30, మార్చి 2012, శుక్రవారం

క్విక్ మ్యారేజేస్ కు పోటి .. క్విక్ డైవోర్స్ ...తక్షణ విడాకులు భస్మాసుర వరమా ? కల్ప తరువా ?
ఆవిడెవరో వనజా రావు  క్విక్ మ్యారేజేస్ అంటూ తెగ హడావుడి చేస్తున్నారు. ఆమె వ్యాపారం చూసి ప్రభుత్వానికి కన్ను కుట్టిందో మరేమిటో కానీ క్విక్ మ్యారేజేస్ కు పోటిగా క్విక్ డైవోర్స్  స్కీం  ప్రకటించేసింది కేంద్రం. దీంతో మనం ఎలగయితే నేఁ  అమెరికాను తోసి ముందుకు వెళ్లి పోయాం . 
 ఆర్థిక రంగంలో కాదు. విడాకుల రంగంలో... ఔను అమెరికా పౌరులకు విడాకులు మంజూరు కావాలంటే రెండేళ్లవరకు పడుతుంది. పలు ఐరోపా దేశాల్లో ఆరేళ్ల వరకు సమయం పడుతుంది. అమెరికాలో విడాకులు కోరుకునే సంఖ్య చాలా స్పీడ్‌గా పెరుగుతోంది కానీ విడాకులు మాత్రం అంత స్పీడ్‌గా లభించడం లేదు. అమెరికాలోని ప్రతి వెయ్యి జంటల్లో నాలుగు వందల జంటలు విడాకుల పేరుతో విచ్ఛిన్నం అవుతున్నాయి. మన దేశంలో వెయ్యికి 11 జంటలు మాత్రమే విడాకులు తీసుకుంటున్నారు. క్విక్ మ్యారేజెస్ మాదిరిగా నిజానికి క్విక్ విడాకుల అవసరం మనకన్నా అమెరికాకే ఎక్కువగా ఉంది. కానీ ఎందుకోగానీ ఈ సౌకర్యం అమెరికా కంటే ముందే మనకు లభించింది. హిందూ వివాహ చట్టం సవరణ బిల్లు 2010కి కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేయడంతో ఇప్పుడు మన దేశంలో విడాకులు పొందడం చాలా సులభం. మహిళలను గృహ హింస బారి నుంచి తప్పించాలన్న అభిప్రాయంతో కేంద్రం ఈ మార్పును తెచ్చింది. అందువల్లనే భార్య విడాకులు కోరుకున్న పక్షంలో భర్త అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా విడాకులు మంజూరు చేసే విధంగా చట్టంలో మార్పులు తెచ్చారు.

 ఇష్టం ఉన్నా లేకున్నా గతంలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నవారు తప్పని సరిగా కనీసం 18 నెలల పాటు నిరీక్షించాల్సి వచ్చేది. తాత్కాలిక ఆవేశంతో విడాకుల కోసం దరఖాస్తు చేసినా 18 నెలల గడువు ఉండడం వల్ల అన్ని కోణాల్లో ఆలోచించి తమ నిర్ణయాన్ని మార్చుకుంటారు అనే ఉద్దేశంతో ఈ నిబంధన విధించారు. ఏం ఆలోచించారో కానీ ఇప్పుడు దీన్ని తొలగించారు. కోర్టుకు వచ్చినప్పుడు కేసుల పరిస్థితిని బట్టి న్యాయమూర్తే నిర్ణయం తీసుకుంటారు. అంతేతప్ప తప్పని సరిగా వేచి ఉండాల్సిన అవసరం లేదు. విడాకుల కోసం దంపతులు కోర్టులను ఆశ్రయించినప్పుడు తప్పనిసరిగా కొంతకాలం నిరీక్షించాలనే నిబంధన విధించారు. ఎవరైనా తమ దాంపత్యం కలకాలం ఉండాలని కోరుకుంటూనే పెళ్లి చేసుకుంటారు. అంతేతప్ప సరదాగా కొంతకాలం కాపురం చేసి విడాకులు తీసుకుందామని ముందుగానే నిర్ణయించుకుని పెళ్లి చేసుకునేవారు ఎవరూ ఉండరు.
భార్య వేసుకున్న డ్రెస్ నచ్చలేదని భర్త విడాకులు ఇచ్చాడని, భార్య చేసిన కాఫీ నచ్చలేదని భర్త విడాకులు కోరాడని అమెరికా వార్తలను మనం ఒకటి రెండు దశాబ్దాల క్రితం నిజమా? అని వింతగా చదివేవాళ్లం. ఆర్థిక సంస్కరణల తరువాత ఇలాంటి వింతలు మనకు ఇప్పుడు లోకల్ వార్తలు అయ్యాయి. ఇలాంటి దాంపత్యాన్ని హిందూ వివాహ చట్టంలోని సవరణలు మరింత ప్రమాదంలో పడేట్టుగా ఉన్నాయి. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతోందని ఆందోళన చెందుతున్న సాంప్రదాయ వాదులకు వివాహ చట్టంలోని సవరణలు మరింతగా ఆందోళన కలిగించే విషయం.
దంపతుల మధ్య ఇక కలిసి ఉండే ప్రసక్తే లేదు అనే భావన ఏర్పడినప్పుడు, కలిసి ఉండే పరిస్థితి లేనప్పుడు, వారిని ఇంకా కలిపే ఉంచాలని ప్రయత్నించడం అర్ధరహితం, అమానవీయమని లా కమీషన్ విడాకులను సమర్థిస్తూ పేర్కొంది. వివాహం అర్ధరహితంగా మారినప్పుడు విడాకులే పరిష్కారం అని తేల్చింది. నిజమే రోజూ శత్రువుల్లా కలిసి ఉండడం కన్నా ఎవరికి వారు విడివిడిగా కొత్త జీవితాలు ప్రారంభించడమే మంచిది. అయితే అది ఆలోచనతో తీసుకునే నిర్ణయం కావాలి కానీ తాత్కాలిక ఆవేశంతో తీసుకునే నిర్ణయం అయితే కొత్త నిర్ణయం వల్ల మరిన్ని కొత్త సమస్యలు వస్తాయి. వివాహం తరువాత విడాకుల కోసం ఇప్పుడున్న నిబంధనల ప్రకారం కనీసం 18 నెలల పాటు వేచి చూడాలి. ఆ తరువాత కూడా వెంటనే విడాకులు మంజూరు అవుతాయనే నమ్మకం లేదు. విడాకుల కోసం దశాబ్దాల పాటు కోర్టుల చుట్టూ తిరిగిన కేసులు సైతం ఉన్నాయి. పొరపాటు గ్రహించి విడాకులు తీసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఇలాంటి ఆలస్యం నిజంగా శాపమే. దశాబ్దాల తరబడి కోర్టుల చుట్టూ తిరగడానికే జీవితం సరిపోతుంది ఇక కొత్త జీవితం మొదలు పెట్టేది ఎప్పుడు. ఇలాంటి వారి కోణంలో ఆలోచిస్తే 18 నెలల పాటు తప్పనిసరిగా వేచిచూడాల్సిన గడువు తొలగించడం మంచి నిర్ణయమే అనిపిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆవేశంతో విడాకుల కోసం కోర్టులను ఆశ్రయించే కేసులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇలాంటి కేసుల్లో ఈ కొత్త మార్పు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. 

విడాకుల కోసం ఇద్దరిలో ఒకరు కోరుకుంటే వేధించాలనుకున్న మరొకరు కేసుకు హాజరు కాకుండా పోవడం వల్ల ఏళ్లతరబడి కేసులు సాగుతున్నాయి. కొత్త మార్పుల ప్రకారం ఇప్పుడు భార్య విడాకులు కోరితే అభ్యంతరం వ్యక్తం చేసే అధికారం భర్తకు ఉండదు. 18నెలలు వేచిచూడాల్సిన అవసరం లేదు. అదే భర్త మాత్రమే విడాకులు కోరితే అభ్యంతరం చెప్పే అధికారం భార్యకు ఉంటుంది. మారిన పరిస్థితుల్లో మగవారే కాదు ఆడవారు సైతం కొన్ని సందర్భాల్లో ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే పెద్దలు సర్దిచెప్పేవారు. ఇప్పుడు ఇద్దరూ చదువుకున్నవారే, ఇద్దరూ సంపాదిస్తున్నారు. ఇది కుటుంబ సంతోషానికి ఉపయోగపడితే మంచిదే కానీ కొన్ని సందర్భాల్లో ఇది ఇద్దరి మధ్య విడాకులకు దారితీసేందుకు ఉపయోగపడుతోంది.  తక్షణ విడాకులు  భస్మాసుర  వరమా ? లేక  కల్ప తరువా ?  కాలమే సమాధానం చెబుతుంది 
.

29, మార్చి 2012, గురువారం

తెలుగు దేశం కు పునర్వైభవం సాధ్యమేనా?

వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఎన్టీరామారావు 1982 మార్చి 29న ఏర్పాటు చేసిన టిడిపి , రెండవ తరం నాయకుని చేతిలో 30 ఏళ్లను పూర్తి చేసుకుని 31వ ఏట అడుగుపెడుతోంది. బాబు పార్టీకి పూర్వవైభవం తీసుకు రాగలరా? మూడవ తరం నాయకుడు బాబు కుమారుడా? బాలకృష్ణనా, హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆరా? ఇప్పుడు టిడిపి శ్రేణులను తొలుస్తున్న ప్రశ్నలివి. వీటికి 2014 ఎన్నికల తరువాతనే సమాధానాలు లభిస్తాయి. మీడియా ఎంత అండగా నిలిచినప్పటికీ ఒకప్పుడు ఉజ్వలంగా వెలుగొందిన టిడిపి పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. మరో రెండేళ్లలో మూడవ సారి ఎన్నికలు ఎదుర్కోవాలి. రాజకీయాల్లో రెండేళ్లు అంటే సుదీర్ఘ కాలమే! ఒక్క చిన్న సంఘటన చాలు ఎన్నికల్లో జయాపజయాలను మార్చివేయడానికి. అలాంటిది రెండేళ్లలో ఏం జరుగుతుందో చెప్పలేం అంటూ అనుకూల మాటలు ఎన్ని చెప్పుకున్నా ఏ కోణంలోనూ టిడిపికి ఆశాజనకమైన వాతావరణం కనిపించడం లేదు. తెలంగాణలో తెలంగాణ వాదం, సీమాంధ్రలో జగన్ బలం ఈ రెండూ టిడిపిని ఆడకత్తెరలో పోకచెక్కలా మార్చేశాయి.


