6, మే 2014, మంగళవారం

మిస్టర్ లోకేశంసూపర్ స్టార్ కృష్ణ కొడుకైనా సత్తాలేకుండా సినిమాల్లోకి వస్తే.. రమేష్ బాబు అవుతాడు? సత్తా చూపితే మహేష్ బాబు అవుతాడు.
***
ఎవరైనా ఊపిరి తీసుకుని బతుకుతారు. ఆయన మాత్రం రాజకీయమే ఊపిరిగా బతుకుతారు. చదువుకునే రోజులనుంచే రాజకీయ ఎత్తుగడలు నేర్చుకున్న చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్. కానీ -ఆయన రాజకీయ రంగ ప్రవేశమే పేలవంగా జరిగింది. తేదీలు ప్రకటించి ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ వచ్చారు. ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్, చిరంజీవి లాంటి వారంతా తాము సినిమా రంగంలో టాప్ పొజిషన్‌లో ఉన్నప్పుడే వారసులను తెరపైకి తెచ్చారు. కానీ చంద్రబాబు మాత్రం వరుసగా రెండుసార్లు ఓడిపోయి సంక్షోభంలో పడిన సమయంలో తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. తన పాదయాత్ర ముగింపు సభలో లోకేశ్‌ను ప్రవేశపెట్టాలనే ప్రయత్నం కుటుంబ రాజకీయాలతో ఫలించలేదు. సైకిల్ యాత్ర అంటూ హడావుడి చేసినా వర్కవుట్ కాలేదు. దాంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక, లోకేశ్‌ను రాజకీయాలకు విడుదల చేశారు.
‘నగదు బదిలీ పథకం సృష్టికర్త’ -అంటూ నారా లోకేశ్ ట్విట్టర్‌లో తన గురించి తాను రాసుకున్నారు. ‘తెరవెనుక పార్టీ ప్రచారానికి వ్యూహ రచన చేసేది మా అబ్బాయే’ -అని బాబు మురిపెంగా చెప్పుకున్నారు. కానీ, జనం మాత్రం లోకేశ్‌ను పెద్దగా పట్టించుకోలేదు. ‘ఏమంటివేమంటివి..’ అంటూ ఎన్టీఆర్‌లా డైలాగులు చెప్పాలని పవన్ ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది. లోకేశ్ ప్రయత్నం కూడా అలానే ఉంది. ఏదో ఆవేశంగా మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు, సాధ్యం కావడం లేదు. కుల పిచ్చి ఉన్న పార్టీ తెదేపానే.. అని ఒకసారి, సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే మనకు మనం ఉరివేసుకున్నట్టేనని మరోసారి ఆవేశంగా మాట్లాడడం వెనక ఉన్నవారు జాగ్రత్తలు చెప్పడం ఈ వీడియోలు సోషల్ మీడియాలో బోలెడు వినోదాన్ని కలిగిస్తున్నాయి.

అనంతపురం జిల్లాలో లోకేశ్ తొలి రాజకీయ సభ. ఆ సభ ఏర్పాటు చేసి లోకేశ్ పక్కనే ఐదారు గంటలపాటు ఓ యువనేత కూర్చోవాల్సి వచ్చింది. నాలుగు రోజుల తరువాత మళ్లీ కలిస్తే -ఎవరు? అని అడిగారట లోకేశ్. తనను తాను మళ్లీ పరిచయం చేసుకున్నాడు యువనేత. రాజకీయాల్లో రాణించాలంటే అస్సలు ఉండకూడని లక్షణమిది. ఒకరకంగా చంద్రబాబు అదృష్టవంతుడు. తన పార్టీలోనే కాదు తన ఇంట్లో సైతం ఆయనకు ఎలాంటి పోటీ లేదు. శరీరం సహకరించినంత వరకు రాజకీయాల్లో కొనసాగే అదృష్టం ఉన్న నాయకుడు చంద్రబాబు.

రాజకీయాల్లోకి రావడం కోసం లోకేశ్ ఒక చానల్‌ను నిర్వహించాలని ప్రయత్నించినా సాధ్యంకాక చేతులెత్తేశారు. తండ్రి నిలబెట్టిన హెరిటేజ్ నిర్వహణలో మాత్రం దూసుకు వెళ్తున్నారు. మాట తీరు, వ్యవహారం, ఏ ఒక్కటీ రాజకీయాల్లో రాణించే లక్షణాలు లోకేశ్‌లో కనిపించడం లేదు. మీడియా అభిమానంతో ఆకాశానికెత్తినా నిలబడలేరు. సూటిగా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడం, ప్రజల్లో మమేకం కావడం, అనుచరులకు విశ్వాసం కలిగించడం వంటి లక్షణాలేవీ కనిపించడం లేదు. 

వైఎస్సార్, చంద్రబాబు ఒకప్పుడు మంచి మిత్రులు.. ఇద్దరూ 78 బ్యాచ్ ఎమ్మెల్యేలే. ఇద్దరి సంతానం రాజకీయాల్లోకి వచ్చింది. కానీ ఇద్దరికీ పోలికే లేదు. బాబును తీవ్రంగా వ్యతిరేకించే వారు సైతం అతనిలోని రాజకీయ నేతను, తెరవెనుక వ్యూహాల్లో ఆయన తెలివిని కాదనలేరు. కానీ లోకేశ్‌లో అవేవీ మచ్చుకైనా కనిపించవు. కానీ -లోకేశ్‌ను ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు పిలిచి సీటు ఇచ్చాయని బాబు చెబుతుంటారు. వినేవాళ్లుంటే చంద్రబాబు చాలా చెప్తారంటారు -మీడియా మిత్రులు.

1 కామెంట్‌:

  1. కుల పిచ్చి ఉన్న పార్టీ తెదేపానే.. అని ఒకసారి, సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే మనకు మనం ఉరివేసుకున్నట్టేనని మరోసారి ఆవేశంగా మాట్లాడడం వెనక ఉన్నవారు జాగ్రత్తలు చెప్పడం
    >>
    చాలా ఆలస్యంగా ఇప్ప్పుడే చూస్తున్నా ఈ పోష్టుని.వీడియోలు ఉన్నాయంటున్నారు గాబట్టి నమ్మాల్సిందే గానీ మరీ ఇంత వాజెమ్మ తనమా?

    రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం