17, నవంబర్ 2011, గురువారం

ఈ స్నేహాలు - ఆత్మీయ స్నేహాలు .. ఒక సర్వే


ప్రియ నేస్తమా...!!

ఫేస్‌బుక్‌లో ప్రవీణ్ స్నేహితుల సంఖ్య 1005. వారం క్రితమే ప్రారంభించిన గూగుల్ ప్లస్‌లో స్నేహితుల సర్కిల్‌లో అప్పుడే వందమందికి పైగా చేరిపోయారు. -‘నీ స్నేహితులు ఎవరో చెప్పు. నీవు ఎలాంటి వాడివో నేను చెబుతాను’ అనే ఆర్యోక్తులు ఇప్పుడిక్కడ పని చేయవు. ఎందుకంటే ప్రవీణ్ ఫేస్‌బుక్‌లో ఉన్న వెయ్యిమంది స్నేహితుల్ని చూసి -ప్రవీణ్ ఎలాంటి వాడో మనం అంచనా వేయలేం. ఆ వెయ్యిమంది వెయ్యి రకాలుగా ఉండొచ్చు. అసలా వెయ్యి మందిలో కనీసం పదిమంది కూడా ఎలాంటి వారో ప్రవీణ్‌కే తెలియకపోవచ్చు. వారిలో కనీసం ఒక్కరిని కూడా అతను చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే -ఇవన్నీ ఆన్‌లైన్ స్నేహాలు కనుక. కలిసి కబుర్లు చెప్పుకోవడం, కష్టసుఖాలు పంచుకోవటం, ఒకరికొకరు మానసిక ధైర్యాన్ని అందించుకోవడం లాంటి సాధారణ స్నేహ బాంధవ్యాలు -‘ఈ’ తరహా స్నేహాల్లో బహు తక్కువ.
అందుకే ప్రవీణ్ తన ఫేస్‌బుక్‌లో, గూగుల్ ప్లస్ ఫ్రెండ్స్ సర్కిల్‌లో వెయ్యిమంది నేస్తాల సంఖ్య చూసి మురిసిపోతుంటాడు తప్ప, వారిలో నిజమైన స్నేహితులెందరు? ప్రాణమిత్రులు ఎంతమంది? ఆప్తులెవరు? ఆప్త మిత్రులెందరు? అన్న ప్రశ్నలు వేస్తే మాత్రం కలవరపడతాడు. ఇది నిజంగా నిజం. సోషల్ నెట్‌వర్క్ సైట్స్‌లో ఉన్న వాళ్లంతా మిత్రులేనా? అంటే మిత్రులే. ఎంతమంది నీకు నిజమైన మిత్రులు? అన్న ప్రశ్న సంధిస్తే మాత్రం -వౌనమే సమాధానం. లేదంటే ఒకట్రెండు పేర్లు వినా, మిగిలిన వాళ్లంతా కాస్త అబద్ధం. కొద్దిమందికి సోషల్ సైట్స్‌లో సైతం నిజమైన మిత్రులు ఉండవచ్చు. చదువుకునే రోజుల్లో, ఉద్యోగాల్లో ఏర్పడిన స్నేహితుల మధ్య ఎలాంటి బంధం ఉంటుందో కొద్దిమంది విషయంలో సోషల్ సైట్స్‌లో సైతం అలాంటి బాంధవ్యం కుదరొచ్చు. కానీ అది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే.

 ఈ పరిస్థితి భారత్‌లోనే కాదు, అంతర్జాల ప్రపంచం అంతటా అదే పరిస్థితి. అమెరికాలో ఈ మధ్య ఇలాంటి అంశంపైనే ఒక సర్వే నిర్వహించార్ట. సర్వేలో -‘నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎంతమంది’ అన్న ప్రశ్నకు ఒకరిద్దరన్న సమాధానాలే ఎక్కువగా వినిపించాయి. విచిత్రం ఏమంటే -వీరందరికీ సోషల్ సైట్స్‌లో స్నేహితుల సంఖ్య వేలల్లోనే. కార్నెల్ వర్శిటీ బృందం ఒకటి ఈ అంశంపై సర్వే నిర్వహించింది. పాతికేళ్ల క్రితం అదే వర్శిటీ అదే అమెరికాలో అచ్చంగా ఇలాంటి సర్వేనే నిర్వహిస్తే అప్పుడు వచ్చిన సమాధానం వేరు. దగ్గరి స్నేహితులు ఎంతమంది? అన్న ప్రశ్నకు సగటున ముగ్గురు అన్న సమాధానం వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువమంది ఒకరు లేక ఇద్దరు అన్న సమాధానాలే ఇచ్చారు. సోషల్ సైట్స్ ద్వారా స్నేహాలు పెరిగిపోతున్నాయని ఒకవైపు మనం సంబరపడిపోతుంటే, ఈ సర్వే మాత్రం ‘క్లోజ్ ఫ్రెండ్స్’ సంఖ్య తగ్గిపోతుందన్న చేదు నిజాలను బయటపెడుతోంది. -‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది’ అనే పాట గుర్తుకొస్తుంది కదూ. సోషల్ సైట్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడివారితోనైనా స్నేహం చేసే అవకాశం లభించింది. సికింద్రాబాద్‌లో ఉంటూ అమెరికా మిత్రుడితో కబుర్లు చెప్పుకుంటున్నాం. మీ ఇరాన్‌పై అమెరికా దాడి చేయవచ్చా? అని ఇరాన్ మిత్రుడి అభిప్రాయం తెలుసుకుంటున్నాం. ఇదంతా నాణానికి ఒకవైపు. ఇదే సమయంలో యాంత్రిక జీవితం పరుగు పందెంలో ‘క్లోజ్ ఫ్రెండ్స్’ సంఖ్య తగ్గించేసుకుంటుంన్నాం. క్లోజ్ ఫ్రెండ్స్ సంఖ్య తగ్గితే నష్టమేముంది? సోషల్ సైట్స్‌లో కావాల్సినంత మంది మిత్రులున్నారుగా? అనిపించొచ్చు.
కానీ -తాజా సర్వేలు అంతలేనన్ని నష్టాలనే చూపిస్తున్నాయి. ఇక్కడ -స్నేహితుల సంఖ్య పరిమితం అయిపోతుందన్న ఆవేదనకంటే, ఆ కారణంగా తలెత్తుతున్న దుష్ఫరిణామాలు ఎక్కువవుతున్నాయన్నదే అసలు ఆవేదన. మనసువిప్పి మాట్లాడుకునే స్నేహితులు లేకపోవడం వల్ల మనిషిపై తీవ్రమైన ప్రభావం పడుతోందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అందరికీ తెలిసిన విషయమే అయినా, అమెరికా సర్వేలూ ఆ విషయాన్ని నొక్కిమరీ చెప్తున్నాయి.
సంతోషాన్ని సన్నిహితులకు పంచుకుంటే ఆనందం రెట్టింపవుతుంది. బాధలను పంచుకుంటే సగం భారం తగ్గిపోతుంది. క్లోజ్ ఫ్రెండ్స్ లేకుంటే మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాం. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ పరిణామాలు తెలిసి కూడా -మనిషి క్రమంగా సంఘజీవి నుంచి కంప్యూటర్ జీవి అయిపోతుండటం దురదృష్టకరం.
తాజా సర్వేను ఒక్కసారి పరికిస్తే -18 ఏళ్లకు పైబడిన రెండువేల మందిని సర్వేలో భాగం చేశారు. సర్వేలో ప్రశ్నలు ఎదుర్కొన్న వాళ్లంతా -ఆన్‌లైన్ స్నేహితులతో వ్యక్తిగతమైన విషయాలు చర్చించలేమనే చెప్పారు. అదే సమయంలో ఆన్‌లైన్ నేస్తాల కారణంగా బాహ్య ప్రపంచంలో ‘క్లోజ్ ఫ్రెండ్స్’ సంఖ్య దాదాపుగా తగ్గిపోయిందని, ఉన్న ఒకరిద్దరితో మనసువిప్పి మాట్లాడుకునే అవకాశమే చిక్కడం లేదని చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో అత్యంత సన్నిహిత మిత్రుని పేరు చెప్పమంటే ఒక్కొక్కరి పేరే చెప్పడం గమనార్హం. 18శాతం మంది ఇద్దరి పేర్లు చెప్తే, 29 శాతం ఇద్దరి కన్నా ఎక్కువ మంది పేర్లు చెప్పారు. మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఆసక్తికరమైన, ప్రాధాన్యం కలిగిన విషయాలేమీ ఉండటం లేదని, అందుకే మిత్రులతో ఎక్కువగా మాట్లాడలేక పోతున్నట్టు 64 శాతం మంది సమాధానమిచ్చారు. 36 శాతం మంది మనసు విప్పి మాట్లాడేందుకు ఎవరూ లేరని చెప్పడం గమనార్హం.
మనసు విప్పి మాట్లాడుకోవడానికి మంచి స్నేహితులు అవసరం. కంప్యూటర్‌లో కావాల్సిన సమాచారం దొరకవచ్చేమో గానీ, మనసు విప్పి మాట్లాడే స్నేహితుడు దొరకటం కష్టమే. అలాంటి స్నేహితుల నుంచి లభించే మానసిక బలం కంప్యూటర్లు అందించలేవన్నది ఎవ్వరు కాదన్నా వాస్తవం. ఎంత ఎక్కువ మంది స్నేహితులుంటే అంత గొప్పవారని చెప్పడం అతిశయోక్తి ఏమోగానీ, ఎక్కువ మంది ప్రాణ స్నేహితులుంటే అంతగా మానసిక వికాసం ఉంటుందన్నది యదార్థం. అనవసర కబుర్లతో కాలం వృధా చేసే నేస్తాలు లేకపోయినా ఫరవాలేదు. ఆనందాన్ని పంచుకోవడానికి, సమస్యల్లో చిక్కుకున్నపుడు దాన్నుంచి బయటపడేసే మానసిక స్థయిర్యాన్ని అందించడానికి మాత్రం మిత్రులుండాలి. చెప్పుకోవడానికి మంచి స్నేహితుడు కూడా లేడన్న భావన మనిషిని కృంగదీస్తుంది. పూర్తిగా కంప్యూటర్ జీవితాలకు అలవాటుపడిపోయి, చివరకు కంప్యూటర్‌తో, కంప్యూటర్‌లో కనిపించే స్నేహితులతో కాలం గడుపుతూ మిత్రులను మర్చిపోకండి. చిన్ననాటి మిత్రులనో, కలిసి చదువుకున్నవారినో, కలిసి పని చేసిన వారిలోనో మీ ఆత్మీయులు ఉండొచ్చు. చాలాకాలం అయిందా? అయినా ఫరవాలేదు. ఒకసారి పలకరించండి. చెదలు పట్టిన స్నేహబంధం బూజు దులపండి. పాత రోజుల్ని ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకోండి.
కొందరి విషయం లో ఈ స్నేహాలు కూడా ప్రాణస్నేహితులు కావచ్చు  అలా ఐతే అదృష్టమే .. కానీ ఈ స్నేహాల వెంటపడి ఆత్మీయ స్నేహాలను  మారవ వద్దు ... నీకోసం నేనున్నాను అనే మాట మనస్పూర్తిగా చెప్పే వారు ఈ స్నేహంలో లభించిన ,  జీవితం లో లభించినా  మరెక్కడ లభించినా అది కలకలం సాగాలని కోరుకుందాం .

3 కామెంట్‌లు:

  1. "మందెక్కువైతే మజ్జిగ పలుచనైనట్లు"(మందు కాదండీ మంది) స్నేహితులు ఇలా వేలల్లో ఉంటే అందులో ఆత్మీయులు ఏ నులుగురో. ఆ నలుగురితో గడిపే సమయం ఎక్కడిదీ మనకు?

    రిప్లయితొలగించు
  2. చక్కటి వ్యాసం మురళి గారు .

    రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం