16, జూన్ 2012, శనివారం

ఔను.. బాబుకు రెండు కళ్లూ సమానం!.......కెసిఆర్ ‘దొరగారు’ మేల్కొనాలి!


అరవై మూడేళ్ల చంద్రబాబుకు ఇది నిజంగా కష్టకాలమే. బాబు రాజకీయ జీవితమంత వయసు కూడా లేని వైఎస్ జగన్ ఇప్పుడు ‘దేశం’ అధినాయకుడి రాజకీయ భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చేశారు. ఇంత క్లిష్టమైన పరిస్థితిలోనూ చంద్రబాబుకు ఒక అనుకూలమైన అంశం ఉంది. టిడిపికి బాబే మైనస్, బాబే ప్లస్. ఆయన నాయకత్వానికి ఆ పార్టీ నుంచి సవాల్ ఎదురయ్యే ప్రసక్తే లేదు. ఎన్టీఆర్ కుమారులకు సినిమా గ్లామర్ ఉన్నా, పాపం.. వాళ్లు బావ చాటు బావమరుదులే.
19చోట్ల ఉప ఎన్నికలు జరిగితే ఒక్కటంటే ఒక్క చోట కూడా టిడిపి గెలవలేదు. ఒంటి చేత్తో యుద్ధం చేస్తూ ఓటమినే కవచకుండలాలుగా మార్చుకున్న బాబు రాబోయే మహాయుద్ధానికి వారసుడిని ఎంపిక చేసుకుంటారా? లేక తనలో శక్తి పోలేదు, చావో రేవో తానే తేల్చుకుంటానని అంటారా? వేచి చూడాలి. ‘టిడిపి నాతోనే పుట్టింది.. నాతోనే పోతుంది’-అని ఎన్టీఆర్ చెప్పేవారు. కానీ ఎన్టీఆర్‌కు అది సాధ్యం కాలేదు. కానీ బాబు సాధ్యం చేస్తాడేమో? అనే కలవరపాటు మాత్రం ఆ పార్టీ శ్రేణుల్లో మెల్లగా మొదలైంది.
‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ టిడిపిని సమానంగా చూస్తున్నాయి. తెలంగాణ, సీమాంధ్ర నాకు రెండు కళ్లు’-అంటూ చంద్రబాబు చెబుతున్న మాటలను తాజా ఉపఎన్నికల్లో ప్రజలు నిజం చేశారు. గతంలో తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి చావుదెబ్బతింది. నేడు సీమాంధ్ర ఉప ఎన్నికల్లో సైతం అదే పరిస్థితి ఎదురైంది. రెండు కళ్లతో రెండు వైపులా చూడడం సాధ్యం కాదు. ఒకవైపే చూడాలి. ఇది కళ్లకున్న విచిత్రమైన లక్షణం. రెండు ప్రాంతాల ప్రజలు టిడిపిని సమానంగానే చూస్తున్నారు. ఒక ప్రాంతంలో ఓడిపోయి, మరో ప్రాంతంలో విజయం సాధించి ఉంటే టిడిపి రెండు కళ్ల సిద్ధాంతంపై జనంలో అనుమానాలు రేకెత్తేవి. ఇప్పుడు ఆ అనుమానం నివృత్తి ఆయింది. టిడిపిని రెండు ప్రాంతాల్లోను ప్రజలు సమానంగానే తిరస్కరిస్తున్నారని ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి.
కాగా, ఉప ఎన్నికల ఫలితాలపై టిడిపి పెద్దగా షాక్ తినలేదు. ఎందుకంటే ఇలాంటి ఫలితాలకు ఆ పార్టీ నేతలు ఎప్పుడో అలవాటు పడిపోయారు. 2009లో ‘మహాకూటమి’ గెలుపు తథ్యమన్న ప్రచారం జోరుగా సాగినా, అది రెండో ఓటమి కాబట్టి టిడిపి వారు పెద్దగా షాక్ తినలేదు. ఈ మధ్య తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో డిపాజిట్లు సైతం గల్లంతు కావడం వల్ల ఇప్పుడొచ్చిన ఫలితాలకు టిడిపి పెద్దగా దిగులుపడాల్సిందేమీ లేదు.
కేవలం మీడియా ప్రచారంపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్న టిడిపిని ఉప ఎన్నికలు చావు దెబ్బతీస్తున్నాయి. చంద్రబాబు తాజా ఉప ఎన్నికల సందర్భంగా విస్తృతంగా ప్రచారం సాగించారు.

 కనీసం రెండు, మూడు స్థానాలు గెలవడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఆశలు కలిగించవచ్చునని భావించారు. ఇప్పుడు భవిష్యత్తు మనదే అని నమ్మించడానికి కొత్త కారణాలు వెతుక్కునే పనిలో పడింది టిడిపి నాయకత్వం. 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజక వర్గంలో గత ఎన్నికల్లో టిడిపి గెలిచింది ఒక్కటి కూడా లేకపోవచ్చు. ‘ఓడినవి మా సీట్లుకాదు’-అని సమర్ధించుకోచ్చు. మరో రెండేళ్లలో సాధారణ ఎన్నికలు ముంచుకొస్తుండగా, ప్రతి ష్ఠాత్మకంగా జరిగిన ప్రస్తుత ఉపఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం ఒక్కసీటు కూడా గెలుచుకోలేని స్థితిలో ఉంటే ఇక ఆ పార్టీ ప్రజల్లో ఎలా విశ్వాసం సంపాదించగలుగుతుంది. కాంగ్రెస్ రెండుగా చీలిన తరువాత సాధారణంగా టిడిపి తన ఓటు బ్యాంకును నిలుపుకొని ఉంటే విజయం సాధించాలి. 

కానీ కాంగ్రెస్ ఓట్లతో పాటు టిడిపి ఓట్లను సైతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కొల్లగొడుతోంది. ‘కాంగ్రెస్ వ్యతిరేకతే మా పార్టీ సిద్ధాంతం’-అని చెప్పుకున్న బాబు పార్టీ ఇప్పుడు ‘జగన్‌పై వ్యతిరేకతే మా సిద్ధాంతం’ -అని ప్రచారం చేసుకుంటోంది. బాబు తనకు అనుకూలంగా ఎంత ప్రచారం చేయించుకుంటున్నా ప్రజల్లో మాత్రం విశ్వసనీయత నెలకొల్పుకోలేక పోతున్నారు. ఆయనను పార్టీ శ్రేణులే కాదు... చివరకు ప్రజలు నమ్మడం లేదు. నమ్మకం కలిగించడానికి ఎనిమిదేళ్లుగా చేసిన కృషి ఫలించలేదు. తన చర్యల ద్వారా నమ్మకం కలిగించాలి కానీ... నమ్మకం కలిగించడమే ఒక ప్రధాన కార్యక్రమంగా ప్రయత్నం సాగిస్తే జనం నమ్మరని మరోసారి రుజువైంది.

‘దొరగారు’ మేల్కొనాలి!


తెలంగాణ ‘దొర’కు ఇది నిజంగానే ఊహించని షాక్. తెలంగాణ వాదానికి తాను తప్ప మరో గత్యంతరం లేదని భావిస్తున్న టిఆర్‌ఎస్‌కు ఇది గట్టిదెబ్బే. తెరాస అధినేత కె.చంద్రశేఖరరావు వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించే వారు సైతం తెలంగాణ కోసం ఒకటిగా ఉన్నారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడిన దశలో జరిగిన ఉప ఎన్నికల్లో 50వేల నుంచి లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, ప్రత్యర్థులకు డిపాజిట్లు దక్కని పరిస్థితి నుంచి ఇప్పుడు పరకాలలో స్వల్ప మెజారిటీతో తెరాస గట్టెక్కాల్సి వచ్చింది.
‘టిడిపి ముసలి నక్క.. దాని గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు, మింగేయడానికి వస్తున్న యువ కిశోరం జగన్‌పై దృష్టి పెట్టాలి’- అని ఓ తెలంగాణ వాది ఇటీవల ఆ ప్రాంత ఉద్యమకారులను హెచ్చరించారు. నిజమే.. పరకాల ఉప ఎన్నికల ఫలితాలు ఆ మాటలనే రుజువు చేశాయి. ‘ఓదార్పు’ అంటూ జగన్, ఏదో ఒక పేరుతో చంద్రబాబు ఉప ఎన్నికల్లో విస్తృతంగా పర్యటిస్తున్న సమయంలో టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ ఫాం హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటూ గడిపారు.
తెలంగాణపై నిర్ణయం తీసుకోవలసింది కేంద్రమే అనే మాట బాబూ చెప్పాడు, ఇప్పుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే చెబుతోంది. తెలంగాణ పేరుతో ఓట్లు వేయించుకుని ఇప్పుడు మాట మార్చిన టిడిపిని తెలంగాణ ప్రజలు డిపాజిట్ కూడా దక్కని విధంగా ఓడిస్తుంటే, అదే మాట చెప్పిన జగన్ పార్టీ గట్టి పోటీనే ఇచ్చింది. తెలంగాణ కోసం జాతీయ స్థాయిలో గట్టి మద్దతు ఇస్తున్న బిజెపిని కలుపుకొని పోవడానికి కెసిఆర్ ప్రయత్నించి ఉండాల్సింది. ‘మీరు పోటీ చేయవద్దు మద్దతు ఇవ్వండి’- అని అభ్యర్థిస్తే బిజెపి తప్పుకునేది కానీ కెసిఆర్‌కు కావలసింది అది కాదు. బిజెపి పోటీ చేయాలి, డిపాజిట్ దక్కకుండా ఓడిపోవాలి.


దాంతో మహబూబ్‌నగర్‌లో ఆ పార్టీకి లభించిన ఊపు పరకాలతో కొట్టుకుపోతుంది, వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ బేరమాడే శక్తి కోల్పోతుందనేది కెసిఆర్ ఎత్తుగడ. ఎత్తుగడ బాగానే ఉంది కానీ స్వల్ప మెజారిటీతో విజయం సాధించడం, జగన్ పార్టీ గట్టి పోటీ ఇవ్వడం తెలంగాణ వాదానికి సవాల్ కాదా? తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్న బిజెపిని శత్రువుగా దూరం పెట్టడం వల్ల సాధించిందేమిటి? టిఆర్‌ఎస్‌కు విజయం లభించినా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి టిఆర్‌ఎస్‌కు తెలంగాణలో గట్టి పోటీ తప్పదని పరకాల ఉపఎన్నిక నిరూపించింది.
10 కామెంట్‌లు:

 1. మీ వ్యాఖ్య చక్కగా ఉంది.ఛంద్ర బాబుతో వచ్చిన చిక్కేమిటంటే తానే చాలా తెలివైన వాడిననీ ప్రజలు గొర్రెలనీ ఏం చెప్పినా నమ్ముతారనీ అనుకుంటాడు.తెలంగాణా విషయంలో కప్పదాటు వైఖరిని అవలంబిస్తున్నాడు.నిర్ణయం తీసుకో వలసినది కాంగ్రెసే నంటున్నాడు.నిజమే. కాని నిర్ణయం తీసుకునే ముందరే ప్రతిపక్షాలు వారి వైఖరిని స్పష్టం చేయాలికదా?అలా కాకుండా నిర్ణయం తీసుకుంటే ఏకపక్ష నిర్ణయమంటారు కదా? చాలా తెలివిగా ఇంకెవరికీ లేనట్టుగా తనకి రెండు కళ్ళు అంటే ఇప్పడా రెండు కళ్లూ పోయాయికదా?కొందరిని ఎల్లకాలం మోసం చేయవచ్చు.అందరినీ కొంత కాలం మోసం చేయవచ్చు. కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయడం సాధ్యం కాదని గ్రహిస్తే మంచిది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పంతుల గోపాల కృష్ణ రావు గారు బాబు అతి ప్రచారమే వాళ్ల కొంప ముంచు తుందేమో ... తొలి సారి ఓడిపోయినప్పుడు రెండేళ్ళు దేశమంతా తిరిగి వస్తే బాబు యేడి ఎక్కాడా ? అంతు ఎదురు చూసే వారేమో . కానీ ముఖ్య మంత్రి కన్నా ఎక్కువగా తనే రోజూ మీడియాలో కనిపిస్తూ .. విరక్తి కలిగిస్తున్నారు

   తొలగించండి
  2. Pantula Gopala Krishna Rao గారు correct గా చెప్పారు. చంద్రబాబు తన అతితెలివితో జనాన్ని బురిడీ కొట్టించగలనని ఇంకా నమ్ముతున్నాడని నా అనుమానం!! ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి తెలంగాణపై నిర్ణయం కాంగ్రెస్ పార్టీదే అంటున్నాడు. అవకాశం తక్కువైనా, ఆయన ఆశిస్తున్నట్టు 2014 లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే, అప్పుడైనా తెలంగాణపై తెలుగుదేశం నిర్ణయం తీసుకోవాల్సిందేగా!! ఇదేం ఆలోచించక ఏదో ప్రకటన చేసేసి కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేశాను అనుకుంటున్నాడు చంద్రబాబు!! తెలంగాణ రాష్ట్రం అనే ఒక అతిముఖ్యమైన సమస్యపై నిర్ణయం తీసుకోలేని చంద్రబాబు రేపు ముఖ్యమంత్రి అయితే, తన అవకాశవాద వైఖరిని వదిలేస్తాడని నమ్మకం ఏంటి?? ఈ అవకాశవాద వైఖరే చంద్రబాబు కొంప ముంచుతున్నది.

   తొలగించండి
 2. మన్మోహన్ సింగ్ కెసిఆర్ గారికి ఫోను చేసి ప్రణబ్ రాష్ట్రపతి అభ్యర్తిత్వం సమర్తించాలని అడిగాడట, దానికి ఈయన సానుకూలంగా స్పందించాడట :)

  ఆయనకు ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదు. ముందు తెలంగాణా విషయం తెల్చమనండి, తరువాత సమర్తిస్తా అనొచ్చు కదా.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. Jai Gottimukkala garu ఫోన్ లో ఏం మాట్లాడుకున్నారో ?అయినా మన్మోహన్ సింగ్ కు సొంతంగా నిర్ణయాలు తీసుకొనే అధికారం ఎక్కడిదండి.. అంతా మేడం గారే చూసుకుంటారు కదా

   తొలగించండి
 3. TRS YSR congress వచ్చే ఎన్నికలలో కలిసి పనిచేస్తాయి, వేచి చూడండి.`ఎందుకంటే పరకాల ఎన్నికలలో KCR YSR congress party గురించి ఏమీ మాట్లాడలేదు.

  రిప్లయితొలగించండి
 4. గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు garu అది మీ అభిప్రాయం కానీ తెలివయిన రాజకీయ నాయకుడు అలా చేయడు.. టిఆర్ యస్ , జగన్ కలిసి పోయారని టిడిపి విస్తృతంగా ప్రచారం చేసింది . ఒక వేళ కెసిఆర్ జగన్ తో కలిస్తే జగన్ కిసేఆర్ ను మింగేస్తాడు . జైలులో ఉండే కాంగ్రెస్స్, తిసిపి లను ఓడించిన నాయకుడు బయటకు వచ్చాక తెలంగాణాలు పాగా వేయగలిగితే కెసిఆర్ ను మింగడం అతనికి కష్టం కాదు . అందుకే యెంత తిట్టుకున్నా కెసిఆర్ , టిడిపి కలవడానికి అవకాశం ఉంది ( ౨౦౧౪ ఎన్నిలల తరువాత ) తనను మింగేసెంత బలవంతునితో చేతులు కలపడం కన్నా పదవి కోసం తాను ఎలా చెబితే అలా నడుచుకొనే నాయకుడితో చేతులు కలపడానికే రాజకీయ నాయకులు ప్రాదాన్యత ఇస్తారు.. అనేది నా అభిప్రాయం . ysr తెలంగాణాను దోచుకున్నాడు .. సిమన్ద్ర పార్టీ అని చివరకు బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాజశేకర్ రెడ్డి ఋణం తీర్చు కుంటున్నాడు ... అందుకే పోటీ చేస్తున్నాడు అని అన్ని రకాల విమర్శలు చేశారండి కెసిఆర్ బహుశా మీడియాలో వాటికి ఎక్కువగా ప్రాదాన్యత లభించి ఉండక పోవచ్చు

  రిప్లయితొలగించండి
 5. >>>>>
  ‘మీరు పోటీ చేయవద్దు మద్దతు ఇవ్వండి’- అని అభ్యర్థిస్తే బిజెపి తప్పుకునేది కానీ కెసిఆర్‌కు కావలసింది అది కాదు. బిజెపి పోటీ చేయాలి, డిపాజిట్ దక్కకుండా ఓడిపోవాలి.
  >>>>>
  మహాశయా, పరకాల పోటీ నుంచి బిజెపి ఎట్టిపరిస్థితిలోనూ తప్పుకోదు అని కిషన్‌రెడ్డి బహిరంగంగా ప్రకటించిన విషయం తెలియదా?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పరకాలలో తెరాస బీజేపీ మద్దతు తీసుకుంటే, "మా మద్దతుతోటే మీరు గెలవగలిగారు, బలమంతా మాదే" అని బీజేపీ డ్రామాలాడే అవకాశమున్నది. తద్వారా తెలంగాణవాదాన్ని కేసీఆర్ నుంచి హైజాక్ చెయ్యడానికి బీజేపీకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. జాతీయపార్టీ ఐన బీజేపీ తోటే తెలంగాణ సాధ్యమని మరింత ప్రచారం చేసే అవకాశమున్నది. ఎప్పటికైనా తెలంగాణలో బీజేపీ బలం పరిమితమేననీ, తెలంగాణలో తమకు ప్రత్యామ్నాయం లేనేలేదనీ నిరూపించడం కేసీఆర్ వ్యూహం!! అందుకని బీజేపీ పోటీలో ఉండాలి, డిపాజిట్ రాకుండా చిత్తుచిత్తుగా ఓడిపోవాలి అన్నది కేసీఆర్ అభిమతం!! అప్పుడు తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకునే శక్తులన్నీ కేసీఆర్ వెనక నడవాల్సిన పరిస్తితి ఏర్పడుతుంది అన్నది కేసీఆర్ వ్యూహం!!

   తొలగించండి
 6. కిషన్ రెడ్డి ఆ మాట చెప్పిన వార్త పక్కనే నేను తెలంగాణా కు వ్యతిరేకం కాదు అని బాబు గారు ప్రకటించిన వార్తా కూడా వచ్చింది దీనితో పాటు అదికూడా నమ్మ వచ్చునంటారా ప్రవీణ్ గారు ..( రాజకీయాల్లో ప్రకటనలు వేరు తెరవెనుక వ్యవహారాలు వేరండి )

  రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం