28, డిసెంబర్ 2018, శుక్రవారం

దేవుళ్లూ.. పారాహుషార్..!


‘‘నన్ను డిస్ట్రబ్ చేయకు.. నేనో భారీ ప్రాజెక్టు మొదలు పెట్టబోతున్నా..’’
‘‘ఏంటా ప్రాజెక్ట్? గరీబీ హఠావో అని ప్రపంచంలోని పేదరికాన్ని నిర్మూలించే ప్లాన్ చేస్తున్నావా?’’
‘‘అలాంటి దురాశ నాకేం లేదు. మనం పేదరికంలో మగ్గిపోవాలన్నా, సంపన్నులం కావాలన్నా అది ప్రభుత్వం చేతిలో లేదు.. మన మెదడులోనే ఉందనే సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మేవాడ్ని.’’
‘‘మరింకేం చేస్తున్నావ్?’’
‘‘చూడోయ్.. మనం ఇలానే నిర్లక్ష్యంగా ఉంటే అంతా మన చేయి దాటి పోతుంది. దెబ్బ తాకినప్పుడు పసుపు రాయడం మన అమ్మమ్మల కాలం నుంచి మనకు అలవాటే కదా? అమెరికా వాడు పసుపు, వేపగింజల మీద పేటెంట్ పొందేంత వరకు మనం మేల్కోలేదు. వాడికి పచ్చిపులుసు సంగతి తెలియదు కాబట్టి బతికి పోయాం. లేదంటే మామిడి కాయ సోగి, పచ్చిపులుసు, చింతకాయ తొక్కు, మాగాయ, ఆవకాయ, గోంగూర చట్నీ, పుంటికూర తొక్కు పేరేదైతేనేం.. ‘అన్నీ మావే’ అని పేటెంట్ హక్కులు పొందేవాడు.’’
‘‘అంటే నువ్విప్పుడు పచ్చిపులుసు, పుంటికూర తెలుగు వాడి హక్కు అని ప్రపంచానికి చాటి చెప్పదలుచుకున్నావా?’’
‘‘కాదు.. అంతకన్నా మహత్తర కార్యంలో ఉన్నా..’’
‘‘ఊరించక అదేంటో చెప్పు?’’
‘‘హనుమంతుడు మా కులం అంటే మా కులం అని ఇప్పటికే ఉత్తరాదిలో చాలా రాష్ట్రాలు, పార్టీలు, నాయకులు పోటీ పడుతున్నారు?’’
‘‘ఔను.. నేనూ చూశా మీడియాలో.. హనుమంతుడు, జాంబవంతుడు, రామలక్ష్మణులు, శబరి మా వారంటే మా వారని వాదులాడుకుంటున్నట్టు మీడియాలో చూశా. ఐతే నువ్వేం చేస్తావ్’’
‘‘ఆ మధ్య శ్రీకృష్ణదేవరాయల పాలన ఐదు శతాబ్దాల ఉత్సావాల సందర్భంగా ఉమ్మడి రాష్ట్రం నుంచి పాలక సామాజిక వర్గాల వారు కర్నాటక వెళ్లి- కృష్ణదేవరాయల వంశస్తులను కలిసి మీరు మా కులం అంటే మా కులం అని చెప్పండని పోటీ పడ్డారట! అధికార వర్గంలో, ఉన్నత పదవుల్లో ఉన్న ఆ సామాజిక వర్గాల ప్రతినిధి బృందం శ్రీకృష్ణ దేవరాయలను తమ వర్గంలో కలుపుకోవడానికి పడుతున్న తపన చూసి కర్నాటకలోని శ్రీకృష్ణదేవరాయల వంశస్తులు విస్తుపోయారు’’
‘‘ఔను.. దాదాపు దశాబ్దం క్రితం ఈ వార్త నేనూ చదివాను. దానిపై పరిశోధన చేస్తున్నావా? రాయలు ఆ రెండు సామాజిక వర్గాలకు కాకుండా మరో సామాజిక వర్గానికి చెందిన వారని పరిశోధన జరుపుతావా?’’
‘‘అలా అని నేను చెప్పానా?’’
‘‘చరిత్రను తిరగరాస్తామంటే ఇదేనేమో? యుద్ధంలో విజయం సాధించిన వారు రాసిందే చరిత్ర కదా? ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారినట్టు చరిత్ర కూడా మారితే భలే ఉంటుంది కదా? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వారు- ఐదు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న వారు రాసింది తప్పుడు చరిత్ర, కొత్త చరిత్ర రాస్తాం అంటున్నారు’’
‘‘అధికారంలోకి వచ్చిన వారికి దేశచరిత్రను తిరిగి రాసే అధికారం ఉన్నట్టుగానే రాష్ట్రా ల్లో అధికారంలోకి వచ్చిన వారికి రాష్ట్ర చరిత్రను తిరిగ రాసే అధికారం ఉండాలి.’’
‘‘నువ్వేదో సరదాగానే అంటున్నా- కొందరు ఈ పని చేస్తూనే ఉన్నారు.’’
‘‘ఔను.. పాలనకు పనికిరారని దించేసిన వారినే విగ్రహాలుగా పెట్టి పూజిస్తూ, ప్రజలంతా పూజించాలని చెబుతున్నారు’’
‘‘వర్మ సినిమా గురించా?’’
‘‘కాదు- జరిగిన చరిత్ర గురించి’’
‘‘ఆ సంగతి వదిలేయ్.. ఇంతకూ నీ భారీ ప్రాజెక్ట్ ఏంటో చెప్పనేలేదు’’
‘‘మనం అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం అని చెబుతూనే ఉన్నాను. వెంకన్న మందిరాలు ఎన్నున్నా వెంకన్న ఆలయం అనగానే తిరుపతి గుర్తొస్తుంది కదా? అలానే ఊరూరా రామాలయాలున్నా దేశంలో శ్రీరాముని ఆలయానికి భద్రాచలం ప్రఖ్యాతి కదా? ’’
‘‘కాదని ఎవరన్నారు? రాష్ట్ర విభజన తరువాత భద్రాచలం తెలంగాణకు వచ్చిందని, ఆంధ్రలోని ఒంటిమిట్ట రామాలయంలో వేడుకలు నిర్వహిస్తున్నారు కదా?’’
‘‘దాని గురించి కాదు. శ్రీరాముడిని కమలం పార్టీ వాళ్లు ఓన్ చేసుకుని రెండు సీట్ల నుంచి అధికారం వరకు ఎగబ్రాకారు. ఇప్పుడు మరోసారి శ్రీరాముని దయచేతను- అని చెప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ’’
‘‘నిజమే- మన భద్రాది రాముడిని ఉత్తరాది రాముడిగా మార్చేశారు.’’
‘‘అందుకే చెబుతున్నా.. ఇప్పటికైనా మనం కళ్లు తెరిచి మిగిలిన దేవుళ్లపై దృష్టి సారించాలి. ’’
‘‘అంటే ఏం చేయాలి’’
‘‘దేవుళ్లను మనం కాపాడుకోవాలి’’
‘‘నీకేమన్నా పిచ్చా? కష్టం వస్తే దేవుళ్లకు మొక్కుకుంటాం. మనల్ని కాపాడమని వేడుకుంటాం. మనం దేవుళ్లను రక్షించుకోవడం ఏంటి?’’
‘‘మరదే.. ఇప్పటికే కొంతమంది దేవుళ్లు మన చేతిలో నుంచి దాటి పోయారు. ఏ దేవుడు ఏ కులమో ఉత్తరాది వాళ్లు తేల్చేస్తున్నారు. దక్షిణాదికి న్యాయమైన వాటా ఇవ్వాలనే ఆలోచన కూడా చేయకుండా దేవుళ్లను ఆయా కులాల వాళ్లు పంచుకుంటున్నారు. అసలే ఎన్నికల కాలం.. ఏ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉంటే దేవుళ్లను ఆ కోటా కింద వేసేస్తున్నారు. మనం వౌనంగా ఉంటే అన్యాయమై పోతాం. ’’
‘‘దానికి మనమేం చేస్తాం?’’
‘‘మనకు ముక్కోటి దేవుళ్లు ఉన్నారు కదా? అందరి పేర్లు సేకరించి..’’
‘‘మొన్న మా మనవడు కౌరవులంటే వంద మంది సోదరులు కదా? 97వ సోదరుడి పేరు చెప్పమని అడిగితే తెల్లమొఖం వేశాను. దుర్యోధనుడి పేరు, ఎన్టీఆర్ పౌరాణిక సినిమాల వల్ల దుశ్శాసనుడి పేరు తప్ప ఇంకో పేరు తెలియదన్నాను. నువ్వు ముక్కోటి దేవుళ్ల పేర్లు సేకరిస్తావా? సేకరించి ఏం చేస్తావ్?’’
‘‘ప్రజల్లో సామాజిక చైతన్యం పెరిగింది. ప్రతి సామాజిక వర్గం తమకో ఫవర్‌ఫుల్ దేవుడు ఉండాలని కోరుకుంటోంది’’
‘‘ఐతే నువ్వేం చేస్తావ్?’’
‘‘ముక్కోటి దేవుళ్ల పేర్లను మనమే రిజిస్టర్ చేయించుకుంటాం. వారిపై సర్వ హక్కులు మనకే ఉంటాయి. ఎవరైనా- తమ సామాజిక వర్గానికి ఓ దేవుడు కావాలంటే కేటాయించే అధికారం మన చేతిలోనే ఉంటుంది. అంటే- మనం చెప్పిన ధర చెల్లించి దేవుడిని కోనుక్కోవాలి’’
‘‘అంటే దేవుళ్లను అమ్ముకుంటావా?’’
‘‘మార్కెట్‌లో దేనికి డిమాండ్ ఉంటే దాన్ని అమ్ముకోవాలి. ఈ వ్యాపారానికి ముక్కోటి దేవుళ్ల ఆశీస్సులు నాకుంటాయి. ఏ మంటావ్?’’
‘‘దేవుళ్లూ పారాహుషార్. మిమ్మల్ని కూడా అమ్మేసుకుంటారని అంటాను’’
*బుద్దామురళి (జనాంతికం 28-12-2018)

24, డిసెంబర్ 2018, సోమవారం

ఇది కేసీఆర్ శతాబ్దం

ఈశతాబ్దం నాది అని సాహి త్యంలో మహా కవి శ్రీశ్రీ ప్రకటించుకున్నారు. తెలుగు సాహి త్యంలో శ్రీశ్రీ ప్రకటింకున్నట్టుగానే తెలుగు రాజకీయాల్లో ఈ శతాబ్దం నాది అని ప్రకటించుకునే ధైర్యం ఒక కేసీఆర్‌కే ఉన్నది. తెలుగు రాజకీయాల్లో ఈ శతాబ్దం నాది అని సగౌరవంగా ప్రకటించుకునే అవకాశం ఒక్క కేసీఆర్‌కు మాత్రమే ఉన్నది. శ్రీశ్రీ కన్నా ముందు, తర్వాత టన్నులకొద్దీ సాహిత్య సృష్టి జరిగింది, జరుగుతున్నది. కానీ ఒక్క మహా ప్రస్థానంతో శ్రీశ్రీ ఈ శతాబ్దం నాది అని ప్రకటించుకోగలిగారు. వందేండ్లలో దాదాపు 80 ఏండ్ల పాటు తెలంగాణ ఎన్నో ఉద్యమాలను చూసింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నుంచి నేటిదాకా అనేక పోరాటాలు ఈ నేల చూసింది. ముల్కీ ఉద్యమం 1955లోనే ఆంధ్రప్రదేశ్‌లో విలీనానికి వ్యతిరేకంగా సాగింది మొదలు 1969 తెలంగాణ ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం వంటి ఎన్నో ఉద్యమాలు చూసింది. తెలంగాణలో సాగిన ఈ ఉద్యమాల అనుభవాలు, ఫలితాలను అధ్యయనం చేసి 2001లో శ్రీకా రం చుట్టిన తెలంగాణ ఉద్యమం విజయతీరాలను తాకి తెలంగాణ కలను సాకారం చేసింది. ఆరు దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేయడం ద్వారా కేసీఆర్ ఈ దశాబ్దం నాది అని సగౌరవంగా ప్రకటించుకోవచ్చు.

దేశానికి భూసంస్కరణల ఆలోచన కలిగించిన నేల ఇదే. భూదాన ఉద్యమానికి శ్రీకారం చుట్టిన నేల ఇదే. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్ట్టెక్కించి ఆర్థిక సంస్కరణల ద్వారా ఆధునిక భారతానికి దారులు వేసిన పీవీ నర్సింహారావు పాలనా పాఠాలు నేర్చుకున్నది ఇక్కడే. ఇవన్నీ ఈ దశాబ్ద కాలంలోని అపురూప దృశ్యాలు, దేశ గతిని మార్చిన పరిణామాలు. అయితే వందేండ్ల తెలంగాణ చరిత్ర చూస్తే ఈ దశాబ్దం నాది అని ప్రకటించుకు నే అవకాశం చరిత్ర కేసీఆర్‌కే ఇచ్చింది. వందేండ్ల తెలంగాణ చరిత్ర పరిశీలిస్తే ఈ వందేండ్లు కూడా పలు కీలక ఉద్యమాలతోనే గడిచింది. అయితే వీటిలో 2001లో మొదలైన తెలంగాణ ఉద్యమం మాత్రమే విజయం సాధించింది. తెలంగాణ సాకారం కావడమే కాదు, ఉద్యమనేతగా కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. మొద టి గెలుపును సెంటిమెంట్ అనుకుంటే, ఇప్పుడు పాజిటివ్ వేవ్‌తో రెండవసారి ఘన విజయం సాధించారు. 2014లో తెలంగాణ సాకారమైన తర్వాత 63 స్థానాల్లో విజయం సాధిస్తే, 2018లో 88 స్థానాల్లో విజయం సాధించారు. సంక్షేమ పథకాల్లో అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు.

ఆధునిక తెలంగాణకు వందేండ్ల క్రితమే పునాదులు పడ్డాయి. సిర్పూర్ పేపర్ మిల్లు, బోధన్ చెక్కర ఫ్యాక్టరీ, చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీ, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం స్టేట్ రైల్వే వంటితో నాడే పారిశ్రామికాభివృద్ధికి పునాదులు పడ్డాయి. ఆధునిక తెలంగాణ సృష్టికర్తను నేనే అని ఎన్నికల ప్రచారంలో బాబు అహంకారంతో ప్రకటనలు చేసినా 1920 నాటికే తెలంగాణ లో ఆధునిక తెలంగాణకు పునాదులు పడ్డ విషయం చారిత్రక సత్యం.1956లో ఆంధ్రప్రదేశ్‌లో తెలం గాణ విలీనం తర్వాత ఈ ప్రాంతం అనుభవించిన వివక్ష, అణిచివేతలు అంతా ఇంతా కాదు. అప్పటినుంచి ఏదో రూపంలో తెలంగాణ తన అస్తి త్వం నిలుపుకోవడానికి ఉద్యమిస్తూ నే ఉన్నది. 2014లో ఆ కల నెరవేరింది. ఈ కల సాకారం చేయడానికి జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించడం ద్వారా కేసీఆర్‌కు ఈ శతాబ్దం నాది అని చెప్పుకునే ఘనతను చరిత్ర కట్టబెట్టింది.1982లో హైదరాబాద్‌లోనే ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఒక సంచలనం. యువతకు రాజకీయాల్లో అవకాశాలు దక్కాయి. ఎన్టీఆర్ గ్లామర్ వల్ల రాజకీయాలు సామాన్యులకు చేరువ అయినా తెలంగాణకు పెద్దగా ప్రయోజనం కలుగలేదు. పైగా 19 83 నుంచే ఆంధ్ర నుంచి బలమైన సామాజికవర్గం హైదరాబాద్‌కు వలస రావడం బాగా పెరిగిపోయింది. తెలంగాణ పల్లె భూములు, హైదరాబాద్ పరిసరాల్లోని విలువైన భూములు ఆ వర్గం చేతిలోకి వెళ్లాయి. వైయస్ రాజశేఖర్‌రెడ్డి చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభానికి చేవెళ్లకు వచ్చిన వారు అక్కడి భూములు చౌకగా లభించడం చూసి విస్తుపోయారంటే తెలంగాణ దుస్థితిని అర్థం చేసుకోవచ్చు.
Kautilya
ఈ పరిణామాలన్నింటి మధ్య పుట్టిన తెలంగాణ ఉద్యమం విజయ తీరాలకు చేరుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడటమే కాదు పాలనలోనూ కొత్త పుంతలు తొక్కుతున్నది. రైతులకు నేరుగా నగదు అందజేయడం విషయంలో దేశం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నది. రుణమాఫీ కన్నా నగదు సహాయం అందించే రైతుబంధు మేలు అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. తెలంగాణలో విజయం సాధించిన కేసీఆర్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించేందుకు సమాయత్తమవటం ముదావహం.
ఒకప్పుడు ఆర్థిక సంస్కరణల్లో తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావు దేశానికి దారిచూపితే, అదే దారిలో ఇప్పుడు దేశ రాజకీయాల్లో కేసీఆర్ రూపంలో తెలంగా ణ మరోసారి తన ప్రభావం చూపనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు చివరి దశలో ఉన్నది. అది పూర్తయితే సగం తెలంగాణ సమస్యలు తీరుతాయి. ఇప్పుడు నిర్మాణం లో ఉన్న ప్రాజెక్టులు రెండేండ్లలో పూర్తి చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో అమలు జరుగుతున్న రైతుబంధు పథకం అందరికీ ఆద ర్శంగా నిలుస్తున్నది. ఈ పథకాన్ని అమలుచేయనున్న ట్టు ఇప్పటికే ఒడిషా, ఛత్తీస్‌గఢ్ ప్రకటించాయి. నిఖార్సయిన తెలంగాణ రాజకీయాల్లో, పాలనలో మానవీయ కోణం ఉన్నది. అది పీవీ ఆర్థిక సంస్కరణ ల్లో అయినా కేసీఆర్ చెబుతున్న గుణాత్మక మార్పు అం శంలోనైనా.. ఇదే గమనించవచ్చు. వందేండ్ల తెలంగాణ రాజకీయ చరిత్రలో కచ్చితంగా ఈ దశాబ్దం నాది అని చెప్పుకునే విశిష్టత ఒక్క కేసీఆర్‌కే దక్కుతుంది. కేసీఆర్ తప్పకుండా తెలంగాణ యుగపురుషుడు. తెలంగాణ సమాజానికి ఓ వెలుగుదారి. భవిష్యత్ దిక్సూచి.
నమస్తే తెలంగాణ 23-12-2018)సంపద బ్లూప్రింట్

మీ సంపద బ్లూ ప్రింట్ ఎలా ఉందో మీరు చూసుకున్నారా? అదేంటి అనుకుంటున్నారా?
ఇంటిని నిర్మించాలనుకున్నప్పుడు ముందుగా ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటాం. అదొక్కటే కాదు. ఒక పని ప్రారంభించేందుకు, ఒక పరిశ్రమ ప్రారంభించేందుకైనా ముందుగా ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటారు. గృహ నిర్మాణం కోసం బ్లూ ప్రింట్ అంటే సరే కానీ సంపదకు సంబంధించిన బ్లూ ప్రింట్ ఏమిటి? చిత్రంగా అనిపిస్తుంది కదూ? నిజమే డాక్టర్ హార్వ్ సీక్రేట్ ఆఫ్ మిలియనీర్ మైండ్ పుస్తకంలో సంపద బ్లూ ప్రింట్ గురించి వివరించినప్పుడు ఇలానే అనిపించింది. ఐతే సామాన్యులకు ఇది చిత్రంగా అనిపించవచ్చు. కానీ సంపన్నులు మాత్రం సరైన బ్లూ ప్రింట్ ద్వారానే తాను అనుకున్న స్థాయికి, కోరుకున్న స్థాయికి ఈ బ్లూ ప్రింట్ ద్వారా చేరుకుంటారు.
సంపదకు సంబంధించి మన సాధించే విజయాలకు సంబంధించి మన ఆలోచనలు, మన లక్ష్యాలు, డబ్బుకు సంబంధించి మన ఆలోచనల రూపమే ఈ బ్లూ ప్రింట్.
పేదలు, సంపన్నులు, విజేతలు, పరాజితులు అనే తేడా లేదు. అందరికీ అంతర్లీనంగా ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. దానికి తగ్గట్టే వారి జీవిత గమనం సాగుతుంది. దానికి తగ్గట్టే ఫలితాలు ఉంటాయి. నేను ఐఎఎస్‌ను కావాలి అని నిరంతరం మనసులో అనుకుంటూ తాను మాత్రం రోజూ సినిమాలు, క్రికెట్ చుట్టూ తిరిగితే ఐఎఎస్ కావడం మాట దేవుడెరుగు పదో తరగతి గట్టెక్కడమే కష్టం అవుతుంది. లక్ష్యాన్ని నిర్ణయించుకోవడమే కాదు దాన్ని చేరుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించే వారికే లక్ష్యం చేరువ అవుతుంది.
* * *
సంపన్నులు, పేదలు కాదు. ప్రతి ఒక్కరికీ సంపదకు సంబంధించిన బ్లూ ప్రింట్ ఉంటుంది. ఐతే అది మనసులో నిక్షిప్తమై ఉంటుంది. బయటకు కనిపించక పోవచ్చు. మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన విజయాలు అన్నీ ఈ బ్లూ ప్రింట్‌కు అనుగుణంగానే జరుగుతుంటాయి. సంపన్నుడు, పేదవాడు ముందు ఆలోచనల నుంచే పుడతాడు. ఆలోచనలను ఆచరణలో పెట్టినప్పుడు ఫలితమే పేదరికం, సంపద. ఈ రెండు కూడా ఆలోచనల నుంచే పుడతాయి. పేద ఆలోచన నుంచి పేదరికం పుడుతుంది. సంపన్నమైన ఆలోచన నుంచి సంపద పుడుతుంది.
ఇటీవల సామాజిక మాధ్యమంలో కొందరి జీవితాలు ఇంతే అంటూ ఒకతను నిరాశాపూరితంగా తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆ స్థితి నుంచి బయటకు వచ్చి పాజిటివ్ దృక్ఫథంతో ఆలోచించి ముందడుగు వేస్తే పేదరికాని దూరం కావచ్చునని, అలా బయటకు వచ్చిన వారి గురించి మరో వ్యక్తి వివరిస్తుంటే పూర్తిగా నిరాశలో మునిగిపోయిన ఆ వ్యక్తి మాత్రం పాజిటివ్‌గా ఎవరేం చెప్పినా దానికి నిరాశాపూరితంగానే స్పందించ సాగాడు. అంబానీ లాంటి వారు సామాన్య ఉద్యోగిగానే జీవితాన్ని ప్రారంభించి, వ్యాపార సామ్రాజ్యాన్ని ఏ విధంగా స్థాపించారో వివరిస్తే, అతను కొందరికి లిఫ్ట్ ఇచ్చే వారుంటారు. అలాంటి వారు ఎదుగుతారు. కానీ మా లాంటి వారికి అంటూ అదే విధంగా పేద ఆలోచనలను బయటపెడుతూనే ఉన్నారు. మనసు నిండా పేదరికం, నెగిటివ్ ఆలోచనలు నింపుకున్న ఇలాంటి వారు మారడం అంత సులభం కాదు. ఐతే అసాధ్యం కాదు. ఈ జీవితం ఇంతే అని నిరాశను నింపుకున్న వారి జీవితాలు నిజంగా పేదరికంలోనే సమస్యల్లోనే ముగుస్తాయి.
మన మనసులో రూపుదిద్దుకునే బ్లూ ప్రింట్ వెనుక మన జీవిత చరిత్ర ఉంటుంది. తల్లిదండ్రుల మాటలు, వారి ప్రవర్తన, కుటుంబం, బంధువులు, చిన్నప్పటి నుంచి మన స్నేహితులు, మనకు తెలిసిన వారు అంటే మన జీవితంపై ప్రభావం చూపించే అందరి ప్రభావం మన బ్లూ ప్రింట్‌పై ఉంటుంది.
‘డబ్బు పాపిష్టిది, ధనవంతులు పాపాత్ములు, తప్పుడు పనులు చేస్తేనే సంపద చేకూరుతుంది. ఎంత సంపద ఉంటే అంతే తప్పులు చేసినట్టు, గుణ వంతున్ని కాబట్టి నా వద్ద డబ్బు లేదు. విలువలకు పాతర వేస్తే నేనూ సంపన్నుడిని అయ్యే వాడిని ’ అనే ఇలాంటి మాటల ప్రభావం బాల్యం నుంచి మనపై బలంగా ఉంటుంది. పేదరికంలో ఉండిపోవడానికి మన అసమర్థతే కారణం అని అంగీకరించడానికి మన మనసు ఒప్పుకోదు. పైగా మనం చాలా నిజాయితీ పరులం కాబట్టే పేదరికంలో ఉండిపోయామని చాలా మంది అనుకుంటారు. ఏ ప్రాంతం, ఏ కుటుంబం, ఎక్కడ పుట్టాలి అనేది మన చేతిలో లేకపోవచ్చు. కానీ వీటికి అతీతంగా మన కృషితో మనం ఎదగవచ్చు అనే ఆలోచన మనలో లేకపోతే అది ముమ్మాటికీ మనదే తప్పు.
బాల్యం నుంచి సంపద గురించి ఇలాంటి తప్పుడు అవగాహన వల్ల సంపదపై వ్యతిరకేక బావం మనలో ఏర్పడుతుంది. మన ఆలోచనలు, మన పనితీరు కూడా దీనికి తగ్గట్టే ఉంటుంది. ఫలితాలు కూడా దీనికి తగ్గట్టుగానే వస్తుంది.
సంపద చెడ్డది అనే అభిప్రాయం తప్పు. సంపన్నులంతా తప్పు చేసిన వారు కాదు. నేను కూడా సంపన్నున్ని కావాలి అనే ఆలోచన ఉంటే మన సంపద బ్లూ ప్రింట్‌ను సమీక్షించుకోవాలి. మనం వెళుతున్న దారి సరైనదే అనే అభిప్రాయం బలంగా ఉంటే అలానే కొనసాగించాలి. లేదు. నీతి తప్పకుండా సంపన్నులు కావచ్చు. మన ఆలోచనలతో సంపన్నులు కావచ్చు. సంపన్నులు కాకపోయినా కనీసం పేదరికంలో మగ్గిపోవద్దు అనుకుంటే సంపద బ్లూ ప్రింట్‌ను మార్చుకోవాలి.
బ్లూ ప్రింట్‌ను మార్చుకున్నప్పుడు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. చిన్న ఉద్యోగంలో ఉన్నామా? చిన్న ఉద్యోగంలో ఉన్నామా అనే తేడా లేదు. మనం ఎదగాలి అనే భావన బలంగా ఎప్పుడు ఏర్పడితే అప్పుడు అవకాశాలు కనిపిస్తాయి. అన్ని పాపాలకు డబ్బే కారణం అనే భావనే తప్పు పుణ్య కార్యాలకు సైతం కావలసింది డబ్బే. మన ఆలోచనలకు అనుగుణంగానే మన చర్యలు ఉంటాయి. మన చర్యలకు తగినట్టుగానే మనకు ఫలితాలు ఉంటాయి.
వడ్డీ రేట్లు, స్టాక్ మార్కెట్, ధరల పెరుగుదల, వడ్డీ, వ్యాపారం, ఇవన్నీ పైకి కనిపించేవి. కానీ సంపద సమకూరడానికి పైకి కనిపించే వీటి కన్నా కనిపించని ఆలోచనల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఒక మనిషి సంపన్నుడిగా ఎదిగినా, పేదవాడిగా మిగిలిపోయినా పైకి కనిపించే వాటి కన్నా కనిపించని వాటి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. పైకి కనిపించని ఆలోచనలే కీలక పాత్ర వహిస్తాయి. జీవితంలో ఏ స్థాయిలో ఉండదలిచాం. ఎంత సంపాదించాలని అనుకుంటున్నాం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ విధంగా కృషి చేయాలి. అనే అంశాలతో కొత్త బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి. మన ఆలోచనలు ఏ తీరుగా ఉన్నాయో సమీక్షించుకుని , ఏ దశలో ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నామో దానికి తగినట్టు కొత్త బ్లూ ప్రింట్ రూపొందించుకుందాం. విజయాన్ని చవి చూద్దాం.
-బి.మురళి(23-12-2018)

21, డిసెంబర్ 2018, శుక్రవారం

ఈ నల్లని రాలలో ఏ వ్యూహం దాగెనో

ఈరోజుల్లో కూడా అంతటి మహానుభావులు ఉన్నారంటే నమ్మలేం. వృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో మోసిన శ్రవణుడి గురించి పురాణాల్లో విన్నాం, తల్లిదండ్రులను దేవతల విగ్రహాలుగా మలిచిన కలియుగ శ్రవణుడిని మీ వీధిలో చూశా..’’
‘‘దేని గురించి ?’’
‘‘మీ ఇంటికి వస్తుంటే మూలమలుపు మీద శ్రావణ్ కుమార్ అనే నేమ్ ప్లేట్ ఉన్న ఇంటిని, ఇంటి ముందున్న విగ్రహాలను చూశాను’’
‘‘బుక్‌పై కవర్‌ను చూసి బుక్‌ను అంచనా వేయవద్దన్నట్టు, ఇంటి ముందు విగ్రహాలను చూసి ఇంటి యజమానిని అంచనా వేయవద్దు’’
‘‘మంచితనాన్ని కూడా మెచ్చుకోలేక పోవడం బాగాలేదోయ్.’’
‘‘శ్రావణ్ ఇంటి విగ్రహాల గురించి నీకు తెలుసా?’’
‘‘విగ్రహాల సైజు ఎంత? వాటి కోసం ఎంత ఖర్చు చేశాడని కాదోయ్. చనిపోయిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారి విగ్రహాలను తయారు చేయించాలనే అతని పెద్దమనసును చూసి మెచ్చుకోవాలి’’
‘‘వారి తల్లిదండ్రులు చనిపోయారని నీకెవరు చెప్పారు? నగరంలోని ప్రముఖ వృద్ధాశ్రమంలో విశ్రాంతి తీసుకుంటూ, దేవుడా మమ్మల్ని పైకి ఎప్పుడు తీసుకుపోతావా? అని ఎదురు చూస్తున్నారు’’
‘‘అర్థం కాలేదు..’’
‘‘అందుకే చెప్పా.. రాజకీయాలతో నాకేం పని అనుకుంటే ఏదీ అర్థం కాదు. రాజకీయాలను దగ్గరి నుంచి పరిశీలించాలి.’’
‘‘రాజకీయాలకు, విగ్రహాలకు సంబంధం ఏమిటి?’’
‘‘దేవుని దయవల్ల నిండా నూరేళ్లు బతికిన కరుణానిధి తన జీవిత కాలమంతా విగ్రహారాధనను వ్యతిరేకించారు. చివరకు ఆయన పోయాక మొన్న చెన్నైలో కుమారుడి నాయకత్వంలో విగ్రహం ఏర్పాటు చేశారు. కూటముల నాయకులు చాలా మంది ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.’’
‘‘ఔను.. ఐతే..?’’
‘‘సర్దార్ పటేల్ విగ్రహం ఏర్పాటుకు ముందు ప్రపంచంలో అత్యంత పెద్ద విగ్రహం ఎవరిదో తెలుసా? బౌద్ధ మతాన్ని స్థాపించిన బుద్ధునిది. విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపిస్తే, ప్రపంచంలోకెల్లా ఎత్తయిన విగ్రహం ఆయనదే కావడం వింతగా లేదు’’
‘‘ఔను! ఐతే?’’
‘‘హఠాత్తుగా పటేల్ భారీ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా? స్వాతంత్య్ర పోరాటం కాంగ్రెస్ నేతృత్వంలో జరగడం, దేశభక్తులంతా కాంగ్రెస్ జాబితాలోనే ఉండిపోవడంతో, గాంధీ, నెహ్రూలను పక్కకు పంపి పటేల్‌ను తమ పార్టీలో చేర్పించుకోవడానికి భారీ విగ్రహం ఏర్పాటు చేశారు. ’’
‘‘నిజంగా ఇది వింతే.. ఐదేళ్ల కోసం ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే వాళ్లు ఏడాది రెండేళ్లు కూడా గెలిపించిన పార్టీలో ఉండకుండా పార్టీ మార్చేస్తున్నారు. కానీ ఆరు దశాబ్దాల క్రితం మరణించిన పటేల్‌ను పార్టీ మార్చి తమ పార్టీలో చేర్చుకోవడం వింతే!. ఈ రోజుల్లో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నో జి మ్మిక్కులు చేస్తారు. విగ్రహాలకు, రాజకీయాలకు, శ్రావణ్ కుమార్ ఇంటి ముందు వాళ్ల అమ్మానాన్నల విగ్రహాలకు సంబంధం ఏమిటి?’’
‘‘ఆకలికి నకనకలాడే వారు ఎంతో మంది ఉండగా, వేల కోట్ల ఖర్చుతో పటేల్ విగ్రహం ఏర్పాటు చేస్తారా? అని తీవ్రంగా విమర్శించారు. నవ్యాంధ్రలో ఎన్టీఆర్ భారీ విగ్రహం నిర్మిస్తున్నారు. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం కలిగినట్టు- అదేదో ఆఫ్రికా దేశం వారికి హఠాత్తుగా గాంధీజీ విగ్రహం చూడగానే జ్ఞానోదయం కలిగి.. గాంధీ మహాత్ముడిలో జాతి వివక్ష కనిపించగా- అతని విగ్రహాన్ని తొలగించారట! ’’
‘‘ఔను మీడియాలో చూశాను.’’
‘‘మరి దీని గురించి ఏమంటావు?’’
‘‘ఆఫ్రికా సంగతి మనకెందుకు కానీ.. ఎన్టీఆర్ విగ్రహం గురించి తెలుసు?’’
‘‘విమర్శలు వచ్చినా విననంత గాఢమైన ప్రేమ ఎన్టీఆర్‌పై ఉందంటావా?’’
‘‘ఆ మాట నేనెక్కడన్నాను. అసలే ఎన్నికల కాలం. తెలంగాణలోనేమో ముందస్తుకు వెళ్లి మళ్లీ కుర్చీపై ధీమాగా కూర్చున్న కేసీఆర్- చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్నారు. ఇటు కేసీఆర్ ఇలా చెలరేగిపోతుంటే, అటు బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఆందోళన ఎలా ఉన్నా గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడాలి కదా? ఎన్టీఆర్ అభిమానుల మద్దతు సంపాదించేందుకు విగ్రహానికి భారీ స్కెచ్ వేసినట్టుంది. రాజకీయాల్లో ఇలాంటివి మామూలే.’’
‘‘ఎన్టీఆర్‌ను గద్దె దించి, మానసిక క్షోభకు గురి చేసి పైకి పోయేట్టు చేసిన వారే విగ్రహం ఏర్పాటు చేయడం ఆశ్చర్యంగా లేదా?’’
‘‘రాజకీయం అన్నాక అన్నీ ఉంటాయి. మరి ఎంతో కాలం నుంచి అధికారంపై కనే్నసి ఉంచితే మధ్యలో చిన్నరాణి వచ్చి అధికారం లాగేసుకునేట్టు ఉంటే ఊరుకుంటారా? పుష్కరాలకు ఏకంగా దేవుడి రూపంలో ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటు చేస్తేనే జనం ఆదరించారు. ఇప్పుడు పటేల్ విగ్రహంతో పోటీ పడి ఎత్తయిన విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పే ముంది? పర్యాటక రంగం వృద్ధికీ ఉపయోగపడుతుంది. ’’
‘‘అంతే అంటావా?’’
‘‘అంతే.. నువ్వు శ్రావణ్ కుమార్ తల్లిదండ్రుల విగ్రహాల గురించి తప్ప అన్నీ చెబుతున్నావ్’’
‘‘ సరే చెబుతా.. శ్రావణ్‌కుమార్ తండ్రి బాగా సంపన్నుడు. ఆయన సంపాదన అంతా కష్టార్జితమే. పిల్లలకు అప్పనంగా ఆస్తి ఇస్తే బయటకు పంపిస్తారనే లోకజ్ఞానం ఉన్నోడు. దాంతో శ్రావణుడు బాగా ఆలోచించి తల్లిదండ్రుల విగ్రహాలను తయారు చేయించాడు. బతికుండగానే తమ విగ్రహాలను చేయించిన కుమారుడిని చూసి తల్లిదండ్రుల ఆనందానికి అంతు లేదు..’’
‘‘ఆ తర్వాత?’’
‘‘ఆ తన్మయత్వంలో ఆస్తి మొత్తం కుమారుడికి అప్పగించారు’’
‘‘ఆ?..’’
‘‘ఆస్తి ఇచ్చాక తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో, వారి విగ్రహాలు ఇంటి ముందు.. ఇదే- ఆ ఇంటిముందున్న విగ్రహాల కథ’’
‘‘ఆ..??’’
‘‘విగ్రహాలను చూడగానే- ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో అని పించింది సినారెకు.. అద్భుతమైన శిల్ప సంపదను చూడగానే ఆ మహాకవికి అలా అనిపించడం సహజమే.. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ రాజకీయ విగ్రహాలే. అవసరాల కోసం పుడుతున్న విగ్రహాలే. రాజకీయాలను జాగ్రత్తగా గమనిస్తే, ఏ విగ్రహం వెనుక ఏ వ్యూహం దాగుందో తెలుస్తుంది. శ్రావణుడు రాజకీయాలను బాగా వంటబట్టించుకున్నాడు. అతనికి రాజకీయాలు తెలుసు కాబట్టి విగ్రహాలతో తండ్రి ఆస్తి స్వాహా చేశాడు .  ఆస్తి తప్ప రాజకీయాలు తెలియకపోవడంతో అతని తండ్రి శేష జీవితం వృద్ధాశ్రమం పాలైంది.’’
* బుద్ధామురళి (జనాంతికం 21-12-2018)


17, డిసెంబర్ 2018, సోమవారం

ఏ గట్టునుంటారు?

సంపన్నుల గురించి చాలా మంది ఆలోచనలు చిత్రంగా ఉంటాయి. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ కనిపించింది. ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఇల్లు కట్టిన అంబానీది, 80 గజాల స్థలంలో ఇల్లు కట్టిన నాదీ ఒకే దేశమా?
న్యూజిలాండ్‌లో షాపింగ్ కోసం 350 కోట్లతో చార్టర్డ్ ఫ్లైట్ కొన్న నీతూ అంబానీది, షాపింగ్ కోసం ఆటో ఎక్కాలా ? వద్దా అని ఆలోచించే మా అమ్మది ఒకే దేశమా?
సెవెన్ హిల్స్ హాస్పటల్‌లో ఐదు లక్షల బిల్లు కట్టి డెలివరీ అయిన ఐశ్వర్యారాయ్‌ది, నిర్మల ఆస్పత్రిలో ముక్కి ముక్కి ఐదువేల బిల్లు కట్టిన నా భార్యదీ ఒకే దేశమా?
ఇలా సాగుతుంది ప్రశ్నల పరంపర. చాలా మంది అంబానీ అలా ఎదిగిపోవడానికి, మనం సామాన్య జీవితం గడపడానికి కారణం ఈ వ్యవస్థ, ప్రభుత్వం లేక ఇంకోటి ఏదో అనుకుంటాం. ఇందులో మన పాత్ర ఏ మాత్రం ఉండదు వారి ఆలోచన ప్రకారం.
నిజానికి మన విజయంలో ఐనా పరాజయంలో ఐనా ప్రధాన పాత్ర మనదే. మన ఆలోచనలదే. మన మనసుదే. ఒక వ్యక్తి అంబానీగా ఎదిగినా, ఇల్లు గడవడానికే అప్పులు చేస్తూ బతికే అప్పుల అప్పారావుగా మిగిలిపోయినా దానికి మనమే కారణం అంతే కానీ కనిపించని దేవుడు, కనిపించే ప్రభుత్వాలు, వ్యవస్థలు ఎంత మాత్రం కారణం కానే కాదు. సమస్య నుంచి పారిపోయే వారు, ఎదుర్కోలేని వారు, బద్ధకస్తులు మాత్రమే కారణం తమది కాదు ఇంకెవరిదో అంటారు.
అంబానీ పెద్ద ఇల్ల్లు కట్టుకున్నా, కూతురు పెళ్లి వైభవంగా చేసినా మనం సహించలేం. అంబానీ చట్టవిరుద్ధంగా సంపాదిస్తే దాన్ని వ్యతిరేకించాలి కానీ సంపాదించడమే తప్పు అన్నట్టుగా వాదనలు ఉంటాయి.
మనం విలువలకు కట్టుబడి ఉన్నాం కాబట్టి సామాన్యులుగా ఉండిపోయాం. అంబానీ విలువలకు కట్టుబడి లేడు కాబట్టే సంపన్నుడు అయ్యాడు అనేది కొందరి వాదన. ఇలా వాదించే వారు తమను తాను మోసం చేసుకుంటున్నారు. ఇలాంటి వారి విషయంలో ఎవరైనా చేసేదేమీ లేదు.
ధీరూబాయ్ అంబానీ కూడా ఒకప్పుడు సాధారణ ఉద్యోగి. చిన్న ఉద్యోగంలో ఉన్నా ఆలోచనలు మాత్రం ఉన్నతం. చిన్న ఉద్యోగం చేసే రోజుల్లో కూడా ఏదో ఒక రోజు వ్యాపార సామ్రాజ్యం సృష్టించాలని కలలు కన్నాడు. వాస్తవం చేసుకున్నారు. దుబాయ్‌లో చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. ఇంటింటికి తిరిగి వస్తువులు అమ్మారు. ఏం చేస్తున్నా ఎప్పుడూ తన లక్ష్యం కళ్ల ముందు మెదులుతూనే ఉండేది.
సంపన్నులు సామాన్యులు ఆలోచించే తీరు వేరుగా ఉంటుంది.
సెల్‌ఫోన్‌లో నెట్‌వర్క్ సరిగా లేకపోతే మరో కంపెనీకి మారుదామని మనం ఆలోచిస్తాం. కానీ అంబానీ మాత్రం జియో నెట్ వర్క్‌ను ప్రారంభించాలని ఆలోచిస్తారు.
నిర్మా గుర్తుందా? గుజరాత్‌లోని ప్రభుత్వ ఉద్యోగి, కెమిస్ట్. కర్సన్‌బాయ్ పటేల్. ఇంటి నుంచి ఆఫీసుకు సైకిల్‌పై వెళ్లే సమయంలో, తిరిగి ఇంటికి వచ్చే సమయంలో నిర్మా పౌడర్‌లు అమ్ముతూ తన వ్యాపార ప్రస్థానం ప్రారంభించి. 15వేల మంది ఉద్యోగులు, 3550 కోట్ల రూపాయల టర్నోవర్‌కు వ్యాపారాన్ని విస్తరించాడు.
అంబానీలు, కర్సన్‌బాయ్‌లు, మన చట్టూ చాలా మందే ఉన్నారు. సైకిల్‌పై తిరిగి క్రేన్ వక్కపొడి అమ్మిన వారు, భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అంటూ సైకిల్‌పైనే ఇంటింటికి తిరిగి అగర్ బత్తీలు అమ్మిన వారు కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించారు. ఇలాంటి వారు మేం పేదరికంలో ఉండడానికి ఈ వ్యవస్థ, ఈ దేశమే కారణం ఆనే ఆలోచనలు చేయరు. సంపద కలిగి ఉండడం పాపం అనుకోరు. సంపన్నులను విలన్లుగా చూడరు. తాము పేదరికంలో ఉన్నా దానికి కారణం ఎవరూ కాదనని తామేనని, పేదరికం నుంచి బయట పడే మార్గం కూడా తమ వద్దనే ఉందని భావిస్తారు. భయటపడేందుకు కృషి చేస్తారు. విజయం సాధిస్తారు. కొన్ని కోట్ల మందికి, లక్షల మందికి ప్రేరణగా నిలుస్తారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తారు. ఇలాంటి విజేతలు ఎంతో మంది మన చుట్టూ ఉన్నారు. అలాంటి వారి నుంచి ప్రేరణ పొందవచ్చు అంతే తప్ప సంపన్నులను విలన్లుగా చూడాల్సిన అవసరం లేదు.
ఆఫీసు నుంచి రాగానే టీవిలో అత్తా ఒకింటి కోడలే సీరియల్ చూస్తే ఎదగం. క్రికెట్ కబుర్లు, సినిమా కబుర్లు, రాజకీయ కబుర్లతో కాసేపు కాలక్షేపం కావచ్చు. కానీ జీవితంలో ఎదిగే అవకాశం ఉండదు. ఉద్యోగంలో ఎప్పుడు ఇంక్రిమెంట్ వస్తుందా? ప్రమోషన్ వస్తుందా? అనే ఆలోచన కన్నా తన పరిస్థితి మెరుగు పరుచుకునే మంత్రం తన వద్దనే ఉందని గ్రహించడం వల్లనే ఎంతో మంది చిరుద్యోగం నుంచి వ్యాపార సామ్రాజ్యాలను స్థాపించే స్థాయికి ఎదుగుతున్నారు. మంత్రాలు, మాయలు, యంత్రాలు చేసేదేమీ ఉండదు. మన చేతి చమురు వదలడం తప్ప మనను విజయతీరాలకు చేర్చే శక్తి మనలోనే ఉందని గుర్తించాలి.
ఏ క్రికెటర్ పుట్టిన రోజు ఎప్పుడో కొంత మంది అడగ్గానే చెప్పేస్తారు. హీరోయిన్ పుట్టుమచ్చలు. హీరోల పుట్టిన రోజులు గుర్తుంచుకోవడానికి ఖర్చు చేసే సమయాన్ని మనం విజయం కోసం మనం ఖర్చు పెట్టుకోవడం అవసరం.
ఏ సినిమా ఎన్ని రోజులు నడిచింది, ఏ సినిమాలో ఏ హీరోయిన్ ఎన్ని చీరలు మార్చింది మన కెందుకు. మన జీవితం ఎలా మారుతుంది ఆలోచిస్తే ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ముందు ఆలోచించడం ప్రారంభిద్దాం.
అంబానీ గురించి మనం గంటల తరబడి చర్చించుకున్నా, మన గురించి అతను ఒక్క క్షణం కూడా ఆలోచించడు. తన సమయం ఎంత విలువైందో అంబానీకి తెలుసు. అది తెలియంది మనకే. తెలుసుకున్న రోజు మనమూ ఎదుగుతాం. పేదరికం నుంచి సంపన్నత వైపు పయనించే ఆలోచనల గట్టుమీద ఉంటారా? పేదరికానికి వ్యవస్థలు, దేవుడు, కనిపించని శక్తులే కారణం అనే ఉపయోగం లేని భావాలా గట్టున ఉంటారా? మీ ఇష్టం.
-బి.మురళి(16-12-2018)

14, డిసెంబర్ 2018, శుక్రవారం

జ్ఞానభేరి-పందెం కోళ్లు

‘‘తిరునాళ్లలో రంగుల రాట్నం లాంటిదే ఈ జీవితం.. ఒకసారి కింద ఉంటుంది, మరో సారి ఆకాశంలో ఉన్నట్టు అనిపిస్తుంది.’’
‘‘నిజమే.. ఏదీ శాశ్వతం కాదు.’’
‘‘విజయం పరాజయం ఒకే నాణానికి రెండు ముఖాల వంటివి’’
‘‘మరణించిన వాడు తిరిగి పుట్టక తప్పదని ఘంటసాల ఎప్పుడో చెప్పారు’’
‘‘అది చెప్పింది ఘంటసాల కాదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. పాడింది మాత్రం ఘంటసాలనే’’
‘‘ఐనా రాసేదెవరు? పాడెదెవరు? భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడని అంటున్నావు. నువ్వు చూశావా? నేను చూశానా’’
‘‘నేను చూడలేదు.. కానీ మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు తన ఎదురుగా ఉన్నవారంతా బంధుగణమే కావడంతో వారితో యుద్ధం చేయలేనని వైరాగ్యంతో యుద్ధరంగాన్ని వీడి వెళ్లబోతుంటే బంధువులు ఎవరు? శత్రువులు ఎవరు? మిత్రులెవరు? చంపేదెవరు? చచ్చేదెవరు? అని శ్రీకృష్ణ పరమాత్ముడు గీతను బోధించే సరికి అర్జునుడు యుద్ధానికి సిద్ధం అవుతాడన్న కథ మనం విన్నది. ఎన్నో సినిమాల్లో ఉన్నది. ’’
‘‘యుద్ధం జరిగింది అనుకుంటే జరిగింది, లేదు అనుకుంటే లేదు. అంతా దేవుని మాయ అయినప్పుడు గెలిచింది ఎవరు? ఓడింది ఎవరు?’’
‘‘ సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడంటారు’’
‘‘తూర్పున సూర్యుడు ఉదయిస్తాడనేది అబద్ధం. సూర్యుడు ఉదయించే దాన్ని మనం తూర్పు అంటున్నాం. దాన్ని తూర్పు అని కాకుండా మార్పు అని పిలిచినా సూర్యుడు అటు నుంచే ఉదయిస్తాడు. మనం తూర్పు, మార్పు, తీర్పు అనుకునే దానితో సూర్యుడికి సంబంధం ఉండదు.’’
‘‘ఏదీ మనం అనుకున్నట్టు జరగదు. ‘జొమాటో’ వాడు చక్కని ప్యాక్ చేసి తెచ్చే ఫుడ్ బాగుంటుందనుకుంటాం.. కానీ మన కన్నా ముందే వాడు దాని రుచి చూశాడని మనకేం తెలుస్తుంది?’’
‘‘వాడు రుచి చూసిన దృశ్యాన్ని మేడ మీద నుంచి ఎవడో షూట్ చేసి ప్ర పంచం కళ్లు తెరిపించి, వాడి ఉద్యోగాన్ని ఊడబెరికిస్తాడని ఎవరికి తెలుసు?’’
‘‘ఔను!కర్నాటక తేజం విజయ్ మాల్యా, తెలుగు తేజం సుజనా చౌదరిలు వేల కోట్ల రూపాయల హాంఫట్ వ్యవహారాల కన్నా- ‘జొమాటో’ వాడు నాలుగు మెతుకులు చౌర్యం చేసిన దానిపై మనం సామాజిక చైతన్యం ఎక్కువ చూపించాం.. ఎందుకంటావ్..?’’
‘‘అది సరే ఆ తెలుగు తేజం వాటా ఆరువేల కోట్లట కదా? ఆరువేల కోట్ల అంకెలో ఎన్ని సున్నాలుంటాయి.?’’
‘‘పదో పదకొండో.. ఒకటి ఎక్కువైతేనేం తక్కువైతేనేం’’
‘‘అదేంటోయ్ ఒక సున్నా కలిపితే వేల కోట్లు అవుతుంది. తగ్గిస్తే వందల కోట్లు అవుతుంది. ’’
‘‘ఐతే కానీ.. సున్నా ఎప్పటికైనా సున్నానే. మనవి కానప్పుడు, మనపై ప్రభావం చూపనప్పుడు ఎన్ని సున్నాలైతే మనకేం? అదే ‘జొమాటో’లోనైతే మనం తెప్పించుకునే ఫుడ్ మనది. మన జేబులోనుంచి డబ్బులు ఇస్తాం. ఎవడో కొంత ఫుడ్ కొట్టేస్తే ఎలా ఊరుకుంటాం?’’
‘‘ఏదో ఆకలి.. ఫుడ్ అనుకుంటాం.. కానీ అంతా భ్రమ.. ఈ రోజు ఆకలికి ఏడుస్తాం. రేపు తిన్నది ఎక్కువై ఏడు స్తాం. జీవితం ఏదీ శాశ్వతం కాదు. విజయం శాశ్వతం కాదు. పెరుగుట విరుగుట కొరకే. నాలుగు రోజుల జీవితానికి విజయాలు, పరాజయాలు అవసరమా? మనం తోలు బొమ్మలం, మనల్ని ఆడించేది భగవంతుడు. ’’
‘‘అరేయ్.. ఇంకో మాట మాట్లాడారంటే మీ బుర్రలు పగల గొడతా.. మీ ఇద్దరూ ఎంతెంత డబ్బు పోగొట్టుకున్నారో ఆ విషయం ముందు చెప్పండి’’
‘‘వా.. వా.. వా..ఆ...’’
‘‘దరిద్రపు ఏడుపు ఆపి మాట్లాడండి’’
‘‘మేం తాత్త్విక ధోరణితో చర్చించుకుంటుంటే నువ్వేంటి హఠాత్తుగా ఎంతెంత డబ్బులు పోగొట్టుకున్నారని అడుగుతున్నావ్? ఆ సంగతి నీ కెలా తెలిసింది?’’
‘‘మీ అతితెలివి తేటలు నా దగ్గర చూపకండి.. నిన్న మొన్నటి వరకు మీ ఉపన్యాసాలు వినలేదనుకున్నావా? మీ సవాళ్ల గురించి తెలియదనుకున్నావా? సామాజిక మాధ్యమాల్లో మీరు పెట్టిన పోస్టులు చూడలేదనుకున్నావా?’’
‘‘వా.. నిండా మునిగాం.. చంటి లోకల్ అన్నట్టు ఊర్లో నన్ను జూనియర్ లగడపాటి అని, వీడినేమో గోనె ప్రకాశ్ అని ఎంత అభిమానంతో పిలుస్తారు.. రాజకీయాలకు సంబంధించి అంకెలన్నీ లగడపాటి నాలుకపైనే ఉంటాయి. ఆయన మెదడులోని కంప్యూటర్ కోట్లాది మంది గంట క్రితం ఏ పార్టీకి ఓటు వేయాలనుకున్నారు, నిమిషంలో నిర్ణయం ఎలా మార్చుకున్నారు.. అంటూ నిమిష నిమిషానికి చెప్పేస్తుంటే అక్కడున్న విలేఖరులు విస్తుపోయి చూస్తుంటారు. తిప్పాయ పాలెం తింగరోళ్లం మేమెంత? ఏ శుభకార్యానికైనా ముహూర్తం కోసం పంతులును కలిసినట్టు ఏ ఎన్నికలు వచ్చినా ఫలితాలు ఎలా ఉంటాయని మమ్మల్ని అడిగి పందెం వేసేవాళ్లు. ఈసారి వారి ఊపులు, విరుపులు చూసి మా దగ్గరున్న డబ్బంతా పందెం కాశాం. మాపై నమ్మకంతో తెలిసిన వారంతా పందెం కాశారు.’’
‘‘ తెలంగాణలోనేమో అధికార పక్షం గెలుస్తుందని, ఆంధ్రలోనేమో కూటమి గెలుస్తుందని పందాలు కడుతున్నారని అదేదో మీడియాలో రాశారు’’
‘‘మేం కూడా వారి రాతలనే నమ్ముకుని నిండా మునిగాం. డబ్బులు పోయాయి. పైగా పందెం ఓడిపోతే మీసం తీసేస్తానని నేను, సగం గుండు కొట్టించుకుంటానని వీడు పందెం కాశాం. పీక కోసుకుంటానని ఒకరంటే బ్లేడ్ పట్టుకుని ఓ మీడియా అతని ఇంటి చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడు ఊరికెళా వెళ్లాలి, తెలిసిన వారికి ముఖం ఎలా చూపాలనే పిచ్చి పిచ్చి ఆలోచలతో ఏమీ తోచక అంతా మాయ, మిధ్య, భ్రమ అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నాం.’’
‘‘మీ అంత మేధావులు ఉండరురా! ఆ వార్త చదివినప్పుడు మీ బుర్ర పని చేయలేదా? ప్రజాభిప్రాయం ఆ వార్తలోనే ఉంది’’
‘‘కూటమి గెలుస్తుందని ఆంధ్రలో, ఆధికార పక్షం గెలుస్తుందని తెలంగాణలో ఎలా పందాలు కాస్తున్నారు? మరి ఎన్నికలు ఎక్కడ జరిగాయి?’’
‘‘తెలంగాణలో..’’
‘‘ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో తెలంగాణలో తెలుస్తుంది కానీ ఎన్నికలతో సంబంధం లేని ప్రాంతానికెలా తెలుస్తుందనే ఆలోచన రాలేదా?’’
‘‘ఇంత సింపుల్ లాజిక్ తెలిస్తే ఆ రాతలను ఎందుకు నమ్ముతాం. నిండా ఎందుకు మునుగుతాం. ఐనా విజయం, ఓటమి అంతా భ్రమ’’
‘‘మళ్లీ మిట్ట వేదాంతమా?’’
‘‘ఆరునెలల తరువాత జరిగే ఆంధ్ర ఎన్నికలపై పందెం కాసి నష్టాన్ని పూడ్చుకుందామా?’’
‘‘కుక్క తోక వంకర అని నీ పందెం బుద్ది మారదా? మీది పందెం కోళ్ల వైరాగ్యమే’’

 *బుద్దామురళి (జనాంతికం 14-12-2018) 

10, డిసెంబర్ 2018, సోమవారం

సంపదను ద్వేషించవద్దు

మనం ద్వేషిస్తే చిన్న కుక్క పిల్ల కూడా మనతో ఉండదు. ప్రేమిస్తేనే అది మనతో ఉంటుంది. అలాంటిది డబ్బును ద్వేషిస్తే అది మనతో ఉంటుందా? లా ఆఫ్ అట్రాక్షన్ అనే సిద్ధాంతం పాశ్చాత్య దేశాల్లో బాగా పాపులర్ ఈ సిద్ధాంతంపై వచ్చిన పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందాయి. మన స్ఫూర్తిగా మనం ఏది కోరుకుంటే అది సాకారం అవుతుందని చెబుతుంది ఈ సిద్ధాంతం. మన పూర్వీకులు యద్భావం తత్ భవతీ అని ఎప్పుడో చెప్పారు. మనం ఇలా చెప్పినా పాశ్చాత్యులు లా ఆఫ్ అట్రాక్షన్ అని శాస్ర్తియంగా చెప్పినా దాని అర్థం ఒకటే మనం మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటే అది సాధ్యం అవుతుంది.
హాస్టల్‌లో ఉండి చదువుకున్న ప్రవీణ్‌కుమార్ అనే ఐపిఎస్ అధికారి ఇప్పుడు సంక్షేమ హాస్టళ్లలో విప్లవం సృష్టిస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో మనం ఏది కోరుకుంటే అది సాధ్యం అవుతుందని నిరూపిస్తున్నారు. చదువుకునే పిల్లలను ఆ మార్గంలో తీసుకు వెళుతున్నారు. అతనికి ఆకలి తెలుసు పేదరికం తెలుసు. దాని నుంచి బయటపడే మార్గం కూడా తెలుసు. పేదరికాన్ని వ్యతిరేకించడం అంటే అడవుల్లోకి పారిపోవడం కాదు. మనం ఎదగాలి, ఎదగాలి అంటే ఏం చేయాలో తెలుసుకోవాలి. ఆ మార్గంలో పయనించాలి. మన ఎదుగుదలను చిన్నప్పటి నుంచి మన మనసుపై బలంగా ముద్రించుకోవాలి.
సంపద విషయంలో సైతం ఇదే సూత్రం వర్తిస్తుంది. ధనంపై మనకున్న అభిప్రాయాలను ముందు మనం సమీక్షించుకోవాలి. డబ్బుదేముంది మంచి మనసు ముఖ్యం, ధనవంతులంతా విలన్లు అని మనకు చిన్నప్పటి నుంచి సినిమా కథల నుంచి పెద్దల వరకు ఎంతో మంది బలవంతంగా మన మీద ఒక ముద్ర వేశారు. సినిమాలో హీరో పేదవాడు. ధనవంతుల అమ్మాయిని ప్రేమిస్తాడు. అమ్మాయి తండ్రి విలన్ హీరో పేదవాడు కావడం వల్ల ప్రేమను అంగీకరించడు. డబ్బుకు విలువ లేదని మనసు ముఖ్యం అని హీరో విలన్‌కు బుద్ధి చెప్పి హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటాడు. తోట రాముడు, బండరాముడు, పాతాళభైరవి పేరేదైతేనేం చాలా సినిమాల కథ ఇదే. ఇంకా ఇవే కథలు. మన మీద మనకు తెలియకుండానే బలమైన ముద్ర వేస్తాయి.
అంబానీ 80 అంతస్తుల భవనం కట్టుకున్నా మనం సహించలేం. రెండు రూపాయలకు కిలో బియ్యం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం అందరి లానే అంబానీ కూడా క్యూలో నిలబడితే తప్ప మన మనసు కుదుట పడదు.
80 అంతస్తుల భవనం కట్టుకోవడం నేరం అనే చట్టం ఉంటే వ్యతిరేకించాలి. లేకపోతే చట్టబద్ధంగా అతను భవనం కట్టుకుంటే మనం తిట్టుకోవలసిన అవసరం ఏముంది. సంపదను ఏదో రూపంలో మన ద్వేషిస్తే అది మన వైపు చూడదు.
యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా రిటైర్ అయినా ఒక బృందంతో ఇటీవల చర్చల్లో వ్యాపారం గురించి ప్రస్తావిస్తే, వ్యాపారం అంటేనే మోసం అది మా వల్ల కాదు అని మేధావుల సమాధానం.
నెల్లూరులో ఒక అటెండర్ ఇంటిపై ఎసిబి దాడి జరిపితే వంద కోట్లకు పైగా ఆస్తులు బయటపడ్డాయి. ఉద్యోగులు అంటే అంతా అక్రమంగా సంపాదించే వారే అనుకోవడం, వ్యాపారం అంటే అంతా మోసమే అనుకోవడం, అక్రమాలు చేస్తేనే సంపాదిస్తారు అనుకోవడం మన ఆలోచనల్లో ఉండే తప్పు. తప్పు చేసే వారు ఉద్యోగులు, వ్యాపారులు అనే తేడా లేదు ఎక్కడైనా ఉంటారు. డబ్బు సంపాదించడం అంటే అదేదో నేరం అని వ్యాపారం అంటేనే మోసం అనే అభిప్రాయం బాల్యం నుంచి మనపై పడే బలమైన ముద్ర. దాని నుంచి బయటకు రావాలి.
ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారం చేసినా డబ్బు పాపిష్టిది అనే అభిప్రాయం నుంచి బయటకు రాక పోతే అది మనతో ఉండదు.
వ్యాపారి డబ్బుకు విలువ ఇస్తాడు. పూజిస్తాడు. అలా చేయడం వల్ల మన జేబులో నుంచి ఒక రూపాయి ఖర్చు చేయాల్సి వచ్చినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తాం. ఈ ఖర్చు అవసరమా? మన డబ్బుకు సరైన విలువ గల సేవను మనం పొందుతున్నామా? అనే ఆలోచన వస్తుంది. ప్రేమికులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, స్నేహితులు కావచ్చు మనం విలువ ఇస్తేనే ఆ బంధం నిలుస్తుంది. లేక పోతే వివాహ బంధం సైతం నిలువదు. బంధాలు ఎలానే డబ్బు సైతం అంతే దానికి విలువ ఇచ్చి ప్రేమిస్తేనే నీతో ఉంటుంది లేదంటే నీకు తెలియకుండానే చేజారి పోతుంది. ఒకప్పుడు తమ నటనతో సంపాదించిన డబ్బుతో అనేక భవనాలను కొన్న పాత కాలం నాటి నటులు ఎందరో చివరి దశలో తిండికే ఇబ్బంది పడాల్సి వచ్చింది. వాళ్లు నటనను ప్రేమించారు. నటనలో జీవించారు. కానీ డబ్బుకు ఏ మాత్రం విలువ ఇవ్వలేదు. అలా విలువ ఇవ్వక పోవడం చాలా గొప్పతనం అని వారి చుట్టూ ఉన్న వాళ్లు పొగడ్తలతో ముంచెత్తారు. రోడ్డున పడిన తరువాత అంతకు ముందు పొగిడిన వారెవరూ చుట్టు పక్కల కనిపించలేదు. కష్టపడి సంపాదించిన డబ్బు అది అనే స్పృహతో దానికి తగిన విలువ ఇస్తే అంతిమ దశ అలా ఉండకపోయేది.
మనం విలువ ఇచ్చేది మాత్రమే చివరి వరకు మనతో ఉంటుంది. కాలం కలిసి రావడం రాకపోవడం అంటే ఇదే. మనం డబ్బుకు ఏ మాత్రం విలువ ఇవ్వకపోతే ఏ కాలం కూడా కలిసి రాదు. డబ్బు మన వద్ద ఉన్నప్పుడే దానికి తగిన విలువ ఇవ్వాలి. అలా విలువ ఇవ్వని వారి జీవితాలు ఎలా మారాయో మన కంటి ముందే మనకు ఎన్నో జీవితాలు కనిపిస్తాయి. వారి దైన్యస్థితి మనకు గుణపాఠం కావాలి.
నా చేతిలో డబ్బు నిలువదు, డబ్బుకు విలువ లేదు అనే రోటీన్ డైలాగులు మాట వరుసకు కూడా అనోద్దు. నేను కష్టపడి సంపాదించిన డబ్బు ఇది. నా చేతిలో నిలుస్తుంది. మరింత పెరుగుతుంది అని మీకు మీరు చెప్పు కోవాలి. డబ్బు విషయంలో నెగిటివ్ ఆలోచనలు పారద్రోలాలి. డబ్బును ప్రేమించాలి, విలువ ఇవ్వాలి. డబ్బుకు విలువ ఇవ్వడం అంటే అదేదో నేరం అని భావించే వారితో డబ్బు విషయంలో దూరంగా ఉండడమే మంచిది. మీ దృష్టిలో డబ్బుకు విలువ లేకపోవచ్చు, కానీ నా దృష్టిలో విలువ ఉంది. డబ్బుకు నేను విలువ ఇస్తాను అని నిర్మోహ మాటంగా చెప్పగలగాలి. విలువ ఇచ్చినప్పుడే డబ్బు నిలుస్తుంది. పెరుగుతుంది. అవసరానికి ఉపయోగపడుతుంది. అంతిమ దశలో కొండంత అండగా ఉంటుంది. డబ్బుకు విలువ లేదు అనే భావనతో చివరి దశలో ఒకరిపై ఆధారపడి బతుకుతారో, డబ్బుకు విలువ ఉందని గ్రహించి చివరి దశలో ఆత్మవిశ్వాసంతో బతుకుతారో ఎవరికి వారే నిర్ణయించుకొని ఆ దిశగా పయనించాలి.
-బి.మురళి( 9-12-2018)

రాముడు, రావణుడు ఏకమైతే..

‘‘ఈ ప్రపంచాన్ని ఎలా మార్చేద్దామనా.. అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?’’
‘‘ ఇంట్లో టీవీ చానల్ మార్చేంత అధికారం కూడా నా చేతిలో ఉండదు. ఇక ప్రపపంచాన్ని మార్చేంత సీనా? నాకో ఆలోచన వచ్చింది.. అలా జరిగితే ఏమవుతుందా అని ఆలోచిస్తున్నా?’’
‘‘రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరంటారు కదా?’’
‘‘ఒక్క రాజకీయాల్లోనే కాదు. మన జీవితాల్లో, వ్యాపార సంస్థల్లో ఎక్కడైనా శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. పోటీపోటీగా వెళ్లిన సెల్‌ఫోన్ కంపెనీలు ఎన్ని ఏకం కాలేదు. ఎన్ని వ్యాపార సంస్థలు ఒకదానిలో ఒకటి విలీనం కాలేదు? ’’
‘‘అలానే పురాణ కాలంలో కూడా శాశ్వత శత్రువులు మిత్రులుగా మారితే ఎలా ఉంటుందా? అని ఆలోచిస్తున్నా’’
‘‘అర్థం కాలేదు...’’
‘‘రామాయణ కథ ఏమిటి? ’’
‘‘శ్రీరాముడు హీరో, రావణుడు విలన్. ఇంకా చాలా పాత్రలున్నాయి’’
‘‘అన్నదమ్ములైన వాలి సుగ్రీవులు ఏకమైతే ఎలా ఉంటుంది?’’
‘‘ఇద్దరూ ప్రాణాలతో మిగిలి ఉండేవాళ్లు. చెరి సగం రాజ్యం పాలించే వాళ్లు.’’
‘‘అలానే శ్రీరాముడు, రావణుడు ఏకమైతే..?’’
‘‘రామాయణమే ఉండదు.’’
‘‘ఎందుకుండదు? ఇప్పుడు చూడు.. ప్రపంచానికి కాంగ్రెస్ పార్టీనే అత్యంత ప్రమాదకరమని భావించి ‘అన్న’ ఎన్టీఆర్ సినిమాల్లో హీరో వేషాలను వదిలేసి తెలుగుదేశం పార్టీని స్థాపించారా? లేదా? ’’
‘‘ఔను’’
‘‘కాంగ్రెస్ వ్యతిరేకతే తెదేపా సిద్ధాంతం కదా?’’
‘‘ఔను.’’
‘‘మరి అలాంటి రెండు పార్టీలు ఏకమైనపుడు రాముడు, రావణుడు ఏకమైతే తప్పేంటి?’’
‘‘తలాతోకా లేకుండా రాజకీయాలను, పురాణాలను ఏకం చేస్తావేంటి? శ్రీరాముడు క్షణాల్లో రావణుడిని వధించలేక కాదు. సీతాపహరణం, రామరావణ యుద్ధం అన్నీ లోక కల్యాణం కోసమే జరిగాయి.’’
‘‘కాదని నేనన్నానా? దేశ కల్యాణం కోసం కాంగ్రెస్‌తో చేతులు కలిపానని బాబు చెబుతున్నారు కదా? ’’
‘‘నువ్వెన్నయినా చెప్పు.. రాముడు, రావణుడు ఏకం కావడం అనేది నేనసలు ఊహించలేను. హీరో, విలన్ ఎలా కలుస్తారు. ఇక సినిమా ఎక్కడుంటుంది?’’
‘‘నీ దృష్టిలో శ్రీరాముడు హీరో, రావణుడు విలన్ ఐతే చాలా మంది రావణుడే హీరో, శ్రీరాముడు విలన్ అని నమ్ముతారు. నువ్వు చాలా సార్లు ప్రస్తావించే రజనీష్ కూడా రావణుడే హీరో, రాముడే విలన్ అన్నాడు.’’
‘‘ఎవరి అభిప్రాయం వారి ది. ఈ దేశంలో కొన్ని కోట్ల మంది శ్రీరాముడని దేవుడిగా భావిస్తారు. నువ్వు రావణుడిని మొక్కుతానంటే వద్దనడానికి నెనెవరిని?’’
‘‘నీకీ సంగతి తెలుసా? 1965 ప్రాంతంలోనే ఎన్టీఆర్ తనకు రావణుడే ఆదర్శం అని ఓ పత్రికలో వ్యాసం రాశారు.’’
‘‘ఎన్టీఆర్‌ను అభిమానించే వాళ్లు రాముడినే దేవుడిగా పూజిస్తారని నీకు తెలుసా? నీ ఇష్టం.. నువ్వు ఎవరినైనా పూజించుకో. చాలా ఏళ్ల క్రితం ‘రావణుడే రాముడయితే’ అనే సినిమా కూడా వచ్చింది. కానీ శ్రీరాముడు, రావణుడు ఏకమైతే.. అనే ఆలోచన ఎవరికీ రాలేదు. నీకే వచ్చింది. ఇదొక్కటేనా? ఇంకెవరినైనా కలిపేద్దామనిపిస్తుందా?’’
‘‘ ఈమధ్య పౌరాణిక పాత్రలను తీసుకుని తమ కోణం నుంచి రాస్తున్నారు కదా?’’
‘‘ఔను చాలా మంది గురించి వచ్చింది. యార్లగడ్డ ద్రౌపది గురించి రాసినట్టున్నారు. కుంతి గురించి ఆ మధ్య ఎవరో రాశారు. కుంభకర్ణుడు, రావణుడు, కైకేయి, శూర్పణఖ.. ఇలా చాలా పాత్రలను తీసుకుని తమ కోణంలో వారి గురించి నవలలు రాసినట్టున్నారు. ధ్రుతరాష్ట్రుని భార్య గాంధారికి చూపు ఉన్నా, భర్త కోసం కళ్లకు గంతలు కట్టుకుని జీవిత కాలమంతా అలా గుడ్డిగానే బతికింది.. ఆమె ఆలోచనలు ఎలా ఉంటాయో ఊహించి రాశారు’’
‘‘నాకోటి తెలియక అడుగుతున్నాను.. మన పురాణాలైన రామాయణం, మహాభారతం నిజంగా జరిగాయో లేదో తెలియదు. ఊహ కావచ్చు, నిజం కావచ్చు. ఆ పాత్రలు ఏమనుకుంటున్నాయో ఏ సందర్భంలో వారి ప్రవర్తన ఎలా ఉందో పురాణాల్లోనే పూసగుచ్చినట్టు ఉంది కదా? వాళ్లు నిజంగా అలా అనుకోలేదు. మరోలా అనుకున్నారని మన ఇష్టం వచ్చినట్టు రాయడం సబబేనా?’’
‘‘నాకూ ఓ అనుమానం ఉంది. పురాణాలు అబద్ధం. కానీ పురాణాల్లోని కొన్ని పాత్రలు నిజం అని వాదించే వర్గం ఒకటి తయారైంది. అంటే శ్రీరాముడు అబద్ధం.. కానీ రావణుడు నిజం అని బల్లగుద్ది వాదించడం అన్న మాట. పురాణాలే అబద్ధం అనుకుంటే కొన్ని పాత్రలు నిజమెలా అవుతాయి?’’
‘ప లానా నాయకుడు ఏమనుకుంటున్నాడు? ఆయన మనోగతం ఏమిటి? అని మీడియాలో  ఎవరికి తోచినట్టు వాళ్లు రాయడం లేదా? ఒక నాయకుడి మనోగతం ఇలా ఉందని ఒక్కో పత్రిక ఒకే సందర్భంలో ఒక్కో రకంగా రాస్తే తప్పు లేదు కానీ- పురాణాల్లో పాత్రలు మనసులో ఏమనుకుంటున్నాయో రాస్తే తప్పెలా అవుతుంది? రాముడు, రావణుడు ఏకం కావాలి. కృష్ణుడు, దుర్యోధనుడు చెట్టాపట్టాలేసుకుని తిరగాలి. దుర్యోధనుడు, అర్జునుడు ప్రాణస్నేహితులు కావాలి. కావాలంటే ఐదేళ్లలో సగం కాలం దుర్యోధనుడు, మిగిలిన సగం కాలం ధర్మరాజు, మధ్యలో ఓ ఏడాది కర్ణుడు పాలించాలి. మన చర్చ రాజకీయాల నుంచి పురాణాల్లోకి వెళ్లింది. పురాణాల సంగతి మనకెందుకు వదిలేయ్.. రాజకీయాల గురించి మాట్లాడుకుందాం.’’
‘‘పురాణాల్లోని పాత్రల్లా రాజకీయ నాయకులు సైతం ఏకం కావాలి. ఇండియా, పాకిస్తాన్ ఏకం కావాలి. అమెరికాలో ట్రంప్, హిల్లరీ చేతులు కలపాలి. శాంతిదూతలు, ఉగ్రవాదులు ఏకం కావాలి. కేసీఆర్ , జగన్, చంద్రబాబు ప్రాణస్నేహితులు కావాలి. మోదీ, రాహుల్ జంటగా విదేశీ పర్యటనలు చేయాలి.’’
‘‘అంతేనా? ఆకాశం, భూమి ఏకం కావాలి అని కూడా కోరుకో. ఆశకు కూడా హద్దు ఉండాలి. హీరోలు, విలన్లు కలిస్తే సినిమాలుండవు. దేవతలు, రాక్షసులు కలిస్తే పురాణాలుండవు. బద్ధ శత్రువులైన నాయకులు కలిస్తే రాజకీయాలు ఉండవు.’’
‘‘ఉండనీ ఉండక పోనీ, ఉండాలని కోరుకుంటా.. అది నా ఇష్టం. ఏమో ఆకాశం, నేల ఏకం కావచ్చు. అసాధ్యం అనుకున్న నాయకులు కలవలేదా?’’
*-బుద్దా మురళి ( జనాంతికం 7-12-2018)

3, డిసెంబర్ 2018, సోమవారం

ఇవి ఉంటే డబ్బు మీ వెంటే..

మనిషి పుట్టినప్పటి నుంచి జీవితం ముగింపు వరకు డబ్బుతోనే జీవితం సాగుతుంది. మరణించిన తరువాత కూడా తతంగాన్ని నిర్వహించడానికి సైతం డబ్బు అవసరం. కానీ డబ్బు దేముంది అంటూ మన వాళ్లు చిత్రంగా మాట్లాడుతుంటారు. డబ్బు పాపిష్టిది కాదు. అదే విధంగా డబ్బే జీవితం కాదు. జీవితానికి డబ్బు అవసరం. డబ్బును విలన్‌గా చూడాల్సిన అవసరం లేదు. డబ్బు లక్షణాలను గుర్తించి దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి. లేకపోతే జీవితం నరకంగా మారుతుంది.
డబ్బుకుండే లక్షణాలు చిత్రమైనవి. అది మన చేతిలో ఉంటే ప్రపంచాన్ని జయించేంత ఆత్మవిశ్వాసం ఉంటుంది. అది చేతిలో లేనప్పుడు అవసరం పడ్డప్పుడు డబ్బు ఎంత శక్తివంతమైందో తెలిసొస్తుంది.
సంపాదన- ఖర్చు
మన సంపాదన ఖర్చు లెక్కలు సరిగ్గా ఉండాలి. డబ్బు సంపాదించాలి అనుకునే వారికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. ఖర్చు, ఆదాయానికి సంబంధించిన లెక్కలు తెలిసి ఉండడం. మీరు ఎంతైనా సంపాదించవచ్చు. సంపాదన కన్నా ఖర్చు ఎంతో కొంత తక్కువ ఉండాలి. సంపాదనను మించి ఖర్చు చేసే అలవాటున్న వారు జీవితంలో ఎప్పుడూ సంపన్నులు కాలేరు. అవసరానికి అప్పుల కోసం పరుగులు తీయడం వారి జీవిత లక్షణంగా మారుతుంది.
మీ పొదుపు అలవాటు ఎలా ఉందో సమీక్షించుకోవాలి. మీకు వచ్చిన జీతం/ ఆదాయం నుంచి ముందు ఖర్చులు తీసేసి మిగిలిన దానిలో అవకాశం ఉన్నంత వరకు పొదుపు చేస్తారా? పొదుపునకు సంబంధించి ఇది సరైన అలవాటు కాదు. మీరు నెలకు ఓ ఐదు వేల రూపాయలే పొదుపు చేయాలని నిర్ణయించుకున్నారనుకుందాం. మీ తప్పని సరి ఖర్చుల్లో ముందుగా ఉండాల్సింది మీరు పొదుపు చేయాలనుకుంటున్న ఈ ఐదువేల రూపాయలు. అంటే మీ ఇంటి అద్దె, ఇంట్లో నిత్యావసర వస్తువులు, పిల్లల ఫీజులు ఇవన్నీ అనివార్యంగా చెల్లించాల్సిన ఖర్చులు. మీ పొదుపు సైతం ప్రాధాన్యతా క్రమంలో ముందు ఉండాలి. అలా ఐతేనే పొదుపు సాధ్యం. అలా కాకుండా చాలా మంది ఖర్చులు పోగా ఎంత మిగిలితే దాన్ని పొదుపు చేయాలి అనుకుంటారు. దీని వల్ల అనవసర ఖర్చులు ఎక్కువ చేస్తాం. దీన్ని కొద్దిగా మార్చి, పొదుపు, ఇంటి అద్దె, నిత్యావసరాలు, పిల్లల ఫీజులు ఇలా ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించుకోండి. పొదుపు దానంతట అదే అలవాటు అవుతుంది.
చిన్న వయసులోనే పొదుపు
పొదుపు అనేది ఎంత చిన్న మొత్తం అయినా కావచ్చు. అది ఎంత తక్కువ వయసులో ప్రారంభిస్తే అంత మంచిది. మరో నాలుగైదేళ్లలో రిటైర్ అవుతాము అనుకునే సమయంలో చాలా మంది అప్పుడు హడావుడిగా పొదుపుపై దృష్టి సారిస్తారు. ఎంత ఎక్కువ పొదుపు చేసినా ఇంకా మిగిలింది ఐదేళ్ల కాలమే కాబట్టి పెద్ద అమోంట్ సాధ్యం కాదు. అలా కాకుండా ఉద్యోగంలో చేరిన కొత్తలోనే పొదుపునకు ప్రాధాన్యత ఇవ్వాలి. చక్రవడ్డీ ప్రాధాన్యత తెలిసిందే. 25ఏళ్ల వయసులో పొదుపు మొదలు పెడితే రిటైర్ అయ్యేనాటికి మీ జీతాన్ని మించిన వడ్డీ వస్తుంది. ఈ కాలంలో 20-25ఏళ్ల వయసులోనే ఐటి కంపెనీల్లో యువత ఉద్యోగం సంపాదిస్తుంది. వీరికి పొదుపును అలవాటు చేస్తే రిటైర్‌మెంట్ వయసు నాటికి మీరు ఊహించనంత సొమ్ము మీ చేతికి వస్తుంది. ఈ పొదుపే మిమ్ములను సంపన్నులుగా మారుస్తుంది.
రిస్క్- ఆదాయం
పొదుపు చేయడమే కాదు. దాన్ని సరైన రీతిలో ఇనె్వస్ట్ చేయాలి. ఎక్కువ ఆదాయం ఆశ చూపితే జాగ్రత్త. ఎక్కడైనా రిస్క్‌ను బట్టే ఆదాయం ఉంటుంది. పెద్దగా రిస్క్ వద్దు అనుకుంటే బ్యాంకు డిపాజిట్లకు ఇచ్చే వడ్డీ అంతంత మాత్రమే. అలా అని ఎక్కువ వడ్డీ ఆశ చూపించే ప్రైవేటు సంస్థల వద్ద డిపాజిట్ చేయడం అసలుకే మోసం వస్తుంది. సురక్షితంగా ఉండడంతో పాటు మంచి ఆదాయం ఇచ్చే పెట్టుబడిని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి.
* విభిన్న రంగాలు
ఒకే ఆదాయాన్ని నమ్ముకుంటే ఒక్కోసారి ప్రమాదం తప్పదు. అదే విధంగా మన ఇనె్వస్ట్‌మెంట్‌లో సైతం ఒకే రంగాన్ని ఎన్నుకోవద్దు. వివిధ రకాల పెట్టుబడులు అవసరం. ఒకవేళ స్టాక్‌మార్కెట్‌లో ఇనె్వస్ట్ చేసినా విభిన్న రంగాలకు చెందిన స్టాక్స్‌పై ఇనె్వస్ట్ చేయాలి. రియల్ ఎస్టేట్, బంగారం, స్టాక్స్ ఇలా భిన్నమైన రంగాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఒకటి దెబ్బతిన్నా మరోటి ఉంటుంది.
* ఆటోమెటిక్ పొదుపు: బ్యాంకుకు ముందుగానే అనుమతి ఇవ్వడం ద్వారా ఆటోమెటిక్ సేవింగ్ ప్రారంభించవచ్చు. మన ఖాతా ఉన్న బ్యాంకుకు ముందుగానే అనుమతి పత్రం ఇస్తే వాళ్లు ప్రతి నెల నిర్ణీత తేదీ నాడు మనం కోరిన మొత్తాన్ని పొదుపు కింద డిపాజిట్ చేస్తారు. లేదా మ్యూచువల్ ఫండ్‌లో ఇనె్వస్ట్ చేయమంటే చేస్తారు. ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఒకసారి అనుమతి ఇచ్చామంటే నెల నెలా దానంతట అదే పొదుపు జరిగిపోతుంది.
-బి.మురళి(2-12-2018)

30, నవంబర్ 2018, శుక్రవారం

‘నానో’ రాజకీయం!

అడిగిన చోటకు ఉద్యోగిని బదిలీ చేయకపోతే రాజీనామా చేసి రాజకీయ పార్టీ స్థాపిస్తారా?’’
‘‘ఎవరి గురించి..?’’
‘‘నన్ను ఎవరైనా పిలవండి వచ్చి చేరిపోతాను. వ్యవసాయ శాఖ మంత్రిని అవుతాను అన్నారు కదా?’’
‘‘ఎవరు?
‘‘ఏ పార్టీలో చేరాలనే ఆలోచన నుంచి కొత్త పార్టీ.. అటు నుంచి నడవని పార్టీని టేకోవర్ చేసుకోవడం, కొత్త పార్టీ మధ్య ఊగిసలాడుతున్నారు కదా? ’’
‘‘ఎవరిష్టం వారిది. ఫేస్‌బుక్ తరహాలో ప్రజల అభిప్రాయాలు పంచుకునే వేదికపై ఇటీవల ఒకరు- ‘కొందరు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు ఎందుకు ఉద్యోగాలు వదిలేస్తున్నారు?’ అని అడిగారు. దానికో ఆలిండియా సివిల్ సర్వీస్ అధికారి స్పందిస్తూ- ‘రాజకీయ వత్తిడి వల్ల రాజీనామా అనేది తప్పు. ఎవరి కారణాలు వారికి ఉంటాయి. మా అమ్మకు క్యాన్సర్.. అమెతోనే ఉండాలని రాజీనామా చేశాను. నా గురువుకు పుస్తకాలు రాసుకోవడం ఆసక్తి దాని కోసం ఉద్యోగం వదిలేశాడు’ అంటూ తన మిత్ర బృందంలోని కొందరు ఏయే కారణాలతో సివిల్ సర్వీస్‌కు రాజీనామా చేశారో చక్కగా రాశారు.’’
‘‘నేనడిగిందేమిటి? నువ్వు చెబుతున్నదేమిటి? ’’
‘‘మూడు దశాబ్దాల క్రితం ఇదే విధంగా ఎన్నికల సమయంలో మెదక్ జిల్లాలో బిఎన్ శాస్ర్తీ అనే బ్యాంకు అధికారి కాంగ్రెస్ నేత బాగారెడ్డిపై ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమయ్యాడు. బ్యాంకు ఉద్యోగులకు ఓ సౌలభ్యం ఉంది. ఉద్యోగంలో ఉంటూ ఇండిపెండెంట్‌గా పోటీ చేయవచ్చు. అప్పట్లో బాగారెడ్డికి మెదక్ జిల్లాలో తిరుగులేదు. బ్యాంకు అధికారి శాస్ర్తీ కొన్ని వాహనాలను సమకూర్చుకున్నాడు, కార్యకర్తలను మాట్లాడి పెట్టుకున్నాడు. ఎన్నికల్లో పోటీ గురించి అతను చెబుతుండగా, మనలాంటి పెద్ద మనిషి ఒకరు- ‘చూడోయ్.. బాగారెడ్డి అంటే ఆషామాషీ కాదు. చేతి చమురు వదలడం తప్ప నువ్వు చేసేదేమీ లేద’ని నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తూ మెదడులో అలోచనలను ప్రోది చేసుకుని వాటిని మాటలుగా మార్చి వివరించడానికి సిద్ధమవుతుండగా, బిఎన్ శాస్ర్తీ ఆవేశంగా- ‘ఎన్నికల్లో పోటీ చేయడం ఏంటి? అని ప్రతివాడూ నీతులు చెప్పడమే..’ అంటూ తన వాదన ప్రారంభించాడు’’
‘‘ఏమని?’’
‘‘నా డబ్బు- నా ఇష్టం. ఒకడికి తాగుడు అలవాటుంటుంది. మరొకడికి పేకాట, గుర్రప్పందాలు, జూదం అలవాటు ఉంటుంది. ఈ అలవాట్లతో వాళ్లు సంతోష పడతారు. వాళ్లకు ఆ వ్యసనం ఉన్నట్టే నాకు ఎన్నికల్లో పోటీ చేయాలని ఉంది. ‘బిఎన్ శాస్ర్తీ జిందాబాద్’ అంటూ వాహనాల్లో పదిమంది కార్యకర్తలు ఊరేగుతుంటే వచ్చే కిక్కే వేరు. మందు కొట్టినా ఆ కిక్కు రాదు. మందుకిక్కు కొన్ని గంటలైతే ఎన్నికల్లో పోటీ చేసే కిక్కు జీవితమంతా ఉంటుంది. నేను సంపాదించిన డబ్బును నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తా.. అడగడానికి వీళ్లెవరు? చెప్పన్నా నా అభిప్రాయం కరెక్టా? కాదా? అంటూ ప్రశ్నించగానే- అప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల డబ్బు వృథా అని చక్కగా బోధించాలని అనుకున్న నేను అవాక్కయ్యాను. ఇంకా నయం..! శాస్ర్తీ నోరు తెరవక ముందే నా అభిప్రాయం చెప్పి ఉంటే నా పరువు పోయేది.. నువ్వెవడివి సలహా ఇవ్వడానికి.. నా డబ్బు- నా ఇష్టం అనేవాడే’’
‘‘ఇంతకూ శాస్ర్తీ పోటీ చేశాడా?’’
‘‘చేశాడు.. బాగారెడ్డి భారీ మెజారిటీతో గెలిచాడు. తనకు ఎన్ని ఓట్లు వచ్చాయో శాస్ర్తీ పట్టించుకోలేదు, నేనూ పట్టించుకోలేదు. పోటీ చేయడం, నలుగురూ తన గురించి మాట్లాడుకోవడం మాత్రమే అతని లక్ష్యం. అతని లక్ష్యం నేరవేరింది. దానికి కొంత ఖర్చయిందనుకో.. మద్యం, జూదంతో పోలిస్తే ఇది తక్కువ ప్రమాదకరమైన వ్యసనమే కదా? ఆ శాస్ర్తీ ఉదంతం నాకు ముప్పయి ఏళ్ల క్రితమే మంచి నీతిని బోధించింది’’
‘‘ఏంటది?’’
‘‘ఎవడి లెక్కలు వాడికి ఉంటాయి. ఆ లెక్కలు తెలియకుండా జ్ఞానబోధ చేయాలనుకుంటే పప్పులో కాలేస్తాం అని తెలిసొచ్చింది. నిజానికి ఎన్నికల గురించి శాస్ర్తీకి ఆ రోజు నేనే బోధించాలని బోలెడు హోంవర్క్ చేసి సిద్ధపడి వెళ్లాను. కానీ తీరా అతడే నాకు బోలెడు జ్ఞానం బోధించాడు. ’’
‘‘ఈ ‘కొత్త పార్టీ ఆయనకు’ ఏం లెక్కలుంటాయి?’’
‘‘రెండు దశాబ్దాల క్రితం ఓ పార్టీ ఆధ్వర్యంలో చంపాపేటలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే వారు. ఆ పార్టీ అధినేత ప్రారంభోపన్యాసం ముగియగానే మీడియా కొంత దూరం వచ్చాక ఒక నాయకుడు డాక్టర్ జంటను మీడియాకు పరిచయం చేశాడు. శిక్షణ తరగతుల్లో ఈ జంట వైద్య సహాయ శిబిరం నిర్వహిస్తోంది అని, వెంటనే ఆ మహిళా డాక్టర్‌ను- మీరు ఏ నియోజకవర్గం ఆశిస్తున్నారని ప్రశ్నించాను. అతని పరిచయానికి నా ప్రశ్నకు అస్సలు సంబంధం లేదు. కానీ కొన్ని రోజులకు ఆ లేడీ డాక్టర్ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. రాజకీయాల గురించి ఈ మధ్య ఓషో వీడియో ప్రసంగం వింటుంటే ఇది గుర్తుకొచ్చింది. నాయకులు తొలుత ఏదో ఒక సేవా కార్యక్రమాల ద్వారానే రాజకీయాలు ప్రారంభిస్తారని ఓషో రాజకీయాల స్వరూపం గురించి వివరించారు. యూ ట్యూబ్‌లో వీడియో ఉంది.. ఆసక్తి ఉంటే దాన్ని చూడు..’’
‘‘ఓషో రాజకీయ నాయకుడా?’’
‘‘కాదు. సర్వం తెలిసిన వాడు. అతనికి రాజకీయమే కాదు తెలియనిది ఏదీ లేదు. మర్రి వృక్షం కూడా చిన్న విత్తనంతోనే ప్రారంభం అవుతుంది. ఏదో ఒక రూపంలో సేవ ద్వారానే రాజకీయాలు మొదలవుతాయి. అది వేసవిలో మంచి నీటి ట్యాంకుల సరఫరా కావచ్చు, రక్తదాన శిబిరాలు, కుల భోజనాల్లో వాటర్ బాటిల్స్ పంపిణీ.. ఇలా సేవారూపం ఏదైనా కావచ్చు. నియోజకవర్గ స్థాయిని బట్టి, నాయకుని స్థాయి బట్టి సేవ ఉంటుంది. ఐతే సేవ చేసేవారందరి లక్ష్యం అదే అని నేను అనడం లేదు. మానసిక తృప్తి కోసం సేవ చేసే వారు కూడా ఉంటారు. ఆ స్టైల్ వేరుగా ఉంటుంది.’’
‘‘సరే.. కొత్త పార్టీకి గిరాకీ ఎలా ఉంటుందంటావు’’
‘‘నానో కారు మార్కెట్‌లోకి విడుదల చేసినప్పుడు టాటా ఎన్నో ఆశలు పెట్టుకొని భావోద్వేగంతో విడుదల చేశారు. మూసేసినప్పుడు కూడా అంతే భావోద్వేగం చూపారు. నానో కారును నేను అద్భుతంగా నడిపిస్తానని ఎవరైనా ముందుకు వస్తే మనమెందుకు వద్దనాలి. టేకోవర్ చేసిన ఎన్నో కంపెనీలు బాగా నడిచిన ఉదంతాలు ఉన్నాయి. నడవనివీ ఉన్నాయి. ఎవరి బడ్జెట్ లెక్కలు వారికుంటాయి. ఏం జరుగుతుందో చూద్దాం...’’
*

బుద్దామురళి (జనాంతికం 30-11-2018)

26, నవంబర్ 2018, సోమవారం

డబ్బు మహత్యం

సతీ సక్కుబాయి, సతీ అనసూయ, సంతోషీమాతా సినిమా పేర్లు ఏదైతేనేం కానీ పతివ్రతల కథల సినిమాల్లో ఓ దృశ్యం తప్పనిసరిగా కనిపిస్తుంది. భక్తురాలిని వేధించేందుకు ఇంట్లో పాత్రలను, బట్టల మూటను ఆమె ముందు వేస్తారు. గుట్టల్లా పేరుకుపోయిన ఆ పాత్రలు, బట్టలు చూడగానే సినిమా చూసే ప్రేక్షకులు జాలితో కరిగిపోతారు. పాపం ఆమె ఒక్కత్తె ఆ పని ఎలా చేస్తుందా? అని బాధపడతారు. ఇంతలోనే ఆ భక్తురాలిని కాపాడేందుకు ఏ దేవతో తన మంత్రశక్తితో ఆ పాత్రలను కడిగేస్తుంది. బట్టలు ఉతికేస్తుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఊపిరి పీల్చుకుంటారు.
కోరుకుంటే అలాంటి మాయలు మంత్రాలు మనకూ సాధ్యమే. అంటే మనం మహాభక్తులం కాబట్టి ఏ దేవుడో మన కోసం ఆ పని చేస్తాడని కాదు అర్థం. మనం ఇతరుల సమయాన్ని కొనుక్కోని ఆ పని చేయించవచ్చు.
సమయాన్ని కొనుక్కోవచ్చు. డబ్బుతో పని చేయించవచ్చు. ఈ రెండూ తెలిసిన వారు సంపన్నులు అవుతారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఒక్క క్షణాన్ని కూడా కొనలేం అంటారు. ఇలాంటి మాటలు కథలు, కవితల వరకు నిజమే కాని సంపద మొత్తం సమయాన్ని ఖరీదు చేసుకొనే వారి వద్దనే ఉంటుంది.
సమయాన్ని కొనుక్కోవచ్చు. సమయాన్ని కొనుక్కొనే టెక్నిక్ తెలియడం వల్లనే కొందరు సంపన్నులు అవుతున్నారు. కొందరు గానుగెద్దుల్లా ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండిపోతున్నారు.
ఉదాహరణకు మీ నెల జీతాన్ని గంటల్లోకి మారిస్తే మీరు గంటకు మూడు వందల రూపాయలు సంపాదిస్తారు. మీ ఇంటి పనికి పనిమనిషి గంట సంపాదన వంద రూపాయలు అనుకుందాం. మీ ఇంటి పని మీరు చేయడంకన్నా ఇతరులకు వంద రూపాయలు ఇచ్చి ఆ పని చేయించినప్పుడు మీ వద్ద గంట సమయం ఉంటుంది. వంద రూపాయలతో మీరు గంట సమయాన్ని కొనుక్కున్నారు. ఆ సమయాన్ని మీరు మూడు వందల రూపాయలు సంపాదించేందుకు ఉపయోగించవచ్చు. ఎందుకంటే మీ సంపాదన విలువ గంటకు మూడు వందలు. ఇదో ఉదాహరణ మాత్రమే కచ్చితమైన లెక్క కాదు. తెలియని వారు జీవితమంతా బతకడానికే కష్టపడుతుంటారు. సమయాన్ని కొనుక్కోవడం వల్ల మనకు రెండు ప్రయోజనాలు ఉన్నాయి. మన సమయం విలువను ఎప్పటికప్పుడు పెంచుకొనే ఆలోచన చేయవచ్చు. సంపన్నులను సంపన్నులుగా మార్చేది ఇతరుల సమయాన్ని కొనుక్కొనే విధానమే.
ఒక ఐటి కంపెనీలో ఓ పది మంది పని చేస్తున్నారని అనుకుందాం. ఒక్కొక్కరి నెల జీతం 50 వేల రూపాయలు అనుకుంటే నెలకు వీరికి చెల్లించే జీతం ఐదు లక్షలు. పది మంది ఉద్యోగుల నెల సమయాన్ని కొనుక్కునే యజమాని వీరి పని ద్వారా నెలకు పది లక్షలు గడించవచ్చు.
అంటే ఐదు లక్షలకు కొనుక్కున్న సమయాన్ని పది లక్షలకు అమ్ముకుంటాడు. ఉద్యోగులతో పది లక్షల రూపాయల విలువైన పని చేయిస్తారు. ఒక్కో ఉద్యోగి చేసే పనిని మదింపు చేసి ఉద్యోగికి చెల్లించే జీతాన్ని మించి పని చేసినప్పుడే కొనసాగిస్తారు. లేకపోతే ఇంటికి పంపిస్తారు. ఏ ప్రైవేటు సంస్థలోనైనా జరిగేది అదే.
సమయాన్ని కొనుక్కోవడం అనేది ఏ ఐటి కంపెనీకో వేలాది మంది పనిచేసే సంస్థకో పరిమితం కాదు. ఇంట్లో పనిమనిషి కావచ్చు, రచయితలు, టెక్నీషియన్లు కావచ్చు. కిరాణా షాపు కావచ్చు. ఇంటింటికి వెళ్లి వస్తువులు విక్రయించే సేల్స్‌మెన్, సేల్స్ ఉమెన్ ఎవరైనా కావచ్చు. ఏదో ఓ రంగం నుంచి డబ్బు సంపాదించడానికి మనకు అవగాహన ఉంటే ఇతరుల సమయాన్ని తక్కువ ధరకు కొనుక్కుని, మన తెలివి జోడించి ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు.
డబ్బుతో పని చేయించడం...
మనం ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకొంటే మన తరఫున ఎవరైనా పని చేసి డబ్బు సంపాదిస్తే ఎంత బాగుంటుంది. మనం ఇంట్లో మనకు నచ్చిన ‘మాయాబజార్’ సినిమానో ‘పోకిరీ’ సినిమానో చూస్తూ గడిపేస్తుంటే మన తరఫున ఎవరైనా పని చేస్తూ మనకు నెల నెలకు కావలసిన డబ్బులు ఇస్తే ఎంత బాగుంటుంది. కవితలు రాయడం, కథలు రాయడం మనకు ఆసక్తి. మిత్రులతో కవితా గోష్ఠులు, కథా పఠనాల్లో మనం జీవితాన్ని అనుభవిస్తుంటే నెలనెల మన ఖర్చులు వాటంతట అవే వచ్చి పడితే ఎంత బాగుంటుంది. కలలు కనడానికి బాగానే ఉంది. ఇది సాధ్యమా? అంటే ఎందుకు సాధ్యం కాదు. సాధ్యమే.
చాలా మంది రాజకీయ నాయకులు నిరంతరం ప్రజాసేవలో, రాజకీయాల్లో మునిగి పోతారు. ఇలాంటి వారికి డబ్బులు ఎలా అంటే డబ్బులతో పని చేయించడం వారికి తెలుసు కాబట్టి. రాజకీయ నాయకులు అక్రమాలు అక్రమ సంపాదన అనే విమర్శల సంగతి పక్కనపెడితే చాలామంది రాజకీయ నాయకులు నెలనెలా తమ ఖర్చులకు సరిపడా ఆదాయం కోసం ముందుగానే ఏర్పాటు చేసుకుంటారు. డబ్బు సంపాదించేందుకు మనమే కష్టపడాల్సిన అవసరం లేదు. డబ్బు డబ్బును సంపాదిస్తుంది. ముందు నుంచే ఒక క్రమపద్ధతిలో మన కోసం సంపాదించేందుకు కొంత డబ్బు సమకూర్చుకోవాలి. కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్న సంపన్నులే కాదు, చిరుద్యోగులు సైతం ఉద్యోగంలో చేరిన మొదటి నుంచే సంపాదన కోసం తాము కష్టపడటమే కాదు, తమ తరఫున తమ డబ్బు పని చేసే విధంగా పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్‌పై దృష్టి సారించాలి. నెలకు లక్ష రూపాయలు సంపాదించే ఉద్యోగి ఓ 30 శాతం జీతం అనుకొంటే ఓ భవనంపై నెలకు లక్ష అద్దె రూపంలో సంపాదించేవారు ఉన్నారు. ఎప్పుడో ఇంటిపై పెట్టిన పెట్టుబడి నెలకు లక్ష రూపాయలు జీతంలా సంపాదించి పెడుతుంది. చాలామంది రాజకీయ నాయకులు ఇలా భారీ ఎత్తున కమర్షియల్ భవనాలపై పెట్టుబడి పెట్టి అద్దెలతో జీవించేస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు చాలామంది మంచి అద్దెలు వచ్చే ఇళ్లను నిర్మించి రిటైర్మెంట్ జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు. పెన్షన్ మొత్తాన్ని మించి అద్దె సంపాదిస్తున్న వారు చాలామంది ఉన్నారు. డబ్బు డబ్బును సంపాదిస్తుంది అనే విషయం ఎంత త్వరగా గుర్తిస్తే భవిష్యత్తు ప్రశాంత జీవనానికి అంత ముఖ్యం.
మరెందుకాలస్యం? మీ డబ్బుకు డబ్బును సంపాదించే పనిని వెంటనే అప్పగించండి.
-బి.మురళి( 25-11-2018)

24, నవంబర్ 2018, శనివారం

బేతాళుడూ విప్పలేని చిక్కుముడి!

‘‘రావోయ్.. కాంపోజిట్ మాథ్స్.. రా..!’’
‘‘ఎంతకాలానికి వినిపించిందిరా..! ఆ పిలుపు.. దేశాలు తిరిగాం, ఎంతో జీవితాన్ని చూశాం. నాలుగు దశాబ్దాల తరువాత కాంపోజిట్ మాథ్స్ అంటూ నువ్వు పిలిచిన పిలుపుతో మరోసారి బాల్యంలోకి వెళ్లినట్టుంది. మన బ్యాచ్‌లో మీరంతా టెన్త్‌లో జనరల్ మాథ్స్ తీసుకుంటే నేనొక్కడినే కాంపోజిట్ మాథ్స్ తీసుకున్నా.. అప్పుడు నా పేరు కన్నా- ఈ పేరుతోనే పిలిచేవారు మీరంతా’’
‘‘సరే లేరా! నువ్వు లెక్కల్లో చాలా క్లవర్‌వి కదా? నీకో చిన్నలెక్క చెబుతా.. సమాధానం ఇస్తావా..?’’
‘‘తిరుపతిలో లడ్డూలు, ఆర్‌బిఐలో డబ్బులు ఎలానో నా బుర్రలో లెక్కలు అలా.. ఏమడుగుతావో అడుగు.. పదహేడవ ఎక్కం కింది నుంచి పైకి చెప్పాలా? పై నుంచి కిందికి చెప్పాలా? పోనీ 37వ ఎక్కం చెప్పమంటావా? అదీ కాదంటే 12346ను 14తో భాగిస్తే ఎంత అవుతుందో చెప్పాలా? 12తో హెచ్చిస్తే ఎంతవుతుందో చెప్పాలా?’’
‘‘తొందర వద్దు అడుగుతా.. అనగనగా ఒక రాజ్యం.. అక్కడ మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికలకు వెళుతున్నారు.’’
‘‘డొంక తిరుగుడు ఎందుకు? తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి.. వాటికి ఎన్నికలు జరుగుతున్నాయని సూటిగా అడుగు’’
‘‘నేను అడిగేది అడుగుతా! నువ్వు ఊహించుకునేది ఊహించుకో’’
‘‘సరే అడుగు’’
‘‘119 నియోజకవర్గాల్లో హస్తం, ప్రొఫెసర్, ఎరుపు, చెరుకు, సైకిల్ పార్టీలు ఒక బృందంగా ఏర్పడి పోటీ చేయాలనుకున్నాయి. మొదట్లోనే ‘చెరుకు’ను పిప్పిలా పక్కన పడేశారు. ఇక మిగిలినవి నాలుగు. ప్రొఫెసర్ 30 స్థానాలను డిమాండ్ చేసి చివరకు 12 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు వాటి పేర్లు అధికారికంగా ప్రకటించారు. 14 చోట్ల నామినేషన్ వేశారు .8 మావే అన్నారు. మూడు మాత్రమే మిగిల్చారు. బృందంలో పెద్దన్న హస్తం మాత్రం చివరకు ప్రొఫెసర్‌కు ఎనిమిది స్థానాలు ఇస్తున్నట్టు ప్రకటించింది. వీటిలో మూడు స్థానాల్లో హస్తం వారికి అవకాశం ఇచ్చారు. మరో దానిలో సైకిల్ వెళ్లింది. సైకిల్‌కు పధ్నాలుగు ఇచ్చారు. ఇవి సరిపోవు.. ఇంకో నాలుగైనా కావాలని ఆడిగి, పన్నెండుచోట్ల నామినేషన్లు వేసి, ఒకటి గాలికి వదిలేశారు. ‘ ఒకటి మరిచి పోయారు.ఎర్ర’ పార్టీ డజను సీట్లు అడిగి, ఐదింటితో సంతృప్తి చెందుతామంటే మూడిచ్చారు. ఒక చోట వెన్నుపోటు, రెండింటిలో సహాయ నిరాకరణ, ఇంకోచోట అష్టకష్టాలు. కథ విన్నావు కదా? ఇప్పుడు చెప్పు ఇందులో బృందంలోని పార్టీల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది? ఎన్ని స్థానాల్లో బృందం సభ్యుల మధ్య స్నేహ పూర్వక పోటీ ఉంది. ఎన్ని చోట్ల వెన్నుపోట్లు? ఎన్ని చోట్ల అగచాట్లు చెప్పు? ఎన్ని చోట్ల తిరుగుబాట్లు ’’
‘‘ఇదేం లెక్క.. అస్సలు అర్థం కాలేదు’’
‘‘అర్థం కాలేదా? సమాధానం చెప్పలేవా? పత్రికలు చూస్తున్నావా? చూడు అభ్యంతరం లేదు. పత్రికలు చూడు, క్యాలిక్యులేటర్ ఉపయోగించుకో, ఫ్రెండ్స్‌తో ఫోన్‌లో సంప్రదించు, బృందంలోని పార్టీల నాయకులకు ఫోన్ చేసి తెలుసుకో.. అభ్యంతరం లేదు.’’
‘‘ఒక్కో పత్రికలో ఒక్కో లెక్క వేశారు. సమాధానం ఎలా చెప్పాలి?’’
‘‘చిన్నప్పుడు టెన్త్‌లో కాంపోజిట్ మాథ్స్ తీసుకున్నోడివి- 119 సీట్ల లెక్క చెప్పలేవా? ల్యాప్‌టాప్ తీసుకో నోప్రాబ్లమ్’’
‘‘బుర్ర వేడెక్కుతోంది’’
‘‘సరే కొద్ది సేపు ఇతర విషయాలు మాట్లాడుకుందాం. చిన్నప్పుడు మన ఫ్రెండ్స్ అందరం జనరల్ మాథ్స్ తీసుకుంటే నీకు కాంపోజిట్ మాథ్స్ తీసుకోవాలని ఎందుకనిపించిందిరా?’’
‘‘నిజం చెప్పాలంటే మనమంతా ఒక గ్రూప్‌గా ఉన్నా నేను మీ అందరి కన్నా తెలివైన వాడినని గుర్తింపు పొందాలన్న ఆశ బలంగా ఉండేది. మీతో ఉన్నంత వరకు నన్ను కూడా అందరిలో ఒకడిగానే చూసిన వరలక్ష్మితో పాటు నేను కాంపోజిట్ మాథ్స్ తీసుకోగానే నన్ను ఎంత ఆరాధనగా చూసిందో తెలుసా? మేం స్కూల్ ముగిశాక మా కాలనీలో కలుసుకుని మాట్లాడుకునే వాళ్లం. ’’
‘‘ఆ సంగతి మాకు తెలుసులేరా! మన మల్లేష్ గాడు అంతకు ముందు వరకు ఆ అమ్మాయిని మూగగా ఆరాధించే వాడు. మాట్లాడే ధైర్యం చేయలేదు. ఈ లోపు నువ్వు లైనేశావు. వాడు ఆ రోజు నుంచే తన జీవితం ముగిసిపోయిందని అనుకున్నాడు పాపం..’’
‘‘మీరంతా నన్ను చూసి కుళ్లుకుంటుంటే నేను ఎంజాయ్ చేసేవాడ్ని.. ఏదో బాల్యం.. తెలియని తనం.’’
‘‘ఇప్పుడు చెప్పు 119 సీట్లలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు?’’
‘‘పోనీ- ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పాలా?’’
‘‘నేను సూటిగా అడిగాను. 119 సీట్లలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అని?’’
‘‘సమాధానం చెప్పడం నా వల్ల కాదు. నువ్వు చెప్పు?’’
‘‘నేను చెబుతాననలేదు. నిన్ను చెప్పమని అడిగాను. కాంపోజిట్ మాథ్స్‌తో టెన్త్ చదివిన లెక్కల మేధావివి.. చెప్పలేవా?’’
‘‘చెప్పలేను, నువ్వు చెప్పురా! లెక్క విన్న తరువాత బుర్ర పని చేయడం లేదు. ఇంటికి వెళ్లినా ప్రశాంతంగా ఉండలేను. నీకు తెలుసు కదా? నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా లెక్క వింటే అది సమాధానం తెలియనిదే నిద్ర పట్టదు.’’
‘‘సమాధానం నీకే కాదు, నాకూ తెలియదు. ఇన్ని దశాబ్దాల నా కసి ఇప్పుడు తీరిందిరా! నాలుగు దశాబ్దాల క్రితం లెక్కల్లో తెలివైన వాడినని నువ్వు విర్ర వీగితే మేం మనసులో ఇంత కాలం ఎంత మథనపడ్డామో నీకేం తెలుసురా?’’
‘‘ఐతే అమరావతి వెళ్లొస్తా’’
‘‘ఆయనకూ తెలియదు. 2009 నాటి కూటమిలో ఎవరికెన్ని సీట్లో ఇప్పటి వరకు లెక్క తేలలేదు. 2018ది ఎప్పుడు తేలాలి?’’
‘‘సమాధానం లేని లెక్క అంటే నాకు నిద్ర పట్టదు. ఏదో ఒక మార్గం చెప్పు’’
‘‘లెక్కల్లో నీ తెలివితో మేం నాలుగు దశాబ్దాలు క్షోభ అనుభవించాం. ఇప్పుడు నీ వంతు. దీంతోనైనా మా క్షోభ నీకు అర్థం అవుతుంది.’’
‘‘చెప్పరా ఎవరికెన్ని స్థానాలో..’’
‘‘పెద్ద పెద్ద ప్రొఫెసర్లకే సమాధానం తెలియదు. నువ్వు, నేను ఎంత? బేతాళుడు కూడా చెప్పలేని చిక్కు ప్రశ్న ఇది. ’’
‘‘బాల్య స్నేహితుడిని ఇలా అమానుషంగా హింసించడం అన్యాయం. నాలుగు దశాబ్దాలు నువ్వు ఇంత కసితో రగిలిపోతున్నావని, ఆ కక్ష నీలో ఇంత బలంగా ఉందని ఊహించలేదు. సమాధానం తెలిసే దాకా నిద్ర పట్టదు. ఎవరికెన్ని సీట్లో చెప్పి పుణ్యం కట్టుకో ప్లీజ్..’’
బుద్దా మురళి (జనాంతికం 23-11-2018) )
*

22, నవంబర్ 2018, గురువారం

మనిషికున్న వరం

మనం బల్లిని చూసినా భయంతో కేకలు పెడతాం. దోమలు కూడా మనల్ని ఆటాడుకుంటాయి. కంటికి కనిపించని చిన్నచిన్న సూక్ష్మ జీవులు కూడా కొన్ని విషయాల్లో మన కన్నా శక్తివంతమైనవి. ఇక సింహం, పులి వంటి కూృర జంతువులను చూస్తే మనం వణికిపోవలసిందే. మన కన్నా ఎన్నో రెట్లు పెద్దదైన ఏనుగు, అడవికి రాజైన పులి వంటి జంతువులు. అనేక విషయాల్లో జంతువులు మనకన్నా ఎన్నో రెట్లు బలవంతమైనవి. ఇంతటి శక్తివంతమైన జంతువులు సైతం తమ ఆహారాన్ని ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకోవలసిందే. అంతే తప్ప నేను పులి రాజును నెల రోజులకు అవసరం ఐన ఆహార పదార్థాలు ఒకే రోజు తెచ్చిపెట్టుకుంటాను అంటే కుదరదు.
ఈ విషయంలో ఒక్క మనిషికి మాత్రమే అద్భుతమైన అవకాశం ఉంది. కానీ చాలా మంది మనుషులకు ఈ విషయం తెలియదు. తెలిసిన రోజు, అర్థం చేసుకున్న రోజు అదృష్టవంతునిగా మారుతాడు.
చిన్నా పెద్దా అనే తేడా లేదు ఏ జంతువైనా ఎప్పటి ఆహారాన్ని అప్పుడే సంపాదించుకోవాలి. కానీ మనిషి మాత్రం జీవిత కాలం మొత్తానికి కావలసింది కొద్ది కాలంలో సంపాదించుకోవచ్చు.
ఒక వ్యక్తికి నెల రోజుల ఇంటి ఖర్చు పాతిక వేల రూపాయలు అనుకుందాం. పక్షులు, జంతువుల తరహాలో ఎప్పటికప్పుడు వీటిని సంపాదించాల్సిందే. చాలా మంది చేసేది అదే. కానీ కొద్ది శాతం మంది మాత్రమే దీనికి భిన్నంగా ఆలోచించి, మనుషులకు ఉండే వరాన్ని ఉపయోగించుకుంటారు.
మనిషి తనకు శక్తిసామర్థ్యాలు ఉన్నంత వరకు ఏదో ఒక పని చేస్తూ ఉండాల్సిందే. చేయాలి కూడా. కానీ ఇల్లు గడవడం కోసం చేసే పనికి ఆసక్తితో చేసే పనికి తేడా ఉంటుంది.
ఇరవై ఐదు వేల రూపాయలు నెలకు ఇంటి ఖర్చు అనుకున్నప్పుడు ఎంత త్వరగా మనం పని చేయకపోయినా నెలకు 25వేల రూపాయలు వచ్చే ఏర్పాటు మనం చేసుకుంటామో అప్పుడు మనకు ఆర్థిక స్వేచ్ఛ లభించినట్టు. ఒకవైపు పదవీ విరమణ వయసు పెంచాలనే డిమాండ్ వినిపిస్తుండగా, కొంత మంది యువత అదే సమయంలో ఎర్ల్రీ రిటైర్‌మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే ఇల్లు గడవడానికి నెలకు పాతిక వేలు అవసరం అయితే అప్పటి వరకు తాను చేస్తున్న ఉద్యోగం మానేసినా నెలకు 25వేల రూపాయలు వచ్చే ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు జీవించడం కోసం ఉద్యోగం అనే అవసరం తీరిపోతుంది. అప్పుడు తనకు నచ్చిన విధంగా ఆ వ్యక్తి బతక వచ్చు. అంటే దాని అర్థం పనీ పాటా లేకుండా జులాయిగా తిరగడం అని కాదు. కొందరికి నటన ఇష్టం కావచ్చు, రాయడం ఇష్టం కావచ్చు, సినిమాలు తీయడం, షార్ట్ ఫిల్మ్‌లు తీయడం, ఏదో ఒక కళలో ఆసక్తి ఉండవచ్చు. ఆసక్తిని చంపుకుని జీతం కోసం ఉద్యోగం చేస్తారు. సంపాదించిన జీతం నుంచి క్రమ పద్ధతిలో పొదుపు చేసి దానిని ఆదాయం వచ్చే వాటిలో ఇనె్వస్ట్ చేస్తే కొంత కాలానికి జీతానికి మించి ఈ పెట్టుబడిపై ఆదాయం వస్తుంది. ఐతే దీని కోసం రిటైర్‌మెంట్ దశలో ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదు. ఉద్యోగం, వృత్తి, వ్యాపారం ఏదైనా కావచ్చు. సంపాదన మొదలు పెట్టిన ప్రారంభం నుంచే పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్ ప్రారంభిస్తే కొంత కాలానికి జీతాన్ని మించిన ఆదాయం పొందవచ్చు. అప్పుడు జీవితాన్ని తమకు నచ్చిన విధంగా జీవించవచ్చు.
జంతువులు, పక్షులకు లేనిది మనకున్న అద్భుతమైన వరం ఇదే. ఎంత బలవంతమైన జంతువు కూడా జీవిత కాలం మొత్తానికి కావలసింది సంపాదించుకోలేదు. మనిషి అలా చేయగలడు. తొందరగా రిటైర్ కావడం అంటే ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం అని కాదు. తనకు నచ్చిన పని చేస్తూ సంపాదించడం. చాలా మంది విషయంలో ఇలా తమ జీతానికి మించి సంపాదించిన వాళ్లు, సంపాదిస్తున్న వాళ్లు ఉన్నారు. ఉద్యోగం వదిలి బయటకు వెళ్లి నచ్చిన పని చేద్దాం అంటే ఆ పనిలో సక్సెస్ కాకపోతే ఎలా అనే అనుమానం మనల్ని వెంటాడుతుంది. కానీ జీతానికి సరిపోయే ఆదాయం సమకూర్చుకున్న తరువాత ఉత్సాహంగా నచ్చిన పని చేస్తూ గతంలో కన్నా ఎక్కువ సంపాదిస్తున్న వాళ్లు, జీవితాన్ని నచ్చిన విధంగా జీవిస్తున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. అమెరికా వంటి దేశాల్లో ఇటీవల ఎర్ల్రీ రిటైర్‌మెంట్ అనే భావన చాలా బలంగా వినిపిస్తోంది. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఈ కోణంలో యువత ఆలోచిస్తోంది.
ఉత్తరాదిలో ఇటీవల ఒక ఐఎఎస్ తన ఉద్యోగాన్ని వదిలిపెట్టారు. సివిల్ సర్వీస్‌లో ఉన్న వాళ్లు ఇలా మధ్యలోనే ఉద్యోగాన్ని ఎందుకు వదిలిపెడుతున్నారు. అని కోరాలో ఒకరు ప్రశ్నించగా, తన సొంత కారణంతో పాటు తనకు పరిచయం ఉన్న పలువురు అధికారులు ఉద్యోగాన్ని ఎందుకు వదిలిపెట్టారో వివరించారు.
రాజకీయ వత్తిడి అనే కారణం ప్రచారం జరుగుతున్నా అది నిజం కాదని, ప్రారంభంలో ఉద్యోగం సంపాదించడమే ముఖ్యం అనే భావన ఉంటుందని కానీ కొంత కాలం తరువాత తమకు నచ్చిన పని చేయాలనే ఆలోచన వల్ల మధ్యలోనే ఉద్యోగాన్ని వదిలివేస్తున్నారని తన మిత్రులు కొందరి గురించి వివరించారు. సీనియర్ ఐఎఎస్ అధికారి ఒకరికి రచనలు చేయడం ఇష్టం. జీతం లేకపోయినా బతికే ఆర్థిక స్థోమత వచ్చిన తరువాత అతను కేవలం రాయడం కోసమే ఉద్యోగం వదిలిపెట్టారు.
అఖిలభారత స్థాయిలో లక్షలాది మందితో పోటీ పడి సంపాదించిన ఆల్ ఇండియా సివిల్ సర్వీస్‌లో ఉన్నవాళ్లు సైతం తమకు నచ్చిన పని చేసేందుకు ఉద్యోగాలు వదిలివేయగలుగుతుండడాన్ని గమనించాలి. జీవితం ఒకటే . జీవితమంతా ఇష్టం లేని పనిని కేవలం జీతం కోసం చేస్తూ జీవితాన్ని ముగించే బదులు ఉద్యోగంలో చేరిన మొదట్లోనే కనీసం పది శాతం జీతాన్ని దీర్ఘకాలిక ఇనె్వస్ట్‌మెంట్ కోసం పక్కన పెడితే, అలా పక్కన పెట్టిన డబ్బే కోరుకున్న విధంగా జీవించేందుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది.
ఐటి కంపెనీల్లో పెద్ద జీతంతో చేరిన యువతకు డబ్బుకు సంబంధించి ఇలాంటి అవగాహన ఉన్నప్పుడు దాదాపు పదేళ్ల పొదుపు + పెట్టుబడితో స్వతంత్ర జీవితం గడపవచ్చు.
-బి.మురళి( 18November 2018)