28, ఫిబ్రవరి 2016, ఆదివారం

వాచీ ఉంగరాల సిద్ధాంతం!

‘మన వీరవాసరం వాళ్ల అమ్మాయికి ఆ నారపల్లి సంబంధం బాగా సరిపోతుంది. నా ఓటు నారపల్లి అబ్బాయికే’’
‘‘ ఆ అమ్మాయి ఐటి ఉద్యోగి. అబ్బాయికి పెద్దగా చదువు సంధ్య లేనట్టుగా ఉంది నీకెలా నచ్చిందమ్మా’’


‘వీడు పిల్లాడు వీడికేం తెలియదు. ఆ సంబంధాన్ని ఖాయం చేసుకోమని నా మాటగా చెప్పండి. అబ్బాయి చేతికి వాచీ లేదు,వేలికి ఉంగరం లేదు. నచ్చడానికి ఇంత కన్నా ఇంకేం కావాలి.’’
‘‘మమీ వాచీ లేని బేవార్స్ సంబంధాన్ని ఆ అమ్మాయికి కట్టబెట్టడం అవసరమా? ’’
‘‘మీ మాటలు వింటుంటే నాకు కాంతం గుర్తుకొస్తుంది’’
‘‘వింటున్నా, పెళ్ళీడు కొచ్చిన కొడుకు ఇంట్లో ఉన్నాడనే జ్ఞానం లేకుండా రోజుకో కొత్త పేరు కలవరిస్తున్నారు. ’’
‘‘అయ్యో అపార్థం చేసుకున్నావు. కాంతం అంటే లెడీసే కానీ నువ్వనుకునే లేడీస్ కాదు. ఛా..్ఛ... నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్ధం కావడం లేదు.’’
‘‘అంతే లేండి ప్రేమలో నిండా మునిగితే మాటలు ఇలానే తడబడతాయి.’’
‘‘ అది కాదు డార్లింగ్.. రచయిత మునిమాణిక్యం పాత్ర కాంతం గురించి నేను చెప్పింది. ఆమె కూడా అచ్చంగా ఇలానే లాజిక్ లేకుండా వాదించడం గుర్తుకొచ్చింది. నచ్చడం, నచ్చక పోవడానికి వాచీ ఉంగరం ప్రాతిపదికేంటి మీ పిచ్చి కాకపోతే ’’
‘‘రాజకీయం మాకూ తెలుసు.. మాకు తెలుసన్న సంగతి మీకు తెలియదు అంతే. ఆడవాళ్లు రాజకీయం మాట్లాడడం ఏమిటని మీకు చిన్నచూపు అంతే. ’’
‘‘ఈ రోజు నా పరిస్థితి బాగాలేదు. నీకు తెలిసింది ఏంటో నువ్వే చెప్పు వింటాను.’’


‘‘నాకు వాచీలేదు, ఉంగరం లేదు, ఎంత పేదరికంలో ఉన్నానో చూడు అని మొన్న ఆంధ్రరాష్ట్ర అధినేత చెప్పాడు కదా? నారాపల్లి అబ్బాయికి వాచీలేదు, ఉంగరం లేదు అందుకే బోలెడు డబ్బుందనే కదా అర్ధం’’
‘‘చూడు పారిజాతం రాజకీయాల్లో ఒక్కో మాటకు ఒక్కో అర్ధం ఉంటుంది. ఆ మాటల వెనుక ఉద్దేశం ఏమిటని ఆలోచించాలి కానీ ఆ మాటలను నమ్మి, యథాతథంగా తీసుకుని జీవితానికి అన్వయించుకుంటే బోల్తా కొడతాం.. నిజం చెప్పు వాచీ ఉంగరం లేదు కాబట్టి పేదవాడు అని నువ్వు అనుకుంటున్నావా ? లేక అచ్చం రాజకీయ నాయకుడిలానే బోలెడు సంపాదించి ఏమీ లేనట్టు నటిస్తున్నాడని నచ్చాడా ?  ’’


‘‘ మీరెన్నయినా చెప్పండి నా అభిప్రాయాన్ని నేను మార్చుకోను. ’’
‘‘23 జిల్లాలకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉదయం రెం డు ఇడ్లీలు, ఒక పుల్కా తింటాను నాకెందుకు డబ్బు అని చెప్పారు గుర్తుందా? 13 జిల్లాలకు సిఎం అయ్యాక రెండిడ్లీలు ఒక్కటయ్యాయా? దేశంలో కెల్లా సంపన్నుడు అంబానీ ఈ లెక్కన రోజుకు లక్షలాది ఇడ్లీలు, వేలాది చపాతీలు తింటారా? ఐనా తినే తిండికి సంపాదనకు సంబంధం ఏమిటోయ్’’
‘‘ అంటే ఎంత కష్టపడ్డా పొట్ట నింపుకోవడానికే అని ఎన్నోసార్లు మీరే అన్నారు. ఎన్టీఆర్ పిసినారి అని విన్నాను కానీ ఏంటండి అల్లుడికి పెళ్లిలో కనీసం ఉంగరం, వాచీ కూడా పెట్టలేదా?. మన పెళ్లికే మా నాన్న సైకిల్ కట్నంగా ఇచ్చారు. ’’


‘‘ పొట్టకూటికోసం కష్టపడేది మనలాంటి వేతన జీవులు, సామాన్యులు. మనం మాట్లాడుతున్నది పాలితుల గురించి కాదు పాలకుల గురించి. కట్నంగా సైకిల్ ఏం కర్మ వేల కోట్లు విలువ చేసే సైకిల్ పార్టీనే మామ నుంచి బలవంతంగా కట్నంగా తీసుకున్నాడు కదా? ’’
‘‘కానీ జగన్‌కు ఉంగరం, వాచీ రెండూ ఉన్నాయి. వైఎస్‌ఆర్‌కు కూడా ఉందండి టీవిలో చూశాను ’’
‘‘ అలా అంటే మహాత్మాగాంధీకి ఉంగరం లేకపోయినా నడుముకు వాచీ ఉంది. కాబట్టి సగం అవినీతి పరుడంటావా? వాళ్ల సంగతెందుకు నాకు వాచీ లేదు, ఉంగరం లేదు. నీ దృష్టిలో నేను కోటీశ్వరున్నా, అవినీతి పరున్నా ఏంటో చెప్పు ’’
‘‘ సర్లేండి బడాయి. మీరూ మీ చచ్చుప్రశ్నలు. రోజంతా రాజకీయాల గురించి ఆలోచిస్తారు కానీ ఆనాయకుల కున్న తెలివి తేటలు మీకెక్కడివి. మీ ఉంగరం, నా బంగారం ఎప్పుడూ బ్యాంకులోనే తాకట్టులో ఉంటుంది కదా? సెల్ ఫోన్ వచ్చాక వాచీ వాడడం లేదు. నాకో బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. దీంతో దేశ రాజకీయాలు ఒక మలుపు తిరుగుతాయి’’
‘‘ ఏంటో ఆ ఐడియా? ’’
‘‘ దేశంలో రాజకీయ నాయకుల్లో ఎవరి చేతికి వాచీ, ఉంగరం ఉందో వాళ్లను అవినీతి పరులుగా ప్రకటించాలి’’
‘‘ ఆ’’


