26, ఏప్రిల్ 2015, ఆదివారం

మీడియా శ్రీకృష్ణులు!

‘‘ఏంటీ విశేషాలు. తమ్ముళ్లను అలా అరెస్టు చేయడం తప్పు కదా? ’’
‘‘ఆదా నీ గోల..... మన చిన్నప్పుడు గుర్తుందా? ప్రతి పెళ్లిలో ఎవడో ఒకరు పప్పు చారులో పప్పు తక్కువైందనో, వంకాయ కూరలో ఉప్పు తక్కువైందనో, గడ్డపెరుగు లేదనో హంగామా చేసేవారు. వారు అరవడం కొత్త జంటను పక్కన పెట్టి వీరిని బతిమిలాడేందుకు ఇరువైపుల వాళ్లు తంటాలు పడడం భలేగా ఉండేది. అంతా అటువంటివారిని పురుగును చూసినట్టు చూసేవాళ్లు కానీ ఒక్కరూ పైకి అనేవారు కాదు. అన్ని పెళ్లిళ్లలో, అన్ని ఊళ్లలో ఇలాంటి పాత్ర కనిపించేది. పప్పులో ఉప్పు తక్కువ కావడం ఇండియా-పాకిస్తాన్ యుద్ధం అంత కీలకమైనదిగా చర్చలు సాగించే వాళ్లు. ఎవరి భోజనం వాళ్లే వడ్డించుకుని వెళ్లే ఈ రోజుల్లో బంధువుల అలకలు పాత చరిత్రే!! ’’
‘‘నిజమే కానీ తమ్ముళ్ల గురించి అడిగితే, పెళ్ళిళ్ల గురించి గురించి చెబుతున్నావు’’
‘‘గులాబీ పార్టీ వాళ్లు అట్టహాసంగా ప్లీనరీ జరుపుకుంటుంటే తమ్ముళ్లు పార్టీ మారిన ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు, జిల్లాల్లో వారి బంధువుల ఇళ్ల ముందు హడావుడి చేసి అరెస్టు కావడం చూస్తే ఎందుకో పూర్వకాలం పెళ్లిళ్లలో భోజనాల దగ్గర లేకిగా గొడవ చేసే వాళ్లు గుర్తొచ్చారు.’’
‘‘రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తూ ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్లు, మరో పార్టీలో చేరడాన్ని నువ్వు సమర్ధిస్తున్నావా? ’’
‘‘నేనెక్కడ సమర్ధించాను. ఆ పని చేసింది కూడా తమ్ముళ్లే’’
‘‘ఎలా?’’
‘‘యువనేత పార్టీ ఎంపిలిద్దరిని చేర్చుకున్న తమ్ముళ్ల బాస్‌ను మరిచిపోయావా? అలాంటి బాస్ ఆదేశాలతో తమ్ముళ్లు గులాబీ నేతల ఇళ్ల ముందు ఆందోళన చేయడాన్ని ఏమంటారు? ’’
‘‘అది కూడా నువ్వే చెప్పు’’
‘‘పెళ్లిళ్లలో గుర్తింపు కోసం ఉప్పు పప్పు తక్కువైందని హంగామా చేసేవాళ్లు అందుకే గుర్తుకొచ్చారు. నిజానికి కూరలో ఉప్పు తక్కువ కావడమే అతని ప్రధాన సమస్యనా? అంటే కానే కాదు. వాళ్లను ఇంట్లో కనీసం భార్యకూడ గుర్తించదు, కనీసం పెళ్లిళ్లలోనైనా ఏదో రూపంలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటారు. వీళ్లది ఐడెంటిటీ క్రైసెస్.’’
‘‘తప్పును తప్పంటే ఐడెంటిటీ క్రైసెస్ అని ఎలా అంటావు? ’’
‘‘నీలాంటి వాడు అది తప్పు అంటే ఓ అర్ధం ఉంది. తప్పులో పుట్టి, తప్పులోనే పెరుగుతున్న వాళ్లు తప్పంటే ఎలా ఉంటుంది? నైతిక విలువల ప్రపంచానికి పరిచయం చేసిన నాయకుడి ఇంటి ముందు ధర్నా చేసి, అటు నుంచి గులాబీ నేతల ఇళ్ల ముందు ఆందోళన చేస్తే ఎంత బాగుండేది’’...‘‘పోనీలే ఆ సంగతి మనకెందుకు కానీ... ఇంకేంటి విశేషాలు..? అప్పుడు టీవిలో తెగ కనిపించిన ముఖాలేమీ ఇప్పుడు కనిపించడం లేదు. వాళ్లేమయ్యారంటావు?’’
‘‘ఎవరు వాళ్లు? ’’
‘‘ఎన్ని పేర్లని చెప్పమంటావు. ఒకరా? ఇద్దరా? రోజూ టీవి చర్చల్లో తెగ కనిపించే వాళ్లు. ప్రజలను నడిపించేది వీళ్లే అనిపించేది.’’
‘‘నువ్వడిగేది వాళ్ల గురించా? చెబుతా?... జర్నలిస్టులను నారదులు అంటారు. కానీ నాకెందుకో వాళ్లలో శ్రీకృష్ణుడు కనిపిస్తాడు’’
‘‘దానికీ దీనికి లింకేమిటి? ’’
‘‘అక్కడికే వస్తున్నా? మహాభారతం మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపించింది శ్రీకృష్ణుడే. ఏ పాత్రను ఎప్పుడు ప్రవేశపెట్టాలో, ఎప్పుడు ముగించాలో డిసైడ్ చేసింది ఆయనే. మీడియా కూడా అంతే. 95 ప్రాంతంలో శంకరపిచ్చయ్య పేరు మీడియాలో మారు మ్రోగేది. లాడెన్ వల్ల ప్రపంచానికి ఎంత ప్రమాదమని అమెరికావాడు భయపడ్డాడో, ఆ కాలంలో శంకర పిచ్చయ్య వల్ల తెలుగు జాతికి అంత కన్నా ఎక్కువ ప్రమాదం అని మీడియా రోజూ హడావుడి చేసేది. ఎవరీ శంకరపిచ్చయ్య అనే కదా నీ సందేహం. లక్ష్మీపార్వతి సోదరుడు. ఈయన వల్ల రాష్ట్రంలో భూ కంపం కన్నా ఎక్కువ ప్రమాదం తప్పదని ప్రచారం సాగేది. ఎన్టీఆర్‌ను అధికారం నుంచి దించేశాక. శంకర పిచ్చయ్య ఏమయ్యాడో ఎవరూ పట్టించుకోలేదు. నిజంగా శంకర పిచ్చయ్య అంత ప్రమాదకరమైన వ్యక్తా? అంటే కాదు.. ఎన్టీఆర్‌ను దించేసే వ్యూహం లో అతనో పాత్ర అంతే. అచ్చం శ్రీకృష్ణుడు కూడా అంతే కదా మహా మహా వీరులను మట్టికరిపించేందుకు ఇలాంటి శంకరపిచ్చయ్యలు ఎంతో మందిని యుద్ధ రంగంలోకి తీసుకు వచ్చాడు.’’
‘‘నిజమే ఇంతకూ శంకరపిచ్చయ్య ఏమయ్యారు? ’’
‘‘ఏమో ఎవరికి తెలుసు.. ఆ పాత్ర అవసరం తీరాక పట్టించుకోవలసిన అవసరం మీడియాకెందుకు?
‘‘అంతే కదా’’
తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆయనెవరో చక్రవర్తి అని పాపులర్ చానల్స్ అన్నింటిలో అరగంట చొప్పున ప్రత్యేక దర్శనం ఇచ్చేవారు. నేనూ పూర్వం తెలంగాణలోనే పుట్టాను. తెలంగాణ వద్దే వద్దు అని గట్టిగా వాదించేవారు. ఎక్కడ చూసినా ఆయనే కనిపించేవారు. ఆయనలో ఒక మహా రచయిత కూడా ఉన్నాడని మీడియా వెలికి తీసింది. తెలంగాణ ఏర్పడ్డాక పాపం ఆయన్ని పిలిచిన చానల్ లేదు. పలకరించిన మీడియా లేదు. కెసిఆర్‌కు వరుసకు మేనల్లుడని ఒకరు, అన్నగారి కూతురని మరొకరు టీవిల్లో కెసిఆర్‌ను దుమ్మెత్తిపోస్తూ తెగ దర్శనం ఇచ్చేవాళ్లు. ఏంటో ఇప్పుడు వాళ్ల పేర్లు కూడా గుర్తుకు రావడం లేదు. నిజంగా వాళ్లు అంత శక్తివంతులా? అంటే విషయం అది కాదు చానల్స్‌కు తమ కోపాన్ని వ్యక్తం చేసే మైకులుగా వీరు కనిపించారు కానీ వారికి సొంత బలం ఏమీ ఉండదు. సొంత బలం ఉంటే ఇప్పటికీ దర్శనం ఇచ్చి ఉండేవాళ్లు. అందుకే అన్నాను మహాభారతంలో శ్రీకృష్ణుడు చేసిన పనే మీడియా చేస్తోందని, ఒప్పుకుంటావా? లేదా? ’’
‘‘నువ్వు చెప్పిందంతా నిజమే కానీ ఆ పోలికను నేను ఒప్పుకోను. మీడియా సొంతంగా నడిపిస్తే నువ్వన్నట్టు శ్రీకృష్ణుడు అంటే ఒప్పుకుంటాను. కానీ ఏదీ మీడియా సొంతంగా నడిపించదు. వాటి వెనుక ఉన్న నాయకులే నడిపిస్తారు. కాబట్టి శ్రీకృష్ణులు మీడియా కాదు. మీడియాను నడిపించే నాయకులు’’

24, ఏప్రిల్ 2015, శుక్రవారం

తెలంగాణ గుండె చప్పుడు కేసీఆర్

--నేడు టిఆర్‌ఎస్ ప్లీనరీ--
తెలంగాణ ఆత్మ తెలిసిన నాయకుడు కేసీఆర్. అందుకే పిడికిలెత్తి జై తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలంతా జై తెలంగాణ అంటూ దిక్కులు పిక్కటిల్లేట్టుగా నినదించారు. ఉద్యమంలో కెసిఆర్ వెన్నంటి ఉన్న నాయకులకు ఉద్యమ కాలంలో కేసీఆర్‌పై ఎంత నమ్మకం ఉందో తెలియదు కానీ ప్రజలకు మాత్రం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాకారం అవుతుందని నమ్మారు. తెలంగాణ సాకారం అ యిన తరువాత ఆయన వెంట ఉన్న మం త్రులు, ఎమ్మెల్యేల్లో బంగారు తెలంగాణపై ఎంత మందికి నమ్మకం ఉందో తెలియదు కానీ సాధారణ తెలంగాణ ప్రజలు మాత్రం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాకారం అవుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నారు. తెలంగాణ ఆత్మ తెలిసిన నాయకుడు కాబట్టే కేసీఆర్ తెలంగాణ ప్రజల మనోభావాల మేరకు పాలన సాగిస్తున్నారు. ఏ ఒక్క పార్టీ మరో పార్టీ ఉనికిని సహించలేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉన్న పార్టీలన్నింటితో జై తెలంగాణ అనిపించిన నాయకుడు కేసీఆర్.
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది కావస్తోంది. ఏడాది కాలంలో తెలంగాణ పయనం ఏ విధంగా సాగిందో, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలో సమీక్షించుకోవడానికి నిర్వహించే సమావేశమే టీఆర్‌ఎస్ ప్లీనరీ. శుక్రవారం ఎల్‌బి స్టేడియంలో పారీట ప్లీనరీ జరుగుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా జరుగుతున్న ప్లీనరీ కావడంతో అధికార పక్షం పోకడలన్నీ ప్లీనరీ ఏర్పాట్లలో కనిపిస్తున్నాయి. ప్లీనరీలో ఎన్ని వంటకాలు వండారు, ఎంత మంది వడ్డించారు, నగర అలంకరణ ఎంత అట్టహాసంగా చేశారు అనేది తెలుగు రాజకీయ రంగంలో ఇది కొత్తేమీ కాదు. ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి సమావేశాల్లో లొట్టిపిట్టలు, ఏనుగుల ఊరేగింపులు గతంలో చూసినవే. ఇలాంటి ఆర్భాటాల సంగతి ఎలా ఉన్నా... తెలంగాణ ఏ దిశలో వెళుతోందో తెలంగాణ ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చే దిశగా ప్లీనరీ సాగాలి.
కేసీఆర్ నాయకత్వంలో మలిదశ ఉద్య మం ప్రారంభం అయిన తరువాత ఉద్యమానికి నాయకత్వం వహించడానికే కేసీఆర్ పనికిరాడని అన్నారు. టిఆర్‌ఎస్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయ్యాక ప్రజల్లో కదలిక మొదలయ్యాక. కేసీఆర్‌ను బలహీన పరచడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని బలహీన పరచవచ్చునని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వ్యక్తిగతంగా బహుశా కేసీఆర్‌ను టార్గెట్ చేసినంతగా రాజకీయ రంగంలో మరో నాయకుడిని చేసి ఉండరు. ఆలె నరేంద్ర, విజయశాంతి, దేవేందర్‌గౌడ్, గద్దర్ లాంటి ఎందరో కేసీఆర్‌కు పోటీగా తెలంగాణ కోసం రాజకీయ పార్టీలు ప్రారంభించారు. అట్టహాసంగా ముహూ ర్తం షాట్ తీసి చేతులెత్తేసిన కొత్త సినిమా నిర్మాతల్లా కొద్ది రోజులకే పార్టీలను మూసేశారు. తెలంగాణ ఏర్పాటును బలంగా కోరుకున్న వర్గాలు టిఆర్‌ఎస్ వైపు ఆశగా చూస్తే, తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన వర్గాలు ఈ కొత్త పార్టీలను మీడియా ద్వారా ఆకాశానికి ఎత్తాయి. అయితే అవి మీడియాలో వార్తలు గానే మిగిలిపోయాయి కానీ తెలంగాణ ప్రజల మనసుల్లోకి వెళ్లలేదు. ఎన్ని లోపాలున్నా ప్రజాస్వామ్యానికి ప్రత్యామ్నాయం లేదు అన్నట్టుగా, తెలంగాణ ప్రజలు ఎన్ని లోపాలున్నా తెలంగాణ సాధనకు కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం లేదని విశ్వసించారు. తెలంగాణ సాకారం అయిన తర్వాత పాలించేందుకు కాంగ్రెస్, టిడిపి- బిజెపి, టిఆర్‌ఎస్ మూడు పక్షాల నాయకులు ప్రజల ముందుకు వస్తే, ఉద్యమ కాలంలో నమ్మిన కేసీఆర్‌కే తిరిగి ప్రజలు పట్టం కట్టారు.
11నెలల పాలనా కాలంలో కేసీఆర్‌సైతం ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయలేదు. ఒక ఉద్యమ కారుడికి ఉండాల్సిన వ్యూహం, ఎత్తుగడ, ఆవేశం వేరు. పాలకుడికి ఉండాల్సిన రాజధర్మం వేరు. ఉద్యమ నాయకుడికి, పాలకుడికి మధ్య తేడా బాగా తెలిసిన నాయకుడు కేసీఆర్. మోదీ అద్భుత పాలన మీకు ఇప్పుడు అర్ధం కాదు, ఐదేళ్ల తరువాత తెలుస్తుంది అంటున్న బిజెపి నాయకులు కేసీఆర్ పాలన ఫలితాలు ఇప్పుడే తేలాలంటున్నారు. ఎవరేమన్నా కేసీఆర్ రాజధర్మం ముందు ముందు అర్ధమవుతుంది.
ఎన్నికల ఫలితాలు వెలువడగానే కేసీఆర్ మంత్రివర్గంలో చేరమని ఎంఐఎంను ఆహ్వానించారు. ఒక ప్రతినిధి బృందాన్ని ఎంఐఎం వద్దకు పంపించారు. టిఆర్‌ఎస్, ఎంఐఎం కలిసిపోతున్నాయని ప్రచారం సాగింది. కొద్ది రోజుల తరువాత బిజెపి ప్రభుత్వంలో టిఆర్‌ఎస్ చేరిపోతోందని బలంగా ప్రచారం సాగింది. ఒకే పార్టీ అటు ఎంఐఎంతో ఇటు బిజెపితో కలుస్తుందని ఒకేసారి ప్రచారం సాగడం విశేషం.
తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం. అందుకే కెసిఆర్ వ్యూహాత్మకంగానే ఇటు ఎంఐఎంతో సన్నిహితంగా ఉంటూనే మరోవైపు కేంద్రంలో బిజెపి ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉంటున్నారు. తెలంగాణ ఏర్పడే సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా సాగిన ప్రచారాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే కేసీఆర్ అనుసరించిన వ్యూ హం సరైనదా? కదా? అనేది తెలుస్తుంది. తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్‌లో భూముల ధరలు పాతాళంలో పడిపోతాయని, హైదరాబాద్‌లోని పరిశ్రమలన్నీ తరలిపోతాయని, ఆదాయం పడిపోతాయని, చీకట్లు కమ్ముకుంటాయనే ప్రచారం సాగింది. వ్యతిరేక శక్తుల ప్రచారం ఏ విధంగా ఉన్నా, ఈ ప్రచారాన్ని తెలంగాణ ఏర్పాటును బలంగా కోరుకున్న శక్తులు సైతం కొంత వరకు నమ్మాయి.
తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ, గుండె కాయ బలంగా ఉంటేనే తెలంగాణ బతికి బట్టకడుతుంది. కెసిఆర్ పగ్గాలు చేపట్టగానే ముందు గుండె కాయపైనే దృష్టిపెట్టారు. నగరంలో దాదాపు 30 శాతం విస్తరించి ఉన్న ఎంఐఎం లాంటి పార్టీకి ప్రాధాన్యత ఇవ్వడం వెనుక వ్యూహం సైతం ఇదే. హైదరాబాద్‌లో భారీ నిర్మాణాలు, ఆకాశ మార్గాలు వంటి ప్రకటనలతో రియల్ ఎస్టేట్ రంగం ఆలోచనలో పడింది. తెలంగాణ ఏర్పాటుకు ముందే రియల్ ఎస్టేట్ రంగంలో కొంత స్తబ్దత ఏర్పడి అది కొనసాగింది. ఇప్పుడిప్పుడు తిరిగి కదలిక ప్రారంభం అయింది. అంతే తప్ప భయంకరంగా ప్రచారం జరిగినట్టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పాతాళంలో పడిపోలేదు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారికే పదవులు లభించాలని తెలంగాణ ఉద్యమ కారులు కోరుకోవడంలో తప్పు లేదు. రాజకీయం వేరు ఉద్యమం వేరు. చివరకు ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంతాచారి తల్లే ఎన్నికల్లో ఓడిపోయారు. ఎలాంటి త్యాగాలు చేయని, ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బు పెట్టుబడి పెట్టిన అభ్యర్థి విజయం సాధించారు. ఎన్నికల రాజకీయాలు వేరు, ఉద్యమ రాజకీయాలు వేరు. అందుకే ఎన్నికల సమయంలో, ఎన్నికల తరువాత అంత వరకు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వారిని సైతం టిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. మంత్రివర్గంలో సైతం స్థానం కల్పించారు. తెలంగాణ సాధించారు సరే ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలంటే అధికారంలో ఉండడం, తిరిగి అధికారం దక్కేట్టు ఇప్పటి నుంచే వ్యూ హాలు రచించుకోవడం ఏ రాజకీయ పార్టీకైనా అవసరం. దానిలో భాగంగానే పక్తు రాజకీయ ఎత్తుగడలతో ఇతర పార్టీలను బలహీన పరుస్తూ ఆయా పార్టీల వారిని టిఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారు. రాష్ట్రంలో ఇదేమీ కొత్త కాదు గతంలో ఉన్నదే, ఇప్పుడు సాగుతున్నది, భవిష్యత్తులో కూడా ఉంటుంది.
తెలంగాణ పోరాడి సాధించుకున్న రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ అనివార్యంగా ఏర్పడిన రాష్ట్రం. తెలంగాణలో కేసీఆర్ విఫలం చెందాలని ఇతర రాజకీయ పక్షాలు కోరుకోవడం సహజం. కేసీఆర్ విఫలం అయితే తాము అధికారంలోకి వస్తామనేది ఆ పార్టీల ఆశ. కానీ కేసీఆర్ నాయకత్వం విఫలం అయితే ప్రజల ఆకాంక్ష విఫలం అయినట్టు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ విఫల ప్రయోగంగా చేసినట్టు అవుతుంది. ప్రజల ఆకాంక్షల మేరకు కేసీఆర్ నడుచుకోవాలి. తాను విఫలం చెందితే టిఆర్‌ఎస్ అనే ఒక రాజకీయ పార్టీ, కేసీఆర్ అనే ఒక నాయకుడు విఫలం చెందినట్టు కాదు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష, నమ్మకం విఫలం చెందినట్టు.
సదకొండు నెలల కాలంలో టిఆర్‌ఎస్ చెప్పుకోదగిన విజయాలనే సాధించింది. వచ్చే ఎన్నికల్లో ఇంటింటికి తాగునీటిని అందించలేకపోతే ఓట్లు అడగడం అని కెసిఆర్ ధైర్యంగా చెబుతున్నారు. అవి చేస్తాం ఇవి చేస్తాం అని రాజకీయ నాయకులు ప్రకటించడం మామూలే కానీ ఎన్నికల నాటికి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగం అని ఎవరూ చెప్పలేదు. వాటర్ గ్రిడ్ పథకంపై ప్రధానమంత్రి సైతం ఆసక్తి చూపుతూ అన్ని రాష్ట్రాలను పరిశీలించమని చెప్పారు. చెరువులు తెలంగాణకు ప్రత్యేకం. చెరువు పూడిక తీసివేత ఒక ఉద్యమంగా చేపట్టడం టిఆర్‌ఎస్‌కు రాజకీయంగా, తెలంగాణ పల్లెలకు ఆర్థికంగా ప్రయోజనకరమైంది. ఏటా ఈ సీజన్‌లో విద్యుత్ కోతలతో అల్లాడే వాళ్లు. ఈ సీజన్‌పై ఎంతో ఆశలు పెట్టుకుని విపక్షాలు ఉద్యమానికి లాంతర్లు సిద్ధం చేసుకున్నాయ. కానీ గతంలో ఎప్పుడూ లేనట్టుగా విద్యుత్ కోత అనేది ఈ సీజన్‌లో లేకుండా చూడడంలో కేసీఆర్ విజయం సాధించారు. ఉద్యమ నాయకుడిగానే కాదు పాలకుడిగా సైతం తన శక్తి సామర్ధ్యాలను కేసీఆర్‌చూపించారు.
ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, మీడియాను ఖాతరు చేయడం లేదు, అనే విమర్శల సంగతి ఎలా ఉన్నా తెలంగాణ ప్రజలను మెప్పించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని కేసీఆర్ నిలబెట్టుకోవాలి. కేసీఆర్ ఏ మీడియా పెద్దను కలిశారు, ఎవరికి పదవి ఇచ్చారు? పౌర హక్కులను ఎంత వరకు కాపాడుతున్నారు? ఎన్‌కౌంటర్‌లు నిజమేనా? అనేది విమర్శకులకు కావాలి. కేసీఆర్ తెలంగాణ కోసం ఏం చేయనున్నారు అనేదే సాధారణ తెలంగాణ ప్రజలకు కావలసింది. సంక్షేమ పథకాలు, నీళ్లు, నీడ, ఉపాధి ఇవే వారికి కావలసినవి. ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత వీటికే ఇవ్వాలి. సామాన్యుడికి సొంతింటి కల నెరవేరితే, ఇంత కాలం ఫ్లోరోసిస్ శాపానికి బలైన వారికి గుక్కెడు మంచినీళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించిన రోజే బంగారు తెలంగాణ సాకారం ఆయినట్టు.

19, ఏప్రిల్ 2015, ఆదివారం

మోదీ లో ఒక అపరిచితుడు

‘‘ఏమోయ్ కమల్‌నాథ్ ఎలా ఉన్నావు? ’’
‘‘ మంచి చేస్తే మోదీ అయినా అంబానీ అయినా మంచిని మంచి అనాలి. అంత మాత్రాన నేను కమల్‌నాథ్‌ను ములాయంను అయిపోతావా? ’’
‘‘నాకు గుర్తున్నంత వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమాలు జరిగేప్పుడు నువ్వే ములాయంకు వీరాభిమానిగా మాట్లాడావు’’

‘‘నేనా? మా మరదలు పుట్టగానే నాకు కాబోయే పెళ్లాం అని, బిజెపి పుట్టగానే నేనా పార్టీ సభ్యుడిని అని ఇంట్లో వాళ్లు తేల్చేశారు. అలాంటి నేను ములా యం అభిమానినేంటి? ’’
‘‘తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో నీ వాదనలు ఓసారి గుర్తు చేసుకో, కాంగ్రెస్, బిజెపి అన్ని పార్టీలు తెలంగాణకు మద్దతు ప్రకటించడంతో ఈ పార్టీలను ఎవరూ నమ్మడం లేదని, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న ములాయంసింగ్ ప్రధానమంత్రి అవుతారని చాలా గట్టిగా వాదించావు. ’’

‘‘ఓ ఆదా.. అప్పుడెంత బాధగా ఉన్నానో అర్ధం చేసుకోవాలి ’’
‘‘అది సరే మోదీ భారత పర్యటనకు వస్తున్నారట కదా! ’’
‘‘మోదీ భారత పటాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు సంతోషించాలి కానీ వ్యంగ్యం ఎందుకు? గతంలో ఒక ముఖ్యమంత్రి హైదరాబాద్ పటాన్ని ప్రత్యేక విమానంలో ప్రపంచమంతా తీసుకెళ్లి ప్రపంచ పటంలో చేర్పిస్తే, ఇప్పుడు ప్రపంచ పటంలో మోదీ భారత దేశాన్ని చేర్పిస్తున్నారు ’’
‘‘నిజమే... లేకపోతే ప్రపంచానికి భారత దేశం అని ఒక దేశం ఉందనే విషయమే తెలియకపోయేది. ప్రపంచ దేశాల నుంచి ఇండియాకు విమాన మార్గాన్ని కనిపెట్టిందే మోదీనే?’’

‘‘ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తుందంటే అది మోదీ సాధించిన విజయం కాదా? ’’
‘‘ఎన్నికలు వచ్చినప్పుడు జిల్లా పత్రికల్లో ఇలాంటి శీర్షికలే కనిపిస్తాయి. అందరి చూపు పరకాలవైపే, అందరి చూపు శృంగవరపు కోట పైనే అంటూ ఏ నియోజక వర్గం విలేఖరి అందరి చూపు తమ నియోజక వర్గంపైనే అని రాస్తారు. వరుసగా నలుగురైదుగురు విశ్వసుందరీమణులు మన దేశం నుంచి ఎన్నికైనప్పుడే నీకు అర్ధమై ఉండాలి. భారత్‌లో మంచి మార్కెట్ అవకాశాలు ఉన్నాయని ప్రపంచం గుర్తించింది అని ’’
‘‘అంటే మోదీ ప్రభావం ఏమీ లేదంటావు’’
‘‘ఆకలి రాజ్యం సినిమా చూశావా? ఆకలి రాజ్యం సినిమా చూడని వాడు, శంకరాభరణం చూడలేదని చెప్పే తెలుగోడు ఎంత వెతికినా కనిపించడు.’’
‘‘ఇప్పుడా సంగతి ఎందుకు? ’’
‘‘ఆ కాలంలో ఇదో అద్భుత కళాఖండం. హీరో ఆకలి కేకలు, కడుపు మాడ్చుకోవడం, తిండి కోసం శ్రీశ్రీ పుస్తకాలు అమ్ముకోవడం ఇప్పుడు చూస్తే నవ్వొస్తుంది. ’’

‘‘మోదీకి ఆకలి రాజ్యానికి సంబంధం ఏమిటి? చర్చను పక్కదారి పట్టిస్తున్నావు’’
‘‘నీ చిన్నప్పటి సంగతి గుర్తుందా? దాదాపు ఆకలి రాజ్యం సినిమా కాలం వరకు అంటే 1980 వరకు ఉదయానే్న ఇంటి ముందు బిక్షగాళ్లు ప్రత్యక్షం అయ్యే వాళ్లు. రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటే వేయమని గుర్తుందా? ’’
‘‘ప్రతి ఇంట్లో ఫ్రిజ్‌లు ఉన్నాయి. మిగిలిపోయిన వాటిని అక్కడ దాచుకుంటున్నారు’’
‘‘దాచుకోవడం సరే. మా చిన్నప్పుడు ఇంటికొచ్చి మిగిలిన అన్నం అడుక్కునే వాళ్లు అని పిల్లలకు చెబితే నిజమా? అని ఆశ్చర్యపోతారు. ’’
‘‘నిజమే ఆ రోజుల్లో ఇంత డబ్బు లేకపోయినా జీవితంలో ఎంతో సంతోషంగా ఉండేది. నెలకోసారి సినిమాకు వెళ్లడం అంటే ఓ పండుగలా ఉండేది. ఇప్పుడు అరచేతిలో సెల్‌ఫోన్‌లోనే నచ్చిన సినిమా చూసేస్తున్నాం. ఆ రోజులే వేరు ’’

‘‘సంతోషం అనేది నీ మానసిక స్థితిని బట్టి ఉంటుంది. నేను మోదీ గురించి మాట్లాడుతున్నాను’’
‘‘ఆడుక్కునే వాళ్లు, ఆకలి రాజ్యం సినిమా వీటిలో మోదీ గురించి ఏ ముంది. ’’
‘‘ఆకలి రాజ్యం అప్పుడు అంత గొప్పగా ఎందుకు విజయవంతం అయిందంటే ఆ సినిమాలో ఉన్నంత దరిద్రం దేశంలో ఉండేది. దేశ పరిస్థితి కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇప్పుడు మారుమూలు పల్లెల్లో సైతం ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. మోదీ ఏ దేశానికి వెళ్లినా లక్షల మంది భారతీయులు హాజరవుతున్నారు. మోదీ గారి అద్భుతమైన ఉపన్యాసాన్ని ఆస్వాదిస్తున్నారు. మోదీ ఈ దేశంలో కన్నా విదేశాల్లో పర్యటిస్తూ చేస్తున్న ఉపన్యాసాలే ఎక్కువగా ఉన్నాయి. విదేశాల్లో మోదీ ఎవరి ముందైతే దేశాన్ని చేత్తగా మార్చేశారు అని తిట్టారో, ఆ ప్రేక్షకులంతా మోదీ ప్రధానమంత్రి అయిన తరువాత విదేశాలకు వెళ్లిన వారు. తన కన్నా ముందు పాలించిన చెత్త పాలకుల కాలంలోనే వాళ్లు ప్రపంచం నలుమూలలా వెళ్లారు. ఒకప్పుడు సంస్థానాధీశులు, రాజుల సహాయంతో విద్య కోసం విదేశాలకు వెళ్లేవాళ్లు. ఇప్పుడు సామాన్య దిగువ మధ్యతరగతి వారి పిల్లలు కూడా ప్రపంచంలోని అత్యున్నతమైన యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. తిండి గింజలకు సైతం అమెరికా వైపు దేహీ అంటూ చూసిన మాట నిజం కాదా? మరిప్పుడు అమెరికా ఇండియాను పక్కన పెట్టలేని స్థితికి చేరుకోవడం అభివృద్ధి కాదా? ’’

‘‘అంటే మోదీ గొప్పతనం ఏమీ లేదంటావా? ’’
‘‘అని నేనెక్కడన్నాను. ఆయన వచ్చి ఏడాది కాలేదు. అప్పుడే ఏం చేయలేదని ఎలా అంటాం. మోదీలో ఒక అపరిచితుడు ఉన్నాడేమో అనిపిస్తోంది? ’’
‘‘ఎందుకు? ’’

‘‘మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా పార్లమెంటుకు వచ్చినప్పుడు ఏం మాట్లాడారో గుర్తు చేసుకో. దేశ అభివృద్ధిలో అందరి పాత్రను ప్రస్తావిస్తూ, ఇంత కాలం పాలించిన వారిని గుర్తు చేసుకున్నారా? లేదా? అదే మోదీ విదేశాలకు వెళ్లగానే దేశాన్ని ఇంత కాలం పాలించిన వాళ్లు చెత్త చెత్త చేసేశారడం చూస్తుంటే ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడని, దేశంలో ఒక మోడీ, విదేశాల్లో మరో మోదీ మాట్లాడుతున్నారేమో అనిపించడం లేదూ? 60ఏళ్ల పాలించిన వారి కాలంలో టీ అమ్ముకునే సామాన్యుడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. మోదీయులు ఎంత కాలం పాలించినా ఒక సామాన్యుడికి ఈ అవకాశం దక్కుతుందా?’’

14, ఏప్రిల్ 2015, మంగళవారం

హీరోలు..దేవుళ్లు! ఒకటే

‘‘బుద్ధిలేకపోతే సరి నీ వయసెంత? ఆ అమ్మాయి వయసెంత? తినేసాలా చూస్తున్నావ్. నీకు సకాలంలో పెళ్లయి ఉంటే అంత వయస్సున్న మనవరాలుండేది నీకు’’
‘‘వయసుదేముందోయ్.. మనసు ముఖ్యం నా మనసెప్పుడూ పాతికేళ్లను మించదు. ’’
‘‘ ఇంతకూ నీ వయస్సెంత? ’’
‘‘ ఎంత మూడు పదులు’’
‘‘ నేనడిగింది ఫేస్‌బుక్‌లో నీ వయస్సెంత ? అని కాదు. నీ అసలు వయస్సెంత? అని ’’
‘‘ అంటే నీ ఉద్దేశం ఫేస్‌బుక్‌లో అసలు వయసును దాచిపెడతారనా? ’’


‘‘ మగవారి జీతం, ఆడవారి వయస్సు అడగవద్దనేది పాత మాట. ఫేస్‌బుక్‌లో మగవారి వయస్సు, ఆడవారి అడ్రస్ అడగవద్దు అనేది నేటి మాట. ఒకవేళ అడిగినా మగవారు అసలు వయసు బయటపెట్టరు, ఆడవారు అడ్రస్ ఇవ్వరు’’
‘‘ అలా ఇవ్వకపోవడమే మంచిది. పరిచయం ఉన్నవారినే నమ్మలేని రోజులివి. ఇక ఫేస్‌బుక్‌లో కనిపించని వారు అడిగినా ఎలా చెబుతారు? ’’
‘‘ అది సరే నేనడిగింది ? నీ వయసు ఎంత? అని ఆ విషయం దాటేస్తున్నావు. ’’
‘‘ నన్నంటే నీ వయస్సెంత అని పదే పదే అడిగేస్తున్నావు? ఓ హీరోను ఈ ప్రశ్న వేయగలవా? ’’


‘‘ నీకు దైవభక్తి ఉందా? ’’
‘‘ మాట మారుస్తున్నానని నన్నన్నావు. ఇప్పుడు నువ్వే మాట మారుస్తున్నావు. నేను హీరో వయసు గురించి అడిగితే నువ్వు దేవుళ్ల గురించి మాట్లాడుతున్నావు.’’
‘‘నువ్వు అడిగిన విషయం చెప్పడానికే నేను దేవుళ్ల గురించి మాట్లాడుతున్నాను.. దైవభక్తి ఉండే ఉంటుంది. నువ్వు చిన్నప్పటి నుంచి శ్రీరాముడు, శ్రీకృష్ణుని రూపాలను చూస్తున్నావు కదా? నీ చిన్నప్పటి శ్రీరాముని రూపానికి ఇప్పటి రూపానికి ఏమైనా తేడా ఉందా? ’’
‘‘ లేదు’’
‘‘ నీ చిన్నప్పటి దేవుళ్ల రూపానికే కాదు. కావాలంటే మీ తాతను కూడా అడుగు వాళ్ల చిన్నప్పుడు శ్రీరాముని రూపం ఎలా ఉండేదో? ఇప్పుడూ అలానే ఉంది? మనిషి దేవుడిని కనుగొన్నప్పటి నుంచి దేవుళ్ల రూపం ఇలానే ఉంది. ’’
‘‘అంటే దేవుళ్లు , హీరోలు ఒక్కటే అంటావా? ’’
‘‘అలా నేనెక్కడన్నానను.. దేవుళ్లు అమృతం తాగారు. వారికి ఇంక్రిమెంట్లు,రిటైర్‌మెంట్ వయసు, వృద్ధాప్య పెన్షన్ల వంటివి ఉండవు. దేవుళ్లు ఒకసారి యువ వయసులోకి వచ్చాక ఇక వయసు పెరుగుదల అక్కడితే ఆగిపోతుంది. అంతే కావాలంటే చూడు చిన్ని కృష్ణుడు బాల్యలో వెన్నదొంగగా చేసిన చిలిపి పనుల గురించి కథలున్నాయి కానీ వయసు మీరాక వృద్ధాప్య సమస్యల గాథలు ఏమైనా ఉన్నాయా? అంటే దేవుళ్లకు బాల్యం, తరువాత యవ్వనం అంతే తప్ప మరోటి ఉండదు. హీరోలు అభిమానుల పాలిట దేవుళ్లు వారికి కూడా అంతే హీరోలకు బాల్యం ఉంటుంది. సినిమాల్లోకి వచ్చాక యవ్వనం అంతే ఆ తరువాత మరో దశ వారి జీవితంలో ప్రవేశించదు. ’’


‘‘ పోనీ హీరోగా మారేందుకు ఏ వయసు ఉండాలంటావు? ’’
‘‘నువ్వింగా వాస్తవంలోకి రావాలోయ్. ఊహాలోకాల్లో బతుకుతున్నావ్.. ఇదేమన్నా ప్రభుత్వ ఉద్యోగమా? ఫలానా వయసు వారే దరఖాస్తు చేయాలని చెప్పడానికి. సమైక్యాంధ్ర ఉద్యమ వీరులకు బాబు రెండేళ్ల సర్వీసు పొడిగిస్తే, తెలంగాణ ఉద్యమ వీరులకు ఉద్యోగ నియామకాల్లో ఐదేళ్ల రాయితీ ఇస్తానని, అంతా ఒప్పుకుంటే పదేళ్ల రాయితీ ఇస్తానని ప్రకటించేశారు. ప్రభుత్వ ఉద్యోగాలకే ఏజ్‌కు సంబంధించి ఎన్నో మినహాయింపులు ఉన్నప్పుడు హీరో ఏజ్‌కు ఇది అని ఎలా చెప్పమంటావు’’
‘‘అంటే హీరోకు అస్సలు ఏజ్‌తో సంబంధం ఉండదా? ’’
‘‘అర్ధం చేసుకున్నవారికి చేసుకున్నంత. హీరో వయసు ముదిరో, బోర్ వేసో రాజకీయాల్లోకి రావాలనుకున్నాడనుకో వయసుతో సంబంధం లేకుండా కుమారుడిని హీరోగా పరిచయం చేసేస్తాడు. ఐదారు డజన్ల వయస్సున్నా ఒకవైపు హీరోగా నటించేస్తునే, రెండు డజన్ల వయస్సు దాటని కొడుకును హీరోను చేసిన మహనీయులు లేకపోలేదు. తాత హీరోగా నటిస్తూ మనవడిని హీరోగా పరిచయం చేసేందుకు దర్శకుడితో చర్చలు జరిపేవారు లేకపోలేదు. హీరో వయసు ఆరు డజన్లు అని చెప్పమంటావా? ఐదారు డజన్ల వయస్సు అని చెప్పమంటావా? ’’
‘‘నాకిప్పుడు ఓ విషయం అర్ధమైంది. దేవుళ్లను, హీరోలను, ఫేస్‌బుక్‌లో వారిని వయసు అడగొద్దని’’


‘‘నీకు ఇంకో విషయం చెప్పానా? ఇప్పుడంటే పెళ్లికి ఎవరి మాట ఎవరు వినడం లేదు కానీ. మాట వినే రోజుల్లో అమ్మమ్మనో, నానమ్మనో కన్ను మూసే లోపు మనవడి పెళ్లినో, మనవరాలి పెళ్లో చూడాలనుందంటే వయసుతో సంబంధం లేకుండా బాల్య వివాహాలు చేసేసేవారు. అలానే ఇప్పుడు తండ్రి రాజకీయాల్లోకి వచ్చేయాలనుకుంటేనో? తాతయ్య త్వరలోనే బకెట్ తనే్నసే సూచనలు ఉన్నాయంటే ఒకటిన్నర డజన్ల వయస్సున్నా సరే మనవడిని హీరోను చేసేస్తున్నారు. ’’
‘‘నిజమా?’’


‘‘సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్‌లో రింగులు కనిపిస్తాయి కదా? అలా ఓసారి అలా ఆ రింగుల మధ్యలో నుంచి ఈ దృశ్యాన్ని చూడు. ఆపరేషన్ థియోటర్ నుంచి డాక్టర్ బయటకు వచ్చి గంభీరంగా ముఖం పెట్టి కళ్లద్దాలు తుడుచుకుంటూ పెదవి విరవగానే, సినిమాలో అయితే ఆపరేషన్ థియోటర్ వద్ద ఎర్రలైటు వెలుగుతుంది. కానీ సినిమా వాళ్ల జీవితంలో మాత్రం ఆ వంశం నుంచి కొత్త హీరో పేరును ప్రకటిస్తూ, కొత్త సినిమా ప్రారంభం అవుతుంది. అతని వయసు డజనుకు కొంచం అటూ ఇటుగా ఉన్నా పరవాలేదు. ’’
‘‘ పోనీ హీరోయిన్‌కు వయస్సుంటుంది కదా? ’’


‘‘ ఎందుకుండదు. మొన్నో నాలుగు డజన్ల వయస్సున్న హీరో ఒకరు రెండు డజన్ల వయస్సున్న హీరోయిన్‌ను రిజెక్ట్ చేశాడు. మరీ ముదిరిపోయిందండి. ముంబై నుంచి కొత్త అమ్మాయిని తెప్పించండి అన్నారు. మనవరాలి వయస్సున్న ఆ హీరోయిన్‌తో ఈ వృద్ధ హీరో రెచ్చిపోయి నటించేశాడు. అంటే హీరోయిన్లకు రెండు డజన్లకు మించి వయస్సు ఉండకూడదు. హీరో మాత్రం దేవుడే. ఇందులో ఎలాంటి మినహాయింపు లేదు. ’’

‘‘ నువ్వు చెప్పింది విన్నాక తెలుగు ప్రేక్షకుల శాపం నాకు తెలిసొచ్చింది. అప్సరసలకు వృద్ధ ఇంద్రుడే దిక్కన్నట్టు తెలుగు ప్రేక్షకులకు వృద్ధ హీరోలే దిక్కు.’’ 

5, ఏప్రిల్ 2015, ఆదివారం

విజన్ 2050 అను అప్పిగాని అప్పు కథ

‘‘నీ వాయిస్ ఎంత స్వీట్‌గా ఉంటుంది డార్లింగ్... ఇలా వింటూనే ఉండిపోవాలనిపిస్తోంది’’


‘‘ఏరా పొద్దస్తమానం అలా సెల్‌ఫోన్ మాట్లాడడమేమా? ఇంటి గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా? చెట్టంత కొడుకు పనీ పాట లేకుండా రోడ్లపై తిరుగుతుంటే తల్లి ఎంత బాధపడుతుందో? నీకేమైనా అర్ధమవుతుందా? నా రోజు కూలీ డబ్బులు కూడా అద్దె సైకిల్‌పై నువ్వు షికార్లు కొట్టడానికే సరిపోతుంది. అద్దె సైకిల్ జీవితం గడుపుతూ ఆకాశంలో విహారం చేయడం మాని కాస్త భూమిపై ఉండి ఆలోచించరా బాగుపడతాం.’’


‘‘ ఒక్క నిమిషం ఉండు డార్లింగ్. మమీ తో అర్జంట్ మ్యాటర్ మాట్లాడి మళ్లీ వస్తాను... ఏంటీ నేనేదో అర్జంట్ విషయం ఫోన్‌లో మాట్లాడుతుంటే ఇంట్లో నీ సణుగుడేంది. నోరు మూసుకోని ఇంట్లో కూర్చో. ఇప్పుడు నీ సంపాదనపై ఆధారపడ్డానేమో కానీ ఓ 20 ఏళ్ల తరువాత నాలాంటి కొడుకును కన్నందుకు గర్వపడతావు. ఇరవై ఏళ్ల వరకు నోరు మూసుకొని ఇంట్లో పడుండు’’


‘‘అయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లు. బయటకు వెళ్లమనడానికి నువ్వెవరు? 2030 వరకు ఇంట్లో నుంచి కదిలేది లేదు. కావాలంటే నువ్వే ఇంట్లో నుంచి వెళ్లిపో.. సారీ డియర్ ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కషన్ చేయాల్సి వచ్చింది అందుకే ఫోన్ కట్ చేశాను. చెప్పు డియర్ నీతో ఎంత కాలమైనా ఇలా మాట్లాడుతూనే ఉండిపోవాలనిపిస్తోంది.’’
‘‘ మన సంగతి మా నాన్నకు తెలిసిపోయింది డార్లింగ్. మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి. లేకుంటే నేను కుంతీదేవిని అయ్యేట్టుగా ఉన్నాను. నాన్న అడిగాడు అబ్బాయి ఏం చేస్తుంటాడు అని ఏం చెప్పమంటావు’’
‘‘ అబ్బాయికి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. 2040 నాటికి అబ్బాయిని ఎవరూ పట్టలేరని చెప్పు చాలు’’
‘‘ అది సరే ఇంతకూ మనం పెళ్లేప్పుడు చేసుకుందాం ’’
‘‘ చెప్పాను కదా డియర్ మనకు 2030 దాటితే కానీ మంచి రోజులు రావు. అప్పటి వరకు వేచి చూడగలిగితే చూడు. లేదంటే నీ దాని నీది నా దారి నాది. ప్రపంచంలో నంబర్‌వన్‌గా నిలవాలంటే ఆ మాత్రం ఓపిక ఉండాలి డియర్. ’’


‘‘ ఇప్పుడు నాకు మూడో నెల’’
‘‘ నువ్వు మాట్లాడే దానికి ఏమైనా అర్ధం ఉందా? డియర్.కాస్త ఉన్నంతంగా ఆలోచించడం ఎప్పుడు నేర్చుకుంటారో అర్ధం కాదు. నేను 30ఏళ్ల తరువాత సంగతి చెబుతుంటే నువ్వు మూడునెలల గురించి చెబుతున్నావు’’
‘‘తొమ్మిది నెలల్లో బిడ్డ భూమిపైకి వస్తుంది. కడుపులో పెరుగుతున్న బిడ్డ సంగతి ఏం చేద్దామనుకుంటున్నావు’’
‘‘ఏం ఓ 30 ఏళ్లు ఆగలేవా? ఎన్నిసార్లు చెప్పాలి డియర్ కడుపులో బిడ్డయినా 30 ఏళ్ల వరకు ఆగాల్సిందే.. అంతే... ’’


****
‘‘మేం అధికారంలోకి వచ్చాకే ప్రపంచంలో భారత్‌కు గుర్తింపు లభించింది. ఎందుకో తెలియదు కానీ ఇంత కాలం ప్రపంచం భారత్‌ను చిన్నచూపు చూసింది.. నేను అధికారంలోకి రాగానే పెద్ద చూపు చూస్తోంది’’ అని బెంగళూరు సభలో నరేంద్ర మోదీ ప్రకటించారు.
‘‘తెలంగాణలో రెవెన్యూ మిగులుకు పదేళ్ల క్రితం నాటి నా పాలనే కారణం. తెలంగాణ, ఆంధ్రలో సమస్యలకు మాత్రం కాంగ్రెస్ పాలనే కారణం.. ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను చేర్చింది నేనే అని చంద్రబాబు 987వ సారి పునరుద్ఘాటించారు.’’
‘‘ ఏరా నీకొక్కడికే పత్రిక చదవడం వస్తుందనా? అంత గట్టిగా చదివి వినిపిస్తున్నావు?’’
‘‘ లేదు బాబాయ్ జ్ఞానాన్ని నలుగురికి పంచమన్నారు కదా? స్వార్థంతో నేనొక్కడినే పేపర్ చదవడం ఎందుకు పైకి చదివితే నలుగురికి తెలుస్తుందని ’’
‘‘ఈ సొల్లు మాటలు, సొల్లు వార్తలతోనే పూరిపాక టీ హోటల్‌లోనే నీ జీవితం గడిచిపోతోందని బాధగా ఉందిరా? ఇల్లు గడవడానికి ఏదైనా ఉద్యోగం చేసేదుందా? ప్రపంచ వార్తలను ఇలా చదువుతూ టైం కాగానే ఇంటికెళ్లి తినడం, పడుకోవడం ఇదేనా నీ జీవితం ’’
‘‘ బాబాయ్ నేనిప్పుడు నీకు ఇలా ఇక్కడ పనికి మాలినోడిగా కనిపించవచ్చు కానీ నాకు బ్రహ్మాండమైన విజన్ ఉంది బాబాయ్ అది నీకు చెప్పినా అర్ధం కాదు. 2030లో ఈ గ్రామంలో కెల్లా నేనే సంపన్నుడిని, 2035లో రాష్ట్రంలో సంపన్నుడిని 2040లో దేశంలో.. 2050లో ప్రపంచంలో కెల్లా నేనే సంపన్నుడిని , 2060లో అంగారక గ్రహంపై అడుగు పెడతాను, అక్కడి సంపదతో విశ్వంలో నేనే సంపన్నుడిని ’’


‘‘ అరే అప్పిగా ఈ టీతో కలిపి మొత్తం 415 రూపాయలయ్యాయి. డబ్బులివ్వకపోతే ఇక్కడి నుంచి కదలనిచ్చేది లేదు. ’’
‘‘పానకంలో పుడకలా నువ్వేంటోయ్ మధ్యలో నేను ప్రపంచంలో కెల్లా సంపన్నుడినని లెక్కలు చెబుతుంటే బోడి టీ డబ్బుల కోసం అంతగా అరవాలా? 2050లో నన్ను చూసి ఒకప్పుడు మా పూరిగుడిసెలో టీ తాగేవారు మహనీయుడు అని దండం పెట్టుకోవాలి. ఎందుకైనా మంచిది ఇప్పుడే ఒక ఫోటో తీసి పెట్టుకో అప్పుడు నీ హోటల్ గోడకు తగిలించుకోవచ్చు. ’’


‘‘ ఫోటో సంగతి తరువాత ఏ మాత్రం సిగ్గున్నా డబ్బులిచ్చి కదలాలి. అరే అప్పిగా ఇప్పుడే చెబుతున్నా, రేపటి లోగా నా డబ్బులు నాకు ఇచ్చావా? సరే లేదంటే ఇక్కడ నీ పేరు మీద హుండీ పెడతాను. అప్పిగాడి అప్పు .. ధర్మం చేయండి అని రాసి పెడతాను. అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు’’
‘‘మంచి ఐడియా ఊళ్లో నాకున్న క్రేజీతో హుండీ నిండడం పెద్ద కష్టమేమీ కాదు. ఒక పని చేయ్.. ఒకటి కాదు.. మొత్తం మూడు హుండీలు పెట్టు. అందులో రెండు హుండీల మొత్తం నాకు పంపించు, ఒకటి నీ పాత బాకీల కింద తీసుకో’’


****
పాతబడి పోవడంతో పురుగులు తినేసిన టీ కొట్టులోని దూలం ఒక్కసారిగా టపీ మని పడిపోయింది. అప్పిగాడి కాలుపై దూలం పడడంతో అమ్మా అంటూ గట్టిగా అరిచేశాడు.
అప్పిగాడికి ఏమైంది డాక్టర్ అని అంతా కంగారుగా అడిగారు. స్పృహలోకి వస్తేకానీ ఏమీ చెప్పలేనని ఆర్‌ఎంపి డాక్టర్ బదులిచ్చాడు. ఇంతకూ మన అప్పి ఇప్పుడు స్పృహలోకి వస్తాడా? మరో 30 ఏళ్లు నిరీక్షించాలా?
ఏమో ఆర్‌ఎంపి డాక్టరే చెప్పలేనప్పుడు మనమేం చెబుతాం? కాలమే చెప్పాలి!!