21, డిసెంబర్ 2024, శనివారం

ఎడిటర్ కు నిజం చెబితే ఉద్యోగం ఊడుతుంది .. ఒక్క రోజు అందరూ నిజమే చెబితే ప్రపంచం తలక్రిందులు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -117

ఎడిటర్ కు నిజం చెబితే ఉద్యోగం ఊడుతుంది .. ఒక్క రోజు అందరూ నిజమే చెబితే ప్రపంచం తలక్రిందులు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -117 ఒక్క రోజు మనుషులు అందరూ నిజం మాత్రమే మాట్లాడితే.. మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాస్క్ లేకుండా , కల్తీ లేకుండా మాట్లాడితే ప్రపంచం తలక్రిందులు అవుతుంది . ఒక్కరికి ఒక్క మిత్రుడు మిగలడు . భార్యా భర్తలు విడిపోతారు . కుటుంబ బంధం నిలవదు ఓషో ఉపన్యాసం లో ఈ మాట విన్నప్పుడు ఒప్పుకోవడానికి మనసు అంగీకరించలేదు కానీ అక్షర సత్యం అనిపించింది . లోకం అబద్దం మీదనే బతుకుతుంది దాన్ని అలానే బతకనివ్వు నిజం చెప్పకు అని నిషే చెప్పింది నిజం . ఆంధ్ర భూమిలో పని చేస్తుండగా అప్పటికి ఓషో చెప్పిన ఈ మాట గురించి తెలియక పోయినా నాయకుల గురించి , మనుషుల గురించి , బాస్ ల గురించి అవగాహన ఉండడం వల్ల నిజం చెప్పాలి అనే జబ్బు బారిన పడకుండా ఉద్యోగం కాపాడుకున్నాను . ఈ మధ్య ఒక ఆసక్తి కరమైన వార్త చూశా ఇంటింటికి తిరిగి క్షవరం చేసే ఎస్ మేడం అనే కార్పొరేట్ కంపెనీ తమ ఉద్యోగుల పని తీరుపై ఒక సర్వే జరిపింది . మీరు ఒత్తిడికి గురవుతున్నారా ? అనేది ఆ సర్వేలో ఓ ప్రశ్న . చాలా మంది ఉద్యోగులకు జీవితానుభవం లేక ఔను మేం విధి నిర్వహణలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాం అని రాశారు . అది చదివిన యాజమాన్యం నిజాయితీగా మీ అభిప్రాయం చెప్పినందుకు అభినందనలు . మీ అభిప్రాయాన్ని మేం పరిశీలిస్తున్నాం అని చెబుతూనే ఒత్తిడికి గురి అవుతున్నాం అని సర్వేలో రాసిన దాదాపు వందమంది ఉద్యోగులను ఉద్యోగం నుంచి తీసేశారు . నిజం చెబితే బహుమతి లభించడానికి అదేమీ ప్రాథమిక పాఠశాల కాదు , వాళ్ళేమీ స్టూడెంట్స్ కాదు . అడిగింది టీచర్ కాదు . నెల నెల జీతం ఇచ్చే కార్పొరేట్ కంపెనీ . అడిగిన విషయం పై అభిప్రాయం చెప్పేప్పుడు అడిగింది ఎవరు ? ఏ ఉద్దేశం తో అడుగుతున్నారు ? నిజం చెబితే ఏమవుతుంది అని గ్రహించాలి . అలా గ్రహించకుండా నిజాలు చెబితే సత్యహరిచంద్రునిలా చరిత్రలో నిలిచి పోతామని కలలు కనొద్దు . నిజం చెబితే రోడ్డున పడే ప్రమాదం ఉందని గ్రహించాలి . *** ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు అసెంబ్లీ బిల్డింగ్ ఆవరణలో పిచ్చాపాటి మాట్లాడుతూ ఓషో చెప్పిన ఈ మాట ప్రస్తావించి మనం సరదాగా ఓ గంట పూర్తిగా నిజాలే మాట్లాడుకుందాం అని ప్రతిపాదించా . మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి అనుకోని మాటలు మొదలు పెట్టి మూడు నాలుగు నిమిషాలకు మించి మాట్లాడలేక పోయాం . .. .. ****** ఓ రోజు ఆంధ్రభూమిలో ఎడిటర్ రిపోర్టర్ లను అందరినీ పిలిచి ఆఫీస్ గురించి , పని తీరు మీ తోటి వాళ్ళు అందరి పని తీరుపై బాగా ఆలోచించి నిజాయితీగా రాసి కవర్ లో పెట్టి ఇవ్వండి . ఒకరు రాసింది ఒకరు చదవరు కాబట్టి మనసులో ఉన్నది ఉన్నట్టు రాయండి . రెండు రోజుల్లో రాసి కవర్ లో పెట్టి ఇవ్వండి అని పరీక్ష పెట్టాడు . అప్పుడు మనసులో ఏమనుకున్నానో రాయడం బాగోదు కానీ నవ్వుకున్నాను . మీటింగ్ కాగానే బృందాలుగా హోటల్ కు వెళ్ళాం . మనసులో ఉన్నది ఉన్నట్టు ఎడిటర్ రాయమన్నారు కదా అని రాస్తే ఉద్యోగాలు ఉడుతాయి . జాగ్రత్త . ఇక్కడ ఉన్న లోపాలు అందరికీ తెలిసినవే అందరూ నటిస్తున్నారు . యాజమాన్యం కే లేని దురద మనకెందుకు ? మనం సేఫ్ గేమ్ ఆడుదాం అని అందరికన్నా ముందు నేనే ఒక బృందానికి ఉచిత సలహా ఇచ్చాను . **** ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటిలా వాట్స్ ఆప్ జర్నలిజం కాదు మంత్రి వర్గ సమావేశం జరిగితే లోపల ఏం చర్చ జరిగిందో తెలుసుకోవడానికి కనీసం పది మంది మంత్రులను విడివిడిగా కలవాల్సి వచ్చేది . అలా కలుస్తూ అప్పుడు మంత్రిగా ఉన్న నిమ్మల కిష్టప్ప వద్దకు నేనూ మరో జర్నలిస్ట్ వెళ్ళాం . మంత్రి వర్గ సమావేశంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు చెప్పిన విషయాలు కిష్టప్ప చెబుతూ - ఎన్నికలు సమీపిస్తున్నాయి మనం నిజాయితిగా మాట్లాడుకుందాం .. . మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం . నేనూ చెబుతాను , మీరూ చెప్పండి .. మీరు మొదలు పెట్టండి అని మంత్రులకు బాబు చెప్పారు అని నిమ్మల కిష్టప్ప చెబుతుండగానే నేను మధ్యలో జోక్యం చేసుకొని .. ఆయన మనసులో ఉన్నది చెప్పడు .. మీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఇలా చెబుతాడు జాగ్రత్త . మనసులో ఉన్నది చెబితే ప్రమాదం అని కిష్టప్పకు చెప్పాను . అయన నవ్వుతూ అదే జరిగింది . అనంత పురం జిల్లాలో కుల రాజకీయాలు మరీ ఎక్కువ సర్పంచ్ స్థాయిలో ఉన్న కుల రాజకీయాల గురించి కులాల పేర్లు ప్రస్తావించి చెబితే అంతా విని ఏం మాట్లాడుతున్నారు ? ఈ రోజుల్లో కూడా ఇంకా కులాలా ? అని బాబు చిరాకు పడ్డారని చెప్పుకొచ్చాడు . నిజాలు మాట్లాడుకుందాం , ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం అని ఎవరు అన్నా మీ మనసులో ఉన్నది తెలుసుకోవడానికి తప్ప అది వారి మనసులో ఉన్నది చెప్పడానికి కాదు . రాజకీయాల్లో అనే కాదు ఏ కంపెనీ లోనైనా , ఏ మీడియాలో నైనా , ఏ సంస్థ లో నైనా , ఏ బాస్ అయినా ఇంతే . **** ఆంధ్రభూమిలో ఎడిటర్ కోరిక మేరకు ఎవరికి వారు విడివిడిగా మనసులో ఉన్నది రాసి కవర్ లో పెట్టి ఎడిటర్ కు ఇచ్చాము . ఓ రోజు ఎడిటర్ అందరినీ పిలిచి కవర్లు ముందు వేసి . తొలుత సంస్థ గురించి , రిపోర్టర్ లు , ఇతరుల గురించి మనసులో ఉన్నది చెప్పి . మేం మనసులో మాట రాసిన కవర్లు విప్పి ఎవరిది వాళ్ళు అందరూ వినేట్టు చదవమన్నారు . అందరి మనసులో ఉన్నది ఒక్కటే ఎడిటర్ అద్భుతం , స్టాఫ్ అద్భుతం , యాజమాన్యం అద్భుతం , ధర్మం నాలుగు కాళ్ళ మీద తాండవిస్తోంది ఇదీ సంక్షిప్తంగా ఆ కవర్ లో అందరూ విడివిడిగా రాసిన ఏకాభిప్రాయం . యాజమాన్యం చేస్తున్న తప్పులు , ఎడిటర్ తప్పుల గురించి అందరం రోజూ గంటల తరబడి మాట్లాడుకున్నా ఒక్క వాఖ్య కూడా ఒక్కరూ రాయలేదు ఆ తంతు ముగియగానే మళ్ళీ బృందాలుగా హోటల్ కు వెళ్ళాం . **** మనం నలుగురం ఇలా రాయాలి అనుకున్నాం కాబట్టి ఒకే రకంగా రాశాం . వేరే రెండు బృందాలు కూడా అచ్చం ఇలానే ఎలా రాశాయి . మనసులో ఉన్నది ఒక విషయం కూడా బయట పెట్టకుండా మనసులో మాట భలే రాశాం అందరం అని మమ్ములను మేం మెచ్చుకున్నాం . పాపం ఇంత జీవితానుభవం లేదు కాబట్టి ఎస్ మేడం కంపెనీ ఉద్యోగులు నిజం రాసి రోడ్డున పడ్డారు . రాజాలియాలు , మీడియా , కార్పొరేట్ కంపెనీ అని కాదు . మనుషులు అంతా ఇంతే ఓషో అన్నట్టు ఒక్క 24 గంటలు నిజాలే మాట్లాడితే ఏ బంధం నిలవదు . ఏ ఉద్యోగం ఉండదు . ఈ లోకం అబద్దాల మీదనే బతుకుతోంది దానిని అలానే బతకనిద్దాం అని నిషే చెప్పిన సత్యాన్ని కూడా ఓషో తన ఉపన్యాసంలో ప్రస్తావించారు . అబద్దాన్ని మీరు రక్షిస్తే అబద్దం మిమ్ములను రక్షిస్తుంది . ఇదే లోక రీతి . - బుద్దా మురళి ( జర్నలిస్ట్ జ్ఞాపకాలు 117 )