29, మార్చి 2015, ఆదివారం

‘మా సహజ నటులు ’

‘‘ఏరా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటావు? ’’
‘‘ కెసిఆర్ అయినా బాబైనా ఇచ్చిన మాటలో కనీసం 50 శాతం నిలబెట్టుకున్నా, జనం ఆదరిస్తారు. లేదంటే అంతే. అలుగుటయే ఎరుంగని ఆజాత శత్రువే అలిగిన నాడు అన్నట్టు ఓటమే ఎరుగని ఎన్టీఆర్ జీవితంలో ఓటమి ముద్ర వేసింది తెలంగాణ ప్రజలే కదా? రెండు రూపాయలకే కిలో బియ్యం ఇస్తానంటే గెలిపించారు, ఇచ్చాక కల్వకుర్తిలో చిత్తరంజన్ చేతిలో ఓడించలేదా? జనం మూడ్ ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం. ఢిల్లీలో మైనారిటీ ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ మూడునెలలు కూడా నడపలేక చేతులెత్తేస్తే ఆయన పని ఐపోయిందనుకున్నాం. మళ్లీ ఎన్నికలు జరిగితే ప్రతిపక్షమే లేకుండా ఏకపక్షంగా గెలిచేశాడు. 70సీట్లున్న అసెంబ్లీలో 67సీట్లతో అంతా ఏకపక్షంగా గెలిస్తే కేజ్రీవాల్‌కు తిరుగులేదు అనుకుంటే నెల గడవక ముందే పార్టీలో సస్పెన్షన్‌లు, లుక లుకలు. బహుశా సస్పెన్స్ సినిమాలను మించిన సస్పెన్స్ చూపించాలనేమో ప్రజలు చివరి నిమిషంలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. నాలుగేళ్లపాటు జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ పార్టీకి తిరుగులేకుండా పోయింది. బాబు పార్టీకి ఒక్క సీటు దక్కలేదు. డిపాజిట్ దక్కితేనే గొప్ప అన్నట్టుగా ఆయన పార్టీ పరిస్థితి మారిపోయింది. జగన్‌కు ఎదురులేదు, బాబుది ముగిసిన జమానా అనిపించింది. రాష్ట్ర విభజనతో ఏమైంది?

 అనుభవం ఉన్న కాంట్రాక్టర్‌కే కాంట్రాక్టు దక్కినట్టు, తొమ్మిదేళ్ల పాలనానుభవం ఉన్న బాబుకే ప్రజలు నవ్యాంధ్ర నిర్మాణ కాంట్రాక్టు అప్పగించేశారు. తెలంగాణ ఇస్తే కెసిఆర్ ఇంటి ముందు కొడుకు, అల్లుడు, బిడ్డ తప్ప ఎవరూ ఉండరన్న హనుమంతరావుకు చివరకు డిపాజిట్ దక్కలేదు. కెసిఆర్‌కు ముఖ్యమంత్రి పీఠం దక్కింది. లక్కు బాస్ లక్కు ’’
‘‘నేనడిగింది ఆ ఎన్నికల గురించి కాదు? ’’
‘‘ మరింకే ఎన్నికలు? మండలి ఎన్నికల్లో ఐతే ఆంధ్రలో టిడిపి ఒక సీట్లో ఓడింది, ఒక దాంట్లో గెలిచింది. తెలంగాణలో టిఆర్‌ఎస్ ఒకటి ఓడింది. ఒకటి గెలిచింది. మండలి ఎన్నికల ఫలితాల కోసం పత్రికలు మాత్రమే చదివే అలవాటుంటే, దానికి తోడు టిడిపి వెబ్‌సైట్ కూడా  చూసే జబ్బుంటే 
తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఓడిపోయినట్టు, ఆంధ్రలో వచ్చే సాధారణ ఎన్నికల కోసం కూడా అడ్వాన్స్‌గా టిడిపికే ఓటు వేసినట్టు అనిపిస్తుంది ’’
‘‘అవి కాదు.. మా ఎన్నికల గురించి?’’
‘‘ ఓహో నువ్వడుగుతున్నది సినిమా నటుల మా ఎన్నికల గురించా? ’’
‘‘మా ఎన్నికల చిత్రం మాత్రం మంచి వినోదాత్మకంగా ఉంది. సహజన నటుల సహజ నటన ఆకట్టుకునే విధంగా ఉంది. దర్శకత్వం బాగుంది. డైలాగులు పేలుతున్నాయి. ఈ కాలంలో వస్తున్న సినిమాల్లో నటనలో హీరోలకు, అందాల ఆరబోతలో హీరోయిన్‌లకు తప్ప నటించేందుకు మిగిలిన పాత్రలకు అసలు అవకాశం ఉండడం లేదు. కానీ మా చిత్రంలో అలా కాకుండా ప్రతి పాత్ర తన నటనా విశ్వరూపాన్ని లైవ్‌గా చూపించే అవకాశం మా ఎన్నికల ద్వారా లభించిది. చాలా కాలం తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టులకు పర్మార్మెన్స్‌కు మంచి స్కోప్ ఉన్న చిత్రం ఇది. నటీనటులు పాత్రో చితంగా నటించారు. ఎవరు విలనో? ఎవరు హీరోనో కథను ఎవరు నడిపిస్తున్నారో తెలియకుండా చివరి వరకు సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. కథ బాగుంది, కథనం బాగుంది. హాస్యాన్ని సపరేట్ ట్రాక్‌లో కాకుండా కథలో మిళితం చేసి చక్కగా చూపిస్తున్నారు. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా రిచ్‌గా నిర్మిస్తున్నారు. కాస్ట్యూమ్స్ బాగున్నాయి. ఎక్కడా అతి అనిపించలేదు. అంతా సహజంగా నటిస్తున్నారు. ’’
‘‘ నేను మా ఎన్నికల గురించి అడిగితే నువ్వు సినిమా రివ్యూలా చెబుతావేమిటి? ’’
‘‘ సినిమా వాళ్ల ఎన్నికలు కాబట్టి సినిమా రివ్యూలా చెప్పాను. అయినా నేను ఎక్కడా అతిగా చెప్పలేదు. నేను కూడా సహజంగానే చెప్పాను కావాలంటే ఒక్కో మాటను వివరించి చెబుతాను.’’
‘‘ సరే చెప్పు’’
‘‘మా ఎన్నికల్లో రాజకీయ నాయకులు ప్రవేశించారని మాజీ హీరోలు మురళీమోహన్, నరేష్, కృష్ణంరాజులు, మాజీ హీరోయిన్ జయసుధలతో పాటు ఇంకా చాలా మంది డైరెక్టర్ చెప్పినట్టుగానే ఎంత సీరియస్‌గా వ్యాఖ్యానించారో టీవిలో చూశావా? ’’
‘‘ ఇందులో విమర్శించడానికి ఏముంది ఇది నిజమే కదా? ’’
‘‘ నిజమే కానీ అలా విమర్శించిన వాళ్లంతా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన వారే. మురళీమోహన్ ఇంకా రాజమండ్రిలో టిడిపి ఎంపిగా వెలిగిపోతున్నారు. కృష్ణంరాజు కాంగ్రెస్, బిజెపి, ప్రజారాజ్యం నుంచి మళ్లీ బిజెపిలోకి వచ్చిన వారు. ఇక జయసుధ తొలుత టిడిపిలో చాన్స్‌లు దొరక్క అటు నుంచి కాంగ్రెస్ వైపు వచ్చి సికింద్రాబాద్‌లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నరేష్ బిజెపి నాయకుడిగా అనంతపురం నుంచి పోటీ చేశారు. ఇకపై తాను   అనంతపురంలోనే ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేశారు. వేదిక పై కనిపించిన  చోటా  తార హేమ కు రాజకీయ ఉంది .. కిరణ్ కుమార్ ఎన్నికల  పెట్టి , ఎన్నికల తరువాత మూసేసిన పార్టీ లో ఏకైక గ్లామర్ తార ఆమెనే ...   వీళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాజేంద్ర ప్రసాద్ గతంలో టిడిపి తరఫున విస్తృతంగా ఎన్నికల్లో ప్రచారం చేసిన వారే. ఇక వారికి మద్దతు ఇస్తున్న నాగబాబు మాత్రం ప్రజారాజ్యం నుంచి వచ్చిన వారు. అంతా టిడిపిలో పని చేసే వారే అయినప్పుడు రాజకీయాల ప్రమేయం అని టిడిపి ఎంపి, ఆయన వర్గం తారలు  విమర్శించడం ఏమిటో?  అమెరికాలో పుడితే ఏ  దేశం వారైనా వారికి ఆటోమేటిక్  అమెరికా పౌరసత్వం లభించినట్టు .. కళామతల్లి సినిమా బిడ్డలందరికీ ఆటోమేటిక్ గా టిడిపి సభ్యత్వం వచ్చేస్తుంది .మా లో రాజకీయ నాయకులూ ప్రవేశించారు అనే కంటే టిడిపి యేతర పార్టీ లు ప్రవేశించాయని విమర్శిస్తే సహజంగా ఉంటుంది . రాజకీయాల్లో టిడిపి, బిజెపి మిత్ర పక్షాలు .. మాలోనూ  అంతే  ’’
‘‘ఔనా?’’
‘‘మాలో ఈరోజు రాజకీయ నాయకులు ప్రవేశించారు, రేపు మాఫియా ప్రవేశిస్తుంది అంటూ నరేష్ ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ల దృష్టిలో రాజకీయ నాయకులు మాఫియా అయితే మరి స్వయంగా ఈ నటులంతా రాజకీయ నాయకులే కదా? వ్యబిచారం కేసులో పట్టుపడిన వారు, మాదక ద్రవ్యాల కేసుల్లో పట్టుపడిన వారు ఎంత మంది లేరు. బాగా తాగి ఎదుటి వారిని షూట్ చేసిన మహా హీరోలు వీళ్లలోనే ఉన్నారు కదా? లాడెన్ ఈవ్ టీజింగ్‌కు పాల్పడేవారిని విమర్శిస్తే ఎలా ఉంటుంది?’’

‘‘ఇంతకూ ఎవరు గెలుస్తారంటావు? ’’
‘‘ఎవరు గెలిచినా అధికారం ఆ వర్గం చేతిలోనే ఉంటుంది. మా ఎన్నికల్లో రాజకీయాల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి టిడిపినే గెలుస్తుంది.’’
‘ఆ...?????’’
-బుద్దా మురళి  

22, మార్చి 2015, ఆదివారం

చెయ్యెత్తి చితగ్గొట్టు తెలుగోడా!


‘‘ చీ పొండి అంత మందున్నారు. మీరు మరీ చిలిపి. సిగ్గులేకుంటే సరి. మన్మథనామ సంవత్సరం ప్రభావం మీ మీద బాగానే పడినట్టుంది. మీకు రోజు రోజుకు సరసాలు ఎక్కువయ్యాయి’’ అంటూ ఆడ చీమ బుగ్గను రాసుకుంటూ ముందుకు వెళ్లింది. మగ చీమ వేగంగా ఆడ చీమను అనుసరిస్తూ వెళ్లింది. మగ చీమ వేగంగా వెళుడుండడంతో వచ్చిన శబ్దం అక్కడున్న వారికి స్పష్టంగా వినబడింది.
నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అధినేత సమావేశ మందిరం లోనికి వచ్చాడు. అధినేత ముఖంలోని కోపాన్ని చూసి చీమలు అక్కడి నుంచి మెల్లగా తప్పుకుని వెళ్లిపోయాయి.
***
‘‘నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను. అసలు మనం ఎక్కడికెళుతున్నాం. ఇదేనా మన సంస్కృతి. మిమ్మల్ని మీరు ఆత్మ విమర్శ చేసుకోండి. ఇలాగైతే అలా ముందుకు ఎలా వెళతాం ’’ అంటూ అధినేత ఆవేశంగా ప్రశ్నించారు. (కర్త , కర్మ, క్రియ సక్రమంగా ఉండని ఆయన మాటల నుంచి సారాంశాన్ని తీసుకుంటే వచ్చిన అర్ధం ఇది) చింపిరి జుట్టు నేత ఒకరు తప్ప మిగిలిన వారి ముఖం వెలవెలబోతోంటే, అతని ముఖం మాత్రం వెలిగిపోతోంది. అధినేత అతన్ని చూసి భుజం తట్టి ప్రోత్సహించి మాట్లాడమని చెప్పారు.


మన వాళ్లు సహకరించక పోయినా ఒంటి చేత్తో రణ రంగంలో వీరోచితంగా పోరాడాను అని అతను చెప్పుకొచ్చాడు. వెరిగుడ్ బ్రదర్ అంటూ అధినేత అతన్ని మెచ్చుకున్నారు. అనేక వీధిపోరాటాల్లో ఆరితేరిన ఆ వీరుడు ఇదే అవకాశం అని తన వీరోచిత గాథను చెప్పుకు పోతున్నాడు. ‘‘నేను ఆ సభకు కొత్త కావచ్చు కానీ వీధిపోరాటాలకు కొత్త కాదు. స్కూల్‌లో చదువుకునేప్పుడే సెకండ్ షో సినిమాకు వెళ్లి వస్తుంటే రోడ్లో వీధి కుక్కలు వెంట పడ్డాయి. ఏం చేయాలా? అని క్షణంలో వెయ్యో వంతు ఆలోచించాను. చిన్నప్పుడు తరగతి బుక్స్ కన్నా డిటెక్టివ్ బుక్స్‌నే ఎక్కువ చదివేవాడ్ని. ఇదే సందర్భం ఎదురైతే, షాడో ఏం చేసేవాడో క్షణంలో వందో వంతు సమయం ఆలోచించాను. ఎంతటి క్లిష్టపరిస్థితి ఎదురైనా షాడో క్షణంలో వెయ్యే వంతు కన్నా ఎక్కువ సమయం తీసుకోడు ఫట్ ఫట్ మంటూ ప్రత్యర్థులను మట్టికరిపిస్తాడు. కానీ నాకా ఆవకాశం లేదు. దాంతో క్షణంలో మరో 150వ వంతు సమయం ఆలోచించాను. చిన్న మెదడులో బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. నిజానికి చిన్నప్పటి నుంచి నన్ను చూసిన వారు నా చిన్న మెదడు చిట్లిందని, అది పని చేయదని అంటారు. నా చిన్నమెదడు పని చేయదని వాళ్లూ వీళ్లూ చెప్పడమే కానీ నిజంగా అది పని చేస్తుందో లేదో, చేస్తే ఎలా చేస్తుందో నాకూ తెలియదు. వినడమే తప్ప పని చేసేది చెయ్యంది నేనూ చూడలేదు.


