17, ఏప్రిల్ 2013, బుధవారం

రాజకీయ అందాలు -రౌతుకు గెలుపు గుర్రాల పోటు

వావ్ అంటూ సిగ్గువల్ల వచ్చిన బిడి యంతో ఆమె నోటిని పూర్తిగా తెరిచి రెండు చేతులతో ముఖం దాచుకుంది. స్థానిక మండల విలేఖరి మురుగయ్య పక్కనోడి జేబులో నుంచి పెన్ను, సర్పంచ్ చేతిలోంచి కాగితం తీసుకుని ‘‘మిస్ మీ జీవితాశయం ఏమిటి?’’అని రాసుకొచ్చిన ప్రశ్నను అడిగాడు. 

‘‘పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవిత లక్ష్యం. ఇప్పటి వరకు నా జీవితం నాది ఇకపై నా జీవితం ప్రజలది. ఈ జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నాను. ప్రజల కోసమే జీవిస్తాను. వారి కళ్లలో ఆనందాన్ని చూడడమే నా జీవితాశయం. పేదల కోసం తిప్పాయపాలెం మొత్తం తిరుగుతాను, తరువాత మొత్తం జిల్లాను, కోస్తా, సీమ, తెలంగాణలో పర్యటిస్తాను. అలానే దేశ మంతా పర్యటిస్తా, ఆ తరువాత ప్రపంచ మంతా పర్యటిస్తాను. ఎక్కడా పేదరికం అనేది ఉండకూడదని శపథం చేస్తున్నాను’’ అంటూ గత వారం రోజుల నుంచి బట్టీ పట్టిన పాఠాన్ని జయప్రభ అప్పచెప్పింది .

 జయప్రద అంత అందంగా తనకు కూతురు పుట్టాలని జయప్రభ కడుపులో ఉన్నప్పుడు  తల్లి కోరుకుంది. ప్రభను మూగగా ప్రేమించిన తండ్రి ఆ ప్రేమను పైకి చెప్పుకోలేక అమ్మాయి పేరు ప్రభ అని పెట్టాలని భీష్మించాడు. మధ్యేమార్గంగా ఇద్దరి అభిమానుల పేర్లు కలిపి జయప్రభ అని పెట్టుకున్నారు. జయప్రభ గ్రామంలో కెల్లా తానే అం దగత్తెను అనే గట్టి నమ్మకం ఉండేది. గ్రామం లోని కుర్రాళ్ళు కుడా ఆవు నిజం  నీవు అనుకుంటున్నది  నిజం నిజం అని  కోరస్ గా  చెప్పే వాళ్ళు .

 జయప్రభ  నమ్మకానికి ఈరోజు అధికారిక ముద్ర పడింది. దాంతో సంతోషంలో తేలిపోతోంది. సర్పంచ్, మునసబు, గ్రామ మోతుబరి మనవ రాళ్ల మధ్య హోరా హోరీగా అందాల పోటీ జరిగి చివరకు ప్రజాస్వామ్య యుతంగా మిస్ తిప్పలాయపాలెంగా జయప్రభ ఎన్నికయ్యారు. ఎంతో కష్టపడి మండల కేంద్రం నుంచి విలేఖరులను కూడా పిలిపించి జయప్రభ ఇంటర్వ్యూ వచ్చేట్టు చేశారు. 

‘‘ముదనష్టపు దానా వచ్చే వారం నుంచి పరీక్షలున్నాయి కాస్త చదువుకొని తగలబడే అంటే మాట వినలేదు. అంత పెద్ద డైలాగు గడగడా చెప్పేసింది . రేపు క్లాసుకు రా నీ సంగతి చెబుతాను అని క్లాస్ టీ చర్   కనక లక్ష్మి మనసులోనే అనుకుంది  . ఆరువందల గడపలు ఉన్న గ్రామ మది. 

అదేం చిత్రమో కానీ విశ్వసుందరిగా ఎన్నికైనప్పుడు ఐశ్వర్యారాయ్, సుస్మితా సేన్‌లైనా మిస్ తిప్పాయపాలెం అయినా పేద ప్రజలను ఉ ద్ధరించడమే తమ జీవిత లక్ష్యం అని చెబుతారు. విశ్వసుందరిగా ఎన్నిక కాగానే మురికి వాడల్లో మురికి పిల్లలు, అనాధ ఆశ్రమంలో అనాధ పిల్లలతో అరగంట కబుర్లు చెప్పి ఆ దృశ్యాలు టీవిల్లో కొన్ని గంటల పాటు వచ్చేట్టు చూసుకుంటారు.


ఇంతకూ రాజకీయాలు వదిలేసి అందాల పోటీల గురించి ఎందుకు? అనే కదా సం దేహం. రాజకీయాలంటే అందాల పోటీలు కావని కేంద్ర మంత్రి జైరాం రమేష్ సెలవిచ్చారు. ఆయనా మాట ఎందుకన్నారో కానీ రాజకీయాలు, అందాల పోటీలు ఒకే రీతిలో జరుగుతాయి. ఐశ్వర్యారాయ్ విశ్వసుందరి పోటీల సమయంలో పేదల ఉద్ధరణే తన లక్ష్యం అని చెప్పిందా? లేదా? సరిగ్గా ఇవే మాటలు ప్రతి రాజకీయ నాయకుడు చెబుతుంటాడు. అందాల పోటీలకు అనేక రౌండ్స్‌లో పోటీ ఉన్నట్టుగానే రాజకీయ నాయకులకు ఐదేళ్ల పాటు అనేక రౌండ్స్‌లో పోటీలు ఉంటాయి. పేదరికం గురించి ఇద్దరి అభిప్రాయాలు ఒకటే. ఇద్దరూ పోటీల తరువాత ఆ విషయం మరిచిపోతారు.

 దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనేది ఇద్దరి సిద్ధాంతం. అధికారంలో ఉన్నప్పుడే నాయకులు నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు. అందంగా ఉన్నప్పుడు నా లుగు యాడ్స్, నాలుగైదు సినిమాలు కొట్టేయాలని అందగత్తెలు చూస్తారు.


రాహుల్‌గాంధీ, మోడీల మధ్య పోటీని చూసి జైరాం రమేష్ రాజకీయాలంటే అం దాల పోటీలు కాదని సెలవిచ్చారు. అందాల పోటీ అని ఒప్పుకోవడానికి జైరాంకు అభ్యంతరం ఏమిటో? ఇద్దరూ బ్రహ్మచారులే కూడా. ఒకరు స్వతంత్రంగా వ్యవహరిస్తారు, ఒకరు తల్లి చాటు బిడ్డ. ఒకరు స్వయం కృషితో ఎదిగిన వారు ఒకరు వంశ పారంపర్యంగా వస్తున్న ఆస్తిని అనుభవిస్తున్న వారు అంతే తేడా!


జైరాం అలా అంటే మన తెలుగు బాబేమో రాజకీయం అంటే గుర్రాల పోటీగా భావిస్తూ మేలు జాతి గుర్రాల కోసం అలుపెరగకుండా ప్రయత్నిస్తున్నారు. పేకాటలో డబ్బులు పోయిన వారు ఈ ఒక్క ఆటతో పోయిన సొమ్మంతా తిరిగి సంపాదించేద్దాం అని నిండా మునిగేంత వరకు ప్రయత్నిస్తారు. గుర్రాల పోటీల్లో కూడా అంతే! నిండా మునిగేంత వరకు తెలియదు. వరుసగా రెండు సార్లు నమ్ముకున్న గుర్రాలు నట్టేట ముంచడంతో ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్లు అంటున్నారు.


గుర్రాలకే నేతల భాష వస్తే...మంచి గుర్రాల కోసం రౌతు వెతికినట్టే, మంచి రౌతు కోసం గుర్రాలు వెతుకుతాయి. అనే విషయం తెలుస్తుంది.   గెలుపు గుర్రాల కోసం తెలుగు రౌతు వెతుకుతుంటే ఈ రౌతును నమ్ముకుంటే అతనితో పాటు మనమూ మునిగిపోతాం అని గుర్రాలు తోక జాడించి గెలిచే చాన్స్ ఉన్న రౌతు వద్దకు పరుగులు తీస్తాయ.


గుర్రాలు చంచలమైనవి ఒక చోట ఉండవు. ఆ విషయం వాటిని కొట్టుకొచ్చిన తెలుగు రౌతుకు కూడా తెలుసు. ఒక గుర్రం గోడ దూకితే 50 గుర్రాలను తయారు చేసుకుంటాను అంటున్నారు. గుర్రాలు గోడ దూకినప్పుడు కొత్త గుర్రాలను తయారు చేసుకోవడం మాంత్రికుడిని హతమార్చిన తోట రాముడికే సాధ్యం కాలేదు . వాళ్ల అల్లుడికి సాధ్యం అవుతుందా?

 గుర్రాలకు రౌతు మీదనే నమ్మకం పోయింది. అందుకే రౌతుకు వెన్నుపోటు పొడిచి వెలుతున్నాయి .  ఇప్పుడున్న శాసన సభ్యుల వసతి గృహం( ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్) నిజాం కాలంలో గుర్రాల శాల. కొన్ని భవనాలను మళ్లీ నిర్మించినప్పటికీ అప్పటి గుర్రాల శాల ఆనవాళ్లు, నిర్మాణాలు కొన్ని ఇంకా అలానే ఉన్నాయి. గుర్రాల వసతి శాలను ఎమ్మెల్యేల వసతి శాలగా మార్చాలనే ఆలోచన ఎందుకొచ్చిందో? చిత్రమే.  గుర్రాల శాల స్థల  ప్రభావం బాగానే పని చేస్తున్నట్టుగా ఉంది . 

6 కామెంట్‌లు:

 1. గుర్రాల వసతి శాలను ఎమ్మెల్యేల వసతి శాలగా మార్చాలనే ఆలోచన ఎందుకొచ్చిందో? చిత్రమే. గుర్రాల శాల స్థల ప్రభావం బాగానే పని చేస్తున్నట్టుగా ఉంది .

  =============================================

  Really nice observation :-)

  రిప్లయితొలగించండి
 2. గుర్రాల రౌతుల గురించి బాగా చెప్పారు. అధ్యక్షులు రౌతులు , నాయకులు గుర్రాలు అయితే మరి ప్రజలు ఎవరంటారు?
  బ్రహ్మచారి అనే పదానికి చాల అర్థాలు ఉన్నట్లున్నాయి. మీరు ఏ అర్థం లో మోడీ ని బ్రహ్మచారి అన్నారు? పెళ్లి కాని వాడు అనే అర్థం లో అయితే కాదు. మోడీ భార్య బతికే ఉంది, టీచర్ గా పని చేస్తోంది అని చదివాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంద్ర gaaru
   మోడికి పెళ్లి కాలేదు ..బ్రహ్మచారి దిగ్విజయ సింగ్ ఓ సారి మోడికి పెళ్లి అయింది అని తనకు ఎవరో చెప్పారు అని అన్నారు అంతే తప్ప ఆయనకు పెళ్లి కాలేదు .... నెట్ లో వెతికినా ఇదే సమాచారం దొరుకుతుంది .. కాంగ్రెస్ వాళ్ళు ఎవరో ఒకరిని తీసుకు వచ్చి ఈవిడే మోడీ భార్య అంటూ గృహ హింస చట్టం కింద ఆమెతో కేసు కుడా పెట్టించగలరు తరువాత . గృహ హింస కేసును సిబి ఐ కి బదిలీ చేస్తారు .. అలాంటిది మోడికి పెళ్లి అయి , కాలేదని చెబితే ఊరుకుంటారా ?

   తొలగించండి
 3. మురళి గారు,
  సరిగా గుర్తు లేదు గాని ఒక తెలుగు పేపర్ లో కుడా మోడీ భార్య గురించి వ్యాసం రాసారు, ఫోటో ల తో సహా. బహుశా ఆంధ్రజ్యోతి అనుకుంటా. దిగ్విజయ సింగ్ చెప్పింది నేను చదవలేదు . నెట్ లో వెతికితే youtube వీడియో లు కుడా ఉన్నాయి . ఆమె పేరు Jashodaben Chimanlal Modi

  రిప్లయితొలగించండి
 4. చంద్ర గారు దీనిపై జి+ లో కొంత చర్చ జరిగింది .. కృష్ణవేణి చారి గారు ఈ లింక్ ఇచ్చారు దాని పై నా అభిప్రాయం ....
  Krishnaveni ChariYesterday 9:43 PMReply
  http://www.openthemagazine.com/article/nation/i-am-narendra-modi-s-wife
  మురళీగారూ ఒక్కసారి దీన్ని చూడండి. నిజమే బతికే ఉంది. టీచర్గానూ పని చేస్తోందనే దీన్లో రాసేరు .
  ...............
  buddha muraliYesterday

  కృష్ణ వేణి గారు ఆ మధ్య మన రాష్ట్రానికే చెందిన ( పేరు బహుశ రామకృష్ణ గౌడ్ అనుకుంటా ) వ్యక్తి ప్రియాంక గాంధీ నా బార్య అంటూ ఏకంగా ఇద్దరి పేరుతో రేషన్ కార్డ్ సంపాదించాడు . భార్యను ఇంటికి పంపించాలని కోర్టుకు వెళ్ళాడు . అంతకు ముందు ఒకరు జయప్రద నా భార్య అంటూ కోర్టుకు వెళ్ళాడు శ్రీదేవి తో పాటు కొందరికి ఇలాంటి కేసులు తప్పలెదు. ఇది అదే బాపతు 

  రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం