18, జులై 2012, బుధవారం

రాజకీయ భారతం లో అల్లుళ్ళ పర్వం ... మన భాగ్య విధాత బాబు అల్లుడా ?బాలయ్య అల్లుడా ?

ఆషాడ మాసంలో కొత్త అల్లుడి కష్టాలు అనుభవించిన వారికే తెలుస్తాయి. ఇలాంటి వింత ఆచారం తెలుగువారికే ప్రత్యేకం. పెద్దింటల్లుడు, అల్లుడుగారు, అబ్బో ఒకటా రెండా తెలుగునాట అల్లుడిపై ఉన్నన్ని సినిమాలు మరే భాషలోనూ కనిపించవు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనితో మొదలు పెడితే అల్లుడి సామెతలు లెక్కలేనన్ని.
ఒక నవాబు మహాభారతం మొత్తం విని ఏక్ బూడా....ఒక వృద్ధుడు, ఒక యువకుడు మాత్ర మే మహావీరులు మిగిలిన వారంతా తుక్కు అని తేల్చేశాడు ఉర్దూలో. భీష్ముడు,అభిమన్యుడు మాత్రమే మహావీరులన్నమాట! అభిమన్యుడు కడుపులో ఉండగానే పద్మవ్యూహాం గురించి సగం తెలుసుకున్నాడు. కృష్ణుడు వచ్చి అక్కడితో ఆపివేయించాడంటారు. కురుక్షేత్ర సంగ్రామంలో అభిమన్యుడు పద్మ వ్యూహంలోకి సులభంగానే వెళ్లగలిగినా, బయటకు రాలేకపోయాడు. శ్రీకృష్ణుడికి అభిమన్యుడు స్వయాన మేనల్లుడు. అల్లుడి శక్తిసామర్ధ్యాలు తెలుసు కాబట్టే అభిమన్యుడ్ని అంతకు మించి తెలుసుకోకుండా చేయడంలో మామ విజయం సాధించాడని అంటారు. కంసుడికి అల్లుడి సామర్ధ్యం సరిగా తెలియకనే కదా! ప్రాణాలు హరీమనిపించుకున్నాడు. అల్లుడిగా మామపై విజయం సాధించిన ఘన చరిత్ర వల్లనే శ్రీకృష్ణుడు అల్లుడి శక్తిని పరిమితం చేశాడేమో అని కొందరి అనుమానం. దీనికి వ్యాసుడు చెప్పిన కారణాలు ఏమైనా రాజకీయ విశే్లషకులు, మన విశే్లషకులు మాత్రం అభిమన్యుడి వ్యవహారంలో కృష్ణ మామ కుట్ర ఉందని అనుమానిస్తారు. చిన్నపామైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. శిశువు అయినా అల్లుడు ప్రాణాలకు ముప్పు అని కంసుడు భయపడి జాగ్రత్తలు తీసుకున్నా, అల్లుడి చేతిలో హతం కాక తప్పలేదు.
స్వతంత్ర భారతంలో నెహ్రూ శకం నుంచే అల్లుడి చరిత్ర మొదలవుతుంది. నెహ్రూతో పాటు ఆయన అల్లుడు ఫిరోజ్ గాంధీ సైతం పార్లమెంటు సభ్యుడు. అయినా ఆయన మామ ప్రభుత్వంపై నిప్పులు చెరిగే వారు. ఆయన మరణం రాజకీయాల్లో కొందరి ఆలోచనల్లో ఒక మిస్టరీ.

సోనియమ్మా ఇటలీ తెలివి తేటలతో అల్లుడి సమస్యను మొదట్లోనే పరిష్కరించుకున్నారు . కోడలి సమస్య ఆమెకు ఇంకా రాలేదు  


అన్నపేరుకు ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయినట్టు, అల్లుడు పదానికి బాబు పెట్టింది పేరు. రాజకీయాల్లో అల్లుడు గారు అనగానే కాంగ్రెస్ వారికి సైతం చంద్రబాబే గుర్తుకు వస్తారు. అమ్మ (ఇందిరమ్మ) ఆదేశిస్తే మామపై పోటీ చేస్తానని 82లో చంద్రబాబు సవాల్ చేశారు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి ఏ విషయం అయినా చంద్రబాబు కుండ బద్ధలు కొట్టినట్టు చెంప చెళ్లుమనిపించేట్టు, జీవితంలో మరిచిపోని విధంగా చెప్పగలరు. ఉచిత విద్యుత్ వల్ల విద్యుత్ తీగలు బట్టలారేసుకోవడానికి పనికి వస్తాయని చెప్పినా, కమ్యూనిస్టులకు కాలం చెల్లిందని చెప్పినా ఆయన ఒక్కసారి చెబితే జీవితంలో మరిచిపోని విధంగా చెబుతారు. సినిమాల్లో దానవీర శూరకర్ణలో ఎన్టీఆర్ డైలాగులను ఒకసారి వింటే మరువలేం, రాజకీయాల్లో ఆయన అల్లుడు గారి డైలాగులూ అంతే పవర్‌ఫుల్ . పాపం మామగారికే ఆయన పవర్ అర్ధం కాలేదు. ఓడిపోయాక ఆయన టిడిపిలోకి వస్తానని దరఖాస్తు చేసుకుంటే మా అల్లుడు గారు వస్తున్నారు అని సమావేశంలో ఎన్టీఆర్ చెప్పగానే ముక్తకంఠంతో అంతా ఒకేసారి వద్దూ అనేశారట! పాపం వాళ్లంతా అల్లుళ్లతో ఎంత విసిగివేసారిపోయిన నాయకులో కదా? ఎన్టీఆర్ మాత్రం చిన్నబుచ్చుకుని, నాదెండ్ల భాస్కర్‌రావు, జానారెడ్డి, ఉపేంద్ర, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి వంటి ఐదుగురు సభ్యులతో కమిటీ వేసి ఒకరికి తెలియకుండా ఒకరిని ఒప్పించి అల్లుడిగారి స్వగృహ ప్రవేశానికి స్వాగతం పలికారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఒక పార్టీ వీడి మరో పార్టీకి వెళ్లినప్పుడు పలికే తొలి డైలాగు ‘సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉంది’. ఈ డైలాగు ఒక్క బాబు విషయంలో మాత్రమే న్యాయమైనది. ఎందుకంటే అల్లుడికి మామగారిల్లు సొంతిల్లే కదా!
అస్తవ్యస్థంగా ఉన్న దేశానికి ఒక దిశ చూపిన నెహ్రూ లాంటి దార్శనికుడే అల్లుడితో బెంబేలెత్తిపోయారు. అలాంటిది ఎన్టీరామారావుకు ఇద్దరు అల్లుళ్లు. ఎన్టీఆర్ రాజకీయ జీవితం మొత్తం ఇద్దరు అల్లుళ్ల రాజకీయాలతో సతమతమయ్యారు. నడుచుకుంటూ ఆలసిపోయిన వ్యక్తి సైకిల్‌పై లిఫ్ట్ అడిగి, కొంత దూరం వెళ్లాక సైకిలే ఎత్తుకెళితే ఎలా ఉంటుంది? పాపం అలాంటి పరిస్థితిలోనే అల్లుడి దెబ్బకు ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసిపోయింది. రాజకీయాలను కాచి వడపోయడం వల్ల వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అల్లుడికి బయ్యారం అప్పగించి,కొడుక్కు రాజకీయం రాసిచ్చారు సినిమా రంగంలోనే ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎలా చేయాలో రిహార్సల్స్ చేయడం లోనే  చిరంజీవి కాలం గడిచిపోయింది. ఆయన ముఖ్య మంత్రి అయితే ఆ పదవి ఎలా కొట్టి వేయాలా అనే ఆలోచనలతోనే చిన్నల్లుడి జీవితం తెల్లారింది ..  మామ అల్లుళ్ళు ఇద్దరినీ రాజకీయం దెబ్బతీసింది .


 రాజకీయాలే ఊపిరిగా పీల్చుకునే కెసిఆర్‌ను ఆయన మేనల్లుడు మించి పోతాడేమో అనే సందేహం పార్టీలో చాలా మందిలో కనిపిస్తుంది. చంద్రబాబుకు ఒకే ఒక కొడుకు కాబట్టి అల్లుడి బాధ లేదని ఆయన అభిమానులు అనుకున్నారు.


నుదుటిపై రాసిపెట్టి ఉంటే ఎలాగైనా తప్పదేమో! సొంతల్లుడు లేకపోతేనేం అల్లుడి వరుస అయ్యే జూనియర్ ఎన్టీఆర్ బాబు భవిష్యత్తు రాజకీయాలను ప్రశ్నార్ధకంగా మార్చారు. నన్ను గెలిపించండి సాధ్యం కాకపోతే మా అబ్బాయిని ఆదరించండి అంటూ బాబు త్యాగానికి సిద్ధపడుతున్న సమయంలో అల్లుడు నేనున్నాను అంటున్నారు. బావకోసం తండ్రిని త్యాగం చేసిన బాలకృష్ణ ఇప్పుడు అల్లుడు లోకేశ్ కోసం ఎన్టీఆర్ కుటుంబాన్ని త్యాగం చేసేందుకు రిహార్సల్స్ చేస్తున్నారు.


ఒలింపిక్ కాగడాను ఒకరి నుంచి మరొకరికి అందించినట్టుగాఅల్లుడి సమస్య ఒకరి నుంచి ఒకరికి వారసత్వంగా వస్తోంది  తెలుగు రాజకీయం. తెలుగు ప్రజలు అల్లుడి కుమారుడిని ఆదరిస్తారా? అల్లుడిగారి అల్లుడిని ఆదరిస్తారా? కాలమే తేల్చాలి. భవిష్యత్తు తెలుగు కిరీటం బాలకృష్ణ అల్లుడిదా? బాబు అల్లుడిదా? తేలాలంటే వేచి చూడాలి.


ముక్తాయింపు:ఏదీ శాశ్వతం కాదు. అల్లుడూ ఒకనాటికి మామ అవుతాడు.

4 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం