జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, ఏప్రిల్ 2026, గురువారం

బాబు పదవిని నిలబెట్టిన గ్యాస్ సిలిండర్ కథ

బాబు పదవిని నిలబెట్టిన గ్యాస్ సిలిండర్ కథ జర్నలిస్ట్ జ్ణాపకాలు -126 ^^ గ్యాస్ సిలిండర్ తో వంట చేయవచ్చని చేసింది నేనే ^^ ఈ మాట అన్నది ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు .ఆంధ్ర లో జరిగిన ఓ మీటింగ్ లో ఈ మాట చెప్పారు . బాబు ఉద్దేశ పూర్వకంగా చెబుతారో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ చాలా సార్లు ఆయన మాటల్లో కర్త , కర్మ , క్రియ ఉండదు . గ్యాస్ సిలిండర్ తో వంట చేయవచ్చు అని మొదట చెప్పింది నేనే అని చెప్పవచ్చు . లేదా గ్యాస్ సిలిండర్ తో మొదటి సారి వంట చేసింది నేనే అని చెప్పినా వ్యాఖ్యలో సంపూర్ణత ఉండేది . వంటి చేయ వచ్చని చేసింది నేనే అనడంలో వాఖ్య అర్ధవంతంగా లేదు . విషయం ఎలాగూ అర్ధవంతంగా లేదు కనీసం వాఖ్య అయినా అర్ధవంతంగా ఉండాలి కదా ? వాఖ్య ఎలా ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పదవిని నిలబెట్టింది ఈ గ్యాస్ సిలిండర్ నే . అదో పెద్ద కథ . గ్యాస్ సిలిండర్ అంత పెద్ద కథ . *** ఎన్టీఆర్ ను వెన్నుపోటుతో దించేశారు అనే బలమైన ముద్ర . లక్ష్మీపార్వతి ప్రచారం . దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో సహా ఎన్టీఆర్ కుటుంబం దూరం కావడం , నందమూరి హరికృష్ణ సొంత పార్టీ పెట్టి బాబు వెన్నుపోటు పై జనం లోకి వెళ్లడం వంటి వాటితో చంద్రబాబు బాబు బాగానే ఇబ్బంది పడుతున్నారు . 1999 ఎన్నికల్లో ఓటమి ఖాయం అనిపించింది . న్యూస్ టైం లో పని చేసే జర్నలిస్ట్ మిత్రుడు పవన్ నేనూ కలిసి అలా గ్రామాల్లోకి వెళదాం ఏమనుకుంటున్నారో తెలుస్తుంది అని బయలు దేరాం . నర్సాపూర్ , గజ్వేల్ ప్రాంతాల్లో తిరిగి మాట్లాడుతుంటే రోడ్డు పై బండి మీద మక్కజొన్న కంకులు కాల్చి అమ్ముతున్న అమ్మాయితో కాసేపు మాట్లాడాం . ఆమె చెప్పిన ఒక్క మాటతో టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది అని అర్థమైంది . ఆ అమ్మాయి ఏం చెప్పింది అంటే ... ? **** ఇప్పుడంటే గ్యాస్ కనెక్షన్ ఏజెన్సీ వాళ్ళు బతిమిలాడి మరి ఇస్తారు . ఆర్థిక సంస్కరణలకు ముందు అలా ఉండేది కాదు . పార్లమెంట్ సభ్యులకు కోటా ఉండేది . ఈ కూపన్ లను కూడా కొందరు అమ్ముకొనేవారు . 96 లో హిమాయత్ నగర్ లో టీడీపీ కార్యాలయం ఉన్నపుడు రాజ్యసభ సభ్యలు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కూపన్లను రిపోర్టర్ లకు ఇవ్వమని కార్యాలయ కార్యదర్శికిఇచ్చారు . మహా ప్రసాదం అని తీసుకున్నాం . ఆ రోజుల్లో గ్యాస్ కనెక్షన్ కు అంత డిమాండ్ ఉండేది . 99 ఎన్నికలు సమీపిస్తుండడం ఎలాగైనా గెలవాలి అని ప్రయత్నాలు . ఒక్క ఓటుతో వాజపేయి ప్రభుత్వం పడిపోయింది . బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తో విజయావకాశాలు మెరుగుపడ్డట్టు నమ్మకం కలిగింది . అదొక్కటే సరిపోదు ఇంకేం చేద్దాం అని ఆలోచిస్తుంటే అప్పుడు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా రాజ్య సభ సభ్యునిగా ఉన్న లాల్ జాన్ బాషా మదిలో మెదిలిన ఆలోచన గ్యాస్ సిలిండర్ పథకం . అప్పుడు బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ చేరలేదు . స్పీకర్ పదవి మాత్రమే తీసుకోని బయటి నుంచి మద్దతు అని ప్రకటించింది . మహిళకు గ్యాస్ సిలిండర్ పథకం ప్రకటిద్దామని బాషా చెబితే అది ఎలా సాధ్యం . ఎంపీలు కూపన్ ల కోసమే పైరవీలు చేస్తున్నారు . లక్షల మందికి ఎలా సాధ్యం అంటే బాషా సాధ్యమే అని చెప్పారు . మనం మంత్రి పదవులు తీసుకోవడం లేదు . ఢిల్లీలో వ్యవహారాలు నేను దగ్గరి నుంచి చూశాను మీ పలుకుబడి ఉపయోగిస్తే మన రాష్ట్రానికి భారీ కోటా వస్తుంది . వాటిని ప్రతి గ్రామంలో కొందరికి పంపిణీ చేస్తే ఎన్నికల తరువాత అందరికీ వస్తుందనే నమ్మకం ఏర్పడుతుంది అని చెప్పారు . బాబు రంగంలోకి దిగి విజయం సాధించారు . ఆ రోజుల్లో ఎన్టీఆర్ భవన్ లో ఆ బీట్ రిపోర్టర్ గా బాషా తో గంటల తరబడి ముచ్చట్లు సాగేవి ఈ విషయాలు అన్నీ ఆ రోజే బాషా చెప్పారు . ఐటీ నేనే అన్నీ నేనే అని బాబు చెప్పుకుంటారు . కుమారుడిని రాజకీయాల్లో నిలబెట్టాలి ఇమేజ్ పెంచాలి అనుకున్నపుడు నగదు బదిలీ పథకం కనిపెట్టింది లోకేష్ అని చెప్పారు . మిగతా అన్నీ తానే అంటారు . సాధారణంగా క్రెడిట్ ఎవ్వరికీ ఇవ్వరు . కానీ లాల్ జాన్ బాషా చనిపోయినపుడు టీడీపీ విడుదల చేసిన సంతాప ప్రకటనలో గ్యాస్ సిలిండర్ పథకం రూపకల్పనలో లాల్ జాన్ బాషా కృషిని ప్రస్తావించారు . బహుశా అప్పుడు బిపి ఆచార్య సమాచార శాఖ కమిషనర్ .. అప్పటికప్పుడు ఫుల్ పేజీ ప్రకటన విడుదల చేస్తూ ఈ పథకానికి దీపం పథకం అని పేరు పెట్టారు . ఇది తాత్కాలికం అని తరువాత పేరు మారుస్తాం అన్నారు కానీ అదే పేరు కొనసాగించారు . ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కు ముందే దీపం పథకం కింద కొందరికి గ్యాస్ సిలిండర్ లు పంపిణీ చేశారు . గ్రామంలో ఒక కుటుంబానికి గ్యాస్ సిలిండర్ వస్తే ఆ వీధిలో పండుగ అన్నట్టు ఉండేది . ఎన్నికల నోటికికేషన్ వచ్చాక దీనిపై వి . హనుమంతరావు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో కమిషన్ నిర్ణయం మేరకు పంపిణీ నిలిపి వేశారు . నిజానికి హనుమంతరావు ఫిర్యాదు టీడీపీ నెత్తిన పాలు పోసినట్టు అయింది . రాష్ట్రంలో అందరికీ ఇచ్చే అన్ని సిలిండర్ లు లేవు . కాంగ్రెస్ ఫిర్యాదు వల్ల ఆపేశాం , ఎన్నికలు కాగానే ఇస్తాం అని బాబు ప్రకటించడం తో అప్పటికే కొందరికి ఇవ్వడం వల్ల జనంలో నమ్మకం ఏర్పడింది . వాజపేయి ఒక్క ఓటు సానుభూతి , దీపం ఈ రెండూ టీడీపీకి కొండంత అండగా నిలిచాయి **** నర్సాపూర్ , గజ్వేల్ ప్రాంతంలో మిత్రుడితో కలిసినప్పుడు మక్కా జొన్న కంకులు కాల్చి అమ్ముతున్న అమ్మాయి ఇదే మాట చెప్పింది . వాళ్ళ ఊరిలో ఎవరికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చారో వారి పేర్లు చెప్పి , ఎన్నికల తరువాత మాక్కూడా వస్తుంది అందుకే ఈ సారి టీడీపీకే ఓటు వేస్తాం అని ఆ అమ్మాయి చెప్పింది . మిత్రుడు పవన్ , నేనూ అప్పుడే అనుకున్నాం దీపం పథకం టీడీపీకి వెలుగు నింపుతుంది అని . 99 ఎన్నికలే బాబు తెలంగాణలో విజయం సాధించిన చివరి ఎన్నికలు . ఆ తరువాత తెలంగాణలో రోజు రోజుకు చిక్కి శల్యం అయ్యారు . రాష్ట్ర విభజన తో పొరుగు రాష్ట్రం పార్టీ అయిపొయింది . లాల్ జాన్ బాషా మదిలో మెదిలిన ఈ దీపం పథకం పై బాబు ఇప్పుడే కాదు అప్పుడు కూడా బోలెడు కథలు చెప్పారు . చంద్రబాబు తల్లి పేరు అమ్మణ్ణమ్మ . 95 నుంచి రాష్ట్ర విభజన జరిగే వరకు ప్రతి రోజు టీడీపీ బీట్ రిపోర్టర్ లు బాబు ఇంటికి వెళ్లేవారు . ఒక్క రోజు కూడా వారి తల్లి ఇంటికి రాలేదు . సొంత గ్రామం లోనే ఉండేవారు . బాబు ఎన్నికల ప్రచారంలో దీపం పథకం పై బోలెడు ఆశలు పెట్టుకొని సెంటి మెంట్ తో అమ్మ కథ చేర్చారు . మా అమ్మ చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద వంట వండేది . పొగ వల్ల కంటి నుంచి నీళ్లు వచ్చేవి . ఏనాటికైనా మహిళకు ఇలాంటి కష్టాలు లేకుండా గ్యాస్ పథకం తేవాలి అని ఆ రోజే అనుకున్నాను అని ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చేవారు . తల్లి కట్టెల పొయ్యితో కష్టపడుతుంటే ఏ పిల్లాడు అయినా సంపాదించి గ్యాస్ పొయ్యి తేవాలి అనుకుంటాడేమో కానీ రాజకీయాల్లోకి వస్తాను , సీఎం అవుతాను , దీపం పథకం తెస్తాను అని ఎవరైనా అనుకుంటారా ? - బుద్దా మురళి

3, మార్చి 2026, మంగళవారం

బాబు ను  భయపెట్టిన  ఇజ్రాయిల్: జర్నలిస్ట్ జ్ఞాపకాలు- 125

 ఉమ్మడి రాష్ట్రం లో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరుల సమావేశం . అయన ఉపన్యాసం రొటీన్ గా సాగుతోంది . ఎన్నోసార్లు చెప్పిన విషయాలే చెబుతుండడం వల్ల పెద్దగా ఆసక్తి  కనిపించడం లేదు . కొత్త  విషయాలు లేవు .   చంద్రబాబు తన సొంత నియోజక వర్గంలో ఇజ్రాయిల్ టెక్నాలెజీ తో  వ్యవసాయం చేయడాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన రోజులు అవి . బాబు రొటీన్ ఉపన్యాసంలో తాను ఇజ్రాయిల్ పర్యటించనున్నట్టు చెప్పారు . అప్పటికే ఇజ్రాయిల్ టెక్నాలెజీ తో వ్యవసాయం సాగుతున్నందును అందరూ మామూలుగానే విన్నారు . అప్పుడు బీబీసీ  రేడియోకు ఉర్దూ రిపోర్టర్ గా ఉన్న ఉమర్ ఫరూఖ్ మీరు ఇజ్రాయిల్ ఎలా వెళతారు ? మన దేశం పాలస్తీనా కు అనుకూలంగా ఉంది . ఇజ్రాయిల్ ఎలా వెళతారు అని  ప్రశ్నించేసరికి బాబు ఖంగుతిన్నారు . పక్కనున్న అధికారులతో మెల్లగా మాట్లాడారు . వాళ్ళు ఏం చెప్పారో వినబడలేదు కానీ ఇజ్రాయిల్ వెళితే మైనారిటీ  ఓటర్లకు దూరం అవుతారు అనే భయం పట్టుకుంది . అధికారులతో కొద్ది సేపు మెల్లగా మాట్లాడిన తరువాత అటూ ఇటూ కాకుండా తన ఇజ్రాయిల్ పర్యటన లేదు అన్నట్టు సూచన ప్రాయంగా చెప్పారు .  **** అంతమంది ఉన్నప్పుడు ఇతరులకు వినపడకుండా బాబు ఎలా మాట్లాడారు అని సందేహం రావచ్చు . 95 ప్రాంతంలో టీడీపీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా మాణిక్ రెడ్డి ఉండేవారు . మెదక్ జిల్లాకు చెందిన నాయకుడు .  జిల్లాలో పరిచయం కావడం వల్ల బాగా పరిచయం . బాబు ముఖ్యమంత్రి అయ్యాక రోజూ బాబు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యేవారు . ఆ సమయంలో బాబుకు ఫోన్ వస్తే మాట్లాడేవారు కానీ ఎదురుగా కూర్చున్న మాకు ఎవరితో మాట్లాడారు , ఏం మాట్లాడారు తెలిసేది కాదు .  కావాలి అంటే మీరు ఓసారి గమనించి చూడండి మీరు ఎదురుగా ఉన్నప్పడు ఎవరికైన ఫోన్ వస్తే ఎవరి నుంచి వచ్చింది , విషయం ఏమిటీ అనేది ఎంతో కొంత అర్థం అవుతుంది . కానీ బాబుకు కాల్ వస్తే కొన్ని వందల సార్లు అక్కడే ఉన్నాను ఎవరి నుంచి కాల్ వచ్చిందో , విషయం ఏమిటో అస్సలు అర్థం కాదు అని మాణిక్ రెడ్డి చెప్పుకొచ్చారు . అనుమానం ఉంటే ఓటుకు నోటు వీడియో చూడండి . కట్టేకొట్టే తెచ్చే అన్నట్టు ఉంటుంది . ఎవరితో మాట్లాడాడు , ఏం మాట్లాడాడు అనేది అర్థం కాదు . మైకు ముందు గంటలతరబడి మాట్లాడే బాబు ఫోన్ లో మాత్రం చిక్కడు దొరకడు అన్నట్టు మాట్లాడుతారు . రాజకీయాల్లో ఉన్నప్పుడు అందులోనూ అధికారంలో ఉన్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్త అవసరం .. ఈ రోజుల్లో   టెక్నాలెజీ మరీ పెరిగిపోయింది . అందరి బండారాలు బయటపెట్టే న్యూస్ ఛానల్స్ ఓనర్ల  గూడుపుఠాణి లే బయటపడుతున్న రోజులివి .  *** ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న కాలం లో రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేదు కానీ పత్రికల్లో ఇందిరాగాంధీ - పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఛైర్మెన్   యాసర్ అరాఫత్ ఫోటోలు , వారి వార్తలు ప్రముఖంగా వచ్చేవి . అరాఫత్  ఆజానుబావుడు అన్నట్టుగా ఉండేవారు . ప్రత్యేకమైన దుస్తులతో మీడియా ఫోటోలకు ప్రత్యేకంగా ఉండేవారు .  ఇజ్రాయిల్ , పాలస్తీనా వివాదం గురించి అప్పుడు తెలియదు కానీ ఇందిరాగాంధీ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దేశ మీడియా అరాఫత్ కు ఎక్కువ  ప్రాధాన్యత ఇచ్చేది .   బాబు  హయాంలో అమెరికా అధ్యక్షుడు వస్తే మీడియాలో ఎంత ప్రాముఖ్యత లభించేదో అరాఫత్ కు అంత ప్రాముఖ్యత లభించేది . 1948లో ఇజ్రాయిల్ స్థాపనకు వ్యతిరేకంగా ఇండియా ఓటు వేసింది . 1992 వరకు ఇజ్రాయిల్ తో మనదేశం కనీసం పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు కూడా ఏర్పాటు చేసుకోలేదు . 92లో పివి నరసింహారావు హయాంలో  సంబంధాలు ఏర్పాటు చేసుకుంది . అప్పటివరకు ఇండియా పాలస్తీనాకు పూర్తి మద్దతుగా నిలిచింది . 1999లో  వాజపేయి హయాంలో సమావేశాలు జరిగాయి . నరేంద్ర మోడీ హయాంలో  ఇజ్రాయిల్ , ఇండియా మధ్య సంబంధాలు బాగా  బలపడ్డాయి . ఇజ్రాయిల్ లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీ . ఇటీవల ఇజ్రాయిల్ పర్యటించి అక్కడి పార్లమెంట్ లో ప్రసంగించారు . ***ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం గురించి , మైనారిటీ ఓట్లపై పడే ప్రభావం వంటి అంశాలను ఏ మాత్రం తెలియక కేవలం ఆధునిక వ్యవసాయ పద్దతులను తెలుసుకోవడం కోసమే బాబు ఇజ్రాయిల్ వెళ్ళాలి అనుకున్నారు . అదే విషయం మీడియా సమావేశంలో చెప్పగానే ఉర్దూ బిబిసి విలేకరి ప్రశ్నతో ఆమ్మో ఇదేదో మెడకు చుట్టుకునేట్టుగా ఉందని ఇజ్రాయిల్ పర్యటన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు . ఇప్పుడు బాబు ఎన్ డి ఏ కూటమిలో ఉన్నారు . బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు . ఇజ్రాయిల్ వెళ్ళాలి అనే కోరికను మూడు దశాబ్దాల తరువాత తీర్చుకొనే అవకాశం లభించింది . యుద్ధం ముగిసిన  తరువాత భారత బృందం  ఇజ్రాయిల్ పర్యటించే అవకాశం లేకపోలేదు .  ఇండియా -  పాక్ ల మధ్య జరిగిన రెండు యుద్ధాల్లో ఇరాన్ పాక్ కు అండగా నిలించింది .  ఇండియా పాలస్తీనాకు అండగా నిలిచినా , ఇజ్రాయిల్ ఏర్పాటుకు వ్యతిరేకంగా 1948 లో ఇండియా ఓటు వేసినా పాక్ తో జరిగిన యుద్ధాల్లో ఇజ్రాయిల్ ఇండియాకు సహకరించింది .   ప్రపంచం లో ఎక్కడా ఆశ్రయం దొరకనప్పుడు శరణార్థులుగా వచ్చిన యూదులకు వందేళ్ల క్రితం ఇండియా ఆశ్రయం ఇవ్వడంతో వాళ్ళు ఇప్పటికీ ఇండియాను అభిమానిస్తారు .కాలం మారింది ఇప్పుడు ఎవరికైనా తమ దేశ ప్రయోజనాలు ముఖ్యం కావాలి . బుద్దా మురళి  

మబ్బులు చూసి కుండలో నీళ్లు పారబోసిన జర్నలిస్ట్ ల కథ

మబ్బులను చూసి కుండలో నీళ్లు పారబోయవద్దు అని మనకో జాతీయం ఉంది . అలా పారబోస్తే ఏమవుతుంది అంటే .. జర్నలిస్ట్ ల్లా అవుతుంది . జాతీయాలు జీవిత పాఠాల ఉంచి పుట్టాయి . మన బాధ భవిష్యత్తు తరానికి ఓ పాఠం కావచ్చు . *** ఎకరం 50 వేల రూపాయలు.. నువ్వు రెండు లక్షలు చెల్లిస్తే ఇప్పుడే నీకు నాలుగు ఎకరాల భూమి వస్తుంది . ఇప్పుడు రెండు లక్షలు చెల్లించి 20 ఏళ్ళ తరువాత తీసుకుంటే నీకో 200 గజాల స్థలం ఇస్తాను .. ఐతే ఇదిగో రెండు లక్షలు .. 20 ఏళ్ళు గడిచాయి . బాబూ ఇబ్బంయూదుల్లో ఉన్నాను .. అప్పు చేసి నీకు రెండు లక్షలు చెల్లించాను . నామీద దయ చూపించి 200 గజాల స్థలం ఇవ్వు ప్లీజ్ ... *** ఇలాంటి బేరం గురించి ఎప్పుడైనా విన్నారా ? అప్పటికప్పుడు నాలుగు ఎకరాల డబ్బు ఇచ్చి 20 ఏళ్ళ తరువాత 200 గజాల కోసం బతిమిలాడుకోవడం ఇదేం బేరం .. ఇది బేరం కాదు పిచ్చి అనుకుంటున్నారా ? అత్యంత దురదృష్టకరమైన బ్యాచ్ జర్నలిస్ట్ ల వాస్తవ వ్యధ ఇది . ఏ ఐ పుణ్యమా అని ఎలాంటి సమాచారం అయినా దొరుకుతుండడంతో ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ అని ప్రభుత్వం చెబుతున్న ప్రాంతాల్లో 2006 లో వ్యవసాయ భూముల ధరలు ఎలా ఉన్నాయి అని గ్రోక్ ను అడిగితే 50 వేలకు ఎకరం నుంచి రెండు లక్షలకు ఎకరంగా ఉండేవని చెప్పింది . వై ఎస్ ఆర్ హయాంలో జర్నలిస్ట్ ల హౌసింగ్ సొసైటీ ఏర్పడ్డాక ల్యాండ్ కోసం ఒక్కో జర్నలిస్ట్ రెండు లక్షలు చెల్లించారు . వైఎస్ మరణం , రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి లు సీఎంలు అయ్యారు . తెలంగాణ ఏర్పాటు కెసిఆర్ , రేవంత్ రెడ్డిలు సీఎంలు అయ్యారు . అనేక మలుపులు తిరిగి సుప్రీం కోర్ట్ జర్నలిస్ట్ లకు కేటాయించిన స్థలాల జీవోను కొట్టేసి డబ్బు తిరిగి చెల్లించమంది . గోడకు కొట్టిన సున్నం , ప్రభుత్వానికి చెల్లించిన డబ్బు తిరిగి రావడం అంత ఈజీ కాదు . ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ ఉద్యోగులకు వణికి పోతుంది . వారం రోజుల జీతం ఆలస్యానికి ప్రభుత్వం మీద కక్ష కట్టి ఓడించిన చరిత్ర వారిది . అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయి రెండేళ్లు అవుతున్నా రిటైర్ మెంట్ బెనిఫిట్స్ చెల్లించే స్థితిలో ప్రభుత్వం లేదు . కోర్ట్ కు వెళ్లిన వారికి చెల్లించామని తీర్పులు వచ్చినా అమలు చేసే స్థితి లేదు . అలాంటిది అడిగేవాడు దిక్కులేని జర్నలిస్ట్ ల డబ్బులు తిరిగి రావు . ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ ఫ్యూచర్ సిటీలో జర్నలిస్ట్ లకు ల్యాండ్ ఇస్తారు అని ఓ ప్రచారం . అంటే జర్నలిస్ట్ లు చెల్లించిన డబ్బుకు ఆ రోజుల్లో నాలుగు ఎకరాలు వస్తే , ఇప్పుడు అదే చోట రెండు వందల గజాల కోసం చకోర పక్షిలా ఎదురు చూడాలి . సుప్రీం తీర్పు తరువాత కూడా కొందరు ఇంకా పాత స్థలాల మీద ఆశ వదులుకోలేక పోతున్నారు . అలా అని వీరిని తప్పు పట్టలేం . అప్పడు తెచ్చి డబ్బు కట్టి 20 ఏళ్లపాటు ఆశగా ఎదురు చూసి రోజూ వాటి గురించే కలలు , కంటూ స్థలం వచ్చాక కట్టే ఇంటిని ముందు కలల్లోనే కట్టుకోవడం వల్ల స్థలాలు రావు అనేదానిని జీర్ణం చేసుకోవడం అంత ఈజీ కాదు . రెండు దశాబ్దాల క్రితమే పరిస్థితి ఉహించి ఆంధ్ర మిత్రులు కొందరు తాము కట్టిన రెండు లక్షలు వెనక్కి తీసుకొని ఆంధ్రలో ప్లాట్స్ కొన్నారు . 2006లో భువనగిరి లో రెండు లక్షలకు రెండు ఎకరాలు వచ్చేవి . మిత్రుడు అయోధ్యరెడ్డి అదే సమయంలో తుర్కపల్లిలో జర్నలిస్ట్ మిత్రులకు తుర్కపల్లిలో మెయిన్ రోడ్ లో 80 వేలకు ఎకరం భూములు చూపించాడు . వాటి ధర ఇప్పుడు రెండు కోట్ల వరకు పలుకుతుంది . జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఆశల్లో మునిగిపోయి అటు వైపు ఎవరూ ఆసక్తి చూపలేదు . నాలుగు ఎకరాలు అమ్మి సొసైటీకి రెండు లక్షలు కట్టాను , ఇప్పుడు నేను అమ్మిన భూమి 60 లక్షలకు ఎకరం అయింది . ఊర్లో , అన్నదమ్ముల ముందు నా పరువు పోయింది అని ఓ జర్నలిస్ట్ మంత్రి పొంగులేటి ముందు తన పరిస్థితి చెప్పుకున్నారు . తప్పు మీదంటే మీది అని ఒక్కరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు . తప్పు పరిస్థితులదే తప్ప వ్యక్తులది కాదు . జాతిరత్నాలు సినిమాలో సెంట్రల్ జైలులో వెన్నెల కిషోర్ బెస్ట్ బ్యాచ్ అంటే మనదే అని పొంగిపోతాడు . తెలుగునాట జర్నలిజం చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన బ్యాచ్ అంటే ఇదే . 20 ఏళ్ళ క్రితం నాలుగు ఎకరాల విలువైన డబ్బు చెల్లించి 20 ఏళ్ళ తరువాత కూడా 200 గజాల కోసం ఆశగా ఎదురు చూడడానికి మించిన దురదృష్టకరమైన బ్యాచ్ ఉంటుందా ? మంచి జీతాలు చెల్లించే మీడియా సంస్థల వారి పరిస్థితి వేరు జీతాలు కూడా సరిగా ఇవ్వని సంస్థల జర్నలిస్ట్ లు అప్పు తెచ్చి రోడ్డున పడ్డారు . - బుద్దా మురళి

22, ఫిబ్రవరి 2026, ఆదివారం

ఖరీదైన గాంధీ విగ్రహాల జ్ఞాపకాలు ...

జర్నలిస్ట్ జ్ఞాపకాలు -124 దాదాపు పాతికేళ్ల క్రితం ... అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి .. లాబీ లో కనిపించిన వారందరితో మాట్లాడుతూ ముందుకు వెళుతుంటే గోడ మీద కొత్తగా తగిలించిన మహాత్మ్యా గాంధీ నెహ్రూ ల ఫోటో ఫ్రెమ్ వేలాడుతుండడం కనిపించింది ... అంతకు ముందు లేదు ... కొత్తగా పెట్టారు . అప్పుడు ఏదో ఛానల్ ( జెమినీ లేదా సిటీ కేబుల్ ) రిపోర్టర్ భూమేష్ గాంధీజీ నెహ్రూల ఫోటో ఫ్రెమ్ చూస్తూ బాగుంది కాదన్న .. ఎన్ని వేల బిల్ వేశారో అనగానే నవ్వు ఆగలేదు ... అలాంటి ఫ్రెమ్ సాధారణంగా ఓ రెండు వందలకు అమ్ముతారు ... ప్రభుత్వ వ్యవహారం కాబట్టి ఓ వెయ్యి వరకు పరవాలేదు ... ఎన్ని వేల బిల్ వేశారో అనడానికి వెనుక ఓ విగ్రహ వ్యవహారం ఉంది . అప్పుడు యనమల రామకృష్ణుడు స్పీకర్ అసెంబ్లీ ఆవరణలో మహాత్మగాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలి అని ప్రయత్నం ... దీనికి 65 లక్షల వ్యయం . పాతికేళ్ల క్రితం 65 లక్షలు అంటే పెద్ద మొత్తమే . విగ్రహం ఏర్పాటును ఎవరూ వ్యతిరేకించ లేదు కానీ ఖర్చు విషయం పై విమర్శలు వచ్చాయి . సగం దుస్తులు ధరించిన మహాత్ముని విగ్రహానికే 65 లక్షల ఖర్చు అంటే పూర్తి దుస్తులు ధరించి ఉంటే ఎంత ఖర్చు చేసేవారో అని జోకులు వేసుకోవడం తప్ప ఖర్చుపై నిలదీయలేని పరిస్థితి ... ప్రతిభా భారతి స్పీకర్ గా ఉన్న సమయంలో అసెంబ్లీ లో టెలిఫోన్ వైరింగ్ కాంట్రాక్ట్ పై ఆరోపణలు మీడియాలో బాగా హైలెట్ అయ్యాయి ... సాధారణంగా అసెంబ్లీ వ్యయం పై ఎవరూ నోరు మెదపరు .... తెలిసినా మౌనంగా ఉండాల్సిందే ... రామోజీ రావు లాంటి వారు అసెంబ్లీ ని కూడా ఎదిరించి అరెస్ట్ ను తప్పించుకుంటారు కానీ సాధారణ జర్నలిస్ట్ కు సాధ్యం కాదు ... యాజమాన్యాలు సహకరించవు ... రామోజీనే యజమాని కాబట్టి తన అరెస్ట్ కు అసెంబ్లీ ఆదేశించినా అరెస్ట్ కాలేదు ... సాధారణ జర్నలిస్ట్ అయితే ఉద్యోగం ఊడబెరుకుతారు .. అందుకే అక్కడి వ్యవహారాలు ఆ భవనం లోనే భూస్థాపితం అవుతాయి ... చివరకు 65 లక్షల వ్యయంతో అసెంబ్లీ ఆవరణలో మహాత్ముని విగ్రహాన్ని ప్రతిష్టించారు .. 65 లక్షల్లో శిల్పికి ఎంత ఇచ్చారో ? శిల్పానికి ఎంతో , ఎవరికి ఎంతో తెలియదు ... ప్రజాస్వామ్యానికి , స్వేచ్ఛకు ప్రతీక అంటూ ఆవిష్కరించిన మహాత్ముని విగ్రహం వద్దకు వెళ్లకుండా గొలుసులతో బంధించిన రోజులు చాలానే ఉన్నాయి ... టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ , కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం వల్ల అసెంబ్లీ ఆవరణ లోని ఈ విగ్రహం వద్ద శాసన సభ్యులు ధర్నాకు కూర్చుంటున్నారని అటు వెళ్లకుండా గొలుసులతో అడ్డుకట్ట వేశారు ... పాతికేళ్ల తరువాత హైదరాబాద్ లో మరో భారీ గాంధీజీ విగ్రహానికి శ్రీకారం చుట్టారు ... బాపూఘాట్ వద్ద ఐదు వేల కోట్ల ఖర్చుతో గాంధీజీ విగ్రహం నిర్మిస్తారట .. పాతికేళ్ల క్రితం 65 లక్షలు అన్నప్పుడు ఇప్పుడు విగ్రహానికి ఐదు వేల కోట్లు సముచితమే ... తెలంగాణ ఆదాయం పెరిగింది . ధరలూ పెరిగాయి ... మున్సిపల్ వార్డు మెంబర్ కే కోటి రూపాయల ధర పలుకుతున్న రోజులు ఇవి . రాజకీయాలు చాలా ఖరీదైన భారీ పెట్టుబడితో కూడిన వ్యాపారం . ఐదు వేల కోట్ల విగ్రహం సరైన ధరనే ... పలానా నాయకుడు రాజకీయాల్లో విచ్చల విడిగా ఖర్చు చేశాడు అని మీడియా విమర్శించేది . మా అభిమాన నాయకుడు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధికారం లోకి వచ్చాడు ... హై కమాండ్ ఇంచార్జ్ ల పెత్తనం ఏమిటీ ? పూర్తి అధికారం ఇవ్వండి అని నిస్సిగ్గుగా రాస్తున్న దమ్మున్న మీడియా ఉన్న కాలం ఇది . విగ్రహానికి ఐదు వేల కోట్ల ఖర్చు సముచితమే ... ధర విషయంలో అభ్యన్తరం లేదు కానీ అపార్ట్ మెంట్ లను కూల్చేసి 450 మంది కుటుంబాలను రోడ్డు పాలు చేయడమే నచ్చడం లేదు . వెయ్యి కోట్ల పెట్టుబడి తిరిగి లాభంతో రాబట్టుకోవలసిందే కానీ సామాన్య కుటుంబాలను రోడ్డు పాలు చేయడమే నచ్చలేదు ... బాపు ఘాట్ ఐదు వేల కోట్ల విగ్రహం తో అసెంబ్లీ విగ్రహం వ్యవహారం గుర్తుకు వచ్చింది .. ఇదిగో బాధితులు మీ సంగతి మీరు చూసుకోండి ..వెయ్యి కోట్ల పెట్టుబడికి తగిన గిట్టుబాటు రాలేదు అని బాధపడుతున్న మీడియాకు మీ గోడు పట్టదు ... విగ్రహ నిర్మాణాన్ని ఆపుతారా ఉద్యమాలకు భయపడే రకం కాదు .. ఎన్టీఆర్ భారీ విగ్రహం పెడతాం ఎవడు అడ్డు వస్తాడో చూస్తాం అని సవాల్ విసిరారు కూడా .... గాంధీజీ విగ్రహానికి బలవుతున్న అపార్ట్ మెంట్ లు యేవో తెలిసిందే ... ఎన్టీఆర్ విగ్రహానికి ఏ కాలనీ బలి కానుందో ... - బుద్దా మురళి

28, మే 2025, బుధవారం

చిన్నప్పటి జ్ఞాపకం హైదరాబాద్ లో భారత్ -పాక్ యుద్ధ జ్ఞాపకం

ఇటీవల భారత్ - పాక్ యుద్ధ సమయంలో ట్యాంక్ బండ్ ను ఏ మీడియా అయినా గుర్తు చేస్తుందేమో అని చూశా . 1971లో జరిగిన ఇండియా పాక్ వార్ లో పాకిస్థాన్ ను జయించి మన సైన్యం స్వాధీనం చేసుకున్న యుద్ధ ట్యాంక్ ఒకటి హుసేన్ సాగర్ కట్ట మీద పాక్ మీద మన సైన్యం సాధించిన విజయానికి చిహ్నం గా నిలిచి ఉంది . ట్యాంక్ బండ్ , వినాయక్ సాగర్ , హుసేన్ సాగర్ పేర్లు ఎన్నయినా అదో అద్భుత మైన ప్రాంతం . వందల ఏళ్ళు అయినా చెక్కుచెదరని నిర్మాణం అని కాదు . ట్యాంక్ బండ్ ఎప్పుడు చూసినా కొత్తగానే కనిపిస్తుంది . అద్భుతం అనిపిస్తుంది . దాదాపు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు చాలా మంది హుసేన్ సాగర్ కట్ట మీదికి వెళుతుంటే నేనూ వెళ్ళాను . హుసేన్ సాగర్ కట్ట మీద ట్యాంక్ ఏర్పాటు చేశారు ,. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని ట్యాంక్ బండ్ గా పాపులర్ అయింది . ట్యాంక్ అంటే యుద్ధ రంగంలో ఉపయోగించే వాహనం . ఇక్కడ నిజంగానే యుద్ధంలో ఉపయోగించే ట్యాంక్ ను ఏర్పాటు చేశారు . దాని పేరు మీదనే ట్యాంక్ బండ్ గా
పాపులర్ . 1971లో ఇండియా పాకిస్థాన్ ల మధ్య జరిగిన యుద్ధంలో ఇండియా పాక్ ను చిత్తుగా ఓడించి బంగ్లా దేశ్ అనే కొత్త దేశాన్ని ఏర్పాటు చేయగలిగింది . ఆ యుద్ధంలో భారత సైన్యం పాకిస్థాన్ లోకి చొచ్చుకు వెళ్లి 66 యుద్ధ ట్యాంక్ లను స్వాధీనం చేసుకుంది . అందులో ఒక ట్యాంక్ ను హుసేన్ సాగర్ కట్ట మీద 1973లో ఏర్పాటు చేశారు . సికింద్రాబాద్ వైపు నుంచి హుసేన్ సాగర్ కు వస్తుంటే కట్ట మొదట్లోనే కుడి వైపు ఈ యుద్ధ ట్యాంక్ ఉంటుంది . ఆ ట్యాంక్ ఏర్పాటు సమయం లో అక్కడికి సమీపంలోనే ఉన్న కవాడిగూడలో ఉండేవాళ్ళం . ట్యాంక్ ఎదురుగా వైస్ రాయ్ హోటల్ . దానికి వెనుక వైపు చిన్న దారి గుండా వెళితే కవాడిగూడ . మహా అయితే వెయ్యి అడుగుల దూరం కావడం వల్ల ఆ ట్యాంక్ ఏర్పాటు చేసిన మొదటి రోజు నుంచి చూశాను . చుట్టు పక్కల ప్రాంతాల నుంచి జనం పెద్ద సంఖ్యలో వచ్చి ట్యాంక్ ను చూసేవాళ్ళు . పిల్లలకు అదో జాతరలా ఉండేది . ఇప్పటిలా సెల్ ఫోన్ కెమెరాలు లేవు కానీ కొద్ది మంది ట్యాంక్ లోపల కూర్చొని కెమెరాలతో ఫోటోలు దిగేవారు . హుసేన్ సాగర్ పై మొత్తం సందడి ఇక్కడే ఉండేది . కొద్ది కాలం తరువాత రోటరీ క్లబ్ వాళ్ళు అక్కడ ఒక పార్క్ నిర్మించారు . ఆ పార్క్ లో ఒక పెద్ద అక్వేరియం భవనం కూడా నిర్మించారు . కాలం గడిచిన టి అంజయ్య బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ చేపట్టారు . ముందు నెక్లెస్ రోడ్ , ఎన్టీఆర్ మరణం తరువాత ఎన్టీఆర్ ఘాట్ నిర్మాణంతో ట్యాంక్ ఉన్న ఇటు వైపు ఎవరూ పట్టించుకోలేదు . పార్క్ పాడుపడింది . చెబితే తప్ప ఇది అక్వేరియం అంటే నమ్మని విధంగా మారింది . 2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత మరోసారి పార్క్ కళకళ లాడింది . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ట్యాంక్ బండ్ పై ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు . ఆ సందర్భంలో ఈ పార్క్ ను కూడా పట్టించుకున్నారు . వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారని బీజేపీ అనుకూల వర్గాలు హుసేన్ సాగర్ పేరును వినాయక సాగర్ అని పెట్టినా జనం లో మాత్రం ట్యాంక్ బండ్ అనే పాపులర్ . దాదాపు 1980 వరకు కూడా హుసేన్ సాగర్ నీళ్లు ఇప్పటి అంత ప్రమాదకరమైనవి , విషపూరితమైనవి కావు . స్థానికులు ఈత కొట్టేవాళ్ళు . నాకు ఈత రాదు కానీ బాల్యంలో పెద్ద వాళ్ళతో కలిసి వెళ్లిన జ్ఞాపకాలు ఉన్నాయి . హోలీ రోజు రంగుల్లో మునిగిన వారు ఇక్కడ స్నానం చేసేవారు . బతుకమ్మ పండుగకు చుట్టుపక్కల ప్రాంతాల వారు బతుకమ్మ ఆడి ఇక్కడే బతుకమ్మ ను నీళ్లలో వదిలి ప్రసాదం పంచేవాళ్ళు . దాదాపు 1980 తరువాత పరిస్థితి తెలియకుండానే మారిపోయింది . బతుకమ్మ పండుగ కనిపించకుండా పోయింది . తరువాత క్రమంగా పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం కలిసి పోయి హుసేన్ సాగర్ నీళ్లు విషపూరితంగా మారాయి . ఆ తరువాత ఇక్కడ వినాయక నిమజ్జనం హడావుడి తప్ప యుద్ధ ట్యాంక్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో సందడి లేకుండా పోయింది . తెలంగాణ ఉద్యమ కాలంలో హైదరాబాద్ నగరంలో మళ్ళీ బతుకమ్మ పండుగ కళ కనిపించింది . సంస్కృతి , పండుగలు అనేవి ఒక తరం నుంచి మరో తరానికి అలవాటు అవుతుంది . మధ్యలో ఒక తరం తప్పుకుంటే ఇక అంతే . బతుకమ్మ పండుగ ఒకటి కాదు రెండు మూడు తారలు తప్పుకున్నాయి . తెలంగాణ ఉద్యమం వల్ల హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై మళ్ళీ కనిపించింది . చిన్నప్పుడు మొదటి సారి సినిమా షూటింగ్ చూసింది ట్యాంక్ బండ్ పైనే హిందీ సినిమా బహుశా కోరా కాగజ్ కావచ్చు . హీరో పెద్ద కారులో వెళుతుంటాడు . హీరోయిన్ ఆకు కూరలు తీసుకోని వెళుతుంటుంది . కారు తాకి కూరగాయల సంచి పడిపోతుంది . చిన్న సీన్ కు అంత సమయమా అనిపించింది . ఎన్టీఆర్ హయాంలో బుద్ధ విగ్రహం ఏర్పాటు చేశారు . కెసిఆర్ హయాంలో భారీ అంబెడ్కర్ విగ్రహం , అంతా వీరుల స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు . 1971లో ఇండియా పాకిస్థాన్ పై విజయం సాధించిన దానికి గుర్తుగా డిసెంబర్ 16న విజయ్ దివస్ జరుపుతారు . కనీసం ఆ రోజైనా ఈ యుద్ధ ట్యాంక్ వద్ద విజయ్ దివస్ నిర్వహించరు . బుద్దా మురళి

14, మార్చి 2025, శుక్రవారం

జిందగీమే కుచ్ భీ హోసక్తా ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -118

జిందగీమే కుచ్ భీ హోసక్తా ... . జర్నలిస్ట్ జ్ఞాపకాలు -118 హిందీ నటుడు అనుపమ్ ఖేర్ ప్రోగ్రాం ఒకటి జిందగీమే కుచ్ బీ హో సక్తా .. మంచి ఆసక్తికరమైన ప్రోగ్రాం . ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి వచ్చి సినిమా రంగంలో ఎదిగిన వారి జీవిత విశేషాలను పరిచయం చేసే కార్యక్రమం . జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు . జీవితంలో ఏదైనా జరగవచ్చు . ఆశను వదులుకోకుండా ప్రయత్నిస్తే ఏదైనా జరగవచ్చు అని చెప్పే ప్రోగ్రాం . *** *** ***** 2017 లో ఆర్ టీ ఐ కార్యాలయం.. మధ్యాన్న సమయం ఏదో పనిలో ఉండగా ఆఫీస్ బాయ్ వచ్చి ఒక విజిటింగ్ కార్డు అందించాడు . ఇద్దరు రిటైర్డ్ ఐ ఏ ఎస్ అధికారులు . షఫీ కుజ్జ మా తో పాటు మరో అధికారి . ఐఏఎస్ గా రిటైర్ అయ్యాక న్యాయవాదులుగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు . ఆర్ టి ఐ కేసు విషయంలో ఆర్ టి ఐ కమిషనర్ గా నన్ను కలవడానికి వచ్చారు . తెలంగాణ యూనివర్సిటీ లో తమ క్లయింట్ కేసు ఉందని , కేసు త్వరగా వస్తే న్యాయం జరుగుతుంది అని చెబుతుంటే .. వాళ్ళిచ్చిన విజిటింగ్ కార్డు ను అలా చూస్తూ ఆలోచనల్లో పడిపోయి .. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాను . **** ***** డిగ్రీ పూర్తి కాగానే 1987 సెప్టెంబర్ లో మెదక్ జిల్లా ఆంధ్రభూమి రిపోర్టర్ గా సంగారెడ్డికి వెళ్ళాను . ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన లెటర్ తీసుకోని కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళాను . అప్పుడు కలెక్టర్ షఫీ కుజ్జ మా... ఆంధ్రభూమికి కొత్తగా వచ్చాను అని లెటర్ ఇచ్చి పరిచయం చేసుకున్నాను . అంతకు ముందు జిల్లా మంత్రి కరణం రామచంద్ర రావు కు డిపి ఆర్ ఓ భూమికి కొత్త అని పరిచయం చేస్తే ఆయన ఏ మూడ్ లో ఉన్నారో భూమికి కొత్తా ? భూమికే కొత్తనా ? అని జోక్ వేశారు . 87 నుంచి బాబు సీఎం అయ్యాక అసెంబ్లీలో నే కరణం మాట్లాడుతూ మాట్లాడుతూనే అస్వస్థతకు గురై మరణించేవరకు అనేక సార్లు కరణం ఉపన్యాసాలు విన్నాను ఒక్క సారి కూడా జోక్ వేయగా వినలేదు . కలెక్టర్ మాత్రం ఎలాంటి జోక్ వేయకుండా కాసేపు మాట్లాడి పంపించేశారు . **** ***** తరువాత హైదరాబాద్ వచ్చాక ఓ రోజు అనుకోకుండా 1996 ప్రాంతంలో షఫీ కుజ్జ మా డ్రామా న్యూస్ కవర్ చేయాల్సి వచ్చింది . జూబ్లీ హల్ లో సీఎం చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే మీడియా మొత్తం వచ్చింది . మద్యనిషేధాన్ని ఎత్తి వేయడానికి చంద్రబాబు రంగం సిద్ధం చేసుకుంటున్న సమయం అది . ఇంకా మీటింగ్ పూర్తి కానందు వల్ల బాబు కోసం మీడియా ఎదురు చూస్తుంటే అంత పెద్ద సంఖ్యలో ఉన్న మీడియా వద్దకు షఫీ కుజ్జ మా కొన్ని కాగితాలు చదువుతూ రాష్ట్రంలో మద్యనిషేధం ఎంత ఘోరంగా విఫలం అయిందో చెబుతున్నారు . కల్తీ మద్యం తో ఎంత మంది మరణించారు . ఎన్ని అక్రమ మద్యం కేసులు , మద్యనిషేధం ఎత్తివేయక పోతే ఎంత ప్రమాదకరమో వివరించే విధంగా ఆ గణాంకాలు ఉన్నాయి . చెప్పాల్సింది అంతా ఆయన చెప్పి వెళ్లి పోయాక . కొద్ది సేపటికి సీఎం చంద్రబాబు వచ్చారు . హష్మీ అని ఉర్దూ రిపోర్టర్ బాబు రాగానే మద్యనిషేధం ఘోరంగా విఫలమైంది ? అంటూ ఆ అధికారి చెప్పిన అంకెలు చెప్పుకొచ్చాడు . నిజామా ? అని చంద్రబాబు బోలెడు ఆశ్చర్య పోయాడు. . మా అల్లుడు నా కన్నా గొప్ప నటుడు అని విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు ఉరికే అనలేదు . **** కేసు త్వరగా వస్తే మా క్లయింట్ విద్యా సంవత్సరం కాపాడినవారు అవుతారు . కమిషన్ నుంచి నోటిస్ వస్తే చాలు పని అయిపోతుంది అని షఫీ కుజ్జ మా అడగగానే ప్లాష్ బ్యాక్ నుంచి బయటకు వచ్చి పీఎస్ ను పిలిచి వీరి కేసు వెంటనే రావాలి అని చెప్పాను . షఫీ కుజ్జ మా ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోతుంటే 1987 నాటి నా పరిచయం గుర్తు చేసి .. 96లో మద్యనిషేధం విఫలం అంటూ మీరు చదివి వినిపించిన ఆ అంకెలు అన్నీ బాబు ఆదేశంతోనే కదా ? అని అడగాలి అని నోటి వరకు వచ్చినా అడగకుండా ఉండిపోయాను . ఏ పాత్రలో ఉన్నప్పుడు ఆ పాత్రకే పరిమితం కావడమే మంచి సంప్రదాయం అనిపించి మౌనంగానే ఉండి పోయాను . ఐఏఎస్ అధికారులు ఎంత పరిచయం ఉన్నా కొన్ని విషయాలు ముఖాముఖిలో కూడా పంచుకోరు . అలాంటిది బాబు ప్రెస్ కాన్ఫరెన్స్ అని మీడియా వస్తే బాబుకు సంబంధం లేకుండా ఎక్సయిజ్ కమిషనర్ వచ్చి మద్యనిషేధం ఎలా విఫలం అయిందో చెబుతారా ? తెలిసిన విషయం అడగడం ఎందుకు అని అడగలేదు సాంప్రదాయ ముస్లిం జీవనం గడిపే అతనికి ఎక్సయిజ్ శాఖ అస్సలు ఇష్టం లేదు అని విన్నాను . 1987 లో రిపోర్టర్ గా అతనికి నన్ను నేను పరిచయం చేసుకుంటే ... సరిగ్గా మూడు దశాబ్దాలు గడిచిన తరువాత ఆర్ టీ ఐ కమిషనర్ గా ఉన్న నన్ను న్యాయవాదిగా అతను పరిచయం చేసుకోవడం ఏదో సినిమా కథలా అనిపించింది ... **** హిందూ చీఫ్ రిపోర్టర్ వర్లు ఒక సారి సి సి ఎల్ఏ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కు వెళ్లారు . కమిషనర్ కార్యాలయంలోకి వెళ్ళగానే కమిషనర్ వర్లు ను చూసి సార్ మీరు వచ్చారా ? అని లేచి నిలబడి స్వాగతం పలికారు .. ఆ రోజుల్లో మీడియాకు ఇంత గౌరవం ఉండేది అని ముందుగానే నిరయానికి వచ్చేయకండి . కమిషనర్ లేచి నిలబడి స్వాగతమ్ పలికింది నిజమే . కానీ కారణం వేరు . హిందూ లో వర్లు చీఫ్ రిపోర్టర్ గా ఉన్నప్పుడు అతని బ్యూరోలో ఒక రిపోర్టర్ గా సి సి ఎల్ ఏ కమిషనర్ ఉన్నారు . ఎప్పుడు ఉద్యోగం వదిలి , ఎప్పుడు సివిల్స్ కు ఎంపిక అయ్యారో పెద్దగా దృష్టి పెట్టలేదు . తన బ్యూరోలో రిపోర్టర్ వద్దకు తానే ప్రెస్ కాన్ఫరెన్స్ కు వెళ్లడం ఒక అరుదైన అనుభవం . డక్కన్ క్రానికల్ లో అయేషా అని అమ్మాయి క్రైం రిపోర్టర్ . క్రైం రిపోర్టర్ లు ఎక్కువగా పోలీసులు ఇచ్చిన సమాచారం పై ఆధారపడాలి . ఈ అమ్మాయి మాత్రం రోజూ మార్చురీకి వెళ్లి సమాచారం సేకరించేది . అయినా ఎడిటర్ జయంతి వేధిస్తోంది అని బాధపడేది . ఆ వేధింపులు తట్టుకోలేక డక్కన్ క్రానికల్ కు రాజీనామా చేసి ఉర్దూ పేపర్ లో చేరింది . ఆర్ టీ ఐ కమిషనర్ గా ఓ రోజు కేసులు చూస్తుంటే ఓ అధికారి మా కలెక్టర్ స్ట్రిక్ట్ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నాం అని కలెక్టర్ పేరు చెప్పగానే సంతోషం వేసింది . ఆయెషా గ్రూప్ వన్ కు సెలక్ట్ అయింది అని తెలుసు చిన్న జిల్లాలు ఏర్పాటు చేసిన సమయంలో ఆయెషా ను జిల్లా కలెక్టర్ గా నియమించారు . ఓపిక తో ఉండి తమ నైపుణ్యాలు పెంచుకుంటూ పోతే అవకాశాలు అవే వస్తాయి అని చాలా మంది నిరూపించారు . **** ఐతే జర్నలిజం లోకి రమ్మంటావా ? అని ప్రశ్నిస్తే వద్దే వద్దు అంటాను . ఆర్థిక సంస్కరణల తరువాత అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి . అదే సమయంలో అంతే స్పీడ్ గా మీడియా రంగంలో అవకాశాలు తగ్గిపోయాయి . తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో అవకాశాలు చాలా వేగంగా పడిపోయాయి . పైగా ఇప్పుడు అంతా రాజకీయ పార్టీల మీడియానే . స్వతంత్ర మీడియా అని చెప్పుకొనేది కూడా అటు రైట్ వైపో ఇటు లెఫ్ట్ వైపో స్వతంత్రంగా పని చేస్తున్నావే . 99 లో టీడీపీ స్వతంత్రులకు టికెట్లు , మంత్రి వర్గంలో స్థానం కల్పించింది . ఒక పార్టీ తరపున పోటీ చేశాక తటస్తులు ఏమిటో ? ఇప్పుడు మీడియా కూడా అలాంటి తటస్తమే . ఎడిటర్ లను , పత్రికలో వార్తలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది . లార్జెస్ట్ సర్క్యులేటెడ్ మొదలుకొని , వెయ్యి లోపు సబ్ స్కైబర్స్ ఉన్న యూ ట్యూబ్ వరకు ఏదో ఒక పార్టీ కోసం పని చేస్తోంది . పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి మధ్యలో మీడియాలోకి వస్తే వేరు కానీ దీనిని ఉపాధిగా భావించి వస్తే దిన దిన గండం ఆరు నెలల ఆయుష్యు అన్నట్టు ఉంటుంది . వెజ్ బోర్డు సిఫారసులు ఉంటాయి .అమలు చేస్తే దాదాపుగా గ్రూప్ వన్ అధికారులకు లభించే స్థాయిలో వేతనాలు ఉంటాయి . ఒక్క ఆంధ్రభూమి తప్ప మరే మీడియా సంస్థ వీటిని అమలు చేయలేదు . - బుద్దా మురళి (జర్నలిస్ట్ జ్ఞాపకాలు 118 )

21, డిసెంబర్ 2024, శనివారం

ఎడిటర్ కు నిజం చెబితే ఉద్యోగం ఊడుతుంది .. ఒక్క రోజు అందరూ నిజమే చెబితే ప్రపంచం తలక్రిందులు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -117

ఎడిటర్ కు నిజం చెబితే ఉద్యోగం ఊడుతుంది .. ఒక్క రోజు అందరూ నిజమే చెబితే ప్రపంచం తలక్రిందులు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -117 ఒక్క రోజు మనుషులు అందరూ నిజం మాత్రమే మాట్లాడితే.. మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాస్క్ లేకుండా , కల్తీ లేకుండా మాట్లాడితే ప్రపంచం తలక్రిందులు అవుతుంది . ఒక్కరికి ఒక్క మిత్రుడు మిగలడు . భార్యా భర్తలు విడిపోతారు . కుటుంబ బంధం నిలవదు ఓషో ఉపన్యాసం లో ఈ మాట విన్నప్పుడు ఒప్పుకోవడానికి మనసు అంగీకరించలేదు కానీ అక్షర సత్యం అనిపించింది . లోకం అబద్దం మీదనే బతుకుతుంది దాన్ని అలానే బతకనివ్వు నిజం చెప్పకు అని నిషే చెప్పింది నిజం . ఆంధ్ర భూమిలో పని చేస్తుండగా అప్పటికి ఓషో చెప్పిన ఈ మాట గురించి తెలియక పోయినా నాయకుల గురించి , మనుషుల గురించి , బాస్ ల గురించి అవగాహన ఉండడం వల్ల నిజం చెప్పాలి అనే జబ్బు బారిన పడకుండా ఉద్యోగం కాపాడుకున్నాను . ఈ మధ్య ఒక ఆసక్తి కరమైన వార్త చూశా ఇంటింటికి తిరిగి క్షవరం చేసే ఎస్ మేడం అనే కార్పొరేట్ కంపెనీ తమ ఉద్యోగుల పని తీరుపై ఒక సర్వే జరిపింది . మీరు ఒత్తిడికి గురవుతున్నారా ? అనేది ఆ సర్వేలో ఓ ప్రశ్న . చాలా మంది ఉద్యోగులకు జీవితానుభవం లేక ఔను మేం విధి నిర్వహణలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాం అని రాశారు . అది చదివిన యాజమాన్యం నిజాయితీగా మీ అభిప్రాయం చెప్పినందుకు అభినందనలు . మీ అభిప్రాయాన్ని మేం పరిశీలిస్తున్నాం అని చెబుతూనే ఒత్తిడికి గురి అవుతున్నాం అని సర్వేలో రాసిన దాదాపు వందమంది ఉద్యోగులను ఉద్యోగం నుంచి తీసేశారు . నిజం చెబితే బహుమతి లభించడానికి అదేమీ ప్రాథమిక పాఠశాల కాదు , వాళ్ళేమీ స్టూడెంట్స్ కాదు . అడిగింది టీచర్ కాదు . నెల నెల జీతం ఇచ్చే కార్పొరేట్ కంపెనీ . అడిగిన విషయం పై అభిప్రాయం చెప్పేప్పుడు అడిగింది ఎవరు ? ఏ ఉద్దేశం తో అడుగుతున్నారు ? నిజం చెబితే ఏమవుతుంది అని గ్రహించాలి . అలా గ్రహించకుండా నిజాలు చెబితే సత్యహరిచంద్రునిలా చరిత్రలో నిలిచి పోతామని కలలు కనొద్దు . నిజం చెబితే రోడ్డున పడే ప్రమాదం ఉందని గ్రహించాలి . *** ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు అసెంబ్లీ బిల్డింగ్ ఆవరణలో పిచ్చాపాటి మాట్లాడుతూ ఓషో చెప్పిన ఈ మాట ప్రస్తావించి మనం సరదాగా ఓ గంట పూర్తిగా నిజాలే మాట్లాడుకుందాం అని ప్రతిపాదించా . మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి అనుకోని మాటలు మొదలు పెట్టి మూడు నాలుగు నిమిషాలకు మించి మాట్లాడలేక పోయాం . .. .. ****** ఓ రోజు ఆంధ్రభూమిలో ఎడిటర్ రిపోర్టర్ లను అందరినీ పిలిచి ఆఫీస్ గురించి , పని తీరు మీ తోటి వాళ్ళు అందరి పని తీరుపై బాగా ఆలోచించి నిజాయితీగా రాసి కవర్ లో పెట్టి ఇవ్వండి . ఒకరు రాసింది ఒకరు చదవరు కాబట్టి మనసులో ఉన్నది ఉన్నట్టు రాయండి . రెండు రోజుల్లో రాసి కవర్ లో పెట్టి ఇవ్వండి అని పరీక్ష పెట్టాడు . అప్పుడు మనసులో ఏమనుకున్నానో రాయడం బాగోదు కానీ నవ్వుకున్నాను . మీటింగ్ కాగానే బృందాలుగా హోటల్ కు వెళ్ళాం . మనసులో ఉన్నది ఉన్నట్టు ఎడిటర్ రాయమన్నారు కదా అని రాస్తే ఉద్యోగాలు ఉడుతాయి . జాగ్రత్త . ఇక్కడ ఉన్న లోపాలు అందరికీ తెలిసినవే అందరూ నటిస్తున్నారు . యాజమాన్యం కే లేని దురద మనకెందుకు ? మనం సేఫ్ గేమ్ ఆడుదాం అని అందరికన్నా ముందు నేనే ఒక బృందానికి ఉచిత సలహా ఇచ్చాను . **** ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటిలా వాట్స్ ఆప్ జర్నలిజం కాదు మంత్రి వర్గ సమావేశం జరిగితే లోపల ఏం చర్చ జరిగిందో తెలుసుకోవడానికి కనీసం పది మంది మంత్రులను విడివిడిగా కలవాల్సి వచ్చేది . అలా కలుస్తూ అప్పుడు మంత్రిగా ఉన్న నిమ్మల కిష్టప్ప వద్దకు నేనూ మరో జర్నలిస్ట్ వెళ్ళాం . మంత్రి వర్గ సమావేశంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు చెప్పిన విషయాలు కిష్టప్ప చెబుతూ - ఎన్నికలు సమీపిస్తున్నాయి మనం నిజాయితిగా మాట్లాడుకుందాం .. . మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం . నేనూ చెబుతాను , మీరూ చెప్పండి .. మీరు మొదలు పెట్టండి అని మంత్రులకు బాబు చెప్పారు అని నిమ్మల కిష్టప్ప చెబుతుండగానే నేను మధ్యలో జోక్యం చేసుకొని .. ఆయన మనసులో ఉన్నది చెప్పడు .. మీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఇలా చెబుతాడు జాగ్రత్త . మనసులో ఉన్నది చెబితే ప్రమాదం అని కిష్టప్పకు చెప్పాను . అయన నవ్వుతూ అదే జరిగింది . అనంత పురం జిల్లాలో కుల రాజకీయాలు మరీ ఎక్కువ సర్పంచ్ స్థాయిలో ఉన్న కుల రాజకీయాల గురించి కులాల పేర్లు ప్రస్తావించి చెబితే అంతా విని ఏం మాట్లాడుతున్నారు ? ఈ రోజుల్లో కూడా ఇంకా కులాలా ? అని బాబు చిరాకు పడ్డారని చెప్పుకొచ్చాడు . నిజాలు మాట్లాడుకుందాం , ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం అని ఎవరు అన్నా మీ మనసులో ఉన్నది తెలుసుకోవడానికి తప్ప అది వారి మనసులో ఉన్నది చెప్పడానికి కాదు . రాజకీయాల్లో అనే కాదు ఏ కంపెనీ లోనైనా , ఏ మీడియాలో నైనా , ఏ సంస్థ లో నైనా , ఏ బాస్ అయినా ఇంతే . **** ఆంధ్రభూమిలో ఎడిటర్ కోరిక మేరకు ఎవరికి వారు విడివిడిగా మనసులో ఉన్నది రాసి కవర్ లో పెట్టి ఎడిటర్ కు ఇచ్చాము . ఓ రోజు ఎడిటర్ అందరినీ పిలిచి కవర్లు ముందు వేసి . తొలుత సంస్థ గురించి , రిపోర్టర్ లు , ఇతరుల గురించి మనసులో ఉన్నది చెప్పి . మేం మనసులో మాట రాసిన కవర్లు విప్పి ఎవరిది వాళ్ళు అందరూ వినేట్టు చదవమన్నారు . అందరి మనసులో ఉన్నది ఒక్కటే ఎడిటర్ అద్భుతం , స్టాఫ్ అద్భుతం , యాజమాన్యం అద్భుతం , ధర్మం నాలుగు కాళ్ళ మీద తాండవిస్తోంది ఇదీ సంక్షిప్తంగా ఆ కవర్ లో అందరూ విడివిడిగా రాసిన ఏకాభిప్రాయం . యాజమాన్యం చేస్తున్న తప్పులు , ఎడిటర్ తప్పుల గురించి అందరం రోజూ గంటల తరబడి మాట్లాడుకున్నా ఒక్క వాఖ్య కూడా ఒక్కరూ రాయలేదు ఆ తంతు ముగియగానే మళ్ళీ బృందాలుగా హోటల్ కు వెళ్ళాం . **** మనం నలుగురం ఇలా రాయాలి అనుకున్నాం కాబట్టి ఒకే రకంగా రాశాం . వేరే రెండు బృందాలు కూడా అచ్చం ఇలానే ఎలా రాశాయి . మనసులో ఉన్నది ఒక విషయం కూడా బయట పెట్టకుండా మనసులో మాట భలే రాశాం అందరం అని మమ్ములను మేం మెచ్చుకున్నాం . పాపం ఇంత జీవితానుభవం లేదు కాబట్టి ఎస్ మేడం కంపెనీ ఉద్యోగులు నిజం రాసి రోడ్డున పడ్డారు . రాజాలియాలు , మీడియా , కార్పొరేట్ కంపెనీ అని కాదు . మనుషులు అంతా ఇంతే ఓషో అన్నట్టు ఒక్క 24 గంటలు నిజాలే మాట్లాడితే ఏ బంధం నిలవదు . ఏ ఉద్యోగం ఉండదు . ఈ లోకం అబద్దాల మీదనే బతుకుతోంది దానిని అలానే బతకనిద్దాం అని నిషే చెప్పిన సత్యాన్ని కూడా ఓషో తన ఉపన్యాసంలో ప్రస్తావించారు . అబద్దాన్ని మీరు రక్షిస్తే అబద్దం మిమ్ములను రక్షిస్తుంది . ఇదే లోక రీతి . - బుద్దా మురళి ( జర్నలిస్ట్ జ్ఞాపకాలు 117 )

19, సెప్టెంబర్ 2024, గురువారం

ఓ గోల్డ్ మెడలిస్ట్ అనాధ మరణం జర్నలిస్ట్ జ్ఞాపకాలు -115

ఆమె యూనివర్సిటీ లో గోల్డ్ మెడల్ సాధించారు . ప్రభుత్వాలను శాసించే నంబర్ వన్ సంస్థ లో జీవితాన్ని ప్రారంభించి ..దాదాపు నాలుగు దశాబ్దాలు అదే జీవితం . ఆమెది ఒంటరి జీవితం . హైదరాబాద్ మహానగరం లో ఒంటరిగా గదిలో ప్రాణాలు విడిచింది .తలుపు బద్దలు కొట్టి చూస్తే తప్ప ఆమె మరణం బయటి వారికి తెలియలేదు . అనాధ శవానికి పోలీసులు , మున్సిపాలిటీ అంత్యక్రియలు నిర్వహించారు . .... ఈ వార్త టీవీ వారి దృష్టిలో పడితే పండగే ... మానవత్వం మంటగలిసింది ... ఎక్కడికి వెళుతున్నాం ... మనుషుల మేనా అంటూ వీలైతే సినిమా పాటలతో అద్భుతంగా మానవత్వాన్ని తట్టిలేపే విధంగా చక్కిని స్టోరీ ప్రసారం చేసే వారు . పత్రికల్లో ఐతే చేయి తిరిగిన సబ్ ఎడిటర్ చేతిలో పడితే కన్నీళ్లు పెట్టించే కవిత్వంతో వార్త వెలుగు చూసేది .. మరణం నిజమే ... కానీ టివిలో , కానీ మీడియాలో కానీ హృదయ విదారక కథనాలేమి రాలేదు .. ఎందుకంటే అలా మరణించింది ఓ మహిళా జర్నలిస్ట్ ... ఎవరైనా ఇలా మరణిస్తే జర్నలిస్ట్ లు హృదయ విదారకంగా కథనం రాస్తారు కానీ జర్నలిస్ట్ మరణిస్తే అలా రాయరు. ఎందుకలా అంటే అదంతే ... .... జంధ్యాల భారతి పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం లో జర్నలిజం లో గోల్డ్ మెడల్ సాధించారు ... ఈనాడు లో జర్నలిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించి తరువాత ఫ్రీ లాన్సర్ గా ఉన్నారు .. మిత్రుడు నామాల విశ్వేశ్వర్ రావు ఫోన్ చేసి జంధ్యాల భారతి సంస్మరణ సభ నిర్వహించాలి అని నాకు ఉంది .. ఆమె ఇలాంటివి తనకు నచ్చవు వద్దు అని గతంలో చెప్పారు అని కొందరు అంటున్నారు .. మీ అభిప్రాయం ఏమిటీ అని అడిగారు .. మీరు సంస్మరణ సభ నిర్వహించినా , నిర్వహించక పోయినా పోయిన వారికి తెలియదు .. మనం ఎలా బతుకుతున్నాం అని మనకు మనం చెప్పుకోవడానికి .. మన జీవితాన్ని మనం సమీక్షించుకోవడానికి సభ నిర్వహించాలి అనేది నా అభిప్రాయం అని చెప్పాను ... ఆమె కోసం కాదు మన కోసం అవసరం అని చెప్పాను ... .... నిన్నటి రోజంతా ఈ విషయం మీదే చర్చ ... ఆలోచన ... ఆమెతో పెద్దగా పరిచయం లేదు ..ఆంధ్రభూమిలో ఉండగా చాలా సార్లు చూశాను .. ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ గా అన్ని పత్రికలకు రాసే వారు ... ముందు ప్రభ తరువాత కరోనా లో భూమి లో పారితోషకం ఇవ్వడం మానేశాక రాయడం మానేశారు .. మిత్రుడు విష్వఈశ్వర రావు చెప్పిన వివరాల ప్రకారం ఆమె ఈనాడు లోనే జర్నలిజం జీవితాన్ని ప్రారంభించారు .. ఎం వి ఆర్ శాస్త్రి , కె యల్ రెడ్డి వంటి వారితో కలిసి ఈనాడులో పని చేశారు . అక్కడి ఉద్యోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ... అక్కడ ఇలాంటి ప్రేమ పెళ్లిళ్లు కొత్తేమి కాదు ... ఐతే ఇద్దరిలో ఒకరు రాజీనామా చేయాలి ఇది నిబంధన .. ఆమె రాజీనామా చేసింది .. కాపురం మూన్నాళ్ళ ముచ్చట కాదు ఒక రోజు ముచ్చట గానే మిగిలి పోయింది ... మళ్ళీ ఒంటరి జీవితమే ... ప్రైవేటు ఉద్యోగం అంటేనే బతుకు భయం భయం ఇక జర్నలిస్ట్ ఉద్యోగం అంటే మరింత భయం ...ఆమె అలానే జీవితమంతా భయం తో కలిసి బతికింది చనిపోయింది ... .... అందరి జీవితాలు ఇలానే ఉంటాయి అని కాదు సినిమా రంగం , జర్నలిజం , రచయిత ఏ రంగం ఐనా కావచ్చు ... ఎవరి బతుక్కు వారే కారణం ... సమాజం , తోటి వారు , యూనియన్ లు అని మాట్లాడితే పలాయన వాదమే అవుతుంది .. జర్నలిజం నుంచి సివిల్స్ కు ఎంపిక అయిన వారు ఉన్నారు ... ముందుకు బానిసలైన వారు ఉన్నారు ... ఆయేషా అని దక్కన్ క్రానికల్ లో క్రైం రిపోర్టర్ ఉండేవారు .. అమ్మాయి అయినా ఎప్పుడూ మార్చురీల చుట్టూ తిరిగేది ... ఇప్పటిలా వాట్స్ ఆప్ జర్నలిజం కాదు కాబట్టి రోజూ మార్చురీకి వెళ్ళేది ... ఐనా ఆఫీస్ లో వేధింపులు ...ఉద్యోగం వదిలేసింది . కొంతకాలం తరువాత ఆమె ఏకంగా జిల్లా కలెక్టర్ అయ్యారు .. చిన్న వయసు వారు కనిపిస్తే బోలెడు ప్రభుత్వ ఉద్యోగాలు , బ్యాంకు రైల్ వే ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తుంటాయి వెళ్లొచ్చు కదా ? అనేవాడిని ... అలా వెళ్లిన ఎంతో మందిని చూశా ... శ్రీ శ్రీ , వేటూరి సుందర రామ మూర్తి వంటి గొప్ప వారు మొదట్లో జర్నలిస్ట్ లే ... ఇవి ఆ రోజులు కాదు .. ఇతర రంగాల్లో రాణించిన వారిని చూశా అనాధల్లా మరణించిన వారిని చూశా ... ... భూమిలో చిక్కడ పల్లి చారీ అని ఒక పార్ట్ టైం విలేఖరి ఉండేవారు ... ఓ రోజు సార్ నేను ఎడిటర్ ఇంటికి వెళ్తా , ఎడిటర్చెప్పిన పని చేస్తా కానీ ఆఫీస్ కు వచ్చాక న్యూస్ ఎడిటర్ , బ్యూరో డెస్క్ అందరి మీద అధికారం చెలాయిస్తా ... నేను ఒక్కరికి తలవంచి అందరినీ భయపెడతా అని చెప్పుకుంటూ పోయా డు .. భ్రమల్లో బతుకుతున్నాడు పాపం అనిపించింది . అతని గురించి కొన్ని రోజుల తరువాత తెలిసింది .. చనిపోయాడు నాలుగు రోజులు మార్చురీలోనే శవం ... ఎవరూ రాలేదు ... ఎన్టీఆర్ ను దించేసి సమయం ... అప్పుడు సెల్ ఫోన్లు లేవు .. సచివాలయం ప్రెస్ రూమ్ లో ల్యాండ్ లైన్ ... ఓ జర్నలిస్ట్ తన వంతు వచ్చే వరకు నిలబడి మెల్లగా ఫోన్ లో సచివాలయంలో బాబు ఛాంబర్ లో ఎంత మంది శాసన సభ్యులు చేరారో రామోజీ రావుకు చెబుతున్నాడు ... ఆ సాయంత్రమే శిబిరం వైస్ రాయ్ కి మారింది .. ప్రభుత్వాన్ని కూల్చడం లో తమ వంతు పాత్ర పోషిస్తున్న వారు కూడా అంత మెల్లగా తన పని తాను చేసుకు పోతుంటే ... మందు మత్తులో అమెరికా అధ్యక్షున్ని కూడా ప్రెస్ రూమ్ నుంచే మార్చేస్తున్నట్టు మాట్లాడే వారిని కూడా చూశా ... ప్రపంచం లో ప్రతి పరిణామం పై సమీక్షించే మనం మన జీవితాన్ని కూడా సమీక్షించు కోవాలి లేదంటే ? ఆరోగ్యం , మానవ సంబంధాలు , డబ్బు అన్నీ జీవితానికి ముఖ్యమే ... బెంగళూరులో ఓ సీఏ ఆఫీస్ లో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకున్నారట ... అంత్యక్రియలకు ఎవరూ రాలేదట ... వాస్తవం ఇలానే ఉంటుంది ... భ్రమలు వదిలి వాస్తవం లోకి రావాలి ... ఓ వీడియో వింటుంటే నూతన్ ప్రసాద్ గురించి యండమూరి వీరేంద్ర నాథ్ ఓ మాట చెప్పారు ... సినిమా షూటింగ్ ప్రమాదంలో నడుము వరకు చచ్చుపడడం తో నూతన్ ప్రసాద్ వీల్ చైర్ కే పరిమితం అయ్యారు .. జీవితంలో అనుకోకుండా వచ్చే ప్రమాదాలకు ముందే సిద్ధం అయి ఉంటే ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుంది అని చెప్పారట ... ఏ ఉద్యోగంలో ఉన్న వచ్చే ప్రమాదాలను ముందే ఊహించుకుంటే జీవితం అగమ్య గోచరంగా ఉండదు ... సీఎం తెలుసు పీఎం తెలుసు అంటూ భ్రమల్లో బతికితే .... - బుద్ధా మురళి

7, జూన్ 2024, శుక్రవారం

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం బాబు సోదరుడు వైయస్ వైపు - జగన్ సోదరి బాబు వైపు జర్నలిస్ట్ జ్ఞాపకాలు -112

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం బాబు సోదరుడు వైయస్ వైపు - జగన్ సోదరి బాబు వైపు జర్నలిస్ట్ జ్ఞాపకాలు -112 ------- తాతా మనవడు సినిమాలోని అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం అనే పాట చిన్నప్పుడు రోజూ రేడియోలో వినిపించేది . ఆ వయసులో పాటలోని భావం పెద్దగా తెలియక పోయినా ఆ విషాద గీతం బాగా వెంటాడేది . జీవితాన్ని బాగా మదించిన వారే అలా రాయగలరు . పాట రచయిత ఎవరా ? అని చూస్తే డాక్టర్ సి నారాయణ రెడ్డి అని తెలిసింది . *** గత కొన్ని రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో కుటుంబ వ్యవస్థకు కాలం చెల్లింది. భవిష్యత్తులో కుటుంబ వ్యవస్థ ఉండదు అని చాలా మంది ఒక వ్యాసాన్ని షేర్ చేస్తున్నారు . ఆంధ్రప్రదేశ్ ఎన్నికల టీడీపీ , జనసేన కూటమి విజయం సాధించింది . విజేతలు చంద్రబాబు తన కుటుంబం తో ఉన్న ఫోటోలు , పవన్ కళ్యాణ్ తన కుటుంబం తో పాటు చిరంజీవి కుటుంబం తో ఉన్న ఫోటోలు చూపుతూ జగన్ తన సోదరిని దూరం పెట్టిన విషయాన్నీ ప్రస్తావిస్తూ కుటుంబం కలిసి ఉంటే విజయం సాధిస్తారు . విడిపోతే జగన్ లా ఓడిపోతారు అంటూ కుటుంబ విలువల వ్యాసాలు బోలెడు వస్తున్నాయి . విజేతలకు ఎందరో తండ్రులు , పరాజితుడు అనాధ అని ఇంగ్లీషులో ఓ మాట బాగా పాపులర్ . ఇంతకూ రాజకీయాల్లో కుటుంబం ఉండాలా ? దూరం పెట్టాలా ? మీడియా ఏం చేయమని చెబుతుంది అంటే ? తండ్రి కొడుకు గాడిద కథ గుర్తుందా ? కథతో పాటు రాజకీయాల్లో కుటుంబ సభ్యుల ఉదంతాలు గుర్తుకు వచ్చాయి . **** 1994 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ వద్ద చంద్రబాబు స్థానాన్ని లక్ష్మీపార్వతి ఆక్రమించారు . బాబు వందశాతం రాజకీయ నాయకుడు ఐతే లక్ష్మీపార్వతి రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవు . చంద్రగిరి నుంచి బాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు టికెట్ కోసం ప్రయత్నం . బాబు వద్దు అంటుంటే లక్ష్మీపార్వతి బాబుకు వ్యతిరేకంగా రామ్మూర్తి తమ్ముడికి టికెట్ ఇప్పించడానికి ఎన్టీఆర్ వద్ద పలుకుబడి ఉపయోగించారు . ఐతే బాబే వ్యూహాత్మకంగా తమ్ముడిని లక్ష్మీపార్వతి పంపారు అని ఓ ప్రచారం . అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో ఎన్టీఆర్ కు వెన్నుపోటు . శరీరం అంతా ఎన్టీఆర్ పచ్చబొట్టు పొడిపించుకున్న శ్రీపతి రాజేశ్వర రావు , ఎన్టీఆర్ వచ్చే అంత వరకు మంగళసూత్రం కట్టని రమేష్ రెడ్డిలు ఎన్టీఆర్ ను వీడి బాబు వద్ద ముందు వరుసలో ఉన్నప్పుడు స్వయంగా బాబు తమ్ముడు బాబు వైపు ఎందుకు ఉండరు . లక్ష్మీపార్వతి రాజకీయాలు తెలియవు . బాబుకు తెలుసు . బాబు సీఎం అయిన కొత్తలో నారా రామ్మూర్తి నాయుడు కూడా ఓ వెలుగు వెలిగారు . పనుల కోసం మీడియా వాళ్ళు కూడా రామ్మూర్తిని ప్రసన్నం చేసుకొనేవారు . కొంతకాలం ఆ హవా కొనసాగింది . తరువాత బాబు రామ్మూర్తిని దూరం పెట్టడంతో 2004 ఎన్నికలకు ముందు రామ్మూర్తి నాయుడు వై యస్ రాజశేఖర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లో చేరారు . ప్రతి రోజు తన అన్న చంద్రబాబు వ్యవహారాల గురించి రామ్మూర్తి నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడేవారు . చంద్రగిరి కాంగ్రెస్ టికెట్ రామ్మూర్తి కి ఖాయం అనుకున్నారు అంతా . తీరా ఎన్నికల సమయంలో రామ్మూర్తి కాంగ్రెస్ టికెట్ దక్కలేదు . ఎందుకంటే .. వై యస్ రాజశేఖర్ రెడ్డి కూడా బాబు లానే వంద శాతం రాజకీయ నాయకుడు . రేపు ఏదైనా జరిగితే తమ్ముడు మూర్తి ఎటు పోతాడో రాజకీయ అవగాహన ఉన్నవారు . ఏం జరిగిందో తెలియదు కానీ పదేళ్లు దాటిపోయింది రామ్మూర్తి బయటకు రాక .. అనారోగ్య కారణాలు అని ప్రచారం . *** చంద్రబాబు , జగన్ ఫొటోలతో విస్తృతంగా ప్రచారం . బాబు కుటుంబంతో కలిసి ఉండడం కుటుంబ విజయంగా ఈ ఎన్నికల విజయాన్ని అభివర్ణిస్తున్నారు . జగన్ సోదరి షర్మిలను దూరం పెట్టడం వల్ల ఓడిపోయారు అని ప్రచారం . ప్రజలకు వేరే పని లేదు , సమస్యలు లేవు . తెలుగు సినిమాల్లో చూపించినట్టు మీ కుటుంబం అంతా ఇలా కలిసి ఉండాలి బాబు మాకు ఇంకేం సమస్యలు లేవు అని చెబుతున్నారన్న మాట . తమ ఇంట్లో తిండికి ఉందో లేదో తెలియదు కానీ కుటుంబం ను చూసి పులకించారు . జగన్ కుటుంబ ఫోటో కాకుండా ఒంటరి ఫోటో చూసి ఓడించారన్న మాట . ఇదే ప్రచారం చేసిన వారు కెసిఆర్ కుటుంబం వల్లనే ఓడిపోయారు అని ప్రచారం చేశారు . కులం , మతం తో పాటు అనేక అంశాలు ఎన్నికల పై ప్రభావం చూపుతాయి . ఒక్కో పార్టీకి కొన్ని కులాల అండ ఉంటుంది . కొంచం ఎక్కువ, తక్కువ కానీ దేశమంతా ఇదే . ఉత్తర్ ప్రదేశ్ లో కులాల కాంబినేషన్ వల్ల బీజేపీ ఓడిపోయింది . ఆంధ్రాలో కూటమి గెలిచింది . కులం మతం తో పాటు అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయి . ఇంతకూ రాజకీయాల్లో కుటుంబం ఉండాలా ? వద్దా ? అంటే గాడిద పై తండ్రి కొడుకు కూర్చొని ప్రయాణిస్తే బాటసారులు ఏం చెప్పారో మీడియా అదే చెబుతుంది . .కుటుంబం ఉంటే వద్దు అంటుంది . లేక పోతే ఉండాలి అంటుంది . రాజకీయం ఓ వ్యాపారం . బ్యాంకు దీర్ఘకాలం కోసం డిపాజిట్ చేస్తే ఎలాంటి రిస్క్ లేకుండా వడ్డీ రూపంలో సాధారణ ఆదాయం వస్తుంది . స్టాక్ మార్కెట్ లో రిస్క్ ఎక్కువ ఆదాయం అంతకన్నా ఎక్కువ . రాజకీయ వ్యాపారం చాలా రిస్క్ ఆదాయం కూడా అంతే . స్టాక్ మార్కెట్ లో కరోనా లాంటి ఉపద్రవం వస్తే మార్కెట్ క్రాష్ అవుతుంది . ఐనా ఆరు నెలల్లో కోలుకుంటుంది . రాజకీయ వ్యాపారంలో క్రాష్ వస్తే కోలుకోవడానికి ఐదేళ్లు పడుతుంది . రిస్క్ తో పాటు ఆదాయం అదే స్థాయిలో ఉంటుంది . రిస్క్ హై తో ఇష్క్ హై అని సినిమాలో హర్షద్ మెహతా డైలాగు బాగా పాపులర్ . ** ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల తరువాత షర్మిల కామెంట్ కోసం ఆసక్తిగా చూస్తే కనిపించలేదు . ఒకవేళ కామెంట్ చేసి ఉంటే గూగుల్ లో దొరుకుతుంది కదా ? అని సెర్చ్ చేస్తే యూట్యూబ్ ఛానల్ లో కనిపించింది . తను పాద యాత్ర చేసి వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా రక్షించింది సుదీర్ఘంగా చెబుతూ పోతున్నారు . ఫలితాల మీద చెప్పడం లేదు . ఇక వినలేక వదిలేశాను . షర్మిల టీడీపీ మీడియాలో రోజూ మొదటి పేజీ ఆక్రమించేవారు . ఫలితాలు వచ్చాయి . టీడీపీ గెలిచింది ఆమె కామెంట్ గూగుల్ లో సెర్చ్ చేస్తే తప్ప దొరకడం లేదు . షర్మిల తొలుత తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడుఆంధ్రాలో ఉన్న ఓ మిత్రుడితో చర్చ ఆమెకు 15 సీట్లు వస్తాయి . కింగ్పా మేకర్లే అవుతారు అని అంటే . ఆమె పోటీ చేయరు , చేసినా ఒక్క చోట గట్టి పోటీ ఇస్తారు అన్నాను . ఇదే ఫేస్ బుక్ లో రాస్తే వైయస్ ఆర్ పార్టీ అభిమానులు మాటల దాడి , ఒకరు మెసెంజర్ లో ఫోన్ చేసి దాడి . పాలేరు బిడ్డను అంటూచివిరి నిమిషంలో చేతులు ఎత్తేసి ఆంధ్రాలో తేలి.. కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెస్తాను అన్నారు . ఒక్క చోట కూడా డిపాజిట్ రాలేదు . తెలం గాణలో బి ఆర్ యస్ కు వ్యతిరేకంగా , ఆంధ్రాలో వై యస్ ఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా న్యూ సెన్స్ క్రియేట్ చేయడంలో షర్మిల విజయం సాధించారు . కేఏ పాల్ మా ఇంట్లో 20 ఓట్లు ఉన్నాయి నాకు నాలుగు ఓట్లు మాత్రమే వచ్చాయి అని చెప్పిన మీడియా సమావేశంలో సైతం కనీసం పాతిక మీడియా లోగోలు ఉన్నాయి . నాలుగు ఓట్లు రాకపోయినా పాల్ మాట్లాడితే పాతిక ఛానల్స్ వస్తాయి . రాజకీయాల్లో కొన్ని పాత్రలకు న్యూ సెన్స్ వాల్యూ మాత్రమే ఉంటుంది . రాజకీయం వ్యాపారం . ఎవరికి లాభసాటి అనుకున్న రీతిలో వాళ్ళు రాజకీయ వ్యాపారం చేస్తారు . రాజకీయం వ్యాపారం అయితే మీడియా ? పెద్ద పరిశ్రమకు అనుబంధంగా కొన్ని చిన్న పరిశ్రమలు ఉంటాయి . 2004 లో చంద్రబాబు ఓడిపోయాక సత్యం పెద్ద క్యాంపస్ ఒకటి ప్రారంభోత్సవం . టీడీపీలో రాధాకృష్ణ అని కార్యాలయ కార్యదర్శి ఉండేవారు . సత్యం క్యాంపస్ ప్రారంభోత్సవం అప్పుడు రాధాకృష్ణ బాధపడుతూ - ఆ క్యాంపస్ కు స్థలం ఇచ్చింది , సౌకర్యాలు కల్పించింది చంద్రబాబు - చూడు మనుషులు ఎలా ఉంటారు .. బాబును కనీసం పిలువ లేదు వై యస్ ఆర్ ను పిలిచారు అని బాధ పడ్డారు . సత్యం కు స్థలం ఇచ్చింది సీఎం , ప్రారంభోత్సవానికి పిలిచింది సీఎం ను ... దీనికి బాబు వైయస్ ఆర్ కు సంబంధం లేదు . సీఎం పోస్ట్ తోనే సంబంధం అని చెప్పాను . సత్యం, బాబు , జగన్ రామ్మూర్తి నాయుడు , షర్మిల అనుబంధాలు ఉత్త ట్రాష్ . రాజకీయమే వాస్తవం . -బుద్దా మురళి

5, జూన్ 2024, బుధవారం

సత్యం పాతాళం నుంచి ఆకాశాన్ని తాకింది . డిపాజిట్ దక్కని పార్టీ అధికారంలోకి వస్తుంది . జీవితం , రాజకీయం , స్టాక్ మార్కెట్ అన్నీ బిజినెస్ లే జర్నలిస్ట్ జ్ఞాపకాలు 111

సత్యం పాతాళం నుంచి ఆకాశాన్ని తాకింది . డిపాజిట్ దక్కని పార్టీ అధికారంలోకి వస్తుంది . జీవితం , రాజకీయం , స్టాక్ మార్కెట్ అన్నీ బిజినెస్ లే జర్నలిస్ట్ జ్ఞాపకాలు 111 జనవరి 2009 టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లోకి వెళుతుంటే ఓ యువకుడు ఫోన్ లో సత్యం షేర్లు లక్ష కొన్నాను -అని గట్టిగా చెబుతున్నాడు . అప్పటివరకు దాదాపు ఐదు వందల రూపాయలు ఉన్న సత్యం 2009 లో స్కామ్ భయటపడగానే తగ్గుతూ పది రూపాయలకు వచ్చింది . ఆ సమయంలో ముందు చూపు ఉండి ధైర్యం చేసిన వారి పంట పండింది . పది లక్షలతో లక్ష షేర్లు కొన్న ఆ యువకుడికి ఇప్పటి ధర ప్రకారం పన్నెండు కోట్ల రూపాయల ఆస్తి . సత్యం ను టెక్ మహేంద్ర విలీనం చేసుకున్న తరువాత ఆ స్టాక్ దశ తిరిగింది . పార్ల మెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మంగళవారం స్టాక్ మార్కెట్ ఘోరంగా పడిపోవడం, ఆంధ్రాలో టీడీపీ జనసేన విజయంతో పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. అసెంబ్లీ సమావేశాల అజెండాలో సభా కార్యక్రమాలను బిజినెస్ అని రాస్తారు . ఆ మాట నాకు బాగా నచ్చుతుంది . జీవితం , రాజకీయం , స్టాక్ మార్కెట్ అన్నీ బిజినెస్ లే . పగలు , రాత్రి ఉన్నట్టే బిజినెస్ అన్నాక బాగా నడిచే రోజులు ఉంటాయి . దెబ్బ తినే రోజులు ఉంటాయి . మన జీవితం లో ఎగుడు దిగుడులు ఉన్నట్టే స్టాక్ మార్కెట్ , రాజకీయాల్లో ఎగుడు దిగుడు ఉంటాయి . తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక ఉప ఎన్నికల్లో ఆంధ్ర , తెలంగాణల్లో టీడీపీ డిపాజిట్లు కోల్పోయింది . అలాంటి టీడీపీ 2014లో ఆంధ్రాలో అధికారంలోకి వచ్చింది . ఉద్యమ కాలంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అసలు పోటీ కూడా చేయని తెరాస హైదరాబాద్ చరిత్రలోనే తొలిసారి 99 సీట్లు గెలిచింది . ఐదేళ్ల పాలన తరువాత ఆంధ్రాలో 23 సీట్లకు పరిమితం అయిన టీడీపీ , ఇప్పుడు వైయస్ ఆర్ కాంగ్రెస్ ను 11 సీట్లకు మరిమితం చేసింది . రెండు చోట్ల ఓడిపోయిన పవన్ ఇప్పుడు 21 స్థానాల్లో జనసేన పోటీ చేసి 21 చోట్ల గెలిచింది . వంద శాతం విజయం ఇదో రికార్డ్ . చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టి ఓడిపోయినప్పుడు ఏం చేద్దాం అని అభిప్రాయాలు సేకరిస్తూ టీడీపీలో ఉన్నప్పుడు బాగా పరిచయం ఉన్న ఎ యం . రాధాకృష్ణ ఫోన్ చేసి చిరంజీవి అడుగుతున్నారు ఏం చేస్తే బాగుంటుంది అని అడిగారు . రాజకీయం వేరు , సినిమాల్లో హీరోలు వేరు . అన్నీ సమకూర్చాక హీరో వచ్చి నటిస్తాడు . రాజకీయం అలా కాదు చాలా ఓపిక ఉండాలి . వచ్చే ఐదేళ్ల వరకు పార్టీని నిలబెట్టి ఉద్యమాలు చేయగలరు అనుకొంటే ఒకే . అంత ఓపిక లేదు అనుకొంటే కాంగ్రెస్ లో విలీనం అయితే రాజ్యసభ , మంత్రి పదవి తో కాలక్షేపం చేయవచ్చు అని న అభిప్రాయం చెప్పాను . ప్రజారాజ్యం నుంచి గెలిచిన శాసన సభ్యులు చిరంజీవిని కలిసి కాంగ్రెస్ లో కలిసి పోతున్నాం మీరు వస్తే మీ నాయకత్వంలో కలుస్తాం , లేదంటే మేమే కలిసి పోతాం అని చెప్పడంతో చిరంజీవి కాంగ్రెస్ లో కలిసిపోయారు . ఎన్టీఆర్ ను దించేసే సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు వర్గం శాసన సభ్యులు సైతం సరిగ్గా ఇదే డైలాగు వినిపించారు . సినిమా నటులు రాజకీయ పార్టీలను నడపడం అంత ఈజీ కాదు . పవన్ కళ్యాణ్ పార్టీకి 21 సీట్లు వచ్చినా నా అభిప్రాయం అదే . చంద్రబాబు వంద శాతం రాజకీయ నాయకుడు . పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కాదు . యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో మాత్రమే . ఈ విషయం కాలమే చెబుతుంది . చంద్రబాబు రాజకీయం ముందు విశ్వ విఖ్యాత నట సార్వభౌముడే నిలువ లేక పోయారు . పడిపోయిన స్టాక్ మళ్ళీ లేస్తుంది . పాతాళంలోకి వెళ్లిన సత్యం ఆకాశంలోకి దూసుకువెళ్లింది . ఆకాశంలోకి వెళ్లిన స్టాక్ పడిపోనూ పోవచ్చు . ఈ పోస్ట్ రాసేప్పుడు స్టాక్ మార్కెట్ ఇండెక్స్ చూస్తే నా ఫోర్ట్ పోలియో ఈ రోజు మూడు శాతం మైనస్ లో ఉంది . కొంత పోస్ట్ రాసి ఇప్పుడు మళ్ళీ చూస్తే మూడు శాతం మైనస్ కవర్ కావడంతో పాటు అరశాతం ప్లస్ లోకి వచ్చింది . 1990 ప్రాంతంలో స్టాక్ మార్కెట్ గురించి తెగ చదివే అలవాటు ఉండేది . ఆంధ్ర ప్రభ దినపత్రికలో ఆదివారం స్టాక్స్ రికమండేషన్స్ వచ్చేవి . యునిటెక్ అనే ఓ స్టాక్ 40 రూపాయలు ఉండేది . ఎందుకో అది బాగా గుర్తుండి పోయింది . ఈ మధ్య మిత్రులతో చర్చిస్తూ ఆ స్టాక్ ప్రస్తావన వచ్చింది . మూడున్నర దశాబ్దాల తరువాత ఆ స్టాక్ ఎక్కడుందో చూద్దాం అని గూగుల్ లో సెర్చ్ చేస్తే తొమ్మిది రూపాయల వద్ద కనిపించింది . 500 కూడా ఆ స్టాక్ కాలం కాటేయడంతో మూడున్నర దశాబ్దాల తరువాత 9 రూపాయల వద్ద తచ్చాడుతోంది .. ఆంధ్రాలో కాంగ్రెస్ లా .. ఆంధ్ర పప్పు అని గెలిచేసిన లోకేష్ ఘన విజయం సాధించారు . జాతీయ స్థాయిలో బీజేపీ సోషల్ మీడియా దశాబ్దన్నర కాలం నుంచి జాతీయ స్థాయిలో పప్పు అని రాహుల్ గాంధీని గేలి చేసింది . అదే పప్పు తనను తాను దేవుడిని అని ప్రచారం చేసుకున్న మోడీకి చుక్కలు చూపించారు . వచ్చే ఎన్నికలకు దేవుడికి విశ్రాంతి ఇచ్చి రాహుల్ గాంధీ ప్రధాని కావచ్చు కూడా . తాను చీదరించుకున్న చంద్రబాబు , నితీష్ కుమార్ ల మధ్దతుతో ఇప్పుడు దేవుడు ప్రజలను పాలించబోతున్నారు . తెరాస లో ఒక సాధారణ చోటా నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి . ఒకప్పుడు మూడు రూపాయలు ఉన్న బజాజ్ ఫైనాన్స్ స్టాక్ ఇప్పుడు తొమ్మిది వేల రూపాయలను దాటి పది వేల రూపాయల వైపు పరుగులు తీస్తోంది . నిన్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు అన్ని స్టాక్స్ దాదాపు 20 శాతం వరకు పడిపోతే , చంద్రబాబు కు చెందిన హెరిటేజ్ 5 శాతం పెరిగింది . కాలం కలిసి వస్తే అంతే . రాజకీయాల్లో అయినా , స్టాక్ మార్కెట్లో అయినా ఓపిక ఉన్నవారికే ఫలాలు అందుతాయి . కరోనా సమయంలో నాగార్జున కంస్ట్రక్షన్ స్టాక్ 17 రూపాయలు , ఇప్పుడు 280 . 17 రూపాయలప్పుడు ఓపిక వహిస్తే 280 అవుతుంది . 23 సీట్లు వచ్చినప్పుడు ఓపిక వహించిన నాయుడుకి 135 వచ్చాయి . జూదగాళ్ళకు నిమిషంలో ఫలితం తేలవచ్చు . లాంగ్ టైం ఇన్వెస్టర్లు లాభాల పంట చూడాలి అంటే దీర్ఘకాలిక ఓపిక , సహనం అవసరం . జీవితం , రాజకీయం , స్టాక్ మార్కెట్ అన్నీ వ్యాపారాలే . ఏ వ్యాపారం కైనా ఓపిక అవసరం . సబర్ కా ఫల్ మీటా హోతా హై అంటారు . గీతలో కృష్ణుడు చెప్పినట్టు నీ పని నువ్వు చెయ్ ఫలితం ఆశించకు . ఫలితం అదే వస్తుంది . స్టాక్ మార్కెట్ లో నైనా రాజకీయ మార్కెట్ లో నైనా .. - - - బుద్దా మురళి

21, మే 2024, మంగళవారం

అతని జోస్యం 33 ఏళ్లకు ఫలించింది - నా జోస్యం కూడా--జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 110

జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 110అతని జోస్యం 33 ఏళ్లకు ఫలించింది - నా జోస్యం కూడా -----------------మీడియాకు సంబంధించి కొన్ని ప్రపంచ రికార్డులు ఉన్నా ఎవరూ, ఎక్కడా నమోదు చేయడం లేదు . జర్నలిస్ట్ యూనియన్ కు నాయకత్వం వహించేవారు . మీడియా లో కార్మిక సంఘాలకు నాయకత్వం వహించేవారు , చివరకు సిఇఓలు ఐదారు దశాబ్దాల పాటు కొనసాగి రికార్డ్  సృష్టిస్తున్నారు కానీ అవి నమోద కావడం లేదు . నైజాం కాలం నుంచి అప్రతిహతంగా లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ఇంగ్లీష్ దినపత్రిక గా      డక్కన్ క్రానికల్ ది ఎవరూ అధిగమించలేని రికార్డ్ . ఈ పత్రిక కార్మిక   సంఘానికి 57 ఏళ్ళ నుంచి సంజీవరెడ్డి అధ్యక్షునిగా  కొనసాగడం ఇంకో  రికార్డ్ అయితే  సిఇఓ 50 ఏళ్ళ పాటు కొనసాగడం మరో రికార్డ్ . జలగం వెంగళ రావు  సీఎం కావడం కన్నా ముందు నుంచి మిమ్ములను చూస్తున్నాను . ఎంతో మంది సీఎంలు మారారు . మీరు మాత్రం ఇంకా యూనియన్ నాయకులుగా అలానే ఉన్నారు ? ఇది ఎలా సాధ్యం అని వై యస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు యూనియన్ నాయకులను ఓ సారి బహిరంగంగానే సరదాగా ప్రశ్నించారు . వైయస్ ఆర్ జమానా పోయి జగన్ జమానా వచ్చినా వారే నాయకులు . డక్కన్ క్రానికల్ లో ఇంతకన్నా సీనియర్లు ఉన్నారు . 94 ఏళ్ళ సంజీవరెడ్డి గత 56 ఏళ్ళ నుంచి డక్కన్  క్రానికల్ కార్మిక సంఘం అధ్యక్షులు . థామస్ అని క్రానికల్ గ్రూప్ కు సిఇఓ ఉండేవారు . 20 ఏళ్ళ వయసులో ఉద్యోగంలో చేరి 50 ఏళ్ళు గడిచాక 70 ఏళ్ళ వయసులో తనంతట తానే రాజీనామా చేసి వెళ్లిపోయారు . ఒక ఉద్యోగి 50 ఏళ్ళు కొనసాగి ఇక చాలు అని వెళ్లడం ఆడో రికార్డ్ . ****అవి టైమ్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభిస్తున్న సమయం . జాతీయ పత్రిక . సహజంగా పోటీ అని టెన్షన్ ఉంటుంది . అప్పుడు ఆంధ్రభూమికి పతంజలి సంపాదకులు . అందరూ ఏమవుతుందా ? అని కంగారు పడుతుంటే పతంజలి నింపాదిగా డక్కన్ క్రానికల్ ను వెంకట్రామ్ రెడ్డి ( యజమాని ) నే ఏమీ చేయలేక పోయారు . టైమ్స్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది .  ఏమైనా చేస్తే వెంకట్రామ్ రెడ్డి చేసేవారు ఆయనే ఏం చేయలేక పోయారు అంటే డిసి ని ఎవరూ ఏమీ చేయలేరు .  ఏమీ కాదు అని భరోసా ఇచ్చారు . అంతకు ముందు రామోజీరావు ఎంతో ఇష్టంగా ప్రారంభించిన న్యూస్ టైం సైతం డిసి ముందు నిలువ లేక పోయింది .  పతంజలి జోస్యం నిజమైంది . టైమ్స్ ఆఫ్ ఇండియనే కాదు ఆ తరువాత వచ్చిన బ్యాంకు లోన్ సంక్షోభం సైతం డిసి ని ఏమీ చేయలేదు . లార్జెస్ట్ సర్క్యులేటెడ్ అనే కిరీటం అలానే ఉంది . ***** జొన్నలగడ్డ రాధాకృష్ణ సహకారంతో 1987లో నేను ఆంధ్రభూమిలో స్టాఫ్ రిపోర్టర్ గా చేరి సిఇఓ థామస్ వద్దకు వెళితే అయన ఎందుకు చేరారు ? ఆంధ్రభూమి మూసేస్తారు అని  పలికారు . మన నోటి నుంచి ఎప్పుడూ వ్యతిరేక మాటలు రావద్దు అని పైన తధాస్తు దేవతలు ఉంటారు అంటారు పెద్దలు .  ఏ ముహూర్తంలో అయన ఆ మాట అన్నారో కానీ ఆ జోస్యం 33 ఏళ్ళ తరువాత నిజం అయింది . కరోనా కాలంలో మూసేశారు .  ఆంధ్రభూమి మూసేస్తారు అనేది థామస్ కు ఒక ఊత పదం . ఎప్పుడు మాట్లాడినా అదే మాట అనేవారు . అదేదో సామెత చెప్పినట్టు యజమానికే తన సొంత పేపర్ పై  ప్రేమ లేనప్పుడు సిఇఓ కు ఎందుకు ఉంటుంది . థామస్ జోస్యం చెప్పినట్టూ వారి గురించి నేనూ ఓ జోస్యం చెప్పాను . 87లో రిపోర్టర్ లకు ఇప్పటిలా  పెద్దగా సౌకర్యాలు ఉండేవి కావు . వార్తలు పేపర్ పై రాసి జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులో  హైదరాబాద్ కు పంపించాలి . వార్తలు రాయడానికి అవసరం ఐన వైట్ పేపర్ కోసం నేను బిల్లు పెడితే థామస్ అది చూసి ఇదేంటి అని అడిగి తనతో పాటు నన్ను గోదాం లోకి తీసుకువెళ్లి కొద్ది సేపు కనిపించకుండా  మాయం అయి ఒక పెద్ద  పేపర్ బండిల్ తెచ్చి ఇచ్చారు . ఏదో ఒక రోజు ఇతను ఈ పత్రికకు ఓనర్ అవుతాడు అనుకున్నాను . కొత్త ఉద్యోగిని కాబట్టి పైకి అనలేదు తోటి జర్నలిస్టులతో అన్నాను . ఓనర్ కాలేదు కానీ విన్న దాని ప్రకారం  ఓనర్ కన్నా మంచి స్థితిలో ఉన్నారు అని విన్నాను . బ్యాంకులకు వేల కోట్ల రూపాయల అప్పు చెల్లించలేక చేతులు ఎత్తేసిన తరువాత యజమాని జైలుకు వెళ్లగా 2018లో థామస్ 50 ఏళ్ళ సుదీర్ఘ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు . థామస్ కేరళలో మరణించారు అనే వార్త చూశాక కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి . ****నేను ఎడిటర్ మనిషిని అని మిగిలిన వారిని బెదిరిస్తున్నాను అని ఓ మిత్రుడు తప్పుడు ఫిర్యాదు చేయడంతో థామస్ ఓ సారి పిలిచి ఎడిటర్ శాస్త్రి , నేను , నువ్వు ఇక్కడ అందరం కూలీలమే . ఒకరు పెద్ద కూలీ ఇంకొకరు చిన్న కూలి అంతే తప్ప అందరం కూలీలమే అని చెప్పారు . ఈ విషయం నాకూ తెలుసు , నేను ఇక్కడ మనుషుల కన్నా నా  ఉద్యోగానికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను , ఎందుకంటే నాకు ఇంకో ఆదాయం ఏదీ లేదు అని చెప్పాను . నిజానికి థామస్ చెప్పింది చాలా ప్రాక్టికల్ మాట. చాలా మంది తాము సంస్థలో  విడదీయరాని భాగం అనుకుంటారు . ఉద్యోగం ఊడబీకి రోడ్డున పడేసిన తర్వాత కానీ తాము కూలీలం అని అర్థం కాదు . యజమాని , సిఇఓ , ఎడిటర్ ఎవరి వ్యవహారం వారిదే ఒకరి జోలికి ఇంకొకరు వెళ్లకుండా ఎవరికి కావలసింది వారు చక్కబెట్టుకున్నారేమో అనిపిస్తోంది . ఏ ముహూర్త బలంలో డిసి బయటకు వచ్చిందో కానీ ... ముహూర్త బలం లేకపోతే ఇంతకాలం ఉండేది కాదు అనిపిస్తుంది . అద్భుతమైన సంస్థ ఎలా దెబ్బ తింటుందో స్టడీ చేస్తే ఎంబీఏ డిగ్రీని మించిన ప్రాక్టికల్  జ్ఞానం లభిస్తుంది . - బుద్దా మురళి (21-5-2024)

18, ఏప్రిల్ 2024, గురువారం

ఎన్నికల్లో పండని అలిపిరి సానుభూతి పంట జర్నలిస్ట్ జ్ఞాపకాలు -109

ఎన్నికల్లో పండని అలిపిరి సానుభూతి పంట జర్నలిస్ట్ జ్ఞాపకాలు -109 ------------------------------------------------------- అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం నక్సలైట్లకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు మంత్రి గా ఉన్న మణికుమారి భర్తను నక్సలైట్లు హత్య చేశారు . భర్త ను నక్సల్స్ హత్య చేసినప్పుడు ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆమె సానుభూతి పవనాల ప్రభావం తో ఘన విజయం సాధించి ఉండాలి . గెలుపు మాట దేవుడెరుగు రెండవ స్థానం కూడా రాలేదు . నాలుగవ స్థానంలో నిలిచారు . ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై రాయితో దాడి జరగగానే అది సానుభూతి కోసం ఆడిన డ్రామా అని టీడీపీ వర్గం , ఇది బాబు జరిపిన కుట్ర అంటూ వై యస్ ఆర్ వర్గం పరస్పరం మాటల దాడులు జరుపుకుంటున్నారు . రాజకీయ సానుభూతి ఆరోపణల తో ఉమ్మడి రాష్ట్రంలో అతి పెద్ద సానుభూతి రాజకీయ ఎత్తుగడలు గుర్తుకు వచ్చాయి . 1999 ఎన్నికల్లో వాజ్ పాయి ఒక్క ఓటు తో ఓడిపోవడం ఆ సానుభూతి , గురిచూసి కొట్టినట్టు బాబు అదే సమయంలో బీజేపీతో జతకట్టి స్వల్ప తేడాతో తిరిగి అధికారంలోకి వచ్చారు . వరుసగా నాలుగేళ్ళ కరువు , తెలంగాణ ఉద్యమం , విద్యుత్ ఉద్యమం తో ఈ సారి బాబు ఓటమి ఖాయం అనే అభిప్రాయం బలంగా ఏర్పడింది . ఆ సమయంలో తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు వెళుతుండగా నక్సల్స్ బాబు కారు ను బాంబులతో పేల్చేశారు . బాబుతో పాటు , గోపాల కృష్ణారెడ్డికి తీవ్ర గాయాలు , బట్టలు రక్తసిక్తం అయ్యాయి . బాబు ఇంటికి వచ్చాక రాజకీయం మొదలైంది . సానుభూతి పవనాలతో విజయం సాధించడం ఖాయం అనే ఆలోచనతో ముందస్తు ఎన్నికలకు సిద్ధం అయ్యారు . మొదట జ్యోతిలో ముందస్తు ఎన్నికలకు అని రాయించారు . అలిపిరి సంఘటన తరువాత బాబు మీడియాతో మాట్లాడలేదు . ఈ వార్త వచ్చిన రెండు రోజులకు ముఖ్యమంత్రి చీఫ్ పిఆర్ ఓ విజయ కుమార్ నుంచి ఫోన్ ... బాబు మీడియాతో మాట్లాడుతారు , ఐతే మీరెవ్వరు ఏమీ అడగవద్దు .. బాబు చెప్పింది విని వెళ్ళాలి ఆ షరతుకు ఒప్పుకుంటే రావాలి అని పిలుపు .. సరే అని మీడియా వెళితే చేతికి కట్టుకట్టుకొని ఉన్న బాబు గంటకు పైగా ఉపన్యాసం . ఐదేళ్ల కాలం లో తాను ఎలా అభివృద్ధి చేసింది , తిరిగి తానే ఎందుకు సీఎం కావాలో చెప్పుకుపోయారు . అచ్చం ఎన్నికల ప్రచారంలో ఉపన్యాసం లానే సాగింది . ఏమీ అడగవద్దు అనే షరతు వల్ల ఎవరూ ఏమీ అడగకుండానే బయటకు వచ్చారు . బాబు మనోగతం అంటూ ఏమన్నా రాయించదలుచుకుంటే జ్యోతి లేదా ఈనాడు , ఒక్కోసారి రెండింటికి చెబుతారు . ముందస్తు అని జ్యోతిలో రావడంతో ఈనాడు మిత్రుడికి అది నమ్మబుద్ది కాలేదు . బాబు ఉపన్యాసం వింటే ఎన్నికల ఉపన్యాసంలానే ఉంది . సానుభూతిపై ఆశలు పెట్టుకొని ముందస్తుకు వెళతారు అనే అనిపిస్తోంది అని బయటకు వచ్చాక జరిగిన చర్చలో నా అభిప్రాయం చెప్పాను . అప్పటి నుంచి బాబు ఇంటి వద్ద సానుభూతి రాజకీయాలు ఉదృతం అయ్యాయి . తొలుత మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తమ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులను బాబు నివాసానికి తీసుకువచ్చి బాబు అంకుల్ మీరు త్వరగా కోలుకోవాలి అని గులాబీ పూలు ఇవ్వడం .. మీడియాలో దీనికి మంచి కవరేజ్ వచ్చింది . స్కూల్ పిల్లల తరువాత అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా పరామర్శ యాత్రలు నిర్వహించారు . అంటే ఏ అసెంబ్లీ నియోజక వర్గం క్యాడర్ , నాయకులు ఏ రోజు రావాలో ముందుగానే సమాచారం ఇస్తే ఆ రోజు వచ్చే వాళ్ళు . చెప్పకుండానే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు . సానుభూతి పై టీడీపీ చాలా ఆశలు పెట్టుకొంది . ఐతే బయట ప్రజల్లో మాత్రం ఈ ప్రభావం ఏమీ లేదు . కృత్రిమ వర్షాలు కురిపించినట్టు , కృత్రిమ సానుభూతి పవనాలు కురిపించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శలు చేసింది . ముందు బాబు కుడి చేతికి కట్టు ఉండేది , తరువాత దాన్ని ఎడమ చేతికి మార్చుకున్నారు అని కే . రోశయ్య చేసిన విమర్శ దుమారం లేపింది . బాబు కారు కింద నక్సల్స్ బాంబులు పేల్చింది , గాయాలు తగిలింది అంతా నిజమే . కానీ అప్పుడు బాబు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వల్ల బాంబు దాడి అంతా డ్రామా నెమో అని భావించిన వారు , ప్రచారం చేసిన వారు కూడా ఉన్నారు . ఎన్నికల ఫలితాల వరకు అవసరం లేదు .. దడి జరిగినప్పుడే సానుభూతి పని చేయడం లేదు అని తెలిపే సంఘటన ఒకటి ... శంకర్ రెడ్డి అని తిరుపతిలో టీడీపీ నాయకులు ( అప్పటి మున్సిపల్ ఛైర్మెన్ ), చదువుకునే రోజుల నుంచి బాబు మిత్రుడు . అతనే ఓ సారి టీడీపీ కార్యాలయంలో చెప్పిన విషయం. బాంబు దాడిలో బాబు దుస్తులు రక్తంతో తడిచిపోయాయి . దాడి తరువాత తిరుపతిలో షాప్స్ మొత్తం బంద్ చేస్తారని షట్టర్ తెరిచి బట్టలు తేగలడు అని శంకర్ రెడ్డిని పంపితే , షాప్స్ అన్నీ తెరిచే ఉన్నాయట . ఒక్క షాప్ కూడా మూయలేదు . సానుభూతి పై బోలెడు ఆశలు పెట్టుకున్నా ఆ ఎన్నికల్లో సానుభూతి పని చేయలేదు . టీడీపీ చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా కేవలం 47 సీట్లు మాత్రమే వచ్చాయి . మంత్రి మణికుమారి భర్తను నక్సల్స్ హత్య చేస్తే ఆ ఎన్నికల్లో ఆమెకు డిపాజిట్ కూడా రాలేదు . **** కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సభలో శాంతిభద్రతల గురించి సీరియస్ చర్చ . తెరాస నుంచి గెలిచి, కాంగ్రెస్ లో చేరిన మందాడి సత్యనారాయణ తో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడించారు . శాంతి భద్రతల వైఫల్యం అంటూ బాబు ఆవేశంగా మాట్లాడితే .. ముడ్డి కింద బాంబు పిలిస్తే దిక్కులేదు .. శాంతిభద్రతల గురించి మీరా మాట్లాడేది అంటూ మందాడి దాడి చేశారు . *** అలిపిరి బాంబు దాడి , కోడి కత్తి , తాజాగా జగన్ పై రాయితో దాడి అన్నీ నిజమే .ఏ పార్టీ నాయకులైన రాజకీయాల్లో ఉండేవాళ్ళు మహా ముదుర్లు . యూ ట్యూబర్ల అంత చిల్లర ఆలోచనల్లో ఉండరు . తమ మీద తామే దాడి జరుపుకొని , సానుభూతి వస్తుంది అనుకునేంత అమాయకులు కాదు . . ఓటర్లు అనేక కోణాల్లో అలోచించి ఏ పార్టీకి ఓటు వేయాలో నిర్ణయించుకుంటారు . సహజంగా రెండు పక్షాలు ఈ అంశంపై తమ తమ రాజకీయ కోణం నుంచి మాట్లాడుతుంటారు . ఐతే అలిపిరి దాడి సమయంలో వై యస్ రాజశేఖర్ రెడ్డి తెలివిగా వ్యవహరించారు . బాంబు దాడి జరిగిన సమయంలో ఆంధ్రాలోనే ఉన్న రాజశేఖర్ రెడ్డి వెంటనే రోడ్డు మీద బైటయింది ధర్నా చేశారు . దాడిని ఖండిస్తున్నట్టు , దోషులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు . టీడీపీ వాళ్ళు తేరుకోక ముందే కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్నా చేయడం ప్రత్యేకంగా నిలిచింది. - బుద్దా మురళి .

21, ఫిబ్రవరి 2024, బుధవారం

అయోధ్య , కాశ్మీర్ , తెలంగాణ కన్నాకష్టం జర్నలిస్ట్ ల" ఇంటి "సమస్య ... ఓ జర్నలిస్ట్ ఇంటి స్థలం కథ @ 1987 జర్నలిస్ట్  జ్ఞాపకాలు 108

అయోధ్య , కాశ్మీర్ , తెలంగాణ కన్నాకష్టం జర్నలిస్ట్ ల" ఇంటి "సమస్య   ఓ జర్నలిస్ట్ ఇంటి స్థలం కథ @ 1987 జర్నలిస్ట్  జ్ఞాపకాలు 108 ---------------------------------------కొన్ని దశాబ్దాల క్రితం జర్నలిస్ట్ ల మధ్య చర్చలో  అయోధ్య - బాబ్రీ మసీదు , కాశ్మీర్ , తెలంగాణ ఈ మూడు ఎప్పటికీ పరిష్కారం లేని సమస్యలు అనే అభిప్రాయం  వినిపించేది .   అసలు పరిష్కారమే లేదు  అనుకొన్న ఈ మూడు సమస్యలకు కూడా మన కళ్ళ ముందే పరిష్కారం లభించింది . కానీ  మహానగరంలో జర్నలిస్ట్ ల ఇంటి స్థలం సమస్య మాత్రం ఈ మూడు సమస్యలకన్నా జటిలంగా మారింది . ప్రతి మనిషికి సొంత ఇల్లు ఉండాలి అనే ఓ కల బలంగా ఉంటుంది .  హౌసింగ్  సొసైటీ లో తనకూ ఓ ప్లాట్ దక్కాలి అని జర్నలిస్ట్ గా అక్షరాబ్యాసం చేసినప్పుడే జర్నలిస్ట్ మనసులో బలంగా ఉంటుంది .  *********1987 సెప్టెంబర్ నెలలో ఆంధ్రభూమి కార్యాలయంలో అపాయింట్ మెంట్ లెటర్ తీసుకోని నిలబడ్డాను . హైదరాబాద్ వీడి వెళుతున్నానని బాధ . ఉద్యోగం వచ్చింది అని సంతోషం .  అప్పుడు ఆంధ్రభూమి న్యూస్ ఎడిటర్ గా ఉన్న  రాధాకృష్ణ ఒకే జిల్లా కాదు , కులం కాదు ... నా రాతలంటే బోలెడు అభిమానం . ఎలాగైనా జీవితంలో బాగుపడేట్టు చేయాలి అనుకోని లెటర్ ఇస్తూ" మెదక్ జిల్లా రిపోర్టర్ గా వెళ్ళు ..  అక్కడ జర్నలిస్ట్ ల హౌసింగ్  సొసైటీ ఉంటుంది . వెళ్ళగానే ముందు ఆ సొసైటీ లో సభ్యత్వం తీసుకో ..... నేను విశాఖలో ఉండగా  జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఏర్పాట్లు అన్నీ పూర్తి అయి రెండు రోజుల్లో ఇస్తారు  అనగా నేను కలెక్టర్ మీద ఓ వార్త రాశాను . దానితో కలెక్టర్ కు మండింది . అన్నీ రద్దు చేశాడు . అందరూ దెబ్బ తిన్నారు" అంటూ తన విషాద భరిత ఇంటి స్థలం కథ చెప్పుకొచ్చారు . తనదే కాదు  ఇది చాలా మంది  అంతులేని కథ అని ఆ రోజు రాధాకృష్ణ ఉహించి ఉండరు . మెదక్ జిల్లా రిపోర్టర్ గా సంగారెడ్డిలో ఉన్నప్పుడు ఆంధ్రప్రభ నుంచి వారానికి ఓ రిపోర్టర్ హైదరాబాద్ నుంచి సంగారెడ్డి  వచ్చేవారు .1988-89 లో  ఓ వారం  అంజయ్య  వచ్చినప్పుడు హైదరాబాద్ లో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యత్వం తీసుకో అని సలహా ఇస్తే ... నేను పని చేసేది మెదక్ జిల్లాలో హైదరాబాద్ లో ఎలా తీసుకుంటా అని ప్రశ్నించా ... నీకెందుకు  నేను చెబుతున్నాను కదా ? అని చెప్పినా వినలేదు . ఓ దశాబ్ద కాలం గడిచాక 95లో  ప్రెస్ క్లబ్ లో మద్య నిషేధం తక్షణం ఎత్తివేయాలి అంటూ అప్పటి సీఎం బాబు సమక్షంలో జర్నలిస్ట్ యూనియన్ సమావేశం . బాబు తలుచుకుంటే మల్లాది సుబ్బమ్మ తో సీకులు అమ్మించగలరు . అయన కోసం మనం డిమాండ్ చేయడం ఏమిటీ అని ఆవేశంగా మాట్లాడి కిందకు వచ్చాక ... ప్రెస్ క్లబ్ తో పాటు , హౌసింగ్ సొసైటీ వ్యవహారాలు చూసే ఉద్యోగి ఒకరు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి తనను తాను పరిచయం చేసుకొని , మీకు హౌసింగ్ సొసైటీలో సభ్యత్వం ఉందా ? అని అడిగితే ఎప్పుడంటే అప్పుడు ఇవ్వరు కదా ? అని బదులిచ్చాను . ఇదిగో ఫారం నింపి ఇవ్వండి అని అక్కడి కక్కడే సొరుగు  నుంచి ఫారం తీసి ఇచ్చాడు . అలా 95లో సభ్యత్వం . గోపన్ పల్లిలో సందడిగా సభ్యుల సమావేశం ప్లాట్ ల కేటాయింపు కుటుంబ సమేతంగా సభ్యులు వచ్చారు . ఇప్పటి వరకు మన సొసైటీలో రాష్ట్రంలో ఎక్కడ పని చేసేవారైనా సభ్యత్వం తీసుకోవచ్చు అనే నిబంధన ఉంది , దీనిని సవరించి హైదరాబాద్ లో పని చేసేవారికే సభ్యత్వం అనే నిబంధన పెడదాం జనరల్ బాడీ ఆమోదిస్తే , అని చదివి చప్పట్లతో ఆమెదించిన తరువాత కానీ ... ఇలాంటి నిబంధన ఒకటి ఉందని తెలియలేదు .   ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడెక్కడో పని చేసిన వారు హైదరాబాద్ లో  సభ్యత్వం పొందింది ఈ నిబంధన వల్లే .  దీనిని ఎత్తివేసిన తరువాత కానీ నాలాంటి వారికి తెలియలేదు . 95 నుంచి వెయిటింగ్ లిస్ట్ కే పరిమితం .అంటే ఆశగా మా అన్నది ఇంతకన్నా విషాదం .  కరీం నగర్ లో ఈనాడు ఎడిషన్ పెట్టినప్పుడు హైదరాబాద్ నుంచి కొందరిని అక్కడకు బదిలీ చేశారు . అప్పుడు సొసైటీ అధ్యక్షుడు ఈనాడులోనే ఉన్న రాహుల్ . మీకు బదిలీ అయింది కదా ? మీ సభ్యత్వం వెనక్కి తీసుకోండి అని రాహుల్ సలహా .  ఎక్కడెక్కడి వారికో  విశాల హృదయంతో హైదరాబాద్ లో సభ్యత్వం ఇచ్చిన పెద్దలు హైదరాబాద్ లో పుట్టి , హైదరాబాద్ లోనే జర్నలిస్ట్ గా పని చేస్తున్న వారికి బదిలీ అయింది అని సభ్యత్వం వెనక్కి ఇచ్చారు . నా ఒక్కడికే ఈ నిబంధన ఏమిటీ , మీ వారిసభ్యత్వం ఎందుకు రద్దు చేయరు , ప్లాట్స్ మీ సొంత జాగీరు కాదు కదా ? అని ప్రశ్నించక పోవడం తప్పు . గోపన్ పల్లిలో 9 ఎకరాలు ఉంది , ప్రభుత్వం అది ఇస్తే  వెయిటింగ్ లో ఉన్న అందరికీ ప్లాట్ వస్తుంది అంటే ఆశగా ఎదురు చూపులు . ********2004 ఎన్నికలకు సన్నాహాలు . ఓ రోజు టీడీపీ బీట్ రిపోర్టర్ లు అందరూ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో మాట్లాడుతుంటే ... బాబుగారిని కలిసి మీ సొసైటీకి ల్యాండ్ కేటాయించమని అడగండి   అని సలహా ... ఎప్పుడో అడిగాం , జర్నలిస్ట్ లకు ల్యాండ్ ఇవ్వడం మా పాలసీ కాదు ,  ఇవ్వం అని నిర్మొహమాటంగా చెప్పారు అని  సమాధానం . అప్పటి మాట వదిలేయండి ఇది ఎన్నికల సమయం , ఎవరు ఏది అడిగినా ఇస్తున్నారు అని ఉమ్మారెడ్డి సలహా . గుర్తున్నంత వరకు నేను , అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్న రాముశర్మ , జ్యోతి వాసిరెడ్డి శ్రీనివాస్ , ఈనాడు సీఎస్ ఆర్ , సారధి బాబును కలిసి సొసైటీకి స్థలం అడిగితే ఒకే  అని బదులిచ్చారు .  టీడీపీ  బీట్ రిపోర్టర్ లు బోలెడు ఆనందపడిపోయారు .తరువాత సచివాలయ రిపోర్టర్ లు సంబంధిత అధికారిని కలిస్తే  .. రిపోర్టర్ లు అందరూ వెళ్లి అడిగితే ఏదో బాబు అలా హామీ ఇచ్చారు కానీ , మాకు ఏమీ చెప్పలేదు . మీరు ఆశలు పెట్టుకోకండి అని ఆశల మీద నీళ్లు చల్లారు . ఐతే బాబు ఉట్టుట్టి హామీ ఇచ్చినా ... తరువాత సొసైటీకి ల్యాండ్ కేటాయింపులో ఈ ఉట్టుట్టి హామీ ఎంతో మేలు చేసింది . టీడీపీ బీట్ రిపోర్టర్ లు ఎన్నికల ముందు బాబును కలిస్తే , కాంగ్రెస్ బీట్ రిపోర్టర్ లు గుర్తున్నంత వరకు నేమాని భాస్కర్ , వంశీ ఇతర రిపోర్టర్ లు వై యస్ ఆర్ ను కలిసి ఈ ఎన్నికల్లో బాబు గెలిస్తే సొసైటీకి ల్యాండ్ ఇస్తాను అని హామీ ఇచ్చారు . మీరు గెలిస్తే మీరు ఇవ్వాలి అని ఓ వినతి పత్రం ఇస్తే వైయస్ ఆర్ సరే అని హామీ ఇచ్చారు . జర్నలిస్టులు 9 ఎకరాల గురించి వినతి పత్రం ఇస్తే , అది వదిలేయండి అని వైయస్ ఆర్ అందరు జర్నలిస్టులకు సరిపోయే విధంగా 72 ఎకరాలు కేటాయించారు . *****ఐదేళ్ల సీనియారిటీ వల్ల సభ్యత్వం దక్కని వారు వైయస్ ఆర్ ను కలిస్తే న మాట విని వెళ్ళండి , 2009 లో కూడా నేనే సీఎం అవుతాను , మీ అందరికి కూడా నేనే ఇస్తాను అని చెప్పి పంపారు . ఐనా కొందరు కోర్టుకు వెళ్లడం , హై కోర్ట్ , సుప్రీం కోర్ట్ ల లో రెండు దశాబ్దాల పయనం .  సామాన్యుల సమస్యలు పరిష్కరించడం అంత కష్టం కాదు . చివరకు అయోధ్య , కాశ్మీర్ సమస్య పరిష్కరించడం కూడా అంత కష్టం కాదు . కానీ మేధావుల సమస్య లు పరిష్కరించడం అంత ఈజీ కాదు .మొట్టమొదట కోర్ట్ర కు వెళ్ళింది  జర్నలిస్ట్ లే .. ఒక్క సారి వ్యవహారం  కోర్ట్ కు వెళితే .. తాతలు దిగివస్తారు .  పెళ్లయిన కొత్తలో హౌసింగ్ సొసైటీ లో సభ్యత్వం తీసుకొంటే ..    కోర్ట్ తీర్పు వచ్చేనాటికి  తాత లు అయిన వారు కూడా ఉన్నారు . బాబు మాట తప్పారు , వైయస్ ఆర్ ఇచ్చారు , తరువాత వచ్చిన రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదు . తరువాత ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వ జోక్యం వల్ల, ప్రధాన న్యాయమూర్తి       జస్టీస్ రమణ గారి వల్ల సుప్రీంలో   కేసు కదిలింది . తీర్పు వచ్చింది . సుప్రీం తీర్పు తరువాత నిజాం పేట స్థలం సొసైటీకి అప్పగించిన ప్రభుత్వం . పేట్ బషీర్ బాద్ స్థలం విషయం ఎటూ తేల్చలేదు . మేం అధికారంలోకి రాగానే హైదరాబాద్ ల్యాండ్ సమస్య పరిష్కరిస్తాం అని ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ హామీ . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వందరోజుల్లో హామీ నెరవేరుస్తారు అని  అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు  . ఇంకో నెల రోజుల్లో వంద రోజులు అవుతాయి . అంతులేని కథ రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు మొదలయింది .  సీఎంగా  కథ కు శుభం పడుతుందా ?   అంతులేని కథ ఇంకా సాగుతుందా ? న్యూస్ పేపర్ లో చూడాలి . ******ఉచితంగానా ? కాదు కానే కాదు , 2005-6 లోనే  ఒక్కో జర్నలిస్ట్ రెండేసి లక్షలు చెల్లించి ప్రభుత్వ ధరకు ల్యాండ్ కొన్నారు . అప్పుడు రెండు లక్షలు అంటే యాదగిరిగుట్ట , భువనగిరి ప్రాంతాల్లో ఒకటి రెండు ఎకరాల భూమి కొనవచ్చు .  కొసమెరుపు   : అదే సమయంలో వైయస్ ఆర్ ఐఏఎస్ ,  ఐ పి యస్ ,  శాసన సభ్యులకు ల్యాండ్ కేటాయించారు .  జర్నలిస్ట్ లకు సంబంధించి కనీసం తీర్పు వచ్చింది . వారిది ఇంకా తీర్పు కూడా రాలేదు . ఇది నా ఒక్కడి కథ . ఒక్కొక్కరిది ఒక్కో పుస్తకం రాసేంత గాధ ఉంటుంది . రాస్తూ పోతుంటే అంతులేని కథకు అంతు  ఉండదు . - బుద్దా మురళి 

29, నవంబర్ 2023, బుధవారం

తిక్కవరపు ఇంటికి వెళ్లిన కొత్త పెళ్లి కొడుకు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి .. టీడీపీ అపవిత్రం అయిందన్న బాబు వర్గం .. అలా పుట్టింది ముసలం . జర్నలిస్ట్ జ్ఞాపకాలు -106

తిక్కవరపు ఇంటికి భోజనానికి వెళ్లిన కొత్త పెళ్లి కొడుకు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి టీడీపీ అపవిత్రం అయిందన్న బాబు వర్గం .. అలా పుట్టింది ముసలం జర్నలిస్ట్ జ్ఞాపకాలు -106 ---------------------- 1993-94 ప్రాంతం . ఎన్టీఆర్ రెండవ వివాహం చేసుకున్న కొత్తలో . అప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది . ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి కొత్తగా వివాహం చేసుకున్న ఎన్టీఆర్ దంపతులను తన ఇంటికి భోజనానికి పిలిచారు . ఇప్పుడైతే ఐతే ఏంది ? అనిపిస్తుంది . ఆ రోజులు అలా కాదు . ఎన్టీఆర్ ను గద్దె దించడానికి పార్టీలో పుట్టిన ముసలంలో ఈ భోజనం ఎపిసోడ్ కూడా ఒక ప్రధాన పాత్ర వహించింది . ఎన్టీఆర్ దంపతులు సుబ్బిరామిరెడ్డి ఇంటికి వెళ్ళగానే బాబు వర్గం రంగంలోకి దిగింది . లక్ష్మీ పార్వతి పార్టీని అపవిత్రం చేస్తోంది అనేది ఆ వర్గం ప్రచార సారాంశం . భోజనానికి వెళితే అపవిత్రమా ? అంటే వారి దృష్టిలో అంతే .. వారు అలా భావించడానికి ఓ కారణం ఉంది . హిమాయత్ నగర్ లో పార్టీ కార్యాలయం ఉన్నప్పుడు , తరువాత భవన్ లో టీడీపీ నాయకులతో సరదా సంభాషణల్లో మీ పార్టీ సిద్ధాంతం ఏమిటీ అంటే పలువురు రెండు రూపాయలకు కిలో బియ్యం అని గర్వం గా చెప్పేవారు . రెండు రూపాయలకు కిలో బియ్యం సిద్ధాంతం కాదు ఆదో స్కీమ్ అని గుర్తు చేస్తే ... చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దాదాపు అందరు నాయకులు కాంగ్రెస్ వ్యతిరేకతే మా సిద్ధాంతం అనే వారు . ఒక పార్టీని వ్యతిరేకించడం మరో పార్టీ సిద్ధాంతం ఏమిటో ? ఒక వేళ కాంగ్రెస్ రంగంలో లేకుండా పోతుంది అనుకోండి అప్పుడు మీ పార్టీకి సిద్ధాంతం లేకుండా పోతుంది కదా ? అని చమత్కరించేవాడిని . నిజానికి ఆ కాలం లో కాంగ్రెస్ రంగంలో లేకుండా పోతుంది అనే మాట ఊహకు అందనిది . ఈ మూడు దశాబ్దాల కాలం లో ఆంధ్ర లో కాంగ్రెస్ లేకుండా పోతే , తెలంగాణలో టీడీపీ లేకుండా పోయింది . ***** తిక్కవరపు ఇంటికి ఎన్టీఆర్ దంపతులు భోజనానికి వెళ్ళాక పార్టీలో బాబు వర్గం లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ను కాంగ్రెస్ కు దగ్గర చేస్తోంది అనే గుస గుస ప్రచారం మొదలు పెట్టారు .తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి కాంగ్రెస్ నాయకుడు , రాజ్యసభ సభ్యులు , కేంద్ర మంత్రి అయినా ఆయన పలుకుబడి కాంగ్రెస్ కె పరిమితం కాలేదు . ఉమ్మడి రాష్ట్రంలో ఆ కాలంలో కూడా ఆయన్ని ప్రచార పిచ్చి ఉన్న నాయకుడు అనే చూశారు కానీ ఢిల్లీలో అయన పలుకుబడి ఎలాంటిదో టీడీపీ రాజ్య సభ సభ్యులుగా ఉన్నప్పుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఓ సారి చెప్పారు . ఆయన ఢిల్లీలో పార్టీ ఇస్తే కేంద్రమంత్రులు ,ఆ న్నీ పార్టీల నాయకులు .... బడా బడా అధికారులు , సినిమా హీరోలు, హీరోయిన్ లు వచ్చేవారట . కనులతోనే ఎవరి అవసరం ఏమిటో గ్రహించేసే వారట .. అక్కడి పెద్దలు .. అంతటి సుబ్బిరామిరెడ్డి కంస్ట్రక్షన్ సంస్థ వేల కోట్ల అప్పులతో చేతులు ఎత్తేసింది . దివాళా ప్రక్రియ సాగుతోంది . లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ ను కాంగ్రెస్ కు చేరువ చేస్తోంది అని ప్రచారం ప్రారంభించిన బాబు వర్గం బాస్ బాబే స్వయంగా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారు . ఆ తరువాత లక్ష్మి పార్వతిపై టీడీపీ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం . ఎన్నికలు వచ్చాయి . కాంగ్రెస్కు ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా ఘోరంగా ఓడిపోగా ఎన్టీఆర్ సీఎం అయ్యారు . 95 వెన్నుపోటులో ఎన్టీఆర్ ను దించేసిన తరువాత ఎన్టీఆర్ కాంగ్రెస్ మద్దతు కోసం ప్రయతినించారు అని మళ్ళీ వార్తలు . అప్పుడు ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు జోక్యం చేసుకోక పోవడం ద్వారా పరోక్షంగా బాబుకు సహకరించారు . ఎన్టీఆర్ ను దించేసిన కొద్ది రోజులకే లోక్ సభ ఎన్నికలు వచ్చాయి . లోక్ సభ సీట్లు మీకు , అసెంబ్లీ మాకు .. బాబును దించేయాలి అని ఎన్టీఆర్ కాంగ్రెస్ తో మంతనాలు సాగిస్తున్నారని బాబు మీడియాలో ప్రచారం . బాబు సీఎంగా కుదురుకోవడంతో ఎన్టీఆర్ తెలుగుదేశం అని కొత్త పార్టీ ఏర్పాటు చేసి పోటీకి సిద్ధమయ్యారు కానీ ఎన్నికలు రాకముందే మరణించారు . ఎన్టీఆర్ నిజంగా కాంగ్రెస్ తో చేతులు కలిపారా ? బేరం కోసం ప్రయత్నించారా ? అంటే ఆ మాట చెప్పల్సింది ఎన్టీఆర్ , వార్తలు రాయించిన బాబు ... చెప్పడానికి ఎన్టీఆర్ లేరు . బాబు చెప్పరు . **** సుబ్బిరామిరెడ్డి ఇంటికి ఎన్టీఆర్ దంపతులు భోజనానికి వెళ్లడం ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది అంటే ? ఖమ్మంలో కాంగ్రెస్ నేత ప్రియాంక సభ లో టీడీపీ జెండాలు రెపరెపలడాయి . కాంగ్రెస్ సభల్లో టీడీపీ జెండాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి . ఇదేం కొత్తకాదు 2018 లోనే చెట్టాపట్టాలేసుకొని పోటీ చేశారు కదా ? అంటే నిజమే 2018 లో కాంగ్రెస్ , టీడీపీ రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఉంది . ఈ సారి పొత్తుకాదు ఒక్క సీటు కూడా ఇవ్వకపోయినా కాంగ్రెస్ విజయానికి టీడీపీ పని చేస్తోంది . కాంగ్రెస్ వ్యతిరేకతే మా సిద్ధాంతం అని సగర్వంగా ప్రకటించుకున్న పార్టీ కాంగ్రెస్ కోసం తమ పార్టీని మూసేసుకుంది . ఒక్క సీటు కూడా లేకుండా షర్మిల పార్టీ కాంగ్రెస్ తో జత కట్టింది . ఒక్క సీటు లేకుండా కోదండరాం పార్టీ కాంగ్రెస్ కోసం పని చేస్తోంది . ఆ రెండు పార్టీల దారిలోనే టీడీపీ సైతం కాంగ్రెస్ కోసం పని చేస్తోంది . 2014 కాలం లో బాబు ఏ ఉద్దేశంతో అన్నారో కానీ ఖాళీ చేయడానికి టీడీపీ బీరు సీసా కాదు అన్నారు . ఖాళీ బీరు సీసాకు కూడా కొంత విలువ ఉంటుంది . కానీ బాబు మాత్రం ఉచితంగానే తెలంగాణలో కాంగ్రెస్ కోసం టీడీపీని ఇచ్చేశారు . బాబు గ్రేట్ ---------- సుబ్బిరామిరెడ్డి ఇంటికి భోజనానికి వెళితే పార్టీని అపవిత్రం చేస్తున్నారని ప్రచారం చేసి దాన్ని నమ్మించిన బాబు ఏకంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా , ఉచితంగా కాంగ్రెస్ కోసం పని చేస్తున్నా టీడీపీ శ్రేణులు , నేతలు ఏమంటున్నారు ? అంటే ? ఏమీ అన్నారు బాబు ఏం చేసినా అదే కరెక్ట్ అనుకునేట్టు ట్యూన్ చేయడంలో బాబు విజయం సాధించారు . ప్రజలను ట్యూన్ చేయడంలో బాబు విఫలం అయి ఉండవచ్చు కానీ పార్టీని ట్యూన్ చేయడంలో ఘన విజయం సాధించారు . - బుద్దా మురళి

5, నవంబర్ 2023, ఆదివారం

వార్తల సైజులు పార్టీల గెలుపును నిర్ణయించలేవు ... . మీడియాలో mim , షర్మిల పార్టీ వార్తలు .... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 105

వార్తల సైజులు పార్టీల గెలుపును నిర్ణయించలేవు ... . మీడియాలో mim , షర్మిల పార్టీ వార్తలు జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 105 ......... ....... సాధారణంగా ప్రధాన మీడియాలో ఒక్కో పార్టీ గురించి ఎం సైజులో వార్తలు వస్తే జనంలో ఆ పార్టీకి ఆ సైజుకు తగ్గ ఆదరణ ఉంది అనిపిస్తుంది . వార్తల సైజులను బట్టి ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఎన్ని సీట్లు రావచ్చు అనే అంచనాకు వస్తారు . పాఠకులే కాదు.. రాజకీయ నాయకులు చివరకు జర్నలిస్ట్ లు కూడా ఇదే అంచనాతో ఉంటారు . ఓ ఏడాది క్రితం మీడియా బిజెపికి హైప్ ఇచ్చింది . తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని సూచించే స్థాయిలో ఆ వార్తలు ఉండేవి . మీడియా + రాజకీయ నాయకులు ఐన వి 6 వివేక్ వెంకటస్వామి లాంటి వారు బిజెపిలోకి , బిజెపి నుంచి కాంగ్రెస్ కు ఇలా అనేక పార్టీలు మారింది ఇలాంటి వార్తలు హైప్ వల్లనే . మీడియా కలిగించే ఈ హైప్ లో చివరకు మీడియా కూడా పడిపోతుంది . చిత్రంగా మేధావులపై ఈ హై ప్ ప్రభావం తీవ్రంగా పడి తమ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారు . కానీ ఓటర్లపై ఈ హైప్ ప్రభావం తక్కువే అనేక సందర్భాల్లో తేలింది . తాము సృష్టించిన వార్తలను నమ్మి మీడియా తామే బోల్తా పడుతోంది కానీ జనం పెద్దగా లెక్కేలోకి తీసుకోవడం లేదు . మద్య నిషేధ ఉద్యమ సమయంలో స్పోర్ట్ పేజీ మినహా ఈనాడు మొత్తం మద్య నిషేధ వార్తలతో నిండి పోయేది . ఉమ్మడి రాష్ట్ర జనాభాను మించి రాష్ట్ర జనాభా మద్య నిషేధ ఉద్యమం లో ఉన్నారు అనిపించేది . జోనల్ పేజీ , జిల్లా పేజీ , మెయిన్ పేజీ ఎక్కడ చూసినా జనం తండోపతండాలుగా మద్య నిషేధ ఉద్యమం లో పాల్గొన్నారు అనిపించేది ఈనాడు చదివితే .. అది మీడియా సృష్టించే మాయాజాలం . మద్యానికి వ్యతిరేక ప్రచారం , మద్యం తాగడం వల్ల ఆరోగ్యం ఎలా పాడవుతుందో మీడియా ప్రచారం చేయాలి . దాని వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది . కానీ అక్కడ ఆ ప్రచార ఉద్దేశం ఒక పార్టీని ఓడించి ఒక పార్టీని గెలిపించడం ... నిజానికి నిషేధ సమయంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి మందు తాగడానికి ఉద్యమ స్థాయిలో పొరుగు రాష్ట్రాలకు వెళ్లారు . సరిహద్దుల్లో మద్యం షాప్స్ వెలిశాయి , ఎందరినో సంపన్నులను చేశాయి . ******* ప్రధాన మైన టివి మీడియా , ప్రింట్ మీడియా లో ఎం . ఐ . ఎం పార్టీ వార్తలు అస్సలు కనిపించవు. గత రెండేళ్ల నుంచి షర్మిల పార్టీ వార్తలు కొన్ని మీడియాల్లో ఆమెనే సీఎం అన్నట్టుగా ప్రచారం చేశారు . జగన్ ను వ్యతిరేకిస్తూ , బాబును అభిమానించే మీడియా జగన్ సోదరి పార్టీని ఆకాశానికి ఎత్తారు . చివరకు పోటీ చేస్తే డిపాజిట్ ఎక్కడా రాదు అని తెలిసి ఆమె పోటీ చేయడం లేదు , ఆమె పార్టీ పోటీ చేయడం లేదు . షర్మిల పార్టీకి ఇచ్చిన ప్రచారంలో ఏడు సీట్లు గెలిచే mim కి ఒక్క శాతం ప్రచారం కూడా ఇవ్వలేదు . ఇక్కడ ఉద్దేశం ప్రచారం ఇవ్వళ్ళూ అని కాదు . మీడియాలో లభించే ప్రచార సైజు చూసి పార్టీలను అంచనా వేయవద్దు అని చెప్పడమే . అదే బీజేపీ వార్తలు చూస్తే ఏడాది క్రితం వరకు వాళ్లే అధికారంలోకి వస్తారేమో అన్నంతగా మీడియాలో ప్రాధాన్యత లభించింది . గత ఎన్నికల్లో mim కు ఏడు సీట్లు వస్తే బీజేపీకి వచ్చింది ఒకే ఒక సీటు . కానీ మీడియాలో ఈ రెండు పార్టీలకు వచ్చిన వార్తలను పోలిస్తే అసలు సంబంధమే ఉండదు . ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందే ఏడు స్థానాలు mim కు వదిలేసి మిగిలిన సీట్ల గురించే ఏ పార్టీ ఐనా ఆలోచించాలి . పోలింగ్ కు ముందే ఫలితాలు తేలిపోయే నియోజక వర్గాలు ఇవే . గత ఎన్నికల్లో తెలంగాణ లో మీడియా వార్తల ప్రకారం చూస్తే మహాకూటమి గెలుస్తుంది అని , ఆంధ్ర లో టీడీపీ అని మెజారిటీ మీడియా వార్తలతో హోరెత్తిందించి . తాము గెలవాలి అని కోరుకున్న పార్టీ గెలుస్తుంది అని మీడియా చెబుతోంది కానీ ఎవరు గెలుస్తారో చెప్పడం లేదు . **** 2012-13 సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా లాబీ లో చర్చ . అప్పుడు హైదరాబాద్ లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పని చేసే జర్నలిస్ట్ మిత్రుడు శాస్త్రి ఇక తెలంగాణ ఉద్యమం ముగిసిపోయినట్టే కదా ? అని కవ్విస్తున్నట్టు అడిగాడు . ఉద్యమం ఒక సారి ఉదృతంగా సాగుతుంది .పత్రికల నిండా ఏవ్ వార్తలు ఆ ఉదృతి చూసి వారం లో తెలంగాణ ఇచ్చేస్తారు అనిపిస్తుంది . కొంత కాలం స్థబ్దతగా ఉండేది ఆ సమయంలో మీడియాలో సైతం వార్తలు కనిపించవు . దాంతో తెలంగాణ ఉద్యమం అయిపొయింది అనుకునేవారు . మీడియాలో వచ్చే వార్తల సైజును బట్టి తెలంగాణ పై నువ్వు అంచనాకు వస్తున్నావు . మీడియా లో వార్తల సైజుతో సంబంధం లేదు . తెలంగాణ ఏర్పడేంత వరకు తెలంగాణ అంశం ఉంటుంది అని వార్తల సైజుకు నిర్ణయాలకు సంబంధం ఉండదు అని అని చెప్పాను . సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో మీడియా మొత్తం అవే వార్తలు . ఆంధ్రభూమి ఎడిటర్ శాస్త్రి ఆ ఉద్యమ వార్తలు చూపుతూ ఇప్పటికీ తెలంగాణ వస్తుందా ? అని అడిగితే .. ఆ వార్తల సైజులు మీడియా ఓనర్లను సంతృప్తి పరుస్తాయి నిర్ణయంలో ఎలాంటి ప్రభావం చూపవు వస్తుంది అని చెప్పాను .. ***** 1978 లో విద్యార్థిగా ఉన్నప్పుడు ఎక్కడ చూసినా గోడల మీద జనతా పార్టీ గుర్తు నాగాలిపట్టిన రైతు బొమ్మ ఉండేది . జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేస్తుంది అనుకున్నాను . దేశమంతా వచ్చినా ఆంధ్ర ప్రదేశ్ లో జనతా పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు . ఆ తరువాత చదువు పూర్తయి జర్నలిజంలోకి వచ్చాక మీడియాలో వచ్చే వార్తల సైజుకు జనంలో పార్టీకి వచ్చే ఓట్లకు సంబంధం లేదు అని అర్థమయింది . ఇప్పుడు అన్ని పార్టీలకు మీడియా ఉంది . పక్ష పాతం అనే మాటకు తావు లేకుండా ఏ పార్టీ మీడియా ఆ పార్టీని ఆకాశానికి ఎత్తుతోంది . ఒక పార్టీ మీడియాకే పరిమితం కాకండి అన్ని పార్టీల మీడియా ను చదవండి , చూడండి .. అలానే సొంత కులం వారితోనే కాకుండా అందరితో మాట్లాడండి ఓ నిర్ణయానికి రండి . ఏదో ఒక పార్టీ మీడియా ను ఫాలో అయి ఎన్నికల ఫలితాలపై పందెం వేస్తే దెబ్బ తింటారు . డబ్బులు ఊరికే రావు . - బుద్దా మురళి

3, నవంబర్ 2023, శుక్రవారం

అభ్యర్థుల పేర్లు - పూర్వ విద్యార్థుల సమావేశం నాయకుల జోనల్ పేజీల జీవితాలు.... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 104

అభ్యర్థుల పేర్లు - పూర్వ విద్యార్థుల సమావేశం నాయకుల జోనల్ పేజీల జీవితాలు జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 104 --------------------------------------- రాజకీయ పార్టీ ప్రకటించిన మూడవ జాబితా అని కనిపించగానే యధాలాపంగా చదువుతూ పోతుంటే కొన్ని పేర్లు కనిపించగానే ముఖం సంతోషంగా వికసించింది . హైదరాబాద్ లో మాములు ప్రభుత్వ పాఠశాలల్లో చదువు . పూర్వ విద్యార్థుల సమావేశాలు జరుపుకొంటారు అని తెలియని కాలం లో చదువు . పత్రికల్లో పూర్వ విద్యార్థుల సమావేశాల గురించి చూసినప్పుడు మనకు అలాంటి అవకాశం లేదే అని కొంత నిరాశ . కానీ పార్టీ అభ్యర్థుల మూడవ జాబితా లోని కొన్ని పేర్లు చూడగానే పూర్వ విద్యార్థుల సమావేశం అంత ముచ్చటేసింది . డిగ్రీ చదువుకొనే రోజుల నుంచే జర్నలిజం నుంచి సహవాసం కావడం వల్ల అప్పుడు విన్న , పరిచయం ఉన్న ఆ పేర్లు కొన్ని పాత జ్ఞాపకాలు తట్టి లేపాయి . పూర్వ విద్యార్థులు సమ్మేళనం లో చదువుకున్న రోజులు గుర్తుకు వచ్చినట్టు పాత జ్ఞాపకాలు కళ్ళ ముందు కదిలాయి . కరోనా తరువాత ఎవరు ఉన్నారో , ఎవరు ఏమయ్యారో తెలియదు .. అలాంటప్పుడు మనం మరిచి పోయిన కొందరు ఉన్నారు అని తెలియడమే కాకుండా , వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అంటే ముచ్చటేయడం సహజమే కదా ? సాధారణ నాయకులే కాదు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయకులు సైతం ఇంటికే పరిమితం అయిన తరువాత వారిని ప్రజలు మరిచిపోతారు . ఓడినా గెలిచినా నాయకులు జనాల్లో ఉంటేనే రాజకీయంగా సజీవంగా ఉన్నట్టు . జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా , కేంద్రమంత్రిగా ఓ వెలుగు వెలిగారు . ఓడిపోయాక రాజకీయాలకు దూరంగా ఇంటికే పరిమితం అయ్యారు . అయన మరణించినప్పుడు రిపోర్టర్ గా సమాచారం కోసం ఇంటికి వెళ్ళాను . చడీ చప్పుడు లేదు . అయన గురించి అడిగితే చెప్పేవారు దొరక లేదు . ఇంట్లో జలగం ఆత్మకథ గ్రంధం ఉంది . తీసుకువెళ్ళండి అని ఒకరు సలహా ఇస్తే ... వార్త సాయిబాబా అప్పటికే బుక్ వెతుకుతుంటే నేనూ ఒకటి తీసుకున్నా .. అయన పోయారు అనే వార్త విని ఆయన ఉన్నారా ? ఎక్కడా వార్తల్లో కనిపించలేదేమబ్బా అనిపించింది . ***** జర్నలిస్ట్ గ్రూప్ లో బిజెపి మూడవ జాబితా కనిపించగానే చదువుతుంటే కొన్ని పేర్లు చూసి మొదట అనుమానం వచ్చింది . తరువాత బిజెపి జాబితానే అని నిర్ధారణ చేసుకొని పేర్లు చదివి సంతోషించాను . చేవెళ్ల నుంచి రత్నం , అంబర్ పేట కృష్ణ యాదవ్ , జూబ్లీ హిల్స్ లంకల దీపక్ రెడ్డి , సికిందరాబాద్ మేకల సారంగపాణి ఇలా ఇంకా చాలా మంది పేర్లు ఉన్నా టీడీపీ కార్యకలాపాల్లో నగరంలో వీరి హడావుడి చాలా ఉండేది . దాదాపు రెండు దశాబ్దాల క్రితం వీరి హడావుడి కనిపించేది .తరువాత వీరు ఏమయ్యారో తెలియదు . హఠాత్తుగా వీరి పేర్లు చూసే సరికి ఎన్నికల్లో జయాపజయాలు ఎలా ఉన్నా .. ఉన్నారు అని సంతోషం . మేకల సారంగపాణి ఒకప్పుడు టీడీపీ నగరనాయకుల్లో ఒకరు . కార్పొరేటర్ స్థాయికి పరిమితం కాకూడదు శాసన సభ్యున్ని కావాలి అని ఆశ ప్రజారాజ్యం పెట్టగానే పోటీ చేసి ఓడిపోయారు . తరువాత ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నారో బీజేపీ లో ఎప్పుడు చేరారో కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు బీజేపీ సికిందరాబాద్ అభ్యర్థి అయ్యారు . చేవెళ్ల రత్నం ఎన్టీఆర్ వెన్నుపోటు సమయంలో జిల్లా పరిషత్ చైర్ మెన్ గా చివరి వరకు ఎన్టీఆర్ వర్గంలో ఉన్నారు . తరువాత కనిపించలేదు . లంకల దీపక్ రెడ్డి చివరి దశలో చేరినా హడావుడి ఎక్కువగానే ఉండేది . తెలుగుదేశంలో కృష్ణ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు . హఠాత్తుగా మంత్రి వర్గం నుంచి బాబు తొలగించారు . ఎందుకో ఏ మీడియా రాయలేదు . ఎవరికీ తెలియదు . కొన్ని రోజుల తరువాత వేల కోట్ల రూపాయల తెల్గీ స్టాంప్ కుంభకోణంలో కృష్ణ యాదవ్ పాత్ర ఉందని అరెస్ట్ చేశారు . ఓహో బాబుగారు మంత్రివర్గం నుంచి తొలగించింది ఇందుకా అని అప్పుడు తెలిసింది . జైలు నుంచి బయటకు వచ్చాక తిరిగి టీడీపీ కోసం కృష్ణ యాదవ్ బాగా ప్రయత్నించారు . చేరలేదు . తెలంగాణ ఏర్పడింది . టీడీపీ తన ప్రాభవాన్ని కోల్పోయింది . తరువాత తెరాస లో చేరారు . తెరాస లో ఉన్నారో లేరో అన్నట్టు ఉండేది . బీజేపీ మూడవ జాబితా తో మళ్ళీ తెరపైకి వచ్చారు . మాంసం తిన్నామని ఎముకలు మేడలో వేసుకొని తిరిగినట్టు అనే సామెతలా .. తెల్గీ నుంచి కృష్ణ యాదవ్ తిన్నది కొద్దిగానే ఐనా శిక్ష చాలా ఎక్కువగా అనుభవించారు అని ప్రచారం . తెల్గీ కుంభకోణం బయటపడి , కృష్ణ యాదవ్ అరెస్ట్ అయ్యాక అయన వార్తలు పత్రికల్లో చందమామ కథల్లా కనిపించేవి . కృష్ణ యాదవ్ అంతకు ముందు ఏ జిల్లాలో తిరిగాడో ఆ జిల్లా నుంచి కథలు వచ్చేవి ఆ జిల్లాలో ఎవరెవరిని కలిశాడు , ఏం జరిగింది అని వార్తలు వచ్చేవి . తెల్గీ కన్నా ఎక్కువ శిక్ష పడింది యాదవ్ కె మంత్రి పదవి పోయింది , జైలు జీవితం తప్పలేదు . రాజకీయ జీవితం ముగిసింది . ******* మీడియాలో జోనల్ పేజీలు వచ్చాక ఏ జోనల్ నాయకులు ఆ జోనల్ పేజీలోనే కనిపిస్తున్నారు . ఇతర జోన్ లలో ఉండే పాఠకులకు వీరు ఉన్నారని తెలియదు . ఏ పార్టీలో ఎప్పుడు చేరారో తెలియదు . జోనల్ జీవితం వల్ల ఒక జోనల్ నాయకుల రాజకీయం ఇంకో జోన్ వారికి తెలియకుండా పోయింది . కనీసం ఎన్నికల వల్ల నైనా వారు ఉన్నారు అని తెలుస్తోంది . ఎన్నికల జాతర వచ్చినప్పుడు టికెట్ కోసం ప్రయత్నించేవారు పేర్లు పత్రికల్లో చదువుతుంటే వీళ్ళు ఇంకా ఉన్నారా ? మరిచే పోయాం అనిపిస్తుంది . నాయకుల గురించి మీడియా ఇలా అనుకుంటే మీడియా వాళ్ళ గురించి నాయకులు కూడా ఇంకా ఉన్నారా ? అనే అనుకుంటారు . రాస్తూంటేనే జర్నలిస్ట్ జీవించి ఉన్నట్టు .. పోటీ చే స్తుంటే, .. రాజకీయాలు చే స్తుంటేనే రాజకీయ నాయకులు రాజకీయంగా జీవించి ఉన్నట్టు .. రచయితలు , సినిమా నటులు సైతం అంతే కలం వదిలేసి, నటన మానేసి అస్త్ర సన్యాసం చేస్తే అంతే ... - బుద్దా మురళి

30, అక్టోబర్ 2023, సోమవారం

తెలంగాణ లో టీడీపీ చరిత్ర అలా మొదలై ఇలా ముగిసింది ..... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -103

తెలంగాణ లో టీడీపీ చరిత్ర అలా మొదలై ఇలా ముగిసింది .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -103 --------------------------------------- తెలంగాణ లో జరిగే 2023 శాసన సభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు . రాజమండ్రి జైలులో ఉన్న బాబు ములాఖత్ లో తెలంగాణ టీడీపీ నాయకులకు ఈ విషయం చెప్పారు . ఆ పార్టీ ఉనికి తెలంగాణలో అంతంగా మాత్రమే . పోటీ చేసినా చేయక పోయినా పెద్దగా ప్రభావం ఉండదు . ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రభావం ఎంతో టీడీపీ ప్రభావం అంతే ఉటుంది . ఐతే నాలుగు సార్లు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఈసారి పోటీ చేయడం లేదు అంటే . తెలంగాణలో ఆ పార్టీ చరిత్ర ముగిసినట్టు . తెలంగాణలో 1999 ఎన్నికలే టీడీపీ గెలిచిన చివరి ఎన్నికలు . 24 ఏళ్ళ నుంచి తెలంగాణ లో పెద్దగా ప్రభావం లేదు . ఐతే ఈ సారి పోటీ చేయడం లేదు అంటే తెలంగాణలో టీడీపీ చరిత్ర అధికారికంగానే ముగిసినట్టు . వారం క్రితం తెలంగాణ టీడీపీ అధ్యక్షడు తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తామని ప్రకటించారు . ఆరు నెలల క్రితం ఖమ్మంలో టీడీపీ బహిరంగ సభ జరిగింది . పాత టీడీపీ వారంతా టీడీపీలోకి వచ్చేయండి అని బాబు పిలుపు ఇచ్చారు . ఈ పిలుపును అందుకొని ఎవరెవరు రాబోతున్నారో తెలుగు ఛానల్స్ వారం రోజుల పాటు చర్చలతో ఉదరగోట్టాయి . ఒక్కరూ రాలేదు . పైగా బాబైనా పార్టీ మారుతాడేమో కానీ ఈయన మారడు అని పేరున్న రావుల చంద్ర శేఖర్ రెడ్డి కూడా టీడీపీని వీడి వెళ్లారు . తెలంగాణ జనంలో టీడీపీకి లేకపోవచ్చు కానీ మీడియా గుండెల్లో బాబు గూడు కట్టుకొని ఉన్నారు . ఎన్నికల్లో పోటీ చేయకపోయినా వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం అని ప్రచారం చేసే దమ్మున్న మీడియా టీడీపీకి ఉంది . ఎన్నికల్లో పోటీ చేస్తేనే రాజకీయ పార్టీకి ఉనికి . పోటీకి దూరం కావడంతో అధికారికంగా తెలంగాణలో టీడీపీ శకం ముగిసినట్టే . పార్టీ పుట్టుక నుంచి ముగింపు వరకు పలు కీలక సంఘటనల్లో ప్రత్యక్ష సాక్షిని .. ***** క్లిక్ మని ఫ్లాష్ వెలగగానే ఎన్టీఆర్ ఒక్కసారిగా ఆ ఫోటో గ్రాఫర్ వైపు కోపంగా చూశారు . మార్వాడి షాప్ లో కనిపించే పరుపు గద్దె మీద ఎన్టీఆర్ కూర్చొని ఉన్నారు . పక్కన నాదెండ్ల భాస్కర్ రావు ఉన్నారు . ఫోటో గురించి నాదెండ్ల ఏదో చెప్పే సరికి ఎన్టీఆర్ మాములు అయ్యారు . ఇది 1982లో రామకృష్ణ స్టూడియోలో ఎన్టీఆర్ ను టీడీపీ నాయకుడి పాత్రలో తొలిసారి చూసిన సందర్భం . అప్పుడు నేను పదవ తరగతి చదువుతున్నాను . పదవ తరగతి పరీక్షలు రాస్తున్న కరీం నగర్ జిల్లాకు చెందిన మిత్రుడు భూపాల్ తీసుకువెళితే రామకృష్ణ స్టూడియోకు వెళ్ళాను . కొత్తగా పెట్టిన టీడీపీలో జిల్లాల వారిగా నాయకులతో ఎన్టీఆర్ సమావేశం . ఆ రోజు కరీం నగర్ సమావేశం కావడంతో తనకు తెలిసిన వారు టీడీపీలో చేరుతున్నారని , వారితో ఎన్టీఆర్ సమావేశం ఉంది వెళదాం అంటే స్టూడియోలోకి వెళ్ళాను . దాదాపు ఓ వందమంది ఉండవచ్చు . అంతకు ముందు దివిసీమ తుఫాన్ బాధితుల కోసం ఎన్టీఆర్ అక్కినేని బృందం విరాళాలు సేకరిస్తుంటే సికింద్రాబాద్ దర్గా వద్ద రేఖా ఎంపోరియం లోకి వెళ్లి విరాళాలు తీసుకుంటుంటే చూశాను . కానీ టీడీపీ ఏర్పడ్డాక ఎన్టీఆర్ ను 82లో రామకృష్ణ స్టూడియోలో చూశాను . 84లో లో ఎన్టీఆర్ కు నాదెండ్ల వెన్నుపోటు తరువాత రామకృష్ణ స్టూడియో వద్ద పిట్టగోడ ఎక్కి వెంకయ్య నాయుడు బీజేపీ కార్యకర్తలు చేసిన ఉపన్యాసం , ఉద్యమం చూశాను . ఆ రోజుల్లో హైదరాబాద్ నగరంలో టీడీపీ కన్నా బీజేపీ హడావుడి ఎక్కువ ఉండేది . ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం లో స్టూడియో వద్ద బీజేపీ నాయకులదే ఎక్కువ హడావుడి . ఆ సమయంలో నేను అక్కడ ఎందుకు ఉన్నానో గుర్తు లేదు కానీ.. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అప్పుడు ఆ స్టూడియో వద్దనే ఉన్నాను . చాలా మంది రోడ్డు మీద నిలబడి చూశారు . ఆ మరుసటి సంవత్సరం ఒక వైపు కాలేజీకి వెళుతూనే 1985 నుంచి ఉదయం స్థానిక విలేకరిగా టీడీపీని దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది . విద్యార్థిగా , జర్నలిస్ట్ గా టీడీపీ పుట్టుక నుంచి మహోజ్వలంగా వెలిగిపోవడం , ఆరిపోవడం వరకు అన్ని కీలక పరిణామాలను దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది . ఎన్టీఆర్ ను దించేసిం వైస్ రాయ్ ఎపిసోడ్ నుంచి తెలంగాణ ఏర్పాటుతో టీడీపీ నిర్వీర్యం కావడం వరకు ఆంధ్రభూమి నుంచి టీడీపీ రిపోర్టర్ గా అన్ని పరిణామాలను చూశాను . *** ఎం ఎల్ ఏ క్వార్టర్ లో టీడీపీ పుట్టిన సందర్భంలో అక్కడ లేను కానీ అటు నుంచి రామకృష్ణ స్టూడియోలో సమావేశాలు ప్రారంభం నుంచి .. తెలంగాణ లో పార్టీ శకం ముగియడం వరకు అన్నీ చూశాను . తెలంగాణ ఏర్పడినా 2014లో ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి ఎన్నికలు జరిగాయి . ఒక ప్రాంతీయ పార్టీ ఒకే రాష్ట్రంలో ఉంటుంది . రెండు రాష్ట్రాల్లో ఉండదు . ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల విభజనను అంత త్వరగా జీర్ణం చేసుకోరు . ఆ ఎన్నికల్లో టీడీపీ పది స్థానాల్లో గెలిచింది . ఓటుకు నోటు తెరాస కు వరంలా మారింది . 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ , టీడీపీ మహాకూటమి మీడియాతో కలిసి అధికారంలోకి వచ్చేస్తున్నారు అనే భావన కలిగించడంలో విజయం సాధించారు . మంత్రివర్గాలను కూడా ఏర్పాటు చేసేసుకున్నారు . ఫలితాల్లో బోల్తా కొట్టారు . ప్రచారంలో బాబు సింహా భాగం ఆక్రమించారు . తీరా రెండు సీట్లకు పరిమితం అయ్యారు . 150 డివిజన్ లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో టీడీపీకి ఒక్క టంటే ఒక్క కార్పొరేటరే గెలిచారు . ఓటుకు నోటు కేసులు , పరాజయాలతో తెలంగాణ టీడీపీ నాయకులు తెరాస , కాంగ్రెస్ , బీజేపీ ఏదో ఒక పార్టీలో సర్దుకున్నారు . రిటైర్డ్ అయిన వారి కాలక్షేపం క్లబ్ తరహాలో ఎన్టీఆర్ భవన్ కొద్ది మందికి పరిమితం అయిపొయింది . ***** ఎందుకు పోటీ చేయడం లేదు .. రాజకీయ పక్షాలు నిజం చెప్పవు .. వారు చెప్పెది నిజం కాదు . ఐతే ఎందుకు పోటీ చేయడం లేదు అనే దానిపై నిజం చెప్పడం లేదు .. అబద్దం చెప్పడం లేదు . మరో ఆరు నెలల్లో ఆంధ్రాలో ఎన్నికలు . టీడీపీకి అవి చావుబతుకుల పోరాటం . తెలంగాణ లో అన్ని చోట్ల డిపాజిట్లు పోవడం ఖాయం .. డిపాజిట్లు పోతే ఆంధ్ర లో ఆ ప్రభావం పడుతుంది . బాబు జైలుకు వెళ్లిన తరువాత ఆంధ్ర కన్నా తెలంగాణలోనే నిరసన కార్యక్రమాలు ఎక్కువగా జరిగాయి . ఒక సామాజిక వర్గం వారాంతపు ఆట విడుపులా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మీడియా మాత్రం జనప్రవాహం అని చెబుతోంది . డిపాజిట్లు పోతే ఓస్ సానుభూతి ఇంతేనా ? అని ఆంధ్ర లో గాలి పోతుంది . మరో వైపు ఈ సామాజిక వర్గం ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లించాలి అని టీడీపీ అనుబంధ మీడియా ప్రయత్నాలు . టీడీపీ పోటీలో ఉంటే ఆ వర్గం అటు ఓటు వేయాలో ఇటు వేయాలో గందరగోళం . బి ఆర్ యస్ కన్నా రేవంత్ రెడ్డి అధికారం లో ఉంటే తానే అధికారంలో ఉన్నట్టు బాబు భావించడానికి అవకాశం ఉంటుంది . ఎలాగూ గెలిచే అవకాశం లేని ఒకటి రెండు శాతం ఓట్లతో పోటీ చేయడం కన్నా పోటీకి దూరంగా ఉండడం ప్రయోజనం అని టీడీపీ తెలంగాణలో తమ పార్టీకి మంగళం పాడింది . నిజానికి తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి ఎప్పుడో మంగళం పాడారు . ఇప్పుడు టీడీపీ కూడా మంగళం పాడింది . *** ఎన్టీఆర్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన గండిపేట కుటీరం , హిమాయత్ నగర్ లోని టీడీపీ కార్యాలయం ( ఎన్టీఆర్ ది , బాబుది తొలి పార్టీ కార్యాలయాలు హిమాయత్ నగర్ లో దగ్గర దగ్గరే ఉన్నాయి ) ఎన్టీఆర్ భవన్ ఇవన్నీ ఒకప్పటి జ్ఞాపకాలు . విశాలమైన , అత్యంత ఖరీదైన ఎన్టీఆర్ భవన్ అక్కడే ఉంటుంది కానీ తెలంగాణలో టీడీపీ రాజకీయాలు ఉండవు . తెలంగాణ ఉద్యమ కాలం లో టీడీపీ తెలంగాణ గడ్డ మీద పుట్టింది .. ఇక్కడే ఉంటుంది అని బాబు చెప్పేవారు . ఇక్కడ పుట్టినా ఇప్పుడు ఆంధ్ర కే పరిమితం . హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఎదురుగా విశాలమైన స్థలం కేటాయిస్తే .. బాబు దానిని ఎన్టీఆర్ భవన్ పేరుతో టీడీపీకి కేటాయించుకున్నారు . పేరుకు ఎన్టీఆర్ విధానాల పై అధ్యయనం , ప్రచారం కోసం ఈ భవన్ అని చెప్పినా పూర్తిగా టీడీపీ కోసం భవన్ ఉండేది . తెలంగాణలో ఇప్పుడు పార్టీ లేదు . విశాలమైన ఎన్టీఆర్ భవన్ మాత్రమే మిగిలింది . - బుద్దా మురళి

19, అక్టోబర్ 2023, గురువారం

కంట్రీ క్లబ్ లో బతుకమ్మ .. నుంచి  బాబు కోసం  -బతుకమ్మ పూజ వరకు జర్నలిస్ట్  జ్ఞాపకాలు-  102-------------

కంట్రీ క్లబ్ లో బతుకమ్మ .. నుంచి  బాబు కోసం  -బతుకమ్మ పూజ వరకు జర్నలిస్ట్  జ్ఞాపకాలు-  102----------------------------- ఏమన్నా విశేషాలు ఉన్నాయా ? అని కాల్ చేస్తే మా పిల్లలు బతుకమ్మ ఆట  చూద్దాం అంటే కంట్రీ క్లబ్ కు  తీసుకువచ్చాను అని అటు నుంచి సమాధానం వచ్చింది . ఇప్పుడు కాదుదాదాపు రెండు దశాబ్దాల క్రితం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు .. చిత్తూరు జిల్లా నగిరికి చెందిన ఏఎం రాధాకృష్ణ ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ కార్యాలయ కార్యదర్శిగా ఉండేవారు .  ఇంటికి వెళ్లేప్పుడు  టీడీపీకి సంబంధించి ఏమన్నా వార్తలు ఉన్నాయేమో అని తెలుసుకోవడం అలవాటు .   1987లో రిపోర్టర్ గా ఉద్యోగంలో చేరాక పండుగలు , పబ్బాలు అంటూ ఏమీ లేవు . అన్ని రోజులు దాదాపు ఒకేలా గడిచిపోయేవి . 95లో హైదరాబాద్ వచ్చాక వారాంతపు సెలవు తప్ప ఏదీ గుర్తుండదు . తెలంగాణ ఉద్యమం దాదాపు అప్పుడే ప్రారంభం అయింది .  బతుకమ్మ పండుగా ఎలా ఉంటుందో చూపడానికి కంట్రీ క్లబ్ తమ క్లబ్ లో బతుకమ్మ ఆడించింది . ప్రాంతం ఏదైనా కావచ్చు , పండుగలు , ఆటలు అంటే పిల్లలకు ఇష్టం. బతుకమ్మ ఆట చూపడానికి కంట్రీ క్లబ్ కు  వచ్చాము అని రాధాకృష్ణ చెప్పిన తరువాత ఆలోచనలో పడిపోయాను .  బాల్యం అంతా కవాడిగూడ ,  బోలాక్ పూర్ , పద్మశాలి కాలనీ ల మధ్య గడిచిపోయింది . ఈ ప్రాంతాలు హుసేన్ సాగర్ కు రెండు కిలో మీటర్ల పరిధిలోనే ఉంటాయి . ఈ ప్రాంతాల్లో బాల్యంలో బతుకమ్మ  సందడిగా ఆడేవారు .  ఆ రోజుల్లో హుసేన్ సాగర్ ఇప్పటిలా ఉండేది కాదు . ఒకప్పుడు తాగునీటికి ఉపయోగించిన చెరువు .  బట్టలు  ఉతుక్కునే వారు , స్నానాలు చేయడం చూశాను . బతుకమ్మ పండుగ రోజుల్లో హుసేన్ సాగర్ కళకళ లాడేది . కవాడి గూడా , బోలాక్ పూర్ వంటి ప్రాంతలు దగ్గరే కాబట్టి బతుకమ్మ ఆడి హుసేన్ సాగర్ లో బతుకమ్మ విడిచేవారు . అక్క చెల్లెళ్ళతో చాలా సార్లు అలా వెళ్ళాను . ఏదో మంత్రం వేసి  మాయం చేసినట్టు  నగరంలో బతుకమ్మ మాయమైంది .గ్రామీణ ప్రాంతాల్లో బతుకమ్మ మొదటి నుంచి అలానే ఉన్నా నగరంలో మాయమైంది   అలాంటి బతుకమ్మ ను చూడాలి అంటే చివరకు కంట్రీ క్లబ్ కు వెళ్లాలా ? అనిపించింది ... స్వతంత్ర పోరాట కాలం లో తిలక్ గణపతి ఉత్సవాలను సామూహికంగా నిర్వహించి   స్వతంత్ర పోరాటం జరిపారు . తెలంగాణ ఉద్యమానికి దీనిని స్ఫూర్తిగా తీసుకున్నారు . *****  కవిత జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలకు  తిరిగి పూర్వ వైభవం లభించింది . బడుగుల బతుకమ్మ అంటూ వామపక్ష బావాలు గలవారు పోటీగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు . పేరు ఏదైతేనేం బతుకమ్మ అంతటా మళ్ళీ కనిపించింది . గతంలో హైదరాబాద్ కాలనీల్లో బతుకమ్మ అంటే తెలియదు అన్నట్టు ఉండేవారు . తెలంగాణ ఏర్పడిన  తరువాత ఇప్పుడు కాలనీల్లో కూడా బతుకమ్మ కనిపిస్తోంది . బతుకమ్మ చూడాలి అంటే హనుమకొండ లోనే చూడాలి అనేవారు . ఆ స్థాయిలో కాకపోయినా ఇప్పుడు నగరంలోనూ బతుకమ్మ కనిపిస్తోంది . ఉద్యమానికి బతుకమ్మ ను ఉపయోగించుకున్నప్పుడు ప్రత్యర్థుల రాజకీయం సహజమే . బతుకమ్మ తెలంగాణ కు మాత్రమే చెందిన వేడుక కాదు విజయవాడలో కూడా ఆడుతారు అంటూ కొందరి వాదన . ఇదిగో ఆధారాలు అని కొందరు వ్యాసాలు రాస్తే ,  లగడ పాటి రాజ్ గోపాల్ విజయవాడలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు . అప్పుడు టీడీపీలో నర్రా విజయలక్ష్మి అనే మహిళా నాయకురాలు ఉండేవారు . లగడపాటి రాజ్ గోపాల్ అన్న బతుకమ్మ వేడుకలకు విజయవాడ పిలిచారు వెళుతున్నాను అంటూ మీడియా ముందు హడావుడి చేసి విజయవాడ వెళ్లారు . తెలంగాణ ఏర్పడిన తరువాత లగడపాటి అన్నగారు విజయలక్ష్మి చెల్లిని బతుకమ్మ వేడుకలకు విజయవాడ పిలిచారో లేదో , చెల్లి వెళ్లారో లేదో తెలియదు . తెలంగాణ వచ్చాక  విజయవాడలో లగడపాటి  బతుకమ్మ వేడుకలు జరిపినట్టు వార్తలు అయితే రాలేదు .  ****  తెలంగాణ ఉద్యమం ఉదృతం అయ్యాక చంద్రబాబు , బాలకృష్ణ లు కూడా బతుకమ్మ పూజ చేశారు . బోనం ఎత్తారు . ఐనా తెలంగాణ వచ్చింది . ఉద్యమ కాలం లో ట్యాంక్ బండ్ పై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడాలని ఏర్పాట్లు చేస్తే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆడేందుకు వీలు లేదు అని ఆంక్షలు విధించింది . జాగృతి కోర్ట్ కు వెళ్లి అనుమతి  తెచ్చింది . తెలంగాణ ఏర్పడిన తరువాత అదే ట్యాంక్ బండ్ పై అధికారికంగా ప్రభుత్వమే పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు జరిపింది . సీఎం తో పాటు గవర్నర్ నరసింహన్ దంపతులు ఆ వేడుకల్లో పాల్గొన్నారు . ***స్కిల్  స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు . బాబు విడుదలను కోరుతూ ట్యాంక్ బండ్ పై ఈ రోజు టీడీపీ ఆధ్వర్యంలో బతుకమ్మ  ఆడుతున్నారు . కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు . తిరుపతి వెంకన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల దేవుడే కాదు . ప్రపంచంలో ఉన్న హిందువులు అందరూ మొక్కుతారు . బతుకమ్మ అందరి పండుగ అనుకుంటే సంతోషమే .. అది గుజరాతీ పండుగా నా ? ఇది బిహారీ పండుగ , తెలంగాణ , ఆంధ్ర పండుగ అని కాదు ఎన్ని పండుగలు చేసుకునే వీలుంటే అన్ని చేసుకోవచ్చు జీవితం పండుగ మాయం అవుతుంది .  - బుద్దా మురళి 

15, అక్టోబర్ 2023, ఆదివారం

కాలం మారుతుందని గ్రహించక పోతే తిరునాళ్లలో తప్పిపోతాం ఎలాంటి నాగం రాజకీయ జీవితం ఎలా అయింది . జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 101

కాలం మారుతుందని గ్రహించక పోతే తిరునాళ్లలో తప్పిపోతాం ఎలాంటి నాగం రాజకీయ జీవితం ఎలా అయింది . జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 101 చదువుకొనే రోజుల్లో ఒక పాట బాగా పాపులర్ . శోభన్ బాబు కారులో వెళుతుంటే వాణిశ్రీ పడుతుంది. కారున్న మైనరు.. కాలం మారింది మైనరు.. ఇక తగ్గాలి మీ జోరూ. మా చేతికి వచ్చాయి తాళాలు.. మా చేతికి వచ్చాయి తాళాలు.. ఇదీ పాట . ఇదేమీ ప్రేమికులు పాడుకున్న డ్యూయెట్ కాదు . అక్షర సత్యం .. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు . ఇప్పుడెందుకు ఈ పాట అంటే . 2013 సాధారణ ఎన్నికలకు ఈ ఉదయం 55 మంది కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించగానే తొలుత నాగర్ కర్నూల్ నియోజక వర్గం పేరు ఆసక్తిగా చూశాను . నాగం జనార్దన్ రెడ్డి పేరుకు బదులు రాజేష్ రెడ్డి అనే పేరు కనిపించగానే .. నాగంతో రెండు దశాబ్దాల సంఘటనలు గుర్తుకు వచ్చాయి . ఆ రోజుల్లో బాబు నంబర్ వన్ ఐతే దేవేందర్ గౌడ్ , నాగం జనార్దన్ రెడ్డి నంబర్ టూ అన్నట్టుగా ఓ వెలుగు వెలిగారు . ఇద్దరి రాజకీయ జీవితం ఒకేలా ముగింపు నాకు వచ్చింది . తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లాడిలా ఉంది నాగం పరిస్థితి అని గతంలో ఓ సారి రాశాను . రాజకీయా నాయకులు , అధికారులు , ఉద్యోగులు , వారూ వీరు అని కాదు కాలం మారుతుంది అనే విషయం , మారింది అనే విషయం అందరూ గుర్తించాలి .. లేక పోతే మరీనా పరిస్థితులను తట్టుకోలేక మానసిక ఆందోళన పాలవుతాం . అందుకే ఆ పాట గుర్తుకు వచ్చింది . ఆ పాట ఓ జర్నలిస్ట్ గా నాకూ వర్తిస్తుంది . మీకూ వర్తిస్తుంది . ************* 2004 ఎన్నికలకు ముందు మంత్రి వర్గ సమావేశం . ఆ రోజుల్లో మంత్రి వర్గ సమావేశం అంటే ఇన్ సైడ్ సమాచారం కోసం కనీసం పది మంది మంత్రులనైనా కలవాల్సి వచ్చేది . మంత్రివర్గ సమావేశం ముగిసింది అని తెలియగానే సచివాలయం లోకి వస్తూ తొలుత నాగం జనార్దన్ రెడ్డి ఛాంబర్ లోకి ఇద్దరు ముగ్గురం జర్నలిస్ట్ లం వెళ్ళాం . లోపలి వెళుతూ నాగం కనిపించగానే ఏంటీ ఈ రోజు కేబినెట్ లో ఊపేశారట ! అని పలకరిస్తే ఆయన మురిసిపోయారు . మేము వెళ్లే సరికి ఛాంబర్లో వాళ్ళ నియోజక వర్గంలోని గ్రామం వాళ్ళు ఏదో పని కోసం వచ్చి ఉన్నారు . 2004 ఫలితాలు ఎలా ఉంటాయి అని నాగం అడిగితే , ఎలాంటి అనుమానం వద్దు మీ పార్టీ ఓటమి ఖాయం అని లెక్కలు చెప్పాను .. నువ్వు ఇలా చెబుతున్నావు కానీ , ఊరినుంచి వచ్చారు వీళ్ళతో ఇప్పుడే మాట్లాడాను గెలుస్తాం బాగుంది అంటున్నారు అని నాగం చెప్పారు . నేను లోపలి వస్తూనే ఏమన్నాను , క్యాబినెట్ లో ఊపేశారట కదా ? అన్నాను . నిజానికి ఈ రోజు క్యాబినెట్ జరిగింది అన్న విషయం తప్ప ఎవరు వచ్చారు , ఏం మాట్లాడారు నాకేం తెలియదు . నేరుగా మీ వద్దకే వచ్చాను . కేవలం ఇన్ సైడ్ సమాచారం కోసం మీ వద్దకు వచ్చి ఊపేశారట అని పొగిడాను . ఇదేమి పైరవీ కాదు , మీరు చెప్పక పోతే ఇంకో 30 మంది మంత్రులు ఉన్నారు . ఐనా మిమ్ములను పొగిడాను . సమాచారం కోసమే నేను మిమ్ములను పొగిడినప్పుడు , మీతో పని కోసం మీ గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు గెలుస్తామని చెప్పక పోతే ఓడిపోతాం అంటారా ? అని చెబితే పక పక నవ్వారు . ******** బాబు హయాంలో నంబర్ 2 గా నాగం ఓ వెలుగు వెలిగిపోతున్న కాలం లో రేవంత్ రెడ్డి తెరాస లో సాధారణ కార్యకర్త . అటు నుంచి రేవంత్ టీడీపీలోకి వచ్చారు . అప్పుడూ నాగం నంబర్ 2 నే .. తెలంగాణ ఉద్యమం ఉదృతం అవుతుండడంతో నాగం కు ఎటూ పాలుపోలేదు . తెలంగాణ వ్యక్తిగా తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ , రెడ్డిగా వై యస్ ఆర్ రాజశేఖర్ రెడ్డిపై ధ్వజ మెత్తుతూ టీడీపీ లో తన స్థానం సుస్థిరం అనుకున్నారు . కోదండరాం రెడ్డి నాయకత్వంలో తెలంగాణ జేఏసీ ఏర్పాటు అయ్యాక ఓ రోజు నాగం తెలంగాణ రెడ్డి నాయకునిగా కోదండరాం ఎమర్జ్ అవుతున్నారు అని కంగారు పడ్డారు . తెలంగాణ ఉద్యమం చివరి దశకు చేరుకున్న సమయంలో సభలో బాబును వ్యతిరేకించినట్టు మాట్లాడి , సంచలనం రేకెత్తించి , కొద్ది సేపు సభలో విడిగా కూర్చొని తరువాత వెళ్లి బాబు పక్కన కూర్చోగానే అదే జిల్లాకు చెందిన మరో నేత ..తిరుగుబాటు చేసిన వారు అలానే ఉండాల్సింది బాబు పక్కన కూర్చోగానే నాగం ది అయిపొయింది ఆయనకు అర్థం కావడం లేదు అన్నారు . టీడీపీలో తాము వెలిగిపోతున్నప్పుడు కెసిఆర్ ఎక్కడో ఉన్నారు , ఆయన నాయకత్వంలో ఎలా పని చేయాలి అని అటు వెళ్ళలేదు . ఇటు కోదండరాం నాయకునిగా వెలుగులోకి వస్తున్నాడు అని తెలంగాణ పేరుతో ఉద్యమ సంస్థ ఏర్పాటు చేశారు . అటు నుంచి బిజెపి , బీజేపీలో అసంతృప్తి అటు నుంచి కాంగ్రెస్ . టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యారు . ఐనా టికెట్ పై ఆశలు పెట్టుకొని అలానే ఉన్నారు . నా లాంటి నాయకుడు కెసిఆర్ నాయకత్వంలో పని చేయడం ఏమిటీ అనుకున్న నాగం చివరకు తెరాస లో చోటా నాయకుడిగా పని చేసిన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాక . రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ లో పని చేశారు . రేవంత్ రెడ్డి టికెట్ఐ లు ఇచ్చే స్థానంలో ఉండగా .. నాగం టికెట్ అడిగే స్థానం లో ఉన్నారు . ఐనా టికెట్ దక్కలేదు . *********** ఉద్యమ కాలం లో చాలా మంది నాయకులకు చర్చల్లో ఓ మాట చెప్పేవాడిని . ఆంధ్రభూమిలో వెజ్ బోర్డు సిఫారసులు అమలు చేస్తారు . మంచి జీతాలు ఉంటాయి . నాకు భూమిలో దాదాపు ఏడు వేల రూపాయల జీతం వచ్చే రోజుల్లో ఏబీకే ప్రసాద్ సంపాదకునిగా సుప్రభాతం అని పక్ష పత్రిక వచ్చేది . రవిప్రకాష్ అందులో దాదాపు మూడు వేల రూపాయలకు రూపాయలకు ఉద్యోగం చేసేవారు . టివి 9 తో రవిప్రకాష్ ఎక్కడికో వెళ్లిపోయారు . భూమిలో ఏదన్నా తేడా వస్తే , ఎక్కడ ఉద్యోగం వచ్చినా చేస్తా కానీ అప్పుడు నాకు ఏడు , నీకు మూడు వేలే జీతం అంటే ఇంట్లో కూర్చోవలసి వస్తుంది అనే వాడిని . .. కాలం కారుతుంది . అలా మారుతుంది అని గ్రహించాలి , స్వీకరించాలి లేకపోతే తిరునాళ్లలో తప్పిపోయినట్టు అవుతుంది . - బుద్దా మురళి

13, అక్టోబర్ 2023, శుక్రవారం

జర్నలిస్ట్ లారా మీరెటువైపు ? జర్నలిస్ట్ జ్ఞాపకాలు -100

జర్నలిస్ట్ లారా మీరెటువైపు ? జర్నలిస్ట్ జ్ఞాపకాలు -100 -------------------------------------- రచయిత లారా మీరెటు వైపు అంటూ 1970 లో వినిపించిన ప్రశ్న 53 ఏళ్ళ క్రితం సాహిత్యంలో ఓ సంచలనం . అప్పుడు నేను ఇంకా స్కూల్ లో కూడా లేను కానీ ఆ ప్రశ్న గురించి ఆ తరువాత కూడా చాలా సార్లు చదివాను . అప్పటి వివాదం , అప్పటి చర్చ లోతుల్లోకి వెళ్ళలేను కానీ .. ఈ మధ్య వచ్చిన సినిమా పాట ఆ వైపు నుంటావా ? ఈ వైపు నుంటావా అని రంగస్థలంలో రాం చరణ్ ప్రశ్నకు మూలం ఈ ప్రశ్న నే కావచ్చు . పైకి ప్రశ్న లానే ఉన్నా అందులో ఒక రకమైన బెదిరింపు కూడా ఉంది అనిపిస్తోంది . విప్లవ రచయితల సంఘం రచయిత లారా మీరెటువైపు అని అడిగిన ప్రశ్నలో మా వైపున ఉంటే ఒకే లేకుంటే అంతే అన్నట్టుగా ప్రభుత్వ పాఠశాలల్లో సాధారణ చదువు చదివిన నాలాంటి వ్యక్తికి అనిపిస్తోంది . రచయితలు అంటే కొందరు అటు కొందరు ఇటూ అన్నట్టు , మరి కొందరు ఎటో తెలియనట్టు ఉండడం వల్ల అదో సంచలనం , సమాధానం కావలసిన ప్రశ్న . మరి జర్నలిస్ట్ లారా మీరెటు అంటే ? ******************** జర్నలిస్ట్ లారా మీరెటువైపు అని ప్రశ్నిస్తే జర్నలిస్ట్ లే కాదు , పత్రికలు చదివే పాఠకులు , ఛానల్స్ చూసే ప్రేక్షకులు కూడా క్షణం కూడా ఆలోచించకుండా చెప్పేస్తారు . కొందరు మేం తటస్థులం అని నటిస్తుంటారు . ఓ నిమిషం మాట్లాడితే ఏ పార్టీ తటస్తులో తేలిపోతుంది . తెలంగాణకు చెందిన ఓ ఛానల్ ఓనర్ తెరాస , కాంగ్రెస్ బీజేపీల మధ్య పొద్దు తిరుగుడు పువ్వులా తిరుగుతూ ఉంటాడు . ఆ ఛానల్ ఓనర్ ఎటు మారితే ఛానల్ అటు మారుతుంది . జర్నలిస్ట్ తనకు ఇష్టం వచ్చినట్టు రాస్తారు అనుకుంటాను కానీ యజమాని ఇష్టం వచ్చినట్టు రాయాలి , రాస్తారు . కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి , జీతాలు ఇచ్చి మీడియా సంస్థలను నడిపేది ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకో , ప్రజల స్వేచ్ఛ కోసమో కాదు . డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ 1950 ప్రాంతంలోనే సబ్బుల వ్యాపారం ఎలానో మీడియా వ్యాపారం కూడా అంతే , దీనికి పెద్దగా విలువలు అంట గట్టకండి అన్నారు . మీడియాది వ్యాపారం అని జర్నలిస్టులకు , యజమానులకు , సంపాదకులకు , యూనియన్ నాయకులకు తెలియదా ? అంటే పాఠకులకే తెలిసినప్పుడు వారికి తెలియకుండా ఎందుకు ఉంటుంది . దేవతా వస్త్రాల కథలా అందరూ నటించేస్తుంటారు . గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇప్పుడు మీడియా మొత్తం వివిధ పార్టీలకు అనుబంధంగా పని చేస్తోంది . యజమాని ఏ పార్టీకి అనుబంధంగా పని చేస్తే ఆ మీడియా జర్నలిస్ట్ తనకు నచ్చినా నచ్చక పోయినా ఆ పార్టీకి ప్రయోజనం కలిగించే కోణం లోనే పని చేయాలి . ******* 95లో ఎన్టీఆర్ ను దించినప్పుడు అనేక వార్తల్లో , వ్యాసాల్లో నేను ఆంధ్రభూమిలో వెన్నుపోటు అని రాశాను . ఆ వెన్నుపోటులో మీడియా పాత్ర కూడా ఉంది . వారి పత్రిక తరపునే కాకుండా చిత్తశుద్ధితో వెన్నుపోటు కు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ జర్నలిస్ట్ ఒకరు ఈ మధ్య ఒక వ్యాసంలో 95 సంఘటన ప్రస్తావిస్తూ వెన్నుపోటు అని రాశారు . అది వెన్నుపోటు అని గ్రహించడానికి ఆ జర్నలిస్ట్ కు పాతికేళ్ళు పట్టిందా ? అంటే కాదు 95లో వెన్నుపోటుకు సహకరించిన మీడియాలో ఉన్నారు . పాతికేళ్ల తరువాత వెన్నుపోటు అని రాసినప్పుడు జగన్ మీడియాలో ఉన్నారు . నేను వెన్నుపోటు అని రాశాను అని స్వతంత్రంగా రాశాను అని కాలరెగిరిస్తే ఓ జర్నలిస్ట్ మిత్రుడు అది మీ పత్రిక పాలసీ కాబట్టి అలా రాయగలిగావు అంతే తప్ప అది మీ మీడియా ఇచ్చిన స్వేచ్ఛ కాదు అంటే ఆలోచిస్తే అతని వాదనలో కూడా నిజం ఉంది అనిపించింది . ఒక్కో సారి యజమాని జర్నలిస్ట్ ఒకే కోణం లో ఉంటే అదృష్టమే . బాబు వెన్నుపోటు సమయంలో మేనేజ్ మెంట్ , ఎడిటర్ , నేనూ వెన్నుపోటు అనే భావించడం వల్ల రాతలకు ఇబ్బంది కలుగలేదు . 2001 తెలంగాణ ఉద్యమం వచ్చే సరికి సీన్ రివర్స్ అయింది . నేనేమో తెలంగాణ కోరుకున్న వాడిని , యాజమాన్యం కొన్ని కారణాల వల్ల మనం సమైక్యాంధ్ర అంది . ఎడిటర్ తెలంగాణ అనే మాట వినడానికే ఇష్టపడని వారు . ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఎడిట్ పేజీలో వారం వారం రాసే పొలిటికల్ కాలం లో ధైర్యం చేసి తెలంగాణ ఎందుకు అవసరమో రాశాను . అది పబ్లిష్ అయ్యాక ఆఫీస్ లో తెలంగాణ మిత్రులు మెల్లగా ఏంటీ మన పత్రికలో తెలంగాణ గురించి అని మెల్లగా అభినందించి వెళ్లేవారు ... ముందుగా ఊహించినట్టుగానే ఎడిటర్ నుంచి ఫోన్ .. అక్షింతలు .. ఇంకోసారి నాకు చూపకుండా పంపవద్దు అని వార్నింగ్ .. నిజానికి నేను అంతకన్నా ఎక్కువ నష్టానికి మానసికంగా సిద్దమై ఉన్నాను . ఉద్యమం ఉదృతం అయ్యాక తెలంగాణ గురించి రాసుకొనే అవకాశం లభించింది . ఎడిటర్ సమైక్యాంధ్ర కోసం రాస్తే నేను తెలంగాణ కోసం రాశాను . పత్రికల్లో కొంత మేరకు యాజమాన్యం స్వేచ్ఛ ప్రసాదించినా , మాకు వద్దంటే వద్దు అని ఎడిటర్ , యజమాని ఏం కోరుకుంటే అదే రాద్దాం అనుకునేవాళ్లనూ చూశాను . 95లో వెన్నుపోటు గురించి రాసే అవకాశం భూమిలో ఉన్నా చాలా మంది ఉపయోగించుకోలేదు . అలానే తెలంగాణ ఉద్యమం ఉదృతం అయ్యాక రాసే అవకాశం ఉన్నా స్వేచ్ఛను ఉపయోగించుకొని వారు ఉన్నారు . ఎడిటర్ పేపర్ కు తానే ఓనర్ అన్నట్టు వ్యవహరించేవారు .. ఆంధ్రభూమి యాజమాన్యం పెద్దగా జోక్యం చేసుకునేది కాదు . దీనివల్ల కొంత వరకు రాయాలన్నది రాసే అవకాశం లభించింది ... ***************** రాష్ట్ర విభజన తరువాత గతంలో ఎప్పుడూ లేని విధంగా ఊహించని విధంగా మీడియా రాజకీయ పార్టీలను మించి రాజకీయ అభిమానం చూపుతోంది . బాబు అరెస్ట్ తరువాత ఛానల్స్ లో కొందరు యాంకర్లు మాట్లాడుతున్న మాటలు పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడలేరు . పార్టీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకులు సైతం యాంకర్ల పార్టీ భక్తి చూసి ఈర్ష పడేట్టుగా ఉంది . రెండు రాష్ట్రాల్లో కూడా మొత్తం మీడియా రాజకీయ పార్టీలకు అనుబంధంగానే ఉంది . కొన్ని మీడియాలను ఏకంగా పార్టీలే నడుపుతుంటే , కూని మీడియాలేమో పార్టీలకు అనుబంధంగా ఉన్నాయి . సొంతంగా పార్టీలు నడిపే మీడియా పార్టీకి శాశ్వతంగా కట్టుబడి ఉంటుంది . పార్టీలకు అనుబంధంగా ఉన్న మీడియా పార్టీ మారదనే నమ్మకం లేదు . మారుతూ ఉంటుంది . రాజకీయ పార్టీల్లో , మావోయిస్టుల్లో కోవర్ట్ లు ఉన్నట్టే మీడియాలో కూడా కోవర్ట్ లు ఉంటారు . ఒక పార్టీ మీడియాలో ఉంటూ ప్రత్యర్థి పార్టీ కి సమాచారం చేరవేస్తారు . ఆ మధ్య ప్రభూత్వ ఉద్యోగులను ఓ మీడియా యజమాని బాబు ముందే తిడుతుంటే రికార్డ్ అయి బయటకు వచ్చింది ఇలానే . ఆ వీడియో టీడీపీకి కలిగించింది . *********** జాతీయ స్థాయిలో కొన్ని మీడియాలను బీజేపీ మరి కొన్నింటిని కాంగ్రెస్ బహిష్కరించింది . దానితో కాంగ్రెస్ సానుభూతి పరులు అంటూ ఎవరో ఒకరిని డిబేట్ లో కూర్చోబెట్టి చర్చ రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు . రాహుల్ గాంధీ అదానీ పై ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే , దానిని ప్రశ్నలతో రసాభాస చేయమని ndtv ఒక జర్నలిస్ట్ ను పంపితే , అతను నా వల్ల కాదు అని రాజీనామా చేశారు . మేనేజ్ మెంట్ చెప్పినట్టు చేస్తేనే ఉద్యోగం లేదంటే బయటకు వెళ్ళాలి . సామాజిక మాధ్యమాల పుణ్యమా ? అని మీడియా లోని వ్యవహారాలు బయటకులు వస్తున్నాయి . ప్రతి మీడియాకు రాజకీయ అనుబంధం ఉంది .. కొందరు అనుబంధం కోసం పార్టీలకు దరఖాస్తు చేసుకున్నా వీరికి అంత సీన్ లేదు అని పార్టీలు పట్టించుకోవడం లేదు . గతం లో ఓ కొత్త మీడియా వస్తుందే అంటే ఎడిటర్ ఎవరు ? అనే ప్రశ్న వినిపించేది .. ఇప్పుడు ఓనర్ ఏ పార్టీ అనే ప్రశ్న వినిపిస్తుంది . - బుద్దా మురళి