2, ఏప్రిల్ 2026, గురువారం
బాబు పదవిని నిలబెట్టిన గ్యాస్ సిలిండర్ కథ
బాబు పదవిని నిలబెట్టిన గ్యాస్ సిలిండర్ కథ
జర్నలిస్ట్ జ్ణాపకాలు -126
^^ గ్యాస్ సిలిండర్ తో వంట చేయవచ్చని చేసింది నేనే ^^ ఈ మాట అన్నది ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు .ఆంధ్ర లో జరిగిన ఓ మీటింగ్ లో ఈ మాట చెప్పారు . బాబు ఉద్దేశ పూర్వకంగా చెబుతారో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ చాలా సార్లు ఆయన మాటల్లో కర్త , కర్మ , క్రియ ఉండదు . గ్యాస్ సిలిండర్ తో వంట చేయవచ్చు అని మొదట చెప్పింది నేనే అని చెప్పవచ్చు . లేదా గ్యాస్ సిలిండర్ తో మొదటి సారి వంట చేసింది నేనే అని చెప్పినా వ్యాఖ్యలో సంపూర్ణత ఉండేది . వంటి చేయ వచ్చని చేసింది నేనే అనడంలో వాఖ్య అర్ధవంతంగా లేదు . విషయం ఎలాగూ అర్ధవంతంగా లేదు కనీసం వాఖ్య అయినా అర్ధవంతంగా ఉండాలి కదా ?
వాఖ్య ఎలా ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పదవిని నిలబెట్టింది ఈ గ్యాస్ సిలిండర్ నే . అదో పెద్ద కథ . గ్యాస్ సిలిండర్ అంత పెద్ద కథ .
***
ఎన్టీఆర్ ను వెన్నుపోటుతో దించేశారు అనే బలమైన ముద్ర . లక్ష్మీపార్వతి ప్రచారం . దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో సహా ఎన్టీఆర్ కుటుంబం దూరం కావడం , నందమూరి హరికృష్ణ సొంత పార్టీ పెట్టి బాబు వెన్నుపోటు పై జనం లోకి వెళ్లడం వంటి వాటితో చంద్రబాబు బాబు బాగానే ఇబ్బంది పడుతున్నారు . 1999 ఎన్నికల్లో ఓటమి ఖాయం అనిపించింది . న్యూస్ టైం లో పని చేసే జర్నలిస్ట్ మిత్రుడు పవన్ నేనూ కలిసి అలా గ్రామాల్లోకి వెళదాం ఏమనుకుంటున్నారో తెలుస్తుంది అని బయలు దేరాం . నర్సాపూర్ , గజ్వేల్ ప్రాంతాల్లో తిరిగి మాట్లాడుతుంటే రోడ్డు పై బండి మీద మక్కజొన్న కంకులు కాల్చి అమ్ముతున్న అమ్మాయితో కాసేపు మాట్లాడాం . ఆమె చెప్పిన ఒక్క మాటతో టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది అని అర్థమైంది . ఆ అమ్మాయి ఏం చెప్పింది అంటే ... ?
****
ఇప్పుడంటే గ్యాస్ కనెక్షన్ ఏజెన్సీ వాళ్ళు బతిమిలాడి మరి ఇస్తారు . ఆర్థిక సంస్కరణలకు ముందు అలా ఉండేది కాదు . పార్లమెంట్ సభ్యులకు కోటా ఉండేది . ఈ కూపన్ లను కూడా కొందరు అమ్ముకొనేవారు . 96 లో హిమాయత్ నగర్ లో టీడీపీ కార్యాలయం ఉన్నపుడు రాజ్యసభ సభ్యలు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కూపన్లను రిపోర్టర్ లకు ఇవ్వమని కార్యాలయ కార్యదర్శికిఇచ్చారు . మహా ప్రసాదం అని తీసుకున్నాం . ఆ రోజుల్లో గ్యాస్ కనెక్షన్ కు అంత డిమాండ్ ఉండేది .
99 ఎన్నికలు సమీపిస్తుండడం ఎలాగైనా గెలవాలి అని ప్రయత్నాలు . ఒక్క ఓటుతో వాజపేయి ప్రభుత్వం పడిపోయింది . బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తో విజయావకాశాలు మెరుగుపడ్డట్టు నమ్మకం కలిగింది . అదొక్కటే సరిపోదు ఇంకేం చేద్దాం అని ఆలోచిస్తుంటే అప్పుడు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా రాజ్య సభ సభ్యునిగా ఉన్న లాల్ జాన్ బాషా మదిలో మెదిలిన ఆలోచన గ్యాస్ సిలిండర్ పథకం . అప్పుడు బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ చేరలేదు . స్పీకర్ పదవి మాత్రమే తీసుకోని బయటి నుంచి మద్దతు అని ప్రకటించింది . మహిళకు గ్యాస్ సిలిండర్ పథకం ప్రకటిద్దామని బాషా చెబితే అది ఎలా సాధ్యం . ఎంపీలు కూపన్ ల కోసమే పైరవీలు చేస్తున్నారు . లక్షల మందికి ఎలా సాధ్యం అంటే బాషా సాధ్యమే అని చెప్పారు . మనం మంత్రి పదవులు తీసుకోవడం లేదు . ఢిల్లీలో వ్యవహారాలు నేను దగ్గరి నుంచి చూశాను మీ పలుకుబడి ఉపయోగిస్తే మన రాష్ట్రానికి భారీ కోటా వస్తుంది . వాటిని ప్రతి గ్రామంలో కొందరికి పంపిణీ చేస్తే ఎన్నికల తరువాత అందరికీ వస్తుందనే నమ్మకం ఏర్పడుతుంది అని చెప్పారు . బాబు రంగంలోకి దిగి విజయం సాధించారు . ఆ రోజుల్లో ఎన్టీఆర్ భవన్ లో ఆ బీట్ రిపోర్టర్ గా బాషా తో గంటల తరబడి ముచ్చట్లు సాగేవి ఈ విషయాలు అన్నీ ఆ రోజే బాషా చెప్పారు .
ఐటీ నేనే అన్నీ నేనే అని బాబు చెప్పుకుంటారు . కుమారుడిని రాజకీయాల్లో నిలబెట్టాలి ఇమేజ్ పెంచాలి అనుకున్నపుడు నగదు బదిలీ పథకం కనిపెట్టింది లోకేష్ అని చెప్పారు . మిగతా అన్నీ తానే అంటారు . సాధారణంగా క్రెడిట్ ఎవ్వరికీ ఇవ్వరు . కానీ లాల్ జాన్ బాషా చనిపోయినపుడు టీడీపీ విడుదల చేసిన సంతాప ప్రకటనలో గ్యాస్ సిలిండర్ పథకం రూపకల్పనలో లాల్ జాన్ బాషా కృషిని ప్రస్తావించారు . బహుశా అప్పుడు బిపి ఆచార్య సమాచార శాఖ కమిషనర్ .. అప్పటికప్పుడు ఫుల్ పేజీ ప్రకటన విడుదల చేస్తూ ఈ పథకానికి దీపం పథకం అని పేరు పెట్టారు . ఇది తాత్కాలికం అని తరువాత పేరు మారుస్తాం అన్నారు కానీ అదే పేరు కొనసాగించారు .
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కు ముందే దీపం పథకం కింద కొందరికి గ్యాస్ సిలిండర్ లు పంపిణీ చేశారు . గ్రామంలో ఒక కుటుంబానికి గ్యాస్ సిలిండర్ వస్తే ఆ వీధిలో పండుగ అన్నట్టు ఉండేది . ఎన్నికల నోటికికేషన్ వచ్చాక దీనిపై వి . హనుమంతరావు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో కమిషన్ నిర్ణయం మేరకు పంపిణీ నిలిపి వేశారు . నిజానికి హనుమంతరావు ఫిర్యాదు టీడీపీ నెత్తిన పాలు పోసినట్టు అయింది . రాష్ట్రంలో అందరికీ ఇచ్చే అన్ని సిలిండర్ లు లేవు . కాంగ్రెస్ ఫిర్యాదు వల్ల ఆపేశాం , ఎన్నికలు కాగానే ఇస్తాం అని బాబు ప్రకటించడం తో అప్పటికే కొందరికి ఇవ్వడం వల్ల జనంలో నమ్మకం ఏర్పడింది . వాజపేయి ఒక్క ఓటు సానుభూతి , దీపం ఈ రెండూ టీడీపీకి కొండంత అండగా నిలిచాయి
****
నర్సాపూర్ , గజ్వేల్ ప్రాంతంలో మిత్రుడితో కలిసినప్పుడు మక్కా జొన్న కంకులు కాల్చి అమ్ముతున్న అమ్మాయి ఇదే మాట చెప్పింది . వాళ్ళ ఊరిలో ఎవరికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చారో వారి పేర్లు చెప్పి , ఎన్నికల తరువాత మాక్కూడా వస్తుంది అందుకే ఈ సారి టీడీపీకే ఓటు వేస్తాం అని ఆ అమ్మాయి చెప్పింది . మిత్రుడు పవన్ , నేనూ అప్పుడే అనుకున్నాం దీపం పథకం టీడీపీకి వెలుగు నింపుతుంది అని .
99 ఎన్నికలే బాబు తెలంగాణలో విజయం సాధించిన చివరి ఎన్నికలు . ఆ తరువాత తెలంగాణలో రోజు రోజుకు చిక్కి శల్యం అయ్యారు . రాష్ట్ర విభజన తో పొరుగు రాష్ట్రం పార్టీ అయిపొయింది .
లాల్ జాన్ బాషా మదిలో మెదిలిన ఈ దీపం పథకం పై బాబు ఇప్పుడే కాదు అప్పుడు కూడా బోలెడు కథలు చెప్పారు . చంద్రబాబు తల్లి పేరు అమ్మణ్ణమ్మ . 95 నుంచి రాష్ట్ర విభజన జరిగే వరకు ప్రతి రోజు టీడీపీ బీట్ రిపోర్టర్ లు బాబు ఇంటికి వెళ్లేవారు . ఒక్క రోజు కూడా వారి తల్లి ఇంటికి రాలేదు . సొంత గ్రామం లోనే ఉండేవారు . బాబు ఎన్నికల ప్రచారంలో దీపం పథకం పై బోలెడు ఆశలు పెట్టుకొని సెంటి మెంట్ తో అమ్మ కథ చేర్చారు . మా అమ్మ చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద వంట వండేది . పొగ వల్ల కంటి నుంచి నీళ్లు వచ్చేవి . ఏనాటికైనా మహిళకు ఇలాంటి కష్టాలు లేకుండా గ్యాస్ పథకం తేవాలి అని ఆ రోజే అనుకున్నాను అని ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చేవారు . తల్లి కట్టెల పొయ్యితో కష్టపడుతుంటే ఏ పిల్లాడు అయినా సంపాదించి గ్యాస్ పొయ్యి తేవాలి అనుకుంటాడేమో కానీ రాజకీయాల్లోకి వస్తాను , సీఎం అవుతాను , దీపం పథకం తెస్తాను అని ఎవరైనా అనుకుంటారా ?
- బుద్దా మురళి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)