ఎన్టీఆర్ నాయకత్వంలో 94లో జరిగిన ఎన్నికల్లో టిడిపికి 44 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తరువాత బాబు నాయకత్వంలోకి పార్టీ వచ్చాక క్రమంగా ఓట్ల శాతం పడిపోతూనే ఉంది. 99లో బిజెపి సానుభూతి పని చేసి 39 శాతం ఓట్లు వచ్చాయి. 2004లో 37 శాతం వస్తే, 2009 నాటికి 28 శాతానికి పడిపోయాయి. ఇప్పుడు వామపక్షాలు సైతం దూరమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో టిడిపి పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. 2009 అసెంబ్లీ సాధారణ ఎన్నికల తరువాత 21 అసెంబ్లీ నియోజక వర్గాలకు, ఒక పార్లమెంటు నియోజక వర్గానికి ఉప ఎన్నికలు జరిగితే, అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ఒక్కటంటే ఒక్కసీటు కూడా గెలుచుకోలేదు. రాయలసీమ, కోస్తా, తెలంగాణ అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఈ రెండు ప్రధాన పక్షాలు ఘోరంగా ఓడిపోయాయి. గెలుపు మాట అటుంచి 21 అసెంబ్లీ నియోజక వర్గాలకు గాను టిడిపి కేవలం మూడు చోట్ల మాత్రమే డిపాజిట్ దక్కించుకుంది.


మీడియా మద్దతు, బలమైన సామాజిక వర్గం అండ దండలు సైతం టిడిపిలో ఉత్సాహాన్ని నింపలేకపోతున్నాయి. ‘సంక్షోభంలో ఉన్నది టిడిపి కాదు... రాష్ట్రం సంక్షోభంలో ఉంది... రాష్ట్ర ప్రజలు సంక్షోభంలో ఉన్నారు’ అంటూ బాబు ఎంత మాటల గారడీ చేస్తున్నా, టిడిపి తన జీవితంలో ఇంతకు ముందెన్నడూ లేనంత సంక్షోభంలో ఉంది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వయసు 38 ఏళ్లు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ విజయం సాధించగానే అఖిలేష్ చేసిన మొదటి ప్రకటన సమాజ్‌వాది పార్టీది గుండాల రాజ్యం అనే ముద్రను చెరిపివేయడానికి కృషి చేస్తామని ప్రకటించారు.


తప్పులు ఏమిటో గుర్తించుకుంటే వాటిని ఎలా సవరించుకోవాలో ఆలోచన వస్తుంది. తొలిసారి ఓటమి చెందగానే ఎందుకలా జరిగిందో సమీక్షించుకొని, లోపాలను నిజాయితీగా బహిరంగంగా ఒప్పుకుంటే పార్టీకి మేలు జరిగేది. బిజెపికి రాష్ట్రంలో సొంతంగా 18 శాతం ఓట్లు వచ్చాయి, టిడిపితో చేతులు కలిపిన తరువాత 2 శాతానికి పడిపోయంది. 2004లో బిజెపితో పొత్తు వల్ల ఓడిపోయాం అని బాబు ప్రకటించారు. 2009లో టిఆర్‌ఎస్‌తో పొత్తు వల్ల ఓడిపోయినట్టు చెప్పుకున్నారు. 2009లో టిఆర్‌ఎస్‌తో పొత్తు లేకపోతే ప్రజారాజ్యం, టిఆర్‌ఎస్, సిపిఐ కలిసి పోటీ చేసేవి, అలా జరిగితే అప్పుడు తెలిసేది. ఒక్క ఓటుతో వాజ్‌పాయి ప్రభుత్వం ఓడిపోవడం వల్ల వచ్చిన సానుభూతి వల్ల 99లో గెలిచిన విషయం ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకోని బాబు బిజెపి వల్ల ఓడాం అని చెప్పినా టిడిపి, బిజెపి బంధాన్ని ముస్లింలు మరిచిపోలేక పోతున్నారు. టిడిపికి చేరువ కాలేకపోతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని అబ్బురపరిచే విధంగా పాలించాము అని ప్రచారం చేసుకున్న బాబుకు ఓటమికి కారణాలు చెప్పుకోవడానికి మనసు ఒప్పలేదు. అహం అడ్డు వచ్చినట్టుగా ఉంది. మేం ప్రజలకు మంచి చేయడం వల్లనే ఓడిపోయాం, అవినీతికి దూరంగా ఉండడం వల్లనే ఓడాం అని టిడిపి నాయకత్వం వింతైన వాదనలు చేస్తుంది. గుండారాజ్ అనే ముద్ర చెరిపేసుకుంటాం అని అఖిలేష్ ప్రకటించారంటే అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ వాళ్లు గుండాల్లో వ్యవహరించారని అతను నిర్మొహమాటంగా ఒప్పుకున్నట్టే. తాము ఎక్కడ తప్పు చేశామో గ్రహించి వాటిని సవరించుకోవడానికే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాధాన్యత ఇచ్చామని అఖిలేష్ బహిరంగంగానే చెప్పారు. మేం సంక్షోభంలో లేం, రాష్ట్రం, రాష్ట్ర ప్రజలే సంక్షోభంలో ఉన్నారని ఒకవైపు చెబుతూనే మరోవైపు టిడిపికి సంక్షోభాలు కొత్త కాదు అంటున్నారు. రాష్ట్ర రాజకీయాలతో ఏ మాత్రం పరిచయం వారికి బాబు మాటలు వింటే ముచ్చటేస్తుంది. రాజకీయ పక్షాలు ఎన్నికల్లో డబ్బును గుమ్మరిస్తున్నాయి, కులాన్ని ఉపయోగించుకుంటున్నాయి. ఇవి బాబు కనిపెట్టిన విషయాలు. ఇవాయన కనిపెట్టినవి కాదు ఆయన రాజకీయాల్లో మొదటి నుంచి అమలు చేస్తున్నవి. కులాన్ని అత్యధికంగా ఉపయోగించుకుంటున్న నాయకుడు ఆయనే, పార్టీ ఆయనదే. చివరకు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు, ఆరోపణలు ఎవరు చేయాలో కుల ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. ఎన్టీఆర్ భవన్‌లో రెడ్డి నాయకుని విలేఖరుల సమావేశం అంటే కాంగ్రెస్ లేదా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి నాయకులపై విమర్శల కోసం అని ముందే నిర్ణయించుకోవచ్చు. ప్రత్యర్థి పార్టీలో ఏ కులం నాయకున్ని విమర్శించాలంటే అదే కులానికి చెందిన టిడిపి నాయకులతో ఎన్టీఆర్ భవన్‌లో విలేఖరుల సమావేశాలు ఏర్పాటు చేయిస్తారు. సీమాంధ్ర రాజకీయాల్లో కులానిది ప్రధాన పాత్ర కాగా, తెలంగాణలో కులం ప్రభావం తక్కువ, తెలంగాణ వాదమే ప్రధానం. కులం కార్డుతో తెలంగాణ వాదాన్ని మరుగున పరచడానికి తీవ్రంగానే ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. టిడిపి ఆవిర్భావం నుంచి ఏ ప్రాంతంలో ఏ కులం ఓట్ల శాతం ఎంత? కాంగ్రెస్ ఏ కులానికి టికెట్ ఇస్తే మనం ఏ కులానికి ఇవ్వాలి అని లెక్క పెట్టుకునేది. పార్టీ బాబు నాయకత్వంలోకి వచ్చాక ఇది మరీ పెరిగిపోయింది. రోజు రోజుకు కులం ప్రభావం అధికం కావడంతో ఈ సమస్య చివరకు టిడిపి తలకు చుట్టుకుంది. టిడిపి సామాజిక వర్గంతో అనుబంధంగా ఉండే కులాల కన్నా టిడిపి వ్యతిరేక శిబిరాల్లోని కులాల వారి ఓట్లు అధికం అదే ఇప్పుడు టిడిపి కొంప ముంచింది. జగన్ అవినీతిపై టిడిపి, టిడిపికి అండగా నిలిచే వర్గాలు ఎంత వ్యతిరేక ప్రచారం సాగించినా, ఎన్నికల్లో అది పని చేయకపోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. టిడిపి తిరిగి అధికారంలోకి రావాలని కోరుకునే బలమైన వర్గం ఒకవైపు జగన్ వ్యతిరేక ప్రచారం విస్తృతం చేస్తూ మరోవైపు తెలంగాణ అంశాన్ని మరుగున పరచడానికి ఎంత ప్రయత్నించాలో అంత వరకు ప్రయత్నించారు. కానీ రెండింటిలోనూ విజయం సాధించలేకపోయారు. అయితే సమైక్యవాదం లేదంటే, తెలంగాణ ఉద్యమానికి కెసిఆర్‌కు ప్రత్యామ్నాయ నాయకత్వం అనే సిద్ధాంతంతో తొలుత విజయశాంతిని, తరువాత గద్దర్‌ను ఆకాశానికెత్తారు. విజయశాంతి టిఆర్‌ఎస్‌లో చేరగా, గద్దర్ తన శక్తి తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడుతుందని భావించినా కెసిఆర్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలువలేనని గ్రహించారు. 2009 ఎన్నికలకు ముందు టిడిపికి అండగా నిలిచే వర్గం తన సర్వశక్తులు ఒడ్డింది. యువగర్జనలో ఈ శక్తుల బలప్రదర్శనగా జరిగింది. ఇప్పుడు చివరకు ఈ వర్గంలో సైతం బాబు పట్ల విశ్వాసం సన్నగిల్లుతోంది.


 తెలంగాణపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుంది? జగన్‌ను అరెస్టు చేస్తారా? వీటికి ఇప్పటికిప్పుడు సమాధానం లభించని ప్రశ్నలు. నిజమే ఈ రెండు సమస్యలను కాంగ్రెస్ హై కమాండ్ ఎలా పరిష్కరిస్తుందో తెలియదు. కానీ టిడిపికి ప్రయోజనం కలిగే విధంగా ఈ రెండు సమస్యలు పరిష్కరించుకోవాలని కాంగ్రెస్ ఎందుకనుకుంటుంది. జగన్, టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అవుతుంది అనేది టిడిపి కొత్త ప్రచారం. టిడిపి తిరిగి అధికారంలోకి రావాలంటే అది జరిగి తీరాలి. కాబట్టి టిడిపి శ్రేయోభిలాషులు ఆ కోరిక కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఎందుకు విలీనం అవుతారు. కాంగ్రెస్ మునిగిపోతున్న పడవ అని స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు అది టైటానిక్ లాంటి గొప్ప పడవ అయినా కావచ్చు కానీ మునిగేప్పుడు అందులో ఎక్కేవారుంటారా? కాంగ్రెస్ వ్యతిరేకతే సిద్ధాంతంగా ఉన్న టిడిపికి కాంగ్రెస్ మరీ బలహీనపడిపోవడం కలవరపెడుతోంది. తమతో ఓడిపోయే స్థాయిలో కాంగ్రెస్ ఉండాలని టిడిపి కోరుకుంటోంది కానీ సోదిలో లేకుండా పోయే స్థాయిలో ఉంటే అది టిడిపికి సైతం నష్టమే. అదే ఇప్పుడు టిడిపి సమస్య. కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలో ఉన్న తరువాత మూడవ సారి జరిగే ఎన్నికల్లో సులభంగా గెలుస్తామనుకున్న టిడిపికి కాంగ్రెస్ స్థానంలో సీమాంధ్రలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రత్యర్థులుగా నిలవడం మింగుడుపడడం లేదు. ఒకవైపు అసలు నాయకుడే లేని కాంగ్రెస్, మరోవైపు అవినీతి ఆరోపణలున్న జగన్, అయినా వీరిని ఎదుర్కోలేని నిస్సహాయ స్థితిలోకి టిడిపిని ఆ పార్టీ నాయకత్వం నెట్టివేయడం సంక్షోభం కాకుంటే మరేమిటి?
-బుద్దా మురళి

28, మార్చి 2012, బుధవారం

మీరు రేడియో వింటున్నారా ? మళ్లీ రేడియో రోజులు వచ్చేశాయి ... రేడియో... రీయెంట్రీ...టీవీ ముందు కూర్చుంటే నీకు ప్రపంచమే కనిపించదు... ఏంటీ? రోజంతా ఇంటర్‌నెట్ ముందేనా?... ఈ ప్రశ్నలు చాలామంది యువత ఇంట్లోనో, బయటో రోజూ వినేవే. ఇకపై ఈ మాటలు తగ్గిపోవచ్చు. నిజమా? అని విస్తుపోకండి. ఆ స్థానాన్ని మారిన రేడియో ఆక్రమిస్తోంది. పాత రేడియోకు కొత్త రోజులు వస్తున్నాయంటే నమ్మాలి.


 వచ్చేశాయ్ కూడా. బాలానందం, రేడియో నాటకం, సంక్షిప్త శబ్దచిత్రం, వివిధ భారతి, జనరంజని, మీరు కోరిన పాటలు, హవా మహల్, సైనిక సోదరులు కోరిన పాటలు. రేడియోలో ఈ కార్యక్రమాలన్నీ ముందు తరాలను ఉర్రూతలూగించినవే. ఇంటర్నెట్ల కాలంలో దృశ్యమాద్యమానికే అలవాటు పడిన యువతరం మళ్లీ రేడియో పట్టుకుంటుంది. పూర్వవైభవాన్ని తెలియకుండానే తెస్తోంది. ఈ విషయం మనం కళ్లతో రోజూ చూస్తున్నాం. బ్రిటన్‌లో ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ఇదే విషయాన్ని చెప్పింది.


 బేసిక్ మాడల్ సెల్‌ఫోన్‌లో సైతం ఇప్పుడు ఎఫ్‌ఎం రేడియో తప్పని సరిగా ఉంటోంది. దీంతో కాలేజీ కుర్రకారు నుంచి కొత్తగా ఉద్యోగంలో చేరిన వారి వరకు రేడియో వినడం మళ్లీ అలవాటు చేసుకుంటున్నారు. ముంబైలో ట్యాక్సీలో రేడియో వినడం క్రేజీ. అక్కడి నుంచి ఈ అలవాటు హైదరాబాద్‌కు, ఇతర నగరాలకు వ్యాపించింది. యునైటెడ్ కింగ్‌డంలోని ది రేడియో అడ్వర్టైయిజింగ్ బ్యూరో నిర్వహించిన సర్వేలో టీవి, ఇంటర్నెట్ చూడటం కన్నా రేడియో వినడం వల్ల ఎక్కువ ఆనందం కలుగుతున్నట్టు తేల్చారు. వెయ్యిమంది బ్రిటన్ వాసులు సర్వేలో పాల్గొన్నారు. పాటలు, సంగీతం వినడం ద్వారా కొత్త శక్తి వస్తోందని, ఉత్సాహంగా ఉంటోందని సర్వేలో పాల్గొన్నవారు చెప్పారు. పలు సర్వేల్లో రేడియోవినే వారి సంఖ్య వేగంగా వృద్ధి చెందుతున్నట్టు తేలింది. రెండు చెవుల నుంచి రెండు వైర్లు వేలాడుతుంటే ఏదోలోకంలో ఉన్నట్టుగా రోడ్డుమీద పరధ్యానంగా నడుస్తున్న యువత మనకిప్పుడు సుపరిచితం. ఇదేం కొత్త కాదు. మూడు దశాద్దాలు వెనక్కి వెళ్తే అచ్చం ఇలానే చెవికి చిన్న రేడియో తగిలించుకుని వెళ్లే యువత చాలామందే కనిపించేవారు. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయంలోనే మాత్రమే అలా కనిపించేవారు ఇప్పుడు రోజూ కనిపిస్తున్నారు.

***
 సమయం మధ్యాహ్నాం మూడు గంటలు మీరిప్పుడు రాముడు- భీముడు సంక్షిప్త శబ్ద చిత్రం వింటారు. మీరు సీనియర్ యువకులు అంటే మధ్య వయస్కులు అయితే మీముందు రింగులు రింగులుగా పొగ ప్రత్యక్షం అవుతుంది. మీరు ఎక్కడికో వెళతారు. నవ యువకులైతే సంక్షిప్త శబ్ద చిత్రమా? అదేంటి ఆర్ట్ సినిమానా? యూ ట్యూబ్‌లో కూడా కనిపించలేదే? ఎప్పుడు విడుదలైంది ఎప్పుడు పోయింది అనుకుంటారు. ఈనాటి తరానికి సంక్షిప్త శబ్ద చిత్రం అంటే తెలియక పోవచ్చు. కానీ టీవిలు రాకముందు రేడియోనే ప్రధాన వినోద సాధనం. సినిమా దృశ్య ప్రధానమైంది. రేడియో శ్రవణ ప్రధానమైంది. దృశ్య ప్రధానమైన సినిమాను దాదాపు గంట సమయానికి కుదించి రేడియోలో వినిపించేవారు. పది చానల్స్‌లో రోజుకు 40 సినిమాలు సినిమాలు వచ్చే ఈ రోజుల్లో టీవిలో సినిమా అంటే పెద్దగా ఆసక్తి కనిపించకపోవచ్చు, కానీ ఒకప్పుడు రేడియోలో సంక్షిప్త శబ్ద చిత్రం అంటే ఇంటిల్లిపాదీ రేడియో చుట్టూ గుమికూడేవారు. సినిమా వినేందుకు ఆనాటి తరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేది. 


అంతకన్నా మరింత ముందుకు వెళితే గ్రామాల్లో రేడియో ఉందంటే వాళ్లు గ్రామంలో మోతుబరి అన్నట్టు. కొందరు సంపన్నుల ఇళ్లలో సొంతంగా రేడియో ఉంటే మొత్తం గ్రామస్తులు వినేందుకు వీలుగా పంచాయితీ కార్యాలయంలో రేడియో ఏర్పాటు చేసి, అందులో వచ్చే కార్యక్రమాలు గ్రామస్తులంతా వినేందుకు వీలుగా రచ్చబండ వద్ద మైకులు ఏర్పాటు చేసేవాళ్లు. ఆ మైకు వద్ద గ్రామస్తులు గుంపులుగా చేరి రేడియోలో వచ్చే కార్యక్రమాలను ఆసక్తిగా వినేవారు. ఆ కాలంలోనే రేడియోనే ఒక అద్భుతం. ఇప్పుడు గృహ రుణాల కిస్తులు చెల్లిస్తున్నట్టుగా 1960 నాటి వరకు కూడా రేడియోను ఇన్‌స్టాల్‌మెంట్‌లో కొనే వీలు కల్పించే వాళ్లు. ‘నెలకు 24 రూపాయలు చెల్లించండి’ అంటూ భారీ ప్రకటనలు ఆనాటి పత్రికల్లో ఇప్పటికీ కనిపిస్తాయి. ఒకప్పుడు వినోద సాధనంగా వెలుగు వెలిగిన రేడియోకు ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ ఆదరణ మళ్లీ పెరుగుతోంది. పూర్వవైభవం మాత్రమే కాదు అపూర్వ వైభవం రాబోతుందని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తిరిగి రేడియోపై ఆసక్తి పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి.


 ప్రధాన నగరాల్లో ఇప్పుడు ఎఫ్‌ఎం రేడియోలు చేస్తున్న హడావుడి అంతాఇంతా కాదు. దేశవ్యాప్తంగా 245 నగరాల్లో కొత్తగా 839 ఎఫ్‌ఎం చానళ్లు రానున్నాయి. వీటిని ఈ- వేలం ద్వారా వేలం వేయనున్నట్టు కేంద్రం నిర్వహించే ఆర్థిక సర్వే నివేదికలో స్పష్టం చేశారు. ఎఫ్‌ఎం రేడియో సర్వీసుల ద్వారా ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగాయని ఈ ఆర్థిక సర్వే పేర్కొంటోంది. రోడ్డు మీదికి వెళ్లినప్పుడు రేడియో క్యాబ్‌లను చూశారా? ఇవి ముందు ముంబై నగరంలో హడావుడి చేశాయి. రేడియో వినిపించడమే వీటి ప్రత్యేకత. ఎఫ్‌ఎం పుణ్యమా అని ముంబైలో ఒక్కసారిగా రేడియో తిరిగి పాపులర్ అయింది. తరువాత హైదరాబాద్, విశాఖ పట్నం వంటి నగరాల్లో సైతం ఎఫ్‌ఎం వినేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎఫ్‌ఎం కార్యక్రమాల్లో మాటలు కొంత ఓవర్ యాక్షన్‌లా అనిపించినా మరి ఈతరం అలాంటి మాటలనే ఇష్టపడుతున్నారేమో అని సర్దిచెప్పుకోవాలి. కానీ ఎఫ్‌ఎంలో పాత పాటలు వింటే మరో ప్రపంచంలోకి వెళ్లిపోతాం. అది చాలదా? కొద్దిసేపు ఓవర్ యాక్షన్‌ను భరించేందుకు. 


ఆదివారం మధ్యాహ్నాం రెండు గంటల పది నిమిషాలకు బాలానందం. పేరు బాలానందమే అయినా ఆ కార్యక్రమం ఇష్టపడని పెద్దవాళ్లు ఉన్నారా? అది ముగియగానే మూడు గంటలకు నాటకం. నెలకు కనీసం ఒకటి రెండు అద్భుతమైన హాస్య నాటికలు వినే భాగ్యం కలిగేది. వెకిలి హాస్యంతో నవ్వించే కామెడీ సినిమాల్లా కాదు, సున్నితమైన హాస్యంతో నవ్వించే నాటకాలు అవి. మూడు దశాబ్దాల క్రితం ప్రియా పచ్చళ్లు ప్రారంభించినప్పుడు రాత్రి తొమ్మిది గంటల తరువాత ప్రతి రోజు ప్రియాపచ్చళ్ల వాళ్లు సమర్పించే హాస్య నాటికలు వచ్చేవి. మురళీ మోహన్ లాంటి అప్పటి పాపులర్ నటులు ఈ నాటకాల్లో వినిపించడంతో అవి బాగా పాపులర్ అయ్యాయి. గత వైభవంగా నిలిచిన పలు నాటకాలు, రేడియో కార్యక్రమాల సిడిలను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో విక్రయిస్తున్నారు. ఇలా అమ్ముతున్నట్టు పెద్దగా ప్రచారం లేకపోవడం కానీ ఒకసారి సందర్శించి ఆనాటి కార్యక్రమాల సిడిలను చూస్తే ఆదిత్యా 356 సినిమాల్లో పాత రోజుల్లోకి వెళ్లినట్టు వెళ్లిపోవచ్చు. 
***
ఇప్పుడు పేరున్న రచయితలు, సినిమా దర్శకులు, సినిమా రచయితలు, సినిమా పాటల రచయితలు ఒకప్పుడు బాలానందం ద్వారా కళాకారులుగా ఓనమాలు నేర్చుకున్నవారే. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌కందా బాల్యంలో బాలనటుడు, అదే సమయంలో బాలానంద సంఘం కళాకారుడు. బాలానందం కార్యక్రమంలో ఏం మాయ చేసిందో కానీ పిల్లలను తన చుట్టూ మూగేట్టు చేసిన మంత్రమేదో అందులో ఉంది. అంతే కాదు ఎంతోమంది కళాకారులను తయారు చేసింది. తెల్లవారు ఝామున లేవగానే సుప్రభాతం నుంచి, రాత్రి నిద్ర పోయేప్పుడు పాత పాటల విరకు వీనుల విందు చేసే మంత్రం రేడియో సొంతం. నేటి తరాన్ని నాటి తరాన్ని అలరిస్తూ రేడియో కొత్త రూపు సంతరించుకోవటం వినోద రంగంలో మంచి పరిణామం. వినోదంతో పాటు విజ్ఞానం పంచడం ద్వారా రేడియో మరోసారి సగర్వంగా ముందుకు వస్తోంది.

హిట్లర్, గాంధీ, నెహ్రూల తప్పులు...కర్ణుడికి జరిగిన అన్యాయం... కనిపెట్టిన మన సుబ్బారావులు

రండి రండి సెలవు రోజు కదా ! హాయిగా మాట్లాడుకోవచ్చు’’ సుబ్బారావు మిత్రులను చూసి డోర్ తెరిచాడు. బిబిసి చూస్తూ ‘‘ఎంతైనా బ్రిటిష్ వాడి తెలివే తెలివి. మన నాయకులూ ఉన్నారు ఎందుకు . నాయకుడు అన్నవాడిలో దూకుడు ఉండాలి . క్రైసెస్ మేనేజ్‌మెంట్ తెలిసుండాలి’’ అన్నాడు. సుబ్బారావు కాఫీకి ఆర్డర్ వేయగానే మిత్రులిద్దరూ ఔనవును అన్నారు. ‘‘ ఆ మధ్య మహేష్‌బాబు సినిమాకు మా బాస్ కూతురు ఎలాగైనా మొదటి రోజు సినిమా చూసి తీరాల్సిందే అని బాస్‌కు వార్నింగ్ ఇచ్చిందట! ఆయన ఎంత ప్రయత్నించినా టికెట్ దొరకలేదు. ఇంకేముంది... చేతులు కాళ్లు ఆడడం లే. నువ్వే కాపాడాలోయ్ సుబ్బారావు అని నా చేతులు పట్టుకున్నాడు. మా మేనమామ చిన్నల్లుడు పోలీస్ కానిస్టేబుల్ వాడి నంబర్ పట్టుకున్నా, వాడు ఆ థియేటర్‌లో డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్‌ను పట్టుకుని, మూడు టికెట్లు సంపాదించాడు. అవి బాస్ చేతిలో పెడితే...నన్ను ప్రమాదం నుంచి బయటపడేశావు సుబ్బారావు నీ మేలు మరిచిపోను అన్నాడు. ఆ రోజు మా బాస్‌లానే నేను బెంబేలెత్తిపోతే సమస్య పరిష్కారం అయ్యేదా? . నాయకత్వం వహించే వాడికి దూకుడు ముఖ్యం. ఇది మన నాయకుల్లో ఏడిస్తే దేశం ఇలా ఎందుకుండేది. పాకిస్తాన్ మీద మనమో రెండు బాంబులు విసిరేస్తే వాడు నోరుమూసుకుని ఉండే వాడు. ఆ ధైర్యం మన వాళ్లకు ఎక్కడిది’’ అని సుబ్బారావు నిట్టూర్చాడు.


 ‘‘ఐనా వీళ్లనని ఏం లాభం సుబ్బు’’ అని విశ్వనాథం అందుకున్నాడు. ‘‘ ఇందిరాగాంధీని అనాలి. మన సైనికులు పాక్‌పై దాడి చేసినప్పుడు కరాచీ, లాహోర్‌లను స్వాధీనం చేసుకొని ఉంటే పరిస్థితే వేరుగా ఉండేది. దాన్ని నాలుగు ముక్కలు చేసి రెండు మనం తీసుకుని ఒక ముక్కలో బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి మరో ముక్కను పాక్‌గా ప్రకటించి ఉంటే కాశ్మీర్ సమస్యే ఉండేది కాదు కదా?’’ అని విశ్వనాథం చెప్పాడు. ‘‘ నేను చెబితే నమ్మరు . ఇందిరాగాంధీ రహస్యంగా పాకిస్తాన్‌తో కుమ్మక్కు అయ్యిందని నేను కచ్చితంగా చెప్పగలను’’ అన్నాడు. ‘‘ ఇందిరాగాంధీ కన్నా ముందు నెహ్రూ ఏమన్నా తక్కువ తిన్నారా? శాంతి అంటూ ప్రపంచాన్ని జయించే చాన్స్‌ను మిస్ చేసింది నెహ్రూనే కదా? మహాభారతంలో స్పష్టంగా ఉంది. మనది సువిశాల దేశం అని ఆఫ్ఘానిస్తాన్ లాంటి దేశాలు కూడా ఒకప్పుడు మన దేశంలో భాగమే కదా? మనం సహనం చూపించి ఉంటే ఆ దేశాలన్నీ మనకు వచ్చేసేవే, పాకిస్తాన్‌ను విభజించాల్సిన అవసరమే ఉండేది కాదు, కానీ నెహ్రూ ఎప్పుడు ప్రధాని పీఠం మీద కూర్చుందాం? అని తొందరపడి దేశ విభజనకు ఒప్పుకున్నాడు’’ అని రామనాథం తాను విన్న విషయం చెప్పాడు. 


అసలు భీష్ముడు మహాభారత యుద్ధంలో ముందు కర్ణున్ని పంపి ఉంటే యుద్ధ్ఫలితం వేరుగా ఉండేది.
ప్రతిభను నొక్కిపెట్టడం అంతటా ఉన్నదే కదా! మొన్న కంపెనీ తరఫున విదేశాలకు వెళ్లే చాన్స్ వస్తే నన్ను పంపడానికి బదులు మా బాస్ వాళ్ల కులపోన్ని పంపుకున్నాడు. ఆ రోజు కర్ణుడికి జరిగింది. ఇప్పడు నాకు జరిగింది ’’ అని విశ్వనాథం ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన ఇద్దరు మహాభారతాన్ని పొడిగించ వద్దని మనసులోనే అనుకున్నారు.


‘‘చంద్రబోస్ నాయకత్వంలో స్వాతంత్య్రం సిద్ధిస్తే తనకు క్రెడిట్ దక్కకుండా పోతుందనే స్వార్ధంతోనే కదా మహాత్మాగాంధీ బోస్ మాట వినలేదు. జపాన్ సహాయంతో అమెరికాపై దాడి చేసి జర్మనీని ఓడించి రష్యాతో కలిసి చైనా సంగతి తేల్చి, టిబెట్ సమస్య పరిష్కరించి, శ్రీలంకను మచ్చిక చేసుకుని నేపాల్ రాజుతో స్నేహం కలుపుకొని , కాంబోడియా వాణిజ్య సంబంధాలు, ఫ్రాన్స్‌తో దౌత్య సంబంధాలు పెట్టుకొని ఉంటే ప్రపంచం మనకు పాదాక్రాంతం అయి ఉండేది కదా? దమ్ముంటే ఎవరైనా దీన్ని కాదనమనండి చూద్దాం’’అని విశ్వనాథం బలంగా బల్ల గుద్ది చెప్పాడు. ‘‘అమెరికా వాడు జపాన్‌పై అణుబాంబు వేయక ముందే హిట్లర్ రష్యా, అమెరికాలపైన బాంబులు వేసి ఉంటే ఇప్పుడు ప్రపంచం మరోలా ఉండేది’’అని సుబ్బారావు అన్నాడు. మన నాయకుల తప్పులన్నింటినీ క్షమించేద్దాం. కానీ వయోజన ఓటింగ్ తప్పు క్షమించరాని నేరం. దీంతో ప్రతి వాడు మాట్లాడే వాడే? మనమేమో బిజీగా ఉండి ఓటింగ్‌కు దూరంగా ఉంటాం . మన లాంటి వారి పిల్లలకు అందరితో పాటు క్యూలో నిల్చోని ఓటు వేసే ఖర్మ పట్టలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని మమూలు జనం ఓట్లు వేస్తున్నారు. పనికి రాని నాయకులను ఎన్నుకుంటున్నారు. ఈ దేశాన్ని ఎవ్వడూ బాగు చేయలేడు సుబ్బారావు నిట్టూర్చాడు.
ఏమండీ ఒక్కసారి లోపలికి వస్తారా? సుబ్బారావు భార్య పిలుపుతో లోనికి వెళ్లాడు.


***
స్టౌవ్‌మీద పాలు పెట్టాను చూడండని చిలక్కి చెప్పినట్టు చెప్పా... పాలు పొంగాయి, గినె్న మాడిపోయింది. ఇంకొద్ది సేపు ఉంటే గ్యాస్ సిలండర్ పేలిపోయేది. షాపుకెళ్లి సరుకులు తేవడం చాతకాదు... ఒక్క పని సరిగా చేయరు. ఐదు నిమిషాల్లో ఒక్కరు కనిపించినా ఊరుకునేది లేదు.. వార్నింగ్ ఇచ్చింది భార్యామణి. 144 సెక్షన్ విధించి లాఠీచార్జ్ చేసినట్టే ... సుబ్బారావు బయటకు పరిగెత్తుకొచ్చాడు. కొడుకు స్కూల్ బ్యాగ్ మీద పడేసి , నువ్వు చేసిన హోంవర్క్‌లో అన్నీ తప్పులే, నీ వల్ల దెబ్బలు తిన్నాను అని ఏడ్చాడు. అంతర్జాతీయ సమస్యలు పరిష్కరిస్తా...లెక్కలు తొక్కలు అంటూ చిన్న చిన్న సమస్యలపై దృష్టి పెట్టాలంటే నా లాంటి వారికి కష్టమే అర్థం చేసుకోరు  అని నిట్టూర్చాడు 
  సుబ్బారావు...

21, మార్చి 2012, బుధవారం

ఓజోన్ పొరను కరిగించి దోచుకున్న జగన్.. బాబు .. ప్రపంచ ప్రఖ్యాత కుంభకోణంమనం మద్దతిచ్చే పార్టీ పరిస్థితి మన చానల్ పరిస్థితి ఒకేలా ఉంది అంటూ సత్యంను కోపంగా చూశాడు బాస్. ఉండండి సార్ మన అబ్బాయి పేలిపోయే వార్త తీసుకు వచ్చారు అని సత్యం ఉత్సాహంగా చెప్పాడు. మన కాదు మా అబ్బాయి. చానల్స్‌కు వ్యాకరణ పట్టింపులు అవసరం లేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు అని బాస్ సవరించారు. ఈ వార్త మనం బ్రేక్ చేయడమే ఆలస్యం రేటింగ్‌లకు అందనంత దూరం పోతాం అంటూ సత్యం గుక్క తిప్పుకోకుండా మాట్లాడేస్తున్నాడు. తెలు గు వాడు కావడం బ్యాడ్‌లక్. మనది అంతర్జాతీయ చానల్ అయి ఉంటే ప్రపంచం కదిలిపోయి ఉండేది. అలాంటి వార్త తెచ్చాడు మీ అబ్బాయి అని సత్యం చెప్పాడు. ****
రోజుకో పార్టీ మార్చే ఈరోజుల్లో పుట్టినప్పటి నుంచి ఒకే పార్టీకి కొమ్ముకాస్తున్న అత్యంత విశ్వసనీయమైన మన చానల్ చరిత్ర సృష్టించబోతోంది అంటూ తాము ప్రసారం చేయబోయే వార్తపై ఆసక్తి రేకెత్తించే విధంగా ప్రకటనలు మొదలు పెట్టారు.
***
సభలో నాయకునికి దీనిపై చీటీ అందింది. అధ్యక్షా మూడు గంటల పాటు ఎడతెరపి లేకుండా మాట్లాడడం వల్ల గొంతు ఎండిపోయింది పది నిమిషాల గ్యాప్ ఇవ్వండి అని చెప్పి బాబు బయటకు వెళ్లారు. గుక్క తిప్పుకోకుండా మాట్లాడ్డంలో ప్రపంచ రికార్డు సృష్టించిన నేత నోటి నుంచి గ్యాప్ అనే పదం రాగానే సభ నిర్ఘాంత పోయింది. ఏదో జరగబోతుందనుకున్నారు. సిఎంను మారుస్తారంటావా? అని దివాకర్‌రెడ్డి వెంకటరెడ్డిని అడిగితే ఆయన కోపంగా చూశారు. 3మంత్రి పదవి కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, కాలం కలిసి రావడం లేదు. సిఎంను మారిస్తే ఆ పదవి చేపట్టేందుకైనా రాష్ట్ర ప్రజల కోసం సిద్ధమవుదామని అనుకుంటున్నాను అని దివాకర్‌రెడ్డి చిన్నగా గొణిగారు. ***
మీ టీవి అని వినిపించగానే ఔను మా టీవినే అని నాయకుడు మనసులోనే నవ్వుకున్నాడు. ప్రపంచాన్ని అబ్బుర పరిచే నిజాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాం. ఓజోన్ పొర ఉండాల్సిన మందం లేదు. పది మిల్లీ మీటర్ల మేరకు కరిగిపోయింది. ఈ విషయం మా పరిశోధనలో బయటపడింది. ఓజోన్ పొర కరిగించడంలో యువనేత హస్తం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వైఎస్‌ఆర్ అధికార దుర్వినియోగానికి సంబంధించి ఇప్పటి వరకూ చూడని కొత్త కోణం. ఇది అంతర్జాతీయ కుంభకోణం. అత్యంత విలువైన ఓజోన్ పొరను కరిగించారు. పది మిల్లీ మీటర్లు అంటే ఇది ఎన్ని లక్షల కుంభోకోణమో ఇప్పుడే అంచనా వేయలేమని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఓబుళాపురం మైనింగ్, బయ్యారం గనుల కుంభకోణం కన్నా పెద్దదని తేల్చారు.
***
హడావుడిగా సభ లోపలకి వచ్చిన బాబు లేచి నిలబడి వాయిదా తీర్మానం నోటీసు ఇస్తున్నాం అధ్యక్షా అని ప్రకటించారు. సభలో కరవు, రైతులు, ప్రజల సమస్యలపై చర్చ జరుగుతోంది. అక్కడ ఓజోన్ పొర కరిగిపోయి ప్రపంచం ముందు మన దేశ ప్రతిష్ట దెబ్బతింటుంటే మీరు నిబంధనల పేరు చెప్పి మా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నారు. తక్షణమే జాయింట్ హౌస్ కమిటీ వేయాలి, ఓజోన్ పొరను కరిగించినందుకు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద లక్ష కోట్లు వసూలు చేయాలి. వారి పార్టీని రద్దు చేయాలి అని బాబు చెబుతుంటే జగన్ లేచి నిలబడ్డారు.
అధ్యక్షా ఓజోన్ పొర 1995 నుంచి కరిగిపోయింది. బాబు కరిగిస్తే ఒక న్యాయం, మాకో న్యాయమా? ఇదెక్కడి న్యాయం అధ్యక్షా? వెన్నుపోటు అలవాటున్నవారే ఓజోన్ పొరను కత్తితో కరిగించారధ్యక్షా ఈ విషయం ప్రపంచానికంతా తెలుసు. విచారణ జరిపించండి అధ్యక్షా అయితే వైఎస్‌ఆర్ కుటుంబంపై కక్ష సాధించే విధంగా విచారణ జరిపిస్తే ప్రజలు సహించరు అధ్యక్షా 1995 నుంచి విచారణ జరిపించాలి22 అని జగన్ డిమాండ్ చేశారు.
 నేను సిఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో భూములను ఓజోన్ పొరను కంటికి రెప్పలా కాపాడాను. అర్ధరాత్రి అలికిడి అయినా ఓజోన్ పొరను కరిగించేందుకు, హైదరాబాద్‌లో భూములు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారేమో అని లేచి చూసేవాన్ని. యువనేత 73 బెడ్‌రూంలతో భవనం నిర్మించుకున్నాడు. ఫై కప్పుకు లక్షల కోట్ల విలువైన ఓజోన్ పొరనే రూఫ్‌గా ఉపయోగించుకున్నారు దీన్ని నిరూపించేందుకు సిద్ధం అధ్యక్షా22అని బాబు ఆవేశంగా పలికాడు.
సీమాంధ్రను ఎండబెట్టి ఓజోన్ పొరను తెలంగాణకు తరలించారు, దీని వల్ల సీమంధ్రలో క్రాప్ హాలిడే కూడా ప్రకటించాల్సి వచ్చింది అని రాజ్‌గోపాల్ గట్టిగా అరిచాడు. వెంకటేశ్ ఔను అని మద్దతుగా నిలిచారు. అధ్యక్షా అటు బాబు ఇటు జగన్ తెలంగాణలోని ఓజోన్ పొరను దోచుకున్నారు, దాచుకున్నారు అని రాజేందర్ మండిపడ్డారు. అధ్యక్షా మా ఆయన చేసిన తప్పేమిటి? పేదలకు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాల అమలు చేయడమే నేరమా? అందరు నాయకుల ఇళ్లల్లో ఉన్నట్టుగానే మా ఇంటి కప్పుపైన ఓజోన్ పొర ఉంది ఇది మా తప్పా! తప్పయితే అందరిపైనా చర్య తీసుకోవాలి. సిబిఐ ఒక్క మా కుటుంబంపైనే కక్ష కట్టడం ధర్మమా? అని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
ఓజోన్ పొర అంటే కరిగించి, తవ్వుకుని అమ్ముకునే గని కాదు కాలుష్యం వల్ల కరిగిపోతుంది . బయటి కాలుష్యం కన్నా సభలో మీ మాటల కాలుష్యం సమాజానికి అత్యంత ప్రమాదకరంగా మారింది అని అనామక నేత గట్టిగా అరిచాడు. 

(ఎవరినీ ఉద్దేశించి రాయలేదు అని అబద్దం చెప్పాల్సిన అవసరం నాకు లేదు .. ఉద్దేశించే రాశాను ) 

20, మార్చి 2012, మంగళవారం

రాకోయి అనుకోని అతిది మా ఇంటికొచ్చిన పిచ్చుక గారుహైదరా బాద్  మహా నగరం లో అతిధులు వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా ? మేం మొన్న ఒక అతిధి అలా వస్తే ముందు సంతోష పడి  తరువాత  బాధ పడ్డాం   కంగారు పడ్డాం  రాత్రి సరిగా నిద్ర కూడా పోకుండా అప్పుడప్పుడు లేచి అతిధి ఉన్నాడా, వెళ్లి పోయాడా అని చూసుకోవలసి వచ్చింది . నాకంత ఇబ్బందేమీ లేదు కానీ పిల్లలే ఎలా గయినా అతిదిని బయటకు పంపు అని ఒకటే పోరు .. అతిధులు  మనం రమ్మంటే వచ్చారా అలా పొమ్మంటే పోరు .. వాళ్ళిష్ట మున్నప్పుడు పోతారు అని చెబితే వినరు ..
ఎప్పుడు వెళ్లి పోయారో తెలియదు కానీ ఉదయం లేచి చూస్తే లేరు అమ్మయ్యా అని ఉపిరి పిల్చుకున్నం. పిల్లలు తెగ సంతోష పడ్డారు  .
ఆ విషయం ఇప్పుడెందుకు గుర్తుకొచ్చింది అంటారా ? ఈ రోజు అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం కదా రెండు వారాల క్రితం ఇంటికొచ్చిన అతిధి గుర్తుకొచ్చారు 
గత సంవత్సరం ఇల్లాలి ముచ్చట్లు లో సుధా గారు ఈ రోజు గురించి రాశారు . అంతకు ముందు అయిదారేళ్ళ క్రితం ముంబాయికి చెందిన పత్రికలో పని చేసే మిత్రుడు వీటి గురించి రాశాడు . చాలా మంది తమ బాల్యం లో పిచ్చుకలతో ఉన్న అనుబందాలను గుర్తు చేసుకున్నారు, ఇప్పుడు కనిపించడం లేవని బాధ పడ్డారు . చిన్నప్పుడు పిచ్చుక గూళ్ళ గురించి జ్ఞాపకాలు గుర్తుకు రావడం లేదు కానీ ఇప్పుడు మాత్రం నేను ఉదయం లేవగానే వాటి గ్రూప్ డిస్కషన్ వింటాను ....  గ్రూప్ డిస్కషన్ అంటే  అసెంబ్లీ  లో  తిట్టుకున్నట్టు కాదండీ . ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ఒకేసారి అయిదారు డజన్ల పిచ్చుకలు ఎవరి కథలు వాళ్ళు  చెప్పుకుంటాయి  ఆ కథలన్నీ కలిసి మనకు మాత్రం చక్కని  సంగీతం లా  వినిపిస్తుంది ...
ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్లి పోతున్నానని అనుకుంటున్నారా? లేదు మా ఇంటి కొచ్చిన అతిధి గురించే చెబుతున్నాను ...
మా ఇంటి ఎదురుగా ఖాళీ స్థలం బాగానే ఉంది . పిల్లలు ఇష్ట పడడం తో వెదురు మొక్కలు కూడా నాటం. మంచి బూం పిరియడ్ లో స్టాక్ మార్కెట్ లో షేర్ల ధరలు పెరిగినట్టు వెదురు మొక్క ఏపుగా పెరిగింది. మేం ఒక్కటి నాటితే కనీసం డజను వెదురు చెట్లు అయ్యాయి  .. వాటి పైన కనీసం అయిదారు డజన్ల పిట్టలు అవే నండి పిచ్చుకలు చేరాయి . వెదురు చెట్ల వైపే మా ఇంటి వంట గది ఉంది . కిటికీ తెరిచి ఉండడం తో ఒక పిచ్చుక గారు ఎలానో దారి తప్పి వంట గది లోకి వచ్చేసింది . దాన్ని చూడ గానే పిల్లలు తెగ సంతోష పది హడావుడిగా ఫోటో తీశారు ( ఇటు చూడు నవ్వు అని యెంత చిప్పిన పిచ్చుకలు వినవు అనే పాఠం ఆ రోజే నేర్చుకున్నాను ..పిల్లలు చెప్పినట్టు వినడానికి అవేమన్న పిచ్చి పెరెంట్సా? తెలివయిన పిట్టలు )  
ఫోటో తీసుకోగానే ఇక బయటికి పంపు పాపం వాళ్ల గుంపు వాళ్ళు ఎదురు చూస్తుంటారు కదా అని ఒకటే గోల ... మేం బయటకు పంపించాలని చూస్తే వెళ్ళే ప్రసక్తే లేదని అటు ఇటు పరిగెత్తింది. ట్రేస్ పాస్ చట్టం పిట్టలకు వర్తిస్తుందో లేదో తెలియదు . అన్ని రకాలుగా ప్రయత్నించాను . యెంత మంది నాయకులను చూశాం .. ఓ ఆలోచన వచ్చింది  ఇలాంటి సమయం లో  వ్యూహాత్మక  మౌనం పాటించడమే మంచిది అనుకున్నాను. కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చెబుతుందని సలహా ఇచ్చాను . ఇక చేసేది కూడా ఎమీ లేక అంతా సరే అన్నారు . మధ్య మధ్యలో లేచి చూశాను . వంటింట్ లో తీగ మీద పడుకుంది .. కొన్ని ఆఫీసులలో కొందరు కూర్చొనే పాడుకుంటారు అదేమీ పెద్ద వింతగా అనిపించలేదు కానీ తీగ మీద పిచ్చుక పడుకోవడం వింతగానే అనిపించింది .
తెల్ల వారు జమున మళ్లీ కిటికీలు తెరిచి అటువైపు వెళ్ళలేదు ఎప్పుడూ బయటకు వెళ్లిందో కానీ అది కనిపించక పోయే సరిక హమ్మయ్య అని అంతా ఉపిరి పిల్చుకున్నం. ఏంటో అందరికీ చిన్నప్పుడు పిచ్చుకలతో అనుబందం ఏర్పడితే నాకు ఇప్పుడు ..... అలా వచ్చి అలా వెళ్ళరు అనుకోని అతిధి మా యింటికి. అప్పుడు అనుకున్నాం రకోయి అనుకోని అతిది ఎదురుగా వెదురు చెట్లు మీ కోసమే . పిట్టగోడపై బియ్యపు గింజలు కూడా మీ కోసమే దయ చేసి ఇంట్లోకి వచ్చి  మీరు బాధ పది మమ్ములను బాధ పెట్ట వద్దు కావాలంటే మేడ పైనా ,, ఇంటి ముందు ఇష్టం వచ్చినంత సేపు ఆడుకోండి  వద్దం టమా .
( జూబ్లి బస్ డిపోకు ఏడు కిలోమీటర్ల దూరం కూడా లేదు ..కానీ  మా వైపు పచ్చని చెట్లు ఉన్నాయి , వాటి పై పిచ్చుకలు ఉన్నాయి .. కేరళను దేవుడి సొంత ప్రాంతం అని చెప్పుకున్నట్టుగా మా ప్రాంతాన్ని పిచ్చుకల సొంత ప్రాంతంఅని   ప్రకటిస్తే బాగుండు ) 

14, మార్చి 2012, బుధవారం

2030 లో ఓ తెలుగు కుటుంబం లో తెలుగు ..పండంటి ఇంగ్లీష్ కుటుంబం

కొడుకు ఇంగ్లీష్ నవల చదువుతున్నాడు. కూతురు ఇంగ్లీష్ సినిమా చూస్తోంది. తల్లి ముద్దాయిలా వౌనంగా ఉంది. ఇంగ్లీష్ పేపర్‌లో నుంచి తల తిప్పిన శ్రీమతి, శ్రీకాంత్‌ను చూడగానే అలగా జనం అలగా బుద్ధులు అంటూ ఇంగ్లీష్‌లో గొణగసాగింది. హాయ్ డార్లింగ్ ఏంటీ ఈరోజు శ్రీమతి గారు కోపంగా ఉన్నారు అని శ్రీకాంత్ ఇంగ్లీష్‌లోనే సరదాగా ఆడిగారు. శ్రీకాంత్ వాళ్లింట్లో అంతా ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారు, అదే భాషలో ఆలోచిస్తారు. అదే గాలి పీలుస్తారు. వారి సంభాషణ తెలుగులోకి అనువాదం చేస్తే ఇలా ఉంటుంది.


శ్రీకాంత్‌కు ఆ రోజు ఎడమ కన్ను అదిరింది. ఏం కొంప మునుగుతుందో అని కంగారు పడుతూనే ఉన్నాడు. ‘‘ ఇంట్లో మీ అమ్మయినా ఉండాలి? నేనైనా ఉండాలి . ఇద్దరం ఉండే ప్రసక్తే లేదు’’ అని శ్రీమతి తేల్చి చెప్పడమే కాకుండా బట్టలు సర్దుకోసాగింది. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు మీ అమ్మ ఎంత అమాయకత్వం నటిస్తుందో చూడండి అంటూ శ్రీమతి సూట్‌కేసును కింద పడేసింది. ‘‘తప్పు చేసిన వారు భయపడాలి నాకెందుకు భయం. మీరు ననే్నమన్నా భరిస్తాను కానీ ఈ వయసులో ఇలాంటి అభాండాలు వేస్తే సహించేది లేదు’’ అని తల్లి వార్నింగ్ ఇచ్చింది. ‘‘ అబద్ధాలు చెప్పాల్సిన ఖర్మ నాకు పట్టలేదు. నా చెవులతో నేను విన్నాను. పక్కింటావిడతో మీ అమ్మ తెలుగులో మాట్లాడుతుండగా నా చెవులతో నేను విన్నాను. సావిత్రి వదిన గారూ బాగున్నారా? అని మీ అమ్మ స్పష్టంగా తెలుగులో అడిగింది. నేను రావడం దూరం నుంచి గమనించి సంభాషణ ఇంగ్లీష్ లోకి మార్చింది. నేను విన్న పదాలను గుర్తు పెట్టుకుని ఇంటర్‌నెట్‌లో వెతికాను అవి తెలుగు పదాలు. యోగ క్షేమాలు అడగడానికి ఉపయోగించే పదాలని గూగుల్‌లో స్పష్టంగా ఉంది. నేను ఆధారాలు లేనిదే మాట్లాడను’’అని శ్రీమతి చెప్పింది. 


‘‘మన ఇంట్లో తెలుగు పదాలు వినిపించాయంటే మన బంధువుల్లో పరువుంటుందా? చెప్పండి మీ అమ్మ చేసిన తప్పు నేను చేస్తే సహించేవారా?’’ అని శ్రీమతి నిలదీసింది. శ్రీకాంత్ హడావుడిగా తలుపులు మూసేశాడు. డియర్ ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలిసిందా? అని కంగారుగా అడిగాడు. ‘‘లేదు కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది పోయే పరువు మనదే కదా? అందుకే ఎవరికీ చెప్పలేదు ’’అని శ్రీమతి చెప్పింది. ‘‘ అమ్మా నీకు వయసుతో పాటు చాదస్తం బాగా పెరిగిపోతుందే? అదేంటమ్మా నీ కేం కష్టం వచ్చిందని తెలుగులో మాట్లాడావు. నీవడిగిన ఇంగ్లీష్ సినిమాల సిడిలు, నవలలు అన్నీ తెచ్చిస్తున్నాను కదా? మళ్లీ తెలుగులో ఎందుకు మాట్లాడావు అని నిలదీశాడు. నువ్వు తెలుగులో మాట్లాడావనే మచ్చ మన కుటుంబంపై పడితే పిల్లల పెళ్లిళ్లు అవుతాయా? చెప్పమ్మా చెప్పు ’’ శ్రీకాంత్ అడిగాడు.


‘‘ప్రామిస్‌రా నేను తెలుగులో మాట్లాడడం ఏమిటిరా? పిల్లలు స్కూల్‌లో తెలుగులో మాట్లాడితే చితగ్గొట్టిన చరిత్ర నాది. కావాలంటే పాత పత్రికల్లో ఉంటుంది చూడు. నేను అంత స్ట్రిక్ట్‌గా ఉంటాననే కదా? సీనియర్లను పక్కన పెట్టి నా ప్రతిభను గుర్తించి ప్రిన్సిపల్‌ను చేశారు. ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి పోతామని చెప్పిండి, లేదా మమ్ములను పొమ్మనండి కానీ ఇలా తప్పుడు ప్రచారం చేయవద్దు అంది. బహుశా పక్కింట్లో తెలుగు పదాలు వినిపించి ఉంటాయి. అవి విని అమ్మాయి నేనే మాట్లాడానని అనుకుంటున్నదేమో’’ అని తల్లి చెప్పింది. ‘‘నానా తంటాలు పడి ఇంటర్నేషనల్ స్కూల్‌లో పిల్లాడికి సీటు సంపాదించాను. ఆ స్కూల్ వాళ్లు పిల్లల ఇంటిపై కూడా నిఘా పెడతారు. ఇంట్లో ఎవరి నోటి నుంచైనా తెలుగు పదాలు వినిపిస్తే, టిసి ఇచ్చి పంపిస్తారు’’ అని చెప్పాడు. తల్లి బోరున ఏడ్చింది
***
మిస్టర్ శ్రీకాంత్ మీ అమ్మాగారికి ఏమీ కాలేదు ఆమె అబద్ధం చెప్పడం లేదు. అంటూ డాక్టర్ రిపోర్టలన్నింటిని పరిశీలిస్తూ చెప్పాడు. కొందరికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. అలానే మీ అమ్మకు నిద్రలో కలవరించే అలవాటుంది. ఎక్కడో మెదడు పొరల్లో మిగిలిపోయిన తెలుగు పదాలు అలా అప్పుడప్పుడు బయట పడ్డాయి. ఇప్పుడు దిగులు లేదు. కౌన్సిలింగ్ నిర్వహించాం. ఇక జన్మలో మీ అమ్మ నోటి నుంచి తెలుగు పదాలు రావు ఇది నా గ్యారంటీ’’ అని డాక్టర్ ధీమాగా చెప్పారు. ‘‘మా కుటుంబాన్ని రక్షించారు. జీవితంలో మీ మేలు మరువలేను’’ అని శ్రీకాంత్ గద్గద స్వరంతో డాక్టర్‌కు కృతజ్ఞతలు చెప్పారు.
***
శ్రీకాంత్ భయంగా లేచి కూర్చున్నాడు. సెలవు రోజు కావడంతో మధ్యాహ్నం కునుకు తీశాడు. భయంగా క్యాలండర్ వైపు చూశాడు 2012 అని ఉంది. అమ్మయ్య ఇది 2030 కాదు కదా అని చేతిలో ఉన్న పత్రికను భయం భయంగానే చూశాడు. తెలుగులో మాట్లాడినందుకు విద్యార్థినిని చితగ్గొట్టిన టీచర్ అనే వార్తను మళ్లీ చదివాడు. ఆ వార్తను చదువుతూ అలానే నిద్రలోకి జారుకున్న శ్రీకాంత్‌కు ఆ కల చమటలు పుట్టించింది. ఆ కల నిజమవుతుందా? కాదా? పాలకుల దయ మన ప్రాప్తం


ముక్తాయింపు: తెలుగు భాష కనిపించకుండా చేస్తున్న తొలి భాషా ప్రయుక్త రాష్ట్ర పాలకులకు, భాష పేరుమీదనే పార్టీని ఏర్పాటు చేసినా వారి వెబ్‌సైట్‌లో సైతం తెలుగు కనిపించకుండా జాగ్రత్తపడుతున్న పార్టీకి కృతజ్ఞతలతో .. 

11, మార్చి 2012, ఆదివారం

మీడియా తప్పు చేస్తే...రాజు తప్పు చేయడు అంటారు. అంటే రాజు ఏం చేసినా అది తప్పు కాదన్నమాట. మన మీడియా సైతం అలానే అనుకుంటోంది. మీడియా తప్పు చేయదు అని మరి అలా తప్పు చేస్తే విమర్శించాల్సిన అవసరం ఉందా? లేదా? ప్రజాస్వామ్య దేశంలో ప్రధానమంత్రి తప్పు చేసినా బోనులో నిలబడుతున్నారు. మీడియాలో ఉండేది కూడా మనుషులు మనుషులన్నాక తప్పులు ఎందుకు జరగవు. కొన్ని ఉద్దేశ పూర్వకంగా జరుగుతాయి. కొన్ని తెలియక జరుగుతాయి. మేం ఏది చేసినా సరైనదే అనుకోవడం కన్నా తప్పును ఒకరు ఎత్తి చూపినప్పుడు సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడం మంచిది. మీడియా తప్పులను ఎత్తి చూపుతూ మీడియా స్కాన్ పేరుతో డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఒక పుస్తకాన్ని వెలువరించారు. ప్రతి వారం మీడియా పోకడలను ప్రస్తావిస్తూ ఈ వారంలో రాసిన వ్యాసాలతో మీడియా స్కాన్ పేరుతో పుస్తకంగా విడుదల చేశారు. ఒక దశాబ్దం క్రితం ఒక మీడియా మాటే వేదంగా చెలామణి అయింది. వాళ్లు వెన్నుపోటు అంటే అది వెన్నుపోటు, కాదు ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే ప్రజా స్వామ్య పరిరక్షణగా చెలామణి అయింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పార్టీకో పత్రిక, ప్రాంతానికో పత్రిక, కులానికో పత్రిక కనిపిస్తోంది. మారిన ఈ పోకడ ఒక విధంగా ఆవేదన కలిగిస్తే, మరో విధంగా అభినందనీయం. ప్రజలను నమ్ముకోవడం కన్నా ఒకటి రెండుపత్రికలను నమ్ముకుని రాజకీయం చేద్దామనుకునేవారికి ఆటలు ఇక సాగవు అని చెప్పే విధంగా మీడియాలో పోటీ ఏర్పడడడం ప్రజాస్వామ్యానికి మంచిదే. తెలుగుమీడియాపై వచ్చిన ఎపి మీడియా బ్లాగ్ స్పాట్ డాట్‌కాం బ్లాగు గురించి మొదలు పెట్టి ఈనాడు , సాక్షి వివాదాల వరకు రచయిత మీడియాలోని అన్ని అంశాలను తన వ్యాసాల్లో ప్రస్తావించారు. ఒక పార్టీపై అభిమానమో, ఒక పత్రికపై ప్రేమ, మరో పత్రికపై వ్యతిరేకత అని కాకుండా నిష్పక్షపాతంగా పత్రికల ధోరణుల గురించి రాశారు. ఒక అంశంలో ఒక పత్రికను విమర్శించిన రచయిత మరో అంశంలో ఆ పత్రిక వైఖరిని మెచ్చుకోవడం ద్వారా తన నిష్పక్షపాత వైఖరిని చెప్పకనే చెప్పారు. రామోజీరావుతో వివాదం తరువాత ఆయన కుమారుడు సుమన్ సాక్షికి తన ఇంటర్వ్యూ ఇవ్వడం, ఆ అంశంపై చానల్స్‌లో జరిగిన చర్చను ప్రస్తావించారు. తెలుగు మీడియా ధోరణులు, రాజకీయ పక్షాలకు మద్దతుగా, వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరు గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారికి మంచి సమాచారం అందించారు రచయిత. తప్పు ఎత్తి చూపిన వారిని శత్రువుగా భావించాల్సిన అవసరం లేదు. తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి.
ఇంగ్లీష్, తెలుగు దినపత్రికలతో పాటు చానల్స్‌లోని వార్తలను, వాటి ధోరణులను సమీక్షించారు. అదే విధంగా నవ్య వారపత్రిక ప్రత్యేక సాహిత్య సంచికపై వ్యాసం ఆకట్టుకునే విధంగా ఉంది. నవ్య వారపత్రిక శ్రీశ్రీపై ప్రత్యేక సంచిక వేసింది. సాధారణంగా సినిమా తారల ముఖ చిత్రంతో వార పత్రిక వెలువడినప్పుడు అమ్మే కాపీల కన్నా సాహిత్య సంచికగా వెలువడినప్పుడు తక్కువ కాపీలు అమ్ముడవుతాయి. కానీ ఇలాంటి ప్రత్యేక సంచికల ద్వారా ఆ పత్రికకు సాహిత్య విలువ ఏర్పడుతుందనే మంచి విషయం చెప్పారు.
- మురళి
మీడియా స్కాన్
( పత్రికలపై పరిశీలనా నేత్రం)
రచయిత: డాక్టర్ నాగసూరి
వేణుగోపాల్
వెల:150 రూపాయలు
పేజీలు 240
ప్రతులకు : ఎన్‌కె పబ్లికేషన్స్
24-8-1,సమీర రెసిడెన్సీ,
విజయనగరం 535002
ఫోన్ 094403 43479

8, మార్చి 2012, గురువారం

దేశ రాజకీయాల్లో మగాడు ఇందిరాగాంధీ ............. ఇందిరాగాంధీ పొతే దేశ సమస్యలన్నీ పోతాయనుకున్నాను ......మేడం మీరు వంట చేస్తున్నట్టుగా ఒక ఫోటో కావాలి ? ఇంటర్వ్యూ  ముగిశాక బ్లిట్జ్ పత్రిక జర్నలిస్ట్ ఇందిరా గాంధీని అడిగాడు. ఆమె నవ్వి నేను ఆలాంటి ఫోటో కు పోజు ఇవ్వనన్నారు . నాకు వంట చేయడం వచ్చు కానీ వంట చేస్తూ ఫోటో ఇచ్చే ప్రసక్తే లేదన్నారు . అతనికి అర్థం కాలేదు ఫొటోకు అభ్యంతరం ఎందుకో అనుకున్నాడు .. నేను వంట చేస్తున్నప్పటి ఫోటో మీ పత్రికలో వచ్చిందనుకోండి . ఈ దేశ ప్రదాని కూడా వంట చేయాల్సిందే నువ్వేమిటి అని మగాళ్ళు భార్యను అంటారు . దానికి నేను అవకాశం ఇవ్వను అని ఆమె సున్నితంగా తిరస్కరించారు. 

పత్రికల వాళ్ళు అడగ గానే మురికి వాడల పిల్లలను ముద్దు పెట్టుకొంటూ పోజులు ఇచ్చే నాయకులు, ఎన్నికలు రాగానే బట్టలుతుకుతూ, రిక్షా  తొక్కుతూ పోజులు ఇచ్చే పనికి మాలిన నాయకులున్న దేశం లో ఇందిరా గాంధీ  చెప్పిన ఆ మాట నాకు బాగా నచ్చింది .
నేనేమి ఆమె అభిమానిని కాదు . పైగా . చదువుకొనే రోజుల్లో దేశం లోని సమస్యలన్నింటికీ ఇందిరాగందినే కారణం అనుకొనే వాడిని. ఆమె పొతే ( బహుశా చనిపోతే కావచ్చు )దేశం లోని సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అన్నంతగా నమ్మేవాడిని. 

స్కూల్ బుక్స్ కన్నావార్త పత్రికల పైనే అభిమానం ఎక్కువ .  పత్రికలు క్రమం  తప్పాకుండా చదివే వాణ్ణి ఆ సమయం లో ఈనాడు ప్రభావం మరీ ఎక్కువ.  ఎవరు  ఎలా ఆలోచించాలో అందరి తరపున ఆ పత్రికే ఆలోచించి పెట్టేది. ఇందిరాగాంధీ మీద విషం కక్కుతూ ఆ పత్రిక రాసే రాతల ప్రభావం బాగా పడింది . ఇప్పటి మాదిరిగా ఈనాడు ఉద్దేశాలను విప్పి చెప్పే బలమైన మీడియా అప్పుడు లేదు ... దాంతో ఇందిరాగాంధీ పొతే తప్ప దేశం బాగుపడదు అనే నిర్ణయానికి వచ్చాను . 

 నాలుగు రైదుగురు తీవ్రవాదులు దేశం మీద యుద్ధం ప్రకటించి అల్ల కల్లోలం సృష్టించి, పార్లమెంట్ మీద దాడి చేసినా , పట్టు బడిన వారికి అల్లుడిలా మర్యాదలు చేస్తున్నా ఇప్పటి నాయకత్వాన్ని చూస్తుంటే .. ఈ దేశానిక ఇందిరాగాంధీ లాంటి మగాడి నాయకత్వం గుర్తుకొస్తోంది .
ఆ మధ్య ఒక వ్యాసం కోసం సమాచారం వెతికినప్పుడు పాకిస్తాన్తో యుద్ద సమయం నాటి సమాచారం చదివాను. 
పాకిస్తాన్ తో యుద్ధం తప్పదనే వాతావరణం ఏర్పడిన తరువాత ఆమెరికా అధ్యక్షుడు ఇందిరా గాంధీని సున్నితంగా  హెచ్చ రించాడు  . మీరు పాకిస్తాన్ తో యుద్ధం చేస్తే , చైనా పాకిస్తాన్ కు అండగా నిలువ నిలుస్తుంది . అలా జరిగితే మేం మాత్రం మీకు అండగా నిలువం అని చెప్పారు .ఒక రకంగా పాక్ తో యుద్ధం వద్దు అనే హెచ్చ రిక... అయినా భయపడకుండా పాకిస్తాన్తో యుద్ధం చేసి ఆ దేశాన్ని రెండు ముక్కలు చేసిన వీరనారి  ఇందిరా గాంధీ ... మేం శాంతి కాముకులం దాన్ని మా బలహీనతగా భావించి తోక జాడిస్తే రెండుగా  చీలుస్తాం అని చేసి చూపింది .. 
విధానాల్లో తప్పు ఉండవచ్చు , కొందరికి నచ్చ వచ్చు,  నచ్చక పోవచ్చు కానీ ఇప్పటి నాయకుల్లా కోట్లు సంపాదించిన నాయకురాలు కాదు ఆమె .. 
ఆర్థికంగా దేశం దూసుకు వెళుతున్న ఇలాంటి కీలక సమయం లో దేశమంతా మరుగుజ్జ నాయకులే కానీ ఇందిరా గాంధీ లాంటి నాయకులేరి ... ఇలాంటి పరిస్థితుల్లో ఆమె లాంటి నాయకులు ఉండాల్సింది .

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఇందిరా గాంధీ గుర్తుకు వచ్చారు. 
ఇందిరా గాంధీని మగాడు అనడం లో ఆడవారిని చిన్న చూపు చూడడం కాదు ... ఒకరి వీరత్వం నచ్చితే సాధారణ మనుషులు వాడు మగాడు అంటారు. అలా నే ఒక అసాధారణ మహిళకు సామాన్యుడి నివాళి వాజ్ పాయి లాంటి నాయకుని తో అపర కాలిక అనిపించుకున్న నాయకురాలు ఆమె .

7, మార్చి 2012, బుధవారం

జీవితం లో మీరు ఏమైనా త్యాగం చేశారా? త్యాగమయమే రాజకీయం

‘‘ప్రియా నన్ను మరిచిపో... ఎన్ని తరాలు మారినా, ఈ పెద్ద వాళ్లు మారరుప్రియా! ఆనాటి లైలా మజ్నుల ప్రేమను ఈ పెద్దవాళ్లు ఒప్పుకోలేదు. మొన్నటి దేవదాసు పార్వతి ప్రేమను అడ్డుకున్నారు. నిన్నటి దేవానంద్ సురయా ప్రేమను కాలరాచారు. మన ప్రేమను త్యాగం చేయాల్సిందే తప్పదు’’ అంటూ సీనియర్ నందమూరి  స్టైల్‌లో చెప్పిన మాటలనే రెండేసి సార్లుచెప్పిన రాజేష్ రియాక్షన్ కోసం ప్రియ ముఖంలోకి చూశాడు. ‘‘అదేంటి రాజేష్ నీ మాటను మీ ఇంట్లో వాళ్లు కాదనరని, కాదన్నా ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుని చిలకా గోరింకల్లా ఉందామన్నావ్! మరిప్పుడేమో ’’ అంటూ ఇక మాట్లడలేకపోయింది. ‘‘మనం ఒకటి తలిస్తే,దైవం మరోటి తలుస్తాడు’’ అని కాసేపు ఆగాడు. ‘‘దేవుడిని కూడా ఎదిరిస్తానన్నావ్’’ అంది ప్రియ. ‘‘ ఆవేశంతో మనిషి దేవున్ని కూడా ఎదిరించగలనని అనుకుంటాడు ప్రియా కానీ అంతా కాల మహిమ. మన ప్రేమను త్యాగం చేయక తప్పదు’’ అంటూ రాజేష్ ముఖంలోకి బాధను ఆహ్వానించాడు. మరి కడుపులో పెరుగుతున్న నీ ప్రతిరూపం మాటేంటి రాజేష్’’ ప్రియ అడిగింది. ‘‘అదీ త్యాగం చేయాలి’’ అని మెల్లగా పలికాడు. ‘‘అలా అంటావా? రాజేష్ ఏదో ఒక రోజు ఇలాంటి త్యాగం సీన్ మన ప్రేమలో ఉంటుందని ఊహించాను. మన వ్యవహారాన్ని మొత్తం రికార్డు చేశాను. అన్ని ఆధారాలను పోలీసులకు, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి తల్లిదండ్రులకు పంపించే ఏర్పాటు చేసే వచ్చాను రాజేష్’’ అంటూ ప్రియ నవ్వింది. ‘‘పిచ్చి ప్రియా నిజమే అనుకున్నావా? ఆ దేవుడే దిగివచ్చినా మన ప్రేమను త్యాగం చేయను. ఉత్తుత్తినే నిన్ను ఆటపట్టించాలని అన్నాను’’ అనిరాజేష్  నవ్వాడు. నేనూ అంతే అని ప్రియ నవ్వింది.
***
కొన్ని జీవితాలు అంతే.. వాళ్లు త్యాగాల కోసమే పుడతారు. కానీ సమాజమే వారి త్యాగాలను గుర్తించదు. ఈ మట్టి చేసుకున్న పుణ్యమో ఏమో కానీ మహనీయుల త్యాగం దేశంలో జీవనదిలా ప్రవహిస్తోంది. మీ కోసం ఆరునెలల పదవీ కాలాన్ని త్యాగం చేస్తున్నాను, నా త్యాగాన్ని గుర్తించండి అని ఒక రాజకీయ త్యాగధనుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. త్యాగాన్ని గుర్తించమన్నాడు కదా? అని ఆయన్ని ఎన్నికల్లో ఓడించారు. ఔను మరి గెలిపిస్తే త్యాగాన్ని చిన్నచూపు చూసినట్టు అవుతుంది కదా? ఆనాటి త్యాగం నుంచి ఆయన ఇప్పటి వరకు కోలుకోలేదు. ఒక రకంగా ఈయన ఆ శ్రీరాముడి కన్నా గొప్పవారే అని ఆయన అభిమానులంటారు. శ్రీరాముడి కథను లవకుశులు గానం చేశారు కానీ స్వయంగా శ్రీరాముడికి చెప్పుకునే అదృష్టం దక్కలేదు. ఏ పూర్వజన్మ సుకృతమో కానీ ఆయన ఒక్కరికే తన త్యాగాన్ని తాను గానం చేసుకునే అదృష్టం దక్కింది. ఒకటా రెండా? ఆయన త్యాగాలకు అంతు లేదు. ప్రధానమంత్రి లాంటి పదవిని త్యాగం చేసిన ఈయన కర్ణుడి కన్నా గొప్పవారే కదా? నీకు ప్రధానమంత్రి పదవి ఎవరిస్తారన్నారయ్యా బాబు రోజూ నాకు ప్రధానమంత్రి పదవి వద్దే వద్దు అని త్యాగం చేస్తున్నావు అంటూ ఆ మధ్య ఒకాయన కనికరం లేకుండా కటువుగా మాట్లాడారు. త్యాగం చేసేందుకు ఒకరివ్వాలా? ఏమిటో ఎవరో ప్రధానమంత్రి పదవి ఇస్తే త్యాగం చేసేందుకు ఆయన అల్లాటప్పా నాయకుడు కాదు ఆయనంతటి వారు ఆయన అందుకే ఎవరు ఇవ్వకపోయినా త్యాగం చేసేస్తున్నారు. అంతటి త్యాగశీలిని పదవి లేనిదే క్షణం ఉండలేకపోతున్నారని ఆడిపోసుకుంటున్నారు కానీ త్యాగాన్ని గుర్తించడం లేదు. ముఖ్యమంత్రి పదవి కోసం మామను కుర్చీ నుంచి లాగేసిన అల్లుడి త్యాగాన్ని గుర్తించ లేదు. ప్రేమాభిషేకం సినిమాలో చివరి సీన్‌లోనైనా శ్రీదేవికి అక్కినేని త్యాగం గురించి తెలుస్తుంది. కానీ మన నాయకుల త్యాగాన్ని ప్రజలెప్పుడు తెలుసుకుంటారో? వారు వీరు అని కాదు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు మన నాయకులు మనుషులకు సహజ సిద్ధమైన సిగ్గు అనేదాన్ని త్యాగం చేశారు. ఈ త్యాగానికి గుర్తింపే లేదు. క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పటి మన సిఎంతో రహస్యంగా చెవిలో నువ్వు నేను, టోనిబ్లేయిర్ కలిసి మరో ప్రపంచం సృష్టిద్దాం, దానికి నువ్వే అధ్యక్షుడివి అని ప్రతిపాదిస్తే, మరో ప్రపంచాన్ని కూడా త్యాగం చేస్తున్నాను నాకు తెలుగునాడే ముఖ్యం అని ప్రకటించిన త్యాగశీలి మన నేత. మా రాహుల్ ప్రధానమంత్రి కావాలనుకుంటే రాత్రికి రాత్రి అవుతారని కాంగ్రెస్ కేంద్ర మంత్రి ఒకరు చెప్పుకొచ్చారు. కానీ రాహుల్ మాత్రం ప్రధానమంత్రి పదవిని త్యాగం చేశారు. వాళ్ల అమ్మ కూడా అంతకు ముందు ప్రధానమంత్రి పదవిని త్యాగం చేశారాయే! ఆ మధ్య జి వెంకటస్వామి నాకు ఇక  రాష్ట్రపతి పదవి ఇస్తానన్నా వద్దంటాను అని త్యాగం చేశారు. అంతకు ముందు ఎం సత్యనారాయణరావు గవర్నర్ పదవి త్యాగం చేశారు. ఏంటీ వాళ్ల త్యాగాలు వీళ్ల త్యాగాల గురించి రాయడమే తప్ప మీ త్యాగం ఏమిటంటున్నారా? అంత మంది ప్రధానమంత్రి పదవి త్యాగం చేస్తుంటే నేనేం తక్కువ తిన్నానా? నేనూ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసేస్తా, నాకూ ఆ పదవి వద్దే వద్దు. జనాంతికంగా మీతోనే ఉండిపోతా..