‘‘ ఇప్పటి వరకు కెసిఆర్ అందరినీ ఇరికిస్తూ వచ్చాడు. ఈ దెబ్బతో కెసిఆర్ ఇరుక్కు పోతాడు. ఆయన చేతికి ఎప్పుడూ వాచీ ఉంటుంది. ’’
‘‘ ఇదేం లెక్క’’
‘‘సచివాలయంలో సొరకాయ అన్నవాళ్లు తెలంగకాణ వాళ్లు, అనపకాయ అనే వాళ్లు ఆంధ్ర ఉద్యోగులని ఆయన ఒక్క ముక్కలో తేల్చేయలేదా? ఇదీ అంతే’’
‘‘ చూడు పంకజం నిజాయితీ పరుడు నేను నిజాయితీ పరున్ని అని ముర్ఛ బిళ్ల కట్టుకుని తిరిగినట్టు చెప్పుకోవలసిన అవసరం లేదు. అది లేనప్పుడే పదే పదే తన నిజాయితీ గురించి తాను చెప్పుకోవలసి వస్తుంది. నువ్వన్నట్టు వాచీ, ఉంగరం ధరించడం, తినే ఇడ్లీలు, పుల్కాల సంఖ్యను బట్టి ఏ నాయకుడు ఎలాంటి వారో నిర్ణయిస్తే ఒక్కరు తప్ప దేశంలో నాయకులంతా అవినీతి పరులే అని తేలుతుంది. మీ పెదనాన్న కొడుక్కు ఎలర్జీ వాచీ పెట్టుకోడు, నక్కలపాడు పెదబావ కూతురుకు బంగారం పడదు. ఇంకొకరికి పువ్వులు పడవు. సామాన్యులు పడని వాటికి దూరంగా ఉంటారు. పాలకులు రాజకీయంగా ఉపయోగపడుతుందని ప్రచారం చేసుకుంటారు అంతే తేడా?
బంగారం తాకట్టుపెట్టిన దశ నుంచి ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ఒడ్డున పడేసిని పివి నరసింహారావు వాచీ, ఉంగరం రెండూ ధరించేవారు. జీవితాన్ని దేశానికే అంకితం చేసిన వాజ్‌పాయి వాచీ లేకుండా కనిపించరు. మన్మోహన్‌ను వౌనముని అంటారేమో కానీ అవినీతి పరుడని ప్రత్యర్థి పార్టీలు కూడా వేలెత్తి చూపవు ఆయనా వాచీ పెట్టుకుంటారు. అంతెందుకు ప్రధాని మోదీకీ వాచీ ఉంది. ’’


‘‘ మీరు ఏవేవో చెప్పి అద్భుతమైన సిద్ధాంతాన్ని చిన్నచూపు చూస్తున్నారు.’’
‘‘  మీ అభిమాన నేత కనిపెట్టిన సిద్ధాంతమే నిజం అని 
నువ్వూఅనుకుంటే వాచీతో పాటు ఉంగరం కాదు, ఏకంగా ఉంగరాలు ధరించిన నీ అభిమాన విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీరామారావే దేశంలో కెల్లా అత్యంత అవినీతి పరుడు అవుతాడు మరి ఒప్పుకుంటావా?   వాచీ ఒక్కటే ధరించినా ఆయన ఉంగరాలు మాత్రం చాలా ధరించే వాడు ’’
-బుద్దా మురళి (జనాంతికం 27-2-2016)

21, ఫిబ్రవరి 2016, ఆదివారం

అక్షరాలకూ వాస్తు!

‘‘ఇదిగో నిరంజన్‌రావు నీకు వంద సార్లు చెప్పాను. గంజితో ఆరబెట్టి ఇస్త్రీ  చేసిన నీ చొక్కా కత్తిలా నా చేతికి గాటు పెట్టింది. గంజిలేని చొక్కా వేసుకోలేవా? ’’
‘‘ అధికారం కోసం మరో రెండు దశాబ్దాలైనా ఎదురు చూస్తాం. పదవి లేకపోయినా ఉండగలం. గంజిపెట్టిన కడక్ చొక్కా లేకపోతే రాజకీయాల్లో ఉండలేం. చిన్నప్పటి నుంచి చొక్కామీద మోజుతో రాజకీయాల్లోకి వచ్చాను’’


‘‘ఆపండయ్యా మీ గోల. పసుపు, ఎరుపు, తెలుపు మన పార్టీల రంగులేవైనా కావచ్చు. ప్రజలు మనల్ని సమానంగా చూస్తూ అందరికీ డిపాజిట్లు గల్లంతు చేస్తున్నారు. మనలోని ఈ భావసారూప్యతే మనల్ని ఏకం చేసింది. ఫలితాలపై విశే్లషించుకుందాం. రాజకీయ విశ్లే షకులు, మేధావులు కూడా వచ్చారు. ఎవరి భవన్‌లకు వాళ్లం వెళ్లాక అక్కడ బాహాబాహిలో తేల్చుకుందాం. ఇక్కడ మేధో మధనానికే పరిమితం అవుదాం. ’’
‘‘ రాజకీయ విశ్లే షకుడు అని మీడియాలో కనిపించగానే ఒక్కసారైనా వాడెవడో కళ్లారా చూడాలని పేపర్ చదవడం అలవాటైనప్పటి నుంచి బలమైన కోరిక, ఏరీ రాజకీయ విశ్లే షకులు? ’’
‘‘ అదిగో ఆ మూలకు ముసుగేసుకుని చీకట్లో కొన్ని ఆకారాలు కదులుతున్నాయి కదా? వాళ్లే రాజకీయ విశ్లే షకులు. దేవతా వస్త్రాల తరహాలో రాజకీయ విశే్లషకులు మానవ మాత్రులకు కనిపించరు. ’’
‘‘ ఇక్కడా ముసుగేనా? ’’
‘‘ విషయం ముఖ్యం కానీ ముసుగు వీరుల ముఖంతో మనకేం పని’’


‘‘ పెద్దగా ఉపయోగించని నా మెదుడును వారం రోజుల పాటు చాలా సీరియస్‌గా ఉపయోగించాను. రాత్రి, పగలు, నిద్రలో మెళకువలో ప్రతి క్షణం ఆలోచించి ఓటమికి కారణం నేను కనిపెట్టాను. బెడ్‌రూమ్‌లో యూరేకా అని అరిస్తే మా ఆవిడ కొడుతుందని ఊరుకున్నాను. ఇప్పుడు యూరేకా... యూరేకా అని అరవకుండా ఉండలేకపోతున్నాను. ’’
‘‘ ముందు మీరు కనుగొన్న ఆ గొప్ప విషయం ఏంటో చెప్పి ఏడవండి’’


‘‘ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు మన జానారెడ్డి ఐదు రూపాయల భోజనం చాలా బాగుందని కితాబు ఇచ్చారు కదా? అదే మన కొంప ముంచింది. మన ఆరడగుల బుల్లెట్ మర్రి శశిధర్‌రెడ్డి ఆంధ్ర ఓటర్లకు గాలం వేసి, వ్యూహాత్మకంగా ఓట్ల రద్దుపై ఆందోళన చేశారు. భాగ్యనగరంలో గల్లీ గల్లీలో ఆంధ్ర మెస్‌లు కనిపిస్తాయి. ఒక్కో మెస్‌లో రోజుకు వందల మంది భోజనం చేస్తారు. జానారెడ్డి ఐదురూపాయల భోజనం బాగుంది అనే సరికి ఇది ఆంధ్రా మెస్‌లకు ఎసరు పెట్టే కుట్ర అనుకున్నారు. గ్రేటర్‌లో ఉన్న ఆంధ్రామెస్‌లు+వాటిలో రోజు భోజనం చేసేవారు అంతా కలిసి గులాబీ పార్టీకి ఓటేశారు. జానా ఐదురూపాయల భోజనం మాటతో ఆంధ్రా మెస్‌లు రాత్రికి రాత్రి ప్లేటు ఫిరాయించి, మనల్ని పక్కన పెట్టి గులాబీని నమ్ముకున్నారు. అదే మన కొంప ముంచింది. ’’
‘‘చక్కని విశ్లే షణ. అందరం దీనికే అంగీకరిద్దాం. విడివిడిగా ఆలోచించడం ఎందుకు దండగ’’


‘‘మేం సొంతంగా ఆలోచించడం మొదటిసారే అయినా ఏ మాత్రం తత్తరపాటు లేకుండా మా ఓటమికి మేం చక్కని కారణం కనుగొన్నాం. టిడిపికి ముందు తెలంగాణ అని చేర్చడం వల్ల మేం ఓడిపోయాం. ముందు కాకుండా వెనక చేర్చి ఉంటే మాకు 99 డివిజన్లు, టిఆర్‌ఎస్‌కు ఒక్కటి వచ్చేది. వెనకిది ముందు కావడం వల్ల ఫలితాలు తలక్రిందులయ్యాయి. తెలంగాణలో తెలంగాణ టిడిపి అంటున్నారు, ఆంధ్రలో మాత్రం ఇలా ఏమీ చేర్చకుండా టిడిపి అని మాత్రమే అంటున్నారు. అందుకే అక్కడ గెలిచాం, ఇక్కడ అడ్రస్ లేకుండా పోయాం. చివరకు ఎన్టీఆర్ చివరి దశలో ఎన్టీఆర్ టిడిపి అని పార్టీ పెట్టి పార్టీని పైకి లేపాలనుకుంటే ఎన్నికలకు ముందే ఆయనే పైకి పోయారు. భార్య టిడిపి, కొడుకు టిడిపి, కో పైలట్ టిడిపి అని ఎన్నో టిడిపిలు వచ్చినా ఒక్కటీ నిలవలేదు. కొంత మంది అల్లుడు టిడిపి అని పిలుద్దామని సలహా ఇచ్చినా, భవిష్యత్తు దర్శనం చేసిన మా అధినేత దానికి ఒప్పుకోకుండా టిడిపికి ఏమీ చేర్చలేదు. అందువల్లే బతికిపోయారు.

 భవనాలకు, సచివాలయాలకు, రాజధానులకు వాస్తు ఉన్నట్టే పార్టీ పేరులోని అక్షరాలకు కూడా వాస్తుంటుంది. టిడిపికి ముందు ఏం చేర్చినా వాస్తు ఒప్పుకోదు కావాలంటే వెనక చేర్చవచ్చు. పోటీ చేసిన ప్రతి చోట డిపాజిట్లు గల్లంతు కావడానికి తప్పు అక్షర వాస్తుది కానీ మాది కాదు. మేం పరిశోధించి తేల్చిన విషయం ఇది. మా పార్టీ విధానం ప్రకారం అమరావతి వెళ్లి అధినేతతో మాట్లాడి హైదరాబాద్ ఓటమిపై అక్కడ ప్రకటిస్తాం ’’


‘‘ఇప్పుడు మీరు ఎర్రపార్టీల విశ్లే షణ వినాలి’’
‘‘ ఎర్రన్నా ఎన్నికలు జరిగి నెల కూడా కాలేదు. కనీసం 20-30 ఏళ్ల తరువాత కానీ తప్పు ఎందుకు జరిగిందో? ఎలా జరిగిందో చారిత్రక తప్పిదం అని గుర్తించడం మీ పార్టీ విధానం. ఇప్పుడే విశే్లషించాలని అని మీరు కోరుకోవడం మీ పార్టీ విధానాలకే విరుద్ధం. పువ్వు పార్టీ వాళ్లకు చాన్సిద్దాం’’
‘‘భారత్  మాతాకీ జై.. మేం ఎందుకు ఓడిపోయామో అమిత్‌షా నుంచి ఇంకే నివేదిక  రాలేదు. అమరావతి నుంచి సందేశాలు అందలేదు. క్రమశిక్షణకు మారుపేరైనా మేం సొంతంగా ఆలోచించం’’
‘‘ మమ్ములను మాట్లాడనివ్వాలి. మాట్లాడనివ్వాలి’’
‘‘ అబ్బా ఎవరయ్యా మీరంతా మేం మాట్లాడుకోనివ్వకుండా ఈ కాకిగోల ఏంటి? ’’
‘‘ మేం పబ్లిక్.. మీకెందుకు ఓటు వేయలేదో, మిమ్ములను తుక్కు తుక్కు కింద ఎందుకు ఓడించామో మేం చెబుతాం’’


‘‘ అనుమతి లేకుండా లోనికి రావడమే కాకుండా ఇలా పద్ధతి లేకుండా మాట్లాడడమేనా? మీరు మాకెందుకు ఓటు వేయలేదో మా కన్నా మీకెక్కువ తెలుసా? ఒక్కోక్కరం థర్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీలో ఉన్నాం. మాకు తోడుగా రాజకీయ విశే్లషకులు, మేధావులు ఇంత మంది ఉన్నారు. వీరెవరికీ తెలియంది బోడి మీకు తెలుసా? మీ మాటలు వినేంత పనికి మాలిన వాళ్లలా కనిపిస్తున్నామా? బౌన్సర్స్ వీళ్లను బయటపడేసి రండి’’
‘‘ ప్లీజ్ మేం మీకెందుకు ఓటు వేయడం లేదో మేం చెబుతాం వినండి ప్లీజ్ . ఒక్కసారి వినండి ప్లీజ్.... ప్లీజ్... ’’
‘‘వినమంటే వినం..గెటౌట్.’’

- బుద్దా మురళి (జనాంతికం 21-2-2016)

14, ఫిబ్రవరి 2016, ఆదివారం

ఆనంద్ భవన్ హోటల్- సర్వపిండి రాజనీతి! ‘‘ఈ రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా ఉన్నాయి’’
‘‘ సినిమా కథ తెలిసీ, ఆందోళన చెందుతున్నట్టు నటిస్తున్న ప్రేక్షకుడిలా కనిపిసున్నావ్ నువ్వు’’
‘‘నీకన్నీ వేళాకోళాలే. తెలంగాణలో టిడిపి ఉంటుందా? విలీనం చెల్లుతుందా? రేవంత్ ఏ పార్టీలో చేరుతాడు? లోకేశ్ భవిష్యత్తు ఏమిటి? హరీశ్‌రావు తిరుగుబాటు ఎప్పుడు? అన్నీ సస్పెనే్స కదా? ’’
‘‘జరగబోయే కథ మొత్తం నీ కళ్ల ముందు కదలాడుతున్నా, కోరుకున్నట్టు జరిగితే బాగుండు అని కోరుకుంటున్నావు. అలా జరుగుతుందో లేదో అనే అనుమానంతో ఆందోళన చెందుతున్నావు ’’
‘‘ నేను ఎడ్డెం అంటే నువ్వు తెడ్డెం అంటున్నావ్. ’’
‘‘ ఎప్పుడైనా సర్వపిండి తిన్నావా? ’’
‘‘ సర్వపిండి అంటే ? రాజకీయాలకు సర్వపిండికి సంబంధం ఏమిటోయ్’’
‘‘ తెలంగాణలో చాలా ఫేమస్ పిండి వంటకం. ఏ వంటకమైనా వేడివేడిగా తింటే బాగుటుంది కానీ సర్వపిండి మాత్రం ఒకరోజు తరువాత తింటే రుచిగా ఉంటుంది. సర్వపిండిలో రాజనీతి మొత్తం దాగుంది. పేరేమో పిండి కానీ నమిలి తినే ఆహార పదార్థం. ’’
‘‘వంటల సంగతి తరువాత మాట్లాడుకుందాం కానీ రాజకీయాల్లో ఏం జరగబోతుందో చెప్పు ముందు ’’
‘‘నేను అదే చెబుతున్నాను. సర్వపిండి తెలంగాణలో చాలా పాపులర్ వంటకం నువ్వేమో అదేంటి అన్నావు. అలానే తెలుగుదేశం అంటే తెలంగాణ రాజకీయాల్లో అదేంటి అనే రోజులు వస్తున్నాయి. సర్వపిండి అనగానే తెలంగాణ గుర్తుకు రావడం, పూత రేకులు అనగానే ఆంధ్ర గుర్తుకు రావడం అనివార్యం. పూత రేకులు హైదరాబాద్‌లో ప్రతి గల్లీలో దొరికినా అవి ఆంధ్రా బ్రాండ్ అంబాసిడర్.’’
‘‘చూడు బ్రదర్ బందురు లడ్డు, మచిలీపట్నం పూత రేకులు, కాకినాడ కాజా హైదరాబాద్‌లో ఎక్కడైనా దొరుకుతుంది అందరూ తింటారు. వాటితో పోలిక వద్దు కానీ నేరుగా అర్ధం అయ్యేట్టు చెప్పు ’’
‘‘ఉద్యమ కాలంలో కెసిఆర్ నిజాం కాలేజీలో తెలంగాణ సంబురాలు అని నిర్వహించారు. వారం రోజులకు సరిపోయే సర్వపిండి గంటలోనే అయిపోయింది. తెలంగాణకు తిరుగులేదు, ఎవరితో పొత్తు లేకుండా ఓంటరిగా పోటీ చేయాలని కెసిఆర్ సర్వపిండికున్న డిమాండ్ చూశాక నిర్ణయించుకున్నారని నా అంచనా’’
‘‘ అబ్బా అర్ధం అయ్యేట్టు చెప్పమన్నాను కదా? ’’
‘‘ చూడోయ్ ఆంధ్రుల ఆత్మగౌరవం అని ఎన్టీఆర్ టిడిపిని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అని కెసిఆర్ టిఆర్‌ఎస్‌ను స్థాపించారు. పార్టీల పేర్లు వేరు కానీ ట్యాగ్‌లైన్ ఒకటే కదా? తెలంగాణ ఆత్మగౌరవానికి ఆంధ్రలో మార్కెట్ ఉంటుందా? అలానే ఆంధ్రుల ఆత్మగౌరవానికి తెలంగాణలో డిమాండ్ ఉంటుందా? పోనీ మరాఠీ ఆత్మగౌరవం ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తుందా? తమిళ ఆత్మగౌరవం తెలంగాణ రాజకీయాల్లో పని చేస్తుందా? మనకు నచ్చినా నచ్చక పోయినా అంతే. కెటిఆర్ ఎంత ఉత్సాహ పడ్డా ఆంధ్రలో టిఆర్‌ఎస్ పప్పులుడకవు, లోకేశ్ ఎన్ని వ్యూహాలు పన్నినా తెలంగాణలో టిడిపిని కాపాడలేరు’’
‘‘ అంతే అంటావా? ’’
‘‘ సికిందరాబాద్ అనగానే ఆనంద్ భవన్ హోటల్, బాటా గుర్తుకొస్తుంది. అక్కడ టిఫిన్ చేయకుండా బాల్యం గడిచిన వ్యక్తి ఉండడు. ఆనంద్‌భవన్ కూల్చేశారు. గల్లీ గల్లీకో బాటా రావడంతో సికిందరాబాద్ బాటా ప్రాధాన్యత కోల్పోయింది. ’’
‘‘ నిజమా ఎందుకు కూల్చారు ’’
‘‘ నిలబడి గబ గబా తినే గొప్ప రోజులు ముంచుకుకొచ్చాయి. దాంతో ప్రశాంతగా కూర్చోని తినే సౌకర్యం ఉన్న ఆనంద్‌భవన్ తొలుత మూతపడి, తరువాత కూల్చబడింది. ’’
‘‘ చిన్నప్పుడు నేనూ అక్కడ చాలా సార్లు టిఫిన్ చేశాను. కూకట్‌పల్లి వెళ్లాక అటు వైపు వెళ్లలేదు. ఆ హోటల్‌లో సర్వర్లు మంచి వాళ్లు. పని మంతులు, ఒక్కసారి ఉద్యోగంలో చేరితే పొమ్మన్నా బయటకు పోయేవారు కాదు. నమ్మిన బంట్లు’’
‘‘ తెలంగాణలో టిడిపికి భవిష్యత్తు లేదురా బాబు అంటే నమ్మిన బంట్ల లాంటి క్యాడర్ ఉంది అని ఇలానే వాదిస్తున్నారు. హోటల్‌ను కూల్చేశాక సర్వర్లదేముంది బ్రదర్. దమ్ముంటే ఇంకో హోటల్ పెట్టుకుంటారు. లేదంటే మరో హోటల్‌లో చేరిపోతారు అంతే కానీ సర్వర్ల కోసం హోటల్ నడిపించరు కదా?’’
‘‘ 95లో ఎన్టీఆర్ నుంచి బాబు సైకిల్ లాగేసుకుంటే ఏమైంది. సైకిల్ ఎత్తుకొచ్చారని ఎంత మంది ఎన్ని మాటలన్నా సైకిల్ మాత్రం బాబు చేతిలోనే ఉంది కదా? ఇప్పుడు విలీనం చెల్లుబాటుపై మనం ఎన్ని మాటలు మాట్లాడినా అసెంబ్లీలో సాంప్రదాయాలకే పెద్ద పీట వేస్తారు. మామ కళ్లు మూసి అల్లుడు సైకిల్ ఎత్తుకెళితే, తెలంగాణలో ఆ సైకిల్‌ను తక్కు చేసి తమ్ముళ్లు కారు డిక్కిలో తోసేశారు’’
‘‘ హైదరాబాద్ గడ్డమీద చెడ్డీ వేసుకొని తిరిగాను 100%లోకల్ అని చెప్పిన లోకేశ్‌కు తెలంగాణలో భవిష్యత్తు లేదా? ’’
‘‘ చూడోయ్ లోకేశ్ హైదరాబాద్‌లోనే కాదు అమెరికాలోనూ చెడ్డీలు వేసుకుని స్నేహితురాళ్లతో కలిసి దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. చెడ్డీలతో తిరిగాడని అమెరికా లోకల్ అవుతాడా?  హైదరాబాద్ ప్రచారంలో కెసిఆర్ ఏ మన్నారు? బాబూ  ఊడ్చుకోవడానికి మీకు హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఎన్నో పట్టణాలు ఉన్నాయి వెళ్లు అంటే హైదరాబాద్‌ను ఊడ్చడానికి నేనూ మా అబ్బాయి ఉన్నారని చెప్పకనే చెప్పారు కదా? ఎలక్షన్‌లో ఫలితాలతో ఊడ్చి చూపించారు కూడా . బాబును ప్రజలు ఎన్నుకున్నది ఆంధ్రకు మేలు చేయమని , హైదరాబాద్‌లో  వేలు పెట్టడానికి  కాదు. గ్రేటర్‌లోని ఆంధ్ర ప్రజలూ ఎన్నికల్లో ఇదే మాట చెప్పారు. ’’
‘‘నువ్వేన్నయినా చెప్పు హరీశ్‌రావు తిరుగుబాటు ఖాయం ’’
‘‘మనిషి ఆశా జీవి.. ఇలాంటి ఆశలు లేకపోతే బతకలేడు. తిరుగుబాటు చేస్తాడు అని నమ్మక పోతే నీకు ఆందోళనతో గుండె పోటు వస్తుంది. రేపు బాగుంటుందనే నమ్మకంతో బంగారం ధర చెల్లించి రాగిరేకు కొనుక్కుంటాం ఇదీ అంతే. నమ్మకం లేకపోతే బతకలేవు. యుగాంతం అని దశాబ్దాల నుంచి నమ్ముతున్నప్పుడు ఐదారేళ్లు నమ్మలేవా? ’’
- బుద్దా మురళి  (జనాంతికం 14. 02. 2016)

7, ఫిబ్రవరి 2016, ఆదివారం

నేనే నంబర్ వన్!

  ‘‘నంబర్ వన్‌గా నిలవడం చాలా కష్టం’’
‘‘  అందుకే ఆ కార్పొరేట్ కాలేజీ వాళ్లు ఎంసెట్‌లో నంబర్ వన్ ర్యాంకు వచ్చే అవకాశం ఉన్న వాళ్లను ముందే పసిగట్టి లక్షలకు లక్షలు ముట్ట చెప్పి కొనుక్కుంటారు’’
‘‘ టీవిలో కనిపించే ఒకటి ఒకటి ఒకటి అన్నీ మాకే అనే ప్రకటన గురించా?’’
‘‘ ఆ ఒక్కటే కాదు జీవితంలో ప్రతి దశలోనో నంబర్ వన్ కావడానికే అంతా శ్రమిస్తారు. అంబడిపూడి నుంచి యండమూరి వరకూ అంతా నంబర్ వన్ కావడం గురించి రాశారు కదా? ’’


‘‘ నిజమే ఒకటి అనే అంకెలోనే ఏదో మహత్మ్యం ఉన్నట్టుగా ఉంది. అద్వైతం అంటే సూక్ష్మంగా నంబర్ వన్ కదా? ’’
‘‘ దేవుడొక్కడే అంటారు కానీ 99 అనరు కదా? 1 సంఖ్యకు ఉన్న ప్రత్యేకతే వేరు. ’’
‘‘తమ పిల్లలు ఎంసెటైనా మరే సెట్టు అయినా నంబర్ వన్‌గా నిలవాలని కోరుకుంటారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అభిమన్యుడు యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. ఈ కాలంలో ర్యాంకులు సాధించడమే మహా యుద్ధం కదా? ఈ యుద్ధ విద్యలు ఎందుకు నేర్చుకోలేరని కొందరు పిల్లలకు ర్యాంకులు రావాలని గర్భవతులుగా ఉన్నప్పుడే తల్లులను కోచింగ్‌కు పంపిస్తున్నారు. ’’

‘‘అబ్బా నేను చెబుతున్నది ఆ నంబర్ వన్ గురించి కాదంటే అర్ధం చేసుకోవేం. పూవు పుట్టగానే పరిమళించినట్టు, గ్యాస్ లీక్ కాగానే మంట పుట్టినట్టు, ఇంకా సమావేశం కాకముందే సమావేశ సారాంశం టీవిలో బ్రేకింగ్ న్యూస్‌గా టీవిలో ప్రత్యక్షం అయినట్టు ’’
‘‘అర్థం పర్థం లేని ఉపమానాలు ఆపుతావా? ఇలా ప్రాసలతో హైదరాబాద్‌లో ప్రచారం చేసి వెంకయ్యనాయుడు బిజెపిని నిలువునా ముంచేశాడట!’’
‘‘ఇప్పుడు దారికి వచ్చావు.. నేను చెప్పాలనుకున్నది కూడా రాజధాని సంగతే.. ఫలితాలపై నీ అభిప్రాయం మొత్తం తప్పు అసలు సంగతి వేరుగా ఉంది. అది నీకు అర్ధం కాలేదు’’
‘‘ ఇంకా ఫలితాలపై నేనేమీ చెప్పనే లేదు. తప్పని ఎలా అంటావు. సరే ఆ వేరుగా ఏ ముందో చెప్పు’’
‘‘ యువ జాతీయ నేత లోకేశ్ నాయకత్వంలో జరిగిన తొలి ఎన్నికల్లో ఒకే ఒక సీటు వచ్చిందని ఆయనపై ఏదో సెటైర్లు వేయాలని ప్రయత్నిస్తున్నావని నాకు తెలియదనుకోకు. నీకు తెలియని విషయం ఏంటంటే ఒకే ఒక సీటు వచ్చే విధంగా లోకేశ్ వ్యూహాత్మకంగా ప్రచారం చేశారు ’’
‘‘ నిజమా నమ్మలేకపోతున్నాను’’

‘‘ లేకపోతే బాబు తలుచుకుంటే హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్ గెలుస్తుందా? టిడిపిని ఒకే ఒక డివిజన్‌కు పరిమితం చేయడం వెనుక పెద్ద వ్యూహం ఉంది! ఎవరికీ చెప్పనంటే చెబుతాను ’’
‘‘ ఇలాంటి విషయాలు ఎవరికైనా చెబితే నన్ను అనుమానంగా చూస్తారు. పైగా ముఖం మీదే నవ్వుతారు. ఎవరికీ చెప్పను చెప్పు ’’
‘‘ ప్రపంచంలో ఏ తండ్రైనా తన పిల్లలు ఏ రంగంలోనైనా నంబర్ వన్‌గా నిలవాలని కోరుకుంటారు కదా? అలానే లోకేశ్ గ్రేటర్‌లో నంబర్ వన్‌గా నిలిచారు. ఒకే ఒక డివిజన్‌లో గెలవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎక్కువ మంది గెలిస్తే గ్రూపులు, వారిలో ఎంత మంది పార్టీ మారుతారోతెలియదు. కానీ ఒకే ఒక్కరైతే గెలిచిన వారు ఒక్క మాటపైనే ఉంటారు. లోకేశ్‌కు కార్పొరేటర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం కూడా ఈజీ, ఫోన్ ట్యాపింగ్ భయం ఉండదు, ఇంకెవరైనా వింటారనే అనుమానం ఉండదు. క్యాంపులు నిర్వహించాల్సిన అవసరం ఉండదు, గెలిచిన వారిని మేపడానికి ఖర్చు అవసరం ఉండదు. ’’
‘‘ అంటే ఒక్క స్థానం ఇచ్చింది ప్రజలు కాదన్నమాట.. బాబు 


నేతృత్వంలో లోకేశ్ పర్యవేక్షణలో, రేవంత్‌రెడ్డి సమక్షంలో చాలా కష్టపడి ఒక్క సీటు తెచ్చుకున్నారన్నమాట’’
‘‘ అన్నమాటేంటి ఉన్నమాటే. ప్రజలు ఇష్టంతో గెలిపిస్తే గెలవడానికి మేమేమైనా గులాబీ వాళ్లమా? దీని కోసం ఎన్ని వ్యూహాలు పన్నామో నీకు తెలుసా? విజయవాడలో వ్యూహానికి లోకేశ్ బాబు రూపకల్పన చేసి, తెలంగాణ నుంచి నేతలను విజయవాడకు పిలిచి బోధించి, దాన్ని అమలు చేసేందుకు నేరుగా లోకేశ్ రంగంలోకి దిగి సాధించిన విజయం ఇది. గత ఎన్నికల్లో అసలు పోటీనే చేయని టిఆర్‌ఎస్ ఈసారి ఏకంగా రాష్ట్రంలో, గ్రేటర్‌లో అధికారంలోకి వచ్చింది కదా? అదే విధంగా ఒక్క సీటుతో ఉన్న మనం వచ్చే ఎన్నికల నాటికి హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల్లో కర్నాటక, తమిళనాడుల్లో సైతం అధికారంలోకి వస్తామని చెప్పడానికే ఒక్కసీటుకు పరిమితం అయ్యారు. ’’

‘‘ నిజమా? అయితే మీ వ్యూహం ముందుగానే కాంగ్రెస్‌కు లీకైనట్టుంది’’
‘‘ నీకెందుకొచ్చింది ఆ అనుమానం? ’’
‘‘ మీ ఒక్కసీటు విజయం వెనుక ఇంత వ్యూహం ఉంటే కాంగ్రెస్‌కు రెండు సీట్ల విజయం వెనుక ఎంత వ్యూహం ఉండాలి. నీకు గుర్తుందా? ఒకప్పుడు బిజెపి హనుమకొండ నుంచి జంగారెడ్డి, గుజరాత్ నుంచి ఒక పటేల్  ఇద్దరు మాత్రమే గెలిచారు. రెండు నుంచి ఏకంగా మోదీ నాయకత్వంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతగా ఎదిగింది. దాని కోసమే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా రెండు సీట్లకు పరిమితం అయింది. ’’
‘‘ పాపం ఈ విషయం తెలియక బిజెపి వాళ్లు అనవసరంగా నాలుగు చోట్ల గెలిచినట్టున్నారు? ’’
‘‘ఇంతేనా ఇంకా ఉంది? బాబు,లోకేశ్, రేవంత్‌రెడ్డిలు తలుచుకుంటే ఆ ఒక్కసీటు కూడా గెలవకుండా ప్రయత్నించే వాళ్లు. కానీ అలా చేయలేదు. ఒకవేళ అలా చేసి ఉంటే టిఆర్‌ఎస్‌కు వంద స్థానాలు వచ్చేవి. పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పెద్దలు రాజకీయ సన్యాసం స్వీకరించే వారు. టైగర్ రేవంత్ ఏకంగా తెలంగాణ వదిలి వెళ్లాల్సి వచ్చేది. ఒక్క స్థానంలో టిడిపిని గెలిచేట్టు చేసింది మేమే, 99 స్థానాల్లో టిఆర్‌ఎస్ గెలిచేట్టు చేసింది మేమే. వాళ్లు నిమిత్త మాత్రులు ఆ సంగతి తెలియక గెలిచామని సంబరపడుతున్నారు. 

ఎందరు గెలిచినా నదులన్నీ సముద్రంలో కలిసినట్టు కార్పొరేటర్లు అందరూ కార్పొరేషన్ సమావేశానికి హాజరు కావలసిందే కదా? ’’
‘‘ హైదరాబాద్‌లో నంబర్ వన్‌గా నిలిచిన మీరు ఇలానే ఆలోచించి ఇలానే పాలిస్తే ఆంధ్రలోనూ మీకు తిరుగులేదు. లోకేశ్ బాబుల నాయకత్వంలో ఆంధ్రలోనూ నంబర్ వన్‌గా నిలుస్తారు.’’
బుద్దా మురళి (జనాంతికం 7-02-2016).. 

6, ఫిబ్రవరి 2016, శనివారం

చరిత్ర సృష్టించిన తెరాస

రాజకీయాల్లో విజయం నాయకులను ఆనందంలో ముంచెత్తుతుతుంది. అయితే జిహెచ్‌ఎంసిలో తెరాస సాధించింది సాధారణ విజయం కాదు. సంతోషపెట్టడం కన్నా భయపడాల్సిన విజ యం. సాధారణ రాజకీయ నాయకులు ఒక అసాధారణ విజయంగా దీన్ని చూసి మురిసిపోకూడదు. విజయంపై మురిసిపోవడం, ప్రత్యర్థులను ఎద్దేవా చేయడం ఎవరైనా చేసేదే. కానీ నాలుగు కాలాల పాటు విజ య పరంపర కొనసాగాలన్నా, ప్రజల ఆ కాంక్షలను అర్ధం చేసుకుంటే ఈ విజయా న్ని చూసి భయపడాలి. అలా భయపడితేనే ఈ విజయం నాలుగు కాలాల పాటు నిలుస్తుంది. హైదరాబాద్ నగరానికి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. చాదర్‌ఘాట్ డెవలప్‌మెంట్ బోర్డు నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వరకు 150 ఏళ్ల చరిత్ర ఉంది. ఇంతటి సుదీర్ఘమైన చరిత్రలో గతంలో ఎప్పుడూ ఒక రాజకీయ పక్షానికి ఇంత భారీ మెజారిటీ లభించలేదు.


150 డివిజన్లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో పాత బస్తీలో ఎంఐఎం సామ్రాజ్యాన్ని మినహాయిస్తే మొత్తం నగరంలో టిఆర్‌ఎస్ కారు దూసుకెళ్లింది. గ్రేటర్ ఎన్నికల ప్రచా రం ముగింపు తరువాత తెలంగాణ భవన్‌లో కెటిఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కారు, కెసిఆర్ తప్ప మరోటి చూడబోరు. మీరు ఊహించని స్థాయిలో మా విజయం ఉంటుంది చెప్పారు. టిఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని అందరూ ఊహించిందే అయినా ఈ స్థాయి ఘన విజయం ఊహించలేదు. 14 ఏళ్ల ఉద్యమం ఫలించి తెలంగాణ కల సాకారం అయిన తరువాత జరిగిన ఎన్నికల్లో 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో టిఆర్‌ఎస్ 63 నియోజక వర్గాల్లో సాధించిన విజయం కన్నా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సాధించిన విజయం ఘనమైంది.


గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ వారే ఉంటారు. కానీ హైదరాబాద్ అలా కాదు. తెలంగాణకు రాజధాని అయినా ఇది మినీ ఇండియాలా ఉంటుంది. మినీ ఇండియా రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో ఇంతటి ఘన విజయాన్ని సాధించడం మామూలు విషయం కాదు. తెలంగాణ ప్రజలు, పెద్ద సంఖ్యలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు, దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు చెందిన వారు వీరందరినీ టిఆర్‌ఎస్ నాయకుడు కెసిఆర్ ఏకం చేసినట్టు ఫలితాలు నిరూపిస్తున్నాయి.
టిఆర్‌ఎస్‌కు ఓటు వేయడానికి ఒక్కో వర్గానికి ఒక్కో కారణం ఉండవచ్చు కానీ ప్రజలు టిఆర్‌ఎస్‌పై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారనడానికి ఈ ఫలితాలు నిదర్శనం. వారి ఆశల మేరకు పని చేయాల్సిన బాధ్యత టిఆర్‌ఎస్‌పై ఉంది. విజయాన్ని సొంతం చేసుకునేందుకు అందరూ ముందుకు వస్తారు. తప్పేమీ లేదు అన్ని చేతులు కలిస్తేనే విజయం సాకారం అయిం ది. కానీ ఈ విజయంతో మురిసిపోవడానికే పరిమితం అయితే ఇతర పార్టీలకు టిఆర్‌ఎస్‌కు తేడా ఉండదు. ప్రజలు ఏ ఆశలతో టిఆర్‌ఎస్‌ను, కెసిఆర్ నాయకత్వాన్ని గెలిపించారో గుర్తించి, వాటిని సాకారం చేయా లి. 14 ఏళ్ల తెలంగాణ ఉద్య మం ద్వారా తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టుకున్న టిఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు సాధారణ ఎన్నికల్లో పట్టం కట్టారు. తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలో ప్రజలకు చెప్పి ఒప్పించిన కెసిఆర్, సాధించిన తెలంగాణ ఏ విధంగా ఉండాలో చెప్పి అదే ప్రజలను ఎన్నికల్లో ఒప్పించారు. విజయం సాధించారు. తెలంగాణ ప్రజలు 14 ఏళ్ల ఉద్యమం వల్ల టిఆర్‌ఎస్‌ను గెలిపించారు. ఏడాదిన్నర పాలనలో టిఆర్‌ఎస్ తెలంగాణ ప్రజలతో పాటు హైదరాబాద్‌లో ఆంధ్ర ప్రాంతంతో పాటు ఇతర రాష్ట్రాల ఓటర్ల మద్దతు సైతం సాధించడం విశేషం.


నరేంద్ర మోదీపై దేశ వ్యాప్తంగా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని మూడు దశాబ్దాల తరువాత సంకీర్ణ రాజకీయాలకు స్వస్తిపలికి ఒకే పార్టీకి విజయం చేకూర్చారు. అయితే మోదీ అధికారం చేపట్టిన తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ బిజెపికి ఎదురుగాలి వీస్తోంది. మోదీ పాలిస్తున్న ఢిల్లీ రాష్ట్రంలోనే బిజెపికి ఘోరపరాజయం తప్పలేదు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఎక్క డ ఏ ఎన్నికలు జరిగినా బిజెపికి పరాజయమే. బిహార్‌లో లక్షల కోట్ల ప్యాకేజీని సై తం ప్రజలు తిరస్కరించారు. మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో నాలుగువ స్థానంలో నిలిచారు. అదే సమయంలో తెలంగాణలో మాత్రం ఏ ఎన్నికలు జరిగినా టిఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తోంది. వరంగల్ పార్లమెంటులో విపక్షాలకు డిపాజిట్ దక్కలేదు. టిడిపి ఆవిర్భావం నుంచి 17 ఏళ్లపాటు అధికారంలో ఉన్న సికిందరాబాద్ కంటోనె్మంట్‌లో విజయం సాధించలేకపోయింది. కానీ టిఆర్‌ఎస్ మాత్రం తొలిసారి పోటీ చేసి కంటోనె్మంట్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌లో ఇంతకు మించిన ఘన విజయం సాధించింది.


రోమ్‌లో రోమన్‌లా ఉండమన్నారు. అలానే ఉద్యమ కాలంలో ఉద్యమ కారుడిగా ఉన్న కెసిఆర్ తెలంగాణ ఆవిర్భావం జరిగాక, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత ఒక పాలకుడిగానే ఉన్నారు. ఉద్యమ కారుడిగా 14 ఏళ్లపాటు కెసిఆర్‌ను చూసిన వారు ముఖ్యమంత్రిగా సైతం అదే విధంగా ఊహించుకున్నారు. కానీ వారి ఊహలను పటాపంచలు చేస్తూ కెసిఆర్ రాజధర్మాన్ని పాటించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కెసిఆర్ ప్రచారం చేసింది రెండే రెండు సార్లు. ఒకటి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధికి ఏం చేయదలిచారో చెప్పారు. ఒక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. విపక్షాలు ఉద్యమ కాలంలో కెసిఆర్ ఏం మాట్లాడారో చెప్పడానికి ప్రయత్నిస్తే, కెసిఆర్ మాత్రం ప్రభుత్వాధి నేతగా హైదరాబాద్‌లో ఏం చేయదలిచారో చెప్పారు. హైదరాబాద్‌లో ఉండేవారంతా మా బిడ్డల్లాంటి వారే అని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను సైతం కొందరు తప్పు పట్టారు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా విభజన జరిగింది. ఇది అయిపోయిన అంశం. ఇప్పుడు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే దానిపై అందరి దృష్టి ఉండాలి. ఏం చేస్తామో చెప్పిన టిఆర్‌ఎస్‌ను ప్రజలు ఆదరించారు. ఈ అంశంలో సరైన వ్యూహం లేని విపక్షాలను జనం పాతిపెట్టేశారు. 

సాధారణ విజయం అయితే టిఆర్‌ఎస్ ఈ ఫలితాలను సాధారణంగా తీసుకోవచ్చు. కానీ ఇవి అసాధారణ ఫలితాలు. ప్రజలు టిఆర్‌ఎస్‌పై ప్రాంతాలకు, రాష్ట్రాలకు, కులాలకు అతీతంగా ఎంత ఆశలు పెట్టుకున్నారో తెలిపే ఫలితాలు. టిఆర్‌ఎస్ ఈ దిశగా పని చేయాల్సిన బాధ్యత ఉంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. వరుస విజయాలతో ప్రజలు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారని స్పష్టం అవుతోంది. అయితే ఇంకా మిగిలి ఉన్నది మూడేళ్ల కాలం. ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పారో వాటిని చేసి చూపించాం అని వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ నాయకత్వం సగర్వంగా ప్రకటించుకునే అవకాశం ఉండాలి. తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పాతాళంలో పడిపోతుందని, చీకట్లు తప్పవని భారీగా ప్రచారం చేశారు. ఈ మాటలు తెలంగాణ వారిని సైతం భయపెట్టాయి. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత నాయకత్వం సరైన పంథాలోనే వెళ్లి ఈ ప్రచారాలు పచ్చి అబద్ధాలని నిరూపించగలిగింది. ప్రపంచ ప్రఖ్యాత ఐటి కంపెనీలు హైదరాబాద్‌లో అడుగు పెట్టేట్టు చేసింది.


హైదరాబాద్ తెలంగాణ గుండె కాయ. ప్రచారం ద్వారా ఈ గుండెకాయనే పిసికేయాలని ప్రయత్నించారు. కానీ టిఆర్‌ఎస్ నాయకత్వం గుండెకాయను బతికించుకుంటేనే తెలంగాణ బతుకుతుందని గ్రహించి సమర్ధవంతంగా పని చేసింది. ఇక టిఆర్‌ఎస్‌కు ఎదురులేదని తేలిపోయింది. ఇంకా మూడున్నర ఏళ్ల కాలంలో చెప్పినవి చేసి చూపడంపై దృష్టిసారించాలి. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ప్రజలతో కనెక్ట్ కాలేకపోయామని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ ఇక్కడే విజయం సాధించింది. ప్రాంతాలు, కులాలకు అతీతంగా ప్రజలకు టిఆర్‌ఎస్ కనెక్ట్ అయింది. వారికి ఏం కావాలో టిఆర్‌ఎస్‌కు స్పష్టమైన అవగాహన ఉంది. ఇక మిగిలిన ఈ మూడున్నర ఏళ్ల కాలంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంపై దృష్టిసారించాలి. తెలంగాణ టైగర్, ఆంధ్ర టైగర్, అంతర్జాతీయ టైగర్‌లుగా తమకు తామే ముద్రలు వేసుకున్న చంద్రబాబు, లోకేశ్, రేవంత్‌రెడ్డిని ప్రచారంలో ఎంత తిరిగినా, ఎన్ని తిట్టినా చివరకు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు సైతం విలువ ఇవ్వలేదు. ముగ్గురు టైగర్లుకలిసి ప్రచారం చేసినా మూడు సీట్లు రాలేదు. ఇంటింటికి అందుతున్న ఆసరా పథకం, ఆశలు కల్పించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం టిఆర్‌ఎస్ ఘన విజయంలో కీలక పాత్ర వహించాయి. కాళ్లు కడిగినప్పుడే కాపురం ఎలా చేస్తుందో తెలుస్తుంది అంటారు. సెంటిమెంట్ ఎల్ల కాలం నిలబడదు, 60 డివిజన్లలో మా సామాజిక వర్గం వాళ్లే ఫలితాలను తేలుస్తారు అంటూ టిడిపి సామాజిక అనుబంధ మీడియా బహిరంగంగా ప్రకటించింది. కానీ ప్రజలు వీటికి ప్రాధాన్యత ఇవ్వలేదు.


విపక్షాలు టిఆర్‌ఎస్‌ను భయపెట్టే స్థాయిలోలేవు. ప్రజల ఆకాంక్షలే టిఆర్‌ఎస్‌ను నడిపిస్తున్నాయి. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథ కం ఒక శక్తివంతమైన ఆయుధం. ఎన్ని ఇళ్లు కట్టి చూపిస్తే టిఆర్‌ఎస్ చేతిలో అన్ని ఆయుధాలు ఉన్నట్టు. చెప్పినవి చెప్పినట్టుగా చేసి చూపిస్తే టిఆర్‌ఎస్ పథకాలే ఆ పార్టీ చేతిలో బ్రహ్మాస్త్రాలు. కనీసం ప్రచారం కూడా చేయని పాతబస్తీలో సైతం టిఆర్‌ఎస్ తన ప్రభావం చూపగలిగింది అంటే మతాలకు, కులాలకు అతీతంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారో స్పష్టం అవుతోంది. ప్రచారం చేసిన డివిజన్లను మించి సీట్లు సాధించింది. 

తెలంగాణలో ఇప్పుడు నినాదాలు పని చేయవు, సిద్ధాంతాలను పట్టించుకోవడం లేదు. కులాలు చూపించే ప్రభావం చాలా తక్కువ. పథకాల అమలే ప్రభావం చూపిస్తాయి. ప్రకటించిన పథకాల అమలు టిఆర్‌ఎస్‌ను భయపెట్టాలి. ఒక బాధ్యతను నెరవేర్చాలనే చిత్తశుద్ధి ఉన్నవారిని ఆ బాధ్యత నెరవేర్చేంత వరకు మనసు నిద్ర పోనివ్వదు. ఇంతటి ఘన విజయం టిఆర్‌ఎస్ నాయకత్వానికి లక్ష్య సాధన కోసం నిద్ర పోనివ్వదు. అలా జరిగితేనే ప్రజలకు మేలు, టిఆర్‌ఎస్ నాయకత్వానికి మేలు.

బుద్దా మురళి (6.2.2016 ఎడిట్ పేజి )