29, నవంబర్ 2023, బుధవారం

తిక్కవరపు ఇంటికి వెళ్లిన కొత్త పెళ్లి కొడుకు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి .. టీడీపీ అపవిత్రం అయిందన్న బాబు వర్గం .. అలా పుట్టింది ముసలం . జర్నలిస్ట్ జ్ఞాపకాలు -106

తిక్కవరపు ఇంటికి భోజనానికి వెళ్లిన కొత్త పెళ్లి కొడుకు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి టీడీపీ అపవిత్రం అయిందన్న బాబు వర్గం .. అలా పుట్టింది ముసలం జర్నలిస్ట్ జ్ఞాపకాలు -106 ---------------------- 1993-94 ప్రాంతం . ఎన్టీఆర్ రెండవ వివాహం చేసుకున్న కొత్తలో . అప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది . ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి కొత్తగా వివాహం చేసుకున్న ఎన్టీఆర్ దంపతులను తన ఇంటికి భోజనానికి పిలిచారు . ఇప్పుడైతే ఐతే ఏంది ? అనిపిస్తుంది . ఆ రోజులు అలా కాదు . ఎన్టీఆర్ ను గద్దె దించడానికి పార్టీలో పుట్టిన ముసలంలో ఈ భోజనం ఎపిసోడ్ కూడా ఒక ప్రధాన పాత్ర వహించింది . ఎన్టీఆర్ దంపతులు సుబ్బిరామిరెడ్డి ఇంటికి వెళ్ళగానే బాబు వర్గం రంగంలోకి దిగింది . లక్ష్మీ పార్వతి పార్టీని అపవిత్రం చేస్తోంది అనేది ఆ వర్గం ప్రచార సారాంశం . భోజనానికి వెళితే అపవిత్రమా ? అంటే వారి దృష్టిలో అంతే .. వారు అలా భావించడానికి ఓ కారణం ఉంది . హిమాయత్ నగర్ లో పార్టీ కార్యాలయం ఉన్నప్పుడు , తరువాత భవన్ లో టీడీపీ నాయకులతో సరదా సంభాషణల్లో మీ పార్టీ సిద్ధాంతం ఏమిటీ అంటే పలువురు రెండు రూపాయలకు కిలో బియ్యం అని గర్వం గా చెప్పేవారు . రెండు రూపాయలకు కిలో బియ్యం సిద్ధాంతం కాదు ఆదో స్కీమ్ అని గుర్తు చేస్తే ... చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దాదాపు అందరు నాయకులు కాంగ్రెస్ వ్యతిరేకతే మా సిద్ధాంతం అనే వారు . ఒక పార్టీని వ్యతిరేకించడం మరో పార్టీ సిద్ధాంతం ఏమిటో ? ఒక వేళ కాంగ్రెస్ రంగంలో లేకుండా పోతుంది అనుకోండి అప్పుడు మీ పార్టీకి సిద్ధాంతం లేకుండా పోతుంది కదా ? అని చమత్కరించేవాడిని . నిజానికి ఆ కాలం లో కాంగ్రెస్ రంగంలో లేకుండా పోతుంది అనే మాట ఊహకు అందనిది . ఈ మూడు దశాబ్దాల కాలం లో ఆంధ్ర లో కాంగ్రెస్ లేకుండా పోతే , తెలంగాణలో టీడీపీ లేకుండా పోయింది . ***** తిక్కవరపు ఇంటికి ఎన్టీఆర్ దంపతులు భోజనానికి వెళ్ళాక పార్టీలో బాబు వర్గం లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ను కాంగ్రెస్ కు దగ్గర చేస్తోంది అనే గుస గుస ప్రచారం మొదలు పెట్టారు .తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి కాంగ్రెస్ నాయకుడు , రాజ్యసభ సభ్యులు , కేంద్ర మంత్రి అయినా ఆయన పలుకుబడి కాంగ్రెస్ కె పరిమితం కాలేదు . ఉమ్మడి రాష్ట్రంలో ఆ కాలంలో కూడా ఆయన్ని ప్రచార పిచ్చి ఉన్న నాయకుడు అనే చూశారు కానీ ఢిల్లీలో అయన పలుకుబడి ఎలాంటిదో టీడీపీ రాజ్య సభ సభ్యులుగా ఉన్నప్పుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఓ సారి చెప్పారు . ఆయన ఢిల్లీలో పార్టీ ఇస్తే కేంద్రమంత్రులు ,ఆ న్నీ పార్టీల నాయకులు .... బడా బడా అధికారులు , సినిమా హీరోలు, హీరోయిన్ లు వచ్చేవారట . కనులతోనే ఎవరి అవసరం ఏమిటో గ్రహించేసే వారట .. అక్కడి పెద్దలు .. అంతటి సుబ్బిరామిరెడ్డి కంస్ట్రక్షన్ సంస్థ వేల కోట్ల అప్పులతో చేతులు ఎత్తేసింది . దివాళా ప్రక్రియ సాగుతోంది . లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ ను కాంగ్రెస్ కు చేరువ చేస్తోంది అని ప్రచారం ప్రారంభించిన బాబు వర్గం బాస్ బాబే స్వయంగా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారు . ఆ తరువాత లక్ష్మి పార్వతిపై టీడీపీ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం . ఎన్నికలు వచ్చాయి . కాంగ్రెస్కు ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా ఘోరంగా ఓడిపోగా ఎన్టీఆర్ సీఎం అయ్యారు . 95 వెన్నుపోటులో ఎన్టీఆర్ ను దించేసిన తరువాత ఎన్టీఆర్ కాంగ్రెస్ మద్దతు కోసం ప్రయతినించారు అని మళ్ళీ వార్తలు . అప్పుడు ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు జోక్యం చేసుకోక పోవడం ద్వారా పరోక్షంగా బాబుకు సహకరించారు . ఎన్టీఆర్ ను దించేసిన కొద్ది రోజులకే లోక్ సభ ఎన్నికలు వచ్చాయి . లోక్ సభ సీట్లు మీకు , అసెంబ్లీ మాకు .. బాబును దించేయాలి అని ఎన్టీఆర్ కాంగ్రెస్ తో మంతనాలు సాగిస్తున్నారని బాబు మీడియాలో ప్రచారం . బాబు సీఎంగా కుదురుకోవడంతో ఎన్టీఆర్ తెలుగుదేశం అని కొత్త పార్టీ ఏర్పాటు చేసి పోటీకి సిద్ధమయ్యారు కానీ ఎన్నికలు రాకముందే మరణించారు . ఎన్టీఆర్ నిజంగా కాంగ్రెస్ తో చేతులు కలిపారా ? బేరం కోసం ప్రయత్నించారా ? అంటే ఆ మాట చెప్పల్సింది ఎన్టీఆర్ , వార్తలు రాయించిన బాబు ... చెప్పడానికి ఎన్టీఆర్ లేరు . బాబు చెప్పరు . **** సుబ్బిరామిరెడ్డి ఇంటికి ఎన్టీఆర్ దంపతులు భోజనానికి వెళ్లడం ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది అంటే ? ఖమ్మంలో కాంగ్రెస్ నేత ప్రియాంక సభ లో టీడీపీ జెండాలు రెపరెపలడాయి . కాంగ్రెస్ సభల్లో టీడీపీ జెండాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి . ఇదేం కొత్తకాదు 2018 లోనే చెట్టాపట్టాలేసుకొని పోటీ చేశారు కదా ? అంటే నిజమే 2018 లో కాంగ్రెస్ , టీడీపీ రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఉంది . ఈ సారి పొత్తుకాదు ఒక్క సీటు కూడా ఇవ్వకపోయినా కాంగ్రెస్ విజయానికి టీడీపీ పని చేస్తోంది . కాంగ్రెస్ వ్యతిరేకతే మా సిద్ధాంతం అని సగర్వంగా ప్రకటించుకున్న పార్టీ కాంగ్రెస్ కోసం తమ పార్టీని మూసేసుకుంది . ఒక్క సీటు కూడా లేకుండా షర్మిల పార్టీ కాంగ్రెస్ తో జత కట్టింది . ఒక్క సీటు లేకుండా కోదండరాం పార్టీ కాంగ్రెస్ కోసం పని చేస్తోంది . ఆ రెండు పార్టీల దారిలోనే టీడీపీ సైతం కాంగ్రెస్ కోసం పని చేస్తోంది . 