21, మే 2024, మంగళవారం

అతని జోస్యం 33 ఏళ్లకు ఫలించింది - నా జోస్యం కూడా--జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 110

జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 110అతని జోస్యం 33 ఏళ్లకు ఫలించింది - నా జోస్యం కూడా -----------------మీడియాకు సంబంధించి కొన్ని ప్రపంచ రికార్డులు ఉన్నా ఎవరూ, ఎక్కడా నమోదు చేయడం లేదు . జర్నలిస్ట్ యూనియన్ కు నాయకత్వం వహించేవారు . మీడియా లో కార్మిక సంఘాలకు నాయకత్వం వహించేవారు , చివరకు సిఇఓలు ఐదారు దశాబ్దాల పాటు కొనసాగి రికార్డ్  సృష్టిస్తున్నారు కానీ అవి నమోద కావడం లేదు . నైజాం కాలం నుంచి అప్రతిహతంగా లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ఇంగ్లీష్ దినపత్రిక గా      డక్కన్ క్రానికల్ ది ఎవరూ అధిగమించలేని రికార్డ్ . ఈ పత్రిక కార్మిక   సంఘానికి 57 ఏళ్ళ నుంచి సంజీవరెడ్డి అధ్యక్షునిగా  కొనసాగడం ఇంకో  రికార్డ్ అయితే  సిఇఓ 50 ఏళ్ళ పాటు కొనసాగడం మరో రికార్డ్ . జలగం వెంగళ రావు  సీఎం కావడం కన్నా ముందు నుంచి మిమ్ములను చూస్తున్నాను . ఎంతో మంది సీఎంలు మారారు . మీరు మాత్రం ఇంకా యూనియన్ నాయకులుగా అలానే ఉన్నారు ? ఇది ఎలా సాధ్యం అని వై యస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు యూనియన్ నాయకులను ఓ సారి బహిరంగంగానే సరదాగా ప్రశ్నించారు . వైయస్ ఆర్ జమానా పోయి జగన్ జమానా వచ్చినా వారే నాయకులు . డక్కన్ క్రానికల్ లో ఇంతకన్నా సీనియర్లు ఉన్నారు . 94 ఏళ్ళ సంజీవరెడ్డి గత 56 ఏళ్ళ నుంచి డక్కన్  క్రానికల్ కార్మిక సంఘం అధ్యక్షులు . థామస్ అని క్రానికల్ గ్రూప్ కు సిఇఓ ఉండేవారు . 20 ఏళ్ళ వయసులో ఉద్యోగంలో చేరి 50 ఏళ్ళు గడిచాక 70 ఏళ్ళ వయసులో తనంతట తానే రాజీనామా చేసి వెళ్లిపోయారు . ఒక ఉద్యోగి 50 ఏళ్ళు కొనసాగి ఇక చాలు అని వెళ్లడం ఆడో రికార్డ్ . ****అవి టైమ్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభిస్తున్న సమయం . జాతీయ పత్రిక . సహజంగా పోటీ అని టెన్షన్ ఉంటుంది . అప్పుడు ఆంధ్రభూమికి పతంజలి సంపాదకులు . అందరూ ఏమవుతుందా ? అని కంగారు పడుతుంటే పతంజలి నింపాదిగా డక్కన్ క్రానికల్ ను వెంకట్రామ్ రెడ్డి ( యజమాని ) నే ఏమీ చేయలేక పోయారు . టైమ్స్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది .  ఏమైనా చేస్తే వెంకట్రామ్ రెడ్డి చేసేవారు ఆయనే ఏం చేయలేక పోయారు అంటే డిసి ని ఎవరూ ఏమీ చేయలేరు .  ఏమీ కాదు అని భరోసా ఇచ్చారు . అంతకు ముందు రామోజీరావు ఎంతో ఇష్టంగా ప్రారంభించిన న్యూస్ టైం సైతం డిసి ముందు నిలువ లేక పోయింది .  పతంజలి జోస్యం నిజమైంది . టైమ్స్ ఆఫ్ ఇండియనే కాదు ఆ తరువాత వచ్చిన బ్యాంకు లోన్ సంక్షోభం సైతం డిసి ని ఏమీ చేయలేదు . లార్జెస్ట్ సర్క్యులేటెడ్ అనే కిరీటం అలానే ఉంది . ***** జొన్నలగడ్డ రాధాకృష్ణ సహకారంతో 1987లో నేను ఆంధ్రభూమిలో స్టాఫ్ రిపోర్టర్ గా చేరి సిఇఓ థామస్ వద్దకు వెళితే అయన ఎందుకు చేరారు ? ఆంధ్రభూమి మూసేస్తారు అని  పలికారు . మన నోటి నుంచి ఎప్పుడూ వ్యతిరేక మాటలు రావద్దు అని పైన తధాస్తు దేవతలు ఉంటారు అంటారు పెద్దలు .  ఏ ముహూర్తంలో అయన ఆ మాట అన్నారో కానీ ఆ జోస్యం 33 ఏళ్ళ తరువాత నిజం అయింది . కరోనా కాలంలో మూసేశారు .  ఆంధ్రభూమి మూసేస్తారు అనేది థామస్ కు ఒక ఊత పదం . ఎప్పుడు మాట్లాడినా అదే మాట అనేవారు . అదేదో సామెత చెప్పినట్టు యజమానికే తన సొంత పేపర్ పై  ప్రేమ లేనప్పుడు సిఇఓ కు ఎందుకు ఉంటుంది . థామస్ జోస్యం చెప్పినట్టూ వారి గురించి నేనూ ఓ జోస్యం చెప్పాను . 87లో రిపోర్టర్ లకు ఇప్పటిలా  పెద్దగా సౌకర్యాలు ఉండేవి కావు . వార్తలు పేపర్ పై రాసి జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులో  హైదరాబాద్ కు పంపించాలి . వార్తలు రాయడానికి అవసరం ఐన వైట్ పేపర్ కోసం నేను బిల్లు పెడితే థామస్ అది చూసి ఇదేంటి అని అడిగి తనతో పాటు నన్ను గోదాం లోకి తీసుకువెళ్లి కొద్ది సేపు కనిపించకుండా  మాయం అయి ఒక పెద్ద  పేపర్ బండిల్ తెచ్చి ఇచ్చారు . ఏదో ఒక రోజు ఇతను ఈ పత్రికకు ఓనర్ అవుతాడు అనుకున్నాను . కొత్త ఉద్యోగిని కాబట్టి పైకి అనలేదు తోటి జర్నలిస్టులతో అన్నాను . ఓనర్ కాలేదు కానీ విన్న దాని ప్రకారం  ఓనర్ కన్నా మంచి స్థితిలో ఉన్నారు అని విన్నాను . బ్యాంకులకు వేల కోట్ల రూపాయల అప్పు చెల్లించలేక చేతులు ఎత్తేసిన తరువాత యజమాని జైలుకు వెళ్లగా 2018లో థామస్ 50 ఏళ్ళ సుదీర్ఘ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు . థామస్ కేరళలో మరణించారు అనే వార్త చూశాక కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి . ****నేను ఎడిటర్ మనిషిని అని మిగిలిన వారిని బెదిరిస్తున్నాను అని ఓ మిత్రుడు తప్పుడు ఫిర్యాదు చేయడంతో థామస్ ఓ సారి పిలిచి ఎడిటర్ శాస్త్రి , నేను , నువ్వు ఇక్కడ అందరం కూలీలమే . ఒకరు పెద్ద కూలీ ఇంకొకరు చిన్న కూలి అంతే తప్ప అందరం కూలీలమే అని చెప్పారు . ఈ విషయం నాకూ తెలుసు , నేను ఇక్కడ మనుషుల కన్నా నా  ఉద్యోగానికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను , ఎందుకంటే నాకు ఇంకో ఆదాయం ఏదీ లేదు అని చెప్పాను . నిజానికి థామస్ చెప్పింది చాలా ప్రాక్టికల్ మాట. చాలా మంది తాము సంస్థలో  విడదీయరాని భాగం అనుకుంటారు . ఉద్యోగం ఊడబీకి రోడ్డున పడేసిన తర్వాత కానీ తాము కూలీలం అని అర్థం కాదు . యజమాని , సిఇఓ , ఎడిటర్ ఎవరి వ్యవహారం వారిదే ఒకరి జోలికి ఇంకొకరు వెళ్లకుండా ఎవరికి కావలసింది వారు చక్కబెట్టుకున్నారేమో అనిపిస్తోంది . ఏ ముహూర్త బలంలో డిసి బయటకు వచ్చిందో కానీ ... ముహూర్త బలం లేకపోతే ఇంతకాలం ఉండేది కాదు అనిపిస్తుంది . అద్భుతమైన సంస్థ ఎలా దెబ్బ తింటుందో స్టడీ చేస్తే ఎంబీఏ డిగ్రీని మించిన ప్రాక్టికల్  జ్ఞానం లభిస్తుంది . - బుద్దా మురళి (21-5-2024)