30, మే 2012, బుధవారం

రాజకీయ పక్షాల బ్రాండ్ ఇమేజ్

బ్రాండ్ ఇమేజ్ అనేదేదో పాశ్చాత్యుల కంపెనీలు మనకు పరిచయం చేశారని చాలా మంది అనుకుంటారు. కానీ అమెరికాను కనిపెట్టక ముందు, అది పుట్టక ముందు నుంచే మనకు మహామహా బ్రాండ్‌లున్నాయి. బ్రాండ్ అంబాసిడర్‌లు ఉన్నారు. పరమ శివుడ్ని మించిన బ్రాండ్ ఏ దేవుడికుంది. అడగ్గానే కోరిన వరాలిచ్చే భోళాశంకరుడనే బ్రాండ్ ఆయన మీద చాలా బలంగా ఉంది. టాటా బ్రాండ్ పేరు వినగానే నాణ్యమైన ఉత్పత్తులు గుర్తుకు వచ్చినట్టు పరమ శివుడి పేరు తలుచుకోగానే భక్తుల పాలిట భోళాశంకరుడి రూపం మెదులుతుంది. టాటాకు వ్యాపారంలో తిరుగు లేని పేరుంది. కార్పొరేట్ పైరవీకారు నీరా రాడియాకు టాటా 60 కోట్లు ఇవ్వడం లాంటివి ఆ బ్రాండ్ మీద పడ్డ ఓ మచ్చ.


కార్పొరేట్ కంపెనీలు బ్రాండ్ ఇమేజ్ కోసం ప్రకటనలకు కోట్లు ఖర్చు చేస్తాయ. నిజానికి ఒక కంపెనీ బ్రాండ్ ఇమేజ్ సాధించేందుకు పడే కష్టం కన్నా ఎన్నో రేట్లు ఎక్కువగా ఒక రాజకీయ పక్షం బ్రాండ్ ఇమేజ్ కోసం కష్టపడాల్సి వస్తుంది. రాజకీయ పక్షాలకు బ్రాండ్ ఇమేజ్ కల్పించే వృత్తిలో ఉన్నవారు కార్పొరేట్ కంపెనీలకు పనికి రారు, కార్పొరేట్ కంపెనీల వాళ్లు రాజకీయ పక్షాలకు బ్రాండ్ ఇమేజ్ కల్పించడానికి పనికి రారు.
ఈ విషయం తెలియక గతంలో బిజెపి వాళ్లు తమ పార్టీకి గొప్ప బ్రాండ్ ఇమేజ్ కల్పించమని ఒక కార్పొరేట్ కంపెనీని సంప్రదిస్తే, భారత్ వెలిగిపోతోంది (ఇండియా ఇస్ షైనింగ్) అనే నినాదం ఇచ్చి ఇక జనంలోకి వెళ్లండి మీరు వెలిగిపోతారు అని భరోసా ఇచ్చింది. బిజెపి వాళ్ల నినాదం విన్నాక సమస్యలతో మేం చస్తూ బతుకుతుంటే భారత్ వెలిగిపోతుందా? ఓటర్లకు చిరాకేసింది. వెలుగు మాట దేవుడెరుగు బిజెపిని చీకటిలోకి పంపించేశారు. ఈ విషయం తెలిసి కూడా ఈ మధ్య మాయావతి కూడా బిఎస్‌పికి మంచి బ్రాండ్ ఇమేజ్ కల్పించమని ఒక కార్పొరేట్ కంపెనీని కలిశారు. మంత్రులను తొలగించండి, ఇలా మాట్లాడండి, అలా చేయండి అంటూ భారీ ఫీజు తీసుకుని తోచిన సలహాలిచ్చారు. అవినీతి మంత్రులను తొలగించడం వల్ల పార్టీకి బ్రహ్మాండమైన ఇమేజ్ వచ్చిందని ఆమె మురిసిపోయారు. కానీ ఫలితాలు వచ్చాక చూస్తే ఉన్న ఇమేజ్ కూడా మంట గలిసి ఇప్పటి వరకు కోలుకోలేక పోయారు.అన్ని పార్టీలు ఇలానే తమది గొప్ప బ్రాండ్ అని ప్రత్యర్థులది చెత్త బ్రాండ్ అనే ప్రచారం వల్ల అసలు రాజకీయ వ్యాపారమే చెత్త బ్రాండ్ అనే బలమైన ముద్ర ప్రజలపై పడిపోయింది. ముందుకు వచ్చిన చిన్నపాటి బొర్ర, ఖద్దరు దుస్తులు, నెత్తిపై టోపీ ఇదీ రాజకీయ నాయకుని బ్రాండ్ .


బివి పట్ట్భారామ్ అనగానే మనకు టోపీలోంచి రంగు రంగుల కాగితాలను తీసుకు రావడం, పేక ముక్కలను మాయం చేయడం, పావురాలను రప్పించడం గుర్తుకు వస్తుంది కదూ. దాదాపు రెండు మూడు దశాబ్దాల పాటు తీవ్రంగా కృషి చేసి ఆయన తెచ్చుకున్న బ్రాండ్ ఇమేజ్ అది. కానీ చిత్రమేమంటే గత రెండు దశాబ్దాల నుంచి ఆయన మేజిక్ మానేసి సైకాలజిస్ట్‌గా ఉన్నారు. సైకాలజిస్ట్‌గా ఆయన ఎంత బిజీగా ఉన్నా ఆయన పేరువింటే మాత్రం గుర్తుకు వచ్చేది మెజీషియన్ రూపమే. కొందరు ఈ బ్రాండ్‌లను మార్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. అలా మనుషుల మస్తిష్కంలో ముద్ర పడిపోతుంది. టెలిఫోన్లు మధ్యతరగతి వారికి అందుబాటులోకి వచ్చిన కొత్తలో ఫోన్ మాట్లాడుతున్నట్టుగా ఫోటో దిగడం ఫ్యాషన్. అదే విధంగా కంప్యూటర్ అందుబాటులోకి వచ్చిన కొత్తలో వౌస్‌ను ఆడిస్తూ, కంప్యూటర్ స్కీృన్‌ను చూస్తూ ఫోటో దిగడం పెద్ద క్రేజి. అయితే మీకు గుర్తు కొచ్చేసిందన్నమాట! నిజమే బాబు గారు కంప్యూటర్ స్కీృన్ చూస్తూ వౌస్‌ను తిప్పుతున్నప్పటి ఫోటో అప్పుడు పత్రికల్లో రోజూ కనిపించేది. క్యాలండర్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పత్రికల్లో ప్రకటనలు అన్నింటిలో ఇదే ఫోటో. కంప్యూటర్‌లకు బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారేమో అనుకునేంత బలంగా ఈ ముద్ర పడిపోయింది. ఈ బ్రాండ్‌తో కాలం కలిసొచ్చేట్టు లేదని గ్రహించి తొమ్మిదేళ్ల క్రితం నుంచి కొత్త బ్రాండ్ ఇమేజ్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు. కంప్యూటర్ స్కీృన్ స్థానంలో పొలం దున్నుతున్న బాబు ఫోటోను చేర్చినా కొత్త బ్రాండ్ జనంలోకి వెళ్లలేదు.


 రిలయన్స్ వాళ్లు తమ లోగోను మార్చి కొత్త లోగో ప్రచారం కోసం కోట్లరూపాయలు ఖర్చు చేశారు. కానీ ఎందుకో పాత లోగో గుర్తుకు వచ్చినంతగా కొత్తది మనసులో ముద్రించుకోలేదు. కాలాన్ని బట్టి లోగోను, బ్రాండ్‌ను, బ్రాండ్ అంబాసిడర్లను మారుస్తుంటారు. అయితే చాలా సార్లు ఈ మార్పులు జనానికి అంత ఈజీగా అలవాటు కావడం లేదు. బాబు జమానాలో రాజకీయాల్లో ప్యాంటు షర్టు తప్ప దోవతీల బ్రాండ్‌కు కాలం చెల్లిందని బలంగా నమ్మేవారు. కొన్ని వందల కిలోమీటర్ల దూరం నడిచి దోవతీ బ్రాండ్ రాజకీయాలకు కాలం చెల్లలేదని వైఎస్‌ఆర్ నిరూపించారు. ఇప్పుడు మళ్లీ ఫ్యాంట్‌ల యుగం వచ్చింది. అయితే ఫ్యాంట్ల సంఖ్య పెరిగింది. వీటిలో ఏ ఫ్యాంటును ఎలా ఆదరిస్తారో తేలాలంటే రెండేళ్లు ఆగాలి.

23, మే 2012, బుధవారం

జీతం-జీవితం-ఆత్మ సంతృప్తి!...జర్నలిస్టు లారా జీతం కోసం వద్దు ఆత్మ సంతృప్తి తో కోట్లు సంపాదించండి

‘‘నోబెల్ బహుమతుల్లో మన వాళ్లకు అన్యాయం జరుగుతోంది’’
‘‘నీకెందుకలా అనిపించింది. ’’
‘‘కొత్తవాటిని కనిపెట్టిన వారికే కాకుండా, పాత విషయాలను కొత్త కోణంలో పరిశోధన చేసిన వారికి ఈ అవార్డు ఇస్తే ఏటా మన వారికే దక్కుతుంది’’
‘‘ఒకటి రెండు పరిశోధనల గురించి చెప్పు’’
‘‘కొత్తవాటిని కనిపెట్టలేనప్పుడు పాత వాటిని కొత్త కోణంలో కనిపెట్టాలి. శ్రీరాముడు మంచి వాడని అంతా అంటారు కదా? కానే కాదు మన వాళ్లు పరిశోధన చేసి ఆయన మహా దుష్టుడని తేల్చేశారు. అంతేనా రావణుడు మహా జ్ఞాని, అని ఇంకా ఏవేవో కనిపెట్టారు.’’
‘‘ఇప్పుడు కనిపెట్టడం ఏమిటి? చాలా కాలం క్రితమే ఎన్టీరామారావు తన సినిమాల్లో దుర్యోధనుడ్ని హీరోగా, పాండవులు అతనికి అన్యాయం చేసినట్టు చూపించారు. అంత కన్నా చాలా ముందే రావణాసురుడి గొప్పతనం చూపించారు కదా?’’


‘‘అప్పుడు సినిమాల్లో చూపించారు ఇప్పుడు మేధావులు ఈ విషయాన్ని బహిరంగ చర్చల్లో నిరూపిస్తున్నారు. ఇలాంటి వారికి నోబెల్ బహుమతులు దక్కితే మరిన్ని అద్భుత విషయాలు బయట పడతాయి కదా?’’
‘‘ఎంత వరకు చదువుకున్నావేమిటి?’’
‘‘చదువు మీద ఎక్కువగా దృష్టి పెడితే ఎవడి దగ్గరో జీతగాడిగానే పని చేయాల్సి వస్తుంది! తక్కువగా దృష్టిపెడితే మనమే ఉద్యోగాలిచ్చే స్థాయిలో ఉంటామనే జ్ఞానం చిన్నప్పుడే సంపాదించా. అందుకే పెద్దగా చదువుకోలేదు’’


‘‘సత్యహరిశ్చంద్రుని సత్యవాక్కులో పెద్ద కుంభకోణం, దేవుళ్ల కుట్ర ఉందని నిరూపించాలనుకుంటున్నాను ఎలా ఉంటుందటావు?’’
‘‘ఏమిటో ఆ కుంభకోణం తెలుసు కోవచ్చా?’’
దేవుళ్లు తనను పరీక్షిస్తున్నారని, వాటికి తట్టుకొని నిలబడితే మళ్లీ తన రాజ్యం తనకు దక్కుతుందనే సమాచారం హరిశ్చంద్రునికి ముందే లీకైంది. అందుకే చివరకు రాజ్యాన్ని వదులుకున్నాడు, కాటికాపరిగా పని చేశాడు.’’
‘‘నమ్మలేకపోతున్నాను’’
‘‘సినిమాల్లో చివరకు హరిశ్చంద్రునికి రాజ్యం, రాజ్యలక్ష్మి దక్కుతుందని తెలిసి కూడా ప్రేక్షకులు ఆయన బాధలు చూసి కన్నీళ్లు పెట్టారా? లేదా? ప్రేక్షకులే అంతగా జీవించినప్పుడు హరిశ్చంద్రుడు అన్నీ తెలిసి పాత్రలో జీవించాడని నేనంటే నువ్వు కాదంటావా? ’’
‘‘ఏమో’’


‘‘సరే కానీ మీకు తెలిసిన వారున్నారు కదా? నన్ను ఏదైనా పత్రికలో చేర్పిస్తారా?’’
‘‘జర్నలిజంలోకే ఎందుకు రావాలనుకుంటున్నావు? ’’
దేన్నయినా పరిశోధించే అలవాటుంది. దీన్ని గురించి కూడా బాగా పరిశోధించి ‘ఆత్మ సంతృప్తి’తో ఎక్కడికో వెళ్లే అవకాశం ఉండడం వల్ల నాకు ఇదే బెటరనుకుంటున్నాను. ’’
‘‘ఆత్మ సంతృప్తి కోసం పని చేస్తే ఎక్కడికో ఎలా వెళతాం’’
‘‘మా గురువు గారు జర్నలిజంలోకి వచ్చినప్పుడు ఆత్మ సంతృప్తి తప్ప ఆర్థిక తృప్తి లభించదు ఆలోచించుకో అని పెద్దలు సలహా ఇచ్చారు. ’’
‘‘జర్నలిజాన్ని గురువుగారు సమున్నత శిఖరాలకు తీసుకు వెళ్లారు. గతంలో జర్నలిస్టులు అంటే బీరు బాటల్‌కు కక్కుర్తి పడతారు అనే విమర్శ ఉండేది. మరిప్పుడు జర్నలిస్టు తలుచుకుంటే పవర్ ప్రాజెక్టులు, చానల్స్ పెట్టేస్తున్నారు. బీరు బాటిల్ నుంచి పవర్ ప్రాజెక్టుకు తీసుకు వెళ్లడం విలువలు పెంచడమే కదా?’’
అదృష్టం అనేది తలుపు తట్టే సమయాన్ని గ్రహించి తలుపులు తెరిచి ఉంచాలి. ఆ సమయంలో తలుపులు మూసి ఇప్పుడు తలుపులు తెరిస్తే వచ్చేది అదృష్టం కాదు దొంగలు. కాబట్టి ఆత్మ సంతృప్తి కోసం పని చేయాలనే ఆలోచన మీ మనస్సులో మెదులుతుంది కదా తృంచి వేయండి’’
‘‘లేదు నాకు అలాంటి ఆలోచన ఏమీ రాలేదు’’
‘‘ఐనా అది అందరితో అయ్యే పని కాదు. అలా అయ్యేదుంటే ఎవరూ నీతి మంతులుగా మిగిలిపోరు. చెడిపోకుండా ఉండడం కష్టం, చెడిపోవడం చాలా కష్టం, చెడిపోయి కూడా నైతిక విలువల పాఠాలు చెప్పడం అన్నింటి కన్నా కష్టం. ఓ జర్నలిస్టు నాయకుల వద్ద టీ కూడా తాగడు ఆయనోసారి ఊరవతల పార్టీ సమావేశం జరుగుతుంటే గత్యంతరం లేని పరిస్థితిలో పార్టీ వారి సమావేశంలో భోజనం చేశానని పార్టీ అధ్యక్షునికి కొంత డబ్బు ఎంఓ చేశాడు. ఈ విషయం ఆపార్టీ అధ్యక్షుడే చెప్పాడు. ఆ జర్నలిస్టు ఒక్కసారి కూడా నైతిక విలువల గురించి చెప్పలేదు. కోట్లు, ఇంట్లో వాళ్లకు మెడికల్ సీటు పుణ్యానికి కొట్టేసిన వాళ్లు నైతిక విలువ గురించి అనర్గళంగా ఉపన్యసించేస్తారు.’’


‘‘ఇంత చెప్పిన వాడివి నువ్వు మీ గురువు వద్దనే చేరవచ్చు కదా?’’
‘‘ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు. వృత్తి రహస్యాలు తెలుసుకున్నానని గురువు నన్ను రానివ్వడు.’’
‘‘చిన్న సందేహం నువ్వు నీతిగా ఉండమని చెబుతున్నావా? అవినీతికి పాల్పడమని చెబుతున్నావా?’’
‘‘యాక్టర్‌తో రాసలీలల గురించి ప్రపంచానికి తెలిసిన తరువాత కూడా నిత్యానంద స్వామి అంత ధైర్యంగా టీవిలో నైతిక విలువల గురించి బోధించడం, అభిమానులను అలరించడం సామాన్య విషయం కాదు. తమ్ముడిని అరెస్టు చేసిన కేసులో అరెస్టయిన కెఎ పాల్ స్టేషన్‌కు వెళుతూ గాడ్ బ్లెస్ యూ అంటూ పోలీసులను కూడా దీవించడం అందరి వల్ల కాదు’’
‘‘నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు’’
‘‘కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మరిన్ని సందేహాలు కలిగిస్తాయి’’

22, మే 2012, మంగళవారం

రాష్ట్రం లో కార్పోరేట్ స్కూల్స్ వ్యాపారం ఎక్కువనా ? కార్పోరేట్ కాలేజీల వ్యాపారం ఎక్కువా ?


హవ్వ..మార్కులు ఇవ్వలేరా?


 ప్రభుత్వం ఉంటే పరీక్షలపై దృష్టి పెట్టేది. అసలు ప్రభుత్వమే లేదనుకునే పరిస్థితి ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ ఎలా ఉంటే వారికేం? పదవ తరగతి విద్యార్థులకు మార్కులకు బదులు గ్రేడింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయానికి కారణం ఏమిటా? అంటే కార్పొరేట్ కాలేజీల పోటీని నివారించేందుకట! దొంగతనాలను నివారించలేని రాజుగారు దొంగలకే ఆ బాధ్యత అప్పగించారట వెనకటికి. కనీసం ఆ రాజు నిర్ణయమైనా కొంత మెరుగ్గానే పని చేసింది. వీళ్లది మరీ అధ్వాన్నం. కార్పొరేట్ స్కూల్స్ మధ్య పోటీని నివారించేందుకా? లేక కార్పొరేట్ కాలేజీలకు మేలు చేసేందుకా? ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు విద్యార్థులు పోటీ పడి చదువుతున్నారు. ఒక్కో మార్కు కోసం పోటీపడతారు. దేశ వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ఒకే విధానంతో నిర్వహించాలనే ఉద్దేశంతో మార్కులకు బదులు గ్రేడింగ్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంటే చేయగలిగింది ఏమీ లేదు.. ఆ నిర్ణయానికి స్వాగతం పలకడం మినహా. కానీ ఇక్కడ మాత్రం కార్పొరేట్ స్కూల్స్ మధ్య పోటీ పెరిగిందట. దాన్ని నివారించేందుకు గ్రేడింగ్‌లు ఇస్తారట! ప్రభుత్వానికి, విద్యాశాఖ పెద్దలకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉందా? రాష్ట్రంలో ఇప్పుడు అత్యంత లాభసాటి వ్యాపారం విద్యా వ్యాపారం. కనీసం రాజకీయ వ్యాపారానికైనా కేసుల వేధింపుల వంటి కొన్ని అడ్డంకులున్నాయి. ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన పోటీ ఉంది. కానీ విద్యా వ్యాపారంలో మాత్రం ఆ సమస్య కూడా లేకుండా బంగారు బాతుగుడ్డుగా మారింది. రెండు కార్పొరేట్ కాలేజీలు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను శాసిస్తున్నాయి. కోట్ల రూపాయలు ప్రకటనలకు వెచ్చిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటనలు నిలిపివేసి మీడియాను తమ అదుపులోకి తీసుకోవడంలో కొంత కష్టం ఉంది.. కానీ ప్రకటనలతో దాన్ని చాలా సులభంగా ఇది సాధించవచ్చు. సెలవుల్లో కాలేజీలను నిర్వహించవద్దనే ప్రభుత్వ ఆదేశాలు వీరికి పట్టవు, పదవ తరగతి ఫలితాలు వచ్చేంత వరకు ఇంటర్‌లో చేర్చుకోవద్దనే ఆదేశాలను పూచిక పుల్లను తీసిపారేసినట్టు పారేసి విద్యార్థులను చేర్చుకుంటారు. అసెంబ్లీ శాసన సభాకమిటీ దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో పర్యటించి అక్కడి ప్రభుత్వ జూనియర్ కాలేజీలను, కార్పొరేట్ కాలేజీలను పరిశీలించింది. కార్పొరేట్ కాలేజీల్లో అసలు లేబొరేటరీలు లేవని, ప్రభుత్వ కాలేజీలే ఈ విషయంలో నయమని నివేదిక ఇచ్చాయి. పదవ తరగతిలో ఐదువందలకు పైగా మార్కులు వచ్చిన బడుగుల పిల్లలకు మంచి విద్య అందించేందుకు ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి కార్పొరేట్ కాలేజీల్లో చేర్పిస్తే, మంచి విద్య మాట అటుంచి పదవ తరగతిలో 500 మార్కులు దాటగా, ఇంటర్‌లో వీరిలో 25నుంచి 30 శాతం మంది ఫైయిల్ అయ్యారు. ర్యాంకులపై తప్పుడు ప్రకటనలు, ర్యాంకుల కొనుగోళ్ల వంటి వ్యాపారంపై ప్రభుత్వం నోరుమెదపదు. లక్షలాది మంది ఇంటర్ విద్యార్థులను రెండు కార్పొరేట్ కాలేజీలు పంచుకుంటున్నాయి. వందల కోట్ల రూపాయల ప్రకటనలతో అందరి నోళ్లు మూయిస్తున్నారు. వీటి ప్రచార తాకిడికి స్థానిక కాలేజీలు మూత పడుతున్నాయి. మధ్య తరగతి వారు ఆప్పు చేసైనా కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించక తప్పని పరిస్థితి. వాస్తవానికి పదవ తరగతిలో కార్పొరేట్ స్కూల్స్ మధ్య పోటీ కన్నా ఎన్నో రేట్లు ఎక్కువగా కార్పొరేట్ జూనియర్ కాలేజీల మధ్య పోరు సాగుతోంది. ఈ కార్పొరేట్ కాలేజీలు స్కూల్ విద్యా వ్యాపారంలోకి ప్రవేశించినా అంతగా రాణించడం లేదు. మహామహులైన కార్పొరేట్ కాలేజీల వారి కన్నా సాధారణ ప్రైవేటు హై స్కూల్స్ వారికే పదవ తరగతిలో ఎక్కువ మార్కులు రావడం వీరు జీర్ణం చేసుకోలేకపోతున్నట్టుగా ఉంది. నిజంగా విద్యా వాప్యారాన్ని, ప్రచారాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం అనుకుంటే కార్పొరేట్ కాలేజీలపై దృష్టి సారించాలి. నిబంధనలకు వ్యతిరేకంగా వారు వ్యవహరించడాన్ని అడ్డుకోవాలి. అంతే తప్ప పదవ తరగతి విద్యార్థులకు మార్కులకు బదులు గ్రేడింగ్‌లు ఇవ్వడం ద్వారా పోటీని నివారించాలనుకోవడం తగదు. కార్పొరేట్ కాలేజీల ఆగడాలను అడ్డుకట్టవేయలేక చేతులెత్తేసిన ప్రభుత్వం, పదవ తరగతి విద్యార్థులకు గ్రేడింగ్‌ల పేరుతో మార్కులు చూసుకోకుండా చేయడం తగదు.

రాష్ట్రం లో ఇంటర్ విద్యనూ రెండు కార్పోరేట్ కాలేజిలు పంచుకున్నాయి . అయినా రాజధాని నగరానికి సుదూరంగా శ్రీకాకుళం లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజి విద్యార్థి ఇంటర్ లో ఈ సారి స్టేట్ టాపర్ గా నిలిచారు. అక్కడ సగానికి ఎక్కువ మంది లెక్చరర్ లో కాంట్రాక్ట్  లెక్చరర్ లే .  ఈ కాలేజి పై విద్యా శాక పెద్దలు ఏమయినా చర్య  తీసు కుంటారేమో చూడాలి
 

18, మే 2012, శుక్రవారం

మీరు రంగనాయకమ్మ అభిమానులా ? వ్యతిరేకులా ?మీరు ఏదయినా కావచ్చు .. బాగుంటే చదవడం లేదంటే లేదు అంతే తప్ప అభిమాన రచయిత , అభిమాన నటుడు అంటూముద్రలు వేసే అలవాటు నాకు లేదు . నేను రంగనాయకమ్మ అభిమానిని కాదు, వ్యతిరేకిని కాదు .  నవ్యలో ఆమె తన పాటకుల ముచ్చట్లు రాస్తున్నారు . వ్యక్తుల మనస్తత్వం గురించి తెలుసుకోవాలనుకునే వారు చదవాల్సిన ముచ్చట్లు . చదువుకునే రోజుల్లో రంగనాయకమ్మ రామాయణ విష వృక్షం చదివాను .( రంగనాయకమ్మ రచనల్లో విష వృక్షం, మాట్లాడే తెలుగులోనే రాస్తున్నామా మాత్రమే చదివాను )  విష వృక్షం లోని వ్యంగ్యం అప్పుడు బాగా నచ్చింది . కానీ ఇప్పటి అభిప్రాయం వేరు. హిందూ దేవుళ్ళ గురించి ఇలా రాసే వారు ఇతర మతాలలోని తప్పులపై ఇలా రాయగలరా ? రాయలేనప్పుడు ఒక్క హిందూ మతం పైనే ఎందుకు రాస్తారు? 
ఇక రంగనాయకమ్మ  తన పాటకుల చిత్ర మైన వైకరి  గురించి రాశారు . నాకయితే రంగా నాయకమ్మ వైకరే కొంత చిత్రంగా అనిపించింది . గొప్ప తెలివైన అభిమాని అని ఒకరి గురించి రాశారు . ఆతను నాస్తికుడు , భార్య భక్తురాలు. తన భార్య గురించి పరాయి వ్యక్తి ముందు అంతా చులకనగా మాట్లాడే వ్యక్తి నాకయితే దిగజారిన వ్యక్తిగా అనిపించాడు. అతన్ని రంగనాయకమ్మ మాత్రం గొప్ప వ్యక్తిగా పరిచయం చేశారు .ఎవరి నమ్మకాలూ వారివి భార్య నమ్మకాన్ని ఇతరుల వద్ద గేలి చేసే వ్యక్తినీ ఏమనాలి. ...
సాధారణంగా సినిమా నటులు తమ అభిమానుల గురించి బహిరంగంగా పొగుడు తారు కానీ వారితో విడిగా మాట్లాడితే అభిమానులను యెంత చులకనగా చూస్తారో తెలుస్తుంది . మల్లాది వెంకట కృష్ణ మూర్తి తనకు పరిచయం ఉన్న సంపాదకుల గురించి కౌముదిలో రాస్తున్నారు.. ఒక రచయిత తన అభిమానుల గురించి ( పాటకుల గురించి ) రాసే శీర్షిక బహుశా ఇదే మొదటిదేమో . విభిన్న మనస్తత్వాలు గల వ్యక్తుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వారు చదవదగిన శీర్షిక 

16, మే 2012, బుధవారం

మంత్రాక్షరాలు..............వెన్నుపోటు..లక్షకోట్లు!

శ్రీరాముడంతటి వాడు వాలి ముందు నిలబడి యుద్ధం చేయలేకపోయాడు. వాలి ముందు నిలబడి ఎవరు పోరాడినా అతనిలోని సగం బలం వాలికి జమ అయ్యేది. బహుశా తన ఎదుట నిలబడిన వారిపై శక్తివంతమైన మంత్రమేదో వాలి ఉపయోగించే వారేమో! బహుశా ఎదుటి వ్యక్తిని ఇలా నీరుగారిపోయేట్టు చేసే మంత్రాక్షరం వాలికి తెలుసనే విషయం తెలిసే శ్రీరాముడు చెట్టు చాటు నుంచి యుద్ధం చేశాడు.


అందాల రాముడు సినిమాలో అల్లురామలింగయ్య హడావుడి చేస్తుంటే రాజబాబు తీతా అనగానే నీరుగారిపోతాడు. పట్టపగ్గాలు లేనట్టుగా ఎగిరిపడే అల్లురామలింగయ్య తీతా అని వినిపించగానే గాలి తీసిన బెలున్‌లా మారిపోయే సీన్ సినిమాలో బాగా పండింది. తాను తహసిల్దార్‌ను అంటూ అల్లురామలింగయ్య అధికారం చెలాయిస్తుంటారు, కానీ అతను తీసేసిన తహసిల్దారు అనే విషయం రాజబాబు ఒక్కరికే తెలుసు. తీతా అంటే తీసేసిన తహసిల్దారు అన్న మాట.


