12, జనవరి 2014, ఆదివారం

నేనెవరు ? మీరెవరు ?

సోక్రటీసు చివరి దశలో నాకేమీ తెలియదని తెలుసుకున్నానంటాడు. అలానే కిరణ్ కుమార్‌రెడ్డి తన పదవీ కాలం ముగిసే సమయంలో నేనే ప్రాంతానికి చెందిన వాడినో చెప్పండి అంటున్నారు. నేనెవరిని? అనే సందేహం రావడం ఇది మొదటి సారి కాదు చివరి సారి కాదు. సిద్ధార్థునికి ఇదే అనుమానం వచ్చి బుద్ధునిగా మార్చింది. గొప్పవీరుడైన అశోక చక్రవర్తికి ఇదే అనుమానం వచ్చి కత్తిని పక్కన పారేసి బౌద్ధం స్వీకరించేట్టు చేసింది. శ్రీరాముని మదిలో సైతం ఇదే ప్రశ్న ఉదయిస్తే గురువు తీర్చాడు. 

సాధారణంగా రాజకీయ నాయకులు నేను అది ఇది అని చెప్పుకుంటారు. కానీ నేనెవరిని? అనే ప్రశ్న వేయరు. అధికారం పోయేటప్పుడు కలిగే ఆలోచనల పుణ్యమా అని ఇంత కాలానికి కిరణ్‌కు ఈ సందేహం వచ్చింది. తత్వవేత్త కాబట్టి సోక్రటీసు తనకేమీ తెలియదని తనకు తానే ప్రకటించుకున్నాడు. కానీ కిరణ్ రాజకీయ నాయకుడు. వీళ్లు అన్నీ ప్రజలనే అడుగుతారు. రాజకీయ నాయకుల కున్న గొప్ప సౌకర్యమే ఇది. సింగపూర్‌లో పెట్టుబడులు పెట్టినా, లక్ష కోట్లు కొల్లగొట్టినా వాళ్లు ప్రజల సంక్షేమం కోసమే ఆ పని చేస్తారు. అమ్మాయి చదువు, అబ్బాయి పెళ్లి అన్నీ వాళ్లు రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే చేస్తారు.


సాంప్రదాయ రాజకీయాలకు వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకున్న ఆమ్ ఆద్మీ అరవింద్ కేజ్రీవాల్ సైతం అచ్చం ఇలానే ప్రజలను అడిగారు. ఏం చేయాలో చెప్పండి? అని. ఢిల్లీ ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాలేదు, బిజెపి మొదటి స్థానంలో, ఆమ్ ఆద్మీ రెండవ స్థానంలో, కాంగ్రెస్ మూడవ స్థానంలో నిలిచింది. సహజంగా అయితే మొదటి స్థానంలో నిలిచిన బిజెపి అధికారంలోకి రావాలి.. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ చిన్నదే అయినా ప్రచారం పెద్దది అనే విషయం గ్రహించి ఢిల్లీ రాష్ట్రం కోసం చూసుకుంటే మోడీకి ఢిల్లీ పెద్ద గద్దె మిస్సయ్యే ప్రమాదం ఉందని గ్రహించి వద్దు లేండి మీరే తీసుకోండన్నారు. రెండవ స్థానంలో ఉన్న కేజ్రీవాల్ మీరేం చేయమంటే అది చేస్తాను అని ప్రజలను అడిగారు. రోగి కోరుకున్నదే వైద్యుడు ఇచ్చాడన్నట్టు కేజ్రీవాల్ కోరుకున్న విధంగానే జనం అభిప్రాయం చెప్పారు. అదే విధంగా ఇప్పుడు కిరణ్ కూడా ప్రజలనే అడుగుతున్నారు. నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్‌లోనే. నా వయసు 53 ఏళ్లు ఇప్పుడు చెప్పండి..నాదే ప్రాంతం? అని ఆయన సోక్రటీసు గురువులా ముఖం పెట్టి నిండు సభలో అడిగారు.


నిండు సభలోకి ద్రౌపదిని ఈడ్చుకు రమ్మని దుర్యోధనుడు ఆదేశించినప్పుడు నన్నోడి తానోడెనా? తానోడి నన్నోడెనా? అని ద్రౌపది అడిగిన చిక్కు ప్రశ్నలా మీరే చెప్పండి నాదే ప్రాంతం? అని అడిగితే నేల తెలంగాణదైనా విత్తనం సీమాంధ్రదే అని ఎమ్మెల్యే హరీశ్‌రావు బాగానే చెప్పారు. కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు క్షేత్రం ముఖ్యమా, బీజం ముఖ్యమా అనేది మరో చర్చ. తప్పు పట్టాల్సింది నేలను కాదు నేల లక్షణం ఒకటే ఏ విత్తనం నాటిదే అదే మొలకెత్తుతుంది.


ఓ సినిమాలో ఎంఎస్ నారాయణ ఇంటికి సునీల్ దొంగతనానికి వస్తాడు. సరదాగా పందెం వేసుకుందాం అంటాడు. నువ్వెవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నేను దొంగను, మనిషిని, అంటూ సునీల్ రకరకాల సమాధానాలు చెప్పినా నువ్వు దొంగవా? మంచివాడివా? మనిషివా జంతువువా? అని కాదు నువ్వెవరు సరైన సమాధానం చెప్పి ఈ బంగారు గొలుసు తీసుకెళ్లమని సునీల్ బంగారు గొలుసు నొక్కెస్తాడు. కిరణ్ కూడా విభజన బిల్లుపై చర్చ జరిగేప్పుడు నేనెవరూ చెప్పండి అని పందెం కాసినట్టు ప్రశ్నించాడు. సమాధానం చెప్పలేకపోతే బిల్లు వీగిపోతుందనుకున్నారేమో ! మహా తత్వవేత్తలు ముందు ప్రజలను ప్రశ్నలు అడుగుతారు. అజ్ఞానులారా నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేంత గొప్పవాళ్లా మీరు అన్నట్టుగా అమాయక ప్రజల ముఖం ఒకసారి చూసి మళ్లీ వాళ్లే సమాధానం చెబుతారు. కిరణ్ కూడా అదే విధంగా తన ప్రశ్నకు తానే నర్మగర్భంగా సమాధానం కూడా చెప్పాడు. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను మరి నాదే ప్రాంతం అని ప్రశ్నించిన ఆయనే మరో సందర్భంలో పివి నరసింహారావును మీ ప్రాంతంలో గెలిపించరని, మా ప్రాంతంలో పోటీ చేయించి గెలిపించాం అంటూ తెలంగాణకు చెందిన పివి రాయలసీమ నుంచి పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, తనదే ప్రాంతమో చెప్పకనే చెప్పారు.

 పివి ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పుడు నంద్యాల నుంచి పోటీ చేశారు. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఒకరో ఇద్దరో సీమాంధ్రకు చెందిన వారు ఎన్నికైన సందర్భాలు ఉన్నాయి. ప్రధానమంత్రి పదవిలో ఉంటే తప్ప తెలంగాణ నేత సీమాంధ్ర నుంచి గెలవడం సాధ్యం కాలేదని మరొకరు ప్రాంతాల వాదన చెప్పుకొచ్చారు.


ఎస్‌వి రంగారావు, గుమ్మడి ప్రధాన పాత్రలుగా చాలా కాలం క్రితం ఓ సినిమా వచ్చింది. దొంగ కొడుకు దొంగే అవుతాడు, మంచివాడి కొడుకు మంచి వాడే అవుతాడు అనేది జడ్జి అయిన గుమ్మడి వాదన, అది తప్పు పెరిగిన పరిస్థితులే ముఖ్యం అనేది ఎస్‌విఆర్ వాదన. అది నిరూపించేందుకు గుమ్మడి కొడుకును ఎస్‌విఆర్ ఎత్తుకెళ్లి మహా దొంగగా తీర్చిదిద్దుతాడు. వీళ్ల పందెం సంగతేమో కానీ పాపం జడ్జి కొడుకు దొంగవుతాడు. సరే హీరో కాబట్టి దొంగ అయినా తిరిగి మారిపోతాడనుకోండి. కిరణ్‌కు ఈ సినిమాను చూపించేంత టైమ్ హరీశ్‌కు దొరికితే చేసే రకమే. కానీ అంత టైమ్ లేకపోవడం వల్ల భూమి ఏదైనా విత్తనం ఏదైతే చెట్టు అదే అవుతుందని చెప్పారు.


అమెరికాలో తెలుగు వారికి కొదవ లేదు. తల్లిదండ్రులు ఉద్యోగం చేసే కాలంలో అక్కడ స్థిరపడిన కుటుంబాలకు చెందిన పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. వారి జీవిత కాలంలో ఎప్పుడూ తెలుగునాడును చూడలేదు. అలాంటి కొంత మంది యువతను రాష్ట్ర విభజనపై అభిప్రాయం అడిగితే, ఏమంటారు? సీమాంధ్ర తల్లిదండ్రుల పిల్లలు సమైక్యవాదం వినిపిస్తారు, తెలంగాణావారి పిల్లలు విభజన జరగాల్సిందే అంటారు. ఎందుకంటే అది విత్తనం లక్షణం.

2 కామెంట్‌లు:

  1. కిరణ్ కుమార్ రెడ్డి గారిది హైదరాబాదు అయితే మరి చిత్తూరు జిల్లా నుండి ఎందుకు పోటీ చేసారో ఆయనే చెప్పాలి.

    ఆయన అనేక సభలలో తెలంగాణాను "అక్కడ" అని, రాయలసీమను "మన" అని పెరుకొన్నారు. అప్పుడు లేని సందేహం ఇప్పుడెందుకు?

    రిప్లయితొలగించు
  2. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదట. పదవి ఊడిం తర్వాతగానీ తానెవరో తెలిసిరాదు. హైదరాబాద్ ఝాడించి తంతే చిత్తూరులో పడతాడు. అప్పుడు గానీ "పులితోలు కప్పుకున్న నక్క" బయటపడదు. తనది ఏ జంతు జాతో తెలియదు. అక్కడి నక్కలు ఊళ పెడుతుంటే తానూ ఊళ పడతాడుగదా! అప్పుడు తెలుస్తుంది తానెవరో? అప్పటిదాకా స్వప్నలోకంలో విహరించనివ్వండి పాపం.

    రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం