14, ఆగస్టు 2013, బుధవారం

పార్టీ పెట్టుకుందాం రా!

ఏమి సోమయ్యా దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?

 మరో మూడు నెలలైతే రిటైర్ అవుతాను. బల్ల మీది నుంచి, కింది నుంచి, పక్కల నుంచి బాగానే సంపాదించాను కానీ. ఇంత కాలం బిజీగా గడిపి ఇప్పుడు ఒక్కసారిగా ఏ పనీ లేకుండా ఉండాలంటేనే ఎదోలా ఉంది ’’అంటూ సోమయ్య బంజారా క్లబ్‌లో మిత్రుడితో తన గోడు వెళ్లబోసుకున్నాడు.
‘‘నా దగ్గరో మంచి ప్లాన్ ఉంది. ఒక్కనితో వర్కవుట్ కాదని వౌనంగా ఉన్నాను. నువ్వు చేతులు కలుపుతానంటే కలిసి చేద్దాం’’ అని సుదర్శనం ఉత్సాహంగా అన్నాడు.
అబ్బా వ్యాపారమా నాకు ఆసక్తి లేదు. రిస్క్,శ్రమ రెండూ ఎక్కువే’’అని సోమయ్య తల అడ్డంగా ఊపాడు.
‘‘వ్యాపారమే కానీ రిస్క్, శ్రమ తక్కువ, ఆదా యం, ప్రచారం ఎక్కువగా ఉండే రాజకీయ వ్యా పారం’’ అని సుదర్శనం పక పకానవ్వాడు.
‘‘ఆ వ్యాపారం మన వల్ల అవుతుందంటావా?
ఏ పార్టీ గెలుస్తుందో తెలియదు. మనతో బోలెడు ఖర్చు చేయిస్తారు. రిస్క్ ఎక్కువనుకుంటాను’’ అని సోమయ్య సందేహం వ్యక్తం చేశాడు.
‘‘ఒక పార్టీలో చేరాల్సిన ఖర్మ మనకెందుకు. మనమే పార్టీ పెట్టేసుకుందాం. మన మన సామాజిక వర్గాల్లో మనకు బాగానే పలుకుబడి ఉంది. నువ్వు పైలట్ నేను కో పైలట్ నన్న మాట. మనం పార్టీ పెట్టగానే అధికారంలోకి వస్తామనే అత్యాశలు పెట్టుకోకు. రాజకీయ వ్యాపారంలో బడా బడాపెట్టుబడి దారులు ప్రవేశించారు. కార్పొరేట్ ఎత్తుగడలన్నీ రాజకీయ వ్యాపారంలో ప్రవేశించాయి. వాల్‌మార్ట్ విజృంభిస్తున్నా వీధి చివర్లో పచారీ కొట్లు ఏదోలా బతికేస్తున్నట్టుగానే మన చిన్నారి పార్టీ బతికేస్తుంది. పార్టీతో లాభమేమిటనే కదా నీ అనుమానం. వెయ్యిరూపాయల ఖర్చుతో కోట్ల రూపాయల ప్రచారం పొందొచ్చు. ఏ సమస్యపైనైనా టీవిలో చిట్టిపార్టీ ప్రతినిధులుగా ఆవేశంగా మాట్లాడవచ్చు. అఖిలపక్ష సమావేశాలకు భారీ కండువాలు కప్పుకొని వెళ్ళొచ్చు. ప్రతి రోజు టీవిల్లో అమెరికా ఆధిపత్యం మొదలుకుని అంగన్‌వాడి టీచర్ల సమస్యల వరకు, రూపాయి విలువ పడిపోవడం మొదలుకుని పిల్లలకు పాకెట్ మనీ ఎన్నిరూపాయలివ్వాలి అనే అంశం వరకు, తారా చౌదరి నుంచి తారా శశాంకం వరకు ఏ సమస్యపైనా మనకు తోచింది మాట్లాడవచ్చు. టీవిలో మనను చూసి అదిగో మా తాతయ్య అని నీ మనవరాలు తన స్నేహితులకు చెప్పుకుని మురిసిపోతే ఎంత బాగుంటుంది ఒక్కసారి ఊహించుకో... రిటైర్ అయ్యాక ఇంట్లో భార్యా పిల్లలు కూడా మాట్లాడేందుకు చిరాకు పడతారు. అలాంటిది అన్నింటిపై టీవిలో మన అభిప్రాలు చెప్పుకునే చాన్స్ లభించడం అదృష్టం కాకుంటే మరేమిటి?
ఏ వ్యూహం క్లిక్కవుతుందో, ఏ రూపంలో అదృష్టం వరిస్తుందో? మనమూ గెలవవచ్చు.

 రాష్ట్రంలో ఇప్పుడు ఏ పార్టీ పేరు విన్నా జనం థూ అని తిడుతున్నారు. మాది అన్ని పార్టీల లాంటి పార్టీ కాదు. ఈ అన్ని పార్టీల సిద్ధాంతాలను తీవ్రంగా వ్యతిరేకించే సిద్ధాంతంతో పుట్టింది మా పార్టీ అని చెప్పుకుందాం. ఒక్క కాంగ్రెస్ వ్యతిరేక సిద్ధాంతో పుట్టిన పార్టీకి జనం 15 ఏళ్లు అధికారం అప్పగించారు. అలాంటిది మనం బోలెడు పార్టీల వ్యతిరేకమనే సిద్ధాంతం అని చెబితే ఫలితాలు ఎలా ఉంటాయో ఆలోచిం చు’’ అని సుదర్శనం చెబితే సోమయ్య ముఖంలో మార్పులు స్పష్టంగా కనిపించసాగాయి.

 అయినా ముఖంలో సందేహాలు ఇంకా పూర్తిగా తొలిగి పోక పోవడంతో ‘‘దీని కోసం నేను కొంత వర్క్ చేశాను. రిటైర్ మెంట్ వయసులో హీరోలు పార్టీలు పెట్టి విజయం సాధించారు’’ అని సుదర్శనం చెబితే, ‘‘అలా పార్టీ పెట్టి అడ్రస్ లేకుండా పోయిన హీరోయిన్ కూడా ఉంది ’’ అని సోమయ్య విజయశాంతిని గుర్తు చేశారు.
‘‘80వ దశకంలో సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన నరసింహరాజు అనే నటుడు గుర్తున్నా డా? జయమాలినితో జగన్మోహినిలో హీరోగా నటించాడు. ఆయనకు ఎందుకో కానీ ఎన్టీఆర్‌పై కోపం వచ్చి భారత దేశం అనే పార్టీ పెట్టాడు. ఆ పార్టీ ఏమైందో ఆయనకే తెలియదు. కానీ ఆయన మాత్రం ఇప్పుడు తెలుగు సీరియల్స్‌లో క్యారెక్టర్ నటునిగా బతుకుతున్నాడు.
పూర్వం రుషుల కోపం నుంచి శ్లోకాలు పుట్టినట్టు ఈ కాలంలో నాయకుల కోపం నుంచి రాజకీయ పార్టీలు పుడుతున్నాయి. సిఎంను చేయలేదని జగన్‌కు సోనియాపై వచ్చిన కోపంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పుట్టింది. బాబుపై కెసిఆర్ కొచ్చిన కోపం నుంచి టిఆర్‌ఎస్ పుట్టింది.ఇందిరాగాంధీపై కోపంతో జనతా పార్టీపుట్టింది. జనతాలో అందరూ మేధావులే, ఒకరి అభిప్రాయం ఒకరికి నచ్చక ఒకరిపై ఒకరికి కోపాలు వచ్చి డజన్ల కొద్ది పార్టీలు పుట్టాయి. బైరెడ్డికి తన మీద తనకే కోపం వస్తే రాయలసీమ పార్టీ పుట్టింది. నెహ్రూ వాళ్ల నాన్నకు కూడా కాంగ్రెస్‌పై కోపం వచ్చి పార్టీ పెట్టారు. ఆంగ్ల అక్షర మాలలో ఎన్ని అక్షరాలున్నాయో అన్ని కాంగ్రెస్ పార్టీలున్నాయని ఎన్టీఆర్ అనేవారు. తెలుగు కుటుంబాల్లో ఎన్ని బంధుత్వాలు ఉన్నాయో అన్ని తెలుగుదేశం పార్టీలు పుట్టా యి, అల్లుడిపై కోపంతో’’ అంటూ సుదర్శనం పార్టీల పుట్టుపూర్వోత్తరాలు చెప్పుకొచ్చాడు.అందరు కోపంతో పార్టీ లు పెడితే ఒకాయన ప్రేమే మార్గం సేవే ధర్మం అంటూ ఏదో నినాదం తో వచ్చి పాపం వ్యాపారం నడవక  మూసేశాడు 
‘‘సరే పార్టీ పెట్టుకుందాం’’ అని సోమయ్య తల ఊపాడు. ‘‘అన్ని పార్టీల లక్ష్యం సూట్‌కేసే అని ఆ పేరుతోనే జస్పాల్ భట్టీ పార్టీ పెట్టాడు. మరి మనమేం పార్టీ పెడదాం’’అని సోమయ్య అడిగా డు. ‘‘ప్రజల్లో బాగా నానుతున్న పేరును పె ట్టుకుంటే ప్రచారంలో కలిసొస్తుంది. లక్ష కోట్లు, తెలంగాణ, సమైక్యాంధ్ర, సీమాంధ్ర ఇప్పుడు రాష్ట్రంలో పాపులర్ వర్డ్స్, దీనిలో ఏదో ఒకటి ఖాయం చేసుకుందాం ’’ అని ఇద్దరూ నిర్ణయించుకున్నారు   ఏదైనా మంచి పేరు సూచించండి . 

7 కామెంట్‌లు:

 1. పది మంది ఎం.ఎల్.ఎ లను గెలిపించుకోగలిగితే పెట్టుబడికి నాలుగు రెట్లు సంపాదించుకోవచ్చు :) ఇది లాభసాటి వ్యాపారం. పార్టీ పేరు కావాలి కదూ ఖర్చవుతుంది మరి.....:)

  రిప్లయితొలగించు
 2. "ఆల్ ఫ్రీ పార్టీ " అని పెట్టుకుని వాగ్దానాలు కురిపిస్తే చాలు, తెలుగు ప్రజలు దండిగా ఓట్లు వేసేస్తారు

  రిప్లయితొలగించు
 3. బైరెడ్డికి తన మీద తనకే కోపం వస్తే రాయలసీమ పార్టీ పుట్టింది. :)

  రిప్లయితొలగించు
 4. లక్ష కోట్లు ayithe vinadaaniki vinasompuga kuda vumtumdi.

  రిప్లయితొలగించు

 5. అదేదో చానల్ ఉంది చూడండీ , ఎవరూ దానిని మాటీవీ కాదని చెప్పలేరు !

  అలా 'మన' పార్టీ అని 'పెరడు' పెడితే 'వోట్ల కాయలు' బాగా సంవృద్ది గా పండు తా యనుకుంటా !

  చీర్స్
  జిలేబి

  రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం