10, జూన్ 2024, సోమవారం
అతనికి స్మశానమే దేవాలయం : వారాంతం లో అక్కడే నివాసం : ముందే స్మృతి వనం నిర్మాణం . అలా గుర్తుండి పోయిన జర్నలిజం తొలి నాళ్ళ వార్త జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 113
^^ నాకు స్మశానమే దేవాలయం , మనిషి ఆలయానికి వెళ్ళవచ్చు , వెళ్లక
పోవచ్చు కానీ అంతిమంగా స్మశానానికి రావలసిందే అందుకే నాకు స్మశానం అంటే ఇష్టం ^^ 41 సంవత్సరాల క్రితం బి ఆర్ లక్ష్మయ్య చెప్పిన మాటలు ఇవి . అప్పుడు నేను పదవతరగతి పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థిని .అప్పుడు జర్నలిస్ట్ ను కాను కానీ బి ఆర్ లక్ష్మయ్య మాటలు , అయన చర్యలు అలా గుర్తుండి పోయాయి . సంఘటనలు తప్ప వ్యక్తుల పేర్లు పెద్దగా గుర్తు పెట్టుకోవడానికి ఆసక్తి ఉండదు . కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు బి ఆర్ లక్ష్మయ్య పేరు అలా గుర్తుండి పోయింది .
అంత్యక్రియలు జరిగే స్మృతి వనాన్ని ఈనాడు అధినేత రామోజీరావు ముందుగానే నిర్మించుకున్నారు . జర్నలిస్ట్ గ్రూప్ లో ప్రపంచంలో తొలిసారి ఇలా ముందుగానే స్మృతి వనాన్ని నిర్మించుకున్న ఏకైక వ్యక్తి రామోజీరావు అని పేర్కొనన్నారు . చాలా మంది జర్నలిస్ట్ లు కవులు , రచయితలు ప్రపంచంలో ఇదే మొదటి సారి అని రాశారు .
ఇలా ముందుగానే నిర్మించుకున్న స్మృతి వనాన్ని నేను 1983లోనే చూశాను . అంతకు ముందే ఆ నిర్మాణం జరిగింది . ఇది కూడా పెద్ద విశేషం కాకపోవచ్చు . చాలా గ్రామాల్లో వృద్దులు తమ వ్యవసాయ పొలంలో ఇలా నిర్మించుకుంటారు . రూపాయలు బహుశా నేనెరిగిన ప్రపంచంలో బి ఆర్ లక్ష్మయ్య లాంటి ప్రత్యేక వ్యక్తిని మరొకరిని చూడలేదు .
స్మశానమే నాకు దేవాలయం అని చెప్పడమే కాదు ఆదివారం , ఇతర సెలవు దినాల్లో తాను స్మశానంలో నిర్మించిన భవనంలోనే విశ్రాంతి తీసుకునేవారు . జంటనగరాల్లోని పెద్ద స్మశాన వాటిక అయిన బన్సీలాల్ పేట స్మశాన వాటిక లో ఎక్కడ చూసినా బి ఆర్ లక్ష్మయ్య నిర్మించిన నిర్మాణాలు కనిపిస్తాయి . సికింద్రాబాద్ మార్కెట్ ప్రాంతంలో ఆయనది బండల వ్యాపారం . ఇప్పటిలా ఆ రోజుల్లో టైల్స్ లేవు . బండలవ్యాపారం జోరుగా సాగేది . తన సంపాదన ఎక్కువగా ఈ స్మశాన వాటిక కోసం ఖర్చు చేసేవారు . 1970 ప్రాంతంలోనే ఒకే సారి స్మశాన వాటిక అభివృద్ధి పనులకు 80 వేల రూపాయలుఇచ్చారు . 1980 ప్రాంతంలో మా బంధువులు ఎకరానికి వెయ్యి రూపాయల్లా భువనగిరి గజ్వేల్ రోడ్ లో 60 ఎకరాలు కొన్నారు . 70లో ఐతే 80 వేలకు 200 ఎకరాలకు పైగా వచ్చేది .
***
1983లో నేను పదవ తరగతి పరీక్షలకు సిద్ధం అవుతున్నప్పుడు మా నాన్న మరణించారు . ఓ పది రోజుల పాటు రోజూ స్మశాన వాటికకు రోజూ వెళ్ళాను . బి ఆర్ లక్ష్మయ్య అనే వ్యాపారి తన కోసం ముందుగానే అంత్యక్రియలు నిర్వహించే స్మృతి వనం నిర్మించుకున్నారు అని తెలిసి ఆసక్తి కలిగింది . ఎవరు ఎంత డబ్బు చెల్లిస్తామని ముందుకు వచ్చినా అయన అంగీకరించలేదు అని వినిపించింది . రెండేళ్లు గడిచాక 85-86లో ఒక వైపు చదువుకుంటూనే మరోవైపు ఉదయం పార్ట్ టైం విలేకరిగా చేరాను . అప్పుడు బి ఆర్ లక్ష్మయ్యను కలిసి చాలా సేపు మాట్లాడి ఉదయం సిటీ పేజీలో వార్త రాశాను . జర్నలిజం లోకి వచ్చిన తొలి నాళ్లలో నాకు బాగా నచ్చిన , అలా గుర్తుండి పోయిన వార్త బి ఆర్ లక్ష్మయ్య ముందే నిర్మించుకున్న స్మృతి వనం , స్మశాన వాటిక కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం , ఆదివారం అక్కడే పడుకోవడం బాగా గుర్తుండి పోయింది .
ఉదయం కోసం రాయడానికి ఆయనను కలిసినప్పుడు చాలా సేపు మాట్లాడాను . ఫోటో తీయబోతుంటే ఆగమని చెప్పి పాతతరం వాళ్ళు ధరించే కోటు వేసుకొని ఫోటో దిగారు .
స్మశాన వాటిక కార్యాలయం పైన ఉన్న విశాలమైన గదిలో పడుకునేవారు . భయం వేయదా? అని అడిగితే ఎందుకు ? అని ఎదురు ప్రశ్నించారు . తన భార్యా పిల్లలను కూడా ఆదివారం ఇక్కడికి రమ్మని మొదట్లో అడిగితే వారు రావడానికి నిరాకరించారని తాను మాత్రం తప్పనిసరిగా వస్తాను అని చెప్పారు .
అంత్యక్రియలకు వచ్చే వారి ప్రవర్తన , కులాల వారిగా వారు వ్యవహరించే తీరు చెప్పినట్టు గుర్తు . చివరకు అయన తన కులం గురించి కూడా తాను విమర్శించినట్టు బాగా గుర్తుండి పోయింది .
రాజులు మొదలుకొని నేటి సంపన్నుల వరకు ఆలయాల అభివృద్ధికి భారీగా విరాళాలు ఇచ్చిన వారు ఎంతో మంది ఉంటారు. కానీ తన సంపాదనలో చాలా మొత్తం స్మశాన వాటిక అభివృద్ధికి ఖర్చు చేయడమే కాకుండా దానిని దేవాలయంగా భావించి అక్కడే సెలవు రోజుల్లో సేదతీరేవారు కనిపించరు . స్మశాన వాటిక స్థలాలను ఆక్రమించుకొని భారీ భవనాలు నిర్మించుకున్నవారు ఉంటారు కానీ ఇలా సేవ చేసేవారు కనిపించరు .
1983లో బి ఆర్ లక్ష్మయ్య స్మృతి వనాన్ని చూశాను . అంటే అంతకు ముందే ఆ నిర్మాణం జరిగింది . బి ఆర్ లక్ష్మయ్య 2003లో మరణించారు . ఆ స్మృతి వనం లోనే అంత్య క్రియలు నిర్వహించారు . ఇప్పటికీ ఆ స్మృతి వనం బి ఆర్ లక్ష్మయ్యకే పరిమితం . మరెవరి అంత్యక్రియలు అక్కడ నిర్వహించరు .
ముందే తన కోసం స్మృతి వనం నిర్మించుకున్న బి ఆర్ లక్ష్మయ్య గురించి , బన్సీలాల్ పేట స్మశాన వాటిక లో అయన సేవల గురించి 1985లో ఉదయం లో రాశాను . చాలా రోజుల క్రితం సీనియర్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు జి కృష్ణ గురించి రాస్తూ బన్సీలాల్ పేట స్మశాన వాటిక నిర్వాహకులతో కృష్ణ పరిచయాలు , ఛలోక్తుల గురించి రాశారు . అది చదివాక 85లో నేను బి ఆర్ లక్ష్మయ్య గురించి ఉదయం లో రాసిన వార్త చూసి జి కృష్ణ వారితో పరిచయం చేసుకున్నారేమో అనిపించింది .
***
ప్రపంచంలో తొలిసారి రామోజీరావు ఇలా ముందుగానే స్మృతి వనాన్ని నిర్మించుకున్నారు అని జర్నలిస్ట్ లు , కవులు , రచయితలు సామాజిక మాధ్యమాల్లో రాయడంతో తన మరణానికి రెండున్నర దశాబ్దాల ముందే - నాలుగు దశాబ్దాల క్రితం ఇలా ముందే స్మృతి వనం నిర్మించుకున్న బి ఆర్ లక్ష్మయ్య గురించి , 85లో ఉదయంలో తొలినాళ్లలో నేను రాసిన నాకు నచ్చిన వార్త ఇలా గుర్తుకు వచ్చింది .
భారతీయ సినిమా పితామహుడు అని దాదాసాహెబ్ పాల్కేను సంభోదిస్తారు . తొలి భారతీయ సినిమాను నిర్మించింది వారే కాబట్టి . రామోజీ రావును తెలుగు జర్నలిజం పితామహుడు అని కొందరు రాశారు . తెలుగు లో తొలి పత్రిక 1832లో వచ్చింది . 1883లో సత్యదూత వచ్చింది .
7, జూన్ 2024, శుక్రవారం
అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం బాబు సోదరుడు వైయస్ వైపు - జగన్ సోదరి బాబు వైపు జర్నలిస్ట్ జ్ఞాపకాలు -112
అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
బాబు సోదరుడు వైయస్ వైపు - జగన్ సోదరి బాబు వైపు
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -112
-------
తాతా మనవడు సినిమాలోని అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం అనే పాట చిన్నప్పుడు రోజూ రేడియోలో వినిపించేది . ఆ వయసులో పాటలోని భావం పెద్దగా తెలియక పోయినా ఆ విషాద గీతం బాగా వెంటాడేది . జీవితాన్ని బాగా మదించిన వారే అలా రాయగలరు . పాట రచయిత ఎవరా ? అని చూస్తే డాక్టర్ సి నారాయణ రెడ్డి అని తెలిసింది .
***
గత కొన్ని రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో కుటుంబ వ్యవస్థకు కాలం చెల్లింది. భవిష్యత్తులో కుటుంబ వ్యవస్థ ఉండదు అని చాలా మంది ఒక వ్యాసాన్ని షేర్ చేస్తున్నారు . ఆంధ్రప్రదేశ్ ఎన్నికల టీడీపీ , జనసేన కూటమి విజయం సాధించింది . విజేతలు చంద్రబాబు తన కుటుంబం తో ఉన్న ఫోటోలు , పవన్ కళ్యాణ్ తన కుటుంబం తో పాటు చిరంజీవి కుటుంబం తో ఉన్న ఫోటోలు చూపుతూ జగన్ తన సోదరిని దూరం పెట్టిన విషయాన్నీ ప్రస్తావిస్తూ కుటుంబం కలిసి ఉంటే విజయం సాధిస్తారు . విడిపోతే జగన్ లా ఓడిపోతారు అంటూ కుటుంబ విలువల వ్యాసాలు బోలెడు వస్తున్నాయి . విజేతలకు ఎందరో తండ్రులు , పరాజితుడు అనాధ అని ఇంగ్లీషులో ఓ మాట బాగా పాపులర్ .
ఇంతకూ రాజకీయాల్లో కుటుంబం ఉండాలా ? దూరం పెట్టాలా ? మీడియా ఏం చేయమని చెబుతుంది అంటే ?
తండ్రి కొడుకు గాడిద కథ గుర్తుందా ? కథతో పాటు రాజకీయాల్లో కుటుంబ సభ్యుల ఉదంతాలు గుర్తుకు వచ్చాయి .
****
1994 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ వద్ద చంద్రబాబు స్థానాన్ని లక్ష్మీపార్వతి ఆక్రమించారు . బాబు వందశాతం రాజకీయ నాయకుడు ఐతే లక్ష్మీపార్వతి రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవు . చంద్రగిరి నుంచి బాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు టికెట్ కోసం ప్రయత్నం . బాబు వద్దు అంటుంటే లక్ష్మీపార్వతి బాబుకు వ్యతిరేకంగా రామ్మూర్తి తమ్ముడికి టికెట్ ఇప్పించడానికి ఎన్టీఆర్ వద్ద పలుకుబడి ఉపయోగించారు . ఐతే బాబే వ్యూహాత్మకంగా తమ్ముడిని లక్ష్మీపార్వతి పంపారు అని ఓ ప్రచారం . అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో ఎన్టీఆర్ కు వెన్నుపోటు . శరీరం అంతా ఎన్టీఆర్ పచ్చబొట్టు పొడిపించుకున్న శ్రీపతి రాజేశ్వర రావు , ఎన్టీఆర్ వచ్చే అంత వరకు మంగళసూత్రం కట్టని రమేష్ రెడ్డిలు ఎన్టీఆర్ ను వీడి బాబు వద్ద ముందు వరుసలో ఉన్నప్పుడు స్వయంగా బాబు తమ్ముడు బాబు వైపు ఎందుకు ఉండరు . లక్ష్మీపార్వతి రాజకీయాలు తెలియవు . బాబుకు తెలుసు .
బాబు సీఎం అయిన కొత్తలో నారా రామ్మూర్తి నాయుడు కూడా ఓ వెలుగు వెలిగారు . పనుల కోసం మీడియా వాళ్ళు కూడా రామ్మూర్తిని ప్రసన్నం చేసుకొనేవారు . కొంతకాలం ఆ హవా కొనసాగింది . తరువాత బాబు రామ్మూర్తిని దూరం పెట్టడంతో 2004 ఎన్నికలకు ముందు రామ్మూర్తి నాయుడు వై యస్ రాజశేఖర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లో చేరారు . ప్రతి రోజు తన అన్న చంద్రబాబు వ్యవహారాల గురించి రామ్మూర్తి నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడేవారు . చంద్రగిరి కాంగ్రెస్ టికెట్ రామ్మూర్తి కి ఖాయం అనుకున్నారు అంతా . తీరా ఎన్నికల సమయంలో రామ్మూర్తి కాంగ్రెస్ టికెట్ దక్కలేదు . ఎందుకంటే .. వై యస్ రాజశేఖర్ రెడ్డి కూడా బాబు లానే వంద శాతం రాజకీయ నాయకుడు . రేపు ఏదైనా జరిగితే తమ్ముడు మూర్తి ఎటు పోతాడో రాజకీయ అవగాహన ఉన్నవారు . ఏం జరిగిందో తెలియదు కానీ పదేళ్లు దాటిపోయింది రామ్మూర్తి బయటకు రాక .. అనారోగ్య కారణాలు అని ప్రచారం .
***
చంద్రబాబు , జగన్ ఫొటోలతో విస్తృతంగా ప్రచారం . బాబు కుటుంబంతో కలిసి ఉండడం కుటుంబ విజయంగా ఈ ఎన్నికల విజయాన్ని అభివర్ణిస్తున్నారు . జగన్ సోదరి షర్మిలను దూరం పెట్టడం వల్ల ఓడిపోయారు అని ప్రచారం . ప్రజలకు వేరే పని లేదు , సమస్యలు లేవు . తెలుగు సినిమాల్లో చూపించినట్టు మీ కుటుంబం అంతా ఇలా కలిసి ఉండాలి బాబు మాకు ఇంకేం సమస్యలు లేవు అని చెబుతున్నారన్న మాట . తమ ఇంట్లో తిండికి ఉందో లేదో తెలియదు కానీ కుటుంబం ను చూసి పులకించారు . జగన్ కుటుంబ ఫోటో కాకుండా ఒంటరి ఫోటో చూసి ఓడించారన్న మాట .
ఇదే ప్రచారం చేసిన వారు కెసిఆర్ కుటుంబం వల్లనే ఓడిపోయారు అని ప్రచారం చేశారు . కులం , మతం తో పాటు అనేక అంశాలు ఎన్నికల పై ప్రభావం చూపుతాయి . ఒక్కో పార్టీకి కొన్ని కులాల అండ ఉంటుంది . కొంచం ఎక్కువ, తక్కువ కానీ దేశమంతా ఇదే . ఉత్తర్ ప్రదేశ్ లో కులాల కాంబినేషన్ వల్ల బీజేపీ ఓడిపోయింది . ఆంధ్రాలో కూటమి గెలిచింది . కులం మతం తో పాటు అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయి . ఇంతకూ రాజకీయాల్లో కుటుంబం ఉండాలా ? వద్దా ? అంటే గాడిద పై తండ్రి కొడుకు కూర్చొని ప్రయాణిస్తే బాటసారులు ఏం చెప్పారో మీడియా అదే చెబుతుంది . .కుటుంబం ఉంటే వద్దు అంటుంది . లేక పోతే ఉండాలి అంటుంది .
రాజకీయం ఓ వ్యాపారం . బ్యాంకు దీర్ఘకాలం కోసం డిపాజిట్ చేస్తే ఎలాంటి రిస్క్ లేకుండా వడ్డీ రూపంలో సాధారణ ఆదాయం వస్తుంది . స్టాక్ మార్కెట్ లో రిస్క్ ఎక్కువ ఆదాయం అంతకన్నా ఎక్కువ . రాజకీయ వ్యాపారం చాలా రిస్క్ ఆదాయం కూడా అంతే . స్టాక్ మార్కెట్ లో కరోనా లాంటి ఉపద్రవం వస్తే మార్కెట్ క్రాష్ అవుతుంది . ఐనా ఆరు నెలల్లో కోలుకుంటుంది . రాజకీయ వ్యాపారంలో క్రాష్ వస్తే కోలుకోవడానికి ఐదేళ్లు పడుతుంది . రిస్క్ తో పాటు ఆదాయం అదే స్థాయిలో ఉంటుంది . రిస్క్ హై తో ఇష్క్ హై అని సినిమాలో హర్షద్ మెహతా డైలాగు బాగా పాపులర్ .
**
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల తరువాత షర్మిల కామెంట్ కోసం ఆసక్తిగా చూస్తే కనిపించలేదు . ఒకవేళ కామెంట్ చేసి ఉంటే గూగుల్ లో దొరుకుతుంది కదా ? అని సెర్చ్ చేస్తే యూట్యూబ్ ఛానల్ లో కనిపించింది . తను పాద యాత్ర చేసి వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా రక్షించింది సుదీర్ఘంగా చెబుతూ పోతున్నారు . ఫలితాల మీద చెప్పడం లేదు . ఇక వినలేక వదిలేశాను . షర్మిల టీడీపీ మీడియాలో రోజూ మొదటి పేజీ ఆక్రమించేవారు . ఫలితాలు వచ్చాయి . టీడీపీ గెలిచింది ఆమె కామెంట్ గూగుల్ లో సెర్చ్ చేస్తే తప్ప దొరకడం లేదు .
షర్మిల తొలుత తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడుఆంధ్రాలో ఉన్న ఓ మిత్రుడితో చర్చ ఆమెకు 15 సీట్లు వస్తాయి . కింగ్పా మేకర్లే అవుతారు అని అంటే . ఆమె పోటీ చేయరు , చేసినా ఒక్క చోట గట్టి పోటీ ఇస్తారు అన్నాను . ఇదే ఫేస్ బుక్ లో రాస్తే వైయస్ ఆర్ పార్టీ అభిమానులు మాటల దాడి , ఒకరు మెసెంజర్ లో ఫోన్ చేసి దాడి . పాలేరు బిడ్డను అంటూచివిరి నిమిషంలో చేతులు ఎత్తేసి ఆంధ్రాలో తేలి.. కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెస్తాను అన్నారు . ఒక్క చోట కూడా డిపాజిట్ రాలేదు . తెలం గాణలో బి ఆర్ యస్ కు వ్యతిరేకంగా , ఆంధ్రాలో వై యస్ ఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా న్యూ సెన్స్ క్రియేట్ చేయడంలో షర్మిల విజయం సాధించారు . కేఏ పాల్ మా ఇంట్లో 20 ఓట్లు ఉన్నాయి నాకు నాలుగు ఓట్లు మాత్రమే వచ్చాయి అని చెప్పిన మీడియా సమావేశంలో సైతం కనీసం పాతిక మీడియా లోగోలు ఉన్నాయి . నాలుగు ఓట్లు రాకపోయినా పాల్ మాట్లాడితే పాతిక ఛానల్స్ వస్తాయి . రాజకీయాల్లో కొన్ని పాత్రలకు న్యూ సెన్స్ వాల్యూ మాత్రమే ఉంటుంది . రాజకీయం వ్యాపారం . ఎవరికి లాభసాటి అనుకున్న రీతిలో వాళ్ళు రాజకీయ వ్యాపారం చేస్తారు . రాజకీయం వ్యాపారం అయితే మీడియా ?
పెద్ద పరిశ్రమకు అనుబంధంగా కొన్ని చిన్న పరిశ్రమలు ఉంటాయి .
2004 లో చంద్రబాబు ఓడిపోయాక సత్యం పెద్ద క్యాంపస్ ఒకటి ప్రారంభోత్సవం . టీడీపీలో రాధాకృష్ణ అని కార్యాలయ కార్యదర్శి ఉండేవారు . సత్యం క్యాంపస్ ప్రారంభోత్సవం అప్పుడు రాధాకృష్ణ బాధపడుతూ - ఆ క్యాంపస్ కు స్థలం ఇచ్చింది , సౌకర్యాలు కల్పించింది చంద్రబాబు - చూడు మనుషులు ఎలా ఉంటారు .. బాబును కనీసం పిలువ లేదు వై యస్ ఆర్ ను పిలిచారు అని బాధ పడ్డారు . సత్యం కు స్థలం ఇచ్చింది సీఎం , ప్రారంభోత్సవానికి పిలిచింది సీఎం ను ... దీనికి బాబు వైయస్ ఆర్ కు సంబంధం లేదు . సీఎం పోస్ట్ తోనే సంబంధం అని చెప్పాను . సత్యం, బాబు , జగన్ రామ్మూర్తి నాయుడు , షర్మిల అనుబంధాలు ఉత్త ట్రాష్ . రాజకీయమే వాస్తవం .
-బుద్దా మురళి
5, జూన్ 2024, బుధవారం
సత్యం పాతాళం నుంచి ఆకాశాన్ని తాకింది . డిపాజిట్ దక్కని పార్టీ అధికారంలోకి వస్తుంది . జీవితం , రాజకీయం , స్టాక్ మార్కెట్ అన్నీ బిజినెస్ లే జర్నలిస్ట్ జ్ఞాపకాలు 111
సత్యం పాతాళం నుంచి ఆకాశాన్ని తాకింది .
డిపాజిట్ దక్కని పార్టీ అధికారంలోకి వస్తుంది .
జీవితం , రాజకీయం , స్టాక్ మార్కెట్ అన్నీ బిజినెస్ లే
జర్నలిస్ట్ జ్ఞాపకాలు 111
జనవరి 2009 టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లోకి వెళుతుంటే ఓ యువకుడు ఫోన్ లో సత్యం షేర్లు లక్ష కొన్నాను -అని గట్టిగా చెబుతున్నాడు . అప్పటివరకు దాదాపు ఐదు వందల రూపాయలు ఉన్న సత్యం 2009 లో స్కామ్ భయటపడగానే తగ్గుతూ పది రూపాయలకు వచ్చింది . ఆ సమయంలో ముందు చూపు ఉండి ధైర్యం చేసిన వారి పంట పండింది . పది లక్షలతో లక్ష షేర్లు కొన్న ఆ యువకుడికి ఇప్పటి ధర ప్రకారం పన్నెండు కోట్ల రూపాయల ఆస్తి . సత్యం ను టెక్ మహేంద్ర విలీనం చేసుకున్న తరువాత ఆ స్టాక్ దశ తిరిగింది . పార్ల మెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మంగళవారం స్టాక్ మార్కెట్ ఘోరంగా పడిపోవడం, ఆంధ్రాలో టీడీపీ జనసేన విజయంతో పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి.
అసెంబ్లీ సమావేశాల అజెండాలో సభా కార్యక్రమాలను బిజినెస్ అని రాస్తారు . ఆ మాట నాకు బాగా నచ్చుతుంది . జీవితం , రాజకీయం , స్టాక్ మార్కెట్ అన్నీ బిజినెస్ లే . పగలు , రాత్రి ఉన్నట్టే బిజినెస్ అన్నాక బాగా నడిచే రోజులు ఉంటాయి . దెబ్బ తినే రోజులు ఉంటాయి . మన జీవితం లో ఎగుడు దిగుడులు ఉన్నట్టే స్టాక్ మార్కెట్ , రాజకీయాల్లో ఎగుడు దిగుడు ఉంటాయి .
తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక ఉప ఎన్నికల్లో ఆంధ్ర , తెలంగాణల్లో టీడీపీ డిపాజిట్లు కోల్పోయింది . అలాంటి టీడీపీ 2014లో ఆంధ్రాలో అధికారంలోకి వచ్చింది . ఉద్యమ కాలంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అసలు పోటీ కూడా చేయని తెరాస హైదరాబాద్ చరిత్రలోనే తొలిసారి 99 సీట్లు గెలిచింది . ఐదేళ్ల పాలన తరువాత ఆంధ్రాలో 23 సీట్లకు పరిమితం అయిన టీడీపీ , ఇప్పుడు వైయస్ ఆర్ కాంగ్రెస్ ను 11 సీట్లకు మరిమితం చేసింది . రెండు చోట్ల ఓడిపోయిన పవన్ ఇప్పుడు 21 స్థానాల్లో జనసేన పోటీ చేసి 21 చోట్ల గెలిచింది . వంద శాతం విజయం ఇదో రికార్డ్ .
చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టి ఓడిపోయినప్పుడు ఏం చేద్దాం అని అభిప్రాయాలు సేకరిస్తూ టీడీపీలో ఉన్నప్పుడు బాగా పరిచయం ఉన్న ఎ యం . రాధాకృష్ణ ఫోన్ చేసి చిరంజీవి అడుగుతున్నారు ఏం చేస్తే బాగుంటుంది అని అడిగారు . రాజకీయం వేరు , సినిమాల్లో హీరోలు వేరు . అన్నీ సమకూర్చాక హీరో వచ్చి నటిస్తాడు . రాజకీయం అలా కాదు చాలా ఓపిక ఉండాలి . వచ్చే ఐదేళ్ల వరకు పార్టీని నిలబెట్టి ఉద్యమాలు చేయగలరు అనుకొంటే ఒకే . అంత ఓపిక లేదు అనుకొంటే కాంగ్రెస్ లో విలీనం అయితే రాజ్యసభ , మంత్రి పదవి తో కాలక్షేపం చేయవచ్చు అని న అభిప్రాయం చెప్పాను . ప్రజారాజ్యం నుంచి గెలిచిన శాసన సభ్యులు చిరంజీవిని కలిసి కాంగ్రెస్ లో కలిసి పోతున్నాం మీరు వస్తే మీ నాయకత్వంలో కలుస్తాం , లేదంటే మేమే కలిసి పోతాం అని చెప్పడంతో చిరంజీవి కాంగ్రెస్ లో కలిసిపోయారు . ఎన్టీఆర్ ను దించేసే సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు వర్గం శాసన సభ్యులు సైతం సరిగ్గా ఇదే డైలాగు వినిపించారు . సినిమా నటులు రాజకీయ పార్టీలను నడపడం అంత ఈజీ కాదు . పవన్ కళ్యాణ్ పార్టీకి 21 సీట్లు వచ్చినా నా అభిప్రాయం అదే . చంద్రబాబు వంద శాతం రాజకీయ నాయకుడు . పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కాదు . యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో మాత్రమే . ఈ విషయం కాలమే చెబుతుంది . చంద్రబాబు రాజకీయం ముందు విశ్వ విఖ్యాత నట సార్వభౌముడే నిలువ లేక పోయారు .
పడిపోయిన స్టాక్ మళ్ళీ లేస్తుంది . పాతాళంలోకి వెళ్లిన సత్యం ఆకాశంలోకి దూసుకువెళ్లింది . ఆకాశంలోకి వెళ్లిన స్టాక్ పడిపోనూ పోవచ్చు . ఈ పోస్ట్ రాసేప్పుడు స్టాక్ మార్కెట్ ఇండెక్స్ చూస్తే నా ఫోర్ట్ పోలియో ఈ రోజు మూడు శాతం మైనస్ లో ఉంది . కొంత పోస్ట్ రాసి ఇప్పుడు మళ్ళీ చూస్తే మూడు శాతం మైనస్ కవర్ కావడంతో పాటు అరశాతం ప్లస్ లోకి వచ్చింది . 1990 ప్రాంతంలో స్టాక్ మార్కెట్ గురించి తెగ చదివే అలవాటు ఉండేది . ఆంధ్ర ప్రభ దినపత్రికలో ఆదివారం స్టాక్స్ రికమండేషన్స్ వచ్చేవి . యునిటెక్ అనే ఓ స్టాక్ 40 రూపాయలు ఉండేది . ఎందుకో అది బాగా గుర్తుండి పోయింది . ఈ మధ్య మిత్రులతో చర్చిస్తూ ఆ స్టాక్ ప్రస్తావన వచ్చింది . మూడున్నర దశాబ్దాల తరువాత ఆ స్టాక్ ఎక్కడుందో చూద్దాం అని గూగుల్ లో సెర్చ్ చేస్తే తొమ్మిది రూపాయల వద్ద కనిపించింది . 500 కూడా ఆ స్టాక్ కాలం కాటేయడంతో మూడున్నర దశాబ్దాల తరువాత 9 రూపాయల వద్ద తచ్చాడుతోంది .. ఆంధ్రాలో కాంగ్రెస్ లా ..
ఆంధ్ర పప్పు అని గెలిచేసిన లోకేష్ ఘన విజయం సాధించారు . జాతీయ స్థాయిలో బీజేపీ సోషల్ మీడియా దశాబ్దన్నర కాలం నుంచి జాతీయ స్థాయిలో పప్పు అని రాహుల్ గాంధీని గేలి చేసింది . అదే పప్పు తనను తాను దేవుడిని అని ప్రచారం చేసుకున్న మోడీకి చుక్కలు చూపించారు . వచ్చే ఎన్నికలకు దేవుడికి విశ్రాంతి ఇచ్చి రాహుల్ గాంధీ ప్రధాని కావచ్చు కూడా . తాను చీదరించుకున్న చంద్రబాబు , నితీష్ కుమార్ ల మధ్దతుతో ఇప్పుడు దేవుడు ప్రజలను పాలించబోతున్నారు . తెరాస లో ఒక సాధారణ చోటా నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి . ఒకప్పుడు మూడు రూపాయలు ఉన్న బజాజ్ ఫైనాన్స్ స్టాక్ ఇప్పుడు తొమ్మిది వేల రూపాయలను దాటి పది వేల రూపాయల వైపు పరుగులు తీస్తోంది . నిన్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు అన్ని స్టాక్స్ దాదాపు 20 శాతం వరకు పడిపోతే , చంద్రబాబు కు చెందిన హెరిటేజ్ 5 శాతం పెరిగింది . కాలం కలిసి వస్తే అంతే .
రాజకీయాల్లో అయినా , స్టాక్ మార్కెట్లో అయినా ఓపిక ఉన్నవారికే ఫలాలు అందుతాయి . కరోనా సమయంలో నాగార్జున కంస్ట్రక్షన్ స్టాక్ 17 రూపాయలు , ఇప్పుడు 280 . 17 రూపాయలప్పుడు ఓపిక వహిస్తే 280 అవుతుంది . 23 సీట్లు వచ్చినప్పుడు ఓపిక వహించిన నాయుడుకి 135 వచ్చాయి . జూదగాళ్ళకు నిమిషంలో ఫలితం తేలవచ్చు . లాంగ్ టైం ఇన్వెస్టర్లు లాభాల పంట చూడాలి అంటే దీర్ఘకాలిక ఓపిక , సహనం అవసరం . జీవితం , రాజకీయం , స్టాక్ మార్కెట్ అన్నీ వ్యాపారాలే . ఏ వ్యాపారం కైనా ఓపిక అవసరం . సబర్ కా ఫల్ మీటా హోతా హై అంటారు . గీతలో కృష్ణుడు చెప్పినట్టు నీ పని నువ్వు చెయ్ ఫలితం ఆశించకు . ఫలితం అదే వస్తుంది . స్టాక్ మార్కెట్ లో నైనా రాజకీయ మార్కెట్ లో నైనా .. - - - బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)