అని ఆవిడెవరో చెప్పారు కదా?’’
‘‘డేరాబాబా అలాంటి వాడు కాదని కొన్నివేలమంది బస్సులు తగలబెట్టి మరీ చెప్పారు. మా ఆయన అలాంటి వారు కాదు అని ఆయన శ్రీమతి చెప్పడం లేదు కానీ ఏ 2 గా ఉన్న యువతి చెప్పి పరారైంది . మంత్రి అలంటి వాడు కాదు అన్నందుకు నా మీద నాకే సిగ్గేస్తుంది అన్నాడు . గజల్ శ్రీమతికి కూడా ఈ సంగతి చెప్పాను అని నిందితురాలు చెబితే మా అయన మంచోడు అని చెప్పలేదు నిందితురాలు ఎప్పుడూ నాకు చెప్పలేదు అని ఆమె ఖండించలేదు . అంటే వ్యవహారం అందరికీ తెలిసిన రహస్యమే . ’’
‘‘అంటే అలాంటి వాడే అంటావా?’’
‘‘స్పష్టమైన ఆధారాలతో చూపించేంత వరకు ఎవరూ అలాంటి వారు కాదు. అలాంటి వాడే అని పోలీసులు ఆధారాలు చూపించారు కదా?’’
‘‘అతని అనుమతి లేకుండా అతని లీలలను కెమెరాల్లో రికార్డు చేయడం తప్పు కదా?’’
‘‘నిజమే! నా లీలలను రికార్డు చేయండి అని ముద్దాయిలు లిఖితపూర్వకంగా అనుమతి ఇచ్చే స్థాయికి ఎదిగే రోజుల కోసం ఎదురు చూద్దాం’’
‘‘ఇంతకూ ఏమంటావు?’’
‘‘అతనో మనిషి అంటాను. మనుషులకు ఉండే లక్షణాలు అన్నీ ఉంటాయంటాను. మగవాడు అంటాను. మగవాళ్లకు ఉండే లక్షణాలు అన్నీ ఉంటాయంటాను. అతనేమీ మానవాతీతుడు కాదు, దేవుడు కాదు. మనిషి మనోభావాలను గాయపరిచానని అనుకుంటున్నావేమో! మనుషులకు ఉండే లక్షణాలు అన్నీ మనుషులకు ఉంటాయి. ఇది నా మాట కాదు రజనీష్ చెప్పిన మాట. విచక్షణతో ఆలోచించి కొందరు దారి తప్పకుండా ఉంటారు.పట్టుపడితే రోడ్డున పడతామని భయం , సంస్కారం , చట్టం తప్పు చేయనివ్వదు . ఏమీ కాదు అనే తెగింపు తో  ఏ స్థాయిలో ఉన్నా కొందరు దారి తప్పుతారు. అంతే తేడా. ఆరేడేళ్ల క్రితం వరల్డ్‌బ్యాంక్ సిఇఓ ఒక హోటల్‌లో మహిళపై అఘాయిత్యానికి పాల్పడినప్పుడు ఇదే మాట చెప్పాను. ఇప్పుడూ ఇదే మాట ఏ స్థానంలో ఉన్నా మనిషికి మనిషి లక్షణాలు అన్నీ ఉంటాయి. విచక్షణ కోల్పోయిన వారు, కోల్పోని వారు ఇంతే తేడా!’’
‘‘ఏం మాట్లాడుతున్నావ్? నువ్వూ అంతేనా? నేనూ అంతేనా?
‘‘ఏం మనం మనుషులం కాదా?తప్పు చేయాలి అని నీకెప్పుడూ అనిపించలేదా ? చట్టానికి చిక్కాను అనే గ్యారంటీ ఉంటే తప్పు చేయాలనే ఆలోచన చేయకుండా ఉంటావా ?  ’’
‘‘నేనెప్పుడూ అలా అనుకోలేదు’’
‘‘ఐతే నీలో ఏదన్నా లోపం ఉండొచ్చు, లేదా నువ్వు అబద్ధం ఆడుతుండొచ్చు ’’
‘‘గజల్ పురుషుని సంగతి చట్టం చూసుకుంటుది కానీ స్వాతి సంగతేంటి?’’
‘‘స్వాతిలో కొందరికి భయంకరమైన ఆడరాక్షిసి కనిపిస్తుందేమో కానీ నాకైతే సినిమాకు, టీవీ సీరియల్స్‌కు నిజ జీవితానికి తేడా ఉంటుందనే కనీస పరిజ్ఞానం లేని టీవీ సీరియల్ పిచ్చి జీవి కనిపిస్తోంది.
ముఖానికి మాస్క్ తొడుక్కుంటే రూపం మారడం, చిత్తూరు నాగయ్య హీరోగా వెలుగొందిన కాలం నాటి సినిమా ఫార్ములా. మొగుడిని చంపి ప్రియుడికి మాస్క్ తొడిగితే మొగుడవుతాడా? ఆమెది చావు తెలివితేటలు కాదు, అజ్ఞానం. టీవి సీరియల్స్, సినిమాల్లో హీరో సాహసాలు నిజమే అనుకునేంత అజ్ఞానం’’
‘‘వాళ్ల సంగతి సరే రజనీకాంత్ రాణిస్తారా? పవన్ కల్యాణ్ పాలిస్తాడా? మహారాష్టల్రో పుట్టి, కర్నాటకలో పెరిగిన రజనీకాంత్‌ను తమిళులు ఎలా ఆదరిస్తారు?’’
‘‘తమిళులకూ మనకూ తేడా ఉంది. భాష పేరుతో ఏర్పడిన తొలి రాష్ట్రం, భాషపేరుతో పుట్టిన పార్టీ రెండు దశాబ్దాలు అధికారంలో ఉన్నా మనలో భాషాభిమానం శూన్యం. తమిళులు భాషా సినిమాలనైనా, తమిళ భాషనైనా పిచ్చిగా ప్రేమిస్తారు. రజనీకాంత్ ఒక్కరే కాదు తమిళులకు రాజకీయంగా, సినిమాపరంగా ఆరాధ్య దైవాలుగా వెలుగొందిన వారంతా తమిళేతరులే. ఎంజిఆర్ తమిళుడు కాదు. ఎంజిఆర్ హీరోగా నటించినప్పుడు దైవంగా పూజించారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అంతే ఆరాధించారు. ఇందిరాగాంధీ తరువాత అమ్మా అని ఆప్యాయంగా పిలిపించుకున్న జయలలిత తమిళియన్ కాదు. 
ఎంజీఆర్ ది సిలోన్ (శ్రీలంక )జయలలిత కర్ణాటకలో పుట్టారు ఈ విషయం తమిళులకు తెలియకనా? మనకూ వారికి తేడా ఏమంటే? ఏ భాషకు చెందిన వారైనా వారిలో తమిళుల్లో కలిసిపోవలసిందే. కలిసిపోయారు కాబట్టే ఎంజిఆర్, జయలలితలాంటి వాళ్లు తమిళుల మనసు దోచుకున్నారు.’’

‘‘పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఎన్టీఆర్‌ను చూసి పార్టీ పెడితే ఏమవుతుందో చిరంజీవి, విజయకాంత్ సంగతి తెలియందా?’’
‘‘ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఇదే మాటన్నారు. 83లోపాతికేళ్ల కాంగ్రెస్ పాలనపై జనం విసిగిపోయి ఉన్నారు. ప్రత్యామ్నాయం లేదు. కానీ చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు రంగంలో రెండు బలమైన పార్టీలు ఉన్నాయి. ఎన్టీఆర్ రెండోసారి పార్టీ పెట్టినప్పుడు ఇదే పరిస్థితి. అల్లుడి పార్టీ, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతో అన్నగారి రెండో పార్టీ అడ్రస్ లేకుండాపోయింది. ఇప్పుడు వందకు చేరువలో కరుణానిధి, వారసుణ్ణి ప్రకటించకుండా వెళ్లిపోయిన జయలలిత ఇదే రజనీకి కలిసొచ్చే కాలం. కనెక్టింగ్ ది పీపుల్ అంటూ ప్రపంచంలో 60శాతం మార్కెట్‌ను హస్తగతం చేసుకున్న నోకియా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో తెరమరుగైంది. దేనికైనా టైం ముఖ్యం.రజనీది సరైన సమయం . పవన్ పార్టీ పెట్టి తొలి ఉపన్యాసం లో 5 నిమిషాల్లోనే తేలిపోయింది ఆయన రాజకీయ పరిజ్ఞానం .. రాజకీయ భవిష్యత్తు ’’
‘‘ఇదిగో అన్నయ్యా ఉప్మా తినండి’’
‘‘చూశావటోయ్ విధి బలీయమైంది. రాజకీయాల్లోకి రావాలని రజనీ నుదుటి రాసి ఉన్నా, ఏదో ఒక రోజు రాసలీలలు బయటపడాలని గజల్ నుదుటిన రాసి ఉన్నా, ఉప్మా తినాలని మన నుదిటిపై రాసి ఉన్నా తప్పించుకోలేం.’’
-బుద్దా మురళి (జనాంతికం 5. 1. 2018)

2, జనవరి 2018, మంగళవారం

బాలాజీ టాకీసు -బంగ్లా దేశ్ కు సహాయం
ఘంటసాల మరణం .పాకిస్థాన్ తో యుద్ధం-బాంగ్లాదేశ్ ఆవిర్భావం ప్రభుత్వ పాఠశాల లో రుచికరమైన చిక్కటి పాలు .. చింత చెట్టు నుంచి రాలిపడే చింతకాయలు  .
 బడిపంతులు -అంజలి శ్రీదేవి , జయమాలిని జగన్ మోహినీ 
ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం  లేదు . కానీ గాంధీనగర్ లోని బాలాజీ టాకీస్ అనగానే ఇవన్నీ ఒకదాని తరువాత ఒకటి గుర్తుకు వస్తాయి . 
***

 మహా సౌధం కూలిపోయిన తరువాత అక్కడ ఆనవాళ్లు కనిపించి నట్టుగా అనిపించింది ఆ గోడను చూసిన తరువాత ...గాంధీ నగర్ లోని ఒకప్పటి బాలాజీ సినిమా హాల్ ఇప్పుడు కేవలం జ్ఞాపకాలు మాత్రమే .. అందులో చూసిన సినిమాలు తక్కువే కావచ్చు .. కానీ ఆ టాకీసు గోడలపై చూసిన సినిమా పోస్టర్ లకు లెక్క లేదు .. ప్రతి రోజూ ఉదయం స్కూల్ కు వెళ్లి హాజరు వేయించుకొన్నట్టుగానే ..స్కూల్  లంచ్ టైం లో ఆ టాకీసుకు వెళ్లి గోడమీద పోస్టర్ లను కాసేపు చూసి అక్కడి నల్లా నీళ్లు తాగి రావలసిందే . ఓ రోజు అలా పోస్టర్ లు చూస్తుండగానే ఒకరు ఘంటసాల మరణించారు అనే వార్త మోసుకొచ్చారు .. అక్కడి పోస్టర్లు చూస్తూ ఆ వార్త విని నాలుగున్నర దశాబ్దాలు అవుతున్నా ఆ దృశ్యం ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది . 
ఫలక్ నుమా ప్యాలెస్ లో పొడవైన ఆ డైనింగ్ టేబుల్ ఎలా ప్రత్యేక మైందో బాలాజీ టాకీస్ కు కిలోమీటర్ల దూరం నుంచి కనిపించే పొడవైన కట్టడం ఒకటి ప్రత్యేక మయింది . రాజు గారికి కిరీటం లా బాలాజీ టాకీస్ కు  పైన జారుడు బండ లాంటి నిర్మాణం ఉండేది. గాంధీ నగర్ ముషీరాబాద్ ఎటు నుంచి చుసిన కనిపించేది .. 
ఒక రోజు టికెట్ పై అయిదు పైసలు అదనపు చార్జీ వసూలు చేశారు . టికెట్ ధర పైన ఐదు పైసలు అదనంగా ముద్రించారు .. బంగ్లాదేశ్ కు సహాయం కోసం . పాకిస్తాన్ నుంచి బంగ్లా దేశ్ వేరుపడింది . బంగ్లా విముక్తిలో మనదేశానిదే కీలక పాత్ర .. అప్పుడు విధించిన అదనపు చార్జీలు నేటికీ కొనసాగుతున్నాయని పత్రికల్లో వచ్చింది . . ఈ రోజుల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా కొత్త సినిమాలు నేరుగా విడుదల అవుతున్నాయి .. ఆ రోజుల్లో బాలాజీ టాకీస్ లో కొత్త సినిమాలు వచ్చేవి కాదు కానీ కొన్ని నెలలు గడిచిన తరువాత వచ్చేవి . జయమాలిని నటించిన జగన్ మోహిని సినిమా ఇందులో బాగా ఆడింది .. 
ఆర్ధిక సంస్కరణల తరువాత సినిమా టాకీసుల్లో కూడా చాలా మార్పు వచ్చింది . మధ్య తరగతిలో పెరిగింది . అంతకు ముందు సినిమా టాకీసులో థర్డ్ క్లాస్ టికెట్ కు జనం ఎక్కువగా ఉండేవారు . థర్డ్ క్లాస్ బుకింగ్ మూసేసిన తరువాతనే పై తరగతి టికెట్లు అమ్ముడు పోయేవి . ఆర్ధిక సంస్కరణల తరువాతి పై తరగతి బుకింగ్స్ క్లోజ్ అయినా తరువాత కింది తరగతి టికెట్ లు ఉన్నా వెళ్లేందుకు ఇష్టపడని తరగతి సంఖ్య భారీగానే  ఉంది .. 
గాంధీ నగర్ ,ముషీరాబాద్ ,భోలక్ పూగాంధీ నగర్ ,ముషీరాబాద్ ,భోలక్ పూర్ ప్రాంతాల వారికీ తలమానికంగా నిలిచిన బాలాజీ టాకీసు ఇప్పుడు ఓ జ్ఞాపకం మాత్రమే . ఆ టాకీసును కూల్చేప్పుడు చుట్టుపక్కల వారంతా చేరి తమ ఇంటిని కూల్చి వేస్తున్నట్టుగా ఆవేదన చెందారు . తాము చిన్నప్పుడు అడుగులు వేసిన ప్రాంతం. తోలి సినిమా చుసిన టాకీసు ను తమ కళ్ళ ముందే కూల్చి వేయడాన్ని తట్టుకోలేక పోయారు . తమ ఆత్మీయుడు మరణిస్తే ఎలాంటి ఆవేదన చెందుతారు ఆలా మూగగా రోధించారు.. 
***
బాలాజీ టాకీసు ఉన్న చోట ఇప్పుడు బాలాజీ ఇంద్ర ప్రస్థ పేరుతో భారీ అపార్ట్ మెంట్ అవతరించింది . వారికి అదో అపార్ట్ మెంట్ మాత్రమే కానీ ఆ ప్రాంత వాసులకు తమ జీవితం లో ఎప్పుడూ చెదిరిపోని జ్ణాపకాల వేదిక . 
 బాలాజీ టాకీసు పక్కనే మరో టాకీసు నిర్మాణం ప్రారంభమయింది .. ఇప్పటిలా భూముల ధరలు అంత ఎక్కువ కాదు కాబట్టి విశాలమైన స్థలం లో బాలాజీ టాకీసు ఉండేది . దాని పక్కన మరో టాకీసు నిర్మాణం ప్రారంభమయింది .. మధ్యలోనే టాకీసు నిర్మాణం ఆపేశారు . ఓ దశాబ్ద కా లం సగం నిర్మాణం తో అలానే ఉండేది .. ఇప్పుడు బాలాజీ టాకీసు లేదు దాని పక్కన మరో టాకీసు లేదు .. ఆ స్థలం లో భారీ అపార్ట్ మెంట్ కనిపిస్తోంది . ఫస్ట్ క్లాస్ , సెకండ్ క్లాస్ , థర్డ్ క్లాస్ అని టికెట్ బుకింగ్స్ కనిపించే చోట ఇప్పుడు అపార్ట్ మెంట్ లో మొదటి లైన్ రెండవ లైన్ మూడు , నాలుగవ లైన్ అని కనిపిస్తోంది . 
టాకీసు మొత్తం కూల్చి వేసినా ఎందుకో కానీ ప్రహరీ గోడను మాత్రం అలానే ఉంచారు . మార్నింగ్ షో పాత సినిమా పోస్టర్ లు అతికించే గోడ అలానే ఉంది కానీ వాటిమీద పోస్టర్ లు మాత్రం లేవు . గేటు గోడ పాతదే.. బాలాజీ క్యాంటిన్ అని మసక మసకగా అక్షరాలు కనిపిస్తున్నాయి . 
కవాడిగూడ లోని ప్రభుత్వ స్కూల్ ను గాంధీ నగర్ కు మార్చారు . అద్దెకు ఉన్నప్పుడు ఇంటిని ఖాళీ చేసినట్టే అద్దె స్కూల్ ను ఖాళీ చేయాలి . దాదాపు నాలుగున్నర దశాబ్దాల క్రితం  స్కూల్ పిల్లలంతా కవాడిగూడ నుంచి గాంధీనగర్ కు నడక అంతా చెట్లూ  చేమ తో అడవిని తలపించేది . జూబ్లీ హిల్స్, హై టెక్ సిటీ కన్నా ముందు అత్యంత ఖరీదైన ప్రాంతం గాంధీ నగర్ .. నాలుగున్న దశాబ్దాల క్రితం ఓ అడవిని తలపించే విధంగా ఉండేది . స్కూల్ లో ఆ రోజుల్లో మధ్యాహ్నం చిక్కని పాలు ఇచ్చేవారు . 
స్కూల్ పిల్లలంతా నడుచుకొంటూ వెళ్లేప్పుడు చెట్ల పొదల నుంచి తొండలు వస్తాయేమో అని భయం .. ఉర్దూలో మాట్లాడితే తొండలు భయపడి రావు అని మాలో ఒకరి సలహా . దాంతో పిల్లలంతా ఉర్దూలో తెగ ముచ్చట్లు . తొండలకు భాషా బేధం ఉంటుందా ?
భోలక్ పూర్ నుంచి గాంధీ నగర్ బాలాజీ టాకీసుకు దగ్గరి దారి . గాంధీ నగర్ నుంచి బాలాజీ టాకీసు దారిలో విసిరివేసినట్టుగా ఒకే ఒక ఇల్లు . ఆ ప్రాంతం లో అదే తోలి ఇల్లు . ఆ ఇల్లు ఇప్పటికీ అలానే ఉంది . చుట్టూ బహుళ అంతస్థుల భవనాలు . 
ఎన్టీఆర్ అంజలి నటించిన బడిపంతులు ఇందులో చూశాను . శ్రీదేవి ఎన్టీఆర్ కు మానవరాలిగా నటించింది . బుచా డమ్మా బుచాడు బుల్లి పెట్టెలో ఉన్నాడు అంటూ టెలిఫోన్ గురించి శ్రీ దేవి పాట పాడేది ఈ సినిమాలోనే ఆ కాలం లో కొద్దీ మంది సంపన్నుల ఇళ్లలో తప్ప టెలిఫోన్ అంతగా అందుబాటులో ఉండేది కాదు .. ఆ రోజుల్లో ఈ పాట చాలా పాపులర్ . 
గ్రామాల్లో పుట్టి పెరిగిన వారికీ చింత చెట్టు జ్ఞాపకాలు తప్పకుండా ఉంటాయి . నగరం లోని వారికీ ఆ జ్ఞాపకాలను మిగిల్చింది మాత్రం బాలాజీ టాకీసు పక్కన ఉండే చింత చెట్టు . ఇప్పుడు ఆ చెట్టూ లేదు ఆ ఖాళీ స్థలం లేదు . ఓ అపార్ట్ మెంట్ చెట్టును ఖాళీ స్థలాన్ని మింగేసింది . బాలాజీ టాకీసులో బాగా ఆడిన సినిమా జయమాలిని నటించిన జగన్ మోహిని . అడ మగ పిల్లా పీచు తేడా లేకుండా జనం తండోప తండాలుగా వచ్చారు . 
టాకీసు కూల్చినప్పుడు రోజంతా ఏడ్చాను . అన్నం తినబుద్ధి కాలేదు . చుట్టుపక్కల ఉన్న అందరూ టాకీసు వద్దకు వచ్చి అలానే బాధ పడ్డారు అని బాలాజీ టాకీసు దగ్గరలోనే ఉండే మిత్రుడొకరు ఆనాటి  జ్ఞాపకాలను  నెమరు వేసుకున్నారు . 
బుద్దా మురళి (జ్ఞాపకాలు నమస్తే తెలంగాణ 31-12-2017)