కానీ ఆ రోజు నేను చిన్నమెదడుతోనే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని నా చిన్నమెదడు పని చేస్తుందని తేల్చుకున్నాను.
‘‘ బాబు ఇంతకూ ఆ రోజు ఏం జరిగిందో చెప్పు సస్పెన్స్‌లో ముంచకు’’ అని వెనక నుంచి మెల్లగా ఎవరో అడిగారు. వీడికి చాన్స్ దొరగ్గానే అధినేత ముందే మైకును తినేస్తున్నాడు. ఆత్మకథ అంతా వినిపిస్తున్నాడు. ఆయన తరువాత మనం మళ్లీ రెండు మూడు గంటల పాటు అధినేత ఉపన్యాసం వినాలి. మనమూ మనుషులమే ఇంత హింసను ఎలా భరిస్తామని పక్కనున్నాయనతో ఒకాయన తన ఆవేదన మెల్లగా చెప్పుకున్నాడు. రోలు వచ్చి మద్దెలతో చెప్పుకుంది అన్నట్టు నాతో చెబితే ఏం లాభం. నేనంటే వృద్ధుడిని నాకు దగ్గు మాత్రమే ఉంది. నువ్వు యువకుడివి దమ్ముంటే అధినేతకే చెప్పవచ్చు కదా అని మెల్లగా చెవిలో చెప్పాడు.
చింపిరి జుట్టు నేత మళ్లీ మైకు సరి చేసుకుంటూ చదువుకునేప్పుడు సెకండ్ షో సినిమా చూసి వస్తుంటే కుక్కలు వెంట పడితే వాటితో నేను వీరోచితంగా ఎలా పోరాడానో తెలుసుకోవాలనే కదా మీరంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వజ్రాన్ని వజ్రంతో కోయమన్నారు. నేనూ అదే పని చేశాను. కుక్కలు వెంట పడి అరిస్తే, భయపడి పారిపోకుండా ఒక్కసారిగా వాటిని కోపంగా చూశాను, వాటి కన్నా బలంగా అరిచాను, కరిచాను. దాంతో ఒక కుక్క అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కుక్క కరిస్తే బొడ్డు చుట్టు సూదులు తప్పవని ప్రజలు భయపడేవారు. కానీ నేను జాతికి వెలుగునిచ్చాను. ప్రపంచానికి కొత్త విషయాన్ని చెప్పాను. కుక్క కాటుకన్నా మనిషి కాటు ప్రమాదకరం అని నా బాల్యంలోనే కుక్కలకు తెలియజెప్పాను.
పూవు పుట్టగానే పరిమళించినట్టు చిన్నప్పుడే ఇంత గొప్ప ఆవిష్కరణలు చేసిన నేనంటే మా వీధిలో అందరికీ హడల్. ఇప్పుడు నా గొప్పతనం జాతి జనులందరికీ తెలియడానికి అవకాశం కల్పించింది మాత్రం మీరే అని అధినేతకు వినయంగా నమస్కారం చేసి ముగించారు. మీరేం చేయాలో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను అని అధినేత తన వారికి చెప్పకనే చెప్పారు.
***
దేశంలో ఎక్కడెక్కడి సభలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటే ఇంకా పాత కాలపు సంచలనాలతోనే కాలం గడుపుతున్నందుకు మేం సిగ్గుతో తల దించుకుంటున్నాం. పెద్దలు చూపిన మార్గంలో నడుస్తాం. కసరత్తు చేస్తాం, మల్ల యుద్ధం, కర్ర తిప్పడం, పిడిగుద్దులు గుద్దడం, నోటి తీట తీరేంత వరకు కొత్త కొత్త తిట్లు తిడతామని, నేను నా జాతిపై ప్రమాణం చేస్తున్నాను. కొత్త కొత్త తిట్లు నేర్చుకుంటానని ప్రమాణం చేస్తున్నాం. ఇకపై మరోసారి ఇలా తలదించుకునే పరిస్థితి రాదని, మర్డర్ చేసి సభలోకి రావడం కాదు... సభలో మర్డర్ చేసేంతగా ఎదుగుతామని మాటిస్తున్నాం అని అంతా ప్రమాణం చేశారు.
***
మహిళ, పురుష అనే తేడా లేకుండా జాతి చైతన్యాన్ని ప్రదర్శించాలని అన్ని పక్షాలు ఏకగ్రీవంగా తీర్మానించుకున్నాయి. ఈ సందర్భంగా మీమీ హోదాలను బట్టి మీకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని ఆయా పార్టీల అధినేతలు ప్రకటించడంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్లారు. ఆ సమయంలో వారిని చూస్తే అచ్చోసిన ఆబోతులు సైతం గజగజ వణికిపోవలసిందే.


****
నన్నపనేని రాజకుమారి , గంగా భవానీ , మోత్కుపల్లి నర్సింహులు లాంటి మహనీయులు నడయాడిన ఈ  సభలో  వారి తరువాత ఆ మహా సంస్కృతి అంతరించి పోవలసిందేనా ?  అనే ఆవేదన ఉండేది .. మేమున్నామని కొత్త తరం వారి వారసత్వాన్ని అంది పుచ్చుకోవడం సంతోషంగా ఉంది  అంటూ ఓ సీనియర్ నేత ఉబికి వస్తున్న ఆనంద బాష్పాలను తుడుచుకొన్నాడు .
- బుద్దా మురళి 

15, మార్చి 2015, ఆదివారం

రాజరికం కమ్ కంపెనీ పాలన!

‘‘రాజువయ్యా మహరాజు వయ్యా’’
‘‘ మా వైఎస్‌ఆర్ పై ప్రేమ పుట్టుకొచ్చిందేమిటి?’’
‘‘నేను పాడే పాటకు నీ మాటకు సంబంధం ఏమిటో నాకర్ధం కావడం లేదు’’
‘‘అబ్బో నటించకు.. టీవి ఆన్ చేయగానే వైఎస్‌ఆర్ బొమ్మ చూపిస్తూ రాజువయ్యా మహరాజువయ్యా అని పాటివినిస్తుంది. తెలియదా? ’’
‘‘నీ ఉద్దేశం ప్రకారం ఇది మీ పార్టీ జాతీయ గీతం అన్నమాట! నీకు తెలుసో లేదు కానీ మీ పార్టీ పుట్టక ముందే ఈ పాట పుట్టింది.’’
‘‘మా తెలుగు తల్లికి పాట ఎన్టీఆర్‌కు రాజకీయాల్లోకి కాదు కదా కనీసం సినిమాల్లో అవకాశాలు కూడా రాని రోజుల్లో పుట్టింది. కానీ చివరకది తెలుగుదేశం పార్టీ జాతీయ గీతం అయింది. పాట ఎలా పుట్టిందని కాదు.. ఆ పాటను ఎవరెలా ఉపయోగించుకున్నారన్నది ముఖ్యం. అలానే రాజువయ్యా మహరాజువయ్యా అనగానే వైఎస్‌ఆరే గుర్తుకొస్తారు. వైఎస్‌ఆర్ గుర్తుకొచ్చి కాకుంటే మరెందుకు పాడావాపాట? ’’


‘‘కెసిఆర్ కోసం పాడాను. కెసిఆర్ తనను తాను తెలంగాణకు రాజును అనుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులంటే అవును మా కెసిఆర్ మహారాజు మనసున్న మహారాజు ప్రజలెన్నుకున్న మహారాజు అని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కీర్తిస్తుంటే పాట గుర్తుకొచ్చింది. ’’
‘‘నిజమే కెసిఆర్ ఏమైనా రాజుననుకుంటున్నాడా? రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టు వందల కోట్లను ఆలయాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నాడేమిటి? బాబుగారు తన తొలి పాలనా కాలంలో బిల్‌గేట్స్, బిల్ క్లింట్లన్ , ఉల్ఫెన్‌సన్ అంటూ నోరు తిరగని కొత్త కొత్త పేర్లు స్మరిస్తూ అలా ముందుకెళ్లేవారు. కెసిఆర్ కాకతీయలు, రెడ్డిరాజులు, బహుమనీ సుల్తాన్‌లు, అసఫ్‌జాహీలు అంటూ అలా వెనక్కి వెళుతున్నారేంటి? ’’
‘‘ప్రజలను పట్టించుకోకుండా ఉల్ఫెన్‌సన్ అంటూ అలా ముందుకు వెళ్లడం వల్లనే కదా జనం పదేళ్లపాటు ఆయన్ని వెనక పడేశారు. ముందుకు వెళ్లడం వల్ల వెనకబడిపోతామని కెసిఆర్ ముందు జాగ్రత్తగా అలా రాజులను గుర్తు చేస్తూ మహారాజులా నిలిచిపోవాలనుకుంటున్నారేమో.. కుంభకోణాలతో ప్రజల సొమ్ము స్వాహా చేస్తే తప్పు, అవినీతిపై విచారణకు స్టే పొంది రాజకీయం చేస్తే తప్పు కానీ ఆలయాలను అభివృద్ధి చేస్తే తప్పేంటి? ’’
‘‘తప్పని కాదు రాచరికంలో కూడా ఇలానే ఆలయాలను నిర్మించే వారు. బహుశా కెసిఆర్ కూడా అలా రాజరికంలో బతికేస్తున్నాడేమో అని ’’
‘‘మనది సెక్యులర్ దేశం సరే కానీ సెక్యులరిజం అంటే ఆలయాలను పట్టించుకోవద్దు అని ఎక్కడా లేదు కదా? ప్రజాస్వామ్యం అంటేనే మెజారిటీ ప్రజల అభీష్టం కదా? మెజారిటీ ప్రజల ఆలయాలను అభివృద్ధి చేస్తే తప్పేముంది. ’’


‘‘ఆలయాలనే కాదు ప్రజలను కూడా పట్టించుకోవాలి కదా? విమర్శించే వాళ్ల ఉద్దేశం అదే కావచ్చు. లేకపోతే కుల భవనాలు, మతాలయాలు ఇలా ఉదారంగా కట్టేస్తుంటే మా పరిస్థితి ఏంటనే భయం కావచ్చు. నువ్వెన్నయినా చెప్పు మన వాళ్లకు రాజులపై ఇప్పటికీ బోలెడు ప్రేమ. విజయనగరం నుంచి గెలిచే అశోకగజపతిరాజు ఏమీ చేయకపోయినా రాజులపై ఉండే అభిమానంతో గెలిపిస్తాడంటారు. మనకు తెలియని రాజుల పాలన అద్భుతంగా ఉండేది అని కొందరి గట్టి నమ్మకం.’’
‘‘మరి రాజుల పాలన నిజంగా అంత అద్భుతంగా ఉండేదా? ఇప్పుడు రాజులు ముస్లిం దేశాల్లో మాత్రమే ఉన్నారు. మొన్నో రాజు తన పుట్టిన రోజున దేశంలో అందరికీ కానుకల వర్షం కురిపించారట! రాజుల గురించి ఇలాంటి కథలు వింటుంటే రాజరికం నిజంగానే బాగుండేదేమో అనిపిస్తోంది ’’
‘‘రాజుల పాలన చూసిందెవరు? ఇప్పుడు ముఖ్యమంత్రులు తమ పాలన అద్భుతం అంటూ మీడియాలో ఫుల్ పేజీ ప్రకటనలు, టీవిల్లో అదర గొట్టే యాడ్స్ ఇచ్చుకున్నట్టుగా రాజుల కాలంలో ఇలాంటి సౌకర్యం లేదు కాబట్టి నా పాలన పరమాద్భుతం అంటూ శాసనాలు రాయించుకునేవారు. అవి తప్ప మరో ఆధారం ఏముంది. పత్రికల్లో వచ్చే సమాచార శాఖ వారి ప్రకటనల ఆధారంగా ప్రభుత్వ పనితీరు ఊహించుకుంటే ఎలా ఉంటుందో, శాసనాలను బట్టి ఆ రాజు పాలనను అంచనా వేయడం కూడా అలాంటిదే ’’
‘‘అంటే దేన్నీ నమ్మవద్దంటావా? ’’


‘అలా నేనెందుకంటాను? అలా అని పూర్తిగా నమ్మవద్దు అనేది నా ఉద్దేశం. ఆ రాజు ప్రజలను తన కన్నబిడ్డల్లా చూసుకునే వారు అని ముగుస్తాయి అనగనగా ఒక రాజు కథలన్నీ... కథల వరకు ఓకే కానీ నిజంగా రాజు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటారా? అన్నదమ్ములే రాజ్యం కోసం చంపుకున్న మహాభారతాన్ని చదివిన తరువాత కూడా రాజులు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవారంటే ఎలా నమ్ముతాం. మహాభారతంపై నమ్మకం లేకపోయినా రాజ్యం కోసం తండ్రిని చంపిన కొడుకులు, కొడుకులను చంపిన తండ్రి, అన్నను చంపిన తమ్ముళ్ల కథలు చరిత్రలో ఎన్ని లేవు. ఐనా దీని కోసం చరిత్ర దాకా ఎందుకు మన కళ్లముందే జరిగింది కదా? ఏం జరిగిందో గుర్తు చేసుకో నేను చెప్పడం ఎందుకు? ’’
‘‘ఇంతకూ తెలుగు పాలకుల పాలన రాజుల పాలన గుర్తుకు తెస్తుందా? లేదా? ’’


‘‘ తెలుగు పాలకులే కాదు తమిళ పాలకులైనా? బెంగాలీ మమతక్క పాలనైనా ప్రాంతీయ పార్టీల పాలన ఎక్కడ సాగినా అది కంపెనీ పాలన అవుతుంది కానీ రాజరికం కాదు. రాజరికం కన్నా ఇది కొంచం బెటర్. మొగలాయిల పాలన తరువాత దేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పాలించింది. కంపెనీ పాలన అని ముద్దుగా పిలుచుకునే వాళ్లు. 1857 సైనిక తిరుగుబాటు తరువాత కంపెనీ నుంచి నేరుగా బ్రిటీష్ రాణి పాలన ప్రారంభం అయింది. 90 ఏళ్ల పాటు బ్రిటీష్ రాణి నేరుగా పాలించారు. ఇంత కాలానికి మళ్లీ దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ కంపెనీల పాలన సాగుతోంది. సైనిక తిరుగుబాటు వచ్చే అవకాశాలు లేనే లేవు. ఎందుకంటే ఇది రాజరికం కమ్ కంపెనీ పాలన విధానాన్ని మిక్స్ చేస్తే వచ్చిన ప్రాంతీయ పార్టీల పాలనా కాలం.         - బుద్దా మురళి 

8, మార్చి 2015, ఆదివారం

మోడీ , కెసిఆర్ , కేజ్రివాల్ , బాబు , అమృతాంజనం... ఎవరు శక్తి వంతులు ?

‘‘నరేంద్ర మోదీ, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, నారా చంద్రబాబునాయుడు ఈ ముగ్గురిలో ఎవరు గొప్పంటావు? ’’
‘‘నువ్వో ప్రశ్న అడిగావంటే నా నుంచి సమాధానం కోసం కాదు. ఆ ప్రశ్నకు నీ దగ్గరో సమాధానం ఉంటుంది. నువ్వు అడిగిన ప్రశ్నకు నువ్వు ఆశిస్తున్న సమాధానం ఏమిటో కూడా నువ్వే చెప్పు వింటాను’’
‘‘ నాకైతే నరేంద్ర మోదీని మించిన నాయకుడు లేడనిపిస్తోంది’’
‘‘ ప్రపంచంలో నెటిజన్ల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న వారిలో అమెరికా అధ్యక్షుడిది మొదటి స్థానం అయితే రెండవ స్థానం మోదీది.. ’’
‘‘నీ అభిప్రాయం నీ ఇష్టం. వెనకటికో ఎలుకకు పెళ్లీడు రాగానే తమ తోటి మగ ఎలుకలు పెళ్లి ప్రపోజ్ చేశాయి. ఛీ.. ఇంత అందగత్తెనైన నేను మీలాంటి వాళ్లను చేసుకునే ప్రసక్తే లేదు. అత్యంత శక్తివంతులు ఎవరో వాళ్లనే చేసుకుంటాను అందట. పులి, ఎనుగు, చివరకు నీరు,నీప్పు అన్నీంటిని తిరస్కరించింది. అన్నింటిని ఎదురొడ్డి నిలిచే కొండ చూసి మనసు పారేసుకుని కొండే శక్తివంతమైందని దాన్ని పెళ్లి చేసుకోవాలనుకొని ప్రపోజ్ చేసింది. కొండ నవ్వి నేను శక్తివంతమైన దానే్న కానీ ఎలుక నాకన్నా శక్తివంతమైంది. నా కింద కన్నం వేసి మట్టిని తొలచి నేను పడిపోయేట్టు చేసేంత శక్తి ఎలుకకు ఉందని చెప్పుకొచ్చింది. దాంతో బుద్ధిగా ఆ ఎలుక మరో ఎలుకతో జత కట్టింది’’
‘‘నేను మోదీ గురించి అడుగుతుంటే నువ్వు ఎలుక గురించి చెబుతున్నావు. మోదీ అంటే అంత చిన్నచూపా? ’’
‘‘ నేనెక్కడ చిన్నచూపు చూశాను. పర్వతం లాంటి మోదీని చిట్టెలుక లాంటి కేజ్రీవాల్ పార్టీ ఢిల్లీలో చిత్తుగా ఓడించలేదా? ’’
‘‘ సరే పోనీ కేజ్రీవాల్ అందరి కన్నా శక్తివంతమైన నాయకుడనుకోవచ్చా’’
‘‘ ఆ మాట నేనెక్కడన్నాను. మోదీని కేజ్రీవాల్ ఓడిస్తే, కేజ్రీవాల్‌ను జలుబు ముప్పు తిప్పలు పెడుతూ అధికారంలోకి వచ్చాననే సంతోషం కూడా లేకుండా చేసింది. దేశమంతా గెలిచిన ఆనందం లేకుండా మోదీకి కేజ్రీవాల్ చేస్తే, కేజ్రీవాల్‌కు అనందం లేకుండా జలుబు చేసింది. అలాంటి జలుబుకు అమృతాంజనం లోకువ అనుకో అది వేరేవిషయం’’
‘‘ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అత్యంత శక్తివంతమైన నాయకుడు. 14 ఏళ్లపాటు ఉద్యమం జరిపి, అసాధ్యం అనుకున్న తెలంగాణను సాధించి చూపించాడు. చెన్నారెడ్డి చేయలేనిది కెసిఆర్ చేశాడు. చెన్నారెడ్డికి ఇందిరాగాంధీ కూడా భయపడేదట! చెన్నారెడ్డిని ఖాళీగా ఉంచితే ప్రమాదం అనేదట! అలాంటి చెన్నారెడ్డి వల్ల కానిది కెసిఆర్ వల్ల అయిందంటే కెసిఆర్ శక్తివంతమైన నాయకుడే కదా? ’’
‘‘ముందే చెప్పాను. నీ అభిప్రాయం నీ ఇష్టం అని కానీ అలానే నీ లాజిక్ నీ ఇష్టం నీ లాజిక్‌తో నేను ఏకీభవించాల్సిన అవసరం లేదు’’
‘‘ అంటే ఇంతకూ చెన్నారెడ్డి కన్నా కెసిఆర్ శక్తివంతుడు అని ఒప్పుకుంటున్నావా? లేదా? ’’
‘‘ నువ్వు చెప్పిన లాజిక్ తరహాలోనే కొన్ని లాజిక్‌లు చెబుతాను. అప్పుడు నువ్వే చెప్పు నీ లాజిక్ సరైనదో కాదో? వాజ్‌పాయి లాంటి ప్రతిపక్ష నాయకుడు సైతం ఇందిరాగాంధీని శక్తిమాత అని కొనియాడారు. పాకిస్తాన్‌పై విజయం సాధించి బంగ్లాదేశ్ ఆవిర్భావం కావడానికి ఆమె చూపిన ధైర్యానికి ప్రతిపక్ష నాయకుడు సైతం మెచ్చుకోకుండా ఉండలేక పోయారు. అలాంటి ఇందిరాగాంధీ సైతం ఎన్టీఆర్ శక్తి ముందు నిలువలేకపోయారు. తొలి వెన్నుపోటు సమయంలో ఎన్టీఆర్‌కు మద్దతుగా జనం స్పందన చూసి ఇందిరాగాంధీ తన నిర్ణయాన్ని మార్చుకుని ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యేట్టు చేశారు. అంటే నీ లాజిక్ ప్రకారం ఇందిరాగాంధీ కన్నా ఎన్టీఆర్ శక్తివంతుడు. ఆగాగు నా మాట పూర్తి కానివ్వు. టిడిపి అభిమానుల భాషలో చెప్పాలంటే ఇందిరాగాంధీ మెడలు వంచిన నాయకుడు ఎన్టీఆర్ కదా? అలాంటి ఎన్టీఆర్‌ను అధికారం నుంచి దించింది ఎవరు బాబుగారు. నల్లరంగు దుస్తులు వేసుకోని ఊళ్లన్నీ తిరుగుతూ ఎన్టీఆర్ నాకు అన్యాయం జరిగిందని ఘోషించారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక చివరకు ఎన్టీఆర్ కన్ను మూశారు. ఇప్పుడు చెప్పు ఇందిరాగాంధీ మెడలు వంచిన ఎన్టీఆర్‌ను సైతం మట్టికరిపించిన చంద్రబాబు నీ లాజిక్ ప్రకారం ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌ల కన్నా శక్తివంతుడే కదా? అవును అని నువ్వు చెబితే , మరి అంతటి శక్తి వంతుడు బాబును 2004 ఎన్నికల్లో 47 సీట్లకు పరిమితం చేసి ఘోరంగా ఓడించిన వై యస్ ఆర్ వీరందరి కన్నా శక్తి వంతుడు అని ఒప్పుకోవాలి  ’’
‘‘నా వాదనను నువ్వు సమర్ధిస్తున్నట్టే సమర్ధిస్తున్నావు కానీ వ్యతిరేకిస్తున్నావు. ఇంతకూ నువ్వు చెప్పు ఎవరి శక్తివంతుడు? ’’


‘‘ మహాభారత యుద్ధాన్ని అంతా శ్రీకృష్ణుడు ఒంటి చేత్తో నడిపించాడు. అలాంటి శ్రీకృష్ణున్ని కోన్ కిస్కా సామాన్యుడు బాణం పుల్లతో పైకి పంపించేశాడు. కాబట్టి అతను శ్రీకృష్ణుడి కన్నా గొప్పవాడు అందామా? ఇచ్ఛాపూర్వకంగా కోరుకున్నప్పుడు మరణించేంత గొప్ప వరపుత్రుడు, మహాశక్తివంతుడు భీష్ముడి మరణానికి శిఖండి కారణం. అంత మాత్రాన భీష్ముడి కన్నా శిఖండి శక్తివంతుడందామా? పురాణాల్లోనే కాదు ఫ్యాక్షన్‌లోనే ఇలాంటి సిత్రాలు జరుగుతుంటాయి. ఫ్యాక్షన్‌లో కోట్లు సంపాదించిన శక్తివంతులను కోన్ కిస్కా ఎవరో ఎవరి కళ్లల్లోనే ఆనందం చూడాలనుకుని పైకి పంపిస్తుంటారు. ’’


‘‘ మరి నీ వాదన ప్రకారం శక్తివంతులు అంటూ ఎవరూ లేరా? ’’
‘‘ అని నేనెక్కడన్నాను. ఎందుకు లేరు ఉన్నారు. పురాణాల కాలం నుంచి నేటి బూతు పురాణ కాలం వరకు శక్తివంతుడు ఒకే ఒకరు ’’
‘‘ ఎవరు దేవుడా? ’’
‘‘ పిల్ల రాక్షసుల చేతిలో పడి పరుగులు తీసిన దేవుళ్ల కథలు మనకు ఎన్ని తెలియవు’’
‘‘ మరి ఇంతకూ ఎవరయ్యా బాబు శక్తివంతుడు. ఎవరి పేరు చెప్పినా కాదంటావు? నువ్వు చెప్పవు’’
‘‘ సమాధానం చెప్పనని ఎప్పుడన్నాను’’
‘‘ మరి చెప్పు సమాధానం’’
‘‘ కాలం.. ఔను అందరి కన్నా శక్తివంతమైంది కాలం. కేజ్రీవాల్‌కు కాలం కలిసొచ్చింది బిజెపియేతర ఓటర్లు ఏకమయ్యారు గెలిచాడు అంతే తప్ప మోదీ కన్నా శక్తివంతుడు అని కాదు. అలానే కాలం కలిసి రావడంతో కెసిఆర్ వల్ల తెలంగాణ సాకారం అయింది అంతే తప్ప చెన్నారెడ్డి కన్నా ఎక్కువ తక్కువ అని కాదు. బాబుకు కాలం కలిసి రావడంతో ఎన్టీఆర్ నిర్వీర్యుడు అయిపోయాడు కానీ ఇందిరాగాంధీ కన్నా బాబు శక్తివంతుడు అని కాదు. బాబు పదేళ్ళ పాలనతో రాజశేఖర్ రెడ్డికి కాలం కలిసి వచ్చింది ..  నేతలను విజేతలుగా చేసేది పరాజితులుగా మార్చేది కాలమే.

- బుద్దా మురళి