2014 కాలం లో బాబు ఏ ఉద్దేశంతో అన్నారో కానీ ఖాళీ చేయడానికి టీడీపీ బీరు సీసా కాదు అన్నారు . ఖాళీ బీరు సీసాకు కూడా కొంత విలువ ఉంటుంది . కానీ బాబు మాత్రం ఉచితంగానే తెలంగాణలో కాంగ్రెస్ కోసం టీడీపీని ఇచ్చేశారు . బాబు గ్రేట్ ---------- సుబ్బిరామిరెడ్డి ఇంటికి భోజనానికి వెళితే పార్టీని అపవిత్రం చేస్తున్నారని ప్రచారం చేసి దాన్ని నమ్మించిన బాబు ఏకంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా , ఉచితంగా కాంగ్రెస్ కోసం పని చేస్తున్నా టీడీపీ శ్రేణులు , నేతలు ఏమంటున్నారు ? అంటే ? ఏమీ అన్నారు బాబు ఏం చేసినా అదే కరెక్ట్ అనుకునేట్టు ట్యూన్ చేయడంలో బాబు విజయం సాధించారు . ప్రజలను ట్యూన్ చేయడంలో బాబు విఫలం అయి ఉండవచ్చు కానీ పార్టీని ట్యూన్ చేయడంలో ఘన విజయం సాధించారు . - బుద్దా మురళి

5, నవంబర్ 2023, ఆదివారం

వార్తల సైజులు పార్టీల గెలుపును నిర్ణయించలేవు ... . మీడియాలో mim , షర్మిల పార్టీ వార్తలు .... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 105

వార్తల సైజులు పార్టీల గెలుపును నిర్ణయించలేవు ... . మీడియాలో mim , షర్మిల పార్టీ వార్తలు జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 105 ......... ....... సాధారణంగా ప్రధాన మీడియాలో ఒక్కో పార్టీ గురించి ఎం సైజులో వార్తలు వస్తే జనంలో ఆ పార్టీకి ఆ సైజుకు తగ్గ ఆదరణ ఉంది అనిపిస్తుంది . వార్తల సైజులను బట్టి ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఎన్ని సీట్లు రావచ్చు అనే అంచనాకు వస్తారు . పాఠకులే కాదు.. రాజకీయ నాయకులు చివరకు జర్నలిస్ట్ లు కూడా ఇదే అంచనాతో ఉంటారు . ఓ ఏడాది క్రితం మీడియా బిజెపికి హైప్ ఇచ్చింది . తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని సూచించే స్థాయిలో ఆ వార్తలు ఉండేవి . మీడియా + రాజకీయ నాయకులు ఐన వి 6 వివేక్ వెంకటస్వామి లాంటి వారు బిజెపిలోకి , బిజెపి నుంచి కాంగ్రెస్ కు ఇలా అనేక పార్టీలు మారింది ఇలాంటి వార్తలు హైప్ వల్లనే . మీడియా కలిగించే ఈ హైప్ లో చివరకు మీడియా కూడా పడిపోతుంది . చిత్రంగా మేధావులపై ఈ హై ప్ ప్రభావం తీవ్రంగా పడి తమ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారు . కానీ ఓటర్లపై ఈ హైప్ ప్రభావం తక్కువే అనేక సందర్భాల్లో తేలింది . తాము సృష్టించిన వార్తలను నమ్మి మీడియా తామే బోల్తా పడుతోంది కానీ జనం పెద్దగా లెక్కేలోకి తీసుకోవడం లేదు . మద్య నిషేధ ఉద్యమ సమయంలో స్పోర్ట్ పేజీ మినహా ఈనాడు మొత్తం మద్య నిషేధ వార్తలతో నిండి పోయేది . ఉమ్మడి రాష్ట్ర జనాభాను మించి రాష్ట్ర జనాభా మద్య నిషేధ ఉద్యమం లో ఉన్నారు అనిపించేది . జోనల్ పేజీ , జిల్లా పేజీ , మెయిన్ పేజీ ఎక్కడ చూసినా జనం తండోపతండాలుగా మద్య నిషేధ ఉద్యమం లో పాల్గొన్నారు అనిపించేది ఈనాడు చదివితే .. అది మీడియా సృష్టించే మాయాజాలం . మద్యానికి వ్యతిరేక ప్రచారం , మద్యం తాగడం వల్ల ఆరోగ్యం ఎలా పాడవుతుందో మీడియా ప్రచారం చేయాలి . దాని వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది . కానీ అక్కడ ఆ ప్రచార ఉద్దేశం ఒక పార్టీని ఓడించి ఒక పార్టీని గెలిపించడం ... నిజానికి నిషేధ సమయంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి మందు తాగడానికి ఉద్యమ స్థాయిలో పొరుగు రాష్ట్రాలకు వెళ్లారు . సరిహద్దుల్లో మద్యం షాప్స్ వెలిశాయి , ఎందరినో సంపన్నులను చేశాయి . ******* ప్రధాన మైన టివి మీడియా , ప్రింట్ మీడియా లో ఎం . ఐ . ఎం పార్టీ వార్తలు అస్సలు కనిపించవు. గత రెండేళ్ల నుంచి షర్మిల పార్టీ వార్తలు కొన్ని మీడియాల్లో ఆమెనే సీఎం అన్నట్టుగా ప్రచారం చేశారు . జగన్ ను వ్యతిరేకిస్తూ , బాబును అభిమానించే మీడియా జగన్ సోదరి పార్టీని ఆకాశానికి ఎత్తారు . చివరకు పోటీ చేస్తే డిపాజిట్ ఎక్కడా రాదు అని తెలిసి ఆమె పోటీ చేయడం లేదు , ఆమె పార్టీ పోటీ చేయడం లేదు . షర్మిల పార్టీకి ఇచ్చిన ప్రచారంలో ఏడు సీట్లు గెలిచే mim కి ఒక్క శాతం ప్రచారం కూడా ఇవ్వలేదు . ఇక్కడ ఉద్దేశం ప్రచారం ఇవ్వళ్ళూ అని కాదు . మీడియాలో లభించే ప్రచార సైజు చూసి పార్టీలను అంచనా వేయవద్దు అని చెప్పడమే . అదే బీజేపీ వార్తలు చూస్తే ఏడాది క్రితం వరకు వాళ్లే అధికారంలోకి వస్తారేమో అన్నంతగా మీడియాలో ప్రాధాన్యత లభించింది . గత ఎన్నికల్లో mim కు ఏడు సీట్లు వస్తే బీజేపీకి వచ్చింది ఒకే ఒక సీటు . కానీ మీడియాలో ఈ రెండు పార్టీలకు వచ్చిన వార్తలను పోలిస్తే అసలు సంబంధమే ఉండదు . ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందే ఏడు స్థానాలు mim కు వదిలేసి మిగిలిన సీట్ల గురించే ఏ పార్టీ ఐనా ఆలోచించాలి . పోలింగ్ కు ముందే ఫలితాలు తేలిపోయే నియోజక వర్గాలు ఇవే . గత ఎన్నికల్లో తెలంగాణ లో మీడియా వార్తల ప్రకారం చూస్తే మహాకూటమి గెలుస్తుంది అని , ఆంధ్ర లో టీడీపీ అని మెజారిటీ మీడియా వార్తలతో హోరెత్తిందించి . తాము గెలవాలి అని కోరుకున్న పార్టీ గెలుస్తుంది అని మీడియా చెబుతోంది కానీ ఎవరు గెలుస్తారో చెప్పడం లేదు . **** 2012-13 సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా లాబీ లో చర్చ . అప్పుడు హైదరాబాద్ లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పని చేసే జర్నలిస్ట్ మిత్రుడు శాస్త్రి ఇక తెలంగాణ ఉద్యమం ముగిసిపోయినట్టే కదా ? అని కవ్విస్తున్నట్టు అడిగాడు . ఉద్యమం ఒక సారి ఉదృతంగా సాగుతుంది .పత్రికల నిండా ఏవ్ వార్తలు ఆ ఉదృతి చూసి వారం లో తెలంగాణ ఇచ్చేస్తారు అనిపిస్తుంది . కొంత కాలం స్థబ్దతగా ఉండేది ఆ సమయంలో మీడియాలో సైతం వార్తలు కనిపించవు . దాంతో తెలంగాణ ఉద్యమం అయిపొయింది అనుకునేవారు . మీడియాలో వచ్చే వార్తల సైజును బట్టి తెలంగాణ పై నువ్వు అంచనాకు వస్తున్నావు . మీడియా లో వార్తల సైజుతో సంబంధం లేదు . తెలంగాణ ఏర్పడేంత వరకు తెలంగాణ అంశం ఉంటుంది అని వార్తల సైజుకు నిర్ణయాలకు సంబంధం ఉండదు అని అని చెప్పాను . సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో మీడియా మొత్తం అవే వార్తలు . ఆంధ్రభూమి ఎడిటర్ శాస్త్రి ఆ ఉద్యమ వార్తలు చూపుతూ ఇప్పటికీ తెలంగాణ వస్తుందా ? అని అడిగితే .. ఆ వార్తల సైజులు మీడియా ఓనర్లను సంతృప్తి పరుస్తాయి నిర్ణయంలో ఎలాంటి ప్రభావం చూపవు వస్తుంది అని చెప్పాను .. ***** 1978 లో విద్యార్థిగా ఉన్నప్పుడు ఎక్కడ చూసినా గోడల మీద జనతా పార్టీ గుర్తు నాగాలిపట్టిన రైతు బొమ్మ ఉండేది . జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేస్తుంది అనుకున్నాను . దేశమంతా వచ్చినా ఆంధ్ర ప్రదేశ్ లో జనతా పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు . ఆ తరువాత చదువు పూర్తయి జర్నలిజంలోకి వచ్చాక మీడియాలో వచ్చే వార్తల సైజుకు జనంలో పార్టీకి వచ్చే ఓట్లకు సంబంధం లేదు అని అర్థమయింది . ఇప్పుడు అన్ని పార్టీలకు మీడియా ఉంది . పక్ష పాతం అనే మాటకు తావు లేకుండా ఏ పార్టీ మీడియా ఆ పార్టీని ఆకాశానికి ఎత్తుతోంది . ఒక పార్టీ మీడియాకే పరిమితం కాకండి అన్ని పార్టీల మీడియా ను చదవండి , చూడండి .. అలానే సొంత కులం వారితోనే కాకుండా అందరితో మాట్లాడండి ఓ నిర్ణయానికి రండి . ఏదో ఒక పార్టీ మీడియా ను ఫాలో అయి ఎన్నికల ఫలితాలపై పందెం వేస్తే దెబ్బ తింటారు . డబ్బులు ఊరికే రావు . - బుద్దా మురళి

3, నవంబర్ 2023, శుక్రవారం

అభ్యర్థుల పేర్లు - పూర్వ విద్యార్థుల సమావేశం నాయకుల జోనల్ పేజీల జీవితాలు.... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 104

అభ్యర్థుల పేర్లు - పూర్వ విద్యార్థుల సమావేశం నాయకుల జోనల్ పేజీల జీవితాలు జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 104 --------------------------------------- రాజకీయ పార్టీ ప్రకటించిన మూడవ జాబితా అని కనిపించగానే యధాలాపంగా చదువుతూ పోతుంటే కొన్ని పేర్లు కనిపించగానే ముఖం సంతోషంగా వికసించింది . హైదరాబాద్ లో మాములు ప్రభుత్వ పాఠశాలల్లో చదువు . పూర్వ విద్యార్థుల సమావేశాలు జరుపుకొంటారు అని తెలియని కాలం లో చదువు . పత్రికల్లో పూర్వ విద్యార్థుల సమావేశాల గురించి చూసినప్పుడు మనకు అలాంటి అవకాశం లేదే అని కొంత నిరాశ . కానీ పార్టీ అభ్యర్థుల మూడవ జాబితా లోని కొన్ని పేర్లు చూడగానే పూర్వ విద్యార్థుల సమావేశం అంత ముచ్చటేసింది . డిగ్రీ చదువుకొనే రోజుల నుంచే జర్నలిజం నుంచి సహవాసం కావడం వల్ల అప్పుడు విన్న , పరిచయం ఉన్న ఆ పేర్లు కొన్ని పాత జ్ఞాపకాలు తట్టి లేపాయి . పూర్వ విద్యార్థులు సమ్మేళనం లో చదువుకున్న రోజులు గుర్తుకు వచ్చినట్టు పాత జ్ఞాపకాలు కళ్ళ ముందు కదిలాయి . కరోనా తరువాత ఎవరు ఉన్నారో , ఎవరు ఏమయ్యారో తెలియదు .. అలాంటప్పుడు మనం మరిచి పోయిన కొందరు ఉన్నారు అని తెలియడమే కాకుండా , వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అంటే ముచ్చటేయడం సహజమే కదా ? సాధారణ నాయకులే కాదు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయకులు సైతం ఇంటికే పరిమితం అయిన తరువాత వారిని ప్రజలు మరిచిపోతారు . ఓడినా గెలిచినా నాయకులు జనాల్లో ఉంటేనే రాజకీయంగా సజీవంగా ఉన్నట్టు . జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా , కేంద్రమంత్రిగా ఓ వెలుగు వెలిగారు . ఓడిపోయాక రాజకీయాలకు దూరంగా ఇంటికే పరిమితం అయ్యారు . అయన మరణించినప్పుడు రిపోర్టర్ గా సమాచారం కోసం ఇంటికి వెళ్ళాను . చడీ చప్పుడు లేదు . అయన గురించి అడిగితే చెప్పేవారు దొరక లేదు . ఇంట్లో జలగం ఆత్మకథ గ్రంధం ఉంది . తీసుకువెళ్ళండి అని ఒకరు సలహా ఇస్తే ... వార్త సాయిబాబా అప్పటికే బుక్ వెతుకుతుంటే నేనూ ఒకటి తీసుకున్నా .. అయన పోయారు అనే వార్త విని ఆయన ఉన్నారా ? ఎక్కడా వార్తల్లో కనిపించలేదేమబ్బా అనిపించింది . ***** జర్నలిస్ట్ గ్రూప్ లో బిజెపి మూడవ జాబితా కనిపించగానే చదువుతుంటే కొన్ని పేర్లు చూసి మొదట అనుమానం వచ్చింది . తరువాత బిజెపి జాబితానే అని నిర్ధారణ చేసుకొని పేర్లు చదివి సంతోషించాను . చేవెళ్ల నుంచి రత్నం , అంబర్ పేట కృష్ణ యాదవ్ , జూబ్లీ హిల్స్ లంకల దీపక్ రెడ్డి , సికిందరాబాద్ మేకల సారంగపాణి ఇలా ఇంకా చాలా మంది పేర్లు ఉన్నా టీడీపీ కార్యకలాపాల్లో నగరంలో వీరి హడావుడి చాలా ఉండేది . దాదాపు రెండు దశాబ్దాల క్రితం వీరి హడావుడి కనిపించేది .తరువాత వీరు ఏమయ్యారో తెలియదు . హఠాత్తుగా వీరి పేర్లు చూసే సరికి ఎన్నికల్లో జయాపజయాలు ఎలా ఉన్నా .. ఉన్నారు అని సంతోషం . మేకల సారంగపాణి ఒకప్పుడు టీడీపీ నగరనాయకుల్లో ఒకరు . కార్పొరేటర్ స్థాయికి పరిమితం కాకూడదు శాసన సభ్యున్ని కావాలి అని ఆశ ప్రజారాజ్యం పెట్టగానే పోటీ చేసి ఓడిపోయారు . తరువాత ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నారో బీజేపీ లో ఎప్పుడు చేరారో కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు బీజేపీ సికిందరాబాద్ అభ్యర్థి అయ్యారు . చేవెళ్ల రత్నం ఎన్టీఆర్ వెన్నుపోటు సమయంలో జిల్లా పరిషత్ చైర్ మెన్ గా చివరి వరకు ఎన్టీఆర్ వర్గంలో ఉన్నారు . తరువాత కనిపించలేదు . లంకల దీపక్ రెడ్డి చివరి దశలో చేరినా హడావుడి ఎక్కువగానే ఉండేది . తెలుగుదేశంలో కృష్ణ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు . హఠాత్తుగా మంత్రి వర్గం నుంచి బాబు తొలగించారు . ఎందుకో ఏ మీడియా రాయలేదు . ఎవరికీ తెలియదు . కొన్ని రోజుల తరువాత వేల కోట్ల రూపాయల తెల్గీ స్టాంప్ కుంభకోణంలో కృష్ణ యాదవ్ పాత్ర ఉందని అరెస్ట్ చేశారు . ఓహో బాబుగారు మంత్రివర్గం నుంచి తొలగించింది ఇందుకా అని అప్పుడు తెలిసింది . జైలు నుంచి బయటకు వచ్చాక తిరిగి టీడీపీ కోసం కృష్ణ యాదవ్ బాగా ప్రయత్నించారు . చేరలేదు . తెలంగాణ ఏర్పడింది . టీడీపీ తన ప్రాభవాన్ని కోల్పోయింది . తరువాత తెరాస లో చేరారు . తెరాస లో ఉన్నారో లేరో అన్నట్టు ఉండేది . బీజేపీ మూడవ జాబితా తో మళ్ళీ తెరపైకి వచ్చారు . మాంసం తిన్నామని ఎముకలు మేడలో వేసుకొని తిరిగినట్టు అనే సామెతలా .. తెల్గీ నుంచి కృష్ణ యాదవ్ తిన్నది కొద్దిగానే ఐనా శిక్ష చాలా ఎక్కువగా అనుభవించారు అని ప్రచారం . తెల్గీ కుంభకోణం బయటపడి , కృష్ణ యాదవ్ అరెస్ట్ అయ్యాక అయన వార్తలు పత్రికల్లో చందమామ కథల్లా కనిపించేవి . కృష్ణ యాదవ్ అంతకు ముందు ఏ జిల్లాలో తిరిగాడో ఆ జిల్లా నుంచి కథలు వచ్చేవి ఆ జిల్లాలో ఎవరెవరిని కలిశాడు , ఏం జరిగింది అని వార్తలు వచ్చేవి . తెల్గీ కన్నా ఎక్కువ శిక్ష పడింది యాదవ్ కె మంత్రి పదవి పోయింది , జైలు జీవితం తప్పలేదు . రాజకీయ జీవితం ముగిసింది . ******* మీడియాలో జోనల్ పేజీలు వచ్చాక ఏ జోనల్ నాయకులు ఆ జోనల్ పేజీలోనే కనిపిస్తున్నారు . ఇతర జోన్ లలో ఉండే పాఠకులకు వీరు ఉన్నారని తెలియదు . ఏ పార్టీలో ఎప్పుడు చేరారో తెలియదు . జోనల్ జీవితం వల్ల ఒక జోనల్ నాయకుల రాజకీయం ఇంకో జోన్ వారికి తెలియకుండా పోయింది . కనీసం ఎన్నికల వల్ల నైనా వారు ఉన్నారు అని తెలుస్తోంది . ఎన్నికల జాతర వచ్చినప్పుడు టికెట్ కోసం ప్రయత్నించేవారు పేర్లు పత్రికల్లో చదువుతుంటే వీళ్ళు ఇంకా ఉన్నారా ? మరిచే పోయాం అనిపిస్తుంది . నాయకుల గురించి మీడియా ఇలా అనుకుంటే మీడియా వాళ్ళ గురించి నాయకులు కూడా ఇంకా ఉన్నారా ? అనే అనుకుంటారు . రాస్తూంటేనే జర్నలిస్ట్ జీవించి ఉన్నట్టు .. పోటీ చే స్తుంటే, .. రాజకీయాలు చే స్తుంటేనే రాజకీయ నాయకులు రాజకీయంగా జీవించి ఉన్నట్టు .. రచయితలు , సినిమా నటులు సైతం అంతే కలం వదిలేసి, నటన మానేసి అస్త్ర సన్యాసం చేస్తే అంతే ... - బుద్దా మురళి