30, నవంబర్ 2011, బుధవారం

విస్కీసోడా= ప్రజాస్వామ్యం - సామాజిక న్యాయం!
అత్యవసర సమావేశం అని తన ముఖ్యులందరినీ ఊరవతల ఉన్న డాబాకు పిలిచాడు ప్రముఖ దాదా సూరి. అప్పటికే క్వార్టర్ పూర్తి చేసిన సూరి మరో పెగ్గి లాగించేస్తూ ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. డబుల్ మర్డర్ చేసేప్పుడు కూడా అన్న ఇంత సీరియస్‌గా కనిపించలేదు, ఏమై ఉంటుందా? అని అంతా తమలో తామే గుసగుసలాడుకుంటున్నారు.
 ఉద్రిక్తంగా ఉన్నా పరిస్థితి అదుపులో ఉంది అన్నట్టుగా ఉందక్కడ . హైటెక్ సిటీ దగ్గర ఏడెకరాల ల్యాండ్ గొడవలో మంత్రిగాడి మనుషులు వచ్చినప్పుడే అనుకున్నాను ఏదో అవుతుందని అని ఒకరు మెల్లగా పలికాడు. ఆ మాట విన్న సూరి .... ఖాళీ ల్యాండ్‌మీద మన కన్ను పడిందంటే ఏ నాయకుడి చెంచాలు నాకు అడ్డురారు నీకు తెలియందేముంది భాయ్ కానీ ... అంటూ చెప్పకుండా నసుగుతుంటే అన్నా చెప్పన్నా పరవాలేదు. నీ కోసం ఏమైనా చేస్తాం అని అంతా పలికారు. సూరిబాబు గొంతు సవరించుకుని ‘‘ 50 ఏళ్ల వయసులో నాలో ఓ తీరని కోరిక రగిలిపోతుంది రా!’’ అని సిగ్గుపడ్డాడు. విషయం అర్ధమైందన్నా!
 సుజ్జి కంపెనీలో కొత్త పిట్టలొచ్చాయట! వెళదాం పదన్నా అని ఒకడన్నాడు. సూరి తల అడ్డంగా ఊపాడు. అన్నా టాలివుడా? బాలివుడా? పేరు చెప్పన్నా మిగతా మేం చూసుకుంటాం అని ముఖ్య అనుచరుడు ఊషారుగా ఈలవేశాడు. ఇంతోటి దానికి సిగ్గుపడడం ఎందుకన్నా అని నవ్వారు. సిగ్గే మనను చూసి సిగ్గుపడుతుంది మనకు సిగ్గెందుకురా? కానీ ఎందుకో? మీ అందరి ముందు ఆ కోరికను చెప్పాలంటే కొంత ఇబ్బందిగా ఉందని సూరి నవ్వాడు. ఏ కంపెనీ పిట్ట కావాలో చెప్పన్నా ? క్షణంలో నీ ఓళ్లో వాలిపోతుందని భరోసా ఇచ్చారు అనుచరులు నాకు కావలసింది అది కాదు. ఎప్పుడూ లేని విధంగా నాకు దానిపై మనసు పడిందిరా! పోయే లోపు ఎలాగైనా ఒకసారి సొంతం చేసుకోవాలనిపిస్తుంది. కానీ నాకది కావాలంటే నీ సహయం కావాలి అని సూరి సిగ్గుపడుతూ తల దించుకున్నాడు. అది.. అది.. అంటావు ఏంటో చెప్పన్నా అని అనుచరులు ఆప్యాయంగా అడిగారు. డబ్బులు బాగా వచ్చాక అది కావాలనే కొరిక చాలా మందికి కలుగుతుంది చూడు.. ‘‘అదేరా... అదే ప్రజాస్వామ్యం ... ఎలా గైనా దాన్ని సొంతం చేసుకోవాలని, అనుభవించాలని కోరిక పుట్టింది’’ అని సూరి చెప్పాడు.‘‘ ఏమో అనుకున్నానన్నా మరీ కొండకే గురిపెట్టావు. ప్రజాస్వామ్యాన్ని అనుభవించాలనుంది, సొంతం చేసుకోవలనుంది అనొద్దన్నా! ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని’’ఉంది అనాలి భాస్కర్ సవరించాడు. ఏదో లేరా? అది చేయాలని ఉంది అని సూరి చెప్పాడు.

 ఐనా అది మరీ ఖరీదైందన్నా ఒకటి రెండు ఎకరాలకు దొరికేంత తక్కువ ధర కాదు అని భాస్కర్ నిరాశ పరిచాడు. ఎంత ఖరీదైనా పరవాలేదురా మనం పెజాస్వామ్యాన్ని రక్షించాల్సిందే అని సూరి భీష్మించుకున్నాడు. అన్నా మరీ ప్రజాస్వామ్యంతో పరాచికాలొద్దు బాబు, జగన్ లాంటి పెద్ద పెద్ద వాళ్లు చేసే పనన్నా అది వాళ్ల వద్దనంటే లెక్కలేనంత డబ్బుంటుంది వాళ్లు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వెళితే ఒక అర్ధం ఉంది. ఏదో అక్కడిక్కడ ఖాళీ స్థలాను ఆక్రమించుకుని బుద్ధిగా బతికే వాళ్లం. అంత ఖరీదైన జూదం మనకెందుకన్నా ఉన్నది ఊడ్చుకుపోతుంది అయినా ప్రజాస్వామ్యాన్ని రక్షించి ఏం చేస్తావన్నా అని భాస్కర్ ఆసక్తిగా అడిగాడు. సూరి మరింతగా మెలికలు తిరిగిపోతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించి సామాజిక న్యాయం సాధిస్తాను అన్నాడు. ఇంతకూ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే ఆలోచన నీ కెందుకొచ్చిందన్నా! అని అడిగారు.

 ‘‘మొన్న రచ్చబండలో మంత్రి వేదికపై ఉంటే ఎమ్మెల్యే బస్తీమే సవాల్ అంటూ పైకి వెళ్లి బండ బూతులు తిట్టి మంత్రిని తోసేశాడు. దాంతో మంత్రి తిరిగి బూతులు తిట్టి ఆ ఎమ్మెల్యేను చితగ్గొట్టాడు. తరువాత ఎమ్మెల్యే టీవిలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికే తాను వేదికపైకి వెళ్లి గొడవ పడ్డానన్నాడు. మంత్రికూడా ఎమ్మెల్యేను చితగ్టొట్టాడంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికే కదా! మనం పోలీసులకు, అధికారులకు, నాయకులకు అందరికీ భయపడాలి. మరి మనమే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ముందుకు వచ్చామనుకో? ’’ అని సూరి అడిగాడు. సామాజిక న్యాయం? అని రవి ప్రశ్నార్ధకంగా ముఖం పెట్టాడు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం విస్కీ సోడాలా కలిసే ఉంటాయిరా? సామాజిక న్యాయం అంటే మీకు ఈజీగా అర్ధమయ్యేట్టు చెబుతా వినండి. మన కులపోల్లంతా మనకు ఓటు వేస్తారు, గెలిచాక మనం మన కులపోల్లకు కావలసింది చూసుకోవాలి ఈ కులాలు మనం సృష్టించుకున్నవే అంతా ఒకటే అంటూ ఉపన్యాసం ఇవ్వాలి అదే సామాజిక న్యాయం’’ అని సూరి వివరించాడు అయితే సరే అన్నా సొంతంగా కాకుండా ఇప్పుడున్న ఏదో ఒక పార్టీలో చేరి పెజాస్వామ్యాన్ని రక్షించి, సామాజిక న్యాయం సాధిద్ధాం అన్నారు. సూరి ఎవరికో ఫోన్ చేసి ఖద్దరు డ్రస్‌లు సిద్ధం చేయండి అని ఆదేశించి అనుచరులవైపు చూస్తూ ఇకపై నా పేరు సూరిబాబు అన్నాడు. అందరూ కోరస్‌గా ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సూరిబాబు జిందాబాద్ అన్నారు.

29, నవంబర్ 2011, మంగళవారం

చానల్స్ ఘోరాలు- యాజమాన్య నేరాలు


దాదాపు అన్ని తెలుగు చానల్స్ లో నేరాలు - ఘోరాలు అంటూ  నేరాల వార్తలు చూపుతున్నారు . ఓసారి కాస్త వెరైటిగా మన తెలుగు చానల్స్ యజమానుల నేరాల గురించి చూపితే ఎలా ఉంటుంది. ఒకరి ఇద్దరూ అని కాదు చాలామంది అనేక కేసులు ఎదుర్కొంటున్నారు .
కొత్త సంవత్సరంలో మరిన్ని కొత్త చానల్స్ వెలుగు చూడనున్నాయి. ఇప్పటి కున్న చానల్స్ సరిపోవనా? అంటే ఎవరి అవసరం వారిది. ఆర్థిక సంస్కరణల తరువాత సంపద పెరగడంతో పాటు చానల్స్ ఏర్పాటు చేయడానికి అవసరమైన వ్యయం కూడా తగ్గిపోవడం వల్ల సాధారణ స్థాయిలోనే చానల్ ప్రారంభించడానికి అవకాశం ఏర్పడింది. చానల్స్ మధ్యృ పోటీ వల్ల నష్టాలు ఎన్నున్నా, ప్రయోజనాలు సైతం ఉన్నాయి. ఒకటి రెండు చానల్స్ మాత్రమే ఉన్నప్పుడు ఏదో ఒక పార్టీకి కొమ్ముకాస్తూ, తాము చెప్పినట్టుగానే ఆలోచించాలి అనే ధోరణి ఉండేది. ఇప్పుడు మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అనే సామెత మాదిరిగా చానల్స్ సంఖ్య పెరిగినప్పటికీ సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లభించడానికి అవకాశం ఉంటోంది. ఇప్పటికీ అన్ని వర్గాలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం లభిస్తోందని చెప్పలేం కానీ గతంలో కన్నా మెరుగు.
త్వరలోనే ఎంపి వివేక్ చానల్ వస్తోంది. చిరంజీవి సైతం సొంత చానల్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. అదే వర్గం నుండి ఒక సీడ్స్ కంపెనీ వారు కొత్త చానల్ ఏర్పాటులో ఉన్నారు.
వీరంతా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికో, సుపరిపాలన కోసమో చానల్స్ పెడుతున్నారనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇప్పుడు రాజకీయాల్లో ఎదగాలంటే సొంత చానల్ తప్పనిసరి.
టైమ్స్ నౌలో ఒక వార్తా కథనాన్ని ప్రసారం చేస్తూ పొరపాటున ఒక న్యాయవాది ఫొటో చూపించారు. ఒకరి ఫోటోకు బదులు మరొకరి ఫోటో పొరపాటున వచ్చింది. పొరపాటు జరిగిందని పలుమార్లు చానల్ ప్రకటించింది. దీనిపై కోర్టుకు వెళితే వంద కోట్ల రూపాయలు చెల్లించాలని తీర్పు రావడం మీడియా రంగాన్ని విస్మయ పరుస్తోంది. పొరపాటున వచ్చిన దానికే ఇలా వంద కోట్ల జరిమానా? అయితే ఉద్దేశ పూర్వకంగా మన తెలుగు నాట పార్టీల వార్‌లో భాగంగా ప్రత్యర్థులపై మన చానల్స్ ప్రసారం చేస్తున్న కథనాలకు ఎన్నివేల కోట్లు చెల్లించాలో? ఒక రకంగా మన తెలుగు చానల్స్ దీన్ని అవమాన కరంగానే భావించాలి. సొంత పార్టీ మేలు కోసం ప్రత్యర్థి పార్టీపై వ్యతిరేకతతో మన వాళ్లు ప్రసారం చేస్తున్న కథనాలను ఎవరూ పట్టించుకోవడం లేదు, పట్టించుకోవడం లేదేమో అనిపిస్తోంది.
స్వాతంత్య్ర పోరాట కాలంలో ఎంతో మంది మీడియా పెద్దలు జైలు జీవితం అనుభవించారు. జైలు నుండి కూడా పత్రికల ద్వారా స్వాతంత్య్ర కాంక్షను రగిలించారు. అప్పటి మీడియా పెద్దలే కాదు ఇప్పటి మీడియా పెద్దలు సైతం కేసులు ఎదుర్కొంటున్నారు, జైలుకు వెళుతున్నారు. అయితే వారిది స్వాతంత్య్రం కోసం పోరాటం జరిపి జైలు పాలైతే, వీరు మాత్రం ఆర్థిక వ్యవహారాల్లో, నేరాల్లో కేసులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఎసిబి చేతిలో పట్టుబడిన పోలీసు అధికారి సర్వేశ్వరరెడ్డి ఒక చానల్స్ ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకున్నారు అని మీడియాలో ఒక వార్త. హమ్మయ్య చివరకు అవినీతి పరులు కూడా చానల్ పెట్టబోయారా? సర్వేశ్వరరెడ్డి ప్రమాదం తృటిలో మనకు తప్పిపోయింది అని సంబరపడిపోవలసిన అవసరం లేదు అంత కన్నా భారీ నేరాలకు పాల్పడిన వారి చేతిలో ఇప్పుడు చానల్స్ ఉన్నాయి, రాబోతున్నాయి, తృటిలో ఆగిపోయాయి. ఒక మీడియా మొఘల్ సిబిఐ కేసు ఎదుర్కొంటున్నారు. చానల్ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న మరొకరు ఒక కేసులో జైలు పాలయ్యారు. ఇక వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాళేశ్వరస్వామి గురించి ఒక చానల్‌లో విస్తృతంగా ప్రచారం సాగుతుంటుంది. సాధారణంగా చానల్స్‌లో బాబాలకు వ్యతిరేకంగా ప్రచారం సాగుతుంటుంది. కానీ కాళేశ్వరస్వామి గురించి మాత్రం ఓ చానల్‌లో మహిమాన్వితుడు అనే ప్రచారం జరుగుతుంది. కొన్ని వందల కోట్ల రూపాయల పెట్టుబడులను ఒక స్వామి పెనుగొండకు తీసుకురావడంలో కీలక పాత్ర వహిస్తున్నారని ఆ చానల్ విస్తృతంగా ప్రచారం సాగిస్తోంది. సాధారణంగా ముఖ్యమంత్రులు తమ పాలనతో పెట్టుబడి దారులను ఆకట్టుకున్నామని, పెట్టుబడులతో వారు రాష్ట్రంలోకి దిగిపోతున్నారని ప్రచారం చేసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం స్వామి పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్టు ప్రచారం సాగడం విశేషం. ముల్లును ముల్లుతోనే తీయాలని ఆ మధ్య మీడియా ద్వారా బాధలు అనుభవించిన ఓ స్వామి మీడియాలో పెట్టుబడుల ద్వారా తన స్థావరాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. ఇటీవల ఒక నాయకుడి వ్యవహారాన్ని ఒక చానల్ బయటపెడితే, ఆ చానల్ వారి వ్యవహారాన్ని ఆ నాయకుడు బయటపెట్టాడు.

 ఆ మధ్య చీరాల కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చానల్స్‌లో కొన్ని వార్తలు వస్తే, ఒక్కో చానల్స్ వ్యవహారం ఇదీ అంటూ అతను లైవ్‌లో వివరించే సరికి అంతా అవాక్కయ్యారు. లైవ్‌ను నిలిపివేసి రాయబారాలు నడిపించారు. ఏదైనా చానల్‌లో ఓ నాయకుడికి వ్యతిరేకంగా వార్తలు వస్తే మీ చానల్ వ్యవహారం ఇదీ అంటూ నాయకులు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. న్యూస్ చానల్స్ హడావుడి లేకముందు ఇలాంటి వాతావరణం తక్కువ.
చిరంజీవి రాజకీయాల్లో విఫలమయ్యాక ఎందుకిలా జరిగిందని సమీక్షించుకున్నారు. సొంత చానల్ లేకపోవడం వల్లనే ఇలా జరిగింది తేల్చారు. 2014 ఎన్నికల నాటికి చేతిలో ఒక సొంత చానల్ ఉండే విధంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ నిలబడాలన్నా, ఒక నాయకుడు ఎదగాలన్నా చేతిలో ఒక చానల్ తప్పనిసరి అని బలంగా వినిపిస్తున్న వాదన. దేవేందర్‌గౌడ్ సైతం ఇదే కారణంతో విఫలమయ్యారని, ముందు చానల్ పెట్టి తరువాత ఆయన పార్టీ పెట్టి ఉంటే విజయం సాధించి ఉండేవారని ఆయన శ్రేయోభిలాషులు చెబుతుంటారు.
కొత్త చానల్ ప్రారంభించడానికి ఎన్నో ఆంక్షలు విధిస్తున్నప్పటికీ సంపద పెరగడం వల్ల చానల్స్ సంఖ్య రోజు రోజుకు పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. కొత్త ఏడాదిలో మరిన్ని కొత్త చానల్స్ దర్శన మివ్వబోతున్నాయి. రాసిలోనే తప్ప వాసిలో చానల్స్‌పై మనం పెద్దగా ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదు. చానల్స్ కొత్తవి కావచ్చు కానీ ఒరవడిలో కొత్తదనం ఆశించలేం.

25, నవంబర్ 2011, శుక్రవారం

రాజకీయ నాయకుడిని చెంపదెబ్బ కొడితే భారత రత్న ఇవ్వాలా ?


ఎక్కడికెళ్తున్నాం?

ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. అవినీతిని, అధిక ధరలను సహించలేక పోతున్నారు. ఇది మంచి పరిణామమే. నేటి యువత తమ కెరీర్, సంపాదనపై సమాజంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఇలాంటి సమయంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలపై ఒక యువకుడు తీవ్ర స్థాయిలో స్పందించాడు. ఎంత తీవ్ర స్థాయిలో అంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌ను చెంపదెబ్బ కొట్టేంత తీవ్ర స్థాయిలో. ఢిల్లీలో గురువారం సిక్కు యువకుడు హర్విందర్‌సింగ్ చెంపదెబ్బ కొట్టాడు. ఇది ఆహ్వానించదగిన పరిణామమా? ముమ్మాటికీ కానే కాదు. కానీ శరద్ పవార్‌ను కొట్టిన సంఘటన కన్నా తీవ్రమైన విషయం యాహూ వెబ్‌సైట్‌లో కనిపించింది. యాహూ సైట్‌లో హర్విందర్‌సింగ్ మంత్రిని చెంపదెబ్బ కొడుతున్న దృశ్యాన్ని పెట్టారు. గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయానికి యాహూలోని ఈ దృశ్యంపై 1118 మంది స్పందించారు. విచిత్రమైన విషయం ఏమంటే యాహూలో స్పందించిన మొత్తం 1118 మంది ఆ యువకుడి చర్యను సమర్ధించారు. ఇంకా విచిత్రమైన విషయం ఏమంటే అతనికి భారత రత్న ఇవ్వాలని మొత్తం 20 మంది సూచించారు. రాజకీయ నాయకులంతా దొంగలే, వారికి ఇలాంటి శిక్ష తప్పదు. మీ కుటుంబం గురించే కాదు సమాజం గురించి పట్టించుకోండి. ఒక్క చెంపదెబ్బతోనే సరిపెట్టావేం హర్విందర్ ... మీ వెంట భారత యువత ఉంది . ముందుకు వెళ్లు .. ఇది ఆరంభం మాత్రమే.. హర్విందర్ చర్యకు మా సంపూర్ణ మద్దతు .... యాహూ స్పందనల్లోని కొన్ని వాఖ్యలివి. ఈ చర్యను దేశంలోని అన్ని రాజకీయ పక్షాల నాయకులు ఖండించగా, వెబ్‌సైట్స్, సోషల్ సైట్స్‌లో మాత్రం యువత ఈ చర్యను సమర్ధించింది. చివరకు అతనికి భారత రత్న అవార్డు బహూకరించాలని డిమాండ్ చేసేంత వరకు వెళ్లారు. యాహూలో స్పందించిన వారిలో ఎక్కువగా యువత ఉంది. వృద్ధులు కూడా కొద్ది మంది ఉన్నప్పటికీ యువతనే ఎక్కువగా ఉంది. మహిళలు కూడా కొద్ది సంఖ్యలో ఉన్నారు. 1118 స్పందనల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా ఆ యువకుడి చర్యను ఖండిస్తూ లేదు. భారత రత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్‌ను సమర్దిస్తూ పోటీ పడ్డారు. దేశంలోని రాజకీయ నాయకులంతా ఇలాంటి వారే వారికీ శిక్ష అవసరం అనే నినాదాలు రాశారు. మరి రాజకీయ నాయకులందరినీ వ్యతిరేకిస్తూ, వారిని వద్దని మనం ఏ పాలన కోరుకుందాం. సైనిక పాలన కోరుకుందామా? ఇలాంటి నాయకుల కన్నా సైనిక పాలనే మేలు అని వాదించే యువత సైతం లేకపోలేదు. కొన్ని ఇస్లామిక్ రాజ్యాల్లో విప్లవాల ద్వారా నియంతృత్వాన్ని అంతమొందించాక, సైనిక పాలన వస్తే వారిని కొన్నినెలలు కూడా భరించలేకపోతున్నారు.
సైనిక పాలన స్థానంలో ప్రజా స్వామ్యం కోసం ఇస్లామిక్ రాజ్యాల్లో ప్రజలు ఉద్యమిస్తుంటే మనం మళ్లీ ప్రజాస్వామ్యాన్ని వద్దనుకుని ఎలాంటి పాలన కోరుకుంటున్నాం? గురువారం ఢిల్లీలో జరిగిన పరిణామం అటు రాజకీయ వ్యవస్థకు మంచిది కాదు, దేశంలో అసహనంతో విసిగివేసారి పోయిన యువతకు మంచిది కాదు. అవినీతిని ముమ్మాటికి వ్యతిరేకించాల్సిందే!కానీ రాజకీయ నాయకులను కొడితే ధరలు తగ్గుతాయా? ఇదే సమయంలో రాజకీయ వ్యవస్థ సైతం తమను తాము సంస్కరించుకోవాలి. ఎలా పాలించినా ప్రజలకు ఐతే కాంగ్రెస్, లేదంటే బిజెపి మాత్రమే శరణ్యం కాబట్టి చచ్చినట్టు ఎన్నుకొని తీరుతారు అనే ధీమా మంచిది కాదు. శరద్ పవార్‌ను కొట్టిన యువకుడే సుఖరామ్‌పై రెండు రోజుల క్రితమే దాడి చేశాడు. అతని మానసిక స్థితి అనుమానం కలిగిస్తోంది. ఇలాంటి చర్యలను నాగరికులు ఎవరైనా ఖండించాల్సిందే. భారత రత్న ఇవ్వాలని కోరడం, చర్యను సమర్ధించడం తగదు.

  • శరద్ పవర్ ను చెంప దెబ్బ కొట్టిన హర్విందర్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని చెబుతూ కొందరు యాహూ లో రాసిన కామెంట్స్ 
  • sathiyaseelan
    Sathiyaseelan Yesterday
    A very good news to all indians. We shouldn't stop with him alone. We should continue to slap Mr.P.Chithambaram, Mr.Manmohan singh, Mrs.Sonia ji, Mr.Rahul Gandhi. Ms,Mayawathi, Mr.Pranab mukharjee, Ms.Jeyalalitha, Mr.Lallu prasad yadhav etc. Since they are ruining our country. My support to you..

24, నవంబర్ 2011, గురువారం

నానాజాతి సమితి .... ఆరుబయలు జైలులో గాలి... కనిమొళి.. రాజ .. బాబు...జగన్ ,అమర్ సింగ్ ... జయప్రద


గాలి ఓ కొండను పరీక్షగా చూస్తూ, కొండలను తవ్వేశామనే జైలుకు పంపారు, జైలులో కొండలను తవ్వనిస్తారా? అని కొంత నిరాశ చెందాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, కాలం మారుతుంది ప్రభుత్వం మారుతుంది. కొండ ఎక్కడికీ పొదు అనుకుని చేతిలోని గరుడ పురాణం చదవడంలో లీనమయ్యాడు. జగన్ ఎవరి కోసమో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.‘‘ ఏంటి జగన్ దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్, ఇంటికి పై కప్పు దేంతో వేద్దామని ఆలోచిస్తున్నావా?’’ అని పక్కనున్న వారు జోకేశారు.

 ‘‘ఎవరో ఒకరిని ఓదార్చకపోతే చేతులు వణుకుతున్నాయి. డాక్టర్‌ను కలిస్తే చాలా కాలం నుండి ఓదార్చడం అలవాటైంది కాబట్టి ఓదార్పు లేకపోతే కష్టమే అన్నారు. రోజుకో డజను మందినైనా చంపలు నిమిరి తలపై చేయి వేసి ఓదార్చకపోతే నిద్ర రాదు అంటూ జగన్ మాట్లాడుతుండగానే, ఓదార్చడానికి రెండు చేతులు వాటంతట అవే ముందుకు వచ్చాయి. దాంతో ఆ వ్యక్తి అక్కడి నుండి వేగంగా పరుగు తీశాడు.


మరో వైపు బాబు సూర్య నమస్కారాలు చేస్తూ దేవుడా ఓ మంచి దేవుడా! మా రాష్ట్రంలో తొమ్మిది శాతం గ్రోత్‌రేట్ వచ్చేట్టు చూడు. ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేట్టు చూడు. రైతులకు గిట్టుబాటు ధర లభించేట్టు, వ్యవసాయం లాభసాటిగా అయేట్టు, ఎస్సీ, బిసి, మైనారిటీ, + 98 కులాలకు మేలు జరిగేట్టు చూడు అంటూ అందరికీ వినబడేట్టు గట్టిగా మొక్కాడు. మనసులో మాత్రం మెల్లగా ఓ మంచి దేవుడా నన్ను మళ్లీ అధికారంలో కూర్చోబెట్టు అధికార విరహాన్ని తట్టుకోలేక పోతున్నాను. ఇప్పటికే అధికార రహితంగా ఏడేళ్ల జీవితాన్ని గడిపాను. జీవితంలో నిన్ను ఇంకేమీ కోరను మళ్లీ ఒక్కసారి ముఖ్యమంత్రిని చేయి అని మొక్కుకున్నాడు. మా తమిళులను ఓవర్ యాక్షన్ అని తిట్టుకుంటారు కానీ మీ తెలుగువారిలో ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువండి అంటూ అప్పటి వరకు దూరంగా ఉండి అందరినీ గమనిస్తున్న రాజా వీరి దగ్గరకు వచ్చాడు.
 చెప్పేవి శ్రీరంగనీతులు... దూరేవి... ఏవో అన్నట్టు నానా గడ్డితిని మనం ఇక్కడ జైలుకు వచ్చాం. ఇక్కడైనా సహజంగా ఉండొచ్చు కదా? ఇక్కడెందుకు ఓవర్ యాక్షన్ అని రాజా చిరాకుపడ్డాడు. బాబుగారూ మీది మరీ మితిమీరిన ఓవర్ యాక్షనండి ఇదేమన్నా ఎన్నికల బహిరంగ సభనా? ఇక్కడున్నవారంతా నీలాంటి వారే కదా? ఓటర్ల ముందు చెప్పే మాటలు ఇక్కడ ఎందుకు? అని రాజా అసహనంగా పలికాడు. తమిళనాడు పక్కనే కదా, మీ తమిళుల ఓవర్ యాక్షన్ చిత్తూరు వారికి బాగానే అంటినట్టుంది అని బాబు, గాలి.. వైపు చూస్తూ జగన్ నవ్వాడు. తమరేదో బుద్ధిమంతులైనట్టు అంటూ కనిమొళి జగన్‌ను చూస్తూ ముందుకు వచ్చి వారితో మాటలు కలిపింది.
 ఓవర్ యాక్షన్‌లో తమిళ, తెలుగు ప్రాంతీయ బేధాలు ఎందుకు? అని ఒక గొంతు వినబడింది. మాసిన గడ్డంతో శాలువా కప్పుకున్న కొత్త వ్యక్తి ఎవరో కనిపించారు. అప్పటి వరకు అక్కడున్న వారంతా ఆ కొత్త శాల్తీని చిరాగ్గా చూశారు. హలో మిస్టర్ ఇది విఐపిల ఆరుబయలు జైలు. ఎక్కడికెళ్లాల్సిన వారో ఇక్కడికొచ్చినట్టుంది అని చిరాకు పడ్డారు. ఎల్‌ఐసిలో కోట్ల రూపాయల పాలసీలు చేయించే ఏజెంట్లకు ప్రత్యేకంగా మిలియనీర్స్ క్లబ్ లా రాజకీయాల్లో వందల కోట్లు,వేల కోట్లరూపాయల కుంభకోణాలకు పాల్పడిన వారికి ఆరుబయలు జైలులో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. అక్కడికి సాధారణ వ్యక్తి రావడంతో తమ హోదాను తగ్గించి అవమాన పరిచినట్టుగా వారు భావించి, ఎవరు మీరు? అని కోపంగా అడిగారు. అతను సమాధానం చెప్పకముందే జయప్రద పరిగెత్తుకుంటూ వచ్చి ఆగండాగండి ఎవరనుకుంటున్నారు? 
అని పూర్తి చేయకముందే, జయప్రదను చూడగానే ఆయన అమర్‌సింగ్ అని గుర్తు పట్టారు. ఎలాంటి వారు ఎలా ఐపోయారని అంతా సానుభూతి చూపారు. జగన్ పరిగెత్తుకొచ్చి అమర్‌సింగ్ చెంపలను రెండు చేతులతో నిమిరి ఓదార్చి సంతృప్తి చెందాడు. ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన అమర్‌సింగ్ మాసిన గడ్డంతో యుద్ధంలో చిత్తుగా ఓడిపోయి శత్రు సైనికుల చేతికి చిక్కిన సిపాయిగా కనిపిస్తున్నారు. ఒకరి బాధలు ఒకరు చెప్పుకొని ఆవేదన చెందారు. ఆయనెవరో విజయమాల్యా రోజూ ముద్దుగుమ్మలతో గడుపుతూ వ్యాపారంలో నిండా మునిగి సహాయం కోసం ప్రభుత్వ తలుపు తట్టారు. మరి మనం చేసింది కూడా వ్యాపారమే కదా? రాజకీయ వ్యాపారంలో కోట్ల కొద్దీ పెట్టుబడులు పెట్టి తిరిగి రాబట్టుకోవడానికి నానా గడ్డి కరవాల్సి వస్తుంది. పట్టుపడితే అవినీతి పరులు అని ముద్ర వేసి జైలుకు పంపుతున్నారు. 
పెట్టుబడి పెట్టేది మనం, నష్టపోయేది మనం, వ్యాపారంలో రిస్క్ ఎంత ఎక్కువ ఉంటే లాభం అంత ఉంటుంది. నష్టపోయిన వ్యాపారులను జైలుకు పంపనప్పుడు మనల్ని పంపడం ధర్మమా?అని ఎవరో గట్టిగా నిలదీశారు. మనలో ఐక్యత లేకపోవడం వల్లనే ఇలా జరుగుంది. అన్ని వ్యాపారాల వారికి సంఘాలున్నప్పుడు రాజకీయ వ్యాపారులకు ఎందుకు ఉండకూడదు అని ప్రశ్ని వినిపించింది. పొలిటికల్ లీడర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. తుమ్ సంఘర్ష కరో హమ్ తుమర్హా సాత్ హై అంటూ మాయావతి వారికి మద్దతు పలికింది. ఆ వెంటనే పురుచ్చితలైవి జిందాబాద్ అనే నినాదాలు వినిపించాయి. తరువాత ఒక పెద్ద మేఘం అక్కడ వాలినట్టుగా జయలలిత వాలిపోయారు. ఇప్పటికైనా మనలో ఐక్యత రావాలి డిఎంకె వాళ్లు తప్ప ఈ ఫెడరేషన్‌లో ఎవరున్నా మాకు అభ్యంతరం లేదు అని జయ పలికింది. ఎన్‌డిఏ, యుపిఏ యేతర పక్షాలతో మూడో ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని బాబు ఆలోచిస్తున్నాడు.
***
ములాఖత్ సమయంలో బంగారు లక్ష్మణ్ వచ్చి వారందరినీ చూసి వావ్ అంటు భోరున విలపించాడు. ఏమైంది అంటూ అంతా కంగారు పడ్డారు. దేశాన్ని ఏలే పార్టీకి అధ్యక్షుడిగా ఉండి నేను లక్ష రూపాయలకే పట్టుబడి శిక్ష అనుభవించాను, మీ అవినీతి చరిత్ర చూశాక నామీద నాకు జాలి కలిగింది... జాలి దుఃఖంగా మారింది... దుఃఖం నుండి నిర్వేదంలోకి.. ఈ జీవితం వృధా అనిపిస్తోంది అంటూ బంగారు లక్ష్మణ్ తన తలను గేటు తలుపులకు తలను దన్... దన్ ... మని కొట్టుకుంటున్నాడు.
***
అబ్బా అప్పుడే తెల్లవారిందా?బంగారం లాంటి కల.

22, నవంబర్ 2011, మంగళవారం

మల్లయ్య... విజయమాల్యా...విలాస పురుషుడికి చానల్స్ నీతులు

నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నే నెరిగి పోతే,
నిబిడాశ్చర్యంతో వీరు-
నెత్తురు క్రక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరె...


మల్లయ్య అనే పేరు వినగానే మీకేం గుర్తుకు వస్తుంది. ఒక పల్లెటూరి సాధారణ వ్యక్తి అనిపిస్తుంది కదూ! మరి మాల్యా అనే పేరు వింటే ఎంత ఆధునికంగా ఉందీ పేరు ఆ పేరు వినగానే అందమైన ముద్దుగుమ్మల మధ్య వెలిగిపోయే ఆధునికుడు గుర్తుకు వచ్చి తీరుతాడు. నిజానికి ఆ రెండు పేర్లు ఒకరివే. మల్లయ్య అనే గ్రామీణ పేరును ఆయన స్టైల్‌గా మాల్యా అని మార్చుకున్నారు అంతే ఇది విజయమాల్యాలోని రెండు కోణాలకు ఉదాహరణ. ఈ వారమంతా తెలుగులో అట్టడుగు స్థానంలో ఉన్న స్టూడియో ఎన్ మొదలుకొని హిందీ, ఇంగ్లీష్ భాషల్లో టాప్‌లో ఉన్న చానల్స్ వరకు పలు చానల్స్ విజయమాల్యాపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి.

 ఒక వ్యక్తి అత్యున్నత శిఖరాలను అధిరోహించినప్పుడు, కీర్తి ప్రతిష్టలు గడించినప్పుడు అతన్ని అభినందించడానికి తహతహలాడినా ఎక్కడో ఒక మూల అతని స్థితిపై అసూయ ఉండడం మానవ నైజం. అత్యున్నత స్థితిలో ఉన్న ఆ వ్యక్తి జారి కింద పడితే మన ఇగో సంతృప్తి చెందుతుంది. మనం అతనిలా ఎదగలేకపోయామే అనే అసంతృప్తి నుండి మనం బయటపడతాం. అందుకే శిఖరంపై ఉన్నవారిని చూసి అభినందించే మనమే శిఖరం నుండి జారి పడిన తరువాత వీడు ఇలాంటి వాడు అని నేను ఎప్పుడో అనుకున్నాను అని చెప్పడానికి తహతహలాడతాం. అందుకే శ్రీశ్రీ పై కవిత చెప్పారు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిరిపోతే ఆశ్చర్యపోయిన వారే నేలకు రాలినప్పుడు నిర్దాక్షిణ్యంగా ఉంటారు.
విజయమాల్యా దృశ్య ప్రధానమైన వార్త. బిజినెస్ అనేది కంటికి అందంగా కనిపించే దృశ్యం కాదు. బిజినెస్ చానల్స్‌లోనైనా, న్యూస్ చానల్స్‌లోనైనా బిజినెస్ వార్తలు ఎక్కువగా అంకెల రూపంలోనే ఉంటాయి. ఒక వ్యక్తి వ్యాపారంలో ఎదిగినా పతనం అయినా వార్తలన్నీ అంకెల రూపంలో ఉంటాయి. అందుకే అవి పెద్దగా ఆసక్తి కలిగించవు. కానీ విజయమాల్యా వ్యాపారం దృశ్య రూపంలో కనిపిస్తారు. అలాంటిలాంటి దృశ్య రూపం కాదు కంటికి ఇంపైన దృశ్య రూపం. అందుకే విజయమాల్యా కింగ్ ఫిషర్ విమానయాన సంస్థ నష్టాల్లో ఉందని, ప్రభుత్వం నుండి సహాయం కోరిందనే విషయం తెలియగానే న్యూస్ చానల్స్ విజృంభించాయి. విజయ మాల్యా విలాస వంతమైన జీవితమే ఈ పరిస్థితికి కారణమని తేల్చి చెప్పాయి. మద్యం వ్యాపారం సాగించే యుబి గ్రూప్ ఏటేటా అందమైన అమ్మాయిల అర్ధనగ్న క్యాలండర్‌లను ముద్రిస్తుంది. ఈ క్యాలండర్‌లపై దేశంలో మహా క్రేజ్. ప్రధానంగా ఇంగ్లీష్ చానల్స్ అన్నీ ఈ క్యాలండర్ ముద్రణపై నెలల తరబడి ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తాయి. క్యాలండర్ కోసం అమ్మాయిలు అందాలను ఆరబోస్తుంటే చానల్స్ వాటిని చూపించి తరించేవి. విలాసవంతమైన జీవితాన్ని గడపడం ద్వారానే మాల్యా కింగ్ ఫిషర్‌ను నష్టాల బాట పట్టించాడని తేల్చి పారేసిన చానల్స్ అతను విలాసవంతంగా జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఎప్పుడైనా ఒక్కసారైనా అది తప్పని చెప్పారా? మోడల్స్ కోసం మాల్యా ఖర్చు చేస్తే ఉత్తి పుణ్యానికి వారి అందాలను తమ చానల్స్‌లో చూపిస్తున్నామని మురిసిపోయి కవిత్వాన్ని కలిపి ఆ అందాలను చూపించారు కానీ ఒక్కసారైనా, ఒక పారిశ్రామిక వేత్త అర్ధనగ్నంగా ఉన్న అందగత్తెలతో ఇలా ఫోజులివ్వడం ఏమిటని విమర్శించారా?
పతనం అయ్యాడనుకుని ఇప్పుడు అన్ని చానల్స్ అతనికి నీతులు చెబుతున్నాయి. రాజకీయ నాయకులు సైతం టీవిల్లో అలాంటి విమర్శలే చేశారు. ప్రభుత్వం సహాయం చేయాల్సిన అవసరం లేదు, ఆతను విచ్చలవిడిగా జీవితాన్ని గడిపి నష్టం వస్తే ప్రభుత్వ సహాయం ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఒకవేళ విజయమాల్యా విలాసవంతమైన జీవితం గడపడం తప్పు అని మీడియా భావిస్తే, అలాంటి జీవితం గడుపుతున్నప్పుడు నిలదీయాల్సిన బాధ్యత మీడియాకు లేదా? మరి ఆ పని ఎందుకు చేయనట్టు.
నిజానికి అతని విలాసవంతమైన జీవితానికి, కింగ్ ఫిషర్ దెబ్బతినడానికి ఎలాంటి సంబంధం లేదు. సహజమైన ఈర్ష్యతో అలాంటి విమర్శలు సహజమే. దాదాపుగా విమానయాన సంస్థలన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. ఇండియన్ ఎయిర్‌లెన్స్ పీకలోతు నష్టాల్లో కూరుకుపోయింది. మరి ఎవరి విలాసవంతమైన జీవితం వల్ల ఇండియన్ ఎయిర్‌లైన్స్ నష్టాల్లో ఉంది. వాటి నష్టాలకు, విలాస జీవితానికి సంబంధం లేదు.
1984లో విజయ మాల్యా యునైటెడ్ బ్రేవరీస్ గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుండి యుబి గ్రూప్ దూకుడుకు ఎదురే లేదు. తొలి 15 ఏళ్ల కాలంలో 63.9 శాతం గ్రోత్‌రేట్ ఉందంటే మాల్యా వ్యాపార సామర్థ్యం అర్థమవుతుంది. ప్రపంచంలో మద్యం ఉత్పత్తి దారుల్లో అతని సంస్థ రెండో స్థానంలో ఉంది. అతను విలాసవంతమైన జీవితం గడిపిందే యుబి గ్రూప్ చైర్మన్‌గా. దాదాపు మూడు దశాబ్దాల నుండి అతను యూబి చైర్మన్‌గా విలాసవంతమైన జీవితానే్న గడుపుతున్నారు. అందమైన అమ్మాయిలతో ఫోటోలు దిగడం, డ్యాన్స్ చేయడం, మొహమాటం లేకుండా మద్యం తాగుతున్నట్టు ఫోజులు ఇవ్వడం అతనికి అలవాటే. అవే దృశ్యాలను ఇప్పుడు టీవిల్లో చూపుతున్నారు. అతను చేసేదే మద్యం వ్యాపారం అయినప్పుడు మద్యం తాగడం తప్పు అన్నట్టు ఉండాల్సిన అవసరం అతనికెందుకు? 2006లో కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రారంభించారు. విమానయాన వ్యాపారంలో దెబ్బతిన్నారు. దానికి నిబంధనలే కారణమంటారు. విమానయాన వ్యాపారంలో ఒడిదుడుకుల గురించి చానల్స్ కథనాలు ప్రసారం చేస్తే బాగుండేది కానీ అలా కాకుండా అతను విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు అంటూ మోడల్స్‌తో కలిసున్న దృశ్యాలు చూపి హడావుడి చేశారు. వడ్డీ రాయితీ వంటి సహాయాన్ని మాల్యా కోరితే కొందరు పారిశ్రామిక వేత్తలు స్పందన చిత్రంగానే ఉంది. పేదవాడికి ఉచిత విద్యుత్, రెండు రూపాయల కిలో బియ్యం ఇవ్వడాన్ని సైతం తప్పు పట్టే కొందరు, పారిశ్రామిక వేత్తలకు మాత్రం వేలకోట్ల రాయితీలు ఇచ్చి తీరాల్సిందేనంటూ వాదించడం చిత్రంగానే ఉంది.
తండ్రి నుండి దూరంగా సాధారణ జీవితం గడిపిన మాల్యా తండ్రికి చేరువై తండ్రి నిర్మించిన మద్యం రాజ్యాన్ని మహా సామ్రాజ్యంగా విస్తరించాడు. అతని జీవితం ఒక సక్సెస్ సినిమా ఫార్ములాకు ఏ మాత్రం తక్కువ కాదు. కింద పడినా తిరిగి కోలుకునే శక్తి అతనికుంది. ఇక విలాస వంతమైన జీవితం గడపడం అవసరమా? నిర్ణయించుకోవలసింది అతనే... చానల్స్ కాదు...
ఐశ్వర్య ప్రసవం
అమితాబ్ తాతయ్యారు. సినిమా వాళ్ల పెళ్లి అంటే చానల్స్ హడావుడి అంతా ఇంతా కాదు. హీరోయిన్లు గర్భవతి అయితే, ప్రసవవేదన చానల్స్ పడతాయి. హీరోలు, హీరోయిన్లు, సినిమా వాళ్లు, రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు. వాళ్లూ మనుషులే ... వాళ్లకూ వ్యక్తిగత జీవితం ఉంటుంది. కానీ ఎందుకో చానల్స్ ఈ విషయాన్ని అంగీకరించడానికి ఇష్టపడవు. సినిమా వాళ్ల పెళ్లి అంటే వాళ్ల అభిమానుల్లో సహజంగా ఆసక్తి ఉంటుంది. చానల్స్ మధ్య పోటీ ఉంటుంది. ఒక చానల్ ప్రసారం చేస్తే మేం ఎక్కడ మిస్సవుతామో అని పోటీపడతారు. దాంతో వాళ్లు పెళ్లికి పిలిచినా పిలవకపోయినా చానల్స్ హడావుడి చేస్తాయి. చివరకు మా పెళ్లికి దయచేసి మీరు రావద్దు అని ముందుగానే తిరస్కార పత్రం( ఆహ్వానపత్రానికి వ్యతిరేకం) ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అలా చేసినా మిగిలిన వారి విషయంలో పెద్దగా పట్టించుకోలేదు కానీ అమితాబ్‌కున్న పలుకుబడి వల్ల జాతీయ చానల్స్ సంయమనం పాటించాయి. చానల్స్ వాళ్లు ముందుగానే స్వయం నియంత్రణ విధించుకుని ఆస్పత్రిని చూపవద్దు, ఐశ్వర్య రాయ్ ప్రసవానికి సంబంధించి వారిచ్చిన క్లిప్పింగ్స్ తప్ప ఎలాంటివి ప్రసారం చేయవద్దని ఆంక్షలు విధించడం బాగానే పని చేసింది. అయితే కొన్ని తెలుగు చానల్స్‌లో మాత్రం అప్పుడే పుట్టిన శిశువు జాతకాన్ని చెప్పేశాయి, ఏ పేరు పెట్టాలి, మొదటి అక్షరం ఏముండాలో తెలుగు చానల్స్‌లో తెలుగు జోస్యులు తేల్చి చెప్పారు. హిందీ, ఇంగ్లీష్ చానల్స్ ఆంక్షలను పాటిస్తే తెలుగు చానల్స్ కొద్దిపాటి హడావుడి చేసినా సోషల్ సైట్స్‌లో మాత్రం కొందరు ఐష్ శిశువుకు జన్మనివ్వడంపై అనాగరికమైన కుళ్లు జోకులు వేసుకున్నారు. అమితాబ్ లాంటి పలుకుబడి గల వ్యక్తుల కోసం చానల్స్ స్వీయ ఆంక్షలు విధించుకుంది. మరి ఈ నియమాలు అందరికీ వర్తించవా? అంత పలుకుబడి లేని హీరోయిన్ల గురించి ఇష్టం వచ్చినట్టు ప్రసారం చేయవచ్చు, వారి పెళ్లిలో పిలవకపోయినా వెళ్లి గందరగోళం చేయవచ్చు, అదే పలుకుబడి ఉన్నవారికైతే ఆంక్షలు విధిస్తారు. వ్యక్తులను బట్టి కాకుండా స్వీయ నియంత్రణ అందరి విషయంలోనూ చానల్స్‌కు అవసరం.

17, నవంబర్ 2011, గురువారం

అవినీతికి పెద్ద దిక్కు .... రాజకీయ వ్యంగ్యం***
ఎవడో సామాన్యుడు సీతను అనుమానిస్తే శ్రీరాముడు సీతమ్మను అడవుల్లో వదిలి రమ్మని లక్ష్మణుడిని ఆదేశించాడు. సినిమా లక్ష్మణుడు కాంతారావు మాత్రం ఏ నిమిషానికి ఏమిజరుగునో అని ఏడుస్తూ అడవి బాట పట్టాడు. తనను రాముడు అడవుల్లో వదలిరమ్మన్నాడనే మాట విన్నప్పుడు ఆ సీతమ్మ ఎలా రియాక్ట్ అయి ఉంటారు. భూమి బద్ధలు అయ్యే ఉంటుందా? వద్దంటే వనవాసానికి శ్రీరాముడితో పాటు వచ్చి అడవుల పాలై, తరువాత రావణుడి పుణ్యమా అని లంకలో అశోకవనంలో గడిపి నానా కష్టాలు పడి వస్తే చివరకు రాముడు చేసిన సత్కారం ఇదా? ఆ మాట విన్నాక భూమి బద్దలైందో లేదో కానీ లవకుశులు శ్రీరాముడి చెంత చేరిన తరువాత నిజంగానే భూమి బద్దలై సీతమ్మ తల్లి ఒడిలోకి చేరుతుంది. అప్పుడు శ్రీరాముడి గుండె బద్దలై ఉంటుంది. నిజమే మరి వినకూడని మాట విన్నప్పుడు, ఊహించనివి జరిగినప్పుడు భూమి బద్దలు కావడం, సముద్రం ఉప్పొంగడం జరిగి తీరాల్సిందే.
***
అలానే ఈరోజు భూమి బద్దలవుతుందనుకుంటే కాలేదు. స్కైలాబ్ భూమిపై పడి సర్వ నాశనం అవుతుందని ప్రపంచం అంతా భయంతో గజగజవణికినప్పుడు అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా సముద్రంలో పడి తుస్సుమంది. సినిమాల విషయంలోనూ ఇలానే జరుగుతుంది. షూటింగ్‌లో ఉన్న ప్రతి సినిమా విడుదల కాగానే భూమి బద్దలవుతుంది అన్నట్టుగా ప్రచారం సాగుతుంది. కానీ ఆ సినిమా ఎప్పుడొచ్చిందో, ఎప్పుడు పోయిందో తెలియకుండా ఉంటుంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలానే బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమా తీశారు. ఈ సినిమా దెబ్బతో ఓటు బాక్సులు బద్ధలవుతాయని అన్న నమ్మారు, కాంగ్రెస్ వాళ్లకు కూడా అదే భయం పట్టుకుంది. తీరా ఎన్నికల్లో అన్నగారు స్వయంగా ఓడిపోయారు, సినిమా విడుదలైంది బాక్స్ బద్దలు కాలేదు కానీ నిర్మాత నెత్తిన గుడ్డపడింది.
***
ఆ మాట వినగానే భూమి బద్ధలవుతుందేమో అనుకున్నా... బద్దలైన భూమిని చూద్దామని పరుగులు తీశా... కానీ అలా ఏమీ జరగలేదు. ఎక్కడ? ఏమిటి? అంటే?
***
బంజారాహిల్స్ పవిత్ర భూమి. దిగిపోయన ముఖ్యమంత్రులు, కాబోయే ముఖ్యమంత్రులు, సిఎంలం అయి తీరుతామని కలలు కనేవారు కొలువైన పుణ్యభూమి అది. ఎత్తయన భవనం. ఇక్కడ అన్నీ ఎత్తయిన భవనాలే. వాటన్నింటిలోకి ఎత్తయిన భవనం అది. ఆ భవనానికి ముందు భారీ హోర్డింగ్‌లు. ఆ హోర్డింగ్‌లకు ఎంత ఖర్చయింది? ఎవరు ఏర్పాటు చేశారు? ఎందుకు ఏర్పాటు చేశారు అనే రంధ్రానే్వషణ తగదు. హోర్డింగ్‌లోని నినాదాలకే మనం పరిమితం కావాలి. కళ్లముందున్న హోర్డింగ్ అందాన్ని చూడాలి కానీ ఖర్చు గురించి ఆలోచించవద్దు. ఎలాంటి వారైనా ఆ హోర్డింగ్ ముందు ఒకసారి నిలిచి తనివి తీరా చూసి ముచ్చట పడాల్సిందే. ఎడమ వైపు మహాత్మాగాంధీ. బానిస బ్రతుకు బతుకుతున్న భారతీయులను స్వాతంత్య్ర పోరాటం కోసం చైతన్య పరిచిన మహాత్ముడు. కుడివైపు అన్నా హజారే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆరు దశాబ్దాల తరువాత కూడా అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆవేదనతో అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నడుపుతున్న మహనీయుడు. వారిద్దరి బుల్లి ఫోటోల మధ్య వెలిగిపోతున్న నిలువెత్తు బాబు. భుజంపై జాతీయ పతాకం, అవినీతికి వ్యతిరేకంగా నిప్పులు కురిపిస్తున్న కళ్లు. భారత మాత చేతిలో జాతీయ పతాకాన్ని పట్టుకుంటే బాబు గారు ఈ దేశంలోని నీతి భారం మొత్తం తన భుజాలపై మోస్తున్నట్టుగా సింబాలిక్‌గా భుజంపై జెండాతో చూపరులను ఆకట్టుకుంటున్నారు. ఆ భవన దర్శకులు ఏనాటికైనా ఈ దేశానికి బాబుగారే శరణ్యం అనుకుంటారు. అక్కడి నుండే మంగళహారతులతో బాబుగారిని అవినీతి వ్యతిరేక ఉద్యమ యాత్రకు పంపిస్తారు.
అన్నా హజారే దీక్ష పేరుతో పరుపుపై కూర్చున్న సమయంలోనే ఇక్కడ 60ఏళ్ల వయసులో సైతం అలసిపోకుండా భుజంపై బరువైన జాతీయ పతాకాన్ని మోస్తూ ఆరుకిలోమీటర్లు నడిచి అవినీతి వ్యతిరేక మహోద్యమాన్ని నడిపిన నవ మహాత్ముడు. రాష్ట్రంలో అవినీతి వ్యతిరేక ఉద్యమానికి పెద్ద దిక్కు. మిత్రునితో కలిసి కాలేజీల చుట్టూ తిరుగుతూ విద్యార్థులకు అవినీతి వ్యతిరేక పాఠాలు చెబుతున్నారు. ఒకవైపు రాందేవ్ బాబాతో అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ఎంఓయు కుదుర్చుకుని రంగ ప్రవేశం చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇంతటి మహనీయుడిపై అవినీతి పిడుగు పడింది. మీ అబ్బాయి మా అబ్బాయిని కొట్టాడు అంటే మీ వాడేమన్నా తక్కువనా? అని ఇరుగుపొరుగు అమ్మలక్కలు తిట్టుకున్నట్టుగానే చినబాబు అవినీతి పరుడు అంటూ ఒకరు కోర్టుకు వెళితే, మా చినబాబు అవినీతిపరుడైతే, మీ పెదబాబు తక్కువ తిన్నాడా? రాజకీయాల్లోకి వచ్చాకే కదా పేదబాబుకాస్తా పెద్దబాబు అయింది, అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నాడు, తమ వర్గం వారికి దోచిపెట్టాడు అంటూ తల్లి విజయమ్మ కోర్టుకెళ్లారు. కోర్టేమో బాబుగారి వ్వహారాలపై విచారణ జరపమని సిబిఐని ఆదేశించింది. హజారే దీక్ష ప్రారంభించగానే తొలుత బాబు ఆ వెంటనే జగన్, తరువాత గాలి జనార్దన్‌రెడ్డి మద్దతు ప్రకటించారు. ఈ ముగ్గురిపై సిబిఐ విచారణ జరగడం అంతర్జాతీయ కుట్ర కాకుంటే మరేమిటి?
***
కోర్టు ఆ మాట చెప్పగానే భూమి ఎందుకు బద్ధలు కాలేదు? ప్రకృతి ఎందుకు స్పందించలేదు? లావా ఉప్పొంగలేదేమీ... 2012లో యుగాంతం అన్నారు కదా? యుగాంతం సమీపిస్తున్నదా? మరిప్పుడు 

ఈ స్నేహాలు - ఆత్మీయ స్నేహాలు .. ఒక సర్వే


ప్రియ నేస్తమా...!!

ఫేస్‌బుక్‌లో ప్రవీణ్ స్నేహితుల సంఖ్య 1005. వారం క్రితమే ప్రారంభించిన గూగుల్ ప్లస్‌లో స్నేహితుల సర్కిల్‌లో అప్పుడే వందమందికి పైగా చేరిపోయారు. -‘నీ స్నేహితులు ఎవరో చెప్పు. నీవు ఎలాంటి వాడివో నేను చెబుతాను’ అనే ఆర్యోక్తులు ఇప్పుడిక్కడ పని చేయవు. ఎందుకంటే ప్రవీణ్ ఫేస్‌బుక్‌లో ఉన్న వెయ్యిమంది స్నేహితుల్ని చూసి -ప్రవీణ్ ఎలాంటి వాడో మనం అంచనా వేయలేం. ఆ వెయ్యిమంది వెయ్యి రకాలుగా ఉండొచ్చు. అసలా వెయ్యి మందిలో కనీసం పదిమంది కూడా ఎలాంటి వారో ప్రవీణ్‌కే తెలియకపోవచ్చు. వారిలో కనీసం ఒక్కరిని కూడా అతను చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే -ఇవన్నీ ఆన్‌లైన్ స్నేహాలు కనుక. కలిసి కబుర్లు చెప్పుకోవడం, కష్టసుఖాలు పంచుకోవటం, ఒకరికొకరు మానసిక ధైర్యాన్ని అందించుకోవడం లాంటి సాధారణ స్నేహ బాంధవ్యాలు -‘ఈ’ తరహా స్నేహాల్లో బహు తక్కువ.
అందుకే ప్రవీణ్ తన ఫేస్‌బుక్‌లో, గూగుల్ ప్లస్ ఫ్రెండ్స్ సర్కిల్‌లో వెయ్యిమంది నేస్తాల సంఖ్య చూసి మురిసిపోతుంటాడు తప్ప, వారిలో నిజమైన స్నేహితులెందరు? ప్రాణమిత్రులు ఎంతమంది? ఆప్తులెవరు? ఆప్త మిత్రులెందరు? అన్న ప్రశ్నలు వేస్తే మాత్రం కలవరపడతాడు. ఇది నిజంగా నిజం. సోషల్ నెట్‌వర్క్ సైట్స్‌లో ఉన్న వాళ్లంతా మిత్రులేనా? అంటే మిత్రులే. ఎంతమంది నీకు నిజమైన మిత్రులు? అన్న ప్రశ్న సంధిస్తే మాత్రం -వౌనమే సమాధానం. లేదంటే ఒకట్రెండు పేర్లు వినా, మిగిలిన వాళ్లంతా కాస్త అబద్ధం. కొద్దిమందికి సోషల్ సైట్స్‌లో సైతం నిజమైన మిత్రులు ఉండవచ్చు. చదువుకునే రోజుల్లో, ఉద్యోగాల్లో ఏర్పడిన స్నేహితుల మధ్య ఎలాంటి బంధం ఉంటుందో కొద్దిమంది విషయంలో సోషల్ సైట్స్‌లో సైతం అలాంటి బాంధవ్యం కుదరొచ్చు. కానీ అది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే.

 ఈ పరిస్థితి భారత్‌లోనే కాదు, అంతర్జాల ప్రపంచం అంతటా అదే పరిస్థితి. అమెరికాలో ఈ మధ్య ఇలాంటి అంశంపైనే ఒక సర్వే నిర్వహించార్ట. సర్వేలో -‘నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎంతమంది’ అన్న ప్రశ్నకు ఒకరిద్దరన్న సమాధానాలే ఎక్కువగా వినిపించాయి. విచిత్రం ఏమంటే -వీరందరికీ సోషల్ సైట్స్‌లో స్నేహితుల సంఖ్య వేలల్లోనే. కార్నెల్ వర్శిటీ బృందం ఒకటి ఈ అంశంపై సర్వే నిర్వహించింది. పాతికేళ్ల క్రితం అదే వర్శిటీ అదే అమెరికాలో అచ్చంగా ఇలాంటి సర్వేనే నిర్వహిస్తే అప్పుడు వచ్చిన సమాధానం వేరు. దగ్గరి స్నేహితులు ఎంతమంది? అన్న ప్రశ్నకు సగటున ముగ్గురు అన్న సమాధానం వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువమంది ఒకరు లేక ఇద్దరు అన్న సమాధానాలే ఇచ్చారు. సోషల్ సైట్స్ ద్వారా స్నేహాలు పెరిగిపోతున్నాయని ఒకవైపు మనం సంబరపడిపోతుంటే, ఈ సర్వే మాత్రం ‘క్లోజ్ ఫ్రెండ్స్’ సంఖ్య తగ్గిపోతుందన్న చేదు నిజాలను బయటపెడుతోంది. -‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది’ అనే పాట గుర్తుకొస్తుంది కదూ. సోషల్ సైట్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడివారితోనైనా స్నేహం చేసే అవకాశం లభించింది. సికింద్రాబాద్‌లో ఉంటూ అమెరికా మిత్రుడితో కబుర్లు చెప్పుకుంటున్నాం. మీ ఇరాన్‌పై అమెరికా దాడి చేయవచ్చా? అని ఇరాన్ మిత్రుడి అభిప్రాయం తెలుసుకుంటున్నాం. ఇదంతా నాణానికి ఒకవైపు. ఇదే సమయంలో యాంత్రిక జీవితం పరుగు పందెంలో ‘క్లోజ్ ఫ్రెండ్స్’ సంఖ్య తగ్గించేసుకుంటుంన్నాం. క్లోజ్ ఫ్రెండ్స్ సంఖ్య తగ్గితే నష్టమేముంది? సోషల్ సైట్స్‌లో కావాల్సినంత మంది మిత్రులున్నారుగా? అనిపించొచ్చు.
కానీ -తాజా సర్వేలు అంతలేనన్ని నష్టాలనే చూపిస్తున్నాయి. ఇక్కడ -స్నేహితుల సంఖ్య పరిమితం అయిపోతుందన్న ఆవేదనకంటే, ఆ కారణంగా తలెత్తుతున్న దుష్ఫరిణామాలు ఎక్కువవుతున్నాయన్నదే అసలు ఆవేదన. మనసువిప్పి మాట్లాడుకునే స్నేహితులు లేకపోవడం వల్ల మనిషిపై తీవ్రమైన ప్రభావం పడుతోందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అందరికీ తెలిసిన విషయమే అయినా, అమెరికా సర్వేలూ ఆ విషయాన్ని నొక్కిమరీ చెప్తున్నాయి.
సంతోషాన్ని సన్నిహితులకు పంచుకుంటే ఆనందం రెట్టింపవుతుంది. బాధలను పంచుకుంటే సగం భారం తగ్గిపోతుంది. క్లోజ్ ఫ్రెండ్స్ లేకుంటే మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాం. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ పరిణామాలు తెలిసి కూడా -మనిషి క్రమంగా సంఘజీవి నుంచి కంప్యూటర్ జీవి అయిపోతుండటం దురదృష్టకరం.
తాజా సర్వేను ఒక్కసారి పరికిస్తే -18 ఏళ్లకు పైబడిన రెండువేల మందిని సర్వేలో భాగం చేశారు. సర్వేలో ప్రశ్నలు ఎదుర్కొన్న వాళ్లంతా -ఆన్‌లైన్ స్నేహితులతో వ్యక్తిగతమైన విషయాలు చర్చించలేమనే చెప్పారు. అదే సమయంలో ఆన్‌లైన్ నేస్తాల కారణంగా బాహ్య ప్రపంచంలో ‘క్లోజ్ ఫ్రెండ్స్’ సంఖ్య దాదాపుగా తగ్గిపోయిందని, ఉన్న ఒకరిద్దరితో మనసువిప్పి మాట్లాడుకునే అవకాశమే చిక్కడం లేదని చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో అత్యంత సన్నిహిత మిత్రుని పేరు చెప్పమంటే ఒక్కొక్కరి పేరే చెప్పడం గమనార్హం. 18శాతం మంది ఇద్దరి పేర్లు చెప్తే, 29 శాతం ఇద్దరి కన్నా ఎక్కువ మంది పేర్లు చెప్పారు. మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఆసక్తికరమైన, ప్రాధాన్యం కలిగిన విషయాలేమీ ఉండటం లేదని, అందుకే మిత్రులతో ఎక్కువగా మాట్లాడలేక పోతున్నట్టు 64 శాతం మంది సమాధానమిచ్చారు. 36 శాతం మంది మనసు విప్పి మాట్లాడేందుకు ఎవరూ లేరని చెప్పడం గమనార్హం.
మనసు విప్పి మాట్లాడుకోవడానికి మంచి స్నేహితులు అవసరం. కంప్యూటర్‌లో కావాల్సిన సమాచారం దొరకవచ్చేమో గానీ, మనసు విప్పి మాట్లాడే స్నేహితుడు దొరకటం కష్టమే. అలాంటి స్నేహితుల నుంచి లభించే మానసిక బలం కంప్యూటర్లు అందించలేవన్నది ఎవ్వరు కాదన్నా వాస్తవం. ఎంత ఎక్కువ మంది స్నేహితులుంటే అంత గొప్పవారని చెప్పడం అతిశయోక్తి ఏమోగానీ, ఎక్కువ మంది ప్రాణ స్నేహితులుంటే అంతగా మానసిక వికాసం ఉంటుందన్నది యదార్థం. అనవసర కబుర్లతో కాలం వృధా చేసే నేస్తాలు లేకపోయినా ఫరవాలేదు. ఆనందాన్ని పంచుకోవడానికి, సమస్యల్లో చిక్కుకున్నపుడు దాన్నుంచి బయటపడేసే మానసిక స్థయిర్యాన్ని అందించడానికి మాత్రం మిత్రులుండాలి. చెప్పుకోవడానికి మంచి స్నేహితుడు కూడా లేడన్న భావన మనిషిని కృంగదీస్తుంది. పూర్తిగా కంప్యూటర్ జీవితాలకు అలవాటుపడిపోయి, చివరకు కంప్యూటర్‌తో, కంప్యూటర్‌లో కనిపించే స్నేహితులతో కాలం గడుపుతూ మిత్రులను మర్చిపోకండి. చిన్ననాటి మిత్రులనో, కలిసి చదువుకున్నవారినో, కలిసి పని చేసిన వారిలోనో మీ ఆత్మీయులు ఉండొచ్చు. చాలాకాలం అయిందా? అయినా ఫరవాలేదు. ఒకసారి పలకరించండి. చెదలు పట్టిన స్నేహబంధం బూజు దులపండి. పాత రోజుల్ని ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకోండి.
కొందరి విషయం లో ఈ స్నేహాలు కూడా ప్రాణస్నేహితులు కావచ్చు  అలా ఐతే అదృష్టమే .. కానీ ఈ స్నేహాల వెంటపడి ఆత్మీయ స్నేహాలను  మారవ వద్దు ... నీకోసం నేనున్నాను అనే మాట మనస్పూర్తిగా చెప్పే వారు ఈ స్నేహంలో లభించిన ,  జీవితం లో లభించినా  మరెక్కడ లభించినా అది కలకలం సాగాలని కోరుకుందాం .

15, నవంబర్ 2011, మంగళవారం

తమిళ డబ్బింగులే తెలుగు సంస్కృతి ? మన చానల్స్ దుస్థితితెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది. నిజంగానే మనది చిత్రమైన తెలుగు జాతి. తెలుగమ్మాయి సినిమాలో అచ్చం తెలుగమ్మాయిలా కనిపించాలంటే పరాయి భాష అమ్మాయే మనకు శరణ్యం. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం, కానీ ఇక్కడ పాఠశాలల్లో తెలుగులో మాట్లాడితే దొంగ మెడలో పలకపై పేరు రాసి పోలీస్ స్టేషన్‌లో ఫోటో అంటించినట్టు మెడలో ఇకపై తెలుగు మాట్లాడం అని రాయించి ఎండలో నిలబెడతారు.

 రాష్ట్రం ఏర్పడిన మూడు దశాబ్దాల తరువాత కూడా తెలుగునాడుకు వెళదామని తెలుగు పరిశ్రమ ఆలోచించలేదు. ఎలాగోలా తెలుగునాడుకు వచ్చాక ఇక్కడ హీరోయిన్లు తమిళ, కేరళ, గోవా అందగత్తెలు, విలన్లు హిందీవాళ్లు. బాబోయ్ డబ్బింగ్ సినిమాల ధాటిని తట్టుకోలేం అంటూ తెలుగు సినిమా పెద్దలు చేతులెత్తేశారు. మా వల్ల కాదు కానీ మీరే ఏదో ఒక చట్టం చేసి డబ్బింగ్ సినిమాల నుండి మమ్ములను రక్షించమంటున్నారు.
సినిమాల సంగతి వదిలేద్దాం మన టీవీల విషయానికి వద్దాం అంటే తెలుగు టీవీలన్నీ డబ్బింగ్ టీవీలుగానే కనిపిస్తున్నాయి.

 తెలుగు చానల్స్‌లో ఆసక్తిగా చూసే సీరియల్ పేరు ఏదైనా చెప్పండి అది కచ్చితంగా తమిళ సీరియలే అవుతుంది. న్యూస్ చానల్ విషయంలో పాతాళంలో ఉన్న జెమిని ఎంటర్‌టైన్‌మెంట్ చానల్ విషయంలో మాత్రం టాప్‌లో నిలిచింది. దానికి కారణం ప్రధానంగా డబ్బింగ్ సీరియల్స్. ప్రధానంగా ఒకప్పటి హీరోయిన్ రాధికకు చెందిన రాడాన్ సంస్థ నిర్మిస్తున్న తమిళ సీరియళ్లే తెలుగునాట ఎంటర్‌టైన్‌మెంట్ చానల్‌ను ఏలేస్తున్నాయి.

 అవి తమిళ సీరియల్స్ అని కూడా మన వారికి బాగా తెలుసు. అందుకే రేపు ఏమవుతుంది, లేక వచ్చే వారం ఏమవుతుంది అనేది తెలుసుకోవడానికి తమిళ చానల్‌ను సైతం చూసేస్తున్నారు. భాష అర్ధం కాకపోయినా దృశ్యాన్ని బట్టి విషయం అర్థమవుతుంది కదా! ఒకవేళ ఆ సీరియల్ వచ్చే సమయానికి చూసే అవకాశం లేకపోతే కూడా బాధపడడం లేదు తమిళ చానల్ చూసి విషయం అర్థం చేసుకుంటున్నారు. మన తెలుగు చానల్స్ తమిళ సంస్కృతిని తెలుగువారికి ఇంతగా అలవాటు చేసేశారు. తెలుగును నమ్ముకోవడం కన్నా పరాయి భాషపై ఆధారపడడమే ఎంటర్‌టైన్‌మెంట్ చానల్స్ విజయరహస్యం అనుకున్నట్టుగా ఉంది ‘మా’ టీవి సైతం అదే బాట పట్టింది. అయితే తమిళంలో హిట్టయిన సీరియల్స్ ‘సన్’ టీవీ వారివి కావడం, అవన్నీ వారికే చెందిన జెమినీలో వస్తుండడం వల్ల మా వాళ్లు తమిళం కన్నా హిందీ మిన్న అనుకున్నారు. అప్పటి వరకు ఉన్న హిందీ చానల్స్ అన్నింటిని వెనక్కి నెట్టి దూసుకెళుతున్న కలర్స్ చానల్‌ను ‘మా’ వాళ్లు నమ్ముకున్నారు. కలర్స్ హిందీలో హిట్టయిన హిందీ సీరియల్స్ అన్నీ మాలో చక్కగా తెలుగులో వచ్చేస్తున్నాయి. జీ తెలుగు చానల్స్‌లో ఇప్పుడు మంచి పాపులారిటీ ఉన్న సీరియల్స్ చిన్నారి పెళ్లికూతురు ( హిందీలో బాలికా వధు) వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి కలర్స్ హిందీ డబ్బింగ్ సీరియల్సే. ఇక సోనీ హిందీలో బాగా పాపులర్ అయిన సిఐడిని ‘మా’లో ప్రసారం చేస్తున్నారు. ఇక ‘సన్’లో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న లక్ష్మీ, కళ్యాణి, వసంతం, ఝాన్సీ సీరియల్స్ తెలుగు డబ్బింగ్‌తో జెమినిలో తెలుగులో ప్రసారం చేస్తున్నారు.
దేశంలో ఒక ప్రాంతానికి చెందిన సంస్కృతి మరో ప్రాంతానికి తెలియాల్సిన అవసరం ఉంది. అది అవసరం కూడా. కానీ డబ్బింగ్ కార్యక్రమాల ద్వారా జరుగుతున్నది అది కాదు. చివరకు తెలుగు సీరియల్స్ అంటే తమిళ సంస్కృతితోనే ఉండాలనుకునే విధంగా మారింది పరిస్థితి. మన సంస్కృతి, మన ఆచారాలు, మన వ్యవహారాల మీద, మన భాష మీద మనకు ఏ మాత్రం అభిమానం లేకపోవడమే దీనికి కారణం. సిఐడిలో క్రైం స్టోరీలు వస్తాయి. ఒక హత్య జరుగుతుంది. ఆ హత్య ఎవరు చేశారో సిఐడి బృందం చేధిస్తుంది. ఇదీ కథ దీనికి మనకు హిందీ హత్యలే కావాలా? తెలుగునాట హత్యలు జరగవా? మనకు క్రైం కథలు లేవా?
సరే తమిళనాడు మన పొరుగు రాష్ట్రం, దక్షిణాది వాళ్లమే కాబట్టి కొంత వరకు మనకూ వాళ్లకూ పోలికలు ఉంటాయి తేడా తెలియదు అందుకు డబ్బింగ్ చేసేస్తున్నారని సమర్థించుకోవచ్చు. కానీ చివరకు హిందీ సీరియల్స్ విషయంలో సైతం అదే జరుగుతుంది కదా! ఉత్తరాది వారి ఆచార వ్యవహారాలకు, తెలుగు వారికి చాలా తేడాలు ఉంటాయి. సీరియల్స్‌కు వచ్చేసరికి అలాంటి తేడాలేమీ పెద్దగా ఇబ్బంది కలగడం లేదు. ఇతర భాషల సీరియల్స్‌ను డబ్బింగ్ చేసి చూపడం నేరం కాదు, తప్పు కాదు కానీ ఇదే అలవాటైతే మరి మన తెలుగు కళాకారులు ఏం కావాలి, తెలుగుదనం ఏం కావాలి, మన సంస్కృతి మనం మరిచిపోమా? ప్రసార మాధ్యమాలను మనం ఎంత తీవ్రంగానైనా విమర్శించవచ్చు, తిట్టుకోవచ్చు కానీ అవి సమాజంపై చూపే ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయలేం.

 ఇలా తమిళ, హిందీ సీరియల్స్‌కే పరిమితం అయితే కొంత కాలానికి తెలుగుదనం మనకు అదేదో మరో గ్రహానికి సంబంధించిన ఆచారాల్లా అనిపించవచ్చు. ‘మా’లో గతంలో చక్కని తెలుగు సీరియల్స్ వచ్చేవి. అమ్మమ్మ.కామ్, రాధా మధు వంటి తెలుగు సీరియల్స్‌లో తెలుగుదనం ఉట్టిపడేది. వంశీ మా పసలపూడి కథలు బాగా ఆకట్టుకున్నాయి. అమృతం సీరియల్ బాగా ఆకట్టుకొంది. అమ్మమ్మ .కామ్ ప్రధానంగా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించింది. ప్రేక్షకులు ఎక్కువ మంది చూస్తున్నారు, వ్యయం తక్కువ ఆదాయం ఎక్కువ అనే ఉద్దేశంతో చానల్స్ ఇలా డబ్బింగ్ సీరియల్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక రకంగా ఇవి వ్యవసాయ రంగంలో జెనిటిక్ విత్తనాల వంటివన్నమాట! రైతుకు ఎక్కువ పంట కావాలి, ఒక్కసారి జెనిటిక్ విత్తనాలకు అలవాటు పడితే తరువాత ఆ పొలంలో మన విత్తనాలు మొలకెత్తవు. చచ్చినట్టు జెనిటిక్ విత్తనాల కోసం పరిగెత్తాలి. తెలుగుతనం మరిచిపోతే తెలుగు వారి పరిస్థితి అలానే అవుతుంది.
కొన్ని కార్టూన్ చానల్స్, డిస్కవరీ చానల్, సినిమా చానల్స్ అచ్చంగా డబ్బింగ్ చానల్స్‌గానే నిర్వహిస్తున్నారు. వాటి సంగతి వేరు. ఆయా అంశాలపై ఇంగ్లీష్‌లో అర్థం చేసుకోలేని వారికి ఈ తెలుగు డబ్బింగ్ చానల్స్ బాగానే ఉపయోగపడతాయి. కానీ సీరియల్స్ సంగతి అలా కాదు తమిళ, హిందీ సీరియల్స్‌ను తెలుగు వాటిగానే మభ్యపెడుతూ ప్రసారం చేస్తున్నారు. తెలుగు సినిమా వారికి బలమైన సంఘం ఉంది, పలుకుబడి గల వారున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే శక్తి విషయంలో సందేహాలు ఉండొచ్చు కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి జివోలనైనా విడుదల చేయించుకునే బలం విషయంలో తెలుగు సినిమా వాళ్లను తక్కువగా అంచనా వేయలేం. కానీ టీవి రంగానికి చెందిన వారికి సంబంధించి ఇలాంటి బలమైన సంఘాలేమీ లేవు. పైగా ఈ ధోరణిని బహిరంగంగా విమర్శిస్తే అలాంటి వారిని చానల్స్ వాళ్లు బహిష్కరించే అవకాశం కూడా లేకపోలేదు. తమిళ, హిందీ చానల్స్‌లో వస్తున్న సీరియల్స్ లాంటిలో ఉండే కథలు మన తెలుగు నాట దొరకవా? 

డబ్బింగ్‌లే తప్ప సొంత ఆలోచనలకు అవకాశం ఇవ్వరా? ఈ టీవి ఇలాంటి డబ్బింగ్ వ్యవహారాలకు దూరంగానే ఉన్నా, మితిమీరిన ఆంక్షల వల్ల ఆ చానల్‌లో మంచి తెలుగు సీరియల్స్ రావడం లేదు. సుమన్ రెండు, మూడు వారాలకో సినిమాతో ప్రేక్షకులపై కక్షకట్టినట్టుగా విజృంభించేస్తున్నారు. అయితే డబ్బింగ్ సీరియల్స్ లేకపోతే సుమన్ సినిమాలు, సుమన్ తరహా సీరియల్సే దిక్కు. పాపం తెలుగు ప్రేక్షకులు.

10, నవంబర్ 2011, గురువారం

ఇంకా మంచికాలం ముందుంది అంటున్న కిరణ్ ... రాజకీయ వ్యంగ్యం


ఉందిలే మంచి కాలం...


కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోటో. దానితో పోటీపడుతున్న స్కీముల జాబితా... వాటిని తలదనే్నవిధంగా ఉన్న ‘ముందున్నది మరింత మంచి కాలం’ స్లోగన్. ఇప్పుడు రాష్ట్రాన్ని ఏలుతున్న స్లోగన్ ఇది. స్లోగన్ అంటే అది వినియోగదారుల గుండెల్లోకి తూటాలా దూసుకువెళ్లాలి. స్కీములకు ఓట్లు రాలుతాయో లేదో కానీ స్లోగన్‌లకు ఓట్లు రాలితీరుతాయి. ఆ కాలంలోనే ఇందిరాగాంధీ ఇచ్చిన గరీబీ హఠావో స్లోగన్‌కు తలతూగే స్లోగన్ భారత రాజకీయాల్లో ఇప్పటి వరకు రాలేదు. రాజకీయ బిజినెస్‌లో గరీబీ హాఠావో టాప్ వన్‌గా నిలిస్తే, ఎన్‌డిఏ అధికారంలో ఉన్నప్పుడు బిజెపి వారిచ్చిన భారత్ వెలిగిపోతోంది స్లోగన్‌ను చివర్లో నిలుస్తుంది. ఈ నినాదాన్ని భారీ బహుళ జాతి కంపెనీలకు ప్రకటనలు రూపొందించే సంస్థ రూపొందించిందని అధికారంలో ఉన్నప్పుడు అద్వానీ ఘనంగా చెప్పుకున్నారు. రాజకీయ పక్షాలు, కార్పొరేట్ కంపెనీలు రెండూ చేసేవి బిజినెస్సే అయినా వ్యూహాలు వేరుగా ఉండాలి. రామ మందిరాన్ని వదిలేసి స్లోగన్‌లను నమ్ముకున్నందుకు దెబ్బతిన్నారు.

ఐటి, స్వర్ణాంధ్ర స్లోగన్‌లు ప్రజల హృదయాల్లో ముద్రించుకుపోయిన కాలంలో జాతకం మారిపోతుందని గ్రహించి స్లోగన్ మార్చారు. ఆయన్ని వదిలేస్తే ఇప్పుడు రాష్ట్రంలో స్లోగన్‌ను నమ్ముకున్నది కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రమే. ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎవరూ పట్టించుకోవడం లేదు, ఆయనా ఎవరినీ పట్టించుకోవడం లేదు. ఎప్పుడు రాజీనామా చేస్తారో, ఏ క్షణంలో దీక్ష చేస్తారో, ఎప్పుడు పార్టీ మారుతారో తెలియని ఎమ్మెల్యేలను నమ్ముకోవడం కన్నా స్లోగన్‌ను నమ్ముకోవడం మంచిదని ఆయన అనుకుంటున్నారు. ఏ కార్పొరేట్ కంపెనీ వారి ధర్మమో కానీ ఆయనకు భలే స్లోగన్ లభించింది. సర్వకాల సర్వావస్థల్లో ఉపయోగపడే తారకమంత్రమిది.

 ‘ముందుంది మరింత మంచి కాలం’
ఎవరికి మంచి కాలం తెలంగాణ వాదులకా? సమైక్యాంధ్ర అంటున్న సీమాంధ్ర వాదులకా? మంచి కాలం సిఎంకా? ప్రజలకా? హై కమాండ్‌కా? ఎమ్మెల్యేలకా? మంత్రులకా? ఒకే స్లోగన్ ఎవరికి అనుకూలంగా వారు అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరేం మాట్లాడినా దానికి రెండు అర్ధాలు ఉంటున్నాయి. చిదంబరం, ఆజాద్ అలా అన్నారు కాబట్టి దాని అర్ధం తెలంగాణ ఏర్పడుతుందని తెలంగాణ ఆశిస్తున్నవారు అనుకుంటే, ఆ మాటలతో తెలంగాణ రాదని తేలిపోయింది అంటూ ఆవే మాటలకు సీమాంధ్ర నాయకులు అర్ధాలు చెబుతున్నారు. రెండు అర్ధాల మాటలకే మనం ఆశ్చర్యపోతుంటే దాని అబ్బలాంటి మాటను కిరణ్‌కుమార్‌రెడ్డి కనిపెట్టేశారు.
ముందుంది మరింతమంచి  కాలం ఈ నినాదం కార్పొరేట్ ఆస్పత్రిలో చావుబతుకుల మీదున్న పేషింట్‌కు సైతం జీవం పోస్తుంది.
ముందుంది మంచి కాలం అనే నమ్మకమే లేకుంటే కిరణ్‌కుమార్‌రెడ్డి జీవితం ఎలా సాగుతుంది? అందరూ రాజీనామాలు చేసేస్తారు, ప్రభుత్వం పడిపోతుంది, నేను రాజీనామా చేస్తాను అనే ఆలోచన ఆయన్ని చుట్టుముట్టకుండా ఉండాలంటే ముందుంది మరింత మంచి కాలం అనే మంత్రం పదే పదే వినాల్సిందే కదా!
టెలిఫోన్లు వచ్చిన కొత్తలో శ్రీదేవి బాలనటిగా బూచాడమ్మా బూచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడు అంటూ టెలిఫోన్‌తో పాటలు పాడిన కాలంలో ఫోన్ మాట్లాడుతున్నట్టు ఫోటో దిగడం పెద్ద ఫ్యాషన్. ఆ తరువాత ఎక్కువగా రచయితలు పెన్ను వెళ్లతో పట్టుకుని చేతిని గవద కింద పెట్టుకుని ఆలోచిస్తున్నట్టు ఫోటోలు దిగేవారు. కవితా సంకలనాల్లో ఇలాంటి ఫోటోలు కనిపిస్తుంటాయి. అదే తరహాలో బాబు గారు కంప్యూటర్ ముందు కూర్చోని ఒక చేతితో వౌస్‌ను పట్టుకుని కంప్యూటర్‌ను చూస్తూ సీరియస్‌గా ఆలోచిస్తున్న ఫోటోలు ఇంకా మన మస్తిష్కంలో బలంగా ముద్రించుకొని ఉన్నాయి. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా బాబు గారి కంప్యూటర్ ఫోటో కనిపించేది. ఆ ఫోటోలు చూశాక కంప్యూటర్‌ను కనిపెట్టింది బాబుగారే అని చాలా మందికి ఉన్నట్టే నాకూ గట్టినమ్మకం. సీన్ రివర్స్ అయ్యే ప్రమాదం ఉందని ఎన్నికల ముందు తెలియగానే హడావుడిగా ఆ ఫోటోలు తొలగించి రైతుబాబు ఫోటోలు విడుదల చేశారు. ఫోటోలతో కాదని ఏకంగా పోలాల్లోకి దిగారు. ఐనా జనం మాత్రం ఆయన్ని ఐటిబాబుగానే తప్ప రైతుబాబుగా గుర్తించడం లేదు. ఐనా బాబు పొలాల వెంట పడి నడుస్తున్నారంటే ముందుంది మరింత మంచి కాలం అనే నమ్మకంతోనే కదా! అబినహీతో కబీ నహీ (ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ కాదు) అని టిఆర్‌ఎస్ బయటకు అంటుంటే బాబు మాత్రం ఇప్పుడు అధికారం రాకపోతే నాకు ఇక ఎప్పుడూ రాదని ముందున్న మంచి కాలాన్ని ఊహించుకుంటూ పోలాల్లో విత్తనాలు నాటుతున్నారు.

 ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలు చేయాలని మాయావతి అసెంబ్లీలో తీర్మానం పెడుతున్నామనగానే ముందుంది మరింత మంచి కాలం తెలంగాణ వచ్చేస్తుంది అని కెసిఆర్ చెబుతున్నారు. కాశీయాత్ర అనగానే ఏనుగుల వీరాస్వామిగారు డజను దశాబ్దాల క్రితం రాసిన కాశీయాత్ర గుర్తుకు వచ్చినట్టు ఎలాంటి సందర్భంలోనైనా ఓదార్పు అనగానే జగన్ గుర్తుకొస్తారు. ముందుంది మంచి కాలమనే గట్టి నమ్మకంతోనే జగన్ ఓదార్పు సాగుతోంది.
‘అవినీతిపై నేను పోరాడుతుంటే ముఖ్యమంత్రికి ఇష్టం లేదు. మంత్రుల అవినీతిని నిరూపిస్తాను, కోర్టుకు వెళతాను, గవర్నర్‌ను కలుస్తాను అని లోకాయుక్తను కలిసి ఫిర్యాదు చేసిన తరువాత మంత్రి థింకర్‌రావు చెప్పాడు. నిరంతరం మంత్రుల అవినీతి గురించి చెబుతాడు కాబట్టి అంతా ఆయన్ని థింకర్ రావు అనే అంటారు. నిజంగా మంచి కాలం ఉందంటావా? ఉంటే తోటి మంత్రులను ఇలా నిద్రలేకుండా ఎందుకు చేస్తున్నావన్నా అని అడిగితే తమీ నాకు మంత్రి పదవి ఎలా ఇచ్చారు రోజూ సిఎల్‌పికి వచ్చి వైఎస్‌ఆర్‌ను తిడితేనే కదా! అలానే ఇప్పుడు మంత్రుల అవినీతిపై ఫిర్యాదు చేస్తే నా మనసులోని కోరిక గ్రహించి మంచి శాఖ ఇస్తారు తప్పకుండా ముందుంది మరింత మంచి కాలం అని థింకరన్న నవ్వాడు. నిజంగా మంచి కాలం ఉందా? మనకే కాదు ఉందిలే మంచి కాలం ముందుముందునా అని ఎప్పుడో సినీకవి చెప్పిన పాటలో సైతం ఇలాంటి అనుమానమే వ్యక్తమైంది

8, నవంబర్ 2011, మంగళవారం

మానవ సంబందాలను , బావోద్వేగాలను తట్టిలేపుతున్న అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతి

అద్భుతం... అద్భుతం.. వాహ్ .... నాకు మాటలు రావడం లేదు... ఇలాంటి పదాలు మన తెలుగు చానల్స్‌లో చాలా సార్లు వినే ఉంటాం. వంటల కార్యక్రమంలో వంట రుచి చూడగానే వావ్ అనే మాట తప్పనిసరిగా వినిపిస్తుంది. వంటకు ఉప్పు తప్పనిసరి అన్నట్టు తెలుగు చానల్స్ వంటల కార్యక్రమంలో వావ్ పదం వినిపించాల్సిందే! కానీ ఇది అలాంటి వావ్ కాదు ఆ పదాలకు జీవం పోసిన దృశ్యం అది. అమితాబ్ నిర్వహిస్తున్న కౌన్‌బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో కనిపించిన దృశ్యం అది. ఈసారి కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమానికి మానవ సంబంధాల కోణాన్ని కూడా కలిపారు. అందుకేనేమో అందరినీ కట్టిపడేసింది ఈసారి కెబిసి. హాట్ సీట్‌పై భర్త ఉంటే భార్య కుటుంబ సభ్యులతో మాట్లాడించడం, భార్య ఉంటే భర్తతో మాట్లాడడం, అప్పుడప్పుడు భారతీయ వివాహ వ్యవస్థలోని గొప్పతనాన్ని చెప్పడం, అమితాబ్ తన కుటుంబం గురించి చెప్పడం వంటి వాటితో కార్యక్రమం రక్తికట్టింది.


నెలకు నాలుగున్నర వేలు సంపాదిస్తూ, తన నత్తివల్ల ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న సామాన్యుడు అమితాబ్ ముందు ఆత్మవిశ్వాసంతో ఆడి 50 లక్షలు గెలిచాడు. ఏడు జన్మల్లోనూ నా జీతం ద్వారా ఇంత సంపాదించలేనని కన్నీళ్లు పెట్టుకున్నాడు. పేదరికంలో కనీసం మరణించిన తండ్రి ఫోటో కూడా చూడలేదు, పదవ తరగతి పాస్ కాకముందే చదువు మాని పొలం పని చూసుకోవలసి వచ్చింది. కెబిసి మళ్లీ చదవాలనే కోరిక రగిల్చింది. మళ్లీ చదవడమే కాదు ఏకంగా అమితాబ్ ముందు హాట్‌సీట్‌పై కూర్చొని తన జీవిత లక్ష్యాన్ని సాధించుకున్నాడో సామాన్యుడు అతను ఇప్పటికీ పొలం పని చేస్తాడు. ఇలాంటి దృశ్యాలు ఈసారి కెబిసిలో ఎన్నో కనిపించాయి.


దేశంలో వెనుకబడ్డ రాష్ట్రం బీహార్ ... అందులో మరింత వెనుకబడిన గ్రామం నుండి సుశీల్‌కుమార్ అనే యువకుడు కెబిసి హాట్‌సీట్‌లో కూర్చున్నాడు. అతని జీతం నెలకు ఆరున్నరవేల రూపాయలు. కెబిసి రెండుసార్లు అమితాబ్‌తో నిర్వహించిన తరువాత ఒకసారి షారుఖ్ ఖాన్‌తో నిర్వహించారు. అమితాబ్‌తో కౌన్‌బనేగా కరోడ్‌పతి కార్యక్రమాన్ని స్టార్‌ప్లస్ ప్రారంభించి, కోటి రూపాయల బహుమతి నిర్ణయించారు. దానితో మరో చానల్ పోటీగా అనుపమ్‌ఖేర్‌తో రెండు కోట్లరూపాయల బహుమతితో కార్యక్రమాన్ని ప్రసారం చేస్తే అది అట్టర్ ఫ్లాప్ అయింది. కెబిసిని ఒకసారి షారుఖ్‌ఖాన్‌తో నిర్వహించారు. కానీ అది అమితాబ్ తరహాలో ఆకట్టుకోలేక పోయింది. అంతా తెలిసిన కార్యక్రమమే ఇందులో ఆసక్తి ఏముంటుంది అని మొదట్లో అనిపించింది. 13 ప్రశ్నలు అన్నింటికి సరైన సమాధానాలు చెబితే గతంలో కోటి రూపాయల బహుమతి, ఇప్పుడు ఐదు కోట్ల బహుమతి. ప్రతి ప్రశ్నకు నాలుగు సమాధానాలు వారే చెబుతారు అందులో ఏది సరైనదో చెబితే చాలు. దీనికి నాలుగు లైఫ్ లైన్లు కూడా ఉంటాయి. ఇంతోటి దానికి అన్ని కోట్ల రూపాయల బహుమతా అనిపిస్తుంది.


 కానీ కార్యక్రమం చూశాక అభిప్రాయం మారుతుంది. బాగానే క్లిక్ అయింది. మళ్లీ ఇప్పుడు ఐదుకోట్లతో కొత్తగా ఏం చూపిస్తారు అనిపించింది. ప్రసారాలు ప్రారంభం అయ్యాక కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇది జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన కార్యక్రమమే కానీ దాన్ని మానవీయ కోణంతో చూపించారు. కార్యక్రమంలో ఎంతగా విజయం సాధించారంటే నాలుగు లైఫ్ లైన్లలో నిపుణుడి సలహా కూడా ఒకటి ఉంటుంది. బీహార్‌కు చెందిన సుశీల్ కుమార్ 50లక్షల రూపాయలు గెలిచిన తరువాత కోటి రూపాయల ప్రశ్నకు నిపుణుడి సహాయం కోరారు. లాల్‌బహద్దూర్ శాస్ర్తీ తన పెళ్లిలో ఖాదీతో కట్నంగా ఏం తీసుకున్నారు అనేది ప్రశ్న. సుశీల్ కుమార్‌కు దాని సమాధానం తెలియదు. చరఖా అని నిపుణడు సలహా ఇచ్చాడు. సుశీల్‌కుమార్‌కు కోటి దక్కాయి. ఆ సమయంలో సుశీల్ కుమార్ ముఖంలోని ఆనందాన్ని చూసి జాతీయ పత్రికకు సంపాదకుడైన నిపుణుడు సైతం భావోద్వేగానికి గురికాకుండా ఉండలేకపోయారు. తన కళ్లను తుడుచుకున్నారు. సరిగ్గా అమితాబ్ సైతం అలాంటి ఉద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే సుశీల్ కుమార్ బీహార్‌లోని ఒక మారుమూల గ్రామం నుండి వచ్చాడు. నెలకు ఆరున్నర వేల రూపాయలు సంపాదిస్తాడు. కూలిపోయిన పెంకుటిల్లు, పేద కుటుంబం. సుశీల్‌కుమార్ ఆనందాన్ని తట్టుకోలేక పోయాడు.


 తన జీవితంలో షూ ధరించడం ఇది రెండవ సారి కెబిసిలో పాల్గొనేందుకు షూ ధరించి వచ్చానని చెప్పుకున్నాడు. చివరి ప్రశ్నకు సైతం సమాధానం చెప్పి అతను ఐదు కోట్ల రూపాయలు సంపాదించాడు. అమితాబ్ సైతం ఆనందాన్ని తట్టుకోలేకపోయారు. తాను నిబంధనలకు భిన్నంగా మీ సీటు వద్దకే వచ్చి చెక్ ఇస్తున్నానని చెప్పారు. తానెంతగా భావోద్వేగానికి లోనైంది అమితాబే చెప్పుకున్నారు. కోటి రూపాయలు గెలిచాక చెక్ ఇవ్వడం ఆనవాయితీ కానీ తాను కోటి రూపాయల చెక్ కూడా ఇవ్వడం మరిచిపోయానని, తరువాత ఇచ్చారు. సుశీల్‌కుమార్‌కు ఐదు కోట్ల రూపాయల బహుమతి లభించడం తనకు ఎంత సంతోషాన్ని కలిగించిందో అమితాబ్ తన బ్లాగ్‌లో ప్రత్యేకంగా రాశారు. సుశీల్ కుమార్ పెంకుటిల్లును, అతని పేద జీవితాన్ని టీవిలో ప్రత్యేకంగా చూపించారు. ఆ దృశ్యాలు చూపిన వారు అతను విజయం సాధించినప్పుడల్లా చప్పట్లతో ప్రోత్సహించారు. చివరి ప్రశ్నకు సమాధానం చెప్పి ఐదుకోట్ల బహుమతి పొందినప్పుడు కార్యక్రమంలో ఉన్నవారే కాదు టీవీల ముందున్నవారు సైతం భావోద్వేగం నుండి తప్పించుకోలేకపోయారు. ఈసారి కెబిసిలో ఇలాంటి దృశ్యాలు చాలానే చోటు చేసుకున్నాయి.


 ఒక సాధారణ మహిళ మూడు లక్షల రూపాయల అప్పు చేశాం అదిప్పుడు ఆరులక్షలైంది. సంపాదించిందంతా వడ్డీ చెల్లించడానికే సరిపోతుంది అని చెప్పింది. ఆ మహిళ ఆరులక్షల రూపాయల ప్రశ్నకు సమాధానం చెబుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, మీరు తప్పు సమాధానం చెప్పి కిందికి వెళితే మాకు చాలా బాధగా ఉంటుంది అని అమితాబ్ చెప్పడం కదిలించింది. చివరకు ఆ మహిళ 50 లక్షల రూపాయలు గెలుచుకుంది. డబ్బుతో జనరల్ నాలెడ్జి ఏమిటి? అనే విమర్శ ప్రారంభంలోనే వచ్చింది. క్రైం కథలో, ఏడుపుగొట్టు కథలతోనో ప్రజలను హింసించే వాటికన్నా ఇలాంటి కార్యక్రమాలు ఏ కోణంలో చూసినా అభినందించదగినదే. పేదరికాన్ని గ్లామరైజ్ చేశారనే విమర్శ రావచ్చు, రేటింగ్ పెంచుకునే జిమ్మిక్కులు అనే విమర్శ రావచ్చు. కానీ వీక్షకులను కట్టిపడేసి విధంగా ఉంది కార్యక్రమం. కార్యక్రమంలో పాల్గొనే వారి కుటుంబం గురించి, వారి ఇంటిని, ఆ ప్రాంతాన్ని, మిత్రులను చూపడం బాగుంది. ఐదుకోట్ల రూపాయల బహుమతి పొందిన సుశీల్‌కుమార్ నేటి యువతకు, పాజిటివ్ ఆలోచనలకు అద్దం పట్టేవిధంగా ఉన్నారని అమితాబ్‌తో పాటు నిపుణులు కొనియాడారు. 


అమితాబ్‌కున్న ఇమేజ్, అతను నటించిన సినిమాలు, అతని పట్ల ప్రజల్లో ఉండే అభిమానం కెబిసి విజయానికి దోహదం చేసింది. వాటన్నింటికి తగ్గట్టు టీవి కార్యక్రమాన్ని ఇలా నిర్వహించాలి అనుకునేట్టుగా అమితాబ్ దీన్ని నిర్వహిస్తున్నారు. ఆయన తప్ప మరెవరూ ఇలాంటి కార్యక్రమానికి సరిపోరు. షారుఖ్ ఖాన్ బాలివుడ్ బాద్షాగా నిలిచినా కెబిసిలో మాత్రం అమితాబ్ ముందు వెలవెలబోయారు. ఆ తరువాత మరోసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తే సక్సెస్ అవుతుందని బాగానే అంచనా వేశారు. అమితాబ్ ఆ అంచనాలను నిజం చేశారు. భార్యాభర్తల గురించి హాస్యోక్తులతో అమితాబ్ కార్యక్రమానికి జీవం పోశారు. బిగ్ బిగా తన పేరుమీద కార్పొరేషన్ ఏర్పాటు చేసి దివాళా తీసిన తరువాత కెబిసి ద్వారానే అమితాబ్ తిరిగి నిలదొక్కుకోవడం విశేషం. అందుకే పట్టుదలతో కృషి చేసిన సామాన్యులను ఆయన మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో ప్రోత్సహించారు. ఇలాంటి కార్యక్రమాలు తెలుగునాట మనం ఆశించడం అత్యాశే అవుతుందేమో!