23, మార్చి 2018, శుక్రవారం

పాతివ్రత్య మీడియా!

‘‘నిన్ను  దించేయడమే.. అంటూ అతను పదే పదే అంటున్నాడు.. అంత మొనగాడా?’’
‘‘ఎంతో మంది పీఎంలను, సీఎంలను అతను పైకి తీసుకు వెళ్లాడు, కిందికి తీసుకువచ్చాడు.’’
‘‘నిజమా?’’
‘‘ఇందులో అబద్ధం ఏముంది? పైకి తీసుకువెళ్లడం, కిందికి తీసుకు రావడమే అతని డ్యూటీ. అతను లిఫ్ట్ బాయ్..’’
‘‘సర్లే.. నేను రాగానే ఏదో చదువుతూ పగలబడి నవ్వుతున్నావ్..ఏంటి సంగతి? ’’
‘‘శాంతిభద్రతలు సరిగా లేవని దావూద్, బ్యాంకులు పనితీరు మెరుగు పరుచుకోవాలని నీరవ్ మోదీ, విజయ మాల్యా అంటే ఏమనిపిస్తుంది? సినిమా రంగం వారసులతో నిండిపోయిందని జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు చెబితే, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ అవును అంటే ఎలా ఉంటుంది? ’’
‘‘ఎందుకలా పడిపడి నవ్వుతున్నావని అడిగితే- ఏదేదో చెబుతావేం? శాంతిభద్రతలు సరిగా లేకపోతే దావూద్ ఐతేనేం, బిన్ లాడెన్ అయితేనేం అదే చెబుతారు కదా?’’
‘‘చెప్పొద్దని అనడం లేదు. నీకేమనిస్తుంది అని అడుగుతున్నాను?’’
‘‘ఎందుకలా పడి పడి నవ్వుతున్నావో చెప్పు ముందు’’
‘‘యాచకునికి యాచకుడే శత్రువు అనే మాట గుర్తుకు వచ్చి...’’
‘‘అక్కడేదో సీరియస్ విషయం మీద వ్యాసం ఉంటే అది చూపిస్తూ పగలబడి నవ్వడమే కాకుండా పొంతన లేని సామెతలు చెబుతున్నావు’’
‘‘టీవీ చానళ్లలో ప్రవచనాలు చెబుతుంటారు విన్నావా? అదృష్ట వశాత్తూ మన తెలుగువారెవరూ ఆ స్థాయికి వెళ్లలేదు కానీ ఆ మధ్య దేశ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను మూటగట్టుకున్న స్వామీజీలు కొందరు చిల్లర వ్యవహారాల కే సుల్లో అరెస్టయ్యారు గుర్తుందా? అలాంటి స్వాముల ప్రవచనాలు వింటుంటే ఏమనిపిస్తుంది?’’
‘‘ముందు అసలు విషయం చెప్పు’’
‘‘అక్కడికే వస్తున్నాను. ఈ మధ్య సామాజిక మాధ్యమాల హవా పెరిగిపోయింది కదా? ఫేస్‌బుక్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాల్లో అబద్ధాల జోరుకు హద్దే లేకుండా పోయిందట!’’
‘‘నిజమే కదా? పిచ్చి పిచ్చి పుకార్లు సామాజిక మాధ్యమాల్లో ఎంతగా వ్యాపింపజేస్తున్నారో నీకేమన్నా తెలుసా? ఆరు తోకలు, పన్నెండు  మూతుల పాము అని ఒకడు. అదేదో దేశంలో పుట్టగానే పిల్లలు మాట్లాడేస్తున్నారని మరొకడు ప్రచారం చేస్తున్నాడు. ఇత్తడి రేకు మీద తెలుగులో ఏదో రాసున్న ఫోటో కనిపించగానే శ్రీవేంకటేశ్వరస్వామి తన వివాహానికి కుబేరుని వద్ద తీసుకున్న అప్పుకు రాసిచ్చిన ప్రామిసరీ నోటు అని సామాజిక మాధ్యమాల్లో తెగ ప్రచారం చేస్తున్నారు. ఇదిగో ప్రామిసరీ నోటు అని ఒకడు పోస్ట్ చేస్తే, శ్రీవేంకటేశ్వర స్వామి రాసిచ్చిన ఆ నోటుకు సాక్షి సంతకం అన్నగారే పెట్టారు తెలుసా? అని మరో బుడంకాయ తాను దగ్గరుండి చూసినట్టు పుకారుకు మరింత మసాలా జోడిస్తున్నాడు. ఆ మధ్య శ్రీకృష్ణదేవరాయల 2019 ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో పంపిన సందేశం కూడా వాట్సప్‌లో వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి ప్రచారంపై అంత సీరియస్‌గా వ్యాసం రాస్తే అంతగా ఎందుకు నవ్వుతున్నావ్?’’
‘‘అదే చెప్పాను.. యాచకుడికి యాచకుడే శత్రువు అని ?’’
‘‘అదే అడుగుతున్నా, అది ఎలా? ’’
‘‘రామలింగరాజు గుర్తున్నా డా? గుర్తుండే ఉంటాడు లే.. ఐటి ప్రపంచంలో ఎక్కడికో వెళ్లిన ఆయన ఎందుకు గుర్తుండడు. ఎవరూ కనిపెట్టక ముందే తానేం తప్పు చేశాడో రామలింగరాజు పూసగుచ్చినట్టు వివరిస్తూ తన నేరాన్ని అంగీకరించాడు. ఆ వెంటనే తెలుగు మీడియా రంగంలోకి దిగి ఆరు నెలల పాటు కథలల్లింది. ‘చందమామ’ మూత పడిందనే బాధ కలుగనీయకుండా కథలు వండి వార్చారు. చిన్నపిల్లలకు చాక్లెట్ ఆశ చూపి కిడ్నాపర్లు ఎత్తుకెళ్లినట్టు. రామలింగరాజును అమాయకుణ్ణి చేసి తనకు నచ్చని పార్టీ నాయకుడు ఆయన్ని నిలువునా ముంచాడని కథలు అల్లారు. ఆరునెలల పాటు వచ్చిన ఆ కథలు సేకరించి పుస్తకం వేస్తే ఇప్పటి వరకు వచ్చిన తెలుగు కథా సంకలనాలను తలదన్నేది  అవుతుంది’’
‘‘ఔను ఐతే.. ?’’
‘‘ఆరునెలల తరువాత పోలీసులు రాజు మీద చార్జీషీట్ దాఖలు చేశారు. తానేం తప్పు చేశానని రామలింగరాజు ప్రకటించారో చార్జీషీట్‌లో అవే ఆర్థిక నేరాలు ఉన్నాయి. అప్పుడు తెలుగు మీడియా ఇదే మాట రాసింది. ఆరునెలల నుంచి వండి వార్చిన కథల సంగతి ఏమిటని ?ఎవరూ అడగలేదు. వండివార్చామని మీడియా చెప్పలేదు. ’’
‘‘ఔను! ఐతే ఏంటి?’’
‘‘సామాజిక మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తుందని ‘పవిత్ర మీడియా’ ఆవేదన వ్యక్తం చేస్తూ వ్యాసాలు రాస్తుంటే యాచకునికి యాచకుడే శత్రువు అనే మాట గుర్తుకు వచ్చింది. అబద్ధాలు రాసే అవకాశం ఒకప్పుడు తమకే పరిమితం అయ్యేది ఇప్పుడు అందరికీ ఆ అవకాశం దక్కిందనే అక్కసు కనిపిస్తోంది. కోడలికి బుద్ది చెప్పి అత్త తెడ్డు నాకిందని ఓ సామెత. పరిణామక్రమాన్ని అర్థం చేసుకోవాలి.. తప్పదు.. ఒకప్పుడు మీడియా ఒక పార్టీ సొత్తు. పరిణామక్రమంలో పార్టీల సొత్తుగా మారింది. మీడియా సామాజిక వర్గాలకే పరిమితం అయిందని బాధపడుతున్న కాలంలో సామాజిక మాధ్యమాలు పుట్టాయి. దీంతో ప్రతి ఒక్కరూ అచ్చం మీడియాలానే తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దే చాన్స్ వచ్చింది. వేదాలు కొందరికే పరిమితం అనుకున్న కాలంలో అందరికీ అవి అందుబాటులోకి వచ్చినప్పుడు సాంప్రదాయవాదులు ఎంత బాధపడ్డారో అభిప్రాయాలను ప్రచారం చేసే అవకాశం సామాజిక మాధ్యమాల ద్వారా దక్కినప్పుడు అంతే బాధపడుతున్నారనిపిస్తోంది. మోదీ విజయంలో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర వహించాయని చెబుతారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నాయి. ’’
‘‘అంటే- సమాచారానికి వాస్తవం అనే పవిత్రత అవసరం లేదా?’’
‘‘పాతివ్రత్యం ఆడవారికే కాదు మగవారికీ ఉండాలి. పవిత్రం, పాతివ్రత్యం నాకు లేదు-కానీ నీకు ఉండాలి అని డిమాండ్ చేయడం అన్యాయం. అందరికీ పాతివ్రత్యం ఉండాలని కోరితే నేనే నీకు మద్దతుగా చెయ్యెత్తుతాను. నాకు వర్తించదు, కానీ మీరు పాటించాలి అంటే ఇలానే నవ్వొస్తుంది మరి..! *
-బుద్దా మురళి (జనాంతికం 23-3-2018)

16, మార్చి 2018, శుక్రవారం

అద్దె బతుకులు!

‘‘కలికాలం.. పిదపకాలం.. ఏమండీ.. ఈ వార్త చూ శారా?’’
‘‘ఏ వార్త..? రెండు, మూడేళ్లలో హైదరాబాద్ మహానగరాన్ని నిర్మించి నాయన నాలుగేళ్లయినా కొత్త రాజధానిలో భవనాల మాట దేవుడెరుగు డిజైన్ కూడా ఫైనల్ చేయలేక భావోద్వేగానికి గురైన వార్తేనా?’’
‘‘అది ఎన్నికల కాలం వార్త. నేను చెప్పింది కలికాలం వార్త’’
‘‘ఓ అదేనా? నాకూ బాధేసింది. నాకే కాదు చివరకు ఆ పార్టీ వ్యతిరేకులకు సైతం బాధేసింది. కలికాలం అంతే. రెండు సీట్ల నుంచి పార్టీ రథాన్ని అధికార పీఠం వరకు తీసుకువెళ్లిన అద్వానీకి ఈ వయసులో అంత అవమానం చూశాక.. రాజకీయంలో ఏదైనా సాధ్యమే అనిపించింది. రాజకీయమే ఊపిరిగా బతికేవారి తీరు అంతే. రాజకీయం, వ్యాపారం ఒకటే. వ్యాపారంలో సెంటిమెంట్ పని చే యదు. 1998లో దగ్గుబాటి బిజెపి తరఫున షడ్రకుని ఇంటికి పొత్తు కోసం వస్తే బయటే నిలబెట్టి, బయటి నుంచే పంపించారు. శత్రువు ఇంటికి వచ్చినా లోనికి ఆహ్వానించాలని అంటారు. ఇది సామాన్యుల విషయంలోనే.. కానీ, రాజకీయ వ్యాపారంలో ఇలాంటి సెంటిమెంట్లు పనిచేయవు. తోడల్లుడు కదా అని ఆయన ఇంట్లోకి పిలిస్తే, దగ్గుబాటి వల్లనే రెండు పార్టీల పొత్తు అని ఆయనకు క్రెడిట్ వస్తుంది. అందుకే బయటి నుంచి బయటకే పంపించారు. కష్టసమయంలో తనకు అండగా నిలిచిన రాజకీయ గురువు అద్వానీ నమస్కారం చేస్తున్నా పట్టించుకోకుండా శిష్యుడు వెళ్లిపోవడం రాజకీయాల్లో మామూలే’’
‘‘మనుషులను నిచ్చెనమెట్లుగా భావించే వారికి ఎవరైనా ఒకటే. వారి దృష్టిలో అదో మెట్టు అంతే .. అక్కడెవరున్నారు? అనేది వారికి అనవసరం .. నేను చెబుతున్నది దాని గురించి కాదు’’
‘‘ఓహో... ఇప్పుడర్థమైంది. గోరఖ్‌పూర్‌లో అధికార పక్షాన్ని ఘో రంగా దెబ్బతీసిన ఉపఎన్నికల ఫలితాల గురించే కదా? చూడోయ్.. సికిందరాబాద్ అంత లేని త్రిపురలో విజయం సాధించగానే ప్రపంచాన్ని జయించినట్టు హడావుడి చేయడం వల్ల ఉపఎన్నికల్లో ఓటమి నిరాశ కలిగించడం సహజమే. ఓటమి, గెలుపు ఏదీ శాశ్వతం కాదు. ఆయన దేవదూతలా మనల్ని ఉద్ధరించడానికి పుట్టారు. అధికారంలోకి రాగానే ఏదో అయిపోతుందని అతిగా ప్రచారం చేశారు. రాబిన్ హుడ్‌లా ఏదో అద్భుతాలు చేసేస్తాడని అనుకున్నారు. ఎవరు అధికారంలో ఉన్నా వాళ్లేమీ దేవుళ్లు కాదు.. వాళ్లూ మనుషులే.. ఎక్కువగా ఆశలు పెట్టుకుంటే నిరాశ పడాల్సి వస్తుంది. వారి పరిమితులు వారి కుంటాయి. పెద్దనోట్ల రద్దుతో అవినీతి మాయమై, దేశంలోని సంపద అంతా అందరికీ సమానంగా పంపిణీ జరుగుతుందని ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని జనం అమాయకంగా నమ్మారు.’’
‘‘నేనేం అడుగుతున్నాను. మీరేం చెబుతున్నారు? నేను లోకల్ విషయాలు చెబుతుంటే మీరేదో అంతర్జాతీయ రాజకీయాలు మాట్లాడుతున్నారు’’
‘‘ఓహో.. తమ్ముడి పార్టీ వార్షికోత్సవ ఉపన్యాసం గురించా నీ అనుమానం. నేనేం చెప్పాలి. ఆయన చదివిన స్క్రిప్టు ఈసారి మేం రాయలేదు కాబట్టి ‘కమలం’ వాళ్ల స్క్రిప్టు అని ఓ పార్టీ వాళ్లు చెబుతున్నారు. ఇందులో కలికాలం.. పిదప కాలం అ ని బాధపడేందుకు ఏ ముంది? ఐనా, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడినే ప్రచారంతో బోల్తా కొట్టించిన వారిని ఢీ కొట్టడం ఎంత మాస్ హీరోకైనా అంత ఈజీ కాదు. ఎన్టీఆర్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ కన్నా ఈయన పెద్ద నటుడా? వారి కన్నా రాజకీయం ఎక్కువ తెలుసా? ’’
‘‘ఆ విషయం కాదండీ.. 24 గంటల న్యూస్ చానల్స్ వచ్చాక, రాజకీయాలకు, సినిమాలకు తేడా లేకపోవడంతో నేనసలు సినిమాలు చూడ్డమే మానేశాను. ఎవరెలా నటిస్తే నాకేం?’’
‘‘ఇంతకూ కలికాలం అని నువ్వు అంతగా ఆశ్చర్యపోయిన విషయం ఏంటో చెప్పు?’’
‘‘సంతోషం .. ఇప్పటి వరకూ నా తరఫున కూడా నువ్వే సమాధానాలు చెబుతూ వచ్చావు. కనీసం ఇప్పుడైనా ఏంటో చెప్పమని అడిగావు.. ఈ వార్త చూశారా? ఇంట్లో వాడుకునే సోఫాలు, మంచాలు, పూల కుండీలు, ఏసీలు కూడా అద్దెకిస్తున్నారట! ఎంతకాలం అని ఒకే వస్తువును వాడుతాం , అద్దెతో తెచ్చుకుంటే నెలకోసారి ఫ్రిడ్జ్ మారిస్తే ఎంత హుషారుగా ఉంటుందో.. జనాల్లో మారిన ఈ వైఖరిని గమనించే ఏదడిగితే అది అద్దెకు సమకూర్చే కంపెనీలు పుట్టుకొచ్చాయి. కలికాలం ... ఛీ..్ఛ.. చివరకు సోఫాలు కూడా అద్దెకు తెచ్చుకుని వాడుకోవడం ఏంటో?’’
‘‘ఇందులో తప్పేముంది? జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. అసలు జీవితమే శాశ్వతం కాదు అనే తత్వాన్ని బాగా వంట బట్టించుకున్న వారే ఎవరో ఈ బిజినెస్ స్టార్ట్ చేసినట్టున్నారు. ఏడు జన్మల వరకు కలిసే ఉంటామని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి వారే, పెళ్లి పందిరిలోనే మంగళసూత్రం కడుతూ పెళ్లి కొచ్చిన అందమైన అమ్మాయిలను అదోలా 
చూసే పెళ్లి కొడుకులున్న కాలం ఇది.. ఏది శాశ్వతం?’’
‘‘మరీ అద్దె బతుకులైపోయాయని మీకేమీ అనిపించడం లేదా?’’
‘‘పాజిటివ్‌గా తీసుకుంటే దీన్ని స్వాగతించాలనిపిస్తోంది. భూమి మీద శాశ్వతంగా జీవిస్తాం అనుకుంటూ సంపాదనే జీవితంగా బతుకుతూ జీవితాన్ని కోల్పోతున్నాం. ఏదీ శాశ్వతం కాదు అన్నీ నశించి పోతాయని అద్దె సోఫాలు, అద్దె ఫర్నిచర్ వ్యాపారం మరింతగా పెరిగితే మనుషుల ఆలోచనా దోరణి మారవచ్చు.  ఒక పార్టీ మరో పార్టీ కోసం పని చేయడం , ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి వెళ్లడం, పాన్ షాప్‌లో పాన్ కొన్నంత ఈజీగా విడాకులు తీసుకోవడం .. ఒకరితో పెళ్లి మరొకరితో కాపురం ఇవన్నీ చూస్తుంటే మన జీవితాలే అద్దె జీవితాలు అయినప్పుడు అద్దె వస్తువులను విమర్శిస్తూ, అద్దె బతుకులు అని తీసిపారేయడం అన్యాయం.’’ *
-బుద్దా మురళి (జనాంతికం 16-3-2018)

9, మార్చి 2018, శుక్రవారం

లాఫింగ్ ఫార్ములా

‘‘హాస్యం లేకపోతే ఎప్పుడో ఆత్మహత్య చేసుకునే వాణ్ణి అని మహాత్మా గాంధీ చెప్పింది అక్షర సత్యం అనిపిస్తోంది.’’
‘‘ఎలా?’’
‘‘ జీవితం రోజురోజుకూ రసహీనంగా మారుతున్నట్టు అనిపిస్తోంది. నువ్వంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావ్? నాకెందుకీ దిగులు?’’
‘‘హాస్యం వల్లే నేనిలా ఉండగలుగుతున్నా’’
‘‘ఈ కాలంలో కూడా నీకు హాస్యం అందుబాటులో ఉందా? నమ్మలేకపోతున్నాను’’
‘‘అసలు హాస్యం లేనిదెక్కడో చెప్పు చూద్దాం’’
‘‘మసీదులో తాగడం తప్పయితే దేవుడు ఎక్కడ లేడో చెప్పు అని గాలిబ్ ప్రశ్నించినట్టుగా ఉందీ ప్రశ్న. చేతిలో ఉన్న ఆ స్మార్ట్ ఫోన్‌లో, ఎడమ చేతిలో ఉన్న ఆ పత్రికలో హాస్యం ఉందా? ’’
‘‘ ఈ స్తంభంలో శ్రీమహావిష్ణువు ఉన్నాడా? చూపించు.. అని హిరణ్య కశిపుడు ప్రహ్లాదుడిని సవాల్ చేసినట్టుగా సవాల్ చేస్తున్నావా? ’’
‘‘అడిగిన దానికి సమాధానం చెప్పు’’
‘‘అన్నింటిలోనూ హాస్యం ఉంది.. అది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. స్మార్ట్ఫోన్, పత్రికల్లోనే హాస్యం ఎక్కువగా ఉంది.’’
‘‘మాటలకేం.. ఎన్నయినా చెప్పొచ్చు. మనం చదువుకునే రోజుల్లో , జంఘాల శాస్ర్తీ ఉపన్యాసాలు, కన్యాశుల్కం, బాపూ కార్టూన్‌లు, మునిమాణిక్యం కథలు, రాగతి పండరి కార్టూన్‌లు మన ఆకలిని తీర్చాయి. జ్యోతి మాసపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రపత్రిక,ప్రభ, యువ, ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచికల్లోని హాస్యకథలు, కార్టూన్‌లు మన హాస్య దాహాన్ని తీర్చేవి. ఆ తరువాత టీవీ వచ్చాక పందుల పెం పకం శిక్షణకే పరిమితం అని మనం జోకులు వేసుకున్న దూ రదర్శన్‌లో ధర్మవరపు సుబ్రమణ్యం ‘ఆనందోబ్రహ్మ’ లాంటి కల్తీలేని హస్యం స్థాయికి ఇంత కాలమైనా మన ప్రైవేట్ చానల్స్ చేరుకోలేదు. ఆ తరువాత జంద్యాల సినిమాలు ఆదుకున్నాయి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ సినిమాలు లేవు, అల్లరి నరేష్‌కు అవకాశాలు లేవు. దూరదర్శన్ రాక ముందు ఆదివారం మధ్యాహ్నం రేడియోలో సంక్షిప్త శబ్ద చిత్రాలు వచ్చేవి. ఇప్పుడు కొన్ని టీవీ చానళ్లలో సంక్షిప్త నీలి శబ్దచిత్రాలను ‘జబర్దస్త్’గా చూపించి నవ్వమంటున్నారు. దీనే్న నువ్వు గొప్ప హాస్యంగా భావిస్తూ సంబరపడుతున్నావ్..’’
‘‘మన హాస్య ఖజానాను బాగానే గుర్తు చేశావ్ కానీ .. వీటిని మించిన హాస్యం మన వార్తల్లో ఉంది. అది చూసే దృష్టిని బట్టి ఉంటుంది. వజ్రం, బొగ్గు ఒకే జాతి. నువ్వు బొగ్గును చూస్తున్నావు కానీ దాని వెనుక ఉన్న వజ్రాన్ని గుర్తించలేకపోతున్నావ్’’
‘‘ఉదయం న్యూస్ చానల్స్‌లో ‘చర్చాగోష్టి’ పేరిట వీధి పోరాటాలను మించిన అరుపులు, అర్థం పర్థం లేని వార్తల న్యూసెన్స్‌లో నీకు వజ్రాలు కనిపించాయా? మా నాయనే’’
‘‘నాగుపాము విషం ప్రాణం తీయడమే కాదు, ప్రాణాలు నిలిపే ఔషధాల తయారీకీ ఉపయోగపడుతుంది’’
‘‘వెబ్‌సైట్స్‌లో న్యూస్, దినపత్రికలను చదువుతూ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావంటే... ఏదో అనుమానంగా ఉంది’’
‘‘తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దు. లాఫింగ్ ఫార్ములా చె బితే నువ్వు నాకన్నా ఎక్కువగా వీటిని ఎంజాయ్ చేస్తావు. పత్రికలు, వెబ్‌సైట్స్ చూసి సంతోషిస్తానని చెప్పగానే అనుమానంగా చూశావు.. కానీ వివరాలు అడిగావా? అడిగితే లాఫింగ్ రహస్యం తెలిసేది’’
‘‘దీనిలో రహస్యం కూడా ఏడ్చిందా? అవి చూస్తేనే నాకు చిరాగ్గా ఉంటుంది’’
‘‘నిజమే కానీ నేను చెప్పినట్టు చూసి ఎంజాయ్ చేయకపోతే అప్పుడడుగు..’’
‘‘ మచ్చుకు ఒకటి చూపిస్తా.. ఇది చదువు.. ’’
‘‘గణతంత్ర దినోత్సవ వేడుకల తరువాత ఉమ్మడి గవర్నర్ మార్పు- ఐతే?’’
‘‘వెబ్‌సైట్ వార్త పూర్తిగా చదువు. ఈ వార్త ఇప్పటిది కాదు పాత వార్త. పత్రికలు సంచలనం కోసం ఓ రెండేళ్ల పాటు ఒకటి రెండు రోజుల్లో గవర్నర్ మార్పు అని రోజూ రాశాయి. ఇదే అంశాన్ని వెబ్‌సైట్ వాళ్లు స్వాధీనం చేసుకుని గణతంత్ర వేడుకల్లో ప్రసంగించాల్సి ఉన్నందున గవర్నర్‌ను మార్చలేదని, వేడుకలు ముగియగానే మారుస్తారు అని గల్లీలో ‘సింగిల్ బెడ్ రూమ్ హౌస్ కం ఆఫీసు’లో కూర్చుని వార్త వండేశారు. తాజా వార్త చదివితే చిరాకేస్తుంది. కానీ ఇప్పుడు చదివితే నీ మోము వికసించి తీరుతుంది. ఏదో ఒకటి, రెండు చెప్పాను. తవ్విన కొద్దీ లంకెబిందెల్లా ఇలాంటివి దొరుకుతాయి. తవ్వుకున్న వారికి తవ్వుకున్నంత. 2014లో దేశమంతా మోదీ హవా సాగుతుంటే ఓ తెలుగు ఆర్‌ఎస్‌ఎస్ వాది ములాయం సింగ్ యాదవ్ ప్రధానమంత్రి అవుతారని జోస్యం చెప్పాడు. ఎలా? అంటే తెలంగాణ ఏర్పాటును దేశంలో వ్యతిరేకించిన పార్టీలన్నింటినీ మినహాయిస్తూ పోతే మిగిలింది ములాయం పార్టీ మాత్రమే. ప్రధాని పదవి దేవుడెరుగు.. ఆయన ముఖ్యమంత్రి కూడా కాలేదు. ఇప్పుడిది చదివితే నవ్వురాకుండా ఉంటుందా? ఇంకో తెలుగు మేధావి విభజన జరిగితే రెండు రాష్ట్రాలకు ముగ్గురు గవర్నర్‌లు అంటూ, పార్లమెంటు కన్నా తన బుల్లి చాంబరే శక్తివంతమైందని ఊహాలోకాల్లో బతికిన మేధావులు ఎంతో మంది వార్తల రూపం లో మనకెంతో హాస్యం వండి వార్చారు .  హైదరాబాద్ నగరం కూడా ఓ రాష్ట్రం అవుతుందని వార్తా కథనం వండి వార్చేశాడో మహా మేధావి . విభజన జరిగిన నాలుగేళ్లయినా రెండు రాష్ట్రాలకూ ఒకే గవర్నర్ ఉన్న కాలంలో ఆ వార్త ఇప్పుడు చదివి 
చూడు.. ఆ మేధావి తెలివి నీకు బోలెడు వినోదాన్ని కలిగిస్తుంది. కేంద్ర మంత్రి వర్గం లో కవిత , మోత్కుపల్లికి గవర్నర్ , ముందస్తు ఎన్నికలు అంటూ చిన్న మేధావులు తమకు తోచిన వంటకాలు వండి మనల్ని అలరించారు . విషం ప్రాణాలు తీస్తుంది, ఔషధంగా ఉపయోగపడుతుంది అన్నట్టుగానే తాజా వార్తలను చూస్తే బుర్ర హీటెక్కుతుందేమో కానీ, కొంత కాలం తరువాత అదే వార్తను తిరిగి చదివితే మనసారా నవ్వుకుని రిలాక్స్ అయ్యే అదృష్టం కలిగిస్తుంది. నా ఆరోగ్య రహస్యం, నవ్వుకు ఇదే కారణం. ఇదే లాఫింగ్ ఫార్ములా..
నువ్వూ అనుసరించు గుణం కనిపించి తీరుతుంది.’’
‘‘అంటే..’’
‘‘ లేని బాపూ- రమణ, జంద్యాలను తలచుకుని వగచే కన్నా అందుబాటులో ఉన్న పాతవార్తలను చదివి, చూసి మనసారా నవ్వుకునే ఈ లాఫింగ్ టెక్నిక్‌ను నమ్ముకుని శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని చెబుతున్నా. ద్రాక్షరసం ఎంత పాతదైతే అంత కిక్కిస్తుంది. మేధావుల పాత జోస్యాలు సైతం అంతే..’’
*బుద్దా మురళి (జనాంతికం 9-3-2018)

3, మార్చి 2018, శనివారం

మీడియా- శ్రీదేవి- సబ్బుల వ్యాపారం

 ‘‘ఛీ ..ఛీ ..    మీ మగజాతే అంత..! చేసిన పాపం ఊరికే పోదు..’’
‘‘పోనీ లేవే.. బయటి వారి గొడవలు మనకెందుకు? పాపం.. శ్రీదేవి ఎంత అందంగా ఉండేది. అంత చిన్న వయసులోనే ఆ దేవుడు తీసుకెళ్లాడు. అదేంటో నేను బాగా ఇష్టపడ్డ గాయకుడు ఇదే వయసులో పోయాడు. వయసులో ఉండగా నేను తెగ ప్రేమించిన శ్రీదేవి అదే వయసులో పోయింది. అంతా దైవలీల’’
‘‘అందుకే అన్నాను మీ మగజాతే అంత అని.. ఈ పాపం ఊరికే పోదు’’
‘‘ఎవరిమీద కోపం ఉంటే వాళ్లను తిట్టు.. అంతే కానీ ఆ వంకతో మొత్తం మగవాళ్లను తిట్టకు. నా ముందు సాటి మగవాళ్లను తిడితే సహించలేను’’
‘‘నేను నేరుగా మిమ్మల్నే తిడుతున్నా.. అర్థం చేసుకోలేక పోవడం మీ దౌర్భాగ్యం .. శ్రీదేవిది ఎంత ముద్దొచ్చే రూపం. పొట్టన పెట్టుకునే దాకా నిద్ర పోలేదు. మీ మగజాతే అంత ’’
‘‘ఏంటీ శ్రీదేవిని నేను పొట్టన పెట్టుకున్నానా? అదేదో టీవీ 8+3-2 చానల్ కూడా ఈ మాట చెప్పలేదు. టీవీ చానళ్లు బోనీకపూర్‌పై అనుమానం వ్యక్తం చేశాయి.. కానీ నామీద కాదు. ఒకప్పుడు వర్మలానే శ్రీదేవిని నేను ప్రేమించిన విషయం నిజమే. ఆమె పెళ్లి చేసుకుని నటించడం మానేసిప్పటి నుంచి నేను సినిమాలు చూసింది లేదు. ఆమె తిరిగి నటించడం ప్రారభించినా నేను మాత్రం మళ్లీ థియేటర్‌కు వెళ్లి సినిమా చూడలేదు. ఆయన నెవరో ప్రపంచంలో ఎక్కడేం జరిగినా నేనే... నేనే.. అని చెప్పుకుంటారు. అలానే ఎక్కడే తప్పు జరిగినా నువ్వు నన్ను దోషిని చేయడం ఏమీ బాగాలేదు’’
‘‘ముమ్మాటికీ మీరే కారణం.. మూడు పదుల వయసుకే మగాళ్లకు బాణా పొట్ట, తెల్ల జుట్టు వస్తే ఫరవాలేదు. కానీ.. పాపం ఆ అమ్మాయి 40-50 ఏళ్ల వయసు వచ్చినా పదహారేళ్ల వయసు సినిమా నాటి అందంతో మెరిసిపోవాలి. ఏ మాత్రం తేడా వచ్చినా తట్టుకోలేరు. మీ కోసమే వయసు కనిపించకుండా ఉండేందుకు, అందంగా కనిపించేందుకు అడ్డమైన మందులు తిని, ఆపరేషన్లు చేయించుకుని చిన్న వయసులోనే చనిపోయింది’’

‘‘అదంతా పాత న్యూస్. శ్రీదేవి సౌందర్య రసహ్యమే ఆమె మరణానికి కారణం అని చానల్స్ హడావుడి చేశాయి. మరుసటి రోజుకు న్యూస్ మారిపోయింది.. నువ్వు చూడలేదా? ’’
‘‘అన్మీ చూస్తున్నా, మీ మగవాళ్ల వేషాలన్నీ చూస్తున్నాను. బోనీ కపూర్ కాకపోతే ఇంకో కపూర్ ఎవడైతేనేం మగవాడే కదా ? ఆమె ప్రాణాలు తీసుకుంది.’’
‘‘ఔను.. ఆమె షూటింగ్‌లో తప్ప జీవితంలో సుఖపడింది లేదట! వర్మ రాశాడు’’
‘‘అతను మీకన్నా తక్కువనా? బతికున్నన్నాళ్లు శ్రీదేవిని ప్రేమించానంటూ వర్మ ఆమెకు కంటిపై కునుకు లేకుండా చేశాడు. పోయాక ఆత్మకు శాంతిలేకుండా ఏదో ఒకటి అంటున్నాడు. మగజాతికి ఈ పాపం తగిలి తీరుతుంది. ’’
‘‘కాంతం నేకేమన్నా చుట్టం అవుతుందా?’’
‘‘ఎదురుగా ఉన్న భార్య పేరు గుర్తు లేదు కానీ, ఎప్పుడో కాలేజీ క్లాస్‌మేట్ కాంతం బాగానే గుర్తుంది? అందుకే అన్నాను మీ మగజాతికి పాపం తగిలి తీరుతుందని, ఏం కాంతం కనిపించిందా? శ్రీదేవిలా అందంగా ఉందా? వయసుకు తగ్గట్టు లావయిందా?. పరాయి వాళ్లు మీకు అందంగానే కనిపిస్తారు లే!’’
‘‘అసలు కాంతం తెలుసా? నీకు?’’
‘‘తెలుసుకోవలసిన అవసరం లేదు.’’
‘‘పోనీ మునిమాణిక్యం తెలుసా?’’
‘‘శ్రీదేవి గురించి కలవరించే మరో వర్మనా? ఎవరైతే నాకేం ఈ మగాళ్లంతా అంతే శ్రీదేవి తప్ప మరో విషయమే లేదు వాళ్లకు.’’
‘‘పాపం మునిమాణిక్యంకు శ్రీదేవి తెలియనే తెలియదు. నాలానే అమాయకుడు. నోటి నుంచి మరో కాంత పేరు వినగానే క్లాస్‌మేట్ అని నిర్ణయానికి వచ్చేయడమేనా?. మునిమాణిక్యం సృష్టించిన పాత్ర కాంతం. ఆమె కూడా అచ్చం ఇలానే ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా తలాతోక లేని వాదన చేస్తుంది. అటూ ఇటూ తిప్పి ప్రతి విషయంలో మొగుణ్ణి సాధిస్తుంది ఆచ్చం నీలానే.. ఆమెతో పరిచయం ఏమైనా ఉందా? అని ఏదో సరదాగా అన్నాను.’’
‘‘తలా తోక లేకపోవడం ప్రపంచంలో ఏం జరిగినా మనం కోరుకున్న దానికి లింక్ పెట్టి వాదించడానికి తెలుగు చానల్స్ అని చెబితే సరిపోతుంది కదా? ఈ తరం వారికి తెలియని, చెప్పినా అర్థం కానీ మునిమాణిక్యం, కాంతంల గురించి ఎందుకు?’’
‘‘ఏమో అనుకున్నా నీకూ రాజకీయాలు బాగానే తెలుసు. కానీ పాపం చానల్స్‌నెందుకంటావు?’’
‘‘అదేదో చానల్ వాళ్లు బాత్‌టబ్‌లో పడితే బతుకుతారా? చస్తారా? చేతులు విరుగుతాయా? కాళ్లు విరుగుతాయా? కాలు విరిగితే కుడి కాలు విరుగుతుందా? ఎడమ కాలా? ఏ కాలు ముందు విరుగుతుంది అని బాత్‌టబ్‌లో దూకి మరీ చూపారు కదా? పనిలో పని బావిలో దూకాల్సింది శ్రీదేవితో పాటు నేరుగా పై లోకానికి వెళ్లే వాళ్లు.. ఏం జరిగిందో అక్కడికెళ్లి ఆమెనే అడిగితే సరిపోయేది. వీళ్లను అనకుంటా ఇంకెవరిననాలి?’’
‘‘ఎన్నికలకు ఇంకా ఏడాది గడువు ఉంది కాబట్టి ఏదో పద్దతిగా పోవాలని బాత్‌టబ్ కథనాలతోనే సరిపెట్టుకున్నారు. లేకపోతే.. అదే ఎన్నికల సమయంలో అయితే ?’’
‘‘ఐతే ఏం చేసేవారు? ఏకంగా పై లోకానికి వెళ్లేవారా?’’
‘‘శ్రీదేవిది హత్య.. దీని వెనుక భారత రాజకీయాల కుట్ర ఉంది. తెలుగు పార్టీలు పొత్తు కోసం జాతీయ పార్టీపై ఒత్తిడి తెచ్చి, కేంద్ర పాలకులకు ఆశ చూపి, గల్ఫ్ పాలకులను ఒప్పించి కుట్రను బయటపడకుండా చేశారు అంటూ ఓ సంచలన వార్త వండితే అప్పుడు తెలిసేది. తెలుగు పార్టీలు అంటే మనకు ఏ పార్టీ నచ్చకపోతే ఆ పార్టీని ఖాళీలో భర్తీ చేసేయొచ్చు. గల్ఫ్ పాలకులు ఖండించరు, ప్రశ్నించరు. అప్పటికి ఎన్నికలు ముగిసిపోతాయి. కోరుకున్న ఫలితం సిద్ధిస్తుంది. నిన్న అలా ప్రసారం చేశారు. అలా జరగలేదు కదా? అని అడిగేదెవరు? చెప్పేదెవరు? ’’
‘‘ నోరు తెరిస్తే విలువలు ముఖ్యం అనే చెబుతారు కదా ?  ’’
‘‘సబ్బుల వ్యాపారం ఎలాంటిదో మీడియా వ్యాపారం కూడా అలాంటిదే.. మీరు అనవసరంగా మీడియాకు విలువలు ఆపాదిస్తున్నారని బాబా సాహెబ్ అంబేద్కర్ 1950లోనే చెప్పారు. ఏడు దశాబ్దాల క్రితం ఆయనకు అర్థం అయిన విషయం మనకే ఇంకా అర్థం కావడం లేదు. అర్థం చేసుకోవడానికి కూడా మనం ఇష్టపడడం లేదు. ’’
బుద్దా మురళి (జనాంతికం 2-3-2018)