మాటల మంత్రాన్ని శత్రువును బలహీనపరచడానికి ఉపయోగించుకోవడం రామాయణం, మహాభారతంలోనూ కనిపిస్తుంది. మహాభారత సంగ్రామంలో ద్రోణాచార్యుడిని ఓడించడం అంత సులభం కాదని పాండవులకు తెలుసు. ఇంకేం ఈ మంత్రానే్న ఆశ్రయించారు. యుద్ధంలో అతని కుమారుడు అశ్వత్థామ మరణించాడు అనే మాట వింటే చాలు నీరుగారిపోతాడని, ధర్మరాజుతో ఆ అబద్ధం చెప్పిస్తారు. అశ్వత్థామ మరణించాడు అని గట్టిగా చెప్పి ఏనుగు అని మెల్లగా చెప్పడంతో ద్రోణుడు నీరుగారిపోతాడు.
ఇక మన నేటి రాజకీయాల్లోకి వస్తే వెన్నుపోటు, లక్ష కోట్లు ఈ రెండు మాటలు చాలా పాపులర్ అయ్యాయి. ఈ మాట వినిపించని రాజకీయ చర్చ లేదు. ఈ మాట వినిపించని రోజు లేదు. లక్ష కోట్లు అనగానే కళ్లముందు జగన్, వెన్నుపోటు అనగానే బాబు కళ్లముందుంటారు. ఈ రెండు పదాలు రెండు పార్టీలకు పర్యాయ పదాలుగా మారిపోయాయి. వైఎస్‌ఆర్ ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడే ఫ్యాక్షనిస్టు అనే పదాన్ని ప్రయోగించి ఆయన్ను నిర్వీర్యం చేయాలని ప్రయత్నించారు. ఏ సైకాలజిస్టు సలహానో కానీ ఆ పదాన్ని ఆయన ఒక జోక్‌గా తీసుకుని నవ్వేవారు. తర్వాత ఆ పదం రాజకీయంగా ఎక్కువగా ఉపయోగపడలేదు. ఇప్పుడు లక్ష కోట్లను ఆశ్రయించారు. పిఎన్‌వి ప్రసాద్ అనే టిడిపి నాయకుడు ఒకాయన గంటకు ఎంతో నిమిషానికి ఎంతో లెక్క కట్టి లక్ష కోట్ల లెక్కతేల్చారు. బహుశా ఆయన లక్ష కోట్లకు ఆకర్షితుడైనట్టున్నారు. లెక్క పూర్తయ్యాక ఆయన టిడిపిని వీడి జగన్‌కు నమ్మిన బంటుగా మారారు. ఈ లక్ష కోట్లు ఎలా సంపాదించారో మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రాజాఆఫ్ కరప్షన్ అంటూ పుస్తకాలు రాస్తే, నేతలు ఢిల్లీలో విడుదల చేశారు. ఇప్పుడాయన జగన్ పార్టీలో చేరేందుకు మంచి ముహూర్తం కోసం చూస్తున్నారు!


గరీబీ హఠావో అనే ఒక మంత్రాక్షరం కొన్ని దశాబ్దాల పాటు ఇందిరాగాంధీకి కోట్ల ఓట్ల వర్షం కురిపించింది. ఆత్మగౌరవం అనే పంచ్ డైలాగ్ ఎన్టీఆర్‌ను మన రాష్ట్రంలో ఇందిరాగాంధీని మించిన శక్తివంతునిగా మార్చింది. ఆయన అల్లుడి విషయానికి వస్తే వెన్నుపోటు అనే పదం ఒకప్పుడు ఆయన్ని ఒక మంచి నాయకుడిగా నిలబెట్టింది, చివరకు అదే పదం బాబును, బాబు వర్గీయులను నిర్వీర్యులుగా మారుస్తోంది. కాంగ్రెస్ నుంచి అప్పుడే వచ్చిన బాబు ప్రతిభ చూపించడానికి అవకాశం కోసం ఎదురు చూస్తుంటే నాదెండ్ల భాస్కర్‌రావు వెన్నుపోటు వ్యవహారం బాబులోని ప్రతిభా పాటవాలను పైకి తీసుకు వచ్చింది. కర్నాటకలో క్యాంపు నడపడం మొదలుకొని, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం వరకు వెన్నుపోటుపై అలుపెరగని పోరాటం చేసి ఎన్టీఆర్ మళ్లీ సిఎం కావడంలో కీలక భూమిక పోషించారు. పదేళ్ల తరువాత అదే అనుభవంతో ఆయనే స్వయంగా వెన్నుపోటును నమ్ముకొని అధికారం దక్కించుకున్నారు. బాబుకు పార్టీ పగ్గాలు, అధికారం ఎన్టీఆర్ నుంచి వారసత్వంగా వస్తే, వెన్నుపోటు పదం మాత్రం నాదెండ్ల నుంచి వచ్చింది. ఆ పదానికి అంత కన్నా ముందు ఓనర్ నాదెండ్లనే. కొన్ని పదాలు అత్యంత శక్తివంతగా ఉన్నా వాటి జీవిత కాలం స్వల్పం. లక్ష్మీపార్వతి జమానా నడిచే కాలంలో దుష్టశక్తి అనే పదం చాలా బలంగా వినిపించేది. ఆ పదం ఆమె కొంప ముంచింది. ఆమె రాజకీయ శకం ముగియగానే ఆ పదం జీవితం ముగిసిపోయింది. ఇప్పుడు రాజకీయాల్లో లక్షకోట్లు, వెన్నుపోట్ల హడావుడే ఎక్కువగా కనిపిస్తోంది.


వచ్చే ఎన్నికల్లో లక్ష కోట్లు గెలుస్తాయా? వెన్నుపోటు విజయం సాధిస్తుందా? తెలుగు ఓటరును తొలుస్తున్న ప్రశ్న. సమాధానం కావాలంటే రెండేళ్లు ఆగాల్సిందే! ఈలోపు లక్ష కోట్లు, వెన్నుపోట్లు ను సినిమా టైటిల్స్ కోసం రిజిస్టర్ చేయించుకుంటే ఎలా ఉంటుంది

10, మే 2012, గురువారం

మీడియాపై నియంత్రణ అవసరమా?వందలాది వార్తా చానళ్లు, లెక్కలేనన్ని పత్రికలు. క్షణాల్లో ప్రపంచాన్ని కళ్లముందుంచుతున్నాయి. పాకిస్తాన్ ముష్కరులు మన పార్లమెంటుపై దాడి చేసినా, ముంబయలో తాజ్‌మహల్ హోటల్‌పై దాడి చేసినా ఎలక్ట్రానిక్ మీడియా లైవ్‌గా చూపిస్తోంది. క్రికెట్‌కు లైవ్ చెప్పినంత ఉత్సాహంగా పాకిస్తాన్ తీవ్రవాదులు తాజ్‌మహల్ హోటల్‌పై జరిపిన దాడిని చూపించారు. అయితే మితిమీరిన అత్యుత్సాహం విమర్శలకు దారితీస్తోంది. మీడియాకు స్వీయ నియంత్రణ అవసరం అనే డిమాండ్ బలంగా వినిపించింది. అదే సమయంలో మీడియాపై నియంత్రణ విధించడం అంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం అనే వాదనా వినిపించింది. ఈ నేపధ్యంలో కోర్టు వ్యవహారాలను మీడియా కవర్ చేస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. 

వ్యవహారం చివరకు సుప్రీంకోర్టు ముంగిటకు వెళ్లింది. కోర్టుల్లో కేసు విచారణ సాగుతుండగా, దానిపై మీడియా ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తూ కేసును ప్రభావితం చేస్తున్నాయని, కోర్టులకు సంబంధించిన వార్తల విషయంలో మీడియాపై నియంత్రణ ఉండాలని కోరుకునే వారు చేస్తున్న ఆరోపణ. ఈ అంశంపై సుప్రీంకోర్టు న్యాయనిపుణుల వాదనలు వింది. సుప్రీంకోర్టు ఈ అంశంలో వెలువరించే తీర్పు మీడియాపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. జస్టిస్ ఎస్‌హెచ్ కపాడియా నేతృత్వంలోని బెంచ్ ఇరు వర్గాల వాదనలు వింది. తీర్పును రిజర్వులో పెట్టారు. నారీమన్ లాంటి న్యాయనిపుణలు వార్తల కవరేజిలో నియంత్రణ విధించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని వాదిస్తున్నారు. మీడియా వ్యవహరించే విధానాన్ని నిర్ణయిస్తూ విధివిధానాలు రూపొందించే అధికారం చట్టసభలకు ఉంటుంది. సుప్రీంకోర్టు విధి విధానాలు రూపొందించడం అంటే చట్టసభల అధికారాల్లో జోక్యం చేసుకోవడమే అనేది ఆయన వాదన. మీడియాకు వార్తల కవరేజ్‌లో నియంత్రణ విధించడం మంచిది కాదనే వాదన బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో నియంత్రణ అవసరం అనే వాదన సైతం అంతే బలంగా ఉంది. మీడియాకు నియంత్రణ విధించడం కొత్తేమీ కాదని, న్యాయవార్తల ప్రచురణలో నియంత్రణలను విధిస్తూ గతంలోనే కొన్ని తీర్పులు వెలువడ్డాయని, నియంత్రణ అవసరం అని వాదించే వారు చెబుతున్నారు. మీడియాకు స్వీయ నియంత్రణ లేకపోవడం వల్లే ఇలాంటి వివాదాలు తలెత్తుతున్నాయి. సంచలనాత్మకం, పోటీతత్వంతో చివరకు తమ గొంతు తామే కోసుకునే స్థాయికి మీడియా పోటీ పెరిగిందన్న విమర్శలూ వస్తున్నాయి. వివిధ కేసులు కోర్టుల్లో విచారణ జరుగుతుండగానే మీడియా వాటిపై తీర్పులు ఇచ్చేస్తోంది. సంచలనాత్మక కేసుల్లో ప్రజలుకుండే ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ కోర్టు విచారణను ప్రభావితం చేసే విధంగా కథనాలు రాస్తున్నాయి.

 కేసు విచారణకు దోహదం చేసే విధంగా ఆధారాలతో వార్తలు రాయడం వేరు- కానీ తీర్పును ప్రభావితం చేసే విధంగా ప్రజలపై ప్రభావం పడే విధంగా సొంత ప్రయోజనాల కోసం రాయడం వేరు. సత్యం కంప్యూటర్స్ కేసులో రాష్ట్రంలోని మీడియా అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. రామలింగరాజు తాను చేసిన నేరం ఏమిటో ఆయనే స్వయంగా వెల్లడించారు. అప్పటివరకు అతను తప్పు చేసిన విషయం ఎవరికీ తెలియదు. చేసిన తప్పేమిటి? ఏ పరిస్థితుల్లో తప్పు చేశాడో, ఎలా చేశాడో లిఖిత పూర్వకంగా ప్రకటన చేశాడు. ఆ తరువాత కేసు కోర్టుకు వెళ్లింది. ఈలోపు రాష్ట్రంలోని మీడియా సొంతంగా మసాలా వార్తలు వండి వడ్డించారు. ఒక రాజకీయ నాయకుడి ప్రమేయంతోనే ఇదంతా జరిగిందని రాశారు. తీరా మూడు నాలుగు నెలల తరువాత చార్జిషీట్ దాఖలు చేసిన సమయంలో తాను ఏం తప్పు చేశానని రామలింగరాజు ప్రకటనలో పేర్కొన్నారో, చార్జీషీట్‌లో సైతం అంతే ఉంది. చేసింది తప్పయినా ఏం తప్పు చేశాడో అదే చెప్పాడని నాలుగు నెలల తరువాత అదే మీడియా రాసింది. మరి ఆ మూడు నాలుగు నెలల పాటు వండిన మసాలా కథల మాటేమిటి? ఇలాంటి సంఘటనలు అనేక రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఇటువంటి ఉదంతాలు చూపించి మీడియాకు నియంత్రణ అవసరం అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో నియంత్రణ అంటూ మొదలైతే అది అన్ని స్థాయిల్లోనూ ఉంటుంది. చివరకు ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని కొందరి వాదన. మారుతున్న కాలంలో మీడియాలో సామాజిక బాధ్యత కన్నా ఇతరత్రా ప్రయోజనాలు ఆశిస్తున్నందు వల్లే మీడియాకు నియంత్రణ అవసరం అనే వాదన వినిపిస్తుండగా దానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి మద్దతు లభించడం లేదు

9, మే 2012, బుధవారం

పాండవులు గెలిచింది కోవర్టులతో ... కౌరవులు ఓడింది కోవర్టులు లేక .. నారదుడే తొలి కోవర్టు

‘‘ఏరా పిల్లలూ! మీరు పెద్దయ్యాక ఏమవుతారు?’’ ఐదవ తరగతి పిల్లలను టీచర్ ప్రశ్నించింది. పిల్లలు ఉత్సాహంగా, ‘‘నేను డాక్టర్‌నవుతా? నేను ఇంజనీర్‌నవుతా?’’ అంటూ పిల్లలు ముద్దు ముద్దుగా చెబుతున్నారు. పింకు గట్టిగా నవ్వాడు. ‘‘సరే పెద్దయ్యాక నువ్వేమవుతావు?’’ అని టీచర్ పింకును అడిగింది. ‘‘కోవర్ట్‌నవుతా టీచర్ అని పింకు గర్వంగా చెప్పాడు. ‘‘వేలెడంత లేవు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. కోవర్ట్ అంటే తెలుసా? నీకు’’ అని టీచర్ ఆశ్చర్యంగా అడిగింది. ‘‘తెలుసు టీచర్. రెండేళ్ల నుంచి ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను. అంతా నన్ను బన్ను గ్యాంగ్ వాడినని అనుకుంటారు కదా? కానీ ఇప్పుడు చెబుతున్నాను. నేను బన్ను గ్యాంగ్‌లో ఉండి వాళ్లు మాట్లాడుకునే మాటలను ఎప్పటికప్పుడు ప్రితీష్ గ్యాంగ్‌కు చేరవేస్తాను. ఏనాటికైనా రాష్ట్రంలో నంబర్ వన్ కోవర్టును కావాలనేది నా టార్గెట్ ’’ అని పింకు చెప్పుకొచ్చాడు. బన్ను గ్యాంగ్ విద్యార్థులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. క్లాస్ నుంచి బయటకు వచ్చాక, ఏరా మమ్మల్ని నమ్మించి మేం మాట్లాడుకునేవి వాళ్లకు చెబుతావా? అని పింకు చొక్కా పట్టుకున్నాడు. ‘‘ప్రితీష్ వాళ్లు నన్ను నమ్మాలని అందరి ముందు అలా చెప్పాను. నేను మీ కోవర్టునే ప్రామిస్ అని చెప్పాడు. బన్ను వాడి చొక్కా వదిలి సంతోషంగా షేక్‌హాండ్ ఇచ్చాడు. ‘‘నేనేరా కోవర్ట్’’ అని పాట పాడుకుంటూ ..
***


హనుమంతుడికి కూడా తన శక్తి తనకు తెలియదంటారు. కానీ కోవర్టుకు మాత్రం తన శక్తితో పాటు ఎదుటి వాడి బలహీనతలు కూడా తెలుస్తాయి. ఏ కాలంలో నైనా కోవర్టులకు తిరుగులేదు. రాష్ట్ర రాజకీయాల్లో కోవర్టులు పెరిగిపోయారని అంతా ఆశ్చర్యపోతుంటే అసలు ముఖ్యమంత్రే కోవర్టు అని మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అందరినీ విస్మయపరిచారు. సినిమాల్లోని సస్పెన్స్ కన్నా ఒక్కోసారి జీవితంలోని సస్పెన్స్ ఎక్కువ విస్మయ పరుస్తుంది.


 మనం హీరో అనుకున్న వ్యక్తి ఏదో సమయంలో కరుడు గట్టిన విలన్ అని తేలవచ్చు. అమ్మాయి ఒడిలో తల పెట్టుకొని ప్రేమ కబుర్లు చెప్పినప్పుడు అచ్చం కమల్ హసన్‌లా కనిపించిన వాడు పెళ్లి మాటెత్తగానే ప్రకాశ్ రాజ్‌లా మారిపోవచ్చు. గుండెపోటు గుమ్మడి ఓ సినిమాలో గుండెలు తీసిన విలన్ అని సినిమా చివర్లో ఎన్టీఆర్ తేల్చేస్తారు. అప్పుడు ఎన్టీఆర్‌తో పాటు మనమూ విస్తుపోతాం. పాత సినిమాల్లో అయితే కనీసం విలన్ ఎవరూ చివర్లోనైనా తెలిసేది. ఇప్పుడు హీరోల వారసులు హీరోలు అని గుర్తించాలి తప్ప సినిమాలో కథను బట్టి ఎవరు హీరోనో? ఎవరు విలనో అస్సలు పోల్చుకోలేం. ఆది నుంచి దమ్ము వరకు జూనియర్ ఎన్టీఆర్ తన ఎదుట కనిపించిన వాడినల్లా తల నరికేస్తున్నాడు. మరప్పుడు అతన్ని మనం విలన్ అనుకోవాలి. అలా అనుకుంటే మీరు పాత కాలం మనుషులని తెలిసిపోతుంది. వందలాది మందిని ఆకారణంగా చంపేస్తేనేం ఆయన ఎన్టీఆర్ మనవడు. హీరో కాకుండా విలన్ ఎలా అవుతాడు. సినిమా కథేంటి అనేది అనవసరం. ఇంతకన్నా ఈజీగా హీరోను గుర్తు పట్టాలంటే మరో మార్గం ఉంది. తెరపైకి ఎవడు రాగానే ఈలల గోలతో అంతా గందరగోళంగా మారుతుందో, కాగితాలు విసిరేస్తారో వాడే హీరో. చిత్తుకాగితాలు ఏరుకునే వారంతా అనాధలు కాదు. వారిలో హీరోల అభిమానులు కూడా ఉంటారు అనే బరువైన డైలాగు ఇక్కడ ఎవరికైనా అవసరం అయితే వాడుకొవచ్చు.


కోవర్టు వృత్తికి మాత్రం మరణం లేదు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా కోవర్టుల చరిత్ర లిఖించాల్సిన అవసరం ఉంది. తొలి కోవర్టు ఎవరు? ఇంకెవరు నారదుడు. నారాయణ నారాయణ అంటూ ఆయన అన్ని కాలాల్లోనూ ప్రధాన విలన్లకు అత్యంత సన్నిహితంగా మెదిలే వారు. హిరణ్యకశ్యపుడి చెవిలో మంతనాలు జరుపుతుంటే రాక్షస పక్షపాతి అనిపిస్తుంది. కానీ ఆయన దేవతల కోవర్టు. రాక్షస సంహారం కోసమే ఆయన నిత్యం వారి వెంట ఉండేవాడు. రావణున్ని శ్రీరాముడు వీరోచితంగా వధించాడు అని చెప్పుకుంటాం కానీ దానికి కారణం ఎవరు ఇంకెవరు విభీషణుడు అనే కోవర్టే కారణం కదా? దుర్యోధనుడి సైన్యంలో ఆయుధ సంపత్తి, వీరులు ఎంత మంది ఉన్నా సరైన కోవర్టులు లేక దెబ్బతిన్నాడు. రథం నడిపిన శల్యుడి నుంచి మహాభారత యుద్ధానికి కౌరవులను ప్రేరేపించిన శకుని మామ వరకు అంతా పాండవుల కోవర్టులే కదా? మహాభారతంలో దుర్యోధనుడు కోవర్టులను నమ్ముకున్న దాఖలా లేదు. దుర్యోధనుడు ఓడిపోయింది సైన్యం లేక కాదు కోవర్టులను నమ్ముకోక! 


జానపద సినిమాల్లో ఈ ద్రోహిని బంధించండి అని ముసలి రాజు చెప్పగానే రాజనాల వికట్టహాసం చేస్తాడు సైనికులంతా రాజునే బంధిస్తారు. తన సైన్యమంతా కోవర్టులుగా మారిపోయారని అప్పుడు కానీ ఆ రాజుకు తెలియదు. ఇలాంటి సినిమాలు మన ముఖ్యమంత్రి బాగానే చూసినట్టున్నారు. అందుకే కోవర్టులందరితో పాటు తానూ కోవర్టుగా మారిపోయి తన స్థానం పదిలపరచుకున్నారు. సినిమా హీరో అయినా పాపం ఎన్టీఆర్‌కు ఈ పరిజ్ఞానం లేక దెబ్బతిన్నారు. అల్లుడు గారిని బంధించండి అని హూంకరిస్తే తమ్ముళ్లంతా అన్నగారినే బంధించి అల్లుడికి జై కొట్టారు. అల్లుడిలా మామ కూడా కోవర్టులను ఆశ్రయించి ఉంటే రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండేవో?
నీతి .. కోవర్టు ను నువ్వు రక్షిస్తే .. కోవర్టు నిన్ను రక్షిస్తాడు 

4, మే 2012, శుక్రవారం

నాడు మేనక... నేడు కొలవెరి .....రాజకీయాలను, సినిమాలను నిండా ముంచుతున్న మితిమీరిన ప్రచారం


కొలవెరి ... కొలవెరి ... వై దిస్ కొలవెరి... రెండు నెలల క్రితం దాదాపు మొత్తం దేశాన్ని ఊపేసిన పాట ఇది. ఈ పాట గురించి చూపించని చానల్ లేదు. రాయని పత్రిక లేదు. మాట్లాడని సినిమా అభిమాని, సినిమా జీవి లేరు. సాధారణంగా దక్షిణాధికి అంతగా ప్రాధాన్యత ఇవ్వని ఉత్తరాధి సినిమా రంగం, ఉత్తరాధి మీడియా సైతం ఈ పాటను ఆకాశానికెత్తింది. ఆ పాట ఉన్న సినిమా 3 విడుదలైంది. ఔనా! ఎప్పుడు విడుదలైంది అనుకునే వారే ఎక్కువ. ఎందుకంటే ఆ సినిమా ఎప్పుడు విడుదలైందో, ఎప్పుడు డబ్బాలు వెనక్కి వెళ్లాయో తెలియకుండానే జరిగిపోయింది. ఒక సినిమాలోని పాట మొత్తం దేశాన్ని ఊపేస్తే ఆ సినిమా ఎలా ఉంటుందని అనుకుంటారు. టాపు లేపేస్తుందని అనుకోవడం సహజమే. చాలా మంది సినిమా వ్యాపారులు అలానే అనుకున్నారు. పోటీ పడి 3 సినిమా హక్కులు కొన్నారు. సినిమా విడుదలయ్యాక వై దిస్ కొలవెరి అంటూ తడిగుడ్డ నెత్తిమీద వేసుకొని లబోదిబో మంటున్నారు. 


సినిమా అయినా రాజకీయాలు అయినా ప్రచారం ఒక స్థాయి వరకు బాగానే ఉంటుంది. ప్రచారం అవసరం కూడా. కానీ మితిమీరిన ప్రచారం ఒక సినిమాను నిలబెట్టలేదు. ఒక రాజకీయ పార్టీని గెలిపించలేదు అని పదే పదే రుజువు అవుతూనే ఉంది. కానీ ఈ వ్యవహారం కొందరిని నిండా నష్టాల్లో ముంచేస్తుంది. చిన్న సినిమా విషయంలో ఇటీవల తెలుగు నాట నట్టికుమార్ పేరు బాగా వినిపిస్తోంది. షూటింగ్ చివరి దశలో ఉండి ముగింపునకు నోచుకోని సినిమాలు, షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలను సైతం ఆయన విడుదల చేస్తున్నారు. కానీ ఇప్పుడు అలాంటి నట్టికుమార్‌ను కొలవెరి నిండా ముంచేసింది. రెండు మూడు కోట్లకు మించి వ్యయం కాని 3 సినిమాలో రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరో. ధనుష్ వాళ్ల నాన్న కొలవెరి పాట పాపులారిటీని బాగా ఉపయోగించుకుని 3 సినిమా రైట్స్‌ను వివిధ భాషల్లో అమ్ముకున్నారు. ఒక్క తెలుగులోనే ఈ సినిమాను ఆరుకోట్ల 40 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. వీళ్లు చెప్పిన సమాచారం ప్రకారమే తెలుగు, తమిళం, కన్నడం భాషల్లో ఈ సినిమాను 50 కోట్లకు అమ్ముకున్నారు. కొలవెరి పాట పాపులారిటీ తప్ప ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఏమీ లేదు.


24 గంటల చానల్స్‌కు ప్రతి నిమిషం ఏదో కొత్తదనం చూపించడానికి తంటాలు పడాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎవరో ఒకరి మదిలో మెదిలిన ఐడియా కొలవెరి పాట. ఒకరిని చూసి ఒకరు అన్ని చానల్స్ ఆ పాటను పాపులర్ చేశాయి. దాంతో ఆ చానల్స్‌కు పోయేదేమీ లేదు. కానీ ఒక్క పాటను చూసి డబ్బింగ్ సినిమా హక్కులను ఆరున్నర కోట్లకు కొనేవారు ఆలోచించాలి. అసలే తెలుగు సినిమా పరిశ్రమ సంక్షోభంలో పడిపోయింది. కేవలం ఐదు శాతం సినిమాలో మాత్రమే అంతో ఇంతో లాభాలు గడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత భారీ నష్టం అది వ్యక్తులపైనే కాదు మొత్తం సినిమా పరిశ్రమపై ప్రభావం పడుతుంది.
విపరీతమైన ప్రచారంతో గట్టెక్కుతామనే భ్రమల్లో పడిపోవడం ఇది మొదటి సారేమీ కాదు. ఏకంగా ఎన్టీ రామారావు లాంటి నట రాజకీయ వేత్త ఒక సినిమా ద్వారా మళ్లీ అధికారంలోకి వచ్చేస్తామని కలలు కన్నారు. బహుశా బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాకు లభించినంత ప్రచారం దేశంలో మరే సినిమాకు లభించి ఉండదు. విపిసింగ్ లాంటి జాతీయ నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మీనాక్షి శేషాద్రి మేనకగా నటించింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు విశ్వామిత్రుడి వేషం వేశారు. విశ్వామిత్రుడి గెటప్‌లోనే ఆయన మేనక వీపు మీద ఫైళ్లు పెట్టి సంతకం చేశారు. దేశంలో దాదాపు అన్ని పత్రికలు ఈ ఫోటోను ప్రచురించాయి. ఈ సినిమాకు కాంగ్రెస్ నాయకులు కూడా భయపడిపోయారు. ఈ సినిమా రావడాని కన్నా ముందే దూరదర్శన్‌లో మేనక పై దాసరి నారాయణరావుతో టీవి సీరియల్ తీయించారు. 89 ఎన్నికల్లో ఎన్టీరామారావు ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకొన్నారు. ఎన్నికల నాటికి సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో అప్పటి వరకు పూర్తయిన సినిమానే కొన్ని కొన్ని భాగాలుగా జిల్లాలకు పంపించారు. అప్పుడు టిడిపి అభ్యర్థులు ఈ సినిమా ముక్కలను ప్రచారంలో ఉపయోగించుకోవాలన్నమాట. చివరకు ఈ సినిమా తుస్సు మంది. 89 ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది. కల్వకుర్తిలో స్వయంగా ఎన్టీఆర్ ఓడిపోయారు. మితిమీరిన ప్రచారమే ఈ సినిమా కొంప ముంచింది.


 న్యూస్ చానల్స్ లేక ముందు సినిమా ప్రమోషన్ సాధారణ స్థాయిలోనే ఉండేది. చానల్స్ పెరిగాక ఇప్పుడు అన్ని చానల్స్‌లోనూ ప్రతి సినిమా ప్రచారం అదిరిపోతుంది. అయితే థియేటర్లలో మాత్రం సినిమా పప్పులు ఉడకడం లేదు. కథలో కొత్తదనం ఉంటే తప్ప సినిమాలు బతకడం లేదు. కానీ ప్రచారం మాత్రం అదిరిపోతుంది.
ఇప్పుడు 3 సినిమా తరహాలోనే గతంలో రజనీకాంత్ నటించిన బాబా సినిమా వ్యవహారంలో జరిగింది. ఆ సినిమాకు సైతం మితిమీరిన ప్రచారం కల్పించారు. పోటీ పడి ఆ సినిమా హక్కులు పొందిన వారు నిండా మునిగిపోయారు. వారి పరిస్థితి చూసి రజనీకాంత్‌కే జాలి కలిగింది. దాంతో తన సినిమాతో నష్టపోయిన వారిని కొంత వరకు ఆయన ఆదుకున్నారు. 3 సినిమాపై సైతం ఆదే విధంగా ఆశలు పెట్టుకొని ఎక్కువ మొత్తానికి కొన్నవారు ఆయన వైపు ఆశగా చూస్తున్నారు. 3 సినిమా ఫ్లాప్ కాగానే రజనీకాంత్ ఆ సినిమాతో తనకు ఎలాంటి సంబంధం లేదనే ప్రకటన చేశారు. 


హీరో ధనుష్ ఆదుకుంటామని హామీ ఇచ్చారట! కానీ ఇప్పుడు ధనుష్ కానీ నిర్మాత అయిన వాళ్ల నాన్న కానీ దొరకడం లేదు. ఇది వ్యాపారం బాగా నడుస్తుందనే అత్యాశతో కొని నష్టపోగానే ఆదుకోమని చూడడం ఏమిటో? తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని ధనుష్ సినిమాను ఆరున్నర కోట్లకు కొనుగోలు చేయడం ఏమిటో? సినిమాలే కాదు రాజకీయ పక్షాలు సైతం మితిమీరిన ప్రచారంపై బోలెడు ఆశలు పెట్టుకొని తీరా ఫలితాలు వచ్చాక లబోదిబో మంటున్నారు. ప్రచారం కాదు సినిమాలో సరుకు చూసి ముందడుగు వేయాలి. మితిమీరిన ప్రచారానికి సినిమా వ్యాపారులు పడిపోతున్నారేమో కానీ ప్రేక్షకులు పడిపోవడం లేదని 3 సినిమా ప్లాప్ వ్యవహారం రుజువు చేస్తోంది.

3, మే 2012, గురువారం

యువ జీవితాలను హరిస్తున్న ^ఆందోళనా రాగం ^రాగాలు రాళ్ళను కరిగిస్తాయి, వర్షాలు కురిపిస్తాయి . మరి జీవితం లో ఆందోళనా రాగం ఎక్కు వయితే ఏమవుతుంది ? అది జీవితాన్నే కరిగించేస్తుంది సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్.. 80వ దశకంలో కుర్రకారును ఊపు ఊపేసిన పాట అది. ఆ కాలంలో యువతకు పెద్ద టార్గెట్ -ఉద్యోగం సంపాదించడం. ఆ పాట నేటి యువతకు సిల్లీగా అనిపించొచ్చు. కాలం మారింది. కుర్రకారు కోరికలు మారాయి. సంస్కరణలు దేశంలో ఊహించని పెను మార్పులు సంభవిస్తున్నాయి. కానీ -చిత్రంగా లావవుతున్న కోర్కెల చిట్టా, అందుకు అనుగుణంగా సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఏ కుర్రాడినైనా కదిపి చూడండి. మంచి జీవితానికి ఊహల్లో రూపురేఖలు ఎలా ఉన్నాయో రాసిమ్మనండి. అందులో తప్పని సరిగా కనిపించేది -సకల సౌకర్యాలు కలిగిన లగ్జరీ ఇల్లు. సెలబ్రిటీని తలదనే్న సహచరి. అంతకుముందు -కార్పొరేట్ కంపెనీలో పెద్ద ఉద్యోగం. పెద్ద కారు. ఏటేటా కుటుంబంతో విహార యాత్రలు. ఆనందాన్ని రెట్టింపు చేసే స్నేహ బృందం. భలే! సరే ఇవన్నీ సమకూరాయి అనుకుందాం. అప్పుడు జీవితం సంతృప్తికరంగా ఉంటుందా? సారీ.. అవునని బలంగా చెప్పలేరు. ఏదో తెలీని ఆందోళన. ఎక్కడో ఏదో జరిగిపోతోందన్న కలవరం. ఎందుకూ? అని ప్రశ్నిస్తే ‘ఉన్నదానికంటే ఇంకేదో కావాలనే తాపత్రయం’. ‘ఒకే ఒక్క చాన్సివ్వండి’ అని స్టూడియో గేటుదగ్గర ఏడ్చిన వాడు కూడా, చాన్స్ దొరికాక ‘సూపర్ స్టార్’కు లంగరేస్తాడు.


 మంచి శక్తి సామర్థ్యాలను వెలికి తీసే పదునైన ఒత్తిడి, సందర్భోచిత ఆతృత మంచిదే. కానీ ఎక్కువ సందర్భాల్లో ఇదే కుర్రకారులో ఆందోళనగా రూపాంతరం చెందుతుంది. మానసిక, శారీరక అనారోగ్యాలకు హేతువవుతోంది. -‘పట్టణ ప్రాంతాల్లో 98శాతం భారతీయ యువత తీవ్రమైన ఆందోళన, గాబరాతోనే కాలం గడిపేస్తోంది’ అన్నది ఇటీవలి అధ్యయనాలు తేల్చిన సారాంశం. ఈ మితిమీరిన ఆందోళనే ముందు రక్తపోటు, తరువాత గుండెపోటుకు దారి తీస్తున్నాయని వైద్యులు అంటున్నారు. ఆర్థిక సంస్కరణల తరువాత దేశంలో కచ్చితంగా సంపద పెరిగింది. సంతోషానికి, సుఖమయ జీవనానికి సంపదే మూలం అనుకుంటే, మరి దేశంలో సంతోషం సూచి పైకి చూపించాలిగా. నిజానికి అలా జరగలేదు. సంపదను మించి ఆందోళన, ఆతృత మానసిక రోగాలను పెంచాయి. ఇది సర్వేల సాక్షిగా నిజం. ఈతరం కన్నా వారి తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు సంతోషంగా జీవించారు. ఇది అందరూ అంగీకరించేదే. అది తెలుసుకుని కూడా, గాబరాకు గురవుతున్న యువత మాత్రం ఏదో జరిగిపోతుందనే భయం, ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ, ఆనారోగ్యాన్ని ఆహ్వానిస్తున్నారు.


 ఒక్క విషయం తెలుసా.. గుండెపోటుకు కారణాల్లో 34 శాతం ఇలాంటి సమస్యలే. ఇది వైద్యులు చెప్తోన్న మాట. 34 ఏళ్ల పవన్ ఒక బహుళ జాతి కంపెనీలో ఎగ్జికూటివ్. తల్లిదండ్రులకు ఇల్లు ఉంది. అదికాక, సొంతంగా ఇల్లు కట్టాడు. ‘బాగానే సంపాదిస్తున్నాను. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నాను. తరుచూ కుటుంబంతో విహార యాత్రలకు వెళ్తాను. కానీ ఏదో తెలియని వెలితి, ఆందోళన వెంటాడుతోంది. ఇది నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది’ అంటున్నాడు. గతంలో ఎప్పుడూ లేనన్ని యోగా సెంటర్లు, ధ్యాన కేంద్రాలు చుట్టూ కనిపిస్తున్నాయి. వాటిద్వారా ఉపశమనం పొందేందుకు కేంద్రాల వద్దకు క్యూ కడుతూనే ఉన్నారు. బహుశ, అంతకంతకూ పెరుగుతోన్న ఆందోళనే వీటి అవసరాలు పెరగటానికి కారణమై ఉండొచ్చు. ‘అలుపెరుగని పరుగే అంతిమ విజయం అనుకుంటూ, ‘ఏదో ఏదేదో’ కోసం పరుగులు తీస్తున్న వాళ్లంతా జీవితాన్ని ఓడిపోతున్నామన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు’ అంటారు డాక్టర్ మానస. ఫలానాది సాధించాలి, సాధిస్తామా? లేదా? సాధించిన విజయం నిలబెట్టుకుంటామా? అనే అతి ఆలోచనలు సైతం ఆందోళనను పెంచుతాయి. పదేపదే అదే అంశాన్ని తీవ్రంగా ఆలోచిస్తూ, దానిపైనే దృష్టి కేంద్రీకరించిన క్రమంలో చిన్న సమస్యలు కూడా పెద్ద శిరోభారానే్న మోసుకొస్తాయి. మనిషి ఆందోళనతో ఉన్నప్పుడు సహజంగా ఉండలేడు. అయోమయాన్ని ప్రదర్శిస్తాడు. తననుంచి తానే దూరంగా పరుగులు తీస్తుంటాడు. ప్రతికూల ఆలోచనలతో సతమతం అవుతుంటాడు. ఇతరులపై ఆధారపడే తత్వం, కోపం ఎక్కువవుతాయి. నిస్సహాయుడవుతాడు. ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు ‘ఏదోక వ్యసనానికి’ దగ్గరవుతారు. అంతేకాదు, హాఠాత్తుగా బరువు పెరగడమో తగ్గడమో జరుతుంది. కంటినిండా నిద్రకు దూరమై, అనారోగ్యం ఒడికి చేరతాడు. సిల్లీగా అనిపించినా, మానసిక నిపుణుడు ఒకరు చెప్పిన విషయం ఆసక్తికరంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న వాళ్లంతా -చేరాల్సిన సమయం కంటే ఇంటికి ఆలస్యంగా చేరతారట. నలుగురితో కూర్చుని భోజనం చేస్తూనే ఈ క్షణం గురించి ఆలోచించటం మానేసి రెండు రోజులు ముందునాటి ప్రణాళికలపై దృష్టి పెడతారు.


 ఒకప్పటి పరిస్థితి వేరు. చేరాల్సిన సమయానికే ఇంటికి చేరుకుని, కుటుంబంతో హాయిగా గడిపేవారు. ఇప్పటి జనరేషన్ అయితే -‘ఈ క్షణంలో జీవించడం ఎప్పుడో మర్చిపోయింది. రెండురోజుల ముందు గురించి ఆలోచిస్తుంది. తినాల్సింది ఒంటరిగా తినేస్తూ, నలుగురితో కలిసి చేయాల్సిన పనులు ఒంటరిగా చేసేస్తుంటే ఆందోళన పెరిగిపోక ఏమవుతుంది. మనం అలవాటు చేసుకుంటున్న క్రెడిట్ కార్డులు, ఈజీ మనీ వ్యవహారాలు కూడా ఆందోళన పెరగడానికి ప్రధాన కారణం అవుతున్నాయంటున్నారు మానసిక నిపుణులు. ఎవరికి వారు -ఆందోళనతో ఇబ్బంది పడుతున్నామేమో తెలుసుకోవడానికి వైద్యులు కొన్ని ప్రమాణాలు నిర్ణయించారు. మీరు ఏ దిక్కుకైనా తీక్షణంగా చూస్తున్నపుడు -పట్టపగలే కళ్ల ముందు లీలగా చుక్కలు కదులుతున్నాయా? మీ హృదయ స్పందన మీకు వినిపిస్తుందా? మెడ భాగంలో చరచూ నొప్పికి గురవుతున్నారా? చాలా ఎక్కువగా నిద్ర పోవడం లేదా తక్కువగా నిద్రపోవడం జరుగుతుందా? అర్ధరాత్రి మెలుకువ వచ్చేస్తోందా? ఆందోళన కలిగించే కలలు రావడంతో హఠాత్తుగా మేల్కొంటున్నారా? కడుపులో తరచూ గడబిడ ఉంటుందా? ఎక్కువగా తుమ్ములు, శరీరం మొత్తం నొప్పిగా ఉంటుందా? ఇలాంటి సమస్యలు -మీలో పెరిగిపోతున్న ఆందోళనకు సంకేతాలు. ఆ పరిస్థితి నుంచి బయట పడాలంటే కొన్ని చిట్కాలు కూడా సూచిస్తున్నారు వైద్యులు. 


అవేంటంటే.. ముందుగా అత్యాశ వదులుకోవాలి. తాహతుకు మించిన ఆలోచనలు తలనొప్పి వ్యవహారమేనట. ఏ పనినైనా పూర్తి చేయాలనుకుంటే సరైన అంచనాలు రూపొందించి సానుకూల ధోరణితో అడుగులు వేయమని హెచ్చరిస్తున్నారు. ఆలోచించండి. సాధించిన దానితో సంతోషంగా ఉన్నానని మీకు మీరే సంకేతాలు ఇచ్చుకోండి. చేసే పనిలో ఆనందాన్ని అనుభవించండి. శక్తిని సరిగా అంచనా వేసుకొని, ఆ మేరకే లక్ష్యాలు నిర్దేశించుకోండి. రోజుకు కనీసం 15 నిమిషాలు ధ్యానం చేయండి. జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారో కాగితంపై రాసి చూసుకోండి. ఉద్యోగం, సంపాదన, పని ఎంత ముఖ్యమో కుటుంబం కూడా అంతే ముఖ్యం. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు ఎంత సంపాదించి ఏం ప్రయోజనం. ఆ విషయాన్ని గుర్తెరికి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి. ఎదుటివాడి జీవితంతో నిన్ను పోల్చుకుని ఏడ్చేకంటే, మనదైన సంతోషాన్ని గుర్తు చేసుకుని ఆనందంగా జీవించండి. జీవితం ఒక్కటే. దాన్ని ఏడిపించొద్దు అన్నాడో సినీ కవి. ఈ తత్వం బోధపడితే జీవితం కోసం జీవించొచ్చు. లేదంటే బతుకంతా -ఆందోళనారోగమే!

2, మే 2012, బుధవారం

సూపర్ మ్యాన్ వేషం లో నారాయణ ... కామెడీ రాజకీయం!

‘సూపర్ మ్యాన్... సూపర్ మ్యాన్ ’అంటూ అండర్‌వేర్ ప్యాంట్‌పైన ఒక వ్యక్తి హాలులోకి పరిగెత్తుకొచ్చాడు. అచ్చం సినిమాలో సూపర్ మ్యాన్ వేషధారణలానే ఉంది. చుట్టుపక్కల ఎక్కడైనా నాటకాలాడుతున్నారేమో అనుకుని బాబు ఇది పార్టీ ఆఫీసు ఇక్కడ రాజకీయ వేషాలే తప్ప ఇలాంటి వేషాలు వేయవద్దు వెళ్లండి అని భుజం మీద చేయి బలవంతంగా బయటకు పంపడానికి ప్రయత్నించారు. మే ఫూల్... మే ఫూల్ అని అతను గట్టిగా నవ్వాడు. ఏప్రిల్ ఫూల్‌ను మేలో జరుపుకునే వీడెవడురా బాబు అని తలలు పట్టుకున్నారు. అతను ముఖానికున్న మాస్క్ తొలగించాడు. నారాయణ... నారాయణ... అరే సిపిఐ కార్యదర్శి నారాయణ సూపర్ మ్యాన్ అయిపోయారు అని అంతా ఆశ్చర్యపోయారు.


 ఆయనపైకి కెమెరాలు ఫోకస్ చేశారు. సూపర్ మ్యాన్ వేషంలో నారాయణ అంటూ చానల్స్ బ్రేకింగ్ న్యూస్‌లతో లైవ్ టెలికాస్ట్ మొదలు పెట్టాయి. నారాయణ వేషధారణపై టీవిల్లో చర్చలు మొదలయ్యాయి. ‘‘రైతుల సమస్యలు, పేదల సమస్యలు అంటూ నేను గంట సేపు ఉపన్యాసం చేసినా మీ చానల్‌లో నిమిషం చూపరు, పత్రికల్లో అక్షరం రాయరు. మళ్లీ ప్రజల సమస్యలను విస్మరిస్తున్న నాయకులు అంటూ మీరే చెబుతుంటారు. విషయం చెబితే ఎవరూ పట్టించుకోవడం లేదు అందుకే ఇలా వేషం వేసుకొని వచ్చాను. ఏ చానల్ తిప్పి చూసినా నా మాటలే లైవ్‌గా వస్తున్నాయి. మా పార్టీకి ఇంతకు మించి ఇంకేం కావాలి’’ అని నారాయణ తన వేష రహస్యాన్ని విప్పారు. నేను పోలీసుల కళ్లు కప్పి నాటు పడవల్లో సాహస యాత్ర చేసి ఉద్యమిస్తే మీరు ఒక్క రోజు కన్నా ఎక్కువ చెప్పలేదు. ఈ మధ్య ఎంత తీవ్రమైన కామెంట్స్ చేస్తున్నా స్క్రోలింగ్‌లకే పరిమితం చేస్తున్నారు. అందుకే ఒక్కోసారి ఒక్కో వేషం వేసి మిమ్ములను ఆశ్చర్యంలో ముంచెత్తాలనుకుంటున్నాను. మీరెవరూ ఊహించని వేషాల్లో వస్తాను. ఊహించండి చూద్దాం అని నారాయణ మీడియాకు సవాల్ విసిరి అక్కడి నుంచి మాయమయ్యారు.
***
బాబు చేతిలో పేపర్ల కట్టులు చూడగానే అక్కడ కూర్చున్న మీడియా వారికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఒక టీవి చానల్ యువకుడు సార్ వచ్చే వారం నా పెళ్లి అని మెల్లగా చెప్పాడు. ఆ లోపుగానే ముగిస్తాలే అని బాబు భరోసా ఇచ్చారు. కిక్కిరిసిన విలేఖరుల సమావేశం కావడంతో కెమెరా బాబు తలకు తాకింది. ఆయన నిశే్చష్టులయ్యారు. ఒక్క నిమిషం ఏమీ మాట్లాడలేదు. వెంటనే మైకు అందుకున్నాడు. స్వర్ణాంధ్ర సాధించేంత వరకు నేను నిద్రపోను.. మిమ్ములను నిద్ర పోనివ్వను. నా పాలన చూసి ప్రపంచం విస్తుపోతోంది అని చెప్పడం మొదలు పెట్టారు. (పిఎ చెవి వద్దకు చేరి సార్ మీరిప్పుడు అధికారంలో లేరు ఇది 2012 అని గుర్తు చేశాడు.) నాకిప్పుడే అంతా గుర్తుకొచ్చింది. వైఎస్‌ఆర్ పులివెందుల ప్రాథమిక పాఠశాలలో చదివేప్పుడు పక్క కుర్రాడి బలపం ఎత్తుకెళ్లాడు. సిబిఐ ఎంక్వైయిరీ జరిపిస్తే వాస్తవాలు తెలుస్తాయి. మీడియ వాళ్లు అయోమయంగా చూశారు. ఆయన జీవితం ఎలాంటిదో చెప్పడానికే ఈ సంగతి చెప్పాను. తరువాత కర్నాటక వెళ్లి మెడికల్ కాలేజీలో చేరాడు. తెలుగు ఆత్మగౌరవాన్ని అప్పుడే తాకట్టు పెట్టాడు. సరే కొత్త సంగతులు చెప్పండి సార్ అని వెనక నుండి అసంతృప్తి వాది అరిచాడు.
 ప్రపంచాన్ని నివ్వెర పరిచే విషయం ఒకటి చెప్పబోతున్నాను. స్కూల్‌లో చదువుకునేప్పుడు వైఎస్‌ఆర్ పక్కవారి పెన్సిళ్లు, బలపాలు ఎత్తుకెళ్లిన విషయం నాకు మాత్రమే తెలుసు. నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఏనాటికైనా ప్రమాదం అని నల్లమల అడవులకు వెళ్లి అన్నలతో మాట్లాడి అలిపిరిలో నాపై హత్యాయత్నం చేశారు. నేషనల్ మీడియా ఉందా? దీన్ని ఇంగ్లీష్, హిందీల్లో కూడా చెబుతాను అని బాబు అనగానే ముందు తెలుగులో పూర్తి చేయండి సార్ అని అంతా చేతులు జోడించి ప్రార్థించారు. పాపం సార్ ఢిల్లీలో చక్రం తిప్పేవారు ఎలాంటి వారు ఎలా అయిపోయారు అని అభిమానులు ఆవేదన చెందారు.

***
ఇలా అయితే కష్టం సార్! తెలుగు సినిమా ఇంతకు ముందెన్నడూ లేనంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మీరే రక్షించాలి అని తెలుగు సినిమా పెద్దలు ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. వీళ్లు మాట్లాడిన తెలుగును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అర్ధమయ్యే తెలుగులోకి సమాచార శాఖ అధికారి తర్జుమా చేసి చెప్పాడు. తప్పకుండా మీ సమస్య పరిష్కరిస్తాను అనే అర్ధం వచ్చే విధంగా సిఎం ఏదో మాట్లాడారు. ఆ తెలుగును అధికారి మళ్లీ మామూలు తెలుగులోకి అనువదించాడు. అన్ని సినిమాలు ప్లాపవుతున్నాయి. అంతో ఇంతో కామెడీ సినిమాలు నడిచేవి. కానీ మీ నాయకులంతా నిత్యం చేసే కామెడీ చర్యలను టీవిలు 24 గంటల పాటు లైవ్‌గా చూపడంతో మా సినిమాలు చూసేవారే లేరు అని బోరుమన్నారు. టీవిల్లో 24 గంటల రాజకీయ కామెడీ నిలిపివేసి మా సినిమాలను రక్షించండి అని వేడుకున్నారు. సినిమాల్లో కామెడీ తగ్గి రాజకీయాల్లో కామెడీ పెరిగిపోవడం ఎవరికీ మంచిది కాదని కమెడీయన్లు ముఖ్యమంత్రికి చెప్పారు. మీరు నటులు రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు నాయకులమైన మేము కామెడీ ట్రాక్‌లోకి వస్తే తప్పేమిటి? అంటూ అక్కడే ఉన్న బొత్స పక పకా నవ్వారు.